పరలోకమునుండి వచ్చిన ఆహారము – Bible Verses Chapter 6 in Telugu

ఆరవ అధ్యాయము

పరలోకమునుండి వచ్చిన ఆహారము

నాల్గవ సూచకక్రియ –
ఐదువేలమందికి ఆహారము పెట్టుట 6:1-15) :

6:1-4 “అటు తరువాత” అనగా 5వ అధ్యాయములో వ్రాయబడిన సంగతులు జరిగిన తరువాత కొంత సమయము గడచిపోయెనని అర్థము. అది ఎంత సమయము గడచెనో మనకు తెలియదు. అయితే ప్రభువు యెరూషలేము చుట్టు ప్రక్కల ప్రాంతములు సంచరించి గలిలయ సముద్రము నొద్దకు వచ్చెను.

ఆయన సముద్రము దాటి అద్దరికి వెళ్ళెననగా – వాయువ్య దిశలోని సముద్ర తీరమునుండి ఈశాన్య తీరమునకు వెళ్ళెనని అర్థము. గలిలయ సముద్రమును తిబెరియ సముద్రమనికూడ పిలుతురు. ఎందుకనగా తిబెరియ పట్టణము దానియొక్క పడమటి ఒడ్డున ఉన్నది.

తిబెరియ పట్టణము గలిలయ ప్రాంతమునకు ముఖ్యపట్టణము. మరియు రోమా చక్రవర్తి “లిబేరియస్” అను పేరును బట్టి ఆ పట్టణమునకాపేరు వచ్చెను. అక్కడ బహు జనులాయనను వెంబడించిరి. అయితే వీరు ఆయన దేవుని కుమారుడని నమ్ముటవలన ఆయనను వెంబడించినవారు కాదుగాని, ఆయన అద్భుతములు చేయగా చూచి ఆయనను వెంబడించిరి.

ఆ ప్రాంతమందు పేరెన్నికగొన్న పర్వత మొకటి కలదు. ప్రభువైన యేసు తన శిష్యులతో ఆ కొండపైకి ఎక్కి వెళ్ళెను. పస్కా పండుగ సమీపించెనని యోహాను ఎందుకు వ్రాసెనో వివరముగా తెలుపలేదు.

Read and Learn More Telugu Bible Verses

అయితే యీ అధ్యాయములో ప్రభువైన యేసు జీవాహారమును గురించి అద్భుతరీతిగా మాట్లాడు చున్నప్పుడు పస్కా పండుగను గురించి తలంచెనని కొందరు చెప్పుదురు ఈ పస్కా పండుగకు యేసు యెరూషలేమునకు వెళ్ళియుండలేదు.

పస్కా పండుగ అనునది “యూదుల పండుగ” యని సువార్తికుడైన యోహాను చెప్పియుండెను. వాస్తవముగా యీ పండుగను దేవుడు నియమించి యూదుల కనుగ్రహించుటనుబట్టి ఇది యూదులు పండుగయైనది. అయితే యూదుల పండుగయని పిలుచుటలో దేవుడు దీనిని “యెహోవా పండుగ” గా గుర్తించలేదని భావము. ఎందుకనగా యూదులు ఈ పండుగను ఒక ఆచారముగా చేయుచున్నారుగాని హృదయపూర్వకముగా ఆచరించుటలేదు.

6:5,6 యేసు బహుజనులు గుంపుగా కూడి వచ్చుట చూచినప్పుడు ఆయన తన శిష్యులతో ఆ కొండపై ఏకాంతముగా గడుపు ఆ విశ్రాంతి సమయమును భంగపరచు చున్నారని ఎంతమాత్రము కోపపడలేదు. ఆయన మొదటిగా వారికి ఆహారము పెట్ట తలంచెను. కనుక వారు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమనియేసు ఫిలిప్పునడిగెను.

ఇతరులకు బోధించుటకే యేసు ఈ ప్రశ్నను అడిగెను గాని తనకు తెలియకకాదు ఆయనకు ఆ ప్రశ్నకు సమాధానము తెలియునుగాని ఫిలిప్పుకు తెలియదు. ఇక్కడ ప్రభువు ఫిలిప్పుకు ఒక అమూల్యమైన పాఠమును నేర్పదలంచి అతనియొక్క విశ్వాసమును పరీక్షించెను. ఈ జనసమూహమునకు ఆహారము పెట్టుటకు తాను చేయబోవు అద్భుతమును ఆయన ఎరిగియుండెను.

అయితే ప్రభువు అద్భుతము చేయగలడని ఫిలిప్పు తలంచెనా? ఫిలిప్పు విశ్వాసము గొప్పదా? లేక అల్పమైనదా?

6:7 ఫిలిప్పు విశ్వాసము ఉన్నత శిఖరము నధిరోహించినట్లుగా మనకిక్కడ అగుపించుటలేదు.  అతడు వెంటనే లెక్కించి రెండువందల దేనారముల ఖరీదుగల ఆహారము వారిలో ప్రతి ఒక్కరు కొంచెము కొంచెముగా తీసికొనుటకుకూడ చాలదని చెప్పెను. ఎన్ని రొట్టెలు కొనవలెనో కచ్చితముగా తెలియదు.

పెద్ద మొత్తములోనే ఆహారము కావలసి యుండెను. దేనారము అనగా ఒక కార్మికునియొక్క రోజుకూలి.

6:8 సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ అచ్చట ఉండెను. వారిరువురు గలిలయ సముద్ర తీరములోని బేత్సయిదా ప్రాంతమందు నివసించుచుండెడివారు

6:9 ఇంత గొప్ప జనసమూహమునకు ఆహారము పెట్టుట బహు కష్టతరమైన సంగతియని అంద్రెయ తేల్చిచెప్పెను. అయినను అతడు అక్కడొక బాలునియొద్ద ఐదు యవల రొట్టెలను, రెండు చిన్న చేపలున్నట్లు గుర్తించెను. అయితే వీటిద్వారా యీ గొప్ప జనసమూహముయొక్క ఆకలి తీర్చ ప్రయత్నించుట నిష్ప్రయోజనమని తలంచెను.

ఆ చిన్నవానియొద్ద ఎక్కువ ఆహారము లేకపోయినప్పటికి అది అంతయు ప్రభువైన యేసు కిచ్చుటకు అతడు ఇష్టపడెను. తత్ఫలితముగా ఈ వృత్తాంతము నాల్గు సువార్తలయందు వ్రాయబడెను. ఆ చిన్నవాడు గొప్పకార్యమేమియు చేయలేదు. కాని, అది కొంచెమే అయినను ఆ కొంచెమందు దేవుడున్నయెడల అదే ఎక్కువ. దీనినిబట్టి ఆ చిన్నవాడు ప్రంపంచమంతట ప్రసిద్ధికెక్కెను.

6:10 ఈ వచనమందు వాడబడిన “జనులు” అను మాటకు ‘స్త్రీ పురుషులు’ అని భావము. ప్రభువైన యేసు వారిని పంక్తులుగా తీర్చి కూర్చుండబెట్టుట వారియొక్క సౌలభ్యముకొరకే పచ్చికగల చోటును ఆయన ఎన్నుకొనుటను గమనించుడి, ఆ ప్రాంతమందు పచ్చికగల ప్రదేశమును కనుగొనుట కష్టమే. అయినప్పటికి పరిశుభ్ర మైన ఆహ్లాదకరమైన ప్రదేశమందు ఆ జనులను కూర్చుండబెట్టుటలో ప్రభువు జాగ్రత్త వహించెను.

ఆ జనసమూహమందు ఐదువేలమంది పురుషులుండిరి అనగా వీరికితోడు స్త్రీలు పిల్లలు అనేకులు కలరని అర్థము. ఐదు వేలమంది పురుషులని చెప్పుటలో ఎంత గొప్ప అద్భుత కార్యము జరుగనైయున్నదో తెలియజేయుచున్నది.

6:11. యేసు ఆ ఐదు రొట్టెలు చేతపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఆహార మును వడ్డించి పెట్టకమునుపు లేక వడ్డించకమునుపు యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినయెడల మనము కూడ ఆహారము భుజించకమునుపు మనమెంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనో గదా! ఆ తరువాత ఆయన ఆ ఆహారమును తన శిష్యులకు పంచి ఇచ్చెను.

ప్రభువు ప్రతిపని తనంతట తానేదియు చేయలేదు. ఇతరుల పరిచర్యను ఆయన తన పరిచర్యగా పరిగణించెను. “నీవు చేయగలిగినది నీవు చేయుము” “నేను చేయగలిగినది నేను చేయుదును” “మనము చేయలేని దానిని ప్రభువు చేయును” అని దీని విషయములో బాగుగా చెప్పబడినది.

ఆయన తన శిష్యులకు పంచి ఇచ్చునపుడు ఆ యాహారము ఆశ్చర్యకరముగా విస్తారమాయెను. ఈ అద్భుతము ఏ క్షణములో సంభవించెనో మనమెరుగము గాని ఐదు రొట్టెలు. రెండు చిన్నచేపలు ప్రభువు చేతులలో ఈ గొప్ప జనసమూహము తినుటకు సరిపోయినంత ఆహారమాయెనని మనము ఎరుగుదుము. కూర్చుండిన ప్రజలకు రొట్టెలను, చేపలను శిష్యులు పంచిపెట్టిరి.

వారికి “ఇష్టమైనంతమట్టుకు” చేపలుకూడ వడ్డించిరి. అనగా ఆహారపు కొరత లేదని భావము, ఈ అద్భుత కార్యములో సృష్టికార్యము మిళితమైయున్నది. ఒక సామాన్యమానవుడెవడును ఐదు రొట్టెలు రెండు చేపలు తీసికొని యీ విధముగా విస్తారపరచలేడు. ఆయన ఆ రొట్టెలను ఆశీర్వదించినప్పుడు అది ‘తొలకరి’ వానయనియు ఆయన ఆ రొట్టెలను విరిచి నపుడు అది ‘కోతకాలమనియు’ సరిగా పోల్చిచెప్పబడినది.

6:12 మిగిలిన ముక్కలు ప్రోగుచేయుడని ప్రభువు తన శిష్యులకు చెప్పిన మాటలు మన హృదయములను ఎంతగానో తాకుచున్నవి. యేసు కేవలము మానవుడైయున్న యెడల మిగిలిపోయిన ముక్కలను గురించి ఆలోచించువాడు కాదు.

పరలోకమునుండి వచ్చిన ఆహారము నాల్గవ సూచకక్రియ - ఐదువేలమందికి ఆహారము పెట్టుట 6:1-15) :

ఐదువేలమందిని పోషించిన మానవుడెవడు మిగిలినపోయిన ముక్కలను గురించి ఆలోచించడు. యేసు దేవుడు గనుక, దేవుని దాతృత్వమందు ‘వృధా’ యనునది ఉండదు. ఆయన మన కప్పగించిన అమూల్యమైన వస్తువులను మనము వృధా చేయకూడదు. గనుకనే ఆయన ఏమియు మిగులకుండ మిగిలిన ముక్కలను ప్రోగుచేయుడని చెప్పెను.

ఈ అద్భుతమును గురించి మరికొందరు ఇట్లు చెప్పుదురు. ఆ చిన్నవాడు ప్రభువు కిచ్చిన ఐదు రొట్టెలను, రెండు చేపలను ఆ జనసమూహముచూచి తామెంతో స్వార్థ పరులమని గ్రహించి వారి భోజనపుమూటలను విప్పి ఒకరితో ఒకరు పంచుకొనిరని వ్యాఖ్యానించుచున్నారు.

ఇట్లు ప్రతి ఒక్కరికి సమృద్ధియైన ఆహారముండెనని చెప్పుదురు. 6:13 కాని ఆ జనసమూహము తృప్తిగ (భోజనము) భుజించిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపలు ఎత్తిరి. వారు ఎవరో తెచ్చుకొనిన భోజనము భుజించుట వలనగాని, లేక ఒకరితో ఒకరు పంచుకొనుట వలనగాని ఇంత విస్తారమైన ఆహారము మిగులుట సాధ్యమేనా ! నిశ్చయముగా అట్లు జరుగనే జరుగదు. గొప్ప అద్భుతకార్య మిక్కడ సంభవించెను.

6:14,15 ప్రజలు ఈ అద్భుతమును గుర్తించిరి. ఈ అద్భుతమునుబట్టి ఈ లోకమునకు రానైయున్న ప్రవక్త ఈయనేయని వారు ఒప్పుకొనిరి. ఒక ప్రవక్త వచ్చునని వారెరుగుదురు. ఆయన వచ్చి తమ్మును రోమా ప్రభుత్వాధికారము నుండి విడిపించు నని ఆయనకొరకు కనిపెట్టుచున్నారు. కాని యేసు దేవుని కుమారుడని మాత్రము వారు ఒప్పుకొనుటకు ఇష్టపడరు. మరియు వారి పాపములను ఒప్పుకొని ఆయనను తమ రక్షకునిగా అంగీకరించుటకుకూడ ఇష్టపడరు.

యేసు చేసిన యీ అద్భుతకార్య మునుబట్టి ప్రజలాయనను రాజుగా చేయదలంచిరి. అయితే వారియొక్క శరీరాశలకు యేసు కదిలింపబడలేదు. పాపులకు ప్రతిగా ఆయన కలువరిలో సిలువపై మరణించు టకు ఈ లోకములోనికి వచ్చెను. ఆ గురినుండి ఆయన ఎంతమాత్రము తొలిగిపోడు. ఆయన హెచ్చింపబడక మునుపు శ్రమపొంది రక్తము కార్చి మరణించవలసియున్నది.

ఐదవ సూచకక్రియ
యేసు నీళ్ళపై నడచి తన శిష్యులను కాపాడుట (6:16-21) : 6:16,17

అది సాయం సమయము. యేసు ఒంటరిగా కొండకు వెళ్ళెను. జన సమూహము తమతమ ఇండ్లకు వెళ్ళిరి. శిష్యులు తిరుగు ప్రయాణమై గలిలయ సముద్రమును దాటుటకు సముద్రపు ఒడ్డునకు చేరిరి.

కపెర్నహూమునకు వెళ్ళవలెనని వారు సముద్రమును దాటుచుండగా చీకటిపడెను. ప్రభువు వారితో లేడు. ఆయన కొండపై ప్రార్థించుచుండెను. నేటి దినములలోని క్రీస్తు అనుచరులకు ఇది చక్కని పటము కాదా! తుఫానుతో కూడిన జీవితసాగరములో వారు పయనించుచున్నారు.

ఇది చీకటివేళ, ప్రభువైన యేసు ప్రత్యక్షముగా ఎక్కడను కనిపించుటలేదు. దీనినిబట్టి ఏమి జరుగుచున్నదో ఆయన గమినించుటలేదని అర్థమా? కాదు. ఆయన పర మందుండి తాను ప్రేమించువారికొరకు ప్రార్థించుచుండెను.

6:18 గలిలయ సముద్రము తరుచుగా తుఫానులకు గురియగుచుండును. యోర్దాను నదీలోయయందు వీచిన గాలులు ఈ సముద్రమందు పర్వతమంత అలలను పుట్టించును. ఆ సమయమందు చిన్న చిన్న దోనెలు ఆ సముద్రమందు ప్రయాణించుట క్షేమముకాదు.

శిష్యులు దాదాపుగా 25 నుండి 30 ఫర్లాంగులు లేక సుమారు 3 నుండి 4 మైళ్ళ దూరము నావలో ఆ సముద్రముపై ప్రయాణము చేసిరి. ఇప్పుడు వారు తుఫాను ప్రమాదములో చిక్కుకొనిరి. ఇంతలో అకస్మాత్తుగా వారు యేసు ఆ నీళ్ళపై నడచి వచ్చుట చూచిరి. ఆయన వారిని సమీపించగా వారు భయపడిరి.

ఐదవ సూచకక్రియ యేసు నీళ్ళపై నడచి తన శిష్యులను కాపాడుట (6:16-21) : 6:16,17

ఎంత సహజముగా ఈ వృత్తాంతము చెప్పబడెనో గమనించుడి, మిక్కిలి ఆశ్చర్య కరమైన వాస్తవములు మనకు చెప్పబడెనుగాని, జరిగిన గొప్ప కార్యము విని మనము ముగ్దులమగునట్లుగా యెహాను గంభీరమైన మాటలతో ఈ వృత్తాంతమును వివరించు టకు ప్రయత్నించలేదు. కాని వారికి ఎదురైన ఆటంకమును తేటగా వివరించెను.

6:20 అప్పుడు ప్రభువైన యేసు “నేనే, భయపడకుడి” అని చెప్పి వారినాదరించెను. శక్తిమంతుడైన సృష్టి నిర్మాణకుడు నిర్వాహకుడు వారిచెంతనే యుండెను. ఇంక వారు భయపడుటకు హేతువులేదు.

గలిలయ సముద్రమును కలుగజేసినవాడే తుఫాను అలజడికి లేచిన నీటి తరంగములను సద్దణిపి, తన శిష్యులను క్షేమముగా ఒడ్డుకు చేర్చగలడు. ‘నేనే’ అను మాటకు వాస్తవముగా ‘నేను ఉన్నవాడను అని అర్ధము. ఈ యోహాను సువార్తలో రెండవసారిగా యేసు తనంతట తానే తనకు యెహోవా నామమును ఉపయోగించుకొనెను.

6:21 ఆయన ప్రభువని వారు గుర్తించినప్పుడు వారాయనను తమదోనెలోనికి ఆహ్వానించిరి. వారాయనను చేర్చుకొనగా వారు చేరవలసిన గమ్యమునకు చేరిరి. ఇక్కడ మరొక అద్భుతమును గురించి చెప్పబడినదిగాని, వివరించబడలేదు. ఇక వారు దోనెను నడపనవసరములేదు. తక్షణమే ప్రభువు వారిని దరికి చేర్చెను. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో గదా!

ప్రజలు సూచకక్రియ నడుగుట (6:22-34) :

6:22 ఇది మరుసటి దినము. గలిలయ సముద్రమునకు ఈశాన్య ప్రాంతమందు బహుజనులు ఇంకను నిలిచియుండిరి. గడచిన సాయంకాలమందు ఒక చిన్న దోనెలో శిష్యులు మాత్రమే ఎక్కివెళ్ళిరని వారు గమనించిరి. మరియు ప్రభువైన యేసు వారితో వెళ్ళలేదనికూడ వారు గుర్తించిరి. ఆ సమయమున అక్కడ ఆ ఒక్క దోనె మాత్రమే యుండుటచేత ఆ దోనెలో శిష్యులు వెళ్ళిరి.

6:23 మరుసటి దినమున మరికొన్ని దోనెలు ప్రభువు ఐదువేల మందికి ఆహారము పెట్టిన స్థలమునొద్దకు చేరెను. అయితే ప్రభువు ఆ దోనెలలో అక్కడనుండి వెడలిపోలేదు. ఎందుకనగా అవి అప్పుడే ఆ స్థలమునకు వచ్చెను. బహుశ ఆ చిన్న దోనెలలోనే ఆ ప్రజలు సముద్రము దాటి కపెర్నహూమునకు చేరియుండ వచ్చునని మనము తరువాత వచనములద్వారా తెలిసికొనగలము.

6:24 ఈ గుంపు ప్రభువును అతి జాగ్రత్తగా గమనించుచుండిరి. ఆయన కొండపై ప్రార్ధించుటకు వెళ్ళెనని వారికి బాగుగా తెలియును. ఆయన శిష్యులతో కలసి సముద్ర మును దాటి వెళ్ళియుండలేదని వారికి తెలియును. అయినను ఆ మరుసటి దినమందు వారెక్కడను ఆయనను కనుగొనరైరి.

కనుక వారు సముద్రమును దాటి సాధారణముగా శిష్యులుండు కపెర్నహూమునకు వెళ్ళదలంచిరి. అయితే యేసు అక్కడికి ఎటువెళ్ళెనో వారికి తెలియదుగాని, వారాయనను వెదుకుచు వెళ్ళిరి.

6:25 – 27 వారు కపెర్నహూమునకు వెళ్ళినపుడు ఆయనను అక్కడ కనుగొనిరి. వారు తమ ఉత్సాహమును అణచుకొనలేక నీ వెట్లు ఇక్కడకు వచ్చితివని వారాయనను అడిగిరి. వారి ప్రశ్నకు ప్రభువు సూటిగా జవాబివ్వలేదు. ఎందుకనగా వారు ఆయన ఇచ్చు ఆహారముకొరకే ఆయనను వెదుకుచున్నారుగాని, ఆయన ఎవరోయని తెలిసికొను నిమిత్తము ఆయనను వెదుకుటలేదని ప్రభువు ఎరిగియుండెను.

గత దినమున ఆయన చేసిన అద్భుత కార్యమును వారు కన్నులారా చూచిరి. దానినిబట్టి వారాయనను సృష్టికర్తగాను, మెస్సీయగాను తప్పక ఒప్పుకొనవలెను. అయితే వారి ఆసక్తియంతయు ఆహారమందే యున్నది.

ప్రభువు యిచ్చిన రొట్టెలు తిని ఆకలి తీర్చుకొనిరి. కనుక యేసు వారితో క్షయమగు ఆహారముకొరకు శ్రమ పడకుడని చెప్పెను. వారు తమ అనుదిన జీవనము కొరకు పనిచేయవద్దని ఆయన ఉద్దేశ్యము కాదు.

కాని ఆహార సంపాద్యమే వారి జీవితములో ముఖ్యోద్దేశ్యముగా నుండరాదని ప్రభువుయొక్క భావము. ఆకలితీరి తృప్తిపడుటయే జీవిత లక్ష్యము కాదు. మానవుడు ఒక్క శరీరమును మాత్రమే కలిగియుండలేదు.

గాని ఆత్మ, ప్రాణము దేహమును కలిగియుండెను. గనుక నిత్యజీవము కలుగజేయు అక్షయాహారము కొరకు మనము ప్రయాసపడవలెను. అనగా, ఆత్మీయాహారము లేక ప్రభువైన యేసుయొక్క బోధ నాశింపవలెనని యర్థము.

శరీరాహారముయొక్క విలువ సమాధితో అంతమగును. అయితే ప్రభువైన యేసుయొక్క మాటల విలువకు ఎన్నడు అంతము లేదు. అవి నిత్యజీవమనుగ్రహించును. మానవుడు శరీరావసరముల నిమిత్తము జీవించరాదు. దేవునియొక్క మాటచే తనయొక్క ప్రాణము దినదినము పోషించబడునట్లు నిశ్చయముగా చూచుకొనవలెను.

మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడుగాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును. దేవుని వాక్యముయొక్క శ్రేష్ఠమైన జ్ఞానమును సంపాదించు నిమిత్తము మనము అలయక ప్రయాసపడవలెను.

ఈ వచనముయొక్క చివరి భాగములో ప్రభువైన యేసు తండ్రియైన దేవుడు తనకు ముద్రవేసి యున్నాడని చెప్పెను. అనగా దేవుడాయనను పంపెననియు, మరియు ఆయనను ఆమోదించెననియు అర్థము. మనము ఏదేని ఒక విషయమునకు ముద్రవేసితిమంటే, అది సత్యమని మనము వాగ్దానము చేయుచున్నామని అర్ధము. దేవుడు మనుష్యకుమారునికి ముద్రవేసి యున్నాడనగా, ఆయన సత్యమును పలుకు వానిగా దేవుడు ఆయనను ప్రతిష్టించుచున్నాడు.

ప్రజలు సూచకక్రియ నడుగుట (6:22-34) :

6:28, 29 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ప్రభువును అడిగిరి. పరలోకము చేరుటకు మానవుడు తన స్వంత మార్గములలోనే ప్రయత్నించుచున్నాడు. రక్షణ పొందుటకు తానేదియో చేయవలెనని మానవుడు ఆశించుచున్నాడు.

అయితే వారి వేషధారణ యేసు ఎరిగియుండెను. దేవునికొరకు పనిచేయుచున్నట్లుగా నటించుచున్నారుగాని దేవునికుమారుని విషయములో తమ కేమియు సంబంధములేనట్లుగానున్నారు. అయితే ప్రభువు ఎవరిని పంపెనో ఆయనను వారు మొదట తప్పక అంగీకరించవలెనని ప్రభువు చెప్పెను.

ఈ దినములలోకూడ ఇట్లే జరుగుచున్నది. అనేకులు తమయొక్క సత్రియలద్వారా పరలోకమునకు వెళ్ళు మార్గమును వెదకుచున్నారు. అయితే వారు దేవునికొరకు సత్రియలు చేయనారంభించు టకు ముందు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలసి యున్నారు.

సత్రియలు రక్షణను అంటి వెంబడించునుగాని రక్షణ సత్రియలను వెంబడించదు. అనగా క్రియలు రక్షణ తరువాతే గాని రక్షణకు ముందుకాదు. ఒక పాపి తన పాపములను ఒప్పుకొని యేసు క్రీస్తును ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించుటయే సత్రియ.

6:30 మానవునిది ఎంత దుష్ట హృదయమోగదా! నిన్ననే యేసుప్రభువు ఐదువేల మంది పురుషులకు ఐదు రొట్టెలు, రెండు చేపలు పంచిపెట్టుటను చూచిరి. కాని నేడు నీవు దేవుని కుమారుడవని ఋజువు పరచుకొనునట్లు మాకొక సూచకక్రియ చూపుమని వారు అడుగుచున్నారు.

వారు పాత నిబంధనలో చెప్పబడిన మన్నాను గూర్చిన అద్భుత కార్యమును యూదులు యేసు ప్రభువుకు గుర్తుచేసిరి. అనగా ఆ దినములలో దేవుడు చేసిన గొప్ప కార్యముకంటె, ప్రభువుచేసిన యీ కార్యము ఎన్నతగినది కాదని వారి అభిప్రాయము. మరియు వారు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని కీర్తన 78:24,25 లోని సంగతిని ఎత్తి చెప్పిరి.

మోషే వారికొరకు పరలోకమునుండి ఆహారమును కురిపించెను. కాని ప్రభువు ఉన్నదానినే (తనకిచ్చిన ఆహారమును) ఎక్కువ చేసెను. కాబట్టి ప్రభువు మోషేకంటే గొప్పవాడుకాడని వారి ఉద్దేశ్యము.

పరలోకమునుండి వచ్చిన ఆహారము Bible Verses Chapter 6

6:32 మన్నాను ఇచ్చినది మోషే కాదనియు, దేవుడు దానిని వారికిచ్చెననియు యేసు వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అయితే మన్నా పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆత్మీయ ఆహారము కాదు. మన్నా అనునది అక్షరార్థమైన ఆహారము. ఇది శరీర పోషణార్ధమై యివ్వబడిన ఆహారము.

ఇది జీవిత కాలమువరకే ప్రయోజనమైనదిగాని ఆ తరువాత జీవితమునకు నిష్ప్రయోజనమైనది నిజమైనదియు, ఉన్నతమైనదియు, వాస్తవమైనదియు పరలోకమునుండి దేవుడనుగ్రహించు ఆహారమును గూర్చి ప్రభువైన యేసు చెప్పుచుండెను. ఈ ఆహారము ఆత్మకొరకేగాని శరీరము కొరకుకాదు. ‘నా తండ్రి’ అని చెప్పుటలో క్రీస్తు తన దైవత్వమును గూర్చి వక్కాణించుచున్నాడు.

6:33 పరలోమునుండి దిగివచ్చి ఈ లోకమునకు జీవమనుగ్రహించునదే దేవుడిచ్చు ఆహారమైయున్నది. ఇప్పుడు తాను దేవుడిచ్చు ఆహారమని ప్రభువైన యేసు తన్నుగూర్చి ఇక్కడ చెప్పుటలేదుగాని, దేవుడిచ్చు ఆహారము పరలోకమునుండి దిగివచ్చి జీవ మనుగ్రహించునని చెప్పెను.

దేవుడు ఆరణ్యములో కురిపించిన మన్నాకంటే ఈ ఆహారము శ్రేష్ఠమైనది. మన్నా జీవమనుగ్రహించదు గాని శరీరమును బలపరచును. మన్నా ఈ లోకమంతటికొరకు కాదుగాని ప్రత్యేకించి ఇశ్రాయేలు జనాంగము కొరకు ఇవ్వబడెను. పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము మానవులకు జీవము ఇచ్చును. అది ఒక్క జాతికేగాక సర్వ మానవాళికి అనుగ్రహింపబడెను.

6:34 అయితే యూదులు ‘తానే ఆ నిజమైన ఆహారమై యుండెనని ప్రభువైన యేసు చెప్పుచున్నట్లు’ ఇంకను గ్రహించక ఆ ఆహారమును తమకు దయచేయుమని వారాయనను అడుగుచున్నారు. వారింకను అక్షరార్థమైన ఆహారముకొరకు అడుగు చుండిరే గాని, వారి హృదయములందు నిజమైన విశ్వాసములేక యుండిరి.

“జీవాహారము నేనే” (6:35-65) :

6:35 జీవాహారము తానే యనెడి సత్యమును ఇప్పుడు ప్రభువైన యేసు చక్కగా తేటగా వివరించెను. ఆయన జీవాహారమైయుండెను. ఆయన యొద్దకు వచ్చువారు తమ ఆత్మసంబంధమైన ఆకలి ఆయనయందు శాశ్వతముగా తృప్తిపరచబడుటను కనుగొందురు. ఆయనయందు విశ్వాసముంచువారి దాహముకూడ శాశ్వతముగా తీర్చబడుట కనుగొందురు.

“నేనే” అను పదము ప్రభువైన యేసు తాను ‘యెహోవా’తో సమానునిగా చేసికొనుటను తెలియజేయుచున్నది. పాపాత్ముడైన మనుష్యుడు ఇట్టి మాటలను పలుకుట ఎంతో అజ్ఞానమే. తన స్వంత ఆత్మీయ దాహము ఆ తీర్చుకోలేని ఒక సామాన్య మానవుడెవడును ఈ ప్రపంచముయొక్క ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలిని తీర్చజాలడు, మరియు తీర్చగలనని చెప్పజాలడు.

6:36 30వ వచనమందు అవిశ్వాసులైన యూదులు తాము చూచి నమ్మునట్లు ఒక సూచకక్రియ చేయుమని ప్రభువైన యేసును అడిగిరి. అయితే ప్రభువు వారితో – మీరు నన్ను చూచియున్నారని చెప్పెను.

అనగా ‘ఆయనే ఒక గొప్ప సూచకక్రియ, ‘ అయినను వారు ఆయనను విశ్వసించలేదు. దేవుని కుమారుడు సంపూర్ణమైన మానవునిగా వారియెదుట నున్నను; వారాయనను గుర్తించలేదు. అట్లయినచో మరి ఏ సూచకక్రియ చేసినను వారు దేవుని కుమారునిగా ఆయనను ఒప్పుకొనరని చెప్పుటలో ఎట్టి సందేహము లేదు.

6:37 యూదులలో ఉన్న అవిశ్వాసమునుబట్టి ప్రభువు నిరుత్సాహము చెందలేదు. తండ్రి ఉద్దేశ్యము ప్రణాళిక అంతయు నెరవేరవలసి యున్నదని ప్రభువు ఎరిగి యున్నాడు. తానెవరితో మాట్లాడుచుండెనో వారాయనను విశ్వసించక పోయినప్పటికి తండ్రి ఏర్పరచుకొనిన వారందరు ఆయన యొద్దకు వచ్చెదరు.

తిరుగులేని దేవుని నిత్యత్వపు ఆలోచనలయొక్క గ్రహింపు ఒక వ్యక్తికి ప్రశాంతతను పవిత్రమైన దైవభక్తిని, ధైర్యమును, పట్టుదలను కలిగించునుగాని మరేదియు ఇట్టి వాటిని ఆ వ్యక్తిలో కలిగించ జాలదని ‘పింక్’ వ్యాఖ్యానించెను.

ఈ వచనములో బైబిలునందలి రెండు ముఖ్యమైన సత్యములు యిమిడియున్నవి. గనుక ఇది చాల ప్రాముఖ్యమైనది. మొదటిగా దేవుడు కొంతమందిని క్రీస్తుకు అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించిన వారందరు రక్షింపబడుదురు.

రెండవదిగా – మానవుడు బాధ్యతాజీవి. అనగా బాధ్యత గలవాడు. ఒకడు రక్షింపబడవలెనన్నచో వాడు ప్రభువైన యేసునొద్దకు వచ్చి విశ్వాసముతో ఆయనను అంగీకరించవలెను. దేవుడు కొందమందిని రక్షించుటకు ఎన్నుకొనెను.

గాని నాశనమునకు ఎన్నుకొనలేదు. ఎవడైనను రక్షింపబడినయెడల వాడు దేవునియొక్క ఉచితమైన కృపనుబట్టి రక్షింప బడెను. అయితే ఎవడైనను నిత్యనాశనమొందినయెడల అది వాని తప్పిదము మాత్రమే.

ప్రతివారు తమయొక్క పాపమునుబట్టియు, దుష్టత్వమునుబట్టియు నశించుదురు. నరకమునకు వెళ్ళువారందరు వారు పొందవలసిన దానినే వారు పొందుచున్నారు. తన కృపనుబట్టి దేవుడు దిగివచ్చి ఈ మానవజాతినుండి ఒక్కొక్కరిని రక్షించుచున్నాడు. ఇట్లు చేయుటకు ఆయనకు హక్కుగలదా ? అవును – అట్లు చేయుటకు ఆయనకు నిశ్చయముగా హక్కుగలదు.

దేవుడు తన చిత్తానుసారముగా ఏదైనను చేయగలడు. అయితే ఆయనకు గల ఈ హక్కును ఏ మానవుడు నిరాకరించలేడు. అయితే దేవుడు ఏ తప్పిదమునుగాని, అన్యాయమునుగాని చేయడు. దేవుడు కొందరిని రక్షణకు ఎన్నుకొనెను కాని మానవుడు సువార్తను నమ్మవలెను, అది అతని బాధ్యత.

ఎవడైనను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచినయెడల వాడు రక్షింపబడునని దేవుడు సర్వజనులను ఆహ్వానించుచున్నాడు. వారి యిష్టమునకు వేరుగా దేవుడెవరిని రక్షింపడు. ఒకడు పశ్చాత్తాపముతోను, విశ్వాసముతోను తప్పక ఆయనయొద్దకు రావలసియున్నది. అప్పుడు వానిని దేవుడు రక్షించును. క్రీస్తుద్వారా తనయొద్దకు వచ్చినవానిని దేవుడు ఎంతమాత్రము త్రోసివేయడు.

మానవజ్ఞానము ఈ రెండు సత్యములను ఏకముచేసి సమాధానము కనుగొన జాలదు. మనము వాటిని గ్రహింపజాలక పోయినను వాటిని తప్పక నమ్మవలెను. ఇవి బైబిలు చెప్పుచున్న సత్యములు; ఈ వచనము వీటిని తేటగా విశదపరచెను.

6:38 37వ వచనమునందు తండ్రిద్వారా తనకు అనుగ్రహింపబడిన వారియొక్క రక్షణార్థమైన దైవ సంకల్పమంతయు కాలక్రమములో తప్పక నెరవేరునని ప్రభువైన యేసు చెప్పెను. ఇది తండ్రియొక్క చిత్తము గనుక ముఖ్యముగా తాను తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చియుండెను గనుక ప్రభువైన యేసు వ్యక్తిగతముగా ఈ కార్యమును నెరవేర్చును.

“నేను పరలోకమునుండి దిగివచ్చితిని” అని ప్రభువైన యేసు చెప్పుటలో – తనయొక్క జీవితము బేత్లహేమునందు పశువుల తొట్టిలో ప్రారంభము కాలేదని తెలియజేయుచున్నాడు. అంతేగాక తాను తండ్రి యైన దేవునితో నిత్యత్వమంతటియందు ఉన్నాడు.

అనగా ఆయన నిత్యుడు. ఆయన ఈ లోకములోనికి వచ్చుటద్వారా ఆయన తండ్రికి విధేయుడైన కుమారుడని ఋజువగుచున్నది. అయితే తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకై దాసుని స్వరూపమును ధరించెను. అనగా తన స్వంత చిత్తమును కలిగియుండలేదని భావము కాదుగాని, ఆయన చిత్తము తన తండ్రి చిత్తముతో సంపూర్ణముగా ఐక్యమైయుండెనని అర్థము.

6:39 తండ్రి చిత్తమేమనగా; క్రీస్తుకు అనుగ్రహింపబడిన ప్రతి ఒక్కరు రక్షింపబడి నీతిమంతుల పునరుత్థానము వరకు భద్రము చేయబడి, పునరుత్థానులై పరమునకు చేర్చబడుట తండ్రి చిత్తము.

"జీవాహారము నేనే” (6:35-65) :

ఈ వచనములోని “యేమియు” “దానిని” అను పదములు ఒక్క విశ్వాసిని గాక, విశ్వాసులందరిని సూచించుచున్నవి. వీరు గతించిన కాలముల నుండి రక్షింపబడిన విశ్వాసుల సమూహము (సంఘము) నకు సాదృశ్యముగా నున్నారు. ఈ విశ్వాసుల సమూహములో ఎవరును నశించకుండునట్లు అంత్యదినమున ఆ సంఘమును లేపుట ప్రభువైన యేసుయొక్క బాధ్యతయైయున్నది.

విశ్వాసుల విషయములో “అంత్యదినమనగా” ప్రభువైనయేసు వారి కొరకు (సంఘము కొరకు) ఆకాశమండలమునకు (మధ్యాకాశమునకు) వచ్చు దినము. ఆ దినమున విశ్వాసులు ఆయనతో సదాకాలముండుటకు ఆయనను ఎదుర్కొనుటకు మేఘములమీద కొనిపో బడుదురు. అయితే యూదుల విషయములో అంత్యదినమనగా మహిమతో వారికొరకు మెస్సీయ వచ్చుదనమే.

6:40 ఒక వ్యక్తి విమోచింపబడినవారి కుటుంబమునకు ఎట్లు చెందునో ఇక్కడ ప్రభువు వివరించుచున్నాడు. ఎవడైనను కుమారుని చూచి ఆయనయందు విశ్వాస ముంచి నిత్యజీవము పొందుట తండ్రి చిత్తమైయున్నది. కుమారుని చూచుటయనగా బాహ్య నేత్రములతోగాక విశ్వాస నేత్రములతో ఆయనను చూచుటయని అర్థము, ఆయన దేవుని కుమారుడనియు, లోకరక్షకుడనియు, ఆయనను చూచి గ్రహించవలెను.

మరియు ఆయనయందు తప్పక విశ్వాసముంచవలెను. విశ్వాసము వలననే ఒకడు ప్రభువైన యేసును తన స్వంత రక్షకునిగాను, ప్రభువుగాను స్వీకరించును. ఇట్లు చేయువారు ప్రస్తుత స్వాస్థ్యముగా నిత్యజీవమును మరియు అంత్యదినమందు లేపబడుదురను అభయమును పొందుదురు.

6:41 ప్రజలు ప్రభువైన యేసును అంగీకరించుటకు సిద్ధముగా లేరని వారి సణు గులు తెలియజేయుచున్నవి. తాను పరలోకమునుండి దిగివచ్చిన దేవుని ఆహారమని ఆయన తెలియజేయుచుండెను.

ఈ ఆరోపణ చాలా ప్రాముఖ్యమైనదని వారు గుర్తిం చిరి. ఏ మానవడుగాని ఎంత గొప్ప ప్రవక్తగాని పరమునుండి దిగిరాలేదు. కనుకనే వారు ఆయనను గురించి సణిగిరి. ఆయన మాటలు నమ్ముటకు ఇష్టపడరైరి.

6:42 యేసు యోసేపు కుమారుడని వారు తలంచిరి. అయితే వారి అభిప్రాయము తప్పు. ఎట్లనగా, ఆయన పరిశుద్ధాత్మవలన కన్య మరియకు జన్మించెను. యోసేపు ఆయన తండ్రి కాడు. కన్య మరియ గర్భమందు జన్మించెనని వారు నమ్ముటలో విఫలు లైరి గనుక వారు అంధకారములోనికి నెట్టివేయబడిరి.

ఇట్లే నేటి దినములలో కూడ జరుగుచున్నది. ప్రభువైన యేసు కన్య మరియ గర్భమందు జన్మించి ఈ లోకము లోనికి వచ్చెనని దేవుని కుమారునిగా అంగీకరించనివారు క్రీస్తుయొక్క వ్యక్తిత్వమును గూర్చిన సత్యమును ఆయన కార్యమును గూర్చిన సత్యమును నిరాకరింతురు.

6:43 వారాయనతో ముఖాముఖిగా మాట్లాడకపోయినను వారి సణుగులన్నియు ఆయన ఎరిగియుండెను. కనుక “మీలో మీరు సణుగుకొనకుడి” యని ఆయన చెప్పెను. వారి సణుగులెట్లు నిష్ప్రయోజనమైనవో తరువాత వచన భాగములందు వివరింపబడినది.

ఆయనిచ్చు సాక్ష్యమును వారెంతగా తృణీకరించుచున్నారో అంతగా ఆయన బోధలు యూదులు గ్రహించుట కష్టతరమయ్యెను. “వెలుగును తృణీకరించుట యనగా వెలుగును ద్వేషించుటయే.” వారు సువార్తను ఎంతగా తృణీకరించుచున్నారో అంతగా సువార్తను అంగీకరించుట వారికి కష్టమగుచుండెను.

అతిస్వల్ప విషయము లను గురించి ప్రభువైన యేసు వారితో మాటలాడినప్పుడు వారు నమ్మకున్నయెడల, కష్టతరమైన సంగతులను గురించి ఆయన బోధించునపుడు వారెట్లు గ్రహించుదురు? (వారెంతమాత్రమును గ్రహించరు గదా!).

6:44 మానవుడు పూర్తిగా నిస్సహాయుడును నిరీక్షణలేనివాడును, తనంతట తానుగా యేసునొద్దకు రాగల శక్తికూడ లేనివాడు. అట్టివాని జీవితములోను, హృదయములోను తండ్రి మొదటిగా కార్యము జరిగించనియెడల తనయొక్క ఘోరమైన పాపమును గుర్తించి, తన జీవితములో రక్షకునియొక్క అవసరతను ఎరుగలేడు.

ఈ వచనమును గ్రహించుట అనేకులకు కష్టముగా నున్నది. ఒక వ్యక్తి రక్షింపబడుట కాశించునుగాని, అది అతనికి అసాధ్యమని ఈ వచనము బోధించుచున్నట్లు అనేకులు తలంతురు, అయితే ఈ అభిప్రాయము సరికాదు.

దేవుడే మొదటిగా మన జీవితములలో : ‘కార్యమును జరిగించి, ఆయనకొరకై మనలను సంపాదించుకొనుటకు వెదకుచున్నాడని ఈ వచన భావము. ఆయనను అంగీకరించుటకుగాని తృణీకరించుటకుగాని మన ఇష్టమై యున్నది.

అయితే మొదటిగా దేవుడు మన హృదయములతో మాట్లాడనిదే మనకు రక్షణనుగూర్చిన కోరిక కలుగదు. మరల ప్రభువు అంత్యదినమందు ప్రతి నిజవిశ్వాసిని లేపుదునని వాగ్దానమిచ్చెను. మనము పై వచనములలో చూచినట్లుగా ఆయన తన పరిశుద్ధులకొరకు వచ్చునప్పుడు మృతులైన వారు మొదట లేతురు, మరియు సజీవుల మైన మనము మార్పుపొందుదుము. ఇది విశ్వాసుల పునరుత్థానము మాత్రమే.

6:45 తండ్రి ఆకర్షించనిదే ఎవడును ఆయనయొద్దకు రాడు – అని ఖండితముగా చెప్పిన తరువాత తండ్రి వారిని ఎట్లు ఆకర్షించునో ప్రభువు వివరించెను. మొదటిగా ఆయన యెషయా 54:13 లో వ్రాయబడినట్లుగా వారికి బోధించెను. “వారందరు (నా పిల్లలందరు) యెహోవాచేత ఉపదేశము నొందుదురు.” దేవుడు కొద్దిమందిని ఏర్పరచుకొనును. తన అమూల్యమైన వాక్యబోధద్వారా ఆయన వారి హృదయములతో మాటలాడును.

అయితే దీనిలో మానవుని యిష్టముయొక్క ప్రమేయముకూడ కలదు. దేవుని బోధద్వారా ప్రభావితులైన వారు తండ్రిని గురించి ఎరిగిన వారు క్రీస్తునొద్దకు వచ్చెదరు. ఇక్కడ దేవునియొక్క సార్వభౌమాధికారము మానవుని స్వచిత్తము అను రెండు గొప్ప సత్యములు కలవు. ఈ రెండు సత్యములు రక్షణయందు దైవకార్యము మానవకార్యములు కలవని చెప్పుచున్నవి.

ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నదని చెప్పినప్పుడు ప్రవక్తల గ్రంథములన్నింటిని గూర్చి చెప్పుచున్నాడు కాని ప్రభువైన యేసు ప్రత్యేకముగా యెషయా ప్రవక్తనుగూర్చి చెప్పెను. దేవుని వాక్య బోధద్వారాను దేవుని ఆత్మద్వారాను మానవులు దేవుని యొద్దకు ఆకర్షింపబడుదురు.

6:46 “దేవునిచేత బోధింపబడినవారు” అనగా వారాయనను చూచియున్నారని అర్థము కాదు. తండ్రిని చూచియున్న ఒకే ఒక వ్యక్తి ఎవరనగా, దేవునియొద్ద నుండి పంపబడిన ప్రభువైన యేసు మాత్రమే. దేవునిచేత బోధింపబడినవారందరు ప్రభువైన యేసుక్రీస్తును గురించి బోధింపబడినవారే. ఎందుకనగా దేవుని బోధయందలి గంభీర మైన అంశము “క్రీస్తే.”

6:47 దేవుని వాక్యములో రక్షణను గురించిన వివరణ ఈ వచనమునందు మనము కనుగొందుము. “తనయందు విశ్వాసముంచువారు నిత్యజీవముగలవారు” అని తేటగా ప్రభువైన యేసు చెప్పెను.

ఈ మాటలు గ్రహించుటకు కష్టముకాదు. ‘నిశ్చయముగా’ అను పదము తరుచుగా ఈ సువార్తలయందు ప్రభువు వాడెను, క్రొత్త నిబంధనలోని అనేక వచనములవలె ఈ వచనమునందు కూడ రక్షణ క్రియలవలనగాని, ధర్మశాస్త్రము నెరవేర్చుటవలనగాని, సంఘములో సభ్యత్వమువలనగాని, బంగారు సూత్రమును పాటించుటద్వారా కలుగదుగాని, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటద్వారా మాత్రమే కలుగునని స్పష్టముగా తెలుపుచున్నది.

6:48 జీవాహారము నేనే అని ప్రభువైన యేసు చెప్పెను. ‘జీవాహారము’ అనగా ఆ యాహారము భుజించువానికి అది జీవమును అనుగ్రహించునని అర్థము. 6:49 యూదులు ఇంతకు ముందే మన్నానుగూర్చి ఆయనతో ప్రస్తావించి, ఆ విధమైన ఆహారమును తాను తెప్పించవలసినదిగా ప్రభువుతో వాదించిరి.

అయితే ప్రభువు వారి పితరులు ఆ మన్నాను తినియు చనిపోయిరని వారికి గుర్తుచేసెను. మరొక విధముగా చెప్పవలెనంటే మన్నా ఈ జీవితమునకు సంబంధించిన ఆహారము. మన్నాను భుజించిన వారికి అది నిత్యజీవము అనుగ్రహింపలేకపోయెను. ‘మీ పితరులు’ అని ప్రభువు చెప్పుటలో పడిపోయిన మానవజాతినుండి తన్నుతాను ప్రత్యేకించుకొని, తనయొక్క అద్వితీయమైన దైవత్వమును దృఢపరచుచుండెను.

6:50 మన్నాకు ప్రతిగా తానే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని ప్రభువైన యేసు చెప్పెను. ఎవడైనను ఈ ఆహారమును భుజించినయెడల అతడు మరణము చూడడు. అనగా అతడు శరీరరీతిగా చనిపోడని అర్థము కాదుగాని, పరమునందు నిత్యజీవమనుగ్రహించబడునని యర్ధము. అతడు శరీరరీతిని చనిపోయినను అతని దేహము అంత్యదినమున లేపబడి నిత్యత్వములో ప్రభువుతో సదాకాలము గడువునని యర్ధము.

ఈ వచనమునందును తరువాత వచనములయందును మానవులు తన్ను భుజించవలెనని చెప్పుచు వచ్చెను. అట్లు చెప్పుటలో అర్థమేమి? అనగా మనుష్యు లాయనను అక్షరార్థముగా శరీరరీతిగా భుజించుమని చెప్పెనా? అట్లు కానేకాదు.

అట్లయిన అది వికటము కాగలదు. మనము ప్రభురాత్రి భోజనమును అనగా ప్రభువు శరీరమునకు, రక్తమునకు సాదృశ్యముగానున్న రొట్టె, ద్రాక్షారసములో పాలు పొందునపుడు అద్భుతరీతిగా అవి ప్రభువుయొక్క శరీరముగాను, రక్తముగాను మారును గనుక మనము ఆయనను భుజించవలెనని కొందరు చెప్పుదురు.

మరియు ఆత్మరక్షణ పొందుటకు ఈ రొట్టె రసములలో పాలు పొందవలెననికూడ చెప్పుదురు. అయితే ప్రభువైన యేసు అట్లు చెప్పుటలేదు. ఆయనను భుజించుటయనగా ఆయన యందు విశ్వాసముంచటయే. మనమాయనను రక్షకునిగా అంగీకరించుటయనగా విశ్వాసముద్వారా ఆయనను అనుభవించుటయే. ఆయన వ్యక్తిత్వము మరియు ఆయన కార్యముయొక్క ధన్యతలో మనము పాలుపొందుచున్నాము.

6:51. యేసు జీవాహారమైయుండెను. ఆయన తనలోతాను జీవించుచు జీవమిచ్చు చుండెను. ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడు జీవించును కాని ఇదెట్లు సాధ్యమగును? పాపాత్ములైన మానవులకు ప్రభువు ఎట్లు నిత్యజీవమనుగ్రహించును? ఈ ప్రశ్నకు సమాధానము ఈ వచనమునందు చివరి భాగములో ఇవ్వబడెను. “నే నిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే” అని చెప్పెను.

ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తాను పొందనైయున్న మరణమును సూచించెను. పాపాత్ముల విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును ఇవ్వవలసియుండెను. ఆయన శరీరము విరగగొట్టబడవలెను.

మరియు వారి పాపముల కొరకు ఆయన రక్తము పానార్పణముగా పోయబడవలసియుండెను. ఆయన పాపి స్థానములో పాపికి బదులుగా మరణించవలసి యుండెను. మన పాప విమోచన క్రయధనమును చెల్లించ వలసియు ఆయన ఇదంతయు ఎందుకు చేసెను? “లోకమునకు జీవము అనుగ్ర హించుటకే.”

యూదా జనాంగముకొరకు గాని, లేదా ఎన్నుకొనబడిన వారికొరకు మత్రమే ఆయన చనిపోలేదుగాని లోకమంతటికి ఆయన మరణము చాలినది. లోకమంతయు రక్షింపబడునని దీని అర్థముకాదు గాని, ప్రభువైన యేసు కలువరిలో ముగించిన సిలువకార్యము తనయొద్దకు వచ్చువారినందరిని రక్షించుటకు చాలినంత విలువ గలదైయున్నది.

6:52 అయినను యూదులింకను అక్షరార్థమైన భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారమును గురించి (ఇంకను) ఆలోచించుచుండిరి. వారి ఆలోచనలు ఈ లోక జీవన వ్యాపారమును మించిలేవు.

అయితే ఆత్మీయ సత్యములను గ్రహించు నట్లు వాటిని ప్రకృతి సంబంధమైన వాటితో పోల్చి చెప్పుచున్నాడని వారు గ్రహింపరైరి. కనుక వారు ఒక మానవుడు తన శరీరమును ఎట్లు తినుటకు ఇవ్వగలడని తమలో తాము తలంచుచుండిరి.

రక్షకుని మాటలకు పలువిధములైన స్పందనలు (6:66-71) : 6:66

అయితే ప్రభువైన యేసు సమస్తము ఎరిగినవాడై యుండి, వారేమి తలంచుచున్నారో, మాట్లాడుచున్నారో కూడ ఎరిగియుండి వారు తనయొక్క శరీరమునుతిని, తనయొక్క రక్తమును త్రాగనియెడల వారియందు జీవముండదని గట్టిగా హెచ్చరించెను.

అయితే ఇది ప్రభురాత్రి భోజన సమయమందు వాడబడిన రొట్టె, ద్రాక్షారసమును సూచించుటలేదు. ప్రభువు తానప్పగింపబడిన రాత్రి ఈ ఆచారమును ప్రారంభించెను. అప్పటికింకను ఆయన శరీరము నలుగగొట్టబడలేదు. మరియు ఆయన రక్తము కార్చబడి యుండలేదు. ప్రభువు శిష్యులు రొట్టెలోను, ద్రాక్షారసములోను పాలుపొందిరిగాని, అక్షరార్థముగా ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగలేదు.

క్రీస్తుప్రభువు సిలువలో మనకొరకు పొందిన ఆయన మరణముయొక్క విలువను మనము సరిగా గ్రహించనియెడల మనము ఎన్నటికీ రక్షణ పొందలేమని ప్రభువు చెప్పెను. మనము ఆయనయందు తప్పక విశ్వాసముంచ వలెను. ఆయనను స్వీకరించవలెను, ఆయనను నమ్మవలెను మరియు ఆయనను మన స్వంతము చేసికొనవలెను.

6:54 ఈ వచనమును 47వ వచనముతో పోల్చిచూడుము, ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగుటయనగా, ఆయనయందు విశ్వాసముంచుటయని అర్ధము. 47వ వచనమునందు “నాయందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడని” చదువుచున్నాము.

54వ వచనములో నా శరీరమునుతిని, నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అని వ్రాయబడినట్లు తెలిసికొనుచున్నాము. ఆయన శరీరముతిని, ఆయన రక్తమును త్రాగుటయనగా ఆయనను విశ్వసించుటయని అర్థము. ఆయనయందు విశ్వసించువారందరు అంత్యదినమున లేపబడుదురు. అనగా ప్రభువైన యేసునందు విశ్వాసముంచి మరణించినవారి దేహములని భావము.

6:55 ప్రభువైన యేసుయొక్క శరీరము నిజమైన ఆహారమైయున్నది. మరియు ఆయన రక్తము నిజమైన పానీయమునై యున్నది. ఈ ఆహారము ఈ లోకములోని ఆహారమునకు భిన్నమైనది. ఏలయనగా ఈ లోకసంబంధమైన ఆహారము తాత్కాలిక మైన విలువగలిగినది. ప్రభువైన యేసు పొందిన మరణముయొక్క విలువకు అంతము లేదు. విశ్వాసముతో ఆయనయందు పాలుపొందువారు శాశ్వత జీవమును పొందుదురు.

6:56 ఆయనకును, ఆయనయందున్న వారికి శాశ్వతమైన సన్నిహిత సంబంధము గలదు. ఆయన శరీరము తిని, ఆయన రక్తము త్రాగినవాడు ఆయనయందు నివసించును మరియు ఆయన వారియందు నివసించును.

ఇంతకంటే గొప్పదైన సన్నిహిత సంబంధము మరియొకటి లేదు. మనము అక్షరార్థమైన ఆహారమును తీసికొనినయెడల, మనలోనికి దానిని తీసికొందము, మరియు అది మనదై యుండును. మన విమోచకునిగా ప్రభువైన యేసును మనము స్వీకరించినయెడల మనలో నివసించుటకు మన జీవితములోనికి ఆయన వచ్చును మరియు మనము ఆయనలో నివసించుదుము.

6:57 ప్రభువైన యేసు తనకును, తనవారికిని మధ్య ఉన్న సన్నిహిత బంధమును గురించి మరొక ఉపమానమును వివరించెను. ఆ ఉపమానమేదనగా, తన తండ్రియైన దేవునితో తనకుగల సంబంధము, జీవముగల తండ్రి ప్రభువైన యేసును ఈ లోకము లోనికి పంపెను.

జీవముగల తండ్రియనగా, జీవమునకు మూలమైనవాడని భావము. ఈ లోకములో మానవునిగా ప్రభువైన యేసు తండ్రిద్వారా తండ్రి నిమిత్తము, తండ్రి వలన జీవించెను. తండ్రియైన దేవునితో ఆయన జీవితము సన్నిహిత సంబంధము కలిగి ఏకత్వము కలిగియుండెను.

దేవుడు ఆయన జీవమునకు కేంద్రమును మరియు సమస్తమునై యుండెను. అనగా తన తండ్రితోను, తండ్రి పనులయందు ఎల్లప్పుడు నిమగ్నమై ఉండవలెనని ఆయన ఉద్దేశ్యము. ఆయన ఒక మానవునిగా ఈ లోకములో ఉండెను కాని ఆయన శరీరధారియైన దేవుడని లోకము ఆయనను గ్రహించలేదు.

లోకమాయనను అపార్థము చేసికొనినను తండ్రియు ఆయనయు ఏకమైయుండెను. వారిరువురు అతి సన్నిహిత సంబంధము కలిగియున్నారు. అదే రీతిగా ప్రభువైన యేసు నందు విశ్వాసముంచువారందరితో ప్రభువు వారిమధ్య ఇట్టి సంబంధమునే కలిగి యుండును.

వారు ఈ లోకమునందు ఉండి, లోకమువలన అపార్థము చేయబడుచు ద్వేషించబడి హింసింపబడుదురు. అయితే వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట వలన ఆయననుబట్టియే జీవించుచున్నారు. వారి జీవము ఆయన జీవముతో బంధింప బడి భద్రము చేయబడెను. కాబట్టి వారి జీవము నిత్యము నిలిచియుండును.

6:58 ఈ వచనము, ముందు వచనములలో ప్రభువు చెప్పిన మాటలయొక్క సారాంశమని చెప్పవచ్చును, పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము ఈయనే. ఈయన మన పితరులు అరణ్యములో తినిన మన్నాకంటే శ్రేష్టుడు.

ఈ లోకపు ఆహారముయొక్క విలువ తాత్కాలికమైనది. అది ఈ జీవితకాలము మట్టుకే పరిమిత మైనది. అయితే క్రీస్తు తన్ను భుజించువారికందరికి నిత్యజీవమనుగ్రహించు దేవుని ఆహారమై యున్నాడు.

6:59 గలిలయ సముద్రమునకు అవతల ఆగ్నేయ దిశనుండి ప్రజలు కపెర్నహూము వరకు ఆయనను ఆయన శిష్యులను వెదకుచు వెంబడించిరని మనకు జ్ఞాపకమే గదా! అయితే వారు ఆయనను సమాజమందిరమందు కనుగొనిరి ఆ మందిరములోనే ప్రభువు జీవాహారమునుగూర్చి వారికి బోధించెను. (సమాజ మందిరము అనగా యూదుల మత సంబంధమైన బోధకు కూడుకొను స్థలమే గాని బలులు అర్పించు దేవాలయము కాదు.)

6:60 అప్పటికి మొదటి పండ్రెండుమంది శిష్యులు కాక మరి పెక్కుమంది శిష్యులు ఆయనకుండిరి. ఆయనను వెంబడించువారు మరియు ఆయన బోధను అంగీకరించు వారందరు ఆయనకు శిష్యులని పిలువబడిరి. ఆయన శిష్యులుగా పిలువబడినవారందరు ఆయనకు నిజమైన విశ్వాసులు కారు.

ఆయన శిష్యులమని చెప్పుకొనువారిలో కొందరు “ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని” చెప్పుకొనిరి. అనగా యీ మాట వారికి గ్రహింపులేక కాదుగాని, వారు స్వీకరించుటకు ఇంపుగా ఉండనందున వారట్లు చెప్పిరి. “ఎవరు విందురు?” అని వారు చెప్పిన మాటకు ఇట్టి విరుద్ధమైన బోధను ఎవరు వినగలరు? ఎవరు నిలువగలరు? అని వారి అభిప్రాయము.

6:61 యేసు సంపూర్ణ జ్ఞానము కలిగియుండెనని ఈ వచనములో మనము గ్రహించుచున్నాము. శిష్యులేమి చెప్పుచున్నారో ఆయనకు పూర్తిగా తెలియును. అది ఏదనగా తాను పరలోకమునుండి దిగివచ్చితిననియు, మరియు మానవులు తన శరీరమును భుజించి, తన రక్తమును త్రాగుటద్వారా నిత్యజీవము పొందుదురని తాను చెప్పిన మాటలు వారికిష్టములేనందున వారు సణుగుచున్నారనియు ప్రభువుకు తెలియును, కనుకనే “దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?” యని ప్రభువు ప్రశ్నించెను.

6:62 ప్రభువు తాను పరలోకమునుండి దిగివచ్చితినని చెప్పినందుకు వారు అభ్యంతరపడి, నేరముగా నెంచిరి. అప్పుడాయన తాను పునరుత్థానుడైన తరువాత పరమునకు ఆరోహణుడౌదునని ఎరిగియుండి తాను పరమునకు తిరిగివెళ్ళుట వారు చూచినయెడల వారేమని తలంచెదరని ఆయన అడిగెను.

మరియు ఆయన తన శరీరమును తినుడని చెప్పినందుకు వారు అభ్యంతరపడిరి. శరీరముతోనే పరలోకము నకు వెళ్ళుట వారు చూచినట్లయిన ఏమి తలంచెదరో గదా? ఆయన పరమునకు వెళ్ళిన తరువాత మనుష్యులు అక్షరార్థమైన ఆయన శరీరమును ఎట్లు తిందురు? ఆయన రక్తమును ఎట్లు పానము చేయుదురు?

6:63 ఈ మనుష్యులు అక్షరార్థమైన క్రీస్తు దేహమును గురించి తలంచుచున్నారు. ఆయన మాంసయుక్తమైన దేహమును తినుటద్వారా నిత్యజీవము పొందలేరుగాని, దేవునియొక్క పరిశుద్ధాత్ముని క్రియవలన నిత్యజీవము పొందగలరని చెప్పెను. మాంస యుక్త దేహము జీవమును అనుగ్రహించలేదు గాని ఆత్మయే జీవమునను గ్రహించును.

అయితే వారు ఆయన మాటలను అక్షరార్థముగా ఎంచిరిగాని ఆత్మీయముగా గ్రహింప లేకపోయిరి. మరియు ప్రభువైన యేసు వారితో చెప్పియున్న మాటలు ఆత్మీయ జీవమును గూర్చినవైయున్నవని వారికి విశదపరచెను. అనగా “నా శరీరమును తిని, నా రక్తమును త్రాగువాడు” అను మాటలు ఆత్మీయముగా మనము గ్రహించ వలసినవారమైయున్నాము, అనగా ఆయనయందు విశ్వాసముంచుటయే. అప్పుడు ఆయన మాటలను అంగీకరించు వారికి నిత్యజీవము కలుగును.

6:64 ఆయన ఈ సంగతులను చెప్పుచుండగా వినుచున్నవారిలో కొంతమంది ఆయన చెప్పుబోధను గ్రహించలేదు. ఏలయనగా వారాయనను విశ్వసించలేదు. ఆయనను వెంబడించితిమని చెప్పుకొనినవారిలో కొందరు ఆయనయందు విశ్వాస ముంచలేదనియు ఆయన శిష్యులలో ఒకరు ఆయనను అప్పగించుననియు తన సేవా ప్రారంభమునుండియే ఎరిగియుండెను. అయితే ఇదంతయు ఆయన నిత్యత్వ మందే ఎరిగియుండెను.

6:65 ఈ హేతువునుబట్టి తండ్రి వలననేగాని మరి ఎవని వలనను ఒకడు తన యొద్దకు రాలేడని వారికాయన గతకాలములోనే చెప్పియుండెను. వారి అవిశ్వాసమే దీనికి హేతువైయున్నది. ఈ మాటలు మానవుని అహంకారమును దెబ్బ తీయుచున్నవి.

ఏలయనగా, మానవుడు తన స్వశక్తిద్వారా రక్షణను సంపాదించగలనని తలంచు చున్నాడు. గనుకనే ఎవడైనను తనయొద్దకు వచ్చుటకు కావలసిన శక్తిని తండ్రియైన దేవునినుండి మాత్రమే పొందగలడని ప్రభువు చెప్పెను.

రక్షకుని మాటలకు పలువిధములైన స్పందనలు (6:66-71) : 6:66

ప్రభువు చెప్పిన యీ మాటలు అనేకులకు రుచించలేదు గనుక వారు ఆయనను వెంబడించుటకు ఇష్టములేక వెనుకతీసిరని యీ మాటలద్వారా మనకు గ్రాహ్యమగుచున్నది. పై వచనములలో చెప్పినట్లుగా ఈ శిష్యులు నిజమైన విశ్వాసులు కారు. వివిధములైన ఉద్దేశ్యములతో వారు ప్రభువును వెంబడించిరి. ఆయన ఎవరో ఎరిగియుండిరిగాని, ఆయనపట్ల నిజమైన ప్రేమకల్గి ఆయనను వెంబడించలేదు.

6:67 – 69 ఇట్టి తరి ప్రభువు తన శిష్యులవైపు తిరిగి “మీరుకూడ వెళ్ళిపోవలెనని యున్నారా?” అని అడిగెను. అందుకు పేతురు “ప్రభువా, మేమెట్లు నిన్ను విడువగలము? నీవు నిత్యజీవమునకు నడిపించు బోధ చేయుచున్నావు. నిన్ను విడిచినచో మేము వెంబడించతగిన వ్యక్తి ఎవరూ లేరు” నిన్ను విడిచి వెళ్ళుటయనగా “మా నాశనమునకు మేము ముద్రవేయుటయే” అని చెప్పిరి. పన్నెండుమంది శిష్యుల పక్షముగా పేతురు – “ప్రభువైన యేసు దేవుని పరిశుద్ధుడని విశ్వసించి ఎరిగియున్నా మని చెప్పెను.”

విశ్వసించుట ఎరుగుట’ అను మాటల క్రమమును గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తునందు వారు విశ్వాసముంచిరి. ఆ తరువాత ప్రభువు తన్ను గూర్చి చెప్పినదంతయు నిజమని వారు ఎరిగిరి.

రక్షకుని మాటలకు పలువిధములైన స్పందనలు (6:66-71) : 6:66

6:70 “మేము” అనగా పన్నెండుమంది శిష్యులమని పేతురు యొక్క భావము. గాని ప్రభువు పేతురు చెప్పిన తప్పును సరిదిద్దెను. మా పన్నెండుమందిమి నిజమైన విశ్వాసులమని పేతురు అంత దృఢముగా చెప్పకూడదు. ప్రభువు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొనుట వాస్తవమేగాని, వారిలో ఒకడు సాతాను. ఆ పన్నెండు మందిలో ప్రభువునుగూర్చి పేతురుకున్న దృక్పథముతో ఏకీభవించని యొకడు గలడు. యూదా ఆయనను అప్పగించునని ఆయన ఎరిగియున్నాడు.

6:71 తన్ను ప్రభువుగాను, రక్షకునిగాను యూదా ఎన్నడు అంగీకరించి యుండ లేదని ప్రభువు ఎరుగును. ఈ సందర్భములోకూడ ప్రభువుకున్న సంపూర్ణ జ్ఞానమును మనము గమనించుచున్నాము. అయితే పేతురు పన్నెండుమంది శిష్యుల తరపున మాట్లాడుటలో పొరపాటు పడినాడని తెలియుచున్నది.

Leave a Comment