ఏదెను తోట

ఏదెను తోట

ప్రశ్న:- ఏదెను తోట ఏ దేశములో నుండెను?
జవాబు :- ఆరంభములో నెచ్చటో తూర్పున ఏదెనులో నొక తోటను దేవుడు వేసెనని ఆదికాండము 2:10-14 లో వ్రాసినట్లున్నది. దానిలోనుండి వెళ్లి పోయిన నాలుగు నదులలో నేటివరకు రెండు మాత్రము నిలిచినట్టు గుర్తించగలము. అవేవనగా ఆది కాండము 2:14 లో చెప్పబడిన హిద్దెకెలు, ఫరాతు అనునవి. హిద్దెకెలు నది టైగ్రీస్ నదికి పురాతన పేరు.

యూఫ్రటీస్ నది ఫరాతు అనబడినది. నేటివరకీ రెండు నదులు ఇరాక్ దేశములో నున్నవి. గనుక ఆ భూభాగములో నెచ్చటనో ఏదెనుతోట సంయుక్తమై మానవ చరిత్ర ఆరంభించెనని చెప్పుటకు ఏ సందేహమును లేదు. ఇప్పుడైతే ఏదెను కనబడుటలేదు. దాని స్థానమును దేవుడే దాచిపెట్టెను.

గొప్ప ప్రవక్తయైన మోషే చనిపోతే యెహోవా తానే ఆయనను పాతిపెట్టినట్టున్నది. నేటివరకు ఆ సమాధి యెక్కడున్నదో యెవరికి తెలియదని ద్వితీయోపదేశకాండము 34:6 చెప్పుచున్నది. తెలిసియుంటే వెళ్ళి పూజచేసేవారున్నారు. గనుక దేవుడు ఆ స్థలమును మరుగుచేసెను. ఏదెను ఆలాగే మరుగాయెను. గాని, ఏదెనులో పాపము జరుగగా సహాయమునకు వచ్చి ఆదాము, హవ్వలకొరకు రక్తబలి నొనర్చిన వాడీ దినములలో బలియై లేచిన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు.

స్తోత్రము. క్రీస్తులో రక్షణ మరుగు కాలేదు. అది సంసిద్ధమైయున్నది. రక్షింపబడితిరా! లేదా? మెసొపొతమియ లోనే మహిమగల దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమాయెనని అపొస్తలుల కార్యములు 7:2 చెప్పుచున్నది. కాబట్టి యెచ్చటో ఇరాక్కు చెందిన మెసొపొత మియలో ఏదెను వుండెనని నిశ్చయించి యింతమట్టుకే చెప్పగలము. వాదము సాగదు. ఇరాక్ దేశము నేటివరకున్నది. టైగ్రీస్ నది నేటివరకున్నది.

యూఫ్రటీస్ నది నేటికి పారుచున్నది. ఎక్కడో ఆ నదులు పుట్టిన తావులో ఏదెను తోట యుండెను. మించి చెప్పలేము. ఏదెను మరుగాయెను. ఏదెనులో ఆదాము హవ్వలను రక్షించినవాడు మరుగుకాలేదు.

Leave a Comment