అన్యాయపు సిరి

అన్యాయపు సిరి

ప్రశ్న:- లూకా 16:1-13 లో వ్రాసినదాని అర్థమేమి? యుక్తిగా మనము పనిచేసి క్రీస్తును సేవించగలమా? డబ్బుచేత స్నేహితులను సంపాదించుకొనవలెనా?

జవాబు :-
ఈ ఉపమానములో మనకు ధనవంతుని పేరివ్వబడలేదు గాని దృష్టాంతముగా ఫలాని ధనవంతుడు గలడని క్రీస్తు అనెను. అతనియొద్ద యొక గృహనిర్వాహకు డుండెను. అతడు చేయుచున్న అన్యాయము తేటగా వివరింపబడినది. వాడు తన యజమానుని ఆస్తిని పాడుచేయుచుండెనంటే దొంగలెక్కలు వ్రాసి తానే ఆ యజ మానుని సొమ్ము తినివేయుచుండెను. అచ్చియున్నవారెవరనగా యజమానుని దగ్గర సరుకు తీసుకొని వెళ్ళేవారు.

గోధుమలును, నూనెయు అమ్ముచున్నాడు గనుక చాలమంది అప్పుగా ధాన్యమును నూనెను తీసికొని వెళ్ళుచుండిరి. లెక్కలు వ్రాసే వాడేమో ఈ గృహ నిర్వాహకుడు. లెక్కలు తారుమారుచేయుచున్న వార్త యజమానుని చెవిని పడిన సంగతి ఈ దొంగవానికి వినవచ్చినది. తోడనే భీతితో నిండినవాడై నా పని పోతుంది గనుక నేనేమి చేతును? భిక్షమెత్త సిగ్గుపడుచున్నాననుకొనెను. అవును, ఇన్ని దినములు నెమ్మదిగా ఆ ధనవంతుని దగ్గిర పనిచేసేవాడు నిరుద్యోగియై జీవనము జరుపుకొన లేక వారి దగ్గిరను వీరి దగ్గిరను భిక్షమెత్తితే సిగ్గుకరముకాదా? నిండు సిగ్గుకరము గనుక అట్లు కూడదని ముందుగానే దీర్ఘాలోచన చేయుచున్నాడు. కూర్చుండి కూర్చుండి లెక్కలు చూచుకొనినవాడు కూలినాలి చేయగలడా? శక్తిచాలదు. కాబట్టి లోతుగా వీడు తలపోసుకొని తన గృహనిర్వాహకపు పని పోగానే అసహ్యముగా తోచిన భిక్షమెత్తుటగాని, చేతకాని కష్టమైన కూలినాలి గాని సంభవింపకుండ ముందుగానే వేరొక ఆలోచన పెట్టుకుని కార్యము సాధించెను.

ఇందులో యుక్తిగా నడుచుకొనెనని నష్టము పొందిన ఆ యజమానుడైనను దాసుని మెచ్చెను. దాసుడైనవాడు రక్షింపబడినవాడు కాడులెండి, యజమానుడు కూడను కేవలము లోకసంబంధియైన అవిశ్వాసియే. క్రీస్తుయైనను దేవుడైనను దాసుడు చూపిన యుక్తిని మెచ్చిరని అభ్యంతరపడకండి. ఆ సంగతి దీనిలో లేదు. వీరందరును రుణస్థులును 16:8 లో చెప్పినట్టు లోకసంబంధులే. మరి ఈ ప్రస్తుత యుగ కుమారులే. వారు రక్షణలేనివారైననూ వారిలో మెచ్చదగినది యున్నది. అదేది? క్రీస్తే చెప్పు చున్నాడు. వెలుగు సంబంధులకంటే లోకసంబంధులే యుక్తిమంతులైయున్నారు.

వారి దగ్గర రక్షింపబడిన మనము కొన్ని పాఠములను నేర్చుకొనగలము. పాము చెడ్డదే గాని చెడ్డదానిని నిదర్శనముగా పెట్టుకొని మంచివారు తెలివి తెచ్చుకొన గలరన్నట్టు క్రీస్తు పాములవలె వివేకులుగా నుండుడని తనవారికి చెప్పుచున్నాడు. (మత్తయి 10:16). రక్షణలేని వ్యాపారస్థులకు క్రీస్తు సువార్త చాటించే సువార్తికులైన వారిని సరిపోల్చండి, వ్యాపారస్థుడు చురుకుతనముగలవాడై సంతలో వేళకుండేటట్టు పెందలకడ లేచి చీకటితోనే ప్రయాణంచేస్తాడు.

సువార్తికుడైతే నిద్రామత్తుడై జనులు పనితీర్చి ఇండ్లకు వెళ్ళిపోవు సమయములోనే మహిమ గల సువార్తను ప్రకటించుటకు ఆలస్యముగానే పనిపెట్టుకొంటున్నాడు. వట్టి లాభానికి వస్తువులు అమ్మే కోమటి రక్షణలేనివాడైనను తన పనిలో మిక్కిలి యుక్తిగానే యున్నాడు, ఆసక్తితోనే పనిచేస్తాడు. గాని ఆయా వస్తువులకంటె మిక్కిలి ప్రియమై నిత్య పదవిని వర్ణించే గొప్ప పుస్తకములగు నట్టి బైబిళ్ళు అమ్మే కోల్పోర్టర్లయితే – నేనొకప్పుడు బెంగుళూరులో చూచినట్లే తమ పుస్తకాలు అరుగుమీద పెట్టి యెవరితోను ప్రస్తావింపక కొంతదూరంలో వెళ్ళి కూర్చుండి కాలహరణము చేస్తారు. ఏమి? పుస్తకాలు అవంతట అవే ఖర్చగునా?

లండన్లో నొకసారి కమ్యూనిస్టువారి గుంపు దగ్గర నిలుచుండి ప్రసంగముచేసే రీతిని నేర్చుకున్నాను. దేవుడు లేడను అంశము వద్దు, వారి సహవాసమే వద్దు, గాని వారిలో ఆ వేళ ప్రసంగించుచున్నవాని ధోరణి, అభినయములు, మాదిరి, వైఖరి, జనులనాకర్షించే విధానము మొదలైనవి నాకు కావలెను. నన్ను తన రక్తమిచ్చి కొనిన నాథుని ప్రస్తావించుటలో వారు చూపే యుక్తి, రక్షింపబడిన రీతిగా క్రీస్తుకొరకే నాకుండుగాకని ప్రార్థించితిని.

ప్రసంగీకులెందరో స్వరములేక అభినయము సరిగా లేక భాష రీతిలేక ఆకర్షణీయమునకు బదులుగా వినేవారిని అసహ్యపరచే కొన్ని పద్ధతులతో సమకూడి పనిచేయుచున్నారు. వారు చెప్పే క్రీస్తు అంశము సరే అది అందరికి కావలసిన నిత్యసువార్త గాని దాని ప్రచురించుటలో వారు లోకసంబంధులు చూపే నిపుణతలో చాల తక్కువ పడియున్నారు. గనుక రక్షింపబడినవారు రక్షింపబడని వారి దగ్గర కొన్ని పాఠములను నేర్చుకొనగలరు. రక్షింపబడినవారు రక్షణలేని లోకులతో కలిసి మెలిసి పాపపు పనులు కాదు- క్రీస్తును సేవించగల్గిన మంచి చురుకుతనమే మంచి పట్టుదలవంటి మాదిరియే పనిలో వారు చూపుచున్న ఉత్సాహమే వహించి తమ పక్షముకొరకు వారు దాల్చిన త్యాగమే మొదలైన అంశములను కనిపెట్టి క్రీస్తు కొరకు అవలంబించ గలరు.

స్వరాజ్య పోరాటములో నెందరో స్త్రీలుకూడ సాహసించి దేశానికి మిగుల శ్రమలకోర్చి దెబ్బలును చెరసాలలు అనుభవించి సేవచేసిరి. క్రీస్తు కొరకు మీరు త్యాగము చూపవద్దా? ఆ లోక సంబంధులకంటె క్రీస్తుకొరకు వెలుగు సంబంధులైన మీరు తక్కువగా పనిచేస్తారా? గత మహాయుద్ధములో వీరులు కను పరచిన ధైర్యసాహసములను గురించి ఆయా పత్రికలలో నేను చదువగా క్రీస్తు రాజు కొరకు నేను మెల్లగా యుద్ధమాడుచున్నదానికి శోకించితిని.

కాబట్టి లూకా 16:8 లో గొప్ప పాఠమున్నది. పాప నాశనకరమైన యుక్తి మన కందరికి తెలుసును. దానిలో పుట్టి పెరిగితిమి. గాని ఇప్పుడు రక్షింపబడిన యుక్తి కలదని తెలిసికొనవలెను. పౌలు కొరింథీయులకు వ్రాయుచు – యుక్తిగలవాడనై మిమ్మును తంత్రముచేత పట్టుకొంటిననెను. అవును, రక్షింపబడిన యుక్తి అవసరము. దీని అర్థమేమి? పౌలు అపోస్తలుడైనట్టు సువార్తలోనే జీవనము చేస్తూ కొరింథీ పట్టణమునకు వెళ్ళి సువార్త చెప్పియుంటే సరే గాని ఆలాగు వెళ్ళక యెవరికి భారముగా నుండకుండ డేరాలు కుట్టుచు సువార్తను ప్రకటించెను.

రక్షింపబడిన తంత్రమువంటి యుక్తి యిది. సర్వ సాధారణముగా 1 వ కొరింథీ 9:14 లో వ్రాసినట్లు సువార్త ప్రచురించువారు వేరేమి పనిలేక సువార్త పనిలోనే జీవింపవలెనని యున్నది. అయితే నిట్లు చేస్తే కొరింథీయులు నాకు దొరకరని పౌలు యుక్తిగా ప్రవర్తించి డేరాలు కుట్టుచు సువార్త చెప్పి వారిని పట్టుకొనెను.

దీనిలో మరొకటి యున్నది. ఆ మనస్సాక్షిలేని గృహనిర్వాహకుడు తన యజ మానుని లెక్కలు తగ్గించి మార్చి యొకనికి యాభై శాతము మరొకనికి నిరువై శాతము వారి లెక్కలను తగ్గించి వారి స్నేహమును లాగుకొనెనెందుకు? వారు తమ యిండ్లలోకి నన్ను చేర్చుకొనులాగున నిట్లు చేస్తానని ఆ తెలివిమంతుడు యుక్తిగా నడుచుకొనెను. (లూకా 16:4). రక్షించబడినవారు కష్టపడి క్రీస్తుకొరకే జనులను సంపాదించుకొన వలెను. కారణమేమి? 16:9 లో వ్రాసినట్లు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని యున్నది. దీని భావమేమి? మీరు మిమ్మును తగ్గించుకొని 1 వ కొరింథీ 9:22 లో వ్రాసిన మాదిరి క్రీస్తు నిమిత్తమై అందరికి అన్ని విధములైనవారైపోతే నట్టి కష్టస్థితిలో మీరు సువార్తద్వారా కనినవారే రాబోవు సమయములో క్రీస్తు వచ్చి నప్పుడాయన యెదుటనే మహిమలో మిమ్మును చేర్చుకొంటారు. మీరు క్రీస్తుకొరకు సంపాదించుకొని రక్షించినవారే పరమందు మీకు స్వాగతమిస్తారు.

పౌలు 1వ థెస్స 2:19,20 లో నేర్పుచున్న గొప్ప సత్యమిది. ఆ యుక్తిమంతుడు తమ యిండ్లలోకి నన్ను చేర్చుకొంటారేయని నమ్మి లెక్కలు పాడైపోయినను వారిని సంతోషపరచి యుక్తిగా నడుచుకొనెను. ఈ యిండ్లలో వద్దుగాని నిత్యనివాసములలో అనేకులు వచ్చి మిమ్మును వందించేలాగున దానియేలు 12:3 లో చెప్పుచున్నట్లు రక్షింపబడిన మీరు దీనిలో మేలుకొని యుక్తిగాను, దీర్ఘాలోచనగాను, విధేయతగాను ప్రవర్తించి క్రీస్తుకొరకు అనేకులను సంపాదించుకొండి.

చిన్న మాట మిగిలినది – అన్యాయపు సిరివలన మీరు స్నేహితులను సంపాదించు కొనుడని 16:9 లో నున్నదే దీని భావమేమి? పనిలో లంచాలు తిని ఆ అన్యాయమైన డబ్బు క్రీస్తుకొరకు ఖర్చుచేయమంటారా? అబ్బో అట్లు కూడదు. అన్యాయస్థులు దేవుని బిడ్డలు కానివారు (1 కొరింథీ 6:9). దీని అర్థమేమనగా సర్వసాధారణముగా సిరి అనేది అన్యాయమైనదే. అది చెడ్డదే. అది యురితో సమానమైనదే. 1వ తిమోతి 6:10 చెప్పుచున్నట్లు దీనిలోనే సమస్తమైన కీడులు సంభవించుచున్నవి. అసలు 1 వ పేతురు 5:2 లో అది దుర్లాభమని పిలువబడుచున్నది.

ఆంగ్లేయ బైబిల్లో “Filthy Lucre” అని వస్తున్నది. డబ్బు మైలగానే యున్నది. డబ్బు కీడుగానే యున్నది. అయితే గమనించండి, మైలగాను కీడుగాను ఆటంకముగాను అన్యాయముగాను వున్న ఆ వస్తువు రక్షింపబడినవాని చేతిలో రూపు మారి దేవుని సేవలో నుపయోగము కాగలదు. ఆ పదార్థము చెడ్డదే గాని దానిని ప్రతిష్ఠచేసి క్రీస్తు అన్నట్టు దానితో నిత్య నివాసములలో నుండబోయే స్నేహితులను సంపాదించుకొనవలెను, ఎట్లు? పది బైబిళ్ళు కొనండి; వాటిని కొన్నప్పుడు సొసైటి వారికి డబ్బు కట్టి ఆ పుస్తకాలు కొన వలెను.

అన్యాయపు సిరి ఖర్చాయెను. గాని ప్రార్థనాపూర్వకముగా ఆ బైబిళ్ళు యోగ్యు లైనవారి చేతిలో పెట్టితే జరుగునదేమి? వాటిని చదివినవారిలో ముగ్గురైన ఒక్కడైనను రక్షింపబడితే రాబోవు నిత్య నివాసములో నొకడు చేరినట్టు లెక్క. మీరు వ్యయపరచిన ఆ సొమ్మే పనికి వచ్చినదని లెక్క సువార్త యాత్రమీద వెళ్ళండి. ఖర్చుచేసి వెళ్ళండి లేదా వెళ్ళేవారికి తోడ్పడండి. లేదా కొన్ని సువార్త పత్రికలు సిద్ధముచేసి యచ్చొత్తించండి. వాటివలనను సువార్త యాత్రలో చెప్పబడిన వాక్యమువలనను రక్షింపబడినవారు ఖర్చుయైన ఆ సిరికే దొరికిరని యొక మాదిరిగా చెప్పనొప్పును. నా తెలుగు పత్రికలో గడచిన ఈ ముప్పై యేండ్లు వేలవేలకొలది రూపాయలు వ్యయపరచితిని. ఆ రూపా యలు అసలు అన్యాయపు సిరి, దాని అసలు పేరది. అయితే “క్రైస్తవ నిరీక్షణ”లో నున్న సువార్త వాక్యమువలన నెందరో దొరికిరి. ఆనాడు నన్ను మహిమలో చేర్చు కొంటారని నమ్మి సంతసించుచున్నాను.

కాబట్టి మీతో కూడా మీ రూకల సంచి రక్షింపబడి క్రీస్తు సేవకొరకు నుపయోగములోకి రావలెను. మీ సిరి మీది కాదు. అసలు మీరుకూడ మీవారు కారు. మీరు మీ సొత్తు కారు గనుక సంగతి తెలిసికొని 1 వ కొరింథీ 6:19, 20 అనుసరించి మీ దేహముతోను, మీ చేతికి వచ్చే సిరితోను క్రీస్తుకొరకు స్నేహితులను సంపాదించుకొనుడి.

ఇంటికి యిల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. ఎవరు అనేకులను (క్రీస్తువైపునకు) త్రిప్పుదురో వారు నక్షత్రములవలె నిరంతరమును ప్రకాశించెదరు. ఒకటి యెషయా 5:8 లో నున్నది. రెండవ వాక్యము దానియేలు 12:3 లో నున్నది. మీరు దేనియందు నిలిచెదరు?

Leave a Comment