చెడ్డ స్త్రీ – మంచి మనుష్యుడు – Bible Verses Chapter 4 in Telugu

నాలుగవ అధ్యాయము

చెడ్డ స్త్రీ – మంచి మనుష్యుడు

మూడు, నాలుగు అధ్యాయములలో మన ప్రభువు ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో చేసిన సంభాషణ వివరించబడియున్నది. ఆ ఇద్దరు నీకొదేము మరియు సమరయ ఆ ఇరువురి మధ్యగల కొన్ని ముఖ్యమైన భేదములను దిగువ చూడగలము.

నీకొదేము                                                                                          సమరయ స్త్రీ
1. మంచివాడు                                                                                                 చెడ్డ స్త్రీ
2. యూదులనాయకుడు                                                                                 యూదులచే వెలివేయబడెను
3. రాత్రివేళ ప్రభువునొద్దకు వచ్చెను                                                                మధ్యాహ్నపువేళ కనుగొనబడెను
4. రక్షకుని వెదకెను                                                                                         రక్షకుడే ఈమెను వెదకెను
5. దైవ జ్ఞానము కలిగియుండెను “మేమెరుగుదుము”(3:2)                                 సత్యమునుగూర్చిన జ్ఞానము ఈమెకు లేదు. “మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు”(4:22)
6. క్రొత్త జన్మ                                                                                                     ఆరాధన
7. స్పష్టమైన ఫలితములేదు                                                                            తక్షణమే ఫలితము కనబడెను.

 

చెడ్డ స్త్రీ – మంచి మనుష్యుడు

 

సమరయ స్త్రీయొక్క సంభాషణ (4:1-30) :

4:1-3 యేసు యోహానుకంటే ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్నాడనియు, యోహానుయొక్క పేరు ప్రతిష్ఠలు తగ్గిపోవుచున్నవనియు పరిసయ్యులు వినిరి. దీనిని ఆధారము చేసికొని యోహాను శిష్యులకు యేసు శిష్యులకును మధ్య వివాదము రేపుటకు ప్రయత్నించి యుండవచ్చును.

Read and Learn More Telugu Bible Verses

వాస్తవమునకు ప్రభువైన యేసు తానే బాప్తిస్మమియ్యలేదుగాని, ఆయన శిష్యులిచ్చిరి. అయినను ప్రజలు మాత్రము ప్రభువుయొక్క శిష్యులుగా, లేక ఆయన అనుచరులుగానే బాప్తిస్మము పొందిరి. తాను యూదయ దేశము విడచి గలిలయ ప్రాంతమునకు వెళ్ళుటద్వారా యోహాను శిష్యులకును మధ్య భేదాభిప్రాయములు కలిగించుటతో పరిసయ్యులయొక్క ప్రయత్నములను ప్రభువు నిరోధించెను. కాని యీ వచనములో గుర్తింపదగిన మరొక విషయమున్నది.

అదేమనగా, యూదయ ప్రాంతము యూదా జనాంగమునకు ప్రధాన కేంద్రము కాగా, గలిలయ ప్రాంతము అన్యజనాంగములకు చెందినది. యూదా జనాంగము ఇప్పటికే తనను మరియు తన సాక్ష్యమును తిరస్కరించిరని ప్రభువు ఎరిగినవాడై, రక్షణ వర్తమానము తీసికొని గలిలయ ప్రాంతమునకు వెళ్ళెను.

4:4-6 యూదయనుండి గలిలయకు వెళ్ళుటకు సమరయ గుండ వెళ్ళుటయే సరియైన మార్గము. కాని యూదులు సమరయగుండా ప్రయాణము చేయరు. యూదులు సమరయను నీచమైనదిగా నెంచెదరు. గనుక వారు గలిలయ ప్రాంతము లకు వెళ్ళునప్పుడు చుట్టు మార్గముగుండ వెళ్ళెదరు. ప్రభువు సమరయ మార్గముగుండా వెళ్ళవలసి వచ్చెనని చెప్పినప్పుడు తన సహాయము అవసరమైన ఒక ఆత్మ సమరయలో ఉన్నదను ఉద్దేశ్యముతో తప్ప, భౌగోళిక పరిస్థితులను బట్టి ప్రభువు ఆ మార్గమున వెళ్ళెనని తలంచరాదు. సమరయ ప్రాంతములో ప్రయాణము చేయుచు ప్రభువు “సుఖారు” అను గ్రామమునకు వచ్చెను.

ఆది 48:22లో వ్రాయబడి యున్నట్లు ఆ గ్రామమునకు సమీపములో యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి యుండెను. ప్రభువైన యేసు ఈ ప్రాంతములో ప్రయాణము చేయుచుండగా, దాని గత చరిత్ర దృశ్యములన్నియు ఆయన మనస్సులో స్థిరముగా నిలిచిపోయెను. ఆ ప్రాంతములోనే యాకోబు బావి యుండెను. నేడు కచ్చితముగా గుర్తించగల బైబిలు సంబంధమైన బహు కొద్ది స్థలములలో ఇది యొకటి ప్రభువు ఆ బావిని చేరునప్పటికి మధ్యాహ్న సమయమాయెను. ఆయన బహు దూరము నడుచుటవలన బాగా అలసిపోయెను గనుక ఆయన ఆ బావియొద్ద కూర్చుండెను. యేసు కుమారుడైన దేవుడైనప్పటికిని ఆయన మానవుడుకూడ.

దేవుడుగా ఆయన ఎన్నటికి అలసట చెందడు గాని, మానవుడుగా అలసిపోయెను. ఈ సంగతులు అర్థము చేసుకొనుట మనకు కష్టమే. కాని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వము నశించు మానవ మనస్సుకు పూర్తిగా అర్థము కాదు. దేవుడు ఈ లోకమునకు దిగివచ్చి ఒక మనుష్యుడుగా మనుష్యులమధ్య జీవించెనను సత్యము మర్మమైనది. ఇది సమస్త జ్ఞానమునకు మించినది.

4:7,8 ప్రభువైన యేసు బావినొద్ద కూర్చుండి యుండగా, ఒక స్త్రీ నీళ్ళు చేదుకొనుటకు బావియొద్దకు వచ్చెను. అది మిట్టమధ్యాహ్న సమయము. స్త్రీలు నీళ్ళ కొరకు బావియొద్దకు వెళ్ళుటకు అనుకూల సమయము కాదు. అది మిక్కిలి ఎండవేళ, ఈ స్త్రీ చాల ఘోరమైన పాపి. తన్ను చూచువారెవరు అక్కడ ఉండరని తలంచి ఆ స్త్రీ ఆ సమయమును ఎంచుకొని ఉండవచ్చును. కాని ఆ సమయములో ఆ స్త్రీ ఆ బావియొద్ద ఉండునని ప్రభువు ఎరిగియున్నాడు. ఆమె రక్షణ అవసరమైన ఆత్మయని ఆయన ఎరిగెను. గనుక ఆ స్త్రీని కలిసికొని ఆమె పాప జీవితమునుండి ఆమెను తప్పించవలెనని ఆయన నిశ్చయించుకొనెను.

ఈ వచనములోను, తరువాతి వచనములలోను గొప్ప ఆత్మల సంపాదకుడు తన పనిలో నుండుట మనము చూడగలము. అంతేగాక ఆమెయొక్క అవసరత గ్రహించునట్లు చేయుటకు, ఆమెకు గల సమస్యకు పరిష్కారమార్గము సూచించుటలో ఆయన అనుస రించిన పద్ధతులను మనము గమనించగలము. ప్రభువుతో ఆ స్త్రీ కేవలము ఏడు మారులు మాటలాడెను.

వాటిలో ఆరుమారులు ప్రభువుతోను ఒకమారు తన పట్టణ ప్రజలతోను మాటలాడెను. ఆమె మాటలాడినంతగా మనముకూడ ప్రభువుతో సంభాషిం చినయెడల, తన పట్టణప్రజలతో మాటలాడినప్పుడు ఆమె ఎటువంటి సాక్ష్య మిచ్చెనో అటువంటి సాక్ష్యము మనముకూడ కలిగియుందుము. మరియు మన సాక్ష్యముకూడ సఫలమగును. ‘ఇమ్ము’ అను మాటలతో ప్రభువు తన సంభాషణను ప్రారంభించెను. ఆయన ప్రయాణము చేసి అలసియుండుట వలన నీరు త్రాగ ఆశించెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ‘సుఖారు’ అను ఊరిలోనికి వెళ్ళిరి. కాని, అక్కడ బావినుండి నీరు చేరుకొనుటకు ఆయనకు ఎటువంటి సాధనము లేనట్లుగానున్నది.

4:9 ఆ స్త్రీ యేసు ఒక యూదుడని గ్రహించి, త్రోసివేయబడిన సమరయురాలైన తనతో ఆయన మాటలాడుట చూచి ఆమె ఆశ్చర్యపడెను. తాము యాకోబు సంతాన మనియు, తామే నిజమైన ఇశ్రాయేలీయులమనియు సమరయులు చెప్పుకొందురు. కాని వాస్తవమునకు వారు యూదులు మరియు అన్యజనాంగముద్వారా ఏర్పడిన మిశ్రిత జనాంగము. వారి ఆరాధన స్థలము గెరిజీము పర్వతముపై నున్నది.

ఆ స్త్రీ ప్రభువుతో మాటలాడుచున్న స్థలమునుండి చూస్తే, వారిరువురికి స్పష్టముగా కనిపించు పర్వతము గెరిజీము పర్వతమే. సమరయ ప్రజలంటేనే యూదులకు బహు అయిష్టత కలదు. వారిని సంకరజాతి ప్రజలుగా యూదులు పరిగణింతురు. అందువలననే ఆమె ఆ ప్రభువుతో “యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు” అని ప్రశ్నించెను. ఈ సందర్భములో తాను తన సృష్టికర్తతో మాటలాడు చున్నదని, ఆయన ప్రేమ మానవ పరిధులను మించినదనియు ఆమె ఎరుగకుండెను.

4:10 ఆయన ఆ స్త్రీని దాహమునకిమ్మని అడుగుటవలన ప్రభువు ఆమెలో ఆసక్తిని రేకెత్తించెను. తన్ను దేవునిగాను, మానవునిగాను చెప్పుకొనుటద్వారా ఆమెలోని ఆసక్తిని అధికము చేసెను. మొట్టమొదట ఆయన దేవుని వరమైయున్నాడు. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును లోకరక్షకునిగా అనుగ్రహించెను. కాని ఆయన మానవుడు కూడ. మానవుడుగా ఆయన ప్రయాణము వలన అలసిపోయెను. గనుకనే ఆమెను దాహమునకిమ్మని అడిగెను. తనతో మాటలాడుచున్నవాడు శరీరధారిగా ప్రత్యక్షమైన దేవుడని ఆమె గ్రహించినయెడల ఆయనను వరమిమ్మని అడుగును. అప్పుడు ఆయన ఆమెకు జీవజలమును అనుగ్రహించును.

14:11-13 ఆ స్త్రీ కేవలము అక్షరార్థమైన నీటినిగూర్చి మాత్రమే ఆలోచించెను. మరియు ఏమి లేకుండ ఆ నీటిని ఎలా పొందగలడని ఆమె తలంచెను. ఆమె ప్రభువును గుర్తించుటలోను, ఆయన మాటలను అర్థముచేసికొనుటలోను పూర్తిగా విఫలమైనది. ఆమె ఎప్పుడైతే ఆ బావిని తమకిచ్చిన తమ పితరుడైన యాకోబునుగూర్చి ఆలోచించినదో అప్పుడు తాను ఎక్కువగా అలజడికి గురియాయెను. యాకోబును తన కుమారులును, వారి పశువులును ఆ బావి నీరు త్రాగిరి.

అయితే శతాబ్దముల తరువాత ఆ యాకోబు బావి నీరు త్రాగుట కిమ్మని అడిగిన అలసిన ప్రయాణికుని ఆమె కనుగొనుచున్నది. కాని అతడు దానికంటె శ్రేష్ఠమైన నీరు ఇవ్వగలనని చెప్పెను. తనయొద్ద శ్రేష్ఠమైనవి యుండగా, యాకోబు బావినీరు కావలెనని ఎందుకు అడిగెను? గనుక అక్షరార్థమైన యాకోబు బావి నీటికిని, తానిచ్చు నీటికిని గల భేదమును ప్రభువు వివరించుచున్నాడు. ఈ నీటిని త్రాగువారు మరల దప్పిగొందురు.

ఈ సత్యమును ఆ సమరయ స్త్రీ నిశ్చయముగా అర్థము చేసికొనెను. ఆ బావినుండి నీరు చేదుకొనుటకు ప్రతిదినము ఆమె అక్కడికి వచ్చుచున్నది. కాని ఆ నీరు ఆమెయొక్క దప్పి తీర్చలేదు. లోకములోని బావులన్నింటి పరిస్థితి అంతే. భూసంబంధమైన వాటిద్వారా తమ కోర్కెలను తృప్తిపరచుకొనుటకు మానవులు ప్రయత్నింతురు గాని, మానవ హృదయ దాహమును అవి ఏమాత్రమును తీర్చజాలవు.

4:14 యేసు ఇచ్చు నీరు నిశ్చయముగా తృప్తినిచ్చును. క్రీస్తుయొక్క ఆశీర్వాద కనికరములను గ్రోలినవాడు ఎన్నడు దప్పిగొనడు. ఆయన మేళ్ళతో హృదయము నిండుట మాత్రమేగాక అవి పొర్లిపారును. అవి ఈ జీవితములోనే గాక నిత్యత్వ మందును నిత్యము ఉబుకుచుండు బుగ్గవలె ఉండి నిరంతరము ప్రవహించుచుండును. ఈ వ్యత్యాసము బహు తేటగా నున్నది.

మానవ హృదయమును తృప్తితో నింపుటకు లోకమిచ్చునదంతయు చాలదు కాని క్రీస్తు అనుగ్రహించు దీవెనలు హృదయమును నింపుటయేగాక అవి ఏ హృదయము పట్టజాలనంత గొప్పవియైయున్నవి. లోకము ఇచ్చునట్టి సంతోషము బహుకొద్ది సంవత్సరములమట్టుకేగాని క్రీస్తు అనుగ్రహించు సంతోషము నిత్యజీవములోకూడ నిలుచును.

4:15 ఆశ్చర్యకరమైన ఈ నీటినిగూర్చి ఆ స్త్రీ వినినప్పుడు వెంటనే తనకు ఆ నీరు దయచేయుమనికోరెను. ఆమె ఇంకను అక్షారార్థమైన నీటిని గూర్చియే తలంచుచున్నది. ప్రతిదినము బావికివచ్చి చాలా లోతునుండి తోడుకొని, బరువైన ఆ కుండను మోసికొని వెళ్ళుట ఆమె కిష్టము లేదు.

ప్రభువైన యేసు ఆత్మీయమైన నీటినిగూర్చి మాటలాడు చున్నాడని ఆమె గ్రహించలేదు. ఈ నీటిని కేవలము ఆయనయందు విశ్వాసముంచుట ద్వారా పొందవచ్చునని ఆయన సూచించుచున్నాడని ఆమె గ్రహించకుండెను.

4:16 వారి సంభాషణలో వచ్చిన ఆకస్మికమైన మార్పును గమనించండి. ఆమె నీరునడుగుచుండగా, ప్రభువైన యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసికొని రమ్మని చెప్పుచున్నాడు. ఎందుకు ? ఎందుకనగా, ఈ స్త్రీ రక్షింపబడుటకు ముందు తాను పాపినని గ్రహించవలెను. ఆమె నిజమైన పశ్చాత్తాపముతోను, ఒప్పుకోలుతోను ప్రభువు చెంతకు వచ్చి తన పాపములను అవమానకరమైన తన స్థితిని ఒప్పుకొనవలెను.

ప్రభువైన యేసు ఆమె జీవించిన పాపపంకిలమైన ఆమె జీవితమంతటిని ఎరుగును. గనుక తన పాపస్థితిని తాను గ్రహించునట్లు నెమ్మది నెమ్మదిగా ఆమెను నడిపించ బోవుచున్నాడు. తాము నశించితిమని ఎందరు గ్రహించెదరో వారు మాత్రమే రక్షణ పొందగలరు. నిజముగా మానవులందరు నశించిరి. కాని దానిని ఒప్పుకొనుటకు
ఎవరూ ఇష్టపడరు.

క్రీస్తుకొరకు మనుష్యులను సంపాదించుటలో పాపమును గూర్చిన ప్రశ్న ఎంతమాత్రము విడిచిపెట్టకూడదు. తమ పాపములనుబట్టి, అపరాధములనుబట్టి మానవులు మరణించిరను సత్యమును వారు తప్పక ఎదుర్కొనవలెను. వారికి ఒక రక్షకుడు అవసరమైయుండెననియు వారు తమ్మును తాము రక్షించుకొనలేరనియు, తమ్మును రక్షించు రక్షకుడు క్రీస్తు ప్రభువనియు, ఆయనయందు విశ్వాసముంచి పశ్చాత్తాపముతో తమ పాపములను ఒప్పుకొనినయెడల ఆయన తప్పక రక్షించుననియు వారు ఎరుగవలెను.

4:17,18 మొట్టమొదట అబద్ధమాడకుండగనే సత్యమును మరుగుపరచుటకు ఆ స్త్రీ ప్రయత్నించినది. నాకు పెనిమిటిలేడు అని చెప్పినది. చట్టపరముగా ఆలోచిస్తే. ఆమె చెప్పినది వాస్తవమే. కాని భర్తకాని వ్యక్తితో పాపములో జీవించుచున్నదను వాస్తవమును మరుగుచేయుటకు ఆమె ప్రయత్నించుచున్నది. దేవునిగా, ప్రభువైన యేసు సమస్తమును ఎరిగినవాడు. అందువలననే ఆయన “నాకు పెనిమిటి లేడని నీవు చెప్పినమాట సరియే,” అని ఆమెకు బదులిచ్చెను.

ఆయన ఆమెను గూర్చి సమస్త మును ఎరుగును. ఒక వ్యక్తి జీవితమును అనవసరముగా బహిర్గతము చేయుటకుగాని లేక అవమాన పరచుటకుగాని ప్రభువు తన జ్ఞానమును ఎన్నడు ఉపయోగించలేదు. కాని యీ సమయములో ఒక వ్యక్తిని పాపపు కట్లనుండి విడిపించుటకు తన జ్ఞానమును ఇక్కడ ఉపయోగించెను. ప్రభువు ఆమె గత జీవితమును ఆమెకు తెలియజేసినప్పుడు ఆ స్త్రీ ఎంతగా ఆశ్చర్యపడెనో గదా! ఆమెకు ఐదుగురు భర్తలుండిరి. కాని ఇప్పుడున్న వాడు ఆమె భర్తకాదు.

ఈ వచనమునుగూర్చి బైబిలు విద్యార్థులలో కొన్ని భేదాభిప్రాయములు కలవు. ఆమె ఐదుగురు భర్తలు మరణించి ఉండవచ్చును లేక ఆమెను విడిచిపెట్టి యుండ వచ్చును. గనుక ఆమెకు వారితోగల సంబంధము పాపసంబంధమైనదికాదని కొందరి అభిప్రాయము. ఈ అభిప్రాయము నిజమో కాదో మనకు తెలియదుగాని, ఈ వచనము లోని రెండవ భాగము ఆమె ఒక వ్యభిచారిణియనే తెలియజేయుచున్నది. ఆ మాటను గమనించండి. “ఇప్పుడున్నవాడు నీ పెనిమిటికాడు.” ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఆ స్త్రీ కేవలము పాపి. ఈ సత్యమును ఆమె గుర్తించు వరకు జీవజలములతో ప్రభువు ఆమెను ఆశీర్వదించలేడు.

4:19 తన జీవితమును తన యెదుట తెరచి చూపెట్టుచూ, తనతో మాటలాడిన వాడు సామాన్యమైన వ్యక్తికాడని ఆమె గ్రహించెను. అయినను ఆయన దేవుడని మాత్రము ఆమె గ్రహించలేదు. దేవుని పక్షమున మానవులతో మాటలాడు ఒక ప్రవక్తయని మాత్రమే ఆమె తలంచెను.

4:20 ఇప్పుడు ఆమె తన పాపముల విషయమై ఒప్పింపబడిన స్త్రీనిగా చూచు చున్నాము. గనుక సరియైన ఆరాధనా స్థలమును గూర్చి ప్రశ్నించుచు అంశమును మార్చుటకు ప్రయత్నించెను. “మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి” అని గెరిజీము పర్వతమును చూపించుచు చెప్పినది. మరియు యెరూషలేమే సరియైన ఆరాధన స్థలమని యూదులు చెప్పుచున్నారని ప్రభువుకు జ్ఞాపకము చేయుచున్నది.

4:21 అయితే ప్రభువు ఆమె మాటలను త్రోసివేయక మరొక ఆత్మీయ సత్యమును గ్రహింపజేయుటకు ఆమె మాటలనుపయోగించెను. అదేమనగా, ఒక కాలము వచ్చు చున్నది. ఆ కాలమందు గెరిజీముగాని, యెరూషలేముగాని ఆరాధన స్థలముగా ఉండదు.

పాత నిబంధనలో తన్ను ఆరాధించు స్థలముగా దేవుడు యెరూషలేమును నియమించెను. ఆ కాలములో యెరూషలేములోని మందిరము దేవుని నివాసస్థలమై యున్నది. గనుక భక్తిగల యూదులు తమ బలులను, అర్పణలను యెరూషలేమునకు తెచ్చెడివారు. అయితే యీ సువార్త యుగములో తన్ను ఆరాధించుటకు భూమిమీద ఒక ప్రత్యేకమైన స్థలమును దేవుడు ఎన్నుకొనలేడు. తరువాత వచనములలో ప్రభువు యీ సత్యమునుగూర్చి పూర్తిగా వివరించియున్నాడు.

4:22 “మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు” అని ప్రభువు చెప్పినప్పుడు ఆయన సమరయుల ఆరాధన విధానమును ఖండించుచున్నాడు. “అన్ని మతములు ఒక్కటే, అన్ని మతములు చివరికి మానవుని పరలోకమునకే చేర్చును” అని చెప్పెడి మత బోధకుల తప్పుడు బోధకు ఇది పూర్తిగా భిన్నమైనది సమరయుల ఆరాధన దేవునిచేతగాని, తనచేతగాని ఆమోదింపబడలేదని ప్రభువు ఆమెకు తెలియజేసెను.

అంతేగాక వారి ఆరాధన మానవ కల్పితమైనదేగాని, దైవ వాక్యధారమైనది కాదు. మరియు యూదుల ఆరాధన దీనివంటిది కాదు. యూదులు భూలోకములోని జనాంగ ములన్నింటినుండి దేవునిచేత ఎన్నుకొనబడిన జనాంగము. తన్ను ఆరాధించుటకు అవసరమైన నియమములను ఆయన వారికి అనుగ్రహించెను. “రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది” అని ప్రభువు చెప్పెను. వారిని తన దూతలనుగా నియమించి వారికి తన లేఖనములనను గ్రహించెను. అంతేగాక ఆ జాతిద్వారానే మెస్సీయకూడ అనుగ్రహించబడెను. ఆయన యూదురాలైన తల్లికి జన్మించెను.

4:23 తన రాకతో ఆరాధనకు దేవుడు భూమిమీద ఒక ప్రత్యేకమైన స్థలము కలిగియుండలేదని ప్రభువు ఆ స్త్రీకి తెలియజేసెను. అవును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారు తండ్రియైన దేవుని ఏ సమయమందైనను, ఏ స్థలమందైనను ఆరాధించవచ్చును. నిజమైన ఆరాధనకు అర్థమేమనగా, ఆరాధికుడు ఎక్కుడ ఉన్నా డనునది ప్రశ్నకాదు. విశ్వాసి విశ్వాసముద్వారా దేవుని సన్నిధిచేరి ఆయనను స్తుతించి ఆరాధించగలడు.

తండ్రిని ఆరాధించువారు ఇప్పటినుండి ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెనని ప్రభువు చెప్పెను. ఇట్టి ఆరాధనను యూదులు మానవపద్ధతులుగా, ఆచారములుగా మార్చిరి. అందుచేత యూదుల ఆరాధన ఆత్మతో చేయు ఆరాధన కాదు. అది బాహ్యసంబంధమైన ఆరాధనయేగాని, అంతరంగమున జరుగునది కాదు. వారి దేహములు ఆయన సన్నిధిలో సాష్టాంగపడియున్నను, వారి హృదయములు దేవునియెదుట సరియైనవిగా లేవు. మరలా చెప్పునదేమనగా, యూదుల ఆరాధన బాహ్యసంబంధమైనదే గాని, అది ఆత్మీయమైనదికాదు. గనుక ఈ ఆరాధన సరికాదు.

మరొకవైపు సమరయుల ఆరాధన ఇంతకంటే అప్రమాణికమైనది. అది లేఖనాధారమైనది కాదు. అది సమరయులు తామే ప్రారంభించి తాము కనుగొనిన స్వంత పద్ధతులద్వారా కొనసాగించిన మతారాధనైయున్నది. అయితే ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెనని ప్రభువు చెప్పుటలో, ఆయన యూదులను, సమర యులను ఖండించుచున్నాడు. కాని యిప్పుడు తాను పరలోకమునకు చేరిన పిదప తనద్వారా దేవునియొద్దకు వచ్చి యథార్థమైన ఆరాధన చేయుటకు మనుష్యులకు అవకాశము కలదనికూడ ప్రభువు చెప్పుచున్నాడు.

తన్ను ఆరాధించువారు “అట్టివారే కావలెనని” తండ్రి వెదుకుచున్నాడు. దీనిని లోతుగా ఆలోచించండి! తండ్రి తన్ను ఆరాధించు ఆరాధికుల కొరకై వెదుకుచున్నాడు. తన ప్రజలయొక్క ఆరాధనయందు దేవుడు ఆసక్తిగలవాడైయున్నాడు. ఇట్టి ఆరాధన ఆయన నీ నుండి స్వీకరించుచున్నాడా?

4:24. “దేవుడు ఆత్మయైయున్నాడు.” మానవాళికిగల సమస్త హద్దులకు, పొరబాటు లకు లోనగుటకు ఆయన కేవలము మానవమాత్రుడు కాడు. ఆయన ఒక స్థలమునకు పరిమితమైనవాడు కాడు ఆయన ఆదృశ్యుడు. గనుక ఏక సమయములో అన్ని స్థలములలో ఉండువాడు. అంతేకాదు, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు; సర్వశక్తి మంతుడు. అంతేగాని ఆయన ఒక సమయమునకు ఒక స్థలమునకు మాత్రమే పరిమితమైన దేవుడు కాడు. ఆయన తన మార్గములన్నింటిలో పరిపూర్ణుడు. గనుక, ఆయనను ఆరాధించువారు తప్పక ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆయనను ఆరాధించుటలో సిగ్గుగాని, వేషధారణగాని ఉండకూడదు. అంతమాత్రమే కాదు.

అంతరంగము చెడిపోయియుండగా, మత సంబంధమైన పైపై నటన తగదు. మతాచారముల రీతిగా ఆయనను ఆరాధించుటద్వారా దేవుడు సంతోషించునను ఆలోచనకు చోటివ్వకూడదు. ఒకవేళ దేవుడు తానే ఆ ఆచారములను నియమించి నప్పటికిని, మానవుడు విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి చేరవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ అధ్యాయములో తప్పక చేయవలసిన రెండు కార్యములు కలవు. మొదటిది – ఆత్మలను సంపాదించువాడు తప్పక చేయవలసిన కార్యము (4:4), రెండవది – ఆరాధికుడు తప్పక చేయవలసిన కార్యము (4:24).

4:25 ప్రభువు మాటలు ఆలకించుచున్న ఆ సమరయ స్త్రీ, రాబోవు మెస్సీయను గూర్చి ఆలోచించినది. మెస్సీయ ఈ లోకమునకు రావలెనను అపేక్షను దేవుని ఆత్మ ఆమెలో కలిగించెను. అంతేగాక, ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయునను నమ్మకమును ఆమె వ్యక్తపరచెను. క్రీస్తు రాకడ యొక్క గొప్ప ఉద్దేశ్యములలో ఒకదానిని ఆమె బహు స్పష్టముగా గ్రహించినట్లు తన మాటలద్వారా వ్యక్తమగుచున్నది.

Bible verse.guide - 2023-02-17T151448.467

 

4:26 ఆ స్త్రీకి ప్రభువిచ్చిన జవాబు ఏమనగా “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను”. కాని K.J.V లోని (he) “ఆయనను” అను మాట మూల గ్రంథములో లేదు. అయితే యీ వచనము స్పష్టముగా అర్థమగుటకు “ఆయనను” అను పదము చేర్చబడినది. ప్రభువుయొక్క మాటలకు ఎంతో ప్రాధాన్యత కలదు. పాత నిబంధనలో దేవుడు తనకు అన్వయించుకొనిన కొన్ని పేర్లలో నొకదానిని ప్రభువు ఈ వచనములో ఉపయోగించెను.

నేను “అనువాడను” నీతో మాటలాడుచున్నాను” లేక మరియొక రీతిగా చూస్తే “నీతో మాటలాడుచున్నవాడు యెహోవాయైయున్నాడు” అని ఆయన చెప్పెను. ఆమె ఎవరికొరకు చూచుచున్నదో ఆమెతో ఎవరు మాటలాడుచున్నారో ఆయనే మెస్సీయా అను ఆశ్చర్యకరమైన సత్యమును ఆయన తెలియజేసెను. ఆయన తానే దేవుడైయున్నాడు. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు.

4:27 సుఖారు నుండి తిరిగివచ్చిన ప్రభువు శిష్యులు ఆయన ఆ స్త్రీతో మాటలాడుట చూచిరి. సమరయురాలైన ఆ స్త్రీతో ఆయన మాటలాడుట చూచి వారు ఆశ్చర్యపడిరి మరియు ఆమె పాపాత్మురాలనికూడ వారు తెలిసికొనియుండిరేమో, అయినను ఆమె నుండి ప్రభువుకు ఏమికావలెననిగాని లేక ఆమెతో ఎందుకు మాటలాడుచున్నావని
ఆ గాని ఆయనను ఎవరు అడుగలేదు.

4:28 ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టెను. ఆమె వేటిద్వారా తన వాంఛలను తీర్చుకొనుచున్నదో వాటికి ఈ కుండ సూచనయైయున్నది. కాని ఆమెకు తృప్తి నిచ్చుటలో అవన్నియు నిష్ప్రయోజనమైనవి. అయితే యిప్పుడు ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తును కనుగొన్నది. ఇంతకుముందు తన జీవితములో ప్రముఖ స్థానము నాక్రమించిన వాటియొక్క అవసరత ఇప్పుడు ఆమెకు లేదు.

ఆమె కుండను విడిచిపెట్టుట మాత్రమేగాక తన ఊరిలోనికి వెళ్ళెను. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షింపబడెనో అప్పుడే జీవజలముల అక్కరలో ఎందరున్నారో వారిని గూర్చి వెంటనే ఆలోచించసాగెను. గొప్ప భక్తుడైన హడ్సన్ టేలర్ ఒకసారి ఈరీతిగా చెప్పెను. కొందరు అపొస్తలులకు వారసులగుటకు ఆశింతురు. నేనైతే సమరయ స్త్రీకి వారసునిగా ఉండనాశించుచున్నాను.

వారు ఆహారము కొరకు ఊరిలోనికి వెళ్ళిరి. కాని ఆమె ఆత్మల నిమిత్తము తన కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళెను. 4:29, 30 ఆమె సాక్ష్యము చాలా సామాన్యమైనదేగాని, దాని ప్రభావము బహు గొప్పది. తాను చేసిన వాటన్నింటిని తనతో చెప్పిన మనుష్యుని చూడరమ్మని ఆ పట్టణస్థులను ఆహ్వానించినది. వారు క్రీస్తు ప్రభువును కనుగొను నిమిత్తము ‘ఈయన క్రీస్తుకాడా’ అని ఆమె చెప్పెను.

ఈయన క్రీస్తు కాడా, అని చెప్పుటలో ప్రభువు విషయములో ఆమె కెట్టి అనుమానము లేదు. ఎందుకనగా తాను క్రీస్తునని ప్రభువు ఆమెకు ముందే తెలియజేసెను. ఆ స్త్రీ ఆ పట్టణస్థులకు సుపరిచితురాలనుట నిస్సందేహము. కాని యిట్టి పాపాత్మురాలైన ఆమె ఒక బహిరంగ స్థలములో నిలిచి, ప్రభువైన యేసుక్రీస్తుకొరకు బహిరంగ సాక్ష్యమిచ్చుట చూడగా వారికి బహు ఆశ్చర్యము కలిగినది.

అందువలననే తమ హృదయములలోని అనుమానమును తీర్చుకొనుటకు వారు ప్రభువును చూడవచ్చిరి. ఆ స్త్రీయొక్క సాక్ష్యము సార్ధకమైనది. జనులు తమ గృహములను, పనులను విడిచిపెట్టి యేసును కనుగొనుటకు వెళ్ళసాగిరి.

దేవుని చిత్తము జరిగించుటలో క్రీస్తుయొక్క ఆనందము (4:31-38) :

4:31 ఇప్పుడు ప్రభువు శిష్యులు తిరిగి వచ్చిరి. వారు భోజనము చేయుమని ఆయనను ప్రేరేపించిరి. కాని మరికొద్ది నిమిషముల క్రిందట జరిగిన సంఘటనను గూర్చి వారికి ఏ మాత్రము తెలియదు. మహిమాస్వరూపియైన ప్రభువుకు సమరయ పట్టణము లేక ప్రజలు పరిచయమైన ఈ చారిత్రాత్మక ఘడియలలో శిష్యులు తమ శరీరమునుగూర్చి మాత్రమేగాని అంతకుమించి ఆలోచించలేకపోయిరి.

4:32 తండ్రిని ఆరాధించువారిని సంపాదించుటయే తనకు ఆహారముగా ప్రభువు ఎంచుకొనెను. ఈ ఆనందముతో పోల్చినప్పుడు, భౌతిక ఆహారము ఆయన దృష్టిలో బహు అప్రధానమైనది. శిష్యులు భోజనము విషయములో ఎంతో ఆసక్తి కనుపరచిరి. గనుకనే ఆహారము కొనుటకు పట్టణములోనికి వెళ్ళిరి. వారు ఆహారము తీసికొని దానితో తిరిగి వచ్చిరి. కాని ప్రభువు ఆత్మలయందు ఆసక్తి కలిగియుండెను. వారి పాపములనుండి స్త్రీ పురుషులను రక్షించి వారికి జీవజలము ననుగ్రహించుటలో ఆయన మరి ఎక్కువ ఆసక్తి కలిగియుండెను. అయితే మన ఆసక్తి దేనియందు ?

4:33 భూసంబంధమైన దృష్టి వారికుండుటను బట్టి, ప్రభువుయొక్క మాటలలోని భావమును గ్రహించుటలో వారు విఫలులైరి. అంతేగాక ఆత్మీయ విజయమునందున్న ఆనంద సంతోషములు శరీర అక్కరలకంటే ఉన్నతమైనవై యున్నవి. ఈ సత్యమును వారు గ్రహించలేకపోయిరి. గనుక ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చియుండవచ్చునని వారు తలంచిరి. ఇప్పుడు మరియొకసారి వారి మనస్సులను భౌతిక విషయములనుండి ఆత్మీయ విషయములవైపు త్రిప్పుటకు ప్రభువు ప్రయత్నిం చెను.

దేవుని చిత్తము నెరవేర్చుటయు, చేయుటకు దేవుడు తనకిచ్చిన పని తుద ముట్టించుటయు తనకు ఆహారమై యున్నదని, ప్రభువు నుడివెను. ఇక్కడ ప్రభువు భోజనము చేయలేదని లేక చేయడని కాదు. కాని దేవుని చిత్తము జరిగించుట ఆయన జీవితముయొక్క ప్రధాన లక్ష్యమైయున్నది.

4.35″ నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా” అని ప్రభువు చెప్పెను. బహుశా ఆ సమయములో రాబోవు కోతకాలమును గూర్చి శిష్యులు ముచ్చటించుచుండిరేమో ! లేక విత్తనము విత్తుటకును కోతకాలమునకు మధ్య నాలుగు నెలల సమయమున్నది అని యూదులలో ఉన్న ఒక సామ్యము కాబోలు.

ఏది ఏమైనను ఒక ఆత్మీయ సత్యమును బోధించుటకు ప్రభువు భౌతిక సత్యమైన కోతను ఉదహరించెను. కోత సమయము ఇంకను బహుదూరములో నున్నదని శిష్యులు తలంచకూడదు. ‘దేవుని కార్యము తదుపరి చేయవచ్చుననెడి తలంపుతో ఆహారమును వస్త్రమును వెదకుటలోనే తమ జీవితములను గడుపుటకు ప్రయత్నించ కూడదు. పొలము తెల్లబారి కోతకు సిద్ధముగా నున్నదని వారు తప్పక గ్రహించవలెను. ఇక్కడ చెప్పబడిన పొలము లోకమును సూచించుచున్నది.

చెడ్డ స్త్రీ - మంచి మనుష్యుడు – Bible Verses Chapter 4

అదే సమయములో, సమరయ పట్టణపు స్త్రీ పురుషుల ఆత్మలనే పంటతో నిండియున్న పొలము మధ్య ఉండి ప్రభువు ఈ మాటలు పలుకుచున్నాడని మనము గమనించవలెను. పంటను కోసి కూర్చవలసిన గొప్పకార్యము వారియెదుటనున్నదని ప్రభువు చెప్పెను గనుక ఆ కార్యముకొరకు బహు త్వరితముగాను, ఆసక్తితోను తమ్మునుతాము అప్పగించుకొన వలెను. కాబట్టి నేటి దినములలోకూడ ప్రభువు “మీ కన్నులెత్తి పొలమును చూడుడి” అని విశ్వాసులకు చెప్పుచున్నాడు.

ప్రపంచముయొక్క గొప్ప అక్కరను గూర్చి కొంత సమయము మనము యోచన చేయుచుండగా నశించుచున్న ఆత్మలను గూర్చిన భారమును దేవుడు మన హృదయమునందు ఉంచునని మనము గ్రహించగలము. అప్పుడు పండిన పంటయొక్క పనలను మోసికొని ఆయన కొరకు తెచ్చుటకు ముందుకు సాగుట మన బాధ్యతయై యున్నది.

4:36 ఈ వచనములో ప్రభువు – వారు ఏ పని నిమిత్తము పిలువబడిరో ఆ పనినిగూర్చి తన శిష్యులకు సూచనలిచ్చుచున్నాడు. కోతవారినిగా ప్రభువు వారిని ఎన్నుకొనెను. ఫలితముగా వారు ఈ లోకములో తగిన జీతము పుచ్చుకొనుటయే గాక, నిత్య జీవార్ధమైన ఫలమునుకూడ సమకూర్చుకొందురు. ప్రస్తుత కాలములో క్రీస్తుకొరకు మనముచేయు పరిచర్యవలన అనేక బహుమానములు కలవు. కాని రాబోవు కాలమందు కోతవారు నమ్మకముగా ప్రకటించిన సువార్త సందేశమువలన రక్షింపబడిన ఆత్మలను పరలోకమందు చూతురు.

అప్పుడీ లోకములో వారు పొందిన బహుమానములవలన వారికి కలిగిన సంతోషముకంటె అధికమైన సంతోషము పొందుదురు. అంతేగాక విత్తువారును, కోయువారును ఆ దినమున పరలోకములో కలసి సంతోషించెదరు. ఈ ప్రకృతి జీవితములో విత్తనముచేయుటకు ముందు భూమి సిద్ధపరచబడవలెను. ఆ తరువాత విత్తనము విత్తవలెను. ఆ పిదప దాని కాలములో పంటకోయబడును.

ఆత్మీయ జీవితములోకూడ యింతే. మొట్టమొదట సువర్త మానము ప్రకటింపబడవలెను. ఆ పిదప ప్రార్థనతో దానికి నీరు కట్టవలెను. కాని, కోతకాలము వచ్చినప్పుడు, ఆ పనిలో పాలుపొందిన వారందరు కలసి ఆనందింతురు.

దేవుని చిత్తము జరిగించుటలో క్రీస్తుయొక్క ఆనందము (4:31-38) :

 

4:37, 38 ఆ దినములో జనులు సామాన్యముగా చెప్పుకొనెడి “విత్తువాడొకడు, కోయువాడొకడు” అను సామెత ఈ సందర్భములో నెరవేరినట్లు ప్రభువు చూచెను. కొంతమంది విశ్వాసులు అనేక సంవత్సరములు సువార్త ప్రకటింతురు. కాని తమ శ్రమకు తగిన ఫలమును వారు వెంటనే చూడలేరు. కొన్ని సంవత్సరములు గతించిన తరువాత మరొకరు ఆ పరిచర్యలో ప్రవేశింతురు. వారి కాలములో అనేక ఆత్మలు ప్రభువుతట్టు తిరుగును.

ఇతరులచేత అంతకుముందే సిద్ధపరచబడిన ప్రాంతములకు ప్రభువు తన శిష్యుల నంపుచున్నాడు. పాత నిబంధన కాలమంతటిలో రాబోవు సువార్త యుగమునుగూర్చియు మెస్సీయ యుగమునుగూర్చియు ప్రవక్తలు ముందుగా ప్రకటించిరి. ఆ తరువాత బాప్తిస్మమిచ్చు యోహానుకూడ ప్రభువుకొరకు జనుల హృదయములను సిద్ధపరచుటకు ప్రభువుకంటె ముందుగా వచ్చెను. ప్రభువు తానే సమరయ పట్టణములో వాక్య విత్తనము విత్తి కోత వారికొరకు పంటను సిద్ధపరచెను.

ఇప్పుడు కోతకు సిద్ధముగానున్న ఆ పొలములోనికి శిష్యులు అడుగిడ బోవుచున్నారు. గనుక అనేకులు క్రీస్తుతట్టు మళ్ళుకొనుట చూచి సంతోషించునప్పుడు, మరొకరి శ్రమలో ప్రవేశించినట్లు వారు గ్రహించవలెనని ప్రభువు వారిని కోరుచున్నాడు. ఒక వ్యక్తియొక్క పరిచర్యద్వారా కేవలము బహుకొద్ది ఆత్మలు మాత్రమే రక్షింపబడును.

అనేకులు రక్షకుని అంగీకరించుటకుముందు అనేక మారులు సువార్త వినియుందురు. గనుక, ఒక వ్యక్తిని క్రీస్తునొద్దకు నడిపించిన వ్యక్తి, ఆశ్చర్యకరమైన ఈ కార్యములో దేవుడు వాడుకొనిన ఏకైక పాత్ర తానే అయియున్నట్లు తన్నుతాను ఏమాత్రము హెచ్చించుకొనకూడదు.

సమరయులలో అనేకులు యేసునందు విశ్వాసముంచిరి (4:39-42) :

4:39 సమరయ స్త్రీ ఇచ్చిన అతి సామాన్యమైన సాక్ష్యము ఫలితముగా ఆమె యొక్క జనులు అనేకులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిరి. తన సాక్ష్యములో ఆమె చెప్పిన విషయము గమనించండి. “నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి.” ఇవి బహుకొద్ది మాటలైనను ఇతర వ్యక్తులను రక్షకుని చెంతకు తెచ్చుటకు అవి చాలు, క్రీస్తుకొరకు ధైర్యముగా, ప్రత్యక్షముగా సాక్ష్యమిచ్చుటలో ఇది మనలో ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకరముగా ఉండును.

4:40 సమరయులు ప్రభువును చేర్చుకొనిన విధానము విశేషమైనది. వారు ప్రభువును ఆశ్చర్యకరుడుగా గుర్తించుటయేగాక, ఆయనను తమయొద్ద ఉండవలెనని ఆహ్వానిం చిరి. ఫలితముగా ప్రభువు వారితో రెండు దినములుండెను. సమరయుల గ్రామమైన ఆ సుఖారు ఎంత ధన్యకరమైనదో గదా. వారు మహిమా స్వరూపియు జీవాధిపతియు నైన ప్రభువును చేర్చుకొని ఆయనకు ఆతిథ్యమిచ్చుటద్వారా ఆయనను ఘనపరచిరి.

 

 

4:41 ఈ రెండు దినములలో ప్రభువు యొక్క మాటలు వినినవారిలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. కొందరు ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యమునుబట్టి విశ్వసించిరి. మరికొందరు ప్రభువు మాటలనుబట్టి విశ్వసించిరి. పాపియైన మానవుని తన చెంతకు తెచ్చుటలో దేవుడు వివిధములైన రీతులను ఉపయోగించును.

4:42 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి “ఇక మీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.” రక్షకుని గూర్చి సమరయులు ఇట్టి స్పష్టమైన సాక్ష్యమిచ్చుట వినుటకు ఆశ్చర్యముగా ఉన్నది.

ఆయననుగూర్చి వారి మనస్సులలో ఎట్టి అనుమానములేదు. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క మాటలనుబట్టిగాక, ప్రభువుయొక్క మాటలనుబట్టి తమ రక్షణ విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగియున్నారు. ప్రభువునుగూర్చి విని ఆయన మాటలయందు విశ్వాసముంచుటను బట్టి ఆయన నిజముగా లోకరక్షకుడైన క్రీస్తని సమరయులు తెలిసికొనిరి.

ఇట్టి జ్ఞానము వారికి పరిశుద్ధాత్మద్వారా మాత్రమే అనుగ్రహించబడెను. మెస్సీయా కేవలము తమకు మాత్రమేనని యూదులు తలంచిరి. కాని క్రీస్తుయొక్క పరిచర్య ఫలము సర్వలోకమునకు చెందినదని సమరయులు గ్రహించిరి.

రెండవ సూచక క్రియ – ప్రధాని కుమారుడు స్వస్థపరచబడుట (4:43-54) :

4:43 ప్రభువు సమరయుల మధ్య రెండు దినములు గడిపిన పిదప గలిలయలోని ఉత్తర భాగమునకు పయనమాయెను.

4:44 ఈ వచనము ఒక సమస్యను చూపించుచున్నది. మరియు ప్రభువు సమరయ నుండి గలిలయ ప్రాంతమునకు వెళ్ళుటకు గల కారణముకూడ తెలియజేయుచున్నది, అదేమనగా, ప్రవక్త స్వదేశములో ఘనత పొందడనునదే. గలిలయ ప్రాంతము తన స్వదేశము.

ప్రభువు నివాసమున్న నజరేతు ఆ గలిలయ ప్రాంతమునకు చెందినది. ఎట్టి పరిస్థితులలోను, ఒక వ్యక్తి తాను ఇతర స్థలములలో ఉన్నప్పటికంటే తన స్వంత గ్రామములో లేక దేశములో ఉన్నప్పుడు ఎక్కువ ఘనత ఏ మాత్రము పొందడనుట సత్యము. ఆ రీతిగను తాను పొందవలసిన ఘనత ప్రభువైన యేసుక్రీస్తు తన స్వజనులవలన ఏ మాత్రము పొందలేదనుట వాస్తవము.

4:45 యెరూషలేములో పండుగ సమయములో యేసుప్రభువు చేసిన కార్యము లన్నింటిని వారు చూచియున్నారు గనుక, ఆయన గలిలయకు వచ్చినప్పుడు ఆ ప్రజలు ప్రేమతో ఆయనను చేర్చుకొనిరి.

ఈ వచనములో గలిలయులు అని చెప్పబడినవారు యూదులేయనుట స్పష్టము. వారు ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళిరి. అక్కడ వారు ప్రభువును, ఆయన చేసిన గొప్ప కార్యములలో కొన్నింటిని చూచియుండిరి. గనుక ఇప్పుడు ఆ ప్రభువునే తమతో ఉంచుకొనుటకు ఇష్టపడుచున్నారు. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడైయున్నాడని గాక, తాను వెళ్ళిన ప్రతి స్థలములో చర్చనీయాంశ ముగా ఉన్నాడు. గనుక వారు ఆయనను చేర్చుకొనిరి.

4:46 ప్రభువు మరొకసారి కానా అను గ్రామమునకు వచ్చుటవలన దానికి ఘనత కలిగినది. ప్రభువు మొదటిసారి ఆ గ్రామమును దర్శించినప్పుడు ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చుటను కొందరు చూచిరి. ఇప్పుడు ఆయన చేయనైయున్న మరొక గొప్ప సూచకక్రియను వారు చూడనైయున్నారు. దాని ప్రభావము కపెర హూము వరకు విస్తరించనైయున్నది.

4:47 పెర్నహూములో ఒక ప్రధానియొక్క కుమారుడు రోగియైయుండెను. నిస్సందేహముగా ఈ ప్రధాని రాజైన హేరోదు చేత నియమింపబడిన యూదుడై యుండెను. ప్రభువు యూదయనుండి గలిలయకు వచ్చుచున్నాడని అతడు వినెను. ఈ సమయములో తన కుమారుని స్వస్థపరచుటకు ప్రభువు సమర్ధుడని అతడు విశ్వసించెను. ఏలయనగా, అతడు ప్రభువు దగ్గరకు వచ్చి చావనైయున్న తన కుమారుని బ్రతికించుమని ఆయనను బ్రతిమాలెను. తన దేశస్థులలో అనేకులకంటే ఇతడు ప్రభువునందు గొప్ప విశ్వాసముంచినట్లు కనిపించుచున్నాడు.

4:48 ఇక్కడ ప్రధానితోనేగాక యూదా ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభువు మాటలాడుచున్నాడు. అదే సమయములో వారు నమ్మకముందు మహత్కార్యములను చూడనాశింతురని చెప్పుచు ఆ జాతియొక్క ప్రధాన లక్షణమును ప్రభువు వారికి జ్ఞాపకము చేయుచున్నాడు. అయితే సహజముగా ఆయన బోధ వినుటద్వారా వారిలో కలుగు విశ్వాసమునుబట్టి ఆయన సంతోషించువాడేగాని మహత్కార్యము చూచుట ద్వారా కలుగు విశ్వాసమునందు ప్రభువు సంతోషించడు. లేక అద్భుతములు చూచి నమ్ముటకంటె ఆయన మాట విని నమ్ముట ఆయనకు ఘనతయైయున్నది.

విశ్వసించక మునుపు అద్భుతములను చూడవలెనని ఆశించుట మానవ లక్షణమై యున్నది. కాని మొదట మనము విశ్వసించవలెను ఆ పిమ్మట అద్భుతములు చూచెదమని ప్రభువు మనకు బోధించుచున్నాడు. ఈ వచనములో చెప్పబడిన సూచకక్రియలు, అద్భుతములు ఈ రెండు పదములు ఆశ్చర్యకార్యములనే సూచించుచున్నవి. సూచకక్రియలు అనగా లోతైన భావము కలిగియున్న మహత్కార్యములే. అద్భుతకార్యములనగా, మానవులను ఆశ్చర్యపరచునట్టి పరలోకపు లక్షణములు కలిగియున్న మహత్కార్యములు.

4:49 ఆ ప్రధాని స్థిర విశ్వాసముతో యేసుప్రభువు తన కుమారుని బాగుచేయునని నమ్మి, ఆయన తన కుమారుని దర్శించవలెనని ఎంతగానో బ్రతిమాలెను. ఒక విధముగా చూచినచో, అతని విశ్వాసము లోపభూయిష్టమైయున్నది. ఎట్లనగా ప్రభువు తన కుమారుని స్వస్థపరచకమునుపు ఆయన ఆ బాలుని మంచము ప్రక్కనే ఉండ వలెనని తలంచెను. అయినను ఇందుకు ప్రభువు అతనిని ఎంతమాత్రము గద్దించలేదు గాని, అతడు కనుపరచిన విశ్వాస పరిమాణమునుబట్టి అతనికి బహుమానమును అనుగ్రహించెను.

రెండవ సూచక క్రియ - ప్రధాని కుమారుడు స్వస్థపరచబడుట (4:43-54) :

4:50 ఈ వచనములో అంతకంతకు వృద్ధియగుచున్న ఆ ప్రధానియొక్క విశ్వాస మును మనము చూచుచున్నాము. అతడు తనకున్న అల్ప విశ్వాసమును సాధకము చేయగా, ప్రభువు అతని విశ్వాసమును వృద్ధిచేసెను. ఆ పిదప “నీ కుమారుడు బ్రతికియున్నాడు” అను వాగ్దానమనుగ్రహించి అతనిని యింటికి పంపించెను. ఆ వాగ్దాన ప్రకారము తన కుమారుడు స్వస్థచిత్తుడాయెను. ఎట్టి మహత్కార్యమును ప్రత్యక్షముగా చూడకుండగనే ఆ ప్రధాని కేవలము ప్రభువైన యేసుయొక్క మాటల యందు నమ్మికయుంచి తన యింటికి బయలుదేరెను.

4:51 క్రియారూపకమైన విశ్వాసమంటే ఇదే! ప్రధాని తన యింటికి సమీపించు చుండగా తన కుమారుడు బాగుపడెనను సంతోషకరమైన వర్తమానముతో అతని సేవకులు ఎదురు వెళ్ళిరి. ఆ వర్తమానము వినిన ప్రధాని ఏ మాత్రము విస్మయము చెందలేదు. ఏలయనగా అతడు ప్రభువుయొక్క వాగ్దానమును నమ్మెను. ఆ నమ్మిక గలవాడై ఆ వాగ్దానముయొక్క నెరవేర్పును ప్రత్యక్షముగా ఇప్పుడు చూచుచున్నాడు

. 4:52,53 యేసుక్రీస్తుయొక్క వాగ్దానమును అతడు నమ్మెనుగాని వెంటనే స్వస్థత కలుగునని అతడు నమ్మలేదు. తన కుమారుడు స్వస్థత పొందిన సమయమును అతడు తన సేవకుల నడిగి తెలిసికొనెను. స్వస్థత నెమ్మది నెమ్మదిగా కాక, వెంటనే కలిగెనని వారి జవాబు తెలియజేయుచున్నది. అద్భుతమైన సూచిక క్రియను గూర్చి లేశమంత అనుమానముకూడ లేదు. గత దినము ఒంటిగంటకు కానాలో ప్రభువు నీ కుమారుడు బ్రతికియున్నాడని ప్రధానితో చెప్పెను.

ఆ సమయములో కపెర హూములో అతని కుమారుడు స్వస్థపడెను. మరియు జ్వరము అతనిని విడిచిపోయెను. ఒక అద్భుత కార్యము జరిగించుటకు లేక ప్రార్థనకు జవాబిచ్చుటకు ప్రభువైన యేసు శరీరరీతిగా ఆ స్థలములో ఉండవలసిన అవసరత లేదని దీనిద్వారా ఆ ప్రధాని నేర్చుకొనెను.

ప్రతి విశ్వాసి యొక్క ప్రార్థన జీవితములో ఈ సత్యము ప్రోత్సాహకరముగా ఉండవలెను. మన విన్నపములను ఆలకించు బలమైన దేవుడు మనకున్నాడు. మరియు ఆయన తన సంకల్పములను ప్రపంచములో ఏ స్థలమందైనను, ఏ సమయమందైనను నెరవేర్చ శక్తిగల దేవుడు. తన కుటుంబములో ప్రభువుచేసిన మేలునుబట్టి ఆ ప్రధానియు అతని యింటి వారందరును ప్రభువునందు విశ్వాసముంచిరి.

క్రొత్త నిబంధనలో ఇటువంటి వచనములద్వారా మనకు ఒక సత్యము తేటపరచబడుచున్నది. అదేమనగా, వ్యక్తిగా మాత్రమేగాక ఇల్లంతయు అనగా ఇంటిలోనివారందరు క్రీస్తునందు ఐక్యపరచ బడుట దేవుని అభీష్టమైయున్నది.

4:54 ప్రధానియొక్క కుమారుని స్వస్థపరచుటయనునది అప్పటివరకు ప్రభువు యొక్క పరిచర్యయంతటిలో రెండవ సూచక క్రియకాదు. ప్రభువు యూదయనుండి వచ్చిన తరువాత గలిలయలో ఆయన చేసిన సూచక క్రియలలో ఇది రెండవది.

Leave a Comment