విశ్వాస పథము (అధ్యాయము 11)
మూడవ అధ్యాయములో విశ్వాసులు ‘పరలోక సంబంధమైన పిలుపులో పాలివారు’ అని పిలువబడియున్నారు. అనగా భూలోకము నుండి మనము పరలోకమునకు పిలువబడియున్నాము.
9వ అధ్యాయ ములో పరలోకము విశ్వాసికొరకు సంపాదించబడినట్లు తెలిసికొన్నాము. ఎందుకనగా దేవుని సముఖమందు కనిపించుటకు క్రీస్తు పరలోకమందే ప్రవేశించెను.
10వ అధ్యాయములో క్రీస్తు చేసిన కార్యమువలన విశ్వా సులు పరలోకమునకు యోగ్యులుగా చేయబడియున్నారు. దానిద్వారా వారు తెరలోపల ప్రవేశించి పారలౌకిక ఆనందము అనుభవించగలరు.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
ఈ 11వ అధ్యాయములో పరలోకపు వ్యక్తి ప్రయాణము చేయవలసిన మార్గము వివరించబడినది. ఆదినుండి అంతమువరకు అది “విశ్వాస పథము” అని స్పష్టముగా బోధించబడినది.
ఈ అధ్యాయమంతయు హబక్కూకు ప్రవక్త గ్రంథమునుండి ఉదహరించిన లేఖన భాగముయొక్క అద్భుత వెల్లడింపు. 10వ అధ్యాయము చివరిలో “నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును” అని ఉన్నది.
ఈ పత్రిక ఎవరికి వ్రాయబడినదో గుర్తుంచుకొనినయెడల ఈ అధ్యాయమంతయు ‘విశ్వాసము’నకు సంబంధించిన సంఘటనేయని గ్రహించగలము.
విశ్వాసి ఆధారపడి జీవించవలసిన గొప్ప సూత్రము ఇందు విడమర్చి చెప్పబడినది. వెలి చూపునకు ప్రాధాన్యత నిచ్చు మత వ్యవస్థనుండి వచ్చిన ఈ హెబ్రీ విశ్వాసులకు విశ్వాస పథమును అంగీక రించుట కష్టమై ఉండవచ్చును.
యూదా మత వ్యవస్థ అంతయు మనోజ్ఞ మగు దేవాలయము చుట్టూ పెనవేసుకొని ఉన్నది. దాని బలిపీఠములు, జంతుబలులు, అందమైన వస్త్రములు ధరించి బలులు అర్పించు యాజ కులు, నియమిత సంప్రదాయము ప్రకారము ఎన్నో రకముల ఆచారము లను జరిగించెడివారు.
అయితే వారు కొనిరాబడిన ఈ క్రైస్తవ్యము వీటన్నిటిని ప్రక్కకు పెట్టినది. క్రైస్తవ్యములో అంతయు విశ్వాసమే. వెలిచూపువలన ఏదియు లేదని ఈ విశ్వాసులు తెలిసికొనవలసియున్నది. పైగా, యూదా మతములోని దృశ్యమానమగు వస్తువులు రాబోవుచున్నవాటి మేలుల ఛాయమాత్రమే.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం
క్రైస్తవ్యములోని అదృశ్యమైనవి నిజస్వరూపములు. వారు యూదా మత శిబిరము వెలుపల ఉండి అవమానమును భరించుచు క్రీస్తు ఉన్న స్థలమునకు వెళ్లవలెనని పిలువబడి యున్నారు.
వెలుపలికి వచ్చిన తరువాత “వెనుకకు మళ్ళవద్దని” అపొస్తలుడు హెచ్చరించు చున్నాడు. అపొస్తలుని హెచ్చరికలు, ప్రోత్సాహక వచనములు నేడును మనకు ఎంతో ప్రయోజనకరములు.
నేటి క్రైస్తవ లోకము చాలా దూరము వెనుకకు వెళ్ళిపోయినది. 10:38,39 వచనములలో చెప్పినట్లు పూర్తి అర్ధములో కాకపోయినను కొంతమేర వెనుకకు వెళ్ళిపోయి ఉన్నారు. అయితే 10:38 లో చెప్పబడినది అక్షరాలా భ్రష్టత్వమును అనుకరించు టలో క్రైస్తవ లోకము దిగజారెను.
నేడు క్రైస్తవ లోకము యూదా మతమును అనుకరించుచు, గొప్ప దేవాలయములు నిర్మించుకొనుచు, మనిషి వెలి చూపును ఆకర్షించు విస్తార ఆచారములను నిర్వహించుటకు అధికార యాజకులను నియమించుకొనుట చేయుచున్నారు. క్రొత్త జన్మ, రక్షణ మొదలగువాటి ప్రస్తావనే ఎత్తుటలేదు.
ఈ విధముగా క్రైస్తవ లోకము పూర్తిగా క్రైస్తవ్యమును విడిచిపెట్టి యూదా మతమునకు మళ్ళుట లేదు గాని, యూదా మతమును క్రైస్తవ్యమును కలుపుటకు ప్రయత్నము చేసి యున్నారు.
ఫలితముగా క్రైస్తవ లోకము ప్రాముఖ్యమగు క్రైస్తవ సత్యము లను పోగొట్టుకొనియున్నది. నిజమైన విశ్వాసిమాత్రమే వాటిలో ప్రవేశించ గలడు. ప్రకృతి సంబంధిమాత్రము యూదా మతములోని బాహ్య వస్తువులను మిగుల్చుకొనియున్నాడు.
ఈ గొప్ప అధ్యాయములో విశ్వాస పథములో ప్రవేశించి నిజస్వరూప ములను, దేవుని ప్రాముఖ్యమైన సత్యములను తెలిసికొని ఆనందించునట్లు ఛాయలను వెనుక విడిచిపెట్టుదము. అన్ని యుగములలోను దేవునితో గట్టి సంబంధము కలిగించునది విశ్వాసమేయని తెలిసికొందము.
మొదటి మూడు ప్రారంభ వచనముల తరువాత అధ్యాయమంతయు మూడు ముఖ్య భాగములుగా విభజింపబడినది. మొదటి భాగము 4-7 వచనములు. మనము దేవుని సమీపించి, రాబోవు తీర్పునుండి తప్పించుకొను గొప్ప సూత్రము ‘విశ్వాసము’ అని వివరించుచున్నది.
రెండవ భాగము 8-22 వచనములు. ఇందు విశ్వాస వీరుల జాబితా ఇవ్వబడినది. వీరందరూ రాబోవు లోకముకొరకు దేవుని సంకల్పములను గట్టిగా చేపట్టుకొనిరి. దానిద్వారా వారు ఈ లోకమందు యాత్రికులుగాను, పరదేశులుగాను నడచుకొనగలిగిరి.
మూడవ భాగము 23-38 వచనములు. అపవాది శక్తులను, ప్రస్తుత లోకమును, దాని ఆకర్షణలను, కష్టములను విశ్వాసము జయించుట వివరించబడినది.
పరిచయము (1-3 వచనములు).
(వచనము 1). ఈ పరిచయ వచనములు ‘విశ్వాసము’ అను గొప్ప సూత్రమును వెల్లడించుచున్నవి. మొదటి వచనమును నిర్వచనమనుట కంటే, విశ్వాస ప్రభావమునుగూర్చిన ప్రకటన అనవచ్చును.
విశ్వాస మనగా ఏమిటో అనిగాక, విశ్వాసము ఏమి చేయునో ఆ వచనము వివ రించుచున్నది. విశ్వాసము నిరీక్షించువాటిని నిజముచేయును.
మనము వేటికోసమైతే ఎదురుచూచుచున్నామో వాటిని మన ఆత్మకు వాస్తవ ములుగా చేయును. అదృశ్యమైనవి ఉన్నవి. అని మనలను ఒప్పించును.
అదృశ్యమైనవి విశ్వాసికి ఎంత వాస్తవమగుననగా అవి నిజముగా తన యెదుట ఉన్నట్లు అతడు భావించును. “ఎందుకనగా దృశ్యమానమైన వాటిలో మోసమున్నది” అని జె. యన్. డార్బీ అను భక్తుడు చెప్పెను.
(వచనము 2). విశ్వాసముద్వారా పెద్దలు మంచి సాక్ష్యము పొందిరి. వారు మంచి సాక్ష్యము పొందుటకు కారణము వారు చేసిన పనులు, వారి జీవితము కాదు. వారి విశ్వాసమే.
వారందరును మనవంటి స్వభావముగల స్త్రీ పురుషులే. వారి జీవితాలలో ఎన్నో అపజయాలు ఎదురైనవి. వారి పనులను దేవుడు ఖండించిన సందర్భములు లేక పోలేదు.
ఇన్ని అపజయములున్నను వారు దేవునియందు విశ్వాస ముంచుటవలన గుర్తించబడిరి. వారి మంచి సాక్ష్యము వినిన తరువాత, అధ్యాయము చివరిలో విశ్వాసముద్వారా వారు మంచి సాక్ష్యము పొందినట్లు మరియొకమారు చెప్పబడినది.
(వచనము 3). ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మించబడిన వని విశ్వాసముద్వారా గ్రహించుచున్నాము.
ప్రకృతి సంబంధియైన మానవుడు హృదయమందు దేవునితో శత్రుత్వము కలిగియుండి ప్రపంచ నిర్మాణము దేవుడు లేకుండా జరిగినట్లు హేతుబద్ధముగా ఆలోచించును.
ప్రపంచ నిర్మాణము పదార్థములోను, ప్రకృతి శక్తులలోను అతడు కనుగొనవలసివచ్చును. ఫలితముగా అతడు చీకటిలో తడబడుచూ తన ఊహలందు స్పష్టమైనదేదీ గ్రహించకుండును.
ఒక తరమువారు జ్ఞానాంతమని సంతోషముగా అంగీకరించిన సిద్ధాంతములను తరువాతి తరమువారు అవి నమ్మదగినవి కావని తిరస్కరించుచున్నారు. మనిషి దృశ్యమానమైనవాటిపైననే దృష్టి నిలుపుచున్నాడు.
అయితే దృశ్యమానమైన వాటిలోనుండి సృష్టి జరుగలేదని దేవుడు స్పష్టముగా తెలియజేయు చున్నాడు. హేతువును ఆధారము చేసికొని మనుష్యులు పరస్పర విరుద్దమైన ఊహలలో పడిపోవుదురు.
విశ్వాసి ప్రపంచములు ఏలాగు నిర్మితమైనవో విశ్వాసముతో గ్రహించును. పదార్థము పదార్థమునుండి ఉత్పత్తికాలేదు. దృశ్యమానమగునవి కనిపించు వస్తువులనుండి ఉత్పత్తి కాలేదని మనమెరుగుదుము.
ప్రపంచములు “దేవుని వాక్యమువలన” కలిగినవని విశ్వాసము ఎరుగును. ఆ విధముగా ప్రారంభ వచనములు మూడు గొప్ప విశ్వాస సూత్రములను వెల్లడించుచున్నవి.
మొదటిది, అదృశ్యమైనవాటిని విశ్వాసము వాస్తవము చేయును. రెండవది, విశ్వాసులకు మంచి సాక్ష్యము కలిగించును. మూడవది, మానవ జ్ఞానమునకు మించిన వాటిని గ్రహించెడి జ్ఞానము ఈ విశ్వాసము అనుగ్రహించును.
విశ్వాసముతో దేవుని సమీపించుట (4-7 వచనాలు).
పరిచయ వాక్యముల తరువాత అధ్యాయములోని మొదటి ముఖ్య విభాగమునకు వచ్చియున్నాము. ఇందులో దేవుని సమీపించు గొప్ప సూత్రము విశ్వాసమని చెప్పబడినది.
ఈ సూత్రము హేబెలుతో వెల్లడించ బడి, మరణమునుండి తీర్పునుండి తప్పించుకొనిన నోవహునందు చూపెట్టబడినది. విశ్వాసముద్వారా విశ్వాసి దేవునితో సవ్యమైన సంబం ధము కలిగియుండెను.
(వచనము 4). పాపి దేవుని సమీపించు ఒకే ఒక మార్గము హేబెలుతో వెల్లడించబడినది. హేబెలు తాను పాపియని, దేవుడు పరిశుద్ధుడని, ఆయన పాపమును దాటిపోడని ఎరుగును.
అలాగైన యెడల తనకు దేవునితో సఖ్యత ఎట్లు కలుగును? మరణ శిక్షక్రింద ఉన్న పాపి ఎన్నుకొను ఒకే ఒక మార్గమును హేబెలు విశ్వాసముతో అనుసరించెను.
పాపములేని ఒక జంతు మరణముద్వారా అతడు దేవుని సమీపించెను. హేబెలు బలి దేవుని గొర్రెపిల్లయగు క్రీస్తు బలిని సూచించు చున్నది. కనుక హేబెలు నీతిమంతుడని అతని అర్పణలనుబట్టి దేవుడు సాక్ష్యమిచ్చెను.
దేవుడు హేబెలు జీవితమును గూర్చిగాని, విశ్వాసమును గూర్చిగాని సాక్ష్యమియ్యలేదు. అతడు విశ్వాసముతో తెచ్చిన బలినిగూర్చి సాక్ష్యమిచ్చెను. పాపి ఆశీర్వాదము పొందు ఏకైక మార్గము ఇంకను ఇదే.
యేసునందు విశ్వాసముంచి, ఆయన బలిని అభ్యర్థించినయెడల నీతిమంతుడని సాక్ష్యము పొందును, “ఆయనయందు విశ్వాసముంచు వారందరును నీతిమంతులుగా తీర్చబడిరి” అని అట్టివారినిగూర్చి చెప్పబడినది.
కనుకనే హేబెలు మరణించినను మాటలాడుచున్నాడు. పాపి ఆశీర్వాదము పొందు విశ్వాస మార్గమునుగూర్చి అతడు ఇంకను మాటలాడుచున్నాడు.
(వచనములు 5,6). హనోకులో మరియొక విశ్వాస లక్షణమును అనగా మరణమునుండి తప్పించబడుటను మనము చూచియున్నాము. “విశ్వాసమునుబట్టి హనోకు మరణము రుచిచూడకుండునట్లు అతడు కొనిపోబడెను” అని వ్రాయబడినది.
వెలిచూపు, హేతువు మొదలగు వాటన్నిటికి భిన్నముగా అతడు మరణము చూడక కొనిపోబడుదునని నమ్మెను. మానవ చరిత్రలో అంతకుముందెన్నడూ జరగని సంఘటన జరుగునని విశ్వాసముమాత్రమే కనిపెట్టును.
నేడు విశ్వాసి కనిపెట్టునది మరణముకొరకు కాదుగాని కొనిపోబడుటకే. క్రైస్తవ లోకమందు ఎన్నడూ జరగని అసమానమైన సంభవము కోసము మనము ఎదురుచూచు చున్నాము.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం
బూర ధ్వని శబ్దముతో మధ్యాకాశమునకు వచ్చు ప్రభువును ఎదుర్కొనుటకు, ఆయన పిలుపుకొరకు మనము కనిపెట్టుచున్నాము. ప్రకృతి సంబంధి భూలోకములో తన చరిత్ర ముగియునని భయముతో మరణమును చూచుచున్నాడు.
విశ్వాసము మాత్రమే మరణముగుండా వెళ్ళక, కొనిపోబడుదుమని నమ్మును. ఆదికాండము చరిత్రలో హనోకు విశ్వాసమునుగూర్చి ఏమియు చెప్పబడలేదు కాని, అతడు “దేవునితో నడిచినట్లు” రెండు పర్యాయములు చెప్పబడినది.
“అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను” అని ప్రస్తావించినప్పుడు ఈ సత్యమునే అపొస్తలుడు వెల్లడించియున్నాడు. ఈ సాక్ష్యము ఆధారముగానే హనోకు విశ్వాసము గలవాడని అపొస్తలుడు వాదించుచున్నాడు.
ఏలయనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునియొద్దకు వచ్చువారు దేవుడున్నాడని నమ్ముట మాత్రమేకాదు, తనను శ్రద్ధతో వెదకువారికి ఫలము దయచేయుననియు నమ్మవలెను.
(వచనము 7). విశ్వాసముద్వారా తీర్పును తప్పించుకొనుట ఎట్లో నోవహునందు చూచెదము. రాబోవు తీర్పును గూర్చి దేవుడు నోవహును హెచ్చరించినప్పుడు ముంచుకొనివచ్చు ప్రమాద ఛాయలేమియు బొత్తిగా కనిపించలేదు.
దేవుడు హెచ్చరించిన సమయములో తీర్పు అనుదానిని “అదివరకు చూడలేదు”. కనిపించు వస్తువుల విషయానికొస్తే అన్నియు ఎప్పటివలెనే జరుగుచుండెను.
ఆ రోజులలో మనుష్యులు తినుచు, త్రాగుచు, పెండ్లిచేసికొనుచు, పెండ్లికిచ్చుచు నుండిరి అని ప్రభువు చెప్పు చున్నాడు. అయితే విశ్వాస వీరుడైన నోవహు, దేవుని హెచ్చరికను నమ్మి, భయముతో జీవించి దేవుడు చేసిన ఏర్పాటును వినియోగించుకొని, ప్రపంచమును నాశనము గావించిన తీర్పునుండి తప్పించుకొనెను.
దేవుడు రాబోవు తీర్పును గూర్చి ఇచ్చిన సాక్ష్యమును తిరస్కరించిన ఆనాటి లోకముపై నోవహు తాను నడిచిన విశ్వాస పథముద్వారా నేరస్థాపన చేసెను. అందువలన దేవుని వాక్యమందు విశ్వాసముంచి నీతిమంతుడుగా తీర్చబడిన విశ్వాసుల జాబితాలో అతడు స్థానము పొందెను.
విశ్వాసముతో రాబోవు లోకమును గట్టిగా పట్టుకొనుట. (8-22 వచనములు)
ఎనిమిదవ వచనమునుండి ఈ అధ్యాయములోని మరియొక భాగములో ప్రవేశించుచున్నాము. రాబోవు లోకముపట్ల దేవుని ఉద్దేశ్య మేమిటో తెలిసికొని విశ్వాసము దానిని హత్తుకొనుట ఈ భాగములో వెల్లడించబడినది.
దీనిద్వారా ఆ విశ్వాసి ప్రస్తుత లోకమందు యాత్రి కునిగా, ప్రయాణికునిగా జీవించగలుగుచున్నాడు. ఇరవై రెండవ వచనము వరకు ఉన్న ఈ భాగములో అయిదుగురు పాత నిబంధన భక్తుల పేర్లు ప్రస్తావించబడియున్నవి. అబ్రాహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు అను ఈ అయిదుగురిలో
ఒక్కొక్కరిలో ప్రత్యేక విశ్వాస లక్షణము లున్నవి. అయితే అందరును రాబోవు మహిమగల లోకముకొరకు ఎదురుచూచిరి.
(వచనము 8). రాబోవు లోకము విషయమైన దేవుని సంకల్పమును విశ్వాసముతో గట్టిగా పట్టుకొని, ఈ లోకములో యాత్రికునిగా పరదేశిగా జీవించినవారిలో అబ్రాహాము ప్రముఖుడు.
దేవుడు అబ్రాహామును తన దేశమును విడిచి వెళ్ళమనగా, వెళ్ళి ఆ దేశమందు మరియొక దేశము కొరకు ఎదురుచూచుచు జీవించెను. ఒక వ్యక్తిని దేవుడు ఈ లోకమునుండి పిలిచినాడనగా, అంతకంటే శ్రేష్ఠమైన లోకమందు ప్రవేశపెట్టుటకే పిలిచి యుండును.
స్తెఫను యూదుల సభ యెదుట తన సందేశమును “మహిమ గల దేవుడు మన పితరుడగు అబ్రాహాముకు ప్రత్యక్షమై” అను మాటలతో ప్రారంభించినది ఇక్కడ గమనించదగిన విషయము. అది ఒక అద్భుతమైన ప్రకటన.
అయితే అంతకంటే అద్భుతమైన ప్రకటన స్తెఫను సందేశము చివరలో ఉన్నది. ఆకాశమువైపు కన్నులెత్తి, దేవుని కుడిపార్శ్వమున యేసు నిలుచుండుట చూచి, ఈ పిలుపులోని ఆరంభము మహిమగల దేవుడు ఒక వ్యక్తికి భూలోకములో కనిపించుట. ముగింపు మహిమగల దేవునితో ఒక వ్యక్తి పరలోకమందు కనిపించుట.
యేసుప్రభువు మహిమలో తన స్థానము నాక్రమించుట అబ్రాహాము మసక మసకగా చూచినదానిని మనము తేటగా చూడగలుగుచున్నాము. దేవుని పిలుపువల్ల కలుగు పరిపూర్ణ ఫలమిదే.
అబ్రాహామువలె మనముకూడ దేవుని సంకల్పానుసారముగా పిలువబడియున్నాము. దేవుడు మనలను ఈ లోకమునుండి పిలిచి మహిమగల తన రాజ్య మందు పాలివారినిగా చేసెను.

అబ్రాహాములో మనము చూచినది దేవుని పిలుపుకు చక్కని నిదర్శ నము మాత్రమే కాదు, విశ్వాసముతో బదులు చెప్పిన బలమైన ఉదాహరణ అని కూడ చూడగలము.
అబ్రాహాము మొదట “ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను” అని చదువుచున్నాము. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక స్వదేశమును వదలి వెళ్ళుట ప్రకృతి సంబంధియైన వానికి పిచ్చిగా, వివేక శూన్యతగా తోచును. అయితే విశ్వాసము వెలుగొందు అవకాశమిదే.
అబ్రాహామును దేవుడు పిలిచెను. ఎక్కడికి నడిపించవలెనో ఆయన ఎరుగును. అబ్రాహామునందు పిలుపుకు తగిన విశ్వాసమున్నది. కొన్ని పర్యాయములు దేవుని వాక్యమునకు విధేయులై విశ్వాసపుటడుగు వేసినందున ఫలితమేలాగుండునోయని ఆలోచించు దుము.
అందువలన ఆ అడుగువేయుటకు వెనుకాడుదుము. మానవ వివేకము ఫలితములను నిశితముగా పరిశీలించును. అయితే దైవికమగు విశ్వాసము విధేయతతో ఫలితమును దేవునికి విడిచిపెట్టును.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం
(వచనము 9). రెండవది, అబ్రాహాము విశ్వాసముతో బయలువెళ్ళుట మాత్రమేగాక పాత ప్రదేశమును విడిచిన తరువాత నూతనమైనది పొందువరకు విశ్వాసముతోనే నడచెను.
ఆ విధముగా ఇస్సాకు, యాకోబులు అబ్రాహాముతోకూడా యాత్రికుడు, పరదేశి లక్షణములు పొందిరి. అబ్రాహాము నివసించినది పరదేశము, తాను గుడారములలో నివసించు పరదేశి.
ఈనాడు క్రైస్తవుల విషయంలోకూడ ఇది వాస్తవము కాదా? మన చుట్టూ ఉన్న లోకమునుండి మనము పిలువబడియున్నాము. అయితే మనము వెళ్ళనైయున్న నూతన లోకములో మనమింకను ప్రవేశింపలేదు.
ఈ మధ్యకాలమందు మనము ఈ లోకములో పరదేశులము, మరియొక లోకమునకు వెళ్ళు యాత్రికులము.
(వచనము 10). మూడవది. అబ్రాహాము పునాదులుగల పట్టణము కొరకు ఎదురుచూచెను. దాని కర్త, నిర్మాణకుడు దేవుడే. అబ్రాహాము పరదేశములో యాత్రికునిగా ఉండగా, అతనిని నడిపించినదేమిటో ఇక్కడ గ్రహించుచున్నాము.
దేవుడు తన ప్రజలకు దాచియుంచిన భవిష్యత్ ఆశీర్వాదముకొరకు అబ్రాహాము ఎదురుచూచెను. అబ్రాహాము జీవించిన కాలమందు తన చుట్టూ ఎన్నో పట్టణములున్నవి.
అయితే, నేటివలెనే నాడు కూడా అవి నీతియుక్తమగు పునాది గలవి కావు. ఈ కారణము చేతనే మానవుల పట్టణములు నాశనమునకు గురికానున్నవి. అబ్రాహాము దేవుని పట్టణముకొరకు ఎదురుచూసెను.
అది నీతి పునాది కలది, దానికి చలనము లేదు. ఈ పట్టణము “జీవముగల దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేము” అని 16వ వచనము, 12:22 లనుబట్టి తెలియుచున్నది. అబ్రాహాము ఆ విధముగా రాబోవు లోకపు వెలుగులో విశ్వాసపుటడుగు వేసెను.
ప్రకృతి సంబంధులకు దృశ్యమానమగు లోకమును వదలి, కనిపించని లోకముకొరకు కనిపెట్టుట ఎంతో అవివేకముగా అనిపించును. అయితే విశ్వాసము ఆ పట్టణముకొరకు ఎదురుచూచును.
దుఃఖము, ఏడ్పు, మరణము, రాత్రి లేని ఆ సుందర పట్టణమైన పరలోక యెరూషలేమును చూచినప్పుడు అబ్రాహాము చేసిన తీర్మానము, మనమందరము చేసుకున్న తీర్మానము ఎంత సక్రమమైనదో అప్పుడు అర్థమగును.
అబ్రాహామును, అతని అడుగుజాడలలో నడచుకొను మనమందరమును ఆ పట్టణముకొరకు ఎదురుచూచుచు ఈ లోకములో యాత్రికులు, పరదేశులుగా ఉండుటకు తీర్మానించుకొనియున్నాము.
(వచనములు 11, 12). విపరీతమగు కష్టములలో విశ్వాసముతో దేవునివైపు చూచుటయే కాదు, ప్రకృతి సంబంధముగా అసాధ్యములగు వాటిలోకూడా దేవునియందు నమ్మికయుంచుటను శారాయందు మనము నేర్చుకొనగలము.
ఆమె కుమారునికొరకు సాధారణ పద్ధతులను అవలం బించలేదు, “ఇది ఏలాగు సాధ్యమని?” హేతువు అడుగలేదు. తన స్వంత విధానములో తన మాటను నమ్మకముగా నెరవేర్చు దేవునియందే ఆమె నమ్మికయుంచెను.
దేవుడు ఆమె విశ్వాసమును మన్నించి, “వయస్సు గతించినదైనను” ఆమెకు కుమారుని అనుగ్రహించెను. ఆ విధముగా దేవుడు తన సంకల్పమును నెరవేర్చుటకు తన స్వంత విధానములో “మృతతుల్యుడైన ఒకనినుండి” అసంఖ్యాకులను పుట్టించెను. దేవుని విధానములు ఎప్పుడూ అంతే.
నిరీక్షణకు ఆధారములేని పరిస్థితులలో, బలహీన పాత్రలద్వారానే తన సంకల్పమును నెరవేర్చుకొనును.
ఆయన బలహీనతలో బలమును, తినుదానిలోనుండి తీపిని, మరణములోనుండి జీవమును “మృతతుల్యుడైన ఒక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రతీరమందలి ఇసుకవలెను” రప్పించును. “కావున అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను”,
(వచనములు 13-16). ఈ పరిశుద్ధులందరు విశ్వాసముగలిగి జీవించుట మాత్రమేకాదు, “వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను విశ్వాసముగలవారై మృతినొందిరి” అని చెప్పబడియున్నది.
మరణించి నందున అద్భుతమగు వారి జీవిత వృత్తాంతములను దేవుడు మనకు ఇచ్చియున్నాడు. వారి చరిత్రను గమనించినచో ఎన్నో వైఫల్యములు కనబడును. వారు మనవంటి స్వభావముగల మనుష్యులే!
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం
అయితే వారి వైఫల్యములను మన హెచ్చరికకొరకు దేవుడు గ్రంథ స్తము చేయించియున్నాడు. ఇక్కడ వారి అపజయములన్నిటిని విస్మరించి, దేవుని కృపామూలమైన వారి ఫలమును మాత్రమే దేవుడు వ్రాయించి ఉంచెను. ఈ వచనములు మన పితరులపైని శిలాఫలకమువలె ఉన్నవి.
మొదటిది : వారు దృశ్యమానమైనవాటికి ఆవల చూచినట్లు చెప్పబడి నది. వారు దూరమునుండి “వాగ్దానములను” చూచిరి. భవిష్యత్ మహిమను గూర్చిన నిశ్చయత వారి మనస్సులలో బలముగా నాటుకొనినందున, వారు హృదయపూర్వకముగా మహిమనుగూర్చిన నిరీక్షణను చేపట్టిరి.
రెండవది : భవిష్యత్తులో కలుగు మహిమనుగూర్చిన నిరీక్షణను చేపట్టినందున అది వారి జీవితములలో గొప్ప ప్రభావము చూపినది. వారు భూమిమీద యాత్రికులము, ప్రయాణికులమని ఒప్పుకొనిరి.
మూడవది : తాము యాత్రికులము, ప్రయాణికులమని ఒప్పుకొనుట ద్వారా దేవునికి స్పష్టమైన సాక్ష్యమిచ్చినట్లయినది. “ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు”.
నాలుగవది : వారు విడిచి వచ్చిన లోకములోనికి తిరిగి వెళ్ళు పరిస్థితులను వారు అధిగమించిరి. దేవుని పిలుపుకు లోబడి, ప్రస్తుత లోకమునుండి ప్రత్యేకించుకొనినవారిని లోకములోనికి తిరిగి వెళ్ళునట్లు చేయుటకు అపవాది ప్రయత్నించి, అట్టి అవకాశములు కలుగజేయును.
శరీరాశ, లోకాకర్షణలు, శరీర సంబంధములు, జీవితములోని వ్యాపార పరిస్థితులు అనేక రీతులుగా, ఆయా సమయములలో వెనుకకు మళ్ళు అవకాశములు కల్పించును. అబ్రాహాము తాను యాత్రికుడను, పరదేశి నని స్పష్టముగా ప్రకటించెను.
లోతు తాను ఒక మనిషిని వెంబడించు చున్నానని తేటగా వెల్లడిపరచెను. ‘లోతు అబ్రాహాముతో వెళ్ళెను’ అని మూడు పర్యాయములు చెప్పబడినది. అవకాశము వచ్చినప్పుడు లోతు దానిని విడిచి మైదానమునందలి పట్టణమునకు సాగిపోయెను.
లోతు కాలమునుండి ఎంతమంది వాగ్దానమును స్వతంత్రించుకొనక, తిరిగివెళ్ళు అవకాశము కలిగినప్పుడు దానినే అనుసరించి, శరీరమునకు నిత్యము శోధన కలిగించుకొనుచున్నారు!
మనము తిరిగివెళ్ళు అవకాశములను తప్పించుకొంటిమా? మనము ప్రభువు పక్షపువారమని తేటగా ప్రకటించవచ్చును. మనము తేటగా ప్రకటించినయెడల అప్పుడు యాత్రికులుగా, పరదేశులుగా లోకమునుండి ప్రత్యేకింపబడు మార్గమును ఖండితముగా అవలంబింతము.
మనము నిజముగా యాత్రికులము, పరదేశులమును అయినయెడల మనయెదుట నూతన లోకమందు తెరువబడియున్న విశాల ఆశీర్వాదములమీద మన దృష్టి నిలుపుదము. రాబోవు మహిమనుగూర్చిన వాస్తవికతతో మన హృదయములను నింపుకొందముగాక!
అయిదవది : వారు స్వదేశమునకు మరలివెళ్ళు అవకాశములను తిరస్కరించినందున ‘మరి శ్రేష్టమైన దేశమునకు’ అనగా పరలోక సంబంధమైన దేశమునకు సునాయాసముగా సాగిపోగలిగిరి.
ఆరవది : అలాంటివారి జీవితములనుగూర్చి చెప్పబడినదేమనగా “తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గు పడడు”. వారి జీవితములనుగూర్చిన వివరములలోనికి వెళ్ళి పరిశీలించి నచో అందు అనేక అపజయములున్నవి.
వాటి విషయమై వారు సిగ్గుపడి యుందురనుటలో సందేహములేదు. అయితే వారి జీవితములను శాసిం చిన గొప్ప సూత్రము వారిని ముందుకు సాగునట్లు చేసి, వారి ప్రవర్తనకు మంచి గుణమునిచ్చియున్నది. అందువలన వారు తనవారని చెప్పుకొనుట కును, వారి దేవుడనని తాను చెప్పుకొనుటకును దేవుడు సిగ్గుపడడు.
ఏడవది : అట్టివారికి దేవుడు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. వారి జీవితములో దేవుడు ఏమైయున్నాడో అదంతయు ఆ పట్టణమందు మహిమాన్వితముగా లభించును.
అదే లక్షణములు ఈ రోజున మనయందున్నచో మనలో అనేక అపజయములు, బలహీనతలు, లోకము దృష్టిలో మనము ఎన్నిక లేకుండుట మొదలగునవి ఉండినను, “నేను వారి దేవుడను” అని మన విషయములో చెప్పుటకు ఆయన సిగ్గుపడడుగదా?
(వచనములు 17-19). అబ్రాహాము జీవితము విశ్వాసములోని మరొక అంశమునకు సాదృశ్యముగా నున్నది. విశ్వాస జీవితములో మనము సాతాను మూలముగా వెనుకకు మళ్ళు అవకాశములు ఎదుర్కొని నప్పుడు, దేవుడుకూడా మన విశ్వాసపు విలువను పరీక్షించుటకు శ్రమలను అనుమతించును.
అబ్రాహామునకు దేవుడనుగ్రహించిన ఒక్కడైన కుమా రుని, అనగా ఎవనియందు వాగ్దానములన్నియు నెరవేరవలసియున్నవో ఆ ఇస్సాకును బలి ఇవ్వమని కోరుటలో అబ్రాహాము “శోధింపబడెనని” గ్రహించుచున్నాము.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అర్థం
అతని విశ్వాసము ఆ పరీక్షలకు స్పందించి, కుమారుని బలి ఇచ్చునట్లు చేసెను. ఫలితముగా మృతులలోనుండి దేవుడు అతని లేపగలడని ఋజువైనది.
(వచనము 20). ఆ తరువాత భవిష్యత్తు వెలుగులో నడచుకొనిన వ్యక్తులకు ఉదాహరణగా ఇస్సాకు మనయెదుట ఉంచబడినాడు. “జరుగ బోవు సంగతుల విషయమై యాకోబును, ఏశావును ఆశీర్వదించెను” అని చదువుచున్నాము.
ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించిన వృత్తాం తము ఆదికాండము 27వ అధ్యాయములో ఉన్నది. ఆ విషాదపూరిత అధ్యాయమంతయు చదివినయెడల, ఆ కుటుంబములోని సభ్యులందరు తప్పిపోయినట్లు గమనించగలము. వారిలో విశ్వాసమున్న ఆనవాలే లేదు.
అక్కడ ఇస్సాకు తన కోర్కెలకు లొంగిపోయి, ప్రకృతి సహజంగా ప్రవర్తించు టకు ప్రయత్నించుట చూచుచున్నాము. మన బాహ్య అపజయముల వెనుక ఉన్నదంతయు దేవుడు చూచెను గనుక, ఇస్సాకు తన కుమారులను జరగబోవు విషయములలో దీవించునది విశ్వాసముద్వారానే అని తెలిసి కొనవలెను.
(వచనము 21). తరువాత విశ్వాసముద్వారా మంచి సాక్ష్యము పొందిన వరుసలో యాకోబు ప్రస్తావించబడియున్నాడు. యాకోబు తన విశ్వాసమును ప్రకటించినది అవసాన దశలో.
అంతవరకు దేవుడు అతనికొరకు కనిపెట్టియున్నాడు. ఆ విశ్వాసమే యాకోబుకు పితరుల జాబితాలో స్థానము కల్పించినది. పరిశుద్ధునిగా అతని జీవితమంతా లోపభూయిష్టము.
అతడు తన తండ్రిని మోసగించాడు, అన్నను మోస గించాడు, ఇంటినుండి తరిమివేయబడ్డాడు, పరాయి దేశమందు సంచారిగా మారాడు. తాను పనిచేయు యజమానిని మోసగించి తిరిగి అతని చేతిలో మోసపోయాడు.
అతని సంతానమతనికి ఎంతో వేదన కలిగించారు. ఇన్ని వన్నెలుగల ఈయన జీవితము చివరకు పరదేశిగా ఐగుప్తునందు ముగిసినది. అయినను అతడు నిజమైన దైవభక్తుడు.
అతని అల్లకల్లోలిత జీవితము దేదీప్యమానమగు అస్తమయముతో ముగిసినది. సహజాతీతముగా ఎదిగి విశ్వాసముతో యోసేపు కుమారులిద్దరినీ ఆశీర్వ దించెను. సహజముగా జ్యేష్ఠునికి ప్రథమ స్థానమిచ్చెదరు.
అయితే యాకోబు విశ్వాసముద్వారా చిన్నవానిని ప్రథమ స్థానమునకు దేవుడు కోరుకొని యుండెనను ఆయన సంకల్పము నెరిగి, తన చేతులను కుడి ఎడమచేసి యోసేపు వారించినను, కనిష్ఠునికి మొదటి ఆశీర్వాదము నిచ్చెను.
(వచనము 22). చివరగా, విశ్వాసముతో భవిష్యత్తులోనికి చూచిన యోసేపు మన గమనమునకు తేబడియున్నాడు. తన అవసాన కాలమందు అతడు ఇశ్రాయేలు ప్రజల నిర్గమముగూర్చి ప్రస్తావించెను.
లోకములో ఏ మనిషియు ఐగుప్తులో యోసేపు పొందిన ఉన్నత స్థానము, అధికారము పొందియుండలేదు. అయినను, తన మరణకాలమందు ఈ లోక మహిమ అంతయు కనుమరుగైపోయినది.
ఐగుప్తు గతకాలపు వైభవములవైపు చూడక, యోసేపు ఇశ్రాయేలీయుల రాబోవు మహిమవైపు చూచెను. అప్పటి కాలమునుబట్టి చూడగా ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టు అవకాశము కనిపించదు.
వారు గోషెను ప్రాంతమందు స్థిరపడిపోయారు. ఆ దేశమందు వారు ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు. “విస్తరించి, అత్యధికముగా ప్రబలిరి”.
అయితే అప్పటినుండి నూటయాభై సంవత్స రములలో ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొందుదురని యోసేపు విశ్వాసముద్వారా చూచెను. విశ్వాసమునుబట్టియే వారి నిర్గమ మునకు సంబంధించిన ఆజ్ఞలనిచ్చెను.
విశ్వాసము ఈ లోకమును జయించుట. (23-40 వచనములు)
ఈ అధ్యాయము మొదటి భాగములో విశ్వాసి విశ్వాసముద్వారా బలి ఆధారముగా దేవుని సమీపించి, మరణమును తీర్పును తప్పించు కొనుటను చూచియున్నాము. (4-7 వచనములు).
ఆ తరువాత రాబోవు లోకపు వెలుగులో విశ్వాసి యాత్రికుడుగా, పరదేశిగా ఈ లోకమందు నడుచుకొనుట చూచియున్నాము. (8-22 వచనములు).
23వ వచనముతో ప్రారంభమగు చివరి భాగములో విశ్వాసిలోని ఈ లోకమును జయించు విశ్వాసమును చూడగలము.
రానున్న పరలోక దేశము, పునాదులుగల పట్టణముకొరకు విశ్వాసముతో ఎదురుచూచిన అబ్రాహాము మనకు ప్రముఖ ఉదాహరణగా ఉన్నాడు. ఈ భాగములో విశ్వాసముద్వారా ఈ లోకమును జయించిన మోషేను ప్రముఖ వ్యక్తిగా చూడగలము.
(వచనము 23). మోషే పుట్టుకను గూర్చిన వివరణలో ఆయన తల్లిదండ్రుల విశ్వాసము ప్రస్తావించబడినది. దాని మూలమున వారు రాజాజ్ఞకు భయపడకుండుట మాత్రమే కాదు, వారి భయమునుకూడా అధిగమించిరి.
చాలాసార్లు చెడుగుకంటే చెడుగుమూలముగా అకస్మిక ముగా కలుగు కీడును జయించుట కష్టమగును. వారి విశ్వాసము కార్య రూపము దాల్చుటకు కారణము బాలుని అందము అని మనము ఆలోచించు అవకాశమున్నది.
“శిశువు సుందరుడై యుండుట చూచి” వారు విశ్వాసముతో ప్రతిస్పందించిరి. ఇక్కడ ప్రేమచేత విశ్వాసము క్రియారూపము దాల్చినదనుట కష్టము.
(వచనము 24). ఇప్పుడు మనము మోషే జీవితము దగ్గరకు వచ్చి యున్నాము. లోకము తన ఆకర్షణలను, వైభవమంతటిని యివ్వజూపినను ఒక విశ్వాసి తన విశ్వాసముతో ఈ లోకమును జయించుననుటకు మోషే జీవితము ప్రబల నిదర్శనము.
విశ్వాస పథము బైబిల్ వచనాలు
తల్లిదండ్రులు లోకసంబంధమగు భయములను జయించిరి. కుమారుడు దాని ఆకర్షణలను జయించెను. మోషే జీవితములో కొట్టొచ్చినట్టు కనిపించునది అదే. మనము లోక సంబంధమగు భయములను జయించవచ్చును గాని, లోకాకర్షణలకు లొంగిపోయెదము.
మోషే విశ్వాసముయొక్క నాణ్యతను గ్రహించవలెనంటే అతని విశిష్ఠ లక్షణములను, లోకమందు అతడు నిర్వహించిన ఉన్నతమైన పదవిని మననము చేసికొనుట సముచితము.
సైఫను యూదుల సభ యెదుట ఇచ్చిన సందేశములో మోషే గుణగణములు ఉన్నత స్థితినిగూర్చి క్లుప్త మగు సారాంశమును వివరించెను.

మోషే స్పురద్రూపి, నాటి ప్రపంచములో మేటి, దేశమందలి జ్ఞానమంతయు పుణికిపుచ్చుకున్నవాడు, తనకున్న జ్ఞానమును సముచిత పదములతో అన్వయించగలవాడు, తన మాటలకు శూర కార్యములతో ఊతమిచ్చువాడు.
కనుకనే ప్రపంచములో అత్యున్నత స్థానము నధిష్టించుటకు అన్ని విధముల తగినవాడు. ఆ అత్యున్నత స్థానము తన చేతికందునంత దూరములో ఉన్నది. ఎందుకనగా ఫరో కుమార్తె దత్తపుత్రుడు మోషే, దానినిబట్టి ఐగుప్తును ఏలనున్న ఫరోల వరుస క్రమములో ఉండెను.
లోకములో ఉన్నత స్థితికి వచ్చు అట్టి పరిస్థితులలో మోషే ఏలాగు ప్రవర్తించెను? మొదటిది, మోషే పెద్దవాడైనప్పుడు, అనగా లోకమందలి ఆ అత్యున్నత స్థానము పొందు అవకాశము వచ్చినప్పుడు లోక మహిమను కాలదన్ని “ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పు కొనలేదు”.
(వచనము 25). రెండవదిగా, అతడు ఎన్నుకొనినదానిని చూడ గలము. తన ఎంపికకూడా తాను తిరస్కరించినదానివలే విలక్షణమైనది.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక తెలుగులో
ఆ దినములలో ఐగుప్తులో నిమ్నజాతిగానున్న అసంఖ్యాక ప్రజలు ఉండిరి. వారు ఎవరికీ అక్కరలేని విదేశీయులు. బానిసలుగా చెప్పనలవి కానిరీతిలో బాధలుపడుచుండిరి.

వారు అంతటి దీనస్థితిలో ఉన్నను, కఠిన బానిసత్వము అనుభవించుచున్నను వారు దేవుని ప్రజలు.
కనుక మోషే అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలగు వీరితో శ్రమననుభవించుట కోరుకొనెను. ఈ విలక్షణమైన “తిరస్కారము”, “ఎదిరింపు”లకు మూలాధారమేమి? అని మనము అడుగవచ్చును.
ఒక్క మాటలో చెప్పవలెనంటే అది విశ్వా సము. మోషే విశ్వాసముతో లోకమును త్యజించెను. విశ్వాసముతోనే దేవుని పిల్లలతో శ్రమలననుభవించుటను ఎన్నుకొనెను.
శరీరము శాసించినదానికి తలవొగ్గక, ఇంగిత జ్ఞానమునకు విపరీతముగానున్న దానిని ఎన్నుకొని మోషే విశ్వాసముతో అడుగు ముందుకు వేసెను. మోషే ఎన్నుకొన్న మార్గము దైవికమైనదని భావించవచ్చును.
రాజు యెదుట అత్యున్నత స్థానములోనున్న వ్యక్తి రాజు మరణశిక్ష విధించినను చెక్కుచెదరక ఉండగలుగుటకు కారణము దేవుని ఏర్పాటుగాక మరేమిటి? తనకు మేలు చేసినవారికి కృతజ్ఞతతో రాజాస్థానములో ఉండక పారి పోవుట న్యాయమా? అని లౌకిక ఆలోచన ప్రశ్నించును.
తన గొప్ప సామర్థ్యములు, ఉన్నత స్థానము, దాని మూలముగా సంక్రమించు అధికారముతో పేదవారైన తన సహోదరుల అభ్యున్నతికి వినియోగించి ఉండవచ్చు కదా? అని హేతువు, ఇంగిత జ్ఞానము ప్రశ్నించును.
దైవికమగు ఏర్పాటు, సవ్యమైన సహజానుభూతులు, ఇంగిత జ్ఞానము మొదలగువాటికి సముచిత స్థానమున్నను అవి విశ్వాసపథమందు నడి పించు మార్గదర్శి లేదా జీవన సూత్రము కాజాలవు.
విశ్వాసము దేవునివైపు చూచును. మోషే దైవానుగ్రహమువలననే రాజు ఆస్థానములోనికి వచ్చినను, విశ్వాసము అతనిని వెలుపలికి నడిపించినది. ప్రపంచములో ఎంతో గొప్పవారగు ప్రజలతో సంబంధమును వదలుకొని, ఆ దేశమందు హీనముగా ఎంచబడిన ప్రజలతో తనను గుర్తించుకొనుటకు అతడు కోరుకొనెను.
(వచనము 26). సహజాతీతముగా విశ్వాసము అడుగు వేయుటకు కారణము ఏదో దాగి ఉన్న శక్తి, లేక బలమైన సంకల్పము అయి ఉండవచ్చును. మోషే దేనిపై దృష్టి నిలిపియున్నాడో ఇప్పుడు మనము చూడబోవుచున్నాము.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వివరణ
24వ వచనములో మోషే “తిరస్కారము”, 25వ వచనములో మోషే “ఎంపిక”, 26వ వచనములో మోషే “దేనిపై దృష్టి నిలిపెనో” చూడగలము.
తిరస్కారమునకు, ఎంపికకు రహస్యమేమిటో వెల్లడియగుచున్నది. మోషే దృష్టి నిలుపుట, చీకటిలో అడుగువేయుట విశ్వాసము కాదు అని తెలియుచున్నది.
దీనినిబట్టి అర్థమయ్యేదేమనగా విశ్వాసమునకు అంతరంగిక ఉద్దేశ్యములు, బాహ్యమైన బలము ఉన్నవన్న మాట. విశ్వాసము సావధానముగా విలువలను అంచనావేయును, విశ్వాసము దూరదృష్టితో చూచును, విశ్వాసమునకు గురియుండును.
మోషేయొక్క విశ్వాసము దృశ్యమైన, అదృశ్యమైనవాటి నిజమైన విలువను అంచనావేసికొనెను. అది కళ్లెదుటే ఉన్నట్లు అతడు చూచెను. ఒకవైపు ప్రపంచములో అత్యున్నత పదవి, దానికి సంబంధించిన పాపభోగములు, సంపదలు ఉన్నవి.
మరొకవైపు దేవుని ప్రజలు ఆ కాలమందు శ్రమలు, నిందలపాలై యుండిరి. ఈ రెంటినీ బేరీజు వేసుకొని లోకమును నిర్ద్వందముగా తిరస్కరించి, దేవుని ప్రజలతో శ్రమననుభవించుటయే అతడు కోరుకొనెను.
అతడెందుకు ఆలాగు చేసెను? “ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను”. “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్లు సహించెను” అని చెప్పబడినట్లు అతని విశ్వాసము చాలా దూరము చూడగలిగెను.
ఐగుప్తు ధనరాశులు, భోగభాగ్యములు ఒకవైపు – దేవుని పిల్లలతో శ్రమలు, నిందలు మరొకవైపు అతడు చూచెను. విశ్వాసముతో అతడు చాలా దూరము తేరిచూచి, “సౌందర్యవంతుడైన రాజును, దూరదేశమును చూచెను”.
ఆ దేశపు మహిమకు, రాజు సౌందర్యమునకు ఆకర్షింపబడి ఈ లోక మహిమను జయించగలిగెను. రాబోవు లోకము వెలుగులో ఈ లోకపు విలువను అంచనా వేసికొనెను. క్రీస్తు విషయమైన నిందలో ఐగుప్తు భోగభాగ్యములను మించిన సంపద లున్నట్టు చూచెను.
ఈ లోకపు వైభవమంతటిపై మరణపు తీర్పు ఛాయలున్నట్టు మోషే గమనించెను. ఈ లోక భోగము అల్పకాలమే అని గ్రహించెను. ఐగుప్తు సంపదలన్నియు సమాధితో అంతమగునని గట్టిగా నమ్మెను. మోషే పితరుడైన యోసేపుకూడా ఇంతే.
ఐగుప్తులో సమున్నత స్థానము పొందిన వ్యక్తి అతడే. రాజు తరువాతి అధికారము చేపట్టిన వ్యక్తి అతడే. అంతకు ముందు గాని, ఆ తరువాత గాని ఏ మానవుడును అంత ఎత్తుకు ఎదగ లేదు.
అయినను అదంతయు శవపేటికలో అంతమాయెను. ఆదికాండ ములోని చివరి మాటలు ఇవే – “యోసేపు మరణించెను… ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి”.
భూలోకమందలి సంతోషములు అంత రించును, మహిమ గతించును. ఈ లోక మహిమ అంతయు శవపేటిక లోనికి దిగిపోవలసినదే. ఫరో మహా సామ్రాజ్యము చిన్న సమాధిలోనికి కుంచించుకుపోవును.

లోక సంబంధియైన మనిషికి – మోషే తిరస్కరించుట, ఎంపిక, దృష్టించుట మొదలగునవి శుద్ధ అవివేకమనిపించును. మోషే జీవితములో అది ఏలాగు పనిచేసెనో పరిశీలించెదము.
మోషే తిరస్కరించి, విశ్వాస పథమును ఎన్నుకొన్నప్పటినుండి పదిహేను వందల సంవత్సరములు ముందుకు సాగినయెడల అతడు పొందిన బహుమానమును చూడ గలము.
మత్తయి 17వ అధ్యాయము ప్రారంభ వచనములలో ఈ గొప్ప దృశ్యము వర్ణించబడినది. అక్కడ దూరదేశము సమీపముగా కనిపించును. రాజు సౌందర్యముతో ప్రత్యక్షమగును, మనము భూమిమీదనుండి పర్వతముమీదికి ఏకాంతముగా కొనిపోబడుదుము.
అక్కడ ఒక క్షణ కాలము క్రీస్తు ముఖవర్చస్సు మారినప్పుడు, ఆయనను మహిమతో చూతుము. ఏ మనిషికంటెను వికారముగా మారిపోయిన ముఖము ఇప్పుడు సూర్యునివలె ప్రకాశించుచున్నది.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక వివరణ
అవమానకరమగు వస్త్రములు ప్రక్కన పెట్టబడినవి. ప్రకాశమానమగు వస్త్రములు ధరించియున్నాడు. ఇదొక అద్భుతమగు ప్రత్యక్షత. అయితే, దానివెంట ఇతర అద్భుతములు కూడా జరిగినవి – “ఇదిగో మోషేయు, ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి” అని వ్రాయబడియున్నది.
15 శతాబ్దములకు ముందు మోషే లోకముయొక్కయు, లోకము యొక్క రాజు దృష్టినుండియు తప్పించుకొని, తృణీకరించబడిన తన ప్రజలతో క్రీస్తు నిందను భరించుటకు అదృశ్యుడాయెను.
ఇప్పుడైతే ప్రవక్తలు, అపొస్తలుల సమూహముతో కలసి రాజుల రాజు మహిమను అనుభవించుటకు మరల కనిపించెను.
అప్పుడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్లు సహించెను. కాని ఇప్పుడు “ఆయనతో” మహిమలో ప్రత్యక్షమాయెను.
మోషే ఇప్పుడు పొందిన బహుమానమును చూచిన యెడల – తాను లోకమును త్యజించి, తన ప్రజలతోకూడ నిందను అనుభవించినట్లు లోకమునందలి అవకాశములను అతడు పోగొట్టు కొనెను అని ఎవరు అనగలరు?
(వచనము 27). విశ్వాసమునకు ప్రముఖ నిదర్శనమైన ఇతని జీవితముద్వారా మనము ఎంతో మేలుపొందవచ్చును.
లోకపు సంపదల కంటే క్రీస్తునందు లభ్యమగు సంపదలు ఎంతో గొప్పవనియు, రాబోవునవి గతములో ఉన్నవాటికంటే శ్రేష్టమైనవనియు భావించవలెను.
స్వార్థ త్యాగము, లోకమును త్యజించుట, రానైయున్న మహిమలో పొందు బహుమానము, వీటన్నిటికంటే వ్యతిరేకతలు, అవమానములు, నిందలు కలిగినప్పుడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్లు జీవించుట ఎంతో మేలు.
స్తెఫనును శత్రువులు ఎదిరించి, అవమానపరచినను, అతడు ఒక్క కోపపు మాట పలుకలేదు. అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్లుండెను.

కనుక, ఆయన మనలను చూచుచున్నాడని సంతృప్తిపడక, విశ్వాసముతో మనమే ఆయనను చూచుచు ముందుకు సాగిపోవలెను. ఆయన మనలను చూచుచున్నాడన్న భావము గొప్పదే.
అయితే ఆయనను చూచుచున్నట్టు విశ్వాసముతో నడచుచు, ఒకానొక రోజున ఆయనను ముఖాముఖిగా చూచు గడియకొరకు కనిపెట్టుట అంతకంటే గొప్పది.
అల్పకాలపు లోకమందలి శ్రమలు ఆయన నవ్వులో దూదిపింజలా తేలిపోవును
(వచనము 28). మోషే వృత్తాంతమందు మరికొన్ని పాఠములు నేర్చుకొనగలము. విశ్వాసముద్వారా అతడు మనుష్యుల భయమును జయించెను. ఇప్పుడు అది దేవునియందు పవిత్రమగు భయమునకు దారితీయుచున్నట్లు గమనింతుము.
మనము పాపులమనియు, పరిశుద్ధు డైన దేవుడు పాపమును దాటిపోడని విశ్వాసము గుర్తించును. ఇశ్రాయేలీ యులు పాపులుగా ఐగుప్తీయులతో సమముగా తీర్పుక్రింద నుండిరి.
ఆలాగైనయెడల వారి జ్యేష్ఠ సంతానము మరణించక తప్పించుకొనుట ఎట్లు? దేవుడు ఆ విపత్తునుండి తప్పించుకొను ఆశ్రయమును అనగా గొర్రెపిల్ల రక్తమును ఏర్పాటుచేసెను.
“నేను ఆ రక్తమును చూచి … దాటిపోయెదను” అని దేవుడు చెప్పుచున్నాడు. విశ్వాసము గొర్రెపిల్ల రక్తమును వెలకట్టుటమీదగాక, దేవుని పరిపూర్ణ అంచనాపై ఆధారపడి ఉండును.
విశ్వాస పథము బైబిల్ లో ఎక్కడ ఉంది?
ఆ విధముగా మోషే “తొలిచూలు పిల్లలను నాశనము చేయు వాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును పాటించెను”.
(వచనము 29). దేవుడు రక్తమునకు వెలకట్టిన దాని ఆధారముగా విశ్వాసముతో ఇశ్రాయేలీయులు ఐగుప్తును దాటిపోయిరి. ఆ తరువాత “విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి”.
“ఊరకే నిలుచుండి యెహోవా రక్షణను కన్నులారా చూడుడని” ప్రజలు ఆదేశింపబడిరి. అక్కడ దేవుడు తన ప్రజలు ఆరిన నేలను నడిచిపోవుటకొరకై నీటిని అట్లే నిలిచిపోవునట్లు చేసెను.
ఐగుప్తులో రక్తము నాశ్రయించి తీర్పును తప్పించుకొనిరి. ఎర్ర సముద్రమువద్ద తమ శత్రువులందరి చేతిలోనుండి రక్షింపబడిరి. క్రీస్తు మరణముద్వారా పరిశుద్ధుడైన దేవుని షరతులన్నియు నెరవేరి నవి.
క్రీస్తు మరణ, పునరుత్థానములవలన విశ్వాసి మరణమును, తీర్పును దాటిపోయెను. మచ్చలేనివాడుగా క్రీస్తు దేవునికి తనను తాను అర్పించు కొనుట పస్కాకు ముంగుర్తుగా నున్నది.
మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన క్రీస్తును ఎర్ర సముద్రము సూచించుచున్నది.
ఎర్ర సముద్రమును దాటుటకు ప్రయత్నించిన ఐగుప్తీయులు మునిగి పోయిరి. విశ్వాసము లేకుండా శరీరము మరణమును ఎదుర్కొనినచో నాశనము తప్పదు.
ఈ రోజున ఎంతమంది బయటకు క్రైస్తవులమని చెప్పుకొని, స్వంత ప్రయత్నములతో రక్షణ పొందుటకు ప్రయత్నించి, క్రీస్తు రక్తమందు విశ్వాసముంచకయే మరణమును ఎదుర్కొనుచున్నారు! వారి అంతము నాశనమే.
(వచనము 30). ఇశ్రాయేలీయులు విశ్వాసముద్వారా తీర్పును తప్పించుకొని, ఐగుప్తునుండి విడుదల పొందినయెడల, వారు వాగ్దాన దేశమందు ప్రవేశింపకుండునట్లు నిరోధించిన శత్రువును జయించినది కూడా విశ్వాసముద్వారానే.
“విశ్వాసమునుబట్టి యెరికో గోడలు కూలెను”. యెరికో పట్టణమును ముట్టడించుటకు ఇశ్రాయేలీయులు ఎన్నడూ లేని పద్ధతిని అవలంబించిరి. ఏడు రోజులు పట్టణము చుట్టూ ప్రదక్షిణ చేసి నందున గోడలు కూలిపోలేదు. దేవుని వాక్యమందు విశ్వాసముంచుట వలన కూలెను.
(వచనము 31). ఈ పాత నిబంధన విశ్వాస వీరుల జాబితాలో ఒక హీన చరిత్రగల స్త్రీ విశ్వాసముద్వారా స్థానము పొందెను. “విశ్వాస మునుబట్టి రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపక పోయెను”.
వేశ్యగా ఆమె మనుష్యుల తీర్పుకు గురి అయ్యేదే. అయితే, విశ్వాసమునుబట్టి దేవునిద్వారా మంచి సాక్ష్యము పొంది గొప్ప సాక్షి సమూహములో చేరెను.
(వచనము 32). గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనువారి పేర్లతో ప్రస్తావించిన విశ్వాసవీరుల జాబితాకు ముగింపు.
ఈ పేరుల వరుసలో చారిత్రక క్రమము పాటింపలేదని గుర్తించ వలెను. చరిత్రలో గిద్యోనుకంటే బారాకు ముందటివాడు. యెఫ్తా సంసోను కంటే మొదటివాడు.
న్యాయాధిపతుల కాలమందు బారాకుకంటే గిద్యోను విశ్వాస విషయములో మంచి సాక్షిగా ఉన్నందున, యెఫ్తాకంటే సంసోను విశ్వాసము అధికమైనందున ఈ జాబితా క్రమము మార్చి ఉండవచ్చును.
దావీదుకూడా పరిపాలకుడే గనుక న్యాయాధిపతులలో వర్గీకరించబడెను. ప్రవక్తల వరుసలో చేర్చుటకు సమూయేలును చివర ప్రస్తావించి ఉండ వచ్చును. రాజుల తరువాత ప్రవక్తలు వచ్చిరి.
(వచనములు 33, 34). విశ్వాసముయొక్క విలక్షణతలను చూపెట్టు టకు అపొస్తలుడు చివరలో కొన్ని ప్రాముఖ్య విశ్వాస సంఘటనలు ఉదహ రించెను. మొదట రాజ్యములను జయించి, సైన్యములను పారద్రోలిన విశ్వాసపు శక్తిని చూపెట్టు సంఘటనలు ప్రస్తావించెను.
అనగా బలహీ నతలో బలము, యుద్ధములో శూరత్వము చూపుట, ప్రకృతి శక్తులకు ప్రతీకగా సింహము ప్రస్తావన ఉన్నది. అగ్ని బలమును చల్లార్చుట, మరణముపై విజయము సాధించిన సంఘటనలు ప్రస్తావించబడినవి.
(వచనములు 35, 36). రెండవదిగా, విశ్వాసముద్వారా సహించు టను – చిత్రహింసలు, విడుదల పొందుటకు ఒప్పుకొనకపోవుటను – తిరస్కారములు, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదును అనుభవించిన వారిని అపొస్తలుడు మనయెదుట పెట్టుచున్నాడు.
విశ్వాస పథము బైబిల్ లో ఎక్కడ ఉంది?
(వచనములు 37, 38). మూడవదిగా, రచయిత విశ్వాసమువలన కలిగిన శ్రమలనుగూర్చి మరింత పరిష్కారముగా ప్రస్తావించియున్నాడు. “రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గ ముతో చంపబడిరి”.
చివరిగా విశ్వాసముద్వారా కలుగు నిందను చూచెదము. లోకము విశ్వాసులైనవారిని తమ మధ్యనుండి తోలివేసినది. వారిని తృణీకరించి కులహీనులుగా పరిగణించినది.
దేవుడు యెగ్యులనుగా ఎంచినవారిపట్ల లోకస్థులు వ్యవహరించిన తీరునుబట్టి తమకు తామే అయోగ్యులమని ప్రకటించుకొన్నట్లయినది. విశ్వాసముంచినవారిని తీర్పు తీర్చి, తమకు తాము తీర్పు తీర్చుకొనిరి.
(వచనము 39). వారందరు గొప్ప కార్యములు జరిగించినను, సహించినను, శ్రమలు నిందలు అనుభవించినను వారి కాలములో వాగ్దాన ఫలములు వారు అనుభవించలేదు.
గత కాలమందు వారు విశ్వాసమునుబట్టి జీవించిరి. నేడు మంచి సాక్ష్యము పొందియున్నారు. రాబోవు దినములలో వాగ్దానము చేసిన ఆశీర్వాదములలో ప్రవేశించి బహుమానము పొంది ఆనందించెదరు. ఈ పాత నిబంధన భక్తుల ఆశీర్వాదములు ఎంతో గొప్పవి.
అయితే దేవుడు క్రైస్తవులకు “మరి శ్రేష్టమైనది” అనుగ్రహించెను. దేవుడు సంఘమును పిలుచుటయను తన సంకల్పమును సంపూర్తి చేసినప్పుడు పాత నిబంధన భక్తులు సంఘముతో కలసి ఆశీర్వాద పరిపూర్ణతలో ప్రవేశించుదురు. వారును, మనమును సంపూర్ణులమగుటకు పునరుత్థాన ఉషోదయముకొరకు కనిపెట్టుచున్నాము.