శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు – Bible Verses Chapter 5 in Telugu

ఐదవ అధ్యాయము

శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు

మూడవ సూచకక్రియ – శరీర దౌర్భల్యముగల వ్యక్తిని స్వస్థపరచుట (5:1-9) :

5:1 యెరూషలేములో యూదుల పండుగ సమయమాసన్నమైనట్లు మనమీ అధ్యాయ ప్రారంభమునందు గమనించుచున్నాము. అనేకులు ఇది పస్కా పండుగ అని భావింతురు గాని, కచ్చితముగా చెప్పుట కష్టము. యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రపంచమునందు యూదుడుగా జన్మించి, యూదులకు దేవుడనుగ్రహించు ధర్మశాస్త్రము నెరవేర్చబద్దుడై యెరూషలేమునకు (ఆ పండుగకు) వెళ్ళెను.

పాత నిబంధనలో యెహోవా అని పిలువబడిన ప్రభువైన ఈ యేసే పస్కా పండుగను గూర్చిన విధిని మొదటిగా నిర్ణయించెను. ఇప్పుడు మానవునిగా తండ్రికి విధేయుడై తాను నిర్ణయించిన చట్టమునకు తానే లోబడినవాడాయెను.

5:2 యెరూషలేము పట్టణమందు బేతెస్థ అనబడిన కోనేరు కలదు. బేతెస్థ అనగా “కృపా నిలయము” లేక “కనికరముగల ఇల్లు” అని అర్ధము. కోనేరు గొర్రెల సంత ప్రక్కగా లేదా గొర్రెలద్వారము దగ్గర యున్నట్లుగా చెప్పుదురు. ఆ కోనేటిచుట్టు ఐదు మంటపములు లేక విశాలమైన ప్రదేశములు గలవు. వాటియందు అనేకులుండుటకు అవకాశము కలదు. కొందరు ఈ విధముగా చెప్పుదురు: ఈ “ఐదు మంటపములు మానవుని సంకటములను తీర్చజాలని మోషే ధర్మశాస్త్రమునకు ప్రతిగా నున్నవి.”

Read and Learn More Telugu Bible Verses

శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు –

5.3 బేతెస్థ కోనేరు ఆశ్చర్యకరమైన స్వస్థతలు జరుగు స్థలముగా పేరుగాంచినది. అయితే యీ అద్భుతములు సంవత్సరము పొడవునా జరిగెనో లేక, కొన్ని ప్రత్యేకమైన సమయములందు జరిగెనో (పండుగ సమయములందు) మనకు తెలియదు.

ఆ కోనేరుచుట్టు స్వస్థపడనాశగలవారు అనేకులు గలరు. వారెవరనగా, శరీర దౌర్భల్యము గలవారు అనగా బలహీనులు, రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు మొదలగువారు. మరియు ఊచచేతులు గలవారుకూడ అక్కడ ఉండిరి. ఈ బలహీనతలన్నియు పాప మానవునియొక్క నిస్సహాయతకు గ్రుడ్డితనమునకు, కుంటితనమునకు, పనికిమాలిన స్థితికి పటముగా నున్నవి.

పాపమువలన తమ శరీరమందు దౌర్బల్యముగల్గిన మనుష్యులనేకులు ఆ కోనేటిలో నీరు ఎప్పుడు కదిలింపబడునాయని ఎదురుచూచు చుండిరి. వారికి కల్గిన ఆ యా రోగములనుండి బాగుపడవలెనని వారాశించి ఆ సమయముకొరకై ఎదురుచూచుచుండిరి.

శరీర దౌర్భల్యము కల్గిన మనుష్యుడు – Bible Verses Chapter 5

అట్లు వారు స్వస్థతకొరకై కనిపెట్టుచుండిరి. బెల్లెట్ అనునతడు ఇట్లు వ్యాఖ్యానించెను: “దేవుని కుమారుడు వారి మధ్యనే ఉండగా నిరాశ, నిస్పృహలు కలిగించు నీటిచుట్టు వారు తడవులాడుచుండిరి.” నిశ్చయముగా ఇందులో మనకు పాఠము కలదు. ఆ స్థలము జనముతో క్రిక్కిరిసియుండినను, ప్రభువు సంచారమును వారు లక్ష్యపెట్టరైరి. ఇది మానవ మతమునకు చక్కని సాక్ష్యముకాదా! మతము ఆచారములను, అభిషేకములను మొదలగువాటిని వెదకెను గాని, దేవుని కృపను లేశమైనను వెదకలేదు.

5:4 ఈ వృత్తాంతము మనకు ఆశ్చర్యమును కలిగించుచున్నదిగదా! ఒకానొక సమయమందు దేవదూత దిగివచ్చి ఆ నీటిని కదిలించుటకద్దు. నీటిని కదిలించిన వెంటనే ఎవరైతే ఆ నీటిలో దిగుదురో వారు తమ రోగమునుండి బాగుపడుదురు. అనేకులకు స్వస్థత అక్కర కలిగియుండగా దూత నీటిని కదిలించినప్పుడు ఒకరిపై నొకరు పడుచు నెట్టుకొనుచు, నీటిలో దిగుటకు ఆత్రుతపడుచున్న ఆ గుంపులలో నీటిలో ముందు దిగినవాడు మాత్రమే స్వస్థతపొందుట ఎంత శోచనీయము !

5:5-7 అట్టివారిలో నొకడు ముప్పదిఎనిమిది ఏండ్లనుండి నిరుపయోగముగా అచ్చట పడియుండెను. రక్షకుడు జన్మించక మునుపే ఇతడు అక్కడ ఉండెను. ప్రభువైన యేసుకు అన్నిటియందు పరిపూర్ణమైన జ్ఞానము గలదు. ఆయన ఈ వ్యక్తిని ఇంతకు మునుపెన్నడును కలువలేదు. అయినప్పటికి యిట్టి నిస్సహాయస్థితిలో అతడు చాలకాలముగా పడియుండెనని ఆయన యెరిగియుండెను.

అప్పుడు ప్రభువు వానిని చూచి, ప్రేమతో నీవు స్వస్థపడగోరుచున్నావా? అని అడిగెను. అయితే ఆ వ్యక్తి స్వస్థత నాపేక్షించుచున్నాడనియు గత ముప్పది ఎనిమిది సంవత్సరములుగా అది అతని హృదయాభిలాష అనియు ఎరిగియుండినను, ప్రభువు అతని నుండి తాను నిస్సహాయుడనియు, స్వస్థత తనయొక్క తక్షణ అవసరతయనియు ఒప్పుకొనునట్లు ఆ ప్రశ్న వేసెను. రక్షణ విషయము కూడ ఇంతే.

ఒక వ్యక్తి రక్షింపబడవలయునన్నచో – తాను నశించిన పాపియనియు, యేసు రక్షించుననియు అతడు నోటితో ఒప్పుకొను తరుణముకొరకు ప్రభువు కనిపెట్టుచున్నాడు, మనంతట మనము రక్షింపబడలేము గాని ఆత్మరక్షణ పొందుటకు ఆయనయెదుట మన యిష్టమును తెలియజేయవలెను. ఆ వ్యాధిగ్రస్థునియొక్క జవాబు హృదయ విదారకమైనది.

38 సంవత్సరములుగా అతడు కోనేటి దగ్గర ఉండి ఆ నీళ్ళు కదిలింపబడినప్పుడు దానిలోనికి దిగుటకు ఎదురుచూచుచుండెను గాని అతనికి సహాయము చేయువారెవరును లేరు. తాను ప్రయత్నించు ప్రతి సమయమందును వేరొకడు తనకంటె ముందుగా నీటిలో దిగు చున్నాడు. మన పాపములనుండి మనము రక్షింపబడుటకు మనతోటివారిపై ఆధార పడుట ఎంత నిస్పృహ కలిగించునో ఈ వృత్తాంతము జ్ఞాపకము చేయుచున్నది.

5:8,9 అతని పడక ఒక తేలికపాటి పరుపుకావచ్చును. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని ప్రభువు చెప్పెను. రక్షింపబడినప్పుడు మనము లేచుట మాత్రము కాదుగాని, నడువవలసియున్నది. పాపరోగమునుండి ప్రభువైన యేసు మనలను స్వస్థపరచును, ఆ తరువాత ఆయనకు తగినట్లుగా మనము నడువవలెనని ఆయన ఆశించును. ఒకనికి ఒక పని చేయుటకు శక్తిననుగ్రహింపకనే ఆ పని చేయుమని ప్రభువు ఆజ్ఞాపింపడు.

ఆయన చెప్పినట్లు బలహీన దేహమునకు నూతన జీవమును శక్తిని ఇచ్చెను. తక్షణమే వాడు స్వస్థత నొందెను. ఇది క్రమేపి జరిగిన స్వస్థత కాదు, కొన్ని సంవత్సరముల తరబడి బలహీనముగా నున్న కాళ్ళు, చేతులు ఇప్పుడు బలముతో నింపబడెను. ప్రభువు మాటకు అతడు వెంటనే లోబడెను, అతడు తన పరుపెత్తుకొని నడచెను.

ముప్పది ఎనిమిది సంవత్సరములు అస్వస్థతగా నుండి ఇప్పుడు లేచి నడచుటలో అతడు ఎంత ఆశ్చర్యచకితుడాయెనో ! సబ్బాతు దినమందు ఈ అద్భుతము జరిగెను. సబ్బాతు దినమనగా వారములో ఏడవరోజు మనకు శనివారము. యూదులు సబ్బాతు దినమందు పనిచేయుట నిషేధము. స్వస్థతనొందిన వ్యక్తి యూదుడు. యూదుల నియమము ప్రకారము ఆ దినమున తాను ఏ పని చేయకూడనప్పటికి, ప్రభువైన యేసుయొక్క ఆజ్ఞ ప్రకారము అతడేమియు అభ్యంతరము చెప్పక తన పరుపెత్తుకొని నడచెను.

యూదుల వ్యతిరేకత (5:10-18) :

5:10 అతడు పరుపెత్తుకొని నడువగా చూచిన యూదులు అతని ఆక్షేపించిరి. ఎందుకనగా, యూదులు మతనియమముల విషయమై పట్టుదల గలవారు. ధర్మ శాస్త్రమునందు అక్షరార్థముగా నిష్టగలవారు మాత్రమేగాక శ్రద్ధకలిగి బహు నిక్కచ్చిగా దానిని నేరవేర్చుదురుగాని దయ కనికరములను ఇతరులపట్ల ఎంతమాత్రము
కనుపరచువారుకారు.

5:11 స్వస్థత నొందినవాడు బహుతేటగా సమాధానమిచ్చెను. అదేదనగా, తన్ను స్వస్థపరచినవాడు తనను పరుపెత్తుకొని నడువుమని ఆజ్ఞాపించగా తానట్లు చేసితినని చెప్పెను. ముప్పది ఎనిమిది సంవత్సరములుగా రోగియైయున్న వ్యక్తిని స్వస్థపరచ శక్తిగలవానికి విశ్రాంతి దినమందు పరుపెత్తుకొని నడువుమని ఆజ్ఞాపించగా దానికతడు విధేయుడు కావలెనుగదా? స్వస్థపరచబడిన వానికి ప్రభువైన యేసు ఎవరో, ఆ సమయమునకు తెలియదు. అతడు ఆయనను గురించి సహజ రీతిగా మాటలాడినను, కృతజ్ఞతా భావముతోనే మాటలాడెను.

5:12 అతనిని విశ్రాంతి దినమును అతిక్రమింప ఆజ్ఞాపించిన నేరస్థుడు ఎవరోయని తెలసికొనగొరి, ఆ నేరస్థుని చూపించుమని వారడిగిరి. ఎందుకనగా విశ్రాంతి దినమును అతిక్రమించువానిని రాళ్ళతో కొట్టుమని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించు చున్నది.

5:13 అతని స్వస్థత విషయమై యూదులకేమి పట్టలేదు. స్వస్థతనొందిన వానికి తన్నెవరు స్వస్థపరచెనో తెలియదు. మరియు స్వస్థపరచిన వానిని గుర్తించుట అతనికి అసాధ్యము, ఎందుకనగా ఆ గుంపులోనుండి ప్రభువు తప్పించుకొని వెళ్ళెను.

ప్రభువైన యేసుయొక్క బహిరంగ పరిచర్యలో ఇదొక మలుపు. ఈ అద్భుతమును ప్రభువు విశ్రాంతి దినమున చేసినందున యూదులకు ద్వేషము, పగ, కోపమును ఆయన రేకెత్తించెను. కనుక వారాయనను తరుముచు ఆయనను చంపజూచిరి.

5:14 కొంతకాలము తరువాత స్వస్థతనొందిన వ్యక్తి మందిరమందు చేరి తన జీవితములో జరిగిన అద్భుతకార్యమును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చుండగా ప్రభువైనయేసు అతని కనుగొనెను. అతడు కనికరింపబడెను గనుక ప్రభు వతనిని పిలిచి అతనిపై నొక బాధ్యతను మోపెను. ఆధిక్యతలు ఎల్లప్పుడు బాధ్యతను చూపించును. “నీవు స్వస్థపరచబడితివి గనుక నీకు మరెక్కువ కీడు సంభవించ కుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పెను”. అతని జీవిత పాప ఫలితముగా వానికి ఈ వ్యాధి సంభవించెను. అన్ని వ్యాధుల విషయములో ఇది వాస్తవము కాదు.యూదుల వ్యతిరేకత (5:10-18) :

ఒక వ్యక్తి జీవితములో అతని పాపములకును, రోగములకును అనేక మారులు ఎట్టి ప్రత్యక్ష సంబంధముండదు. ఉదాహరణకు: పసిపిల్లలు తాము ఇచ్ఛాపూర్వకముగా పాపముచేయు వయస్సు రాకమునుపే అస్వస్థతకు గురియగుచుందురు. “ఇకను పాపము చేయకుము అని ప్రభువు చెప్పుటలో ఆ మాటలు దేవుని పరిశుద్ధతయొక్క ప్రమాణమును సూచించుచున్నది. “సాధ్యమైనంత తక్కువగా పాపము చేయుము” అని చెప్పినచో ఆయన దేవుడుకాడు.

అది ఎంతటి చిన్న పాపమైనను దేవుడు క్షమించడు. కనుకనే ఆయన “నీకు మరి ఎక్కువ కీడు సంభవించకుండునట్లు ఇకను పాపము చేయకుము” అని గట్టిగా హెచ్చరించెను. ‘ఎక్కువ కీడు’ అనగానేమో మనకు చెప్పబడలేదు. శారీరక రోగముకంటె పాప ఫలితములు బహు భయంకరమైనవిగా ఆ వ్యక్తి గ్రహించవలెనని ప్రభువు ఉద్దేశించెనని మనము తలంచుటకు ఎట్టి అనుమానము లేదు. తన పాపములయందు చనిపోవువాడు నిత్యోగ్రతకు, వేదనలకు పాత్రుడు.

ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా చేయు పాపముకంటె కృపకు వ్యతిరేకముగా చేయు పాపము బహు భయంకరమైనది. ఈ వ్యక్తికి ప్రభువు ఆశ్చర్యకరమైన ప్రేమను కృపను కనుపరచెను. తన వ్యాధికి కారణమైన ఆ పాప జీవితములో కొనసాగుట బాధ్యతా రాహిత్యమును సూచించుచున్నది.

5:15 సమరయ స్త్రీవలె ఇతడుకూడ ప్రభువుకొరకు ప్రత్యక్ష సాక్షిగా జీవించ నాశించెను. కనుకనే అతడు తన్ను స్వస్థపరచినవాడు “యేసు” అని యూదులతో చెప్పెను. యూదులకు ఆయనపట్ల కృతజ్ఞత లేకున్నను అతడు యేసుకు కృతజ్ఞత చెల్లి. అయితే ప్రభువును కనుగొని ఆయనను శిక్షించుటయే యూదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యమైయున్నది.

5:16 మానవుని హృదయమెంత కౄరమైనదో ఇక్కడ వెల్లడియగు చున్నది. రక్షకుడు వచ్చి ఒక గొప్ప స్వస్థత కార్యము చేసియుండగా యూదులు కోపోద్రేకులైరి. ఆ స్వస్థత కార్యము విశ్రాంతి దినమున జరిగెనని వారు కోపగించుకొనిరి యూదులు మతవిషయములందు నిర్దయులు గనుకనే సాటి మానవునియొక్క క్షేమము, ఆశీర్వా దములకంటె మతాచారములందే ఎక్కువ ఆసక్తిగలవారైయున్నారు.

అయితే సబ్బాతు దినమును నియమించినవాడే ఆ దినమున కృపాకార్యమును చేసియున్నాడని వారు గుర్తించలేదు. ఏ విధముగాను యేసు సబ్బాతును అతిక్రమించలేదు. ధర్మశాస్త్రము, విశ్రాంతి దినమున శరీరసంబంధమైన పనులను నిషేధించెను. అత్యవసరమైన, కనికరయుతమైన కార్యములను చేయ నిషేధించలేదు.

5:17 ఆరు దినములలో సృష్టికార్యమును సంపూర్తిజేసి ఏడవదినమున దేవుడు విశ్రమించెను. ఆ యేడవ దినమే సబ్బాతుదినము అనగా విశ్రాంతిదినము. పాపము లోకములో ప్రవేశించినప్పుడు దేవుని విశ్రాంతికి భంగము కలిగెను. కనుక ఇప్పుడు ఆయన విశ్రమించక స్త్రీ, పురుషులను తన సహవాసములోనికి మరల తెచ్చుటకు నిర్విరామముగా పనిచేయుచున్నాడు.

విమోచనా మార్గమేర్పాటుచేసెను. ప్రతి తరమునకు ఆయన సువార్త బయలువెళ్ళుచున్నది. ఆదాము పాపములో పడిపోయినది మొదలు ప్రస్తుత కాలమువరకు దేవుడు (ఆయన) విశ్రమించక పనిచేయుచుండెను. ఆయన ఇంకను పనిచేయుచుండెను. ప్రభువైన యేసు విషయమందు కూడ ఇది వాస్తవము. ఆయన తన తండ్రియొక్క పనిమీద యుండెను. ఆయన ప్రేమ ఆయన కృపలు ఆరుదినములకే పరిమితమైయుండలేదు.

5:18 ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. యూదులు ఇంతకుముందుకంటె ఇప్పుడు మరెక్కువగా ప్రభువైనయేసును చంప నిశ్చయించుకొనిరి. ఆయన సబ్బాతు దినాచారమును మీరుటయేగాక దేవునితో సమానునిగా ఎంచుకొనెను, కనుక ఆయన నిశ్చయముగా సబ్బాతును అతిక్రమించి యున్నాడని వారికి స్పష్టమాయెను.

యేసు “దేవుడు తనయొక్క తండ్రి” యని చెప్పినప్పుడు వారాయనను దేవునితో సమానునిగా ఎంచుకొనియున్నాడని తలంచిరి. ఇది వారి దృష్టిలో ఘోరమైన దేవ దూషణయైనది. వాస్తవముగా ఇది సత్యమే! రానున్న వచనములలో తానెట్లు దేవునితో సమానమైనవాడో తేటగా వివరించెను. జె.యస్. బాక్సర్ ఇట్లు చెప్పెను. తాను దేవునితో సమానుడని ఏడు విధములుగా ప్రభువు వివరించెను.

  •  పనిలో సమానుడు: “తండ్రి వేటిని చేయునో కుమారుడును ఆలాగే చేయును” (19వ).
  •  ఎరుగుటలో సమానుడు : “తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయువాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడు”(20వ).
  •  మృతులను లేపుటలో సమానుడు: “తండ్రి మృతులను ఏలాగులేపి బ్రదికించునో….. కుమారుడును తన కిష్టము వచ్చిన వారిని బ్రదికించును (21,28,29వ).
  •  తీర్పు తీర్చుటలో సమానుడు: తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడుగాని, తీర్పు తీర్చు అధికారము కుమారునికి అప్పగించెను (22,27వ).
  •  ఘనతలో సమానుడు : “మనుష్యులందరు తండ్రిని ఘనపరచినట్లు కుమారుని ఘనపరచవలెనని … (23వ).
  •  క్రొత్తజన్మ (పునర్జన్మ) నిచ్చుటలో సమానుడు : “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు” (24,25వ)
  •  స్వయం భవత్వములో సమానుడు : తండ్రి ఏలాగు తనంతటతానే జీవము కలిగియున్నాడో అలాగే కుమారుడును తనంతటతాను జీవముగలవాడైయున్నాడు” (26వ).

యేసు – తాను దేవునితో సమానుడనని నిరూపించుకొనుట (5:19-29) :

5:19 ప్రభువు తాను తండ్రియైన దేవునితో ఏకమైయున్నాననియు, తనంతట తాను ఏదియు చేయననియు తెలియజేయుచున్నాడు. అనగా తనంతట తానేదియు చేయుటకు శక్తిలేనివాడనికాదు. దేవునితో ఏకమైయుండి, తండ్రి ఏది చేయుట చూచునో దానినే చేయును. ప్రభువు తండ్రితో సమానత్వమును ఆరోపించుకొనినను తండ్రికి వేరుగా తాను స్వతంత్రుడనని చెప్పుకొనలేదు. ఆయన తండ్రితో సంపూర్ణముగా సమానత్వము కలిగియున్నను, తండ్రికి వేరుగా ఆయన యుండలేదు.

యూదులు తన్ను దేవునితో సమానునిగా గుర్తించవలెనని ప్రభువైన యేసు ఆశించెను. దేవుడు చేయు పనులను తాను చేయగలనని ఒక మానవుడు చెప్పుకొనుట అవివేకమే. తండ్రిచేయుచున్న దానిని తాను చూచుచున్నట్లు యేసు చెప్పెను. తానట్లు చెప్పినప్పుడు తాను తండ్రితో నిరంతరము సన్నిహిత సంబంధము కలిగియుండి పరలోకములో జరుగుచున్న వాటి విషయమై పరిపూర్ణజ్ఞానము కలిగియుండవలెను గదా! మరియు తండ్రి యేమి చేయుట తాను చూచెనో దానినే తాను చేయుచున్నానని ప్రభువు చెప్పెను. ఇది ఆయన దేవునితో సమానుడని నిశ్చయముగా తెలియజేయు చున్నది. ఆయన సర్వశక్తిమంతుడు.

ఆ కుమారునికి తాను చేయునదంతయు చూపించుట తండ్రికి తన కుమారుని పట్లగల ప్రత్యేకమైన ప్రేమకు చిహ్నముగా నున్నది. యేసు ఆ సంగతులను చూచుటయే గాక, అట్టి కార్యములను చేయుటకును శక్తిగలవాడై యుండెను. మరియు దేవుడు తనకు ఇంతకంటే మరి గొప్ప కార్యములు చూపించునని జనులు ఆశ్చర్యపడునట్లు ప్రభువు తెలియజేసెను. ప్రభువైన యేసు చేసిన అద్భుతకార్యములను ప్రజలు అప్పటికే చూచిరి.

ముప్పది ఎనిమిది ఏండ్లనుండి వ్యాధిగ్రస్తునిగా పడియున్నవానిని ప్రభువు స్వస్థపరచగా వారు చూచిరి. అయితే వారు దీనికంటే మరిగొప్ప ఆశ్చర్య కార్యములను చూడగలరు. అట్టి అద్భుతములలో మొదటిది ఏదనగా, మృతులను బ్రతికించుట (21 వ॥). రెండవదిగా మానవజాతికి తీర్పు తీర్చుట (22 వ॥).

5:21 యేసు తాను దేవునితో సమానునిగా చేసుకొనెనని, యూదులు ఆయనపై నేరము మోపిరి. వారి నేరారోపణను ఆయన ఖండించలేదుగాని, తానును, తండ్రియు ఏకమైయున్నామని వారికి గొప్ప ఋజువులను చూపించెను. ఎట్లనగా తండ్రి మృతులను ఏలాగు లేపి జీవమనుగ్రహించెనో ఆలాగుననే కుమారుడుకూడ తనకిష్టమైన వారికి జీవమనుగ్రహించును. ఆయన సామాన్య మానవుడైనచో ఆయనను గురించి ఇట్లు చెప్పబడునా? దానికి ఈ ప్రశ్నలోనే జవాబు కలదు.

5:22 క్రొత్త నిబంధన ప్రకారము తండ్రియైన దేవుడు తీర్పుతీర్చు పనిని తన కుమారునికి అప్పగించెను. ప్రభువైన యేసు తండ్రి తనకు అప్పగించిన పనిని చేయుటకు పరిపూర్ణ జ్ఞానమును, సంపూర్ణమైన నీతియు కలిగియుండవలెనుగదా ! ఆయన మానవులయొక్క హృదయాలోచనలను, ఉద్దేశ్యములను ఎరిగినవాడైయుండ వలెను. ఈ లోకమునకు న్యాయాధిపతియైనవాడు యూదులయెదుట నిలుచుండి, తన అధికారమును నిరూపించుచుండగా వారాయనను ఎరుగరైరి.

5:23 ఈ వచనమందు దేవుడు తన కుమారునికి మృతులను లేపు అధికారమును, లోకమునకు తీర్పు తీర్చు అధికారమును ఎందుకు అనుగ్రహించెనో తెలుపబడినది. మనుష్యులందరు తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచవలసియున్నది. ప్రభువు చెప్పిన యీ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రభువు యొక్క దైవత్వమునకు బైబిలు గ్రంథములో అనేక స్పష్టమైన ఋజువులు కలవు. వాటిలో ఇదియొకటి.

యేసు - తాను దేవునితో సమానుడనని నిరూపించుకొనుట (5:19-29) :

దేవుడొక్కడు మాత్రమే పూజార్హుడని బైబిలు మనకు బోధించుచున్నది. నిజదేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదని పది ఆజ్ఞలయందు కలదు. అయితే యిప్పుడు తండ్రిని ఘనపరచువారందరు కుమారుని ఘనపరచవలెనని మనకు చెప్పబడియున్నది. కనుక ఈ వచనములో చెప్పబడిన, సత్యమేమనగా యేసుక్రీస్తు దేవుడైయున్నాడు.

ప్రజలనేకులు దేవుని ఆరాధించుచున్నారని చెప్పుదురుగాని, యేసుక్రీస్తును దేవునిగా ఒప్పుకొనరు. వారు ఆయన మంచివాడనియు లేక దేవునివంటివాడనియు భూమిమీద జీవించినవారిలో అటువంటివాడెవడు లేడనియు చెప్పుదురు. అయితే యీ వచనము ఆయనను దేవునితో సరిసమానునిగా తెలియజేయు చున్నది. మరియు తండ్రియైన దేవునికిచ్చు ఘనతను కుమారుడైన దేవునికికూడ ఇవ్వవలెనని తెలియ జేయుచున్నది.

కుమారుని ఘనపరచనివాడు తండ్రిని ఘనపరచ లేడు. ప్రభువైన యేసును ప్రేమింపక నేను దేవుని ప్రేమించుచున్నానని ఒకడు చెప్పు కొనుట వ్యర్ధము. నీవు యేసుక్రీస్తు ఎవరో ఇంతవరకు ఎరుగనియెడల నీవీ వచనమును జాగ్రత్తగా చదివి ఇది దేవుని వాక్యమని ఎరిగి, ‘యేసుక్రీస్తు శరీరధారియైన దేవుడు’ అను ఈ మహిమాన్వితమైన సత్యమును అంగీకరించుము.
5:24 పై వచనములలో ప్రభువైన యేసు జీవమిచ్చువాడనియు, తీర్పు తీర్చు పని ఆయనకు అప్పగింపబడెననియు చదివియున్నాము. ఇప్పుడు ఆయనద్వారా ఒకడు. ఆత్మీయ జీవమును ఎట్లు పొందగలడో, రాబోవు తీర్పును ఎట్లు తప్పించుకొనగలడో ఈ వచనముద్వారా తెలిసికొనుచున్నాము.

ఈ వచనము బైబిలులోగల ప్రియమైన సువార్త వచనములలో ఒకటి. ఇందలి వర్తమానముద్వారా అనేకులు నిత్యజీవమునకు వారసులైరి. ప్రభువైన యేసు ఈ వచనములో “నిశ్చయముగా చెప్పుచున్నాను” అను మాటలను ఉపయోగించెను. తాను చెప్పబోవునది ఎంత ప్రాముఖ్యమైన విషయమో తెలియజేయుటకే ప్రభువు ఈ మాటను ఉపయోగించెను. ఈ వచనములో దేవుని కుమారుడు మనతో వ్యక్తిగతముగాను, సన్నిహితముగాను మాటలాడుచున్నాడు.

“నా మాట విని” – అను మాటకు – యేసు మాట విని అంగీకరించి, విశ్వసించి, విధేయులగుట యని అర్థము. సువార్త ప్రకటింపబడుచుండగా అనేకులు విందురుగాని ఆ సువార్తను నమ్మరు. అయితే యేసుప్రభువు తాను చేయు బోధ దైవసంబంధమైన దనియు ఆయన నిజముగా లోకరక్షకుడనియు నమ్మి ప్రతి ఒక్కడు తన్ను తప్పక అంగీకరించవలెనని చెప్పుచున్నాడు. “నన్ను పంపినవానియందు విశ్వాసముంచుము” అని ప్రభువు చెప్పుచుండెను.

అనగా దేవునియందు విశ్వాసముంచుమని ఆయన చెప్పుచున్నాడు. అయితే ఒకడు దేవునియందు విశ్వాసముంచినంతమాత్రముచేత వాడు రక్షింపబడునని దీని భావము కాదు. అనేకులు మేము దేవునియందు విశ్వాసముంచియున్నవారమేగదా అని అందురు.

అయితే వారు హృదయ పరివర్తనము చెందినవారు కారు. యిక్కడ చెప్పబడిన భావ మేమనగా, ప్రభువైన యేసుక్రీస్తును యీ లోకమునకు పంపిన దేవునియందు తప్పక విశ్వాసముంచుమని అర్థము. మరియు ప్రభువైన యేసును తనకు రక్షకునిగా దేవుడు పంపెనని ఒకడు తప్పక విశ్వసించవలెను. దేవుడే ప్రభువైన యేసునుగూర్చి చెప్పిన దంతయు మానవుడు నమ్మవలెను.

అనగా, ఆయన కలువరి సిలువ కార్యముద్వారా మాత్రమే పాపములు తీసివేయబడుననియు, ఆయన మాత్రమే రక్షకుడనియు తప్పక నమ్మవలెను. “నిత్య జీవము (everlasting life) గలవాడు” అనగా అతడు ఎప్పుడో నిత్య జీవము పొందునని కాదుగాని దానిని ఇప్పుడే ఉన్నపాటున కలిగియున్నాడని అర్ధము. ప్రభువైన యేసుక్రీస్తుయొక్క జీవమే నిత్యజీవము. ఇది నిత్యము కొనసాగు జీవమేగాక శ్రేష్ఠమైనది మరియు విలక్షణమైనది. అది ఆయనయందు విశ్వాసముంచువారికి రక్షకుడనుగ్రహించు జీవమైయున్నది. ఒకడు శరీరరీతిగా జన్మించినపుడు ఎట్లు ప్రకృతి సిద్ధమైన జీవమును పొందునో అట్లే ఒకడు తిరిగి జన్మించినప్పుడు ఆత్మీయ జీవమును పొందును.

“మరియు అట్టివాడు తీర్పులోనికి” రాడు అనగా విశ్వాసి, ఇప్పుడుగాని ఎన్నటికి గాని శిక్షింపబడడు. విశ్వాసి శిక్షనుండి విడుదల పొందియున్నాడు. ఎందుకనగా వాని పాప పరిహార క్రయధనమును కలువరి సిలువలో క్రీస్తు ప్రభువు చెల్లించెను, అయితే ఈ క్రయధనమును రెండు మారులు చెల్లించుమని దేవుడు కోరడు మనకు బదులు క్రీస్తే దానిని చెల్లించెను. ఇది చాలినది. ఆయన రక్షణ కార్యమును సమాప్తిచేసి యున్నాడు.

యేసు దేవుని కుమారుడనుటకు ఇవ్వబడిన నాలుగు సాక్ష్యములు (5:30-47) :

సమాప్తము చేయబడిన ఆ కార్యమునకు మరేదియు కలుపలేము. విశ్వాసి తన పాపములనుబట్టి ఇక ఎన్నటికి శిక్షింపబడడు. “అట్టివాడు మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడు”. క్రీస్తు నంగీక రించినవాడు ఆత్మీయ మరణస్థితినుండి ఆత్మీయ జీవములోనికి దాటియున్నాడు.

అతడు మారుమనస్సు పొందకమునుపు పాపములచేత అపరాధములచేత చచ్చినవాడై యుండెను. మరియు నతడు దేవుని ప్రేమ విషయములో, ప్రభువు సహవాస విషయములో సజీవుడు. ప్రభువైన క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు, అట్టి వానియందు దేవుని ఆత్మవసించును, మరియు అతడు దైవసంబంధమైన జీవమును కలిగియుండును.

5:25 ‘నిశ్చయముగా’ అనుపదమును ప్రభువైన యేసు ఈ అధ్యాయములో నుపయో గించుట యిది మూడవసారి. మరియు ఈ సువార్తలో ఇప్పటివరకు యీ మాట ఏడుసార్లు చూచుచున్నాము. మృతులు దేవునికుమారుని శబ్దము విను గడియ వచ్చు చున్నది. ఇప్పుడే వచ్చియున్నది. అని ప్రభువు చెప్పిన ఆ గడియ మానవ చరిత్రలోకి ఆయన అడుగిడిన సమయమును సూచించుచున్నది.

“ఈ వచనములో చెప్పబడిన మృతులెవరు? ఎవరు దేవుని కుమారుని స్వరము విని బ్రదుకుదురు? ఆయన బహిరంగ పరిచర్య కాలమందు ప్రభువు లేపిన వారై యుండవచ్చును. అయితే ఈ వచనము ఇంతకంటే గంభీరమైన భావమును మనకు తెలియజేయుచున్నది. మరణించిన వారెవరనగా తమయొక్క పాపముల చేతను, అపరాధములచేతను చచ్చినవారే. వారు దేవుని కుమారుని స్వరము వినిరి. సువార్త సందేశము నంగీకరించిరి సువార్త ప్రకటింపబడగా ప్రభువును రక్షకునిగా స్వీకరించి నప్పుడు వారు మరణములోనుండి జీవములోనికి దాటియున్నారు.

5:26 ఒక వ్యక్తి ప్రభువైన యేసు నుండి జీవము ఎట్లు పొందునో ఈ వచనము వివరించుచున్నది. తండ్రి ఎట్లు జీవమునకు మూలాధారమైయుండి ఆ జీవమును అనుగ్రహించువాడై యున్నాడో అట్లే తన కుమారుడుకూడ తనంతటతాను జీవము గలవాడైయుండి ఇతరులకు ఆ జీవమును ఇవ్వగల అధికారమును ఆయనకు అనుగ్ర హించెను. ఇవి క్రీస్తుయొక్క దైవత్వమును తండ్రితో ఆయనకు గల సమానత్వమును తెలియజేయు మాటలు. ఏ మానవుడు తనంతటతానే జీవముగలవాడని ఎవరిని గూర్చియు చెప్పలేము.

మనలో ప్రతి ఒక్కరికి జీవము ఇవ్వబడెను గాని. దేవునికిని ప్రభువైన యేసుకును ఎన్నడును ఎవరిద్వారాను ఇవ్వబడియుండలేదు. నిత్యత్వ మంతటినుండి వారిలో జీవము వసించుచుండెను. ఆ జీవమునకు ప్రారంభము లేదు. వారికి వేరుగా ఆ జీవమునకు ఆధారమేలేదు.

5:27,28 ఇదిగాక దేవుడు లోకమునకు తీర్పు తీర్చు అధికారమును క్రీస్తుకు అనుగ్రహించెను. ఆయన మనుష్యకుమారుడు గనుక ఈ తీర్పు తీర్చు అధికారము అనుగ్రహింపబడెను. ప్రభువు దేవుని కుమారుడుగాను, మనుష్యకుమారుడుగాను పిలువబడెను. దేవుని కుమారుడనుమాట ఆయన పరిశుద్ధ దైవ త్రిత్వములో ఒకడని తెలియజేయుచున్నది. దేవుని కుమారునిగా తండ్రితోను పరిశుద్ధాత్మతోను సమానత్వము కల్గియుండి ఇతరులకు ఆయన జీవము అనుగ్రహించును. ఆయన మనుష్యకుమారుడు కూడ, ఈ లోకమునకు ఆయన మనుష్యుడుగావచ్చి మనుష్యుల మధ్య నివసించెను. కలువరి సిలువలో మానవులైన స్త్రీ పురుషులకు బదులుగా ఆయన మరణించెను.

ఆయన మానవుడుగా ఈ లోకమునకు వచ్చినపుడు తృణీకరింపబడి సిలువ వేయ బడెను. ఆయన మరలా వచ్చినప్పుడు తన శత్రువులకు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వచ్చును. ఒకప్పుడు ఈ లోకములో హీనపరచబడిన ఆయనే మరలా వచ్చినప్పుడు ఈ లోకములోనే ఘనపరచబడును. ఆయన దేవుడును, మానవుడును గనుక తీర్పు తీర్చుటకు ఆయనే అధికారముగల న్యాయాధిపతి.

క్రీస్తు తన్ను తాను దేవునితో సమానుడనని దృఢముగా చెప్పుచుండగా ఆ మాటలు వినుచున్న యూదులు ఆశ్చర్య పడుచున్నారనుటలో ఎట్టి అనుమానము లేదు. ఆయన వారి హృదయాలోచనను ఎరిగియుండి మీరు ఇందుకు ఆశ్చర్యపడనవసరములేదని వారితో చెప్పెను. మరియు ఆయన వీరికి మరింత ఆశ్చర్యకరమైన సత్యములను బయలుపరచుచుండెను. రానున్న కాలములో సమాధులలో నున్నవారు ఆయన స్వరము విందురని చెప్పెను. దేవుడు కాని వాడెవడైనను తన స్వరము సమాధులలోనివారు విందురని ప్రవచించుట అవివేకము. దేవుడు మాత్రమే ఇట్లు చెప్పగలడు ఆయన క్రీస్తే.

5:29 మరణించిన వారందరు ఒక దినమున తిరిగి లేచెదరు. కొందరు జీవము పొందుటకును, మరికొందరు తీర్పు పొందుటకును లేచెదరు. మానవులలో ప్రతి ఒక్కరు వర్తమాన భూత భవిష్యత్కాలములో జీవించు మానవులెవరైనను ఈ రెండు గుంపులలో ఏదో ఒకదానికి చెందియుండవలసినదే.

సత్త్రియలు చేసినవారు తాము చేసిన సత్రియలనుబట్టి రక్షింపబడుదురనియు దుష్క్రియలు చేసినవారు తమ దుష్ట జీవితములనుబట్టి శిక్షింపబడుదురనియు ఈ వచనము బోధించుటలేదు. ఒకడు సత్రియలు చేయుటవలన రక్షింపబడడుగాని, అతడు రక్షింపబడుట వలన సత్రియలు చేయును. సత్రియలు రక్షణకు మూలము కాదుగాని అవి రక్షణ ఫలమైయున్నవి. అవి రక్షణకు హేతువుకావు గాని అవి రక్షణకు నిదర్శనములై యున్నవి. “కీడుచేయు వారందరు” అనగా ప్రభువైన యేసునందు విశ్వాసముంచనివారని అర్ధము, మరియు వారు దేవుని యెదుట నిలువబడుటకును, నిత్య నాశనమను శిక్ష పొందుటకును లేపబడుదురు.

యేసు దేవుని కుమారుడనుటకు ఇవ్వబడిన నాలుగు సాక్ష్యములు (5:30-47) :

5:30 ప్రభువు తనంతట తానుగా ఏమియు చేయలేనంతటి ఐక్యత తండ్రియైన దేవునితో కలిగియున్నట్లు ఈ వచనము చెప్పుచున్నది. తన స్వంత అధికారముతో ఆయన ఏమియు చేయలేదు, స్వచిత్తము రక్షకునియందు కానరాదు, ఆయన తండ్రికి పూర్తిగా విధేయుడైయుండి ఆయనతో సంపూర్ణ సహవాసము మరియు ఐక్యత కలిగియుండెను.

యేసుక్రీస్తు దేవుడు కాడని ఋజువు చేయుటకు దుర్బోధకులు ఈ వచనమును ఆధారము చేసికొనుచున్నారు. ఆయన తనంతట తానేమియు చేయలేడు గనుక ఆయన మానవుడని వారందురు. అయితే యీ వచనము వీరి బోధకు పూర్తిగా భిన్నమైనదానిని తెలియజేయుచున్నది. మానవులు తమకిష్టమైన కార్యమును చేయగలరు. వారు చేయు కార్యములు దైవచిత్తమునకు అనుకూలము కావచ్చును, కాక పోవచ్చును.

తానెవరో ఆయన ఎరుగును గనుక ప్రభువైన యేసు అట్లు చేయ జాలడు, ప్రభువు తనంతట తానేమియు చేయలేడనగా, శరీరరీతిగా చేయగలడు గాని, నైతికముగా చేయలేడు, సమస్త కార్యములను నిర్వర్తించుటకాయనకు భౌతికమైన శక్తి కలదు కాని అక్రమము ఎన్నడు చేయజాలడు. తండ్రియైన దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా చేసిన ఏ కార్యమైనను ప్రభువు దృష్టిలో అక్రమమే. “నా అంతట నేనే ఏమియు చేయలేను” అని ప్రభువు చెప్పిన మాటలు సమస్త మానవాళి నుండి ఆయనను ప్రత్యేకపరచుచున్నవి.

ప్రభువైన యేసు తండ్రి చెప్పునది విని, నిత్యము ఆయనయొద్దనుండి ఉపదేశము పొంది తండ్రివలె ఆలోచించెను, బోధించెను, ప్రవర్తించెను. ఈ వచనములో ‘తీర్పు’ అను పదము న్యాయసంబంధమైన తీర్పును సూచించుట లేదుగాని, తాను ఏమిచేయ వలెనో, ఏమి మాట్లాడవలెనోయను దానిని నిర్ణయించుచున్నది.

ఎందుకనగా స్వార్థపర మైన ఉద్దేశ్యములు రక్షకునికి లేవు గనుక సమస్త విషయములను నిష్పక్షపాతముగాను, న్యాయముగాను నిర్ణయించగలడు. ఆయన ఏకైక అపేక్ష యేమనగా, తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయనను సంతోషపరచుటయే.

ఇందుకు భిన్నమైనదేదియు ఆయనలో లేదు. తన సొంత ప్రయోజనముకొరకు ఆయన తీర్పులు తీర్చడు. మన ఉద్దేశ్యములు, మన బోధలైతే మన క్రియలకు మన విశ్వాసమునకు అనుగుణ్యముగా నుండును, అయితే దేవుని కుమారుని విషయము అట్లుకాదు. ఆయన తలంపులు ఆయన తీర్మానములు పక్షపాతముతోగాని స్వయిష్టముతోగాని కూడినట్టివికావు. ఆయన నిష్పక్షపాతి.

5:31 ఈ అధ్యాయములోని మిగిలిన వచనములయందు ప్రభువైన యేసుక్రీస్తు తనయొక్క దైవత్వమును గురించి పెక్కు సాక్ష్యములను వివరించెను. అవేవనగా బాప్తిస్మమిచ్చు యోహాను యిచ్చిన సాక్ష్యము (32,35 వ॥లు); ఆయన సొంత క్రియలు (36 వ॥); తండ్రియొక్క సాక్ష్యము (37,38 వ॥లు); మరియు పాత నిబంధన లేఖనముల సాక్ష్యము (39,47 వ॥లు).

మొదటిగా, సాక్ష్యమనగా నేమో తెలియజేయుటకు ప్రభువు ఒక సాధారణ వివరణ ఇచ్చెను. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు అని చెప్పెను. చట్ట సభలలో ఒక వ్యక్తియొక్క సాక్ష్యము పరిపూర్ణమైన ఋజువుగా పరిగణింపబడదు. ఒక సంగతిని స్థాపించుటకు ఇద్దరు లేక ముగ్గురు సాక్షులుండవలెనని దైవాజ్ఞ. న్యాయమైన తీర్పుకు ఇది చాలినది. కనుక ప్రభువైన యేసు తన దైవత్వమును ఋజువుపరచుటకు ఇద్దరు ముగ్గురు కాదుగాని నాలుగు సాక్ష్యములను చూపించుచుండెను.

5:32 ఈ వచనంలో చెప్పబడిన “వేరొకడు” అను మాట బాప్తిస్మమిచ్చు యోహానును సూచించుచుండెనా? తండ్రియైన దేవుని సూచించుచుండెనా? పరిశుద్ధాత్మ దేవుని సూచించుచుండెనా? యను ప్రశ్నను రేకెత్తించుచున్నది. కొందరు ‘వేరొకడు’ అను పదము బాప్తిస్మమిచ్చు యోహానును సూచించుచున్నదని నమ్ముచున్నారు. మరికొందరు తండ్రియనియు, పరిశుద్ధాత్మయని నమ్ముచున్నారు. మనమైతే తండ్రి ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చెనని నమ్ముచున్నాము. ఈ వచనము క్రింది మూడు వచనములతో సంబం ధము కలిగియున్నది.

5:33 తన తండ్రి తన్నుగూర్చి ఇచ్చిన గొప్ప సాక్ష్యమును తెలియజేసి, ఆ తరువాత యోహాను తన్నుగూర్చి యిచ్చిన సాక్ష్యమును ప్రభువు వివరించుచున్నాడు. అవిశ్వాసు లైన యూదులకు ఆయన ఇట్లు గుర్తుచేసెను : బాప్తిస్మమిచ్చు యోహాను ఏమి బోధించుచున్నాడోయని కొందరు మనుష్యులను మీరు పంపితిరి గదా! అయితే అతడు నన్నుగూర్చియే సాక్ష్యమిచ్చెనని ప్రభువు వారితో చెప్పెను. యోహాను మనుష్యులను తనవైపు ఆకర్షించుకొనక, వారి దృష్టిని ప్రజలవైపు మళ్ళించెను. సత్యవంతుడైన వానినిగూర్చి యోహాను సాక్ష్యమిచ్చెను.

5:34 తన మాటలు వినుచున్న వారికి ప్రభువైన యేసు చెప్పినదేమనగా, తాను దేవునితో సమానుడనని చెప్పినది మానవులిచ్చు సాక్ష్యమును ఆధారము చేసికొని కాదని తెలిపెను. ఒక వేళ అట్లు చెప్పినచో ఆయన వాదము బలహీనమైనదైయుండును.

మెట్టుకు బాప్తిస్మమిచ్చు యోహాను తన్నుగూర్చి యిచ్చిన సాక్ష్యమును ప్రభువు ఇక్కడ వివరించుచున్నాడు. అతడు దేవునియొద్దనుండి పంపబడినవాడు గనుక ప్రభువైన యేసు ‘మెస్సీయ’ అనియు, లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లయనియు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చియుండెను.

అటు తరువాత “మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను” అని ప్రభువు చెప్పెను. ఇంత దీర్ఘముగా ప్రభువైన యేసు యూదులతో ఎందుకు మాట్లాడవలసి వచ్చెను? తాను చెప్పునదంతయు సత్యమనియు, వారు వాదించునదంతయు అసత్యమని తెలియజేయుటకు మాట్లాడెనా? కానే కాదు.

ఈ అద్భుతమైన సత్యములు వారి ముందుంచినది ఎందుకనగా, తానెవరో వారు గ్రహించి వాగ్దానము చేయబడిన రక్షకునిగా ఆయనను అంగీకరించు నిమిత్తమే. ఈ వచనము ప్రభువైన యేసుయొక్క మృదువైన ప్రేమ కల్గిన హృదయమును చూపించుచున్నది. తనను ద్వేషించువారితోను, తన ప్రాణము తీయజూచు వారితోను ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడెను. అయితే వారిపట్ల ఆయనకేమాత్రమును ద్వేషము లేదు. ఆయన వారిని ప్రేమించెను.

5:35 ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి – “అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను” అని అతని ఘనపరచెను. దీపమనగా, అతడు అధికాసక్తిగలవాడనియు ఇతరులకు వెలుగిచ్చు పరిచర్యగలవాడనియు ఇతరులను క్రీస్తునొద్దకు నడిపించుటలో తన్నుతాను వ్యయపరచుకొనువాడనియు అర్థము. మొదటిగా యూదులనేకులు యోహానును వెంబడించిరి. ఏలయనగా యోహాను నూతనమైన వింతైన వ్యక్తిగా వారి జీవితములలో ప్రవేశించెను. వారు అతడు చెప్పు బోధను ఆలకించుటకు అతనియొద్దకు వెళ్ళిరి. కొంతకాలము వరకు వారతనిని ఒక గొప్ప మత బోధకునిగా గుర్తించిరి. తాత్కాలికముగా ఆనందించిరి.

కాని వారు పశ్చాత్తాపము నొంద లేదు. యోహానును అంతగా అంగీకరించినవారు అతడు ఎవరిని గూర్చి చెప్పెనో ఆ మెస్సీయను వారెందుకు అంగీకరించలేదు? ఆ ప్రజలు పరస్పర విరుద్ధ స్వభావము గలవారు. వారు రాజుయొక్క రాకడను గూర్చి ముందుగా తెలియ జేయు వర్తమానికుని (వారు) అంగీకరించిరి గాని, రాజును అంగీకరించలేదు. యేసు యోహానును ఎంతగానో ఘనపరచెను.

క్రీస్తుయొక్క సేవకుడైనను “మండుచు ప్రకాశించుచున్న దీపము” అని పిలువబడుట అది దేవుని కుమారునియొద్దనుండి వచ్చిన నిజమైన ఘనతయైయున్నది. ప్రభువైన యేసును ప్రేమించు మనలో ప్రతి ఒక్కరము ఆయన కొరకు మండుచు ప్రకాశించు దీపమైయుండవలెననెడి ఆపేక్షగల వారమై యుండవలెను. మరియు మనము మండుచు లోకమునకు వెలుగు నివ్వవలెను.

5:36 యోహాను ఇచ్చిన సాక్ష్యము క్రీస్తుయొక్క దైవత్వమునకు గొప్ప ఋజువేమి కాదు. చేయుటకు తండ్రి తనకిచ్చిన ఆశ్చర్యకరమైన క్రియలే ఆయన దేవుని యొద్దనుండి నిజముగా పంపబడినవాడని సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే కేవలము అద్భుత కార్యములే దైవత్వమునకు ఋజువులు కాజాలవు. పరిశుద్ధ గ్రంథమందు మానవులకు అద్భుతములు చేయుశక్తి అనుగ్రహింపబడినట్లుగా చదువుచున్నాము. అపవిత్రాత్మలకుకూడ గొప్ప అద్భుతములు చేయు శక్తి కలదు. అయితే ప్రభువైన యేసు చేసిన అద్భుతములు ఇతరులు చేసిన అద్భుతములకు భిన్నమైనవి.

ఇట్టి గొప్ప అద్భుతములు చేయుటకు ప్రభువు తనంతట తానే శక్తిగలవాడు గాని ఇతరులైతే ఆ శక్తి అనుగ్రహింపబడిన (పొందిన) వారైయున్నారు. వారు అద్భుతములు చేయుదురు గాని ఎవరికైనను అద్భుతములు చేయు శక్తిని అనుగ్రహించలేరు. ప్రభువైన యేసు తనంతట తానే అద్భుతములు చేయు శక్తి కల్గియుండి, అపొస్తలులకు తనవలె అద్భుతములు చేయు శక్తిననుగ్రహించెను. రక్షకుడు చేసిన గొప్ప కార్యములు మెస్సీయనుగురించి పాత నిబంధనలో ప్రవచింపబడిన కార్యములే. ప్రభువైన యేసు చేసిన అద్భుత కార్యములు వాటి స్వభావమందును, ఉద్దేశ్యమందును మరియు సంఖ్యయందును అద్వితీయమైనవి.

యేసు దేవుని కుమారుడనుటకు ఇవ్వబడిన నాలుగు సాక్ష్యములు (5:30-47) :

5:37 ఈ వచనములో తండ్రి తననుగూర్చి ఎట్టి సాక్ష్యము కలిగియుండెనో దానిని గూర్చి ప్రభువు మరల తెలియజేసెను. ఇది ప్రభువైన యేసు బాప్తిస్మము పొందిన సమయమును సూచించుచున్నది. అప్పుడు “ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను” అని తండ్రియైన దేవుని స్వరము పరలోకము నుండి వినబడెను. కాబట్టి మనము గ్రహించునదేమనగా, యేసు ప్రభువుయొక్క జీవితమందును, పరిచర్యయందు, అద్భుత కార్యములయందు కూడా ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడని తండ్రి సాక్ష్యమిచ్చెను.

5:38 అవిశ్వాసులైన యూదులు దేవుని స్వరమును వినలేదు మరియు ఆయన స్వరూపము చూడలేదు. ఆయన వాక్యము వారిలో నిలిచియుండలేదు గనుక వారాయన స్వరమును వినలేదు. నేడు పరిశుద్ధ గ్రంథముద్వారా దేవుడు మానవులతో మాట్లాడు చున్నాడు. యూదులు పాత నిబంధన లేఖన భాగములను కలిగియున్నను, ఆ లేఖన భాగములద్వారా దేవుడు తమతో మాటలాడుటకు వారు ఒప్పుకొనలేదు. ఎందుకనగా వారి హృదయములు కఠినపరచబడి, వారి చెవులు వినుటకు మందమాయెను.

దేవుడు పంపినవానియందు విశ్వాసముంచలేదు గనుక వారు దేవుని స్వరూప మును ఎన్నడు చూచియుండలేదు. తండ్రియైన దేవుడు మానవ నేత్రములతో చూడ దగిన ఆకృతినిగాని, స్వరూపముగాని గలవాడుకాదు. దేవుడు ఆత్మగనుక ఆయన అదృశ్యుడు. కాని ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మానవాళికి తన్ను తాను బయలుపరచుకొనెను. అయితే క్రీస్తునందు విశ్వాసముంచినవారు నిజముగా దేవుని స్వరూపమును చూచియున్నారు. కాని అవిశ్వాసులైతే ప్రభువును చూచినప్పుడు ఆయనను తమవంటి వేరొక మనిషిగానే భావించిరి.

5:39 లేఖనములు క్రీస్తునుగురించి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ వచనములోని మొదటి భాగము రెండు విధములుగా అర్థము చేసికొనవచ్చును. (1) యూదులకు లేఖనములను పరిశోధించుమని ప్రభువైన యేసు చెప్పియుండ వచ్చును. (2) లేఖనములను కలిగి యుండి వాటిని పరిశోధించుటవలన వారు నిత్యజీవమును కలిగియున్నారను అభిప్రా యమును ప్రభువు చెప్పియుండవచ్చును, ఈ వచనమునకు ఈ రెండు వ్యాఖ్యానము లలో ఏదైనను సరిపోవచ్చును. లేఖనములు పరిశోధించినంతమాత్రముననే తాము నిత్యజీవమును పొందుదుమని వారు తలంచుచున్నట్లు ప్రభువైన యేసు చెప్పెను.

అయితే పాత నిబంధన లేఖనములు రానున్న మెస్సీయనుగూర్చి తెలియజేయుచున్నవి. కాని ఈ యేసే రానై యున్న మెస్సీయ అని లేఖనములు చెప్పుచున్నట్లు యూదులు గ్రహించరైరి. తమ చేతులలో లేఖనములు కల్గియుండియు గ్రుడ్డివారగుట ఎంతో భయంకరము, మరియు ప్రభువైన యేసు వారితో మాటలాడినను వారాయనను అంగీకరించకపోవుట క్షమింపరాని సంగతి. ఈ వచనములో “అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” అను భాగమును గమనించుడి.

“క్రీస్తు రాకడ” పాత నిబంధనలోని లేఖనముల ముఖ్యాంశమని ఈ వాక్య భావము. ఎవడైనను యీ సత్యమును గ్రహించకనే పాత నిబంధన లేఖనములను పఠించినయెడల వాడు అతి ప్రాముఖ్యమైన అంశమును పోగొట్టుకొనినవాడగును.

5:40 యూదులు జీవము పొందునట్లుగా వారు క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇష్టపడుట లేదు, జనులు రక్షకుని అంగీకరింపక పోవుటకు తగిన కారణము ఇక్కడ తెలుపబడినది. వారు సువార్తను గ్రహించలేక కాదు; లేక యేసును అంగీకరించుట అసాధ్యమనియు కాదు; మరియు వారికి ఆయనయందు నమ్మశక్యముకాని దేదియు లేదు. అసలైన తప్పు ఏదనగా అది మానవుని స్వయిచ్ఛయందున్నది. మనుష్యుడు రక్షకునికంటే తన పాపములనే ఎక్కువగా ప్రేమించెను. తన దుష్టమార్గములను విడిచిపెట్టుట అతనికి ఇష్టము లేదు.

5:41 యూదులు ప్రభువును ఘనపరచలేదు. ఆయనను అంగీకరించుటలో వారు విఫలులైరి. తాను వారిచేత అవమానము పొందితినని వారికి తెలియకూడదని ప్రభువు ఆశించెను. మనుష్యులవలన మెప్పుపొందుటకు ఆయన ఈ లోకములోనికి రాలేదు. మానవుల మెప్పును కోరక తండ్రియొక్క మెప్పునే ఆయన కోరెను. మానవ తృణీకారము ఆయన మహిమను లేశమైనను తగ్గించదు.

5:42 మానవుడు దేవుని కుమారుని అంగీకరించని కారణమేమో ఇక్కడ తెలుపబడి యున్నది. దేవుని ప్రేమ వారిలో లేదు గనుక వారు దేవుని ప్రేమింపక తమ్మును తామే ప్రేమించుకొనిరి. వారు దేవుని ప్రేమించినయెడల దేవుడు పంపినవానిని వారు అంగీకరించుదురు. ప్రభువైన యేసును తృణీకరించుటద్వారా వారు యెహోవా దేవుని ప్రేమించుటలో ఎంతగా కొరతపడియున్నారో వారే తెలియజేయుచున్నారు.

5:43 తండ్రికి మహిమ తెచ్చుటకును, తండ్రికి అన్ని విషయములలోను విధేయత కల్గియుండుటకును తండ్రి చిత్తము నెరవేర్చుటకును ప్రభువైన యేసు తన తండ్రి నామమున వచ్చెను. మానవులు నిజముగా దేవుని ప్రేమించిన యెడల, తన క్రియల ద్వారా మాటలద్వారా తండ్రిని సంతోషపరచినవానిని అనగా ప్రభువైన యేసునుకూడ వారు ప్రేమించుదురు గదా!
మరియొకడు తన నామమందు వచ్చినయెడల యూదులు అంగీకరింతురని ప్రభువు ప్రవచించెను. తన తరువాత అబద్ధబోధకులు లేచి, ఆ జాతిద్వారా ఘనతను అపేక్షించుదురని చెప్పెను.

బహుశా గడచిన శతాబ్దములనుండియు నేనే క్రీస్తునని ప్రకటించుకొనిన అబద్ధ మత నాయకులను గురించి చెప్పియుండవచ్చును. మరియు ఆయన క్రీస్తువిరోధినిగురించి మరి నిశ్చయముగా చెప్పియుండవచ్చును. రానున్న దినములయందు తన్నుతానే రాజుగా హెచ్చించుకొనుచు తన్ను దేవునిగా ఆరాధించు మని బలవంతము చేయు ఒకడు యూదా జనాంగములోనుండి లేచును (2 థెస్స 2:8-10). యూదులలో మూడువంతుల ప్రజలు ఈ క్రీస్తు విరోధిని తమ ఏలికగా అంగీకరింతురు. తత్ఫలితముగా వారు దేవునియొక్క కఠినమైన తీర్పుకు గురియగుదురు (ప్రకటన 13:11-18; మత్తయి 24:15).

5:44 యూదులు ప్రభువును అంగీకరించుటలో తప్పిపోవుటకు గల కారణమును ఆయన ఇక్కడ వివరించుచుండెను. వారు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా నపేక్షించిరి. ఆయనను వెంబడింపగా కలుగు శ్రమలను, అవమానములను సహించుటకు ఇష్టములేనివారైరి. మనుష్యులేమనుకొందురో, ఏమిచేయుదురో యని మనుష్యులకు భయపడునంతవరకు వారు రక్షింపబడలేదు. ఒకడు ప్రభువైన యేసును అంగీకరించుటకు దేవుని మెప్పుకంటె మరెక్కువగా దేనిని అపేక్షించరాదు. దేవుని యొద్దనుండి వచ్చు ఘనతనే ఒకడు తప్పక వెదకవలెను.

5:45 ప్రభువే యూదులపై తండ్రి యెదుట నేరము మోపవలసిన అవసరము లేదు. ఆయన వారిపై అనేక నేరములు మోపగలడుగాని, వారిపై నేరారోపణ చేయుటకు మోషే ధర్మశాస్త్రమే చాలును. పాత నిబంధనయందు ప్రత్యేకించి, మోషే ధర్మశాస్త్రము నందు యూదులకు అతిశయము కలదు. ఈ లేఖనములు యూదా జనాంగమునకే ఇవ్వబడెనని వారు గర్వించుదురు గాని, 46వ వచనమునుబట్టి వారు మోషే మాటలకు విధేయత చూపలేదని మనము గమనించగలము.

5:46 ప్రభువు తన స్వంత మాటలకెంత ఆధిక్యత నిచ్చెనో అట్టి ఆధిక్యతను మోషే వ్రాతలకును ఇచ్చెను. ఎట్లనగా, లేఖనములన్నియు దైవావేశము వలన కలిగినవని మనమెరుగుదుము. మనము పాత నిబంధన చదివినను, క్రొత్త నిబంధన చదివినను దేవుని వాక్యమునే చదువుచున్నాము. యూదులు మోషేయందు విశ్వాసముంచిన యెడల ప్రభువైన యేసునందును విశ్వాసముంచవలసియున్నారు. ఏలయనగా, మోషే క్రీస్తు ఆగమనమును గురించి వ్రాసియుండెను.

ద్వితీయోపదేశకాండము 18:15-18 నందు మోషే క్రీస్తు ఆగమనమును గురించి వ్రాసియుండెను. మరియు మోషే క్రీస్తు వచ్చినప్పుడు ఆయనమాట విని, ఆయనకు విధేయులు కమ్మని వారికి చెప్పియుండెను. ఇప్పుడు ప్రభువైన యేసు వచ్చియుండెనుగాని, వారాయనను స్వీకరించుటలో తప్పిపోయిరి.

కనుక దేవుని యెదుట మోషే యూదులపై నేరారోపణచేయును. ఎందుకనగా, వారు మోషేను నమ్మియున్నట్లుగా నటించి, మోషే వారికాజ్ఞాపించినది చేయుటకు నిరాకరించిరి. “అతడు నన్ను గురించి వ్రాసెను” అని ప్రభువు చెప్పిన మాటలనుబట్టి పాత నిబంధన లేఖనములయందు క్రీస్తు ప్రభువును గూర్చిన ప్రవచనములు కలవని తేటగా తెలియుచున్నది.

5:47 మోషే వ్రాసిన దానిని యూదులు నమ్మనియెడల యేసు మాటలు వారు నమ్ముదురని మనము చెప్పజాలము. పాత నిబంధనకు, క్రొత్త నిబంధనకు సన్నిహిత సంబంధము కలదు. పాత నిబంధన గ్రంథమందలి లేఖన భాగములు దేవుని ప్రేరణచే వ్రాయబడినట్లు నమ్మనియెడల ప్రభువైన యేసు మాటలుకూడ దైవప్రేరితమని నమ్మలేరు. పరిశుద్ధ గ్రంథమందలి కొన్ని లేఖన భాగములను నమ్మక విమర్శించువారు తమ అపనమ్మకమునుబట్టి అనతి కాలములోనే పరిశుద్ధ గ్రంథమునంతటిని విమర్శింతురు.

Leave a Comment