క్రొత్త బలి – క్రొత్త దేవాలయము (అధ్యాయము 9)
అపొస్తలుడు నూతన యాజకత్వమును (7వ అధ్యాయం) నూతన నిబంధన ఆశీర్వాదములను (8వ అధ్యాయం) మన యెదుట పెట్టి యున్నాడు.
ఇప్పుడు 9వ అధ్యాయములో క్రీస్తుయొక్క నూతన బలిని, దాని అనన్య సామాన్య విలువను, క్రీస్తు బలిద్వారా మనకు ప్రవేశము లభించు దేవాలయమును వివరించుచున్నాడు.
భూసంబంధమగు దేవాలయము – శరీర సంబంధమగు బలులు. (1-7 వచనములు).
(వచనములు 1-5). అపొస్తలుడు మొదట పూర్వకాలపు ప్రత్యక్ష గుడారమునుగూర్చి ప్రస్తావించెను. సాదృశ్యములుగా అందులో ఎన్నో సత్యములున్నవి. అవి సాదృశ్యరూపకముగా ఎంత విలువైనవైనను ఆ సత్యములను అతడు ఇచ్చట వివరించుటలేదు.
దీనితో పోల్చగా పరలోక గుడారము ఎంత శ్రేష్టమైనదో చూపించుటయే రచయిత ఉద్దేశ్యము. ప్రత్యక్ష గుడారమునకు సంబంధించి ఎన్నో సేవా నియమములున్నను అది ఈ లోక సంబంధమగు దేవాలయమే.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
దాని అందము, విస్తారమైన ఆచార వ్యవహారములు, కన్నుల పండుగగానుండు ఉత్సవములు, ప్రకృతి సంబంధియగు మానవునికి ప్రత్యేక ఆకర్షణగా నుండెను.
అందువలన అది భూసంబంధులకు సరిపోయినది. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని రెండు విభాగములను అపొస్తలుడు నొక్కి చెప్పుచున్నాడు.
(వచనములు 6,7). ప్రత్యక్ష గుడారపు ఆకారమును, దానిలోని ఉపకరణములను సూచించిన తరువాత, అపొస్తలుడు యాజకులను, ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన బలులను, ప్రజలనుగూర్చి వివ రించుచున్నాడు.
ప్రత్యక్ష గుడారమునకు సంబంధించి దేవుని పరిచర్య జరిగించునది యాజకులేగాని ప్రజలు కాదు. ప్రత్యక్ష గుడారములోని రెండవ భాగములోనికి ప్రధాన యాజకునికి ఒక్కడికే ప్రవేశించు అర్హత ఉన్నది.
అదికూడ సంవత్సరమునకొకసారి. రక్తము లేకుండా కాదు – తనకొరకును, ప్రజల పాపములకొరకును రక్తము అర్పించవలసియున్నది. ఈ అధ్యాయము మొదటి ఏడు వచనములలో అపొస్తలుడు చివరి అధ్యాయములో ప్రస్తావించిన “శిబిరమును” గూర్చి వర్ణించుచున్నాడు. (13:13).
శిబిరము దగ్గర చూచుటకు అందముగానున్న గుడారము చుట్టు అసంఖ్యాక ప్రజలు, దానిలో ఒక భాగము అనగా అతి పరిశుద్ధ స్థలము తెరతో అడ్డగించబడి ఉండును. సామాన్య ప్రజలకు భిన్నమైన యాజకుల సమూహము ప్రజల పక్షముగా దేవుని పరిచర్య జరిగించు చుందురు.
ప్రత్యక్ష గుడారము – దాని బలుల భావము.
(వచనములు 8–10). ప్రత్యక్ష గుడారము, దాని సేవలనుగూర్చి మనము నేర్చుకొనినదేమి? మన స్వంత భాష్యము చెప్పుటకు వీలులేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దాని భావమును సూచించియున్నాడు.
ధర్మ శాస్త్రముక్రింద దేవుని సన్నిధికి మనకు ప్రవేశము యింకను వెల్లడికాలేదని ప్రత్యక్ష గుడారపు సేవా నియమములు స్పష్టముగా చూపెట్టుచున్నవని మొదట మనము గ్రహించవలెను.
రెండవది – అతి పరిశుద్ధ స్థలములోనికి మార్గము యింకను తెరువ బడలేదనుట ఈ బలులు చాలినవి కాదనుటకు స్పష్టమైన ఋజువు. మనస్సాక్షి విషయములో ఆరాధకుని ఆ బలులు పరిపూర్ణునిగా చేయలేవు.
మూడవది – ఈ వస్తువులన్నియు అమలులో ఉన్నప్పుడు అవి రాబోవువాటి మేలుల ఛాయగా నున్నవి. ఈ అలంకారిక రూపములు దేవునికి సంతృప్తి కలిగించలేవు, మానవుని అక్కరను తీర్చలేవు.
అటు వంటి వ్యవస్థలో దేవుడు మూసివేయబడి ఉన్నాడు. మానవుడు వెలుపల నున్నాడు. యూదా మతవ్యవస్థ మనకు పరలోకమును తెరువలేదు లేదా మనలను పరలోకమునకు యోగ్యులనుగా చేయలేదు.
అయితే క్రైస్తవ లోకముకూడా పరిశుద్ధాత్మ బోధను విస్మరించి, ప్రత్యక్ష గుడారమును అలంకారిక రూపముగా చూడక, తమ మతవ్యవస్థకు నమూనాగా తీసుకొన్నది. ఆ విధముగా చేయుటద్వారా ఆ అలంకారిక రూపము చెప్పుచున్న “మేలులను” పోగొట్టుకొనిరి.
క్రైస్తవ లోకములో అసంఖ్యాకులు గొప్ప గొప్ప కట్టడములను నిర్మించి, వారు నిర్మించిన భవనములలోని ఒక భాగము మరియొక భాగముకంటే పరిశుద్ధమైనదని చెప్పుచున్నారు.
సామాన్య ప్రజలకు భిన్నముగా యాజకులను ఒక ప్రత్యేక వర్గముగా నెలకొల్పి ప్రజల పక్షముగా మత కార్యకలాపము జరుపుటకు నియమించుకొనుచున్నారు. ఆ విధముగా దేవునికి దూరముగా నుంచు యూదా శిబిరము నమునాలో ఒక వ్యవస్థను నెలకొల్పుకొనియున్నారు.
ఆ వ్యవస్థ మనస్సాక్షికి సంపూర్ణసిద్ధి కలుగజేయదు. అపొస్తలుడు 9, 10 అధ్యాయములలో ప్రస్తావించిన పరిపూర్ణ సిద్ధి, లేదా కడుగబడిన మనస్సాక్షి అనునది వేర్వేరుచోట్ల ప్రస్తావింపబడిన “నిర్మలమైన మనస్సాక్షికి” భిన్నమైనది. కడుగబడిన మనస్సాక్షి అనగా ఒకసారి శుద్ధియై పాప జ్ఞప్తి ఇక ఉండని మనస్సాక్షి అని అర్థము. (10:2).
పాపముల విషయమై మనస్సాక్షిని అభ్యసింపజేయుచుండగా క్రీస్తుయొక్క ప్రశస్త రక్తము విశ్వాసిని శుద్ధిచేసెనని, ఇక ఎన్నడును అతడు తీర్పులోనికి రాడని ఎరిగిన మనస్సాక్షి, నిజ జీవితములో ప్రవర్తనలో అపరాధ భావన లేనిది. అది మంచి మనస్సాక్షి.
క్రొత్త బలి. (11-23 వచనములు)
(వచనము 11). క్రీస్తు రాకతో అంతా మారిపోయినది. వెంటనే మనకొక ప్రధాన యాజకుడు, గొప్పది మరింత పరిపూర్ణమైనది అయిన గుడారము మరియు నూతన బలి సంప్రాప్తించినవి.
ఈ లోక సంబంధ మైనవాటికి అహరోను ప్రధాన యాజకుడు. అయితే “క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయములో ప్రధాన యాజకుడు”. “క్రీస్తు బలిద్వారా ప్రస్తుత ఆశీర్వాదములు విశ్వాసికి సంక్రమించినవి”.
అయితే క్రీస్తు ప్రధాన యాజకుడని చెప్పబడిన “మేలులు” – అవి “రాబోవునవి”. ఆ విధముగా ఆత్మ మన అరణ్యయాత్ర ముగింపును సూచించెను. 2:10 లో క్రీస్తు అనేకులగు కుమారులను మహిమకు తెచ్చుచున్నాడని నేర్చుకొంటిమి.
2:5 లో ‘రాబోవు లోకమునుగూర్చి చదువుదుము. 4:9 లో నిలిచి ఉండు విశ్రాంతి ప్రస్తావించబడినది. 6:5 లో మరల రాబోవు లోకమును గూర్చిన ప్రస్తావన ఉన్నది.
రాబోవు లోకములో మనకు “మేలులు” సమకూర్చుటకు, మన అరణ్యయాత్రలో సహాయపడుటకు క్రీస్తు మన ప్రధాన యాజకుడుగానున్నాడు.
క్రీస్తు యాజకత్వము అహరోను యాజకత్వమును ప్రక్కన బెట్టిన యెడల “ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునగు గుడారము” భూ సంబంధమగు గుడారముకూడా ప్రక్కన పెట్టబడును.
భూసంబంధమైన గుడారము హస్తకృతము, ఈ సృష్టి సంబంధమైనది. “అయితే పరిపూర్ణమైన గుడారము పరలోక సంబంధమైనది”. (23 వచనము).
(వచనము 12). లేవీయులు చేయు బలులన్నియు క్రీస్తు చేసిన ఒకే ఒక గొప్ప బలిద్వారా ప్రక్కన పెట్టబడినవి. ఆయన పరలోకమునకు ముంగుర్తుగానున్న అతి పరిశుద్ధ స్థలములో తన స్వంత రక్తముతో ఒక్కమారే ప్రవేశించెను.
అహరోను వంశమువారైన యాజకులు “ప్రతి సంవత్సరము” ఒకసారి ప్రవేశించెదరు. అందుకు భిన్నముగా క్రీస్తు పరలోకమందు “ఒక్కసారే ప్రవేశించెను”. ఆయన అంతకుముందే విమోచింపబడినవారి పక్షముగా యాజక ధర్మము జరిగించుటకు అందులో ప్రవేశించెను.
(వచనములు 13, 14). నిత్య విమోచనము సంపాదించిన క్రీస్తు రక్తము కోడెలయొక్కయు, మేకలయొక్కయు రక్తమును ప్రక్కకు పెట్టినది. ఈ జంతువుల రక్తము శరీర విషయములో శుద్ధి కలిగించుట నిజమే. క్రీస్తు రక్తము మనస్సాక్షిని శుద్ధిచేయును.

యాజకునిద్వారా అర్పించబడు జంతువుమాత్రమే ద్వారా పూర్తిగా ప్రక్కన పెట్టబడినది. పరిశుద్ధాత్మద్వారా క్రీస్తు శరీరధారి యాయెను. పరిశుద్ధాత్మద్వారానే ఆయన తన పరిపూర్ణ జీవితము జీవించగలిగెను.

రెండవ అధ్యాయము 9వ వచనములో దేవుని కృపవలన యేసు ప్రతి మనుష్యునికొరకు మరణమనుభవించెనని చెప్పబడినది. ఆ విధముగా దేవునికి క్రీస్తు తనను అర్పించుకొనినది నీకొరకేనని పాపికి మనము ప్రకటించగలము.
ఈ బలిద్వారా కలుగు గొప్ప ప్రయోజనమేమనగా “నిర్జీవ క్రియల నుండి మనస్సాక్షిని శుద్ధిచేయుట” క్రీస్తు తనను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకొనినందున, దేవుడు ఆ గొప్ప బలిని అంగీకరించి – క్రీస్తునందు, ఆయన చిందించిన రక్తమునందు సంపూర్ణ తృప్తినొందియున్నాడు.
కనుక క్రియలద్వారా ఆశీర్వాదమును సంపాదించుకొన ప్రయత్నించిన మానవుని మనస్సాక్షి దానినుండి విడిపించబడినది. ఆ విధముగా మనస్సాక్షియందు విడుదల పొందిన విశ్వాసి దేవునిని ఆరాధించువాడాయెను.
(వచనము 15). క్రీస్తు అర్పణ దేవుని పరిశుద్ధతను, పాపి అవస రతను తీర్చును గనుక క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియాయెను. పిలువబడినవారందరును నిత్య స్వాస్థ్యమను వాగ్దానములో ప్రవేశించు నట్లు క్రీస్తుద్వారా క్రొత్త నిబంధన ఆశీర్వాదములు సమకూడెను.
(వచనములు 16, 17). “మరణము ద్వారా” ఆ స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును విశ్వాసి పొందుచున్నాడని అపొస్తలుడు తెలియ జేయుచున్నాడు.
రచయిత ప్రస్తావించిన మరణముయొక్క ఆవశ్యకతను వివరించుటకు ఈ రెండు వాక్యములలో మరణ శాసనముద్వారా స్వాస్థ్యములనుగూర్చిన వాగ్దానము సంక్రమించుననియు, అది కూడా మరణ శాసనము వ్రాసినవాని మరణముద్వారా అమలులోనికి వచ్చు ననియు తెలియజేయుచున్నాడు.
(వచనములు 18-22). క్రొత్త నిబంధన, క్రొత్త గుడారముయొక్క ఆశీర్వాదములు “మరణముద్వారా” మాత్రమే కలుగునని, అవి భూ సంబంధమగు గుడారము, మొదటి నిబంధనలద్వారా అలంకారికముగా రచయిత చూపెట్టుచున్నాడు. మొదటి నిబంధన రక్తముచే ప్రతిష్టింపబడెను.
ప్రత్యక్ష గుడారము, దాని ఉపకరణములన్నియు రక్తముచే ప్రోక్షింపబడెను. రక్తముద్వారానే మనిషికి ఆశీర్వాదము, దేవుని సమీపించుట జరుగుననుట కిది సాక్ష్యముగానున్నది.
దీనినంతటివలన చివరకు తేలినదేమనగా “రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు”. ఇక్కడ ప్రస్తావించినది రక్తము ప్రోక్షించుట కాదు, “రక్తము చిందించుట”. దేవుడు అందరినీ క్షమించు టకు, విశ్వసించినవారిని క్షమించినట్లు ప్రకటించుటకు ఆధారమిదే.
(వచనము 23). ప్రత్యక్ష గుడారము, దాని ఉపకరణములన్నియు “పరలోకమందున్నవాటి పోలికయై” యున్నవి. కోడెలయొక్కయు, మేకల యొక్కయు రక్తము కలిగి శారీరక శుద్ధితో భూసంబంధమైన గుడారమందు ప్రవేశించుట సాధ్యపడెను. అయితే పరలోక వస్తువుల శుద్ధికి మరింత శ్రేష్టమైన బలులు అవసరమాయెను.
నూతన ఆలయము (24-28 వచనములు)
రచయిత 11వ వచనములో “క్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చి” అను మాటలతో శ్రేష్టమైన బలులు అను అంశమును ప్రారంభించెను.
అయితే ఇప్పుడు “నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదుగాని, ఇప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” అను మాట లతో మన మనస్సులను నూతన ఆలయమువైపు మళ్ళించుచున్నాడు.
అక్కడ, అనగా దేవుని సముఖమందు యేసుక్రీస్తు మన ప్రధాన యాజ కునిగా తన ప్రజల తరపున దేవునియెదుట ఉన్నాడు. “క్రీస్తు మనకొరకు” పరలోకమందు దేవుని సముఖములో కనబడుట పరలోకము మనకొరకు సంపాదించబడి, విశ్వాసికి తెరువబడియున్నదనుటకు నిత్యసాక్షియై ఉన్నది.
(వచనములు 25-28). పైగా, విశ్వాసి పరలోకమున ప్రవేశించు టకు అడ్డువచ్చిన ప్రతి అవరోధము ఒకే ఒక్క శాశ్వత బలిద్వారా తొలగించబడెను. లేవీయులు అర్పించు బలులు ఏటేటా జరిగించు చున్నందున అవి పాపమును తీసివేయుటకు సరిపోయినవి కావని స్పష్టమగుచున్నది.
అయితే అందుకు భిన్నముగా క్రీస్తు యుగముల సమాప్తియందు పాప నివారణ చేయుటకై తనను తానే బలిగా అప్పగించు కొనుటద్వారా ప్రత్యక్షమాయెను.
“మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడెను”.
ఆ విధముగా క్రీస్తు తానే బలియగుటవలన పాపము నివారణ చేయ బడెను. పాపములు భరించబడెను. మరణము, తీర్పు విశ్వాసికి లేకుండా తొలగించబడెను.
క్రీస్తు రెండవమారు ప్రత్యక్షమగునప్పుడు విశ్వాసికి కలుగు ఆశీర్వాద కరమగు ఫలితమేమనగా, ఆయన యిక పాపము విషయమై చేయున దేమియు ఉండదు.
ఆయన మొదటి ప్రత్యక్షతలో పాపమును పరిహరించి నందున, రెండవసారి ఆయన ప్రత్యక్షమగునది తన ప్రజలను పాపలోకము నుండి రక్షించి, శత్రువు అధికారమునుండి తప్పించి, నిత్యము నిలిచి ఉండు విశ్రాంతిలోనికి నడిపించుటకే. ఈ భాగములో క్రీస్తుయొక్క మూడు ప్రత్యక్షతలు ప్రస్తావించబడినవి.
పాపమును తీసివేయుటకు పాపమును భరించుటకు తీర్పును తొలగించు టకు సిలువలో గతకాలమందు ప్రత్యక్షమగుట (వ. 26); ప్రస్తుతము పరలోకమందు తన ప్రజల పక్షముగా ప్రధాన యాజకుడుగా ప్రత్యక్ష మగుట; భవిష్యత్తులో మహిమలో ప్రత్యక్షమగుట.
అప్పుడు తన ప్రజలను అరణ్యమువంటి లోకమునుండి, దానిలోని శోధనలు, బలహీనతలన్నిటి నుండి సంపూర్ణముగా రక్షించును.