క్రీస్తు శిష్యులు – ఆయన రాజ్యము

క్రీస్తు శిష్యులు – ఆయన రాజ్యము

ప్రశ్న:- నా రాజ్యము వచ్చుట చూడనిదే మీలో కొందరు మరణము రుచిచూడరని క్రీస్తు మత్తయి 16:28 లో అనెను. అలాగైతే క్రీస్తు శిష్యులు కొందరు నేటివరకు బ్రతికియున్నారా? లేక ప్రాణముతో ఆ శిష్యులలో కొందరు అప్పుడే ఆ రాజ్యమును చూచిరా?

జవాబు :- ఆ శిష్యులలో నెవరైన నేటివరకు బ్రతికియున్నారా అంటే – అవును, బ్రతికే యున్నారు గాని భూలోకములో లేరు. పరదైసులోనే క్రీస్తు నిజమైన శిష్యులు నేటివరకు బ్రతుకుచున్నారు. అయితే క్రీస్తు చెప్పిన ఆ శిష్యులలో కొందరు అప్పుడే ఆ రాజ్యము చూచిరని తెలిసికొంటున్నాము. ఒక హెచ్చరిక – ఎప్పుడైన సత్యవేదములో నొక వచనము తొందరగా తీస్తే దానిముందు వెనుకలను పరిశీలించి చూడవలెను. లేకపోతే దాని అసలు అభిప్రాయం తేలదు.

క్రీస్తు చెప్పి చేయకుండునా? ఉండడు, గనుక మళ్లీ అవే వచనములను గమనించండి. మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట మీలో కొందరు చూతురని మత్తయి 16:28 లో నున్నది. సరే అయితే అధ్యాయము ముగిసినందున సంగతి ముగిసినదా? లేదు. అధ్యాయములనేవి దేవుని ఏర్పాటు కాదు. మత్తయి సువార్త యిన్ని అధ్యాయములుగలదానిగా మత్తయి వ్రాసెనా? లేదు. మత్తయి సువార్త యొకటే వ్రాతగా వ్రాయబడినది.

నాలుగు వందల సంవత్సరముల క్రిందట మనుష్యులే అధ్యాయములను నియమించిరి. త్వరలో ఫలాని వచనము దొరకే నిమిత్తమాలాగున చేసిరి. కాబట్టి 16:28 వరకు వచ్చి నిలిచిపోకూడదు. చదువుచునే ముందుకు వెళ్ళవలసినది. అప్పుడు 17 అధ్యాయములో దాని నిజసంగతి తెలిసికొండి. మీలో కొందరు నా రాజ్యమును జూతురని చెప్పిన ఆరు దినములైన తరువాత జరిగినదేమిటి? ఆ శిష్యులలో క్రీస్తు కొందరిని ఏర్పరచుకొని కొండెక్కి వారియెదుట రూపాంతరము పొందెను.

17:1-8 లో వ్రాసినది యిది గనుక క్రీస్తు 16:28 లో తానిచ్చిన వాగ్దానము 17:1-8 లో నెరవేర్చినట్లున్నది. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు అన్నట్టు ఆ పన్నెండుగురిలో ముగ్గురిని పిలుచుకొనిపోయి తన గొప్ప మహిమను వారికి కనుపరచగా నప్పుడే క్రీస్తు తన రాజ్యముతో వచ్చినట్టు పూర్ణముగా కాదుగాని చిన్నగానే జరిగెను. సూచనకొరకు అప్పుడే ఆ ఎత్తైన కొండమీద క్రీస్తు రూపాంతరము నొంది రాజుగా కనబడెను. ఆరు దినములైన తరువాత అంటే ఏడవదినము వచ్చినట్లున్నది. ఏడు బైబిల్లో పూర్ణసంఖ్యగా నున్నది.

క్రీస్తు రాజ్యము ఏడవ అనే అంకము అనుసరించి వస్తుంది. ఇదివరలో లోక చరిత్రలో అమాయక యుగము, మనస్సాక్షి యుగము, మానవపరిపాలన యుగము, వాగ్దాన యుగము, ధర్మశాస్త్ర యుగము, మొదలగు అయిదు యుగములు జరిగిపోయెను. ఇప్పుడు కృపాసువార్త యుగము ఆరవ యుగముగా సాగుచున్నది. దీని పిమ్మటనే ఏడవ యుగము క్రీస్తు వెయ్యియేండ్ల రాజ్యము అనే యుగము వస్తుంది. దానికి సూచనగా ఫలాని ఏడవ దినమున ఆ కొండమీద వారికి తన రాజ్య సంబంధమైన మహిమను ప్రత్యక్షపరచెను. మార్కు 9:1 లో వాగ్దానము చేసెను.

ఆరు దినములైన తరువాత సరిగా 9:2-8 లో వ్రాసినట్లు తానిచ్చిన ఆ వాగ్దానమును తాను నెరవేర్చెను. లూకా 9:27 లో వాగ్దానమిచ్చెను. 9:28, 36 లో ఆ వాగ్దానము నెరవేరినట్లున్నది. అయితే లూకా 9:28 లో కొంత మార్పు జరిగెను. రమారమి ఎనిమిదిదినములు జరిగెనని లూకా సూచించుచున్నాడెట్లనగా వారా దర్శనము చూచినది రాత్రిపూటని నమ్ము చున్నాము.

ఎందుకనగా నిద్రలో నుండిరని లూకా 9:32 చెప్పుచున్నది. కాబట్టి ఆరు దినములు జరుగగా ఏడవ రోజున కొండయెక్కి రాత్రి అనగా ఏడవ దినముయొక్క రాత్రిలోనే ఆ రాజ్యమును గాంచిరి. గనుక రమారమి అది ఎనిమిదవ దినమున జరిగిన దర్శనమని మొత్తానికి చెప్పిన చెప్పవచ్చును. ఆలాగే క్రీస్తు రాజ్యమేలి కడకు దానిని తండ్రి కప్పగిస్తే అంతట ఎనిమిదవ కడపటి నిత్యయుగమారంభించునని నమ్ముచున్నాము. (1 కొరింథీ 15:24-28).

అయితే కొందరు ఆక్షేపిస్తారేమో అనగా కొండమీద జరిగినది రాజ్యమేనా? అయితే పేతురు తానే తన రెండవ పత్రిక 1:16-21 లో స్పష్టముగా అప్పుడే కొండమీద ఆయనతో నుండగా ఆయన శక్తిని ఆగమనమును కన్నులారా చూచితిమని ఒప్పుకొంటున్నాడు. మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద నుండగానే వచ్చిన ఆ శబ్దము వింటిమి.

ఆయన ఘనతయు మహిమయు పొందగా జూచితిమని పేతురు సాక్ష్యమిచ్చి ఆ రూపాంతరమనేది రాబోవు క్రీస్తు రాజ్యసంబంధమైనదని వ్యాఖ్యానించి చెప్పు చున్నాడు. తండ్రియైన దేవుడు ఆ సమయమున ఆకాశమునుండి ఈయన నా ప్రియ కుమారుడని పలికి ఆ శిష్యుల యెదుట క్రీస్తుకు ఘనతను మహిమను యిచ్చెను. రాబోయే గొప్ప రెండవ రాకడకు చిన్న సూచనగా అదంతయు జరిగెను గనుక ఆ పన్నెండుగురిలో ఫలాని ముగ్గురు అప్పుడే క్రీస్తు తన రాజ్యముతో వచ్చుట చూచి ఆనందించిరి. మీలో కొందరు చూస్తారని క్రీస్తు పలికెను.

ఆ మాట పలికిన క్రీస్తు వారమురోజుల లోపలనే దానిని సంపూర్తి చేసెను. కాబట్టి నేటివరకు ఆ శిష్యులలో కొందరు బ్రతికియున్నారా అనే ప్రశ్న అసంగతమైనది. అప్పుడే నమ్మకస్థుడైన క్రీస్తు తాను పలికినదానిని నెరవేర్చెను. రాజ్యములో క్రీస్తు నీతిసూర్యుడుగా ప్రత్యక్షమగును. మలాకీ 4:2). దానికి ముంగుర్తుగా క్రీస్తు ముఖము ఆ కొండమీదనే సూర్యునివలె ప్రకాశించెను. రాజ్యములో క్రీస్తు గొప్పగా తండ్రివలన ఘనత మహిమలను పొంద బోతాడు. దానికి ముంగుర్తుగా ఆ కొండమీద ముగ్గురి యెదుట క్రీస్తు ఘనపరచబడెను. మోషే ఏలీయాకూడ నుండిరి.

మోషే అనగా చనిపోయి లేచినవారికి గుర్తు. ఏలీయా అనగా చనిపోక సజీవులుగా నిలిచే వారికి గుర్తు. క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తునందుండి చనిపోయినవారు మొదట లేచి నిలుస్తారు. సజీవులుగా నిలిచియుండేవారు మార్పు చెంది నిలుస్తారు. వారు వీరు కలిసి మేఘములమీద కొనిపోబడి క్రీస్తు మహిమ చూచెదరు. (1 థెస్సలోని 4:16-18). ఆయన మాట వినుడి యని ఆ దివ్య మహిమలోనుండి శబ్దము వచ్చినట్లు క్రీస్తు తన రాజ్యముతో సరిగా వస్తే సర్వ లోకమును సహస్ర సంవత్సరమువరకాయన మాట విని ఆయన చెప్పినట్టే నడుచు కొనవలెను. (జెకర్యా 14:9).

కాబట్టి ఆ కొండమీద నప్పుడే తాను వాగ్దానము చేసినట్టు క్రీస్తు చిన్నగా చిన్నగుంపులవారికి తన రాజ్యము వచ్చుటను కనుపరచెను. మీలో కొందరు నా రాజ్యమును చూతురనెను, ఆలాగే వారము రోజుల లోపలనే ఆ కొండమీద జరిగెను. దీని సరియైన వ్యాఖ్యానమిది, మీరాయన రాజ్యము చూడ బోతారా.

Leave a Comment