నెఫీలులు

నెఫీలులు

ప్రశ్న:-

ఆదికాండము 6:4 లో చెప్పబడిన నెఫీలులనబడినవారెవరు? వారు ఆదాము లేకుండ పుట్టిరా?

జవాబు:-

భూమిమీద నుండిరి అంటే ఆదాములేక జన్మించియుండిరని అనుకొనకూడదు. ఆ నెఫీలులనువారు ఆ దినములలో నుండిరని వ్రాయబడినది. ఆ దినములేవనగా అక్రమము విస్తరించి దేవుని కుమారులనబడిన వారు భ్రష్టులై ఆత్మ నడుపుదలకు విరుద్ధముగా కయీను వంశపువారనబడిన నరుల కుమార్తెలతో వివాహము చేసికొన్నప్పుడే ఈ నెఫీలులు కనబడిరి. తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరని వ్రాయబడినది.

ఆ దేవుని కుమారులు దేవుని యిష్టము కాక స్వంత యిచ్చనే కొనసాగించి కూడని సంబంధము పెట్టుకొని పిల్లలను కనిరి. అట్టి దుర్దినములలో వారు పాప ఫలితముగా కనినవారే ఈ నెఫీలులనబడినవారు.

అది హెబ్రీ భాష శబ్దము. తెనుగులో “ఉన్నత దేహులు” అని అర్ధము. ఆది 6:2 లో దేవుని కుమారుల పతనము వివరింపబడినది. వారు స్థానముతప్పి పడిపోయిరి. 6:3 లో ఆత్మ దానికెదురు వాదించిన సంగతి యున్నది.

ఆలకించే వారెవరు లేక పోయిరి. 6:4 లో ప్రత్యేకముగా కాదుగాని ముందువచ్చిన సమస్యతో విజ్జోడుగా దినములలో అనగా అక్రమము విస్తరించిన ఆ దినములలో ఈ ఉన్నత దేహులు భూమిమీద నుండిరని వ్రాయబడినది. అవును, ఆదాము లేకనే వారంతట వారే పుట్టి భూమిమీద తిరగడానికి మొదలు పెట్టిరని అనుకొనకూడదు. యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెనని అపొ.కార్య. 17:26,27 లో అనినది తప్పిపోకూడదు.

ఈ నెఫీలులు ఆదాము సంతతి వారే. ఎవరిద్వారా? ఆ కాలమందుండినవారిద్వారానే జన్మించిరి. అనగా కయీను సంతతివారి సంతానమే. మరియు ఆ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కూడి నప్పుడు పుట్టిన సంతతివానిలో నిమిడియున్నవారే. వీరుగాక ఆ సంయోగముద్వారా పేరుపొందిన అనేక శూరులైన వారును పుట్టిరని ఆది 6:4 చెప్పుచున్నది. పుట్టి లాభమేమి? వారు శూరులే, పేరుపొందినవారే.

ఉన్నత దేహులే గాని దైవభక్తిలో లేనందున జలప్రళయము రాగా వారందరును నశించిపోయిరి. ఉన్నత దేహులుండగా ఆ కాలమందలివారు ఇట్లు చెప్పుకొనిరి. నెమ్మదిగానున్నది, భయమేమియు లేదు, మనకు కొరతయేమియు లేదు. చూడండి మన సంతతివారెంత పెద్దవారైరి, పేరుపొందిరి. బలముగా నున్నారు, అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనమే తటస్థించెను. ఈ దినములలోకూడ ఇలాగే జరుగుచున్నది. (1 థెస్స. 5:1-3).

చదువు హెచ్చినది. అందరికి ధనము విస్తరించినది. ఆయా మతములుకూడ పునర్జీవమునకు వచ్చినది, భయమేమియు లేదంటున్నారు నెఫీలులవంటి విద్యా వంతులు మెడచాచి నడుచుకొంటున్నారు. అయితే నేమి? క్రీస్తు రెండవరాకడ అకస్మాత్తుగా వారిమీద దండనగా పడుతుంది గనుక వారు తప్పించుకొనలేరు, ఇప్పుడే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము.

చిన్నవారేమి నెఫీలులవంటి వారేమి క్రీస్తుకే వంగి నిర్భేదముగా రక్షణపొంది తీరవలెను. వేరొక దారి లేదు నెఫీలులు భూమిమీద నుండిరి. తరువాతను ఉండిరి యని యున్నది. అవును, జల ప్రళయము తీరిపోయి సరాసరి వెయ్యి యేండ్ల పిమ్మట పాలస్తీను అన్యులలో మళ్ళీ నెఫీలులున్నట్లు సంఖ్యా 13:33 తెల్పుచున్నది.

ఈ సారి నెఫీలీయులని పేరు వచ్చినను ఉన్నత దేహులే అని అర్థము. సంఖ్యా 13:32. దేహసంబంధముగా పెద్దవారే గాని ఆధ్యాత్మికములో సన్నవారై అసహ్యులై యెహోవా దృష్టికి నిలువలేనివారై యెహోషువ వచ్చి తీర్పు తీర్చగా ఆయన ఖడ్గమునకు పడిపోయి నశించిరి. వారు జరిపిన హేయకృత్యములకుగాను అసలు ఆ దేశము కంపుకొట్టుచు అపవిత్రపరచబడియుండగా వారి దోషశిక్ష వారి మీద దిగినట్టు వారాదేశములోనుండి వెళ్ళగక్కబడిరి. (లేవీ 18:25). పెత్తనము సలిపిరి. గప్పాలు కొట్టుకొనిరి. బడాయి చూపిరి. పేరుపొంది శూరులైరి.

నెఫీలులనబడిరి ఇష్టము వచ్చినట్టు కార్యము జరుపుకొనిరి గాని లాభమేమి? నియమింపబడిన ఎనమండుగురు రక్షణయోడలో విధేయులై చేరి రక్షింపబడియుండగా శూరులైన వారు నీటిలోనే మునిగి నశించిరి.

నెఫీలులుండిరి, తరువాత ను వుండిరి. ఇప్పుడునుకూడ ఆత్మీయమైన నెఫీలులు దండిగాగలరు గాని -తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నానని క్రీస్తు మత్తయి 11:25 లో జయఘోషనిడి తండ్రిని కొనియాడినట్టు, నెఫీలుల దిక్కుచూచి మోసపోక, చిన్న మంద నమ్ముకొనిన ప్రభువైన క్రీస్తువైపునే జూచి రక్షణ పొందండి.

Leave a Comment