నీళ్ళద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు

నీళ్ళద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు

ప్రశ్న:

1 యోహాను 5:6-8 లో వ్రాసిన వాక్య రహస్యమేమిటి? నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడీయనే అంటే అర్థమేమి?

జవాబు :

అవును, ఇది కష్టమైన వాక్యమేగాని యితర వాక్యములతో దీనిని సరిచూస్తే దాని అర్థము విప్పుతుంది – క్రీస్తు చనిపోగా నీళ్ళు మాత్రము రాలేదు. గాయపరచబడిన ఆయన ప్రక్కలోనుండి వెంటనే రక్తమును నీళ్ళును వచ్చెనని యోహాను 19:34 చెప్పుచున్నది. మీ అనుభవములో ఈ రెండు నెరవేరవలెను

రక్తము – ఇది ప్రాధాన్యమైనది. రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదని హెబ్రీ 9:22 చెప్పుచున్నది. ఆ రక్తమువలననే మన పాపములు పోయి నీతి కలిగెను. (ప్రకటన 1:6).

క్రీస్తు రక్తముయొక్క విలువ భక్తునికి గోచరము కావలెను. దానివలన కొనబడెను. దానివలన విడుదల ప్రాప్తించెను. దానివలన నీతిమంతుడుగా తీర్చబడెను. గనుక క్రీస్తు రక్తము విశ్వాసికి అమూల్య రక్తముగా నుండవలెను. (1 పేతురు 1:19; 1 కొరింథీ 6:19,20; రోమా 5:9).

క్రీస్తు నీళ్ళతో మాత్రమే వచ్చినవాడు కాడని యోహాను నేర్పుచున్నాడు. అవును, ఆయన ప్రక్కలో నుండి కారిన రక్తముద్వారానే క్రీస్తు వస్తాడు-వస్తాడనగా కీర్తిలోకి అప్పుడే క్రీస్తు వచ్చెను, ఎట్లు? తన రక్తము కార్చినందుచేతనే గనుక క్రీస్తు రక్తమునకు మొదటి స్థానమివ్వవలెను. ఆయన ప్రాయశ్చిత్తము మిగుల గొప్పది. (2) నీళ్ళు – శుద్ధికి సూచనయైనది నీళ్ళు.

రక్తము ద్వారా పాపపరిహారము కలుగుతుంది. పాపముయొక్క శిక్ష నీళ్ళకు కాదుగాని రక్తమునకే తొలిగి పోతుంది. గనుక మీ యనుభవములో తొలిగా క్రీస్తుద్వారా నా యొక్క శిక్ష పోయెనని మీరు తెలిసికొని రోమా 8:1 లో వ్రాసిన దానికి ఆనందించి స్థిరపడవలెను. అటు తరువాతనే శిక్షపోయిన తదనంతరము మీ అనుదిన జీవితము చక్కపడేటట్టు చూచుకొనవలెను.

నీళ్ళంటే దానికే సూచన. క్రీస్తు తన రక్తముద్వారా మిమ్మును రక్షించేవాడు. అయితే రెండవదిగా క్రీస్తు మీ అనుభవములోకి నీళ్ళద్వారా కూడా వస్తాడు. దీని భావమేమనగా మిమ్మును పవిత్రపరచి మిమ్మును మార్చి క్రొత్తవారినిగా చేసి తిరిగి పాపములో పడిపోకుండ మిమ్మును కాపాడుతాడు. నీళ్ళద్వారా క్రీస్తు వచ్చినాడంటే అర్థమిది.

ఆయన ప్రక్కనుండి నీళ్లుకారెను – వచనమే యొక నీరు, ఎఫెసీ 5:25-27 లో వాక్యము ఉదకముతో పోల్చబడినది. ఆ వాక్యమనే యుదకముచేత దినదినము క్రీస్తు సంఘము పవిత్రపరచబడుచున్నది. నీళ్ళు పరిశు ద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మద్వారా క్రీస్తు తన వారిని పరిశుద్ధపరచుచున్నాడు. దీనికి ఆత్మవలన పరిశుద్ధత యని 1 పేతురు 1:1 లో వ్రాసినది తోడ్పడుచున్నది.

క్రీస్తు ఈ రెండురీతులుగా మీలో పనిచేయతగినది – ఆయన ప్రక్కలోనుండి రక్తము నీరును కారెను. నేడు కూడా మీరు క్రీస్తును నమ్మియుంటే రక్తముద్వారాను నీళ్ళద్వారాను మీలోకి వచ్చి ఆయన పనిచేస్తాడు. (1) ఆ రక్తముద్వారా రాబోవు యుగ్రతనుండి మిమ్మును తప్పిస్తాడు-అట్టి స్థలములోనికి మిమ్మును నడిపించి భద్రమైన స్థితిలో మిమ్మునుంచుతాడు.

మొదటి పని యిది. (2) అటుపిమ్మట తనకొరకు మీరు సాక్షులుగా నుండేటట్లు మీయందు తన ఆత్మచేత నివసించి మిమ్మును తన వాక్యముతో నింపి సరియైన రీతిని తన స్వరూపానికి రాజేస్తాడు.

నీళ్ల ద్వారా ఆయన చేయించే పని యిది. ఇట్టి క్రీస్తు మీకు గోచరమాయెనా కాలేదా? నిత్యమరణమని మీకుండిన దెబ్బ క్రీస్తు తన రక్తములో సరిచేసికొనెను. (రోమా 6:23). పాపముయెక్క యేలిక మీమీద నిక చెల్లకుండ క్రీస్తు నీళ్లద్వారా కూడ పనిచేసేవాడు. (రోమా 6:14), తాను వాడుకొను నీళ్లు ఏదనగా వాక్యమును, ఆత్మయును అనబడిన నీళ్లు.

నీళ్లతోమాత్రమే కాదని యెహాను వ్రాస్తున్నాడు. ఒకడు అతిశయించి యిన్ని వేదవాక్యములు నాకు తెలుసు నంటాడు మంచిదే గాని క్రీస్తు నెరుగుటలో వాక్యమను నీళ్లతో కూడ రక్తము అనేది మిళితమై పని చేయవలెను – ఇన్ని వచనములు గుర్తని గర్వించరాదు. క్రీస్తు రక్తముచేత రాబోవు శిక్షనుండి విడిపింపబడితివా లేదా అని విచారించవలసినది.

క్రైస్తవ బళ్లలో ఎన్నోమార్లు బైబిల్ పరీక్షలో మొదటి స్థానము గాంచినవారు అన్యులే. దీని భావమే మనగా నీళ్ళు అబ్బినది గాని రక్తమునకు చోటులేకపోయినది. క్రీస్తు నీళ్లద్వారా మాత్రము రాడు, నీళ్లద్వారాను అనగా వాక్యముద్వారాను, రక్తముద్వారాను మీ యనుభవములోకి రాగోరుచున్నాడు.

క్రైస్తవ కుటుంబములో జన్మించినవారికి నీళ్లు గిట్టుచున్నవి. వారి తలిదండ్రుల నేర్పుద్వారా వచనమేమో వారికి కలిగినది అయితే నేర్పులోనే కార్యము జరుగదు; రక్తము కూడ అవసరము. కాబట్టి క్రైస్తవులుగా జన్మించినవారు క్రీస్తు రక్తముపట్ల తమకున్న అవసరము తెలిసికొని ఆయనను అంగీకరించి క్రొత్తగా పైనుండి జన్మించవలెను.

ముఖ్యమైనది వేరొకటి కలదు – పాత నిబంధనలో కుష్ఠరోగమువలన అపవిత్రుడని నిర్ణ యింపబడిన యూదుడు రోగము బాగై పవిత్రుడని నిర్ణయింపబడవలసిన ఆచారములో రెండు పవిత్రమైన పక్షులు తేబడగా నర్పింపబడిన యొక దాని రక్తముతో కూడ పారునీరు అవసరము. (లేవి 14:1-9).

గుంట నీరు వేరు పారు నీరు వేరు. గుంట నీరు చచ్చినది. పారు నీరు జీవముగలది. పారు నీరే కావలెనని లేవీ 14:5 పలుకుచున్నది. పారు నీరు పరిశుద్ధాత్మకు సూచన. (యోహాను 7:37-39), పారు నీరు జీవముగలది గనుక జీవముగల దేవుని వాక్యమునకు సూచన. (హెబ్రీ 4:12) పారు నీటి పైని మంటి పాత్రలో ఆ పక్షులలో నొకదానిని చంపనాజ్ఞాపించెనెందుకు? బలిగా చంపబడిన ఆ పిట్ట రక్తముతోకూడ ఆ పాత్రలో ఆ పారు నీరు కలిసిపోవలెను.

నీళ్ళు మాత్రముకాక ఆ అపవిత్రునిమీద నీళ్లతోకూడ ఆ రక్తమును పడవలెను. యాజకుడే వానిని అట్లు ప్రోక్షించుట కద్దు. (లేవీయ 14:7). అతి స్పష్టముగా లేవీ 14:51 లో కర్రకు ఎర్రని నూలుతో కట్టబడిన హిస్సోపు రక్తములో మాత్రము గాక రక్తములోను పారునీటిలోను ముంచబడెననియు గనుక పవిత్రత పొందగోరువానిమీద నీళ్లు మాత్రము గాక లేక రక్తము మాత్రమే కాక రెండును ఒకదానితో నొకటి కలసి వానిమీద రక్తమును నీళ్లును పడెననియు తెలిసికొంటున్నాము.

ఈ పాత నిబంధన చట్టమునకు పూర్ణసిద్ధి వచ్చినట్లుగా క్రీస్తు చనిపోవుచు మనకు అవసరముగానుండిన ఆ రెండు పదార్థము లును అనుగ్రహించెను. ఆయన ప్రక్కలోనుండి రక్తమును, నీరును కారెను.

నేడుకూడ మీ అనుభవములో క్రీస్తు తన రక్తముతోను తరువాత తన వాక్యమను నీళ్లతోను తన ఆత్మయను జలముతోను మిమ్మును తాకి బాగుచేస్తాడు. వాక్యమనే నీళ్లుండవలెను గాని దానితోకూడ క్రీస్తు రక్తము రావలెను. వాక్యమే మిమ్మును ప్రతిష్ఠ చేయును. (యోహాను 17:17). అయితే దానికి ముందు మీ పాపములు క్రీస్తు రక్తమువలన క్షమింపబడక పోయియుంటే వాక్యము ద్వారా మీకు కలిగెడు మేలు సరియైనది కాదు. నీళ్లతోను రక్తముతోను క్రీస్తు రావలెను. ఇంకొకటి – నీళ్లు ఆత్మకు సూచనయై యుండగా నొకడు ఆత్మతో నింపబడి గొప్ప పనులు చేస్తానని అపేక్షించుచున్నాడను కొండి.

రోగులను బాగుచేస్తానంటున్నాడు. అద్భుతములు చేస్తానంటున్నాడు. అయితే ఆయననొక ప్రశ్న అడిగితిమి – నీవు రక్షింపబడితివా లేదా? నీ పాపములు పోయెనా పోలేదా? అయితే దానికి జవాబివ్వడు.

రక్షింపబడితినని ధైర్యముగా సాక్ష్యమివ్వ లేనివాడు ఆత్మపరిపూర్ణుడై గొప్ప కార్యములెట్లు చేయగలడు? అసాధ్యము, నీళ్లతో మాత్రమే అని వాపోతున్నాడు. ఇది సరికాదు. నీళ్లతోను రక్తముండవలెను. రక్తముతో నీళ్ళు కలిసియుండవలెను. నీళ్లుమాత్రము వద్దు. వచనము మాత్రము అనగా వట్టి అక్షరము మాత్రము చాలదు.

ఆ అక్షరమెవరికి సాక్ష్యమిచ్చుచున్నదో ఆ యేసుక్రీస్తే గోచరము కావలెను. ఆయన రక్తమే విశ్వసనీయము కావలెను. లేదా – ఒకడంటాడు – రక్తమే అవసరము. మరియు నాకొక కలకూడ వచ్చినది. ఆ కలలోనే రక్షింపబడితి నంటాడు. క్రీస్తు రక్తము ఎర్రగా కారినట్లు నేను చూచినానంటాడు. సరే గాని దానిలో లోటు పాటుగా నుండేది ఏదనగా రక్తము సరే – అయితే నీళ్లు యెక్కడ? వచనమను నీళ్లు లేకపోయినది – గమనించండి.

యోహాను చెప్పినది తప్పిపోరాదు. నీళ్ళద్వారాను రక్తముద్వారాను క్రీస్తు వచ్చేవాడు – వాక్యమును అనుభవమును వేర్వేరుపరచరాదు. అవును. నాకు తలంపు వాక్యమును ఆత్మను వేర్వేరుపరచరాదు. ఒకడంటాడు – వచ్చినది.

ఆ తలంపు ఆత్మద్వారానైనది, గనుక ఆ కార్యము చేస్తిని. అయితే అతడు చేసిన పని కేవలము అవినీతితో కూడినది. ఇదెట్లని అడిగితే ఆత్మ నాతో చెప్పెను గనుక చేస్తినన్నాడు. అయితే ఆత్మ వాక్యానికి విరుద్ధముగా నెప్పుడైన ఫలాని క్రియ చేయుమనునా? వాక్యానికి ఆత్మకును విరోధమున్నదా? అట్లనరాదు.

ఒక ప్రసంగికుడు సిఫారసు కావలెనని వైద్యునికి లంచమివ్వబోతే ఆ వైద్యుడు అన్యుడైనను నా దగ్గరికి వచ్చి సంగతి చెప్పెను. ఆ క్రైస్తవ ప్రసంగిని పిలిచి అయ్యా, లంచమిచ్చి మీరేమైన వ్రాయించుకొంటారా? ఇదెట్లని అడిగితే – దేవుడే అట్లు లంచమిచ్చి చేయుమని నన్ను ప్రేరేపిస్తే నేనడమేమి చేయగలనని ప్రత్యుత్తరమిచ్చెను.

ఇంకొక స్థలములో భార్యగల సువార్తికుడే, మరొకని కుమార్తెతో పరుగెత్తి పోదామనియుండగా పట్టుపడెను -దేవుడే ఆ పిల్లను, పెండ్లి భార్యగా చేసికొమ్మనెనే అన్నాడు. అయితే మీకు భార్యకలదే అన్నప్పుడు దేవుడే ఈ మంచిపిల్లను చేసికొనుమని పట్టినపట్టు వదలక తన పాపమును దేవునిమీదనే దులప ప్రయత్నించెను.

అయ్యో, ఇదెంత భయంకరము! వాక్యానికి విరుద్ధముగా ఫలానిది చేయుమని దేవుడైనను పరిశుద్ధాత్మయైనను చెప్పరు సుమీ. వాక్యమును పరిశుద్ధాత్మను వేర్వేరు చేయరాదు. ఆత్మ అనే నీళ్ళు మాత్రమే వద్దు. నీళ్ళతోను రక్తముతోను ప్రతి కార్యమును పరిశీలించి ముదంజవేసి సాగిపోవలయును.

తుదకు మరియొకటి చెప్పి దీనితో విరమించతగినది. అదేదనగా క్రీస్తు పుట్టుకతో కాదు బాప్తిస్మము నీళ్ళలో పొందినప్పుడే ఆయన దేవుని కుమారుడైపోయెనని కొందరు నేటివరకుకూడ దుర్బోధ చేయుచున్నారు. యోహాను దీనికి జవాబిచ్చుచు నీళ్ళతో మాత్రమేగాక నీళ్ళతోను, రక్తముతోను క్రీస్తు వచ్చెనని తెలియపరచుచున్నాడు – అనగా రక్తము మొదలుకొని అనగా మరియలో జన్మించినది మొదలుకొని పారంపర్యముగా రక్తముతో అబ్రాహాము మొదలు మరియు రాజైన దావీదు మొదలుకొని రక్తము ద్వారాను, రక్తముతోను క్రీస్తు దేవుని కుమారుడై వచ్చెనని యోహాను మనకు నేర్పు చున్నాడు.

నీళ్ళలో బాప్తిస్మము పొందినప్పుడు క్రీస్తు దేవుని ప్రియకుమారుడే-ఆలాగు ఆకాశమునుండి సాక్ష్యముకూడ వచ్చినది. (మత్తయి 3:17). క్రీస్తు నీళ్ళతో వచ్చినవాడు అయితే నీళ్ళతో మాత్రమే కాదు రక్తముతోకూడ క్రీస్తు వచ్చినవాడు. రక్తములో కూడ క్రీస్తు దేవుని కుమారుడని దీని అర్థము. పుట్టగానే గాబ్రియేలు లూకా 1:35 లో అన్నట్టు క్రీస్తు శిశువుగా నున్నప్పుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడుటకు యోగ్యుడైయుండెను.

అవును, పుట్టకముందుకూడ ఆదియందే వాక్యముగా దేవునియొద్ద నుండెను. మరియు దేవుడైయుండెను. (యోహాను 1:1). గనుక సాక్ష్యమిచ్చువారు ముగ్గురైరి.

  1. సత్మ స్వరూపియైన ఆత్మ సాక్ష్యమిచ్చుచున్నాడు. (రోమా 8:16).
  2. నీళ్ళు అనే వచనము సాక్ష్యమిచ్చుచున్నది. (యోహాను 5:39).
  3. క్రీస్తు చిందించిన రక్తముకూడ నోరుకలిగి మాటలాడినట్లు సాక్ష్యమిచ్చుచున్నది. (హెబ్రీ 12:24).

సత్యసాక్షియైన హేబెలు రక్తము దేవుని చెవిని మొర్రపెట్టెను. (ఆది 4:10). ఆలాగైతే క్రీస్తు విలువైన రక్తము పలకదా? ఓ పాపీ, క్రీస్తును నమ్ముము, ఆయన రక్తమే పరమ ప్రసాదమని విశ్వసించుము. వెంటనే ఆ రక్తమునుబట్టి క్షమింపబడి దాని మెల్లనైన సాక్ష్యముచే ఆదరింపబడి హర్షించెదవు.

Leave a Comment