బైబిలులోని సంఖ్యలు

బైబిలులోని సంఖ్యలు

ప్రశ్న:-

సంఖ్య అనేది బైబిలులో నాలాగే పడినదా లేక యుద్దేశ పూర్వకముగా కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలను దేవుడు నియమించినట్టు కనిపించుచున్నదా? నలభై యంటే అర్థమేమి? నలుబది దినములకు వర్షము, నలుబది సంవత్స రములు ఇశ్రాయేలీయుల ప్రయాణము, మోషే కొండపై నలుబది దినములు, యేసుప్రభువు నలుబది దినములు శోధింపబడుట వీటి యర్థమేమి?

జవాబు:-

వ్రాయబడినదానిలో పొల్లు సున్న అనే చిన్నవాటిమట్టుకు దిగి అట్టి అల్పమైనవి కూడ నెరవేరకపోవని మత్తయి 5:18 లో మన ప్రభువు చెప్పిన తరువాత వాక్యములోని ప్రతి సంగతి సంఖ్యలతోకూడ కనిపెట్ట తగినదని మనము తీర్మానించకుండలేము.

గలతీ 3:16 లో పౌలు – సంతానమైన క్రీస్తును ప్రకటించుచు పాత నిబంధనలో సంతానములు అని దేవుడు చెప్పక రాబోవునది సంతానమే అని చెప్పినందున క్రీస్తు ఒకడే అవసరముగాని క్రీస్తులు అనే పదము అసంభవమని విషయము విడదీసి వివరించుచు చెప్పినట్టున్నది. చూడండి. ఆలాగైతే వాక్యము చదివినప్పుడెల్ల మిగుల జాగ్రత్తతో పెద్దవాటిని మాత్రము కాక బహు వచనమునకును ఏకవచనము నకును గల చిన్నతేడాలవంటి వాటిని సైతము కనిపెట్టి చదువవలసినట్టున్నదని తెలిసికొంటు న్నాము.

ఇట్లుండ దేవుని వాక్యము చాలా లోతైనదని మనస్సుకు రాకపోదు. అవును, ఆ వాక్యము లోతైనదే కాక అందులోగల ప్రతి శబ్దము కూడ అర్థసహితముగా వ్రాతకు వచ్చెనని మనమెరుగ వలయును. మత్తయి 12:36 లో వ్యర్థముగా పలుకు ప్రతి మాటనుగూర్చి మనుష్యుడు విమర్శలో నిలుచుననిన ప్రభువు తాను వ్రాయించిన పుస్తకములో ఆయా సంఖ్యలను కూడ అనార్థముగా వ్రాయించి పెట్టుతాడా? పెట్టడు, కాబట్టి వాక్యములోనున్న సంఖ్యలనే అంశము మన పఠనమునకు యోగ్యమైనది.

పాఠకుడీసారి నలుబది అనే సంఖ్యనెత్తి విచారించినందున సంతసించుచు దీనిలో క్లుప్తముగా ఆయా కొన్ని సంఖ్యలను వివరించిన పిదప నలభై అనే దానికి వచ్చెదను. దీని సంబంధముగా మరియొకటియైతే కలదు. అదేదనగా ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయములో రాబోవు ఆ క్రూర రాజును వర్ణించుచు ప్రభువు తానే ఆ రాజుగారి పేరు తెల్పక అతని సంఖ్యనే మనకప్పగించుచున్నాడు. గనుక సంఖ్యలో గొప్ప భావమిమిడి యున్నదని ప్రభువే ప్రకటన 13:18 లో మనకు నేర్పుచున్నాడు. ఉదాహరణముగా ఆరు అనే సంఖ్యను చూడండి.

మానవుడు ఆరంభములో ఆరవ రోజులోనే సృష్టింపబడినందుచేత (ఆది 1:24-28) ఆరు అనే సంఖ్యతోనే కట్టబడియున్నాడు. ఆ భావముతో బైబిలులోని ఆయా ఆరు అనే సంఖ్యగల సందర్భములను పరీక్షించండి. వాటిలో మానవుడే పైగా తేలుతాడు. యోహాను రెండులో ఆ కానాను వివాహము వ్రాయబడినది. బాసలు ఆరు అని కనిపించుచున్న దెందుకు? ఏ ప్రకారము ఆ ఆరు రాతి బానలు అల్లనాడు క్రీస్తు తన మహిమను కనుపరచెనో ఆ ప్రకారమీ దినములలో బానలు అక్కరలేదు గాని ఆరు బాసలు సూచించే నరుడే క్రీస్తుకు అవసరము.

నరుడు రక్షింపబడి పనిముట్టుగా క్రీస్తు చేతిలోనుంటే నేడు కూడ గొప్ప పని జరిగి క్రీస్తుకు మహిమ కల్గును. ఆరు అర్థ సహితముగా వచ్చినది. రక్షింపబడిన మానవుని సేవను వివరించుచు 7 లేక 8 రకములు చెప్పక 1 కొరింథీ 3:12,13 లో నెంచి చూడండి.

ప్రభువు దాసుడైన పౌలు ఆరు విధములైన సేవ కార్యములను మాత్రము సూచించుచున్నందుచేత? ఆరు మానవుని సంఖ్య గనుక ఆయన చేసే సేవ ఆరు అను అంకములో వర్ణింపబడియున్నది. ఇది యూరకనే వచ్చినదా? కాదు. అర్థ సహితముగా సంఖ్యలను వాడుచున్నాడు. నరుడైన నెబుకద్నెజరు విర్రవీగుచు పూజకొరకు అన్యాయముగా చేయించిన విగ్రహము కొలతలను కనిపెట్టండి. ఎత్తు ఆరు అనే సంఖ్యకు సరిపోయినది. వెడల్పు కూడ ఆరులోనున్నది – దానియేలు 3:1 చూడండి. అట్లనే వచ్చినదా? రాలేదు.

మనకు దీనిలో నొక సంగతిని దేవుడే చూపు చున్నాడు. ఎట్లనగా మానవుని నిష్ప్రయోజన యత్నముగా ఆ బొమ్మ కట్టబడెను. కాబట్టి ఆరు అనే సంఖ్య క్రింద కట్టబడినది. ఈ కార్యము సరికానందుచేత త్వరలో ఆ బొమ్మతోకూడ అతిక్రమించిన ఆ రాజుగారు కొట్టివేయబడిరి. గొప్ప నెబుకద్నెజరు యెట్లొక మతమును స్థాపించి రాజ్యములోని సమస్తమైనవారిని ఆ మతములోనే కలుపవలెనని ఉండి ఆఖరికి నోడిపోయెనో అట్లనే రాబోవు కొంతకాలానికి మరియొక రాజు కీర్తిశేషముగా పేరుగొని లేచి క్రమేణ ప్రకటన 13 లో వివరింపబడినట్లు సర్వత్ర మతము నొకటి పుట్టించి అందులో కలియని వారిని హతసాక్షులనుగా కావించి తుదకు తానే నశించిపోతాడని తెలియుచున్నది. ముందుండినదే మళ్ళీ సంభవిస్తుంది.

లౌకికములో కొత్తవి లేవు. రాబోవు ఆ రాజుగారి పేరేమి? అతని పేరు మనకివ్వబడలేదు గాని అతని సంఖ్య చెప్పబడినది మరియు ఆ సంఖ్య ఆరుతోనే నిండినది. వ్రాస్తే సరిగా 666 అని వస్తుంది. ఇందులో మనము నేర్చుకో వలసినదేమనగా సర్వలోకమును మోసపుచ్చి వశపరచుకొన నపేక్షించేవాడు నరులలో గొప్ప నరుడు కాని పక్షమున అంత పదవికి రాలేడు.

ఆరు అనగా నరుని సంఖ్య. ఆరు అంటే బలమైన నరుడని అర్థము. అయితే దీనికిమించి ప్రకటన 13:18 లో కనబడుచున్నట్లు ఆరు ఆరు ఆరు అనగా ఆర్నూట అరువదియారు వస్తే నిట్టి బలమైన అంకము గలవాడు రాజైన సౌలువలె నరులలో అతిశ్రేష్ఠుడై అందరికంటె భుజము మొదలుకొని పైకి నెత్తుగలవాడై ఆరంభములో మంచి ముఖముండినను తుదకు క్రూరముఖము గలవాడై యుక్తిగలవాడై యుపాయము తెలిసికొని లోక రాజ్యములను స్వాధీనపర్చుకొని కొట్టకొనకు దేవునిమీదను దేవుని అభిషిక్తునిమీదను చెయ్యియెత్తి నియమింపబడిన దండనకు వెళ్ళిపోతాడని గ్రహించుచున్నాము. దానియేలు 8:23; 1 సమూయేలు 10:23 చూడండి. మనుష్యులలో అతడు గొప్పవాడేగాని ఏడు అనేదానికి రాక ఆరులోనే నిలిచెను. గనుక దండనకు పాత్రుడాయెను.

విస్తరించి మాటలాడరాదుగాని బైబిలు సంఖ్యలలో చాల అర్థమున్నదని చదువ రులు గ్రహించియుంటారని నా నమ్మకము. ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైనది. గనుక బైబిల్ యొక్క కడపటి గ్రంథములో కార్యములన్నియు సంపూర్తికి వచ్చుచుండుట చేత సారిసారి ఆరుగాని తొమ్మిది గాని కనబడక ఏడు నక్షత్రములు ఏడు సంఘములు ఏడు దీపస్తంభములు ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు మొదలైన విషయ ములు ఏడు అనే సంపూర్ణ సంఖ్యలో యోగ్యముగానే మనకు తెల్పబడుచున్నవి.

యోహాను 4 లో సమరయ స్త్రీ ఐదుగురుతో నుండి ఆరవవాని దగ్గరకు వచ్చి యుండెను. అతడుకూడ ఆమెకు పెనిమిటి కాడు అయితే నేమి? – క్రీస్తు చిక్కుటతో ఆమె కార్యము సరిపోయినదిలెండి. క్రీస్తు తానే సంపూర్ణుడు మరియు ఆమె అనుభవ ములో ఆమెకు ఆరుగురు తరువాత ఏడవవాడుగా చిక్కెను. 7 అనే సంఖ్యకు తగినట్టు ఆమె రక్షణలోనికి వచ్చినది. స్తోత్రము.

పదమూడు అను సంఖ్య వాక్యములో చాల విశేషమైనది. అది తిరుగుబాటుతో చేరియున్నది, ఆది 14:4 లో తొలిగా కనబడుచున్న ఈ పదమూడవ సంఖ్య ఆలాగే తుదివరకు నానా భాగములలో చెడ్డ అర్థముతోనే కూడియున్నది. మానవుని హృదయములోనున్న చెడుగును క్రీస్తు తెలియ జేయుచు పదిహేనుగాని పదిగాని చెప్పక సరిగా తిరుగుబాటునకు సూచనయైన పదమూడు దుర్గుణములనే వెలిబుచ్చెను – మార్కు 7:21,22 తీసి లెక్కపెట్టండి. మానవుడు దేవునిమీద తిరుగుబాటు చేసిన వాడు అని వ్రాయబడియున్నది.

పది అనే అంకము పరిశోధనతో కూడినది-పదిమంది కన్యకలు, యూదులకు విరోధియైన హామానుకు పదిమంది కొడుకులు, పది ఆజ్ఞలు, ప్రకటనలోని పదిమంది రాజులు, సారిసారి చెప్పబడిన పది దినములనేది. (దానియేలు- 1:12,14). ఇవన్నియు పది అనే సంఖ్యయొక్క ప్రత్యేక ఆత్మీయమైన భావమునకు సాక్ష్యమిచ్చుచున్నవి. ప్రశ్న వేసినవాడు సూచించిన నలుభై అంటే మరి విశేషమైనది. నియమింపబడిన నిర్ణయ సమయమునకు సాక్ష్యమిచ్చుచున్నది.

నోవహు దినములలో వారు ఓడలో ప్రవేశించినది మొదలుకొని జలములు విస్తరించి ఆ పెద్ద యోడ తేలువరకు నలువది ప్రత్యేకమైన దినములు జరిగెను. (ఆది 7:17).

ధర్మశాస్త్రమివ్వబడుటకు మోషే నలువది దివారాత్రులు సీనాయి కొండమీద యెహోవాతో గడిపెను. (నిర్గమ 24:18), తిరిగి నలువది రేయింబగళ్లు గడిపెను. (నిర్గమ 34:28).

నలువది దినములు వేగులవారు కనాను దేశము సంచరించి చూచిరి. (సంఖ్యా 13:25). పిమ్మట నలువది యేండ్లు దండనగా అరణ్యభూమిలో నిలిచిపోయిరి. (సంఖ్యా 14:34).

గొల్యాతు ఇశ్రాయేలీయులను తిరస్కరించినది నలువది దినములు -ఆ తరువాత శిక్షింపబడెను గనుక నలుభైయనే సంఖ్య నిర్ణయితమైన పరిశోధనను మనకు చూపుచున్నది. (1 సమూ. 17:16).

క్రుంగిపోయిన ఏలీయా ధర్మశాస్త్రమివ్వబడిన కొండకు వెళ్ళిపోయిన ప్రయాణమునకు సరిగా నలువది దివారాత్రులు పట్టెను. (1 రాజులు 19:8).

ప్రవక్తయైన యోనా స్వరమెత్తి ‘నీనెవె’ మీద ప్రకటించిన నాశన దినములు నలువది దినములు. (యోనా 3:4). దేవునికి స్తోత్రములు-ఆ ప్రసంగము విని ఘనులేమి అల్పులేమి మారుమనస్సునొంది దేవునివైపు తిరిగి, చాటింపబడిన నాశనము తప్పించుకొనిరి.

దెబ్బలు కొట్టితే నలుభై లోపల కొట్టి చాలించుకొనవలెను గనుక నలుభై యనే సంఖ్య నిర్ణయితమైన కాలముతో కూడినది. (ద్వితీయో. 25:3). అరణ్యములో నలువది యేండ్లు మన్నాను భుజించినది, ఏలీ న్యాయాధిపత్యము, దావీదు సొలొమోనులు రాజ్యమేలిన సంవత్సరములు నలుభైయనే సంఖ్య మిళితమైనవి. యిట్టి మొదలగు విషయములు అనేకములు గలవు గాని అన్నియు వివరించ సమయము లేదు.

క్రొత్త నిబంధనలోకూడ క్రీస్తు ఉపవాసముండి యడవిలో పరిశోధింపబడినది నలువది రోజులే. (మార్కు 1:13). మళ్ళీ దీనిలో నలుబది పరిశోధన సంఖ్య అని బోధపడుచున్నది. లేచిన పిమ్మటకూడ శిష్యులకు కనుపించిన కాలము నలుభై రోజులు (అపొ.కార్య. 1:3). మొన్ననే 1 యోహాను పత్రికను పరిశోధించుచుండగా ముప్ప దెనిమిది కాదు నలువదిరెండు కాదు గాని సరిగా నలువది పర్యాయములు ఎరుగు, ఎరిగితిమి, ఎరుగుదుము, అనేది వచ్చెనని కనుగొని మిక్కిలి ఆశ్చర్యపడితిని. అవును. ఈ లోకమే యొక బడి.

క్రీస్తువారీ బడిలో పరిశోధన క్రిందనున్నారు గనుక నలుభై మార్లు ఎరుగుమని హెచ్చరింపబడుచున్నాము. ఎరుక లేనిది దేవునికిష్టము లేదు. కాబట్టి భయభక్తులతోనే బైబిలు చదువుచు అందులోని ప్రతి సంఖ్యనుకూడ గమనముతో గుర్తించండి. గొప్ప లాభము లేకపోదు.

Leave a Comment