పరమగీతము

పరమగీతము

ప్రశ్న: పరమగీతముమీద మీరు ప్రసంగించుట లేదే ఎందుకు?

జవాబు:-

పరమగీతముమీద ప్రసంగించెదము లెండి. అయితే పనికిమాలిన ఆయా వ్యాఖ్యానములు తిరుగుచుండగా కొంత వెక్కసముపుట్టి అంతగా దీనిలో దిగలేదు. కొందరు స్త్రీ అంటే వెంటనే మోహమునకు తిరుగుతారు.

పరమగీతములో మోహము లేదుగాని భార్యభర్తలకుండ తగిన పరస్పర సంబంధములే దివ్యముగా చెప్పబడినవి. అయితే తగినవారికే యిది బోధగా నుంటుంది.

పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును, అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదని తీతు 1:15 లో వ్రాసినది ఈ పరమగీతమను పుస్తకమునకు అన్వయించుచున్నది.

క్రీస్తు సంఘానికి పెండ్లికొడుకైనట్టున్నాడు, సంఘమైతే ఆయన భార్య. కాబట్టి పరిశుద్ధమైన పెండ్లిలోను భార్యభర్తల పరిశుద్ధమైన ఐకమత్యములోను, క్రీస్తుకును భక్తునికిని వుండతగిన ప్రేమ సంబంధములు కానవచ్చుచున్నవి. యిట్టి భావనతో పరమగీతము చదివితే భాగ్యము చాలయున్నది.

ఆయన ఆ స్త్రీని పిలిచెడు ప్రేమగల పలుకులు చూడండి – నారీమణీ, సుందరీ, ప్రియురాలా, సుందరవతీ, నీవు అధిక సుందరివి, నీయందు కళంకమేమియు లేదు; ప్రాణేశ్వరీ, నా సహోదరీ, నా పావురమా, నా నిష్కళంకురాలా, రాజకుమార పుత్రికా – ఈ నామాంకితముల నొక్కొక్కటి తలపోసి ఆలోచించి విశ్వాసి తనతోనే వీటిని పొత్తుచేసికొంటే క్రీస్తుకును తనకు నెంత సమీప బంధుత్వ ప్రేమలుండునో యెంతవరకా ప్రేమభావము పుట్టి వర్ధిల్లగలదో చెప్పలేము గాని క్రీస్తు యింతగా తన భక్తులను ప్రేమించి, ముందుప్రేమగా వారితో చర్చించవలెనని యున్నట్టు దీనిలో తెలియవచ్చుచున్నది – ఇట్టి సమీప సహవాసము క్రీస్తుతో సలుపుకొనుట మీకేమైన అనుభవమాయెనా? అలాగే అగుగాక! క్రీస్తు మిమ్మును ప్రేమించుచున్నాడని దీనిలో నేర్చుకోండి. క్రీస్తు మిక్కిలిగా మిమ్మును ప్రేమించుచున్నాడని యెరుగండి.

ఆ ప్రేమకు దూరముపోక దగ్గరనే నిలువబడి అందులో నిమిష నిమిషము జీవించుడి. 1:8,9,15; 2:11; 4:7,8,10; 6:9; 7:1 మొదలైన వచనములను వల్లించి తీపి గ్రోలుడి. సొలోమోను కూలికత్తెగానున్న ఆమెను చూచి ప్రేమించి తన పెండ్లిభార్యగా తీసికొని వచ్చి విందుశాలలో చేర్చుకొనెను. 1:6; 2:4.

ఇట్టి ప్రేమ ఆశ్చర్యకరముగానున్నది మరియు యెరూషలేము కుమార్తెలకు అగోచరమైయుండెను. 2:7; 3:5. ఇట్లు ఆరంభ ములో బీద ఆమెను లేవనెత్తిన రాజుగారు తుదకు ఆమెను బహుగా గౌరవించి రాజ కుమార పుత్రికా అను గొప్ప స్థితికి తీసుకొనివచ్చిరి. 7:1.

విశ్వాసి కూడ క్రీస్తున్నంత పై పదవికి పైకి రావలెను. రాజుగారు ఆమెను పోల్చిన దివ్య పోలికలను కనిపెట్టండి.

ఫరోయొక్క రధాశ్వములతో నిన్ను పోల్చెదనంటున్నాడు. 1:9 క్రీస్తు సంఘము వేగిరముగా సువార్త ప్రచారములో అభిప్రాయము గల్గి యుండవలెనని దీని దీటు.

బలురక్కసి చెట్లలో ఈమె వల్లీ పద్మమువంటిది. 2:2. అవును క్రీస్తు సంఘము ముండ్లలోనున్న లిల్లీపుష్పమువంటిది … పాత తర్జుమాలో లిల్లీ అని యున్నది. లిల్లీ యెంత పరిశుద్ధమైనది, వింతైనది. బురదలోనే పైకి పెరుగుచు వచ్చునది మరియు నెంతో నిర్మలమైనది! క్రీస్తు సంఘమీ మాదిరిగా లోకములో ప్రకాశించవలసినది.

ఉద్యానము అని ఆమె పోలిక. 4:12. మూయబడినది అనగా పరిశుద్ధాత్మచే క్రీస్తు సంఘము ముద్రవేయబడి భద్రముగా నున్నది. (ఎఫెసీ 1:13, 4:30).

జలకూపమని ఆమెను పోల్చుచున్నాడు. 4:12. క్రీస్తును నమ్మితే లోలోపల నూరెడి నీటిబుగ్గవంటి సంతోషకరమైన ఎడతెగని అనుభవము దొరుకుతుంది. యోహాను 4:14. మూతవేయబడినదంటే భద్రపరచబడినదని అర్థము. (యూదా 1).

వనమని 4:13 లో నున్నది – అవును. ప్రభువు తన భక్తులను కాయుచు చెట్లుగా వారిని పెంచుచున్నాడు. (కీర్తన 92:12).

సఖీ అని ఆమెను పిలుచుచు తిర్సా పట్టణమంత సుందరమైన దానివి నీవని ఆమెను కొనియాడుచు వర్ణించుచున్నాడు. 6:4. తిర్సా చాల యేండ్లు పదిగోత్రముల వారి ముఖ్యపట్టణము. (1 రాజులు 15:33). సంఘమే యొక పట్నము-ఆ పట్నానికి క్రీస్తు సొగసుండియున్నది. (మత్తయి 5:14, కీర్తన 149:4).

సైన్యముతో ఆమెకు దీటు. (6:10) వ్యూహితసైన్య సమభీకర రూపిణియని ఆమెను పిలిచెను-క్రీస్తు సంఘము సువార్తసేవలో యుద్ధమాడినట్టు శౌర్యముదాల్చి కార్యాల
చేయవలెనని దీని భావన. (2 తిమోతి 2:3, 1 తిమోతి 1:18).

సంధ్యారాగముతోను సూర్యచంద్రాదుల ప్రభావముతోను ఆమె అలంకరింప బడినట్టున్నది. (6:10). అవును, క్రీస్తు పునరుత్థాన శక్తి ప్రభావములు నమ్మినవారి కున్నవి గనుక వారు శోభిల్లకుండలేరు.

ఎఫెసీ 5:14 దీనికి సరిపోవుచున్నది. యెషయా 60:1 కూడ చెల్లుతుంది. కాబట్టి పరమ గీతమును మానివేయుము. దానిలో భక్తుడు మునుగుచును తేలుచును తగిన మేతకూడ కనుగొని సంతోషిస్తాడు. అయితే లేనిపోని విపరీతమైన వ్యాఖ్యానములనుగూర్చియు సరికానివారు దీనిలో పాప ప్రేరితముగా బోధించుచున్న అన్యబోధలను గురించియు జాగ్రత్త పడుమని చదువరులను హెచ్చ రించుచున్నాను.

Leave a Comment