శిబిరము వెలుపల (అధ్యాయము 13)
హెబ్రీ పత్రికయొక్క ముఖ్యోద్దేశము మన ప్రధాన యాజకునిగా మహిమలోనున్న క్రీస్తు అనేక కుమారులను మహిమకు తెచ్చుటయను అంశమును వివరించుట. ఈ అంశముల క్లుప్త సారాంశము దీనిని స్పష్టము చేయును.
మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము క్రీస్తు మహిమల గురించి, పరలోకమందు ఆయన స్థానమునుగురించి వివరించు చున్నది.
ఈ మూడునుండి ఎనిమిదవ అధ్యాయంవరకు తన ప్రజలు భూలోకము నుండి పరలోకమునకు పయనించుచుండగా ప్రధాన యాజకుడుగా వారిని భూలోకమందు నిర్వహించుచున్నట్లు వివరించుచున్నది.
తొమ్మిదవ అధ్యాయంనుండి 10:18 వరకు విశ్వాసికి పరలోకమును తెరచి, దానికి యోగ్యునిగా చేసిన క్రీస్తు బలిని వివరించుచున్నది.
Read and Learn More హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
9:19-23 వరకు మనమిక్కడ ఉండగానే క్రీస్తు ఉన్న పరలోకమునకు ప్రవేశము లభించినట్లు వివరించుచున్నది.
11వ అధ్యాయము – పరలోకమందున్న క్రీస్తునొద్దకు నడిపించు
విశ్వాస పథమును వెల్లడించుచున్నది.
12వ అధ్యాయము – మనము పరలోక పథమునందుండగా మన పాదములు జారకుండునట్లు దేవుడు వినియోగించిన వివిధ పద్దతులు చూడగలము.
13వ అధ్యాయము – విశ్వాస పథము మత లోకమునకు బయట ఉన్నది; పరమునకు చెందినవారి ప్రస్తుత భాగము నిందలు మాత్రమే నని చెప్పుచున్నది.
ఆ విధముగా ఈ పత్రికలో క్రీస్తును పరలోకమందు చూచుచున్నాము. విశ్వాసులు పరలోక ప్రజలుగా పరిగణించబడుచున్నారు.
పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొంది, భూలోకమందు ప్రారంభమై పరలోకమందు అంతమగు పరుగు పందెములో పాల్గొనియున్నారు.
ఈ పత్రికలోని చివరి అధ్యాయములో మనమింకను శరీరమందున్నా మని గుర్తుచేయబడియున్నాము. శరీరముతో ఉన్నాము గనుక బంధక ములు, శ్రమలు తప్పవు. జీవితములో శారీరక సంబంధ బాంధవ్యమును గౌరవించవలెను.
భౌతిక అవసరములు తీర్చుకొనవలెను. మనము భూలోకములో ఉన్నను, మత ప్రపంచమునకు వెలుపల ఉన్నట్లు పరిగ ణించబడియున్నాము.
మనము క్రీస్తుతోకూడా పరలోకమందలి ఆయన స్థానములో పాలుపొందినయెడల, భూలోకమందలి ఆయన నిందలలో కూడా పాలుపొందవలెను. తెరలోపల ప్రవేశించుట మన ఆధిక్యత. అదే సమయములో శిబిరము వెలుపలికి పోవుట మన ఆధిక్యత, బాధ్యత కూడా.
ఆ విధముగా, క్రీస్తుతోకూడా శిబిరము వెలుపల నిందలు అనుభవించుటకు పిలువబడినవారి ప్రవర్తనకు తగిన హెచ్చరికలు ఇవ్వబడినవి. శిబిరము వెలుపల ఉన్నంతమాత్రమున ప్రకృతి సహజమైన వాటికి దూరముగా ఉన్నామని అర్థము కాదు. ఈ సత్యమును స్పష్టముగా గ్రహించుట ఎంతో అవసరము.
(వచనములు 1, 2). క్రైస్తవుల మధ్య ప్రేమ నెలకొని ఉండవలెను అనునది మొదటి హెచ్చరిక. ఇది శరీర సంబంధమగు సహజ ప్రేమ కాదు. అది మంచిదే కావచ్చునుగాని ఇది క్రీస్తునుబట్టి సహోదరుల మధ్య ఉండవలసిన ప్రేమ.
ఈ ప్రేమ “నిరంతరము ఉండునట్లు” మనము చూచుకొనవలెను. విషమ పరీక్షలలో, శ్రమలలో చూపిన ప్రేమ దైనందిన జీవితములో తరిగిపోవు ప్రమాదమున్నది.
ప్రతిరోజు ఒకరినొకరు కలుసు కొనుచున్నందున చిన్న చిన్న బలహీనతలు, విపరీత స్వభావము కనిపించు నందున ఒకరిపట్ల మరియొకరికి ప్రేమ చల్లారు అవకాశము కలదు. మనతో ఎక్కువ బాంధవ్యముగలవారితోనే ప్రేమ పరీక్షించబడును.
అట్టివారి మధ్య సహోదర ప్రేమ నిలుచునట్లు జాగ్రత్తపడవలెను. ఆతి థ్యముద్వారా ప్రేమను వ్యక్తపరచవలెను.
(వచనము 3). సహోదర ప్రేమ బంధకములలో ఉన్నవారిపట్లను, కష్టములనుభవించు సహోదరులపట్లను చూపెట్ట వీలగును.
మనము కూడా శరీరములో ఉన్నాము గనుక కష్టములు, బంధకములు అనుభ వించుచున్నవారిని జ్ఞాపకము చేసికొనవలెను. ఎందుకనగా మనముకూడా అట్టి పరిస్థితిని ఎదుర్కొనవలసివచ్చును.
(వచనము 4). లోకములో ఉన్నాము గనుక శరీర సంబంధమగు బాంధవ్యములు తప్పవు. మానవ సంబంధములన్నిటిలో వివాహ సంబం ధము చాలా పటిష్టమైనది.
కనుక, వివాహమును చిన్నచూపు చూడక గౌరవించవలెను. నిష్కల్మషముగా నుండవలెను. పరిశుద్ధతను, లేదా వివాహబంధమును మీరినయెడల ప్రభుత్వపరమైన లేదా నిత్యమైన తీర్పు తప్పదు.
(వచనములు 5, 6). మనము మన భౌతిక అవసరములుకూడా తీర్చుకొనవలసియున్నది. ఈ అవసరములు ధనాపేక్షకు దారితీయ కూడదు.
దేవుడు ప్రస్తుతము మనలను ఏ స్థితిలో ఉంచెనో దానితో తృప్తిపడవలెను. దానికి ఇచ్చిన కారణము చాలా శ్రేష్టమైనది. మన పరిస్థితులు ఏమైనను ప్రభువు మనతో ఉన్నాడు. “నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను” అని ఆయన చెప్పియున్నాడు.
ప్రభువే అట్లు చెప్పినయెడల “ప్రభువు నాకు సహాయుడు, నేను భయ పడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?” అని చెప్పగలము. ఈ వచనము వాస్తవముగా ఒక ప్రశ్న – “ప్రభువు నాకు సహాయుడు కాగా, నరమాత్రుడు నాకేమి చేయగలడు?”
(వచనము ‘7).
మనకంటే ముందుగా ఈ లోకమును విడిచివెళ్ళిన మన నాయకులను జ్ఞాపకము చేసికొనవలెను. మూడవ వచనములోని “జ్ఞాపకము చేసికొనుడి” అను మాటకు, ఇక్కడ చెప్పిన “జ్ఞాపకము చేసికొనుడి” అను మాటకు వ్యత్యాసమున్నది.
అక్కడ కష్టములలో ఉన్న వారికి ఏదైనా చేసి జ్ఞాపకము చేసికొనుటను గూర్చియు; ఇక్కడ మరిచిపోవు అవకాశమున్నందున వ్యక్తులను మనస్సుకు తెచ్చుకొనుటనుగూర్చియు వ్రాయబడెను.
వారు జ్ఞాపకముంచుకొనుటకు తగినవారు. ఎందుకనగా వారు మనకు వాక్యమును బోధించిరి. పైగా, వారి ప్రవర్తన ఫలమును మనము తలపోసికొనవలెను. వారు తమవైపుకు ప్రజలను ఆకర్షించుటకు వాక్యము బోధింపలేదుగాని, పరమందున్న ప్రభువువైపుకు ఆకర్షించిరి.
మనము వారి విశేష లక్షణములను, ఆచార వ్యవహారములను లేదా వారి పరిచర్యను కాదుగాని వారి విశ్వాసమును అనుసరించవలెను.
(వచనములు 8, 9). ఈ రెండు వచనములలో మనయొద్దనుండి నిరంతరము జీవించు యేసునొద్దకు వెళ్లిన నాయకులను దాటిపోవు చున్నాము. ఇతరులు వెళ్ళిపోవుదురు, మార్పుచెందుదురు. అయితే “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కరీతిగానే ఉన్నవాడు”.
కొన్ని పర్యాయములు మనము గత కాలమందలి దైవజనులనుగూర్చి, వారు వెళ్ళిపోయినందున మనకిక గొప్ప లోటు అని మాటలాడుట కద్దు.
ఆ విధముగా మాటలాడినందున అనాలోచితముగా క్రీస్తును తక్కువచేయు ప్రమాదమున్నది. వారు వెడలిపోయిరి కాని, నిరంతరము జీవించు క్రీస్తు హృదయములో పరిపూర్ణ ప్రేమ, ఆయన చేతిలో పరిపూర్ణ శక్తి ఉన్నది.
ఆయన తన శరీరమునకు పరిపూర్ణ జ్ఞానమిచ్చు శిరస్సుకూడా అయి ఉన్నాడు. మనము జయించలేని కష్టము, మనలను కాపాడలేని ప్రమా దము, మనకు జవాబు లభించని ప్రశ్నలు ఏమీ ఆయనయందు లేనేలేవు.
ఆయనే మన ఆధారము, సమస్తము. ఈ పత్రిక ప్రారంభమైనది మార్పు లేని క్రీస్తుతోనే. అంతమగునది కూడా ఆయనతోనే, మొదటి అధ్యాయములో “నీవు నిలచియుందువు”,“నీవు ఏకరీతిగా యున్నావు” అని ఆయన ప్రస్తుతింపబడియున్నాడు.
ఇతరులు గతించి పోవుదురు, ఆయన నిరంతరము నిలుచును, ఇతరులు మార్పు చెందుదురు, ఆయన ఏకరీతిగా నుండును. క్రీస్తే మన ఆధారము గనుక “నానా విధములైన అన్యబోధలచేత త్రిప్పబడకుందముగాక!” ప్రజలు చెప్పుకొనుచున్నట్లు నూతన వెలుగు లేదా తానే వెలుగు కావలెనని చెప్పు దురద చెవులు కలిగి ఉన్నామా?
అట్లయినయెడల మనము అవిశ్రమముగా నూతన విషయమందు ఆసక్తి చూపి క్రీస్తునుండి దూరమై కొట్టుకొనిపోవు ప్రమాదమున్నది, జాగ్రత్త! అన్యబోధలు జ్ఞానయుక్తమైనవిగా కనిపించును.
అవి మానసికమైన పరిచర్యమాత్రమే జరిగించును. వాటియందాసక్తిగల వారికి వాటివలన ప్రయోజనమేమియు చేకూరదు. మన ఆత్మలను బల పరచి, స్థిరపరచునది క్రీస్తు కృప మాత్రమే.
శారీరక వ్యర్థత నూతనమైన వాటి కొరకు అర్రులు చాచును. అంతకు ముందు ప్రకటించిన సత్యము నకు భిన్నముగా తన స్వంతవిధానములో సత్యమును ప్రకటించుటకు ప్రయత్నించును.
ఫలితముగా ముందుగా వెడలిపోయిన నాయకులను కించపరచినట్లగును. యేసుక్రీస్తు మార్పులేనివాడుగానున్న ఆయన స్థానము తప్పిపోవును, మనము అన్యబోధలచేత కొట్టుకొనిపోవుదుము.
ఆ విధముగా ‘క్రీస్తుకు లోకమందు ఉన్న స్థానము’ అను ఈ అధ్యాయముయొక్క గొప్ప అంశములోనికి మనము వచ్చియున్నాము. ఆయన మనతో ఉన్నాడని తెలిసికొనియున్నాము.
ఇప్పుడు మతవ్యవస్థకు సంబంధించి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనబోవుచున్నాము. ఆ విధముగా ఆయనతోబాటు మనమును ఉండగలము.
(వచనములు 10-12). ఈ గొప్ప అంశమును పరిచయము చేయుటకొరకై యూదా మతమునకు క్రైస్తవ్యమునకు ఉన్న వ్యత్యాసము చూపెట్టబడినది. యూదా మత వ్యవస్థలో నిర్ణయించబడిన విధానములో బాహ్యముగా దేవుని సమీపించు ఏర్పాటు కలదు.
అన్యులకు ప్రవేశించు హక్కులేదు. ఇప్పుడు బలిపీఠము – అనగా దేవుని సమీపించు మార్గము. క్రైస్తవులకు మాత్రమే పరిమితము. యూదా మత వ్యవస్థలోనివారికి ఈ బలిపీఠములో ప్రవేశించు హక్కులేదు.
తొమ్మిదవ అధ్యాయము 14వ వచనమునుండి మనము నేర్చుకొనునదేమనగా, మనము నిర్జీవ క్రియల నుండి విడిపించబడి, శుద్ధిచేయబడిన మనస్సాక్షిగలవారమై దేవుని సేవించునట్లు “క్రీస్తు నిత్యుడగు ఆత్మద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనెను”.
“కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పు డును స్తుతియాగము చేయుదము”. (వ 15). క్రీస్తుయొక్క సిలువ మన బలిపీఠము. పాప సమస్యను పరిష్కరించు బలిద్వారా విశ్వాసి ఆరాధకు నిగా దేవుని సమీపించగలుగుచున్నాడు.
యూదా మత బలిపీఠములకు అంటి పెట్టుకొనియుండువారు క్రీస్తు చేసిన గొప్ప అర్పణను తిరస్కరించు చున్నారు. వారు నీడలను అంటిపెట్టుకొని, నిజ స్వరూపమును విస్మ రించుచున్నారు. అట్టివారికి క్రీస్తు లేక ఆయన అర్పణయను క్రైస్తవ బలిపీఠములో పాలులేదు.
అబ్రాహాము సంతానమగు యూదా జాతి బాహ్యముగా దేవుని ప్రజలు. ఆ మత వ్యవస్థలో పాల్గొనవలయునన్నయెడల వారు సహజ ముగా అబ్రాహాము సంతానమై యుండుట ఆవశ్యకము. వారి విషయ ములో నూతన జన్మయను ప్రస్తావన లేదు.
ఆ వ్యవస్థలో దేవుడు మనిషిని మనిషిగా పరీక్షించినందున, ప్రకృతి సహజమైన ఆకర్షణలు అందులో ఉండెను. ఆ మత వ్యవస్థలోని శోభాయమానమైన ఆచారములు, విస్తృత మైన కర్మకాండలు, గొప్ప కట్టడములు ఇవన్నియు ప్రకృతి సహజమైన మనిషిని ఆకట్టుకొనునవి.
అది భౌతికమైన దేవాలయముతో, లౌకిక శోభతో నిండిన లోకసంబంధమగు మతము. అది నిందించబడలేదు సరికదా, లోకమందు దానికి సముచిత స్థానము, భాగము లభించినది. అయితే ఆ వ్యవస్థద్వారా మనిషికి పరలోకములో స్థానముకాని, భాగముకాని లభించలేదు.
క్రైస్తవ్యము ఎంత భిన్నమైనది! మనకు క్రీస్తునందు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము లభించెను. దానిద్వారా మనకు దేవుని లోకములో దేదీప్యమానమగు స్థానమందు స్థలము లభించినది. దాని అనంత ఆశీర్వాదములు క్రీస్తుమాత్రమే కొలవగలడు.
ఆయన మనకొరకు తండ్రియెదుట ప్రత్యక్షమై ఉన్నాడు. క్రైస్తవ్యముద్వారా పరలోకమందు మనకు క్రీస్తు స్థానము లభించినయెడల, భూలోకమందును ఆయన స్థానము లభించును.
పరలోకమందలి క్రీస్తు సంపదలతోపాటు భూలోక మందలి ఆయన నింద మనకు సంక్రమించినది. క్రీస్తుతో అక్కడ లోపలి స్థానము పొందవలెనంటే, ఇక్కడ క్రీస్తుతోకూడ వెలుపలి స్థానము పొందవలయును.
ఆ విధముగా యూదా మత వ్యవస్థ క్రైస్తవ్యమునకు పూర్తిగా భిన్నమైనది. యూదా మతము మనిషికి లోకములో సమున్నత స్థానము సంపాదించెను గాని పరలోకములో స్థానమును కల్పించలేదు.
క్రైస్తవ్యము విశ్వాసికి పరలోకములో గొప్ప స్థానమును ఇచ్చును గాని, ఈ లోకములో స్థానము ఇచ్చుటలేదు. వారికి ఈ లోకములో లభించునది నిందలుమాత్రమే.
అలాగైన, లోకమందు క్రీస్తు స్థానమేమి? ఈ లేఖన భాగములో 11-13 లో మూడు పర్యాయములు “వెలుపల” అను పదము ప్రయో గించుటద్వారా ఆయన స్థానమేదో వెల్లడించబడినది.
11వ వచనములో “శిబిరము వెలుపల” అను మాట ప్రయోగించబడినది. 12 వ వచన ములో “గవిని వెలుపట”, మరల 13వ వచనములో “శిబిరము వెలుపల” అని ప్రయోగించబడినది.
“శిబిరము వెలుపల” అను పదప్రయోగముద్వారా మనము గ్రహిం చునదేమి? 11 వ వచనములో ముంగుర్తుగాను, 12 వ వచనములో వ్యతిరేక ముంగుర్తుగాను, 13 వ వచనములో విశ్వాసికి వ్యక్తిగత అన్వయముగాను ఈ పదము ప్రయోగించినట్లు గ్రహించిన దీని అర్థము సులభగ్రాహ్యమగును. లేవీయకాండము 4 అధ్యాయము నుండి 11వ వచనము ఉదహరించబడినది.
లేవీయ కాండము 4 అధ్యాయములో కోడెను వధించిన తరువాత యాజకుడు వ్రేలితో రక్తమును తీసికొని యెహోవా యెదుట ప్రత్యక్ష గుడారములో చిలకరించును.

“పాళెము వెలుపల” అనగా దేవునితోగాని, మనుష్యులతోగాని గుర్తించ గలిగిన సంబంధమేమియు లేని స్థలము. దేవుని దృష్టిలో అది తీర్పు స్థానము కావచ్చును, లేదా మానవుల దృష్టిలో నింద భరించు స్థలము కావచ్చును.
తీర్పు దృష్టితో ఆలోచించినయెడల అది తిరస్కరించబడిన స్థలము, దేవుడు లేని స్థలము. అది వెలుగు రేఖ ఎన్నడూ ప్రసరించని, ప్రేమ ఎన్నడూ వికసింపజేయని “వెలుపలి చీకటి”.
అక్కడ ఆదరణ, కరుణ పిసరంతకూడా ఉండవు. “పాళెము వెలుపల” పాప పరిహారార్థ బలి జంతువును దహించుట పాపముపై పరిశుద్దుడైన దేవుని తీర్పును చక్కగా సూచించుచున్నది. యేసు ఈ స్థలమునకే వెళ్ళెను.
తన స్వరక్తముతో తన ప్రజలను పరిశుద్ధపరచునట్లు ఆయన గవిని వెలుపల శ్రమపడెను. క్రీస్తు చనిపోయినప్పుడు యెరూషలేము పాళెము స్థానము వహించినది.
మనము తెరలోపల ఆశీర్వాదము పొందుస్థానము పొంద వలెనంటే, ఆయన గవిని వెలుపల మన స్థానములో తీర్పు పొందవలెను. మనము పాపమునుండి ప్రత్యేకింపబడి, దేవునికి ప్రీతికరమైన జీవితము జీవించకపూర్వము మన పాపములపైకి రావలసిన తీర్పు భరింపవలెను.
క్రీస్తు వెలుపటి చీకటిలోనికి వెళ్ళి పలికిన “నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడచితివి?” అను గంభీరమైన మాటలు మన హృదయ ములలో తలపోసికొనినయెడల అమితాశ్చర్యము కలుగును.
ఆ మాటల భావమేమిటో ఆలోచించుడి. నీతిమంతుడైన ఆయనను (ఆయన ఒక్కడే నీతిమంతుడు) దేవుడు చేయి విడిచిపెట్టుట – అంతకు ముందుగాని, ఆ తరువాతగాని ఏ మానవుడు అట్టి మరణము పొందలేదు.
“నీతిమంతు లను దేవుడు ఎప్పుడైనను విడిచిపెట్టెనా? ఇతరులు యెహోవాయందు నమ్మికయుంచి విడిపించబడిరి. ఇతరులు భయంకరమగు దూషణలు, కొరడా దెబ్బలు అనుభవించిరి.
బంధకములు, చెరసాలలు పొందిరి. మరికొందరు యాతనపెట్టబడిరి. అనాథలైరి, శోధింపబడిరి. అయినను ఏ ఒక్కరుకూడ విడిచిపెట్టబడలేదు. కాని, ఇక్కడ విడిచిపెట్టబడిన ఒక నరుడు ఉన్నాడు.
“నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?” అని దేవునితో చెప్పగలిగినవాడే ఆ నరుడు. ఆయన దేవునికి మొరపెట్టెనుగాని “నీవు నాకుత్తరమియ్యకున్నావు” అనుచున్నాడు.
ఆయన దేవునిచే విడనాడబడినాడు. ఆయనకు దేవునినుండి సహాయములేదు, దేవునినుండి జవాబులేదు. ఆయన ఎందుకు విడనాడబడెను? కేకవేసిన ఆయనమాత్రమే దానికి జవాబు చెప్పగలడు. “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు”.
దేవుడు పరిశుద్ధుడు. సిలువను విడిచిపెట్టుటకు మహోన్నత మగు జవాబు అక్కడ ఉన్నది. మానవుడు చెడ్డవాడు అను విషయము కాదు ఇక్కడ ప్రాముఖ్యము. దేవుడు పరిశుద్ధుడు.
క్రీస్తు భయంకరమైన, విడిచిపెట్టిన సిలువయెదుటికి వెళ్ళినప్పుడు నీతిమంతుడైన ఆయన యెదుట ఉన్నది మనిషి కాదు – దేవుడే. స్తోత్రముచేయు ప్రజల మధ్య నివసించుట దేవుని ఉద్దేశ్యము.
క్రీస్తు సిలువ కార్యమునుబట్టి ప్రజలు యోగ్యులుగాను, దేవునియెదుట నిలబడగలుగునట్లుగాను చేయబడిరి.
ఈ ప్రజలు దేవునికి ప్రీతిపాత్రులగునట్లు క్రీస్తు సిలువలో విడనాడబడెను. ఆయన తన ప్రాణమును పాపక్రయధనముగా అర్పించినప్పుడు దేవుని చేతిలో ఆనందము అధికముకాజొచ్చెను.
సకల యుగములలో ఆయన మహిమకు కీర్తి కలిగించు ప్రజలు తెరలోపల నిలిచియుందురు, ఎందు కనగా యుగముల పూర్వమే యేసు గవిని వెలుపల విడనాడబడెను.
(వచనము 13). ఆ విధముగా మనము “మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్ళుదము” అను ఆచరణాత్మక హెచ్చరికకు వచ్చియున్నాము.
ఇక్కడ ఒక విషయము మనము జాగ్రత్తగా గమనించవలెను. ఈ వెలుపలి స్థలమును దేవుడు ఎంతమాత్రము తీర్పు స్థలముగా చూచుట లేదు.
మానవునివైపునుండి నింద భరించు స్థలముగా దానిని ఎంచుచున్నాము. దేవుని తీర్పు భరించుటకే మనము శిబిరము వెలుపలికి వెళ్ళము. మానవుల నిందను సంపూర్ణముగా భరించుటకు మనము పిలువబడియున్నాము.
ఆయన దేవుని తీర్పుక్రింద పరిశుద్ధ బలిపశువుగా వధింపబడెను. సహనశీలియైన హతస్సాక్షిగా మానవుల నిందను సహించెను. దేవుని చేతినుండి ఆయన శ్రమలలో మనము పాలుపొందలేముగాని, మానవుల చేతిలో ఆయన పొందిన అవమానములలో పాలుపొందుట మన ఆధిక్యత.
మన తీర్పును భరించుటకు ఆయన శిబిరము వెలుపలికి వెళ్ళెను. ఆయన నిందను భరించుచు మనము శిబిరము వెలుపలికి వెళ్ళుదము.

దేవుని ద్వేషించు జనాంగము మధ్య ఆయన దేవునిపట్ల ఆసక్తిగానుండెను. అందువలన ఆయనను “అన్యుడు”గాను, “పరుడు”గాను పరిగణించిరి. ఆయన ఆసక్తి ఆయనను నింద, అవమానముల స్థలమునకు నడిపించెను.
దేవుని ద్వేషించిన లోకమందు ఆయన దేవుని ప్రతినిధి. మానవులు ద్వేషమును వెళ్లగ్రక్కుటకు మానవుల మధ్య ఆయన నివసించుట కారణమాయెను.
“నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని” అనియు, “నిన్ను నిందించిన వారి నిందలు నామీద పడియున్నవి” అనియు చెప్పినట్లుగా వారు దేవునిపై చూపు ద్వేషమును క్రీస్తుపై వెళ్ళగ్రక్కిరి.
క్రీస్తుకు ఈ లోకము ఏ స్థానమునిచ్చెనో దానిని క్రైస్తవుడు స్వీకరించు టకు పిలువబడియున్నాడు. కనుక, ప్రకృతి
సంబంధియైన మానవునికి ఆకర్షణీయముగానున్న మత వ్యవస్థనుండి, ఈ భాగములో చెప్పినట్లు శిబిరము వెలుపలికి వెళ్ళవలెను.
మనమింతకుముందే గమనించినట్లు శిబిరములో దేవునితో భౌతికమగు సంబంధము కలిగిన ప్రజలున్నారు. వారి మతము భూసంబంధమైన క్రమముతో కూడినది. దేవునికి మనిషికి మధ్య నిలుచు యాజకులు వారికున్నారు.
భూసంబంధమగు దేవాలయము, క్రమమైన ఆచారములున్నవి. ఆ వ్యవస్థ హెబ్రీ 9:1-10 లో సంక్షేపముగా వ్రాయబడినది. దానిద్వారా దేవుని సమీపించుట వీలుకాదనియు, ఆరాధ కునికి మనస్సాక్షి విషయములో అవి సంపూర్ణసిద్ధి కలుగజేయలేవనియు గ్రహించుచున్నాము. అంతేకాదు, ఆ వ్యవస్థలో నిందకూడా లేదు.

యూదా శిబిరముతో పోల్చినయెడల, క్రైస్తవ సమూహములోని ప్రజలు శరీర జన్మద్వారా దేవునితో బాహ్యమగు సంబంధముగలవారు కాదు. క్రొత్త జన్మద్వారా విశేషమైన సంబంధము కలిగియున్నారు.
యాజకులని ఒక ప్రత్యేక వర్గము లేదు, విశ్వాసులందరూ యాజకులే. భూసంబంధమగు దేవాలయమునకు బదులు క్రైస్తవుడు పరలోకమునే పొందియున్నాడు. పైగా, క్రైస్తవ్యములో శుద్ధిచేయబడిన మనస్సాక్షివలన దేవుని దగ్గరకు ప్రవేశము లభించినది.
క్రైస్తవ్యములో ప్రకృతి సంబంధి యగు మానవుని ఆకర్షించునది ఏదీ లేదు. ఎందుకనగా శరీరమును ఇవి ప్రక్కనపెట్టును. అందువలననే క్రీస్తును తృణీకరించిన లోకములో మనము ఆయన నిందను భరించుచున్నాము.
యూదా శిబిరమునకు, క్రైస్తవ సమూహమునకు ఉన్న వ్యత్యాసము లను మనస్సులో ఉంచుకొనినయెడల, నేడు క్రైస్తవ లోకమందలి మత వ్యవస్థను పరీక్షించుట కష్టము కాదు.
నేటి మత వ్యవస్థలలోనున్నది శిబిరము లక్షణములా లేక క్రైస్తవ లక్షణములా? నిస్సందేహముగా నేటి మత వ్యవస్థ అంతయు శిబిరము నమూనాలోనే రూపొందించబడి యున్నది.
లోక సంబంధమైన దేవాలయములు, దేవునికి మానవులకి మధ్య నిలుచుండు మానవ కల్పితమగు యాజక వ్యవస్థ వారికున్నది. ఈ వ్యవస్థలద్వారా మనస్సాక్షికి శుద్ధిగాని, పరలోకమందున దేవుని యొద్దకు ప్రవేశముగాని లభించదు.
వారు శరీరసంబంధియగు మానవుని గుర్తించి, శరీరసంబంధిని ఆకర్షింపజూతురు. మానవునికి హత్తుకొను లాగున ఈ వ్యవస్థ రూపొందించబడినందున, ఈ వ్యవస్థలలో నిందకు తావులేదు.
ఆ వ్యవస్థలు శిబిరము అని మనము భావించగలమా? నిజము చెప్పాలంటే అవి కానేకావు. ఒక విధముగా చెప్పాలంటే అవి శిబిరము కంటే హీనమైనవి. ఎందుకనగా, వాటిని శిబిరము నమూనాలో కొన్ని క్రైస్తవ లక్షణములు జోడించి రూపొందించియున్నారు. ప్రారంభములో శిబిరమును దేవుడే నెలకొల్పెను.
అయితే చెడిపోయినందున దేవుడే దానిని ప్రక్కకు నెట్టివేసెను. ఈ గొప్ప వ్యవస్థలన్నియు భక్తి గలిగినవారు సదుద్దేశ్యముతోనే ప్రారంభించి ఉండవచ్చును.
యూదా విశ్వాసులనే దేవుడు శిబిరము వెలుపలికి వెళ్ళమని చెప్పినయెడల, కేవలము శిబిరము నకు అనుకరణయైనదానినుండి నేడు విశ్వాసి మరి నిశ్చయముగా వెలుపలికి వెళ్ళవలెనుగదా!
ఈ గొప్ప మత వ్యవస్థలలో ఎందరో నిజమైన క్రైస్తవులున్నారుకదా! వారి మాటేమిటి? అనే ప్రశ్న అనేకుల మనస్సులలో తలెత్తవచ్చును. యథార్థమైన భక్తిగల క్రైస్తవులనేకులు ఉన్న వ్యవస్థలో ఉండుట తప్పా? అని కొందరు వాదించుదురు.
ఈ చిక్కు సమస్యకు జవాబుగా ఒక ప్రశ్న అడుగవచ్చును. మనము అనుసరించవలసినది దేవుడు చెప్పిన మాటనా, మనుష్యులు పాటించుదానినా? దేవుని వాక్యమునకు విధేయులగుట ప్రతి విశ్వాసి విధి.
ఎవరైనను దేవుని వాక్య వెలుగులేక విధేయత మూలముగా కలుగు నిందలు, శ్రమలు ఎదిరించి ధైర్యము చాలక దేవుని వాక్యము ఖండించు వ్యవస్థలో ఉండిపోవచ్చునా? ఎంతమాత్రము వీలులేదు.
ఈ నిర్జీవమగు వ్యవస్థలలో దేవునియందు భయభక్తులుగలవారు లేకపోలేదు. అట్టివారు ఆ వ్యవస్థలో ఉండిపోవుటకు కారణము ఆ వ్యవస్థ కాదు. ఈ వ్యవస్థకు భిన్నముగా పనిచేయు దేవుని మహా కృప.
పరిశుద్ధులు ఆ వ్యవస్థ మూలముగా పుట్టలేదు. వారు ఆ వ్యవస్థకు ప్రాణము పోయరు. అట్టివారి స్థితిని తుయతైర పట్టణములోవున్న భక్తిగల శేష జనాంగముతో మరియొకరు పోల్చిరి.
ఆ సంఘములోనివారు యెజెబెలు, ఆమె సంతాన లక్షణములుగలవారు. అయితే తుయతైర పట్టణములో యెజెబెలు సంతానము కాని వారున్నారు. వారు ఆ దుష్ట వ్యవస్థమూలముగా పుట్టిన వారు కారు. అట్టి లక్షణములు వారిలో లేవు.
మనిషి రూపొందించు కున్న వ్యవస్థలలో ఉన్న పరిశుద్ధుల స్థితికూడా అట్టిదే. అయితే దేవుని వాక్యము తేటగా శిబిరము వెలుపలికి వెళ్ళమని హెచ్చరించుచున్నది. వెలుపలికి వెళ్ళక నిలిచియుండువారి ఉద్దేశ్యములను తీర్పు తీర్చుట మన పని కాదు.
సత్యము ఎరుగకపోవుట, సరళమైన విశ్వాసము లేకపోవుట, మనుష్యుల భయము, పరిణామములనుగూర్చి భయపడుట, మతపరమైన శిక్షణ, సంస్థలయొక్క అపోహలు … ఈ విధముగా ఎన్నైనా ఉద్దేశ్యములు చెప్పుకొనుచు పోవచ్చును.
ఇవి మనిషిని శిబిరము వెలుపలికి పోకుండా ఆపివేయును. పరిశుద్ధులు ఈ వ్యవస్థనుండి వెలుపలికి రాకుండుటకు మరియొక బలమైన కారణము నిందింపబడుదుమను సహజమైన భయము కావచ్చును.
క్రైస్తవలోకములోని మత వ్యవస్థలనుండి వెలుపలికి వెళ్ళి తృణీకరించబడిన క్రీస్తుతో, ఈ లోక సంబంధముగా పేదలు, బలహీనులు, ఎన్నికలేనివారితో సమైక్యమగుటలో నింద ఉన్నది. అందు వలన అనేకులు వెనుకాడుదురు.
నిందకు భయపడి వెనుకడుగు వేయు స్థితిని జయించు శక్తి ఏదియు లేదా? తప్పక ఉన్నది. అది క్రీస్తునందుగల అనురాగమే. అందువలననే “ఆయనయొద్దకు వెళ్ళుదము” అని చెప్పబడినది. ఇది చాలా ప్రాముఖ్య మైన మాట.
మనము శిబిరము వెలుపలికి వెళ్ళుటకు ప్రాధ్యాన్యతా క్రమములో ముఖ్యమగు కారణము ఇదే. ఇంతవరకు మనము నేర్చుకొనిన దానిని విడిచిపెట్టుట వ్యతిరేకభావము. ఎవరును ప్రతికూలమైనవాటితో జీవించరు.
“శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు మళ్ళుట”లో చెడుగు నుండి ప్రత్యేకింపబడుట ఇమిడి ఉన్నది. అంతకంటే మించి మనము క్రీస్తుకొరకు ప్రత్యేకించుకొనుటవలన మనకు రూఢియైన గురి ఏర్పడినది.
క్రీస్తును గురిగా కలిగి ఉండుట మినహా, ప్రత్యేకింపబడుట విమతము నకు దారితీయును. ఆ విధముగా చేయుట ఒక గుంపును వదలి మరియొక సంస్కరింపబడిన గుంపులో చేరినట్లగును.
అనేక విమతముల ఉద్యమ చరిత్ర అక్షరాలా ఇదే. నిజమైన క్రైస్తవులను వారి అనుబంధముగా నున్న చెడుగు, భ్రష్టత్వములను గూర్చి క్రైస్తవులను జాగృతము చేసినప్పుడు, వారు కొన్ని ప్రాముఖ్యమైన సత్యములను గట్టిగా చేపట్టి, తామున్న గుంపును వ్యతిరేకించి, చెడుగును విడిచిపెట్టి, సత్యమును అవలంబించె దరు.
అయితే వారు విడిచిపెట్టి వచ్చిన చెడుగులన్నియు తిరిగి ఇందులో ప్రవేశించి, ఇదియును అట్టి గుంపుగానే పరిణమించును. క్రీస్తు రెండవ రాకడను గూర్చిన సత్యము కావచ్చును, పరిశుద్ధాత్మ మనలో ఉండి, ఒకే శరీరమను సత్యము కావచ్చును.
ఆ సత్యము ఎంత శ్రేష్టమైనదైనను మనము మత వ్యవస్థనుండి ఈ గొప్ప సత్యములను అవలంబించుటకు వేరుపడుటవలన మనము మత శాఖలను ఏర్పరచుచున్నాము.
ప్రతిచోటా ఇది జరుగుచున్నట్లు గమనించగలము. క్రైస్తవులు పరిశుద్ధులుగా ఉండు టకు పిలువబడియున్నారు. కనుక పరిశుద్దుల గుంపు ఒకటి తయారైనది. పరిశుద్ధాత్మనుగూర్చిన సత్యము కొందరు గుర్తెరిగిన ఫలితంగా పెంతెకొస్తు గుంపు పుట్టుకొచ్చినది.
ప్రభువు రాకడ సత్యము గుర్తెరిగిన కొందరు “సంఘము ఒకే శరీరము” అను సత్యమును పట్టుకొని, దానిని అవలం బించు ఒక శాఖగా జారిపోయిరి. అయితే శాఖలుగా చీలిపోక, సత్యమును అవలంబించుచు చెడుగు నుండి ప్రత్యేకింపబడుటకు ఒకే ఒక్క మార్గమున్నది.
అని ప్రభువు చెప్పిన మాటలో గొప్ప హెచ్చరిక, బోధ, ఎంతో అర్థము దాగియున్నవి. జె. యన్. డార్బీ అనే ప్రియమైన దైవజనుడు ఈ వచనముపై వ్యాఖ్యానించినదేమనగా “దేవుని కేంద్ర బిందువు క్రైస్తవులు కాదు, క్రీస్తు.

క్రైస్తవులు ఒకచోట సమకూడవచ్చును. కాని, క్రీస్తు కేంద్రముగా సమకూడనియెడల అది చెదరగొట్టుట యగును. యేసుక్రీస్తు తప్ప మరి ఏ కేంద్రస్థానము దేవునికి తెలియదు. ఆయనే గురి, క్రీస్తే కేంద్రబిందువు.
ఆయన చుట్టూ, ఆయనకొరకు, ఆయననుబట్టి సమకూడని దంతయు చెదరగొట్టుటయే. సమకూడుట జరగవచ్చునేమో గాని, “నాతో” కానియెడల అది చెదరగొట్టుటయే. మనము సహజముగా చీలికల స్వభావముగలవారము. దీనిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండవలెను.
క్రీస్తు నా ఆలోచనల కేంద్రము కానియెడల, నా ప్రయత్నముల కేంద్రము ఆయన కాజాలడు.” ప్రభువు తన ప్రజలతో వ్యక్తిగతముగా ఉందునని వాగ్దానము చేసెను గాని, తన ప్రజలు లోక సంబంధమైన వ్యవస్థలలో ఉంటే తన సన్నిధిని అనుగ్రహించెదనని ప్రభువు వాగ్దానము చేయలేదు.
అందుకు భిన్నముగా ఆయన నింద భరించుచు శిబిరము వెలుపల ఉన్నాడు. ఆయన మనతో వ్యక్తిగతముగా ఉన్నమాట నిజమే. కాని, మనము సామూహికముగా ఆయనతో ఉన్నామా? “వెలుపలికి ఆయనయొద్దకు వెళ్ళుదము” అనుటలో క్రీస్తు నామమునకు చేరిన సమూహము అని అర్థమిచ్చుచున్నది.
(వచనములు 14-21). “శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్ళుమని” హెచ్చరించిన తరువాత, ఆ హెచ్చరికకు విధేయులైనందున కలుగు ఆశీర్వాదములు, ఆధిక్యతలు రచయిత వివరించుచున్నాడు.
వెలుపలి స్థలములోనే అనేక ఆధిక్యతలు అనుభవించవచ్చును, లేఖనము లోని అనేక ఆజ్ఞలను పాటించవచ్చును, శిబిరములోనున్న వస్తుక్రమములో పొందని పరిపూర్ణతను అనుభవించవచ్చును. కనుక, క్రీస్తుతోకూడా శిబిరము వెలుపల సమకూడువారికి కొన్ని లక్షణములున్నట్లు స్పష్టమగు చున్నది.
1. వారు యాత్రికులు : “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదానికోసము ఎదురుచూచుచున్నాము” శిబిరము వెలుపల మాత్రమే మనము యాత్రికుల, ప్రయాణికుల లక్షణములు కలిగియుండగలము.
ఈ లోకములో స్థిరమైన పట్టణము లేని వ్యక్తి యాత్రికుడు. రాబోవు పట్టణముకోసము కనిపెట్టువాడు ప్రయాణికుడు. నిజమైన యాత్రికుని లక్షణములు శిబిరము వెలుపల మనలో చోటుచేసు కొననియెడల, శిబిరములో అట్టిది అసాధ్యము. (వ. 14).
2. వారు ఆరాధించు సమూహము : “దేవునికి ఎల్లప్పుడు స్తుతి యాగము చేయుదము”. శిబిరములో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుట కష్టము. వెలుపల ఆరాధించు వ్యక్తులే కాదు, ఆరాధించు సమూహమునే చూడవచ్చును. (వ.15).
3. శిబిరము వెలుపలనున్న ప్రజలు: శరీర విషయమై శ్రద్ధ తీసుకొందురు. అందువలననే ఉపకారము, ధర్మము చేయుట మరువ వద్దని హెచ్చరింపబడియున్నాము. (వ. 16).
4. ఇక్కడ ఆత్మలను కాపు కాయుటకూడ జరుగును : కనుక మనపైని నాయకులుగా ఉన్నవారికి లోబడి, మన ఆత్మల క్షేమము కోసము పాటుబడువారి మాట వినవలెను. (వ.17).
5. అది ప్రార్థించు సమూహము : వారి ఆత్మల క్షేమము కోరు నాయకులను బలపరచునది పరిశుద్ధుల ప్రార్థనలే. పరిశుద్ధులకు నాయకుల పరిచర్య అవసరమైతే నాయకులకు పరిశుద్ధుల ప్రార్థనలు అవసరము. (వ. 18, 19).
6. ఈ సమూహము దేవుని చిత్తమును జరిగించువారు : గనుక వారు దేవుని దృష్టికి అనుకూలమైనదానిని జరిగింతురు. (వ.20,21).
7. చివరగా ఈ సమూహము యేసుక్రీస్తుకు మహిమ కలిగించినది: “యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక!” (వ.21).
ఈ పత్రిక క్రీస్తు మహిమతో ప్రారంభమైనది. ఆ తరువాత మహిమకు కొనిరాబడిన సమూహమును చూచాము. ముగింపులో ఇప్పుడు, మహిమను పొందబోవువారు ఈ లోకమందు క్రీస్తుతోకూడా శిబిరము వెలుపలికి వెళ్ళవలెను. ఆ విధముగా కాలమందును, యుగయుగములు దేవునికి మహిమ కలిగించవలెను అని నేర్చుకొనుచున్నాము.
లేఖనములలో ఈ గొప్ప సత్యము ఎంత చక్కగా వివరించబడినది! క్రీస్తునొద్దకు వెలుపలికి వెళ్ళిన సమూహము, ఆయన నిందను భరించుచు యాత్రికుల లక్షణములు కలిగి, ఆరాధించు సమూహముగా శరీరముల విషయమై శ్రద్ధ తీసికొనుచు, ఆత్మలను కాపు కాయుచు, ప్రార్థన చేయుచు నుండుట ఇక్కడ దేవునికి ఇష్టమైనది, మహిమ కలిగించునది. మనలో ఎన్ని వైఫల్యములున్నను మన యెదుట సత్యమును మాత్రమే ఉంచుకొని, ముందుకు సాగిపోవుదముగాక!






































