జాన్ బన్యన్ జీవిత వృత్తాంతము

జాన్ బన్యన్ జీవిత వృత్తాంతము

పంచంలో ప్రతి ఒక్కరికీ సుపరిచితుడైన జాన్ బన్యన్ ఇంగ్లాండులోని ‘బెడ్ఫోర్డ్ పట్టణానికి ఒక మైలు దూరంలోనున్న ఎలో గ్రామంలో క్రీ.శ. 1628వ సంవత్సరంలో జన్మించాడు. అతని స్వంతమాటల్లో చెప్పాలంటే అతడు “సమాజంలో ఏమాత్రం ఎన్నికలేని ఒక దిగువస్థాయి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఆ ప్రదేశంలో తృణీకరించబడినది అయిన పాత్రలకు కళాయివేసే వృత్తిని చేపట్టి ఒక కళాయి వేసేవానిగా పిలువబడుతూ వచ్చాడు. ఆ రోజుల్లో ఈ వృత్తి సమాజంలో ఏమాత్రం గౌరవంలేని వృత్తిగా పరిగణించబడేది.

బహుశాః ఈ వృత్తిని చేపట్టేవారు ఒక ప్రదేశంనుండి ఇంకో ప్రదేశానికి తిరిగే సంచారులు కావడంవల్లనూ, ఏమాత్రం సిద్ధాంతాల్లేని వారి అనైతిక అలవాట్లు మరియు జీవన విధానంవల్లనూ వారికి సమాజంలో ఎలాంటి గౌరవమూ ఉండేదికాదు. అయితే, బన్యన్ తండ్రికి ఎల్లో గ్రామంలో ఒక స్థిరమైన నివాసగృహం మాత్రమేగాక, తన ఇరుగుపొరుగు వారిమధ్య అతనికి మంచి గౌరవమర్యాదలు ఉండేవి. అంతేగాక, సమాజంలో హీనదశలోనున్న సామాన్య ప్రజానీకం తమ పిల్లలను ఒక పాఠశాలకు పంపించి చదివించడం అత్యంత అరుదుగానుండిన ఆ రోజుల్లో బన్యన్ తండ్రి అతనికి విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఒక పాఠశాలకు పంపిం చాడు.

తాను నేర్చుకొన్న “అతికొద్ది చదువును అనతికాలంలోనే మరచిపోయి నట్లు”గా జాన్ బన్యన్ చెప్పినప్పటికీ, అతడు చదవడాన్నీ వ్రాయడాన్నీ మాత్రం బాగా నేర్చుకొన్నాడు.

అతని జ్ఞాపకశక్తి అత్యద్భుతమైనదనీ, అతని మానసికశక్తి అత్యంత ఆరోగ్యకరమైనదనీ అతని రచనలద్వారా మనకు స్పష్టమవుతోంది. తన బాల్య చేష్టల కారణంగా విద్యను అభ్యసించాలన్న జిజ్ఞాస అతనిలోనుండి తొలగిపోయినందువల్ల, తన జ్ఞాపకశక్తిని గురించి బహుశాః బన్యన్ తప్పుగా అంచనా వేసికొని ఉండవచ్చు.

తన జీవితంలో అమూల్యమైన అనేక సంవత్స రాలు తాను తిరిగిన పనికిరాని తన చెడు తిరుగుళ్ళనుబట్టి తాను నేర్చుకొన్న కొద్దిపాటి విద్యకు తానేమీ అదనంగా చేర్చలేకపోయానని అతడు అభిప్రాయ పడ్డాడు. అతని బాల్యచేష్టలను గురించిన వివరణ మరియు వాటి ఫలితంగా అతడు అనుభవించిన నైరాశ్యపు జీవితాన్ని గురించి “ప్రధానపాపికి చూపబడిన అపరిమితమైన కృప” అన్న పేరుతో అతడు వ్రాసిన తన ఆత్మీయ స్వీయకథలో
మనము చదువగలము.

దేవుని కృప కార్యరూపంలో …

తన ప్రారంభజీవితంలో అతడు అనేక ప్రమాదకరమైన పరిస్థితులనుండి తప్పింపబడ్డాడు. రెండుసార్లు నదిలో మునిగిపోతుండగా వెంట్రుకవాసి వ్యత్యా సంలో అతడు తప్పించబడ్డాడు.

పార్లమెంటరీ సైన్యంలో సైనికునిగా ఉన్నప్పుడు అతని స్థానంలో వేరొక సైనికుడు యుద్ధానికి వెళ్ళి హతుడయ్యాడు. ఆ వ్యక్తి “ఒక తుపాకీ తూటా తలలోకి చొచ్చుకొనిపోగా అతడు అక్కడికక్కడే మరణిం చాడు.” ఆ తర్వాత, తన పాపములకుగాను తన్ను శిక్షించక, శిక్షతో మిళితమైన అపార కృపతో తనను కాపాడుతూ ఆశీర్వదిస్తోన్న దేవుని కృపాహస్తాన్ని బన్యన్ చూడటం ప్రారంభించాడు. అంతేగాక, తాను ఇంకను యౌవనస్తునిగా ఉన్న సమయంలో భక్తిగల భార్యను తనకనుగ్రహించి తనను ఆశీర్వదించిన దేవుని కృపాహస్తాన్ని బన్యన్ స్పష్టంగా చూడగలిగాడు.

ఆమె మాదిరి జీవితం మరియు ఆమెలోని మార్పు యౌవనస్తుడైన ఆ కళాయివేసే వ్యక్తిని క్రమంగా దేవాలయానికి వెళ్ళేందుకు పురికొల్పడం మాత్రమేగాక, త్రాగుబోతులైన తన సహచరుల సహవా సాన్ని అతడు అసహ్యించుకొనేలా చేసింది. ఆమె సహచర్యానికీ, ఆమె ప్రక్కన వెచ్చగా చలికాచుకోవడానికీ అతణ్ణి ప్రోత్సహించిన అతనిలోని తీవ్రమైన వాంఛ అల్లరిగా తిరిగే తన సహచరుల దుష్ట సాంగత్యానికి అతణ్ణి దూరంచేసింది.

తమకు ఒక చిన్న గరిటెగాని ఒక చిన్న గిన్నెగాని లేనంతటి అత్యంత నిరుపేద స్థితిలో ఆ యౌవనదంపతులు తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు.

తన తండ్రి తనకు అందించిన ఆస్తి అయిన రెండు పుస్తకాలను అతని భార్య వారి వైవాహిక బంధంలోనికి తీసుకొచ్చింది.

“పరలోకానికి సామాన్య మానవుని రాజ బాట” మరియు “భక్తి సాధన” అన్న రెండు అమూల్యమైన పుస్తకాలను ఆమె తనతోపాటు తీసుకొచ్చింది. ఈ పుస్తకాలు బన్యను ఆత్మీయంగా ప్రభావితంచేసి, అతని ఆత్మీయాభివృద్ధికి అమితంగా దోహదపడ్డాయి.

యౌవనస్తుడును ఆరోగ్యవంతుడును అయిన బన్యన్ తన వృత్తిద్వారా తన కుటుంబ అవసరాలకు తగినంతగా సంపాదించుకొని ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించగలడు. అతని భార్య మంచి పొదుపరి, శ్రమజీవి, ఆరోగ్యకర మైన మానసికస్థాయి కలిగిన వ్యక్తి. వారి చిన్నికుటీరంలో వెలుగును వెదజల్లి దానిని శాంతి, సంతృప్తి, సమాధానములతో నింపేందుకు నిజమైన దైవభక్తి తప్ప వారిరువురికి మరింకేం కావాలి?

అయితే, నిజమైన దైవభక్తి అంటే ఏంటో జాన్ బన్యనక్కు ఇప్పటివరకు ఏమాత్రం తెలి యదు. అయినప్పటికీ అతడు చర్చికి వెళ్ళడంలో ఆనందించసాగాడు. చర్చి, చర్చి వేదిక, పీఠాధి పతి, అతని సహాయకులు, వారు ధరించే దుస్తులు … ఇవన్నీ అతణ్ణి అమితంగా ఆకర్షిం చాయి.

నిజమైన దైవభక్తి అంటే ఎంటో అప్పటికింకా జాన్ బన్యన్ కు తెలియకపోయినా, అతడు చర్చికి వెళ్ళడంలో ఆనందించసాగాడు.

వీటన్నిటిలో అతడు సంపూర్ణంగా ఆనందించడం ప్రారంభించాడు. అయి నప్పటికీ అతడు వాస్తవమైన భక్తిజీవితానికి ఇంకను అపరిచితుడే.
అతని దైవధ్యానాలు ఇంకను అత్యంత సాధారణమైనవే. అప్పుడప్పుడూ అవి అతని మనఃస్సాక్షిని మేల్కొలిపి అతని ప్రశాంతతను భంగపరుస్తున్నప్పటికీ, వాటిపట్ల క్రమక్రమంగా అతనికి మక్కువ ఎక్కువకాసాగింది.

దైవభక్తిపట్ల అతనిలో చెలరేగే ఆలోచనలు ఒకదానికి మరొకటి భిన్నమైనవై అతణ్ణి తీవ్రమైన గలిబిలికి గురిచేయడం ప్రారంభించాయి. అవన్నీ అతణ్ణి మార్మికవాదమువైపు మళ్ళిస్తూ, అతణ్ణి భవిష్యత్తును గురించిన లోతైన ఆలోచనల్లో పడవేయడం ప్రారంభిం చాయి.
కొన్నిసార్లు పరలోకంనుండి ఒక స్వరం తనతో మాట్లాడుతున్నట్టుగా అతడు అనుభూతి చెందేవాడు. మరికొన్నిసార్లు తన జ్ఞానేంద్రియాలకు వింతైన మార్మిక దృశ్యాలు ప్రత్యక్షపరచబడుతున్నట్టుగా అతనికి అనిపించేది.

ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలన్న ఆశతోను ఆసక్తితోను అతడు బైబిలు పఠనంలోను ప్రార్థనలోను గడపడం ప్రారంభించాడు. ఆ తర్వాత, తన గ్రాహ్యశక్తికి సుదూరంలో నున్న దైవికమర్మాలను గురించి తీవ్రమైన కలతకు గురై అతడు తన బైబిలు పఠనమును ఆపివేశాడు.

నిరాశా నిస్పృహలలో…

కొన్నిసార్లు తన హృదయం తీవ్రమైన అలజడికి గురైన సమయంలోను, తన చుట్టూ చిమ్మచీకట్లు కమ్ముకొన్న సమయంలోను ఏదో ఒక చిరుదీపంలాంటి ఆశ తన్ను ఆవరించి ఉన్నట్టుగా అతనికి అనిపించేది. అయితే, మరికొన్ని సమయాల్లో లోతైన నైరాశ్యపు చీకట్లు తన్ను ఆవరించి ఉన్న సమయంలో అతడు తీవ్రమైన భయభ్రాంతులకు గురైనవాడై, “ఆయ్యో నా స్థితి ఎంత దౌర్భాగ్యకర మైనది! నా పాపములను నేను వదలినప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే! పాపములను నేను విడిచిపెట్టనప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే! ఎటు చూచినా నా స్థితి దౌర్భాగ్యమైనదే! నేను కేవలం శిక్షకే పాత్రుడను.

నేను చేసే కొన్ని పాపముల కొరకైనా మరిన్ని పాపముల కొరకైనా నేను శిక్షార్హుడనే” అని భోరున విలపించేవాడు. ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక క్షోభను గురించి అతడు ఇలా ఆవేదనతో వ్రాశాడు:

“నా ఆట మధ్యలో నా చుట్టూ ఉన్నవారందరి యెదుట నేను అలాగే నిశ్చేష్టుడనై నిలువబడ్డాను. కాని ఏం జరిగిందో నేను వారికి చెప్పలేదు.

అలా కాసేపు మౌనంగా నిలుచున్న తరువాత చివరిగా ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి నేను తిరిగి నా ఆటలో కొనసాగాను. ఇలాంటి నిరాశా నిస్పృహలు నాలో పదేపదే చోటుచేసుకొంటున్నాయని నాకు తెలుసు. వాటినుండి నేను ఉపశమనం పొందే మార్గం కేవలం నేను నా పాపంలో కొనసాగడమే. ఎందుకనగా పరలోకం అనేది నాకు అందనిది. కావున, నేను దాన్ని గురించి ఆలోచించడంలో ఏమాత్రం అర్థం లేదు. అందు వలన నన్ను నేను విపరీతమైన పాపంతో నింపుకోవాలని నేను అమి తంగా ఆశించాను. నేను మరణించి ఈ లోకాన్ని వదలక మునుపు ఈ లోకంలో ఉన్న పాపపు లోతులన్నిటినీ నేను అనుభవించాలి. అందులోని మాధుర్యాన్ని నేను రుచిచూడాలి.”

ఒక మారిన మనిషిగా …

ఈ భయంకరమైన పరిస్థితినుండి అతడు ఒక అసాధారణమైన విధంగా విడిపించబడ్డాడు. ఒకనాడు పాపిష్టురాలైన ఒక స్త్రీ అతణ్ణి తీవ్రంగా అసహ్యించు కొంటూ, అతని బూతుమాటలను తాను వినలేకున్నాననీ, అతనిలాంటి భక్తిహీన మైన వ్యక్తిని తన జీవితంలో తాను ఎన్నడూ చూడలేదనీ, ఆ గ్రామంలోని యౌవ నస్తులందరినీ అతడు చెడుమార్గంలో నడిపిస్తూ వారిని సర్వనాశనం చేస్తున్నాడనీ నడివీధిలో అనేకమంది యెదుట అతణ్ణి శాపనార్ధాలు పెట్టసాగింది. ఆమె మాటలు అతని గుండెల్లోకి శూలాల్లా దూసుకుపోయాయి. అతడు అవమాన భారంతో చాలసేపు అలానే నిశ్చేష్టుడై మౌనంగా నిలబడ్డాడు.

ఈ సంఘటన అతని జీవితంలో పెనుమార్పును తీసుకొచ్చింది. అతడు వెంటనే తన చిన్ననాటి నుండి వాడుకగా తనలోనుండి వస్తోన్న బూతుమాటల్ని వెంటనే మానివేశాడు. అంతేగాక, అతడు బైబిలు గ్రంథాన్ని చదివేందుకు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు. అతని ప్రవర్తనలో ఎంతగా మార్పు వచ్చిందంటే, అతని ఇరుగు పొరుగువారు అతనిలోని మార్పును చూసి ఆశ్చర్యచకితులై, ఒక మార్పునొందిన వ్యక్తిగా అతనిని గౌరవించడం ప్రారంభించారు.

“నాలాగా దేవుణ్ణి సంతోషపరచే వ్యక్తి ఇంగ్లండు దేశమంతటిలో వేరెవరూ లేర”ని జాన్ బన్యన్ ఆలోచించసాగాడు.

ప్రారంభంలో అతడు చర్చి గంటల్ని కొట్టడంలో అమితంగా ఆనందించేవాడు. అయితే, కాలక్రమేణా అతనిలోని మనఃస్సాక్షి మృదువుగా మారేకొలదీ “అలాంటి ఆచారం కేవలం వ్యర్థమైనదని” అతడు అభిప్రాయపడటం ప్రారంభించాడు. మెల్లమెల్లగా వినోదాలనూ నాట్యాలనూకూడ అతడు అల్లరితో కూడిన ఆట పాటలుగా భావించి విడిచిపెట్టాడు. క్రమ క్రమంగా నైతికభావన అతనిలో చోటు చేసు కొంది. అనతికాలంలోనే “నాలాగా దేవుణ్ణి సంతోషపరచే వ్యక్తి ఇంగ్లాండు దేశమంతటిలో వేరెవరూ లేర”ని అతడు ఆలోచించసాగాడు. అయితే, వాస్తవమైన హృదయ పరివర్తనను అతడింకను అనుభవించలేదు. హృదయంలో లోతైన మార్పుయొక్క అవసరత అతనికి ఏ మాత్రం తెలిసియుండలేదు.

హృద యముయొక్క స్వభావము పూర్తిగా మారాలన్న అవగాహనకూడ అతనికింకను కలుగలేదు. అయితే, దేవుని దృష్టిలో తన వాస్తవస్థితి ఆమోదయోగ్యమైనది కాదని తన హృదయపు లోతుల్లో ఎక్కడో ఒక మెల్లని స్వరం తనను మేల్కొలుపు తున్నట్టుగా అతనికి అనిపించేది.

ఒకనాడు మారుమనస్సును గురించీ, తిరిగి జన్మించుటను గురించీ భక్తిపరులైన కొందరు స్త్రీలు ఒకచోట మాట్లాడుకోవడాన్ని విన్న బన్యన్, తన భక్తిమార్గం కేవలం లోపభూయిష్టమైనదనీ “నిజమైన భక్తి పరునికి ఉండవలసిన గుర్తులు” తనలో లేవనీ గ్రహించాడు.
అతనిలో ఈ నూతనమైన వెలుగు ప్రవేశించడానికి కారకులైన ఆ స్త్రీలు, జాన్ గిఫోర్డ్ పాస్టరుగానున్న బెడ్ఫోర్డ్లోని బాప్టిస్ట్ సంఘానికి చెందినవారు.

ఆ సత్పురుషుని గురించి ఇవిమీ (Mr. Ivimey) అనే వ్యక్తి తాను రచించిన “ఇంగ్లీషు బాప్టిస్టుల చరిత్ర” (History of the English Baptists) అన్న పుస్తకంలో ఇలా వ్రాశాడు:

“అతని శ్రమ ఒక ఇరుకైన పరిధికే పరిమితమై ఉన్నప్పటికీ, కొంత కాలం తర్వాత ఆ శ్రమయొక్క ఫలితాలు చాల విశాలంగా విస్తరించాయి.

అతడు ఎల్లోని ఒక దుర్మార్గుడైన కళాయివేసే వ్యక్తికి బాప్తిస్మము ఇచ్చి తన సంఘానికి అతనిని పరిచయం చేసిన దృశ్యాన్ని మనము వీక్షించినప్పుడు, దుర్మార్గపు ద్వారంగుండా బన్యను సువార్త జ్ఞానము లోనికి నడిపించిన సువార్తికునిగా మనము అతనిని తప్పక గౌరవిస్తాం.

గాఢాంధకారపు లోయలోనుండి ఆ వ్యక్తిని వెలుగుమయమైన పర్వత శిఖరాగ్రానికి చేర్చిన బోధకునిగా మనము అతనిని తప్పక ప్రశంసిస్తాం. అయితే, దేవునిచే ఎన్నుకొనబడిన పాత్రయైన నిరుపేదయు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోన్నవాడును అయిన బన్యను మొట్టమొదటి సారి తన ఇంటి తలుపులను తెరిచే సమయంలో అతని భవిష్యత్తును గురించి ఆ సంఘకాపరికి ఏమాత్రం తెలియదు. అతడు ఒక గొప్ప పాత్రగా దేవునిచేతిలో వాడబడతాడని ఆ సంఘకాపరి ఆ సమయంలో ఏమాత్రం ఊహించి ఉండడు.”

బన్యన్ మార్పుకు కేవలం గిఫోర్డ్ మాత్రమే కారణమని మనము చెప్పలేము గాని, అతని సంభాషణ మరియు బోధలు ఎల్టాలోని ఒకప్పటి దుర్మార్గుడైన కళాయివేసే వ్యక్తికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనము విశ్వసించక తప్పదు.

జాన్ బన్యన్ కు మొట్టమొదటిసారి తన ఇంటి తలుపులను తెరిచే సమయంలో అతని భవిష్యత్తును గురించి ఆ సంఘకాపరికి ఏమాత్రం తెలియదు.

తన మార్పు తర్వాత తన అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణను బన్యన్ అనుభవిం చాడు. తనలోని అపరాధభావన ఒకవైపూ, క్రీస్తు దయచేసిన క్షమాపణ ధర్మశాస్త్రపు అవస రతను కొట్టివేసిందన్న బోధ మరోవైపూ అతణ్ణి తీవ్రమైన సంఘర్షణకు గురిచేసాయి. అయితే, బన్యన్ ఈపాటికే లేఖనాలను అత్యంత శ్రద్ధా సక్తులతోను ప్రార్థనాపూర్వకంగాను పఠించియున్నాడు. గనుక దేవుని ఆత్మయొక్క ఆశీర్వాదాన్నిబట్టి, దేవునియందు నమ్మికయుంచినవారు “ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు” (యెషయా 45:17) అన్న లేఖనానుసారమైన నిశ్చయతద్వారా తీవ్రమైన అలజడికి గురియైయున్న తన ఆత్మలో అతడు శాంతినీ విశ్రాంతినీ పొందాడు.

బోధించేందుకు నియమించబడుట

క్రీ.శ. 1655వ సంవత్సరంలో తన ఇరవై ఏడేండ్ల వయస్సులో గిఫోర్డ్ సంఘ సభ్యునిగా బన్యన్ చేర్చబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికే ఆ సంఘము తన కాపరి మరణంతో కృంగిపోవడంతో, తన అర్హతల విషయమై కొన్ని పరీక్షల తర్వాత, నూతన సహోదరుడుగా ఆ సహవాసంలోనికి చేర్చబడిన బన్యన్, అప్పు డప్పుడూ ఆ సంఘంలో బోధించే బాధ్యతను చేపట్టేందుకు ఆ సంఘసభ్యులచే ప్రోత్సహించబడ్డాడు. తన ఈ నియామకాన్ని గురించి బన్యన్ ఇలా వ్రాశాడు:

“తమ దృష్టిలో పరిశుద్ధునిగా కనిపించిన నాలో దేవుని చిత్రాన్ని గ్రహించే యోగ్యత తమకు అగుపడినందునను, దేవుని పరిశుద్ధ వాక్య మును ప్రకటించుటకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపావరమును తాము స్పష్టంగా కనుగొనినందునను, తమకు దేవుని వాక్యమును బోధింప వలెనని మాతోనున్న పరిశుద్ధులు కొందరు నన్ను బలవంతం చేసారు. అలా తమ కూడికలలో తమకు దేవుని వాక్యమును బోధించమని వారు నన్ను పదే పదే అర్థించినందున మొదట నేను అంగీకరించనప్పటికీ, ఆ తర్వాత వారి కోరికను నేను మన్నించవలసి వచ్చింది.”

మొట్టమొదట బన్యన్ బోధించడాన్ని ప్రారంభించినప్పుడు, ప్రజలు అతని బోధను వినేందుకు నలుదిశలనుండి తండోపతండాలుగా రావడం ప్రారంభిం చారు. అతని పరిచర్యలో స్పష్టంగా కనిపించే జయకరమైన ఫలితాల్ని చూసిన సంఘస్తులు కొంతకాలం “పట్టుదలతో ఉపవాస ప్రార్థన” చేసిన తరువాత, బెడ్ఫోర్డ్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ పూర్తి పరిచర్య జరిగించేందుకు అతణ్ణి నియమించారు.

బోధించడం ప్రారంభించిన మొదట్లో బన్యన్ ధర్మశాస్త్రముయొక్క భయంకర మైన స్థితిని గురించి బోధించసాగాడు. ఈ అంశంపై తాను బోధించడాన్ని గురించి అతడు ఈ విధంగా వ్రాశాడు:

“నాకు అప్పగింపబడిన ఈ పరిచర్యను అత్యంత శ్రద్ధాభక్తులతోను, గొప్ప నమ్మకత్వంతోను నేను నెరవేర్చాను. వ్యక్తిగతంగా నేను చూచి అనుభవించినవాటినే నేను బోధించాను.

నా దౌర్భాగ్యపు ఆత్మ మూల్గులనే నేను ప్రకటించాను. సంకెళ్ళచే బంధింపబడినవారు విడుదల పొందు నట్లుగా సంకెళ్ళచే బంధించబడిన నేను, నా అనుభవాలతో వారికి బోధించేందుకు బయలువెళ్ళాను.

నా స్వంత మనఃస్సాక్షిలో అగ్నిజ్వాలల్ని చవిచూసిన నేను, వాటి విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ బోధించగలిగాను.” అతని ఆత్మీయస్థితి మెరుగుపడేకొద్దీ అతని బోధలు మెరుగులు దిద్దుకో సాగాయి. తాను “అనుభవించి అనుభూతి పొందినవాటినే” అతడు బోధించాడు.

“పాపాన్ని శత్రువుగా భావించిన పాపుల మిత్రుడైన క్రీస్తునే అతడు బోధించాడు. క్రీస్తు కృపాకార్యంపై మాత్రమే ఆధారపడవలెనని అతడు తన సభికులకు బోధిం చాడు. “ఈ లోకము ఆధారపడే పడిపోవునవీ నాశనమయ్యేవీ అయిన తప్పుడు స్తంభాలను పెకలించివేయడమే అతని సందేశములయొక్క ముఖ్యోద్దేశము.”

అంకితభావము కలిగిన రచయిత

ఇప్పుడు బన్యన్ నిరంతర పరిచర్యలో విరామం లేకుండా ఉన్నాడు. తనకు ఇవ్వబడిన మానసిక శారీరక మరియు ఆత్మీయ శక్తిచే అతడు దేవుని వాక్యాన్ని బోధించడం మాత్రమేగాక, ఆత్మీయ రచనలనుకూడ ప్రచురించడం ప్రారంభిం చాడు. “లేఖనముల ప్రకారము వెల్లడించబడిన కొన్ని సువార్త సత్యములు” అనునది అతని మొదటి ప్రచురణ. బెడ్ఫోర్డ్లోని సంఘ పరిచర్యలో గిఫోర్డ్ వారసుడైన జాన్ బర్టన్ (John Burton) తన వ్యాఖ్యానాన్ని ఈ విధంగా వ్రాశాడు:

సత్యములను గురించి ఈ నా సహోదరుడు రచించిన రచనలకు నేనును సాక్ష్యము పలుకుట నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.”

“ఈ వ్యక్తియొక్క స్థిరమైన విశ్వాసాన్నీ, అతని దైవిక సంభాషణలనూ, మానవ నైపుణ్యముతోగాక క్రీస్తు ఆత్మతో సువార్తను ప్రకటించుటలో అతనికిగల సామర్థ్యాన్నీ, పాపులగు అనేకులను క్రీస్తువైపుకు త్రిప్పుటలో అతడు సాధించిన విజయాన్నీ, ఇతర పరిశుద్ధులతోబాటు నేనును ప్రత్యక్షంగా వీక్షించిన తరువాత, ప్రభువైన యేసుక్రీస్తు మహిమకరమైన బన్యన్ చేసిన ఈ రచన కాకర్ల (Quakers) చే తీవ్రంగా వ్యతిరేకించబడింది.

మంత్రశక్తులను ఉపయోగించి చేసిన రచనగా వారు దానిని అభివర్ణించారు. అందులో అతడు “తాను సిలువపై వ్రేలాడిన శరీరంతోనే మరియ కుమారుడైన యేసు పరలోకంలో ఉన్నాడని” వ్రాసినందున, అతడు “ఒక విగ్రహాన్ని గురించి బోధించాడని” వారు విమర్శించారు.

క్రీస్తు మరణం పునరుత్థానం ఆరోహణం మరియు మధ్యవర్తిత్వం మున్నగువాటిని గురించిన లేఖనానుసారమైన తన అభిప్రాయాలను బన్యన్ సమర్థించుకొంటూ వారి నేరారోపణలకు విరోధంగా శక్తివంతంగాను సరియైన విధంగాను న్యాయసమ్మతంగాను వాదించాడు.

అతని భాషాశైలి ప్రత్యేకంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, మొట్టమొదటి సారిగా రచనా వ్యాసంగంలోనికి ప్రవేశించిన విద్యావంతుడుకాని ఒక వ్యక్తి చేసిన ఆ రచన ఒక అసాధారణమైనదే. బన్యన్ రచనకు జవాబుగా “సమాధాన సువార్త యొక్క నిజమైన విశ్వాసము కొరకు వినయముతో కూడిన పోరాటము”

బోధించడాన్ని విరమించడానికి బన్యన్ నిరాకరించడంతో అతడు బెడ్ఫోర్డ్ చెరసాలకు అప్పగించబడ్డాడు.

అన్న పేరుతో ఎడ్వర్డ్  బరోస్ అనే వ్యక్తి ఒక కరపత్రాన్ని విడుదల చేసాడు. అయితే, బన్యన్ ఆ కరపత్రానికి సరైన  ఇచ్చాడు. బరోస్ ఆ తర్వాత తిరిగి మరో కరపత్రాన్ని విడుదల చేసినప్పటికీ బన్యన్ తన రచనను బలంగా నిరూపించ డంతో చివరికి వివాదం సద్దుమణిగింది.

చెరసాలకు పంపబడుట

క్రీ.శ. 1657లో ఈటన్ (Eaton) అనే స్థలంలో బన్యన్ బోధిస్తున్న సమ యంలో లండన్ చర్చి ఆరాధనకు విరోధంగా బోధిస్తున్నాడని అతనిపై నేరా రోపణ చేయబడింది. అయితే ఆ రోజుల్లో బ్రిటీష్ కామన్వెల్త్లో తీవ్రమైన శిక్షలు

అమలులో ఉండినప్పటికీ, అతనిపై మోపబడిన నేరారోపణ ఋజువుకానందు వల్ల బన్యన్కు ఎలాంటి శిక్షా పడలేదు. అయితే, కొన్ని నెలల తరువాత బన్యన్పై అరెస్టు వారంటు జారీచేయబడింది. ఫలితంగా బెడ్ఫోర్డ్షైర్లోని సామ్ సెల్లో అతడు నిర్బంధించబడి వినేట్ (Wingate) అనే న్యాయాధిపతి యెదుట హాజరుపరచబడ్డాడు. బోధించడాన్ని విరమించడానికి బన్యన్ నిరాకరించడంతో అతడు బెడ్ఫోర్డ్ చెరసాలకు అప్పగించబడ్డాడు. న్యాయస్థానంలో అతనిపై మోపబడిన అభియోగం ఈ విధంగా ఉంది :

“బెడ్ఫోర్డ్ పట్టణంలో సామాన్య కార్మికుడైన జాన్ బన్యన్ దైవిక ఆరాధనలో పాల్గొనడానికి చర్చికి రావడాన్ని మానివేయడమేగాక చట్ట విరుద్ధమైన రహస్య మతకూడికలను నిర్వహిస్తూ రాజరికపు సార్వ భౌమాధికారానికి హాని కలిగిస్తున్నాడు.”

ఈ అభియోగంపై అతడు తిరిగి మూడు నెలలు చెరసాల నిర్బంధంలోనికి పంపబడ్డాడు. అంతేగాక, ఆ మూడు నెలల నిర్బంధం తర్వాత చర్చికి వెళ్ళేందుకూ బోధించడాన్ని మానివేసేందుకూ అతడు అంగీకరించనట్లయితే, దేశబహిష్క రణకు గురికావలసి ఉంటుందని అతడు హెచ్చరించబడ్డాడు.

ఒక నమ్మకస్తురాలైన భార్య

ఈ సమయానికి బన్యన్కు అతని మొదటి భార్యద్వారా పుట్టిన నలుగురు చిన్నబిడ్డలు ఉన్నారు. అతని పెద్ద కుమార్తె అయిన మేరీ పుట్టుకతోనే అంధురాలు. తన మొదటి భార్య మరణించిన సంవత్సరం తరువాత అతడు తిరిగి వివాహం చేసుకొన్నాడు. అతని రెండవ భార్య ప్రసవదినములు సమీపిస్తున్న సమయంలో బన్యన్ చెరసాలలో బంధించబడటం మరియు అతని దేశబహిష్కరణలను గురిం చిన వార్తలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేయడంవల్ల తన ప్రసవదినములకు ముందే ఆమె ఒక మరణించిన బిడ్డను ప్రసవించింది. అయినప్పటికీ, ఈ శ్రమలన్నిటి మధ్యలో ఆమె తన భర్త విడుదలకోసం తీవ్రంగా పోరాడింది.

ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లండన్కు ప్రయాణంచేసి తన భర్త విడుదల కోసం హౌస్ ఆఫ్ లార్డ్స్క ఒక వినతిపత్రం సమర్పించింది. అయితే, ఈ విషయమై స్థానిక న్యాయస్థానంలోని న్యాయవాదులను సంప్రదించమని అక్కడ ఆమె నిర్దేశించబడింది. ఆమె తన ఇంటికి తిరిగి వచ్చి ఎంతో వినయముతోను ‘వణకుతున్న హృదయంతోను’, అనేకమంది న్యాయవాదుల సమక్షంలోను ఆ పట్టణములోని పెద్దల సమక్షంలోను తన విన్నపాన్ని న్యాయమూర్తులకు సమర్పిం చింది. అక్కడున్న న్యాయమూర్తులలో ఒకరైన సర్ మాథ్యూ హేల్ (Sir Mat- thew Hale) ఆమె భర్త విడుదల విషయంలో తన నిస్సహాయతను వ్యక్తంచేస్తూ తన తలను అడ్డంగా ఊపాడు.

“నీ భర్త బోధించడాన్ని విడిచిపెడతాడా?” – ట్విస్డెన్ (Twisden) అనే న్యాయాధిపతి ఆమెను ప్రశ్నించాడు. “ఆ విధంగా అతడు విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే, అతణ్ణి పిలిపించండి.”

“అయ్యా, తాను మాట్లాడగలిగినంత కాలం అతడు బోధించడాన్ని నిలిపి వేయలేడు” – ధైర్యస్తురాలైన ఆ స్త్రీ అతనికి జవాబిచ్చింది. సర్ మాథ్యూ ఆమె మాటల్ని తీవ్రమైన బాధతో ఆలకించాడు. అయితే, ట్విస్డెన్ ఆమెతో కఠినంగా మాట్లాడి దారిద్ర్యమే ఆమె పైవస్త్రమని ఆమెతో అన్నాడు.

“అవును,” – ఆమె సింహంలా గర్జించింది – “అతడు ఒక కళాయివేసేవాడు గనుకనూ, అతడు ఒక నిరుపేద గనుకనూ అతడు తృణీకరించబడ్డాడు. కాబట్టి అతనికి ఏమాత్రం న్యాయం జరగదు” – మండే గుండెతో ఆమె అతనికి బదు లిచ్చింది. ఆ సందర్భాన్ని గురించి ఎలిజబెత్ బన్యన్ తన అభిప్రాయాన్ని ఈ క్రింది మాటల్లో తెలిపింది :

“నేను న్యాయస్థానంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టే సమయంలో భయపడినప్పటికీ, నేను అక్కడనుండి బయటకు వచ్చే సమయంలో కన్నీటి పర్యంతమయ్యాను. అలా నేను ఏడ్చింది నాపట్లనూ నా భర్తపట్లనూ వారు కఠినంగా ప్రవర్తించినందుకు కాదుగాని, ‘ఈ దౌర్భాగ్యులు ప్రభువు రాకడ సమయంలో ఏమని లెక్క అప్పగించ గలరా?’ అని నేను విలపించాను.”

ఫలాల్ని పండించిన కారగారవాసము

బన్యన్ పన్నెండు సుదీర్ఘ సంవత్సరాల కాలంపాటు కారాగారవాసం చేసాడు. అయితే, అతడు చెరసాల అధికారి కనికరమునుబట్టి అప్పుడప్పుడూ రాత్రివేళల్లో తన ఇంటికి వెళ్ళివచ్చేవాడు. ఒక సందర్భంలో అతడు రహస్యంగా లండన్లోని క్రైస్తవ విశ్వాసులను దర్శించాడు. తన జీవితంలోని అత్యంత మధురమైన కాలాన్ని అతడు చెరసాల నాలుగు గోడలమధ్య వ్యర్థపుచ్చుతున్న ఈ సమయంలో, బైబిలుగ్రంథం మరియు ఫాక్సుగారి హతసాక్షుల పుస్తకం తప్ప మరే పుస్తకమూ తనతోలేని ఈ కాలంలో అతడు దేవుని ప్రజలకు ఆదరణ కలిగించే అనేక చిన్న చిన్న కరపత్రాలతోపాటు తన సజీవ రచన అయిన “యాత్రికుని ప్రయాణము”ను రచించేందుకు పూనుకొన్నాడు.

చెరసాలనుండి విడుదల

బన్యన్ కారాగార శిక్ష అనుభవించిన చివరి సంవత్సరమగు 1671 లో అతడు బెడ్ఫోర్డ్ లోని బాప్టిస్ట్ చర్చికి పాస్టరుగా ఎన్నుకొనబడ్డాడు. తాను కారాగార శిక్ష అనుభవించిన చివరి నాలుగు సంవత్సరాలు అతడు ఆ సంఘ కూడికలకు వెళ్ళేందుకు చెరసాల అధికారిచే రహస్యంగా అనుమతించబడ్డాడు. తాను సాయం కాలం చెరసాలకు తప్పక తిరిగొస్తానన్న అతని మాటపై చెరసాల అధికారికి ఏమాత్రం అనుమానం ఉండేదికాదు.

చిట్టచివరిగా అతని విడుదల అధికారికంగా ప్రకటించబడింది. లింకన్ బిషప్ అయిన బార్లో, బన్యన్ విడుదల విషయంలో జోక్యంచేసుకొన్నాడు. అతని విడుదల తర్వాత బెడ్ఫోర్డ్ ఒక క్రొత్త ప్రార్థనా మందిరం నిర్మించబడింది.

తన శేషజీవితమంతా బన్యన్ ఆ ప్రార్థనామందిరం లోనే విస్తారమైన జనసమూహానికి బోధిస్తూ గడిపాడు.

సంవత్సరానికి ఒకసారి అతడు లండన్కు వెళ్ళి సౌత్వారాలోని సమావేశ భవనంలో బోధించేవాడు. ఆ సమయంలో ఆక్కడి ప్రజలు అతనిని అత్యంత ఆదరాభిమానాలతో ఆహ్వానించేవారు. అంతేగాక, అతడు బెడ్ఫోర్డ్ మరియు లండన్ పరిసర ప్రాంతాల్లో కూడ విరివిగా సంచరిస్తూ బోధించేవాడు. అతడు నగరాల్లో బోధించే సమయాల్లో ఆనాటి ప్రసిద్ధిగాంచిన వేదాంత పండితుడైన ఓవెన్ (Owen) తప్పక అతని కూడికలకు హాజరై అతని బోధలను వినేవాడు. విద్యాధికుడూ వేదాంతపండితుడూ అయిన ఆ వ్యక్తి విద్యాధముడైన ఒక కళాయి వేసేవాని బోధలను వినడాన్ని గురించి ఒకసారి రెండవ చార్లెస్ రాజు అతణ్ణి ప్రశ్నించినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు: “ఘనతవహించిన రాజా, అతని లాంటి బోధనాసామర్థ్యాన్ని సంపాదించేందుకు నా విద్యార్హతలన్నిటినీ సంతోషంగా వదలుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.”

బన్యన్ జీవిత చరిత్రను మొట్టమొదటిగా రచించిన ఒక రచయిత అతని భావోద్రేకాలను గురించి ఇలా వ్రాసాడు :

“అతడు చూడటానికి చాల కఠినంగా కనిపించేవాడు. అయితే, అతని మాటల్లో ఎంతో మృదుత్వం మేళవించేది. ఎప్పుడైనా అరుదుగా అవసరమొస్తే తప్ప అతడు వాక్చాతుర్యంతో వాక్యాన్ని బోధించేవాడు కాడు. తన్ను గురించి తాను గొప్పలు చెప్పుకోవడమంటే ఏంటో అతనికి తెలియదు. తన్నుతాను తగ్గించుకొంటూ ఇతరుల తీర్పుకే తనను వదలి వేయటం అతని అభిమతం. అబద్ధాలు చెప్పడం, ఒట్టుపెట్టుకోవటం, డంబాలు పలకటం, చెడు మాటలు పలకటం, ప్రతీకారం తీర్చుకోవటం, గాయపరచటం అతని దృష్టిలో హేయమైనవి. మాటల్లోను క్రియల్లోను నీతిని ప్రేమను ప్రదర్శించటం, బేదాభిప్రాయాలను సరిచేసుకొంటూ అందరితో స్నేహంగా ఉండటం అతనికి అత్యంత ఇష్టమైనవి. అతని కళ్ళు చాల త్వరగా ఇటూ అటూ తిరుగుతూ మనుష్యుల్ని కనిపెడు తుంటాయి. అంతేగాక అవి తమ మొదటి చూపులోనే ఒక వ్యక్తియొక్క గుణలక్షణాలను ఇట్టే పసిగట్టగలవు. అవి ఒకే క్షణంలో ఆ వ్యక్తిని గురించి తీర్పు తీర్చగలవు. ఇక అతని విగ్రహం విషయానికి వస్తే, అతనిది బలమైన కండలు తిరిగిన ఒక ఎత్తైన విగ్రహం. ఎఱ్ఱని ముఖంలో మెరిసే కళ్ళు. చిరునవ్వులొలికే పెదవులపై తొణికిసలాడే దట్టమైన మీసాలు, చక్కని ముక్కు అతని అందానికి అదనపు ఆస్తులు. అతని

వెంట్రుకలు ఎఱ్ఱగా ఉండేవి. అయితే, ఆ తర్వాతి కాలంలో అవి తెలుపు రంగుకు మారాయి. అతని నోరు ఒక మోస్తరు పెద్దదిగాను, అతని తల నిటారుగాను, అతని అలవాట్లు సాదాసీదాగాను ఉండేవి.”

తరతరాలకూ సజీవమైన పరిచర్య

బన్యన్ శేషజీవితాన్ని గురించి చరిత్రకారులచే అతి తక్కువగా వ్రాయబడింది. దేవుని ప్రజలు చార్లెస్ రాజు పరిపాలనలో భయంకరమైన హింసను అనుభవించిన సమయంలో బన్యన్ మునుపటిలాగా తన మనఃస్సాక్షిలో తీవ్రమైన సంక్షోభాన్ని అనుభవించాడా లేదా అన్న విషయాన్ని గురించి మనకు సరైన సమాచారం లేదు.

తన జీవిత చరమాంకంలో ఒక రోజు భయంకరమైన కుండపోత వర్షంలో బాగా తడిసి తీవ్రమైన చలిజ్వరం బారినపడ్డ కారణంగా అప్పటికే బాగా నీరసించి బలహీనంగా ఉన్న బన్యన్ 1688వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన తన ఇహలోక యాత్రను ముగించి నిత్యత్వంలోనికి చేరుకొన్నాడు.

అతని దేహం లండన్లోని క్రైస్తవ స్మశానవాటిక అయిన బర్హిల్ ఫీల్డ్స్లో భూస్థాపన గావించబడింది. విధవరాలైన అతని భార్య అతడు మరణించిన నాలుగు సంవత్సరాలకు మరణిం చింది.

అతని వారసులలో అతి కొద్దిమంది పేర్లు మాత్రమే బెడ్ఫోర్డ్ ని బాప్టిస్టు చర్చి పుస్తకాలలో కనిపిస్తున్నాయి.

అతని చివరి వారసురాలిగా కనుగొనబడిన బన్యన్ మునిమనుమరాలు అయిన హన్నా బన్యన్ క్రీ.శ. 1770 లో తన 76వ ఏట మరణించింది.

ఎలిజబెత్ బన్యన్ మరణించిన సంవత్సరమైన 1692 లో బన్యన్ రచనలన్నీ రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురించబడ్డాయి.

బెడ్ఫోర్డ్లో బన్యన్ పరిచర్యను కొనసాగించిన ఎబెనెజర్ క్యాండ్లర్ మరియు క్యాండ్లర్ తరువాత బెడ్ఫోర్డ్ సంఘ పరిచారకుడైన జాన్ విల్సన్ ఈ ప్రచురణ కార్యాన్ని చేపట్టి ముగించారు.

ఈ గ్రంథాలలో జాన్ బన్యన్చే రచించబడిన దాదాపు అరవై వేర్వేరు రచనలు సమీకరించబడ్డాయి. ఇవన్నీ లోతైన ఆత్మీయ ధ్యానాలతో నిండివున్నాయి.

Leave a Comment