క్రీస్తు సాతానుకు ఓడిపోయెనా?

క్రీస్తు సాతానుకు ఓడిపోయెనా?

ప్రశ్న:

క్రీస్తు సిలువలో నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివని కేకవేసెనుగదా. గనుక ఆ వేళ భయపడి సాతానుకు ఓడిపోయినట్టున్నదా? పేతురు అవిశ్వా సముచేత సముద్రముపై భయపడినట్లు ప్రభువు కూడ భయపడెనా? అట్లు క్రీస్తుకూడ ఒకసారి సాతానుకు ఓడిపోయినట్లు దీనినిబట్టి భావించవచ్చునా?

జవాబు:-

ప్రభువు భయపడెనని ప్రశ్నవేసినవాని యూహ. ఆలాగైతే క్రీస్తుయేసు పరిపూర్ణుడు కాకపోవును. భయమనేది నరమాత్రులకే గాని దైవత్వముగలవానికి చెందుటలేదు. క్రీస్తు వట్టి నరుడైతే సరి భయపడి తీరవలెను. క్రీస్తు మరియ కుమారుడు మాత్రమైతే మనవలెనే జడిసేవాడు గాని ఆలాగు లేదే, ఆయన అట్టివాడు కాడే. క్రీస్తును గురించి పౌలు రోమా 9:5 లో వ్రాయుచు ఆయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు. ఆమేన్.

క్రీస్తు దేవుడైయుండగా నెట్లు భయపడతాడు? ఇట్టి సరికాని తలంపు మనకు దూరమగుగాక. అంతేకాదు క్రీస్తు తనకు సంభవింపనైయున్న ఆ మరణము ముందుగానే యెరిగి ప్రార్థించి జయము నొంది ఆ మరణమునుండి తన్ను రక్షించగలవానికి యాచనలను సమర్పించి భయభక్తులు గలిగియున్నందున ఆయన అంగీకరింపబడెనని హెబ్రీ 5:7 లో వ్రాయబడినది. చచ్చి లేస్తానని తనకు తెలుసును. నా ప్రాణము పెట్టుచున్నాను. దాని తిరిగి తీసికొనుటకుకూడ నా కధికా రము గలదని ధైర్యముగా ముందెలివి కల్గి సాక్ష్యమిచ్చినవాడెట్లు భయపడతాడు? అసాధ్యము.

ప్రశ్న వేసినవారు దీనిలో నిండు పొరబడిరి. యోహాను 10:18 గట్టి బండగా నిలిచినది. దేవుడైన క్రీస్తు తనంతట తానే తన ప్రాణమును పెట్టెను. తెలిసి పెట్టెను. మనలను ప్రేమించి పెట్టెను. పెట్టిన తరువాతకూడ దానిని మళ్లీ తీసికొందునని పూర్వమునుండి యెరిగియున్నాడు. నేను పునరుత్థానమును జీవమునై యున్నానని పలికినవాడు తానే యెట్లు మరణానికి భయపడతాడు? వీలుకాదు.

ప్రశ్న వేసినవాడు రెండవదిగా గొప్ప తప్పుచేసి భయపడిన పేతురుతో క్రీస్తును పోల్చి ప్రశ్నించెను. అబ్బో, పేతురును సృజించినవాడు క్రీస్తు. సృష్టికర్త క్రీస్తు. సృజింపబడినవాడు పేతురు. ఇట్లుండగా పేతురుతో సమానునిగా క్రీస్తును భావించుట చాల పొరబాటు. పేతురును సృజించినది మాత్రము కాకుండ క్రీస్తు పేతురు విమోచకుడై యుండెను. విమోచకుడు వేరు. ఆ విమోచనకు అర్హుడైన వ్యక్తి వేరు. వారిద్దరిని నొకటిగా చేయలేము. పేతురు తక్కువైనవాడు, క్రీస్తు యెక్కువైనవాడు.

అయితే మూడవదిగా ప్రశ్న వేసినవారు క్రీస్తుకూడ నొక పర్యాయమైనను సాతానుకు ఓడిపోయెనని భావించుచున్నారు. అయ్యో ఇందులో కేవలము గొప్పపొరబాటు వచ్చినదని యెల్లరు గాంచవలసినది.

క్రీస్తు సాతానుకు ఓడిపోయియుంటే క్రీస్తు సామాన్యుడనియు మనవలె పాపియనియు తేలినది. ఇది సరియా? వాక్యమేమనుచున్నది? ఆయన పాపముచేయ లేదని పేతురు తన మొదటి పత్రికలో సాక్ష్యమిచ్చి 2:22 లో వ్రాయుచున్నాడు. ఆయనందు పాపమేమియులేదని అపొస్తలుడైన యోహానుకూడ 1 యోహాను పత్రిక 3:5 లో పలుకుచున్నాడు. మరియు హెబ్రీ పత్రిక వ్రాసినవాడు క్రీస్తు మహాత్మ్యమును వర్ణించుచు ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా నున్నవాడును ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చైనవాడునైయున్నాడని చెప్పి యిట్టి పాపములేని ఆయనే మనకు సరిపోవు ప్రధానయాజకుడని వక్కాణించు చున్నాడు. క్రీస్తు తానే యొకనాడు శత్రువులైన ఆ యూదులతో నాయందు పాప మున్నదని మీలో నెవడు స్థాపించునన్నప్పుడెవరును ప్రత్యుత్తరమిచ్చినట్టు కనబడుటలేదు ఎందుకు? అట్టి నిరూపణ యెవరిచేత కాజాలదు. క్రీస్తు నిష్పాపియై యుండెను. (యోహాను 8:46). కనుక నొక నిమిషమైన క్రీస్తు సాతాను కోడిపోయెనని అనవద్దు. అది సత్యము కాదు.

క్రీస్తు యొకడే నా తండ్రి కిష్టమైన కార్యములు నేనెల్లప్పుడును చేయువాడనని చెప్పగలడు. (యోహాను 8:29). నరవంశములో ఆయన యొకడే పాపరహితుడైనవాడు. క్రీస్తు యొకడే లోకాధికారియైన సాతాను విషయమై – ఇదిగో నాతో వానికి సంబంధమేమియు లేదని పలుకగలవాడు. (యోహాను 14:30). అసలు మరణముయొక్క బలముగలవాడైన ఆ సాతానును నశింపజేయుటకే క్రీస్తు వేంచేసె ననియు వేంచేసి మరణమునొంది లేచుటద్వారా సాతానును ఓడించెననియు హెబ్రీ 2:14,15 లో తెలిసికొని చదువుచున్నాము. సాతానును గెల్చినవాడెట్లు సాతానుకు యోడిపోతాడు? కాబట్టి క్రీస్తుకు పాపము నారోపింపకండి. మరియు జయవీరుడైన క్రీస్తు సాతాను కోడిపోయెనని యైనను చెప్పకండి.

దీనిలో మరొకటి కలదు క్రీస్తు సాతాను కోడిపోయి పాపియై యుంటే కేవలము వాక్యానికి విరుద్ధము వచ్చినది కాకుండ ఆయన ప్రాయశ్చిత్తమునకుకూడ లోటు కలిగెను. క్రీస్తు తానే పాపియైయుంటే పాపుల విమోచనార్థమై యింకనేమి సహాయము చేయగలడు? ఏమియు లేదు. తానే గ్రుడ్డివాడైతే అంధులకెట్లు త్రోవజూపగలడు? క్రీస్తు లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లయైనవాడని యోహాను 1:29 లో మ్రోగుచుండే గొప్ప సువర్తమానము. అయితే నొకటి – క్రీస్తు బలియైన గొర్రెపిల్ల అంటే ముందొకసంగతి పరిష్కారము కావలసినది. అదేది? పాత నిబంధనలో జూస్తే బలికి తేబడు ప్రతి గొర్రెపిల్ల ముందు పరీక్షకు నిలిచి అది ఏడాదిగాను నిర్దోషమైనది గాను తేలితేనే తప్ప అది బలికి యోగ్యము కాకపోతుంది.

నిర్గమ 12:6 లో వ్రాసిన యీ చట్టముగాక లేవీయ 22:21 లో ఆ బలి అంగీకరింపబడినట్లు దోషము లేనిదై యుండవలెను. దానిలో కళంకమేదియు నుండకూడదని వ్రాసినది. కాబట్టి క్రీస్తు యొకసారియైనను సాతానుకు ఓడిపోయియుంటే బలికి యోగ్యుడు కాకపోతాడు. కాబట్టి క్రీస్తుయందు దోషమున్నదని సూచించుట గొప్ప పాతకమైయున్నది. అది ఆయన ప్రాయశ్చిత్తమున కడ్డము తగులుతుంది. మరియు పునాదియైన ఆ ప్రాయ శ్చిత్తమునకు భంగమువస్తే యిల్లు పడిపోయినట్టే. అసలు గొర్రెపిల్లలో నొక చిన్న యెముకైనను విరిగిపోకూడదని నిర్గమ 12:46 లో ఆజ్ఞాపించబడినది.

అందుచేత బలిగా వచ్చిన క్రీస్తులో లేశమైనను పాపదోషముంటే అనగా నొక యెముకైనను విరిగినట్టు ఆయనలో కళంకము కనబడియుంటే అట్టిది మరి యేదైనను ఆయనలో నుంటే ఆయన దైవత్వము నిలువక పోవును. అసలు ఆయన లోకరక్షకుడు కాలేక పోవును. కాబట్టి యెంతమాత్రమును క్రీస్తు సాతానుకోడిపోయె ననవద్దు. ఈలాగైతే మిగిలినదేమనగా ఎందుకు క్రీస్తు సిలువమీద ఆ కేక వేసెను? జవాబు దీనికున్నది. ప్రవచనములోనే దాని నిమిత్తము కనబడు చున్నది.

క్రీస్తు రాక పూర్వము విరివిగా ఆయననుగూర్చిన ప్రతి సంగతి ప్రవచనములలో చెప్పబడెను. ఆయన కన్య జననము, జన్మించు గ్రామము, చిన్న శిశువుగా నున్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోయేది, మున్నగు కార్యములన్నియు ముందుగానే సూచింపబడెను. ఆయన సిలువ శ్రమలు బహు వివరముగా చెప్పబడెను. కీర్తన 22:16 లో ఆయన కాలుసేతులు పొడువబడునని వ్రాయబడెను.

వస్త్రములకొరకు చీట్లు వేసి పంచుకొన్న సంగతి 18వ వచనములో నున్నది. సిలువమీద నుండగా చూచువారు హాస్యము చేసి పెదవులు విరిచి తల ఆడిస్తారని 7 వ వచనమునందు వ్రాయబడెను. 22:8 లో కొందరు వచ్చి చావకుండ ఆయనను తప్పిస్తారేమో అను సంగతి వివరింపబడెను. సిలువమీద నుండగా కొందరాలాగే ఏలీయా వచ్చి అతని రక్షించునేమో చూతమని కాచుకొనిరి. (మత్తయి 27:49). అనగా ముందు వ్రాయబడినట్లే కార్యమంతయు జరిగెను.

కీర్తన 22:22 యైతే చనిపోయిన క్రీస్తు లేచి తన సంఘమును స్థాపించి నమ్మినవారిమధ్య నివసించి ఆ సహోదరులకు తండ్రి నామమును ప్రచురము చేయునని వ్రాయబడి యుండగా హెబ్రీ పత్రిక వ్రాసినవాడు 2:11,12 లోకి వచ్చి ఆ మాటలు క్రీస్తునే అన్వయించినవని తేటగా వివరించుచున్నాడు గనుక కీర్తన 22 లో ప్రాముఖ్యముగా దాని సారాంశమంతయు వచ్చి చనిపోయి లేవబోవు క్రీస్తుని గురించినది. ఆలాగైతే ఆ చెట్టుమీద ఆయన వేసిన కేక సహితము ప్రవచనములో నెందుకు లేదని యడుగవచ్చును.

ప్రతి సంగతి వివరింపబడియుండగా ఆ కేక సంగతి కూడ ప్రవచనములో లేదాయెనా ఏమి? కీర్తన 22:1 లో సరిగానే ఆ కేక కనబడుచున్నది. దావీదు రాజు తానే ఆ కేక వేసినట్టున్నదిగాని క్రీస్తు వస్తాడనగా వెయ్యియేళ్ళకు పూర్వమున్న దావీదు ప్రవక్తగా నుండి రాబోయే క్రీస్తు విషయమై ఆయన వచ్చి శ్రమపడగా ఆలాగు కేక వేస్తాడని దావీదు ఆత్మవశుడై వ్రాసెనని వ్యక్తమగుచున్నది. ఇప్పుడు తెలిసినది. క్రీస్తు భయపడి ఆ కేకవేయలేదు. అట్టి భయమనేది రక్షకుడుగా నుండే ఆయనకు తగదు.

ప్రవచనము నెరవేరుటకే ఆయన ఆ భయంకరమైన కేక వేసెనని తీర్మానించుచున్నాము. ముందుగానే వ్రాయబడెను. వెయ్యియేండ్ల తరువాత అక్షరాల నెరవేరెను. అదే దీని మర్మము. కనుక ఆ కేక వేయుటద్వారా క్రీస్తు దైవత్వము తగ్గిపోవుటకు ప్రతిగా మరి బలపరచబడెను. ఆ కేక వేయుటద్వారా ప్రవచనములలో సూచింపబడినవాడాయనే అని మరి స్పష్టమాయెను. కనుక ఆ కేక క్రీస్తుకు సహాయమాయెను.

క్రీస్తు ఆలాగు నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివని అరువకపోతే కీర్తన 22:1 లో లిఖింపబడిన ఆ లేఖనమాలాగుననే నిరర్థకమైపోవును. అట్లు కాకూడదు. యోహాను 10:35 చూడండి. గనుక రావలసినవాడు వచ్చెను వచ్చి చేయవలసిన పనిచేసి ముగించెను. అంతే కాదు, ఇవ్వబడిన వివరములో ప్రవచన భావము నెరవేరులాగున అసలు ఆయన ఆ చెట్టుమీద అరువవలసిన అరుపులుకూడ ముందుగా చెప్పబడెను గనుక ముందివ్వబడిన లేఖనమును ఘనపరచి సంపూర్ణము చేయుటకై క్రీస్తు ఆ కేక వేయవలసియుండి వేసెనని తేటపడుచున్నది. ఇంక నున్నది.

విమోచన క్రయము చాల గొప్పది. రాబోయే ఆ గొప్ప కార్యమునకు ముంగుర్తుగా ఇశ్రాయేలీయులలో అజాజేలు ఆచారము సంవత్సరమున కొకతూరి జరుగుచుండెను. అదేది? లేవీ 16 లోనే యిది వివరింపబడినది. సంవత్సరమున కొకతూరి అనగా ఏడవ నెల పదియవ దినమున యూదులందరును సమాజముగా కూడుకొని ఆనాడే సంవత్సరము పొడుగున చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము చేసి దేవుని దీవెన నొందవలెను. దానికొరకు రెండు మేకలు నియమింపబడెను.

ఒక మేక అప్పుడే వధింపబడియుండగా చీటీపడిన ఆ రెండవ మేకమీద ప్రధాన యాజకుడు చేతులుంచి దానిమీద వేసినట్టుగా నిరుడు జనులు చేసిన పాపమునంతయు నొప్పుకొని మోపుతాడు. (16:21). అంతట జనుల సమస్త పాపమును మోసికొన్నట్టు నియమింప బడిన ఆ మేక యెచ్చటికి పోవలెను? 16:22 చూడండి. ఆ మేక వారి పాప దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును. అరణ్యములోకి దాని పంప వలెనని 16:21 లో నున్నది.

తెలిసినవాడు దాని తోలుకొని వెళ్ళి అచ్చటనే దానిని ఒంటరిగా విడిచి రావలెను (16:22). పాత తర్జుమాలో – నిర్జనమైన దేశమునకు వెళ్ళి దానిని విడిచి రావలెనని యున్నది. అరణ్యము, ఎడారి, నిర్జనము ఈ మూడు పదములు దోషమును భరించిన ఆ మేకను సంబంధించియున్నవి. కొట్టి వేయుటకు కాదు, నెరవేర్చుటకొరకే క్రీస్తు వచ్చి గొర్రెపిల్లయై మేకయై మన పాపదోషములను భరించుటయందు జనులుండే తావుకు పోకూడదు – నిర్జనమైన స్థలములోనే మేకయుండి చనిపోవలెను.

ఎడారి అనే మాట నెరవేరవలెను. అరణ్యమనే భావము క్రీస్తుకు వచ్చి సంపూర్ణము కావలెను. కాబట్టి సిలువలో నున్నప్పుడు క్రీస్తు ఆ కేకలోనే తనకు కలిగిన గొప్ప విపత్తు కనుపరచుచున్నాడు. ఆత్మీయముగా క్రీస్తు యెవరును లేని స్థలములో చనిపోయెనని గ్రహించుచున్నాము. అప్పుడు శిష్యులు ఆయనను విడిచిపోయిరి. దానికి ముందే ఖజానాదారుడైన యూదా ఇస్కరియోతు డబ్బు కాశపడి అప్పుడే క్రీస్తును విడిచిపెట్టెను. నిన్ను ఎన్నడును విడువననిన పేతురు సహా దూరమై పోయెను. అంతేకాదు, తుదకు దేవుడే దూరము కావలసివచ్చెను.

మన పాపమునుబట్టి మనమే దేవునికి దూరమైపోయి నశించియుండవలెను గాని క్రీస్తు మన స్థానానికి వచ్చి మన పాపదోషములను భరించుచు దేవునికి దూరస్థుడాయెను. మనలను సమీ పస్థులనుగా చేయుటకే తానింతగా మనలను ప్రేమించి ఆ గొప్ప విమోచన క్రయము కట్టుటలో అంతగా అధముడాయెను. ఎల్లప్పుడు తండ్రి సాన్నిధ్యములోనున్న యేసు ఆ వేళ మన పాపములను మోసికొని అజాజేలు పేరట చీటి వచ్చినట్లు సమ్మతించి-

  1. లోయలో చచ్చినట్టె
  2. అరణ్యమునకు వెళ్ళిపోయినట్టె 3) నిర్జనమైన తావులో నిలిచినట్టె

ఆ భయంకరమైన కేకవేసి క్రయము కట్టి మనలను విడిపించెను.
ఆ మొదటి మేక వధింపబడియుండగా దాని రక్తము అడ్డతెర లోపలికి తెచ్చి ప్రోక్షించినట్టు 16:15 లో వ్రాయబడియున్నది. ప్రధానయాజకుడే ఆ రోజున ఈ గొప్ప పని చేయవలెను. ఆయన ఆ రక్తమును లోపలికి తీసికొనివెళ్ళి బయటికి వచ్చేవరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదని తేటగా లేవీ 16:17 లో శాసనముగా ఆజ్ఞాపింపబడెను. క్రీస్తు ఆ రెండవ మేకగా నిర్జనభూమికి పోయి చనిపోవలెను. అయితే మొదటి మేక కూడ క్రీస్తుకు ముంగుర్తుగానున్నది. గనుక మొదటి మేకవలె క్రీస్తు వధింపబడి మరియు ఆయన రక్తము అడ్డతెర లోపలికి రావలెను. బలి క్రీస్తే మరియు ప్రధానయాజకుడు కూడ నిప్పుడు క్రీస్తే, ఇదంతయు

క్రీస్తులోనే నెరవేరెను. కాబట్టి యెట్లు ఆ ప్రధానయాజకుడు ఒంటరిగా లోపలికి వెళ్ళి ఆ బలిరక్తము ప్రోక్షించెనో ఆలాగే క్రీస్తు ఒంటరిగా పనిచేయవలెను. నా దేవా, నా దేవా, నీ వేల నన్ను చెయ్యి విడిచితివి అంటే ఆ ఒంటరితనమనేది పూర్ణముగా నప్పుడే క్రీస్తుకు తగిలి రుచి ఆయెనని నమ్ముచున్నాము. ఏ మనుష్యుడా వేళ క్రీస్తుకు సహాయము చేయరాదు. దేవుడు సహా తన ముఖము త్రిప్పి తన కుమారుని ఒంటరిగా విడిచిపెట్టెను. అతి పరిశుద్ధుడు దేవుడే గనుక హబక్కూకు 1:13 లో వ్రాయబడినట్లు ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కాబట్టి మన సమస్త పాప దోషములను భరించిన క్రీస్తు ఆ చెట్టుమీద నుంచగా

  1. ఇవ్వబడిన ప్రవచన నిమిత్తముగాను (కీర్తన 22:1)
  2. అజాజేలు మేక ఛాయను నెరవేర్చు నిమిత్తముగాను 3) ఏకాంతముగా రక్తప్రోక్షణము చేయవలసిన ప్రధాన యాజకుని మాదిరి నిమిత్తముగాను
  3. పరిశుద్ధుడైన దేవుని నిష్కళంక దృష్టి నిమిత్తముగాను
  4. రక్షణ యొక్క వెల యింత విలువైనదని మనకందరికి నేర్పు నిమిత్తముగాను
  5. మనమే దేవుని సాన్నిధ్యమునుండి పారదోలబడి నిత్యనాశనమను దండనకు వెళ్ళిపోయి బాధ అనుభవించవలసియుండగా మనకు ప్రతిగా నిలిచిన నిమిత్తముగాను
  6. మనమీదనున్న దేవుని ప్రేమ నిరూపించి మనపట్ల దేవునికున్న చిత్తము సంపూర్ణము అగు నిమిత్తముగాను-

క్రీస్తు ఆ సిలువమీద భయంకరమైన కేకవేసి ప్రాణమును పెట్టి మనలను విముక్తు లనుగా చేసెను. దేవునికి స్తోత్రము. నమ్మినవారికే అనుభవ మగుచున్నది, కాబట్టి క్రీస్తు ఆ కేకవేసినదానిలో సాతానుకు యోడిపోయిన దానికి బదులుగా సాతానును జయించుచుండి గొప్ప అతిశయముతోనే ఆ జయకేకవేసి చనిపోయెనని బోధపడు చున్నది. కావున ఆ కేకకు అభ్యంతరపడక దానివలన రక్షణయొక్క విలువ యెంతో తెలిసికొని ఆ రక్షకుని ఆహ్వానించి నమ్మి మీ స్వంత రక్షకునిగా అంగీకరించి రక్షింప బడండి. అంతట క్రీస్తు సిలువమీద బాధ అనుభవించి భయంకరముగా కేకవేసినదాని కార్యము మీ మట్టుకు వృధాగా పోదు. దేవుని కృపను నిరర్థకము చేయవద్దు. (గలతీ 2:21).

Leave a Comment