ఎండిన యెముకలు

ఎండిన యెముకలు

ప్రశ్న:- యెహెజ్కేలు 37 వ అధ్యాయము వట్టి యుదాహరణము అని కొందరు చెప్పుచున్నారు. అవునా? ఈ అధ్యాయముయొక్క అర్థమేమి? వట్టి యెముకలు జీవము వచ్చి లేచి గొప్ప సైన్యమాయెనే, దీని భావమేమి?

జవాబు:-

క్రొత్త నిబంధనలో రాబోయే క్రీస్తు రాగా యాకోబుకే అగుపడి వారిలోనుండి భక్తిహీనతను తొలగించి వారిని జ్ఞాపకము చేయుటతో ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురని చెప్పబడియున్నది. (రోమా 11:25-27). వారు దేవుని పాత ప్రజలు. మరియు క్రీస్తుయేసును లోకమునకు దయచేసిన సంతతివారు. ఎందుకనగా శరీరమునుబట్టి క్రీస్తు యూదుడుగా పుట్టెనని మరువరాదు. గనుక దేవుడు తన పాత ప్రజలను విసర్జించెనా? అవును, మొత్తానికి విసర్జనక్రింద నున్నారు.

ఎందుకనగా మెస్సీయను చంపిన నేరముక్రింద నున్నారు. ఆయన రక్తము మా మీదను మా పిల్లలమీద నుండుగాకని కేకలువేసి శపించుకొన్నారు. అయినప్పటికిన్ని అన్యులమైన మన లెక్క సంపూర్ణము కాగా తాను విసర్జించిన ప్రజలను దేవుడు తిరిగి దీవించనైయున్నాడు. (రోమా 11:1). ఇప్పుడు యూదులు తొట్రుపాటులోనున్నారు, ఇప్పుడు క్షీణదశలోనున్నారు, విసర్జింపబడియున్నారు, విరిచివేయబడియున్నారు. అవును, ఈ వచనములు క్రొత్త నిబంధనలో సరిగానే చెప్పుచున్నవి.

అయితే క్షీణదశలో నున్న యూదులికమీదట ఐశ్వర్యములోకి వస్తారు. (రోమా 11:12). విసర్జింప బడిన వారిని ప్రభువికమీదట చేర్చుకొనబోవుచున్నాడు. (రోమా 11:15). విరిచి వేయబడిన కొమ్మలు తిరిగి అంటుకట్టబడును. కాబట్టి క్రీస్తు సంఘ చరిత్ర తీరిపోయిన పిమ్మట యూదులకు గొప్ప గతి చిక్కనైయున్నది. యెహెజ్కేలు 37:1-14 అదే సంగతి తెల్పుచున్నది.

దర్శనములో ప్రవక్త చూచిన ఆ బహుగా నెండిపోయిన యెముకలు పడిపోయిన ఇశ్రాయేలీయులకే సూచన – యెహెజ్కేలు 37:11. ఆ యెముకలు లేచి జీవముతో నిండి గొప్ప సైన్యముగునా? ఎవరును నమ్మరు. అసలు ప్రవక్తయైన యెహెజ్కేలు సహా ఈ యెముకలు బ్రతుకగలవా అని ప్రభువు తన్ను అడిగితే చెప్పలేక ప్రభువా, నీకే తెలుసునని అవిశ్వాసముతో ప్రత్యుత్తరమిచ్చెను.

ప్రస్తుతము చాలమంది క్రైస్తవులు, నికముందు యూదులకు గతియేమియు లేదని చెప్పుకొనుచున్నారు. అయితే ప్రకటన జరుగగా నెట్లు జీవము వచ్చి ఆ యెముకలలో ప్రవేశించెనో యికముందు అదేలాగున యూదులు దేవుని రాజ్యమును గురించిన ప్రకటన విని క్రమేణ దారికి వస్తారు, తప్పదు.

క్రమేణ కాదు క్షణములో వచ్చుచున్న క్రీస్తును చూచి ప్రలాపించి దారికి వచ్చి ఆయనను అంగీకరించి యొక దినములోగానే రక్షింపబడుదురు. (జెకర్యా 3:9; యెషయా 66:8). ఇప్పుడు యూదులు చచ్చి యెండిపోయినట్టున్నారు. వారిలో శేషము కృపచేత నీ దినములలో క్రీస్తును నమ్మియున్నప్పటికిన్ని విశేషము అనేది చావులోనే నిలిచియున్నది. అయితే మృతులైన యూదులిక సజీవులవుతారు, స్తోత్రము. (రోమా 11:15) ఇద్దరు దిగివచ్చి యూదులకు ప్రకటిస్తారు. (ప్రకటన 11:3).

యూదులలో ప్రథమఫలముగా నూట నలువది నాలుగువేలమంది ముద్రింపబడి సేవలో చేరుదురు. (ప్రకటన 7:1-8). ఏదియెట్లు న్నను మేఘారూఢుడై వచ్చుచున్న క్రీస్తును ఆయనను పొడిచిన ఆ యూదులే చూడ మార్పుచెందుదురు. (ప్రకటన 1:7; జెకర్యా 12:10). ప్రకటనచేతను, పరిశుద్ధాత్మ పనిచేతను, రాబోవుచున్న క్రీస్తు దర్శనముచేతను యూదులు మార్పుచెందుట నిశ్చ యము. (యెహెజ్కేలు 37:12-14). వారి సమాధులు తెరువబడునంటే వారున్న దేశాలు, వారున్న రాజ్యాలు, వారిని పట్టుకొనిన ఆయాశక్తులు విప్పబడగా యూదులు స్వతంత్రులై తమ అసలు దేశానికి మళ్ళీ వెళ్ళి సుఖింతురు. తూర్పు దేశాలలో యూదులు చెదరియున్నారు. పడమటికి పోయిరి.

ఉత్తర దిక్కున నున్నారు. దక్షిణములో సైతము దాగియున్నారు. అయితే యెషయా 43:5,6 చూడండి – నా ప్రజల నప్పగించుమని చెప్పితే నలుదిక్కులు కదిలి సమాధులు తెరచినట్లుగా యూదుల కుపకారము చేసినప్పుడు దేవుడు పలికినది నెరవేరును. ఆ లోయలో అలనాడు ఆత్మవశుడైన యెహెజ్కేలు ఈ సంగతులు జూచి వ్రాసిపెట్టెను.

ఈ మాటలు వట్టి యుదాహరణములని బోధిస్తే సరిపోదు. ఇవి దైవోక్తులు గనుక అక్షరాల నెరవేరును. సమయము మాత్రము అనుకూలించవలెను, దానికొరకు వేచియున్నాము. అవును, నానా రకములైనవారు నానా అభిప్రాయములు గల్గి యున్నారు. నమ్మేవారు గలరు, పరిహసించేవారు గలరు. గాని ప్రభువు ప్రవచించినది ఖాయమని యెరుగండి. ఈ సంగతులు నిశ్చయములు. వట్టి యుదాహరణములు కావు. (ప్రకటన 22:6).

Leave a Comment