జైరోము : హింస, హతసాక్షి మరణము (క్రీ.శ. 1416)
ప్రేగ్ నివాసియైన జెరోము (Jerome) క్రీ.శ. 1370 లో జన్మించెను. ఇతడు బొహెమియా సంఘసంస్కర్త, సంచార పండితుడు. వివిధ పట్టణములలోని అనేక విశ్వవిద్యాలయ చర్చలలో ఇతడు పాల్గొనెను. ప్రేగ్ (Prague), పారిస్ (Paris), హైడెల్బర్గ్ (Heidelberg), కొలొన్ (Cologne), మరియు ఆక్స్ఫర్డ్ (Oxford) పట్టణములలోని చర్చలలో పాల్గొనుటద్వారా అతనికి చక్కని ఆంగ్లము మాట్లాడుట వచ్చెను. ఆక్స్ఫర్డ్ జాన్ విక్లిఫ్ రచనలతో పరిచయము కలిగి, వాటిని ఆంగ్లమునుండి చెక్ (Czech) భాషలోనికి తర్జుమా చేయగా అతని పుస్తకములు బొహెమియా అంతట వ్యాపించెను.
జెరోము బొహెమియాకు తిరిగివచ్చినప్పుడు అతని గ్రంథములు పట్టణములోను, విశ్వవిద్యాలయములోను విస్తృతముగ చదువబడుట చూచెను. విక్లిఫ్ రచించిన ఉపదేశములను జాన్ హస్ వ్యాప్తిచేయుచున్నందున జెరోము వెంటనే హస్ సహవాసము చేసెను. అప్పటినుండి వారిద్దరు ఆ సేవలో కలసి పనిచేసిరి.
కాన్స్టన్స్ సభలో హస్ బంధింపబడి, చెరసాలలో ఉన్నప్పుడు జెరోము కాన్స్టన్స్ వెళ్లెను. హస్ కాల్చివేయబడుటకు మూడు నెలల ముందు అనగా క్రీ.శ. 1415, ఏప్రిల్ 4న అతడక్కడకు వెళ్లెను. తాను కూడా ఖైదు చేయబడుదునను భయముతో రహస్యముగ ఆ పట్టణములో ప్రవేశించి, విక్లిఫ్ సిద్ధాంతములను విశ్వసించిన కొందరు నాయకులను సంప్రదించెను.
హసన్ను సజీవదహనము చేయవలెనను సభ తీర్పును మార్చుట అసాధ్యమని ఆ నాయకులు తెలుపగా జెరోము చక్రవర్తియైన సిజిస్మండ్ సంరక్షణలోనున్న ఐబెర్లింగ్ (Iberling) అను రాజనగరికి వెళ్లాను. తనకు ఏవిధమైన హాని కలుగదని చక్రవర్తి హామీ యిచ్చినట్లయితే తాను హస్ పక్షముగ సభముందు హాజరగుదునని చక్రవర్తికి ఉత్తరము వ్రాయగా, అది నిరాకరింపబడెను.
అదే విష యము కాన్స్టన్స్ సభకు వ్రాయగా వారుకూడా తిరస్కరించిరి. కాని హసు బదులుగ తీర్పును వినుటకు కాన్స్టన్స్, ఐబెర్లింగ్లలోని ప్రభువులు సంతకముచేసిన యోగ్యత పత్రములన్నింటిని తీసికొని తిరిగి బొహెమియా చేరెను. అయితే రాజైన సల్స్బాక్ (Sultsbach) ఆజ్ఞ ప్రకారము ఒక అధికారి జెరోమును జర్మనీలోని హిర్షా (Hirshaw) పట్టణములో అన్యాయముగ బంధించెను.
జెరోము బందీగా ఉన్నందున అతనిని తక్షణమే తమయెదుట హాజరుపరచవలెనని సభ తెలియజేసెను. జర్మనీ యువరాజు జెరోము కాళ్లకు పొడవైన గొలుసు బిగించి, ఆ గొలుసు చివరి భాగమును తన మెడకు చుట్టుకొని ఆడంబరముగా కాన్స్టన్స్కు గుఱ్ఱముమీద ప్రయాణించెను. దారిలో జెరోము అనేకమంది తన సహవాసులను కలిసికొనెను.
అతడు జెరోమును కాన్స్టన్స్కు తీసికొనిరాగా, అతనిని దుర్గంధపు గుహలో బంధించి న్యాయాధిపతులు సంతోషించిరి. హస్కు చేసిన విధముగానే జెరోముకుకూడ చేసిరి. అయితే ఇతనిని తక్కువకాలము బంధించి, వేరువేరు చెర సాలలకు మార్చెను. అతనిని బంధించిన సంవత్సరము తరువాత సభ ముందుంచిరి. అక్కడ అతనిని తన పక్షముగ వాదించుకొనుమని చెప్పి, మరల తిరస్కరించిరి. అందుకు జెరోము కోపముతో, గట్టిగా ఈ మాటలు పలికెను :
“ఇదేమి క్రూరత్వము? సుమారు మూడువందల నలుబది ఐదు దినములు నేను వివిధ జైళ్లలో బంధింపబడితిని. నేననుభవింపని దుఃఖముగాని, కష్టము గాని లేదు. వారు కోరినంతమేరకు నన్ను హింసించుటకు మీరు వారికి అప్పగించితిరి. నా పక్షముగ న్యాయమును నిరూపించుకొను చిన్న అవ కాశముకూడ నాకు ఇవ్వ నిరాకరించితిరి. తీర్పుకొరకు సిద్ధపడుటకు నాకు ఒక్క గంట వ్యవధికూడ మీరు అనుగ్రహింపలేదు.
నాకు వ్యతిరేకమైన అతి దుర్మార్గపు ప్రకటనలను మీరు స్వీకరించితిరి. నా సిద్ధాంతము తెలియకుండనే నన్ను మతద్రోహిగా నిర్ధారించితిరి. నేను ఎట్టి నమ్మకము కలిగియున్నానో తెలియకుండగనే నన్ను విశ్వాసమునకు విరోధియనుచున్నారు. నా ఉద్దేశ్యము గ్రహింపకుండగనే నన్ను బోధకుని చంపినవాడని నిందించితిరి.
మీలో ఈ ప్రపంచమునకు బోధింపగలిగినంత విజ్ఞానము, మంచి తనము పవిత్రత ఉన్నవి. కాని మీరు ఇంకను మనుష్యులే. మనుష్యుల మాటలవలన మోసపోవుదురు. మూర్ఖత్వములోను, మోసములోను పడ కుండునట్లు జాగ్రత్త కలిగియుండుడి. నేను వాదించ కోరుకొను విషయము నా స్వంత విషయము, ప్రజల విషయము, క్రైస్తవుల విషయము. ఏ రకమైన పద్ధతిని ఉపయోగించి మీరు పరీక్షించెదరో కాని, ఇది రాబోవు తరముల స్వేచ్ఛను, హక్కులను బాధించు విషయము.”
జెరోముయొక్క హృదయవేదన సభపై ఎట్టి ప్రభావము చూపలేదు. అతడు మాట్లాడుట ముగించినవెంటనే, అతనిపై ఐదు నేరారోపణలు జారీచేసిరి.
- జెరోము సంఘ గౌరవమును పరిహసించెను.
- పోప్ను వ్యతిరేకించెను.
- మత ప్రధానాధికారులకు శత్రువు.
- బిషప్ హంతకుడు.
- క్రైస్తవ మతద్వేషి.
జెరోము తనపై మోపిన నేరారోపణలనన్నింటిని తిరస్కరించగా, తిరిగి అతనిని జైలులో పెట్టి పదకొండు దినములు కాలిమడమలు పైకికట్టి తలక్రిందులుగా వ్రేలాడదీసిరి.
జెరోము గొప్ప భాషాపాండిత్యము, మిక్కిలి జ్ఞానముగలవాడు కనుక మాట్లాడుటకు అవకాశమిచ్చినచో ఎంతటి మతోన్మాదినైనను, కరడుగట్టిన ద్వేషబుద్ధిగలవానినైనను మార్చగలడు. కనుక మాట్లాడుటకు అతనికి అవకాశమీయకూడదని కొందరు అభి ప్రాయపడిరి. అయినను సభ తన వాదనలోని న్యాయమును నిరూపించుకొను అవ కాశము జెరోముకిచ్చెను.
తనమీద నేరములు ద్వేషముతోను, అబద్దములతోను నిరూ పించబడినవని చెప్పెను. తన జీవితము, నడవడి సభకు విడమరచి చెప్పెను. మహా ఘనులు, పవిత్రులైన మనుష్యుల అభిప్రాయములుకూడ కొన్నిసార్లు మారుననియు, కనుక బహిరంగముగ చర్చించుకొనిన వాస్తవములు గ్రహించవచ్చుననెను.

విక్లిఫ్ సిద్ధాంతములు సత్యమైనవని నిరూపించి, హసన్ను గొప్పగా శ్లాఘించెను. అట్టి పవిత్ర హతసాక్షులననుసరించి తానుకూడ చనిపోవుటకు సిద్దముగా ఉన్నానని జెరోము విన్నవించెను. గతములోవలె, ఇప్పుడుకూడ సభ అతని మాటలను లక్ష్యపెట్టలేదు.
జాన్ హస్వలె జెరోముకూడ దోషియని తీర్చబడి, మతద్రోహివలె కొయ్య స్తంభమునకు కట్టి కాల్చవలెనని ఆజ్ఞాపించిరి. అతడు హస్వలె పాదిరి కాదు గనుక అగౌరపరచు కార్యములు చేయలేదు. తన మనస్సు మార్చుకొనుటకు సభ అతనికి రెండురోజుల వ్యవధినిచ్చెను. శాయశక్తుల కృషిచేసి, అతనిని ఒప్పించుటకు కార్డినల్ ఫ్లారెన్స్ ప్రయత్నించెను. కాని జెరోము మాటలు సభపై ప్రభావము చూపనట్లే ఫ్లారెన్స్ మాటలుకూడ జెరోముపై ఎట్టి ప్రభావమును చూపలేకపోయెను.
ఉరికంబమునకు వెళ్లుదారిలో జెరోము ఎన్నో స్తుతిగీతములు పాడెను. హసన్ను సజీవ దహనముచేసిన అదే స్థలమునకు జెరోమును తీసికొనివచ్చినప్పుడు అతడు మోకరించి పట్టుదలగా ప్రార్థించెను. గొలుసులతో కట్టబడకముందే, కొయ్యస్తంభమును కౌగిలించుకొనెను. కట్టెలు అంటించుటకు హంతకుడు వెనుకకు వచ్చినప్పుడు, అతనిని పిలిచి, “నాకు ఎదురుగా వచ్చి, నేను చూచునట్లు నిప్పుముట్టించుము. నేను భయ పడను, భయపడి ఉంటే, నేనీ స్థలమునకు వచ్చి ఉండేవాడను కాదు” అని చెప్పెను.
నిప్పు ముట్టించబడినది. కట్టెలు బాగా ఎండినవగుటచే, జ్వాలలు త్వరగా అతనిని చుట్టుముట్టెను. కొద్దిసేపు జెరోము స్తుతిగీతములు పాడెను కాని, రగులుచున్న అగ్ని అతనిని నిశ్శబ్దపరచినది. ప్రత్యక్ష సాక్షులు వినిన అతని చివరి మాటలు : ‘క్రీస్తూ, ఈ మంటలలో నా ఆత్మను నీకు సమర్పించుచున్నాను.’
ఇట్లు జెరోము క్రీ.శ.1416, మే 30 న హతసాక్షి మరణమొందెను. మతన్యాయ నిర్ణేతలు ఏవిధముగా తలంచినను, అతని మరణజ్వాలలు సత్యసువార్తాగ్నిని నాగరిక ప్రపంచమంతట వ్యాపింపజేసెను. విక్లిఫెక్క ఆంగ్ల రచనలను జెరోము చెక్భాషలోనికి తర్జుమా చేసి, ఆ విధముగ సత్య సువార్త విత్తనములను నాటెను.

పునరుత్థానుడైన క్రీస్తు పెర్గములో ఉన్న సంఘమునకు ఈలాగు వ్రాసెను:ఇప్పుడు ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము, మారుమనస్సు పొందని సంఘము మీదకి రానైయుండెను.