జాన్ హూపర్ హతసాక్షి మరణము (క్రీ.శ. 1555)
జాన్ హూపర్ (John Hooper, Bishop of Worchester) ఇంగ్లాండులోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి, పట్టభద్రుడు. అతడు విజ్ఞాన శాస్త్ర పఠనమును ముగించుచున్న సమయములో లేఖనములయెడల ప్రేమచేతను, వాటినిగూర్చిన జ్ఞానము సంపాదింపవలెనను బలమైన కోరికచేతను ప్రేరేపింపబడెను. దేవుని వాక్యమును ప్రార్థనపూర్వకముగా ఎక్కువ సమయము చదువుచు, పరిశోధించుటవలన పరిశుద్ధాత్మ కృపచేత నిజమైన పరిశుద్ధ మార్గమతనికి బయలుపరచబడెను.
దేవుని కృపలోను, ఆత్మీయ జ్ఞానములోను, భక్తిగల ప్రవర్తనలోను అతడు వర్ధిల్లు టనుబట్టి విశ్వవిద్యాలయములోని ఇతర మతప్రవిష్టుల ఆగ్రహము, ద్వేషములకు గురియై బహిష్కరింపబడెను. పిమ్మట అతడు సర్ థామస్ అరండెల్ (Sir Thomas Arundel) యొక్క ఆస్తి వ్యవహారములను పర్యవేక్షించుటకు నియమింపబడెను. అయితే హూపర్ మత సిద్ధాంతములనుగూర్చి తెలిసికొనిన అరండెల్ అతనిని ఆ ఉద్దేశ్యములనుండి మార్చుటకు విన్చెస్టర్ (Winchester) బిషప్ యొద్దకు పంపి, కొంతకాలమైన తరువాత హూపర్ను తిరిగి తనయొద్దకు పంపుమని బిషప్ను కోరెను.
విన్చెస్టర్ బిషప్ ఐదు దినములు హూపర్ చర్చించిననూ ఆ యౌవనస్థుని కొంచెమైననూ మార్చలేకపోయెను. హూపర్ ఉద్దేశ్యములను ఏమాత్రము మార్చలేక పోయిన ఆ బిషప్, అరండెల్ కోరికమేరకు హూపర్ను తిరిగి అతనియొద్దకు పంపించెను. బిషప్ హూపర్ యొక్క జ్ఞానమును, తెలివిని ప్రశంసించెను గాని అప్పటినుండి అతనియెడల ద్వేషభావము కలిగియుండెను.
కొద్దికాలమునకే అరండెల్కు తనపై అసూయపెరుగుటవలన, తన ప్రాణమునకు అనేక మార్గములనుండి ముప్పువాటిల్లెనని తలంచిన హూపర్, అతనియొద్ద ఉద్యోగము మానివేసి, కొన్నిదినములకు ముందు తాను ఉరిశిక్షపడకుండా కాపాడిన తన స్నేహితుని యొద్దనుండి ఒక గుఱ్ఱమును అరువుతీసుకొని ఫ్రాన్స్ వెళ్లుటకు సముద్ర తీరమున చేరి, పారిస్ వెళ్లెను.
పారిస్ లో కొంతకాలము గడిపిన తరువాత అతడు తిరిగి ఇంగ్లాండు చేరి మాస్టర్ సెంట్లో (Master Sentlow) అను ఒక వ్యక్తియొద్ద ఉద్యోగములో చేరెను. అచ్చటకూడ అతనికి తన సిద్ధాంతములవలన ప్రాణాపాయము ఏర్పడుటచే ఐర్లాండు, ఫ్రాన్స్ దేశములగుండా ప్రయాణించి జర్మనీకి వెళ్లి, అక్కడ బాసిల్ (Basil) నగరములోనూ, మరిముఖ్యముగ స్విడ్జర్లాండ్ లోని జ్యూరిక్ (Zurich) నగరమందు అనేకమంది వేదాంత పండితులను కలసికొనెను. అక్కడ మాస్టర్ బులింజర్ (Bullinger) తో స్నేహముచేసి, అచ్చటనే బర్గండియన్కు చెందిన ఒక స్త్రీని వివాహమాడి, హెబ్రీ భాషను కష్టపడి నేర్చుకొనసాగెను.
రాజైన ఎనిమిదవ హెన్రీ క్రీ.శ. 1547 జనవరి 28న మరణించెను. అదేరోజున అతని ఏకైక కుమారుడగు ఆరవ ఎడ్వర్డ్ ఇంగ్లాండుకు రాజయ్యెను. హెన్రీ రాజు చనిపోవుటకు కేవలము పది సంవత్సరముల ముందు అనగా క్రీ.శ. 1537 అక్టోబరు 12న అతని మూడవ భార్యయైన జేన్ సెమూర్ (Jane Seymour) కు జన్మించిన ఎడ్వర్డ్ యుక్త వయస్సు రానివాడగుటచే ఇంగ్లాండును పరిపాలించుటకు పదహారు మంది సభ్యులుగల సభను హెన్రీ ఏర్పాటుచేసెను.
కాని ఈ సభ ఏర్పడిన కొద్ది కాలమునకు ఎడ్వర్డ్ మేనమామ మరియు సోమర్సెట్ (Somerset) ప్రభువైన ఎడ్వర్డ్ సెమూర్ (Edward Seymour) ఎడ్వర్డ్కు సంరక్షకునిగా ప్రకటించుకొని ఇంగ్లాండును పరిపాలించుట ప్రారంభించెను. కాని రెండు సంవత్సరముల తరువాత క్రీ.శ 1549లో ఎడ్వర్డ్ సెమూర్ను అధికారమునుండి తొలగించి నార్తంబర్లాండ్ ప్రభువైన జాన్ డడ్లీ (John Dudley) రాజ ప్రతినిధిగా ఎడ్వర్డ్కు యుక్తవయస్సు వచ్చువరకు పరిపా లించుటకు అధికారము చేపట్టెను.
ఆరవ ఎడ్వర్డ్ రాజు ప్రొటెస్టంట్ గురువులవద్ద విద్యనభ్యసించిన ఫలితముగా ఇంగ్లాండు దేశపు సంఘములో ప్రొటెస్టంట్ సంస్కరణలను అభిమానించెను. ఎడ్వర్డ్ పరిపాలనలో ఆర్చిబిషప్ థామస్ క్రానమర్చే వివిధ గ్రంథములనుండి సంగ్రహించ బడిన సాధారణ ప్రార్థన గ్రంథము (Book of Common Prayer) మొదటిసారిగా ప్రచురింపబడెను.

జ్యూరిక్లో అతని స్నేహితులు అతనియెడల చూపిన దయ, అభిమానములకు వారిని అభినందించి, కృతజ్ఞతలు తెలిపి తాను వెళ్లుచున్నానని వారికి చెప్పెను. దానికి జవాబుగా మాస్టర్ బులింజర్ హూపర్తో ఇట్లు చెప్పెను :
“మాస్టర్ హూపర్, మేము నీ సహవాసమును కోల్పోవుచున్నందుకు మాకు బాధగా ఉన్ననూ మేము సంతోషించుటకు గొప్ప కారణముకూడా ఉన్నది. క్రీస్తుయొక్క నిజమైన విశ్వాసమునిమిత్తము చాలాకాలము ప్రవా సములోనున్న నీవు స్వదేశమునకు తిరిగి వెళ్లుచున్నందుకు సంతోషించు చున్నాము. నీవు అచ్చట నీ వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించుటమాత్రమే కాదు గాని నీవలన అచ్చట క్రీస్తు సంఘము అభివృద్ధి చెందుననుటలో మాకు ఏవిధమైన సందేహము లేదు.
మేము నీనిమిత్తము ఎందుకు ఆనందించుచున్నామనగా నీవు చేదైన, ఆనందము లేని, మూర్ఖత్వము, అనాగరికమైన దేశమును వదలి స్వేచ్ఛ, సంతోషము, పాలు తేనెలు ప్రవహించు ఫలభరితమైన దేశమునకు వెళ్లు చున్నావు.
నీవు మాకు దూరమై అందుబాటులోలేక, ఐశ్వర్యము, ఆశీర్వాదము లతోకూడిన నీ క్రొత్త జీవితములో గొప్ప ధనికుడవై, బిషప్ అంతటివాడవై, నీ గౌరవము వృద్ధిపొంది, అనేకమంది నూతన స్నేహితులను సంపాదించుట వలన, నీ పాత పరిచయస్థులము, నీ క్షేమము కోరు మమ్ములను మరచిపోదు వేమో అను భయముతో పూర్తిగా ఆనందించలేకపోవుచున్నాము.
అయినను నీవు ఎంతవరకు మమ్మును మరచి, విసర్జించినను మేము మా పూర్వ స్నేహితుడు, మా తోటివాడునైన మాస్టర్ హూపర్ను మరచి పోలేమని నీవు కచ్చితముగా తెలిసికొనవలెను. మమ్ములను మరచి పోకుండుట నీకిష్టమైతే నీయొద్దనుండి క్షేమ సమాచారములు మాకు తెలియచేయవలెనని నిన్ను ప్రార్థించుచున్నాము.”
అందుకు హూపర్, “నా స్నేహితులు, శ్రేయోభిలాషులైన మిమ్ములను ఆ దేశములోని ఆనందముగాని, నూతన స్నేహితులుగాని మరచిపోవునట్లు నన్ను ప్రేరేపించలేవు. అప్పుడప్పుడు ఉత్తరములు వ్రాయుటద్వారా అక్కడి పరిస్థితులు మీకు తెలియజేసెదను. కాని అన్నిటికంటే చివరి వార్త నేను మీకు వ్రాయగలనా?” అని బదులు పలికి, మాస్టర్ బులింజర్ చేయిపట్టుకొని, “అక్కడ నేను అధికశ్రమలు పొందుదును, నేను కాల్చబడి బూడిదయైతినని మీరు వినెదరు” అని వారితో చెప్పెను.
హూపర్ లండన్ చేరిన వెంటనే ఎడతెగక బోధించుట ప్రారంభించెను. రోజుకు రెండుసార్లు, కనీసము ఒక్కసారైననూ బోధించకుండా ఉండలేదు. అతని ప్రసంగములు వినుటకు అనేకమంది ప్రజలు వచ్చుటచే చివర వచ్చివారికి దేవాలయములో స్థలము లేక వారు వాకిటనే నిలిచియుండవలసివచ్చెడిది. అతడు తన సిద్ధాంతములలో ఆరితేరిన వాడు, చక్కని వాగ్ధాటి, లేఖనములలో మంచి అనుభవము, బోధించుటలో అలుపెరుగనివాడు గనుక కొద్దికాలములోనే ప్రజలు అతడు బోధించుచున్న దేవాలయమునకు విపరీతముగా వచ్చుట ప్రారంభించిరి.
అతడు తన జీవితకార్యమును ఎట్లు ప్రారంభించెనో అట్లే అంతమువరకు దానిని కొనసాగించెను. శ్రమగాని, కష్టముగాని అతని పనిని నాశనము చేయలేకపోయెను. పదోన్నతి అతనిలో పరివర్తనము తేలేకపోయినది, రుచికరమైన భోజనములు అతనిని చెరిపివేయలేకపోయెను. ఎటువంటి నింద దరిచేర వీలుకానంతటి శ్రేష్ఠమైన, పవిత్రమైన జీవితమును అతడు జీవించెను.
శారీరకముగాను, మానసికముగాను అతడెంతో బలముగా నుండి ప్రతి విషయములోను యేసుక్రీస్తు సువార్తకు లోపములేని సేవకుడుగా నుండెను. అనేకమందికి అతడు చాలా కఠినముగా కనబడిననూ, అందరికీ బాగా తెలిసినవాడుగా ఉండవలెనని అతడు కోరుకొనెను. కాని అతడు తన పనిని చక్కగా ఎట్లు చేయవలెనో ఎరిగినవాడు. ఒకానొక సమయములో ఒక గొప్ప వ్యక్తి కొంత అసూయతోకూడిన మనస్సుతో హూపర్ ఇంటికి వెళ్లెను. అయితే హూపర్ యొక్క సామాన్య జీవితమును, అతని గాంభీర్యమును చూచి అతనితో మాటలాడు ధైర్యము లేక ఆ వ్యక్తి తనలోతాను సిగ్గుపడి తిరిగి వెళ్లెను.
కొంతకాలమైన తరువాత హూపర్ రాజుయెదుట బోధించుటకు పిలువబడి, రాజు మెప్పుపొంది, గ్లేసెస్టర్ పట్టణ బిషప్ (Gloucester) గా పదోన్నతి పొంది, అందు రెండు సంవత్సరములు పనిచేసెను. అచ్చట అతని శత్రువులుకూడా అతనిమీద దోషారోపణ చేయలేనంత మంచిగా పనిచేసెను. ఆ తరువాత అతడు వోర్చెస్టర్ బిషప్ గా నియమింపబడెను.
ఇంగ్లాండు సంఘము మతవిషయములయందు కొంత సంస్కరింపబడిననూ కేథలిక్ బిషప్లు కొన్ని పండుగల సమయములలో మరియు మూఢనమ్మకములు కలిగిన కొన్ని వేడుకల సమయములలో ఆడంబరమైన దుస్తులు ధరించుట చలామణిలో కలదు. వారు పెట్టుకొను టోపీ చతుర్భుజాకారముకలిగి ప్రపంచమునే నాలుగు భాగములుగా విభజించిరను సూచనకు సరిపోవును.
అట్టి వస్త్రములను ధరించుట హూపర్కు ఇష్టము లేదు. అందుచే అతడు బిషప్ పదవినుండి తనను తొలగించుమని, లేదా తాను పండుగ సమయములలో అట్టి ప్రత్యేక వస్త్రములను ధరింపకుండా ఉండుటకు అనుమతించవలెనని రాజును వేడుకొనెను. రాజు అతని మనవికి వెంటనే సమ్మతించెను.
ఇందుకు ఇతర బిషప్లు బలముగా వ్యతిరేకించిరి. పండుగ సమయములలో సంప్రదాయముగా వచ్చుచున్న ఆచార సూచకమైన వస్త్రములను కచ్చితముగ ధరింపవలెనని, ఇది చాల అల్పమైన విషయమని, దోషము వస్త్రములలో లేదని, వాటిని దుర్వినియోగపరచుటలోనే ఉన్నదని చెప్పిరి. ఇటువంటి సామాన్య విషయము లలో హూపర్ అంత మొండిగా ప్రవర్తించనవసరములేదని, తన యిష్టానుసారముగా ఉండెదనని పంతము పట్టుట అంగీకరింపబడదని చెప్పిరి.
వేడుక సమయములలో వస్త్రములను ధరించు విషయములో హూపర్కు, బిషప్లకు వాగ్వివాదము జరుగుటచే అనేకమంది మంచి క్రైస్తవులు బాధపడిరి. అయితే హూపర్ వ్యతిరేకులుమాత్రము సంతోషించిరి. తుదకు బిషప్లదే పైచేయి అయినందువలన హూపర్ కొన్ని సందర్భములలో ఇతర బిషప్లతో కలసి పండుగ వస్త్రములను ధరింపవలసి వచ్చెను. రాజు యెదుట ప్రసంగించవలసి వచ్చినప్పుడు అతడు పండుగ వస్త్రములను చతుర్భుజాకారము కలిగిన టోపీతోసహా ధరించి హాజరయ్యెను. కాని అది అతని తలమీద సరిగా అమరలేదు.
హూపర్ తన మందకు నిజమైన రక్షణ విషయములో తర్బీతునిచ్చుటకు సాధ్యమైన ప్రతి మార్గమును వెదకెను. అతడు పట్టణములను, గ్రామములను దర్శించి తన ప్రజలకు వాక్యమును ప్రకటించినట్లుగా – ఏ తండ్రి తన గృహములోనూ, ఏ తోటమాలి తన తోటలోనూ, ఏ పనివాడు తన ద్రాక్షాతోటలోను అంత మంచిగా పనిచేసియుండ లేదు.
అతనికి పని ఎక్కువగా లేనప్పుడు ప్రజల సమస్యలు వినుటయందును, పాఠశాలలను దర్శించుటయందును, వాక్యధ్యానము, ప్రార్థనలయందును తన సమయ మును గడుపుచుండెను. అతడు తన మందలోనివారిని ధనికులు పేదలు, యౌవనులు వృద్ధులు, అక్షరాస్యులు నిరక్షరాస్యులను భేదము లేకుండా అందరిని సమానముగా చూచెను.

ఒక కుటుంబ యజమానిగా హూపర్ తన బిడ్డలకు క్రైస్తవ తర్బీతునిచ్చుటలో తగినంత సమయమును వెచ్చించెను. తనవలె వారును బాగుగా చదువుకొని మంచి మర్యాదలు కలిగి దేవుని వాక్యమును ప్రేమించువారుగా ఉండవలెనని అతడు కోరుకొనెను. ఎవరైన హూపర్ గృహములో ప్రవేశించినచో ఒక దేవాలయములో ప్రవేశించిన అనుభూతిని పొందెదరు.
దైవసంబంధమైన భక్తిభావములు, సత్య ప్రవర్తనతో కూడిన సంభాషణ, పరిశుద్ధ లేఖనముల పఠనము, దైవసంబంధమైన వాతావరణము ఆ యింట చూడగలరు. ఇవి తప్ప ఎటువంటి బుద్ధిహీనత లేక సోమరితనము, ఐశ్వర్యమును ప్రదర్శించుట, అవిధేయతతో కూడిన మాటలు, శాపములు అక్కడ ఎప్పుడూ ఉండవు.
వ్యక్తిగతమైన మరియు సంఘసంబంధమైన ఆర్థిక విషయములలో అతనినెవరూ నిందించలేరు. ప్రాథమిక కుటుంబ అవసరములకు మినహా, బిషప్ కార్యాలయము నుండి వచ్చు మిగతా ధనమంతటిని అతడు ఇతరులకు ఉపయోగించెను. తరచుగా ఆ ప్రాంతములోని భిక్షగాండ్రకు, పేదలకు గొప్ప విందులు చేసెడివాడు.
ప్రతిదినము కొంతమంది పేదలను తన ఇంటికి ఆహ్వానించి భోజనము పెట్టుటతోపాటు పరలోక భోజనమైన ప్రభువు ప్రార్ధన, పది ఆజ్ఞలు, విశ్వాససంబంధమైన కొన్ని విషయములు వారికి బోధించెడివాడు. వారి భోజనమైన తరువాతమాత్రమే అతడు కూర్చొని భోజనము చేసెడివాడు. అయితే హూపయ్యొక్క సత్క్రియలన్నియు త్వరలోనే ఆగిపోయెను.
ఆరవ ఎడ్వర్డ్ రాజు క్రీ.శ. 1552 నవంబరులో రోగగ్రస్థుడై తన పదహారవ జన్మదినమునకు మూడు మాసముల ముందు అనగా క్రీ.శ. 1553 జూలై 6న మరణించెను. నార్తంబర్లాండ్ ప్రభువైన జాన్ డడ్లీ ఎడ్వర్డు వరుసకు సోదరియైన జేన్ గ్రే (Lady Jane Grey) అను వనితను సింహాసనమెక్కించుటకు ప్రయత్నించి విఫలుడయ్యెను. ఈమె ప్రొటెస్టంట్ శాఖకు చెందిన యువతి. అయితే ఎడ్వర్డ్ సవతి తల్లి కుమార్తె మరియు రోమన్ కేథలిక్ శాఖకు చెందిన ఒకటవ మేరి (Mary I) రాణిగా సింహాసనమధిష్టించెను.
సింహాసన మధిష్టించిన వెంటనే, మేరి ఇంగ్లాండులో కేథలిక్ మతమును పూర్వ స్థితికి తెచ్చి, సంప్రదాయముగా వచ్చుచున్న మూఢనమ్మకములతో కూడిన ఆరాధనలను, పోప్ యొక్క అధికారమును పునరుద్ధరించెను. ఒక సంవత్సరము తరువాత పవిత్ర రోమా చక్రవర్తియైన ఐదవ చార్లెస్ కుమారుడును, భవిష్యత్తులో (1556) స్పెయిన్ రాజుగా నియమింపబడు రెండవ ఫిలిప్ (Philip II) ను ఆమె వివాహమాడెను. జీవితాంతమువరకు వారిద్దరూ కలసి ఇంగ్లాండును పరిపాలించిరి.
ఆమె తన పరిపాలనకాలములో సుమారు మూడు వందలమంది ప్రొటెస్టంట్ క్రైస్తవులను హింసించి, వారిని సజీవదహనము గావించెను. అందువలన ఆమెకు ‘రక్తపు మేరి’ (Bloody Mary) అను బిరుదు వచ్చెను.
రాణిగా ఆమెకు పట్టాభిషేకమైన కొద్దికాలమునకే తనయెదుట హాజరుకావలసి నదిగా తాకీదు పంపినవారిలో వోర్చెస్టర్ బిషప్ యైన జాన్ హూపర్ ఒకడు. అతని స్నేహితులైన అనేకమంది హూపర్ను పారిపోయి తన ప్రాణమును రక్షించుకొనుమని హెచ్చరించిరి.
తనయెడల రాణియైన మేరికి దురుద్దేశములు కలవని హూపర్ ఎరిగియున్ననూ అతడు ఇంగ్లాండును విడిచి పారిపోవుటకు ఇష్టపడలేదు. “ఒకప్పుడు నేను పారిపోతిని, కాని ఇప్పుడు జరుగవలసిన దుష్టకార్యములను ఎదుర్కొనుటకు సర్వసన్నద్ధుడనైయున్నాను. నేను నా గొజ్జెలతోనే జీవించెదను, నా గొజ్జెలతోనే మరణించెదను” అని పలికెను.
క్రీ.శ. 1553 సెప్టెంబరు 1వ తేదీన హూపర్ రాణీయెదుట హాజరయ్యెను. చీవాట్లు, ఎగతాళి, అవమానపు మాటలతో అతడు ఆహ్వానింపబడెను. అయినప్పటికినీ బిషప్ గా తన జీవితమును, తన సిద్ధాంతములనుగురించి అతడు స్వేచ్ఛగాను, ధైర్యము గాను చెప్పెను. అదంతయు వినిన తరువాత అతనికి కారాగార శిక్ష విధింపబడెను. అతని విశ్వాసమునుగురించిగాక అతడు రాణీకి డబ్బు అచ్చియుండుటవలన శిక్ష విధింపబడెనని వారు తెలిపిరి, కాని వాస్తవమునకు హూపర్ రాణీకి డబ్బు అచ్చి యుండలేదు.
క్రీ.శ. 1554 మార్చి 19వ తేదీన హూపర్ రాణి ప్రతినిధులైన ప్రధాన న్యాయాధిపతి, విన్చెస్టర్ ప్రభువు, ఇతర ముఖ్య అధికారులయెదుట హాజరయ్యెను. “నీకు వివాహమైనదా” అని విన్చెస్టర్ ప్రభువు ప్రశ్నించగా, “అవును నా ప్రభువా, మరణము నా వివాహమును ఎడబాపువరకు నేను వివాహమును ఎడబాయను” అని హూపర్ సమాధానమిచ్చెను.
ఏ కారణములవలన అయితేనేమి, రోమన్ కేథలిక్ మతాధిపతులు వివాహము చేసికొనరు. వారు ఆసీనులైన ఆ స్థలమునకు అతని జవాబు అమర్యాదకరమైనదని వారు గట్టిగా నవ్వుచూ అతనిని గేలిచేసిరి. ఛిచెస్టర్ పట్టణ (Chichester) బిషప్ డా. డే (Dr. Day) హూపర్ను ‘మతద్రోహి’ అని నిందించి, ఆగ్రహముతో కొట్టి, తిట్టెను. బిషప్ టాన్ల్ (Tonstal) మరియు అక్కడున్న స్మిత్ అను గుమస్తా, మరికొందరు హూపర్ను ‘పశువు’ అని దూషించిరి.
డర్హామ్ పట్టణ బిషప్న టాన్స్టాల్ “సంస్కారములో క్రీస్తు నిజ శరీరమున్నదని నిజముగా నమ్ముచున్నావా?” అని హూపర్ను ప్రశ్నించెను. అందుకు హూపర్ అందులో అట్టిదేదియూ లేదని, దానిని తాను నమ్ముటలేదని స్పష్టముగా జవాబు చెప్పెను. అంతట ప్రధాన న్యాయాధిపతియైన విన్చెస్టర్ ప్రభువు “ఏ అధికారముచేత నీవు క్రీస్తు శరీర ప్రత్యక్షతలను నమ్ముటలేద”ని ప్రశ్నించెను.
“ఆ అధికారము దేవుని వాక్యమే” అని హూపర్ సమాధానమిచ్చెను. అందుకు వారు – అతనికి వివాహమైన దని, భార్యను పరిత్యజించుటకు ఇష్టపడుటలేదని, సంస్కారములో క్రీస్తు నిజ శరీర ప్రత్యక్షత ఉన్నట్లు నమ్ముట లేదని దూషించి, ఈ కారణములనుబట్టి అతనిని బిషప్
పదవినుండి తొలగించిరి. ఫ్లీట్ చెరసాల (Fleet Prison) లో ఉన్నప్పుడు క్రీ.శ. 1555 జనవరి 7వ తేదీన తన శ్రమలను గురించి హూపర్ ఇట్లు వ్రాసెను :
“జైలులో నేను కొద్ది స్వేచ్ఛను పొందుటకు నన్ను క్రీ. శ. 1553 సెప్టెంబరు మొదటి తేదీన రిచ్మండ్నుండి ఫ్లీట్కు బదిలీచేసిరి. ఆరు దినములైన తరువాత ఈ స్వేచ్ఛకొరకు జైలు అధికారికి నేను ఐదుపౌండ్లు సుము చెల్లించితిని. డబ్బు స్వీకరించిన వెంటనే విన్చెస్టర్ బిషప్ స్టీఫెన్ గార్డినర్ (Stephen Gardiner) కు జైలు అధికారి ఫిర్యాదుచేయగా, సుమారు మూడు నెలలపాటు స్వేచ్ఛలేకుండా ఫ్లీట్ జైలులోని టవర్ గదిలో నన్ను బంధించి, చిత్రహింసలకు గురిచేసిరి.
ఒకసారి మంచి మర్యాదగల ఒక స్త్రీ తెచ్చిన మధ్యాహ్నపు భోజనము చేయుటకు నేను క్రిందికి వచ్చు స్వేచ్ఛనిచ్చిరి. కాని, నా స్నేహితులెవరితోను నేను మాట్లాడుటకు అనుమతించక వెంటనే గోపురములోని నా చిన్న గదికి తీసికొని వెళ్లిరి. మరుసటి దినము మధ్యాహ్న భోజనము చేయుటకు నేను దిగివచ్చినప్పుడు చెరసాల అధికారి, అతని భార్య నన్ను దూషిం చుచూ, వారి గొప్ప స్నేహితుడైన విన్వెస్టర్ బిషప్కు నాపై ఘోర నేరారోపణ చేసిరి.
కొన్ని మాసముల అనంతరము చెరసాల అధికారి బాబింగ్టన్ (Babington) అతని భార్య నాతో పోట్లాడి, వారి స్నేహితుడైన విన్చెస్టర్ బిషప్నుండి అనుమతిపొంది, చెరసాలలో మిక్కిలి భయంకరమైన దుర్వాసనగల గదిలో నన్ను ఉంచిరి. ఆ గదిలో విపరీతమైన దుర్వాసనగల గడ్డితో చేయబడిన ఒక చాప, క్రుళ్ల కంపుకొట్టుచున్న దుప్పటి, పక్షి ఈకలు గల సంచివంటి ఒక తలదిండును నాకిచ్చిరి.
ఆ జైలుకు ఇరువైపులా మూయబడని మరుగుదొడ్డి కాలువలు భరింపరాని దుర్గంధమును వ్యాపింపజేయుచున్నవి. నేను అనుభవించిన మరియు ఇప్పుడు అనుభవించుచున్న రోగములకు ఆ అనారోగ్య పరిసర ములే కారణమని నా నమ్మకము.
నేను ఎంతగానో దుఃఖించి, ఏడ్చి కేకలు పెట్టిననూ ప్రయోజనము లేకపోయెను. ప్రాణాపాయ పరిస్థితులలో నేనున్నప్పుడు నాతోటి ఖైదీలు నాకు సహాయము చేయకుండా వారిని ఆపిరి. “అతనిని ఒంటరిగానే ఉండ నీయుడి, అతడు చనిపోతే మనకు పీడ విరగడవుతుంది” అని జైలు అధికారి చెప్పెను.
నా భోజనము నిమిత్తము జైలు అధికారికి ఇరువది షిల్లింగులు ఇచ్చి తిని. నా బిషప్ పదవిని పూర్తిగా తొలగించువరకు ఆ విధముగా ఇచ్చుచూనే యుంటిని. నేను ఎంత ధనము ఇచ్చిననూ అతడుమాత్రము నన్ను ఒక అధమునిగా ఎంచి ఎంతో హీనముగానూ, నీచముగాను చూచుచుండెను.
నా సహాయకుడగు విలియమ్ డౌన్టన్ (William Downton) ను కూడా చెరసాలలో బంధించిరి. అతనివద్ద ఏమైనా ఉత్తరములు లభించు నేమోయని వెదుకుటకు అతని దుస్తులను జైలు అధికారి లాగివేసి, నన్ను చెరసాలనుండి విడుదల చేయించుటకు అవసరమైన ధనమును పంపిన కొందరి మంచివారి పేర్లుగల చీటీని కనుగొనెను. వారినికూడ కష్టపెట్టుటకు దేవునికి, నాకు శత్రువైన స్టీఫెన్ గార్డినర్కు జైలు అధికారి ఆ పేర్లుగల జాబితాను ఇచ్చెను.
సుమారు పదునెనిమిది మాసములు నేను కారాగార శిక్షననుభ వించితిని. నా వస్తువులు, వేతనము, కుటుంబము, మిత్రులు, సౌకర్యములు అన్నీ నాకు దూరమైనవి. న్యాయమైన లెక్కను బట్టి రాణి నాకు ఎనుబది పౌండ్లు ఇచ్చియుండెను. ఆమె నన్ను కారాగారములో పెట్టించినదేగాని నాకు ఏమియు సహాయము చేయలేదు సరికదా ఇతరులు నాకు సహాయము చేయుటకుకూడా ఆమె అంగీకరింపలేదు.
దీనికితోడు దుర్మార్గులైన ఇరువురు స్త్రీ, పురుషులతోపాటు నన్నునూ ఉంచిరి. దేవుని సహాయముతప్ప మరియొక మార్గమేమియు లేదు. నాకు తీర్పు జరుగకముందే నేను చెర సాలలో చనిపోవుదును. అది జీవమైననూ, మరణమైననూ ఆయన చిత్తమే జరుగునట్లు దేవునికి నన్ను అప్పగించుకొనుచున్నాను.”
క్రీ.శ. 1555 జనవరి 22న పరి. మేరి వోవరి (St. Mary Overy) చర్చిలో నున్న విన్చెస్టర్ గృహములో విన్చెస్టర్ బిషప్, ఇతర బిషప్లు మరియు కొందరు ప్రధాన న్యాయాధిపతులు సమావేశమై హూపర్ను తమయొద్దకు తీసికొనిరావలసి నదిగా చెరసాల అధికారియైన బాబింగ్టన్ న్ను ఆదేశించిరి.
హూపర్ వారియొద్దకు వచ్చినప్పుడు విన్చెస్టర్ బిషప్ అతని “దుష్టమైన మరియు అపవిత్రమైన సిద్ధాంతము లను” విడనాడవలసినదిగా బలవంతము చేసి, తిరిగి కేథలిక్ సంఘ ఐక్యతకు తోడ్పడి, ఇంగ్లాండు పార్లమెంట్ నిర్ణయించినట్లు సంఘమంతటికి పోప్ నాయకుడని అంగీక రించుమనెను. పోప్ యొక్క పరిశుద్ధతకు తలవంచి నీవుకూడ నావలె పోప్ ఆశీర్వా దము, రాణియొక్క దయను పొందవచ్చునని బిషప్ హూపర్కు అభయమిచ్చెను.
పోప్ బోధించు సిద్ధాంతము క్రీస్తు సిద్ధాంతమునకు వ్యతిరేకముగ ఉన్నందువలన పోప్ సంఘమునకు నాయకుడుగ నుండుటకు అర్హుడు కాదనియు, అందువలన అన్యాయపు అధిపతికి తాను లోబడననియు, రోమన్ కేథలిక్ సంఘము సరియైన సంఘము కాదనియు, నిజమైన సంఘము తన ప్రియుని స్వరముమాత్రమే వినుననియు, అది క్రొత్తవారి స్వరమునుండి పారిపోవుననియు చెప్పెను.
మరియు హూపర్ అందుకు బిషప్ “పోప్ శత్రువులకు రాణి ఏమాత్రము దయదల్చద”ని చెప్పి, హూపర్ను ఫ్లీట్ చెరసాలకు తీసికొనివెళ్లి ఖైదు చేయుమని బాబింగ్టన్ ను ఆజ్ఞాపించెను.

జనవరి 28వ తేదీన విన్చెస్టర్ బిషప్ మరియు ఇతర న్యాయాధికారులు హూపరు విచారించుటకు మరియొకసారి పరి. మేరి వోవరి చర్చిలో సమావేశమైరి. తీవ్ర వాదోపవాదములు జరిగిన తరువాత వారు హూపర్ను ప్రక్కన ఉంచి మాస్టర్ రోజర్స్ (Rogers) అను మరియొక తిరుగుబాటుదారుని సాయంకాలము నాలుగు గంటలవరకు విచారించిరి.
ఇట్లు వారి విచారణ ముగించిన తరువాత హూపర్ను, మాస్టర్ రోజర్స్ను మరుసటిదినము ఉదయము తొమ్మిది గంటలవరకు సౌత్వార్క్ (Southwark) లో ఉంచుటకు పంపి, వారు ఒకవేళ తమ మనస్సు మార్చుకొని రోమన్ కేథలిక్ సంఘమునకు వచ్చెదరేమోనని వేచియుండిరి.
దేవాలయమునుండి సౌత్వార్క్క అధికారులతో కలసి వెళ్లుచుండగా హూపర్ రోజర్స్తో ఇట్లనెను, “సహోదరుడైన రోజర్స్, రమ్ము, ఎండిన కట్టెలలో సజీవ దహనము గావింపబడువారిలో మనమే మొదటివారమేమో పరిశీలింపుము?”
“అవునయ్యా, దేవుని కృపచేత,” రోజర్స్ బదులు పలికెను.
“దేవుడు మనకు శక్తినియ్యడని అనుమానించకు” అని హూపర్ ధైర్యము చెప్పెను. వారి ధైర్యమును చూచి ఆనందించిన ఆ వీధి ప్రజల మధ్యగా నడచి వెళ్లుట వారికి కష్టమైనది.
మరుసటి ఉదయము జైలు అధికారులు వారిని బిషప్ మరియు ఇతర న్యాయాధి కారుల ముందు ప్రవేశపెట్టిరి. సుదీర్ఘమైన చర్చ అనంతరము హూపర్ వారికి ఏ విధముగాను లోబడడని వెల్లడియైనది. కనుక వారు అతనిని జాన్ హస్, జెరోమ్ వలె కించపరచి, మరణమునకు తగినవాడని తీర్పుచెప్పిరి.
ఆ తరువాత రోజర్స్నుకూడా రప్పించి వారికి లోబడవలసినదిగా బలవంతము చేసిరి. అతడుకూడా అంగీకరింపక పోవుటచే, వారిద్దరిని లండన్ ప్రభుత్వ అధికారులకు అప్పగించిరి. ఆ అధికారులు వారిని చీకటిపడువరకు ఉంచుటకు విన్చెస్టర్ భవన సమీపములోని ‘క్లింక్’ (Clink) ఖైదుకు తీసుకొనిపోయిరి.
చీకటిపడిన తరువాత అధికారులు కర్రలు, కత్తులు ధరించిన తమ అనుచరులతో విన్చెస్టర్ బిషప్ భవనముగుండా లండన్ వంతెనమీదుగా పట్టణములోనుండి న్యూ గేట్ చెరసాలకు హూపర్ను తీసుకొని వెళ్లిరి. పట్టణములోగుండా వెళ్లకమునుపు వారు తమపై ఎవరైనా దాడిచేసి బలత్కారముగా తమయొద్దనుండి హూపర్ను తీసికొని వెళ్లుదురను భయముతో ముందుగా వెళ్లి ఆ వీధులలోని దీపములను ఆర్పివేసిరి.
వారి దుర్మార్గపు కార్యములకు, దుష్ట మనఃస్సాక్షికి చీకటి చక్కగా సరిపోవునుగదా! అయిననూ హూపరు ఆ మార్గమున తీసికొని పోవుచున్నారని తెలిసి ప్రజలు చేతులలో దీపములు పట్టుకొని వారి గృహములనుండి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించిరి.
ఆయన వారికి బోధించిన సత్య సిద్ధాంతములను అంతమువరకు కాపాడుకొనినందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తుది గడియవరకు దేవుడు అతనిని బలపరచునట్లు ప్రార్థించిరి. హూపర్ కూడా వారిమధ్యగా వెళ్లుచూ తనకొరకు దేవునిని మనస్ఫూర్తిగా ప్రార్థించుడని ప్రజలను కోరెను.
ఆ తరువాత వారు హూపర్ను న్యూ గేట్ జైలు అధికారికి అప్పగించగా, అతడక్కడ ఆరు దినములుంచబడెను. ఆ దినములలో జైలు కావలివారు అతనిని చూచుటకు లేక మాట్లాడుటకు కొద్దిమందిని తప్ప మరి ఎవరిని అనుమతించలేదు.
అనేకసార్లు లండన్ బిషప్న బోనర్ (Bonner), మరికొందరు హూపర్ను దర్శించి తన మనస్సు మార్చుకొని క్రైస్తవ వ్యతిరేక సంఘములో సభ్యునిగా చేరుమని ఒప్పించుటకు ప్రయత్నించిరి. వాక్యమును వక్రీకరించుట, పురాతన వ్రాతలకు తప్పుడు అర్థములను చెప్పుట మొదలగు చేయదగు ప్రయత్నములన్నియు చేసిరి. పైపై మంచితనము, స్నేహమును ప్రదర్శించిరి.
లోకసంబంధమైన వస్తువులను, ఆస్తులను అతనికి ఎరచూపిరి, గట్టిగా బ్రతిమలాడిరి, బెదిరించిరి. కాని హూపర్ – “క్రీస్తులోని తన స్థిర విశ్వాసమును దేవుని వాక్యములోని సత్యమునుండి తననేదియూ కదిలించ లేదు” అని వారితో చెప్పెను.
వారు తమ తప్పుడు పనులకు అతనిని ఉపయోగించుకొనుటలోనూ, సంఘము నకు అతనిని తిరిగి సంపాదించుటలోను విఫలమైనందున వారు అతనిమీద, అతడు బోధించిన క్రీస్తు సిద్ధాంతములమీద తప్పుడు ప్రచారము చేసి అవమానపరచుటకు ప్రయత్నించిరి. ముఖ్యముగా లండన్ బిషప్, మరికొందరు ఆ వాదనను బలపరచి నప్పుడు బలహీనులైన కొందరు ఆ వాదనను నమ్మిరి.
తప్పుడు ప్రచారములు ఎంత ప్రభావమును కలిగియుండునో మాస్టర్ హూపర్ త్వరలోనే గ్రహించెను. తనపై మోపబడిన తప్పుడు పుకారులను కొందరు నమ్ముట చూచి అతడు విచారించి, వారికొరకు ఒక బహిరంగ లేఖ వ్రాసెను. ఆ వ్రాయబడిన లేఖ సారాంశమేమనగా:
“జాన్ హూపర్ అను నేను క్రీస్తుకొరకు ఖైదీనై మరణ దండన విధింపబడినవాడనైతిని. (న్యూ గేటు ఖైదులో మరణ శిక్షకొరకు ఎదురు చూచుచూ) నేను ఇంతవరకు బోధించిన విషయములను తప్పు అని నేను ఒప్పుకొనినట్లు వచ్చిన వార్తలు నన్ను ఆశ్చర్యపరచినవి.
నాపై ఈ పుకారులు లండన్ బిషప్ అతని అనుచరులు నన్ను చూచు టకు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఉద్భవించినవి. నేను వారితో మాట్లాడి తిని, మరలా వారు వచ్చినయెడల మాట్లాడెదను. వారి వాదములు నాకు భయము పుట్టింపలేదు. మరణముకూడా నన్ను భయపెట్టలేదు. వారి రాకవలన నేను ఇప్పటివరకు బోధించిన సత్య సిద్ధాంతములలో ఇంకా బలముగా స్థిరపడియున్నాను.
లోకమునకు సంబంధించినవాటినన్నిటిని నేను విడిచిపెట్టితిని, నేను గొప్ప బాధను, చెరసాల శిక్షను అనుభవించితిని. నేను మరణమును భరించుటకు సిద్ధముగా ఉన్నందున దేవునికి వందనములు చెల్లించు చున్నాను. ఇప్పటివరకు నేను నా నాలుకతోను, కలముతోను సత్యమును బోధించితిని. త్వరలోనే అదే సత్యమును దేవుని కృపద్వారా నా రక్తముతో స్థిరపరచుదును.”
క్రీ.శ. 1555 ఫిబ్రవరి 4 సోమవారమున చెరసాల అధికారి హూపర్ వద్దకు వచ్చి గ్లాసెస్టర్ (Gloucester) లో నీకు మరణశిక్ష విధింపబడునని, దానికొరకు సిద్ధపడుమని చెప్పెను. అది వినిన వెంటనే హూపర్ తాను ఇదివరకు గ్లాసెస్టర్ బిషప్ పనిచేసినందున, అక్కడనే తనకు మరణశిక్ష విధించెదరని మిక్కిలి సంతోషించి, ఆకాశమువైపు తన కన్నులను, చేతులను ఎత్తి దేవుని స్తుతించెను.
ఎవరిమధ్య తాను బిషప్ పని చేసెనో ఆ ప్రజలమధ్య చంపబడుట మంచిదని, తన మరణముద్వారా తాను బోధించిన సత్యసిద్ధాంతములను స్థిరపరచవచ్చునని తలంచెను. ఆయన మహిమకొరకు చనిపోవుటకు దేవుడు తనకు శక్తిననుగ్రహించుననుటలో అతనికెట్టి సందేహములేదు. కనుక హూపర్ అధికారులు పిలిచిన వెంటనే వెళ్లుటకు తన నౌకరు ఇంటికి కబురు పంపి తన చెప్పులను, పైవస్త్రమును తీసికొని రమ్మని చెప్పెను.
మరుసటి రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు చెరసాల అధికారి, మరి కొందరు హూపర్ను బంధించిన గదిలో ప్రవేశించి, అతడు వ్రాసినవి ఏమైనా దొరుకునేమోయని వెదకుట ప్రారంభించిరి. అప్పుడు లండన్ అధికారులు, వారి సహాయకులు హూపర్ను న్యూ గేట్ చెరసాలనుండి ఫ్లీట్ వీధిలోగల పరి.
డన్స్ట్రన్ దేవాలయమునకు సమీపములోనున్న ఒక స్థలమునకు తీసికొనిపోయి, అక్కడ అతనిని గ్లాసెస్టర్కు తీసికొని పోవు అధికారులైన చందోస్ ప్రభువు (Lord Chandos) కు, మాస్టర్ విక్స్ (Wicks), రాణి నియమించిన భటులు ఇతర అధికారులకు అప్పగించిరి.
లండన్లో రాణి భటులతో హూపర్ భుజించిన తరువాత అతనిని ఎవరూ గుర్తింపకుండా తలపై ముసుగువేసిరి. అయిననూ అతడు సంతోషముతో ఎవరి సహాయము లేకుండనే గుర్రముమీద ఎగిరి కూర్చుండెను. అతడు రక్షక భటులతో కలసి సంతోషముగా లండన్ నుండి గ్లాసెస్టర్కు ప్రయాణము చేసెను.
గురువారము ఉదయము 11 గంటలకు వారు గ్లాసెస్టర్కు పదిహేను మైళ్ల దూరములోగల సిరెన్సెస్టర్ (Cirencester) అను పట్టణములో భోజనము చేయుటకు ఆగిరి. ఆ భోజన గృహ యజమానురాలు ఎప్పుడూ సత్యమును ద్వేషించుచూ, హూపర్నుగురించి అసభ్యకరముగా మాట్లాడును. కాని ఇప్పుడు మాత్రము అతడు గ్లాసెస్టర్ వెళ్లుచున్న కారణము తెలిసికొనినదై అతనితో మంచిగా మాట్లాడి, “మీకు మరణశిక్ష విధిస్తే మీ సిద్ధాంతములను తప్పక విడిచిపెట్టుదురని మిమ్ములను దూషించితి”నని కన్నీటితో హూపర్ వద్ద ఒప్పుకొనెను.

మధ్యాహ్న భోజనమైన తరువాత వారు ప్రయాణము సాగించి సుమారు సాయంత్రము ఐదుగంటల ప్రాంతములో గ్లాసెస్టర్ చేరిరి. పట్టణము వెలుపల సుమారు ఒక మైలు దూరమువరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు గుమికూడి హూపర్ పరిస్థితిని చూచి ఏడ్చి, ప్రలాపించిరి.
ప్రజలు హూపర్ ను తమవద్దనుండి బలవంతముగా తీసి కొని పోవుదురని భయపడిన ఒక రక్షకభటుడు పట్టణములోనికి వేగముగా పోయి నగరపాలక అధికారిని, పోలీసు అధికారులను సహాయపడవలసినదిగా కోరెను. అధికారులు వెళ్లి పట్టణ ద్వారమువద్దనున్న ప్రజలను తమ గృహములయందే ఉండ వలెనని ఆజ్ఞాపించిరి. అయితే అలజడులేమియు జరుగలేదు.
హూపర్ గ్లాసెస్టర్ ని ఇన్గ్రామ్ (Ingram) అను నతని గృహములో బసచేసెను. ప్రయాణములో ప్రతి రాత్రి చేసినట్లే ప్రశాంతముగా తన భోజనము ముగించి, కొంత సమయము సుఖముగా నిద్రించెను. పిమ్మట అతడు మేల్కొని ఉదయమువరకు ప్రార్థించెను.
ఆ తరువాత అతడు ఒక చిన్న గదిలోనికి వెళ్లి, దేవుని ప్రార్థించుటకును, ఆయనతో మాట్లాడుటకును వారిని అనుమతి కోరెను. కనుక ఆ దినమంతయూ అతడు భోజనము చేయుటకు, తనను దర్శించుటకు వచ్చినవారితో మాట్లాడుటకు వెచ్చించిన సమయము మినహా మిగిలిన సమయమంతయూ ప్రార్థనలో గడిపెను.
అతనిని దర్శింప వచ్చినవారిలో సర్ ఆంథోని కింగ్స్టన్ (Sir Anthony Kingston) అను యోధుడు కలడు. ఇతడు గతములో హూప స్నేహితుడై యుండెను. ప్రస్తుతము ఇతడు హూపర్ మరణశిక్షను అమలుపరచు అధికారులలో ఒకనిగా రాణిచే నియమింపబడెను. హూపర్ ఆ చిన్నగదిలో ప్రార్థించుట చూచినప్పుడు అతడు బహుగా దుఃఖించి, కన్నీరు కార్చెను. మొదట హూపర్ కూడా అతనిని గుర్తింప లేదు. అప్పుడు కింగ్స్టన్, “నా ప్రభువా, నీవు నన్ను ఎరుగవా? నేను నీ పాత స్నేహితుడను, నా పేరు ఆంథోని కింగ్స్టన్” అని గుర్తుచేసెను.
“అవును, మాస్టర్ కింగ్స్టన్, నేను నిన్ను బాగుగా ఎరుగుదును, నీవు ఆరోగ్యముగా నుండుట చూచినప్పుడు నాకు ఎంతో సంతోషము కలిగినది, దానికొరకు దేవుని స్తుతించుచున్నాను” అని హూపర్ సమాధానమిచ్చెను.
“నీవు ఇక్కడ చనిపోవుటకు వచ్చితివని చూచుటకు నేనెంతో చింతించుచున్నాను. కాని, జీవించియుండుట మధురము, మరణించుట చేదని తలంచుము. అందువలన నీవు జీవించియుండవలెనని కోరుకొనినచో ఇప్పటినుండి నీ జీవితము ఎంతో మేలుకరముగానుండున”ని కింగ్స్టన్ పలికెను.
దానికి హూపర్ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, “మాస్టర్ కింగ్స్టన్, నీవు చెప్పినది వాస్తవమే, కాని నేను ఈ ప్రాంతములోను ఇతర ప్రాంతములలోను ఒకప్పుడు బోధించిన సత్య సిద్ధాంతములను కాదనలేను, కనుక ఈ జీవితమును ఇంతటితో చాలించుకొని మరణముననుభవించుటకు ఇక్కడకు వచ్చితిని. నేను కోరదగినది కాకపోయిననూ నీవిచ్చిన స్నేహపూర్వకమైన సలహాకొరకు నీకు వందనములు. మాస్టర్ కింగ్స్టన్, మరణము చేదుగాను, జీవము తీపిగాను ఉండుననుట వాస్తవమే.
కాని నేను మరణమంటే భయపడను, జీవమంటే గొప్పగానూ తలంచను. దేవుని వాక్యము లోని సత్యమును నిరాకరించుటకంటే, ఆయనయొక్క పరిశుద్ధాత్మ శక్తిద్వారా ఇప్పుడు నాకొరకు సిద్ధము చేయబడిన భయంకరమైన అగ్నిలో సహనము వహించి కాలి పోవుటకు సిద్ధపడియున్నాను. ఈ విషయమును నా అంతట నేనే పరిష్కరించుకొంటిని. ఈ లోపుగా, మీరును, ఇతరులును మీ ప్రార్థనలద్వారా నన్ను దేవుని కృపకు అప్ప గింపవలసినదిగా కోరుచున్నాను.”
అందుకు కింగ్స్టన్ “మంచిది, నా ప్రభువా, ఈ విషయమునకు పరిష్కారము కనుపించుటలేదు, కనుక నేను దీనిని వదలివేయుచున్నాను. కాని నిన్నుగూర్చి తెలుసుకొనుటకు నాకు అవకాశము కలిగినది గనుక నా హృదయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. నేను తప్పిపోయిన కుమారుడను గనుక నీద్వారా దేవుడు నన్ను మరలా తనయొద్దకు పిలుచుకొనెను” అని జవాబిచ్చెను.
దానికి హూపర్, “దానికొరకు నేను దేవుని ఎంతగానో స్తుతించుచున్నాను. ఆయనయందు భయభక్తులు కలిగి నీవు ఎల్లప్పుడూ జీవించునట్లు నేను దేవుని ప్రార్థించెదను” అని సమాధానమిచ్చెను.
ఇంకా కొంత సమయము మాట్లాడుకొనిన తరువాత చెంపలపైనుండి కన్నీరు కారుచుండగా మాస్టర్ కింగ్స్టన్ అక్కడనుండి వెడలెను. హూపర్ కూడా ఏడ్చుచు చెరసాలలో తాను అనుభవించిన బాధకంటేకూడా వారి ఎడబాటువలన కలిగిన దుఃఖము అధికముగానున్నదని చెప్పెను.
ఆ సాయంకాలము ఒక గ్రుడ్డి బాలుడు హూపర్ను చూడవలెనని కావలియున్న వారిని బ్రతిమిలాడి చివరకు అనుమతిపొందెను. అయితే హూపర్ను చూచుటకు కొద్దిసమయము ముందే ఆ బాలుడు దేవుని వాక్యమును విని, సత్యమును ఒప్పుకొని నందున గ్లాసెస్టర్లో ఖైదు చేయబడెను. హూపర్ ఆ బాలుని చూచి, అతని విశ్వాస మును గురించి, అతనిని చెరసాలలో బంధించుటకుగల కారణములనుగురించి ప్రశ్నించిన తరువాత, కన్నీటితో అతనివైపు చూచి “అయ్యో, బాలుడా! దేవుడు నీ కనుచూపునుమాత్రమే తీసికొనిన కారణము ఆయనకుమాత్రమే తెలియును.
అయితే ఇంతకంటే శ్రేష్టమైన మరియొక దృష్టిని అనగా విశ్వాసము, జ్ఞానముతోకూడిన దివ్య దృష్టిని నీకు అనుగ్రహించియున్నాడు. ఆ దివ్యదృష్టిని నీవు ఎన్నడూ పోగొట్టుకొనకుండా ఆయనను నీవు ఎల్లప్పుడూ ప్రార్థించునట్లు దేవుడు నీకు కృపననుగ్రహించును. అట్లు కానిచో నీవు శారీరకముగానూ, ఆత్మీయముగానూ గ్రుడ్డివాడవైయుండెదవ”ని చెప్పెను.
అదేరాత్రి, భటులు కావలికాయుట ముగించి హూపర్ను గ్లాసెస్టర్ నగరపాలక అధికారి, ఇతర అధికారుల బాధ్యతకు అప్పగించిరి. వారు ఆ విధముగా చేసినప్పుడు హూపర్ ఇట్లు చెప్పెను: “గౌరవనీయులైన నగరపాలక అధికారిగారు, మరణశిక్ష విధింపబడిన ఖైదీనైన నన్ను మీరు, మీ అనుచరులు మీ అధీనములోనికి తీసుకున్నందు లకు నేను వందనములు చెల్లించుచున్నాను. నాయెడల గతములో మీకున్న ప్రేమ, స్నేహము పూర్తిగా అంతము కాలేదని గ్రహించి ఆనందించుచున్నాను.
అదేవిధముగ నేను మీకు గతములో బోధించిన సంగతులన్నియూ మీరు మరచిపోలేదని నమ్ముచున్నాను. దైవజనుడైన అప్పటి రాజు నన్ను మీకు బిషప్ను, బోధకునిగాను నియమించెను. అనేకులు తలంచినట్లుగా నేను బోధించిన సిద్ధాంతములు అసత్యములని, మత ద్రోహములని నేను తలం చుటలేదు.
మీకు తెలిసినట్లు రాణి ఆజ్ఞమేరకు చంపబడుటకు నేను ఇక్కడకు పంపబడితిని. నేను ఏ స్థలములో బోధించితినో అక్కడకు వచ్చి, నేను బోధించినవాటిని నా రక్తముతో స్థిరపరచుటకు వచ్చితిని.”
అతని మాటలకు ఆ అధికారులు, వారితోనున్న ఇతరులుకూడా విచారపడి, అతనిని సామాన్య ఖైదులో ఉంచుటకు తీర్మానించుకొనిరి. అయితే ఒక కావలిదారుడు హూపర్ యొక్క మంచితనము, నెమ్మది, ఓర్పుతోకూడిన మంచి ప్రవర్తననుగూర్చి వివరించి ఒక బాలుడు సహితము అతనిని భద్రపరచవచ్చునని చెప్పి సామాన్య ఖైదులో ఉంచక రాబర్ట్ ఇన్ఫ్రాగ్రామ్ గృహములో ఆయనను భద్రపరచవలెనని అభ్యర్థించెను.
ఆ రాత్రంతయూ అతనికి సైనికాధికారులు, ఇతర అధికారులు కావలి ఉండిరి. అతడు చాల విషయములను జ్ఞాపకము తెచ్చుకొనవలసియున్నందున త్వరగా నిద్రించుటకు సెలవడిగి సాయంత్రము ఐదుగంటలకే నిద్రకు ఉపక్రమించి చాలా రాత్రి అగువరకు నిద్రించి, అప్పుడు మేల్కొని వేకువ జామువరకు ప్రార్థించెను. ఉద యము మేల్కొనిన తరువాత తనకు మరణశిక్ష విధించు సమయమువరకు అతడు ఏకాంతముగా ఉండగోరి ఎవరినీ తన గదిలోనికి రానివ్వవద్దని కావలివారిని కోరెను.
క్రీ.శ. 1555, ఫిబ్రవరి 9వ తేది ఉదయము ఎనిమిదిగంటల ప్రాంతములో హూపర్ మరణశిక్షను పర్యవేక్షించుటకు నియమింపబడిన అధికారులైన సర్ జాన్ బ్రిడ్జెస్, చందోస్ ప్రభువు, వారి అనుచరులు, సర్ ఆంథోని కింగ్స్టన్, సర్ ఎడ్మండ్ బ్రిడ్జెస్, మిగతా అధికారులు హూపర్ను ఉంచిన గృహమునకు వచ్చిరి.
తొమ్మిదిగంటల ప్రాంతములో మరణశిక్ష విధించుటకు సమయము ఆసన్నమైనందున అతనిని సిద్ధపడ వలసినదిగా చెప్పి, ఆయుధములు ధరించిన అధికారులు వెంటనే ఆయనను ఆ గదినుండి క్రిందికి తోడుకొని వచ్చిరి. హూపర్ అన్ని ఆయుధములు ధరించినవారిని చూచి “అధికారులారా, నేను ద్రోహిని కాను.
నేను మరణశిక్ష పొందవలసిన స్థలమునకు నన్ను కొనిపోవుటకు మీరింత కష్టపడనవసరములేదు. మీరు నన్ను అనుమతించినట్లయితే మీకు శ్రమ ఇవ్వకుండ నేను ఒంటరిగానే మరణస్తంభము యొద్దకు వెళ్లెదను” అని చెప్పెను.
ఆ రోజు గ్లాసెస్టర్లో సంత జరుగుచున్నది. సుమారు ఏడువేలమంది ప్రజలు హూపర్ తన మరణశిక్షకు ముందు ఎట్లు ప్రవర్తించునోయని చూచుటకు ప్రోగైరి. తానుంచబడిన గృహపు యజమానియైన రాబర్ట్ ఇన్ గ్రామ వద్ద అరువు తీసుకొన్న ఒక అంగీ ధరించి, టోపీ పెట్టుకొని, దీర్ఘకాలము కారాగారములో ఉన్నందున నడుములోను, కాళ్లలోను వచ్చిన నరముల బలహీనత వ్యాధివల్ల ఒక చేతికఱ్ఱ పట్టుకొని తడబడకుండ నడచుచు, అతనిని గుర్తించినవారిని చూచి సంతోషముగా చిరునవ్వు నవ్వుచూ ఇద్దరు అధికారులమధ్య వధకు కొనిపోబడుచున్న గొఱ్ఱపిల్లవలె ఆయన సాగుచుండెను.
అతనిని చూచినవారు హూపర్ అంతకుముందెప్పుడును అంత సంతోషముగాను, ఆరోగ్యముగాను ఉన్నట్లు చూడలేదనిరి. సజీవదహనము చేయు స్థలమునకు తీసికొని వచ్చినప్పుడు అతడు ప్రజలతో మాట్లాడుటకు అనుమతింపబడనందున వెంటనే మోకరించి ప్రార్థించెను. అతడు కొంతసేపు ప్రార్థించిన తరువాత ఒక పెట్టె తేబడి అతని ముందుగల పీటమీద ఉంచబడెను. అందులో అతడు తన విశ్వాసమునుండి, బోధలనుండి వెనుదిరిగిన యెడల క్షమింపబడునని వ్రాయబడిన రాణిగారి ఉత్తరువు ఉండెను. అతడు దానిని చూచి,
ప్రార్థన ముగించిన వెంటనే మరణస్తంభమువద్దకు వెళ్లి తాను అరువు తెచ్చుకొని ధరించిన అంగీని తొలగించి తిరిగి దానిని రాబర్ట్ ఇన్గ్రామ్కు ఇవ్వవలసినదిగ అధికారులకు యిచ్చి, మిగిలిన వస్త్రములనుకూడ తీసివేసి, కోటుమాత్రమే ఉంచు కొనెను. కాని, ఆ కోటుపై అధికారులకు దురాశకల్గి అది కాల్చబడుటకు వారంగీక రించలేదు.
అందువలన హూపర్ కోటునుకూడ వినయముతో తీసివేసి లోపల ధరించు వస్త్రములు మాత్రము ఉంచుకొనెను. అంతట ఒక భటుడు తుపాకిమందుతో నింపబడిన మూడు సంచులను ఆయనకీయగ, హూపర్ ఒక సంచిని తన కాళ్లమధ్యను, మిగిలిన రెండు సంచులను రెండు చంకల క్రింద కట్టుకొనెను.
అప్పుడు హూపర్ అక్కడున్న ప్రజలను తనతో కలసి ప్రార్థించుమని కోరగా వారు అతని బాధను చూచి కన్నీటితో ప్రార్థించిరి. అప్పుడతడు వధస్తంభమువద్దకు వెళ్లగా భటులు ఆయన శరీరమును స్తంభమునకు ఒక ఇనుప గొలుసుతో బిగించిరి. అదే విధముగ వారు మరి రెండు గొలుసులతో అతని మెడ, కాళ్లు బంధింపబోయి నప్పుడు అతడు వారి ప్రయత్నమును వారించెను.
కొద్ది క్షణములలో అతనికి నిప్పుముట్టించు వ్యక్తి అతనిని సమీపించి తనను క్షమింపుమని వేడుకొనెను. తనపట్ల అతడు ఏ నేరము చేయలేదు గనుక, తానెందుకు క్షమింపవలెనని హూపర్ అడుగగా, ఆ వ్యక్తి ఏడ్చుచు “ఓ అయ్యా, నిప్పు ముట్టించుటకు నేను నియమింపబడితిని” అని సమాధానమిచ్చెను. అందుకు హూపర్ “నీవు చేయు చున్నదానివలన నీవు నన్ను కష్టపెట్టుటలేదు. దేవుడు నీ పాపములను క్షమించును. నీ పనిని నీవు చేయుమని మనవిచేయుచున్నాను” అని పలికెను.
ఎండిన రెల్లు గడ్డి అతని చుట్టూ పేర్చుచుండగా, హూపర్ రెండు కట్టల గడ్డిని తీసికొని వాటిని ముద్దుపెట్టుకొని తన చంకలలోనున్న తుపాకిమందు సంచులక్రింద పెట్టుకొనెను. అప్పుడాయన చేతులతో సంజ్ఞలుచేసి ఎక్కడ గడ్డి ఎక్కువ లేదో అక్కడ పెట్టుమని చెప్పి, దానిని పేర్చుటలో తృప్తిచెందిన తరువాత అగ్ని ముట్టింపబడెను.
ఐతే, రెండు గుఱ్ఱములు మోయగలిగినన్ని పచ్చికట్టెలుపయోగించినందున వాటిని వెలిగించుటకు కొంత సమయముపట్టినది. చివరకు అతనిచుట్టు అగ్ని మండెను. కాని ఆ సమయములో చల్లని బలమైన గాలులు వీచుచున్నందున అగ్నిజ్వాలలు హూపర్ను తాకలేదు. కొంచెము సేపైన తరువాత మరికొన్ని ఎండుకట్టెలు తేబడి మరియొక మంట వేయబడెను.
కట్టెలక్రిందమాత్రమే మంటవున్నందున, బలమైన గాలి దానిని ప్రక్కకు నెట్టుటచే ఆ మంటవలన హూపర్ తల వెంట్రుకలుమాత్రమే కొంచెము కాలి, అతని చర్మము ఉబ్బెను. ఇది జరుగుచున్న సమయమంతయు హూపర్ నిశ్శబ్దముగ నొప్పి లేనట్లే ఈ విధముగ ప్రార్థించెను – “ఓ యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా ఆత్మను స్వీకరించుము.”
ఎండిన కట్టెలలోని అగ్ని పచ్చికట్టెలను మండింపలేక ఆరిపోవుచుండగా హూపర్ తన చేతులతో కళ్లు తుడుచుకొనుచు పెద్దస్వరముతో – “సజ్జనులారా, దేవుని ప్రేమకొరకు ఎక్కువ అగ్నిని నన్ను పొందనీయుడి” అని చెప్పెను. అతని శరీరము పైభాగమువరకు కాలుటకు చాలినన్ని ఎండిన కట్టెలు లేనందున ఇంతసేపు ఆతని శరీరపు దిగువ భాగము మాత్రమే కాలుచుండెను.
కొంచెము సేపైన తరువాత మరికొన్ని ఎండిన కట్టెలు తేబడి ఆరిపోవుచున్న మంటలలో వేసిరి. ఇప్పుడు వేసిన కట్టెలవలన మంటలు పూర్వముకంటె అధిక మయ్యెను. ఈ మంట తుపాకిమందు సంచులను పగులగొట్టెనుగాని, బలమైన గాలి వలన మంటలు దూరముగా నెట్టివేయబడెను. మంటలు ఈ విధముగ నిదానముగ మండుచున్నందున హూపర్ కొంచెము పెద్దస్వరముతో “ప్రభువైన యేసూ, నన్ను కరుణింపుము ప్రభువైన యేసూ, నన్ను కరుణింపుము, ప్రభువైన యేసూ, నా ఆత్మను స్వీకరింపుము” అని పలికెను. ఈ మాటలు హూపర్ వినబడునట్లుగ పలికిన చివరి మాటలు.
అతని నోరు నలుపెక్కి, నాలుక ఉబ్బి, పెదవులు కాలి చిగుళ్లపైకి వెళ్లువరకు అతడు నిశ్శబ్దముగ ప్రార్ధించుచుండెను. ఆ క్షణములలో అతడు తన చేతులతో ఎదరొమ్ములపై బలముగా కొట్టుకొనెను. కొద్దిసేపటికి ఒక చెయ్యి పడిపోయెను. రెండవచేతితో కొట్టుకొనుచుండగా క్రొవ్వు, నీరు, రక్తము వ్రేళ్లచివరి భాగములనుండి చిందెను. మంటలు హఠాత్తుగా గొప్ప శక్తితో ఎక్కువ కాగా అతని బలము ఉడిగి పోయి రొమ్ముచుట్టువున్న యినుప కడియమునకు అతని చెయ్యి చిక్కుకొనెను. అదే సమయములో అతని శరీరము ముందుకు పడగా, అతడు తన ప్రాణమును విడిచెను.
జాన్ హూపర్ సుమారు 45 నిమిషములనుండి ఒక గంటవరకు అగ్నిలో దహించబడెను. అయినను ఆ వేదననంతటిని ఒక గొట్టెపిల్లవలె ఓర్పుతో భరించుచు, వెనుకకుగాని, ముందుకుగాని, ప్రక్కలకుగాని మళ్లలేదు. దేవుని కృపచేత తప్ప భరింప శక్యముగాని ఆ గొప్ప వేదనను భరించి మంచముమీద పరుండిన ఒక శిశువువలె నిశ్శబ్దముగా మరణించెను. అతని విశ్వాస్యతనుబట్టి క్రైస్తవులమైన మనమందరము దేవుని స్తుతింప బద్ధులమైయున్నాము.
