క్రొత్త నిబంధన (అధ్యాయము 8)
ఏడవ అధ్యాయంలో క్రీస్తు దేనికి పిలువబడెనో ఆ నూతన యాజకత్వ క్రమము వివరించబడినది. అది లేవీయ యాజకత్వపు ధర్మశాస్త్రముకంటే, మరియు అహరోను యాజకత్వముకంటే శ్రేష్టమైనదని నేర్చుకొంటిమి.
ఈ అధ్యాయములో మనము నేర్చుకొనునదేమనగా యాజకత్వ నియామకమునకు మోషే ధర్మశాస్త్రమును ప్రక్కనబెట్టుటమాత్రమే కాదు, క్రొత్త ఆరాధకులు, నూతన దేవాలయములో, నూతన బలులు అర్పించు క్రొత్త నిబంధనకుకూడా దారి తెరచినది.
ఈ అధ్యాయములోని రెండు ప్రధానాంశములు – ప్రస్తుతము క్రీస్తు పరలోక సంబంధమగు యాజ కత్వము జరిగించుట. (1-5 వచనములు). రెండవదిగా, అందులో క్రొత్త నిబంధన స్ఫురించుట. (6-13 వచనములు).
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
(వచనములు 1, 2). ఇంతవరకు వివరించిన సత్యముల క్లుప్త సారాంశముతో ఈ అధ్యాయము ప్రారంభమైనది.
ఒక ప్రధాన యాజకు డున్నాడని అపొస్తలుడు చెప్పక, “మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు” అని చెప్పుచున్నాడు.
మెల్కీసెదెకు క్రమముచొప్పున ప్రధాన యాజకునిగా ఉండుటకు పిలువబడిన ఈ మహోన్నత మహిమాన్విత వ్యక్తి మనకు పరిచారకుడాయెను.
మన బలహీనతలలో సహాయము కొరకు, వేదనలో సానుభూతికొరకు ఆశ్రయించవలసినవాడు ఆయనే.
మన ప్రధాన యాజకుడు “పరలోకమందు మహామహుని కుడిపార్శ్వమున కూర్చుండుటను బట్టి ఆయన ఎంత ఉన్నతమైనవాడో అపొస్తలుడు తెలియజేయుచున్నాడు.
పరలోకమందలి హెచ్చింపబడిన ఆయన స్థానము, ఆయన దేవునికి సమీపముగా నుండుటను వెల్లడించెను.
పైగా, ఆయన “పరిశుద్ధాలయములో” పరిచారకుడు. ఇది మనిషి స్థాపించిన భూసంబంధమగు గుడారము కాదు. దేవుడే స్థాపించిన గుడారము. పత్రికలో తరువాత ఇది “పరలోకము” అని చెప్పబడినది.
(9:24). పరిశుద్ధాలయమునుగూర్చి ప్రస్తావించుటనుబట్టి క్రీస్తు యాజ కత్వములో మరియొక భాగమున్నట్టు గ్రాహ్యమగుచున్నది.
ఇది మన అరణ్యయాత్రలోని శోధనలలో ఆదుకొనునట్టి, వేదనలలో సహానుభూతి పొందునట్టి, బలహీనతలలో బలపరచునట్టి పరిచర్య కాదు గాని ఆరాధకు లను దేవునియెదుటకు నడిపించు ఉన్నతమగు పరిచర్య.
అరణ్య యాత్ర లోని పరిస్థితులలో ఆయన మనకు చేయు పరిచర్యనుగూర్చి 2-7 అధ్యాయములలో వివరించబడినది.
ఆయన యాజక పరిచర్యద్వారా పరిశుద్ధాలయములో ఆరాధనకు మనలను నడిపించుచున్నట్లు 8-10 అధ్యాయములు తేటగా వివరించుచున్నవి.
(వచనము 3). లేవీ గోత్రపు యాజకులు తమ విధిలో భాగముగా బలులు, అర్పణలు అర్పించువారు. అట్లే మన ప్రధాన యాజకుడగు క్రీస్తుకూడ ఏదైనా అర్పించవలసియున్నది. “ఆయనద్వారా ఎల్లప్పుడు మనము స్తుతియాగము చేయుదము” అని చెప్పబడియున్నది. (13:15).
(వచనములు 4, 5). క్రీస్తు తన యాజక పరిచర్యను పరలోక సంబంధులగు ప్రజలకొరకు పరలోకమందు జరిగించుచున్నాడు. ఆయన భూలోకమందున్నయెడల ఆయన యాజకుడగుటకు వీలులేదు.
దేవుని ప్రజలలోనుండి ఒక ప్రత్యేక తరగతి ప్రజలను ధర్మశాస్త్రానుసారముగా యాజకులుగా నియమించుదురు.
మోషేకు దేవుడు ప్రత్యక్ష గుడారమును నిర్మించుమని కొండమీద నమూనాను చూపించి (నిర్గమ 25:40) స్పష్టమైన సూచనలిచ్చుటలో ఇది స్పష్టమగుచున్నది.

క్రీస్తు వచ్చుటలో “పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ”యొక్క ఉద్దేశము నెరవేరినది. భూసంబంధమైన యాజకులు భూసంబంధమైన ప్రజల పక్షముగా పరిచర్య జరిగించుటవలన పరలోకసంబంధమగు ప్రజల పక్షముగా, పరలోకసంబంధమగు క్రీస్తు యాజకత్వముయొక్క ఆవశ్యకత ఏర్పడినది.
నేటి క్రైస్తవ లోకము తమ పరలోక పిలుపును మరచి యూదా మతముననుసరించి, మానవులచే అభిషేకించబడు యాజకులను నియ మించుకొని భూసంబంధమైన వ్యవస్థను నెలకొల్పుకొనియున్నారు.
ఆ విధముగా చేయుటవలన ఛాయలకు తిరోగమించి, దాని భావమును గ్రహించకపోవుటయేగాక, క్రీస్తు యాజకత్వమును నిరాకరించుచు, ఆయన పనిలో, పదవిలో జొరబడుచున్నారు.
(వచనములు 6-9). క్రీస్తు పరలోకమందు శ్రేష్టమైన పరిచర్య పొందుటమాత్రమేగాక, శ్రేష్టమగు వాగ్దానములపై ఆధారపడిన శ్రేష్టమగు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు.
ఈ నిబంధన విషయము 6-13 వచనములలో అపొస్తలుడు వివరించుచున్నాడు. ఇద్దరు వ్యక్తులమధ్య సంబంధము ఏయే షరతుల ఆధారముగా ఏర్పడునో అవి నిబంధనద్వారా ఏర్పడును.
బైబిలు గ్రంథములో దేవుడు మనుష్యులతో చేసిన రెండు నిబంధనలు కలవు. అవి పాత నిబంధన, క్రొత్త నిబంధన లేక ధర్మశాస్త్ర నిబంధన, కృపా నిబంధన.
దేవుడు తన ప్రజలను దీవించవలయునన్న వారు ఏ షరతులను పాటించవలెనో ఇవి రెండును తెలుపుచున్నవి. పాత, క్రొత్త నిబంధనలకున్న ప్రాముఖ్య మైన తేడా ఏమనగా, మొదటి నిబంధన ఆశీర్వాదములు మనిషి తనవంతు కర్తవ్యమును నెరవేర్చుటపై ఆధారపడియుండును.
రెండవ నిబంధన ఆశీర్వాదములు షరతులులేని దేవుని వాగ్దానములద్వారా సమకూడును. దేవుడు క్రొత్త నిబంధనలో కృపద్వారా విశ్వాసికి ఆశీర్వాదములు అందించుట క్రీస్తు మధ్యవర్తిత్వముద్వారా సాధ్యపడును.
ప్రజలు తన స్వరమునకు లోబడి, తన నిబంధనను పాటించినయెడల వారిని ఆశీర్వ దించుటకు యెహోవా పూనుకొన్నాడు. ప్రజలుకూడా తమ వంతు పనిని నెరవేర్చ పూనుకొనిరి.

పాత నిబంధన కాలములో ధర్మశాస్త్ర ఆధారముగా ఇశ్రాయేలీయు లకు దేవునితో సంబంధము ఏర్పడినట్లు స్పష్టమగుచున్నది. వారు ధర్మశాస్త్రముననుసరించినయెడల భూమిమీద జీవము, ఆశీర్వాదములు వాగ్దానము చేయబడెను.
వారు ధర్మశాస్త్రమును మీరినయెడల శాపము, మరణము కలుగును. మనిషి తన వంతు నెరవేర్చుటలో ఆశీర్వాదము లన్నియు ఆధారపడియున్నవి.
పతనమైన మానవుడు దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రమును నెరవేర్చలేనందున మొదటి నిబంధన బలహీనమైనదని స్పష్టమగుచున్నది. గనుక రెండవ నిబంధనకు అవకాశమేర్పడినది. ఈ నిబంధనకు మధ్యవర్తి క్రీస్తు.
యెహోవా దేవుడు మొదటి నిబంధనను తప్పుపట్టలేదు. దాని షరతులు నెరవేర్చలేనివారినే తప్పుపట్టెను. అందువలన క్రొత్త నిబంధనను గూర్చి ఆయన మాటలాడెను.

ఈ లేఖన భాగమునుబట్టి రాబోవు దినమొకటి క్రొత్త నిబంధన దృష్టిలో నున్నట్లు స్పష్టమగుచున్నది. ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైనది. అనగా భూసంబంధమైన ప్రజలకే వర్తించును.
క్రొత్త నిబంధన అక్షరార్ధముగా ఇశ్రాయేలీయులకు పరిమితమైనను, దాని ఆధ్మాత్మిక భావమును క్రైస్తవులకు అన్వయించవచ్చును.
అందువలననే అపొస్తలుడు మరియొక పత్రికలో తాను క్రొత్త నిబంధనకు సామర్థ్యముగల పరిచారకుడనని చెప్పుకొనుచు “అక్షరమునకు కాదుగాని ఆత్మకే”నని చెప్పెను. (2 కొరింథీ. 3:6).

అందువలననే క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు ప్రత్యేక ఆధిక్యతలేవియు కనిపించవు. విమోచింపబడిన దేవుని ప్రజలందరికిని సమానమైన ఆశీర్వా దములు చెప్పబడినవి.
ఈ ఆశీర్వాదముల కొరకు ఇశ్రాయేలీయులు ఒక దినము రాబోవుచున్నదని కనిపెట్టిరిగాని, విశ్వాసులు నేటి కృపాకాల మందు వాటిని అనుభవించుచున్నారు.
ఐగుప్తునుండి విమోచించబడిన దినమున దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన పాత నిబంధనకు, ఆ తరువాత వచ్చిన క్రొత్త నిబంధనకు వ్యత్యాసమున్నది. ఆ దినమున దేవుడు ఆ జాతిని ఐగుప్తునుండి ప్రత్యేక పరచి, తనతో సంబంధము కలిగియుండవలెనని కోరెను.
అయితే మన మింతకుముందే గమనించిన విధముగా, ప్రజలు తమ వంతు నిబంధన షరతులు నెరవేర్చినప్పుడే ఆశీర్వాదములు లభించును. అయితే యెహోవా చెప్పినట్లుగా “వారు నా నిబంధనలో నిలువలేదు కనుక వారు విఫలులైరి.
ఫలితముగా వారు ఆశీర్వాదమును పోగొట్టుకొనిరి, గనుక ప్రభువు వారిని అలక్ష్యము చేసెను” అని వ్రాయబడెను. అవిధేయతతో, విగ్రహారాధనతో, తమ విధులను నెరవేర్చని ప్రజలను లక్ష్యపెట్టుట యనగా వారి చెడు తనమును ఆమోదించుట యగును.
అందువలన దేవుడు పాత నిబంధన ఆధారముగా వారితో సంబంధము పెట్టుకొని, వారు తన ప్రజలని చెప్పుటకు యిష్టపడలేదు. దీనినిబట్టి ఇశ్రాయేలు జాతి తిరస్కరించబడినది.
(వచనములు 10-12). అయినను దేవుడు తన సార్వభౌమిక కృప ఆధారముగా రానైయున్న దినములలో చేయనున్న సరికొత్త నిబంధనను గూర్చి మాట్లాడెను. ఈ క్రొత్త నిబంధన పూర్తిగా దేవుని సార్వభౌమిక కృపపై ఆధారపడి ఉండును.
ఈ నిబంధనలోని షరతుల ప్రకారము దేవుడే తన పరిశుద్ధ స్వభావమునుబట్టి, తన సంకల్పమునుబట్టి మాన వునితో సంబంధము కలిగి ఉండును. క్రొత్త నిబంధన ఆశీర్వాదములను వివరించుచు ప్రభువు పదే పదే “నేను చేయుదును” అని చెప్పుచున్నాడు.
“నేను క్రొత్త నిబంధన చేయుదును”, “వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను”, “నేను వారికి దేవుడనై యుందును”, “నేను వారి విషయము దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసికొనను” ఇట్లు క్రొత్త నిబంధన ఆశీర్వాదములు మనిషి చేయు పనులపైన, మనిషి సంకల్పముపైన ఆధారపడి లేవు.
కేవలము దేవుని దయాపూర్వక సంక ల్పమే దానికి ఆధారమని స్పష్టమగుచున్నది. క్రొత్త నిబంధన సారాంశమే మనగా దాని నెరవేర్పంతయు దేవుడే చూచుకొనును.
క్రొత్త నిబంధన ఆశీర్వాదములలో మొదటిది – ‘దేవుడు తన ప్రజల హృదయములలో కార్యము జరిగించుటద్వారా వారి మనస్సులను నూతనపరచి, రాతి పలకల పైగాక వారి హృదయములపై తన ధర్మశాస్త్ర మును వ్రాయును’ అని యిర్మీయా చెప్పుచున్నాడు.
రెండవది – ఆ విధముగా కార్యము జరిగింపబడినవారు దేవునితో సంబంధము కలిగిన ప్రజలుగా నుందురు. విశ్వాసులు నేడు దీనియొక్క ఆధ్యాత్మిక భావములో ప్రవేశించుచున్నారు.

మూడవది యెహోవాను గూర్చిన జ్ఞానము కలిగియుందురు గనుక – ‘ప్రభువును తెలిసికొనుడని’ పొరుగువారైనను, సహోదరుడైనను వారికి బోధించ వలసిన పని ఉండదు.
ఈ రోజున కూడ దేవుని వ్యక్తిగతముగా ఎరిగిన నిజమైన దేవుని పిల్లల విషయములో ఇది ముమ్మాటికిని నిజము.
ఒకవేళ ప్రభువును గురించి మరింతగా తెలిసికొనుటకు బోధించుట అవసరమే అయినప్పటికిని, ఆయనను మనము వ్యక్తిగతముగా ఎరుగుదుము, ఎవరును బోధింపనవసరము లేదు.
నాలుగవది – దేవుడు దయ కలిగి “నేను వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసికొననని” చెప్పెను. ఈ గొప్ప ఆశీర్వాదములోనికి నేడు విశ్వాసి తీసికొనిరాబడుచున్నాడు.
(వచనము 13). క్రొత్త నిబంధన షరతులు, ఆశీర్వాదములు ఇటువంటివి – మనము దేవుని సమీపించునట్లు క్రొత్త యాజకత్వమున్న యెడల అవశ్యముగా క్రొత్త నిబంధన ఎంత పరిపూర్ణమైనదైనను ప్రయో జనకరము కాదు.
మొదటి నిబంధనలో మనము దేవుని సమీపించుట యనునది నిబంధన షరతులను మనము పాటించుటపై ఆధారపడి యుండును.
ఇది అసాధ్యము గనుక మన వైఫల్యములు మనలను దేవునినుండి ఎల్లప్పుడు దూరము చేయును. క్రొత్త నిబంధనలో మనము దేవునితో సంబంధము కలిగియున్నామంటే అది సంపూర్ణముగా దేవుడు తన కృపతో చేసినదాని ఆధారముగానే జరిగినది.
నిబంధన క్రొత్తది. ఎందుకనగా ఇది పాత నిబంధనకంటే పూర్తిగా భిన్నమైనది. ఇది పాత నిబంధన నమూనాలో చేసిన క్రొత్త నింబంధన కానేకాదు. క్రొత్తది అని చెప్పుటవలన మొదటిదానికి కాలదోషము పట్టినది.
అది పాతగిలి, ఉడిగిపోవుటచేత అదృశ్యమగుటకు సిద్ధముగా నున్నది. మనిషి అతిక్రమించుటద్వారా సిలువద్వారా యెరూషలేము దేవాలయము నాశనమగుటద్వారా దేవుడు ప్రక్కనబెట్టినవాటివైపు యూదులుగాని క్రైస్తవులుగాని మళ్ళుట ఇక వ్యర్థము.