జాన్ హస్: హింస, హతసాక్షి మరణము (క్రీ.శ. 1415)
క్రీ.శ. 1372 లో బొహెమియాలోని హస్సెనిట్జ్ (Hussenitz) నందు జాన్ హస్ జన్మించెను. ప్రేగ్ (Prague) విశ్వవిద్యాలయమునందు వేదాంత శాస్త్రము చదివి, పాదిరిగా అభిషేకము పొంది ప్రేగ్లోని బేత్లహేము దేవాలయములో క్రీ.శ. 1402 లో బోధకునిగా నియమింపబడెను. ఆ తరువాత క్రీ.శ. 1409 లో విశ్వ విద్యాలయ అధ్యక్ష పదవిని పొందెను.
విక్లిఫ్ రచనలవలన జాన్ హస్ చాల ప్రభావితుడయ్యెను. ముఖ్యముగ క్రైస్తవ సంఘముపై పోప్ చేయుచున్న అధికారములకు బైబిలు ఆధారము కాదని తిరస్కరించి, సంఘవిషయములన్నిటిలో లేఖనములు ఉన్నత ప్రమాణములని, సంఘములోని లోపములు,అవినీతి సంస్కరింపబడవలెనని పట్టుబట్టెను.
పాదిరి ప్రార్థించిన తరువాత ఆరాధనలోని రొట్టె, ద్రాక్షారసము ప్రభువైన యేసుక్రీస్తుయొక్క నిజశరీరముగాను, రక్తముగాను మారునను సిద్ధాంతము (Doctrine of Transubstantiation) ను హస్ ఒప్పుకొనలేదు. క్రైస్తవులు తమంతట తాము చదువుకొనుటకు బైబిలు వారి స్వభాషలలో ఉండవలెనని వాదించెను.
అప్పటిలో బైబిలు లాటిన్ భాషలో మాత్రమే కలదు, ఉన్నత మతాధికారులు మాత్రమే బైబిలును చదువగలిగేవారు. ఆరాధనకు ఉపయోగించు కొన్ని బైబిళ్లు మాత్రము సామాన్య ప్రజలు దేవాలయము వెలుపటికి తీసికొని వెళ్లకుండ వాటిని గొలుసులతో బోధకుడు నిలుచుండు ఉన్నత స్థలమైన పులి ్పటు కట్టి ఉంచేవారు.
విక్లిఫ్ సిద్ధాంతములను జాన్ హస్ నమ్ముటమాత్రమే కాదుగాని తన దేవాలయము లోను, విశ్వవిద్యాలయమందును వాటిని బోధించెను. అతడు పోషను, అతని అభి మానులను తీవ్రముగ ఎదుర్కొనెను గనుక వారి దృష్టినుండి ఎక్కువకాలము తప్పించుకో లేకపోయెను.
వారు పిలువబడినట్లుగ, “సంస్కర్తలు లేక లో లార్డు (Reformists)” దిన దినము విస్తరించుచున్నందున ప్రేగ్ ని రోమన్ కేథలిక్ ఆర్చిబిషప్ విక్లిఫ్ రచనలు వ్యాపించకుండ వాటిని అణచివేయవలెనని శాసనము చేసెను. కాని అతడు ఆశించిన దానికి భిన్నముగా జరిగెను.
విశ్వవిద్యాలయములోని విక్లిఫ్, జాన్ హస్ల అభిమాను లందరు ఏకమై వారు చేయగలిగినంతమేరకు వారి ఉపదేశములను, సిద్ధాంతములను ఎక్కువ పట్టుదలతో వ్యాపింపజేసిరి.
పోప్ అది వినినప్పుడు, జాన్ హసన్‌ను రోముకు పిలిపించి, మతవిరుద్ధమైన తప్పుడు బోధలు చేయుచున్నాడను నిందలకు సంజాయిషీ కోరుమని కార్డినల్ కొలొన్నా (Cardinal Colonna) ను నియమించెను. జాన్ హస్ తరపున ముగ్గురు ప్రతినిధులు కార్డినల్వద్దకు వెళ్లి “జాన్ హస్ రోముకు రాలేడని అతని పక్షముగ ఏ ప్రశ్నలకైనను తాము జావాబిచ్చెదమ”ని చెప్పిరి. కాని జాన్ హస్ మొండితనముతోకూడిన అవిధేయు డని, అతనిని సంఘమునుండి వెలివేయుచున్నానని కార్డినల్ ప్రకటించెను.

జాన్ హస్యొక్క ప్రతినిధులు పోపన్ను వేడుకొనగ, ఆ ప్రకటనను పునఃపరిశీలన చేయుటకు నలుగురు కార్డినల్స్‌ను పోప్ నియమించెను. ఆ నలుగురు కార్డినల్స్ శిక్షను ధృవీక రించుటమాత్రమే గాక జాన్ హస్ స్నేహితులను, అనుచరులను, ఆ ముగ్గురు ప్రతినిధు లనుకూడ సంఘ బహిష్కరణ గావించిరి.
తీర్పును మార్చమని జాన్ హస్ వేడుకొనెను గాని ఫలితము లేకపోయెను. ప్రేగ్ లోని బేత్లహేము దేవాలయములో ఇక బోధింపలేడు కనుక అతడు తన స్వగ్రామమైన హస్సెనిట్జ్కు తిరిగి వెళ్లెను. అక్కడ తన సిద్ధాంతములను బోధించుచు అనేక పత్రికలు వ్రాసెను. విక్లిఫ్వంటి సంఘసంస్కర్తలు వ్రాసిన పుస్తకములు చదువకుండ, తమను నిషేధించు హక్కు ఎవరికీ లేదని తన సుదీర్ఘ వ్యాసములో వ్రాసెను.
రోమన్ కేథలిక్ పోప్, కార్డినల్స్, మతనాయకుల దుర్మార్గములనుగూర్చి పుస్తకములు వ్రాసెను. జాన్ హస్ వాదములు బైబిల్ ప్రకారము సహేతుకమైనవి, శక్తికలవియునైయున్నవి గనుక అతడు మంచివాడని చాలమంది అంగీకరించిరి.
క్రీ.శ. 1414 నవంబరులో కాన్ఫ్రాన్స్ నందు ఒక సభ జరిగెను. ఆ సభకు జాన్ హస్ ఆహ్వానింపబడెను. అక్కడ అతనికేమియు ముప్పువాటిల్లదని సిజిస్మండ్ (Sigismund) చక్రవర్తి అభయమిచ్చెను. అయినప్పటికిని “మతద్రోహి” అను నేరము అతనిపై మోపబడినందున క్రీ.శ. 1415 జనవరిలో హస్ కాన్స్టన్స్ చేరగానే, అతనిని పట్టుకొని ఒక కోటగదిలో నిర్బంధించిరి. అది చట్టవిరుద్ధమని, అతనికి ఏ ప్రమాదముండదని చక్రవర్తి చేసిన వాగ్దానమునకు విరుద్ధమని హస్ స్నేహితులు సభకు తెలియపరచిరి.
“అతని భద్రత విషయములో తాను ఏమీ చెప్పలేదని, చక్రవర్తి చెప్పిన దేనికైనను తాను బాధ్యుడను కాన”ని పోప్ చెప్పెను. ప్రమాదము జరుగకుండ చూచెదనని అతడు చేసిన వాగ్దానమును గూర్చి అతని స్నేహితులు చక్రవర్తి సిజిస్మండుకు మొఱ్ఱపెట్టుకొనినప్పుడు, అతడు హస్ ను రక్షించుటకు నిరాకరించెను.
హసన్‌ను విచారించుటకు మతన్యాయాధిపతులు లేనందున ఆ బాధ్యతలను సభ నిర్వహించెను. హస్ వారి ముందుకు తేబడినప్పుడు, అతనిమీద నలుబది నిందలు మోపిరి. వాటిలో చాలావరకు అతని రచనలనుండి ఎన్నుకొనిరి. మిగిలినవి నిరాధార ములు. ఆ నిందలకు జాన్ హస్ “నేను పోప్‌కు విన్నవించితిని, నా విన్నపము పరిశీలింపకముందే పోప్ గారు చనిపోయిరి.
కనుక, అతని తరువాత వచ్చిన పోప్ ఇరువదిమూడవ జాన్‌కు మొఱ్ఱపెట్టితిని. రెండు సంవత్సరములవరకు నా విషయమును వాదించుకొనుటకు నాకు అవకాశము లభింపలేదు. కనుక నేను ఉన్నత న్యాయాధి పతియైన యేసుక్రీస్తునకు మనవిచేసికొంటిన”ని సమాధానమిచ్చెను. “క్రీస్తుకు మొఱ్ఱపెట్టుట న్యాయసమ్మతమా?” అని సభ అతనిని ప్రశ్నించెను.
“మీ అందరియెదుట వాస్తవమునకు నేను చెప్పునదేమనగా క్రీస్తుకు సమర్పించిన విన్నపముకంటె న్యాయమైనది, శక్తివంతమైనది మరి యే విన్నపము ఉండదు. చిన్న న్యాయాధిపతిద్వారా జరిగిన తప్పును దిద్దుటకు పెద్ద న్యాయాధిపతికి విన్నపము చేయుమని న్యాయశాస్త్రము చెప్పుచున్నది. క్రీస్తుకంటె ఉన్నత న్యాయాధిపతి యెవరు? అని నేను మిమ్ములను అడుగుచున్నాను.
ఈ విషయమును న్యాయముగను, నిష్పక్షపాతముగను, నిర్దోషముగను ఎవరు తీర్పు చెప్పగలరు? క్రీస్తులో మోసము లేదు, ఆయన మోసగింపబడడు, బాధింపబడినవారికి, అణచివేయబడినవారికి ఆయనకంటె అధికముగ ఎవరు సహాయపడగలరు?” అని జవాబిచ్చెను. హస్ మాటలు విని సభ సభ్యులందరు హేళనచేసి, కోపోద్రేకులై, అతనిని కాల్చి చంపుమని తీర్పుచెప్పిరి.
ఏడుగురు బిషప్‌లు ముందుకువచ్చి హసన్‌ను పాదిరి బట్టలు ధరింపుమని ఆజ్ఞా పింపగ అతడు ఆ వస్త్రములను ధరించెను. అప్పుడు వారందరు అతని వస్త్రములను ఒకేసారి లాగి, అతనిని కించపరచి, పరిహసించిరి. అప్పుడు హస్ “మీరందరు ఒకే చెడ్డ మనస్సు కలిగి ఉన్నందుకు నేను ఆశ్చర్యపడుచున్నాను” అని చెప్పెను.
రెండు కత్తెరలతో అతని తలమీదనున్న కిరీటమును ముక్కలు చేయుటకు బిషప్పులందరు తీర్మానించుకొని, పని ప్రారంభించిరి. రక్తసిక్తమైన అతని తలపై “మత ద్రోహుల నాయకుడు” అని వ్రాసి, దయ్యముల బొమ్మలు వేసిన టోపి ధరింప జేసిరి. హస్ అది చూచి అప్పుడు బిషప్ కాగితపు కిరీటమును హస్ తలపై ఉంచి, “ఇప్పుడు నీ ఆత్మను నరకమునకు అప్పగించుచున్నాను” అని చెప్పెను.

కాని హస్ ఆకాశమువైపు కన్నులెత్తి “ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు విమోచించిన నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను” అని చెప్పెను.
అతని పుస్తకములు కాల్చివేయబడుచున్న స్థలమునకు అతనిని నడిపించుకొని వెళ్లి, ఒక కొయ్యస్తంభమునకు గొలుసులతో కట్టివేసిరి. వారు గొలుసులతో కట్టివేయు చున్నప్పుడు హస్ నవ్వుచూ “నాకొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఇంతకంటె కఠినమైన గొలుసులతో కట్టబడెను, కనుక ఈ తుప్పుపట్టిన గొలుసులతో కట్టించుకొనుటకు నేనెందుకు సిగ్గుపడవలెను?” అని చెప్పెను.
హసను నిలువబెట్టి మెడవరకు చుట్టు కట్టెలు పేర్చిరి. బవేరియా రాజు, హసన్‌ను తన సిద్ధాంతములను పరిత్యజించవలసినదిగా కోరెను. కాని హస్ “కాదు, నేనెప్పుడు తప్పుడు సిద్ధాంతమును ప్రకటింపలేదు. నేను పెదవులతో చెప్పినదానికి రక్తముతో ముద్రవేయుచున్నాను” అని జవాబిచ్చెను. కట్టెల మంటలు అతనిని చుట్టు ముట్టి నప్పుడు, మంటల శబ్దములోకూడ వారందరు వినునట్లు హస్ బిగ్గరగా పాటలు పాడెను. త్వరలో మంటలు అతని గొంతును, ముఖమును మూసివేయుటతో అతని స్వరము ఆగిపోయి, గొలుసులమీదుగ ముందుకుపడి మరణించెను.
విక్లిఫ్ యెడల చూపించిన బుద్ధిహీనతతోనే, బిషప్ లు హస్ చితాభస్మమును ప్రోగుచేసి, భూమిమీద అతని జ్ఞాపకచిహ్నములుండకుండ ఆ భస్మమును రైన్ నదిలో విసరివేసిరి. కాని, హస్ అభిమానుల మనస్సులనుండి అతనిని, అతని ఉపదేశములను, జ్ఞాపకములను తుడిచివేయలేకపోయిరి. అతని ఉపదేశములు అభిమానులద్వారా గౌరవింపబడి సుదూరప్రాంతములకు వ్యాపించెను. జీవములోకంటే మరణములోనే హస్ మతాధిపతులకు హడలు పుట్టించెను.
అతని ఉపదేశములను అనుసరించిన చెక్ (Czech) మత సంస్కర్తలగు హస్సైటులు (Hussites) అతని మరణమునుండి ఉద్భవించిరి. అతడు క్రీ.శ. 1415, జూలై 6న మరణించిన తరువాత బొహెమియా, మొరావియాలలో జాతీయోద్యమ అంకురార్పణ జరిగెను. పవిత్ర రోమా చక్రవర్తి సిజిస్మండ్, ప్రమాదము లేదని వాగ్దానము చేసినప్పటికిని కాన్స్టన్స్ సభలో హస్ను మతద్రోహిగా నిందించి చంపిరి. దీనిని చెక్ ప్రజలు జాతీయావమానముగ భావించిరి. ఈ అవమానమును ప్రజ లనేకులు ఎన్నటికిని మరువకపోవుటచే అది హస్పైటు యుద్ధములకు (Hussite Wars) దారితీసెను.