విశ్వాస పథములో మనలను నిలుపు దేవుని సాధనములు (అధ్యాయము 12)
క్రైస్తవుడు తాను జీవించుచున్నట్టి ఈ లోకముయొక్క నిజమైన అంచనాను కలిగియుండుట చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే తాను వెళ్ళనైయున్న శ్రేష్టమైన దేశపు ఆశీర్వాదములనుకూడ తన యెదుట ఎప్పుడూ ఉంచుకొనవలెను.
మన మనస్సుల నిండా పెరిగిపోవుచున్న ఈ లోకపు దుష్టత్వము తీర్పుకు సిద్ధమైయుండగా, మరొకవైపు క్రైస్తవ లోకము దుస్థితిలో ఉండి, క్రీస్తు నోటనుండి ఉమ్మివేయబడుటకు సిద్ధముగా నుండగా, దేవుని ప్రజలలో గందరగోళము నెలకొని చెల్లాచెదురై ఉండగా, మనముకూడా కొన్నిసార్లు కృంగిపోయి, గుండె బెదరునుండి తప్పించుకొనలేము.
హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయములో క్రైస్తవులుకూడా శ్రమలలో కృంగి పోవుదురు అను వాస్తవమును గుర్తించుట జరిగినది. అయితే ఈ ఉరిని ఎదుర్కొను సత్యము వెల్లడించబడినది.
హెబ్రీయులకు పత్రిక విశ్వాసంలో నిలుపు దేవుని సాధనములు
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
ఈ పత్రికను అందుకొన్న పాఠకులు శోధనల ఒత్తిడికి లొంగిపోయి, శత్రువుతో పోరాడుటలో వాటికి అవకాశ మిచ్చియున్నట్లు అపొస్తలుడు గమనించెను. కృంగదీయు “భారములను” సుళువుగా చిక్కులుబెట్టు పాపములను, క్రైస్తవులకు ఎదురగు కష్టములను అపొస్తలుడు వివరించుచున్నాడు.
శ్రమలలో విశ్వాసులు తమ యెదుట ఉంచబడిన పరుగు పందె ములో అవరోధములు కలిగి తప్పిపోవు ప్రమాదమున్నట్లు గ్రహించెను. శత్రువుతో పోరాడుటలో వారు అలసిపోవచ్చును. ప్రాణములు విసుక వచ్చును.
ప్రభువుచేయు శిక్షను తృణీకరించవచ్చును. ప్రభువు పనిలో వారి చేతులు బలహీనమగునేమో, వారి మోకాళ్ళు సడలునేమో, వారి వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు తుదకు వారి పాదములను ప్రక్కకు తిప్పి వక్రమార్గము అవలంబించునట్లు చేయునేమో అని రచయిత ఆందోళన చెందుచున్నాడు.
మనము కీడుచేత జయింపబడకుండునట్లు అపొస్తలుడు కొన్ని శ్రేష్ఠమగు సత్యములను మన గమనమునకు తెచ్చుచున్నాడు. వాటిని గట్టిగా చేపట్టినయెడల ఎన్ని శోధనలు, వ్యతిరేకతలు ఎదురైనను భూలోకమునుండి పరలోకమునకు వెళ్ళు మన పరుగులో అవి మనలను బలపరచును, ప్రోత్సాహమిచ్చును.
(వచనము 1). మనము విడిచిపెట్టి, వెన్ను చూపిన ప్రస్తుత లోకము, మనము దృష్టి నిలిపియున్న ఆ రాబోవు లోకముమధ్య మన పాదము లున్నవి. ఇదే “పరుగు పందెము”గా వర్ణింపబడినది.
ఇది మనము మన యెదుట ఉంచుకొనిన ఒక పరుగు పందెము కాదు. అది మనయెదుట ఉంచబడియున్నది. రక్షింపబడుటకు ఒకే మార్గమున్నను, ఈ లోకము గుండా ప్రయాణము చేయుటకు అనేక మార్గములున్నవి.
ప్రతి క్రైస్తవుడు తనకు నచ్చిన మార్గములో ప్రయాణముచేయు స్వేచ్ఛ ఉన్నది అని అనేకులు భావించుచున్నారు.
దేవుడు ప్రజలను లోకమునుండి రక్షించు దేవుని మార్గమును, ఈ లోకముగుండా సురక్షితముగా నడిపించు మార్గమును లేఖనములయందు వివరించబడియున్నవి.
మన విధి ఏమనగా ఆ మార్గమును గుర్తించి, మన యెదుట ఉంచిన పరుగు పందెములో పరుగెత్తవలయును. హెబ్రీ పత్రిక చదువుచుండగా మనకు ఒక విషయము స్పష్టమగును.
దేవుడు తన ప్రజలకొరకు ఏర్పాటుచేసిన మార్గము పూర్తిగా యూదా శిబిరమునకు వెలుపల ఉన్నది. అయితే క్రైస్తవ లోకము ఆ శిబిరమునొద్దకే తిరిగి వెళ్లినట్లు స్పష్టమగుచున్నది.
అందువలననే ఈ అధ్యాయములో “శిబిరము వెలుపలికి వెళ్ళుదము” అని ఇచ్చిన హెచ్చరిక ఈ కాలమునకు అన్వయించునదే.
ఆ కాలమందు ఏలాగో, నేటి కాలమందుకూడా మనము శిబిరమునుండి వెలుపలికి వెళ్లవలెనంటే నిందలు, శ్రమలు తప్పవు. నిందలు శ్రమలు కలిగినప్పుడు కృంగిపోవుటయు సహజమే.
ఈ మార్గము నవలంబించుటలో అవరోధములున్నవి. అందువలననే అపొస్తలుడు “ప్రతి భారమును, సుళువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టు”మని హెచ్చరించుచున్నాడు.
దేవుడు నిర్ణయించిన మార్గమును అవలంబించుటలో రెండు అవరోధములు ఎదురగును. మొదటిది “భారములు”, రెండవది “పాపము”. భారములు నైతిక పొరపాట్లు కావు.
దేవుని మార్గమును అంగీకరించుటలో ప్రతిబంధకముగా నుండునది లేదా మార్గమందుండగా ఓపికతో పరుగెత్తకుండా చేయునది భారము. మన ఆత్మీయ పురోగతికి అడ్డుగానున్నదేదో త్వరగా పసిగట్టవలెనంటే వెంటనే పరుగెత్తడము ప్రారంభించవలయును.
పందెములో పరుగెత్తువాడు తనకు భారముగా ఉన్న బట్టలన్నియు తీసివేయవలెను. సాధారణ జీవిత ములో ఎంతమాత్రము బరువుగా అనిపించనివైనను పరుగు పందెములో బరువుగా నుండును.
“ప్రతి భారమును” విడిచిపెట్టుమని హెచ్చరింపబడి యున్నాము. మనము కొన్ని భారములను వెంటనే విడిచి పెట్టుదుము కాని, మరి కొన్నిటిని అంటిపెట్టుకొనియుందుము.
మరియొక అవరోధము పాపము. ఇక్కడ చెప్పిన పాపము అక్రమము లేదా మన ఇష్టమును నెరవేర్చుకొనుట. అవమానమను వెలుపలి మార్గమును అవలంబించుటలో ముఖ్యమైన అవరోధము అదుపులేని అహంభావము.
దేవుని మార్గములో మానవుని తలంపులకు అవకాశమే ఉండకూడదు. ఈ అవరోధములను అధిగమించవలెనంటే బలము, ఓరిమి అవస రము. అందువలననే అపొస్తలుడు “ఓపికతో పరుగెత్తుదము” అని హెచ్చ రించుచున్నాడు.
పరుగెత్తుటకు ఆత్మీయ సత్తువ, దానికి తోడు ఓపిక అవసరము. బలముగా ప్రారంభించుట సులభమే కాని, దినదినము ఎదురగు కష్టములలో, నిరుత్సాహములలో ఓపిక ఎంతైనా అవసరము.
హెబ్రీయులకు పత్రిక దేవుడు మనలను నిలుపు మార్గాలు
మనము అవరోధములను అధిగమించి, మనయెదుట ఉంచబడిన పందె ములో ఓపికతో పరుగెత్తుటకు కావలసిన శక్తిని అమలులో పెట్టుటకు కావలసిన సాధనములను ఈ అధ్యాయములో దేవుని ఆత్మ మన గమన మునకు తెచ్చుచున్నాడు.
మొదటిది – మనలను ప్రోత్సహించుటకు గొప్ప సాక్షి సమూహము యొక్క విశ్వాస పథమునుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు.
మనలను ఎదిరించు శత్రువులున్నను, శోధనలు ఎదుర్కొనవలసినను, కష్టములను అధిగమించవలసినను, మనకంటే ముందుగా ఎందరో ఈ విశ్వాస పథమునందు సాగిపోయిరని మననము చేసికొనవలెను. కొందరు రానున్న లోకపు మహిమ వెలుగులో నడచుకొనిరి.
మరికొందరు విషమ పరీక్షలు ఎదుర్కొనవలసి వచ్చెను. కౄరమైన దూషణలు, బంధకములు, చెర, చిత్రహింసలు, మరణము అనుభవించియు వారు విశ్వాసముద్వారా జయించిరి.
ఆ విధముగా ప్రస్తుత లోకమందలి అన్ని విధముల శ్రమలను అధిగమించి, వేరొక లోకమునకు నడిపించు పరుగునందు ఓపికతో పరుగెత్తునట్లు విశ్వాసమునకు సాక్ష్యమిచ్చుటకు గొప్ప సమూహము మనచుట్టూ ఆవరించియున్నది.
(వచనము 2). రెండవదిగా – భూసంబంధమైన సాక్షులందరికంటే ఎంతో ఉన్నతముగా విశ్వాస పథములో మనలను ప్రోత్సహించుటకు మహిమలో ప్రభువైన యేసు ఉన్నాడు.
“విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన” ఆయనపై మన దృష్టి నిలుపబడినది. శిబిరము వెలుపలి మార్గమును అవలంబించినమీదట మన స్వంత శక్తితో అంతటా కొనసాగగలమని అపొస్తలుడు భావించుటలేదు.
అందుకు భిన్నముగా ఆయన హెచ్చరికతో మనకు అర్థమగునదేమనగా అవరోధములను అధిగమించి, పరుగు ప్రారంభించిన తరువాత యేసువైపు దృష్టి నిలిపి నప్పుడే మనము కొనసాగగలము.
శిబిరము వెలుపలికి మనలను ఆకర్షించినది ఆయనే, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు బలపరచువాడుకూడా ఆయనే. ఇతరులు ఈ విశ్వాస పథమందు నడిచిరి గాని, అంతిమ గమ్యము చేరలేదు.
ఎందుకనగా వారు యింకను సంపూర్ణులు కాలేదు. (11:40). యేసువైపు చూచునప్పుడు ఆ మార్గములోని ప్రతి అడుగును దాటి, గమ్యము చేరిన వ్యక్తిని చూచుచున్నాము. పాత నిబంధన భక్తు లందరూ దేదీప్యమానమగు ఆదర్శమైనను, వారు “నాయకులు” కాదు, “సంపూర్ణులును” కాదు.
కానీ ఆ రెండుకూడా ప్రభువైన యేసే. విశ్వాస పథములో ఎదురైన అవమానములను, శ్రమలను తన ఎదుట ఉన్న ఆనందముకొరకు ఆయన నిర్లక్ష్యము చేసెను.
ఆయన ఆ మార్గమున నడచినందున “నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములు గలవు” అని చెప్పగలిగెను.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములోని సాక్షులందరూ తమ ఆదర్శము ద్వారా మనలను ప్రోత్సహించుచున్నను, వారిలో ఏ ఒక్క సాక్షియు మన విశ్వాసమునకు ఆస్పదము కాజాలడు, అవసరతలో సహాయము చేయు నట్లు కృపా పరిచర్య జరిగించలేడు.
యేసైతే ఆ మార్గమందు నడచుట మాత్రమే కాదు, దాని గమ్యముకూడా చేరిన పరిపూర్ణ ఆదర్శము. అంతే కాదు, “తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై యున్నందున ఆ మార్గ మందున్నవారిని బలపరచ శక్తిగలవాడై యున్నాడు.
ఆ గొప్ప సాక్షి సమూహము తెరమరుగైపోయిరి, వారు దేవునికొరకు జీవించిరి, లోక సంబంధముగా ఆలోచించినయెడల వారిప్పుడు మృతులు, యేసు సదా జీవించుచున్నాడు. మనవెనుక అద్భుత ఆదర్శములును, మనయెదుట జీవించు వ్యక్తియు ఉన్నారు.
ఈ పత్రికలో పదే పదే మన ప్రభువైన యేసు అను వ్యక్తిగత నామము ప్రస్తావించబడియున్నది. (చూడండి 2:9; 3:1; 4:14; 6:20; 9:19; 12:2; 13:12). దీనికి కారణము మన మనస్సులపై ఒక గొప్ప సత్యమును ముద్రించుటకొరకు కావచ్చును.
మహిమా ప్రకాశములతో అలంకరించబడిన, మన అపొస్తలుడు, ప్రధాన యాజకుడు మరెవరో కాదు. మనమధ్య దీనుడై నివసించిన ఆయనే.
ఆయన స్థానము, పరిస్థితులు ఎట్లు మారెనో మనమెరుగముకాని, మనము మాత్రమే ఆయనవైపు తదేకముగా చూడవలెనని చెప్పబడియున్నది. ఆయన మనలను చూచుచున్నాడు. మనము ఆయనవైపు తేరిచూడవలెను.
(వచనములు 3, 4). మూడవదిగా యేసు నడచిన సంపూర్ణ మార్గము మనలను ప్రోత్సహించుచున్నది. యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆయనవైపు చూడుమని హెచ్చరించుటమాత్రమే కాదు, ఆయన గతమునుకూడా తలంచుకొనవలెను.
“బాగుగా తలంచుకొనుడి” అనునది సరియైన తర్జుమా. ఆయన మార్గమును తలంచుకొనినప్పుడు మొదటి నుండి చివరివరకు “పాపాత్ములు తనకు వ్యతిరేకముగా తిరస్కారము” చేసినట్టే గమనించగలము.
హెబ్రీయులకు పత్రిక మరియు విశ్వాసంలో నిలకడ
మనముకూడా విశ్వాస పథము అవలంబించి పందెములో పరుగెత్తుటకు శిబిరము వెలుపలికి వచ్చినయెడల, అడు గడుగునా మనుష్యుల మూర్ఖత్వమును ఎదుర్కొనుట తప్పదు.
క్రీస్తుకు వ్యతిరేకముగా పాపాత్ములు చేసిన తిరస్కారము, దేవుని ప్రజలు ఆయన అవమానములో పాలుపొందునప్పుడు అలసట కలిగించును. అలసి నప్పుడు విసిగిపోయి వెనుకంజవేయు అవకాశమున్నది.

కనుక, మనము విసుకక యుండునట్లు “ఆయనను తలపోసికొందము”. పాపాత్ముల వ్యతిరేకతను, తప్పిపోవు విశ్వాసులను ఆయన సంపూర్ణముగా ఎదుర్కొని యున్నందున మనము ఎదుర్కొనవలసినదేమియు లేదు. అని ఆయన చెప్పగలుగు చున్నాడు. మనమింకను రక్తము కారునంతగా పాపముతో పోరాడలేదు.
పాపాత్ముల వ్యతిరేకతకు కృంగిపోయి, దేవుని చిత్తమునకు విధేయు లగుటలో తప్పిపోకుండునట్లు ప్రభువు తన రక్తమునే కార్చియున్నాడు.
సిలువచుట్టూ మూగియున్న పాపాత్ములు “నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి క్రిందకు దిగిరా” అని పలికిరి. ఆయన ఆ పని చేసినయెడల తండ్రి చిత్తమును నెరవేర్చుటలో విఫలమై, తనకు అప్పగించిన పనిని సమాప్తము చేయలేకపోయి ఉండును.
(వచనములు 5-11). నాలుగవదిగా – ఆ మార్గమందు మన పాదములు నిలుచునట్లు, తండ్రి ప్రేమతో శిక్షించు విధానములున్నవి. మనము పాపముతో పోరాడునప్పుడు, హతసాక్షిగా మరణించవలసి వచ్చిన, మనమెన్నటెన్నటికిని శరీరమునుండి విడిపించబడుచున్నాము.
ఒకవేళ మనము రక్తము ఒలికించుటకు పిలువబడనియెడల, మనలను శరీరసంబంధమైన శక్తినుండి విడిపించి, పరిశుద్ధతలో పాలుపొందునట్లు ఆయన మరియొక పద్ధతిని అవలంబించును.
అవసరమైనయెడల మనలను సరిదిద్దుటకు శోధనలు అనుమతించును. దేవుడు మనతో వ్యవహరించునప్పుడు రెండు ప్రమాదములున్నట్టు హెచ్చరింపబడియున్నాము. ఒకటి, శిక్షను తృణీకరించుట.
రెండవది, శిక్షాసమయములో కృంగిపోవుట. ‘శోధనలు మానవులందరికీ సహజ మేలే’ అని కఠినమైన మనస్సుతో లోపల గర్వించకూడదు.
లేదా శ్రమలలో నిరాశానిస్పృహలతో కృంగిపోకూడదు. (వచనములు 6-8). ఈ రెండు ప్రమాదములను హెచ్చరించిన తరువాత రెండు సత్యములను మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.
దానిద్వారా మనము ప్రతికూల పరిస్థితిలో కృంగిపోవుటగాని, ‘శిక్షను తృణీకరించుటగాని చేయక యుండగలుగుదుము. ప్రతి పరీక్ష వెనుక ప్రేమ ఉన్నదని చెప్పబడియున్నది.
“ప్రభువు తాను ప్రేమించినవారిని శిక్షించును” అని వ్రాయబడియున్నది. ప్రేమించు హృదయమే దెబ్బకొట్టు చేతిని కదలించును. పరిపూర్ణమైన ప్రేమ యోగ్యమైనదేదో చేయుచున్న ప్పుడు నేనెట్లు తృణీకరించగలను? నేనెందుకు అలసిపోవలెను.
శిక్షను అనుమతించిన ప్రేమ నన్ను బలపరచదా? రెండవది, మన పరీక్షలలో దేవుడు కుమారులతో వ్యవహరించినట్లు మనతో వ్యవహరించుటను చూడగలము. మన పిల్లలలో కూడా వారి స్వేచ్ఛావర్తనమును, ఖండించ వలసిన దుర్గుణములను గమనించగలము.
అదేవిధముగా దేవుడు తన పిల్లలలో తన పరిశుద్ధతకు వ్యతిరేకమగు ధోరణులను కనిపెట్టును, మన చెడుపోకడలు, అలవాట్లు, అసహనము, చిరచిరలాడుట, క్షుద్రమగు వ్యర్ధత, గర్వము, డంబము, స్వశక్తిమీద ఆధారపడుట, స్వార్థము మొదలైన వాటిపట్ల కఠినముగా వ్యవహరించి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందునట్లు చేయును.
మనలో తన పరిశుద్ధ స్వరూపమేర్పడుటకు తండ్రి ఎంత శ్రమపడెనో గమనించినయెడల, దానికంతటికిని కారణము తన బిడ్డలపట్ల ఆయనకున్న గొప్ప ప్రేమయే. దేవుని ప్రేమ కేవలము అనుభవ పూర్వకము కాదు.
మన పక్షముగా ఆయన ప్రేమ ఆచరణాత్మకమైనది. ఏదైనా కష్టమునుండిగాని, శోధననుండిగాని తప్పించబడినప్పుడు దేవుని ప్రేమనుగూర్చి ఆలోచించుదుము.
మాటలాడుదుము. ఇది ఆయన సున్నిత మైన ప్రేమ, దయ కావచ్చును. అయితే ఆయన మనకు అనుమతించు శ్రమలుకూడా ప్రేమతోనే అని గ్రహించుట అవసరము.
అపొస్తలుడు శిక్షించుటనుగూర్చి, దండించుటనుగూర్చి మాటలాడు చున్నాడు. దండించుట దేవుని అధికారపూర్వకమైన వ్యవహారము కావ చ్చును. స్పష్టమైన వైఫల్యమును సవరించుటకు చేయు గద్దింపు దండన.
శిక్షించుట ఏదేని పాపము మూలముగానే అనుకొను అవసరములేదు. దేవుడు తన స్వభావముననుసరించి మనలను వృద్ధిపొందించుటకు తన పరిశుద్ధతలో పాలుపొందునట్లు చేయునది కావచ్చును.
హెబ్రీయులకు పత్రికలో దేవుని సాధనములు
(వచనములు 9-11). దేవుడు మనలను శిక్షించుటద్వారా మనము మేలుపొందు రెండు సత్యములు వివరించబడినవి. మొదటిది, “ఆత్మలకు తండ్రియైనవానికి లోబడవలసినదని” చెప్పబడియున్నాము.
భూసంబంధు లైన తండ్రులు మన శరీరములను శిక్షించిరి, ఆత్మల తండ్రి మనము తనకొరకు జీవించునట్లు మనలో సవ్యమైన వైఖరి అలవడునట్లు శిక్షించును.
ఈ శిక్షద్వారా కలుగు ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించవలెనంటే ఆయన అనుమతించినవాటన్నిటికిని పూర్తిగా లోబడవలెను. శ్రమలలో మనము దేవునికి లోబడుటద్వారా శ్రమకు, మనకు మధ్య దేవుడున్నాడు.
తిరుగుబాటుచేసి దేవుని మార్గమును ప్రశ్నించినయెడల దేవునికి, మనకు మధ్య శ్రమ వచ్చును. మన జీవితములు బలము పొందుటకు బదులు చీకటిలో పడిపోవును.
రెండవదిగా, దేవుడు అనుమతించినవాటికి లోబడుటద్వారా “దాని యందు అభ్యాసము” పొందుచున్నాము. రానైయున్న దినమున … ఆయన మనలను ఏలాగు శ్రమలలోగుండా నడిపించెనో మనకు శిక్షణ నిచ్చి, ఆయన ఏలాగు ఆశీర్వదించెనో దానిని పూర్తిగా గ్రహించుదుము.
ఇదంతయు వాస్తవమైనను, దేవుడు మనలను శిక్షించుటనుబట్టి ప్రస్తుత కాలమందును మనము ఆశీర్వాదములు అనుభవించవలెనని కోరుచున్నాడు. దీనికి మనకు ప్రస్తుతము అభ్యాసము అవసరము.
మనము ఆయన పరిశుద్ధతలో పాలుపొందుట, సమాధానకరములగు నీతిఫలముల ననుభవించుటే ఆ ఆశీర్వాదములు. పదియవ వచనములో అపొస్తలుడు ప్రస్తావించిన పరిశుద్దత దాని లక్షణమును సూచించుచున్నది.
దీనిద్వారా మనము అపరిశుద్దతకు దూరముగా నుండుటయే గాక, దేవుని వలెనే అపరిశుద్ధతను అసహ్యించుకొందుము. చెడుగును అసహ్యించు కొనుటవలన నీతి అనుభవములోనికి వచ్చును.
ఫలితముగా సమాధాన ఫలములు పండును. అందుకు భిన్నముగా మనము ఇప్పుడు నివసించు చున్న నీతిబాహ్యమగు లోకము అశాంతితో అలమటించును.
(వచనములు 12-17). విశ్వాస పథము అవలంబించినవారి మధ్య ఉత్పన్నమయ్యెడి ప్రత్యేక ప్రమాదములను, కష్టములను ఎదుర్కొనుటకు కొన్ని ఆచరింపదగిన హెచ్చరికలు మన ప్రోత్సాహముకొరకు ఇవ్వబడినవి.
దేవుని వాక్యమునకు విధేయులై నడచుకొనుచు దేవుని వాక్య ప్రమాణ మును తగ్గించుటకు ఇష్టపడక ఉన్నప్పుడు, బలహీనతలు, వైఫల్యము లేని ప్రజల సహవాసము లభించునని కోరుకొనుట కూడదు.
ప్రాముఖ్య మైన ఆత్మీయ సత్యములు లోపించిన ప్రజల సహవాసము కోరుకొని నందున, చివరకు మనము చేరే గుంపు స్వార్ధపరులును, తమలో తాము తృప్తిచెందిన పరిశుద్ధులునై యుందురు.
ఈ లేఖన భాగమునుబట్టి క్రైస్తవ మార్గములో కొన్ని వర్గముల ప్రజలను చూడగలము.
- క్రైస్తవ శక్తి లోపించినవారు కొందరు వడలిన చేతులు, సడలిన మోకాళ్ళు గలవారు.
- వంకర మార్గమున నడచువారు కొందరు.
- భేదములు పుట్టించువారు కొందరు.
- పరిశుద్ధతను ఆచరించుటలో విఫలులైనవారు.
- దేవుని కృపను పోగొట్టుకొనినవారు.
- లోకములో అపరిశుద్ధమైన సంబంధములు పెట్టుకొనినవారు.
- దైవిక విషయములను సాధారణమైనవిగా భావించువారు మరికొందరు.
ఇన్ని చెడుగులమధ్య దేవుని కృప లేనియెడల తప్పిపోకుండుట ఎట్లు సాధ్యము?
(వచనము 12). మొట్టమొదట “వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి” అని అపొస్తలుడు చెప్పుచున్నాడు. ఆత్మీయ శక్తి కొరవడినయెడల నీ చేతులను పైకెత్తి ఇతరులను ప్రోత్సహించుము.
దీనిని మనము ప్రార్థనకు అన్వయించవచ్చును. తిమోతికి పౌలు వ్రాయుచు చెప్పినదేమనగా, నని కోరుచున్నాడు.

వడలిన చేతులు సడలిన మోకాళ్ళు, ప్రార్థన చేయని చేతులను ప్రార్థనకు వంగని మోకాళ్ళను సూచించుచున్నవి. పూర్వకాలపు ప్రవక్త ఇట్లు చెప్పెను:
వ్యక్తిగత జీవితములో ప్రార్థన లేమివలన, బహిరంగ జీవితములో శక్తిహీనులుగా కనిపించుట లేదా?

(వచనము 13). రెండవదిగా – ప్రార్థనవెంట అభ్యాసము ఉండ వలెను. “మీ పాదములకు మార్గములను సరాళము చేసికొనుడి” అని తరువాత చెప్పబడినది. అనేకులు దారి తప్పి వంకర త్రోవలలో తిరుగు లాడు దినములందు మన పాదములను తిన్నని మార్గములందు నడుచు నట్లు జాగ్రత్తపడుదము.
దానివలన ఎవరును దారితప్పక యుందురు. అనేకులు తమ నడకలో కుంటికాలు, బెణకిన కాలు గలవారై యుండ వచ్చును. వారు నడచుచున్న మార్గము వారికి సరిగా తెలియదు.
ప్రస్తు తము ఎక్కడ ఉన్నారోకూడా స్పష్టమైన అవగాహన వారికి లేదు. అట్టివారు చిన్న కారణమునకే దారి తప్పవచ్చును. అలాగైన మార్గమధ్యమందు మనలను మభ్యపెట్టు మార్గములవైపు మళ్లకుండుట ఎంతో ముఖ్యము.
పెద్దవాడైన పరిశుద్ధుడు ఒకడు అజ్ఞాన కార్యము జరిగించినందున, యౌవ నస్థులైన పరిశుద్ధులు దాని నవలంబించి మార్గము తప్పిపోవచ్చును.
(వచనము 14). మూడవది ఎవరైనను భేదమును కలిగించు మార్గమును అనుసరించినను, మనము అందరితో సమాధానముగా నుండుటకు ప్రయత్నించుదము.
క్రైస్తవులముగా ఈ లోకసంబంధమగు రాజకీయాలలో జోక్యము కలిగించుకొనక, లోకమందు యాత్రికులముగా నున్న మనము గట్టి అభిప్రాయములు వ్యక్తముచేయుట మన పనికాదు.
ప్రశాంతముగా ఈ లోకయాత్రను కొనసాగించవలెను. పతనమైన మానవ స్వభావంలో గొడవలలో తలదూర్చు లక్షణమున్నది. క్రైస్తవుడు జగడములు పుట్టించువాటికి దూరముగా నుండుటయేగాక, సమాధానమును వెంటాడి, సమాధానము పెంపొందు మార్గమును అవలంబించవలయును.
నాలుగవది – మనము పరిశుద్ధత కలిగియుండవలెను. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మహిమాప్రభావములతో అలంకరించబడిన యేసును చూచుచున్నాము అని అపొస్తలుడు చెప్పు చున్నాడు.
దీని అర్థము మనము సహజముగా పరిశుద్ధులముగా జీవించ వలెను. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. ప్రయాణములో సమాధానము, పరిశుద్ధత అను రెంటిని చేపట్టవలెను.
హెబ్రీయులకు పత్రిక గురించిన బోధలు – విశ్వాసం నిలుపు ప్రభావం
లేనియెడల పరిశుద్ధతను ఫణముగా పెట్టి సమాధానమును లేదా సమాధానము లేకుండా పరిశుద్ధతను వెంబడించు ప్రమాదమున్నది.
(వచనము 15). అయిదవది – ఎవడైనను దేవుని కృపను పొంద కుండ తప్పిపోవునేమో జాగ్రత్తగా చూచుకొనుడి అని అపొస్తలుడు హెచ్చరించుచున్నాడు. దేవుని కృపను తప్పిపోవుట అనగా దేవుని కృపలో నమ్మకము తగ్గిపోవుట.
దేవుడు మనకు ఏమైయున్నాడో దానిని అనుభ వించలేకపోవుట. ఫలితముగా చేదు వేరు ఏదైనను మొలిచి, పరిశుద్దులను కలవరపరచవచ్చును. ఒకరిపైనొకరు వైరముతో కూడిన ఆలోచనలకు తావిచ్చినందున అనేకులు అపవిత్రులగుదురు.
(వచనములు 16, 17). ఆరవది – లోకముతో అపరిశుద్ధమైన సంబంధము కల్గియుండు విషయము జాగ్రత్తగా ఉండవలెను. అట్టి సంబంధము వ్యభిచారమునకు ముంగుర్తుగా చూపెట్టబడినది.
చివరిగా దైవికమగు విషయములను-సాధారణముగా పరిగణించు విషయము హెచ్చరించబడియున్నాము. ఇదే భ్రష్టత్వము.
ఏశావు దీనికి ప్రబల నిదర్శనము. ఏశావు తాత్కాలిక ప్రయోజనముకొరకు జ్యేష్టత్వపు హక్కును చిన్నచూపు చూసెను.
ఇది హెబ్రీయులకు, ఆ మాటకొస్తే క్రైస్తవ్యమును ఒప్పుకొనిన ప్రతి ఒక్కరికీ, క్రైస్తవ్యములోని ఆశీర్వాదములను తక్కువగా ఎంచి, త్రోసివేయువారికి గొప్ప హెచ్చరికగానున్నది.
క్రైస్తవ లోకము రాను రాను ఏశావు భ్రష్టత్వములోనికి దిగజారిపోవుట విచారకరము. ఏశావు ఆ తరువాత శ్రద్ధతో వెదకినది పశ్చాత్తాపముకొరకు కాదుగాని అంతయు అయిపోయిన తరువాత ఆశీర్వాదముకొరకు వెదకెను.
భ్రష్టత్వ ములో పశ్చాత్తాపమునకు తావులేదని క్రైస్తవ లోకము గ్రహించును. దైవిక ఆధిక్యతలను చిన్నచూపు చూచుటవలన భ్రష్టత్వములో పూర్తిగా కూరుకుపోకముందు అపచారములో పడిపోవుదురు.
ప్రభు రాత్రి భోజనము మూలముగా మనము రక్షింపబడలేదు కనుక దానిని చిన్నచూపు చూచి, ప్రక్కకు నెట్టువారున్నారు. ఇది ఆధునిక సమాజపు అపచారమునకు నిదర్శనము కాదా?
(వచనములు 18-21). చివరిగా ఈ లోకమందలి శ్రమలకు దుఃఖములకు ప్రస్తుత లోకసంబంధమగు సాధనములకు పైగా మన ఆత్మలను ఎత్తుటకు అపొస్తలుడు మనయెదుట రాబోవు లోకమును ప్రత్యక్షపరచెను.
ప్రస్తుతము ఈ లోకమందలి సౌఖ్యములు, రాబోవు లోకము దృష్టికి వెలుపల ఉన్నవి. అందువలన ఈ గొప్ప వాస్తవిక సత్యముయొద్దకు మనము వచ్చియున్నామని అపొస్తలుడు చెప్పుటలో అవి మనకు విశ్వా సముద్వారా గ్రాహ్యమైనవని భావము.
రెండవ అధ్యాయము 5వ వచనములో అపొస్తలుడు రాబోవు లోకమును ప్రస్తావించి యున్నాడు. ఇది వెయ్యేండ్ల పాలనలో క్రీస్తు స్వతంత్రించుకొను అంతులేని స్వాస్థ్యమును సూచించుచున్నది.
క్రీస్తు నరునిగా అధికారము కలిగి ఉన్నదంతయు ఇందులో నుండును. అవి పరలోకసంబంధము లేదా ఇహ సంబంధము కావచ్చును. రాబోవు లోకమునకు ఇహము, పరము అను రెండు పార్శ్వములున్నవి.
ఈ వాస్తవములను వివరించక ముందు రచయిత 18-21 వచనము లలో ఇశ్రాయేలీయులు దేనియొద్దకు వచ్చిరో, క్రైస్తవులు దేనియొద్దకు రాలేదో వాటి వ్యత్యాసమును చూపుచున్నాడు.

అందువలననే దేవుడు భూమిమీద ప్రత్యక్షమైనప్పుడు, పాపమునకు అవిధేయతకు వ్యతిరేకముగా తీర్పు విధించు గంభీర సంకేతములతో ప్రత్యక్షమాయెను.
ఈ సంకేతములైన అగ్ని, కారుమేఘము, గాఢాంధకారము, తుపాను మనుష్యుల హృదయములలో భయము పుట్టించెను. సీనాయి దగ్గర ఉన్న ప్రతిదీ మనకు వ్యతిరేకముగా ఉన్నది.
మొదటి పర్వతము దగ్గర నున్నవన్నియు దృష్టిని, బుద్ధిని ఆకర్షించెను. క్రైస్తవులమగు మనము “స్పృశించి తెలుసుకొనదగినట్టి” కొండకు రాలేదు. (వ.18). వినికిడి సంబంధమగు “బూర ధ్వనికి, మాటల ధ్వనికి” వచ్చియుండలేదు. (వ.19). కంటికి కనిపించు వస్తువులయొద్దకును రాలేదు. (వ.20).
ప్రకృతి సంబంధియగు మనిషి దేవుని సన్నిధికి తాళుకొనలేడు. దేవుని మహిమా ప్రత్యక్షత కొంచెమైనను, దానికి మనిషి కోరునది జతచేయబడిన యెడల దానిని భరించుట కష్టము. ఇశ్రాయేలీయులు దానిని సహించలేక పోయిరి.
మోషే చూచినప్పుడు ఆ దృశ్యము ఎంతో భయంకరముగా నుండెను గనుక “నేను మిక్కిలి భయపడి వణకుచున్నాను” అనెను. క్రైస్తవ్యములో మనము వచ్చినట్టి గొప్ప వాస్తవములను ప్రకృతి సంబంధి స్పృశించలేడు, వినలేడు, చూడలేడు.
హెబ్రీయులకు పత్రిక అధ్యాయాలు 10-12 వచనాలు
అవి విశ్వాసముద్వారా మాత్రమే గ్రాహ్యములు. యూదా మత వ్యవస్థలో ప్రతిదీ కూడా శరీరమునకు ఆకర్షణీయముగా రూపొందించబడినది. దీనికి అలవాటుపడియున్న యూదా విశ్వాసులకు ఈ సత్యములు గొప్ప పరీక్షగా పరిణమించినవి.
ఇప్పుడు వారికి పరిచయము చేయబడినది పూర్తిగా నూతనమైనది, దృష్టిని ఆకర్షించుదానికి పూర్తిగా వెలుపలిది. యూదా మతములోనివన్నియు ఛాయలు, క్రైస్తవ్యములోని అదృశ్యమైనవన్నియు నిజస్వరూపములని వారు తెలుసుకొనవలెను.
దృశ్యమానమైనవన్నియు గతించి, వారును, మనమును ఇప్పుడు అద్భుతమగు ఆశీర్వాదముల పరిధిలోనికి ప్రవేశించు చున్నాము. అవి విశ్వాసముద్వారానే గ్రహింప వీలగును.
(వచనములు 22-24). మనయెదుట తెరువబడిన విశాలమైన ఆశీర్వాదశాలలోనికి మనము వచ్చియున్నట్లు చెప్పబడు 8 అంశములు ఉన్నవి :
- సీయోను కొండ.
- జీవముగల దేవుని పట్టణము, అనగా పరలోకపు యెరూషలేము.
- వేవేలకొలది దేవదూతలయొద్దకు, ఇది సార్వత్రిక సమావేశము. 4. పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకు.
- అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకు.
- సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకు.
- క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకు.
- హేబెలుకంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు,
1. సీయోను కొండ – మన ఆత్మయందలి విశ్వాసముతో రాబోవు లోకమును చూచినప్పుడు, దేవుని ఆత్మ మనలను భూలోకమందలి పరిశుద్దులకు ప్రతినిధిగానున్న భూసంబధమగు యెరూషలేమునకు, అనగా సీయోను కొండకు తీసికొనివచ్చును.
భూలోకమందుగాని, పరలోక మందుగాని ఉన్న పరిశుద్ధులందరికిని ఆశీర్వాద కారణము ఆ సీయోను కొండ అని సూచించుచున్నది. సీయోను కొండ ఆత్మీయ ప్రాముఖ్యతను 78 మరియు 132 కీర్తనలు వివరించుచున్నవి.
బాధ్యతల విషయములో ఇశ్రాయేలీయులు పూర్తిగా విఫలులైన విషయము కీర్తన 78 వెల్లడించుచున్నది. తమ క్రియల ఆధారముగా సమస్తము పోగొట్టుకొనిరి. వారి ప్రత్యక్ష గుడారము విడిచిపెట్టబడెను. (వ. 60); మందసము విరోధుల చేతిలోనికి పోయెను. (వ. 61); దేశము తీర్పునకు గురియాయెను.
ప్రజలు నశించిపోయిరి. (వ. 62-64). అప్పుడు 65వ పాదములో వ్రాయబడినరీతిగా “నిద్రనుండి మేల్కొను ఒకనివలె” ఆయన “పరాక్రమశాలివలె” దాని చేయ ప్రారంభించును. అప్పుడు ప్రజల స్థితిగతులలో గొప్ప మార్పు చోటు చేసుకొనును, అది యెహోవావలననే జరుగును.
ఇంతవరకు దేవుడు ఇశ్రాయేలీయుల చేతి పనులనుబట్టి వ్యవహరిం చుచు వచ్చెను. వారెప్పుడైతే పూర్తి నాశనమునకు తొలగిపోయిరో అప్పుడు దేవుడు తన సార్వభౌమత్వమునుబట్టి వెనుకతీసి తన స్వంత విధానములో పనిచేయ మొదలుపెట్టెను.
అందువలననే ఆయన యూదా గోత్రమును, తాను ప్రేమించిన సీయోను పర్వతమును, “మరల దావీదును కోరు కొనెను” అని చెప్పబడినది. దేవుడు తన కృపలో ఎన్నుకొను విధానమిది. పర్వతము శక్తికి నిదర్శనముగా నున్నది. సీయోను పర్వతము దేవుని కృప అమలుపరచుటకు నిదర్శనముగా ఉన్నది.
132వ కీర్తన సీయోను పర్వత విషయమై మరికొంత గొప్ప సత్య మును వెల్లడించుచున్నది. దావీదు మందసమును తిరిగి సీయోనుకు తెచ్చిన సందర్భమును ఈ కీర్తన కొనియాడుచున్నది.
మందసమును శత్రువుల చేతినుండి విడిపించుట మాత్రమేకాదు, దాని అసలైన స్థాన మందు అనగా సీయోను కొండపైన నిలుపుట జరిగినది. “యెహోవా సీయోనును ఏర్పరచుకొనియున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు.
ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమస్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను” (వ. 13) అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు.
మందసము సీయోను కొండమీద స్థాపించిన వెంటనే ఆశీర్వాదములు ప్రజలపై ప్రవహించుట చూడగలము. “దానిలోని ఆహారమును నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు”.
ఇక్కడ మరల సీయోనుకు అనుబంధముగా దైవిక ఎన్నిక ప్రస్తావించ బడినది. మందసమును గూర్చిన ఆలోచన జోడించబడినది. మందసము, దానిపైనున్న కరుణాపీఠము క్రీస్తును సూచించుచున్నది.
ఆ విధముగా సీయోను కొండనుగూర్చిన సంపూర్ణ సాదృశ్యభావము మానవునికి ఆశీర్వా దములు క్రీస్తుద్వారానే దైవకృప పనిచేయుటవలన సంక్రమించునని నేర్చుకొనుచున్నాము.
మానవుడు వైఫల్యము చెందినందున సమస్తమును పోగొట్టుకొన్నాడు. అయితే అవన్నియు క్రీస్తు ఏమైయున్నాడో, ఆయన ఏమి చేసెనో దాని ఆధారముగా దైవకృపద్వారా మనిషికి ప్రవహించు చున్నవి.
మనము నిలుచున్న ఆశీర్వాదముల ఆధారమగు రాబోవు లోకము అట్టిది, మనము అట్టిదానియొద్దకు విశ్వాసముతో చేరుకొనియున్నాము.
విశ్వాసంలో నిలుపు దేవుని పద్ధతులు
2. జీవముగల దేవుని పట్టణము అనగా నూతన యెరూషలేము మానవుడు సంపూర్ణముగా పతనమైయుండగా అతని అవసరతను తీర్చు దేవుని ఉచిత కృపతో ప్రారంభమై, ఇప్పుడు పరలోక ప్రదేశములలో ప్రవేశించి, దేవుని పట్టణములో, అనగా పరలోక సంబంధమగు యెరూష లేములో ఉన్నట్లు గ్రహించుచున్నాము.
ఈ పట్టణము రానున్న లోకములో నుండు పరిశుద్దులకును, వారి నివాసములకును సాదృశ్యముగానున్నది. వెయ్యేండ్ల పాలన కాలములో భూసంబంధమగు ఆశీర్వాదము అందించ బడును.
సమస్త జాతులు దాని వెలుగులో నడచుకొందురు. భూలోక పట్టణములకు భిన్నముగా అది జీవముగల దేవుని పట్టణమని పిలువ బడినది. భూలోక నగరములలో నివసించు మనుష్యులు మరణించెదరు.
వారి నగరములును వారివలెనే కనుమరుగై నశించును. ఈ పట్టణమునకు జీవాధారము దేవుడే గనుక ఇది ఎంతమాత్రము నాశనమునకు గురికాదు. ఈ నగరమును విశ్వాసముతో మన కళ్ళెదుటే చూడగలము.
వెలిచూపుతో మన చుట్టూ చూచిన మనకు కనిపించునది లోక పట్టణములలో వేదన, విచ్చలవిడితనము, భ్రష్టత్వము.
అయితే పాపపంకిలమైన పాదము లెన్నడూ నడవని ఆ మహిమగల పట్టణమును విశ్వాసముతో చూచు చున్నాము. లోకమందలి సకల జనాంగము రానైయున్న లోకపు వెలుగులో నడచినయెడల వారి వేదన మటుమాయమగును.
రానైయున్న లోకము యొక్క ఆశీర్వాదములు స్థాపించబడునని ఎరుగుటవలన మన హృదయ ములు ఆదరణ పొందును.
3. వేవేల కొలది దేవదూతలయొద్దకు, అనగా సార్వత్రిక సభ – పరలోకమునకు వచ్చినప్పుడు అసంఖ్యాకులగు దేవదూతల సమూ హములో మనమున్నట్లు గ్రహించుదుము.
ఇది ఆత్మీయ ప్రాణుల సార్వత్రిక సభ. అన్ని వర్గముల, స్థాయిల దేవదూతలు అక్కడ ఉందురు. వేవేలకొలది దేవదూతల సమూహము ఇదివరకే ఉన్నారు. అయితే మనము విశ్వాసముతో వారి ఉనికిని గుర్తించుచున్నాము.
దేవదూతలు దేవుని ప్రజలకు సేవచేయు ఆత్మలు, కాపలాదారులు. రాబోవు లోకమందుకూడా వారు ఈ ప్రత్యేక పరిచర్య నిర్వహించుదురు. దేవదూతలు కావలికాయు పరిచర్య వెల్లడించబడినది.

ఎలీషా జీవితము ఈ కావలి పరిచర్యకు చక్కటి ఉదాహరణ. దోతానులో శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఎలీషా పనివాడు భయముతో వణకిపోయెను. అయితే ఎలీషా చెప్పినదేమనగా.
ప్రార్థనకు జవాబుగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనుక ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని రథములతోను, గుఱ్ఱములతోను నిండియుండుట చూచెను..
ఎలీషా వాటియొద్దకు ముందే విశ్వాస ముతో వచ్చెను. పనివాడు వెలిచూపువలన వచ్చెను.
ఎందుకనగా అతనికి హాని ఏమియు చేయకుండునట్లు దేవదూత పంపబడి, సింహముల నోళ్లు మూసివేసెను. ప్రభువు మానవునిగా దేవదూతల కావలి పరిచర్య అనుభవించెను.

ఆయన జన్మ సందర్భమున దేవదూతలు కనిపెట్టుకొనియుండిరి, శోధన సమయములో దేవదూతలు పరిచర్య చేసిరి. గెత్సేమనే తోటలో ఒక దేవదూత ఆయనను బలపరచెను. దేవదూతలు ఆయన సమాధిని కావలి కాచెను. ఆయన ఆరోహణ సమయంలోకూడా వారు ఆయనతో నుండిరి.
ప్రస్తుతము విశ్వాసులు దేవదూతల కావలి పరిచర్యలోనున్నారు. “వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయు టకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?” అని చెప్పబడియున్నది.
రాబోవు లోకమందును వారు ఈ పరిచర్య కొనసాగింతురు. దేవదూతలు పరలోక పట్టణపు ద్వారమునొద్ద నిలుచుందురు, పరలోకమునకు భూమికిని మధ్య తిరుగుచు మనుష్య కుమారునిపైగా ఎక్కుచూ దిగుచూ నుందురు.
4. పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘము – మనము విశ్వాసముతో మరికొంత దూరము మహిమ లోతులలోనికి పయనించిన యెడల పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘము చేరు కొందుము.
ఈ విశాల పరలోక మహిమలో ప్రత్యేక స్థానము పొందినవారు కొందరున్నారు. వారే అధికులన్న భావముతో జ్యేష్ఠులు అని చెప్పబడి యున్నారు. క్రీస్తు ఆదిసంభూతుడు అని లేఖనములలో ఏడు పర్యాయ ములు చెప్పబడియున్నది. ఎందుకనగా ఆయన ఎప్పుడూ ప్రథముడుగా ఉండవలెను.
ఇక్కడ బహువచన పదము ప్రయోగించబడినది. ఇది పరిశుద్దుల సహవాసమైన సంఘమును సూచించుచున్నది. ఈ జ్యేష్ఠుల పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవి.
అది వారి పరమ నివాసము. మన పేర్లు ఎక్కడ ఉండునో దానికే మనము చెందియుందుము. పరలోకపు యెరూషలేముగా సంఘము భూసంబంధమగు ఆశీర్వాదములు అంద జేయుచున్నట్లు చూడగలము. జ్యేష్ఠుల సంఘము పరలోక సంబంధముగా ఆరాధనను సూచించుచున్నది.

5. అందరి న్యాయాధిపతియైన దేవుడు – మనము విశ్వాసముతో మరింత ఎత్తుకు వెళ్ళినచో “అందరి న్యాయాధిపతియగు దేవుని” చేరు కొందుము. “క్రిందనున్నవాటన్నిటిని తీర్పు తీర్చుటకు ఆయన చూచు చున్నట్లు” దేవునిగూర్చి చెప్పబడినది.
ఇది దేవుని ధవళ సింహాసనముపై నుండి పాపులకు తీర్పు తీర్చుటను గూర్చిన ప్రస్తావన కానే కాదు. భూ లోకముపై నీతి పాలన చేయువానిగా ఆయనను చూడగలము.
అందు వలననే అబ్రాహాము దేవుని న్యాయనిరతినిగూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. కనుక రాబోవు లోకమందు ప్రజలు ఈలాగు చెప్పుదురు – “నిశ్చయముగా నీతిమంతులకు బహుమానము కలుగును.
దేవుడు భూలోకమునకు తీర్పు తీర్చుట నిశ్చయము.” మరియొకచోట ఈలాగు చెప్పబడినది.
మనుష్యుల పరిపాలనలో నీతి న్యాయములు కనుమరుగై పోవుచున్నవి. అందరికీ న్యాయాధిపతియైన దేవుని పరిపాలనలో న్యాయముతో తిరిగి నీతి నెలకొనును.

6. సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకు – రాబోవు లోకము పాత నిబంధన పరిశుద్ధులు లేకుండా సంపూర్ణము కాదు. సీయోను కొండ కేంద్రముగానున్న భూసంబంధమగు పరిశుద్ధులు, పరలోకమందలి పరిశుద్ధులలో ముఖ్యులైన జ్యేష్ఠుల సంఘము, వీరిలో సిలువకు ముందు అన్ని యుగములలోనున్న భక్తులెల్లరూ ఉన్నారు.
వారు సంపూర్ణ సిద్ధిపొందిన నీతిమంతుల ఆత్మలు అని చెప్పబడియున్నారు. అంటే వారు మరణమును దాటి అనాచ్చాదిత స్థితిలో ఉండి ఇప్పుడు మహిమ దేహములు పొందియున్నారన్నమాట.
7. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకు – మన ఆత్మల యందలి విశ్వాసముతో మనము యేసునొద్దకు చేరియున్నాము. రాబోవు లోకమందలి ఆశీర్వాదములు అవి భూసంబంధమైనవైనను, పరసంబంధ మైనవైనను, ఆయనద్వారా సమకూడినవి. యేసు లేకుండా రాబోవు లోకమెట్లుండును? ఆ ఆశీర్వాదములన్నిటికీ కేంద్రము ఆయనే. పరిశుద్ధుల హృదయములను తృప్తిపరచువాడు ఆయనే. దేవుని మహి మార్థమై తన రాజ్యమును నిర్వహించువాడుకూడా ఆయనే.
8. హేబెలుకంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు – చివరగా మనము హేబెలు రక్తముకంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చియున్నాము. రాబోవు లోకమందలి ఆశీర్వాదములకు నిత్యమగు నీతి ఆధారమిదే. హేబెలు రక్తము భూమిమీద ఒలికించబడినది.
రక్తము చిందించిన వ్యక్తిపై పగతీర్చుమని ఆ రక్తము దేవునికి మొర పెట్టినది. క్రీస్తు రక్తము దేవుని కన్నులయెదుట కరుణాపీఠముపై ప్రోక్షింప బడినది. పగతీర్చునట్లు మొరపెట్టక, రక్తము చిందించినవారి క్షమాపణ కొరకు ఆ రక్తము మొరపెట్టెను.
దేవుడు రక్తమును అంగీకరించినాడన్న సత్యమందు విశ్వాసముంచినవారందరును ఆ రక్తముద్వారా సంక్రమించు ఆశీర్వాదములు పొందుదురు. రాబోవు లోకమందు వారికి పాలుండును.
ఆ విధముగా కాల పరిపూర్ణతలో క్రీస్తు మహిమనుగూర్చిన దేవుని ఆలోచనలు మన ఆత్మలయెదుట అద్భుతరీతిలో తెరువబడియున్నవి. పరిశుద్ధుల ఆశీర్వాదములు సాఫల్యత చెందును.
మన ఆత్మలయందలి విశ్వాసము, అనురాగములతో భూలోకమందలి పరిశుద్ధులను, పరలోక మందలి పరిశుద్ధులను, పాత నిబంధన భక్తులను అసంఖ్యాకములగు దేవదూతల సమూహములను అందరికంటే పైన దేవుని ప్రతి ఆశీర్వాద ములకు ఆధారమగు ఆయన ప్రశస్త రక్తమును చూచుటకు అనుమతించ బడియున్నాము.
(వచనములు 25-29). విశ్వాసి పొందనైయున్న మహిమగల లోకమును విశ్వాసముతో ఇప్పటికే చేరుకున్నట్లు వివరించిన తరువాత ఇప్పుడు అపొస్తలుడు ఒక గొప్ప హెచ్చరిక చేయుచున్నాడు.
విశ్వాసంలో నిలుపు దేవుని పద్ధతులు
ఈ సంగతు లనుగూర్చి పరలోకమునుండి మాటలాడుచున్న ఆయననుండి ప్రక్కకు తొలగు ప్రమాదమునుగురించి హెచ్చరించుచున్నాడు.
మనిషినుండి నీతిని కోరి భూలోకమందు దేవుడు మాటలాడినప్పుడు అవిధేయులైనవారికి తీర్పు తప్పని పక్షములో, పరలోకమునుండి ఆశీర్వాదముల నిచ్చునట్లు కృపతో మాటలాడుచున్న దేవుని స్వరమునకు అవిధేయులైనయెడల తీర్పు మరింత నిశ్చయముగా విధించబడునుగదా.
“ధర్మశాస్త్రపు శిక్షకంటే, సువార్త శిక్ష మరింత తీవ్రమైనదని” సామ్యూల్ రూథర్ఫోర్డ్ చెప్పి యున్నారు. రాబోవు తీర్పులో ఇమిడి ఉన్నవాటి విషయమై మనము హెచ్చరింప బడియున్నాము.
సీనాయియొద్ద భూమిని వణకించుటద్వారా దేవుని తీర్పులోని పరిశుద్ధత సాదృశ్యముగా వెల్లడించబడినది. భవిష్యత్తులోని తీర్పు భూమినిమాత్రమే కాదు, ఆకాశమును కూడా చలింపజేయును.
చలింపజేయబడునవి బొత్తిగా తీసివేయబడునని చలింపజేయుటద్వారా స్పష్టమగుచున్నది. దేవుని కృప మూలము కాని ప్రతిదీ తీర్పుద్వారా తొలగించబడును.
దేవుని కృపాకార్యమగు నూతన సృష్టిమాత్రమే మిగులు నట్లు చివరకు పాపమువలన పాడైపోయిన పాత సృష్టి తొలగించబడును. క్రైస్తవులు పొందిన రాజ్యము నీతితోను, దేవుని కృపతోను స్థాపించబడి నందున అది తీసివేయబడదు.
అలాగైన మనము ఏశావువలె దైవికమగు విషయములను సాధారణమైనట్లుగా భావించక, భయముతోను, వణకు తోను దేవునికి సంబంధించిన విషయములు పవిత్రమైనవిగా ఎంచి, ఆయనను సేవించుదము.
మనము కృపనుబట్టి దేవుని ఎరిగినను మన దేవుడు దహించు అగ్ని అని మరచిపోకూడదు. తనకు ప్రతికూలమగు ప్రతిదానిని ఆయన దహించివేయును. అది తన ప్రజలలోనున్న శరీర సంబంధమైనది కావచ్చును లేదా పాపముతో పాడైపోయిన సృష్టి కావచ్చును, ఆయన సమస్తమును దహించును.