పౌలు దమస్కు దర్శనము

పౌలు దమస్కు దర్శనము

ప్రశ్న:-

దమస్కుదారిలో పౌలుతో కూడ ప్రయాణము చేసిన మనుష్యులు స్వరము వినిరా, వినలేదా? అపొ. కార్య. 9:7 లో వినిరని యున్నది. 22:9 లో వినలేదని యున్నది. ఏది ఒప్పు? ఏది తప్పు?

జవాబు:-

అనేకుల భావమేదనగా బైబిల్లో తప్పులెన్నోయున్నవి – వాటినెత్తి చూపుతామని యిట్లు వ్రాస్తారు. అయితే బైబిల్ తప్పని నిరూపించగలిగితే పునాది కదిలిపోయినది. నీతిమంతుల పునాది పాడైపోతే వారేమి చేయగలరు? అయితే బైబిలు యెప్పుడైన మనుష్యుల చమత్కారముచేత తప్పని తీర్చబడుతుందా? తీర్చబడదు. ఆ వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

1 పేతురు 1:24; కీర్తన 119:89 చెప్పుచున్నది వాస్తవము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ప్రశ్నవేసిన ఆయన తాను చూచిన రెండు వాక్యములతో మూడవదిగా అపొ. కార్య. 26:14 కలిపియుంటే మంచిది. 9:7; 22:9; 26:14- ఈ మూడు వచనములలోనున్న సంగతి యొకటే వాక్యముగా స్వరమనేది కనబడుచున్నది.

9:7 లో వ్రాసినట్లు పౌలుతో కూడనుండిన మనుష్యులు ఆ స్వరము వినిరి. అయితే 26:14 లో తేటగా హెబ్రీ భాషలో వినబడిన ఆ స్వరము సౌలును అన్వయించి యుండెనని తెలియుచున్నది. ఒక స్వరము నాతో పలుకుట వింటినని వ్రాయబడినది. అవును, సౌలా! సౌలా! నీవేల నన్ను హింసించు చున్నావని చెప్పినది. ఆ పని మనుష్యులకేమి పట్టినది? అసలు ఆ మాటలు వారికి అర్థమే కాలేదు. ఆ మాటలు వారివి కావు. ఆ మాటలు వారికి సంబంధించినవి. కావు కాబట్టి 22:9 లో వ్రాసినది సరిగానే యున్నది.

నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు. శబ్దమేమో గుర్తొయెను. గొప్ప ప్రకాశము ప్రకాశించెనని తెలిసినది. అయితే జరిగిన సంభాషణ వారికి తెలియక పోయెను. వట్టి పిలుపు మాత్రము వచ్చినది కాదు, ఆ దారిలో గొప్ప సంభాషణ జరిగెను. 9:4-6 చూడండి.

సౌలును పేరు పెట్టి పిలిచిన సంగతి ఆ భాగమందు కొద్దిగానే వివరింపబడినది. గాని పౌలు ఆ తరువాత అగ్రిప్ప రాజునెదుట సంగతి వివరించి చెప్పగా 9:4-6 లో వ్రాయబడని యెన్నో మాటలు జరిగినట్టు వివరముగా వ్రాయబడినది – 22:15-18 చూడండి.

నిన్ను పరిచారకునిగాను, సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నానని క్రీస్తే అలనాడు దర్శనముతోకూడ కొంతసంభాషణ క్రిందపడిన సౌలుతో జరిపెను. అదంతయు 9:4-6 లో వ్రాయబడియున్నదా? లేదు. మరియు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని 26:14 లో వ్రాసినది 9:4-6 లో లేనే లేదు. ఎందుకు లేదు? ఒక స్థలమందు వ్రాసినది, క్లుప్త వివరముతో నుంటుంది. మరొక భాగము చూస్తే పూర్తిగా దాని వివరాలివ్వబడుతుంది. భాగము లన్నియు నొకటిగా కలిపితే విషయము వికసించును.

ఆ మనుష్యులు జరిగిన సంభాషణ వినిరా? ఎక్కడిది? శబ్దము మట్టుకేమో ఆ స్వరము వినిరి. (9:7). అయితే పౌలుతో పలికిన మాటలు వారు వినలేదు గనుక పౌలుతో మాటలాడినవాని స్వరము వారు వినలేదని 22:9 లో వ్రాసినది తప్పు కాదు. ఎందుకంటే 26:14 లో నున్నట్లు కేవలము ఆ స్వరము సౌలుతోనే పలుకబడినది. 22:9 లో ఆ వెలుగు చూచిరని యున్నది గాని 9:7 లో యెవనిని చూడక మౌనులై నిలువబడిరనియున్నది.

దీనిలోకూడ తప్పు వచ్చినదా? రాలేదు. మొత్తానికి ప్రకాశించిన గొప్ప వెలుగు జూచిరి. అయితే వెలుగులో నుండిన క్రీస్తును వారు చూచినది అబ్బినదా? అంతమట్టుకు వారికేమియు తెలియలేదు. శబ్దమేమో వినిరి, స్వరమేమో వినిరి. ప్రత్యేకముగా పలుకబడిన మాటలేమో వారు వినలేదు. అంతే దీని వివరము.

క్రీస్తు యోహాను 12:28 లో చేసిన ప్రార్థన నాలకించి జవాబిచ్చుచు నేను నా నామమును మహిమపరచితిని. మరల మహిమపరతునని ఆకాశమునుండి శబ్దముగా దేవుడు పలికితే ప్రజలేమనిరి?

1) ఉరిమెననిరి. 2) దేవదూత యొకడాయనతో పలికెననిరి. అవును, శబ్దమేమో వారు వినిరి. అయితే శబ్దములోని మాటలు క్రీస్తుకే గాని వారికేమి తెలిసెను? గ్రీకు భాషలో స్వరము అనేది ఫోనే యని వచ్చినది. 9:7; 22:9; 26:14 వచనములలో అగుపడే వాక్కు అదే. ఫోనే అనే గ్రీకు శబ్దములో టెలిఫోను అనే ఇంగ్లీషు పద ముద్భవించినది. ఇప్పుడు పెద్దపెద్ద ఆఫీసులలోను రైలు స్టేషన్లలోను టెలిఫోన్ అనేది యున్నది. దానిలో నొకరికొకరు దూరముగా నుండినను ఆ టెలిఫోనుద్వారా నొకరితో నొకరు మాటలాడగలరు.

టెలిఫోను శబ్దము వేరు. టెలిఫోను మాటలు వేరు. టెలిఫోను కొట్టితే ఆ గంట శబ్దము చాలమందికి వినబడుతుంది. టెలిఫోను స్వరము వింటిరా అంటే వింటిమంటారు. సరిగాని టూకీగా మాటలాడుట యొకటి: పూర్తిగా మాటలాడుట మరొకటి. టెలిఫోనులో ఫలాని మనుష్యుడు కావలసివచ్చి నప్పుడాయన పేరు చెప్పుదురు. ఆయన దగ్గరకు వెళ్లి చెవికి ఆ టెలిఫోను భాగము పెట్టుకొని తన్ను పిలిచిన వానితో సంభాషిస్తాడు. దగ్గిరనుండి చెవికి ఆ చిన్న సామాను పెట్టుకొనిన వానికేగాని రెండవవానికి టెలిఫోనులో జరిగిన సంభాషణ తెలుసునా? తెలియదు.

పరలోకమునుండి ఆనాడు టెలిఫోను కొట్టినది గట్టి శబ్దముతోను పెద్ద వెలుగు సమేతముగాను కొట్టినది. ఆ మనుష్యులు ఆ వెలుగును జూచి ఆ టెలిఫోను శబ్దము వినిరి గాని టెలిఫోనులో జరిగిన సంభాషణ వారికి గుర్తుకాలేదు. ఆ స్వరము వినిరి. మరొకప్రక్క జూస్తే అది వారి నిమిత్తము రానందున వారా స్వరము వినలేదని స్పష్టమగుచున్నది. దీని వివరమిది. ఇది చదివి బైబిల్లో తప్పులున్న వంటారా? లేక శిరసావహించిన క్రీస్తుకును బైబిలుకును విధేయులగుదురా? మీరే దీనికి జవాబియ్యవలయును.

Leave a Comment