పరిచయము

పరిచయము

దుర్మార్గులు తమ పాపపు అవధులు దాటినప్పుడు, తమ పాపములకు క్షమా దుపణ ఇక ఏమాత్రం ఉండదనీ, దేవుని తీర్పుకు ఎదురుచూడటం తప్ప తమ ముందు వేరే ఏ మార్గమూ లేదనీ తమకు తెలిసినప్పుడు, తమకు శిక్ష అనేదే లేదనీ అసలు తమ్మును శిక్షించేందుకు దేవుడనేవాడే లేడనీ అభిప్రాయపడే స్థాయికి వారు చేరుకొంటారు. ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని బలపరచే వాదన లను కనుగొనేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆ తర్వాత తాము విశ్వసించే అభిప్రాయాన్ని ఋజువుచేసేందుకు వారు విశ్వప్రయత్నాలు చేస్తారు.

చెడు ప్రభావము

ఒకసారి నేను ఒక క్రూరమైన ఆటవిక వ్యక్తిని కలిసాను. ఆటవిక వ్యక్తి అని ఆ వ్యక్తిని గురించి నేను ఎందుకు అన్నానంటే, అలాంటి మనుష్యులకు ఇవ్వదగిన సరైన పేరు అదే గనుక. వాస్తవానికి ఆ వ్యక్తి సహవాసం నాకు పరమ అసహ్యం.

ఆ వ్యక్తి నాతో దేవుడు దయ్యం అనేవేవీ లేవనీ, స్వర్గం నరకం అనేవి కేవలం కల్పితాలనీ, మనుష్యులను భయపెట్టేందుకే అవి కనిపెట్టబడ్డాయనీ, వాస్తవానికి అవి పిల్లల్ని భయపెట్టేందుకే పనికొస్తాయనీ చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసాయి.

దేవుడు, దయ్యం, పరలోకం, నరకం ఇవేవీ లేవన్న అతని మాటలు విన్న నేను భయంతో వణికిపోయాను. అలా అతడు నాకు పదే పదే చెబుతూ వచ్చాడు. అతడు ఆ మాటల్ని చెప్పడానికి ప్రారంభించిన ప్రతిసారీ నేను భయంతో వణికిపోతూ అతనికి దూరంగా పారిపోతూ వచ్చాను. అయితే, అతని మాటలు పదే పదే నా చెవులకు వినిపించడంవల్ల అవి నన్ను మెల్ల మెల్లగా ప్రభావితం చేయసాగాయి. అవి ఒక స్థాయిలో నన్ను శక్తివంతంగా తాకి నన్ను లోతైన ఆలోచనలో పడవేసాయి.

‘దేవుడు, దయ్యం, పరలోకం, నరకం – వీటిని గురించిన సత్యాసత్యాలను తెలిసికోవడం ఎలా?’ అని నాలో నేను సతమతమయ్యాను.

అప్పటినుండి నేను తీవ్రమైన గలిబిలికి గురయ్యాను. ఆ సమయంనుండి నేను భరించలేనంతగా కారుమేఘాలు నన్ను కమ్ముకొన్నాయి. కటిక చీకట్లు నన్ను ఆవరించాయి. ‘దేవుడు, దయ్యం, పర లోకం, నరకం – వీటిని గురించిన సత్యాసత్యా లను తెలిసికోవడం ఎలా?’ అని నాలో నేను సతమతమయ్యాను.

దేవుడు లేడన్న తలంపు నన్ను తీవ్రమైన భయానికి గురిచేసింది. అయి నప్పటికీ, దేవుని ఉనికిని గురించిన ఋజువేం టని నన్ను నేను ప్రశ్నించుకొన్నాను. నాకోసం పరలోక మహిమ వేచియుందన్న తలంపునుండి నేను ప్రక్కకు రావడానికి ఇష్టపడ లేదు. అయినప్పటికీ, అలాంటి స్థలం నిజంగా ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకొన్నాను. ఇక నరకమనే స్థలం ఒకటి ఉందన్న విషయాన్నికూడ నేను అనుమానించసాగాను.

అయినప్పటికీ, ఒకవైపు నరకపు అగ్నిజ్వాలలు నా ముఖాన్ని బలంగా తాకుతున్నట్టుగా నాకు అనిపించసాగింది. ఆ విధంగా భిన్నమైన ఆలోచనలు మరియు అభిప్రాయాల మధ్య నా మనస్సు ఊగిసలాడ సాగింది. గజిబిజిగానున్న అనేక త్రోవలమధ్యలో ఎటువెళ్ళాలో తెలియక తీవ్రమైన గలిబిలి గురైన వ్యక్తివలె నేను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను.

తప్పుడు సలహా అనే ప్రమాదము

ఈ గందరగోళ పరిస్థితిలో ఏదైనా ఆదరణ దొరుకుతుందేమోనని నేను నా తప్పుడు స్నేహితునివద్దకు వెళ్ళాను. అది దేవుడు తనను విడనాడిన సమయంలో సౌలు ఒక కర్ణపిశాచముగల స్త్రీయొద్దకు వెళ్ళినట్లుగా ఉంది (1 సమూయేలు 28:7-19). అయితే, నన్ను ఆదరించి తృప్తిపరచడానికి బదులుగా అతడు నన్ను మరింత గలిబిలికి గురిచేసాడు. నా భయాన్ని చూసి అతడు విరగబడి నవ్వాడు.

నా బలహీనతను చూసి అతడు జాలిచూపిస్తున్నట్టుగా నటించాడు. అంతేగాక, తాను అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాల దృష్ట్యా అతడు తన్నుతాను అభినందించు కొన్నట్టుగా కనిపించాడు. భవిష్యత్తును గురించిన తలంపులుగాని, చివరి తీర్పును గురించిన భయంగాని తనను ఏమాత్రం గలిబిలికి గురిచేయడం లేదని అతడు నాతో అన్నాడు.

ఈ విశాలవిశ్వంలో ప్రకృతి ఒక గొప్ప యజమానురాలు అని అతడు విశ్వసించాడు. కావున ఆమె ఏం చెబుతోందో దాన్నే తాను అనుసరిస్తాననీ, ఈ జీవితాన్ని గురించి తానేమీ ఆందోళనకు గురికావడం లేదనీ, తాను తీసుకొన వలసిన జాగ్రత్తంతా ఈ జీవితం తరువాత రానైయున్న జీవితాన్ని గురించేననీ, తాను మరణించి మట్టిలో కలిసిపోయాక తన మట్టి మరొక జీవిగా మారిపోతుం దనీ, తాను తీసుకొనవలసిన జాగ్రత్తంతా ఒక అందమైన జీవిగా తాను మారిపోవడాన్నీ గురించి మాత్రమేననీ, అదంతా తాను భూస్థా పన చేయబడబోవు స్థలంపై ఆధారపడి ఉంటుందనీ, తాను ఒకవేళ ఒక స్మశాన వాటికలో భూస్థాపన చేయబడినట్లయితే, తన మట్టి ఒక సాలెపురుగుగానో లేదా ఒక కప్ప గానో లేదా ఒక పాముగానో మారుతుందనీ, కావున తాను ఒక అందమైన పొలములోనో లేదా ఒక పూలతోటలోనో పాతిపెట్ట బడేట్లుగా తాను జాగ్రత్త తీసికొన్నట్లయితే, అప్పుడు తాను ఒక అందమైన పూల మొక్కగానో లేదా ఒక అందమైన పుష్పంగానో మారేందుకు వీలుంటుందనీ అతడు నాకు చెప్పాడు.

అనేక త్రోవలమధ్యలో ఎటువెళ్ళాలో తెలియక తీవ్రమైన గలిబిలికి గురైన వ్యక్తివలె నేను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను.

తన సంతోషకరమైన భవిష్యత్తు కేవలం తన చేతిలోనే ఉందనీ, ప్రకృతిలోని అందాలన్నీ తన చేతిలోనే ఉన్నాయనీ, వాటిని మనసారా అనుభవించడంకూడ

తన చేతిలోనే ఉందనీ, అంతేగాక తాను ఈ జీవితం తర్వాత తన ప్రణాళిక ప్రకారం ఈ ప్రకృతిలోని వివిధ అంశాలుగా మారుతూ చివరిగా కొన్ని యుగాల తర్వాత తిరిగి ఒక మనిషిగా మారే అవకాశం ఉందనీ, ఆ ప్రక్రియలోనే తాను ఇప్పుడు ఒక మనిషిగా మారి జీవిస్తున్నాననీ అతడు నాకు చెప్పాడు.

అతని జ్ఞానయుక్తమైన ప్రణాళికను వ్యతిరేకించే కొన్ని లేఖన భాగాలను నేను అతనికి చూపించాను. అయితే, అతడు వాటన్నిటినీ కొట్టిపారవేస్తూ అవన్నీ కేవలం పిరికివారిచే రూపొందించబడిన కల్పనా కథలుగా అభివర్ణించాడు. లేఖనములద్వారా దేవుని ఉనికిని ఋజువుచేయుట, దేవుని ఉనికిద్వారా లేఖన ముల ఉనికిని ఋజువుచేయుట – రెండూ ఒకటేనని అతడు నాకు చెప్పాడు.

అనుమానం నిరాశకు జన్మనిస్తుంది.

అతని మాటలు నాలో మరిన్ని అనుమానాలను రేకెత్తించాయి. నేను చాల అసౌకర్యానికి గురయ్యాను. నా బ్రతుకు ఇక నాకు భారంగా తోచింది. శాపగ్రస్త మైన అతని అభిప్రాయాలను నా మనస్సులోనుండి బయటకు గెంటెయ్యాలని నేను ప్రయత్నించాను. అయినప్పటికీ, అవి నిరంతరం నా మనస్సులో కదలాడుతూ నన్ను గలిబిలి చేయసాగాయి.

ఆ మాటల్ని నేను అసలు వినలేదన్నట్లుగా నాలో నేను వెయ్యిసార్లు అను కొన్నాను. అయినప్పటికీ, అవి నిరంతరం చెవుల్లో ప్రతి ధ్వనిస్తూ నా మనస్సులో తిష్టవేసి ఉన్నాయి. “పరలోకాన్ని గురించిన నా ఆశలన్నీ కేవలం ఒక భ్రాంతియేనా? నేను ఇంతకాలంగా దేవుణ్ణి వ్యర్థంగా సేవించానా? అసలు దేవుడనేవాడే లేనప్పుడు, ఆ దేవుణ్ణి నాకు నేనుగా సృజించానా?” అని నాలో నేను రోదించసాగాను.

“పరలోకాన్ని గురించిన నా ఆశలన్నీ కేవలం ఒక భ్రాంతియేనా? నేను ఇంతకాలంగా దేవుణ్ణి వ్యర్థంగా సేవించానా?”

ఆ సమయంలో నా మనస్సులో మెదలాడిన ఆలోచనలు నన్ను ఎంత వేదనకు గురిచేశాయో వివరించడం అసాధ్యం. అవి నాపై శక్తివంతంగా దాడిచేసి చివరిగా నైరాశ్యపు అంచులకు నన్ను త్రోసివేసాయి. “ఆశ నిరాశలమధ్య నేనెందుకు ఊగిసలాడాలి? దీనికన్నా నా జీవితాన్ని అంతం చేసుకొని సత్యా సత్యాలను పరీక్షించడం మేలుకదా?” అని నాలో నేను అనుకొన్నాను.

ఆత్మహత్య ఆలోచన

ఈ తలంపు నాలోకి రాగానే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నాలో కలిగింది. ఇక నేను ఒక్క క్షణంకూడ జీవించకూడదనీ, ఏ విధంగానైనా నన్ను నేను చంపుకోవాలనీ నేను నిర్ణయం తీసుకొన్నాను. ఈ విషాదకరమైన అంతాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు నేను ఒక దినం దగ్గరలోనున్న అడవుల్లోకి వెళ్ళాను. అక్కడ నేను ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్ధపడుచుండగా ఒక మెల్లని స్వరం నాతో ఇలా మాట్లాడటం నాకు వినిపించింది :

“ఓ ఎపెనెటస్, నీ విరోధియైన అపవాది ఉచ్చుల్లో పడి వాణ్ణి సంతృప్తి పరుస్తూ నీవు నిత్యనరకాగ్నిలోనికి దూకొద్దు. నీవు ఇప్పుడు చేయబోయే చర్యద్వారా నిన్ను నీవు నిత్యనరకాగ్నిలో శాశ్వతంగా బంధించుకో బోతున్నావు. ఎందుకనగా, దేవుని స్వరూపంలో ఉన్న నీ ఆత్మను నీవు నాశనం చేసికొన్నప్పుడు ఆయన దయాకనికరాలను ఆశించే అవకాశం ఇక నీకు ఎక్కడుంటుంది? దేవుడు అనేవాడు లేడని నీవు అనుకొంటు న్నావు. ఒకవేళ దేవుడనేవాడు ఒకడు ఉన్నట్టయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు లేడని నీవు అనుకొంటున్నావు. అయితే, దేవుడు తప్పక ఉన్నాడు.”

దేవునిచే రక్షించబడ్డాను

ఆ మెల్లని స్వరం ఎక్కడనుండి వచ్చిందో నాకు తెలియదు. అయితే, అది తప్పక దేవునినుండే వచ్చివుంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఆ స్వరం ఎంత శక్తివంతంగా వచ్చిందంటే, అది నా చేతిలోనున్న ఉరితాడును నేను దూరంగా విసిరివేసేలా చేసింది. అంతేకాదు, అది నా ఉద్దేశంలోని దుష్టత్వాన్ని నాకు బయలుపరచింది.

నేను తీవ్రమైన భయంతో విపరీతంగా వణకడం ప్రారంభిం చాను. నన్ను రక్షించాలన్న ఉద్దేశంతో ఒక అదృశ్యశక్తి సరైన సమయంలో నాకు ప్రత్యక్షపరచబడిందని నేను గుర్తించాను. ఆ అదృశ్యశక్తి దేవుడు తప్ప మరొకరు కారన్న ఆలోచన నాలో జనించగానే ఆయనపట్ల కృతజ్ఞతాభావం నాలోనుండి పెల్లుబికి వచ్చింది. నా కళ్ళల్లోనుండి అశ్రుధారలు ప్రవహిస్తుండగా నేను నేలమీద మోకరిల్లి ఇలా ప్రార్థించాను :

“సర్వశక్తి కలిగిన ఓ అదృశ్యుడవగు దేవా, నీవు మానవుని కళ్ళకు కనిపించకపోయినప్పటికీ, వాని చర్యలన్నిటినీ నీవు గమనిస్తూనే ఉన్నావు. నీ స్వరూపంలో సృజించబడిన నేను నాశనం కావడం ఇష్టం లేక ఈ సమయంలో నన్ను నీవు రక్షించావు. అందుకోసం నేను విన యంతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.”

“ఉనికిలోనున్న వాటన్నిటిపై సార్వభౌమాధికారము కలిగియున్న ఓ దేవా, నన్ను సజీవునిగా నిలిపినందులకై నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాను. నీ ఉనికిని నేను గుర్తించేలా చేసినందుకై నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఓ దేవా, నీవు ఇక ఏమాత్రం నానుండి దాగియుండక, నీ మహిమా వెలుగును నాపై ప్రసరింపజేసి నాలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుము. ఈ సమయంలో నేను అనుభవించిన నీ ఉనికినిగాని నీ సర్వశక్తినిగాని, ఇకమీదట ఎన్నడూ నేను ప్రశ్నించకుండునట్లుగా నాకు కృపజూపుము.”

అలా నేను ప్రార్థించాక, నేను నా మోకాళ్ళమీదనుండి పైకిలేచి అక్కడికి దగ్గర్లోవున్న ఒక నది ఒడ్డున కూర్చున్నాను. భయంకరమైన నరకాగ్నినుండి నన్ను కాపాడిన సర్వోన్నతుడగు దేవుని మంచితనాన్ని గురించిన తలంపులతో నా మనస్సు నిండిపోయింది.

నా హృదయం ఆనందపారవశ్యంతో గాలిలో తేలి పోతోంది. అదే సమయంలో, దేవుని ఉనికిని గురించి ప్రశ్నించిన నా అజ్ఞానాన్ని గురించి నేను ఆశ్చర్యపడసాగాను. సృష్టిలోని ప్రతి చిన్న అంశమూ దేవుని ఉనికిని గురించి సాక్ష్యమిస్తోంది. అంతేగాక, మానవునిలోని మనఃస్సాక్షి వెయ్యి సాక్షులకంటె ఎక్కువగా దేవుడున్నాడన్న వాస్తవాన్ని ఎలుగెత్తి చాటుతోంది. అలాం టప్పుడు దేవుని ఉనికిని నేను ఎలా ప్రశ్నించగలిగాను? నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను?’ నా అజ్ఞానాంధకారాన్ని గురించి నేను ఆశ్చర్యపడుతూ నాలో నేను ఆలోచించాను.

పరలోక అతిథి

అలా నేను ఆ నది ఒడ్డున సుదీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో ఉన్నట్టుండి నాచుట్టూ ఒక గొప్ప వెలుగు ఆవరించింది. అలాంటి వెలుగును నేను అంతవరకు ఎన్నడూ చూసియుండ లేదు. ఆ వెలుగు నన్ను తీవ్రమైన సంభ్రమాశ్చర్యాలకూ భయానికీ గురిచేసింది. ఆ వెలుగు ఎక్కడనుండి వచ్చిందా అని నేను ఆశ్చర్యపడు తుండగా ఒక ప్రకాశమానమైన రూపము నా ముందు ప్రత్యక్షమయింది.

ఆ రూపము ఒక మనిషి రూపంలా ఉంది. కానీ, అతని చుట్టూ మహిమకరమైన వెలుగు ప్రకాశిస్తోంది. అతని ముఖము ప్రకాశమానంగా వెలుగుతోంది. అంతే కాదు, అతని ప్రత్యక్షతతో అక్కడి గాలికూడ మధురమైన సువాసనల్ని వెదజల్లు తోంది. అతడు నా శత్రువు కాడన్న నిశ్చయత నాకు కలిగింది. అతని మహిమా ప్రసన్నతను నేను ఇక ఏమాత్రం భరించలేకపోయాను.

వెంటనే నేను అతని యెదుట బోర్లపడ్డాను. అయితే, అతడు నన్ను తన చేతులతో పైకిలేపి, నన్ను నిలబెట్టాడు. ఆ సమయంలో ఒక నూతనమైన బలం నాలోనికి ప్రవేశించడాన్ని నేను కనుగొన్నాను. అప్పుడు నేను అతనితో ఇలా సంభాషించడం ప్రారంభించాను :

ఎపెనెటస్ : ప్రకాశమానమైన ఓ నా విమోచకుడా, బలహీనమైన నా శరీరాన్ని నీవు రక్షించి నాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించావు. నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెల్లించగలను? నిన్ను ఎలా నేను ఆరాధించగలను?

దేవదూత : నాకు కాదుగాని, నిన్ను సృజించిన నీ సృష్టికర్తకే నీ ఆరాధనలు నీవు సమర్పించు. నీవు ఎవరి ఉనికినైతే తృణీకరిస్తూ వచ్చావో, ఆ సృష్టికర్తచే నేను నీ యొద్దకు పంపబడ్డాను. నీవు వెళ్ళదలచుకొన్న నిత్యనరకానికి వెళ్ళ నీయకుండా నిన్ను ఆపేందుకు నేను నీ యొద్దకు పంపబడ్డాను.

ఈ మాట నన్ను బహుగా కదిలించివేసింది. అధముడనూ అయోగ్యుడనూ అయిన నా యెడల సర్వోన్నతుడును సర్వశక్తుడును అయిన దేవుడు కనబరచిన దయాకనికరములను తలంచుకొని నా హృదయం ద్రవించిపోయింది. నా కళ్ళల్లోనుండి ఉప్పెనలా కన్నీళ్ళు పెల్లుబికి రాగా, “ఇంత గొప్ప దయాకనికరము లకు నేను అయోగ్యుడను” అని బిగ్గరగా ఏడ్వసాగాను.

నీకు దయచూపించుటలో సర్వశక్తిగల దేవుడు నీ అయోగ్యతను చూడలేదుగాని, అవధులులేని ఆయన మంచితనంతోను ఎవ్వరూ గ్రహించలేని ఆయన ప్రేమతోను మాత్రమే నిన్ను చూశాడు.

దేవదూత : నీకు దయచూపించుటలో సర్వశక్తిగల దేవుడు నీ అయోగ్యతను చూడలేదుగాని, అవధులులేని ఆయన మంచితనంతోను ఎవ్వరూ గ్రహించలేని ఆయన ప్రేమతోను మాత్రమే నిన్ను చూశాడు. ఆత్మలవిరోధి అయిన సాతానుడు నిన్నెంతగా సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడో ఆయన చూశాడు.

నీపై దాడిచేసేందుకు వాణ్ణి ఆయన అనుమతించాడుగాని, తన రహస్యశక్తితో ఆయన నిన్ను కాపాడాడు. నిన్ను జయించానని సాతానుడు ఆనందిస్తున్న సమ యంలో ఆయన వాని ఉరులను తెంపివేశాడు. ఫలితంగా నీవు తప్పించుకొన్నావు.

ఈ మాటలు పట్టజాలని ఆనందంతోకూడిన ఒక వింత అనుభూతితో నా హృదయాన్ని నింపివేశాయి. అలా నా హృదయంలోని ఆనందం పొర్లిపారు తుండగా ఆనందపారవశ్యంతో నేను ఇలా పాడటం ప్రారంభించాను :

“శోధనలో మునిగిపోతోన్న నా ఆత్మను నరకమునుండి రక్షించిన ఆ గొప్ప ప్రేమయొక్క లోతుల్ని ఎవరు కొలువగలరు? నాశనకరమైన నరకపు అంచుల్లో నేను పడివున్న సమయంలో నన్ను మోసగించిన సాతానుని చేతుల్లోనుండి నన్ను రక్షించిన ఆ ప్రేమగల రక్షకుని నామానికి మహిమ కలుగునుగాక!

నిత్యం నేను ఆయన నామాన్ని మహిమపరుస్తూనే ఉంటాను. దేవుడు లేడని నేను అనుకొన్నా, దేవుని ఉనికిని నేను తృణీకరించినా, దేవుడు అనేవాడు తప్పక ఉనికిలో ఉన్నాడు. అవును, ఆయన తానే దేవుడైయున్నాడు!”

దేవదూత : సరే, నిత్యత్వాన్ని గురించిన సంగతులయొక్క వాస్తవాన్ని నీవు ఇక ఎన్నడూ అనుమానించకు. వాటిని గురించిన వాస్తవాలను నీచే ఒప్పింప జేసేందుకే నేను నీవద్దకు వచ్చాను. విశ్వాసము ద్వారా మాత్రమేగాక కళ్ళతో ప్రత్యక్షంగా చూచుటద్వారా నీవు ఈ విషయాలను ఒప్పు కొనవలెనన్న ఉద్దేశంతోనే నేను నీవద్దకు వచ్చాను. మర్త్యమగు మానవనేత్రము ఎన్నడూ చూడని సంగతులను నేను నీకు చూపించబోతున్నాను. అలా ఆ నిత్యమైన దృశ్యాలను వీక్షించేందుకు అనువైన విధంగా నీ నేత్రాలు బలపరచబడతాయి.

మర్త్యమగు మానవనేత్రము ఎన్నడూ చూడని సంగతులను నేను నీకు చూపించబోతున్నాను.

దేవదూత పలికిన ఆ ఆశ్చర్యకరమైన మాటలు నన్ను నిశ్చేష్టుణ్ణి చేశాయి. అలాంటి అద్భుతమైన దృశ్యాలను చూసి నేను భరించగలనా అని నాలో నేను అనుమానపడ్డాను. “అలాంటి దృశ్యాలను చూసి ఎవరు భరించగలరు?” నేను అతనితో అన్నాను.

అందుకు అతడు నాకు ఇలా జవాబిచ్చాడు: “యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు” (నెహెమ్యా 8:10). అలా

పరలోకము మరియు నరకములనుగూర్చిన దర్శనములు 42 పలికిన తరువాత అతడు నా చేయి పట్టుకొని తిరిగి నాతో ఇలా అన్నాడు : “భయపడవద్దు. నీవు ఇంతవరకు చూడని దృశ్యాలను నీకు చూపించేందుకే నేను పంపబడ్డాను.”

పరలోక పరిధుల్లోకి

చూస్తుండగానే నేను భూమికి పైగా ఎత్తబడ్డాను. కాసేపటి తర్వాత నేను రూపాంతరం పొంది విశాలమైన అంతరిక్షంలో విహరిస్తుండటాన్ని నేను కను గొన్నాను. అక్కడనుండి నేను క్రిందకు చూశాను. ఆ విశాలవిశ్వంలో భూమి నాకు చాలా చిన్నదిగా కనిపించింది. వాస్తవానికి అది నాకు ఒక చిన్న చుక్కలాగా కనిపించింది.

అప్పుడు నేను నా ప్రక్కనున్న నా మార్గదర్శి అయిన ఆ దేవదూతతో ఇలా అన్నాను – “నేను ఒకటి రెండు ప్రశ్నలు వేస్తే మీకేమైనా అభ్యంతరమా?”

దేవదూత : నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడం నా బాధ్యత. ఎందుకనగా, నేను నీకు పరిచారము చేయుటకు పంప బడిన ఆత్మను (హెబ్రీ 1:14). నీకు మాత్రమేగాక రక్షణ అనే స్వార్థ్యాన్ని పొందగోరు వారందరికీ పరిచారము చేయుటకే నేను నియమింపబడ్డాను.

ఎపెనెటస్ : నా క్రింద అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ నల్లని చుక్క ఏంటి? నేను పైకి వెళ్ళేకొద్దీ అది మరింత చిన్నగానూ, నేను అంతరిక్షపు వెలుగుల్లోకి వెళ్ళేకొద్దీ అది మరింత నల్లగానూ నాకు కనిపిస్తుందెందుకు?

పరలోకపు దృష్టితో కనిపించే భూమి

దేవదూత : దూరాన నీకు కనిపించే ఆ నల్లని చుక్కనీవు ఇంతవరకు నివసిం చిన ప్రపంచం. అది నీకు ఎంత చిన్నగా కనిపిస్తోందో గమనించావు కదా? అనేకులు దానిలోని ఒక చిన్న భాగాన్ని సంపాదించేందుకు తమ బలాన్నీ కాలాన్నీ ఖర్చుచేస్తూ ఎంతగా శ్రమపడుతుంటారో కదా?

భూమి అనేక రాజ్యాలుగా విభజించబడి ఉంది. ఒక రాజ్యాన్ని సంపాదించేం దుకు ఎన్ని హత్యలు! ఎంత రక్తపాతం! దానిలోని ఒక చిన్న భూభాగాన్ని సంపాదించేందుకు ఎంతమంది వ్యర్థంగా తమ ప్రాణాలను పోగొట్టుకొన్నారు! “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?” అని సమాధానాధిపతి అట్టివారిని గురించి ఎంతగా వాపోయాడు। (మత్తయి 16:26).

వారిలోని మూర్ఖత్వానికిగల ఏకైక కారణం వారు పైనున్న సంగతులవైపు చూడకపోవటమే. పైనున్న సంగతులవైపు ఎక్కువగా చు”సేకొద్దీ, వాటికి మరింతగా దగ్గరయ్యేకొద్దీ, భూలోకము మరింత చిన్నదిగా మనకు కనిపిస్తుంది.

విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి పైనున్నవాటిపై తన హృదయాన్ని నిలిపి వాటిని స్పష్టంగా దృష్టిం చడం ప్రారంభిస్తాడు. అలాకాక, తామున్న ప్రపంచాన్నే మనుష్యులు దృష్టించడాన్ని కొనసాగించినప్పుడు, వారు పైనున్నవాటిని ఏమాత్రం దృష్టించలేరు. అయ్యో, వారు కేవలం అంధకారంలో ఉన్నారు!

మనుష్యులలోని మూర్ఖత్వానికిగల ఏకైక కారణం, వారు పైనున్న సంగతులవైపు చూడకపోవటమే.

దానికంటే హీనమైన విషయం ఏంటంటే, వారు ఆ భూమిమీదనే సదాకాలం జీవించి సంచరించాలని ఆశిస్తారు! వెలుగు అధిపతి తానే స్వయంగా వారి మధ్యకు వచ్చి “జీవపు వెలుగును” వారికి స్పష్టంగా చూపించినప్పటికీ (యోహాను 8:12), తన పరిచారకులద్వారా

ఆయన ఆ వెలుగును వారికి ఇంకను చూపిస్తున్నప్పటికీ, వారు ఇంకను ఆ వెలుగువద్దకు రాక చీకటిలోనే సంచరిస్తున్నారు. ఎందుకనగా, వారి క్రియలు చెడ్డవి గనుక వారు చీకటినే ప్రేమిస్తున్నారు (యోహాను 3:19).

పతనమైన దేవదూతలకు విధించబడిన శిక్షావిధి

ఎపెనెటస్ : భూమికి పైభాగాన భయంకరంగా కనిపించే విస్తారమైన ఆ నల్లని రూపాలేంటి? నీవు నాతో ఉండకపోయినట్టయితే, నేను నిజంగా వాటిని చూసి చాల భయపడేవాణ్ణి. అయితే, నీవు వాటి మధ్యలోనుండి దాటి వస్తుండగా అవి నీకు దూరంగా పరుగెడుతున్నాయి. బహుశా నీ చుట్టూ ఉన్న వెలుగును అవి సహించలేక కాబోలు!

దేవదూత : అవి పతనమైన దురాత్మల సమూహం. అవి తమ గర్వాన్నిబట్టి సర్వోన్నతుడైన దేవునిపై తిరుగుబాటు చేశాయి. ఫలితంగా అవి పరలోకంనుండి క్రిందకు పడద్రోయబడి దేవుని తీర్పునుబట్టి అంధకారంలో తిరుగులాడు తున్నాయి. అవి రానైయున్న తీర్పుదినం వరకు ఆ అంధకార పరిధిలో సంకెళ్ళచే బంధించబడి ఉంటాయి. అవి అక్కడనుండి ఎన్నుకొనబడినవారిని పరీక్షిం చేందుకును దుర్మార్గులను శిక్షించేందుకును భూమిపైకి వెళ్ళేందుకు అనుమ తించబడ్డాయి. ఇప్పుడు వారందరూ వికృతమైన నల్లని రూపంలో నీకు కనిపిస్తు న్నప్పటికీ, ఒకప్పుడు వారందరూ వెలుగు కుమారులే.

ఒకప్పుడు వారందరూకూడ నాలానే మహిమకరమైన వెలుగు వస్త్రాలను ధరించినవారే. అయితే, సర్వోన్నతుడగు దేవుని శక్తినీ అధికారాన్నీ ద్వేషించి తమ స్వంత చిత్తముచొప్పున ఆయనకు విరోధంగా పాపము చేయుటనుబట్టి వారు ఇలా త్రోసి వేయబడ్డారు. వారు ఆ మహిమా వెలుగును పోగొట్టుకొన్నవారై, సర్వోన్నతుడగు దేవునికి ఇంకను అవిధేయులుగా కొన సాగుతూ, ఆయన మహిమా వెలుగును ధరించుకొనియున్న దేవదూతలనుండి దూరంగా పారిపోతారు.

పతనమైన దేవదూతలు శాశ్వతంగా ఆ అవకాశాన్ని కోల్పోయారు. శోధకుడు లేకుండిన సమయంలోనే వారు పాపంచేశారు. అసలు మొట్టమొదట పాపంచేసినవారు వారే.

ఎపెనెటస్: కాని నా మార్గదర్శీ, ఈ అవిధేయులైన ఆత్మలు తిరిగి దేవునితో సమాధానపరచబడేందుకు ఎలాంటి అవకాశమూ లేదా? వారిలో కొందరికైనా కొంతకాలం తరువాతనైనా ఆ అవకాశం లేదంటావా?

దేవదూత : లేదు, ఎంతమాత్రమూ లేదు. వారు శాశ్వతంగా ఆ అవకాశాన్ని కోల్పోయారు. శోధకుడు లేకుండిన సమయంలోనే వారు పాపంచేశారు. అసలు మొట్టమొదట పాపం చేసినవారు వారే. అంతేకాదు, రక్షణకు ఆధారమైన మెస్సీయా, పడిపోయిన దేవదూతలకోసం ఒక దేవదూత రూపంలో రాలేదుగాని, వారిని నాశనమునకు అప్పగిస్తూ మానవుల రక్షణార్థం దీనమానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. తాము నరకాగ్నికి వారసులమైయుండగా, మానవులు మాత్రం పరలోక వారసులుగా చేయబడ్డ కారణాన్నిబట్టి ఆ దురాత్మలకు మానవులపై అమితమైన ద్వేషం.

సూర్యుడు మరియు నక్షత్రములయొక్క ప్రకాశమానమైన సౌందర్యము

ఈ సమయానికి మేము అంతరిక్షంలో సూర్యునికి పైగానున్న భాగానికి చేరుకొన్నాము. సూర్యుడు భూమికన్నా వందరెట్లకుపైగా పెద్దదిగానుంటూ అత్యంత ప్రకాశమానంగా వెలుగుతూ ఉంటుంది. వ్రేలాడే ఈ అగ్నిగోళం దేవుని సృష్టిలో ఒక గొప్ప అంశంగా నా మార్గదర్శి నాకు వివరించాడు. అది గంటకు లక్ష మైళ్ళ వేగంతో తన పరిధిలో తిరుగుతూ ఉంటుంది. అంత వేగంతో అది తిరుగుతున్నప్పటికీ అది ఒక వెంట్రుకవాసి కూడ తన పరిధినుండి ప్రక్కకు తొలగదు. అలా అది సంవత్సరాల తరబడి పరిభ్రమిస్తున్నా ఎన్నడూ తన పరిధినుండి ప్రక్కకు తొలగలేదు.

నేను ఆ సమయంలో రూపాంతరం చెంది యుండటంవల్లనూ, ఆ సమయంలో నా కను దృష్టి గొప్పగా బలపరచబడి ఉండటంవల్లనూ నేను దానిని అత్యంత సమీపంనుండి చూడ గలిగాను.

తాము నరకాగ్నికి వారసులమైయుండగా, మానవులు మాత్రం పరలోక వారసులుగా చేయబడ్డ కారణాన్నిబట్టి ఆ దురాత్మలకు మానవులపై అమితమైన ద్వేషం.

నక్షత్రాలుగా మనచే పిలువబడు వ్రేలాడే పెద్ద అగ్నిగోళాలుకూడ తక్కువ ఆశ్చర్యకరమైనవేం కావు. అవి మనకు చాల ఎత్తులో ఉన్నందున చిన్నచిన్న క్రొవ్వొత్తుల్లాగా అవి మనకు కనిపిస్తాయి.

పరిమాణములో అవన్నీ భూమికన్నా చాల పెద్దవే. వాటిలో ఏ ఒక్కటి స్థానభ్రంశం చెంది భూమిమీద పడినప్పటికీ, ఒకే ఒక క్షణంలో భూమి పూర్తిగా దహించివేయబడుతుంది. అయినప్పటికీ, అవన్నీ దేవుడు తమ్మును సృజించినప్పుడు ఏ స్థానాల్లో ఉంచాడో ఆ స్థానాల్లో నుండి ఏమాత్రం ప్రక్కకు తొలగక వాటిలోనే స్థిరంగా ఉంటూ, తమకు ఎలాంటి ఆధారమూ లేకపోయినప్పటికీ కేవలం దేవుని మాటను ఆధారంచేసుకొని తమ తమ స్థానాల్లో అవి స్థిరంగా నిలిచి ఉన్నాయి.

సృష్టి అంతా సృష్టికర్త శక్తికి సాక్ష్యం పలుకుతోంది

ఎపెనెటస్ : ప్రేమగల సృష్టికర్తయొక్క అనంతమైన శక్తిని గురించి ఎలాంటి వారినైనా ఒప్పింపజేయడానికి ఈ అద్భుతాలు చాలు. తన శక్తి మరియు మహిమ లను గురించి అనేక ఋజువులనిచ్చిన దేవుని ఉనికిని ప్రశ్నించే అవిశ్వాసుల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఈ అద్భుతాలు చాలు. మానవులు జంతువుల వంటివారు కానట్లయితే, వారు క్రిందికి చూడక పైకి చూచినట్లయితే, వారు దేవుని అనంతశక్తినీ ఆయన అనంతజ్ఞానాన్నీ తప్పక గుర్తిస్తారు.

దేవదూత : నీవు వాస్తవాన్ని మాట్లాడుతున్నావు. అయితే, నీవు వీటికన్నా అద్భుతమైన దృశ్యాలను వీక్షించబోతున్నావు. ఇంతవరకు చూసినవన్నీ ఒక కట్టడాన్ని నిర్మించేందుకు ఉపయోగించే కొయ్యల్లాంటివి. “చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోక మందు” నీవు చూడబోతున్నావు (2 కొరింథీ. 5:1). దానిని నీ మర్త్యమైన నేత్రాలతో శక్తి ఇప్పుడు నీకు ఇవ్వబడింది.

Leave a Comment