పర్వతారోహణమగుచున్న తర్కము – Bible Verses Chapter 7 in Telugu

ఏడవ అధ్యాయము

పర్వతారోహణమగుచున్న తర్కము
(యోహాను 7:8)
(Mounting Controversy)

క్రీస్తు తన సహోదరులను గద్దించుట (7:1-9) :

7:1 6వ అధ్యాయమునందు జరిగిన సంఘటనల అనంతరము కొలది నెలలు గడచిన తరువాత 7వ అధ్యాయములోని సంఘటనలు సంభవించెను. ఆయన గలిలయలో నిలిచిపోయెను. యూదులాయనను చంప ప్రయత్నము చేయుచుండిరి గనుక ఆయన యూదయలో నిలిచియుండక పోయెను. యూదులు అప్పుడు నాయకులుగాను, పరిపాలకులుగాను ఉండిరి. ఆయనను బహుగా ద్వేషించినది యూదులే. మరియు ఆయనను చంపుటకు సమయమును వెదకుచుండిరి.

7:2 ఈ వచనములో చెప్పబడిన పర్ణశాలల పండుగ యూదుల క్యాలెండరు నందు ముఖ్యమైనది. ఈ పండుగ కోతకాలము తరువాత వచ్చును. మరియు దీని ఉద్దేశ్యము యూదులు ఐగుప్తునుండి వచ్చిన తరువాత వారు గుడారములలో నివసించిరని అది తెలియజేయుచున్నది.

అది ఆనందకరమైన పండుగ సమయము. మరియు రక్షింపబడిన యూదా జనాంగము ఇశ్రాయేలు దేశమందు నివసించునపుడు మెస్సీయ వారిని సమాధానముతోను క్షేమాభివృద్ధితోను ఏలును అని ఆ పండుగ తెలియజేయుచున్నది.

Read and Learn More Telugu Bible Verses

7:3 ఈ వచనమునందు, చెప్పబడిన ప్రభువు సహోదరులెవరనగా, యేసు పుట్టిన తరువాత మరియకు పుట్టినవారుగాని, జ్ఞాతి లేదా దూరపు బంధువులు ఎవరైనను సరే ఆయనకు ఎంత దగ్గర సంబంధము కలిగియున్నను వారు రక్షింపబడినవారు కారు.

వారాయనయందు నిజముగా విశ్వాసముంచినవారు కారు. అయితే వారాయ నను పండుగకు వెళ్ళి అక్కడ ఏమైనను సూచకక్రియలు చేసిన యెడల, ఆయనను వెంబడించువారు ఆ అద్భుతములను చూచెదరని ఆయనతో చెప్పిరి. శిష్యులనగా పండ్రెండుమంది శిష్యులు కాదుగాని, యూదయలో శిష్యులనబడిన వారని అర్థము.

అయినను వారాయనను అంగీకరించలేదు గాని, ఆయన తన్నుతాను ప్రత్యక్షపరచు కొనినయెడల జనులు వారిని – వీరు ఒక గొప్ప వ్యక్తికి సంబంధించినవారనుకొందురని వారి అభిప్రాయము. మరియు వారు ఆయన పొందుచున్న కీర్తినిబట్టి ఆయనయందు అసూయతో అట్లు చెప్పి, ఆయన పండుగకు వెళ్ళిన యెడల వారిచేత చంపగలడని తలంచిరి.

7:4 ఈ వచనము వారు ఆయనను అపహసించుచు చెప్పియుండవచ్చును. ప్రభువు తాను ప్రసిద్ధిగాంచవలెనని తలంచుచున్నట్లు ఆయన సమీప బంధువులు తలంచిరి. ఆయన ప్రసిద్ధిగాంచవలెనని ఆశించక పోయినచో యిన్ని అద్భుతములు ఆయన గలిలయలో చేయుటకు గల కారణమేమి? కనుక నీవు ప్రసిద్ధినొందుటకు ఇది యొక మంచి సమయము గనుక నీవు పండుగకు వెళ్ళుమని వారాయనతో చెప్పిరి.

ఆ పండుగ సమయమందు యెరూషలేములో వందలాది ప్రజలుందురు గనుక నీవు అచ్చట వారికొరకు అద్భుతములు చేయవచ్చును. గలిలయ (నిశ్శబ్ద) నిర్మానుష్యమైన ప్రదేశము. నీవు ఈ రహస్యస్థలమందు ఈ అద్భుతకార్యములు చేయుచున్నావు గాని, నీవు ప్రసిద్ధిగాంచవలెన్న నీతి కార్యములు ఇచ్చట ఎందుకు చేయుచుంటివని అడిగిరి.

నీవీకార్యములను చేసి లోకమునకు నిన్ను నీవే కనుపరచు కొనుమని చెప్పిరి. నీవు మెస్సీయవని ఋజువు పరచుకొనుటకు ఈ అద్భుత కార్యములను చేయుచున్నయెడల నీవు యూదయలో ఈ కార్యములు చేసినయెడల అవి నిజముగా లెక్కించబడునని చెప్పిరి.

7:5 ఆయన మహిమపరచబడుచుండగా చూచి ఆనందించుటకు నిజముగా మనస్సులేనివారు, ఆయనను మెస్సీయగా కూడ వారు అంగీకరించుటకు ఇష్టపడలేరు. వారాయనయందు విశ్వాసముంచుటకు కూడ ఇష్టపడలేదు. వారు చెప్పినదంతయు ఆయనను అపహాస్యము చేయుటకే చెప్పిరి.

ప్రభువుయెదుట వారి హృదయములు సరిగా లేవు. తన స్వకీయులే ఆయన మాటలయందును క్రియలయందును విశ్వాస ముంచకపోవుట ఆయనకు చేదు అనుభవమును కలిగించెను. తరచుగా ప్రభువు నందు విశ్వాసముంచిన వారనేకులు తమ క్రియలవలన ఇట్టి చేదు అనుభూతిని కలిగి యుండుట (వ్యతిరేకతను) మనము చూచుచున్నాము.

7:6 ప్రభువుయొక్క జీవితము ఆదినుండి అంతమువరకు ఒక క్రమములో నున్నది. ప్రతి దినము, ప్రతి క్షణముకూడ ముందుగా సిద్ధపరచబడిన సూచిక ప్రకారము జరుగుచుండెను. లోకమునకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొను సమయమింకను రాలేదు.

ఆయనయందు ఏమి ఉంచబడెనో ఆయనకు తెలియును. ఈ సమయమందు తాను యెరూషలేమునకు వెళ్ళుట దేవుని చిత్తము కాదు గనుక తన్ను కనుపరచు కొనుటకు ఆయన అచ్చటికి వెళ్ళియుండలేదు. కనుకనే ఆయన సహోదరులకాయన వారి సమయమెల్లప్పుడు (వారి యెదుటనే సిద్ధముగానే ఉండెనని చెప్పెను.

వారి జీవితములు వారి ఇష్టానుసారముగా నడుపబడుచుండెను గాని, దేవుని చిత్తమునకు విధేయులైన వారుగా జీవించుటలేదు. వారియొక్క ప్రణాళిక చొప్పుననే వారి ప్రయాణ ములు కొనసాగించుచున్నారు గాని, దేవుని చిత్తమునకు విధేయులు కారు. వారి స్వచిత్తమును చేయ నిష్టము కలవారు.

7:7 ప్రభువు సహోదరులను లోకము ద్వేషించనేరదు. ఎందుకనగా వారు లోకము నకు చెందినవారు. వారు యేసుకు వ్యతిరేకముగా లోకముతో ఏకీభవించిరి, వారి జీవితమంతయు లోకముతో ఐకమత్యము కలిగియుండెను.

ఇచట ‘లోకము’ అనునది దేవునికిగాని, దేవునియొక్క క్రీస్తుకుగాని ఏమాత్రము స్థానము లేకుండా మానవుడు నిర్మించుకొనిన జీవన సరణిని సూచించుచున్నది. ఈ లోకము పూర్తిగా సంస్కృతి, కళ, విద్య మరియు మతము అనువాటితో నిండిపోయినది. ‘యూదయ’ – ప్రత్యేకముగా మతసంబంధమైన ప్రాంతము. మరియు క్రీస్తును అత్యధికముగా ద్వేషించునది ఈ యూదా మతాధికారులే.

క్రీస్తు తన సహోదరులను గద్దించుట (7:1-9) :

లోకముయొక్క క్రియలు చెడ్డవని ప్రభువు సాక్ష్యమిచ్చుచున్నాడు గనుక లోక మాయనను ద్వేషించెను. ఎవడైనను నీతిమంతుడైనవాడు ఈ లోకమునకు వచ్చిన యెడల లోకమాయనను చంపజూచును.

ఇది చెరుపుచేయు మానవుని యొక్క ప్రవృత్తిపై విచారకరమైన వ్యాఖ్యానము. క్రీస్తుయొక్క సంపూర్ణత ప్రతి మానవునియొక్క అసంపూర్ణ తను ప్రత్యక్షపరచుచున్నది. హెచ్చరికలు తననిట్లు హెచ్చరించుచుండగా మానవుడు దేవుని కృపకొరకు మొర్రపెట్టక, తన పాపమును బట్టబయలు చేసినవానిని సంహరింప బూనుకొనెను.

లోకముచే ద్వేషించబడక, ప్రేమించబడి, ఘనపరచబడి, హెచ్చించబడి యుండుటవలన క్రైస్తవుడు తాను ఘోర దుర్భరమైన స్థితియందున్నానని గుర్తించవలసి యున్నది. “అతడు నా గురించి మంచిగా మాట్లాడుటకు నేను చేసిన చెడ్డపని ఏమిటి?” అని పూర్వకాలమందున్న యోగి ఒకడు ప్రశ్నించెనట.

మనలను లోకము ద్వేషించని కారణ మేమనగా దానిని గూర్చియు, దాని క్రియలను గూర్చియు మనము చెడ్డవని సాక్ష్యమివ్వకుండుటయే. లోకములోని ప్రేమపట్ల మనకున్న వేడిమికి గల కారణము మనము లోకమునకు చెందియున్నామనుటయే. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము, లోకమునకు స్నేహితుడై యుండగోరువాడు దేవునికి శత్రువగును. (యోహాను 7:7;15:19; యాకోబు 4:4).

7:8 పండుగకు వెళ్ళవలసినదిగా ప్రభువు తన సహోదరులకు సెలవిచ్చెను. ఈ విషయమై కొంత విచారము కలదు. మతనిష్ట గలవారివలె వారు వ్యవహరించిరి. వారు పర్ణశాలల పండుగను ఆచరింప సిద్ధపడుచుండిరి.

దేవునియొక్క క్రీస్తు వారి మధ్య నిలుచుండినప్పటికిని వారికి ఆయనపై ప్రేమలేదు. మానవుడు సాధారణముగా మతాచారులయందు లక్ష్యముంచుటకు గల కారణము వాటిని ఆచరించుటలో నతడు హృదయపూర్వకముగా ఆసక్తి ఉండనవసరము లేదు గనుక అట్టివాడు క్రీస్తునొద్దకు ముఖాముఖిగా వచ్చినప్పుడు సిగ్గునొందును లేక ఇబ్బందిపడును.

తన సమయమింకను రాలేదు గనుక తాను పండుగకు వెళ్ళలేదని యేసు చెప్పెను. తాను పండుగకు వెళ్ళుటలేదని ఆయన చెప్పుటలేదు. గాని తనకు ఘనత కలుగకుండు నిమిత్తము తన సహోదరులతో తాను పండుగకు రానని చెప్పెను. ఆయనకు అది సమయముకాదు. ఆయన వెళ్ళునప్పుడు ఆయన రహస్యముగాను, తగిన ఘనతతోను వెళ్ళెను.

7:9 కనుక ఆయన తన సహోదరులతో కలసి ఆ పండుగకు వెళ్ళలేదు. పర్ణశాలల పండుగ ఏ ఆనందమును గూర్చి తెలియజేయునో ఆ యానందమునకు కారణభూత మైన వానిని వెనుక విడిచిపెట్టి వారు ఆ పండుగకు వెళ్ళిరి.

యేసు ఆలయములో బోధించుట (7:10-31)

7:10 తన సహోదరులు పండుగకు వెళ్ళిన తరువాత ఆయన రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. భక్తిగల యూదునివలె ఆయన ఆ పండుగకు హాజరు కాదలంచెను. అయితే ఆయన విధేయుడైన దేవుని కుమారుడై యుండెను గనుక ఆయన బహిరంగముగా కాక రహస్యముగా వెళ్ళెను.

7:11 పండుగ సమయమందు ఆయనకొరకు వెదకినవారు ఎవరనగా ఆయనను చంపగోరు యూదామతాధికారులే, ఆయన ఎక్కడ? అని వారడిగినప్పుడు ఆయనను ఆరాధించగోరి వారడుగలేదుగాని, ఆయనను సంహరించుటకే అడిగియుండిరి.

7:12 ప్రభువు వారిలో కొంత అలజడి పుట్టించునట్లుగా మనమిక్కడ చూచుచున్నాము. ఆయన చేయుచున్న అద్భుతకార్యములనుబట్టి నిజముగా ఆయన ఎవరో తెలిసికొనుటకు ప్రజలకు అవకాశము లభించుచుండెను. అంతట ఆ పండుగలో ఆయన అబద్ధ ప్రవక్తయై యుండెనా లేక నిజమైన ప్రవక్తయై యుండెనాయను సణుగు ప్రజలలో పుట్టెను.

7:13 కొందరు ఆయన మంచివాడనిరి, మరి కొందరు ఆయన మోసపుచ్చు వాడనిరి. ఆయనపట్ల ఆ మతాధికారులయొక్క పగ బహు తీవ్రముగా నున్నందున ఎవడును ఆయనను గురించి (ఆయన మంచి తనమును గురించి) బహిరంగముగా మాటలాడ తెగింపలేదు.

అయితే నిస్సందేహముగా సామాన్య ప్రజలు ఆయన ఇశ్రాయేలుయొక్క మెస్సీయ అని గుర్తించిరి గాని, యూదయ మతాధి కారులకు భయపడి వారు ఈ విషయము చెప్పుటకు సాహసించ లేదు.

7:14 కొద్ది దినములకు పర్ణశాలల పండుగను ఆచరించుట ముగిసెను. సగము పండుగైన తరువాత యేసు దేవాలయమునకు వెలుపట జనులు గుంపుకూడి యుండగా అచ్చటికి వెళ్ళి బోధించుచుండెను.

యేసు ఆలయములో బోధించుట (7:10-31)

7:15 ఆయన బోధ వినిన జనులు ఆశ్చర్యపడిరి. లేఖన భాగములయందు ఆయనకు కలిగిన జ్ఞానమును గూర్చి వారాశ్చర్యపడిరి, ఆయన పాండిత్యమును గూర్చియు, బోధ చేయుటయందు ఆయనకు గల్గిన జ్ఞానమును గూర్చియు వారు ఆశ్చర్యపడిరి. ఆయన అంతటి జ్ఞానము కలిగియుండుటకు ఏ పాఠశాలకును వెళ్ళియుండలేదని వారికి తెలియును.

7:16 ప్రభువు తనకు గొప్పతనము నపేక్షింపక తన తండ్రి మహిమపరచబడుటకై ఆయన పనిచేసెను. అందుకు ప్రభువు నేనుచేయు బోధ నాదికాదు. నన్ను పంపిన తండ్రిదేనని చెప్పెను. ప్రభువైన యేసు బోధించునది, మాట్లాడునది అంతయు తండ్రి తనకు బోధించుమని, మాట్లాడుమని ఆదేశించినదే తండ్రికి వేరుగా తాను స్వతంత్రుడై ఆయన ఏమియు మాట్లాడియుండలేదు.

7:17,18 ఆయన బోధ సత్యమైనదో కాదో యూదులు తెలిసికొనగోరినయెడల అది చాల సుళువైన విషయము. ఒకడు దేవుని చిత్తమును నెరవేర్చుటకు యిచ యించినయెడల అట్టివానికి క్రీస్తు చేయు బోధ దైవికమైనదో లేక, ఆయనే తన ఇష్టానుసారముగా బోధించుచుండెనో దేవుడు వానికి తెలియజేయును.

వాస్తవముగా సత్యమును గూర్చి అన్వేషించు ప్రతి ఒక్కరికి అద్భుతమైన వాగ్దాన మివ్వబడెను. ఒకడు నీతిమంతుడై యుండి, సత్యమనగా ఏమిటో తెలిసికొన నాసక్తి కలిగియుండిన యెడల అట్టివానికి దేవుడు ప్రత్యక్షమగును.

“నా యంతట నేను బోధించుచున్నాననగా” తన్ను గురించి తాను బోధించుకొనుచున్నాడని కాదుగాని, “అధికారముతో బోధించు చున్నానని” అర్థము. ఎవడైనను తనకై తాను బోధించునో, అనగా తన చిత్తాను సారముగా బోధించునో అట్టివాడు తన స్వంత మహిమను అపేక్షించును.

ప్రభువైన యేసు అట్లు చేయలేదుగాని, తన్ను పంపిన తండ్రి మహిమను వెదకెను. ఎందుకనగా ఆయన ఉద్దేశ్యములు సంపూర్ణముగా పవిత్రమైనవి. ఆయన బోధ సత్యమైనది. ఆయన యందు అవినీతి ఏమియు లేదు. అట్టి మాటలు ఆ ప్రభువును గూర్చియే పలుకబడెను.

ప్రతి బోధకునియందు వానియొక్క పరిచర్యలో స్వార్థము కనిపించును. కాని దేవుని సేవకులలో ప్రతి ఒక్కరు తమకు కాక దేవునికే మహిమ ఆరోపించవలయును. 19 ప్రభువు యూదులపై సూటిగా నిందయొకటి మోపుచుండెను, మోషే వారికి ధర్మశాస్త్ర మనుగ్రహించెనని గుర్తుచేసెను.

వారు ధర్మశాస్త్రమును కలిగియుండుటవలన వారికేమియు ప్రయోజనము లేదని గుర్తించిరి. ధర్మశాస్త్రమునకు లోబడియుండవలసి నదిగా వారిపై చట్టము యజమాయిషీ చేయుచున్నది. ధర్మశాస్త్రము కలిగి యుండుటలో వారు ఘనత పొందినను, ప్రభువైన యేసును చంపుటకు పన్నాగము పన్నుటలో వారిలో ఏ ఒక్కరును ధర్మశాస్త్రమును గురించి ఆలోచించినవారు కారు.

ధర్మశాస్త్రము ‘హత్యను’ నిషేధించును, వారి స్వంత యిష్టమును నెరవేర్చ గోరినవారై ప్రభువును చంపుటలో ధర్మశాస్త్రమును మీరుట కైనను వారు వెనుకతీసినవారు కారు.

పర్వతారోహణమగుచున్న తర్కము Bible Verses Chapter 7

7:20 ఆయన తమను నిందించుటను గమనించి, ఆయన సత్యమై యుండెనని ఒప్పుకొనుటకు అంగీకరింపక తిరిగి ఆయనను నిందించసాగిరి. వారు నీవు దయ్యము పట్టిన వాడవనిరి. మరియు వారు మేము నిన్ను చంపజూచుచున్నామని ఏల చెప్పుచున్నావని ఆయనను సవాలు చేసిరి.

7:21,22 బేతెస్థ కోనేటివద్ద తాను స్వస్థపరచిన నిస్సహాయకుని గురించి తిరిగి ప్రస్తావించెను. ఈ అద్భుతమును చూచినప్పటినుండి యూదులలో ఆయనపై ద్వేషము చెలరేగెను, అప్పటినుండి ఆయనను చంపుటకు వారు కుట్ర చేయుచుండిరి.

నేను అద్భుతమును చేసినందున మీరు విస్మయమొందితిరని ఆయన జ్ఞాపకము చేసెను. అనగా ఆయన చేసిన అద్భుతమును చూచి, ప్రశంసించువారు అచ్చెరువొందలేదుగాని, ఆ కార్యమును సబ్బాతు దినమున చేసినందులకు విస్మయమొందిరి.

మగశిశువు జన్మించిన తరువాత ఎనిమిదవ దినమున అతనికి సున్నితి చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమునందు వ్రాయబడెను. ఎనిమిదవ దినము సబ్బాతుదినమందు వచ్చిన యెడల వారా శిశువునకు సున్నతి చేయించి యుండెడివారే. అది అత్యవసరమైన కార్యము గనుక అట్టి కార్యము చేయుటకు ధర్మశాస్త్రమంగీకరించునని వారు తలంతురు.

7:23 సున్నతి చేయుటకు ధర్మశాస్త్రము అంగీకరించిన యెడల ఒక వ్యక్తి స్వస్థత నొందుటలో వారు ప్రభువైన యేసునందు ఎందుకు తప్పు వెదుకుచున్నారు? అత్యవసర మైన కార్యమునకు ధర్మశాస్త్రము అంగీకరించిన యెడల, కృపగల కార్యమునకు ధర్మశాస్త్రము అంగీకరింపదా?

7:24 యూదులు కంటికి కనిపించు దానిని బట్టి విమర్శించుదురుగాని, అంతర్గత మైన వాస్తవమునుబట్టి విమర్శించు వాడుక వారికి లేదు. వారి తీర్పు నీతియుక్తమైనది కాదు. వారు చేసిన కార్యమే న్యాయయుక్తమైనది. అయితే వారు చేసిన కార్య ప్రభువు చేసినచో వారి దృష్టికది న్యాయయుక్తమైనది కాదు. న్యాయమైన తీర్పునుబట్టి కాక, వెలిచూపునుబట్టి తీర్పు తీర్చుట మానవ నైజము. ప్రభువు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమును మీరలేదు గాని, అజ్ఞానముగా ఆయనను ద్వేషించుటవలన వారే ధర్మశాస్త్రమును మరియున్నారు.

7:25 – 27 ఇప్పటికి యూదా మతాధికారులు రక్షకుని చంపుటకు పన్నాగము పన్నుచున్నారని యెరూషలేము నందు తెలియవచ్చెను. అయితే కొంతమంది సామాన్య ప్రజలు మన మతాధికారులు చంపదలచినవాడు ఈయన కాడా? యనియడిగిరి.

భయపడకయే బహిరంగముగా ప్రభువైన యేసు బోధించుటకు ఎట్లు అనుమతింప బడెనో వారికి గ్రహింపు కాలేదు. ప్రజలాయనను అంగీకరించుట యూదా మతాధి కారులకు ఇష్టములేదు. వారాయనను ద్వేషించుచున్నప్పుడు ఆయనను ఎందుకు ఈ విధముగా అనుమతించిరి? ఆయన బోధించునట్లుగా వారాయనను మెస్సీయగా అంగీకరించుటకు అవకాశముండెనా? యేసును మెస్సీయగా అంగీకరించినవారు ఆయన ఎక్కడినుండి వచ్చెనో ఎరుగుదురు.

ఆయన నజరేతునుండి వచ్చియున్నాడని విశ్వసించుచున్నారు. ఆయన తల్లి మరియయని వారెరుగుదురు. మరియు తండ్రి యోసేపుగా గుర్తించిరి, అయితే మెస్సీయ వచ్చునపుడు అకస్మాత్తుగా వచ్చుననియు అదియొక మర్మమనియు యూదుల నమ్మకము.

అయితే వారికి ఆయన యొక శిశు వుగా జన్మించి, మానవునిగా ఎదుగునని గ్రహించరైరి. క్రీస్తు బేత్లహేమునందు జన్మించు నని పాత నిబంధన గ్రంథమును చదివి గ్రహించవలసియుండెను గాని వారు ఆయన రాకను గురించిన వివరములు తెలిసికొనుటలో నిర్లక్ష్యము కలిగియుండిరి. కనుకనే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎరుగమని చెప్పిరి.

7:28 ఆ సమయమందు అక్కడ ఉండి ఈ సంభాషణంతయు వినుచున్న వారందరి కొరకు యేసు బిగ్గరగా ఇట్లు చెప్పెను “నేను ఎక్కడనుండి వచ్చియున్నానో వాస్తవముగా మీరెరుగుదురు. అయితే ఒక సామాన్య మానవునిగా నేనెక్కడనుండి వచ్చితినో మీకు తెలియును.

నజరేయుడైన ‘యేసు’ గా నేను మీకు తెలిసియుంటిని గాని నేను దేవుడనని మీకు తెలియదు. నాయంతట నేను రాలేదుగాని, నన్ను నా తండ్రియైన దేవుడు పంపెననియు, మీరు తెలిసికొనుటకు నిర్లక్ష్యము చేయుదురు” అని చెప్పెను. ఇట్లు చెప్పి తాను దేవునితో సమానమైనవానినని వారికి సూటిగా జవాబిచ్చెను. సత్యదేవు డాయనను ఈ లోకములోనికి పంపెనుగాని ఆ దేవుని వారు తెలిసికొనలేదు.

7:29 ఆ దేవుడు ఆయనను ఎరిగియుండెను. నిత్యత్వమంతటిలో దేవునితో కలసి నివసించెను. మరియు అన్ని విషయములలోను ఆయన తండ్రియైన దేవునితో సమానమైనవాడు.

ప్రభువు తాను దేవునియొద్దనుండి వచ్చెనని చెప్పుటలో తాను దేవునియొద్దనుండి పంపబడియున్నానని చెప్పుటయే గాక, నిత్యము దేవునితో జీవించి యున్నాననియు, తానన్ని విషయములలో దేవునితో సమానమైన వాడననియు తెలియ జేసెను. “ఆయన నన్ను పంపెననగా” తాను దేవుని క్రీస్తుననియు అభిషేకించబడి, విమోచన కార్యమును నెరవేర్చుటకు ఈ లోకమునకు పంపబడితిననియు చెప్పెను.

7:30 ఆయన మాటలలోని ముఖ్యాంశమును గుర్తించిన యూదులు తాను ‘మెస్సీయా’ అని వారికి తెలియజేయుచున్నాడని గ్రహించిరి. ఇది వారు దేవదూషణగా భావించి, ఆయనను పట్టుకొనుటకు ప్రయత్నించిరి గాని, సమయ మింకను రాలేదు గనుక ఎవరును ఆయనపై చేయి వేయలేకపోయిరి.

7:31 వాస్తవముగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి వారి విశ్వాసము సరియైనదని మనము తలంచుచున్నాము. వారికి కలిగిన గ్రహింపు ఏదనగా, యేసు మెస్సీయయని ఋజువుపరచుకొనుటకు ఇంకేమి కావలసియుండెను? యేసు మెస్సీయ కానియెడల, మెస్సీయ వచ్చినప్పుడు యేసు ఇప్పుడు చేసిన అద్భుతములకంటె మరిన్ని అద్భుతములు, మరి గొప్ప అద్భుతములు చేయునా? కనుక ఆయన చేసియున్న అద్భుతములు ఆయనను ‘మెస్సీయ’ యని ఋజువుచేయుచున్నవని విశ్వసించిరి.

పరిసయ్యుల శత్రుత్వము (7:32-36)

7:32 గుంపుకూడిన ప్రజలలో పరిసయ్యులు ఇటు అటు తిరుగుచుండగా వారు సణుగులను వినిరి. ప్రజలు ప్రభువును గూర్చి వ్యతిరేకముగా తలంచక వారాయనను హృదయమునందు అభినందించుచు చిన్నగా మాట్లాడుకొనుచుండిరి.

కనుక పరి సయ్యులు ఆయనను అంగీకరించువారు పెక్కుమంది యగుదురేమోయని భయపడి ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. ఈ వచన భాగము బంట్రౌతులకును, మతాధికారులకును, పరిసయ్యలకును అక్కడ గుమికూడిన ప్రజల కోసరము చెప్ప బడెను. ప్రభువు వారితో “ఇంక కొంతకాలము మీతో ఉందుననియు, అటు తరువాత నా తండ్రియైన దేవునియొద్దకు వెళ్లుదుననియు” చెప్పెను.

7:34 దీనితో పరిసయ్యులు మరింత కోపోద్రిక్తులైరి. రానున్న దినములలో మీరు నన్ను వెదకుదురు గాని, నన్ను కనుగొనరని ప్రభువు వారితో చెప్పెను. మరికొంత కాలమునకు వారికి రక్షకుడు అవసరమగును గాని, అప్పటికి సమయము మించి పోవును.

పరిసయ్యుల శత్రుత్వము (7:32-36)

ఆయన అప్పటికే పరలోకమునకు వెళ్ళిపోవును. కాని వారియొక్క అవిశ్వాసము మరియు దుష్టత్వమునుబట్టి పరలోకములో ఉన్న ఆయనను వారు కలుసుకొనలేరు. ఈ వచనములోని మాటలు చాల గంభీరమైనవి. రక్షింపబడుటకు మానవులకిప్పుడు అవకాశము ఇవ్వబడెను. ఇప్పుడీ అవకాశమును వారు తృణీక రించినచో మరెన్నడును ఈ అవకాశము వారికి ఇవ్వబడదు.

7:35,36 ప్రభువు మాటలలోని సారాంశమును యూదులు గ్రహించుటకు విఫలులైరి. ఆయన తిరిగి పరమునకు వెళ్ళుచున్నాడని వారు గ్రహింపరైరి. ఆయన బోధించుచు, ప్రయాణము చేయుచు అన్యులలో చెదరియున్న యూదులకు బోధింప వెళ్ళుచున్నాడనియు లేదా అన్యులకుకూడ బోధింప వెళ్ళుచున్నాడనియు అనుకొనిరి. ఆయన పలుకుచున్న మాటలకు వారు ఆశ్చర్యపడిరి. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు అని చెప్పుటలో ఆయన ఉద్దేశ్యమేమి? వారు వెంబడించలేనంతగా ఆయన ఎక్కడికి వెళ్ళును?

పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానము (7:37-39)

7:37 ఇది పండుగను ఆచరించు దినములలో చివరిదినము. యూదులు తమ మతాచారమును అనుసరించు కార్యము పూర్తికావచ్చినను, వారు ఆ పండుగయొక్క భావమును నిజముగా గ్రహించలేదు. గనుక వారి హృదయములు తృప్తి చెందియుండ లేదు.

వారు తమతమ ఇండ్లకు వెళ్ళబోవు ముందు వారికి ప్రభువు ఇట్లు చెప్పెను. ఎవడైనను ఆత్మీయ దాహమును తృప్తి పరచుకొనుటకు తన యొద్దకు రావలయునని చెప్పెను. “ఎవరినైనను” ఆయన ఆహ్వానించుచుండెను. ఆయన చెప్పిన మాటలను మనము జాగ్రత్తగా గమనించుదముగాక! ఆయన సువార్త సర్వ లోకమునకు చెందినది.

క్రీస్తునొద్దకు వచ్చిన వాడెవడైనను రక్షింపబడును. “ఎవడైనను దప్పిగొనినయెడల” అను మాట లేఖన భాగములలో చెప్పియున్నది. ‘దాహము’ అనగా ఆత్మీయ (దాహమును) అవసరతను గుర్తు చేయుచున్నది. ఒకడు తాను పాపియని గుర్తించిన యెడల వాడు రక్షింపబడును. తాను నశించియున్నానని గుర్తించనియెడల ఒకడు రక్షింపబడడు, ఒకడు తాను తన ఆత్మీయ జీవితములో ఎంతో కొరతబడి యున్నానని గ్రహించనిదే తన అవసరతను తీర్చుకొనుటకు (లోటును భర్తీ చేసికొనుటకు) ప్రభువు నొద్దకు వచ్చుటకు ఆశించడు.

దప్పికగొనిన ఆత్మను ప్రభువు తనయొద్దకు ఆహ్వానించుచున్నాడు, అంతేగాని ఒక సంఘమునకుగాని, ఒక బోధకునియొద్దకుగాని, బాప్తిస్మముయొద్దకుగాని, ప్రభువుబల్ల యొద్దకుగాని ఆయన ఆహ్వానించుటలేదు. “నా యొద్దకురండి” “నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుడి” అని ఆయన చెప్పెను. “త్రాగుటకు” అనగా ఆయనను రక్షకునిగాను, ప్రభువుగాను విశ్వసించి ఒకడు క్రీస్తు నొద్దకు రావలసియున్నది.

పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానము (7:37-39)

7:38,39 క్రీస్తునొద్దకు వచ్చి దాహము తీర్చుకొనుటయనగా ఆయనయందు విశ్వాసముంచుటయే. ఆయనయందు విశ్వాసముంచిన వారందరు వారి అసరములు తీర్చబడి, ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాద కారణముగా నుందురు.

పాత నిబంధన గ్రంథమందుకూడ మెస్సీయను అంగీకరించినవారు తమకు తాము ఫలించు వారైయుండి, ఇతరులకు ఆశీర్వాద కారకులగుదురని వ్రాయబడియున్నది. ‘అతని కడుపులోనుండి జీవనదులు పారునని” చెప్పుటలో ఒకని ఆత్మీయ జీవితమునుండి ఇతరుల సహాయముకొరకు జీవజల నదులు పారునని అర్థము.

“జీవజలము” అనగా ‘పరిశుద్ధాత్మ దేవునికి’ గుర్తు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించెదరో అట్టి వారు దేవుని ఆత్మను పొందియున్నారని ఈ వాక్యము ముఖ్యముగా వివరించుచున్నది. ప్రభువు మాట్లాడునప్పటికి పరిశుద్ధాత్మ ఈ లోకములోనికి పంపబడియుండలేదు. ప్రభువు పరలోకమునకు ఆరోహణుడై మహిమపరచబడనంత వరకు, పెంతెకొస్తు దినమువరకు పరిశుద్ధాత్మ దిగివచ్చియుండలేదు. ఆ క్షణమునుండియు ప్రభువైన యేసు క్రీస్తునందున్న నిజమైన ప్రతి విశ్వాసియు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైయుండెను.

క్రీస్తునుగూర్చి భిన్నాభిప్రాయములు (7:40-53)

7:40,41 ఆయన బోధ వినువారందరు ద్వితీ 18:15,18 లో మోషే చెప్పిన ప్రవక్త యితడేయని ఒప్పుకొనిరి. వారిలో కొందరు యేసే క్రీస్తనియు లేక మెస్సీయ అనియు ఒప్పుకొనిరి. మరికొందరు ఇది అసాధ్యమనిరి, యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చెనని నమ్మిరిగాని మెస్సీయ గలిలయనుండి వచ్చునని పాత నిబంధనలోని లేఖనములలో ఎచ్చటను వ్రాయబడలేదని వారి నమ్మకము.

7:42, 43 మెస్సీయ బేత్లహేమునుండి వచ్చుననియు, దావీదు వంశమునుండి వచ్చుననియు, యూదులు కచ్చితముగా నమ్మిరి. యేసు బేత్లహేములో జన్మించుననియు మరియు దావీదు వంశీయుడనియు వారు కనుగొనినట్లుగా చెప్పబడలేదు. వారియొక్క సహజసిద్ధమైన నిర్లక్ష్య స్వభావమునుబట్టియు, భేదాభిప్రాయములనుబట్టియు వారిలో క్రీస్తునుగూర్చి వివిధములైన ఉద్దేశ్యములు కలిగియుండిరి.

ఇప్పుడును ఇంతే సంభ వించుచున్నది. యేసునుగూర్చిన విషయములందు స్త్రీ పురుషులు విభజింపబడిరి. ఆయన మనవలె ఒక మానవుడని కొందరు చెప్పుదురు. మరియు కొందరు ఇట్టివాడు ఇంతకుమునుపు జీవించియుండలేదని చెప్పుదురు. అయితే దేవుని వాక్యమును అంగీకరించువారు ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటికిపైగా దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడని నమ్ముచున్నారు.

7:44 ఆయనను పట్టుకొన ప్రయత్నములు జరుగుచుండెనుగాని ఆయనను పట్టు కొనుటకు ఎవరును ముందడుగు వేయలేకపోయి విఫలులైరి. ఒక వ్యక్తి దేవుని చిత్తప్రకారము జీవించినంత కాలము ఈ లోకములోని ఏ శక్తియు అట్టివానికి అభ్యంతరము కల్గించదు. “మన పనులను మనము పూర్తిచేయువరకు మనము జీవించియే యుందుము.” ప్రభువైన యేసుయొక్క సమయమింకను రాలేదు గనుక ఎవడును ఆయనకు హానిచేయ తెగింపలేదు.

7:45-47 పరిసయ్యులును ప్రధాన యాజకులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. బంట్రౌతులు తిరిగి వచ్చిరిగాని వారితో ప్రభువు లేడు. అయితే ప్రధాన యాజకులును, పరిసయ్యులను బహుగా కలవరపడి ఈ బంట్రౌతు లాయనను పట్టుకొనలేని కారణమేమని యడిగిరి.

అప్పుడు బంట్రౌతులాయనను అంగీకరింపక పోయినప్పటికి ఆయననుగూర్చి మంచి సాక్ష్యమిచ్చిరి “ఆయన మాట్లాడి నట్లు ఎవడును మాట్లాడలేదని” చెప్పిరి. వారెంతోమంది అధికారులు మాట్లాడుట వినియున్నారు గాని, ప్రభువు మాట్లాడిన విధముగా అధికారముతోను, జ్ఞానముతోను, దయగలిగిన మాటలు ఎవరును మాటలాడలేకపోయిరి.

యేసును పట్టుకొనుటలో మోసపోయిన బంట్రౌతులను భయపెట్టుటకై వారు బంట్రౌతులను దూషించిరి.

7:48 అధికారులలో ఎవడును ఆయనయందు విశ్వాసముంచలేదని వారు చెప్పిరి. ఇది ఎంతటి ఘోరమైన విషయమోగదా! యూదా మతాధికారులలో ఒక్కరైనను ఆయనను మెస్సీయగా గుర్తించకుండుట ఎంత సిగ్గుకరమైన సంగతి! పరిసయ్యులు తమ ప్రభువైన యేసునందు విశ్వాసముంచుటకు అంగీకరింపక పోవుటయేగాక, ఇతరులనుకూడ ఆయనను అంగీకరించుటకు ఒప్పుకొనరు. ఈ దినములలో కూడ ఇట్లే జరుగుచున్నది. తాము రక్షింపబడుటకు ఇష్టములేని వారందరు తమ శక్తినంతయు నుపయోగించి తమ బంధువులను స్నేహితులను రక్షణలోనికి రానీయరు.

7:49-53 ఆ తరువాత పరిసయ్యులు యూదా జనాంగమును శాపగ్రస్తమైన జనము అని చెప్పిరి. ఎవనికైనను లేఖన భాగములు తెలిసియుండిన యెడల వారు కచ్చితముగా యేసు యెస్సీయకాడని చెప్పుదురా? ఇంతకంటే వారు చేయు తప్పిదము మరేదియు లేదు.

క్రీస్తునుగూర్చి భిన్నాభిప్రాయములు (7:40-53)

ఈ సమయమందు నీకొదేము వారితో మాట్లాడెను. ఇంతకు ముందు నీకొదేము ప్రభువునొద్దకు వచ్చి ఆయనను రక్షకునిగా అంగీకరించి రక్షించబడి యుండెనని మనకు తెలియును. అతడు అక్కడ కూడియున్న అధికారులందరి యెదుట ముందుకువచ్చి ప్రభువునుగూర్చి ఒకమాట మాటలాడ తెగించెను, యూదులు యేసుకు అవకాశ మివ్వలేదని నీకొదేము ఆరోపించెను.

ఒకడు చేసినదంతయు తెలిసికొనక మునుపు యూదుల ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చదనుట కద్దు. అయినప్పటికి యూదా మతాధికారులు ఆయనకు తీర్పు తీర్చుటకు పూనుకొనుచున్నారు.

వారు జరుగుచున్న వాస్తవములకు భయపడుచున్నారా? నీకొదేము వారితో సమానమైన అధికారము కలిగినప్పటికి వారతనిని అపహసించుచు ఆయనను వెంబడించు గలిలయులలో నీవును ఒకడవా? అని అడిగిరి.

గలిలయనుండి ఏ ప్రవక్తయు పుట్టడని లేఖన భాగములు చెప్పుట లేదా? అని వారు అనిరి. ఇట్లు వారియొక్క అజ్ఞానమును వెల్లడించిరి. వారు ప్రవక్తయైన యోనాను గురించి చదువలేదా? యోనా గలిలయ నుండి వచ్చెను.

ఇప్పటికి పర్ణశాలల పండుగ ముగియవచ్చినది. ప్రజలు తమతమ ఇండ్లకు వెళ్ళుచుండిరి. వారిలో కొందరు రక్షకుని ముఖాముఖిగా కలిసికొని ఆయన యందు విశ్వాసముంచిరి. అయితే ప్రజలలో పెక్కుమంది ఆయనను తృణీకరించిరి. మరియు యూదా మతాధికారులు ఆయనను చంపుటకు స్థిరముగా నిశ్చయించుకొనిరి. వారాయనను తమ మతమునకు, తమ జీవన సరళికి అడ్డుబండగా యుండెనని తలంచిరి.

Leave a Comment