దావీదు భార్యలు

దావీదు భార్యలు

ప్రశ్న:- దావీదు భక్తుడైతే అతనికెందుకు నింతమంది భార్యలు? దేవుడు దానికి సమ్మతించినాడా? ఈ దినములలో ఒకని కెందరు భార్యలుండవచ్చును?

జవాబు:-

దావీదు భక్తుడైయుండి ఆ కాలములో రెండవ సమూయేలు 6:13,14 ప్రకారము రక్త బలులుగా దేవునికి నెద్దులను, క్రొవ్విన దూడలను అర్పించెను. ఈ దినములలో మనము అర్పించెదమా? అర్పించము. ఎందుకు? దేవుడు మారిపోయెనా? కాదు – ఆ కాలమందు లేని ఏర్పాటు ఈ కృప దినములలో జరుగుచున్నది.

ఆ దినములలో కాలము సంపూర్ణము కాక రాబోవు క్రీస్తు అప్పటికి అవతరించియుండనందున ఆ రక్త బలులు చెల్లెను. ఇప్పుడైతే చెల్లవు. ఎందుకంటే క్రీస్తు తానే బలిగా వచ్చి ఆ అపూర్ణ బలులను తనతో సంపూర్ణమునకు తెచ్చి వాటిని నిలిపివేసెను. గలతీ 4:4; యోహాను 19:30; రోమా 10:4.

దావీదు భక్తుడైయుండి ఆ పాత యూదా మత పద్ధతిచొప్పున సున్నతి పొందియుండెను. (1 సమూ. 17:36). సరి, భక్తుడైన దావీదు పొందినట్టు మనము ఈ దినములలో సున్నతి ఆచరించెదమంటే సరిపోవునా? సరిపోదు – ఇప్పుడు క్రీస్తునుబట్టి క్రొత్త జన్మము పొందుటయే అగత్యము.

ఈ నూతన జీవము సున్నతికంటే నెక్కువై ఆ పాతదానిని ముంచివేసియున్నది. కాబట్టి యిప్పుడు సున్నతి పొందుట యందేమియు లేదని వాక్యమనుచున్నది. (గలతీ 6:15). ఆలాగైతే దేవుడు మారెనని భావిస్తామా? అట్లనరాదు.

ఒక కాలమందు చెల్లినది ఆ అపూర్ణ కాలానికి సరిపోయెను. అయితే సంపూర్ణము రాగా అపూర్ణము నిలిచిపోయినది. దావీదు భక్తుడైయుండి పండుగగా అమావాస్యను ఆచరించెను. 1 సమూ. 20:18 చదవండి. మరియు సబ్బాతు దినముగా శనివారమును ఆచరించెను.

క్రొత్త నిబంధన చేతిలో లేక పాతదానినే ఆచరించెను. సరి, భక్తుడైన ఆయన ఆలాగు చేసినందున క్రీస్తుకు యివతల నున్న మనముకూడ ఆలాగే పాతవాటిని ఆచరించెదమందామా? కూడదు. కాలము వేరైపోయెను. అప్పుడివ్వబడని వెలుగు ఈ కాలమందు ప్రకాశించు చున్నది గనుక మనము పాతదానికి బద్ధులము కాము. (1 యోహాను 2:8).

ఆ పాత అమావాస్య అను పండుగ యేమి, సబ్బాతు దినమనేదియేమి, అవన్నియు రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో నున్నదని యిప్పుడు ప్రతివాడు గ్రహించి ఆ పాత పండుగలను ఆ పాత శనివారమును నిషేధించి క్రీస్తు అనే శిరస్సును హత్తుకొని ఆయనతోనే నిత్యము పండుగ నాచరించి ఆయనతోనే నిత్యము విశ్రాంతి అనుభవించి తృప్తి చెందియుండవలెను. (కొల. 2:17-19).

దావీదు క్రీస్తు పేరు ప్రార్థనలో చెప్పుకొనెనా? క్రీస్తు నామమందు మిమ్మును మనవి చేయుచున్నామనెనా? 2 సమూయేలు 7:18 చూడండి – నా ప్రభువా, యెహోవా అని ప్రార్థనలో చెప్పుకొంటూ ఆఖరికి ఆ ప్రార్థనను ముగింపబడుగాకనియున్నది. అంతే సరి. క్రీస్తు పేరు లేక ఆలాగు భక్తుడైన దావీదు ప్రార్థించెను.

మనమును నేటి దినములయందు క్రీస్తును లోపించి ప్రార్థింతామని చెప్పుకొంటే సరిపోవునా? సరిపోదు, ఆ కాలము వేరు, ఈ కాలము వేరు. దేవుడు మారెనా అంటే మారలేదులెండి గాని ఆయన బయలుపరచే సత్యము కాలక్రమేణ పరిపూర్ణతకు వచ్చెనని మనము తెలిసికొనవలెను. ఇప్పుడు క్రీస్తును మధ్యవర్తిగా పెట్టుకొని క్రీస్తు నామమందు దేవుని ప్రార్థింపవలెను – యోహాను 14:13, 15:16, 16:23.

దావీదు దినములలో బయలుపరచబడని సంగతి మన దినములలో వెలుగులోనికి వచ్చియున్నది. (2 తిమోతి 1:9,10). దావీదు భార్యల సంగతి యిట్లనే వివేచించవలెను. ఆరంభదశలో దేవుడు ఆదామునకు నొకే భార్యనిచ్చి వారిద్దరిని ఆ పెండ్లిలో నేక శరీరముగా చేయుటవలన, మనుష్యునికి భార్యలు కాదు, ఏక భార్యయుండతగినదని ప్రకటింపబడి స్థిరమాయెను. క్రీస్తు కూడ లోకమునకు వచ్చి ఈ గొప్ప పద్ధతికి మత్తయి 19:5-7 లో సమ్మతించి వారు ముగ్గురు లేక నలుగురు కారు, వారిద్దరును ఏక శరీరముగా నుండుట శ్రేయస్కరమని సూచించి పలికెను.

ఆ పాత భక్తులు వెలుగు లేక మామూలు చొప్పున నొక భార్య కాక వారిని వీరిని భార్యలనుగా స్వీకరించి వారితో కాపురముండినప్పుడు దేవుడు తన చట్టమును గాని పెండ్లియెడల తనకున్న తన ఆరంభ ఆపేక్షనుగాని, యుద్దేశమునుగాని మార్చక భక్తులు ఆ అపూర్ణ దినములలో అయోగ్యముగా చేసినది చూచియు చూడనట్టుగా నుండెను. రెండు తెలియుచున్నవి.

  1. ఇప్పుడున్నట్లు అప్పుడు జ్ఞానమంతగా లేదు. గనుక వివాహ సంబంధముగా భక్తులా దినములలో తొలిగినది యెహోవాకు తెలియకుండ పోలేదు గాని క్రీస్తు వచ్చేదాకా ఆ భక్తులను కనిపెట్టి వారితో నోర్చియోర్చి వచ్చెను. (అపొ.కార్య. 17:30).
  2. కాబట్టి క్రీస్తు రాక పూర్వము కొన్ని విషయములుగా వారు వీరు చెప్పే మిషలు చెల్లుచుండెను. ఇప్పుడైతే క్రీస్తు రావడముతో –
  • వెలుగు పరిపూర్ణమాయెను. 1 యోహాను 2:8.
  • సాకుకు గాని మిషకు గాని చోటులేదు. యోహాను 15:22. ఇ) నాకు తెలియదని చెప్పి అజ్ఞానముగానుండ వీలులేదు.అపొ. కార్య. 17:30,31.

గనుక ఈ కృపా దినములలో క్రీస్తు అధికారము క్రిందనుండే వ్యక్తి యొక భార్య తోనే కాపురముండి ఘనముగా జీవించతగినది. ఇందు నిమిత్తమే క్రీస్తు భక్తులకు మాదిరిగా నడుచుకొనదగిన సంఘాధ్యక్షులకు చట్టముగా నివ్వబడి చెల్లుచున్న నొక గొప్ప విధి యేదనగా ఏకపత్నీ పురుషత్వము. 1 తిమోతి 3:2,3. ఈ పద్ధతి లోపలనే ఇప్పుడు క్రీస్తువారు జీవించదగినది. వెనుకకు తిరిగి దావీదు సంగతి యెట్లని అడిగి విచారించి అనేక భార్యలతోనుండ వల్లపడదు. దేవుడు మారలేదు గాని కాలము వేరైపోయెను. అప్పుడివ్వబడని హక్కులిప్పుడు క్రీస్తులో మనకివ్వబడెను.

ఏకపత్నీ పురుషుడుగా నుండుమనే ప్రభువీ దినములలో నాలాగే బ్రతుకునట్టి శక్తినికూడ నివ్వకుండపోడు. క్రీస్తునుబట్టి భక్తులకు కలిగిన పరిశుద్ధాత్మద్వారా భక్తులలో కనిపించ తగిన నీతి క్రియలవంటి పరిశుద్ధత లేకపోకూడదు – ఈ సత్యము నుపేక్షించేవాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. జాగ్రత్త! (1 థెస్స. 4:8).

Leave a Comment