పరిశుద్ధాత్మ నింపుదల

పరిశుద్ధాత్మ నింపుదల

ప్రశ్న:- పరిశుద్ధాత్మ కలిగియుండుటకును పరిశుద్ధాత్మతో నిండియుండుటకును గల తేడా ఏమిటి?

జవాబు:-

ప్రతి నిజ క్రీస్తు విశ్వాసికి పరిశుద్ధాత్మ కలడు, లేనియెడల నట్టి విశ్వాసి విశ్వాసియే కాడు. (రోమా 8:9). పరిశుద్ధాత్మ మన రక్షణకు ముద్రయైయున్నాడు. (ఎఫెసీ 1:13). ముద్రలేనిది సరియైనది కాదు. పేతురు కొర్నేలి యింట సువార్త చెప్పుచుండ గానే వినేవారిమీద ఆత్మ దిగివచ్చెను. ఎట్లు? అపొ.కా. 11:14 చూస్తే వారు ఆ గదిలో చేరినప్పుడు విశ్వాసులు కానివారైయుండి రక్షణ లేకుండిరి.

రక్షణలేని లోకస్థులు పరిశుద్ధాత్మను పొందలేరని యోహాను 14:17 చెప్పుచున్నది. అయితే విశ్వాసము లేనివారు రోమా పత్రిక 10:17 ప్రకారము సువార్త వినుటతో విశ్వాసులై, విశ్వాసులు కాగానే పరిశుద్ధాత్మను పొందిరి. అపొ. కార్య. 10:44. గనుక దేవుని నిజపిల్లలందరికిని పరిశుద్ధాత్మయున్నాడను సంగతి స్పష్టమైనను దేవుని పిల్లలందరును ఆత్మతో నిండియున్నారని చెప్పగలమా? చెప్పలేము.

ఎఫెసీ 1:13 చొప్పున ఆత్మతో ముద్రింప బడినవారు అదే పత్రిక 5:18 లో ఆత్మపూర్ణులై యుండుడను హెచ్చరికవంటి ఆజ్ఞ పొందుచున్నారెందుకు? ఆత్మకలిగి యుండుట ఆత్మతో నిండియుండుట అది యిది రెండు నొకటిగా లేవు. యొకటిగానుంటే అట్టి హెచ్చరిక అనవసరము.

ఆత్మ ముద్రింపు ఆత్మనింపుదలకు వేరైనందుచేతనే ఎఫెసీ భక్తులు ఆత్మ ముద్రింపు పొందిన పిమ్మట ఆత్మ నింపుదల మిగుల అవసరమని బోధింపబడిరి. ఒకానొకప్పుడు కొందరి యను భవములో ఆత్మ రాగానే ఆత్మతోకూడ నింపబడిరి. ఆది అపొస్తలులు ఆత్మలో బాప్తిస్మము పొందుదుమను వాగ్దానము క్రిందనుండి బాప్తిస్మము మాత్రము కాదు గాని ఆత్మ నూతనముగా వచ్చినప్పుడు అపొ. కార్య. 2:4 లో వ్రాసినట్లు ఆయన బాప్తిస్మముతో నింపుదలను కూడ పొందిరి.

పౌలు అనబడిన సౌలు రక్షింపబడి మూడు దినములకు ఆత్మ నింపుదలను గూర్చిన వాగ్దానమునకు యోగ్యుడాయెను – అపొ. కార్య. 9:17 చూడండి. కొరింథీ విశ్వాసులు విశ్వాసులే; మరియు దేవుని పిల్లలే గనుక ఆత్మ కలిగియుండిరి. (1 కొరింథీ 3:16). అయితే అదే అధ్యాయములో వారి పసితనమును గూర్చి లేక వారిపిల్లతనమునుగూర్చి వారిని గద్దించుచు మీరు చాలినంతగా నెదుగ నందున మీద్వారా నా కడ్డము కలిగెననియు, బోధింపవలసిన సంగతులు మీ వినికిడిలో బోధించలేక పోతిననియు, మీరింకను పసిపిల్లలే యనియు వారిలో పుట్టిన భేదము లనుబట్టి వారిని శాసించుచు రావలసి వచ్చెను. (1 కొరింథీ 3:1-3).

ఆత్మ వారికి లేడా? ఆత్మ కలడు – 1 కొరింథీ 3:16; 6:19. ఆత్మవరములు కూడ కలిగియుండిరి 1 కొరింథీ 1:7. వారికి రక్షణ కలిగినదానిలో 6:11 చొప్పున వర్ణించినట్లు ఆత్మయందు కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడిరి. అయినను ఆత్మ నింపుదలను అంతగా నెదుగక కొదువతోనేయుండిరి. భక్తులు పనికిమాలిన తీగెలు గలవారై ఆ తీగెలు తెగకొట్టివేయబడకముందు అడ్డగింపబడి ఆత్మ నింపుదల లేకున్నారు. (యోహాను15:1). విధేయులైనవారికే ఆత్మ అనుగ్రహింపు కలుగునని అపొ. కార్య. 5:32 తెల్పుచున్నది.

ఆత్మ నింపుదల గల అనుగ్రహింపు రక్షింపబడినవారి విధేయతను అనుసరించి ప్రాప్తించునని దీని నిజభావము. ఎంతోమంది క్రీస్తు పిల్లలే ఆయనను అంగీకరించి ఆత్మతో ముద్రింపబడిరి, గాని ఆయా విషయములలో చూపతగిన విధేయతను కనుపరచనందున ఆత్మగలవారైనను ఆత్మ నింపుదలగలవారు కాక పోయిరి.

ఈ దినములలో కూడ ప్రార్థన తక్కువాయెను. ఆత్మకొరకు ప్రార్థింపకూడదు గాని క్రీస్తును గైకొని క్రీస్తునుబట్టి ఆత్మను పొందినవారు లూకా 11:13 ననుసరించి ఆత్మనింపుదల నిమిత్తమై తండ్రిని వేడుకొన తగినది. వారు, వీరు ఆత్మను పొందిరి. సరేగాని ఆత్మ వారిని పొందలేదని తెలియుచున్నది. గనుక క్రీస్తు విశ్వాసులీ గొప్ప సంగతి తలంచి ఆత్మ నింపుదలకు వేగిరపడి అనుభవించి రంజిల్లవలెను.

క్రీస్తు సంతోషమిచ్చే వాడు. అయితే సంతోషముతో మాత్రము తృప్తిచెందరాదు. యోహాను 15:11 లో మన సంతోషము పరిపూర్ణము కావలెనని క్రీస్తు కోరుచున్నాడు. ఆత్మను పొందినవారు సంతోషముగలవారు. ఆత్మ నింపుదల పొందినవారి సంతోషము అంతకంటె పరిపూర్ణ సంతోషమాయెను.

క్రీస్తును నమ్మినప్పుడు పాపికి జీవము సంప్రాప్తమగును. కుమారుడు గలవాడు జీవము గలవాడే. (1 యోహాను 5:12). మరియు క్రీస్తు రక్తమును బట్టి సంపాద్యమైన ఈ జీవము పరిశుద్ధాత్మచేత నమ్మినవారిది అగుచున్నది. (యోహాను 6:63). అయితే జీవము మాత్రము కలిగి ఆనందించినను నిలిచిపోరాదు. యోహాను 10:10 లో వ్రాసినట్లు సమృద్ధిగా ఆ జీవము మీలో పారాడేవరకు మానరాదు.

ఆత్మను పొందిన వారు జీవముగలవారు. ఆత్మ నింపుదల నెరిగినవారు సమృద్ధియైన జీవము అనుభ వించేవారు. తొలిగా ఆత్మను పొందినప్పుడు 1 కొరింథీ. 12:13 లో కనబడుచున్నట్లు ఆ ఆత్మలో పానము చేస్తిమని తెలియుచున్నది. అయితే నోరు బాగుగా తెరచి లోతుగా పానముచేయుట వేరొక సంగతి.

నోరు తెరచుట యొకటి. నోరు బాగుగా తెరచుట వేరొకటి – కీర్తన 81:10 లో సూచింపబడినది. తెరచుట మాత్రము కాదు; దేవుని నిజమైన పిల్లలందరును నోరుతెరచి క్రీస్తుతో నప్పుడే సంయుక్తమై ఆత్మను పొందిరిగాని క్రీస్తు బిడ్డలందరును బాగుగా నోరు తెరచి ఆత్మనింపుదల పొందిరా? లేదు ఏదో భీతితో కొంత తెరచి మరికొంత తెరవకున్నారు.

మా దేశములో కొందరు చెప్పేదేమనగా నోరు బాగుగా తెరిస్తే నొకవేళ ఇండియాకు మిషనెరీగా వెళ్ళుమంటాడు. మాకిష్టము లేదు. ఇష్టము లేనందుచేతనే నోరు కొద్దిగా తెరచుకొన్నవారు కొద్దిగానే అనుభవించిరి. వారిదే తప్పు. ఈ దేశములో కొందరు క్రీస్తు భక్తులు నోరు బాగుగా తెరిస్తేనిక సినిమాలు బొత్తిగా మానవలెను. తమ జీవితములలో అడ్డముగానున్న కొన్ని వాడుకలు మానవలసివస్తుంది.

ఇష్టము లేనందున నోరు బాగుగా తెరువరు. వారిదే నష్టము మరియు వారినిబట్టి క్రీస్తుకుకూడ అభ్యంతరము కలుగుచున్నది. మీరైతే భయపడక నోరు బాగుగా తెరవండి. అంతట ఆయనే దానిని బాగుగా నింపగా ఆత్మ నింపుదల మీదయగును.

నా పిల్లలు తల్లి పాలు మాని ఆవు పాలు త్రాగవలెనంటే చాల అయిష్టముతో బహు తొందరచేసిరి. అప్పుడు సహాయానికి రమ్మని నా భార్య నన్ను మనవిచేయుట కద్దు. ఒకరోజు నా కుమారునికి పాలు త్రాగించవలెనని యుండి ప్రార్థించి ఆకలితో నేడ్చుచున్న పిల్లవానికి ఆ మంచి పాలు గరిటెతో అందించబోతే అబ్బో యెంతో తొందర చేసెను. నోరు తెరువమంటే ఆ చిన్నపిల్లవాడిది తల్లిపాలు కాదని యెరిగి తెరువలేదు. కొద్దిగా నోరుతెరిస్తే కొద్దిగా పాలు లోపలికి వెళ్ళుచున్నవి. గాని నాకు ఓర్పుచాలక చూచి చూచి తుదకు పెద్ద దెబ్బతో పిల్లవాని గొట్టితిని.

అయ్యో, వెంటనే మూసిపోయిన నోరు బాగుగా తెరచినాడు; గనుక పాలు కావలసినంత పోస్తిని. భక్తులారా, జాగ్రత్తలేనియెడల క్రీస్తు మిమ్మును కూడ దెబ్బకొట్టు తాడు. భద్రము. మీ నాశనానికి కాదు; మీరు బాగుగా నోరుతెరచి ఆత్మనింపుదల నెరుగుటకొరకే ప్రేమతో మిమ్మును కొట్టుతాడు-కీర్తన 119:67-71.

ఆత్మను పొందిన మీరు దెబ్బలేక ఆయన ప్రేమకే యిప్పుడు తిరిగి జీవితము దిద్దుకొని ఆత్మనింపుదల అనుభవించి ముందుకు సాగి పోవుడని క్రీస్తుపేరట మిమ్మునందరిని వేడుచున్నాను. ఆత్మను పొందియుండుట నిజమైన దేవుని పిల్లలందరికి నిర్భేదముగా అన్వయించుచున్నది. అయితే ఆత్మతో నిండియుండుట వేరొక సత్యము. అది నిజమైన దేవుని పిల్లలందరి యనుభవములో నెరవేరినది కాదు. మీరైతేనో నేడే ఆత్మతో నింపబడుటకు సమ్మతించి విశ్వాసముతోను విధేయతతోను రోమా 12:1,2 లో సూచింపబడిన గొప్ప అప్పగింపుతో దానిని వెదకి పొందండి.

Leave a Comment