ఆవగింజంత విశ్వాసము

ఆవగింజంత విశ్వాసము

ప్రశ్న :- ఆవగింజంత విశ్వాసముతో కొండలను పెల్లగించుట అంటే అర్ధమేమి? మత్తయి సువార్త 17:20,21 లోని భావము వివరించుడి.

జవాబు :-
ఆవగింజ బహు చిన్నది గాని దాని విషయమై క్రీస్తు విరివిగాను ఆశ్చర్యకరము గాను బోధించెను. గింజలన్నిటిలో బహుగా పెరిగేది ఈ ఆవగింజని క్రీస్తు బోధించెను. మత్తయి 13:32, మార్కు 4:31,32; లూకా 13:19. దేవుని రాజ్యమెట్లో అట్టి వృద్ధి చెందు గుణము ఆ గింజలో నున్నదని క్రీస్తు వెలిపుచ్చెను. కాబట్టి ఆవగింజంత విశ్వాసము మనకుండవలెనంటే చచ్చిన విశ్వాసము పనికి రాదని తేటపడుచున్నది. మృత విశ్వాసము గలదు. కొందరి కట్టి క్రియలు లేని విశ్వాసమున్నది. (యాకోబు 2:26), మరియు కపటమైన విశ్వాసము 2 తిమోతి 1:3-5 లో సూచింపబడుచున్నది.

ఎట్లనగా తిమోతిలో నిష్కపటమైన విశ్వాస ముండగా అనేకులలో జాగ్రత్తలేనియెడల కపటమైన విశ్వాసముండ గలదని స్పష్టము. 1 థెస్స 3:10 లో విశ్వాసము చెప్పబడినది గాని దానిలో లోపమున్నట్లు వ్రాయబడినది. కాబట్టి నానా రకములైన విశ్వాసములు గలవు. అల్ప విశ్వాసము గలదు గనుక క్రీస్తు సారి సారి తన శిష్యులను గద్దించుచు అల్ప విశ్వాసులారా అని వారిని పిలిచెను. (మత్తయి 6:30, 8:26, 14:31, 16:8, లూకా 12:28). నమ్ముచున్నానని ఆ తండ్రి ఒప్పుకొనెను గాని అది యొప్పుకొను చుండగానే ఏమనెను? నమ్ముచున్నాను నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని క్రీస్తును వేడుకొనెను. (మార్కు 9:24).

విశ్వాసమున్నది గాని దాని ఆనుకొని అవిశ్వాసము కూడ నున్నది. కాబట్టి ఆ విశ్వాసము ఈ విశ్వాసముండగా జరుగదు, ఆవగింజంత విశ్వాసమే అగత్యము అనగా పెరిగే విశ్వాసము సరియైనది. పెరిగేది అంటే జీవముండి పెరుగుతుందని అర్థము కాబట్టి జీవముగల విశ్వాసము సరియైన విశ్వాసము. జీవముగల విశ్వాసము తప్పక వృద్ధిచెందుతుంది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నదని పౌలు ఆ థెస్సలొనీ భక్తులకు వ్రాస్తున్నాడు. (2 థెస్సలొనీ 1:3). ఇట్టి జీవము గల్గి పెరుగుచున్న విశ్వాసమే ఆవగింజవంటిది. ఇట్టి విశ్వాస ముండగా గొప్ప కార్యములు చేయగలము.

ఆవగింజంత విశ్వాసము రెండు పర్యాయ ములు చెప్పబడినది. (1) మత్తయి 17:20లోను (2) లూకా 17:6 లోను, కొండలను పెల్లగించుట ఎట్లనగా మనకు కల్గిన కష్టములే కొండలవంటివి లేదా మనమీద విరోధముగా లేచిన శత్రువులే కొండలవంటివారు. పడిపోయిన యెరూషలేము గోడలు కట్టవలెనని లేచిన జెరుబ్బాబెలు మీద ఆ పని ఆపుటకు గొప్ప చక్రవర్తియైన అర్తహషస్త నిలువబడెను. (ఎజ్రా 4:23,24). అయితే ప్రభువేమనెను? ఈ గొప్ప విరోధి కొండకాదు కొండకంటె పర్వతమంత పెరిగి అడ్డముగా నిలిచినను గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నెదుట నీవు చదును భూమిగా నుంటావని చెప్పబడినది. గనుక జెకర్యా 4:6,7 ప్రకారము భక్తుడైన జెరుబ్బాబెలు తనయెదుట నిలిచిన పర్వతమును పెల్లగించ గలిగియుండెను.

ఈ కాలమందు విశ్వాసులు క్రీస్తు గొప్ప శక్తి నెరిగి లోకులయెదుట జంకక ముందుకు సాగి సువార్తపని ధైర్యముగా చేయవలెను. వారు వీరు పర్వతముల వలె అడ్డముగా నిలిస్తే విశ్వాసముద్వారా అనగా ఆవగింజవంటి జీవముగల విశ్వాసము ద్వారాను జీవముగల తమ ప్రభువునందు వారానుకొనినందువలనను లోకమును లోక జనులను ఆ గొప్ప సువార్త విరోధులను జయించగలరు. (1 యోహాను 5:4).

లూకా 17:6 లో నైతే వేరొక అంశమున్నది – కంబళి చెట్టును పెల్లగించవలెనట. ఇదికూడ ఆవగింజంత విశ్వాసముతో జరుగవలెను, ఈ కంబళి చెట్టు ఏదనగా సహోదరుని సరిగా క్షమించకపోతే అడ్డముగా నొకనిలో పెరిగెడి గొప్ప ఆటంకమును సూచించుచున్నది. దినము ఏడుమారులు మీ పట్ల తప్పిదము చేసిన సహోదరుడు మారుమనస్సు పొందితిని గనుక నన్ను క్షమించుమని అడిగిన అనగా దినము ఏడుమారులు అట్లు అడిగిన నోర్పుతో ఆలాగే వానిని క్షమించవలసినదని క్రీస్తు దీనిలో వెలిబుచ్చెను. (లూకా 17:1-4).

ఇది వినగానే అపోస్తలులు ఆశ్చర్యపడి దీని పాటించలేక మా విశ్వాసము వృద్ధిపొందించుమని క్రీస్తును వేడుకొనిరి. పనిచేయు టకు విశ్వాసము కావలెను. అసలు ఆరంభములో రక్షణ పొందుటకు విశ్వాసము అగత్యము, అంతేకాదు క్షమించవలసినంత ప్రేమించి సహోదరుని క్షమించుటకు విశ్వాసము గొప్పగా కావలెను. మరియు ఈ మాటలు వినుచునే ప్రభువు ఆవగింజంత విశ్వాసమును మరియు దానితో కంబళి చెట్టును పెల్లగించడమును వివరించి చెప్పెను. అనేక భక్తులలో నొక చెట్టు అడ్డముగా పెరిగినది అది ఏ చెట్టు? కంబళి చెట్టే. అది దేనిని సూచించుచున్నది? మీ సహోదరుని మీద మీరాయాసపడినదే దీనిలో సూచించ బడుచున్నది, నేడే ఆ సహోదరునితో సమాధానపడుము. సహోదరీ నేడే ఆ స్త్రీతో మాటలాడుము. ఇట్లు చేయవలెనంటే విశ్వాసమే మిక్కిలి అవసరము.

క్రీస్తే విశ్వాసము నకు కర్తయు దానిని కొనసాగించువాడునై యున్నాడు గనుక విశ్వాసము పెట్టుకొని ఆ పాత ఈర్ష్యను, పగను, అసమాధానమును తీసివేసికొనండి. అప్పుడేమైనట్లు? మీరు ఆవగింజంత విశ్వాసముతో అడ్డముగానున్న చెట్టును పెల్లగించినట్టే ఆలాగు చేతురని ప్రార్థన.

Leave a Comment