బలులు నాకు వెక్కసము

“బలులు నాకు వెక్కసము”

ప్రశ్న:-

నిర్గమ కాం. 20:24 ప్రకారము ఆయా బలులను అర్పించవలెనని చెప్పిన దేవుడు – బలులు నాకు లెక్క సమాయెనని యెందుకు చెప్పుచున్నాడు?

జవాబు:-

బలి మాత్రము చెల్లదు. ఆ బలి అర్పించువాని ఆత్మస్థితి లెక్కకు రావలెను. యెషయా 1:11 లో ప్రశ్న వేసినవారు హెచ్చరించినట్లు యూదులా కాలాని కర్పించు బలులు దేవునికి వెక్కసమాయెను. బాహ్యముగా బలులిచ్చిరి, అయితే వారి అంతరంగమున భక్తి లేకపోయినది.

  1. రక్తముతోనే వారి చేతులు నిండినవి. అనగా బలాత్కారులైరి. యెషయా 1:15.
  2. అపవిత్రులై దుష్క్రియలు చేయుచు వచ్చిరి. (1:16. 3)
  3. మేలు తప్పిపోగా కీడే సింహాసనాసీనమాయెను. (1:17. 4)
  4. వారి కార్యములలో న్యాయము తప్పిపోయినది. (1:17. 5)
  5. తండ్రిలేని అనాధలను హింసించుచుండిరి. (1:17.)

దేవునికిని వారికిని వివాదము లేచినది. కెంపువలెను రక్తమువలెను వారి పాపములు విస్తరించినను దానిని విచారించక పైపైగా మతాచార సంబంధముగా బలుల నర్పించుచు దినములనెంచుచు వచ్చిరి. బహిరంగమున మతము మట్టుకు సరిగా నుండిరి. అంతరంగమున నేమియు లేదు. (యెషయా 1:18).

దేవునికి కోపమును రేపి – తుదకు కుమ్మరింపబడిన అగ్ని గంధకములచే నాధీనమైపోయిన సొదొమ గొమొర్రాల పట్టణ నివాసులను పోలి, రాబోవు దేవుని న్యాయమైన కోపమునకు యోగ్యులైన వారిదగ్గిర యెహోవా బలులను తీసికొనునా! యెషయా 1:10 ని ప్రకటన 11:8 తో సరిపోల్చుము. లోతు ఆ పట్టణములలో కొంత సాక్ష్యమిచ్చినను వారు వినకుండ లోతు ప్రకటించిన క్రీస్తుప్రభువును సిలువవేసిరి. గనుక అగ్ని గంధకములకే గురియైన ప్రవక్తయైన యెషయా దినములలో యూదులీ భయంకరమైన స్థితికి వచ్చిరి, పాపిష్టి జనమైరి. దోషభరితమైన ప్రజలైరి.

తమ్మునొక కాలమున ఐగుప్తునుండి విడిపించి రక్షించిన వానిమీద తిరుగబడిరి. (యెషయా 1:2-4). ఇట్లుండగా వారెన్ని బలులర్పించిన చెల్లునా? చెల్లవు. బలి ముఖ్యమైనది కాదు. ఆ బలి యిచ్చినవాడే బలి కావద్దా? దేవుడు వట్టి బలిని కోరడు. దహనబలి మాత్రమే ఆయనకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే, విరిగి నలిగిన హృదయమే ఆయనకింపు. (కీర్తన 51:16-17).

క్రొత్త నిబంధనలలో కూడ వెలపట నెన్ని చేసిన సరిపోదు. హృదయమే దేవునికి స్వాధీనము కావలెను. బలి తెచ్చినదానిని మరుగుపరిచెడి దోషము మనస్సులోనుంటే బలిని విడిచిపెట్టి వెళ్ళి అన్యాయముగా నొప్పిపరచిన ఆ సహోదరునితో సమాధానపడి మరలవచ్చి ఆ బలినర్పింపవచ్చునని క్రీస్తు మత్తయి 5:24 లో నేర్పెను.

ఈ దినములలో క్రైస్తవ బాప్తిస్మము సరేగాని ముందొకని హృదయము సరిపోవద్దా? గారడీ సీమోను నమ్మినట్టున్నది. నమ్మి బాప్తిస్మమొందెనుగాని, పేతురు తరువాత అతని శాసించుచు – నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదనెను – అవును, వెలపట సరే నీళ్ళలో మునిగియుండెను. లోపలనేమో మార్పు కలిగినట్టు లేదు- (అపొ.కార్య. 8:17-24).

రాత్రి భోజనము సరే కాని తండ్రి భార్యను వుంచుకొని పాపము చేయుచునే బల్లయొద్దకు వస్తే సరిపోతుందా? కాదు-ఒకడు తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఆ రసమును త్రాగవలెను. (1 కొరింథీ 11:27-34).

మనుష్యులకు కనబడు నిమిత్తము అనేది నిండు మోసకరమైనది. (మత్తయి 23:5). ఇది కపట భక్తి గనుక మిక్కిలి గొప్ప ఖండమునకు యోగ్యమైనది. ఈ దినములలో ఆరంభము క్రీస్తును అంగీకరించి రెండవసారి పైనుండి ఆత్మమూలముగ పుట్టి తీర వలెను. (యోహాను 3:3-9). అటుపిమ్మట బాప్తిస్మము నొంది అనుదిన జీవితములో ముందుకు సాగవలెను.

సాగుచుండగా కూడ సమస్తమైన కపటమును మానివేయ వలెను. (1 పేతురు 2:1-2). దినము ఆత్మీయముగా క్రీస్తునుబట్టి పండుగ నాచరించ యుక్తమైనది గాని తొలిగా పండుగను చెరచెడి ఆ పులిసిన పిండిని విసర్జించి నిష్కాపట్యమను పులియని రొట్టెతోనే పండుగ ఆచరించవలెనని 1 కొరింథీ 5:7-8 తెల్పుచున్నది. కాబట్టి బలి కావలెనని కోరిన దేవుడు తుదకు జనుల బలిని నిషేధించ వలసి వచ్చినది. మీరుకూడ జాగ్రత్తగానుండి బాల్యర్పణముగా సేవ మాత్రము క్రీస్తు కొరకు చేయవద్దు. ఆ సేవ యెంతో అని కాదు. యెట్టిదో అనేది ముఖ్యము. (1 కొరింథీ 3:12).

Leave a Comment