ఎనిమిదవ అధ్యాయము
క్రీస్తు – లోకమునకు వెలుగు
వ్యభిచారమునందు పట్టబడిన స్త్రీ (8:1-11) :
8:1 ఈ వచనము గత అధ్యాయంలోని చివరి వచనమునకు జోడించబడియున్నది. ఈ రెండు వచనములు కలిపి చదివినయెడల దీనిని మనము గ్రహించవచ్చును. ఎట్లనగా అంతట “ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను,” ప్రభువు చెప్పినమాట మనము జ్ఞాపకము చేసికొందము.
“నక్కలకు బొరియలును, ఆకాశపక్షులకు గూళ్ళుగలవు గాని, మనుష్యకుమారుడు తలవాల్చుటకు స్థలములేదు”.
8:2 ఒలీవల కొండ ఆ దేవాలయమునకు సమీపములో నుండెను. కావున ఉద యముననే ప్రభువు ఆ కొండదిగి కిద్రోను లోయదాటి ఆ దేవాలయముండిన పట్టణములోనికి ప్రవేశించెను. అప్పుడు గొప్ప జనసమూహమాయనను వెంబడించెను ఆయన వారితో కూర్చుండి, వారికి బోధించుచుండెను.
8:3,4 ఈ వచనములో మనముందు శాస్త్రులుండిరి. వీరు లేఖన భాగములను వ్రాసి, బోధించినవారు. పరిసయ్యులాయనను శోధించవలెనని ఆయన మీద నేరము మోపుటకు వారు వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తీసికొనివచ్చి ఆ జన సమూహముమధ్య నిలువబెట్టిరి. ఆమె ముఖము ప్రభువువైపునకు తిరిగియుండెను, ఆమెపై మోపిన నేరము వాస్తవమైనది, అనుమానము లేదు, ఆమె పాపము చేయు చుండగా పట్టబడెను.
క్రీస్తు లోకమునకు వెలుగు
Read and Learn More Telugu Bible Verses
8:5 వారి కుయుక్తి పెల్లుబికెను. ప్రభువు మోషే చెప్పిన మాటలు ధిక్కరించునని ఆశించిరి. వారు తలంచినది ఫలించినయెడల ఈ జనసమూహమంతయు ఆయనకు వ్యతిరేకముగా ఎదురు తిరుగునట్లు చేసియుండెడివారే.
ఎవరైనను వ్యభిచారమునందు పట్టబడినయెడల, అట్టి వారిని రాళ్ళురువ్వి చంపవలెనని మోషే ధర్మశాస్త్రమునందు వ్రాయబడినట్లుగా ఆయనకు గుర్తు చేసిరి. అయితే ప్రభువు ఈ విషయమునకు అంగీకరించడని కౄరులైన పరిసయ్యులు ఎరిగినవారై ఇప్పుడాయన ఏమి చెప్పునోయని ఎదురుచూచుచుండిరి. న్యాయమును, ధర్మమును, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమును ఆమె రాళ్ళతో కొట్టబడి చంపబడవలెనని చెప్పుచున్నది.

(అయితే డార్బి గారు ఇట్లు వాఖ్యానించిరి) “తనకంటే ఎదుటివ్యక్తి మరి ఎక్కువ చెడు స్వభావము గలవాడయి నప్పుడు అది మానవుని భ్రష్టహృదయమును ఆదరించును, నెమ్మదిపరచును. అట్టివాడు యెదుటివాని పాపమును తలంచుచు తనను తాను సమర్థించుకొనును క్షమించు కొనును. ఇతరులను దూషించినపుడు మరియు తీవ్రముగా నిందించునపుడు తనయొక్క చెడుగును మరచును, ఇట్లు తన అతిక్రమములందు ఆనందించును.” ఇది పరిసయ్యులపట్ల శాస్త్రులపట్ల డార్బి వ్యాఖ్యానమైయున్నది.

8:6 ప్రభువుపై నేరము మోపుటకు వారికేమియు దొరకలేదు గాని, నేరము మోపుటకు ప్రయత్నించుచుండిరి. ఆయన ఆ స్త్రీని పోనిచ్చినయెడల ఆయన మోషే ధర్మశాస్త్రమునకు అవిధేయుడనబడును; కనుక ఆయన అవినీతినిబట్టి వారాయనను నిందింపవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని ఆయన మరణశిక్షకు అప్పగించినయెడల ఆయన కనికరము లేనివాడుగా నుండును. ఆయన వంగి నేలమీద ఏమో వ్రాయుచుండెను.
8:7 ఆయన వ్రాసినదేమో తెలిసికొనుటకు అవకాశమేలేదు. అసంతృప్తి చెంది యున్న యూదులు ఆయనను జవాబివ్వవలసినదిగా బలవంతము చేసిరి. కనుక ఆయన “పాపమునకు శిక్ష విధించవలసినదియే గాని, మీలో పాపములేని వాడు. ఆమెను శిక్షించవచ్చును” అని చెప్పెను. అట్లు ప్రభువు మోషే ధర్మశాస్త్రమును నెరవేర్చి, పాపము చేసినవారినందరిని గద్దించెను. ఇతరులకు తీర్పు తీర్చువారు మొదటిగా తమకు తాము శుద్ధులై యుండవలసియున్నది.
పాపమును క్షమించుటకు కొన్నిసార్లు ఈ వచనము వాడబడుచున్నది. మనము నిందకు దూరముగా నుంటిమి. ఎందుకనగా ప్రతి ఒక్కరును చెడ్డపనులనే చేయుచున్నారు. ఇది ఈ వచనముయొక్క ఉద్దేశ్యమై యున్నది. అయితే ‘పాపమునకు శిక్ష విధించకుండా సహించుట’ అనునది ఈ వచనముయొక్క భావము కాదు. వారు పట్టుబడక పోయినప్పటికి, పాపము చేసిన వారినందరిని ఈ వచనము ఖండించుచున్నది.
బైబిల్‌లో క్రీస్తు వెలుగు అర్థం
8:8 మరియొకసారి వంగి నేలమీద ఏమో వ్రాయుచుండెను. ప్రభువు ఏదైనను వ్రాసియుండెనని చెప్పుటకు ఇదియొక నిదర్శనముకాని, ఆయన వ్రాసినదేమోయది భూమిపైనుండి చెరిపివేయబడియుండెను. ఆ స్త్రీపై నేరారోపణ చేయువారందరు ఒప్పింపబడిరి. వారికి సమాధానము చెప్పుట కేమియు లేవు. ఒకని వెంట ఒకడు వారు వెళ్ళియుండిరి.
8:9 పెద్దవాడు మొదలుకొని చిన్నవానివరకు వారందరు అపరాధులే. యేసు ఒక్కడే అచ్చట నిలుచుండియుండెను. మరియు ఆ స్త్రీ మధ్యన నిలుచుండెను. అద్భుత మైన కృపకలిగిన ప్రభువైన యేసు ఆమెపై నేరారోపణ చేయువారందరిని కనబడక పోవునట్లుగా చేసెను. వారు మరెచ్చటను కానరారు. వారిలో ఒక్కడైనను ఆమెకు శిక్ష విధించుటకు తెగించలేదు.
8:10,11 “ఎవరును నీకు శిక్ష విధించలేదా?” అని ఆయన ఆ స్త్రీని అడిగెను. అందుకామె “లేదు ప్రభువా” అని జవాబిచ్చెను. ఇక్కడ ‘ప్రభువు’ (Lord) అను మాటకు ‘Sir’ అనునది గౌరవనీయ పదముగా వాడబడెను. “నేనుకూడ నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపము చేయకుము” అని ప్రభువు ఆశ్చర్యకరమైన మాటలు ఆమెతో చెప్పెను.
ఇక్కడ ప్రభువు తన పౌర హక్కును వినియోగించుకొనలేదు. శిక్షించు అధికారము రోమా ప్రభుత్వముయొక్క అధికారమై యున్నది. ఆ అధికారము ఆయన వారికే వదలివేసెను. అయితే ఆయన ఆమెను ఇకను పాపము చేయకుమని ఈ సువార్తలోని మొదటి అధ్యాయమునందు “కృపయు, సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను” అని మనము చదివియుంటిమి.
దానికి ఉదాహరణగా మన మిక్కడ చూచుచున్నాము. అది ఏమనగా “నేనును నీకు, శిక్ష విధింపను” అని చెప్పుటలో “కృపయు” “ఇకను వెళ్ళి పాపము చేయకుము” అని చెప్పుటలో “సత్యమును” కలవు. “నీవు వెళ్ళి వీలైనంత కొద్దిగా పాపము చేయుమని” ఆయన చెప్పియుండలేదు. యేసుక్రీస్తు దేవుడు గనుక ఆయనకు పరిపూర్ణమైన పవిత్రత కావలసియుండెను. ఎంత స్వల్పమైన పాపమునైనను ఆయన అంగీకరింపడు, కనుకనే ఆయన దేవునికి కావలసిన పరిపూర్ణతను ఆమె ముందుంచెను.
“నేను లోకమునకు వెలుగునై యున్నాను” (8:12–20) :
మనము 20వ వచనములో చూచినట్లుగా దృశ్యము ఆలయములోని కానుకల పెట్టెనొద్దకు మార్చబడెను. గొప్ప జనసమూహము ప్రభువును వెంబడించుచుండెను. ఆయన వారివైపు తిరిగి, తాను మెస్సీయ యని ఋజువు చేసికొనుటకు ఒక నిర్వచ నమును నిర్వచించెను. “నేను లోకమునకు వెలుగైయున్నాను.”
లోకము పాపమనెడి చీకటిలోను, అజ్ఞానములోను, ఒక స్థిరమైన ఉద్దేశ్యము లేనిదిగా నుండెను. లోకమునకు వెలుగు “యేసు.” ఆయన లేకుండ పాపమనెడి చీకటినుండి విముక్తి కలుగదనియు, జీవితయాత్రలో కాపుదల ఉండదనియు, నిజ జీవితార్థము గ్రహించలేరనియు, నిత్య త్వముయొక్క ఫలితముండదనియు భావము. అయితే “యేసు” తన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, జీవపు వెలుగు కలిగియుండుననియు వాగ్దానము చేసెను. యేసును వెంబడించుటయనగా యేసును (స్వీకరించుటయే) అంగీకరించుటయే.
చాలమంది తాము మారుమనస్సు పొందకయే యేసువలె జీవించ గల్గుదుమని చెప్పుదురు. కాని యేసును వెంబడించుటయనగా పశ్చాత్తాపముతో ఆయనయొద్దకు వచ్చి, ఆయనను ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించుటయు విశ్వసించుటయు మరియు అటు తరువాత జీవితమును సమర్పించుటయైయున్నది. ఎవరైతే దీనిని చేయుదురో అట్టివారు తమ జీవితములో దేవుని కాపుదల కలిగియుండి, నిర్మలమైన, ప్రకాశవంత మైన నిరీక్షణ సమాధి అనంతరము కలిగియుందురు.
8:13 పరిసయ్యులు ఆయనతో ఒక న్యాయపరమైన (చట్టపరమైన విషయమునందు సవాలు చేయుచుండిరి. నీయంతటనీవే సాక్ష్యమును చెప్పుకొనుచున్నావని వారాయనతో అనిరి. ఒక వ్యక్తి స్వంత సాక్ష్యము నమ్మదగినది కాదు, ఏలయనగా మానవులు పక్షపాత వైఖరి కల్గియున్నవారు. యేసుయొక్క మాటలను పరిసయ్యులు నమ్మలేదు.
క్రీస్తు జీవితం మరియు వెలుగు
8:14-18 ఆయన మాటలు వాస్తవమైనవో కావోనని వారి అనుమానము. అయితే ఇద్దరు లేక ముగ్గురు మనుష్యుల సాక్ష్యము బలమైనదని యేసు గుర్తెరిగియుండెను. అయితే ఆయన విషయములో ఆయనిచ్చు సాక్ష్యము సత్యమైనది.
ఎందుకనగా ఆయన దేవుడై యుండెను. ఆయన పరలోకమునుండి దిగివచ్చి పరలోకమునకు వెళ్ళనైయుండెనని ఆయనకు తెలియును. అయితే ఆయన ఎక్కడనుండి వచ్చెనో, ఎక్కడికి వెళ్ళుచుండెనో వారికి తెలియదు.
ఆయన వారివలె ఒక సామాన్య మానవుడని తలంచుచుండిరి గాని అద్వితీయ కుమారుడనియు, తండ్రితో సమానత్వము గలవాడ నియు వారు గ్రహింపరైరి, వారు పై రూపమునుబట్టియు, వ్యక్తి గత జీవన విధానమును బట్టియు తీర్పు తీర్చుచుండిరి. వారాయనను వడ్రంగివాడైన, నజరేయుడైన యేసు అనియు, అయితే మానవులందరిలో ఆయన ప్రత్యేకమైనవాడనియు తలంచిరి.
తానెవరికి తీర్పు తీర్చుట లేదని ప్రభువు చెప్పెను. ఈ లోక సాంప్రదాయమును బట్టి పరిసయ్యులు తీర్పు తీర్చునట్లుగా ఆయన మానవులకు తీర్పు తీర్చుట లేదు. ఆయన మనుష్యులకు తీర్పు తీర్చుటకు ఈ లోకములోనికి రాలేదుగాని, వారిని రక్షించు టకే వచ్చెను.
ఆయన న్యాయాధిపతియైనప్పుడు ఆయన తీర్పు న్యాయమైనదిగాను, యథార్థమైనదిగాను ఉండును. ఆయన దేవుడైయుండి, ఆయన చేయునదంతయు ఆయనను పంపిన తండ్రితో ఏకీభవించి చేయును.
తండ్రితో తాను ఏకమైయున్నానని పరిసయ్యులతో ప్రభువు నొక్కినొక్కి చెప్పుచుండెను. ఈ మాట వారి హృదయములో ఆయనపట్ల ద్వేషమును రగిలించెను. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇద్దరిచ్చు సాక్ష్యమును ప్రభువు ధృవీకరించెను.

ఆయన మోషే ధర్మశాస్త్రమును తృణీకరించుచున్నట్లుగా ఏమియు మాటలాడలేదు. ఇద్దరి సాక్ష్యము కావలయునని వారు బలవంతము చేసినచో సాక్ష్యమిచ్చు ఇద్దరిని చూపించుట కష్టమైన పనికాదు. మొదటిగా తనయొక్క పాపరహిత జీవితమునుబట్టి తనంతటతానే నోటిమాటలతో సాక్ష్యమిచ్చుచుండెను.
రెండవదిగా పరలోకమందున్న తండ్రి బహిరంగముగా పరలోకమునుండి సాక్ష్యమిచ్చును. ప్రభువు చేయుటకిచ్చిన అద్భుతములనుబట్టియు సాక్ష్యమిచ్చుచుండెను. పాత నిబంధన గ్రంథ మందు మెస్సీయను గూర్చిన లేఖనములన్నింటిని ప్రభువైన యేసు నెరవేర్చెను. ఇంత బలమైన సాక్ష్యము కలిగియున్నప్పటికి యూద మతాధికారులు ప్రభువునందు విశ్వాస ముంచుటకు అంగీకరించుటలేదు.
క్రీస్తు ప్రకాశం బైబిల్ వచనాలు
8:19,20 పరిసయ్యులు తిరస్కారముతో ఆయనను “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని” అడిగిరి. అందుకు ప్రభువు మీరు నన్ను గుర్తించి యుండలేదని వారితో చెప్పెను. మీరు నన్ను గుర్తించలేదు గనుక, నా తండ్రిని మీరెరుగరని వారితో చెప్పెను. (వారు తమయొక్క అజ్ఞానముతో దేవుని తృణీకరించిరిగాని, అది వాస్తవము). దేవుని గూర్చిన వారి అజ్ఞానమును వారు ఒప్పుకొనకపోయిరి. ఇది వాస్తవమే.
వారు ప్రభువైన యేసును స్వీకరించినయెడల తండ్రిని కూడ ఎరిగియుందురు. ప్రభువైన యేసుద్వారా తప్ప ఎవడును తండ్రియైన దేవుని ఎరుగడు. వారు ప్రభువును తృణీకరించుచున్నారు గనుక తాము తండ్రిని ఎరిగియున్నామనియు ప్రేమించుచున్నామనియు చెప్పుకొనుట అసాధ్యము. ఇది దేవాలయములోని కానుకల పెట్టెదగ్గర దృశ్యము. ప్రభువు దైవికముగా మరల ఇక్కడ తప్పింపబడెను.
ఆయనను పట్టుకొనుటకు ఎవరును ఆయనపై చేయి వేయుటకు తెగింపలేదు. ఎందుకనగా ఆయన సమయమింకను వచ్చియుండలేదు. సమయమనగా ఈ లోక పాపములకొరకు కలువరిలో మరణించుటకు సమయ మింకను రాలేదు గనుక ఆయనను పట్టుకొనుటకుగాని చంపుటకుగాని ఎవరును చేయివేయుటకు తెగింపలేదు.
యేసుతో యూదుల వివాదము (8:21 – 59) :
8:21 ప్రభువు మరల భవిష్యత్తును గురించి తనకుగల పరిపూర్ణ జ్ఞానమును తెలియ జేయుచున్నాడు. ఆయన తాను వెడలిపోవు సమయమాసన్నమైనట్లుగా చెప్పుచుండెను. అనగా తాను మరణించి, సమాధిచేయబడి, పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణుడై పరలోకమునకు ఎక్కి వెళ్ళుదునని తెలియజేసెను.
అప్పుడు యూదులు ఆయన యీ లోకమునకు అరుదెంచి తిరిగి ఆరోహణుడయ్యెనని గుర్తింపక మెస్సీయ కొరకు ఎదురుచూచుదురు. వారాయనను తృణీకరించినందువలన తమ పాపములలోనే ఉ ండి మరణించి ప్రభువు వెళ్ళు పరలోకములో ప్రవేశింపనేరరు, ఇది ఒక గంభీరమైన సత్యము. ప్రభువైన యేసును అంగీకరించుటకు ఎదురాడు వారికి పరలోకము చేరుదుమన్న నిరీక్షణ ఉండదు. దేవుడు లేకుండ, క్రీస్తు లేకుండ, నిరీక్షణ లేకుండ ఒకడు తన పాపములో చనిపోయినయెడల అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి !
8:22,23 పరలోకమునకు తిరిగి వెళ్ళుదునని ప్రభువు చెప్పు మాటలను యూదులు గ్రహించలేకపోయిరి. వెడలిపోవుటయనగా ఆయన వారు చేయు కుట్రలో నుండి తప్పించుకొనిపోయి తనకుతానే ఆత్మహత్య చేసికొనునా? అని తలంచుచుండిరి. వారికిది చాలా ఆశ్చర్యముగా నున్నది.
ఆయన అట్లు చేసికొనినయెడల వారాయనను వెంబడించుట తప్ప మరేదియు వారిని నివారింపజాలదు. అవిశ్వాస మనెడి చీకటికి ఇది మరియొక ఉదాహరణయై యున్నది. రక్షకుడు చెప్పునదేమో తెలిసికొనుటకు వారి అజ్ఞానము, నిర్లక్ష్యము ఆశ్చర్యమును కలిగించుచున్నది.
యేసు క్రీస్తు వెలుగు చిహ్నం
ఆయన తన్నుతానే చంపుకొనునని వారు అనుమానించుచుండిరని యేసు యెరిగి వారితో మీరు భూమిపై నుండువారనియు, కనుక మీ ఆలోచన, గ్రహింపు అక్షరార్థముగానే యుండునుగాని ఉన్నతమైన ఉద్దేశ్యములు కలిగియుండలేరనియు చెప్పెను.
వారు ఆత్మానుసారమైన గ్రహింపు లేనివారు, అయితే ప్రభువు పైనుండి వచ్చినవాడు. ఆయన ఆలోచనలు, మాటలు, కార్యములన్నియు పరలోక సంబంధమైనవే. ఆయన చేసినదంతయు లోకమును రక్షించుటకొరకే, ఆయన జీవించిన జీవితమంతయు తాను ఈ లోకమునకు వేరుగా పవిత్రమైన లోకమునుండి వచ్చియున్నాడని ప్రకటించుచున్నది.
8:24 యేసు తాను ఏదైనా ఒక విషయముయొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పదలిచి నప్పుడు దానిని మరల మరల ప్రస్తావించెడివాడు. కనుకనే ఆయన మీరు మీ పాపములలోనే చనిపోవుదురని వారిని మరల హెచ్చరించెను.
వారాయనను పూర్తిగా నిరాకరింప పూనుకొనిరి. వారి నిర్ణయమునకు తిరుగులేదు. ప్రభువైన యేసునకు వేరుగా నొకడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందడు, మరియు క్షమింపబడని పాపములతో నొకడు పరలోకములో ప్రవేశింపజాలడు. ‘ఆయన’ అను పదము ఈ వచనమునకు చెందినది కాదు. అయితే “నేను ఆయననని మీరు నమ్మనియెడల మీరు మీ పాపములోనే చనిపోవుదురు”. “నేను” (I am) అనునది ప్రభువైన యేసు యొక్క దైవత్వమును చూపించుచున్నది.
8:25 యూదులు పూర్తిగా విసుగుచెందిరి నీ వెవడవో చెప్పుమని ఆయనను సూటిగా ప్రశ్నించిరి. నీ వెవరనుకొనుచున్నావు? అన్నట్లుగా వారాయనను అపహాస్యము చేయుచు అడిగిరి. లేక తనను గురించి ఆయన ఏమి చెప్పుకొనునోయని తెలిసి కొనుటకు ఆతురముగా అడిగియుండవచ్చును.
ఆయన సమాధానము గుర్తింపదగినది. ఆయన “నేను మొదటినుండి ఎవడనని చెప్పుకొంటినో వానినే” యని వారితో చెప్పెను. ఆయన ఈ లోకములో తన పరిచర్యను ప్రారంభించినప్పటినుండి, వారికి వాగ్దానము చేయబడిన ‘మెస్సీయ’ తానేనని చెప్పుకొనుచుండెను.
ప్రభువు తరచుగా చెప్పు ఈ మాటను యూదులు వినుచుండిరి గాని, వారి కఠిన హృదయము ఈ సత్యమునంగీక రించుటకు విధేయత చూపించలేదు. యేసు ఇచ్చిన సమాధానము మరియొక మలుపు తిరిగెను. ఆయన బోధకు తగినట్లుగా ఆయన ఉండెను. ఆయన ఒకటి చెప్పి, మరొకటి చేయలేదు. తాను బోధించిన దానికి మూర్తిమత్వమునై యుండెను. ఆయన బోధకు ఆయన జీవితము సరిపోయినది.
8:26, 27 ఈ వచనముయొక్క భావము విపులముగా తెలియజేయబడలేదు. ఆయన తీర్పు తీర్చుటకు అవిశ్వాసులైన యూదులకు సంబంధించిన సంగతులనేకము కలవని ప్రభువు చెప్పుచుండెను. యేసు వారి హృదయములోని దుష్ట ఆలోచనలను, ఉద్దేశ్యము లను బయలుపరచగలడు.
అయినప్పటికి తండ్రి తనకు బోధించుమని ఇచ్చిన సంగతులను మాత్రమే ఆయన విధేయుడై బోధించుచున్నానని చెప్పెను. తండ్రి సత్యమై యున్నాడు గనుక ఆయనయందు విశ్వాసముంచుటకును ఆయన బోధ వినుటకును ఆయన చాలినవాడు అని చెప్పెను. యూదులాయనను గ్రహింపరైరి.
ప్రతి సమయ మందును వారికి మబ్బు (చీకటి) కమ్మియుండెను. ప్రభువైన యేసు గతకాలమందు తాను దేవుని కుమారుడనని చెప్పుకొనినపుడు తాను తండ్రియైన దేవునితో సమానునిగా ఎంచుకొనుచున్నాడనుకొనిరి. కాని అట్లెన్నటికి కాదు.
8:28 భవిష్యత్తును గురించి యేసు మరల ప్రవచించుచుండెను. మనుష్య కుమారుని వారు పైకెత్తుదురని ఆయన చెప్పెను. ఇది ఆయన పొందబోవు సిలువ మరణమును గూర్చి తెలియజేయుచున్నది.
వారు దానిని నెరవేర్చిన తరువాత ఆయనను మెస్సీయగా గుర్తింతురు. భూకంపమునుబట్టియు, చీకటినిబట్టియు తెలిసికొందురుగాని, మరి ముఖ్యముగా ఆయన పునరుత్థానమునుబట్టి తెలిసికొందురు. “అప్పుడు మీరు నేనే ఆయననని తెలిసికొందురు” అని ప్రభువు చెప్పిన మాటలను గమనించుడి.
“అనగా నేను దేవుడనని” తెలిసికొందురని దాని భావము. అప్పుడు వారు ఆయన తన స్వశక్తితో ఏమియు చేయలేదని తెలిసికొందురు. తన తండ్రి ఏమి బోధించునో వాటినే ప్రకటించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చెను.
8:29 తండ్రియైన దేవునితో ప్రభువుయొక్క సంబంధము చాల సన్నిహితమైనది. ఈ వచనములోని ప్రతిమాట తండ్రితో ఆయన సమానత్వమును తెలియచేయుచున్నది. ఈ లోకములో ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి తండ్రి ఆయనతో నుండెను.
ఏ సమయమందును యేసు ఒంటరిగా విడువబడలేదు. అన్ని సమయములయందును. తండ్రికి ప్రీతికరమగు కార్యములనే ఆయన చేయుచుండెను. పాపరహితుడైనవాడు “నేను ఎల్లప్పుడు నా తండ్రి ఆనందించు కార్యములను చేయుచున్నాను” అని చెప్ప ఏ గలడు. మానవ నైజముగల ఏ తల్లిదండ్రులైనను ఇట్లు చెప్పలేదు. మనము మనకు ప్రీతికలిగించు కార్యములను లేదా మన తోటి వారికి ప్రీతికలిగించు కార్యములను చేయుదుము. దేవునికి అత్యంత ప్రీతికరమైన కార్యములను ప్రభువైన యేసు ఒక్కడే చేయగలడు.
8:30 ఆయన మాటలాడుచుండగా అనేకులాయనయందు వివ్వాసముంచినట్లుగా చెప్పిరి. వారిలో కొంతమంది విశ్వాసము స్థిరమైనదేకాని మరికొందరు విశ్వాసము వారి పెదవులతో ఒప్పుకొనుటయే.
క్రీస్తు లోకమునకు వెలుగు
8:31 శిష్యులకు “నిజమైన శిష్యులకు” మధ్యగల భేదమును ఈ వచనములో ప్రభువు తెలియజేయుచున్నాడు. శిష్యుడు విద్య నభ్యసించువాడై యుండగా “నిజమైన శిష్యుడు” కచ్చితముగా తన్నుతాను క్రీస్తుకు సమర్పించుకొనువాడునైయున్నాడు.
నిజమైన విశ్వాసులు ఈ లక్షణమును కలిగియున్నారు. వారు ఆయన వాక్యమునందు ముందుకు సాగుదురు. అనగా ఆయన బోధ ప్రకారము జీవింతురు. మరియు వారు ప్రభువునుండి ఎంత మాత్రము తొలిగిపోరు నిజమైన విశ్వాసము ఎల్లప్పుడు “స్థిరత” అను గుణమును కలిగియున్నది. మనము ఆయన వాక్యమునందు సాగిపోవుటవలన రక్షింపబడలేదు. గాని,మనము రక్షింపబడి ఆయన వాక్యమునందు నిలిచియున్నాము.
8:32,33 ఒకడు సత్యము గ్రహించును. అప్పుడు సత్యము వానిని స్వతంత్రునిగా చేయునను వాగ్దానము ప్రతి నిజ విశ్వాసికి చేయబడినది. ఇట్టి సత్యమును యూదులు ఎరుగరు. అజ్ఞానము, దోషము, పాపము, ధర్మశాస్త్రము, మూఢభక్తి అనెడి భయంకర మైన దాస్యములో వారుండిరి. అయితే ప్రభువైన యేసును ఎందరు నిజముగా ఎరిగి యుండిరో వారు పాపమునుండి విమోచింపబడిరి.
వారు వెలుగులో నడుచుచున్నారు. అంతమాత్రమేగాక అనుదిన జీవితములో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నారు. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ప్రభువు చెప్పిన మాటలు యూదులుకూడ విని ఆ మాటలకు వెంటనే ప్రభువుపై కోపగించుకొనిరి. “మేము అబ్రాహాము సంతానము, మేమెవరికిని దాసులము కాలేదు” అని తమ్మును గూర్చి గొప్పలు చెప్పుకొనిరి. కాని అది నిజముకాదు.

ఇశ్రాయేలీయులు ఒకప్పుడు ఐగుప్తు, అష్షూరు, బబులోను, పారశీక, గ్రీకు రాజులకు దాసులైయుండిరి. ఇప్పుడు రోమీయులకు దాసులైయుండిరి. కాని అన్నిటికంటే వారు పాపమునకు, సాతానుకు మరి ఎక్కువగా దాసులైయుండిరి. ఈ దాసత్వమును గూర్చియే ప్రభువు ఇక్కడ మాటలాడుచున్నాడు.
8:34 “పాపము చేయువాడు పాపమునకు దాసుడు” అని ప్రభువు ఆ ప్రజలకు జ్ఞాపకము చేయుచున్నాడు. మరియు యూదులు తాము మతాసక్తిగలవారివలె నటించిరి. కాని వాస్తవమునకు వారు నీతి బాహ్యులును, అమర్యాద పరులును, హంతకులునై యుండిరి. యీ సమయములోకూడ దేవుని కుమారుని చంప వెదకుచున్నారు.
8:35,36 ఒకే ఇంటిలో ఉన్న దాసునికిని కుమారునికిగల సంబంధము, వారి స్థితులను ప్రభువు ఈ వచనములో పోల్చి చెప్పుచున్నాడు. తాను ఎల్లప్పుడు యీ ఇంటిలో నివాసముచేయగలనను నిశ్చయత దాసునికి లేదు. కాని కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును.
ఇక్కడ “కుమారుడు” అనుపదము దేవుని కుమారునికి మరియు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటద్వారా దేవుని బిడ్డలుగా తీర్చబడినవారికి అన్వయించవచ్చునా? ఈ రెండింటిలో మనము దేనిని అంగీకరించినను యూదులు కుమారులు కాదుగాని దాసులేయని ప్రభువైన యేసు చెప్పుచున్నాడు.
ఆయనద్వారా స్వతంత్రులుగా చేయబడినవారు, నిజముగా స్వతంత్రులై యున్నారు. ఒక వ్యక్తి రక్షకుని యొద్దకు వచ్చినప్పుడు, అతడు ఆయననుండి నిత్య జీవమును పొందుచున్నాడు. అంతేగాక అతడు పాప దాస్యమునుండియు మూఢభక్తి నుండియు కట్టుబాట్లనుండియు స్వతంత్రుడుగా చేయబడుచున్నాడు.
8:37 శరీరరీత్యా యూదులు అబ్రాహాము సంతానమని ప్రభువు ఎరుగును. మేము అబ్రాహాము వంశమునకు చెందినవారము అని వారే చెప్పిరి. కాని అబ్రాహాముయొక్క ఆత్మీయ బీజము వారిలో లేదు. అబ్రాహాము వలె వారు దేవుని బిడ్డలు కారు. ప్రభువుయొక్క మాటలు తమ జీవితములలో గొప్ప ప్రభావము చూపునట్లు వారు వాటిని అంగీకరించలేదు. గనుక వారు ఆయనను చంప వెదకుచుండిరి. ఆయన మాటలను వారు త్రోసివేసిరి. ఆయన వాక్యమునకు వారి హృదయములలో తావులేదు.
8:38,39 గనుక ఆయనకు విధేయులు కాకపోయిరి. బోధించుటకు తన తండ్రి అప్పగించిన సంగతులనే యేసు వారికి బోధించెను. యేసు మాటలాడిన మాటలు తండ్రియైన దేవుని మాటలే. ఎట్లనగా ఆయనయు ఆయన తండ్రియు ఏకమై యుండిరి.
బైబిల్‌లో క్రీస్తు వెలుగు అర్థం
ప్రభువైన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు తన తండ్రిని గూర్చి సంపూర్ణముగా తెలియజేసెను. కాని యూదులు తమ తండ్రియొద్ద నేర్చుకొనిన కార్యములనే చేసిరని ప్రభువు చెప్పెను. అనగా యూదులయొక్క తండ్రి అపవాదియనియేగాని భూసంబంధ మైన తండ్రియని ప్రభువుయొక్క భావముకాదు.
అబ్రాహాముతో తమకుగల సంబంధ మును ప్రస్తావించుచు అబ్రాహాము తమ తండ్రియని మరియొకసారి అతిశయ ముగా చెప్పుకొనిరి. అయితే అబ్రాహాము పిల్లలకు ఉండవలసిన లక్షణములు వారిలో లేవని ప్రభువు వారితో చెప్పెను. సహజముగా పిల్లలయొక్క చూపు, నడక, మాట తమ తండ్రిని పోలియుండును, కాని యూదులు ఆలాగున లేరు. వారి జీవితములు అబ్రాహాము జీవితమునకు పూర్తిగా విరుద్ధమైయున్నవి. శరీరరీత్యా వారు అబ్రాహాము పిల్లలైనను, నైతికపరముగా వారు అపవాది పిల్లలైయున్నారు.
8:40-41 వారికిని అబ్రాహాముకు మధ్యగల భేదము ఇక్కడ స్పష్టముగా కనిపించుచున్నది. యేసుక్రీస్తు ఈ లోకమునకువచ్చి సత్యమును బోధించుచున్నాడు. అయితే వారు ఆయన మాటలకు కోపపడి, తొట్రుపడి ఆయనను చంపుటకు యత్నించిరి. అబ్రాహాము ఈలాగు చేయలేదు.
అతడు ఎల్లప్పుడు సత్యమును, నీతిని తన పక్షముగా గైకొనెను, కనుక వారి తండ్రి ఎవరో ఇప్పుడు స్పష్టమైనది ఏలయనగా, వారు తమ తండ్రివలె ప్రవర్తించిరి. వారి తండ్రి అపవాది. “మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము” అని చెప్పుటలో “నీవే వ్యభిచారము వలన పుట్టినవాడవు” అని ప్రభువును దూషించినట్లుండెను.
క్రీస్తు జీవితం మరియు వెలుగు
“వ్యభిచారము” అను మాట బైబిలులో విగ్రహారాధనను సూచించుచున్నది. కాని తాము ఏమాత్రము ఆత్మీయ వ్యభిచారము చేయలేదని యూదులు చెప్పుచున్నారు. అయితే వారు తమ తండ్రిగా తాము ఎరిగిన దేవుడే ఏకైక దేవుడను విషయములో మాత్రము వారు సత్యమే చెప్పిరి.
8:42 ప్రభువు మరల వారి మాటలలోని దోషమును ఇక్కడ ఎత్తిచూపుచున్నాడు. ఎట్లనగా మీరు దేవుని ప్రేమించినయెడల, దేవుడు పంపించిన నన్నుకూడ ప్రేమింతురు అని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తును ద్వేషించుచు అదే సమయములో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పుట వెట్టితనము.
నేను దేవుని యొద్దనుండి పంపబడితినని ప్రభువు చెప్పెను. అనగా ఆయన దేవునియొక్క అద్వితీయ కుమారుడని దీని భావము. నిత్యత్వము నుండియే తండ్రికి కుమారునితో ఇట్టి సంబంధము కలదు. గనుకనే “నేను తండ్రియొద్దనుండి వచ్చితిని” అని ప్రభువు వారితో చెప్పెను.
అంతేగాక తాను అన్నిటికంటె ముందున్నవాడనని క్రీస్తు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. ఆయన ఈ భూమిమీద ప్రత్యక్షము కాకమునుపు ఆయన పరలోకములో తండ్రితో ఉన్నవాడు. కాని తండ్రి లోక రక్షకుడుగా ఉండునట్లు ఆయనను ఈ పాపలోకములోనికి పంపెను గనుక విధేయుడైన కుమారునిగా ప్రభువు ఈ లోకమునకు వచ్చెను.

8:43 ఈ వచనములో చెప్పబడిన “మాటలు, బోధ” అను పదముల మధ్య కొంత బేధము కలదు. క్రీస్తుయొక్క “మాట” ఆయన ఉపదేశించిన విషయమును సూచించు చుండగా ‘బోధ’ అను పదము ఒక ఆత్మీయ సత్యమును తాను ఏ మాటలలో తెలియ జేసెనో ఆ మాటలను సూచించుచున్నది. అయితే ఆయన బోధను సహితము వారు అర్థము చేసికొనలేదు. క్రీస్తు రొట్టెను గూర్చి బోధించినప్పుడు, అక్షరార్థమైన రొట్టెను గూర్చి వారు తలంచిరి.
నీటినిగూర్చి మాటలాడినప్పుడు అక్షరార్థమైన నీటినిగూర్చి తలంచిరి. అయితే వారు ఆయన బోధను ఎందుకు అర్థము చేసికొనలేకపోయిరి? ఎందుకనగా, ఆయన బోధలను అంగీకరించుటకు వారికి మనస్సులేకపోయెను.
8:44,45 ఇప్పుడు ప్రభువు వారి తండ్రినిగూర్చి బహిరంగపరచుచు “మీ తండ్రి అపవాది” అని చెప్పెను. అంటే విశ్వాసులు దేవుని మూలముగా పుట్టినట్లు వీరు అపవాది మూలముగా పుట్టిరని దీని భావముకాదు. భక్తుడైన అగస్టీన్ వీరిని గూర్చి చెప్పుచూ” వారు అపవాదిని అనుకరించుటద్వారా వాని పిల్లలైరి”. అతడు జీవించినట్లే వీరును జీవించుటద్వారా అపవాదితో తమకుగల సంబంధమును తెలియజేయు చున్నారు. “మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు” అని ప్రభువు చెప్పిన మాటలలో వారి హృదయాభిలాష మనకు గోచరమగుచున్నది.
ఆదినుండి అపవాది హంతుకుడైయున్నాడు. అతడు ఆదాముకును సమస్త మానవాళికిని మరణము కొని తెచ్చెను. అతడు హంతకుడే గాక అబద్ధికుడుకూడ అతనియందు సత్యములేదు గనుక అతడు సత్యమునందు నిలువలేదు.
క్రీస్తు ప్రకాశం బైబిల్ వచనాలు
అతడు అబద్ధమాడినప్పుడు, తన స్వభావమును తెలియజేయుచున్నాడు. వాని పుట్టుకతోనే అబద్ధములు ప్రారంభమైనవి. గనుక అతడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు గానుయుండెను. యూదులు ఈ క్రింద చెప్పబడిన రెండు విధములుగా అపవాదిని అనుకరించిరి.
దేవుని కుమారిని చంపవలెనను కోరికతో ఉండిరిగనుక వారు కేవలము హంతకులే. మరియు దేవుడు తమ తండ్రియని చెప్పిరి గనుక వారు కేవలము అబద్ధికులు. దేవుని బిడ్డవలె, ఆత్మీయతగల వ్యక్తులవలె వారు నటించిరి కాని వారి జీవితములు దుష్టత్వముతో నిండియున్నవి.
అబద్ధమాడుటకు తమ్మునుతాము అప్పగించు కొనువారు సత్యమును తెలిసికొను శక్తిని కోల్పోవుదురు. ఈ యూదా మనుష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడు సత్యమే చెప్పుచుండెను. అయినప్పటికిని వారు ఆయనయందు నమ్మికయుంచలేదు. ఇది వారి దుష్ట ప్రవర్తనను సూచించుచున్నది.
8:46,47 “నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును”? అని దేవుని కుమారు డైన క్రీస్తుమాత్రమే పలుకగలడు. ఈ ప్రపంచములో ఏ ఒక్కవ్యక్తికూడ యేసునందు ఒక్క పాపమైనను ఉన్నట్లు నేరస్థాపన చేయలేడు. ఎందుకనగా ఆయన ప్రవర్తనయందు ఎట్టి దోషములేదు.
ఆయన తన సమస్త మార్గములయందు పరిపూర్ణుడు. గనుక ఆయన ఎల్లప్పుడు సత్యమునే మాటలాడెను. కాని వారు యేసు ప్రభువును నమ్మలేదు. ఒక వ్యక్తి నిజముగా దేవుని ప్రేమించిన యెడల, అతడు దేవుని మాటలు విని, వాటికి విధేయత చూపును. అయితే యూదులు నిజముగా దేవునికి చెందినవారు కారు గనుక రక్షకుడైన యేసుక్రీస్తుయొక్క వర్తమానముపట్ల విముఖత చూపిరి.
8:48, 49 ఈ వచనములోకూడ యూదులు సహజముగానే దూషణ మాటలను పలుకుచున్నారు. ఎందుకనగా, ఆయన ప్రశ్నకు ఏ విధముగాను ప్రత్యుత్తరమియ్యరైరి. “నీవు సమరయుడవు” అని దూషించిరి. అనగా వారి దృష్టిలో యేసుక్రీస్తు సంకరజాతికి చెందిన సమరయుడేగాని పూర్తిగా యూదుడు కాడని వారి భావము.
“మరియు నీవు దయ్యము పట్టినవాడవు” అనికూడ నిందించిరి. అనగా, ఆయన పిచ్చివాడనియు లేక వెట్టిపట్టినవాడనియు వారి భావము. ఇక్కడ ప్రభువు తన శత్రువులకు పదునైన మాటలతో ఇచ్చిన జవాబును గమనించండి.
క్రీస్తు మాటలు దయ్యము పట్టినవాని మాటలవలె లేవుగాని, తండ్రియైన దేవుని ఘనపరచ నపేక్షించువాని మాటలవలె నున్నవి. వారి దృష్టిలో క్రీస్తు దయ్యము పట్టినవాడు. ఆ కారణమునుబట్టి వారాయనను అవమానపర చుటలేదు గాని. పరలోకములోనున్న తన తండ్రి చిత్తమును ప్రభువు సంపూర్ణముగా నెరవేర్చ పూనుకొనెను గనుక వారు ఆయనను అవమాన పరచుచున్నారు.
8:50 ప్రభువు ఎన్నడును తన మహిమను వెదకలేదని వారు తెలిసికొనవలెను. ఆయన చేయు సమస్తకార్యములు తన తండ్రికి మహిమ తెచ్చుటకొరకే చేయుచున్నాడు. మీరు నన్ను అవమానపరచుచున్నారని ప్రభువు చెప్పుటలో ఆయన తన మహిమను వెదకుచున్నాడని భావముకాదు.
మరియు “వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు” అను మాటలను ప్రభువు ఈ వచనములో ఉపయోగించుచున్నాడు. ఈ మాటలు కేవలము తండ్రియైన దేవునికే చెందియున్నవి. తండ్రియైన దేవుడు తన ప్రేమకుమారుని మహిమను వెదకువాడును, తన్ను మహిమపరచని వారెల్లరికి తీర్పుతీర్చు వాడునైయున్నాడు.
8:51 దేవుడైయున్న ప్రభువైన యేసు మాత్రమే పలికిన దివ్యమైన మాటలలోని ఒక దానిని మనము ఈ వచనములో చూడగలము. ఈ మాటలు “మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అను మాటలతో ముగియుచున్నవి.
యేసు క్రీస్తు వెలుగు చిహ్నం
ఒక వ్యక్తి ప్రభువుయొక్క మాటలను గైకొనినయెడల అతడు ఎన్నడు మరణము రుచి చూడడని ప్రభువైన యేసు వాగ్దానము చేసెను. ఇది భౌతిక మరణమునుగూర్చి చెప్పిన మాటలుకావు. ఎందుకనగా, ప్రభువు నందు విశ్వాసముంచిన అనేకులు ప్రతి దినము చనిపోవుచున్నారు. గనుక ఈ మాటలు శరీర మరణమును గాక ఆత్మీయ మరణమును సూచించుచున్నవి. అనగా తనయందు విశ్వాసముంచువారు నిత్య మరణమునుండి తప్పింపబడి నరక వేదనల నెన్నటికిని అనుభవించరని ప్రభువు చెప్పెను.
8:52, 53 యేసు పిచ్చి పట్టినవాడని ఇంతకుముందుకంటే మరి ఎక్కువగా ఇప్పుడు నిందమోపుచున్నారు. అబ్రాహామును ప్రవక్తలందరును మరణించిరని వారు ప్రభువుకు జ్ఞాపకము చేయుచున్నారు.
అయితే, ఒక వ్యక్తి తన మాటలు గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని ప్రభువు చెప్పెను. మరి వారి ప్రశ్నకు ఎట్లు సమాధానమియ్యవలెను? ప్రభువు తన మాటలలో అబ్రాహాముకంటెను ప్రవక్తలందరి కంటెను గొప్పవాడనని చెప్పినట్లు వారు గ్రహించిరి.
అబ్రాహాము మరణమునుండి ఎవరిని విమోచించలేదు. అంతేకాదు మరణమునుండి తన్నుతాను విమోచించుకొన లేకపోయెను. మరియు అతడు ప్రవక్తలనుకూడ విమోచించలేదు. అయితే తనతోటి మానవులను విమోచించుటకు శక్తిగలవాడను ‘నేనే’ యని చెప్పువాడొకడు ఇక్కడ ఉన్నాడు. గనుక ఆయన తన పితరులకంటే తాను గొప్పవాడనని ఎంచుకొన తగును.
8:54,55 జనసమూహమును తనవైపు ఆకర్షించుకొనుటకు యేసు ప్రయత్నించు చున్నాడని యూదులు తలంచిరి. కాని అది తన ఉద్దేశ్యము కాదని యేసు స్పష్టముగా చెప్పెను. ఆయనను ప్రేమించి ఆయన పరిచర్య చేయుచున్నామని వారు ఏ దేవునిగూర్చి చెప్పుచున్నారో ఆ దేవుడే ప్రభువైన యేసును మహిమపరచుచున్నాడు.
దేవుడు మా తండ్రియని వారు చెప్పినప్పటికిని, నిజముగా వారు ఆయనను ఎరుగరుగాని తండ్రిని ఎరిగినవానితోను ఆయనతో సమానుడైన వానితోను వారు మాటలాడుచున్నారు. తన తండ్రితో సమానుడను కానని చెప్పవలెనని వారు యేసును కోరిరి, కాని ఆయన వారు కోరినట్లు చెప్పినయెడల ఆయన అబద్ధికుడగును. ఎట్లనగా, ఆయన తండ్రియైన దేవుని ఎరిగియుండి ఆయన మాటలను గైకొనుచున్నాడు.

8:56 అబ్రాహామును గూర్చి ప్రభువు తమ సంభాషణలో ప్రస్తావించినప్పుడు ఆ విషయమై యూదులు పట్టుపట్టిరి. గనుక అబ్రాహాము మెస్సీయ రాకడ దినము కొరకు ఎదురుచూచుననియు, విశ్వాసముద్వారా అతడు ఆ దినము చూచి ఆనందించే ననియు ప్రభువు వారితో చెప్పెను.
అబ్రాహాము ఎవరికొరకు ఎదురుచూచెనో, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. రాబోవు క్రీస్తుమీద అబ్రాహాముయొక్క విశ్వాసము ఆనుకొనియున్నది. ఈ విధముగా మెస్సీయను గూర్చిన పాత నిబంధన ప్రవచనముల నెరవేర్పును గూర్చి యేసు చెప్పెను.
8:57 యూదులు దైవసత్యములను అర్థము చేసికొనుటలో తమ అసమర్థతను మరొకసారి కనుపరచిరి. “అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను”. అని ప్రభువు చెప్పిన మాటలకు – “నీవు అబ్రాహామును చూచితివా?” అని వారు ప్రశ్నించుచుండిరి. ఇక్కడ ఒక గొప్ప భేదమున్నది.
అదేమనగా – అబ్రాహాము స్థితికంటే తనస్థితి గొప్పదని ప్రభువు చెప్పుచున్నాడు. అబ్రాహాముయొక్క ఆలోచనలకు, నిరీక్షణకు ప్రభువు గురియైయున్నాడు. క్రీస్తుయొక్క దినముకొరకు అబ్రాహాము విశ్వాసముద్వారా ఎదురుచూచెను.
కాని యూదులు ఈ సత్యమును అర్థము చేసికొనలేదు గనుక నీకు ఇంకను ఏబది సంవత్సరముల వయస్సు కూడ లేదే యని వారు ఎదురు ప్రశ్న వేయుచుండిరి. (వాస్తవముగా ఈ సమయములో ఆయన వయస్సు 33 సం॥లు మాత్రమే) అయితే అబ్రాహాము ఆయనను ఏలాగు చూచెను?
8:58 ఈ వచనములో ప్రభువు తాను దేవుడై యున్నానని మరియొకసారి స్పష్టముగా చెప్పుచున్నారు. “అబ్రాహాము ఈ లోకములో ఉండుటకుముందే నేనున్నాను” (Be- fore Abraham was, I was) అని ప్రభువు చెప్పలేదు.
క్రీస్తు లోకమునకు వెలుగు
అయితే ఆయన అబ్రాహాము కంటే ముందున్నవాడు. ఈ సందర్భములో పాత నిబంధనలో దేవుడు ఉపయోగించిన “నేనే” (I AM) అను నామమును ప్రభువు ఉపయోగించెను. మన ప్రభువు శాశ్వత కాలమునుండి తండ్రియైన దేవునితో ఉన్నవాడు.
ఆయన ఉనికికి, ఆయనయొక్క జీవ ప్రారంభమునకు ఒక సమయమంటూ ఏదీ లేదు. అందువలన, “అబ్రాహాము పుట్టక మునుపే నేనున్నాను” (Before Abraham was I am) అని వారితో చెప్పెను. ఆ మాటలు వినిన దుష్టులైన యూదులు యేసును చంపుటకు యత్నించిరి.
కాని ఆయన ఆశ్చర్యకరముగా వారి మధ్యనుండి తప్పించుకొని దేవాలయమును విడిచి వెళ్ళెను. అయితే “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నాను” అని ప్రభువు చెప్పిన మాటలను నేను యెహోవానై యున్నానని ఆయన చెప్పుచున్నాడని వారు అర్థము చేసికొనిరి.
ఈ కారణమునుబట్టి ఆయనపై రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. ఏలయనగా ప్రభువు చెప్పిన ఆ మాట దైవ దూషణగా వారు పరిగణించిరి. గాని మెస్సీయ తమ మధ్య ఉన్నాడను సత్యమును అంగీకరించుటకు వారు సమ్మతించలేదు. తమ్ము నేలునట్లు వారు ఆయనను కోరుకొనలేదు.