Bible Study For Beginners

ఓ స్వేచ్ఛా ఖైదీ

ఓ స్వేచ్ఛా ఖైదీ

‘తన ప్రియమైన ఎలిజబెత్ బిడ్డను కోల్పోయిందన్న!’ వార్తను వినగానే పెద్దగా ఏడ్చాడు జాన్. “ఎటువంటి సందేహం లేదు! తాను చెరసాలలో ఉన్న విషయం ఎలిజబెత్ను బాగా కలవరపరచి ఉంటుంది. ఆమెలోని ఆ ఆందోళనే ఆమె గర్భస్రావానికి కారణం!” జాన్ రోదించాడు. వెంటనే జైలర్ను ఒంటరిగా కలుసుకొని తనను యింటికి వెళ్ళేందుకు అనుమతించమని అడిగాడు జాన్.

“ఇప్పుడుకూడ నీ పరిస్థితి తీవ్రంగానే ఉంది బన్యన్” – జైలర్ అన్నాడు – “జడ్జి కెలింజ్ యింకా నీపై కోపంగానే ఉన్నాడు. ఒకవేళ నీ పరిస్థితి అంత తీవ్రంగా లేకున్నా కూడ నిన్ను యింటికి పంపలేను. ఎందుకంటే లండన్లోని మతోన్మాదులు కొంతమందిని హత్య చేశారట. ఇంగ్లాండు చర్చి వ్యతిరేకులను ఎవరినీ బయటకు వెళ్ళేందుకు నేను అనుమతించను. కొంతకాలం ఆగు.”

జైలర్ను యిబ్బందులకు గురిచెయ్యడం జాన్కు యిష్టంలేదు. ‘తనెంత కాలం జైల్లో ఉండాలో, జైలర్వద్ద ఎంత ఉపకారం పొందాలో ఎవరికి తెలుసు? పగటి గదిలో తాను బైబిల్ చదువుకుంటున్నప్పుడూ, తను తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తు న్నప్పుడూ అతడు చూసీచూడనట్లు వెళుతున్నాడు.’ అయితే జాన్ హృదయం ఎలిజ బెత్ను గురించి రోదిస్తోంది.

“దేవా! దయచేసి మేరీ, నా సవతి తల్లి ఆనీలు ఆమెను ఓదార్చేట్లు చెయ్” అని జాన్ ప్రార్థించాడు.

ఏప్రిల్ నెల మొదటి వారంలో జాన్ పగటిగదిలో ఉన్నప్పుడు కోర్టు గుమాస్తా వచ్చాడు. విచారణ ముగిసి అప్పటికి మూడు నెలలయింది.

“బన్యన్, ఎలాగున్నావ్?” గుమస్తా అన్నాడు.

“వందనాలు. బాగున్నానండీ!”

“నువ్వు దేశ చట్టానికి విధేయుడవై, బహిరంగ సభలు నిర్వహించకుండా ఉండేందుకు యిష్టపడతావేమోనని కనుగొనేందుకు నేను యిక్కడకు పంపబడ్డాను. లేనిపక్షంలో రాబోయే త్రైమాసిక సమావేశాల్లో నిన్ను అమెరికా పంపడం జరుగుతుంది. లేదా యింకా దౌర్భాగ్యంగా యిక్కడే భూగృహాల్లో ఉండిపోతావ్.”

“అయ్యా! నన్ను జైల్లో పెట్టేందుకు ఉపయోగపడ్డ ఆ పాత చట్టం, చెడును బోధించే వారికోసం రూపింపబడినటువంటిది.”

“మతోన్మాదులుకూడ అదే అంటారు!” – సానుభూతిగా నవ్వాడు గుమస్తా – “బన్యన్! విను, నువ్వు దేవునిచే బోధించడానికే పిలువబడ్డావని నీవు తలంచే పక్షంలో, నువ్వు చేసే యీ బోధించే పని రహస్యంగా ఒక్కొక్కరికే బోధిస్తూ ఎందుకు చెయ్య కూడదు?”

“నేను నా బోధద్వారా ఒక్కరికి మంచి చెయ్యగలిగినప్పుడు, ఇద్దరికి నేనెందుకు చెయ్యకూడదు? అలా అలా …

“వందమందికి ఎందుకు చెయ్యకూడదు అంటావు. అంతేగదా? నువ్వు మంచే చేస్తున్నావని మాకెట్లా తెలుస్తుంది. నువ్వు చెడుకూడ చేస్తుండొచ్చు. అందుకనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్వారిచే రూపొందించబడిన ప్రత్యేక ప్రార్థనావిధానం అనుమతించ బడింది”.

“ఈ విషయాన్ని లేఖనాలే పరిష్కరించనీయ్!” సలహా యిచ్చాడు జాన్. విచారణ జరుగుచున్నప్పుడు జాన్ యేవిధంగా తన బైబిల్ పరిజ్ఞానంతో న్యాయమూర్తులను ఖంగుతినిపించాడో అది జ్ఞాపకం తెచ్చుకుంటూ తాను ఉచ్చులో పడబోతున్నట్టు పసిగట్టాడు గుమస్తా.

చివరకు జాన్ లొంగిపోడని నిర్ధారించుకొని నిరాశతో అతడు విరమిస్తూ – “వాళ్ళు చెప్పింది నిజమే బన్యన్, మన ఇంగ్లాండ్ అంతటిలో నీవంటి వాడు మరొకడు లేడు!” అని గొణుక్కుంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు గుమస్తా.

“ఏం జరిగింది బన్యన్?” తర్వాత అడిగాడు క్వాకర్.

“నేనింకా యిక్కడే ఉండబోతున్నాను నేస్తం.”

“ఏ విధంగానైతేనేం మనం యిక్కడినుండి బయటపడవచ్చు. మరో మూడు వారాల్లో చార్లెస్ పట్టాభిషిక్తుడు కానున్నట్లు నేను విన్నాను. అతడు తన దయాసూచకంగా చాలామంది ఖైదీలను విడుదల చేస్తాడు …

ఎలాగైనా ఎవ్వరైనాసరే ఎప్పుడూ ఖైదులో ఉండబోరు … ఎందుకంటే బ్రీడావద్ద అతని ఉద్దేశ్యపూర్వక ప్రకటన ….. అతని నిష్కాఠిన్య వాగ్దానాన్నిబట్టి .. …” – కటువుగా చెప్పుకుపోతున్నాడు క్వాకర్.

ఆ పట్టాభిషేకం రానూ వచ్చింది, పోనూ పోయింది. కొంతమంది ఖైదీలు విడుద లయ్యారు. కాని జాన్, క్వాకర్ మాత్రం విడుదల కాలేదు. తీవ్రమైన శిక్షానిర్వహణను తాత్కాలికంగా నిలుపుదల చేశారంతే! అతడు అమెరికాకు పంపబడటం లేదు. లేదా తీర్పు అమలుపర్చబోవడమూ లేదు.

ఈ లోపుగా అతణ్ణి పట్టించుకోకుండా మరచి పోయారు. తమ చావు తప్పదని జాన్ మరియు క్వాకర్ పరస్పరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు.

“ఇంగ్లాండ్ మొదటి చార్లెస్ రాజుతోసహా చాలామంది ఈ మరణశిక్షను అనుభవించడాన్ని మన జీవితకాలంలో మనం చూశాం” – క్వాకర్ అన్నాడు – “ఆ సమయంలో ధైర్యంగా చావడం తప్ప ఎవరూ చేయగలిగిందేమీ ఉండదు.”

ఆ చావునుగూర్చి జాన్ కాసేపు తనలోతాను ఊహించడం ప్రారంభించాడు ‘తాను ఒక నిచ్చెన నెక్కడం … మందంగా ఉన్న ఉచ్చుముడి తన మెడచుట్టూ బిగుసుకు పోవడం …” “చావునుండి ఒక వెంట్రుకవాసి దూరంలో కూడ వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నాను మిత్రమా.

దేవుడు నావైపు చూసినా చూడకపోయినా, కాపాడినా, కాపాడకపోయినా దేవుని వాక్యంకొరకు నిలబడటం నా బాధ్యత. మునిగినా తేలినా, మోక్షం వచ్చినా లేక నరకమే ప్రాప్తించినా, వధ్య స్థానంనుండి నిత్యత్వంలోనికి వెళ్ళడం మాత్రం ఖాయం. యేసయ్యా, నువ్వు నన్ను కాపాడదలచావా కాపాడు. లేదంటేకూడ నీ నామంలో నేను దీన్ని చేస్తాను.”

వసంతఋతువు ప్రారంభంలో జాన్ తన సమయాన్నంతా దాదాపు చెరసాలకూ, సిల్వర్ స్ట్రీట్్కూ మధ్యనున్న ఆవరణంలో గడుపుతూ వచ్చాడు. ఉదయాన్నే గడ్డి పరుపుమీదనుండి లేవడం, కాసేపు వళ్లు విదిలించుకోవడం, ఆ తర్వాత ఆవరణలోనికి వెళ్ళేందుకు అనుమతి పొందడం… యిదీ అతని మామూలు దినచర్య.

శీతాకాలమంతా పగటి సమయాన్ని పగటిగదిలో ఎండకు కూర్చోడంలోను, బైబిలు చదవడంలోను, ఖైదునుండి బయటపడే అవకాశాలనుగూర్చి యితర ఖైదీలతో చర్చించడంలోను, సలహా లివ్వడంలోను, బోధించడంలోను గడిపాడు. అప్పుడప్పుడూ వ్రాస్తుండేవాడు. ఇప్పుడు వ్రాయడంలో తీరికలేకుండా తన సమయాన్ని గడపడం ప్రారంభించాడు.

రోజూ జైల్లో పెట్టే సామాన్యమైన భోజనం తినడానికి మాత్రమే వ్రాయడం ఆపేవాడు. ఎప్పుడైనా ఎలిజబెత్ క్యాబేజి, కంద లేదా క్యారెట్ల పులుసు జైలరుద్వారా పంపేది. దానితో జాన్ విందు చేసుకొనేవాడు. మిగతా సమయాల్లో వ్రాసుకుంటూ ఉండేవాడు.

స్టెర్న్హోల్డ్ మరియు హోప్కిన్స్లు వ్రాసిన పాటల పుస్తకంనుండి జాన్ కీర్తనలు పాడుకొనేవాడు. అవి దేవాలయాల్లోనూ, సైన్యం కవాతుచేసే సందర్భంలోనూ ఆలపించ బడేవి. ఈ పాటల కవిత్వం నాలుగు పాదాల వాక్యాలతో వ్రాయబడినవి. ఎలాంటి ఉత్సాహం లేకుండా నిర్లిప్తంగా ఉన్న జానన్ను ఈ పాటలు ఒక్కసారిగా మేల్కొల్పాయి.

మేరీతో కలిసి తాను “పరలోకానికి సామాన్యుని కాలిబాట” (The Plain Man’s Pathway to Heaven) అన్న గ్రంథాన్ని చదివినప్పటినుండి అలాంటిదే ఒకటి వ్రాయాలని జాన్ ఆశించేవాడు. ఒక కథను చక్కగా సృష్టించగల నేర్పరితనం దేవుడు తనకిచ్చాడు.

ఒక క్రొత్త పంథాలో అలాంటి రచనలు చేయాలని జాన్ నిర్ణయించు కొన్నాడు. అంతే! అతని మెదడు సంభాషణలతో నాట్యం చేయడానికి ఎంతో కాలం పట్టలేదు. క్రీస్తుకూ పాపికీ మధ్య జరిగిన ఒక సంభాషణను అతడిలా వ్రాశాడు :

నీ దయను ప్రభూ అంగీకరిస్తాను నేను దాన్ని నాదానిగా నీ కృప ఉచితమనీ, నీ వాక్కు యిలా చెబుతోందనీ నేనంగీకరిస్తా నీవైపు మళ్ళీ మళ్ళీ నే మరలివస్తా నా మరణ సమయమప్పుడు ప్రభూ నే భయపడనుగాని నీ ప్రేమనే నేను గాఢంగా హత్తుకొంటా … పాపంలో ఉన్నప్పటికీ యింకా నీ ప్రేమలోనే నేనున్నా ఇంకా ప్రాపంచిక బంధాలను నే విడువనప్పటికీ పరమునకు నను చేర్చగలిగేవి నా క్రియలు కాదుగాని కేవలం నీ కృపయే ప్రభూ…

వచనం తర్వాత వచనం జాన్ యిలా వ్రాసుకు వెళుతున్నాడు. చివరగా తన వ్రాత ప్రతిని క్వాకర్కు చూపించాడు. “దీన్ని చదివి నీ అభిప్రాయం తెలుపు మిత్రమా.”

చదవాల్సిందేముంటుంది బన్యన్. నీకూ మా క్వాకర్లకూ నీ రచనలతోనేగదా పోట్లాటలు!” – కాని అతడు బన్యన్ వ్రాసిన కవిత చదివి చాలా ఆనందించాడు – “చాలా బాగుంది మిత్రమా. నీవు దీన్ని తప్పక ప్రచురించాలి.”.

“మన దేశంలో యిప్పుడు దేన్నీ ప్రచురించలేము. ఇక లండన్, ఆక్స్ఫర్డ్, క్రేంబిడ్జిలకు వెలుపల ప్రచురించడమంటే దాదాపు అసాధ్యమైన విషయం.”

“కాని ఫ్రాన్సిస్ స్మిత్ అని లండన్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి దీన్ని చేస్తాడు” క్వాకర్ అన్నాడు.

“ఫ్రాన్సిస్ స్మిత్ వ్రాసిన కొన్ని రచనలు నేను చదివాను. అతనిప్పుడు జైల్లో ఉన్నాడని నేననుకొంటున్నాను.”

“లేదు, జైల్లో లేనట్లే!”

“కాని నేను జైల్లో ఉన్నానుకదా మిత్రమా. నేనతని దగ్గరకు ఎలా వెళ్ళగలను?”

“నీవిక ఎప్పుడూ జైల్లోనే ఉంటావా ఏంటి? విడుదలై బయటికి వెళ్ళవూ?”

కాని జాన్ విడుదల పొందలేదు. వచ్చే ఆగస్టు నెలలో జరిగే త్రైమాసిక సమావేశాల్లో తన కేసు తిరిగి విచారణకు వచ్చేందుకు జాన్ ప్రయత్నం చేస్తున్నాడు. తన కేసు పునర్విచారణకు వచ్చినట్టయితే, తాను అన్యాయంగా నేరారోపణకు గురయ్యానని న్యాయమూర్తులను తప్పక ఒప్పించగలడు.

తాను ఈ నేరారోపణమీద ఏమైనా పోరాడదలచుకున్నాడా అని కోర్టు గుమస్తా మామూలు ధోరణిలో అడిగాడు. తాను తప్పక పోరాడతానని జాన్ బదులిచ్చాడు. కాని న్యాయవిచారణ సమావేశాలు సమీపించినప్పుడు విచారణ పట్టీలో తన పేరు లేదని జాన్కు తెలిసింది.

సమావేశాలు జరుగుతున్న రోజుల్లో ఒక రాత్రి హఠాత్తుగా జైలరు అతణ్ణి తన గదిలోంచి బయటికి తీసుకొనివచ్చి పగటిగది మీదుగా ప్రక్క గదిలోనికి నడిపించి చిమ్మచీకట్లోకి మెల్లగా త్రోశాడు. జాన్ చెరసాల బయటున్నాడు.

ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో వర్తకులు ప్రధాన వీధిలో మైనపు వత్తులు వెలిగిస్తే తప్ప బెడ్ఫోర్డ్ వీధులు రాత్రిళ్ళలో వెన్నెల వెలుగులో ఉండాలి, లేదంటే చీకట్లో ఉండాలి. కొన్ని నిమిషాల్లో జాన్ తన కుటుంబంతో ఉన్నాడు.

“ఈ రాత్రి అతడు నన్ను బయటకు పంపడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” – ఎలిజబెత్తో అన్నాడు జాన్.

“బహుశా నువ్వు నా కథ వినాలని కాబోలు అలా పంపి ఉంటాడు.”

“నీ కథా?”

“అవును, ఈ రోజు సమావేశం జరుగక మునుపు జడ్జీలను వాళ్ళ చాంబర్లలో నేను కలిశాను.”

“అలా చేశావా?”

“ఓహ్, ఆ అధికారులముందు నేనెంత వణికిపోయాననుకున్నావ్! అక్కడున్న జడ్జీలలో మాథ్యూ హేల్ అనే జడ్జిగారు చాలా మంచి మనిషి. సరైన విన్నపాలను తప్పక వింటాడని తెలిసింది.”

“మరి నీ విన్నపం విన్నాడా?”

“లేదు, కాని చాలా విచారపడ్డాడు. ”

తర్వాత జైల్లో జాన్ విన్నదేమంటే … ఎలిజబెత్ జడ్జీలవద్దకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిందట. చాలా తీవ్రంగా తన ప్రయత్నాలను కొనసాగించింది. వాళ్ళను చితక బాదినంత పనిచేసింది. ఆమెనుగూర్చి జాన్ చాలా గర్వించాడు. మొండి పట్టుదలగల బన్యన్ కుటుంబీకులవలన యీ జడ్జీలకు దాదాపు కంటిమీద కునుకు కరువయ్యింది!

జైలరు అప్పుడప్పుడు జాన్ను బైటకు పంపుతుండేవాడు. జాన్ కొన్ని పర్యాయాలు ఫ్రీ చర్చికికూడ వెళ్ళాడు. కాని అదిప్పుడు రహస్యంగా సమావేశమౌతోంది. వాళ్ళ కూడికలు పొలాల్లోనూ, ధాన్యాగారాల్లోనూ, తోటల్లోనూ జరుగుతూ ఉన్నాయి.

చివరకు జాన్ తన వ్రాతప్రతులను లండన్లోని స్మిత్వద్దకు తీసుకెళ్ళాడు. స్మిత్ సంవత్సరానికి రెండు మూడుసార్లు జైలుకు వెళుతున్నప్పటికీ జాన్ వెళ్ళిన సమయంలో అదృష్టవశాత్తు ఆయన లండన్లోనే ఉన్నాడు.

జాన్ వ్రాసిన ‘లాభకరమైన ధ్యానాలు’ (Profitable Meditations) అన్న శీర్షికగల వ్రాతప్రతిని అతడు తీసుకున్నాడు. అయితే జాన్ బెడ్ఫోర్డుకు తిరిగి వెళ్ళే సమయానికి అక్కడి పరిస్థితులు బాగుండలేదు. అతడు జైలునుండి బయటకు వెళ్ళిన ఐదురోజుల గైరు హాజరును జైలర్ రహస్యంగా ఉంచలేకపోయాడు.

“నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళడానికి నేను నీకిచ్చిన వ్యవధిని మరీ ఎక్కువగా ఉపయోగించుకున్నావు బన్యన్” – అతనికిచ్చిన ఆధిక్యతను దుర్వినియోగం చేసినందుకు జైలరు జాన్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు.

“మీరు నన్ను బయటకు పంపినందున మీకు దేవుని ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి” సమాధానమిచ్చాడు జాన్.

జాను భవిష్యత్తు దుర్భరంగా గోచరించింది. అతనికి ఇంటి ధ్యాస ఎక్కువైంది. అతడు తన కుటుంబాన్ని పదేపదే జ్ఞాపకం చేసుకోసాగాడు. అంధురాలైన మేరీకి యిప్పుడు పదకొండు సంవత్సరాలు.

ఇప్పుడామె బొద్దుగా ఉండే చిన్నపిల్ల కాదు, అందమైన రెల్లులాంటి యువతి. బెట్సీకి యిప్పుడు ఏడు సంవత్సరాలు. తెలివిగా, మేరీలా కాకుండ తన వయస్సుకు తగినట్లుగా నడుస్తుండేది. జానీకి ఐదు సంవత్సరాలు. మూడు సంవత్సరాల థామస్లో విధేయతతోబాటు పోకిరిచేష్టలుకూడా ఉన్నాయి.

వారాలు గడుస్తున్నాయ్. జాన్ ఏమీ వ్రాయనప్పుడు లేదా ఖైదీలకు సలహాలివ్వ నప్పుడు లేసులు ముడివేసే పని చేస్తుండేవాడు. ఇది బెడ్ఫోర్డులో మంచి పరిశ్రమ. కాని కొద్దిమంది మాత్రమే ఈ పని చేయడానికి యిష్టపడేవారు. జాన్ వీటిని వేలల్లో ముడివేసేవాడు. అతని సంపాదన ఎలిజబెత్కు పంపించబడుతూ ఉండేది. ఇప్పుడతడు జైల్లో ఉండి సంవత్సరమయింది.

రెండో సంవత్సరంలో జాన్ ఒక పాత కుర్చీ కాలుతో ఒక పిల్లనగ్రోవిని తయారు చేశాడు. అతనికి సంగీతమన్నా, నాట్యమన్నా, పాటలు పాడటమన్నా ఎంతో యిష్టం. ఇప్పుడతడు తనకుతానే వాయిద్యం వాయించడం నేర్చుకున్నాడు.

తన మోటు సంగీతం విన్న ఖైదీలు తనను ఎగతాళి చేస్తుంటే తాను దూరంగా జైలు ఆవరణంలోని ఒక మూలకు వెళ్ళి సాధన చేస్తుండేవాడు. త్వరలోనే వాళ్ళు గోలచేయడం ఆపి అతనితో బాటు తీయని రాగాలు తీయడం ప్రారంభించారు. దేవుడు జాన్పట్ల ఎంతో కృప చూపించాడు. తనలో అనంతమైన వరాలు ఉన్నట్లనిపించింది జానుకు.

జాన్ వ్రాయడం కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడు తన కవిత్వాన్ని మెరుగుపరచు కోవడంతోబాటు విస్తృతంగా వేదాంతం వ్రాయసాగాడు. రెండవ అంతస్తులోని పగటి గది ప్రార్థనా మందిరంగా అతనికి ఉపయోగపడేది.

ప్రసంగాలలో, రచనలలో అతడు నిమగ్నమయ్యాడు. తాను ఎంతో కొంత దీవించబడినట్టుగా జాన్ భావించాడు. అతణ్ణి జైల్లో ఉంచడమంటే అతని రచనా వ్యాసంగాన్ని మెరుగుపరచడమేనన్నమాట. చివరికి క్వాకరుకూడ అతని రచనలు చాలా బావున్నాయని అంగీకరించాడు.

1663 నాటికి జాన్ కవిత్వాన్ని చాలా రమ్యంగా వ్రాయసాగాడు. అతడు యింత వరకు నాల్గు . పాదాల ప్రక్రియలోనే వ్రాస్తూవచ్చాడు. అయితే యిప్పుడు పంచలయాన్విత మైన అసమపాద కవిత్వాన్ని మించి వ్రాయడానికి అతడు సాహసించాడు.

ఈ ప్రక్రియ పాడేందుకు అనువైందే గాని వినడానికి ధడేలుమనే శబ్దాలతో చెవులకు రసహీనంగా ఉంది. ‘చెఱ ధ్యానాలు’ (Prison Meditations) అని పిలవనున్న పుస్తకంలో చెరసాలలో విచిత్రమైన తన స్వాతంత్ర్యాన్నిగూర్చి అతడు యిలా వ్రాశాడు:

మనుష్యులు నా బాహ్య పురుషుణ్ణి వాళ్ళ గడులతో, ఊచలతో బంధించినా క్రీస్తునందలి విశ్వాసంతో నేను చుక్కలకన్నా పైకెక్కగలను. ఇక్కడ నాలో నివసిస్తోంది మంచి మనసాక్షి మది నిండా చల్లని ప్రశాంతికూడా ఇక్కడ నే సంకెళ్ళతో బంధింపబడివున్నా, ప్రతి అపరాధ భావననుండీ స్వేచ్ఛననుభవిస్తున్నా.

ఇక్కడ నేనూ, సత్యం ఒకటిగా బంధింపబడ్డాం, ఇలాగే చిరకాలం ఒకటిగా బంధింపబడే ఉంటాం; చేయీ చేయీ పట్టుకొని చిరకాలం నడుస్తాం, ఇది ముమ్మాటికీ సత్యం – ఇది ఎన్నటికీ వాస్తవం.

తనను ఖైదీగా బంధించినవారిని జాన్ ఎంతగా ద్వేషిస్తాడోనన్న సందేహం ఎవరికీ ఉండనక్కరలేదు. చివరకు అతని క్వాకర్ స్నేహితుడుకూడ జాన్ కవితల్ని చదువు ‘తుండగా తెల్లబోయాడు.

మంచివాళ్ళు శ్రమపడతారు దేవునికోసం చెడ్డవాళ్ళు మండిపడతారు వాళ్ళను చూసి … ఇక్కడ మనంకూడా చూస్తాం గిరగిరా తిరిగేవాళ్ళను గాలికోళ్ళలాగ ఎటు గాలి వేస్తే అటు … రాజకీయ నాయకులు చెబుతారెన్నో మాటలు స్థానాలకోసం లోకవాంఛలకోసం బాహ్యంగా కనిపిస్తారు ఎంతో బుద్ధిమంతుల్లా లోలోపల వాళ్ళెంతో కపట సహోదరులే

ఆ తర్వాతి సంవత్సరాల్లో అతడు ఐదు వేదాంత గ్రంథాలనూ, రెండు పద్య కావ్యాలనూ వ్రాశాడు. అయితే అతడు 1665 లో వ్రాసిన “కృపాసమృద్ధి (Grace Abounding) అనే గ్రంథం క్వాకర్ అభిప్రాయం ప్రకారం అన్ని గ్రంథాల్లో ఉత్తమ మైనది.

అది జాన్ వ్యక్తిగత ఆత్మీయ జీవిత చరిత్ర. అందులో అతని ఐదు సంవత్సరాల శ్రమలు, అంతకుముందు సంవత్సరాల చరిత్రకూడ వివరించబడ్డాయి. పాస్టర్ గిఫర్డ్ రి సలహాలను గుర్తుంచుకొనడం జాన్కు తేలికే.

యుద్ధంలో తన సేవల్ని జాన్ ప్రస్తావించ లేదు. రాచరికవాదులు యిప్పుడు అధికారంలో ఉన్నారు. యుద్ధాన్నిగూర్చిన ఏ ప్రస్తావనైనా జడ్జీల నిర్ణయం విషయంలో తనకు కీడు కలిగించవచ్చు.

“బహుశ రాబోయే కాలంలో మరికొన్ని వివరాలను నేను జోడించవచ్చు. ఇప్పుడవి వ్రాయడం సాధ్యంకాదు” – క్వాకర్తో జాన్ అన్నాడు.

“బన్యన్, నీవెప్పుడూ అధైర్యపడలేదా?”

“నేను అదే మాట నిన్ను అడుగుతున్నా. అయితే క్రీస్తు మనకు ఆదరణ అని మనిద్దరికీ తెలుసు. ఏ మనుష్యుడు క్రీస్తునందుంటే అతడు బానిసకాదు, ఖైదీ కాదు. క్రీస్తులో ఉండటమంటే స్వేచ్ఛగా ఉండటమే.”

కాని జాను తెలుసు, తాను పరిపూర్ణతకు దూరంగా ఉన్నానని. క్రీస్తుతో ఒడం బడిక చేసుకొన్నవాడు తన ఆత్మీయ దుస్థితిని గూర్చిన ఎరుక తప్పక కలిగివుంటాడు. ప్రతివాడూ దేవునితో ఎల్లప్పుడూ అత్యంత నిజాయితీని కలిగివుండాలి. “కృపాసమృద్ధి” పుస్తకం చివరిలో జాన్ తనలో యింకా ఊగిసలాడే సప్తవ్యసనాలను ఒక జాబితాగా రూపొందించాడు :

  1. అవిశ్వాసం వైపు తాను మొగ్గు చూపడం.
  2. క్రీస్తు బయలుపరచే కృపాప్రేమలను తాను హఠాత్తుగా మరచిపోవడం.
  3. ధర్మశాస్త్రసంబంధమైన క్రియలవైపు తాను మరలడం.
  4. ప్రార్థనలో తాను చల్లారిపోవడం.
  5. తానేం ప్రార్థన చేస్తాడో దాన్ని గమనించడాన్ని మరచిపోవడం.
  6. లేనివాటినిగురించి సణగటం, ఉన్నవాటిని గురించి నిందించటం.
  7. పరి. పౌలు రోమా 7:21 లో చెప్పినట్టు; కాబట్టి మేలు చేయగోరు
    తనకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము తనలో కనబడుట.

అయినప్పటికీ అంతములేని యీ భావోద్వేగాలకు దైవోద్దేశం ఏదో తప్పక ఉండి ఉంటుందని జాన్ అంగీకరించవలసి వచ్చింది. అవి పైకి వ్యతిరేకంగా కనిపించినా కొన్ని మంచి లక్షణాలను కలుగజేయడానికి సహాయపడ్డాయని అతడు వాటినో జాబితాగా రూపొందించాడు :

  1. అవి నన్ను నేను అసహ్యించుకొనేట్లు చేశాయి.
  2. అవి నా హృదయాన్ని నేను నమ్మకుండునట్లు చేశాయి.
  3. నా అంతరంగంలోని నీతివర్తన చాలినంతలేదని అవి నన్ను ఒప్పించాయి.
  4. యేసువద్దకు పరుగెత్తి వెళ్ళవలసిన ఆవశ్యకతను అవి నాకు చూపించాయి.
  5. అవి నన్ను దేవుని ప్రార్థించునట్లు బలవంతం చేశాయి.
  6. జాగరూకత, మెలకువ కలిగి ఉండవలసిన అవసరతను అవి నాకు చూపించాయి.
  7. అవి నన్ను క్రీస్తుద్వారా దేవుని ప్రార్థించేందుకు పురికొల్పి, తద్వారా ఆయన సహాయం పొంది లోకంలో మనుగడ సాగించడానికి తోడ్పడతాయి.

“కృపాసమృద్ధి” వ్రాతప్రతిని లండన్లో ఫ్రాన్సిస్ స్మిత్ అనే ఓ విప్లవ ముద్రికుని వద్దకు తీసుకెళ్ళాడు జాన్ స్నేహితుడు. స్మిత్ దాన్ని తీసుకోవడానికి తిరస్కరించాడు. అతడు అలా చెయ్యడానికి కారణం సానుభూతిలేక కాదుగాని, తన ముద్రణాలయంమీద దాడి జరిగి తాను శిక్షకు గురౌతానేమోనన్న భయంచేతనే! జార్జ్ లార్కిన్ అనే యువకుడు దాన్ని ముద్రించాడు.

కాని అది చాలా పేలవంగా ముద్రితమయ్యింది. అయితే అప్పటికే జాన్ తన మనస్సులో దాన్నిగూర్చి పునరాలోచన చేస్తున్నాడు. “ఏదో ఒక రోజు తన తప్పులు దిద్దిన గ్రంథాన్ని ఫ్రాన్సిస్ స్మిత్ ముద్రించకపోతాడా!” అనుకున్నాడు జాన్.

జాన్ సిల్వర్ స్ట్రీట్లో ఉన్న తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు చువ్వల కిటికీ దగ్గరకు వెళ్ళినప్పుడు అతడు ఒక పెద్ద కుటుంబాన్ని చూశాడు. అంధురాలైన మేరీకి యిప్పుడు పదిహేను సంవత్సరాలు. బెట్సీ, జానీ, థామస్ లు వరుసగా పదకొండు, తొమ్మిది, ఏడు సంవత్సరాలవాళ్ళు. పిల్లలు అశాంతిగా ఉన్నారు.

ఈ నాలుగు సంవత్స రాల్లో పిల్లలు తమ తండ్రిని కౌగలించుకోలేదు. వారికి జాన్ ఎప్పటికీ ఖైదులోనే ఉంటాడనిపించినట్లుంది. జాన్ ఊచలను పట్టుకొనకుండ ప్రక్కకు తొలిగాడు. ఒకసారి ఎలిజబెత్ ఇలా అన్నది – అతడలా ఊచలను గట్టిగా నిస్సహాయంగా పట్టుకొనివుంటే తన గుండె తరుక్కుపోయిందని, ఎలిజబెత్ తన ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుకంటే యింకా ఎంతో పెద్దదిగా కనిపిస్తోంది.

ఏం, ఎందుకు కనిపించదు? తండ్రిలేని కుటుంబం, అందులో నలుగురు పిల్లలు ఆమెమీద భారంగా ఉన్నారు. అందునా ఇద్దరు చిన్న అబ్బాయిలు రోజంతా రాచి రంపాన పెట్టే వయసున్నవాళ్ళు.

“నువ్వు చాలా విచారంగా కనబడుతున్నావు ఎలిజబెత్” – 1665 మే నెలలో కొన్ని వారాలు గడిచిన తర్వాత జాన్ తన కిటికీవద్ద నిలువబడి దుఃఖంగా అన్నాడు.

“లండన్ నుండి విషాదవార్త బన్యన్” అంతే విచారంతో ఆవిడ అంది.

“డవ్వాళ్ళతో యుద్ధం భయంకరంగా ఉందా?”

“ప్లేగు వ్యాధి” – ఆమె భుజాలు ఎగురవేస్తూ నిస్సహాయంగా అంది.

ప్లేగు! కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రపంచాన్ని తుడిచివేసిన యీ ప్లేగు వ్యాధి ప్రతిసారీ బహిర్గతమౌతోంది. చరిత్రలో యిది పునరావృతమైతే దీని వినాశనాన్ని గూర్చి ప్రజలెంత భయపడిపోతారో! అంతేగాక ప్రతి సంవత్సరం ఇంగ్లాండులో ఎక్కడో ఒకచోట యిది బహిర్గతమౌతూనే ఉంది. అయితే సాధారణంగా యిది డజన్లకొద్దీ ప్రజల ప్రాణాలనుమాత్రమే దహించి, ఆ తర్వాత విచిత్రంగా క్రమేణా మరుగైపోతోంది.

జాన్ కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత, యీ సంభాషణంతా విన్న ఓ పెద్దాయన ఇలా అన్నాడు, “ఇతరులను అంటిపెట్టుకోవడం చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ ఒక జైలరో, ఒక కాపలాదారో లేదా ఖైదీయో ఏదో ఒక విధంగా మన మధ్యకు ప్లేగును తెస్తే, అది నిప్పులా మన జైలునంతా తుడిచివేస్తుంది.”

“ఏంటది?” అడిగాడు క్వాకర్. ఇతడు అనుభవజ్ఞుడైన ఖైదీగా క్రొత్త విషయా లేమిటో చాకచక్యంగా పసిగట్టగల నైపుణ్యంగల వ్యక్తి.

“ప్లేగు” జాన్ అన్నాడు.

“ఇక్కడ బెడ్ఫోర్డులోనా?”

“ఇంకా లేదులే. లండన్లో వ్యాపిస్తోంది.”

“చాలా రోజులుగా నాకేం బాగుండడం లేదు” – క్వాకర్ ఆందోళనగా అన్నాడు.

“కాస్త తమాయించుకో మిత్రమా” – జాన్ అన్నాడు – “బాగా లేకపోవడం ఒక విధంగా ప్లేగు వ్యాధి లక్షణమేననుకో, అయినా దానికి ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి. తల నొప్పి, కడుపులో వికారం, వాంతులు, కీళ్ళ నొప్పులు .

“నువ్వు చెప్పింది నిజమే బన్యన్” – వయస్సు మళ్ళిన ఒక ఖైదీ అన్నాడు – “ఇది 1636 లో ప్రబలినప్పుడు నేను లండన్లో ఉన్నాను. వ్యాధిబారినపడ్డవాడికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అయితే ప్లేగు వచ్చిందనడానికి తిరుగులేని లక్షణం బాగా నొప్పిపుట్టే గడ్డలు కోడి గ్రుడ్డంత పరిమాణంలో గజ్జల్లోనో, చంకల క్రిందో, లేదా మెడమీదనో లేస్తాయి” అని చెప్పి క్వాకర్వైపు చూసి ఇలా అన్నాడు – “ఏంటి మిత్రమా నీకలాంటివేమైనా … ?”

“దేవునికి స్తోత్రం, నాకలాంటి గడ్డలేం లేవు.”

“ఈ మహమ్మారి చాలా తీవ్రంగా ప్రబలుతుంది. దాన్నిగురించి పెద్దగా చర్చిం చాల్సిన పనిలేదు. నాలుగు రోజుల్లో మీరంతా సమాధి గొయ్యిలోనికి పోయేవాళ్ళే” – నిట్టూర్చుతూ అన్నాడు ఆ పెద్దాయన.

“తప్పకుండా కొంత కోలుకోవడం ఉంటుందిలే” – ధృడంగా అన్నాడు క్వాకర్ . “దేవునికి ఏదైనా సాధ్యమే.”

“ప్రతి ముగ్గురికీ ఒకరు కోలుకుంటారు” – పెద్దాయన అన్నాడు – “ఒక్క వారం తట్టుకున్నారంటే మీరు కోలుకున్నట్టే.”

లండన్లో ప్లేగును గూర్చిన పుకార్లు ఎక్కువయ్యాయి. జూన్ నెల మధ్యకల్లా వారాంతపు మరణాల సంఖ్య వందకన్నా ఎక్కువగానే ఉన్నాయి. వ్యాధి తగ్గేవరకు గృహాలు వెలివేయబడ్డట్టు ప్రత్యేకంగా ఉంచబడ్డాయి. తలుపుమీద “రెడ్ క్రాస్” గుర్తు వేయబడింది. చాలామంది బిగ్గరగా ప్రార్థిస్తున్నారు: “ప్రభూ, మాపై దయచూపు!”

జూన్ చివరికల్లా జైలర్ ముప్పయ్మంది ఖైదీలను ఒక పగటి గదిలోనికి పిలిపించాడు – “స్నేహితుల్లారా, గతవారం లండన్లో మరణాల సంఖ్య రెండువందలకు మించిపోయింది. ధనవంతులు పల్లె ప్రాంతాలకు వలసపోతున్నారు.

కొంతమంది యిక్కడకు రావచ్చు. కొద్దిమందికి ప్లేగువ్యాధి ఉండి ఉండవచ్చు. అది తెలుసుకోవడానికి నేనెవర్ని? అయితే నాకు తెలిసిందేమిటంటే మనందరికీ ఈ వ్యాధి సోకేవరకు దానికోసం ఎదురుచూస్తూ మనం యిక్కడే మూటగా పడివుండలేం”.

“అసలు విషయానికి రండి!” – భయపడ్డ ఓ ఖైదీ వెంటనే అన్నాడు.

“మీరు మీ యిండ్లకు వెళ్ళవచ్చు. నేను కోరుకునేది … మీరు మీ యిళ్ళకు వెళ్ళాక వీధుల్లోకి వెళ్ళకుండా మీమీ యిళ్ళలోనే ఉండేట్లు చూసుకోండి. మీరు మళ్ళా యిక్కడకు రావలసిన అవసరం లేదు. అర్థమయిందా? మన స్నేహితుడు బన్యన్ యీ సమయంలో లండన్కు దూరంగా ఉండాలని వేరే హెచ్చరించాల్సిన పనిలేదనుకుంటాను.”

అలా జాన్తోసహా ఖైదీలంతా తమ తమ యిళ్ళకు వెళ్ళిపోయారు. ఇళ్ళూ వాకిళ్ళూ లేని ఖైదీలుమాత్రం జైల్లోనే ఉండిపోయారు. ఒకసారి జైలు పలచబడిన తర్వాత పెద్దగా ప్రమాదమేం ఉండదు. ఇంటిదగ్గర జాన్ రచనలు చేశాడు, లేసుల ముడులు వేశాడు. కుటుంబంతో సంతోషించాడు. పిల్లలకు పాఠాలు శ్రద్ధగా చెప్పాడు.

జానీ, థామస్ లు అతి కష్టంమీద చదవగలరని అతడు గ్రహించాడు. ఎలిజబెత్ వాళ్ళను బడికి పంపించాలని అనుకుంది కాని, అందుకు తగిన సహాయంకూడ అవసరమే. తరచుగా మగపిల్లలు బడి ఎగ్గొడుతున్నారు.

జాన్కు మరోసారి హృదయంలో అపరాధ భావన కలిగింది … తన తండ్రి తనను బడికి పంపినప్పుడు తాను కచ్చితంగా బడికే వెళ్ళానని నమ్మించడం తనకు జ్ఞాపకంవచ్చి అతడు హృదయంలో బాధపడ్డాడు.

చివరిగా ప్లేగు బెడ్ఫోర్డులోనికి పాకింది. ఇప్పుడు రెండో కేసు నమోదయ్యింది. ఇంకా ఎక్కువయ్యాయికూడ. బెడ్ఫోర్డులోని మరణాలన్నీ ఔసె నదికి ఉత్తరంగానే ఉన్నాయి. జాన్ తన కుటుంబం గురించి భయపడ్డా, నదికి దక్షిణాన ఉన్న తన సవతి తల్లీ, అరవై రెండు సంవత్సరాల తండ్రీ మరియు వాళ్ళ పిల్లల ప్రాణాలనుగూర్చి కూడ భయపడ్డాడు.

వ్యాధిబారిన పడినవాళ్ళను పెస్ట్ హౌస్ క్లోజ్ అనే దూరపు పొలాలలో పాతిపెట్టారు. బెడ్ఫోర్టు చుట్టుప్రక్క ప్రాంతాలన్నీ కళావిహీనమై పోయాయి. ఐతే లండనుండి వచ్చే విస్తృత వార్తలు మహా ఘోరంగా ఉన్నాయి.

“లండన్లోని దుకాణాలన్నీ ఇప్పుడు మూతపడుతున్నాయి. థేమ్స్ నదిమీద ఒక్క పడవకూడ లేదు” – జాన్ యింటికి తరచుగా వస్తూ పోతూ ఉండే ఒక స్నేహితుడు ఆగస్టు చివర్లో అన్నాడు.

“నిజానికి మరీ యింత ఘోరంగా ఉండకుండా ఉండాల్సింది” ఎలిజబెత్ అంది.

ఆ స్నేహితుడన్నాడు – “ఈ ప్లేగు వ్యాధి లండన్లోని అమాయకులైన పేదప్రజలను మరీ విపరీతంగా పొట్టన పెట్టుకుంటోంది. శవాలను పాతిపెట్టేవారు అనేకులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసినా తమ పనిని ముగించడం వారికి అసాధ్యమవు తోంది. శవాలను బండ్లలో కుప్పలుగా వేసి నగరం వెలుపట ఆరుబయట పొలాల్లో సామూహికంగా పాతిపెడుతున్నారు.”

“చనిపోయినవారి సంఖ్య అడగాలంటేనే భయంగా ఉంది” నిట్టూర్చాడు జాన్.

“గడచినవారం లండన్లో ఆరువేలమంది చనిపోయారు” – ఆ స్నేహితుడు చెప్పాడు.

“రాజును మళ్ళీ వెనక్కు తెచ్చుకున్నందున దేవుడు లండనీమీద తన ఉగ్రతను కురిపిస్తున్నాడా?” బెట్సీ అడిగింది.

“రాజూ, అతని ప్రభుత్వమూ ఉగ్రతను తప్పించుకున్నారు. ఇప్పుడు బాధపడే వాళ్ళంతా సామాన్యజనం. బహుశా సైతాను దీని వెనుక ఉండి ఉండవచ్చు” – జాన్ అన్నాడు.

ఈ ప్లేగు చావులు అక్టోబర్ నెల నాటికి తగ్గిపోయాయి.

‘దేవునికి స్తోత్రం, అది తన దుష్టత్వాన్ని జరిగించాల్సినంత జరిగించి చివరికి ఆగిపోయింది!’ జాన్ తనలో తాననుకొన్నాడు. నవంబర్ మాసాంతానికి వారాంతపు మరణాలు మూడువందలు. భయంకరమైన వార్తలిప్పుడు ఉపశమనంతో స్వాగతించ బడ్డాయి. ముగింపు కనుచూపుమేరలో ఉంది.

1666 క్రొత్త సంవత్సరం నాటికి జనం తిరిగి లండన్కు రావడం, తిరిగి దుకాణాలను తెరవడం ప్రారంభించారు. బెడ్ఫోర్డులోని రెండువేలమంది నిర్వాసితుల్లో నలభైమంది చనిపోయారు. అయితే లండన్లో చనిపోయినవారి సంఖ్యమాత్రం ఎక్కువగా ఉంది. ఒక్క సంవత్సరంలో లండన్ నగరం ఇంగ్లాండులో జరిగిన సుదీర్ఘ అంతర్యుద్ధాలలో చనిపోయినంతమందిని పోగొట్టుకుంది.

ఇంటివద్ద జాన్ వివిధ భావోద్రేకాలతో నిండిపోయాడు -“దేవునికి స్తోత్రం. ప్లేగు ఘట్టం ముగిసిపోయింది. అయితే నా భయమంతా తిరిగి నేను జైలుకు వెళ్ళాల్సి ఉంటుందేమోనని.”

“నాకైతే మరో క్రొత్త చట్టాలు వస్తాయనిపిస్తోంది” – ఆశాభావంతో అంది ఎలిజబెత్ – “బహుశ రాచరికవాదులు తమ ప్రతీకారం తీర్చుకునే ఉంటారు. కొద్ది కాలంలోనే వాళ్ళు నిన్ను జైలునుండి యింటికి వెళ్ళిపొమ్మనవచ్చు.”

“నాకీ స్వేచ్ఛాదినాలు సంప్రాప్తించినందుకు దేవునికి వందనాలు. పిల్లలు యిప్పుడు చదవటం, వ్రాయటం నేర్చుకోవచ్చు. అయినా దేవుడు మనకిచ్చిన గొప్పవరం ఉండనే ఉందిగా!”

“నిజమే! అదో అద్భుతం” తీయని స్వరంతో ఎలిజబెత్ అంగీకరించింది. జాన్ తిరిగి జైలుకు వచ్చేసరికి జైలు వాతావరణంలో మార్పు కనిపించింది. క్వాకర్ ఇప్పుడు జైల్లో లేడు. దేవుడు తనకిచ్చిన గొప్ప బహుమానాన్నిగూర్చి జాన్ క్వాకర్తో చెబుదామను కున్నాడు. కాని అతడక్కడ లేడు. కాబట్టి జాన్ జైలర్తో చెప్పాడు, “నేస్తం, నా భార్య ఎలిజబెత్ ఓ బిడ్డను ప్రసవించనుంది.”

“బహుశ బిడ్డ పుట్టబోయే సమయానికి నువ్వక్కడుంటావ్” ప్రోత్సహించాడు జైలర్.

జైల్లో యిప్పుడు పరిస్థితులు చాలా వెసులుబాటుగా ఉన్నాయి. జైలరు నమ్మకస్థులైన ఖైదీలను రాత్రిళ్ళు బయటకు పంపుతున్నాడు. ఇతర ఖైదీల్లాగ ప్రతి సమాచారాన్నీ జాన్ రొట్టెలాగ గట్టిగా నమిలేస్తున్నప్పటికీ, అతడు కోర్టు గుమస్తాను దర్శించేందుకు యింకా సిద్ధపడలేదు.

“బన్యన్, నువ్వు పెరోల్మీద బైటకు వెళ్ళబోతున్నావు.”

వసంతంలో ఆడశిశువైన శారా పుట్టినప్పుడు జాన్ యింటివద్దే ఉన్నాడు.

ఫ్రీ చర్చీ సభ్యత్వం యాభైకి పడిపోయినా అది రహస్యంగా కూడుకుంటూనే ఉంది. కొన్ని వారాలు జాన్ సంఘ సభ్యులకు వ్యక్తిగత సలహాలిచ్చాడు. ఎలిజబెత్ తిరిగి బలం పుంజుకునేందుకు అతడు సమయం యివ్వాలి. కుటీరానికి చెయ్యాల్సినవి ఏవేవో కొన్ని పనులున్నాయి.

తన బిడ్డలతో తాను సమయం గడపాలి. పుస్తకాలు అచ్చువేసే ఫ్రాన్సిస్ స్మితన్నుండి తన పుస్తకాల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాల్సి ఉంది. అయితే అతడు తన పరలోక పిలుపును మన్నించాల్సిన సమయంకూడ అతనికి ఆసన్నమయింది.

జాన్ మళ్ళీ సందేశాలు యివ్వడం ప్రారంభించాక శ్రోతలు ప్రతి ప్రసంగం తర్వాత ఉప్పొంగిపోసాగారు. త్వరలోనే కొన్ని వందలమంది దూరంగా ఎక్కడో ఒక పొలంలోని ఓక్ చెట్టు క్రిందనో, ఎండుగడ్డి కప్పువేసిన గిడ్డంగిలోనే గుమికూడేవారు. తాము పట్టుబడితే ఏం సంభవిస్తుందోనని తలచుకొని జాన్ వణికిపోయేవాడు.

జులై మాసంలో ఒక రోజున జాన్ తన ప్రసంగం ప్రారంభించగానే, “జాన్ బన్యన్, నువ్వు దేవుని కుమారుణ్ణి నమ్ముతున్నావా?” అంటూ ఓ వ్యక్తి రొప్పుతూ ముందుకు వచ్చి అడిగాడు.

“అవును, ప్రభువు నిన్ను దీవిస్తాడు.”

“నేను ఒక కానిస్టేబుల్ని. నువ్వు చట్ట వ్యతిరేకమైన కూడికను నిర్వహిస్తున్నావ్.” మరోసారి జాన్ భారీ ఓక్ తలుపుగుండా గ్రామ చెఱసాలలోనికి ప్రవేశించాడు.