క్రీస్తు దేవుడు కాడా?

క్రీస్తు దేవుడు కాడా?

ప్రశ్న: క్రీస్తు సర్వాధికారియైన దేవుడని నమ్ముచుంటిమి గాని 1 కొరింథీ 15:28 ఎట్లు? క్రీస్తు దేవుడైతే ఆయన దేవునికి లోబడుట ఎట్లు?

జవాబు:-

క్రీస్తు దేవుడనియు దేవునితో సమానుడనియు వారిరువురొక్కరే యనియు నిరూపించతగిన వచనములు దండిగానున్నవి. ఫిలిప్పీ 2:6, యోహాను 1:1, 10:30. అయితే ప్రశ్న పంపినవాడు వారిరువురిలో జగడమున్నట్టు భావించి ప్రశ్న అడుగు చున్నాడు. కుమారుడు తండ్రికి లోబడితే లోబడు కుమారుడెట్లు తండ్రితో నేకమై యుండగలడని ప్రశ్న లేచుచున్నది గనుక లోబడుటలో హీనభావమున్నదా? మనలో నట్లుండవచ్చును గాని తండ్రి కుమారులలో నట్టిది లేదు.

తండ్రీ, మనమేకమై యున్నామని క్రీస్తు అనగలడు. (యోహాను 17:11,22). మరొకప్పుడు యోహాను 5:23 లో తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని చెప్పగలడు గాని అదే క్రీస్తు మరొకప్పుడు తన తండ్రి యాజమాన్యమున నొప్పుకొనుచు యోహాను 10:29 లో నా తండ్రి అందరి కంటె గొప్పవాడని వెలిపుచ్చెను. దీనికిని ముందు తాను చెప్పినవాటికిని ద్వంద్వార్థమున్నదా? లేదు. అందులో మనకూ నేర్పు రావలెను. అందులో మర్యాదక్రమము లెట్టివో నేర్చుకొనవలెను.

1 కొరింథీ 11:3 లో మరియొకసారి శిరస్సత్వమునుగూర్చి బోధింపబడు చున్నాము. సంఘములో కృపమట్టుకు స్త్రీగాని పురుషుడుగాని భేదము లేదు. గలతీ 3:28 సరిగానే యున్నది. అయితే పరిచార ధర్మము నిమిత్తము వారివారి క్రమములు చెల్లవద్దా? గనుక రక్షింపబడిన ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సైయుండగా సంఘములోని స్త్రీకి కూడ పురుషుడే శిరస్సుని చెప్పబడినది. కృపలో భేదము లేకుండగా సేవ క్రమములో కూడ భేదము లేదంటారా? భేదమున్నది. స్త్రీ క్రీస్తు సంఘములో అధికారము వహించరాదు. గనుకనే ఆమెకు పురుషుడు శిరస్సని వ్రాయబడినది. దేవుడును క్రీస్తును ఏకమే గాని మన పాఠముకొరకును నేర్పుకొరకును క్రమము అనే దాని క్రిందను శిరసత్వమనే అంశములోను వ్రాయబడినదేమనగా క్రీస్తుకు శిరస్సు దేవుడే.

ఈ భావము క్రిందనే 1 కొరింథీ 15:28 వ్యాఖ్యానము కావలెను. వెయ్యియేండ్లేమో క్రీస్తు తన స్వంత సింహాసనముమీద నాసీనుడై రాజ్యమేలును. నా సింహాసనమని ప్రకటన 3:21 లో లిఖింపబడినది గమనించండి. ఆరు పర్యాయములీ సహస్ర రాజ్య కాలము చెప్పబడినది. (ప్రకటన 20:2,3,4,5,6,7). ఆ వెయ్యి సంవత్సరముల పిమ్మటనే 1 కొరింథీ 15:28 చొప్పున క్రీస్తు సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి రాజ్యపరిపాలన చేసి ఆఖరికి గొప్ప శత్రువైన మరణమును నశింపజేసి దేవుడే సమస్తములో సర్వమగు నిమిత్తము కుమారుడైనను తండ్రికి లోబడి రాజ్యమును ఆయనకే నప్పగించును. (1 కొరింథీ 15:24-28).

ఆ రాజ్యము నిత్య రాజ్యమనియు అంతము లేని రాజ్యమనియు చెప్పబడినందున రెండు భాగములుగా దాని విభజించి వెయ్యియేండ్ల మట్టుకు క్రీస్తు తన భక్తులతో పరిపాలన చేసిన పిదప మిగతా కాలము అనగా నిత్యత్వములో మొదటి సహస్ర సంవత్సరములు జరిగితే బాకీకాలము క్రీస్తు తండ్రితోకూడ ఆ రాజ్యము నేలునని తెలిసికొంటున్నాము. వెయ్యి యేండ్ల తదనంతరము ప్రకటన గ్రంథములో జూస్తే రాజ్యము ఉమ్మడి రాజ్యమై పోయినట్టు గోచరించుచున్నది. దేవునియొక్కయు గొర్రెపిల్లయొక్కయు సింహాసనమని కనబడుచున్నది. (22:3, 21:22,23).

ఈ వచనములలో దేవుని శబ్దము ముందు, కుమారుని శబ్దము వెనుక వచ్చినవి. 1 కొరింథీ 15:28 నెరవేరినట్లుగా తండ్రియైన దేవుడు సర్వమాయెను. (నిత్యత్వమునకు అంతములేదు. గనుక నిత్యత్వములోని బాకీ కాలమనేది అసంభవము. అయితే సంగతి వివరణకొరకే అట్లు వ్రాస్తినంతే).

Leave a Comment