ఇస్కరియోతు యూదా
ప్రశ్న:- మీరు పన్నెండు సింహాసనములమీద ఆసీనులై రాజ్యమేలుతారన్నప్పుడు యూదా ఇస్కరియోతు గుంపులో లేడా? గనుక తప్పక అతనికి గతియున్న ట్లున్నది గదా? పశ్చాత్తాపపడెను గనుక పాపక్షమాపణ అతనికి లేదా? ఎందుకు లేదు?
యేసుప్రభువు మత్తయి 19:28 లో పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పుచు మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములకు న్యాయము తీర్తురని చెప్పెను.
అయితే అపొస్తలుల కార్యములలో 1:25,26 వచనములలో ఉరివేసు కొని చనిపోయిన ఇస్కరియోతు యూదా పోగొట్టుకొనిన ఆ స్థానమునకు మత్తీయ అనువాడు పన్నెండవ అపొస్తలుడుగా నియమించబడెను. యేసు ప్రభువు మత్తయి 19:28 లో “మీరును” అని వాగ్దానము చేసినపుడు యూదా కూడా వారిలో ఒకడుగా నుండెను. అనగా ఆ వాగ్దానము అతనికికూడ చేయ బడెను. వాగ్దానము చేయబడిన యూదా, లేక అతని స్థానములో నియమింప బడిన మత్తీయ, ఎవరు ఆ పన్నెండవ సింహాసనమునకు అర్హ్వుడు?
అసలు మత్తయి 27:5 లో యూదా ఉరివేసికొని ఆత్మహత్య చేసి కొనెను. అట్టివాడు పరలోకము చేరడుగాని నరకమే వాని గతి అని నా నమ్మకము. అయితే ఇస్కరియోతు యూదా యేసుయొక్క శిష్యుడే గదా! ఆయనను అప్పగించినప్పటికిని మత్తయి 27:3 లో తిరిగి పశ్చాత్తాపపడెను గదా! అతనికి క్షమాపణ ఎందుకు లేదు? పరలోకములో అతనికి స్థలము ఎందుకు లేదు?
ఇస్కరియోతు యూదా బైబిల్‌లో
జవాబు:-
ఇస్కరియోతు త్రోసివేయబడెను. ఇకను పన్నెండుగురిలో అతడెంచబడరాదు. మీరు అని క్రీస్తు ఆ వచనములో ఇస్కరియోతుతోకూడ మొత్తమునకు పన్నిద్దరని సూచించి చెప్పినను, మీరనిన ముందెలివిగల ప్రభువు జరగబోవు కార్యములన్నియు నెరిగి ఆ మీరు అని వచించెనని నమ్ముచున్నాము. తన్ను అప్పగింపబోవువాడెవడో మొదటినుండి యేసుకు తెలియును. (యోహాను 6:64). కాబట్టి మీరు అని యూదా ఇస్కరియోతును కలిపి మాటలాడినను ఆ వేళకు మొత్తముమీద మాత్రము ఆ వాక్యము పలికెనని అర్థమవుచున్నది.
మీరు ఆ పన్నెండు సిహాసనములమీద ఆసీనులై యుందురని వక్కాణించిన క్రీస్తు తానే అటు పిమ్మట తన్నప్పగించినవానిని గురించి ఆ మనుష్యుడు పుట్టకుంటే వానికి మేలని సెలవిచ్చెను. (మత్తయి 26:24) ఇస్కరియోతు యూదా నిత్యగతి నాశనమే అని చెప్పుటకే సందేహము లేదు.
యూదా మరియు ఇస్కరియోతు సంబంధం
అతడు అపవాదియని పిలువబడెను. క్రీస్తు తానే యిట్లు అతని పిలిచెను. (యోహాను 6:70). అపవాది పరదైసులో నుండగలడా? ఇస్కరియోతు ఉరిపోసుకొని తన చోటికి వెళ్ళెనని అపొ.కా. 1:25 లో వ్రాయబడినది. అపవాది చోటేది? సందేహించుటకు వీలున్నదా? లేదు.
మరియొకప్పుడు నాశనపాత్రుడని అతని పిలిచిన క్రీస్తు యోహాను 17:12 లో తేటగా అతడు నశించెనని తెలియచెప్పెను. అవును అతడే తప్ప ఆ గుంపులో నింకెవ్వరును నశించలేదు.
అతడు విశ్వాసి కాడు. (యోహాను 6:64).
అతడు పవిత్రుడు కాడు. (యోహాను 13:10,11).
అతడు దొంగ, చందాసొమ్ము సహితము అతని కడ్డము లేదు. (యోహాను 12:6)
పనిలో నుండెను సరే గాని ఆ గొప్ప పనిలోనుండి తప్పిపోయి యివ్వబడిన పరిచర్య పోగొట్టుకొనెను. (అపొ. కార్య. 1:25). కాబట్టి పన్నెండు సింహాసనములలో నొకటి ఇస్కరియోతు యూదాది కాదని అతి స్పష్టముగా గ్రహించియున్నాము.
ఇస్కరియోతు అర్థం తెలుగులో
అతడు పశ్చాత్తాపపడలేదా అంటే పశ్చాత్తాపమువంటి మారుమనస్సు అనేది రెండు విధములైనవి. మరణార్థమైనది. జీవార్థమైనది. 2 కొరింథీ 7:10 లో దేవుని చిత్తానుసారమైన దుఃఖమును, లోకసంబంధమైన దుఃఖమును రెండు చెప్ప బడినవి. ఒకటి రక్షణకరమైన మారుమనస్సు కలుగజేయునుగాని రెండవది మరణము నకే కారణమగును.
ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడి వచ్చి రూకలు పడవేసిన సంగతి మత్తయి సువార్త 27:3 లో వ్రాయబడినది. సరిగాని యిట్లు దుఃఖపడుచు దారికి వచ్చెనా? రాలేదు. చీకటిలోనే యుండిపోయి తన పాపములో నశించిపోయెను. పశ్చాత్తాపము సరే గాని రాజైన ఫరో యొక మాదిరిగా పశ్చాత్తాపపడలేదా? పడిలాభమేమి? ఇశ్రాయేలీయులను తరుమక మానలేదే. నిర్గమ 9:27 లోను 10:16,17 లోను చక్కగా రెండు మారులు నేను పాపము చేసియున్నానని మోషేతో నొప్పుకొనెను.
ఒప్పుకొని ఆలాగే 9:34 లో నున్నట్లు ఇంకను పాపము చేయుచు తన హృదయమును తానే కఠినపరచుకొనుచు వచ్చెను. ద్రోహియైన రాజగు సౌలు దావీదుతో “నేను పాపము చేసితిననెను” (1 సమూయేలు 26:21). అయితే ఆలాగు పాపము ఒప్పు కొనిన సౌలు దారికి వచ్చి రక్షింపబడి దావీదును తరుముట మానివేసెనా? లేదే, గనుక ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడెనంటె రక్షణ వేరు పశ్చాత్తాపము వేరని తెలిసికొనవలెను. రక్షణకరమైన పశ్చాత్తాపము యూదాకు లేదాయెను. అపొ. 11:18 లో వర్ణింపబడిన జీవార్ధమైన మారుమనస్సు యూదాకు లేదాయెను.
మనోవేదన కలిగి ఆ రూకలు తీసుకొని వచ్చెను గాని 2 తిమోతి 1:3-5 ప్రకారమైన నిష్కపట మైన విశ్వాసము అనేది యూదాకు లేదాయెను.
బైబిల్‌లో ఇస్కరియోతు గురించి వివరణ
ఏడ్పు రక్షణ కాదు, దుఃఖము రక్షణ కాదు, దొంగిలిన కొన్ని వస్తువులు వాపసు తీసుకొని వచ్చి యిచ్చివేస్తే రక్షణ కాదు. పశ్చాత్తాపము రక్షణ కాదు, మారుమనస్సు రక్షణ కాదు. దగ్గరకు వచ్చి పొందకుండ పోయిన ఇస్కరియోతులో మానవుని హృదయమెంత మోసకరమైనదో గ్రాహ్యమగు చున్నది.
ఆలాగైతే పన్నెండవ అపొస్తలుడెవడు? ఇస్కరియోతు తప్పిపోతే పన్నెండుగురు పదకొండుమందియైరి. పదకొండనే సంఖ్య గమనించండి. (మత్తయి 28:16; మార్కు 16:14; లూకా 24:9,33; అపొ. 1:13; 1:26; 2:14). అయితే పదకొండు మంది మత్తీయతో మళ్ళీ పన్నెండు గురైరి. (అపొ. 2:14; 6:2; 1 కొరింథీ 15:5). అయితే ఈ మత్తీయ కొద్దిగా ఆరంభములో చేర్చబడినట్లుగా కనబడి మళ్ళీ ఇంకెక్కడ కనిపించ కుండ పోయేది ఆశ్చర్యమే. మొత్తానికి అపొ. 2:14 లో నున్నాడు, 6:2 లో నున్నాడు. గాని ఆయన పని వివరము కొంచెమైన లేకపోవుటవలన అతని అపొస్తలత్వమును గూర్చి సంశయించుచున్నాము.
వట్టి చీట్లు వేయుట వలన వీడు తేలెను ఇది సరియా?
పెంతెకొస్తు జరుగకముందే ఇది జరిగెను.
ప్రభువే మత్తీయను నియమించినట్టు తేటగా నెక్కడ సూచన లేదు. గనుక మానుష్యముగా అపొస్తలత్వము నకు పిలువబడెనేమోయని కొంత ఆలోచన మనస్సులో జన్మించుచున్నది.
“నేను అపొస్తలుడను కానా? నేను ప్రభువైన యేసును చూడలేదా?” అని మరియొకడు 1 కొరింథీ 9:1 లో అంటున్నాడు. అపొస్తలునియొక్క గుర్తువంటి చిహ్నములు వీనిలో దండిగ నున్నవి. 2 వ కొరింథీ 12:12 మరియు 1 కొరింథీ 15:10 లో వాస్తవముగా వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితినని సాక్ష్యమిచ్చుచున్నాడు. వీడెవడు? అవును. పౌలే కాబట్టి సరిగా మహిమపరచబడిన క్రీస్తుచేత పన్నెండవ అపొస్తలుడుగా ఏర్పరచబడినవాడు ఈ పౌలే అని నమ్ముచున్నాము. మత్తీయ మానవుని కృతముగా వచ్చినవాడు. పౌలైతే పరలోకమునుండి నియమింపబడినవాడు.
ఏది యెట్లున్నను సింహాసనములు పదమూడు లేవు. అపొస్తలుల సంఖ్యకూడ పద మూడు కాకూడదు. రాబోయే పట్టణముయొక్క ప్రాకార పునాదులు గొర్రెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పన్నెండు పేళ్ళతోనే యున్నవని ప్రకటన 21:14 తెల్పుచున్నది. కాబట్టి అపొస్తలుల లెక్క హెచ్చినట్లు పదమూడుగాని తక్కువైనట్టు పదకొండుగాని రాకూడదు.
పన్నిద్దరే అపొస్తలులుగా నియమింపబడవలెను. కాబట్టి ద్రోహము చేసి వెళ్ళిపోయిన ఇస్కరియోతు యూదా స్థానాన్ని పౌలే తీసుకున్నాడనియు రాబోయే కాలమందు మత్తయి 19:28 చొప్పున పన్నెండు సింహాస నములలో నొకటి యూదాకు కాదు గాని యూదామతస్థుడుగానుండి మార్పుచెంది రక్షింపబడిన పౌలు అనబడిన సౌలుకే చెందునని దృఢముగా తీర్మానించుచున్నాము.గనుక మత్తీయ స్థానానికి పౌలే వచ్చినాడా రాలేదా యని సందేహించవచ్చును గాని ఆ పన్నెండు సింహాసనములలో నొకటి ఇస్కరియోతు యూదాకు వస్తుందా రాదాయని సందేహించరాదు.
ఇస్కరియోతు యూదా కుటుంబ వారసత్వం
నిర్వివాదాంశ ముగా ఇస్కరియోతు యూదా ఆ గుంపులోనుండి మంచి నేర్పుక్రింద జీవించి మంచి మాదిరితో ఆవరింపబడినను పట్టిన పట్టు వదలక తుదకు విశ్వాసము లేనివాడై పోయినందున తప్పిపోయి తనచోటికి వెళ్ళి నశించెనని తేటతెల్లమాయెను.
చదువరీ, మీరుకూడ నింత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినయెడల నెట్లు తప్పించుకొందురని మిమ్మును హెచ్చరించుచున్నాను.