ఆదివారము పనిచేయవచ్చునా?

ఆదివారము పనిచేయవచ్చునా?

ప్రశ్న:- ఆదివారమునాడు పనిచేయవచ్చునా? వాక్యమేమనుచున్నది? ఆది వారమున పనికిపోయే క్రైస్తవుని నిర్గమ 20:10; లేవీ 23:7 ప్రకారము వెలివేస్తామా, సంఘములో నుండ నిచ్చెదమా?

జవాబు :-

ఆచారము క్రింది కాడిగా దేవుని ప్రస్తుతపు పిల్లలను చేర్చి దాసత్వము వారిచేత జరుపుట అసాధ్యము. ఆలాటి దాస్యమును కాడిక్రింద కాలమిప్పుడాచరణలో లేదు. గలతీ 5:1 చూడండి. అయితే ఫలాని ఆదివారము ఆచరణలో లేదు గనుక దినములన్నియు మనమే యిష్టానుసారముగా ఆదివారమును కూడ వినియోగించి వెళ్లబుచ్చుకొందామంటే అవసరముగా కూడుకొనుట అనేది ఏమాయెను? అది లేకుండ పోవచ్చునా? సంఘముగా లేక సమాజముగా కూడుకొనుట తప్పిపోవచ్చునా? అది వలదా? హెబ్రీ. 10:25 దీనికి జవాబు.

క్రీస్తు భక్తులు సమాజముగా కూడుకొని 1 వ కొరింథీ 14:26-28 లో వ్రాసినట్లు ఒకరి నొకరు హెచ్చరించుకొని బోధపరచి మరియు 1 కొరింథీ 10:16, 11:25 లో నున్నట్లు ఆ రొట్టె విరిచి ఆ రసము త్రాగి క్రీస్తును జ్ఞాపకము చేసికొనుట మిక్కిలి అవసరము. అట్లు కూడుకొనుట మానరాదని హెబ్రీ 10:25 లో నున్నది. సరి, ఏ దినమున కూడుకొన యుక్తమైనది? దానికికూడ జవాబున్నది. యాత్రలో నుండి త్రోయకు వచ్చిన భక్తులా పట్నములో ఏడు దినములు గడిపిరి గాని ఆ ఏడు దినముల సంబంధమైన వారి చర్య మనకు తెలుపబడలేదు. అపొ. 20:6 లో చూడండి.

అయితే 20:7 లో వ్రాసినది గమనించండి. ఆదివారము రాగానే వారు కూడుకొని రొట్టె విరిచి ప్రసంగము విని యొకరితో నొకరు సహవాసము సలిపినట్లు మన నేర్పు నిమిత్తమును మరియు మన మాదిరి కొరకును వ్రాయబడినది. ఆ రోజు కొరకే వారు కనిపెట్టినట్లున్నది. ఆ రోజే ప్రభువు దినము. (ప్రక 1:10). ఆ రోజున క్రీస్తు భక్తులు కూడుకొని తమ చందాలు తమ దగ్గిర నిలువచేసికొనిరి. (1 కొరింథీ 16:2). కాబట్టి ఆరంభకాలమందుండిన క్రీస్తు భక్తులు చేసినట్టు క్రీస్తును నమ్మిన మీరీ దినములలో చేస్తే మంచిది.

ప్రశ్నలో క్రీస్తు దినమైన ఆదివారముతో కూడ క్రీస్తును నమ్మిన వారిమట్టుకు గతించిపోయిన పాత ధర్మశాస్త్ర సంబంధమైన సబ్బాతు దిన సంబంధమైన వచనము లను చేర్చుట సరికాదు. ఆదివారము వేరు. శనివారము వేరు. క్రీస్తును నమ్మినవారు ధర్మశాస్త్రము క్రింద నేటివరకుంటే వాదమే లేదు. నిర్గమ 20:10, లేవీ 23:7 అనుసరించి శనివారము నాడు ఏ పనికీ వెళ్లకూడదు. అయితే శని ఆదివారములను కలుపుట సరిలేదు. మరియు రోమా 6:14 ప్రకారము నమ్మినవారు ధర్మశాస్త్రము క్రింద లేరని స్పష్టమాయెను. రోమా 7:4 ప్రకారము క్రీస్తు పిల్లలిప్పుడు ధర్మశాస్త్రము విషయమై మృతులైరి. దాని విధులనుండి విడుదల పొందిరి. (రోమా 7:6).

కాబట్టి యిట్టి స్వాతంత్ర్యము పొందినవారిమీద చట్టముగా నిర్గమ 20:10, మరియు లేవీ 23:7 మోపలేము. ధర్మశాస్త్రముయొక్క అక్షరమునకు చనిపోతిమి గనుక ఆ పాత శనివార సంబంధమైన హక్కులిప్పుడు చెల్లవు, అక్షరముగా చెల్లవుగాని నీతిగా చెల్లుతవి అంటే ఆ పాత అక్షరము కూడదు. 2 కొరింథీ 3:6 చూడండి. కావున అక్షరాలగా నిప్పుడు క్రీస్తును నమ్మిన వారిమట్టుకు నిర్గమ 20:10, లేవీ 23:7 ఆచరణలో లేవు. అక్షరము అమలులో లేకపోయిన ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి అనేది గతించిపోలేదు. అది విశ్వాసులలో నెరవేరవలెను. రోమా 8:3,4 ప్రకారము ఆ నీతి విధి అవసరముగా నిలిచినది. తేలినదేమనగా-

ఏడు దినములలో నొక దినమును వేరుగా నుంచేది నీతివిధిగా నిప్పుడు నెరవేరుట కావలెను. మోషేకు ముందు మరియు ధర్మశాస్త్రము నకు ముందు యెహోవా దేవుడు తానే యేడు రోజులలో నొకటి వేరుగా నుంచి పెట్టెను. (ఆది 2:1-3). ప్రతి దినము నరుడు పనిచేస్తే త్వరలో సమసిపోతాడు. పశువుకూడ యేడు రోజులలో నొక రోజు పనికిపోకుండ విశ్రాంతిగా నుండేది మంచిది. శాస్త్రజ్ఞులు జీవములేని తమ యంత్రములనుగూర్చి కూడ యేడు దినములలో నొక రోజు యంత్రమును విశ్రాంతిగా నుంచకపోతే వేగిరముగా చెడిపోతుందంటున్నారు. కాబట్టి చట్టముగా కాదు, ధర్మశాస్త్రము ప్రకారముగా కాదు గాని దేవుని పాత నీతి చట్టము అనుసరించి నట్టుగా ఏడు దినములలో నొక దినమును వేరుగా నుంచిపెట్టేది న్యాయమైయున్నది.

ఆ దినము శనివారము కాదు ఆదివారమే అని తెలియుచున్నది. గనుక క్రీస్తు విశ్వాసులు ఆదివారమును పెట్టుకొంటే మంచిదని యెరుగుచున్నాము.

శరీర సౌఖ్యముకొరకును, ముఖ్యముగా క్రైస్తవ సహవాసము కొరకును, పాత నీతి విధిని నెరవేర్చేదానికొరకును ఆ దినమును ప్రత్యేకపరచ యుక్తమైనది. యేడు దినములు పనికిపోతే అత్యాశ పెరిగినదని తేలినది జాగ్రత్త! వారములో యేడు దినములు పనికిపోతే క్రైస్తవ కూటాలెట్లు? గనుక నిలుపుదలచేసి రూపాయలమీద నెక్కువ ఆశపడకుండ వారములో నొక రోజును వేరుపరచి జీవనోపాధియైన పనిచేయకుండపోతే చాలా యోగ్యమైనది. కొన్ని పర్యాయములు నమ్మిన వారందరికి నిట్లు వీలుపడదు. రైలు పనివారేమి, పోలీసు పనివారేమి, ఆస్పత్రి పనివారేమి ప్రతి దినము జరిగే పని వారిది. అయినను ప్రభువు సహాయముచేసి ఆదివారములోకూడ యుక్త ప్రవర్తనగా విధేయులైన వారిని నడిపిస్తాడు. మోపైన చట్టముగా శనివారమును ఆచరించుట పాలస్తీనులో జూచితిని.

శుక్రవారం సాయంకాలము ఆరుగంటలు కొట్ట గానే ఇశ్రాయేలు రాజ్యములో బండ్లు, మోటార్లు, రైలుబండ్లుకూడ అన్నియు నిలిచి పోవును. అంగళ్ళనుకూడ మూసివేస్తారు. శనివారము సాయంకాలము ఆరుగంటల దాకా యూదుల రాజ్యమైన ఆ ఇశ్రాయేలు వారు నిర్గమ 20:10; లేవీ 23:7 అనే వాక్యముల క్రింద మూయబడియున్నారు. వారు క్రొత్త నిబంధన క్రిందికి నింక రాలేదు. గనుక పాతదానిలోనే నిలిచి, యిట్లు ఆ పాత వాక్యములను అక్షరాలగా అనుసరించుచున్నారు. వారి సంగతి వేరు. క్రీస్తును నమ్మి క్రొత్త నిబంధన క్రిందికి వచ్చినవారి సంగతి వేరు.

గనుక ఆదివార సంబంధముగా చెల్లని శనివార వచనములను తీసుకొని వచ్చి క్రీస్తు భక్తునికి తీర్పు తీర్చి ఫలాని రోజున పనిచేసినందుకే సంఘములోనుండి వానిని వెలివేయరాదు. సంఘములోనుండి యొకని వెలివేయతగిన కారణములు 1 కొరింథీ 5:11 లో అతి స్పష్టముగా చెప్పబడినవి. ఆదివారమునాడు పనిచేసిన కార్యము వాటిలో నిమిడివున్న యొక కారణము కాదు జాగ్రత్త ! అయితే నొకటి – లోభి అనే మాట యున్నది.

ఒకడు విశ్వాసియైనట్లు పేరుపొంది రూపాయిలు సంపాదించేదానిలో దిగి అవసరము నిమిత్తము కాదు మరియు నిర్బంధన క్రింద కాదు గాని రాగలిగినప్పుడు సహా సారి సారి ఆదివవారము వచ్చినప్పుడు కూటాలకు రాక అలాగే లోభిత్వముగలవాడైనట్టు అన్యాయముగా తన జీవితములో ఆ చెడు మనస్సు చూపితే నట్టివానిని విచారించి అతడు దిద్దుకొనకపోతే సంఘములోనుండి వెలివేయవచ్చును. వట్టి ఆచారముగా ఆదివారమును మీరినందుకు కాదు. అతడు రాగల్గి రాక సరిగా నుండగల్గి సరిగా నుండక తన లోభిత్వములో క్రీస్తును అవమాన పరచినందునను క్రైస్తవ సహవాసమును కేవలము నిర్లక్ష్యము చేసినందునకును వెలికి యోగ్యుడాయెను. త్వరపడి వాక్యమును మించి వారిని వీరిని వెలివేయరాదు. వాక్యమును లోపించి చేయవలసినది చేయక పాపులను సంఘములో నుండనియ్య రాదు. వెలివేయ తగిన కారణములు గలవు. వెలికి యోగ్యము కాని కార్యములు గలవు. కనిపెట్టి అతిక్రమించకుండ జాగ్రత్తపడవలెను.

Leave a Comment