కన్య మరియ పిల్లలు

కన్య మరియ పిల్లలు

ప్రశ్న:- కన్య మరియకు యోసేపు వలన పిల్లలు కలిగిరా? ఆలాగైన తన తల్లిని తన సహోదరుల కప్పగించక యేల యోహాను కప్పగించెను?

జవాబు:-

క్రీస్తుయేసు పుట్టువరకు ఆ పుట్టుకకు కల్మషమేమి తగలకుండ యోసేపు నీతిమంతుడైయుండి తన శరీరమును స్వాధీనపరచుకొని మరియ నెరుగకుండెనని మత్తయి 1:25 లో వ్రాయబడియున్నది. తన యింట మరియు యుండెను గాని మరియ నెరుగకుండెను. ఇదెంతయో మెచ్చదగిన కార్యము.

ఆమె క్రీస్తును కనిన తరువాత వేరే పిల్లలు సామాన్యముగా మరియకు పుట్టినట్టు సువార్తలలో రుజువు దండిగానున్నది. నలుగురు సామాన్య కొడుకులను కొందరు చెల్లెండ్లును పుట్టిరి. నలుగురు కుమారులు పేర్లు కూడా వ్రాయబడినవి – మత్తయి 13:53-58, మార్కు 6:1-3, యోహాను 7:3-5, 2:12, మత్తయి 12:46 మున్నగు వచనములద్వారా సంగతి స్పష్టమగుచున్నది.

రోమన్ కథోలిక్వారు మాత్రము మరియను అత్యధికముగా పైకి తీసుకొనివచ్చి ఆరాధించుచున్నందున వేరే పిల్లలు సామాన్యముగా మరియకు పుట్టిరంటే ఆమె గౌరవము తగ్గునని తలంచి ఆమెకు క్రీస్తేగాని వేరే పిల్లలు పుట్టనేలేదని నిరూపించుటలో వ్రాసిన వాక్యముకంటే తమ పారంపర్యమునే మిగుల హెచ్చించి వాక్యమునకు విరోధముగా నిలిచియున్నారు. మరియకు వేరే పిల్లలు పుట్టిరి. ఇది సత్యము. వెంటనే దీనికాక్షేపణ లేస్తుంది. “మరియకు వేరే పిల్లలుంటే చనిపోతుండిన క్రీస్తు తన తల్లిని వారికెందు కప్పగించలేదు? వారామె పిల్లలు కారు గనుకనే వారి కప్పగించలేదు. క్రీస్తు యొకడే గాని ఆమెకు వేరెవరును పుట్టలేదని వాదించేవారు గలరు. అయితే వారి వాదము గెలువదు.

ఆరంభములో తేటగా చెప్పబడినదేమనగా ఆయన స్వంత సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. (యోహాను 7:5). క్రమక్రమేణ దారికి వచ్చి నారేమో, ఎందుకంటే అపొ.కా. 1:14 లో వివరింపబడిన ప్రార్థన గుంపులో మరియతో కూడ క్రీస్తు సహోదరులున్నారు. అటుపిమ్మట మరికొన్ని యేండ్లు జరుగగా గలతీ 1:19 లో నున్నట్టు ఆ సహోదరులలో యాకోబు అనబడిన నొకడు రక్షింపబడి క్రీస్తు శిష్యులలో పేరుగొనెను. మరియు కొందరు యాకోబు పత్రిక వ్రాసినవాడుకూడ నితడే అంటారు. కాబట్టి క్రమేణ దారికి వచ్చిరి. కాని అదంతయు క్రీస్తు ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాతనే జరిగెను. కాబట్టి ఆయన తన తల్లిని యోహాను కప్పగించుట న్యాయమే.

క్రీస్తుకు స్వంత తమ్ముండ్లును చెల్లెండ్లునుండిన వారావేళ ఆత్మీయముగా విశ్వాసములో స్థిరపరచబడినవారు కానందున వారికి తల్లిని అప్పగించుటకంటె తన్ను మిక్కిలిగా ప్రేమించు యోహాను వశము ఆమెను చేసికొనుట మేలని సమస్తము నెరిగినవాడెంచి ఆలాగు చేసెను. ఆలాగు చేసిన దానికి ప్రశ్నవేయ నీవెవడవు? నేనెవడను? నాకు కెనడాలో స్వంత రక్తసంబంధులుండగా ఇండియాకు మళ్ళీ రానైయుండి నా బిడ్డలను వారి కప్పగింపక కేవలము రక్తసంబంధములేని వారి వశము చేసి వచ్చితిని ఎందుకు? నా స్వరక్తసంబంధులకంటె ఆత్మీయములో వేరే కొందరు సహోదరులే నాకు క్రీస్తులో సమీపస్థులైరి. గనుక సరియైన పెంపుకొరకు నా పిల్లలను నమ్మినవారి కప్పగించి ఇండియాకు వచ్చితిని.

మీరు గమనించవలసిన దేమనగా స్వంత రక్తముకన్న క్రీస్తు విమోచన రక్తము గొప్పది. మరియు దానిద్వారా కలిగిన ప్రేమ సంబంధము ఆ పాత జననమైన సంబంధముకంటె బలమైనది, ఈ మాట నమ్మతగినది.

క్రీస్తుద్వారా నైన క్రొత్త జన్మ సంబంధముగా కలిగి బంధుత్వము నెదుట లౌకిక బంధుత్వము నిలువనేరదు. క్రీస్తు ఈ బలమైన నవీన బంధుత్వమును కనుపరచుచు మత్తయి 12:46-50 లో చెప్పినదేమనగా నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తముచొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియునై యున్నారు. తిరిగి యనుచున్నాను పాత సంబంధముకంటె క్రొత్తది బలమైనది. స్వంత రక్తముకంటె క్రీస్తురక్తము విశేషమైనది.

స్వంత కుటుంబముకన్న దేవుని విశ్వాస గృహమువంటి కుటుంబము ఆకర్షణీయమైనది. ఈ మర్మము తెలిసికొనియున్నారా? గనుక స్వంతవారి కప్పగింపక క్రీస్తు తన తల్లిని యోహాను కప్పగించుటలో గొప్ప ఆత్మీయ పాఠమున్నది. స్వంతవారు సిద్ధపడకుండగా శిష్యుడైన యోహానే ఆ ప్రేమ భారమునకు యోగ్యుడైయుండెను గనుక ఆలాగు కార్యము సమకూడెను. అంతేకాదు; యోహాను 19:26 లో క్రీస్తు యోహానుకు కుమారుని స్థానమిచ్చి అమ్మా – ఇదిగో నీ కుమారుడని చెప్పిన తరువాతనే తన తల్లిని యోహాను వశము చేసెను.

ఈ విధి చొప్పున క్రీస్తు తన తల్లిని తన సహోదరులకు చెందిన నొకని కప్పగించెనని చెప్పి తీరవలెను. యోహాను ఆ సహోదరుడు. మరియకు పుట్టిన ఆ వేరే పిల్లలు క్రీస్తు స్వంత రక్తసంబంధులని పరిపూర్ణముగా చెప్పలేము. ఎందుకనగా క్రీస్తు కేవలము దేవుని శక్తిమూలముగా ఆమె గర్భములో జన్మించెను. అయితే సాధారణమైన పిల్లలకంటే ఆత్మీయ పిల్లలు విశేషమని యెరుగండి.

Leave a Comment