క్రీస్తు శ్రమలు, యాజకత్వమునకు పిలుపు (అధ్యాయము 5:1-10)
క్రీస్తు యాజకత్వ పరిచర్య జరిగించిన పరిధిని అనగా దేవుని ఇంటిని అపొస్తలుడు మనకు చూపెట్టియున్నాడు. ఆయన యాజకత్వ పరిచర్యకు కారణమైన ఆ ప్రజల స్థితిని – అనగా అరణ్య ప్రయాణమును చూపెట్టి యున్నాడు.
ఇప్పుడు క్రీస్తు తన యాజక పరిచర్యనుబట్టియు, ఆ పదవికి తగిన పిలుపునుబట్టియు ఆయన పొందిన శ్రమలను మన యెదుట చూపెట్టుచున్నాడు.
(వచనములు 1-4). యేసుక్రీస్తుయొక్క శ్రేష్టమగు యాజక పరిచర్యను వివరించుటకు అపొస్తలుడు అహరోను యాజకత్వమును ఉదహరించెను. యాజక సేవకు సంబంధించిన సాధారణ సూత్రములనుకూడ వివరిం చెను.
అదే సమయములో అహరోనుకంటే క్రీస్తు యాజకత్వము ఎంత శ్రేష్టమైనదోకూడ పోల్చి చెప్పెను. ఈ నాలుగు వచనములు క్రీస్తు పరలోక యాజకత్వమును సూచిం చుటలేదు.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
గాని భూసంబంధమగు అహరోను యాజకత్వమును సూచించు చున్నవని మనము గ్రహించవలెను. భూసంబంధమైన యాజకుని వ్యక్తి త్వము, పని, అనుభవము, నియామకము మొదలగు విషయములను అపొస్తలుడు ఇక్కడ వివరించియున్నాడు.
వ్యక్తిగా ప్రధానయాజకుడు మనుష్యులలోనుండి ఎన్నుకొనబడిన వాడు. యేసుక్రీస్తు యాజకత్వము అందుకు పూర్తిగా భిన్నమైనది. క్రీస్తు మానవుడే, కాని ఆయన అంతకంటే అధికుడు. మన ప్రధానయాజకు డగు క్రీస్తు మరెవరోకాదు.
నిత్యుడగు కుమారుడని రచయిత సాక్ష్య మిచ్చుచున్నాడు. పని విషయములో భూసంబంధమైన యాజకుడు మనిషికొరకు దేవుని విషయములో కార్యములు జరిగించుటకు నియమింపబడెను.
పాపముల కొరకు బలులు అర్పణలు అర్పించుటకును, అజ్ఞానుల, పాపుల పక్షమున క్షమాపణను సంపాదించుటకును నియమింపబడెను. ఇక్కడ క్రీస్తు యాజక పరిచర్యను ఛాయగా చూడగలము.
ప్రధాన యాజకునిగా క్రీస్తు మనుష్యుల పక్షముగా పనిచేయుచున్నాడు. తాను మహిమలోనికి తీసుకొని రాబోవు చున్న అనేకులగు కుమారుల పక్షముగా పనిచేయుచున్నాడు.
వారు దేవునితో నడచునప్పుడు తప్పిపోకుండునట్లు భద్రపరచుచున్నాడు.తన ప్రజలు దేవునితో సంబంధము కలిగియుండునట్లు క్రీస్తు పాపములకొరకు బలులను, అర్పణలను అర్పించెను.
పాపములను తీసివేయు ఆ గొప్ప కార్యమును జరిగించి, అజ్ఞానులును పాపులును అయిన తన ప్రజలకు సానుభూతి తాలిమి చూపగలుగునట్లు యాజక పరిచర్యగా విజ్ఞాపన చేయుచున్నాడు.
యాజకుని వ్యక్తిగత అనుభవము విషయము “తానుకూడ బల హీనతచేత ఆవరించబడియున్నందున ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో అలాగే తనకొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు” అని వ్రాయబడియున్నది.
ఇక్కడ క్రీస్తు యాజకత్వమునకు పాక్షిక సామ్యము, స్పష్టమైన వ్యత్యాసము చూపబడి నది. శరీరధారియైయున్న దినములలో ఆయన బలహీనుడుగా ఉండు పరిస్థితులు సంభవించెను.
అయినను, ఆయన బలహీనత అహరోను బలహీనతవంటిది కాక, పాపము లేనిది. అందువలన తన పాపముల కొరకు బలులు అర్పించెనని చెప్పబడలేదు.
భూసంబంధమైన యాజకుని నియామకము విషయము – నేడు క్రైస్తవ లోకములో దేవుని పిలుపు లేకుండా అనేకులు తమకు తామే యాజకత్వమునకు నియమించుకొని కోరహు వలెనే నశించియున్నారని యూదా హెచ్చరించుచున్నాడు.

ఇక్కడి భూసంబంధమైన యాజక పరిచర్య లక్షణములు చారిత్రక ముగా విఫలులైన ఇశ్రాయేలు ప్రజలనుబట్టిగాక, దేవుని ఆలోచననుబట్టి ఎట్లుండవలెనో చూడగలము.
ఇశ్రాయేలు చరిత్రలో ఇద్దరు దుర్మార్గులైన వ్యక్తులు ప్రధాన యాజకుని స్థానము వహించి తమ మెస్సీయాను సిలువవేయుటకు కుట్రచేయుటతో ఇక ఈ వ్యవస్థ అంతమొందినది.
(వచనములు 5, 6). 5వ వచనమునుండి క్రీస్తు ప్రధానయాజకుడని రచయిత చెప్పుచున్నాడు. యాజకుడుగా పిలువబడిన ఆయన వ్యక్తిత్వపు గొప్పతనము, యాజక పదవి నధిష్టించుటకు ఆయన పొందిన అనుభ వము, ఆ పరిచర్య స్థలమునకు దేవుడు నియమించుట రచయిత మనయెదుటికి తెచ్చియున్నాడు.
ఆయన వ్యక్తిత్వపు మహిమ: ప్రధాన యాజకత్వమునకు పిలువ బడిన క్రీస్తు మనుష్యుల పక్షముగా పనిచేయుటకు మనుష్యులలోనుండి యాజకుడుగా పిలువబడియున్నాడు.
అయితే, మానవునిగా శరీరముతో నున్న కాలములో ఆయన కుమారునిగా గుర్తించబడియున్నాడు. “నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను” అని చెప్పబడియున్నది. ఈ మహిమగల వ్యక్తి నిజముగా దేవుడు, నిజముగా మానవుడు. దైవ త్వము, మానవత్వము ఆయనయందు పరిపూర్ణముగా వ్యక్తపరచబడినవి.
ఈ యాజకత్వ క్రమముయొక్క లక్షణముల విషయము రచయిత ఎంతో చెప్పవలసి ఉన్నది. ఇక్కడ యాజకుని గొప్పతనము మాత్రమే కాదు, యాజకత్వముయొక్క హుందాతనమును సూచించుటకు కీర్తనలు 90:4 వచనమును ఉదహరించియున్నాడు.

(వచనములు 7, 8). క్రీస్తు యాజకధర్మము నిర్వర్తించునట్లు ఆయన పొందిన అనుభవమును ఆ తరువాతి వచనములలో నేర్చుకొందము. పరలోకమందు యాజకధర్మము జరిగించుటకు ఆ మహిమగల వ్యక్తి అనగా, కుమారుడు ఎంత అవశ్యకమాయెనో గదా! అయితే అంతటితో సరిపోదు.
అరణ్యయాత్రయందు తన ప్రజలను పోషించి, సహాయపడ వలసియున్నయెడల ఆయన తానే మార్గమందు పొందవలసిన బాధ, దుఃఖము అనుభవించి ప్రవేశించవలెను.
అందువలననే అపొస్తలుడు వెంటనే “శరీరధారియైయున్న దినముల”ను మన దృష్టికి తెచ్చియున్నాడు. ఆయన మన బలహీనతలలో సహానుభవమును పొందెను. మనము నడచు బాటలో ఆయన ముందుగా నడచెను.
మనము ఎదుర్కొనవలసి యున్న శోధనలను ముందుగా తానే ఎదుర్కొనెను. మనవలెనే బలహీన తలచేత ఆవరించబడియుండెను. రచయిత ప్రత్యేకముగా క్రీస్తు చివరి కాలపు శ్రమలను ప్రస్తావించెను.

గెత్సేమనే వనములో మరణముయొక్క భయంక రత్వమును ఆయనకు తెలియజేసి విధేయతా పథమునుండి ఆయనను తప్పించవలెనని శత్రువు యత్నించెను.
ఈ భయంకర శోధనలో ప్రభువు పరిపూర్ణ మానవునిగా వ్యవహరించెను. ఆయన తన దైవికశక్తిని వినియో గించి సాతానును తరిమివేయుటగాని, తనకైతాను మరణమునుండి తప్పించుకొనుటగాని చేయలేదు. పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడిన మనిషిగా శోధననెదుర్కొని అపవాదిని జయించెను.
అయినను, ఆయన మానవ పరిపూర్ణత తన యెదుటనున్న భయంకర విషయములనుబట్టి భయపడి తన ఉద్దేశ్యములను మహారోదనతో, కన్నీటితో వ్యక్తపరచునట్లు చేసెను.
దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి ఆయన శోధనను ఎదుర్కొనెను. తనను మరణమునుండి రక్షింపగల దేవునియందు నమ్మికయుంచెను. ఈ భయంకర శోధనలన్నింటిలో దేవుడు ఆయన ప్రార్థన నాలకించు టకు కారణము ఆయన భక్తియే. ఆయనపై ఆధారపడి, నమ్మికయుంచుట వలన దేవుడు ప్రతి పరిస్థితిలో జోక్యము కలిగించుకొనెను.
ఆయన ప్రార్థనలు అంగీకరించబడినట్టే శారీరక బలహీనతలో ఆయన బలపరచ బడెను. ఆ విధముగా తననుతాను సమర్పించుకొని తండ్రిచేతినుండి పాత్రను అందుకొనగలిగెను.
ఆ విధముగా ఆయన సాతాను అధికారమును జయించెను. కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయత నేర్చుకొనెను. మనకు చెడ్డమనస్సు ఉన్నందున విధేయత నేర్చు కొనవలసియున్నది.
ఆయన సమస్తముపై దేవుడుగా ఉండి, నిత్యత్వము నుండి సమస్తమును శాసించుచున్నాడు. అవిధేయత మూలముగా మన మీదికి కష్టములను కొనితెచ్చుకొని వాటిద్వారా మనము తరచు విధేయత నేర్చుకొందుము.
క్రీస్తు విషయమైతే – ఆయన దేవుని చిత్తమునకు విధేయుడైనందున శ్రమలు కలిగెను. వాటిద్వారా ఆయన విధేయత నేర్చుకొనెను. ఆయన అనుభవపూర్వకముగా విధేయతకు మూల్యమెంతో నేర్చుకొనెను.
శ్రమ ఎంత తీవ్రమైనదైనను, సంపూర్ణ విధేయతా పథము నుండి ఆయనను ఆ శ్రమ తప్పించలేకపోయెను. “ఆయన సమస్తమునకు లోబడెను. అన్ని విషయములలో లోబడెను. అన్ని విషయములలో దేవునిపై ఆధారపడెను” అని ఒక భక్తుడు చెప్పియున్నాడు.
అపొస్తలుడు సూచించిన శ్రమలు “ఆయన శరీరధారియైయున్న” దినములలోనివే. కాని ఆయన మరణ దినము కాదు. సిలువ దగ్గర ఆయన దేవుని ఉగ్రతను భరించుచు శ్రమను అనుభవించెను. అక్కడ ఆయన ఒంటరిగా ఉండవలసినదే.
ఆయన ప్రాయశ్చిత్తార్థమగు శ్రమలలో ఎవరును ప్రవేశింపలేరు, ఎవరును భరించలేరు. గెత్సేమనే తోటలో ఆయన శత్రువులవలన శ్రమననుభవించెను. అక్కడ ఆయనలో ఇరువురు ఉన్నారు.
మనకున్న కొద్ది పరిమాణముమేరకు అపవాదిచేత శోధింపబడి నప్పుడు శ్రమలను అనుభవించగలము. అప్పుడు మనకంటే ముందుగా శ్రమపడిన ఆయన సానుభూతి, సహాయము మనకుండును.
(వచనము 9). గెత్సేమనే తోటలోమాత్రమే దేవుడు ఆయన ప్రార్థన వినుట కాదుగాని, శ్రమననుభవించినందున పునరుత్థానమందుకూడా ఆయన ప్రార్థన వినెను. ఆ విధముగా ఆయన మహిమలో సంపూర్ణసిద్ధి పొందెను. ఆయన మహిమగల మనిషిగా తన స్థానము నాక్రమించు చున్నాడు. ఆయన స్వయముగా చెప్పినదేమనగా

ఆయన వ్యక్తిగత పరిపూర్ణతకు ఏదీ కలుపనవసరము లేదు. శరీరధారియై యున్న దినములలో శ్రమలగుండా వెళ్ళి సిలువ కార్యమును ముగించి, తిరిగి లేచుటద్వారా మహిమపరచబడినందున మహిమకు అనేకులగు కుమారుల పక్షముగా ప్రధానయాజకుని పరిచర్య నిర్వర్తించుటకు ఆయన తగ్గియున్నాడు.
పరిపూర్ణ సిద్ధి పొందినందున దేవుడు ఆయనను మెల్కీ సెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా పిలిచెను. శరీరధారియై నప్పుడు మెల్కీసెదెకు యాజకత్వమును స్వీకరించవలసినదిగా పిలువబడి యున్నాడు.
(5 వచనము). పునరుత్థానుడై మహిమలో పరిపూర్ణ సిద్ధి పొందిన తరువాత మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని
పిలువబడెను. (10 వచనము).