యేసు క్రీస్తు బాల్య చరిత్ర: పాఠాలు మరియు బైబిల్ వచనాలు

క్రీస్తు బాల్యము

ప్రశ్న:- క్రీస్తు యేసు పన్నెండేడ్లు మొదలుకొని ముఫ్పై యేండ్లవరకెక్క డుండెను? అది ఎందుకు వ్రాయబడలేదు, అప్పుడాయన ఇండియాకు వచ్చెనా?
జవాబు:- నాలుగు సువార్తలలో క్రీస్తు చేసి చెప్పినదంతయు వ్రాయబడెనా? వ్రాయబడ లేదెందుకు? (1) అంతయు వ్రాతకువస్తే నట్టి గ్రంథమునకు భూలోకమైనను చాలదు. (యోహాను 21:25). (2) వ్రాసినదానిలోనే యిప్పుడు మునుగుతును తేలుతును వున్నాము. ఈ నాలుగు సువార్తలుగల గ్రంథముచేత కాకుండగా దానికి మించి సవిస్తారముగా క్రీస్తు చరిత్రను వ్రాస్తే మనకు పట్టదు.

వ్రాసినవి యెందుకు వ్రాయబడెను? (1) వ్రాసిన వ్రాతలను పరికించి చూచి క్రీస్తు వాస్తవముగా దేవుని కుమారుడని నమ్ముటకొరకు వ్రాయబడినవి. (యోహాను 20:31). అంతేకాదు, (2) క్రీస్తు దేవుని కుమారుడని తెలిసికొనిన పిమ్మట వెంటనే యట్టి గొప్ప క్రీస్తునందు మృతులైన పాపాత్ములు విశ్వసించి నిత్యజీవము పొందతగినది. ఆలాగు నమ్మి పొందునట్లు వ్రాసినవి వ్రాయబడెను. (యోహాను 20:31). కాబట్టి ఫలానిది యెందుకాయన చరిత్రలో వ్రాయబడలేదంటే అది మనకు అవసరములేదని జవాబు తేలుచున్నది. నిత్యజీవార్థమై కావలసినవన్నియు వ్రాయబడినవి గనుక వ్రాతకు రాని సంగతులు మనకంతగా అవసరము లేదని స్పష్టము. బాలుడైన క్రీస్తు అనే అంశము మనకంతగా అక్కరలేదు.

అయినను కొన్ని సందర్భములుగా అయన బాల్యము వివరింపబడెను. లూకా 240 – బాలుడైన యేసు జ్ఞానముతో నిండుకొనుచు నెదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయనమీద నుండెనని చెప్పుచున్నది. అదే లూకా 2:21 లో ఎనిమిది దినముల వయస్సుగల శిశువైన క్రీస్తు సంగతి వ్రాయబడెనెందుకు? ఆ సంగతి మనకు పట్టినది. ఎందుకంటే ఆ శిశువు పాతవిధి చొప్పున ఆ యెనిమిదవనాడు సున్నతి పొందినదానిలో కేవలము క్రీస్తు దూతగా రాక హెబ్రీ 2:16 లో వ్రాసిన ప్రకారము యూదులకు మూలపురుషుడైన అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని వచ్చెను గనుక క్రీస్తు శరీరము మట్టుకు యూదుడే అని తేలినది. ఇది మనకు గ్రాహ్యము కావలసిన సంగతి కాబట్టి సున్నతి పొందిన అంశము 2:21-39 వరకు వివరముగానే వ్రాయబడియుండగా నెనిమిది దినముల వయస్సు మొదలుకొని

ఆయన పన్నెండవ యేటివరకు జరిగిన పన్నెండేండ్ల సంగతి ఈ 2:40 అనే యొక వచనములోనే వ్రాయబడినది. ఈ వ్యత్యాసమెందుకు? కొన్ని సందర్భములను వివరించుటలో పందొమ్మిది వచనములు పట్టెను. పన్నెండేండ్ల సంగతికి నొక వచనమే చాలినది. అవును. అక్కరలేనిదానిని వివరించక దాటి వెళ్ళినవాడు కావలసినవాటిని వివరించుటలో మిక్కిలి శ్రద్ధ వహించెను. ఆయనకు స్తోత్రములు. మరి యొకసారి లూకా సువార్తను పరీక్షించి 2:41 నుంచి 2:50 వరకు గమనించండి. ఆయన పన్నెండవయేట జరిగిన విశేషమైన ఆ దేవాలయ విషయము వివరముగా వ్రాయబడియున్నది. అందులో రెండు ముఖ్యమైన కార్యములు పైకి తేలుచున్నవి. 1) ఆయన ఆ బాల్య ప్రాయములోనే కనుపరచిన ప్రజ్ఞకును, దేవాలయములో నిచ్చిన ప్రత్యుత్తరములకును వినినవారందరును విస్మయమొందిరి (2:47).

బాలుడైన క్రీస్తు అప్పుడే ఆ పాత లేఖనములయందు ప్రవీణుడాయెనని తెలియుచున్నది. 2) అప్పుడు కూడ నా తండ్రి పరమందున్నవాడే గాని మరియ భర్తయైన యోసేపుకాడని యెరిగి యుండెను. వారాయనను వెదకుచు వచ్చి దేవాలయములో మూడవ నాడాయనను కనుగొంటే తల్లియైన మరియ నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటి మని చెప్పితే ఆమెను గద్దించినపుడు ఆ చిన్న వయస్సులోనున్న యేసు నేను నాతండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా? అనెను. చూచితిరా? నీ తండ్రి నా తండ్రి అనే శబ్దము లొకటితో నొకటి పెనుగులాడెను. ఇంతమట్టుకే పన్నెండేండ్లు యేసు సంగతి చెప్పబడెను. చాలును; ఎనిమిది దినములు మొదలుకొని పన్నెండేండ్లవరకు జరిగినదేమి? అది వ్రాయబడలేదా? వ్రాయబడినది. ఒక వచనమే. గంభీరముగా ఆ సంగతి లూకా 2:40 లో మనకు తెలుపబడుచున్నది. పన్నెండేండ్లు మొదలుకొని ముప్ఫైవరకు జరిగినదేమి? అది వ్రాయబడలేదా? వ్రాయబడినది.

దేవుని జ్ఞానములో రెండు వచనములే ఆ పద్దెనిమిది సంవత్సరముల చర్యకు సరిపోయెను. బాప్తిస్మము పొంది బహిరంగముగా సేవ చేయనారంభించినప్పుడు క్రీస్తుకు ముప్ఫైయేండ్ల యీడు కలిగియుండెనని స్పష్టముగా లూకా 3:23 లో నేర్చుకొనుచున్నాము. 2:41-50 లో ఆయన పన్నెండవయేటి చర్య మనకివ్వబడినది. 3:23 లో ఆయన ముప్పదియవ సంవత్సరము చెప్పబడినది. మధ్య ఆ పద్దెనిమిది సంవత్సరములలో జరిగినదేమి? లూకా 2:51,52 దీనికి సరియైన జవాబు.

తల్లిదండ్రులతో నజరేతుకు వెళ్ళిపోయి వారికి లోబడియుండెను. తరువాత జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ యందును, మనుష్యుల దయయందును వర్థిల్లుచుండెనని దివ్యముగా వ్రాయబడి యున్నది. అంతే చాలును. యింటి జీవితము సరిగానున్నది. తండ్రియని యెంచబడిన యోసేపుతోనైనను, తల్లిగారితో నైనను యెదురులేదు. దేవుని యెదుట సరిగానున్నాడు.

యోగ్యులైన మనుష్యులతో పేరు బాగున్నది. దేహముండెను గనుక దానికి తగినట్టు చర్య తీసికొని ఆయురారోగ్యమునకు భంగము కాకుండ ఆ దేహమును చూచుకొనుటచే వయస్సునందు పెంపొందుచు వచ్చెను. లేఖనములు గలవు వాటిని పరిశోధించుచు జ్ఞానమందు వర్థిల్లుచు వచ్చెను. ఆయన పద్దెనిమిది యేండ్ల చర్య యింతటితో మన కప్పగింపబడెను గాని వ్రాయబడిన ఈ క్లుప్త వివరణ చాలదా? చాలును. రక్షింపబడిన యువకులెట్లు ఆయా తమ రంగములలో ఆత్మీయముగాను, లౌకికముగాను వర్థిల్ల తగినదో నేర్చుకొనుటకా రెండు వచనములలో క్లుప్తమైనను అతి లోతైన భావముతో వ్రాయబడిన వాక్కులు మనకు సరిపోయినవి.

ఇంకొకటి మనము తెలిసికొన యోగ్యమైనది. అదేదనగా క్రీస్తు ముప్పదియేండ్ల చర్య యింత సంక్షేపముగా వ్రాయబడియుండగా ఆయన కడపటి మూడున్నర యేండ్లది సవిస్తారముగా లిఖింపబడె నెందుచేత? అవును, బహిరంగ సేవ సంబంధముగా ఆయన సత్ప్రవర్తనగా నడుచుకొనినది, బోధించినది, అద్భుతములు చేసినది, చనిపోయి లేచినది, లేచి ఆరోహణమైనది మున్నగు విషయములు ప్రాముఖ్యమైనందువలన వాటిమీదనే మన ముఖ్యగమనముండులాగున ప్రేమగల తండ్రి ఆ నలుగురు సువార్తికు లచే ఆ విశేషమైన సంగతులను శ్రద్ధవహించి మనకు వివరముగానే తెల్పెను. ఆలాగు చేయుట ఆయన కభీష్టమాయెను. ఆయన దివ్యనామము స్తుతింపబడుగాక.

శిశువైన యేసుతో మనకు పనిలేదా? ఉన్నది. కాబట్టి యెంతో అంతమట్టుకే వ్రాత యివ్వబడెను. బాలుడైన క్రీస్తుతో మనకు పనిలేదా? ఉన్నది గనుక దానికి తగిన వ్రాత అప్పగింప “బడెను, అయితే శిశువైన యేసుగాని బాలుడైన యేసుకాని మనకంతే అవసరమా? అవసరము లేదు. రక్షకుడైన యేసుతోనే మనకు నిమిత్తమున్నది. యౌవనస్థుడైన యేసుతో మనకంత అక్కరుంటే ఆ సంగతి వివరింపబడియుండెడిది. అక్కరలేదు. గనుక పన్నెండు మొదలుకొని ముప్ఫై యేండ్లవరకు జరిగినది యివ్వబడెను గాని యంత విశదముగా బయలుపర్చబడలేదు. బోధ పనిలో చేరి మన రక్షణకై ప్రాణము పెట్టి లేచేవరకు జరిగినది ముఖ్యము కాబట్టి ఆ వ్రాతలు విస్తారములు.

అంతేకాదు, ఇప్పుడు లోకమును జయించి మహిమలో ప్రవేశించి యుండే క్రీస్తు జనులకు గోచరము కావలెను. కాబట్టి సువార్తలు మాత్రము గాక పత్రికలను కూడ భక్తులు పఠించి ముందుకు సాగవలెను. క్రొత్త నిబంధనలో ఆఖరి భాగమునకు వచ్చి క్రీస్తు రాబోయే సంగతి సహితము తెలిసికొని నమ్మతగినది. వ్రాతలను నమ్మినదానితో కూడ వ్రాతకాధారమైన ఆయనను అంగీకరించి పైనుండి క్రొత్తగా జన్మించతగినది. కాబట్టి సందుగా కనబడిన ఆ పద్దెనిమిది యేండ్ల లోపల క్రీస్తు

ఇండియాకు వచ్చి వారి దగ్గర వీరిదగ్గర నేర్చుకొని మళ్ళీ పాలస్తీను వెళ్ళి బోధించెనని యైనను గనుక ఈ దేశములోని మహర్షులు చెప్పేది ఏమి క్రీస్తు చెప్పేది ఏమి అది యిది యొకటే యని నెవడైన సూచించినయెడల అట్టి బోధ సరియైనది కాదని యెరుగండి. క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడైయున్నాడు. ఆయనతో సాటి యెవరును లేరు. ఈ సాక్ష్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.

పద్దెనిమిది సంవత్సరముల చర్య కొద్ది వాక్కులతోనే వివరింపబడిన సంగతి బైబిల్లో వింతగా లేదు. నిర్గమ 2:10,11 చూడండి. 2:10 లో శిశువైన మోషే చెప్పబడెను గాని దాని ఆనుకొనియే 11వ వచనములో నలువదియేళ్ళుగల మోషే చూపబడుచున్నాడు. ఎందుకంటే మోషే పెద్దవాడై ఆ ఐగుప్తీయుని చంపినందుచేత పరుగెత్తి మిద్యానుకు వెళ్ళిపోయినది – ఆయన నలువదియవ యేట సంభవించెనని అపొ.కా. 7:23 ద్వారా తెలిసికొంటున్నాము. ఒక వచనములో నలువది యేళ్ళ చర్య వ్రాయబడియుండగా రెండు వచనములలో క్రీస్తుయేసు పద్దెనిమిది యేండ్ల వివరము సంక్షేపముగా వర్ణింపబడినది ప్రశ్న వేయతగినది కాదు. అక్కరకు వచ్చే సంగతులు బైబిల్లో నున్నవి. లేనివి అక్కరకు రాలేదని అర్థము.

Leave a Comment