ఒక్కటే బాప్తిస్మము

ఒక్కటే బాప్తిస్మము

ప్రశ్న:- ఎఫెసీ 4:5, “బాప్తిస్మమొక్కటే” ఏక వచనములో, హెబ్రీ 6:1,2, “బాప్తిస్మములు” బహువచనములో ఉన్నది. ఒకటే బాప్తిస్మమా? లేక బాప్తిస్మములా?
జవాబు :- బాప్తిస్మములు అనేది యిప్పుడు చెల్లదు. హెబ్రీ పత్రిక హెబ్రీ మతములోనుండి క్రీస్తునొద్దకు వచ్చినవారికి సంబంధించినది. హెబ్రీయులైనవారికి బాప్తిస్మములనేకము లుండునట్టు చూచుచున్నాము. హెబ్రీ 9:10 లో ఆ పాతకాలమందు నానావిధములైన ప్రక్షాళనమువంటి బాప్తిస్మములుండెనని యున్నది. ప్రక్షాళనములు మూలభాషలో బాప్తిస్మ ములని వస్తుంది. యూదులు గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను ముంచే వారు. మార్కు 7:4 చూడండి. నీళ్ళతో కడిగిరనియున్నది లేక క్రింద జూడండి – పాత్రలకు బాప్తిస్మములిచ్చునట్టున్నది.

యోహాను 2:6 ప్రకారము ఆ పాత మతస్థులు శుద్ధీకరణాచారముగా నిట్టి బాప్తిస్మములు నాచరించిరి. కుష్ఠరోగిని పవిత్రుడని నిర్ణ యించినప్పుడుకూడ ఆయనను చిలకరించే చీపురుకు చేరిన మూడు వస్తువులైన ఆ నూలు, హిస్సోపు, దేవదారు కర్ర మూడును వధింపబడిన బలిపక్షియొక్క రక్తములో ముంచబడెనని లేవీయ 14:6 లో నేర్చుకొనుచున్నాము. ఈ ముంచడమే యొక బాప్తిస్మము గనుక పాత మతములో ముంచడములనేక ములుండెను. క్రీస్తు సంఘము స్థాపింపబడక ముందుకూడ కొన్ని బాప్తిస్మములుండెను.

యోహాను బాప్తిస్మము. (అపొ.కా. 19:3). 2) క్రీస్తు తన సిలువ శ్రమలను బాప్తిస్మముతో పోల్చెను. (లూకా 12:50). 3) క్రీస్తు తానే మనకు మాదిరి కొరకు దూరముగా వచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మము పొందెను. (మత్తయి 3:13). క్రీస్తు సంఘము స్థాపింపబడుటతో ఆత్మబాప్తిస్మమనేది యేర్పడెను. (1 కొరింథీ 12:13).

పాత నిబంధనలో మోషేనుబట్టి ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రము దాటగానే బాప్తిస్మము పొందినట్లు 1 కొరింథీ 10:2 లో వివరింపబడియున్నది. అవును, నానా బాప్తిస్మములు గలవు; మరియు ఆ యెడలో ప్రవేశించి బయటకు వచ్చినప్పుడు సాదృశ్యమైన బాప్తిస్మము జరిగెనని 1 పేతురు 3:21 లో తెలియజేయుచున్నాడు. బాప్తిస్మములకు తక్కువేమియు లేదు. 1 కొరింథీ 15:29 లో మృతులకొరకైన బాప్తిస్మము చెప్పబడినది, అనగా చనిపోయిన భక్తులకు బదులుగా క్రీస్తును నమ్మి గతించిపోయినవారి స్థానాన్ని అలంకరించి బాప్తిస్మము పొందినవారని అర్థము.

క్రీస్తు భక్తులు పొందు హింసలు కూడ బాప్తిస్మమని మార్కు 10:39 లో పిలువబడుచున్నవి. కాబట్టి బాప్తిస్మములు కొల్లగా నున్నవి. గనుక హెబ్రీ 6:1 లో బాప్తిస్మములను గూర్చి బోధ అనేది కనబడితే సరిగాని యిప్పుడు క్రీస్తు వచ్చిపోయిన ఈ ప్రస్తుత కాలములో నానా బాప్తిస్మములు జరుగునా? జరుగవు.

ఎఫెసీ 4:6 ప్రకార మీ కృపా దినములలో పాతవి గతించిపోయి క్రీస్తు సంఘము స్థాపింపబడినందున నమ్మినవారాచరించతగిన బాప్తిస్మమెక్కటే. నీళ్ళలో రక్షణకొరకు కాదుగాని ఆచారముగా క్రీస్తు నొప్పుకొనుటకొరకు నమ్మిన వారే బాప్తిస్మము పొందతగినది. సరియైన వరుస ఏదనగా అపొ. కార్య. 18:8 లో కనిపించుచున్నది.

  • వ్యక్తి పాపిగానుండి క్రీస్తునుగురించిన రక్షణ సువార్త వినవలెను.
  • ఆ వాక్యము వినుటతో రక్షకుడైన క్రీస్తునందు విశ్వసించవలెను.
  • బహిరంగ ఒప్పుకోలు నిమిత్తము క్రీస్తు తానే విధించినట్టు మూడవదిగా బాప్తిస్మము నొందవలెను.

విశ్వాసుల బాప్తిస్మమే. క్రొత్త నిబంధనలో సూచింపబడిన యొకటే బాప్తిస్మము.

దీనికి ముందు 1 కొరింథీ 12:13 లో నున్నట్లు క్రీస్తునందలి విశ్వాసియైనవాడు ఆత్మయిచ్చే బాప్తిస్మముద్వారా క్రీస్తు సంఘమనే శరీరములో అంగముగా చేరియుండ వలెను. కాబట్టి బాప్తిస్మములు ప్రస్తుతమున చెల్లవు. క్రీస్తుతో కూడిన యొకటే బాప్తిస్మ మిప్పుడాచరణలో నున్నది. హెబ్రీ 6:1 లో వ్రాయబడిన బాప్తిస్మములు క్రైస్తవ సంఘమునకు సంబంధించినవి కావు.
నేటి

కన్య మరియ పిల్లలు

కన్య మరియ పిల్లలు

ప్రశ్న:- కన్య మరియకు యోసేపు వలన పిల్లలు కలిగిరా? ఆలాగైన తన తల్లిని తన సహోదరుల కప్పగించక యేల యోహాను కప్పగించెను?

జవాబు:-

క్రీస్తుయేసు పుట్టువరకు ఆ పుట్టుకకు కల్మషమేమి తగలకుండ యోసేపు నీతిమంతుడైయుండి తన శరీరమును స్వాధీనపరచుకొని మరియ నెరుగకుండెనని మత్తయి 1:25 లో వ్రాయబడియున్నది. తన యింట మరియు యుండెను గాని మరియ నెరుగకుండెను. ఇదెంతయో మెచ్చదగిన కార్యము.

ఆమె క్రీస్తును కనిన తరువాత వేరే పిల్లలు సామాన్యముగా మరియకు పుట్టినట్టు సువార్తలలో రుజువు దండిగానున్నది. నలుగురు సామాన్య కొడుకులను కొందరు చెల్లెండ్లును పుట్టిరి. నలుగురు కుమారులు పేర్లు కూడా వ్రాయబడినవి – మత్తయి 13:53-58, మార్కు 6:1-3, యోహాను 7:3-5, 2:12, మత్తయి 12:46 మున్నగు వచనములద్వారా సంగతి స్పష్టమగుచున్నది.

రోమన్ కథోలిక్వారు మాత్రము మరియను అత్యధికముగా పైకి తీసుకొనివచ్చి ఆరాధించుచున్నందున వేరే పిల్లలు సామాన్యముగా మరియకు పుట్టిరంటే ఆమె గౌరవము తగ్గునని తలంచి ఆమెకు క్రీస్తేగాని వేరే పిల్లలు పుట్టనేలేదని నిరూపించుటలో వ్రాసిన వాక్యముకంటే తమ పారంపర్యమునే మిగుల హెచ్చించి వాక్యమునకు విరోధముగా నిలిచియున్నారు. మరియకు వేరే పిల్లలు పుట్టిరి. ఇది సత్యము. వెంటనే దీనికాక్షేపణ లేస్తుంది. “మరియకు వేరే పిల్లలుంటే చనిపోతుండిన క్రీస్తు తన తల్లిని వారికెందు కప్పగించలేదు? వారామె పిల్లలు కారు గనుకనే వారి కప్పగించలేదు. క్రీస్తు యొకడే గాని ఆమెకు వేరెవరును పుట్టలేదని వాదించేవారు గలరు. అయితే వారి వాదము గెలువదు.

ఆరంభములో తేటగా చెప్పబడినదేమనగా ఆయన స్వంత సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. (యోహాను 7:5). క్రమక్రమేణ దారికి వచ్చి నారేమో, ఎందుకంటే అపొ.కా. 1:14 లో వివరింపబడిన ప్రార్థన గుంపులో మరియతో కూడ క్రీస్తు సహోదరులున్నారు. అటుపిమ్మట మరికొన్ని యేండ్లు జరుగగా గలతీ 1:19 లో నున్నట్టు ఆ సహోదరులలో యాకోబు అనబడిన నొకడు రక్షింపబడి క్రీస్తు శిష్యులలో పేరుగొనెను. మరియు కొందరు యాకోబు పత్రిక వ్రాసినవాడుకూడ నితడే అంటారు. కాబట్టి క్రమేణ దారికి వచ్చిరి. కాని అదంతయు క్రీస్తు ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాతనే జరిగెను. కాబట్టి ఆయన తన తల్లిని యోహాను కప్పగించుట న్యాయమే.

క్రీస్తుకు స్వంత తమ్ముండ్లును చెల్లెండ్లునుండిన వారావేళ ఆత్మీయముగా విశ్వాసములో స్థిరపరచబడినవారు కానందున వారికి తల్లిని అప్పగించుటకంటె తన్ను మిక్కిలిగా ప్రేమించు యోహాను వశము ఆమెను చేసికొనుట మేలని సమస్తము నెరిగినవాడెంచి ఆలాగు చేసెను. ఆలాగు చేసిన దానికి ప్రశ్నవేయ నీవెవడవు? నేనెవడను? నాకు కెనడాలో స్వంత రక్తసంబంధులుండగా ఇండియాకు మళ్ళీ రానైయుండి నా బిడ్డలను వారి కప్పగింపక కేవలము రక్తసంబంధములేని వారి వశము చేసి వచ్చితిని ఎందుకు? నా స్వరక్తసంబంధులకంటె ఆత్మీయములో వేరే కొందరు సహోదరులే నాకు క్రీస్తులో సమీపస్థులైరి. గనుక సరియైన పెంపుకొరకు నా పిల్లలను నమ్మినవారి కప్పగించి ఇండియాకు వచ్చితిని.

మీరు గమనించవలసిన దేమనగా స్వంత రక్తముకన్న క్రీస్తు విమోచన రక్తము గొప్పది. మరియు దానిద్వారా కలిగిన ప్రేమ సంబంధము ఆ పాత జననమైన సంబంధముకంటె బలమైనది, ఈ మాట నమ్మతగినది.

క్రీస్తుద్వారా నైన క్రొత్త జన్మ సంబంధముగా కలిగి బంధుత్వము నెదుట లౌకిక బంధుత్వము నిలువనేరదు. క్రీస్తు ఈ బలమైన నవీన బంధుత్వమును కనుపరచుచు మత్తయి 12:46-50 లో చెప్పినదేమనగా నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తముచొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియునై యున్నారు. తిరిగి యనుచున్నాను పాత సంబంధముకంటె క్రొత్తది బలమైనది. స్వంత రక్తముకంటె క్రీస్తురక్తము విశేషమైనది.

స్వంత కుటుంబముకన్న దేవుని విశ్వాస గృహమువంటి కుటుంబము ఆకర్షణీయమైనది. ఈ మర్మము తెలిసికొనియున్నారా? గనుక స్వంతవారి కప్పగింపక క్రీస్తు తన తల్లిని యోహాను కప్పగించుటలో గొప్ప ఆత్మీయ పాఠమున్నది. స్వంతవారు సిద్ధపడకుండగా శిష్యుడైన యోహానే ఆ ప్రేమ భారమునకు యోగ్యుడైయుండెను గనుక ఆలాగు కార్యము సమకూడెను. అంతేకాదు; యోహాను 19:26 లో క్రీస్తు యోహానుకు కుమారుని స్థానమిచ్చి అమ్మా – ఇదిగో నీ కుమారుడని చెప్పిన తరువాతనే తన తల్లిని యోహాను వశము చేసెను.

ఈ విధి చొప్పున క్రీస్తు తన తల్లిని తన సహోదరులకు చెందిన నొకని కప్పగించెనని చెప్పి తీరవలెను. యోహాను ఆ సహోదరుడు. మరియకు పుట్టిన ఆ వేరే పిల్లలు క్రీస్తు స్వంత రక్తసంబంధులని పరిపూర్ణముగా చెప్పలేము. ఎందుకనగా క్రీస్తు కేవలము దేవుని శక్తిమూలముగా ఆమె గర్భములో జన్మించెను. అయితే సాధారణమైన పిల్లలకంటే ఆత్మీయ పిల్లలు విశేషమని యెరుగండి.

కయీను గుర్తు

కయీను గుర్తు

ప్రశ్న:- ఆదికాండము 4:15 లో కయీనుకు యెహోవా వేసిన గుర్తు ఏది?

జవాబు :- అన్నీ బైబిల్ లో లేవు. ఉన్నవాటిలోనే తేలుచు మునుగుచునుండగా అదెందుకు వ్రాయబడలేదు, ఇదెందుకు వ్రాయబడలేదని అడుగ యుక్తము కాదు. యేదో యొక గుర్తు యెహోవా తానే నరహంతకుడైన కయీనుకు వేసెను.

అదేమిటో బయలుపరచ బడలేదు. ఇట్లుండగా దాని జోలికేల పోయెదము? అక్కరలేదు. అది మన కవసరముగానుంటే దేవుడు తెలిపి యుండేవాడు. ఆ గుర్తు ఏమిటో తెలిసికొన ముఖ్యమైనది కానందుచేత ప్రభువు దాని వివరము మనకప్పగించలేదు.

మహిమలో నన్ను అడిగితే ఆ ప్రశ్నకు జవాబిచ్చెదను! ఇప్పుడు సరిగా నివ్వలేను. ఒక వ్యాఖ్యాన నిఘంటువులో చూడగ నొకడూహించి చెప్పినదేమనగా యెహోవా కయీనుకు కలుగజేసిన భయంకరమైన ముఖ వర్చస్సుచేతనే కయీనును చూచినవారప్పుడే ఆయన జోలికి పోక తొలగిపోయిరి.

ఆ ముఖ వైఖరియే ఆ గుర్తు. మరి కొందరిలాగూహించి చెప్పుచున్నదేమనగా, నల్లరంగుగల ముఖముతో యెహోవా కయీనును మొత్తెను. ఆ నల్లని వర్ణమే యెహోవా పెట్టిన గుర్తు.

ఇవన్నియు వట్టి యూహలే. కాబట్టి వాటిని మానివేస్తే మంచిది. యెషయా 3:9 లో వ్రాసినట్లు పాపుల ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చుచున్నది. ఒకని ఆత్మయొక్క అద్దము ముఖమే అని యొక లోకోక్తి కలదు. లేదా, ఒకడు క్రీస్తును నమ్మి క్రొత్త జన్మము పొందెననుకొండి.

ఆ సంతోషము ముఖములో నుండదా? ఉంటుంది. దేవుని జ్ఞానమైన క్రీస్తు నెరిగినవాని ముఖమునకు ప్రసంగి 8:1 లో నున్నటు తేజస్సు కలిగియుంటుంది. మీ ముఖ మెట్లున్నది? ఇప్పుడు భక్తుల నిజమైన గుర్తు పరిశుద్ధాత్మయై యున్నాడు. (రోమా 8:9). పరిశుద్ధాత్మను పొందితిరా లేదా?

ఏదెను తోట

ఏదెను తోట

ప్రశ్న:- ఏదెను తోట ఏ దేశములో నుండెను?
జవాబు :- ఆరంభములో నెచ్చటో తూర్పున ఏదెనులో నొక తోటను దేవుడు వేసెనని ఆదికాండము 2:10-14 లో వ్రాసినట్లున్నది. దానిలోనుండి వెళ్లి పోయిన నాలుగు నదులలో నేటివరకు రెండు మాత్రము నిలిచినట్టు గుర్తించగలము. అవేవనగా ఆది కాండము 2:14 లో చెప్పబడిన హిద్దెకెలు, ఫరాతు అనునవి. హిద్దెకెలు నది టైగ్రీస్ నదికి పురాతన పేరు.

యూఫ్రటీస్ నది ఫరాతు అనబడినది. నేటివరకీ రెండు నదులు ఇరాక్ దేశములో నున్నవి. గనుక ఆ భూభాగములో నెచ్చటనో ఏదెనుతోట సంయుక్తమై మానవ చరిత్ర ఆరంభించెనని చెప్పుటకు ఏ సందేహమును లేదు. ఇప్పుడైతే ఏదెను కనబడుటలేదు. దాని స్థానమును దేవుడే దాచిపెట్టెను.

గొప్ప ప్రవక్తయైన మోషే చనిపోతే యెహోవా తానే ఆయనను పాతిపెట్టినట్టున్నది. నేటివరకు ఆ సమాధి యెక్కడున్నదో యెవరికి తెలియదని ద్వితీయోపదేశకాండము 34:6 చెప్పుచున్నది. తెలిసియుంటే వెళ్ళి పూజచేసేవారున్నారు. గనుక దేవుడు ఆ స్థలమును మరుగుచేసెను. ఏదెను ఆలాగే మరుగాయెను. గాని, ఏదెనులో పాపము జరుగగా సహాయమునకు వచ్చి ఆదాము, హవ్వలకొరకు రక్తబలి నొనర్చిన వాడీ దినములలో బలియై లేచిన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు.

స్తోత్రము. క్రీస్తులో రక్షణ మరుగు కాలేదు. అది సంసిద్ధమైయున్నది. రక్షింపబడితిరా! లేదా? మెసొపొతమియ లోనే మహిమగల దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమాయెనని అపొస్తలుల కార్యములు 7:2 చెప్పుచున్నది. కాబట్టి యెచ్చటో ఇరాక్కు చెందిన మెసొపొత మియలో ఏదెను వుండెనని నిశ్చయించి యింతమట్టుకే చెప్పగలము. వాదము సాగదు. ఇరాక్ దేశము నేటివరకున్నది. టైగ్రీస్ నది నేటివరకున్నది.

యూఫ్రటీస్ నది నేటికి పారుచున్నది. ఎక్కడో ఆ నదులు పుట్టిన తావులో ఏదెను తోట యుండెను. మించి చెప్పలేము. ఏదెను మరుగాయెను. ఏదెనులో ఆదాము హవ్వలను రక్షించినవాడు మరుగుకాలేదు.

క్రీస్తు బాల్యము

క్రీస్తు బాల్యము

ప్రశ్న:- క్రీస్తు యేసు పన్నెండేడ్లు మొదలుకొని ముఫ్పై యేండ్లవరకెక్క డుండెను? అది ఎందుకు వ్రాయబడలేదు, అప్పుడాయన ఇండియాకు వచ్చెనా?
జవాబు:- నాలుగు సువార్తలలో క్రీస్తు చేసి చెప్పినదంతయు వ్రాయబడెనా? వ్రాయబడ లేదెందుకు? (1) అంతయు వ్రాతకువస్తే నట్టి గ్రంథమునకు భూలోకమైనను చాలదు. (యోహాను 21:25). (2) వ్రాసినదానిలోనే యిప్పుడు మునుగుతును తేలుతును వున్నాము. ఈ నాలుగు సువార్తలుగల గ్రంథముచేత కాకుండగా దానికి మించి సవిస్తారముగా క్రీస్తు చరిత్రను వ్రాస్తే మనకు పట్టదు.

వ్రాసినవి యెందుకు వ్రాయబడెను? (1) వ్రాసిన వ్రాతలను పరికించి చూచి క్రీస్తు వాస్తవముగా దేవుని కుమారుడని నమ్ముటకొరకు వ్రాయబడినవి. (యోహాను 20:31). అంతేకాదు, (2) క్రీస్తు దేవుని కుమారుడని తెలిసికొనిన పిమ్మట వెంటనే యట్టి గొప్ప క్రీస్తునందు మృతులైన పాపాత్ములు విశ్వసించి నిత్యజీవము పొందతగినది. ఆలాగు నమ్మి పొందునట్లు వ్రాసినవి వ్రాయబడెను. (యోహాను 20:31). కాబట్టి ఫలానిది యెందుకాయన చరిత్రలో వ్రాయబడలేదంటే అది మనకు అవసరములేదని జవాబు తేలుచున్నది. నిత్యజీవార్థమై కావలసినవన్నియు వ్రాయబడినవి గనుక వ్రాతకు రాని సంగతులు మనకంతగా అవసరము లేదని స్పష్టము. బాలుడైన క్రీస్తు అనే అంశము మనకంతగా అక్కరలేదు.

అయినను కొన్ని సందర్భములుగా అయన బాల్యము వివరింపబడెను. లూకా 240 – బాలుడైన యేసు జ్ఞానముతో నిండుకొనుచు నెదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయనమీద నుండెనని చెప్పుచున్నది. అదే లూకా 2:21 లో ఎనిమిది దినముల వయస్సుగల శిశువైన క్రీస్తు సంగతి వ్రాయబడెనెందుకు? ఆ సంగతి మనకు పట్టినది. ఎందుకంటే ఆ శిశువు పాతవిధి చొప్పున ఆ యెనిమిదవనాడు సున్నతి పొందినదానిలో కేవలము క్రీస్తు దూతగా రాక హెబ్రీ 2:16 లో వ్రాసిన ప్రకారము యూదులకు మూలపురుషుడైన అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని వచ్చెను గనుక క్రీస్తు శరీరము మట్టుకు యూదుడే అని తేలినది. ఇది మనకు గ్రాహ్యము కావలసిన సంగతి కాబట్టి సున్నతి పొందిన అంశము 2:21-39 వరకు వివరముగానే వ్రాయబడియుండగా నెనిమిది దినముల వయస్సు మొదలుకొని

ఆయన పన్నెండవ యేటివరకు జరిగిన పన్నెండేండ్ల సంగతి ఈ 2:40 అనే యొక వచనములోనే వ్రాయబడినది. ఈ వ్యత్యాసమెందుకు? కొన్ని సందర్భములను వివరించుటలో పందొమ్మిది వచనములు పట్టెను. పన్నెండేండ్ల సంగతికి నొక వచనమే చాలినది. అవును. అక్కరలేనిదానిని వివరించక దాటి వెళ్ళినవాడు కావలసినవాటిని వివరించుటలో మిక్కిలి శ్రద్ధ వహించెను. ఆయనకు స్తోత్రములు. మరి యొకసారి లూకా సువార్తను పరీక్షించి 2:41 నుంచి 2:50 వరకు గమనించండి. ఆయన పన్నెండవయేట జరిగిన విశేషమైన ఆ దేవాలయ విషయము వివరముగా వ్రాయబడియున్నది. అందులో రెండు ముఖ్యమైన కార్యములు పైకి తేలుచున్నవి. 1) ఆయన ఆ బాల్య ప్రాయములోనే కనుపరచిన ప్రజ్ఞకును, దేవాలయములో నిచ్చిన ప్రత్యుత్తరములకును వినినవారందరును విస్మయమొందిరి (2:47).

బాలుడైన క్రీస్తు అప్పుడే ఆ పాత లేఖనములయందు ప్రవీణుడాయెనని తెలియుచున్నది. 2) అప్పుడు కూడ నా తండ్రి పరమందున్నవాడే గాని మరియ భర్తయైన యోసేపుకాడని యెరిగి యుండెను. వారాయనను వెదకుచు వచ్చి దేవాలయములో మూడవ నాడాయనను కనుగొంటే తల్లియైన మరియ నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటి మని చెప్పితే ఆమెను గద్దించినపుడు ఆ చిన్న వయస్సులోనున్న యేసు నేను నాతండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా? అనెను. చూచితిరా? నీ తండ్రి నా తండ్రి అనే శబ్దము లొకటితో నొకటి పెనుగులాడెను. ఇంతమట్టుకే పన్నెండేండ్లు యేసు సంగతి చెప్పబడెను. చాలును; ఎనిమిది దినములు మొదలుకొని పన్నెండేండ్లవరకు జరిగినదేమి? అది వ్రాయబడలేదా? వ్రాయబడినది. ఒక వచనమే. గంభీరముగా ఆ సంగతి లూకా 2:40 లో మనకు తెలుపబడుచున్నది. పన్నెండేండ్లు మొదలుకొని ముప్ఫైవరకు జరిగినదేమి? అది వ్రాయబడలేదా? వ్రాయబడినది.

దేవుని జ్ఞానములో రెండు వచనములే ఆ పద్దెనిమిది సంవత్సరముల చర్యకు సరిపోయెను. బాప్తిస్మము పొంది బహిరంగముగా సేవ చేయనారంభించినప్పుడు క్రీస్తుకు ముప్ఫైయేండ్ల యీడు కలిగియుండెనని స్పష్టముగా లూకా 3:23 లో నేర్చుకొనుచున్నాము. 2:41-50 లో ఆయన పన్నెండవయేటి చర్య మనకివ్వబడినది. 3:23 లో ఆయన ముప్పదియవ సంవత్సరము చెప్పబడినది. మధ్య ఆ పద్దెనిమిది సంవత్సరములలో జరిగినదేమి? లూకా 2:51,52 దీనికి సరియైన జవాబు.

తల్లిదండ్రులతో నజరేతుకు వెళ్ళిపోయి వారికి లోబడియుండెను. తరువాత జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ యందును, మనుష్యుల దయయందును వర్థిల్లుచుండెనని దివ్యముగా వ్రాయబడి యున్నది. అంతే చాలును. యింటి జీవితము సరిగానున్నది. తండ్రియని యెంచబడిన యోసేపుతోనైనను, తల్లిగారితో నైనను యెదురులేదు. దేవుని యెదుట సరిగానున్నాడు.

యోగ్యులైన మనుష్యులతో పేరు బాగున్నది. దేహముండెను గనుక దానికి తగినట్టు చర్య తీసికొని ఆయురారోగ్యమునకు భంగము కాకుండ ఆ దేహమును చూచుకొనుటచే వయస్సునందు పెంపొందుచు వచ్చెను. లేఖనములు గలవు వాటిని పరిశోధించుచు జ్ఞానమందు వర్థిల్లుచు వచ్చెను. ఆయన పద్దెనిమిది యేండ్ల చర్య యింతటితో మన కప్పగింపబడెను గాని వ్రాయబడిన ఈ క్లుప్త వివరణ చాలదా? చాలును. రక్షింపబడిన యువకులెట్లు ఆయా తమ రంగములలో ఆత్మీయముగాను, లౌకికముగాను వర్థిల్ల తగినదో నేర్చుకొనుటకా రెండు వచనములలో క్లుప్తమైనను అతి లోతైన భావముతో వ్రాయబడిన వాక్కులు మనకు సరిపోయినవి.

ఇంకొకటి మనము తెలిసికొన యోగ్యమైనది. అదేదనగా క్రీస్తు ముప్పదియేండ్ల చర్య యింత సంక్షేపముగా వ్రాయబడియుండగా ఆయన కడపటి మూడున్నర యేండ్లది సవిస్తారముగా లిఖింపబడె నెందుచేత? అవును, బహిరంగ సేవ సంబంధముగా ఆయన సత్ప్రవర్తనగా నడుచుకొనినది, బోధించినది, అద్భుతములు చేసినది, చనిపోయి లేచినది, లేచి ఆరోహణమైనది మున్నగు విషయములు ప్రాముఖ్యమైనందువలన వాటిమీదనే మన ముఖ్యగమనముండులాగున ప్రేమగల తండ్రి ఆ నలుగురు సువార్తికు లచే ఆ విశేషమైన సంగతులను శ్రద్ధవహించి మనకు వివరముగానే తెల్పెను. ఆలాగు చేయుట ఆయన కభీష్టమాయెను. ఆయన దివ్యనామము స్తుతింపబడుగాక.

శిశువైన యేసుతో మనకు పనిలేదా? ఉన్నది. కాబట్టి యెంతో అంతమట్టుకే వ్రాత యివ్వబడెను. బాలుడైన క్రీస్తుతో మనకు పనిలేదా? ఉన్నది గనుక దానికి తగిన వ్రాత అప్పగింప “బడెను, అయితే శిశువైన యేసుగాని బాలుడైన యేసుకాని మనకంతే అవసరమా? అవసరము లేదు. రక్షకుడైన యేసుతోనే మనకు నిమిత్తమున్నది. యౌవనస్థుడైన యేసుతో మనకంత అక్కరుంటే ఆ సంగతి వివరింపబడియుండెడిది. అక్కరలేదు. గనుక పన్నెండు మొదలుకొని ముప్ఫై యేండ్లవరకు జరిగినది యివ్వబడెను గాని యంత విశదముగా బయలుపర్చబడలేదు. బోధ పనిలో చేరి మన రక్షణకై ప్రాణము పెట్టి లేచేవరకు జరిగినది ముఖ్యము కాబట్టి ఆ వ్రాతలు విస్తారములు.

అంతేకాదు, ఇప్పుడు లోకమును జయించి మహిమలో ప్రవేశించి యుండే క్రీస్తు జనులకు గోచరము కావలెను. కాబట్టి సువార్తలు మాత్రము గాక పత్రికలను కూడ భక్తులు పఠించి ముందుకు సాగవలెను. క్రొత్త నిబంధనలో ఆఖరి భాగమునకు వచ్చి క్రీస్తు రాబోయే సంగతి సహితము తెలిసికొని నమ్మతగినది. వ్రాతలను నమ్మినదానితో కూడ వ్రాతకాధారమైన ఆయనను అంగీకరించి పైనుండి క్రొత్తగా జన్మించతగినది. కాబట్టి సందుగా కనబడిన ఆ పద్దెనిమిది యేండ్ల లోపల క్రీస్తు

ఇండియాకు వచ్చి వారి దగ్గర వీరిదగ్గర నేర్చుకొని మళ్ళీ పాలస్తీను వెళ్ళి బోధించెనని యైనను గనుక ఈ దేశములోని మహర్షులు చెప్పేది ఏమి క్రీస్తు చెప్పేది ఏమి అది యిది యొకటే యని నెవడైన సూచించినయెడల అట్టి బోధ సరియైనది కాదని యెరుగండి. క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడైయున్నాడు. ఆయనతో సాటి యెవరును లేరు. ఈ సాక్ష్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.

పద్దెనిమిది సంవత్సరముల చర్య కొద్ది వాక్కులతోనే వివరింపబడిన సంగతి బైబిల్లో వింతగా లేదు. నిర్గమ 2:10,11 చూడండి. 2:10 లో శిశువైన మోషే చెప్పబడెను గాని దాని ఆనుకొనియే 11వ వచనములో నలువదియేళ్ళుగల మోషే చూపబడుచున్నాడు. ఎందుకంటే మోషే పెద్దవాడై ఆ ఐగుప్తీయుని చంపినందుచేత పరుగెత్తి మిద్యానుకు వెళ్ళిపోయినది – ఆయన నలువదియవ యేట సంభవించెనని అపొ.కా. 7:23 ద్వారా తెలిసికొంటున్నాము. ఒక వచనములో నలువది యేళ్ళ చర్య వ్రాయబడియుండగా రెండు వచనములలో క్రీస్తుయేసు పద్దెనిమిది యేండ్ల వివరము సంక్షేపముగా వర్ణింపబడినది ప్రశ్న వేయతగినది కాదు. అక్కరకు వచ్చే సంగతులు బైబిల్లో నున్నవి. లేనివి అక్కరకు రాలేదని అర్థము.

అన్యాయపు సిరి

అన్యాయపు సిరి

ప్రశ్న:- లూకా 16:1-13 లో వ్రాసినదాని అర్థమేమి? యుక్తిగా మనము పనిచేసి క్రీస్తును సేవించగలమా? డబ్బుచేత స్నేహితులను సంపాదించుకొనవలెనా?

జవాబు :-
ఈ ఉపమానములో మనకు ధనవంతుని పేరివ్వబడలేదు గాని దృష్టాంతముగా ఫలాని ధనవంతుడు గలడని క్రీస్తు అనెను. అతనియొద్ద యొక గృహనిర్వాహకు డుండెను. అతడు చేయుచున్న అన్యాయము తేటగా వివరింపబడినది. వాడు తన యజమానుని ఆస్తిని పాడుచేయుచుండెనంటే దొంగలెక్కలు వ్రాసి తానే ఆ యజ మానుని సొమ్ము తినివేయుచుండెను. అచ్చియున్నవారెవరనగా యజమానుని దగ్గర సరుకు తీసుకొని వెళ్ళేవారు.

గోధుమలును, నూనెయు అమ్ముచున్నాడు గనుక చాలమంది అప్పుగా ధాన్యమును నూనెను తీసికొని వెళ్ళుచుండిరి. లెక్కలు వ్రాసే వాడేమో ఈ గృహ నిర్వాహకుడు. లెక్కలు తారుమారుచేయుచున్న వార్త యజమానుని చెవిని పడిన సంగతి ఈ దొంగవానికి వినవచ్చినది. తోడనే భీతితో నిండినవాడై నా పని పోతుంది గనుక నేనేమి చేతును? భిక్షమెత్త సిగ్గుపడుచున్నాననుకొనెను. అవును, ఇన్ని దినములు నెమ్మదిగా ఆ ధనవంతుని దగ్గిర పనిచేసేవాడు నిరుద్యోగియై జీవనము జరుపుకొన లేక వారి దగ్గిరను వీరి దగ్గిరను భిక్షమెత్తితే సిగ్గుకరముకాదా? నిండు సిగ్గుకరము గనుక అట్లు కూడదని ముందుగానే దీర్ఘాలోచన చేయుచున్నాడు. కూర్చుండి కూర్చుండి లెక్కలు చూచుకొనినవాడు కూలినాలి చేయగలడా? శక్తిచాలదు. కాబట్టి లోతుగా వీడు తలపోసుకొని తన గృహనిర్వాహకపు పని పోగానే అసహ్యముగా తోచిన భిక్షమెత్తుటగాని, చేతకాని కష్టమైన కూలినాలి గాని సంభవింపకుండ ముందుగానే వేరొక ఆలోచన పెట్టుకుని కార్యము సాధించెను.

ఇందులో యుక్తిగా నడుచుకొనెనని నష్టము పొందిన ఆ యజమానుడైనను దాసుని మెచ్చెను. దాసుడైనవాడు రక్షింపబడినవాడు కాడులెండి, యజమానుడు కూడను కేవలము లోకసంబంధియైన అవిశ్వాసియే. క్రీస్తుయైనను దేవుడైనను దాసుడు చూపిన యుక్తిని మెచ్చిరని అభ్యంతరపడకండి. ఆ సంగతి దీనిలో లేదు. వీరందరును రుణస్థులును 16:8 లో చెప్పినట్టు లోకసంబంధులే. మరి ఈ ప్రస్తుత యుగ కుమారులే. వారు రక్షణలేనివారైననూ వారిలో మెచ్చదగినది యున్నది. అదేది? క్రీస్తే చెప్పు చున్నాడు. వెలుగు సంబంధులకంటే లోకసంబంధులే యుక్తిమంతులైయున్నారు.

వారి దగ్గర రక్షింపబడిన మనము కొన్ని పాఠములను నేర్చుకొనగలము. పాము చెడ్డదే గాని చెడ్డదానిని నిదర్శనముగా పెట్టుకొని మంచివారు తెలివి తెచ్చుకొన గలరన్నట్టు క్రీస్తు పాములవలె వివేకులుగా నుండుడని తనవారికి చెప్పుచున్నాడు. (మత్తయి 10:16). రక్షణలేని వ్యాపారస్థులకు క్రీస్తు సువార్త చాటించే సువార్తికులైన వారిని సరిపోల్చండి, వ్యాపారస్థుడు చురుకుతనముగలవాడై సంతలో వేళకుండేటట్టు పెందలకడ లేచి చీకటితోనే ప్రయాణంచేస్తాడు.

సువార్తికుడైతే నిద్రామత్తుడై జనులు పనితీర్చి ఇండ్లకు వెళ్ళిపోవు సమయములోనే మహిమ గల సువార్తను ప్రకటించుటకు ఆలస్యముగానే పనిపెట్టుకొంటున్నాడు. వట్టి లాభానికి వస్తువులు అమ్మే కోమటి రక్షణలేనివాడైనను తన పనిలో మిక్కిలి యుక్తిగానే యున్నాడు, ఆసక్తితోనే పనిచేస్తాడు. గాని ఆయా వస్తువులకంటె మిక్కిలి ప్రియమై నిత్య పదవిని వర్ణించే గొప్ప పుస్తకములగు నట్టి బైబిళ్ళు అమ్మే కోల్పోర్టర్లయితే – నేనొకప్పుడు బెంగుళూరులో చూచినట్లే తమ పుస్తకాలు అరుగుమీద పెట్టి యెవరితోను ప్రస్తావింపక కొంతదూరంలో వెళ్ళి కూర్చుండి కాలహరణము చేస్తారు. ఏమి? పుస్తకాలు అవంతట అవే ఖర్చగునా?

లండన్లో నొకసారి కమ్యూనిస్టువారి గుంపు దగ్గర నిలుచుండి ప్రసంగముచేసే రీతిని నేర్చుకున్నాను. దేవుడు లేడను అంశము వద్దు, వారి సహవాసమే వద్దు, గాని వారిలో ఆ వేళ ప్రసంగించుచున్నవాని ధోరణి, అభినయములు, మాదిరి, వైఖరి, జనులనాకర్షించే విధానము మొదలైనవి నాకు కావలెను. నన్ను తన రక్తమిచ్చి కొనిన నాథుని ప్రస్తావించుటలో వారు చూపే యుక్తి, రక్షింపబడిన రీతిగా క్రీస్తుకొరకే నాకుండుగాకని ప్రార్థించితిని.

ప్రసంగీకులెందరో స్వరములేక అభినయము సరిగా లేక భాష రీతిలేక ఆకర్షణీయమునకు బదులుగా వినేవారిని అసహ్యపరచే కొన్ని పద్ధతులతో సమకూడి పనిచేయుచున్నారు. వారు చెప్పే క్రీస్తు అంశము సరే అది అందరికి కావలసిన నిత్యసువార్త గాని దాని ప్రచురించుటలో వారు లోకసంబంధులు చూపే నిపుణతలో చాల తక్కువ పడియున్నారు. గనుక రక్షింపబడినవారు రక్షింపబడని వారి దగ్గర కొన్ని పాఠములను నేర్చుకొనగలరు. రక్షింపబడినవారు రక్షణలేని లోకులతో కలిసి మెలిసి పాపపు పనులు కాదు- క్రీస్తును సేవించగల్గిన మంచి చురుకుతనమే మంచి పట్టుదలవంటి మాదిరియే పనిలో వారు చూపుచున్న ఉత్సాహమే వహించి తమ పక్షముకొరకు వారు దాల్చిన త్యాగమే మొదలైన అంశములను కనిపెట్టి క్రీస్తు కొరకు అవలంబించ గలరు.

స్వరాజ్య పోరాటములో నెందరో స్త్రీలుకూడ సాహసించి దేశానికి మిగుల శ్రమలకోర్చి దెబ్బలును చెరసాలలు అనుభవించి సేవచేసిరి. క్రీస్తు కొరకు మీరు త్యాగము చూపవద్దా? ఆ లోక సంబంధులకంటె క్రీస్తుకొరకు వెలుగు సంబంధులైన మీరు తక్కువగా పనిచేస్తారా? గత మహాయుద్ధములో వీరులు కను పరచిన ధైర్యసాహసములను గురించి ఆయా పత్రికలలో నేను చదువగా క్రీస్తు రాజు కొరకు నేను మెల్లగా యుద్ధమాడుచున్నదానికి శోకించితిని.

కాబట్టి లూకా 16:8 లో గొప్ప పాఠమున్నది. పాప నాశనకరమైన యుక్తి మన కందరికి తెలుసును. దానిలో పుట్టి పెరిగితిమి. గాని ఇప్పుడు రక్షింపబడిన యుక్తి కలదని తెలిసికొనవలెను. పౌలు కొరింథీయులకు వ్రాయుచు – యుక్తిగలవాడనై మిమ్మును తంత్రముచేత పట్టుకొంటిననెను. అవును, రక్షింపబడిన యుక్తి అవసరము. దీని అర్థమేమి? పౌలు అపోస్తలుడైనట్టు సువార్తలోనే జీవనము చేస్తూ కొరింథీ పట్టణమునకు వెళ్ళి సువార్త చెప్పియుంటే సరే గాని ఆలాగు వెళ్ళక యెవరికి భారముగా నుండకుండ డేరాలు కుట్టుచు సువార్తను ప్రకటించెను.

రక్షింపబడిన తంత్రమువంటి యుక్తి యిది. సర్వ సాధారణముగా 1 వ కొరింథీ 9:14 లో వ్రాసినట్లు సువార్త ప్రచురించువారు వేరేమి పనిలేక సువార్త పనిలోనే జీవింపవలెనని యున్నది. అయితే నిట్లు చేస్తే కొరింథీయులు నాకు దొరకరని పౌలు యుక్తిగా ప్రవర్తించి డేరాలు కుట్టుచు సువార్త చెప్పి వారిని పట్టుకొనెను.

దీనిలో మరొకటి యున్నది. ఆ మనస్సాక్షిలేని గృహనిర్వాహకుడు తన యజ మానుని లెక్కలు తగ్గించి మార్చి యొకనికి యాభై శాతము మరొకనికి నిరువై శాతము వారి లెక్కలను తగ్గించి వారి స్నేహమును లాగుకొనెనెందుకు? వారు తమ యిండ్లలోకి నన్ను చేర్చుకొనులాగున నిట్లు చేస్తానని ఆ తెలివిమంతుడు యుక్తిగా నడుచుకొనెను. (లూకా 16:4). రక్షించబడినవారు కష్టపడి క్రీస్తుకొరకే జనులను సంపాదించుకొన వలెను. కారణమేమి? 16:9 లో వ్రాసినట్లు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని యున్నది. దీని భావమేమి? మీరు మిమ్మును తగ్గించుకొని 1 వ కొరింథీ 9:22 లో వ్రాసిన మాదిరి క్రీస్తు నిమిత్తమై అందరికి అన్ని విధములైనవారైపోతే నట్టి కష్టస్థితిలో మీరు సువార్తద్వారా కనినవారే రాబోవు సమయములో క్రీస్తు వచ్చి నప్పుడాయన యెదుటనే మహిమలో మిమ్మును చేర్చుకొంటారు. మీరు క్రీస్తుకొరకు సంపాదించుకొని రక్షించినవారే పరమందు మీకు స్వాగతమిస్తారు.

పౌలు 1వ థెస్స 2:19,20 లో నేర్పుచున్న గొప్ప సత్యమిది. ఆ యుక్తిమంతుడు తమ యిండ్లలోకి నన్ను చేర్చుకొంటారేయని నమ్మి లెక్కలు పాడైపోయినను వారిని సంతోషపరచి యుక్తిగా నడుచుకొనెను. ఈ యిండ్లలో వద్దుగాని నిత్యనివాసములలో అనేకులు వచ్చి మిమ్మును వందించేలాగున దానియేలు 12:3 లో చెప్పుచున్నట్లు రక్షింపబడిన మీరు దీనిలో మేలుకొని యుక్తిగాను, దీర్ఘాలోచనగాను, విధేయతగాను ప్రవర్తించి క్రీస్తుకొరకు అనేకులను సంపాదించుకొండి.

చిన్న మాట మిగిలినది – అన్యాయపు సిరివలన మీరు స్నేహితులను సంపాదించు కొనుడని 16:9 లో నున్నదే దీని భావమేమి? పనిలో లంచాలు తిని ఆ అన్యాయమైన డబ్బు క్రీస్తుకొరకు ఖర్చుచేయమంటారా? అబ్బో అట్లు కూడదు. అన్యాయస్థులు దేవుని బిడ్డలు కానివారు (1 కొరింథీ 6:9). దీని అర్థమేమనగా సర్వసాధారణముగా సిరి అనేది అన్యాయమైనదే. అది చెడ్డదే. అది యురితో సమానమైనదే. 1వ తిమోతి 6:10 చెప్పుచున్నట్లు దీనిలోనే సమస్తమైన కీడులు సంభవించుచున్నవి. అసలు 1 వ పేతురు 5:2 లో అది దుర్లాభమని పిలువబడుచున్నది.

ఆంగ్లేయ బైబిల్లో “Filthy Lucre” అని వస్తున్నది. డబ్బు మైలగానే యున్నది. డబ్బు కీడుగానే యున్నది. అయితే గమనించండి, మైలగాను కీడుగాను ఆటంకముగాను అన్యాయముగాను వున్న ఆ వస్తువు రక్షింపబడినవాని చేతిలో రూపు మారి దేవుని సేవలో నుపయోగము కాగలదు. ఆ పదార్థము చెడ్డదే గాని దానిని ప్రతిష్ఠచేసి క్రీస్తు అన్నట్టు దానితో నిత్య నివాసములలో నుండబోయే స్నేహితులను సంపాదించుకొనవలెను, ఎట్లు? పది బైబిళ్ళు కొనండి; వాటిని కొన్నప్పుడు సొసైటి వారికి డబ్బు కట్టి ఆ పుస్తకాలు కొన వలెను.

అన్యాయపు సిరి ఖర్చాయెను. గాని ప్రార్థనాపూర్వకముగా ఆ బైబిళ్ళు యోగ్యు లైనవారి చేతిలో పెట్టితే జరుగునదేమి? వాటిని చదివినవారిలో ముగ్గురైన ఒక్కడైనను రక్షింపబడితే రాబోవు నిత్య నివాసములో నొకడు చేరినట్టు లెక్క. మీరు వ్యయపరచిన ఆ సొమ్మే పనికి వచ్చినదని లెక్క సువార్త యాత్రమీద వెళ్ళండి. ఖర్చుచేసి వెళ్ళండి లేదా వెళ్ళేవారికి తోడ్పడండి. లేదా కొన్ని సువార్త పత్రికలు సిద్ధముచేసి యచ్చొత్తించండి. వాటివలనను సువార్త యాత్రలో చెప్పబడిన వాక్యమువలనను రక్షింపబడినవారు ఖర్చుయైన ఆ సిరికే దొరికిరని యొక మాదిరిగా చెప్పనొప్పును. నా తెలుగు పత్రికలో గడచిన ఈ ముప్పై యేండ్లు వేలవేలకొలది రూపాయలు వ్యయపరచితిని. ఆ రూపా యలు అసలు అన్యాయపు సిరి, దాని అసలు పేరది. అయితే “క్రైస్తవ నిరీక్షణ”లో నున్న సువార్త వాక్యమువలన నెందరో దొరికిరి. ఆనాడు నన్ను మహిమలో చేర్చు కొంటారని నమ్మి సంతసించుచున్నాను.

కాబట్టి మీతో కూడా మీ రూకల సంచి రక్షింపబడి క్రీస్తు సేవకొరకు నుపయోగములోకి రావలెను. మీ సిరి మీది కాదు. అసలు మీరుకూడ మీవారు కారు. మీరు మీ సొత్తు కారు గనుక సంగతి తెలిసికొని 1 వ కొరింథీ 6:19, 20 అనుసరించి మీ దేహముతోను, మీ చేతికి వచ్చే సిరితోను క్రీస్తుకొరకు స్నేహితులను సంపాదించుకొనుడి.

ఇంటికి యిల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. ఎవరు అనేకులను (క్రీస్తువైపునకు) త్రిప్పుదురో వారు నక్షత్రములవలె నిరంతరమును ప్రకాశించెదరు. ఒకటి యెషయా 5:8 లో నున్నది. రెండవ వాక్యము దానియేలు 12:3 లో నున్నది. మీరు దేనియందు నిలిచెదరు?