ప్రేమ ప్రయాణం

ప్రేమ ప్రయాణం

“ఏం కావాలి నీకు?” కర్ణకఠోరమైన స్వరంతో గర్జించాడు ఆ వ్యక్తి. అతడు జాన్ ఊహించినదానికన్నా చండాలంగా ఉన్నాడు. అతడి కళ్ళు క్రొవ్వుమడతల్లో మూసుకు పోయిన పంది కళ్ళలా ఉన్నాయి. ఏదైనా సంతలో ఒక కోతిలా అతణ్ణి ఆడించేలా అతని ఒంటినిండా రోమాలు దట్టంగా ఉన్నాయి.

“త్రాగడానికి మంచి నీళ్ళు కావాలండీ, నేను హెల్సీ ప్రాంతానికి చెందినవాణ్ణి. ఇప్పుడు చెస్టర్కు వెళుతున్నాను. జాను కొద్ది కొద్దిగా భయమేస్తోంది. కుర్రాణ్ణి మోసం చేయడం సుళువేగాని హెల్స్బీ చుట్టు ప్రక్కల ప్రాంతమంతా క్షుణ్ణంగా తెలిసిన ఈ మృగంలాంటి మనిషిని మోసంచేయటం చాలా కష్టమే! వీడు సామాన్యంగా వదిలేట్లు లేడు.

“ఈ మధ్య ఎప్పుడైనా పెక్ఫోర్త్ కొండలకు వెళ్ళావా?” ఆ వ్యక్తి అడిగాడు.

“బీస్టన్ కోటను చూసేందుకా?” జాన్ ఎదురు ప్రశ్న వేశాడు.

“హెల్బీ కొండపైన విలియం గ్రేడీ అనే సన్నకారు రైతు తెలుసా?” ప్రశ్నించాడా

“విలియం గ్రాడీనా?” నసిగాడు జాన్. అతని మెదడు వేగంగా పనిచేస్తోంది. ఏం సమాధానం చెప్పాలి? ఈ వ్యక్తి ఒకవేళ తనను పరీక్షించడానికి విలియం గ్రేడీ అనే వ్యక్తి పేరును యిప్పుడు సృష్టించాడేమో!

ఇంటి తలుపు దఢాలున తెరుచుకొంది. ఓ అందమైన అమ్మాయి పరికిణి, జాకెట్తో ఎగురుకుంటూ వచ్చి, “ఈ పరదేశికి నేను నీళ్ళిస్తా” అంది. ఆమె మేరీ!

“నిన్ను యింట్లోనుండి బయటకు ఎవర్రమ్మన్నారు?” కోపంగా అడిగాడు ఆమె మామ. అతని పంది కళ్ళు ఆమెవైపు క్రూరంగా చూస్తున్నాయి. “సరే త్వరగా యిచ్చి పంపు” అతడు గర్జించాడు. తన మామయ్య ప్రశ్నలనుండి జాన ను తప్పించాలన్నట్టు మేరీ జాన్తో మాట్లాడుతూ అతణ్ణి బావివద్దకు తీసుకెళ్ళింది.

అయితే మేరీ మామయ్య వాళ్ళను వెంబడిస్తూ జానన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. జాన్ మేరీతో మాట్లాడేందుకు అతడు అవకాశం యివ్వడంలేదు. జాన్ మేరీవైపు చూశాడు. ఆమె మునుపటికన్నా అందంగా స్త్రీత్వం ఉట్టిపడుతున్నట్టుంది. ఆమె తెలివికిప్పుడు ఆశ్చర్యపడుతున్నాడు జాన్.

మేరీ తనకు నీళ్ళందించిన తర్వాత వాటిని త్రాగుతున్నట్టు నటిస్తూ అడిగాడు, “మీ అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది?”

“ఈ రోజు ఆకాశం చాలా వింతగా ఉంది” – మేరీ కనుబొమ్మలు పైకెత్తుతూ అంది – “ఏ క్షణంలోనైనా శీతాకాలం రావచ్చనిపిస్తోంది.”

మేరీ చెప్పింది జాన్ కర్థమైంది. వాళ్ళత్తమ్మ బ్రతికుందిగాని ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అన్నట్టుంది. మేరీ మామయ్య తనవైపు కోపంగా చూడ్డం జాన్ గమనించాడు. “నేను చెస్టర్కు వెళ్ళడం మంచిదని తోస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే త్వరలో నేను పెళ్ళి చేసుకుంటాను. చీకటిపడ్డాక ఏ విషయం తెలుస్తుందని ఆశిస్తున్నాను” జాన్ అన్నాడు.

“నీ జీవిత కథ మాకెందుకోయ్ ఎర్ర జుట్టు వెధవా” – పెద్దగా గాండ్రించాడు మేరి మామయ్య – “నీ దారిన నీవు వెళ్ళు. నీ తిరుగు ప్రయాణంలో యిక్కడికేం రానవసరం లేదు.”

“అలాగేనండీ”.

జాన్ పెద్ద పెద్ద అడుగులు వేసుకొంటూ వేగంగా వెళ్ళిపోయాడు. “ఓ భగవంతుడా! మేరీ నా మాటల్ని అర్థంచేసికొని ఈ రాత్రికి పొలంలోకి వచ్చేట్లు చెయ్యి” చాలాకాలం తర్వాత దీర్ఘప్రార్థన చేశాడు జాన్. అతడు గడ్డివాములో రంధ్రం చేసుకొని అందులోకి వెళ్ళి చీకటిపడేదాకా అక్కడే ఉన్నాడు.

జాన్ కృంగిపోయి నిరుత్సాహంగా ఉన్నాడు. ‘తన ప్రార్థనలకెప్పుడూ జవాబు రాలేదు. ఎప్పుడైనా వచ్చాయా? అయితే కోటగోడవద్ద నదిలో తన పడవ తిరగబడ్డప్పుడు తాను ప్రార్థనచేస్తే దేవుడు విన్నాడుకదా! కాని, చనిపోయిన తన సహచరుని మాటేంటి?’ ఈ సందేహానికి జవాబు దొరకడం జాన్కు కష్టమనిపించింది. “దేవా దయచేసి మేరీని నాకప్పగించు.”

ప్రొద్దుగ్రుంకి బాగా చీకటిపడింది. ఆ చీకట్లో ఏమీ కనపడ్డంలేదు. అంతా నల్లని తారులా ఉంది. జాన్ గడ్డివామినుండి బయటకు వచ్చి కొద్ది దూరం నడుచుకొంటూ వెళ్ళాడు. ఒకవేళ మేరీవస్తే ఈ చీకట్లో తనను చూడగలుగుతుందా? మేరీ యింటికి సమీపంగా వెళ్ళడం ప్రమాదం. కుక్కలను లేపినట్టవుతుంది.

ఒక గడ్డివామికి ఆనుకొని కూర్చొని ప్రతి రెండు మూడు క్షణాలకొకసారి అది గాలి శబ్దమో, ప్రేమ జ్వరం తగిలిన గుడ్లగూబ అరుపో తేడా తెలియనంత మెల్లగా ఈలవేస్తూ కూర్చొన్నాడు. కాసేపటికి అతని నోరు కాగితంలా ఎండిపోయింది.

“ఇక్కడుంది నువ్వేనా జాన్ బన్యన్ ?”

“మేరీ!”

మొదట వారు ఒకరికొకరు దూరంగా నిలుచున్నారు. తర్వాత ఒకరికొకరు దగ్గరయ్యారు.

“నీవు తిరిగి వస్తావన్న ఆశను నేనెప్పుడూ వదులుకోలేదు” మేరీ అంది. ఆమె స్వరం ఆనందబాష్పాల్ని మోసుకొచ్చింది.

“నిన్ను తీసుకెళ్ళడానికి నేను సరైన ప్రయత్నం చేసుంటే బాగుండేది” జాన్ అన్నాడు. “నువ్వు ప్రయత్నం చేయకపోవడమే మంచిది. నీవెవరో, ఎక్కడినుండి వచ్చావో మా మామయ్యకు యింతవరకు తెలీదు.”

“నా భార్యగా నాతోకూడ వచ్చెయ్ మేరీ”.

“ఇక్కడైనా, వేరెక్కడైనా ముందుగా ప్రశ్నించకుండా మన పెళ్ళి జరిపించేందుకు చర్చి అంగీకరించదుకదా?!”

“క్రామ్వలెక్క ఈ నూతన శకంలో చట్టాలన్నీ మారిపోయాయి. మన పెళ్ళికేమీ అభ్యంతరం ఉండదు.” జాన్ కొద్దిసేపు మేరీ జవాబుకోసం ఎదురుచూశాడు. ‘మేరీ తనతో రాకుండా ఉండే అవకాశం ఉందా?’

“నేను కట్నమేమీ యిచ్చుకోలేను. నేను ఎప్పుడైనా ఒక పెన్నీ ముట్టుకొన్నట్టుకూడ నాకు జ్ఞాపకంలేదు. పుట్టినప్పటినుండి నేనొక నిరుపేదను”.

“నీవే నాకొక గొప్ప ధననిధివి మేరీ”.

“కొద్దిసేపు నన్ను ప్రార్థనచేసికోనివ్వు” ఆమె అడిగింది.

జాన్ నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు. ‘మేరీ ఎందుకు ప్రార్థన చేసికోవాలంటోంది? చిమ్మచీకట్లో ఈ పచ్చిక బయలుమీద మోకరించడంద్వారా ఆమెకేం తెలుస్తుంది? ఎక్కడో మారుమూలన ఈ నక్షత్రాలకన్నా యింకా దూరంగా ఉన్న దేవుడు ఈమె మాటల్ని ఇప్పుడు వింటున్నాడా?’

“నేను తిరిగి వెనక్కు వెళ్ళాలి” – కొద్ది సేపటి తర్వాత చెప్పిందామె.

“వద్దు” తుపాకీ గుండు తగిలిన సైనికుడు అరిచినట్టుగా అరిచాడు జాన్.

“నా దుస్తులూ, యింకా కొన్ని వస్తువులూ తెచ్చుకోడానికి” – అని చెప్పి మేరీ అక్కణ్ణుండి వెళ్ళింది.

‘దేవుడు మేరీ ప్రార్థనకు జవాబిచ్చాడన్నమాట. ఎలా యిచ్చాడు?” జాన్ తనలో తాను ఆలోచిస్తున్నాడు. ‘ఈ విషయం తర్వాత ఆమెనడగాలి’. మేరీ కోసం ఎదురుచూసే కొద్దీ జాన్లో భయం ఎక్కువౌతోంది.

‘ఆమెను వాళ్ళ మామ రాకుండా ఆపేస్తే!’ ఈ లోకంలో గుండెలు పగిలే విషయాలనెన్నింటినో జాన్ చూశాడు. ‘ఒక అంగుళం వాసి తేడాలో ఎంతమంది సైనికులు చనిపోలేదు! అయినా మేరీ వెళతానంటే తానెందుకు అంగీకరించాడు?’ కాలం అతని ఒంటిమీద సాలెపురుగు ప్రాకినట్లుగా కదలసాగింది.

“జాన్ ! …”

“మేరీ!

మేరీ తన చేతిలోని ఒక చిన్న మూటను జాన్ చేతిలో ఉంచింది. జాన్ తన సంచిని గడ్డివామి క్రిందనుండి బయటకు తీసి తన భుజానికి తగిలించుకొని మేరీ చేయి పట్టుకొని ముందుకు నడవసాగాడు. ఇద్దరూ చేయి చేయి పట్టుకొని వాయవ్య దిశగా నడుస్తున్నారు.

“మనం పగటిపూట దాక్కోవాలి తెలుసా? నేనిక్కడకు వచ్చే ముందు కొన్ని రొట్టెలు, జున్ను కొన్నాను. కాబట్టి మనకు ఆహారంగూర్చి చింతలేదు. మనం క్షేమంగా గమ్యం చేరతాము. నాకా నమ్మకముంది” జాన్ చెప్పుకుపోతున్నాడు.

మేరీ ఏమీ ప్రశ్నించలేదు. వాళ్ళు పగలు తప్పక దాక్కోవాలి. ఎందుకంటే మేరీ వాళ్ళ మామయ్య కొన్ని రోజులవరకు వాళ్ళకోసం తప్పక వెదుకుతాడు. ప్రొద్దుపొడవ డానికి కొంచెంముందుగా యింకా చీకటుండగానే వాళ్ళు పొలాల్లోని ఏదైనా ఒక గడ్డివామిలో దాగి, ప్రొద్దుపోయేంతవరకు అందులోనే ఉండేవారు.

వామిలోపల వాళ్ళు తయారుచేసుకొనే గూడు చాలా వేడిగా ఉండేది. కాని సమయమంతా భవి ష్యత్తునుగూర్చి గుసగుసలాడుతూ వారు గడిపేవారు. మేరీ శ్వాస అతనికి పాలు తేనెల్లో స్నానమాడినట్లుండేది. ఎండవేడిమి విపరీతంగా ఉంటేకూడ వారలానే కాసేపు నిద్రించేవారు.

చీకటిపడగానే అందులోంచి బయటకు వచ్చి తిరిగి రాత్రంతా ప్రయాణం కొనసాగించేవారు. రాత్రిళ్ళు వీచే చల్లని గాలి వారి ముఖాలకు సేదదీర్చేది. వారు ఆగ్నేయ దిశగా మలుపు తిరగక ముందు ఒక చిన్న కొండవాగులో నీళ్ళు త్రాగి, అక్కడ స్నానాలు చేసి తిరిగి ప్రయాణం కొనసాగించారు.

చాలా రోజులు రాత్రిళ్ళు ప్రయాణం చేసిన తర్వాత యిప్పుడు పగలు ప్రయాణం చేస్తున్నారు. జాన్ సమయాన్ని తన ప్రణాళిక ప్రకారం కచ్చితంగా పాటించాడు. మే నెల్లో జరిగే సంతలు, ఉత్సవాల కోసం మనుష్యులు పల్లె ప్రాంతాల్లో రద్దీగా తిరుగుతున్నారు.

గతంలో జాన్ స్నేహితుడూ ప్రస్తుతం ఒక చర్చి పాస్టరూ అయిన గిబ్స్, జాన్ మేరీల వివాహం జరిపించాడు. ఆ నూతన దంపతులు గిబ్స వద్ద రెండు దినాలు గడిపారు. అక్కడ ఉత్సవాల్లో నిమగ్నమైయున్న ప్రజలు వీరిని అంతగా పట్టించుకోలేదు.

మేరీకోసం తిరిగి వెళ్ళానన్న తన నిర్ణయాన్ని జాన్ ఎంతగానో అభినందించుకున్నాడు. ఆనందం, తన్మయత్వం, ఉత్సాహం, కార్యసాధన వీటన్నిటితోబాటు మేరీ తోడు అతనిలోని ఆలోచనా శక్తిని హరించివేసింది.

న్యూపోర్ట్ ప్యాగ్నెల్నుండి వాళ్ళు తూర్పున ఉన్న హంటింగ్టన్ మీదుగా ప్రయాణం చేశారు. అక్కడనుండి వారు ఈశాన్యదిశగా ప్రయాణంచేసి ఎలోలోని ‘బన్యన్ ఎండ్’కు వచ్చారు.

“ఈమె మేరీ … అవునా?” ఆశ్చర్యం నిండిన ముఖంతో అన్నాడు జాన్ తండ్రి, జాన్ ఆమెను తన భార్యగా పరిచయం చేసిన తర్వాత.

“ఏ ప్రాంతంనుండి వచ్చావు మేరీ?” జాన్ సవతి తల్లి ఆనీ అడింది

“మేరీది సముద్రతీర ప్రాంతం” – జాన్ అన్నాడు. ఆ వెంటనే నిజాన్ని ఒక అబద్ధానికి మార్చాడు – “మేము ఈశాన్యదిక్కునుండి రావడం నీవు చూళ్ళేదూ?” “అవును ఆ ఫెన్స్ ప్రాంతంనుండి వచ్చారుకదూ?” ఆసక్తిగా అంది ఆనీ. అద్భుత మైన ఆ భూభాగం జలప్రళయంనుండి తప్పించబడిందని విన్నాను. మీ యింటి పేరేంటమ్మా?”

“ఇప్పుడామె యింటి పేరు బన్యనే!” నవ్వుతూ చెప్పాడు జాన్.

ఎలోలోగాని, బెడ్ఫోర్డ్లోగాని మేరీ పుట్టింది పేరు తెలిసే అవకాశం లేదు. తన సవతి తల్లి ఈ విషయంలో ఆరాతీసే అవకాశం జాన్ యివ్వలేదు. ఎందుకంటే ఎలోలోని ప్రధాన మార్గంలో ఒక చిన్న యింటిని జాన్ అద్దెకు తీసుకున్నాడు.

ఆ యింటి వెనక భాగంలో జాన్ ఒక కొలిమి ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. జాన్ కూడబెట్టిన కొంత డబ్బు, మేరీ బట్టలమూటలో దాచితెచ్చుకొన్న రెండు పుస్తకాలు తప్ప ఈ జంటకు వేరే ఆస్తిపాస్తుల్లేవు.

సైన్యంలో ఉండేటప్పుడు జాన్ పుస్తకాలనుగురించీ, ప్రచురణకర్తలనుగురించీ ఎంతో తెలుసుకొన్నప్పటికీ తనలాంటి సామాన్యులు ఆ పుస్తకాల్ని కలిగి ఉండటం జాను ఆశ్చర్యాన్ని కలిగించింది. లోకంలో అత్యంత నిరుపేదయైన మేరీ ఒక్కటికాదు, రెండు పుస్తకాలు సంపాదించింది.

“మా నాన్న నాకోసం ఈ రెండు పుస్తకాలు వదలిపెట్టిపోయాడు. ఆయన చాలా దైవభక్తిగలవాడు” మేరీ గర్వంగా చెప్పింది.

మేరీకి సరైన పరిజ్ఞానం లేకపోయివుంటే ఆ విషయంమీద జాన్ వాదన పెట్టుకొనేవాడే. “ఆ పుస్తకాలేంటి?” అడిగాడు జాన్.

“బిషప్ లూయిస్ బేలి వ్రాసిన ‘పవిత్రతను అభ్యసించుట’ (The Practice of Piety by Bishop Bayly), పాస్టర్ ఆర్థర్ డెంట్ వ్రాసిన ‘పరలోకానికి సాధారణ మనిషి త్రోవ’ (The Plain Man’s Pathway to Heaven by Pastor Arthur Dent). ”

ఆ పుస్తకాల్లోని విషయంపై ఆసక్తి లేకపోయినప్పటికీ చదవడంలో తనకు ప్రావీణ్యత ఉందని చెప్పడానికి జాన్ మేరీతో కలిసి చదవడం ప్రారంభించాడు. బిషప్ బేలీగారి పుస్తకంలో వ్రాయబడిన ‘పాపులు పశ్చాత్తాపం పొందితే కృప సమృద్ధిగా ఉంటుంది’ అన్న సత్యం బాగానేవుందిగాని అది అసందర్భంగా ఉన్నట్టు జాన్కు తోచింది.

అది కొద్దిగా తనకు అన్వయింపబడి ఉంది. ధనవంతుల్లో అతి కొద్దిమందిమాత్రమే రక్షించ బడగలరని బేలి విశ్వసించాడు. ఈ మాట జాన్కు బాగా నచ్చింది. బేలి పుస్తకం చదవడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. మేరీ పుస్తకాన్ని చాలా బాగా చదవినట్టుంది. అందులో ఏదో మేరీని కలవరపరచినట్లుందిగాని అదేదో జాను తెలీదు.

ఆర్డర్ డెంట్ అనే మత బోధకుడు వ్రాసిన “పరలోకానికి సాధారణ మనిషి త్రోవ” అనే ఆమె రెండో పుస్తకం జాన్ ఊహల్ని తుపానులా తాకింది. ఈ పుస్తకం బేలీగారి పుస్తకంతో అనేక విషయాల్లో ఏకీభవించింది.

ధనవంతుడుగా ఉంటూ సుగుణాలు కలిసి ఉండుటలోగల యిబ్బందులనుగూర్చి ఈ పుస్తకంలో చక్కగా వివరించబడింది. ఇది ఒక కథలాగా కొనసాగుతుంది. మే దినాల్లో ఒక దేవదారు వృక్షం క్రింద కూర్చొన్న నలుగురు వ్యక్తుల సజీవ సంభాషణతో కూడినదీ పుస్తకం.

ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ‘యాంటిలేగన్’ అనే రౌతు. ఇతడు ‘జీవితమంటే ఆనందించడం’ అనే విషయాన్ని ఖండించేవాడు. జీవితంపట్ల అతనికున్న నిరాశా దృక్పథం జాన్ విన్న ‘రాంటర్ల’ మాటల్లాగా అనిపించింది. యాంటిలేగన్ దాదాపు అన్నింటినీ హేళనచేస్తాడు. ‘ఫిలగథాస్’ అనే మరో వ్యక్తి నిజాయితీ కలిగిన లౌకికుడు.

‘అసునేటోస్’ అనే మరొక వ్యక్తి అమాయకుడైన వెర్రివాడు. ఇక నాల్గవ వ్యక్తి ‘థియోలోగస్’ ఒక వేదాంతి. వీరి మధ్య సంభాషణ హాస్యధోరణిలో కొనసాగుతుంది. వాళ్ళ వ్యాఖ్యానాల్లో ఆతిథ్యంలాంటి సుగుణాలు తిండిబోతుతనంలాంటి చెడుతనంగా వక్రీకరించబడతాయి.

“విషయాన్ని విశదీకరించేందుకు ఎంత మంచి హాస్యధోరణి ఉపయోగించబడింది!” జాన్ మేరీతో అన్నాడు. “విషయాలన్నీ సామాన్య వాడుక భాషలో చాలా విశదంగా వివరించబడ్డాయి. ఇంతకుమునుపెన్నడూ యిలాంటి పుస్తకం నాకెదురవలేదు.

ఇది మంచి కాలక్షేపాన్నిచ్చే పుస్తకం. ఇప్పుడు గుర్తొస్తోంది, న్యూపోర్ట్ ప్యాగ్నెల్ స్థావరంలోని సైనికులు కాలక్షేపంకొరకు యిలాంటి పుస్తకాలను బిగ్గరగా చదివేవారు. ఒక పుస్తకంలో సర్ వరల్డ్లీ వైస్ లాంటి వ్యక్తులమధ్య చాలా ఉత్సాహాన్ని కలిగించే సంభాషణలు కొనసాగుతాయి.

వేరొక పుస్తకంలో హింస, హేతువు, నిశ్చయత అనే వ్యక్తులు బంధింపబడి స్వేచ్ఛ, అమాయకత్వం, సువార్త అనే న్యాయనిర్ణేతలు మరియు దేవుని ఉగ్రత అనే న్యాయాధిపతి ముందు నిలువబడిన సన్నివేశంలోని వారి సంభాషణ చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది” పుస్తకాలనుగురించి తనకంతా తెలుసునన్నట్టు పెద్ద లెక్చరిచ్చాడు జాన్.

“సువార్తా?” – మేరి మధ్యలో కలుగజేసికొని జాన్ మాటలకు అంతరాయం కలిగించింది – “ఒక మనిషి దైవికంగా మా నాన్నలాగా ఉండాలంటే ఈ సువార్త జ్ఞానం చాలా అవసరం.”

“ఆయన ఒక్కొక్కరి జీవిత వ్యవహారాల్లో జోక్యం చేసికొని వారినెలా సరిచేసేవాడో యిప్పుడు నాకు మళ్ళీ చెప్పబోతున్నావా?”

“ఈ సువార్త సత్యాన్నిగూర్చి వినేందుకు నాతో చర్చికి రావా జాన్?”

“చర్చికి తప్పక వెళ్ళాలన్నది ఇంగ్లాండు దేశ చట్టం గనుక నేను నా చిన్నతనంనుండి చర్చికి వెళుతూనే ఉన్నాను. కాని ఇప్పుడిక అది చట్టం కాదు. తప్పకుండా చర్చికి వెళ్ళాలన్న నిబంధనేం లేదు” జాన్ అన్నాడు.

“నీవు తీసుకెళితే తప్ప నేను చర్చికి వెళ్ళలేను” మేరీ దిగులుగా అంది.

మోక్షానికి సాధారణ మనిషి త్రోవ’ అనే పుస్తకంతో ప్రోత్సహించబడ్డ జాన్ తాను సైనిక స్థావరంలోనున్నప్పుడు చదివిన అనేక కథల్ని చెప్పుకుపోతున్నాడు. తాను వాటన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొన్నందుకు తనకే ఆశ్చర్యంగా ఉంది. “ఈ కథల్ని చదివి దాదాపు నాలుగు సంవత్సరాలైంది.”

“ఈ కథల్లో ఉపయోగించిన విచిత్రమైన పేర్లవల్లే నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో గలిగావు” మేరీ అంది.

“సరిగ్గా చెప్పావు. ఈ క్రొత్త విధానమే జ్ఞాపకశక్తిని పెంచుతోంది. అది యిప్పుడు నాకు తెలుస్తోంది. పాస్టర్ డెంట్స్ గారి పుస్తకాల్ని నేనెంతగా యిష్టపడతానో ఆయన ఉపయోగించిన థియోలోగస్, అసునెటాస్ లాంటి అపరిచితమైన పేర్లు అంతగా నాకు చిరాకు కల్గిస్తాయి. అవి గ్రీకు లేదా లాటిన్ భాషల్లోని పదాలై ఉండాలి” జాన్ అన్నాడు.

“అవి లాటిన్ పదాలని అనుకొంటాను” – మేరీ అంది – “అలాంటి పదాలు నాకు చర్చిలో ఎక్కువ వినిపిస్తుంటాయి. నేనిప్పుడు చర్చికి వెళ్ళలేకున్నాను. నన్ను చర్చికి తీసుకెళ్ళవా జాన్?”

జాన్ అంత కఠినమైనవాడేం కాదు. మేరీ దీనమైన కళ్ళు అతని గుండెను కరిగించివేసాయి.

ఆ తర్వాత జాన్ ఎల్టాలోని చర్చికి మేరీని తీసుకెళ్ళడం ప్రారంభించాడు. చర్చిలో పాస్టర్ క్రిస్టఫర్ హాల్ చేసే ప్రసంగాలను అతడు పెద్ద ఆసక్తిగా వినడంలేదు. చర్చి అలంకరణను, చర్చి అందాన్ని అతడు బాగా ఆస్వాదిస్తాడు. చర్చి తన జీవితంలో అత్యంత సౌభాగ్యవంతమైన అనుభూతి.

ఆ అనుభూతి కోసం తాను తపించిపోయేవాడు. ఇప్పుడు మేరీతోకూడ క్రమంగా చర్చికి వెళ్ళడంవల్ల పాస్టర్ గారి వస్త్రధారణ, బిషప్ గారి దుస్తులు అతడు బాగా గమనించగలుగుతున్నాడు.

పొడవైన నిలువుటంగీ, దానిపైన పొడవైన కండువా, మెడపట్టీ, బిషప్ తలపైని కిరీటం – వీటన్నిటినీ జాన్ చాలా ఆసక్తిగా పరిశీలించడం ప్రారంభించాడు. అలాగే పాస్టరుగారికి సహాయకులుగా ఉండే వారి దుస్తులుకూడ జాన్కు ఆసక్తిని కలిగించేవి.

ఏదో ఒక రోజు తానుకూడ ఇలాంటి దుస్తులు ధరిస్తాడేమో! అతడు మేరీని ఉదయం, సాయంత్రం చర్చికి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత ప్రతి ఆరాధనకు ముందు గంట కొట్టేందుకు జాను పాస్టరుగారు అనుమతినిచ్చారు.

“ఆ త్రాడు పట్టుకొని వ్రేలాడుతూ అద్భుతమైన ఈ గుడిగంటలు మోగిస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. అలా కొడుతున్నప్పుడు వచ్చే ప్రకంపనలు బిగుసుకొన్న నా చేతులనుండి అరికాలివరకు ప్రవహించడాన్ని నేను అనుభవిస్తుంటాను” ప్రతి ఆరాధన తర్వాత జాన్ మేరీతో అనేవాడు.

పాత్రలకు కళాయి వేసేవాడిగా తనకున్న వివిధ లోహాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని జాన్ మొదట ఆ గుడి గోపురంలోని ఐదు గంటల్ని తిలకించాడు. సులభంగా కరిగిపోయి, మట్టిమూసలో పోయబడు ‘గంటలోహం’గా పిలువబడే ఒక విశిష్టమైన యిత్తడి మిశ్రితలోహంతో ఆ గంటలు తయారుచేయ బడ్డాయి.

ఆ తర్వాత క్రమబద్ధమైన వాటి స్వరాన్ని అతడు ఆస్వాదించడం నేర్చుకున్నాడు. అతనిలో ఎక్కడో సంగీతంపట్ల అభిరుచి ఉన్నట్లనిపించింది. ఆ గంటలనుండి వచ్చే ఆది, మధ్యమ, ఉచ్ఛ స్వరాలు తాను వాటిని మ్రోగించిన తర్వాత గంటల తరబడి క్రమబద్ధమైన రీతిగా తన చెవుల్లో అలానే ప్రతిధ్వనిస్తూ ఉండేవి. మళ్ళీ ఆ గోపురంవద్దకు వెళ్ళి గంటలు కొట్టే సమయానికై అతడు ఆసక్తితో ఎదురుచూసేవాడు.

గతంలో తాను ఒంటరిగా ఉన్నప్పటి జీవితానికీ, యిప్పుడు మేరీతో కలిసి జీవించే తన జీవితానికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడతడు ఊర్లో దాదాపు అందరిచేత గౌరవించబడుతున్నాడు. అయితే ప్రతి ఆదివారం మధ్యాహ్నం పచ్చికమైదానాల్లో ఆడటంమాత్రం మానలేదు. తనకు తెలియకుండానే తానింకా ఒట్టుపెట్టుకొంటున్నాడు. కాని అతని జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. 1649 ఆఖర్లో అతని జీవితంలో ఒక పెను మార్పు వచ్చింది. తాను తండ్రి కాబోతున్నాడు!

“అన్ని సౌకర్యాలూ అమర్చబడివున్న యింత చక్కని కుటీరాన్ని అద్దెకు తీసుకొనే టప్పుడు ‘మనకింత యిల్లు అవసరమా?’ అనుకొన్నాను. కాని అలా తీసుకోవడం మంచిదైంది” సంతృప్తితో అన్నాడు జాన్.

“బహుశా, దేవుడు నిన్నలా ప్రేరేపించి ఉంటాడు.”

“ఆయ్యుండొచ్చు” జాన్ అన్నాడు అంగీకారంగా.

ఆదివారంనాడు పనిచేయడాన్నీ, ఆటలాడటాన్నీ ఖండిస్తూ ఒక ఆదివారం పాస్టర్ హాల్ చేసిన ప్రసంగాన్ని విని జాన్ అదిరిపడ్డాడు. ఆ ప్రసంగం తనకు చక్కగా అన్వయింపబడుతుంది. ‘ “కర్రా-బిళ్ళా” ఆట ఆడటంలో తప్పేంటి? తనుగాని, తన స్నేహితులుగాని యిప్పుడు పందెంకట్టి ఆడ్డం లేదు. తనపై పందెం కాచేవారెవరూ యిప్పుడు లేనప్పటికీ ఈ మార్పు ఒక సుగుణంగా తాను భావిస్తున్నాడు.

ఈ ఆటలో తన నైపుణ్యం చాలా ప్రసిద్ధికెక్కింది. తను మెప్పు పొందడం తప్పా?’ ఆ ప్రసంగం అర్థం లేనిదిగా కొట్టిపారేశాడు జాన్. ఆ ప్రసంగాన్ని తాను పెద్దగా వినకపోవడం మంచిదైంది.

ఆ రోజు మధ్యాహ్నం పచ్చికమైదానంలో జాన్ కర్రా-బిళ్ళా ఆటలో కొట్టిన మొదటి దెబ్బకే బిళ్ళ గిరగిరా తిరుగుతూ పైకి లేచి, గాల్లో సుడులు తిరిగింది. అతడు తన భుజాలు త్రిప్పి, మణికట్టును చాచి గర్వంగా దానివైపు చూశాడు. జాన్ కొట్టే రెండో దెబ్బకు బిళ్ళ తప్పకుండా ఒక మైలు దూరంలో పడి ఉండేదే!

“నీ పాపాన్ని విడిచి నీవు పరలోకం వెళ్తావా? లేక నీవు నీ పాపాల్లోనే జీవించి నరకానికి వెళ్తావా?” ఒక స్వరం అతని గుండెను పిండుతూ ఆకాశంనుండి ప్రశ్నించింది.

జాన్ తన చేతిలోని కర్రను క్రిందపడేశాడు. ‘తనను ప్రశ్నించిందెవరు?’ జాన్ తిరిగి పైకి చూశాడు. తానేదో పెద్ద తప్పు చేసినవాడిలా అతడు వ్యాకులపడ్డాడు. ఇంత విచారం తనకెప్పుడూ కలగలేదు. అతడు హ్యారివైపూ, రోజరై వైపూ చూశాడు. వాళ్ళిద్దరు అతనివైపు వింతగా చూస్తున్నారు.

“మీరది విన్నారా?” జాన్ వాళ్ళనడిగాడు.

“నీవు కొట్టకుండా వదిలేసిన బిళ్ళ క్రిందపడ్డ శబ్దంమాత్రం విన్నాను” – ఎగతాళిగా అన్నాడు హ్యారీ – “నువ్వు ప్రక్కకు జరుగు. ఇది నా వంతు” హ్యారీ తిరిగి అన్నాడు.

హ్యారీ తన వంతుగా కర్రను తీసుకొంటూ ఉంటే జాన్కు తల తిరుగుతోంది. ‘తనలో ఎప్పుడూ యిలాంటి అపరాధ భావన కలగలేదు. తనలోని ఈ అపరాధ భావన తొలగిపోవాలంటే తనేం చెయ్యాలి? తను తప్పు చేస్తోంది నిజమే. తనను గద్దించిన ఆ స్వరంకూడ అదే చెప్పింది.’

మళ్ళీ తన వంతు వచ్చినప్పుడు జాన్ ఆడేందుకే నిశ్చయించుకున్నాడు. ‘ఇప్పుడు తాను చేస్తున్న పాపం విషయంలో తనేం చేయగలడు? తను తప్పిపోయి ఉన్నాడంటే తప్పిపోయే ఉన్నాడు. తను పాపంకూడ చేసివున్నాడు.’ ఒక పెద్ద ఊపుతో బిళ్ళను ఆకాశంలోకి కొట్టాడు.

తన జీవితంలో మొట్టమొదటిసారిగా తాను పాపినని ఆ మధ్యాహ్నం జాన్ తెలుసుకొని యింటికెళ్ళాడు. దేవుడుగాని, దేవదూతగాని ఆ మాట పలికి ఉంటారని తనకు తెలుసు. ఆ తర్వాత ఎల్టాలో అంత మంచిపేరులేని ఒక స్త్రీకి సంబంధించిన దుకాణం ముందు జాన్ హ్యారీతో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆమె దుకాణంలోనుండి దూసుకొచ్చి జాన్ ముందు నిలబడింది.

“నువ్వు నాకు అసహ్యం పుట్టిస్తున్నావు జాన్ బన్యన్. నీలాగ ఒట్టుపెట్టుకొనేవాణ్ణి నేనెప్పుడూ చూళ్ళేదు” ఆమె అంది కోపంగా.

“నేనా?” నమ్మలేనట్లుగా అడిగాడు జాన్.

“ఎల్లో నీలాగ దేవునిపట్ల భయంభక్తీ లేనివాళ్ళెవరూ లేరు. యౌవనస్థులు నిన్ను ఆదర్శంగా తీసికొని చెడిపోకూడదని నేను దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను.”

“ఆమె ఎందుకలా అంది?” ఆమె దుకాణంలోనికి వెళ్ళిన తర్వాత జాన్ హ్యారీతో అన్నాడు.

“ఆమె మాటల్ని పట్టించుకోకు. ఇతరులకు నీతులు చెప్పేంత గొప్ప మనిషేం కాదామె. నువ్వు ఒట్టుపెట్టుకొంటావు. అయితే ఏంటట?”

అయితే అది జాను కలవరపెట్టింది. ఎవరో తనను లాగి చెంపమీద కొట్టినట్టని పించింది. ‘నైతిక విలువల్లేని ఒక స్త్రీకూడ అసహ్యించుకొనేంత పాపాత్ముడా తను? తను తన తండ్రంత చెడ్డవాడేం కాదు.

సైన్యంలో ఉన్నప్పుడు కొన్ని బూతు మాటలు తాను నేర్చుకొని ఉండొచ్చు. అయితే ఆ గ్రామీణ ప్రాంతంలో తన్నంతగా మెచ్చుకొనే వాళ్ళంతా వాస్తవానికి తన్నొక చండాలునిగాను, బూతులు తిట్టే వెధవగానూ భావిస్తు న్నారా? జాన్ బన్యన్ అనే తాను పనికిమాలిన మూర్ఖుడైన అసునేటోస్ కంటే చెడ్డవాడా?” ఈ విషయం తీవ్రమైన అవమానంగా తోచింది జాను.

పరలోకంలోని దేవుడు తనను మళ్ళీ ఒక బాలుడుగా చేస్తే బాగుండును. అప్పుడు దైవసంబంధమైన మంచి మాటలు మాట్లాడ్డం తాను నేర్చుకుంటాడు – “దేవా దయచేసి ఈ బూతుమాటల్ని నా నోట్లోనుండి తీసెయ్యి. ”

ఆ రాత్రి భోజనం దగ్గర తన మనస్సులోని భావాలను అణచుకొనేందుకు జాన్ మేరీతో ఏవేవో విషయాలు మాట్లాడ్డం ప్రారంభించాడు. జానైవైపు విచిత్రంగా చూస్తోంది మేరీ. “ఏం అలా చూస్తున్నావు?” అమాయకంగా అడిగాడు జాన్. అతని మనస్సేం బాగోలేదు. జరిగిన సంఘటనలు అతనిలో అలజడిని రేపుతున్నాయి. “నేనేమన్నా తప్పు మాట్లాడానా?” మళ్ళీ అడిగాడు.

మేరీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “నీ మాటల్లో ఎక్కడా తప్పులేదు.”

“నిజంగానా?”

“ఇంకొంచెం క్యారెట్ పులుసు వేసుకో జాన్” ప్రేమగా అంది మేరీ.

భోజనాల తర్వాత యిద్దరూ కలిసి బైబిల్ చదువుకున్నారు. జాన్ మేరీకోసం కొన్న ఏ వస్తువుకూడ ఈ క్రొత్తరకం బైబిలు యిచ్చినంత తృప్తిని ఆమెకు యివ్వలేదు. జారీచేశాడు. ఈ రకమైన బైబిల్ను తయారుచేసేందుకు క్రాంవెల్ స్వయంగా ఆజ్ఞలు జాన్ ఈ బైబిలును చాలా ఆసక్తితో చదవసాగాడు.

ఈ విషయం తెలిసి గిబ్స్ ఎంతో సంతోషించాడు. అందులో అద్భుతమైన కథలున్నాయి. ఇది దేవుని వాక్యమని జాన్ యిప్పుడు మనస్పూర్తిగా నమ్ముతున్నాడు. అందులో దేవుడిచ్చిన పది అద్భుతంగా ఉన్నాయి. దైవికంగా జీవించడానికి అవి చాలా ఉపయోగపడతాయి. ‘కాని యివి దేవుని హృదయంలోంచి వచ్చాయా లేక మోషే మెదడులోంచి వచ్చాయా?’

ఒక రోజు రాత్రి మేరీ యింకా బిడ్డను ప్రసవించకముందు అంచెలంచెలుగా నొప్పులు రాసాగాయి. ఈ నొప్పులకు అర్థమేంటో మేరీకి తెలియలేదు. అయితే జాన్ మేరీ కళ్ళలో భయాన్ని చూశాడు. జన్మనివ్వడం ఒక విపత్తుతో కూడుకొన్న పని. ఆవిడ జాన్ ప్రక్కన బాధతో మూల్గుతూ మెలికలు తిరుగుతూ తెరలుతెరలుగా వచ్చే నొప్పుల్ని ‘ఏం కాదులే’ అన్నట్టు నటించడానికి ప్రయత్నం చేస్తోంది.

తన మేరి బాధతో సుడులు తిరగడం అన్నది జాన్ ఆలోచనల్లో అత్యంత దురదృష్టకరమైన సంఘటన. జాన్ తన తల పైకెత్తి నిశ్శబ్దంగా ప్రార్థన చేశాడు, “దేవా! నీవు కాన్పు నొప్పులనుండి నా భార్యను కాపాడి యీ రాత్రి ఆమెకేం కష్టం కలగకుండా చేశావంటే నీవు హృదయ రహస్యాలను ఎరిగే దేవుడవని నిశ్చయంగా నేను తెలుసుకోగలను. ” వెనువెంటనే మేరీ మూల్గటం మాని గాఢ నిద్రలోకి జారుకుంది.

“అది నిజంగా అద్భుతం!” ఆ మరుసటి రోజు జాన్ తనలో తాననుకొన్నాడు.

ఆ తర్వాత చాలా వారాలవరకు అంటే 1650 జూలై నెలలో పురిటి నొప్పులు వచ్చేవరకు మేరీకి మధ్యలో ఎటువంటి నొప్పులు రాలేదు. ఆ దినం జాన్ సవతి తల్లి ఆనీ మేరీకి సహాయంగా వచ్చింది.

జాన్ తండ్రి అతడికి ధైర్యం చెబుతున్నాడు. కాన్పు చాలా కష్టంగా సుదీర్ఘంగా కొనసాగింది. కొన్ని గంటల తర్వాత పిడికిళ్ళు బిగబట్టి ఏప్రికాట్ పండులాంటి ముఖంతో ఉన్న ఆడశిశువు మేరీ ప్రక్కన పండుకొని ఉంది. ఈ క్రొత్త తలిదండ్రులు తమ బిడ్డకు బాప్తిస్మమిప్పించి ‘మేరీ’ అని నామకరణం చేశారు. అయితే ఆ బిడ్డ గ్రుడ్డిదని తెలుసుకున్నాక వాళ్ళ ఆనందం కాస్త ఆవిరైపోయింది.

‘ఎందుకిలా అయింది?’ జాన్ తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ‘అంతా సవ్యంగా, మృదువుగా సాగిపోతుంటే ఎందుకిలా జరిగింది? తాను మారుమనస్సు పొందలేదా? లేక పది ఆజ్ఞలను ఆచరించే ప్రయత్నం చెయ్యడంలేదా? ఎప్పుడైనా ఒకవేళ దేన్నైనా భంగపరచివుంటే తాను వెనువెంటనే పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకోలేదా? ఎందుకు దేవుడు తనను యింత కఠినంగా చూస్తున్నాడు? బహుశ తాను నిజంగా మార్పునొంద లేదేమో?’ జాన్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

‘మేరీ ముందు నొప్పులు పడిన రాత్రి తాను దేవుణ్ణి శోధించాడా? అదేనా కారణం? లేక ఆ రాత్రి దేవుడు తన ప్రార్థనకు జావాబిచ్చాడన్నది తనకు సందేహమా? లేక తాను యింకా మానుకోవలసినవి మానకుండా కొనసాగిస్తున్నాడా? అవును తను యింకా అల్లరి నృత్యాలు చేస్తూనే ఉన్నాడు.

పోయిన మేడే నాడు మేరీ గర్భిణిగా భారంతో కూర్చొనివుంటే తాను మాత్రం మే సంబరాల్లో గంటలతరబడి నాట్యం చేస్తూ ఆనందించసాగాడు. ఆ తర్వాత చర్చీలో గంటలు, వాటిని మ్రోగించడంలో సంతోషాన్ని అనుభవించడం మాత్రమేగాక వాటిని మ్రోగించేవానిగా గర్వించాడుకూడా.’

జాన్ నాట్యానికీ, గంటలు మ్రోగించే పనికీ స్వస్తి చెప్పాడు. కాని ప్రతి ఆరాధనకు ముందు గంటల గోపురంలో గంటలు మ్రోతలతో పులకించి మైమరచిపోయేవాడు. అయినా కొన్ని పర్యాయాలు అంధురాలైన తన కూతురును తలచుకొని కృంగిపోయే వాడు.

‘ఆమె ఎంత నిస్సహాయురాలు! పైనున్న గుడి గంటలలో యే ఒక్కటైనా అమాంతం ఊడి తన నెత్తిన పడకూడదా!’ జాన్ యుద్ధంలో పని చేశాడు. యుద్ధంలో దేహాలు చితికిపోగా, ఛిద్రమైన కీటకాల్లా కొన ఊపిరితో కొన్ని క్షణాలు విలవిల్లాడే అనేకమందిని తాను చూశాడు. తాను మరణించడానికి ముందు తన ఆఖరి తలంపులు ఎలా ఉంటాయో తనకు తెలుసు.

“అయ్యో! పాపం నా మేరీలు. వాళ్ళను అభాగ్యులుగా చేసి నేను ఎలా వెళ్ళగలను?”

జాన్ గంటల శబ్దాలు వినేందుకు గంట గోపురానికీ, చర్చికీ మధ్యనున్న గోపురం వెనక్కు వచ్చాడు. అతని మనస్సులో అప్పుడొక ఊహ : ‘ఆ గంటల్లో ఒకటి ఊడి నేరుగా క్రిందకు పడకుండా ఏటవాలుగా వచ్చి ఒక గోడకు గుద్దుకున్నట్టూ, ఆ తర్వాత తనమీద పడి తనను నుజ్జునుజ్జు చేసినట్టూ’ – కనుక చర్చి గంటల శబ్దం వినడానికి జాన్ చర్చినుండి బాగా దూరంగా వెళ్ళసాగాడు.

అసలు గోపురం మొత్తం కూలితే ఏమౌతుంది?” చర్చి గంటలు ఎలవాళ్ళను చర్చికి రమ్మని గుర్తుచేసినట్లు జాన్కుకూడ గుర్తు చేసేవి. జాన్ ఆలస్యంగా చర్చికి వెళ్ళేసరికి గంటల శబ్దం కాస్త ఆగిపోయేది. జాన్ గంటలు కొట్టే పనిని పూర్తిగా వదులుకున్నాడు. అలాగే నాట్యం చేయడాన్ని కూడా.

రోజురోజుకూ జాన్ లో మార్పు రాసాగింది. అలా అతనిలో ఎంత మార్పు వచ్చిందన్న విషయం తెలుసుకోడానికి యీ సంఘటన చాలు. ఒక రోజు వీధిలో జాన్ తన పాత స్నేహితుడు హ్యారీని కలుసుకున్నాడు. “ఎలా ఉన్నావ్ హ్యారీ?” ముభావంగా అడిగాడు జాన్. వాస్తవం ఏమిటంటే తన గత పాపమార్గానికి హ్యారీయే కారణమన్న ధోరణితో జాన్ చాలా వారాలుగా అతణ్ణి కావాలని తప్పించుకు తిరుగుతున్నాడు.

“ఓహ్! చాలా బాగున్నాను బిషప్ జాన్ గారూ!” వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు హ్యారీ అదనంగా దేవుణ్ణిగురించి చర్చి గురించి కొన్ని దూషణలు జోడిస్తూ. “హ్యారీ! నువ్వు దేవునికి దూరంగా ఉంటూ చనిపోతే నీ గతేమౌతుందో నీకు తెలుసా?”

“నాలాంటి వాళ్ళు లేకుండా సైతాను ఈ లోకంలో ఏం చెయ్యగలుగుతాడు” తర్వాత జాన్ను దూషిస్తూ నడిచి వెళ్ళాడు హ్యారీ.

Leave a Comment