ఇంగ్లాండులో హింసలు (క్రీ.శ. 1401–1541)
మూడవ ఎడ్వర్డ్ రాజు (King Edward III) పరిపాలించుచున్న కాలములో (క్రీ.శ. 1327-1377) ఇంగ్లాండు సంఘము అవినీతితోను, మూఢభక్తితోను, చెడి యుండెను. మనుష్య సిద్ధాంతములు, పూర్తి విగ్రహారాధన మొదలగు కార్యకలాపముల చీకటిలో క్రీస్తు నిజసువార్త అను వెలుగు ఆరిపోయెను.
అదే కాలములో లోలార్డులు అనబడు సంఘసంస్కర్తలైన విక్లిఫ్ అనుచరులు అధికముగ విస్తరించెను. అందుచే మతాచార్యులు విసుగుచెంది, వారిని చంపు అధికారము లేనందున, వారిని రహస్య ముగ బాధించుట మొదలుపెట్టిరి.
ఆంగ్ల సింహాసనమును నాల్గవ హెన్రీ (Henry IV) బలవంతముగ క్రీ.శ. 1399 లో ఆక్రమించిన తరువాత లో లార్డులకు శ్రమలు అధికమయ్యెను. తమ సిద్ధాంతములను మార్చుకొనక, మొండి పట్టుదలతో ఉన్న లోలార్డులను దోషులుగ ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు తీర్పు తీర్చి, మతద్రోహులని వారిని కాల్చిచంపు అధికారము రాజకీయాధికారులకు మంజూరు చేయు నిమిత్తము పార్లమెంటును సమావేశపరచి, ఆ చట్టమును వెంటనే ప్రవేశపెట్టవలసినదిగా మతనాయకులు రాజును ఒత్తిడిచేసిరి.
లో లార్డుల వ్యతిరేకత తీవ్రముగా ఉన్నప్పటికీ మతద్రోహులను కాల్చిచంపు చట్టమును క్రీ.శ. 1401 లో పార్లమెంటు ఆమోదించి దానిని వెంటనే అమలుపరచెను. వారి మత మూఢనమ్మకముల కొరకు ప్రజలను కాల్చిచంపు శాసనము చేయబడుట ఇంగ్లాండులో అదే ప్రప్రథమము.
ఈ క్రొత్త చట్టమునకు బలియైన మొదటి హతసాక్షి విలియమ్ సంత్రీ (Will- iam Santree) – ఇతడు స్మిత్ఫీల్డు (Smithfield) లో కాల్చి చంపబడెను.
వెంటనే కేంటర్్బరి ఆర్చిబిషప్ థామస్ అరుండేల్ (Thomas Arundel) అతని బిషప్లు సర్ జాన్ ఓల్డ్ కేజిల్ (Sir John Oldcastle) కు వ్యతిరేకముగ నిందలు లేవదీసిరి. సర్ జాన్ ఓల్డ్ కేజిల్ పేరుగాంచిన విక్లిఫ్ అనుచరుడు, రాజైన నాల్గవ హెన్రీ వ్యక్తిగత స్నేహితుడు. బిషప్ల అనుమతి లేకుండ కొందరిని ఉపదేశించుటకు బోధకులుగా నియమించుచున్నాడను నేరము అతనిపై మోపబడెను.
సంఘ ఆరాధనను, విగ్రహములను, తీర్థయాత్రలను నిరసించుచు, పోపు వ్యతిరేకముగ తప్పుడు బోధలను ప్రోత్సహించుచున్నాడను నింద అతనిపై మోపిరి. అతనిమీద దోషారోపణ చేయుటకు ముందు, రాజు సహాయము పొందవలెనని వారికి తెలియును. వారు చెప్పినది రాజు ప్రశాంతముగ విని, సర్ జాన్తో గౌరవముగ వ్యవహరింపుడని మంచితనము ద్వారానే సంఘమునకు అతనిని అప్పగించవలయునని వారికి చెప్పెను.
వారి పక్షముగ రాజుకూడ సర్ జాన్తో వాదించెను. అతడు సర్ జాన్ ను మందలించి, తన పరిశుద్ధ సంఘమునకు తిరిగి వెళ్లుమని, విధేయత కలిగిన చిన్నబిడ్డవలె తాను తప్పు చేసినందున శిక్షకు తగినవాడనని ఒప్పుకొనుమని చెప్పెను. దీనికి స్పందించి, సర్ జాన్ రాజునకు ఈ విధముగా సమాధానమిచ్చెను :

నీవు క్రైస్తవ రాజువనియు, ఏర్పాటుచేయబడిన దేవుని సేవకుడవనియు, దుర్మార్గులను శిక్షించి, ధర్మమును కాపాడుటకు కత్తి పట్టినవాడవనియు నాకు తెలియును. నిత్యుడగు దేవుని తరువాత, మీకు నేను విధేయుడను.
ప్రభువునందు మీరు ఏమి శాసించినను నెరవేర్చుటకు, నా దగ్గర ఉన్న చరస్థిరాస్తిని మీకు అప్ప గించుటకు, పూర్వమువలె ఇప్పుడును సిద్ధమే. కాని పోప్, మత నాయకుల విషయమునకు వచ్చినయెడల, నేను వారియెదుట హాజరగుటకు, సేవ చేయుటకు నేను వారికి అచ్చియుండలేదు. ఎందుచేతననగా, లేఖనముల వలన అతడు క్రీస్తు విరోధి అని, నాశనపుత్రుడని, దేవుని ప్రత్యక్ష విరోధియని నాకు తెలియును.” రాజు ఇది విని, జవాబు చెప్పకుండ ఆ గది విడిచి వెళ్లెను.
సర్ జాన్ విషయము మాట్లాడుటకు ఆర్చిబిషప్ మరల రాజును కలిసెను. సర్ జాన్ వారిముందు హాజరుకానందున, వారి అధికారమును గర్వముగ ఎదిరించినందున ‘పవిత్ర సంఘ శాసనముల’ (The Laws of Holy Church) ప్రకారము అతనిని శిక్షించుటకు ఆర్చిబిషప్కు అధికారమీయబడెను.
సర్ జాన్ తనను పరిహసించినాడని, తాను చేసిన ప్రతి కార్యమును తిరస్కరించి నాడని, అతడు ఇప్పటికీ అదే అభిప్రాయములను కలిగియుండెనని, సంఘాధికారము లను, బిషప్ ఘనతను, ద్వేషభావముతో చూచుచున్నాడని తెలియజేయబడినందున, ఆర్చిబిషప్ క్రోధావేశముతో సర్ జాన్ను సంఘమునుండి వెలివేసెను.
వెలివేయబడిన తరువాత సర్ జాన్ ఓల్డ్ కేజిల్ తన వ్యక్తిగత విశ్వాసపు ఒప్పుదలను తన స్నేహితుడైన నాల్గవ హెన్రీకి వ్రాసెను. అతడు దానిని సంతోషముతో స్వీకరించ గలడని ఆశించెను. కాని దానికి బదులుగ రాజు దానిని తిరస్కరించి, అతనికి న్యాయమును తీర్చు ఆర్చిబిషప్కును, సభలోని బిషప్లకు విన్నవించుకొనుమని ఆజ్ఞాపించెను.
సర్ జాన్ సభయెదుట, రాజుయెదుట హాజరై “నా సిద్ధాంతములు, నేను చేసిన కార్యములు దేవుని వాక్యానుసారము కావని మీరు నిరూపించినట్లయిన, వాటిని నేను సరిదిద్దుకొని, మీకు వినయముగా లోబడెదన”ని చెప్పెను. సర్ జాన్ చెప్పుట ముగించినప్పుడు రాజు అతనిని రహస్యగదిలోనికి తీసికొనివెళ్లి పోప్ నిర్ణయములకు లోబడుమని చెప్పెను. సర్ జాన్ రాజు సలహాను తిరస్కరించగా రాజు అతనిని బంధించి ‘లండన్ టవర్’ (Tower of London) లో ఖైదుచేయుమని ఆజ్ఞాపించెను.
సర్ జాన్కుగల గొప్ప ప్రజాభిమానము, గౌరవములనుబట్టి, ఆర్చిబిషప్ తన తీర్పును నెమ్మదిగ ఏడువారములు కొనసాగించి, చివరకు సర్ జాన్ మత ద్రోహియని తీర్పుచెప్పి, అతనిని స్తంభమునకు వ్రేలాడదీసి కాల్చిచంపవలసినదిగా శిక్ష విధించెను.
అనంతరము సర్ జాన్ సభకు తన వాదనను ఈ విధముగా తెలియజేసెను :
“విగ్రహములు విశ్వాససంబంధమైనవి కావు. దేవునికి చెందవలసిన ఆరాధనను మృణ్మయ విగ్రహములకు అర్పించుచూ, దేవునిలో మాత్రమే ఉంచవలసిన నిరీక్షణ, నమ్మకము వాటియెడల కలిగించుచూ, దేవునికంటె వాటియెడల ఎక్కువ ప్రేమను చూపించుటవలన అతడు ఎక్కువ పాపము చేయుచున్నాడు. క్రీస్తునందలి విశ్వాసమును సంఘము అంగీకరించినది కనుక మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క సుగుణములను, త్యాగపూరిత మరణమును మనస్సులోనికి తెచ్చుటకు ఇతర నీతిమంతుల జీవితములు సూచించుచున్నవి.
ఈ భూమిమీదనున్న ప్రతి వ్యక్తి సంతోషమునకో లేక దుఃఖమునకో యాత్రికుడు. దేవుని పవిత్ర ఆజ్ఞలను ఎరుగక, వాటిని తన జీవితములో పాటింపక, తీర్థయాత్రలకని ప్రపంచమంతట తిరుగుచు, యాత్ర చేయుచునే చనిపోయినయెడల అతడు నరకము పాలగును; కాని ఎవరైతే దేవుని పవిత్ర ఆజ్ఞలను యెరిగి, వాటిని పాటించునో, అతడు తన జీవితములో ఎప్పుడును తీర్థయాత్రలకు అనగా ప్రజలు ఇప్పుడు కేంటర్ ్బరి, రోము లేక ఏదైన మరియొక స్థలమునకు వెళ్లుచున్నట్లుగా అతడు వెళ్లకపోయినను రక్షింప బడును.”
ఉరితీయబడు దినమున, చేతులు వెనుకకు కట్టి సర్ జాన్ ఓల్డ్ కేజిల్ను ‘లండన్ టవర్’ నుండి వెలుపలికి తీసికొనిరాగా, చుట్టూ ఉన్నవారిని చూచి అతడు సంతోషముగ నవ్వెను. ఘోరమైన రాజకీయ ద్రోహియన్నట్లు, అతనిని కొయ్య చట్రముపై పరుండబెట్టి, పరి. గైల్స్ మైదానము (St. Gile’s field) నకు ఈడ్చిరి. ఉరితీయు స్థలమునకు వచ్చినప్పుడు, కొయ్య చట్రమునుండి అతనిని తొలగించగా సర్ జాన్ మోకరించి, తన శత్రువులను క్షమింపుమని దేవుని ప్రార్థించెను.
అతడు నిలువబడి, అక్కడ చేరిన ప్రజలను చూచి, లేఖనములలో వ్రాయబడిన దేవుని మాటలను అనుసరించుడని, క్రీస్తుకు విరోధమైన సంభాషణ, జీవితము కలిగిన బోధకుల విషయములో జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరించెను. గొలుసులు అతని నడుముచుట్టు బిగింపబడి అతడు పైకెత్తబడగా క్రింద నిప్పు వెలిగించిరి.
అగ్ని అతనిని కాల్చి వేయుచున్నను, అతడు స్తుతింపలేని స్థితికి వచ్చువరకు దేవుని స్తుతించుచునే యుండెను. దైవికమైన మంచిమనిషి చనిపోవుచున్నాడని అక్కడ చూచుచున్న జనసమూహము దుఃఖించి, బాధపడెను. ఇది క్రీ.శ. 1417వ సంవత్సరములో జరిగినది.
క్రీ.శ. 1473, ఆగస్టులో థామస్ గ్రాంటర్ (Thomas Granter) లండన్ చెర సాలలో వేయబడెను. తాను విక్లిఫ్ ఉపదేశములను నమ్ముచున్నానని బహిరంగముగ ప్రకటించిన నేరమునకు అతనిని ‘మొండి మతద్రోహి’ అని తీర్పుచెప్పిరి. ఉరితీయు దినమున థామస్ ను ఉరి అమలుచేయు అధికారి ఇంటికి తీసికొని వెళ్లి భోజనము పెట్టించెను.
తినుచున్నప్పుడు అక్కడున్న ప్రజలతో అతడీలాగు చెప్పెను : ‘ఇప్పుడు నేను మంచి భోజనము తినుచున్నాను, నేను మరల భోజనము తినుటకు ముందు నేను చేయవలసిన నూతన పోరాటము ఒకటి ఉన్నది.’ అతడు తినుట ముగించిన వెంటనే దేవుడు అనుగ్రహించిన అధికమైన కృపకొరకు వందనములు చెల్లించి, అతడు నమ్మిన సిద్ధాంతములయొక్క సత్యసాక్ష్యమును ప్రకటించవలసియున్నది గనుక వెంటనే తనను ఉరితీయు స్థలమునకు తీసికొని వెళ్లుమని కోరెను. ఆ ప్రకారమే, అతనిని ‘టవర్-హిల్’ (Tower-Hill) కు తీసికొనివెళ్లి, ఒక స్తంభమునకు గొలుసులతో కట్టిరి. చివరి శ్వాస విడుచువరకు సత్యమును ప్రకటించుచు, అతడక్కడ సజీవ దహనమయ్యెను.

లండన్కు ఈశాన్యదిశలోనున్న నార్విచ్ (Norwich) లో క్రీ.శ. 1499 లో బాద్రేమ్ (Badram) అను పేరుగల భక్తిపరుడొకడుండెను. విక్లిఫ్ సిద్దాంతములను నమ్ముట నేరమని మతాధికారులు అతనిని నార్విచ్ బిషప్ ముందుకు తీసికొనివచ్చిరి. బాద్రేమ్ అంగీకరించెను. అతనిని ‘మొండి మతద్రోహి’ యని నిందించి, అతనిని చంపుమని బిషప్ ఆజ్ఞాపించెను. అతడు గొప్ప విశ్వాసముతో తన సజీవ దహనమనుభవించెను.
క్రీ.శ. 1506 లో విలియమ్ టిల్ (William Tilfrey) అను భక్తిపరుడు అమెన్షామ్ (Amersham) లో సజీవ దహనము చేయబడెను. అతనికి జోన్ క్లార్కె (Joan Clarke) అను వివాహితయైన కుమార్తె కలదు. అతని హంతకులు జోన్ క్లార్కెను ఆమె తండ్రియైన విలియమ్ అగ్నిలో కాలుచుండగా చూడుమని బలవంతము చేసిరి. అదే సంవత్సరము తూర్పు ఇంగ్లాండులోని లింకన్ బిషప్ ఫాదర్ రాబర్ట్స్ (Father Roberts) ను లోలార్డులకు చెందినవాడను అభియోగముపై బకింగ్ హామ్ (Buckingham) లో సజీవ దహనము చేసిరి.
థామస్ నోరిస్ (Thomas Norris) సామాన్య మానవుడు. అతడు పేదవాడు, ఇతరులకు హానిచేయనివాడు. క్రీ.శ.1507 లో అతడు తన సంఘ పాస్టరును మత సంబంధమైన కొన్ని ప్రశ్నలడిగెను. వారి సంభాషణ మధ్యలో థామస్ అడిగిన ప్రశ్నలను బట్టి అతడు లోలార్డు అయివుండునని పాస్టర్ నిశ్చయించుకొని బిషప్కు ఫిర్యాదు
చేయగా, బిషప్ థామస్ ను బంధించి దోషియని తీర్పు చెప్పి, సజీవ దహనము చేసెను.
దక్షిణ ఇంగ్లాండులో లారెన్స్ గాలె (Lawrence Guale) ను క్రీ.శ. 1508 లో సాలిస్బరి (Salisbury) యొద్ద రెండు సంవత్సరములు జైలులో ఉంచి, తరువాత సజీవ దహనము చేసిరి. పాస్టరు ప్రార్థనచేసిన తర్వాత ఆరాధన (mass) లోని రొట్టె, ద్రాక్షారసము నిజమైన క్రీస్తు శరీరము, రక్తముగ మార్పుచెందునని అతడు అంగీకరించలేదు. ఒక రోజున అతడు తన యింటిలో లోలార్డులకు ఆశ్రయము కల్పించినాడను ఫిర్యాదు రాగా, బిషప్ లారెన్స్ను నిర్బంధించి, మతద్రోహియని నిందించి, సజీవదహనము గావించెను.
అదే సంవత్సరము చిప్పెన్ సద్బర్న్ (Chippen Sudburne) లో ఒక దైవ భక్తిగల స్త్రీ, మతద్రోహి అని తీర్చబడి, డా. విటెన్హామ్ (Dr. Whittenham) అను అధ్యక్షుని ఆజ్ఞవలన సజీవ దహనమైనది. ఆమె సజీవదహనమగుచుండగా ఒక ఎద్దు కసాయివానినుండి విడిపించుకొని, డా. విటెన్హామ్ శరీరమంతటిని కొమ్ములతో చీల్చి, అతని ప్రేగులను కొమ్ములమీద వేసికొని అక్కడ కూడియున్న జనసమూహము చుట్టూ కొంతసేపు తిరిగినది కాని అది మరెవరికినీ హాని చేయలేదు.
క్రీ.శ. 1511, అక్టోబరు 18న విలియమ్ సక్లింగ్ (William Succling) మరియు జాన్ బానిస్టర్ (John Bannister) అనువారు స్మిత్ ఫీల్డులో సజీవదహనమైరి. వారు అంతకు ముందు క్రీస్తునందలి తమ విశ్వాసమును పరిత్యజించిరి కాని మరల నిజవిశ్వాసమునకు తిరిగివచ్చిరి.
ఏడవ హెన్రీ (Henry VII) పరిపాలన (క్రీ.శ. 1485-1509) లో జాన్ బ్రౌన్ (John Brown) చిత్రహింసలకు భయపడి క్రీస్తు సాక్ష్యమును విడిచిపెట్టెను. కాని కొంతకాలమునకు క్రీస్తునందలి విశ్వాసములో తిరిగి బలపడుటచే కేంటర్ ్బరి ఆర్చిబిషప్ డా. వాన్ మన్ (Dr. Wonhaman) అతనిని హింసించి, సజీవదహనము గావించెను. అతనిని కొయ్యకు గొలుసులతో కట్టుటకు ముందు డా. వాన్ మన్, రొచెష్టర్ బిషప్ యైన యెస్టర్ (Yester) లు జాన్ బ్రౌన్ చర్మము ఊడిపడి, ఎముకలు కనుపించువరకు అతని పాదములు కాల్చి తన విశ్వాసమును విడిచిపెట్టునట్లు చేయు టకు ప్రయత్నించిరి. కాని ఈసారి జాన్ బ్రౌన్ అంతటి బాధలోకూడ తన విశ్వాసమును నిలబెట్టుకొని, క్రీస్తుకొరకు, దేవుని సత్యవాక్యముకొరకు మహిమకరముగ మరణించెను.
క్రీ.శ. 1518, అక్టోబరు 25న జాన్ స్టిలిన్సెన్ (John Stilincen) నిర్బంధింప బడి లండన్ బిషప్ యైన రిచర్డ్ ఫిట్జ్-జేమ్స్ (Richard Fitz-James) ముందు హాజరుపరచబడగ, అతనిని మతద్రోహియని నిందించి కాల్చిచంపిరి. హింసలకు భయపడి జాన్ ఒకసారి క్రీస్తునందలి తన విశ్వాసమును విడిచిపెట్టెను. కాని కొంత కాలమునకు ప్రజలందరి ముందు స్మిత్ఫీల్డులో కొయ్యకు గొలుసులతో బంధింప బడి తాను విక్లిఫ్ ఉపదేశముల ననుసరించితిననియు, దేవుని సత్యవాక్యముకొరకు చనిపోవుటకుకూడ సిద్ధముగా ఉన్నాననియు ప్రకటించెను.
క్రీ.శ. 1519 లో రాబర్టు సెలిన్ (Robert Celin), థామస్ మత్తయి (Tho- mas Matthew) లు విగ్రహారాధనకు, తీర్థయాత్రలకు వ్యతిరేకముగ మాట్లాడినారని లండన్లో కాల్చిచంపబడిరి.
క్రీ.శ. 1532 లో థామస్ హార్డింగ్ (Thomas Harding), అతని భార్య మత ద్రోహులని నిందింపబడిరి. ఆరాధనక్రమములో పాస్టరు ప్రార్థించిన తరువాత రొట్టె, ద్రాక్షారసము క్రీస్తుయొక్క శరీరము, రక్తముగ మారునను సిద్దాంతమును వారు త్రోసిపుచ్చిరి. తూర్పు ఇంగ్లాండులోని లింకన్ బిషప్ వారిని దోషులని నిందించి, కొయ్యకు కట్టి, సజీవదహనము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. బొట్లే (Botely) పట్టణమునకు వారిని తరలించి, స్తంభమునకు గొలుసులతో కట్టి, వారిచుట్టు పెద్దపెద్ద కట్టెలు పేర్చి నిప్పుపెట్టిరి.
నిప్పు పైకి వ్యాపించుచుండగ, అక్కడున్న ఒక మతాధిపతి లావైన కట్టెతో థామస్ తలమీద గట్టిగ కొట్టుటచే తల చిట్లి, మెదడు బయటకువచ్చి అగ్నిలో పడెను. అచ్చటున్న ప్రజలతో మతాధికారులు “ఈ మతద్రోహులను సజీవ దహనము చేయుటకు కట్టెలు తెచ్చి యిచ్చిన వారికి పాపపరిహార పత్రికలు ఇవ్వ బడును. వాటితో నలుబది దినములు మీరు ఇష్టము వచ్చినట్లు పాపము చేయుటకు అనుమతింపబడుదుర”ని చెప్పెను.
సంవత్సర ముగింపులో కేంటర్బరి ఆర్చిబిషప్ వార్మ్ (Worham) దక్షిణ ఇంగ్లాండులోని మైడ్లైన్ (Maidstone) చర్చ్ పాస్టరైన హిట్టెన్ (Hitten) అను ఒక మార్పుచెందిన బోధకుని బంధించి అనేక నెలలు జైలులో పెట్టి హింసించెను. వారోమ్ మరియు రోచెస్టర్ బిషప్ యైన ఫిషర్ (Fisher) లు అతనిని సంస్కరింపబడిన నూతన విశ్వాసమును విడిచిపెట్టించు ప్రయత్నము చేసిరి. వారు విఫలమైనప్పుడు, అతనిని మతద్రోహిగ తీర్చి, సజీవదహనముచేయుటవలన అతని బోధ అంతమగునను నిశ్చయమునకు వచ్చిరి. అలాగే సంఘప్రజలకు హెచ్చరికగ ఉండునట్లు హిట్టెనన్ను అతని చర్చిముందు కాల్చి చంపిరి.
రోమన్ కేథలిక్ సంఘముయొక్క మూఢనమ్మకములను, మత సిద్ధాంతములను తిరస్కరించినవారెవరైనను – సామాన్య మానవులుకాని, భార్యభర్తలుకాని, విశ్వవిద్యాలయాచార్యులుకాని మతాధికారులు ఆగ్రహమునుండి తప్పించుకొనలేరు. థామస్ బిల్నే (Thomas Bilney) కేంబ్రిడ్జి న్యాయశాస్త్ర ఆచార్యుడు. అతడు మతద్రోహ నేరముపై ఖైదు చేయబడి, లండన్ బిషప్ సభ యెదుటికి రప్పింపబడెను.
హింసించెద మని, కాల్చి చంపెదమని పదే పదే అతనిని బెదిరించి భయపెట్టినందున, అతడు తన విశ్వాసమునుండి వెనుదిరిగెను. అయితే తరువాత పశ్చాత్తాపముతో చాల విచారించి తిరిగి విశ్వాసములో బలపడెను. అందుకు సభ అతనిని “మూర్ఖపు మత ద్రోహి” అని నిందించి, కాల్చి చంపెను.
బిల్నేకాలిపోక ముందు మార్టిన్ లూథరు యొక్క అభిప్రాయములను తాను పూర్తిగా నమ్ముచున్నానని చెప్పెను. ఉరికంబమునకు కట్టబడినప్పుడు, అక్కడున్నవారందరిని చూచి నవ్వి ‘ఈ లోకములో నేను పలు తుపానులను ఎదుర్కొనినాను, కాని త్వరలో నా నావ పరలోకపు ఒడ్డును చేరును’ అని చెప్పెను. అగ్ని జ్వాలలు అతని చుట్టు గర్జించుచుండగ, కదలకుండ నిలబడి, ‘యేసూ, నేను నిన్ను నమ్ముచున్నాను’ అని చెప్పి, అతడు తాను నమ్మినవానిని కలిసికొనుటకు వెళ్లెను.
రోమా మతాధికారులు వారి మూఢనమ్మకములను, సిద్ధాంతములను వ్యతిరేకిం చిన ఇతరులయెడల మూర్ఖత్వము కలిగియున్నను, రోమా ప్రభుత్వములో భాగమై ఉండి వ్యతిరేకించినవారియెడలకూడ మిక్కిలి క్రూరముగా ప్రవర్తించిరి. ఆగ్నేయ ఇంగ్లాండులోని బార్నెస్ (Barnes) యొద్ద రిచర్డ్ బైఫీల్డు (Richard Byfield) అను క్రైస్తవ సన్యాసి కలడు. ఇతడు టిండేల్ (Tyndale) ఆంగ్లములోనికి అనువదించిన క్రొత్త నిబంధన గ్రంథమును చదివి నిజవిశ్వాసములోనికి మార్పుచెందెను.
అంతేగాక మార్టిన్ లూథర్ యొక్క అభిప్రాయములను, సత్యములనుకూడ పూర్తిగ నమ్మెను. ఇది మతాధికారులకు తెలిసినప్పుడు, అతనిని మతద్రోహియని నిందించి, ఖైదుచేసిరి. అతడు మార్పుచెందిన రోమన్ మతనాయకుడగుటచేత, వారు అతనిని మిక్కిలి క్రూరముగ హింసించిరి. అతనిని విశ్వాసమునుండి మళ్లించుటకు, మానవ మలము ఉన్న మురికి నీళ్లతో కంపు కొట్టుచున్న చీకటి గుహలలో నిర్బంధించిరి. అక్కడ ఎలుకలు, బొద్దింకలుమాత్రమే అతని సహవాసులు. అప్పుడప్పుడు చెరసాల అధి కారులు వచ్చి, భుజముల స్థానములు తప్పువరకు చేతులను వెనుకకు లాగికట్టెడివారు. ఆహారము, మలమూత్ర విసర్జన లేకుండ బైఫీల్డ్ను అనేక దినములు అదే స్థితిలో ఉంచిరి.
ఇతర సమయములలో అతనిని కొరడాలతో వీపుమీద మాంసము ఊడునట్లు కొట్టిరి. అయినప్పటికిని క్రీస్తునందలి తన నూతన విశ్వాసమునుండి తిరిగిపోవుటకతడు ఇష్టపడలేదు. కనుక అతనిని లాంబెత్ భవనములోని లోలార్డుల టవర్కు తీసికొనివెళ్లి, అక్కడ ఆర్చిబిషప్ అతని మెడను గొలుసులతో గోడకు బంధించి, రోజుకు ఒకసారి తన సేవకులచే కొట్టించు ఏర్పాట్లుచేసెను. మొత్తముమీద రిచర్డ్ బైఫీల్డు హస్ వలె హింసించబడి, స్మిత్ఫీల్డ్లో దహించబడెను. అది లండనులోని పరి. పౌలు దేవా లయమునకు ఉత్తరమున కలదు.
అదే కాలములో సుమారు క్రీ.శ. 1535 జాన్ టెక్స్బరి (John Tewkesbury) కూడ రిచర్డ్ బైఫీల్డువలే టిండేల్ ఆంగ్లములోనికి అనువాదముచేసిన క్రొత్త నిబంధన గ్రంథమును చదువుచున్నాడని, అది ‘పవిత్ర మాతృ సంఘము’ (Holy Mother Church) నకు వ్యతిరేకమైన నేరమని అతనిని నిర్బంధించిరి. అయితే టెక్స్బరి శ్రమలకు, హింసలకు భయపడి తాను చదివినవాటిలో రోమన్ కేథలిక్ మత సిద్ధాంత ములకు విరుద్ధమైనవాటిని తాను నమ్మలేదని చెప్పెను.
కొంతకాలము తరువాత అతడు పశ్చాత్తాపపడి, క్రొత్త నిబంధన గ్రంథములోని పరిశుద్ధ లేఖనములు యథార్థ మని, కేథలిక్ మత సిద్ధాంతములు అసత్యములని అంగీకరించెను. అందుకు వెంటనే అతనిని లండన్ బిషప్ ముందు నిలువబెట్టి ‘మూర్ఖపు మతద్రోహి’ అని నిందించి, చాల దారుణముగ హింసించిరి.
ఆ హింసలవలన అతడు స్మిత్ ఫీల్డు ఉరికంబము నొద్దకు తీసికొని వెళ్లునప్పటికే చాలవరకు చనిపోయెను. ఉరికంబమువద్ద రోమన్ కేథలిక్ మతముయొక్క దుష్టత్వమును, అవినీతిని
గూర్చి బిగ్గరగ చెప్పి, దేవునిదృష్టిలో తన నూతన విశ్వాసము న్యాయమైనదను గట్టి నమ్మకము తనకు కలదని తెలియజేసెను.
క్రీ.శ. 1536 లో దక్షిణ మధ్య ఇంగ్లాండులోని బ్రాడ్పోర్డు-ఇన్-విట్ షైర్ (Bradford-in-Wiltshire) లో ట్రాక్సనల్ (Traxnal) అను గ్రామస్థుడు కలడు. ఆరాధన సమయములో రొట్టె, ద్రాక్షారసము క్రీస్తు నిజశరీరము, రక్తముగ మారు ననియు మరియు పోపు స్త్రీ, పురుషులు మనఃస్సాక్షిమీద సంపూర్ణాధికారము కలదనియు బహిరంగముగ అంగీకరించకపోవుటవలన అతనిని సజీవదహనము చేసిరి.
తూర్పు ఇంగ్లాండులోని నార్విచ్లో క్రీ.శ. 1538వ సంవత్సరములో నీకొలాస్ పెకె (Nicholas Peke) ట్రాక్స్నలవలె కేథలిక్ సంఘ మూఢనమ్మకములను వ్యతిరేకించినందున సజీవదహనము గావించబడెను. డా. రీడింగ్ (Dr. Read- ing), డా. హెర్నె (Dr. Hearne) మరియు డా. స్క్రాగ్వెల్ (Dr. Spragwell) అను ముగ్గురు కేథలిక్ మతాధిపతులీకార్యక్రమమును నిర్వహించిరి.
నీకొలాస్ తారువలె నల్లగ వచ్చువరకు కాల్చబడినప్పుడు, డా. స్క్రాగ్వెల్ పొడవైన కఱ్ఱతో అతని కుడి భుజముమీద కొట్టి, ‘పెకె, వెనుతిరిగి కేథలిక్ సంఘ ఆరాధనను నమ్ము’ అని చెప్పగా, ఆ ఆరాధనను, నిన్నుకూడ నేను అసహ్యించుకొనుచున్నాను’ అని పెకె జవాబిచ్చి తన ద్వేషమునకు, బాధకు గుర్తుగా డా. స్క్రాగ్వెల్ మీద రక్తము ఉమ్మెను. ఇప్పుడైన నీకొలాస్ పైకె తన అభిప్రాయములను మార్చుకొంటే నలుబది దినముల పాపపరిహార పత్రికలిచ్చెదనని డా. రీడింగ్ ప్రలోభపెట్టెను. రీడింగ్ యొక్క అవివేకతకు నీకొలాస్ స్పందించక, క్రీస్తు నామముకొరకు బాధననుభవించుటకు ఆయన తనను యోగ్యునిగా లెక్కించినాడని సంతోషించెను.
ఎనిమిదవ హెన్రీ పాలనలో దహనము చేయబడిన మరియొక వ్యక్తి తూర్పు ఇంగ్లాండులోని సఫోక్ (Suffolk) గ్రామవాసియైన విలియమ్ లెట్టన్ (William Letton) అను ముసలి క్రైస్తవ సన్యాసి. కేథలిక్ సంఘముయొక్క ఉత్సవములో ఊరేగించుచున్న విగ్రహమునకు వ్యతిరేకముగ మాట్లాడినాడని విలియమ్ ను సజీవ
దహనము చేసిరి.
ప్రసిద్ధ రాజకీయవేత్తయైన థామస్ క్రామ్వెల్ (Thomas Cromwell) ను కేథలిక్ మతమునకు మరియు రాజైన ఎనిమిదవ హెన్రీకి ద్రోహి అని జూన్ 10న నిర్బంధించి, విచారణ లేకుండగనే దోషియని నిర్ణయించి క్రీ.శ. 1540, జులై 28న శిరచ్ఛేదము గావించిరి. శిరచ్ఛేదమునకు ముందు అతనిని ఘోరముగ హింసించిరి. క్రామ్వల్ ప్రజలనుద్దేశించి క్లుప్తముగ మాట్లాడి, మరణమునకు తన్నుతాను మౌనముగ అప్పగించుకొనెను. థామస్ క్రామ్వల్మెద మోపబడిన నేరములకు మతముతో సంబంధము లేకపోయినను, ఆ గొప్ప వ్యక్తిని హతసాక్షుల జాబితాలో చేర్చుట సబబు.
అదేకాలములో డా. రాబర్ట్ బార్నెస్ (Dr. Robert Barnes), థామస్ గార్నెట్ (Thomas Garnet) మరియు విలియమ్ జెరోమ్ (William Jerome) లపై మతద్రోహ నేరములు మోపి లండన్ బిషప్ యొక్క మతన్యాయస్థానము ఎదుటికి రప్పించిరి. ఆ ముగ్గురిని కాల్చిచంపవలెనని బిషప్ తీర్పుచెప్పగా, వారిని లండన్ టవర్లో నిర్బంధించిరి.
అనతి కాలములోనే క్రీ.శ.1540 జులై 30న స్మిత్ ఫీల్డ్కు తీసికొనివెళ్లి వారిని ఒకే స్తంభమునకు గొలుసులతో బంధించి, నిప్పు ముట్టించిరి. మంటలు వారి చుట్టు అలుముకొనినప్పుడు, ఆ ముగ్గురు హతసాక్షులు ఒకరినొకరు స్థిరధైర్యముతో ప్రోత్సహించుకొనిరి. ఆ ధైర్యము యేసుక్రీస్తునందలి నిజవిశ్వాసము వలన వారికి కలిగెను.
ఇది జరిగి ఎంతోకాలము కాకముందే థామస్ సోమర్స్ (Thomas Sommers) అను వ్యాపారిని, మరి ముగ్గురు వ్యక్తులను మార్టిన్ లూథర్ వ్రాసిన గ్రంథములలో కొన్నింటిని చదివినారని చెరసాలలో బంధించిరి. ఆలాగు వారు చదివిన గ్రంథములను చీప్సైడ్ (Cheapside) వ్యాపార కూడలినొద్దగల మంటలవరకు మోసికొనిపోయి, అక్కడ వాటిని అగ్నిలో విసరుటయే వారికి శిక్షగా విధించిరి. ఆ ముగ్గురు వ్యక్తులు ఆలాగుచేసిరి కాని, థామస్ ఆ గ్రంథములను అగ్నిలో పడకుండ విసరుటవలన అవి తగులబడలేదు. కనుక అతడు లండన్ టవర్కు తిరిగి పంపబడి, అక్కడ రాళ్లచే కొట్టబడి చంపబడెను.
అదే సమయములో థామస్ బైనార్డు (Thomas Bainard) ప్రభువు ప్రార్థన ఆంగ్లములో చేసినందుకు లింకన్ బిషప్న డా. లాంగ్లండ్ (Longland) భయంకర మతద్రోహి అని దూషించి, థామస్ను కొయ్యకు కట్టి కాల్పించెను. యాకోబు పత్రికను ఆంగ్లములో చదివినందుకు అదే శిక్ష జేమ్స్ మోర్టన్ (James Moreton) కు కూడ విధించెను. పాస్టరైన ఆంటోని పార్సన్స్ (Anthony Parsons) ను, ఈస్టువుడ్ (Eastwood) ను, మరియొక వ్యక్తిని డా. లాంగ్లండ్ సాలిస్బరి బిషప్ వద్దకు విచారణ నిమిత్తము పంపెను. అయితే సాలిస్బరి బిషప్ విచారణ పేరుతో కాలము వృధాచేయుట అనవసరము, ఆ ముగ్గురిని సజీవ దహనము చేయుమని తీర్పు చెప్పెను.
ఆ ముగ్గురిని సజీవదహనము చేయుటకు గొలుసులతో స్తంభమునకు బంధించి నప్పుడు పార్సన్స్ త్రాగుటకు నీళ్లు అడిగెను. ఇచ్చిన వెంటనే, ఆ నీళ్లను తన మిగిలిన ఇద్దరి సహచరులకు అందించి పార్సన్స్ ఈలాగు చెప్పెను : ‘సంతోషించండి, నా సహోదరులారా, మీ హృదయములను దేవునితట్టు ఎత్తుడి, రుచిలేని ఈ అల్పాహారము ముగించిన తరువాత మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు రాజ్యములో మనమిక మంచి భోజనము చేసెదము.’ పార్సన్స్ మాటలు ఈస్టువుడ్ విని, అతని కన్నులు, చేతులు ఆకాశమువైపు ఎత్తి, తన ఆత్మను త్వరగా చేర్చుకొనుమని పలికెను.
హంతకులు కట్టెలు, గడ్డిని వారిచుట్టు పేర్చగా, పార్సన్స్ కొంతగడ్డిని తీసికొని, తన గుండెలవద్ద పెట్టుకొని చూచుటకు వచ్చిన ప్రజలతో ‘ఇది దేవుని కవచము, నేను యుద్ధమునకు సిద్ధపడిన క్రైస్తవ సైనికుడను, క్రీస్తు యోగ్యతలద్వారా తప్ప, ఎవరి దయకొరకు నేను చూచుటలేదు. ఆయన ఒక్కడే నా రక్షకుడు, నా రక్షణకొరకు నేనాయనను విశ్వసించుచున్నాన’ని చెప్పెను.
నిప్పులు రగిలి, వారి శరీరములు కాలిపోయెను. కాని వారి ప్రశస్తమైన, శాశ్వతమైన ఆత్మలను ఏదీ నష్టపరచలేక పోయెను. దుర్మార్గముమీద వారి స్థిర విశ్వాసము విజయము పొందెను. వారి బోధలు హతసాక్షులను ప్రేమించువారి హృదయములలో ఎల్లప్పుడు నిలిచిపోయెను.
ఆనాటి రోమన్ కేథలిక్ మతాధిపతుల కఠినత్వము, ద్రోహములద్వారా క్రీస్తుయొక్క దైవిక అనుచరులు ఇంగ్లాండులో ఈ విధముగ హింసింపబడిరి. ఇంగ్లాండు శాసన సభలో రాజైన ఎనిమిదవ హెన్రీ దైవదూషణకరమైన చెడ్డ శాసనమును ప్రవేశపెట్టెను: ‘విక్లిఫ్ బోధించిన లేఖనములు చదివిన వారెవరైనను వారు తమ భూమిని, పశువు లను, వస్తువులను, చివరకు వారి శరీరములనుకూడ శాశ్వతముగ కోల్పోవుదురు. వారు దేవునికి ద్రోహులని, రాజుకు శత్రువులని, ఇంగ్లాండునకు సంపూర్ణ దేశ ద్రోహులని తీర్పు తీర్చబడుదురు.’
