పాతాళము-నరకము

పాతాళము-నరకము

ప్రశ్న:-

ధనవంతుడు – లాజరు కథలో వారిరువురు చనిపోయిన తరువాత ధనవంతుడు నరకములో వుండి లాజరును – “తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమనుచున్నాడు!” ఇదివరలో ఒక అంత్య తీర్పు, తీర్పుదినము జరిగినట్లు ఋజువున్నట్లు కనబడుచున్నది! అంత్యదినము జరిగినదా? లేక ఉపమానమా? రాబోవు తీర్పు ఒక్కటేనా?

జవాబు:-

ధనవంతుడు “పాతాళములో” బాధపడెను గాని నరకములో కాదు. లూకా 16:23 జాగ్రత్తగా చదువండి. నరకము వేరు, పాతాళము వేరు. చనిపోగానే పాపులకు చిక్కేది పాతాళము. ఆ పాతాళములో అగ్ని కలదు. ఆ అగ్నిలో అక్కడివారు యాతన పడుదురు. (లూకా 16:24). అయితే నరకమనేది దానికంటే విశేషమైనది. నరక మనగా ప్రకటన 20:15 లో సూచింపబడిన అగ్నిగుండము.

పాతాళము క్రొత్త నిబంధనలో పది పర్యాయములు చెప్పబడినది – మత్తయి 11:23; 16:18; లూకా 10:15; 16:23; అపొ. కార్య. 2:27-31; ప్రకటన 1:18; 6:8; 20:13,14. అయితే ప్రకటనలోని పదములు మృతుల లోకమని తర్జుమా చేయబడినవి. మిగత ఆరు వచనములు పాతాళమని యున్నవి. గ్రీకు భాషలోనైతే పదమొకటే – హేడిస్ అని యున్నది.

పాతాళము మరియు నరకము

Psalm23.infoKnowledge Of The HolyEvery Christian Should Know
Key Biblical Messianic PropheciesPower in the BloodPsalm91.infoSavior on the Cross
Pursuit of GodBible Study For BeginnersPray For Those You LoveBible Study Act

ఈ హేడిస్ యిట్లు పది సార్లు వచ్చినది. హేడిస్ – నరకము వేర్వేరుగా నున్నవి. ఎట్లంటే ప్రకటన 20:14 లో వ్రాసినట్లు వెయ్యియేండ్ల రాజ్యము పిమ్మట జరిగే కడపటి పాపుల తీర్పు పిమ్మటనే హేడిస్ అనగా మృతులలోకము లేక పాతాళము అగ్నిగుండములో పడవేయబడెనని తెలిసి కొంటున్నాము. ఎందుకంటే దానితోనిక అవసరములేదు – దాని పని తీరిపోయెను – పాతాళములో నుండేవారు కడపటి పునరుత్థానములో బయటికివచ్చి తీర్పు పొంది అగ్ని గుండములో పడవేయబడుదురు గనుక పాతాళము అగ్నిగుండములో పడవేయబడునని చదువుచున్నాము.

పాతాళము మరియు మృత్యువు

ఆ ధనవంతుడు అప్పుడే బాధపడెను కాని అది అకాల బాధ మరియు అసంపూర్ణ బాధయై యున్నది. అంతేకాదు – గమనించుడి – పాపులైన మృతుల పునరుత్థానములో అతడు లేచి తీర్పు పొంది పేరు జీవగ్రంథమందు లేనందుచేత అగ్నిగుండములో పడవేయబడును. కొంత అగ్నిలోనుండిన వాడు సంపూర్ణమైన అగ్నిలోకి తేబడి పడత్రోయబడుతాడని తెలియుచున్నది. అబ్బో! ఆ దుర్గతి రాకుండ చూచుకొండి.

క్రీస్తులో దాగితేనే అది తప్పుతుంది – రోమా 8:1. గనుక పాతాళము వేరు, అగ్ని గుండము వంటి నరకము వేరు. పాపములోనుండి చనిపోయినవారు ప్రస్తుతముండే తావు పాతాళము. అటుపిమ్మట పాతాళమునుండి నరకానికి తేబడుదురు. చనిపోగానే తీర్పు కొంత జరిగినట్లు హెబ్రీ 9:27 ప్రకారము పాపి అప్పుడే ఆ ధనవంతునితోపాటు పాతాళములో దిగిపోతాడు. అయితే పుస్తకముల తీర్పు సంపూర్ణముగా జరిగిన పిమ్మట పాపికి చిక్కే భయంకరమైన కడపటి తావు ఏదనగా నరకమనేది. నరకము క్రొత్త నిబంధనలో పన్నెండుమార్లు వచ్చినది – మత్తయి 5:22, 29, 30, 10:28; 18:9; 23:15,33; మార్కు 9:43, 45, 47; లూకా 12:5, యాకోబు 3:6.

నరకము అర్థం

లాజరుది యొక కథయని ప్రశ్నించినవారు వాడుకచొప్పున వ్రాసినది తప్పు. ధనవంతుడొకడుండెననియు లాజరు అను నొక దరిద్రుడుండెననియు క్రీస్తు పలికి యుండగా ఇదొక కథయని యూహించరాదు. క్రీస్తు యొక కథ చెప్పినను అందులో తప్పు చెప్పుడులెండి గనుక లాజరుది కథయైతేనేమి కథయైనందున దానిలో దుర్బోధయుండునా? ఉండదు. మరియు అది కథ కాదు. అది వాస్తవముగా జరిగిన సంభవము అని చెప్పి వివరించెను. ఉపమానములతో చెప్పి వివరించెను.

ఉపమానము లలో వ్యక్తుల పేరులు లేవు. ధనవంతుడుండి సిద్ధపడియుండక భ్రమసిపోయి తరుణము పోగొట్టుకొని చనిపోయి పాతాళము చేరెను. ఇది ఖాయము. ఆ దరిద్రుడు దరిద్రుడైనను సిద్ధపడియుండి చనిపోయి అబ్రాహాముండే తావుచేరి విశ్రమించెను. ఇదికూడ ఖాయము. ఇవి వాస్తవముగా జరిగిన సంభవములు. మరియు క్రీస్తు తానే మనకు ఈ అవసరమైన విషయములను తెల్పుచున్నాడు. రక్షకుడైన క్రీస్తులో దాగినవానికి శిక్షావిధియు లేదు.

పాతాళము బైబిల్ లో

క్రీస్తు సిలువలో సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మనప్పగించిన దానివలన పాపి తీర్పు అప్పుడే క్రీస్తు వలన సమాప్తమునకు వచ్చినది. నమ్మినవానికి రూఢియైనది. యిది రోమా 8:1. అట్టి క్రీస్తు భక్తుడు చనిపోయినా చింతలేదు.

క్రీస్తులోనుండి చనిపోయినందుచేత గతి కల్గియున్నాడు – క్రీస్తు రెండవసారి వస్తే వెంటనే అతడు అక్షయుడుగా లేచి ఆకాశమండలములోనుండే క్రీస్తును కలిసికొని సదా ఆయనతోనుండిపోయేటట్టు మేఘములమీద కొనిపోబడును – 1 థెస్సలోనీ. 4:16-18 లో ప్రచురింపబడిన సువిశేషమిది.

క్రీస్తులో లేకుండ పుట్టి పెరిగిన పాపములలోనే యుండి చనిపోయినవాడు యోహాను 8:21 లో క్రీస్తు అతిస్పష్టముగా తెల్పినట్టు క్రీస్తు పైకి వెళ్ళిపోయిన పరదైసుకు వెళ్లలేక ఆ ధనవంతుని పోలి పాతాళమునకు దిగి పోతాడు. ఈ సంగతులు నిర్వివా దాంశములే.

పాతాళము మరియు నరకము తేడాలు

క్రీస్తు వచ్చినప్పుడు చనిపోయినవారందరును లేవక అయనయందుండి చనిపోయినవారు మాత్రమే మొదట లేస్తారు. (1 కొరింథీ 15:23). ఇది సుభాగ్యముతో కూడినట్టు ప్రకటన 20:1-4 భాగములో వర్ణింపబడిన మొదటి పునరుత్థానము. వెయ్యియేండ్ల పిమ్మటనే మిగిలిపోయిన పాపులు తీర్పుకు బయటికివస్తారు. (ప్రకటన 20:7-15).

మీది ఏ గుంపో చూచుకొండి. మొదటి పునరుత్థాములో నుంటారా, రెండవ దానిలో నుంటారా? మొదటిది జీవ పునరుత్థామని పిలువబడినది; రెండవది తీర్పు పునరుత్థానము – యోహాను 5:29 చూడండి. దానికి దీనికిని మధ్య వెయ్యి యేండ్లున్నది. ఇత్యాది తీర్పువిషయములు తెనుగులో నేను రచించిన “సప్త విమర్శ”లనే పుస్తకములో విశదమవును. ఏది ఎట్లున్నను రాబోవు తీర్పు తప్పించుకొని క్రీస్తును నేడే పట్టుకొని రక్షింపబడితే నుత్తమమును మిక్కిలి అవసరమునైయున్నది.

Leave a Comment