దేవుడు

దేవుడు

ప్రశ్న:- దేవుడు అనే పదము ఏక వచనమా? బహు వచనమా?

జవాబు:-

అవును, బహు వచనమే. ఆదికాండము 1:1 లో “దేవుడు” అని కనబడుచున్నది. ఆ శబ్దము బయలుదేరినది. హెబ్రీ భాషలో ఏలోహీము అని వస్తుంది. ఈ “ఏలోహీము” అనేది రెండు శబ్దములలో నుద్భవించినది. (1) ఏల్ అని యొకటి సారి సారి దేవుడనే నామము ఏలోహీము అని రాక ఏల్ అని యొంటరిగానే వచ్చుచున్నది. ఏల్ అనగా బలముగలవాడని అర్ధము. ముఖ్యముగా యోబు, కీర్తన, యెషయా అను గ్రంథములందు బహుమారులు ఈ ఏల్ అనే శబ్దము వచ్చినది. తెలుగులో “దేవుడు” అని తెనిగించిరి. (2) అల్లాః అని రెండవ శబ్దము దానియేలు గ్రంథాలలో ముఖ్యముగా కనబడే శబ్దమిది. తెలుగులో దేవుడే.

అది దేవుడు, ఇదియు దేవుడు గనుక దేవుడు అనే పదము తెలుగులో నేక వచనమైనను దాని నిజోద్భావములో బహు వచనమే మ్రోగుచున్నది. ఈ అల్లా అనే దానికి ఒట్టు లేక ప్రమాణము అని అర్థము. కాబట్టి దేవుడు అనే శబ్దములో – ఏల్, అల్లాః, కలిసి ఏలోహీము అని వచ్చుచున్నది. ఒకటే పదము గాని శబ్దములు మూడు గనుక దీనిలో త్రిత్వమనేది గోచరించుచున్నది. దేవుడెట్టివాడు? (1) బలముగలవాడు దేవుడు-ఆయన ఏల్ అనేవాడు.

(2) దేవుడు మాటయిచ్చి తప్పనివాడు. తన భక్తులతో ప్రమాణము చేసి వారిని విడువక ఒట్టు క్రింద కాపాడేవాడు ఆయన పేరు అల్లాః (3) ఈ రెండు పేర్లు కొంత మార్పుతో కలసి “ఏలోహీము” అని వచ్చుచున్నది. హెబ్రీ బైబిల్ ఈ మూడు శబ్దములు అగుపడుచున్నవి. అవి సూచించే వాడొకడే. తెలుగులో దేవుడే అని తర్జుమా ఆయెను. కాబట్టి దేవుడు అనే శబ్దము బహువచనమే.

భాషార్థములో మాత్రముగాక నుచ్చరించిన పదములలో సైతము దేవుడు బహు వచనములో నున్నవాడని తేలుచున్నది. నరుని నిర్మాణమును గూర్చి ఆది 1:26 లో దేవుడనువాడు ఆలోచన చెప్పబోతాడు. గాని ఆ భాషరీతిని గమనించి చూడండి.

మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఉన్నది. దేవుడు పలికెనని యున్నది. అయితే మనము మన అనే బహువచన వాచక శబ్దము లేచినది. దీని తాత్పర్యమేమి? దేవుడు బహువచనములో నున్నవాడైయున్నాడు ఆది 2:7 లో మానవుని నిర్మాణరీతి వివరింపబడినదానిలో తిరిగి ఏకవచనమే వచ్చినది. నేల మన్ను తీసికొని రూపించి జీవవాయువు నూదినవాడెవడనగా దేవుడైన యెహోవాయే.

ఒకడే చేసినట్టున్నది గాని ఆది 1:26 లో ఆ యొకడే మరి కొందరితో కలిసి ఆలోచించి మాటలాడినట్టున్నది. మరియొకసారి ఆది 3:22 మాటలాడుచున్న దేవుడైన యెహోవా యొకడే గాని ఆదాము మనలో ఒకనివంటివాడాయెనని చెప్పుచున్నాడు. తర్కవాద మెంత జేసిన దేవుడనబడినవాడు బహువచనములో ఉన్నవాడై ఆయా తన కార్యములు తనకిష్టము వచ్చినట్లు జరుపుచున్నాడని నమ్మక విధిలేదు. తండ్రియైన దేవుడు గలడు. దేవుడైన కుమారుడు గలడు. ప్రభువైన ఆత్మయునున్నాడు.

బాప్తిస్మము జరుగగా ఈ ముగ్గురు చెప్పబడుచున్నారు గాని మూడు నామములలో బాప్తిస్మమిమ్మన్నాడా? లేదు. తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోకి వారికి బాప్తిస్మ మియ్యుడని క్రీస్తు సెలవిచ్చెను. (మత్తయి 28:19). ముగ్గురు వ్యక్తులు చెప్పబడిరి సరి గాని నామము ఒకటేయని గ్రహించండి.

పాత నిబంధనలో సహా ఈ బహు వచన సంబంధమైన దేవుని నామము సూచింపబడినది. సంఖ్యా. 6:26 లో నా ‘నామము’ ఇశ్రాయేలీయులమీద నుచ్చరించుమని చెప్పినదానిలో నామము అనేది ఏక వచనములో చెప్పబడినను మూడు పర్యాయములు “యెహోవా” అని యుచ్చరించి ఆ యొక నామము వారిమీద పెట్టుమని సెలవాయెను.

  1. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాకని 6:24 లో వచ్చినది- కాపాడగల తండ్రియైన దేవునికి ఈ శబ్దము సరిపోవును.
  2. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాకని రెండవ శబ్దముగా వచ్చినది-6:25. మనకు కరుణ లభించునట్లు అవతరించి వచ్చి చనిపోయి లేచిన క్రీస్తుకు ఈ శబ్దము సరిపోవును.
  3. యెహోవా నీమీద తన సన్నిధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాకంటే ఈ పలుకు పరిశుద్ధాత్మకు సంబంధించియున్నది. ఆయనే ఆదరణ సమాధానములను మనకందించువాడై యున్నాడు. 6:26.

Leave a Comment