కయీను గుర్తు
ప్రశ్న:- ఆదికాండము 4:15 లో కయీనుకు యెహోవా వేసిన గుర్తు ఏది?
జవాబు :- అన్నీ బైబిల్ లో లేవు. ఉన్నవాటిలోనే తేలుచు మునుగుచునుండగా అదెందుకు వ్రాయబడలేదు, ఇదెందుకు వ్రాయబడలేదని అడుగ యుక్తము కాదు. యేదో యొక గుర్తు యెహోవా తానే నరహంతకుడైన కయీనుకు వేసెను.
అదేమిటో బయలుపరచ బడలేదు. ఇట్లుండగా దాని జోలికేల పోయెదము? అక్కరలేదు. అది మన కవసరముగానుంటే దేవుడు తెలిపి యుండేవాడు. ఆ గుర్తు ఏమిటో తెలిసికొన ముఖ్యమైనది కానందుచేత ప్రభువు దాని వివరము మనకప్పగించలేదు.
మహిమలో నన్ను అడిగితే ఆ ప్రశ్నకు జవాబిచ్చెదను! ఇప్పుడు సరిగా నివ్వలేను. ఒక వ్యాఖ్యాన నిఘంటువులో చూడగ నొకడూహించి చెప్పినదేమనగా యెహోవా కయీనుకు కలుగజేసిన భయంకరమైన ముఖ వర్చస్సుచేతనే కయీనును చూచినవారప్పుడే ఆయన జోలికి పోక తొలగిపోయిరి.
ఆ ముఖ వైఖరియే ఆ గుర్తు. మరి కొందరిలాగూహించి చెప్పుచున్నదేమనగా, నల్లరంగుగల ముఖముతో యెహోవా కయీనును మొత్తెను. ఆ నల్లని వర్ణమే యెహోవా పెట్టిన గుర్తు.
ఇవన్నియు వట్టి యూహలే. కాబట్టి వాటిని మానివేస్తే మంచిది. యెషయా 3:9 లో వ్రాసినట్లు పాపుల ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చుచున్నది. ఒకని ఆత్మయొక్క అద్దము ముఖమే అని యొక లోకోక్తి కలదు. లేదా, ఒకడు క్రీస్తును నమ్మి క్రొత్త జన్మము పొందెననుకొండి.
ఆ సంతోషము ముఖములో నుండదా? ఉంటుంది. దేవుని జ్ఞానమైన క్రీస్తు నెరిగినవాని ముఖమునకు ప్రసంగి 8:1 లో నున్నటు తేజస్సు కలిగియుంటుంది. మీ ముఖ మెట్లున్నది? ఇప్పుడు భక్తుల నిజమైన గుర్తు పరిశుద్ధాత్మయై యున్నాడు. (రోమా 8:9). పరిశుద్ధాత్మను పొందితిరా లేదా?