కొత్త జన్మ – Bible Verses Chapter 3 in Telugu

మూడవ అధ్యాయము

కొత్త జన్మ

నూతన జన్మను గూర్చి యేసు నీకొదేముకు బోధించుట (3:1-21) :

3:1 ఇప్పటి వరకు మనము ముచ్చటించిన సంగతులకంటే నీకొదేము వృత్తాంతము వేరైనది. యూదులలో అనేకులు ఆయనను విశ్వసించినట్లు చెప్పినను, వారి విశ్వాసము నిజమైనది కాదని ఆయన ఎరుగును. కాని నీకొదేము ఇందుకు భిన్నమైనవాడు. సత్యమును తెలిసికొనవలెననెడి ఆకాంక్ష అతనిలో ఉన్నదని ప్రభువు గ్రహించెను. మొదటి వచనము “కాని” యను మాటతో ప్రారంభించబడవలెను. “యూదుల అధికారి యైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను.

” అతడు తన ప్రజలమధ్య బోధకుడుగా గుర్తింపు పొందెను. బహుశ అతడు ప్రభువు నొద్దకు ఉపదేశము పొందుటకు వచ్చెను. ఆ ఉపదేశమును తన బోధతో కలిపి యూదులకు చెప్పవలెనను ఉద్దేశముతో అతడు వచ్చియుండవచ్చును.

3:2 నీకొదేము రాత్రి సమయములో ప్రభువు దగ్గరకు ఎందుకు వచ్చెనో బైబిలు మనకు చెప్పుటలేదు. కాని దీనికి సరియైన వివరణ ఏమనగా, యూదులలో అనేకులు ప్రభువును అంగీకరించక పోవుటనుబట్టి, ప్రభువునొద్దకు వెళ్ళుట ఇతరులు చూచుట ద్వారా ఇబ్బందులు కలుగునని అతడు తలంచెను. కాని మెట్టుకు … అతడు ప్రభువు నొద్దకు వచ్చెను. ప్రభువు చేసినట్టి అద్భుతములు దేవుని సహాయము లేనిదే ఏ వ్యక్తి చేయలేడని గ్రహించినప్పుడే ఆయన దేవునియొద్దనుండి పంపబడిన బోధకుడని నీకొదేము గ్రహించెను.

Read and Learn More Telugu Bible Verses

అతడు లేఖనములను బాగుగా ఎరిగినప్పటికిని సశరీరుడుగా ప్రత్యక్షమైన దేవుడని అతడు గుర్తించలేదు. నేడు యేసు ఒక గొప్ప వ్యక్తి, అద్భుతమైన బోధకుడు, గొప్ప మాదిరిగల వ్యక్తియని చెప్పెడి అనేకులవలె నీకొదేము ఉన్నాడు. ఇట్టి వ్యాఖ్యానములన్నియు సత్యదూరములే. యేసు వర్తమాన భూత భవిష్యత్కాలము లలో ఉన్న దేవుడు.

3:3 నీకొదేము చెప్పినదానికి, ప్రభువు ఇచ్చిన ప్రత్యుత్తరమునకు ఎటువంటి సంబంధమున్నట్లు మొదట మనకు కనిపించదు. కాని నిదానించి గమనించిన యెడల, “నీకొదేమూ, బోధకొరకు నీవు నాదగ్గరకు వచ్చితివి; నీకు నిజముగా అవసరమైనది ‘క్రొత్తజన్మ,’ నీ ప్రారంభము అక్కడనుండియే. నీవు పైనుండి జన్మించవలెను. లేనియెడల నీవు దేవుని రాజ్యమును చూడలేవు” అని ప్రభువు చెప్పినట్లు గ్రహించగలము.

ఒక యూదునిగా నీకొదేముకూడ మెస్సీయ రాకకొరకు ఎదురుచూచుచుండెను. అంతేకాదు ఆయనవచ్చి రోమీయుల చెఱనుండి ఇశ్రాయేలీయులను విడిపించునని ఆశించుచుండెను. మెస్సీయ వచ్చి శత్రువులను సంహరించి, ఈ భూమిమీద తన రాజ్యమును స్థాపించి, జనములన్నింటిలో ఇశ్రాయేలు జనాంగము ప్రధానమైనదిగా చేయబడు ఆ సమయముకొరకు నీకొదేము ఎంత ఆశతో ఎదురు చూచుచుండెను.

అయితే ఈ రాజ్యములో ప్రవేశించుటకు ఒకడు క్రొత్తగా జన్మించవలెనని ప్రభువు చెప్పెను. ఈ భౌతిక జీవమునకు మొదటి జన్మ ఎంత అవసరమో, ఆ విధముగనే, దైవికమైన జీవమునకు రెండవ జన్మ అంత అవసరమైయున్నది. (ఇక్కడ “క్రొత్త జన్మ” అనుదానికి “పైనుండి కలుగు జన్మ” అను అర్థముకూడ కలదు). దీనిని మరొకరీతిగా చెప్పవచ్చును: ఎవరి జీవితములు పూర్తిగా మార్పు చెందినవో వారు మాత్రమే క్రీస్తురాజ్యములో ప్రవేశించగలరు.

ఆయన రాజ్యము నీతి రాజ్యము. ఆయన పరిపాలన నీతి పరిపాలన గనుక పాలితులుకూడ నీతిమంతులై యుండవలెను. అంతేగాని తమ పాపములోనే జీవించువారిని ఆయన పాలించువాడుకాడు.

3:4ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు అర్థము చేసికొనుట మనుష్యులకు ఎంత కష్టమో మరొకసారి ఈ వచనములో చూడగలము. నీకొదేము ప్రతి విషయము అక్షరార్ధముగానే గైకొనుచుండెను. ముసలివాడైన ఒక వ్యక్తి ఎట్లు క్రొత్త జన్మ పొంద గలడో నీకొదేముకు అర్థము కాలేదు. ఒక వ్యక్తి తిరిగి జన్మించు నిమిత్తము తల్లి గర్భములో ప్రవేశించుటలో గల అసాధ్యమును గూర్చి బహులోతుగా ఆలోచించెను (1 కొరింథీ 2:14).

3:5 ఒకడు నీటిద్వారాను, ఆత్మద్వారాను జన్మించవలెననియు, లేనియెడల అతడు దేవుని రాజ్యములో ప్రవేశింప లేడనియు ప్రభువు నీకొదేముతో మరికొంత వివరముగా చెప్పెను.
ఆ విధముగా చెప్పుటలో ప్రభువుయొక్క భావమేమి? రక్షణ పొందుటకు బాప్తిస్మము అవసరమని ప్రభువు చెప్పినట్లు నేడు అనేకులు తలంచుచున్నారు. కాని అటువంటి బోధ బైబిలంతటికి విరుద్ధమైనది. అయితే ఒకడు ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసముద్వారా మాత్రమే రక్షణ పొందగలడని దేవుని వాక్యములో మనము చదువుచున్నాము. బాప్తిస్మము ఒక వ్యక్తి రక్షణ పొందుటకు సాధనము కాదుగాని, రక్షింపబడిన వారికి మాత్రమే అది నియమింపబడినది.

ఈ వచనములో చెప్పబడిన నీరు దేవుని వాక్యమును సూచించుచున్నదని కొందరు చెప్పుచున్నారు. ఎఫెసీ 5:25, 26 లో చెప్పబడిన నీరు దేవుని వాక్యముతో సన్నిహిత సంబంధము కలిగియున్నది. మరియు 1 పేతురు 1:23 లో కూడ నూతనజన్మ దేవుని వాక్యముద్వారా కలుగునని వ్రాయబడినది. గనుక ఈ వచనములో చెప్పబడిన నీరు దేవుని వాక్యమైన బైబిలును సూచించుచున్నది. అనగా, లేఖనములకు వేరుగా రక్షణ లేనేలేదు. గనుక ఒక పాపి దేవుని వాక్యములో పొందుపరచియున్న వర్త మానమును క్రొత్తజన్మ పొందుటకు ముందు అంగీకరించవలెను.

కొత్త జన్మ నూతన జన్మను గూర్చి యేసు నీకొదేముకు బోధించుట (3:1-21) :

కాని నీరు పరిశుద్ధాత్మనుకూడ సూచించుచున్నది. యోహాను సువార్త 7:38,39లో యేసుక్రీస్తు జీవజల నదులనుగూర్చి మాటలాడెను. మరియు ప్రభువైన యేసుక్రీస్తు “నీరు” అని తన బోధలో ఎక్కడ ఉపయోగించినను అది పరిశుద్ధాత్మనే సూచించుచు చెప్పెను. ఏడవ అధ్యాయములో “నీరు” పరిశుద్ధాత్మయైనయెడల, మూడవ అధ్యాయ ములో ఆ అర్ధమే ఎందుకుండదు? ఈ వచనములో “నీళ్ళను” ఆత్మ యను భావముతో రెండు పర్యాయములు చెప్పబడినట్లు కనిపించుచున్నది.

కాని శారీరక జన్మ కలిగి యుండుట చాలదు. ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశించవలెనంటే ఆత్మీయ జన్మకూడ కావలెను. ఒకడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు, దేవుని ఆత్మ కార్యముద్వారా ఈ ఆత్మీయ జన్మ కలుగుచున్నది. “ఆత్మ మూలముగా జన్మించవలెను” అనుమాట 6, 8 వచనములలో రెండు పర్యాయములు మనకు కనిపించుచున్నది. గనుక ఈ వ్యాఖ్యానము సరియైనదిగా మనము గమనించగలము.

3:6 అదే రీతిగా, నీకొదేము రెండవసారి తల్లి గర్భములో ప్రవేశించి, మరల జన్మించినను అతనియందున్న పాపస్వభావము సరిచేయబడనేరదు “శరీరమూలముగా పుట్టినది శరీరమును” అని ఈ వచనములో చెప్పబడిన మాటలు – “మానవ మాత్రులకు పుట్టిన బిడ్డలు పాపములో పుట్టినవారై నిరీక్షణాధార రహితులును, నిస్సహాయులునై తమ్మును తాము రక్షించుకొనలేని స్థితిలో ఉన్నారు” అను భావమును తెలియజేయు చున్నవి. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మరుక్షణమే ఆత్మజన్మ కలుగుచున్నది. ఒక వ్యక్తి ఆత్మద్వారా తిరిగి జన్మించినప్పుడు అతడు నూతన స్వభావ మునుపొంది, దేవుని రాజ్యమునకు అర్హునిగా చేయబడుచున్నాడు.

3:7 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధకు నీకొదేము ఆశ్చర్యపడనవసరము లేదు. కాని ఒక వ్యక్తి తప్పక తిరిగి జన్మించవలెనని అతడు గ్రహించవలెను. అంతేగాక పతనమైన స్థితిలోనున్న మానవ స్వభావమును సరిచేసికొనుటలో మానవుడు కేవలము బలహీనుడని అతడు గ్రహించవలెను. మరి ముఖ్యముగా, ఒక వ్యక్తి దేవుని రాజ్య నివాసిగా యుండుటకు, అతడు తప్పక పరిశుద్ధుడును, పవిత్రుడును మరియు ఆత్మాను సారియై యుండవలెనని నీకొదేము తప్పక గ్రహించవలెను.

3:8 ఆత్మీయ సంగతులను వివరించుటకు ప్రభువైన యేసు అనేక సందర్భములలో ప్రకృతినే ఉపయోగించెను. గాలి తనకిష్టమైన తావులకు వీచుననియు, మనిషి దాని శబ్దమును మాత్రము వినునుగాని, అది ఎక్కడనుండి వచ్చెనో, ఎక్కడకి వెళ్ళుచున్నదో అతడు గ్రహించలేడని ప్రభువు నీకొదేముకు జ్ఞాపకము చేసెను. అదే రీతిగా క్రొత్తజన్మ గాలిని పోలియున్నది. క్రొత్తజన్మ దేవుని చిత్తప్రకారము కలుగదు. అంతేగాక అది మానవుని స్వాధీనములో లేదు.

మరియు క్రొత్తజన్మ అదృశ్యమైనది (Invisible) అనగా దీనిని బాహ్యనేత్రములతో చూడలేముగాని, దాని ఫలితములను చూడగలము. కనుక ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు అతనిలో ఒక మార్పు కలుగును. ఇంతకుముందు తాను ప్రేమించిన చెడ్డ సంగతులన్నింటిని ఇప్పుడు అతడు ద్వేషించును. అంతేగాక ఇంతకుముందు తాను తృణీకరించిన దేవుని సంగతులన్నియు ఇప్పుడు తనకు ప్రియ మైనవిగా మారిపోవును. మరియు ఒకడు గాలినిగూర్చి ఏవిధముగా పూర్తిగా గ్రహించ లేడో, ఆ విధముగానే దేవుని ఆత్మయొక్క అద్భుత కార్యమైన క్రొత్తజన్మను గూర్చికూడ పూర్తిగా గ్రహించలేడు. అంతేగాక గాలినివలె క్రొత్తజన్మ ముందుగా ప్రకటింప వీలుకానిది. అది ఎప్పుడు ఎక్కడ సంభవించునో తెలుపుట కూడ అసాధ్యము.

3:9 దైవిక విషయములతో సంబంధము కలిగియుండుటలో ప్రకృతి సిద్ధమైన మనస్సుకుగల అసమర్ధతను గూర్చి నీకొదేము మరలా ఈ వచనములో వివరించు చున్నాడు. క్రొత్త జన్మ ఆత్మ సంబంధమైనది కాక, కేవలము ప్రకృతి సంబంధమైన సంభవమనియు లేక భౌతిక సంబంధమైనదనియు నీకొదేము ఇంకను తలంచుచున్నా డని చెప్పుటలో ఎట్టి అనుమానము లేదు. అందుకే అతడు “ఈ సంగతులు ఏలాగు సాధ్యము” అని ప్రభువును ప్రశ్నించుచున్నాడు.

3:10,11 అందుకు ప్రభువు ఇశ్రాయేలీయులకు బోధకుడైన నీకొదేము ఈ సంగతులను తప్పక తెలిసికొనవలెనని తెలియజేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్యస్థాపనకు తిరిగి ఈ భూమి మీదకి వచ్చునప్పుడు ఆయన మొదట తన శత్రువులకు తీర్పు తీర్చి, ఆ పిదప తనకు విరోధమైన ప్రతిదానిని ఆయన నాశనము చేయునని పాత నిబంధన లేఖనములు స్పష్టముగా మనకు బోధించుచున్నవి. అయితే ఎవరు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుదురో వారు మాత్రమే ఆ రాజ్యములో ప్రవేశించుదురు. పదకొండవ వచనములో ప్రభువు తన బోధయొక్క నిశ్చయతను గూర్చియు, ఆ బోధపట్ల మానవునికిగల విశ్వాసమును గూర్చియు నొక్కి చెప్పుచున్నాడు.

ఈ సత్యమును ఆయన నిత్యత్వములోనే ఎరిగి యుండెను గనుక, తాను వినినట్టియు, చూచినట్టియునైన సంగతులనే బోధించెను. కాని నీకొదేము, ఆయన కాలములో నున్న యూదులలోని అనేకులు ఆయన సాక్ష్యమును విశ్వసించుటకు తిరస్కరించిరి. 3:12 ఈ వచనములో ప్రభువు చెప్పిన భూ సంబంధమైన విషయములేవి? అవేవనగా, ఆయనయొక్క భూలోక రాజ్యమును గూర్చిన విషయములే.

పాత నిబంధన లేఖనముల విద్యార్థిగా – ఒకానొక దినము మెస్సీయ ఈ లోకమునకు వచ్చి యెరూషలేము ముఖ్యపట్టణముగా ఈ లోకములో తన రాజ్యమును స్థాపించునని ఎరుగును. కాని ఈ రాజ్యములో ప్రవేశించుటకు క్రొత్తజన్మ అవసరమను సత్యమును అతడు గ్రహించలేకపోయెను. అట్లయితే ప్రభువు చెప్పిన పరసంబంధమైన విషయములేవి? ఒక వ్యక్తి ఈ బోధించెను. క్రొత్తజన్మను ఏ విధముగా పొందగలడో ఆ సత్యములను గూర్చి క్రింది వచనములలో

3:13 పరలోక విషయములను గూర్చి మాటలాడుటకు ఒకే వ్యక్తి సరిపోయినవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని యొద్దనుండి పంపబడిన మానవమాత్రు డైన బోధకుడే కాదుకాని, నిత్యత్వమంతటిలో తండ్రియొద్ద నున్నవాడు ఆయనే ఈ లోకమునకు దిగివచ్చెను. “పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు” అని ప్రభువు చెప్పినప్పుడు – పాత నిబంధన భక్తులైన హనోకు, ఏలీయాలు పరలోకమునకు ఎక్కిపోలేదని కాదుగాని, తనవలె ఏ మానవునికి దేవుని సన్నిధిలో ప్రవేశము లేదని ఆయన భావము.

ఆయన పరలోకమునుండి భువికి దిగివచ్చినవాడు గనుక దేవుని నివాసస్థలమైన ఆ పరలోకమునకు విశేషమైన రీతిగా ఆయన మాత్రమే ఎక్కి వెళ్ళ గలడు. ఆయన ఈ లోకములో ఉండి నీకొదేముతో మాటలాడుచున్నప్పుడు సహితము తాను పరలోకములో నున్నట్లు చెప్పెను. అదెట్లు? ఎట్లనగా, దేవునిగా ప్రభువు ఒకే సమయములో అన్ని స్థలములలో ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి (He is Omni-Present).

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

3:14 ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్తజన్మ అవసరమని నీకొదేముకు ఇంతకు ముందే నొక్కి చెప్పెను. అయితే క్రొత్తజన్మ ఎట్లు కలుగును? పాపపు శిక్షను ప్రతి మానవుడు తప్పక పొందవలెను. పాపియైన మానవుడెవడును పరలోకమునకు వెళ్ళలేడు. అరణ్యములో ఇశ్రాయేలీయులు పాముకాటు తినినప్పుడు మోషే ఆ అరణ్యములో ఒక యిత్తడి సర్పమును ఒక స్థంభముపై ఏలాగు ఎత్తైనో, ఆ విధముగనే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను (సంఖ్యా. 21:4-9 చదవండి).

మోషే కాలములో చేసిన అనేకమంది ఇశ్రాయేలీయులు సర్పపుకాటు తిని మరణించిరి. అయితే ఆ బాధననుభవించినవారు పశ్చాత్తాపపడి ప్రభువుకు మొఱ్ఱపెట్టినప్పుడు ఒక యిత్తడి సర్పమును రూపించి, ఒక స్థంభముపై ఎత్తిపెట్టవలెనని ఆయన మోషేకు ఆజ్ఞాపించెను సర్పముకాటు తినిన ప్రతివాడు దానిని నిదానించి చూచి ఆశ్చర్యకరమైన స్వస్థత పొందెను. క్రొత్తజన్మ ఎట్లు కలుగునో వివరించుటకు ప్రభువు ఈ సాదృశ్యమును గుర్తుచేయుచున్నాడు.

స్త్రీ పురుషులందరు పాపమనే సర్పపుకాటుతిని నిత్యమరణమను శిక్షక్రిందనున్నారు. ఇత్తడి సర్పము ప్రభువైన యేసుక్రీస్తుకు పటముగానున్నది. బైబిలు గ్రంథములో ఇత్తడి తీర్పును సూచించుచున్నది. ప్రభువైన యేసు పాపరహితుడు గనుక ఎంతమాత్రము శిక్షకు పాత్రుడు కాడు. కాని ఆయన మన స్థానము వహించి, మనము పొందవలసిన శిక్షను తాను భరించెను. సర్పము ఎత్తబడిన స్థంభము మన ప్రభువు వ్రేలాడిన కలువరి సిలువను సూచించుచున్నది. గనుక విశ్వాసముతో ఆయన తట్టు చూచుట ద్వారా మనము రక్షింపబడియున్నాము.

3:15 మనము ఆయనయందు దేవుని నీతియగునట్లు పాపమెరుగని ప్రభువైన యేసు మన నిమిత్తము పాపముగా చేయబడెను. గనుక ప్రభువైన యేసునందు ఎందరు విశ్వాసముంచుదురో వారు నిత్యజీవమను వరమును ఉచితముగా పొందెదరు.

3:16 బైబిలంతటిలో బాగుగా పరిచయమున్న వచనములలో ఈ వచనము మొదటిది. ఎందుకనగా, ఈ వచనములో సువార్త బహు స్పష్టముగాను, బహు సూక్ష్మముగాను చెప్పబడెను. క్రొత్త జన్మను పొందు విధమును గూర్చి ప్రభువు నీకొదేముతో చెప్పిన విషయము సంగ్రహపరచబడియున్నది. ఈ వచనములో “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” అని చదువుచున్నాము. ఇక్కడ “లోకము” అనగా సమస్త మానవకోటియని అర్థము.

దేవుడు మానవుని పాపములను గాని, లేక లోకములోనున్న దుష్టవిధానమునుగాని ప్రేమించుటలేదు. కాని ఆయన మానవులను ప్రేమించి, ఎవ్వరు నశించగూడదని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. ఆయన తన అద్వితీయ కుమారుని మనకొరకు అనుగ్రహించుటద్వారా మనపట్ల ఆయనకుగల అపారమైన ప్రేమను వెల్లడిచేసియున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వంటి కుమారుడు ఆయనకెవరును లేరు.

తిరుగుబాటు స్వభావముగల మానవజాతి కొరకు తన అద్వితీయ కుమారుని అనుగ్ర హించుటలో ఆయనయొక్క అనంతమైన ప్రేమ ఈ వచనములో వివరింపబడినది. అంటే ప్రతి ఒక్కరు రక్షింపబడిరని భావము కాదు. కాని, ఒక వ్యక్తి క్రీస్తు తనకొరకు జరిగించిన కార్యమునందు విశ్వాసముంచవలెను. అప్పుడు దేవుడు అతనికి నిత్యజీవ మిచ్చును. గనుకనే ఈ వచనములో ఆయనయందు విశ్వాసముంచువారు నశింపరను మాటలు చేర్చబడినవి. అవును, ఎవ్వరును నశించిపోనవసరములేదు. అందరు రక్షణ పొందునట్లు ఒక మార్గము ఏర్పాటుచేయబడినది. గనుక వారు చేయవలసిన కార్య మేమనగా ప్రభువైన యేసుక్రీస్తును తమ ప్రభువుగాను, రక్షకునిగాను అంగీకరించ వలెను. అట్లుచేసిన ప్రతి వాడు నిత్యజీవమును వరముగా కలిగియున్నాడు.

3:17 దేవుడు కఠినుడును నిర్దయుడును కాదు. మానవాళిపై తన ఉగ్రతను కురిపించుటకు త్వరపడువాడు కాదు. కాని వారిపట్ల ఆయన దయార్దహృదయము కలిగియున్నాడు. గనుక మానవులను రక్షించుటకు ఆయన ఎంతో మూల్యము చెల్లిం చెను. లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన తన కుమారుని పంపగలడు కాని, దానికి బదులు లోకము ఆయనద్వారా రక్షణ పొందునట్లు శ్రమపడి తన రక్తము కార్చి మరణించుటకు ఆయన తన కుమారుని పంపెను. కలువరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన కార్యము ఎంతో విలువైనది. అనగా, ఆ కార్యము ప్రతి స్థలములో తన్ను అంగీకరించు పాపులనందరిని రక్షింప గలిగినంత అమూల్యమైనది.

కొత్త జన్మ – Bible Verses Chapter 3

3:18 మానవులలో సహజముగా విశ్వాసులు అవిశ్వాసులను రెండు తరగతులు కలవు. మన నిత్యత్వపు గతి దేవుని కుమారునిపట్ల మనకుగల వైఖరినిబట్టి నిర్ణయింప బడియున్నది. రక్షకునియందు విశ్వాసముంచువాడు తీర్పు తీర్చబడడు గాని, ఆయన యందు విశ్వాసముంచువానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. ప్రభువైన యేసు రక్షణ కార్యమును సంపూర్తి చేసెను. అయితే యిప్పుడు ఆయనను అంగీకరించుట లేక నిరాకరించుట ప్రతి వ్యక్తి నిర్ణయమునకు వదిలివేయబడినది.

కాని ఇట్టి ప్రేమపూర్వకమైన వరమును తృణీకరించుట బహు భయంకరము. ఒక వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసముంచని యెడల దేవుడు వానికి శిక్ష విధించుట తప్ప మరేమియు చేయలేడు. “ఆయన నామమందు” విశ్వాసముంచుట “ఆయనయందు” విశ్వాస ముంచుటయే. బైబిలు గ్రంథములో చెప్పబడిన పేరు ఒక వ్యక్తిని సూచించుచున్నది. నీవు ఆయన నామమును విశ్వసించుట ఆయనను విశ్వసించుటయే.

3:19 లోకములోనికి వచ్చిన వెలుగు యేసుక్రీస్తే. ఆయన పాపరహితమై నిష్కళంక మైన దేవుని గొఱ్ఱపిల్ల. సర్వలోక పాపముల కొరకు ఆయన చనిపోయెను. అందుకు మానవులు ఆయనను ప్రేమించారా? లేదు. వారు ఆయనను అవమానపరచిరి. అంతేకాదు. ఆయనను తమ రక్షకునిగా కలిగియుండుటకంటె తమ పాపములనే మిన్నగా ఎంచిరి. గనుక వారు ఆయనను తిరస్కరించిరి. ప్రాకెడు జీవులు వెలుగు వచ్చిన తోడనే ఎట్లు పారిపోవునో, అట్లే పాపులైన మానవులు క్రీస్తు సన్నిధినుండి
పారిపోవుదురు.

3:20 సహజముగా పాపమును ప్రేమించువారు వెలుగును ద్వేషింతురు. ఎందు కనగా, వెలుగు వారి పాపస్థితిని బయలుపరచును. ప్రభువైన యేసు ఈ లోకములో ఉన్నప్పుడు పాపులైన మానవులు ఆయన సన్నిధి వారిమధ్య ఉండుటను బట్టి బహు సంకటపడిరి. ఎందుకనగా ఆయన తన పరిశుద్ధతద్వారా వారి భయంకరస్థితిని బయలు పరచెను. ఒక కర్రయొక్క వంకరతనమును తెలియజేయుటకు దాని ప్రక్కనే ఒక తిన్ననికర్ర నుంచితే చాలుగదా!

3:21 ఆలాగుననే ప్రభువైన యేసు పరిపూర్ణుడైన మానవునిగా ఈ లోకమునకు వచ్చి, ఇతర మానవులందరి వంకరతనమును తన పరిపూర్ణత ద్వారా బయలుపరచెను. ఒక వ్యక్తి దేవుని యెదుట నిజముగా సత్యవర్తనుడైయున్న యెడల, అతడు వెలుగైయున్న క్రీస్తునొద్దకు వచ్చి తన అయోగ్యతను, తన పాపస్థితిని గుర్తెరిగి రక్షకునియందు విశ్వాసముంచును. ఈ విధముగా ఒక వ్యక్తి క్రీస్తునందలి విశ్వాసముద్వారా తిరిగి జన్మించును.

యూదయ ప్రాంతములో
బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

3:22 యెరూషలేములో ప్రభువుయొక్క సాక్ష్యమును గూర్చి ముందు వచనములలో వివరించబడినది. ఇరవై రెండవ వచనమునుండి ఈ అధ్యాయము ఆఖరి వరకు యూదయలో ప్రభువుయొక్క పరిచర్యను గూర్చి చదువుచున్నాము. ఈ ప్రాంతములో ప్రభువు రక్షణను గూర్చిన శుభవర్తమానమును ప్రకటించుచుండెననుటలో ఎట్టి సంశయము లేదు. మనుష్యులు వెలుగునొద్దకు వచ్చుటను బట్టి బాప్తిస్మము పొందిరి. అయితే ఈ వచనములో ప్రభువు తానే బాప్తిస్మమిచ్చినట్లు చూడగలముగాని, 4:2లో శిష్యులు బాప్తిస్మమిచ్చినట్లు నేర్చుకొనుచున్నాము.

3:23 యోహానని ఈ వచనములో చెప్పబడిన వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహానే. అతడు యూదయ పరిసరప్రాంతములో మారుమనస్సును గూర్చి ప్రకటించుచుండెను. మరియు మెస్సీయా రాక కొరకు సిద్ధబాటు కలిగి మారుమనస్సు పొంద ఇష్టపడు వారికందరికి అతడు బాప్తిస్మమిచ్చుచుండెను. “ఐనోను” అను స్థలములో నీరు విస్తార ముగా నున్నందున అక్కడ యోహాను బాప్తిస్మమిచ్చుచుండెను. అయితే అతడు ముంచడము ద్వారా బాప్తిస్మమిచ్చెనని మనము పూర్తిగా ఋజువు చేయలేముగాని, అతడు ఆ విధముగనే ఇచ్చియుండ వచ్చునని మనము గట్టిగా భావించవచ్చును. ఏలయనగా, అతడు కేవలము చిలకరింపుద్వారా బాప్తిస్మమిచ్చి యున్నయెడల అంత విస్తారమైన నీరు అవసరము లేదు.

3:24 యోహాను తన పరిచర్యను ఇంకను కొనసాగించుచుండెననియు, నమ్మకమైన తన సాక్ష్యమునుబట్టి భక్తిగల యూదులనేకులు స్పందించుచున్నారనియు ఈ వచనము మనకు వివరించుచున్నది. సమీప భవిష్యత్తులో యోహాను చెరసాలలో వేయబడి శిరచ్ఛేదనము చేయబడనై యున్నాడు. కాని ఈ కొద్ది సమయములోనే తనకప్పగించిన పనిని శ్రద్ధతో నెరవేర్చుచున్నాడు.

3:25 శుద్ధీకరణాచరమునుగూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెనని ఈ వచనము స్పష్టపరచుచున్నది. “శుద్ధీకరణము” అను పదము బాప్తిస్మమును సూచించుచున్నది. యేసు ఇచ్చు బాప్తిస్మముకంటె యోహాను ఇచ్చు బాప్తిస్మము మిన్నయను విషయములో వారికి వివాదము కలిగెను. అయితే ఏ బాప్తిస్మములో ఎక్కువ శక్తి యున్నది? ఏ బాప్తిస్మము ఎక్కువ విలువ గలది? బహుశా అన్ని బాప్తిస్మములకంటె యోహాను యొక్క బాప్తిస్మము గొప్పదను ఉద్దేశ్యముతో యోహాను శిష్యులలో కొందరు అవివేకముగా జగడము పెట్టుకొని యుండవచ్చును. క్రీస్తుయొక్క ప్రసిద్ధినిగూర్చి యోహాను యొక్క శిష్యులలో అసూయ కలిగించుటకు పరిసయ్యులలో ఒకడు ప్రయత్నించి యుండవచ్చును.

3:26 గనుక ఒక నిర్ణయము కొరకు వారు యోహానునొద్దకు వచ్చి – నీవిచ్చు బాప్తిస్మము శ్రేష్ఠమైనదైతే, అనేకులు నిన్ను విడిచి ఏల క్రీస్తు నొద్దకు వెళ్ళుచున్నారు. అని అతనిని అడిగియుండవచ్చును. (యొర్దానుకు అవతల నున్నవాడనగా క్రీస్తే). యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఆ సాక్ష్యమునుబట్టి తన శిష్యులలో అనేకులు తనను విడిచి యేసును వెంబడించసాగిరి.

3:27 యోహాను ఇచ్చిన ప్రత్యుత్తరమునకు రెండు విధములైన వివరణలు కలవు. అతడు యేసుక్రీస్తును గూర్చి చెప్పుచున్న యెడల రక్షకుడు పొందిన ప్రతి విజయము ఆయనను దేవుడంగీకరించెననుటకు గుర్తు. కాని యోహాను తన్ను గూర్చి చెప్పుచున్న తాను గొప్పవాడైనట్లును లేక ప్రముఖడనైనట్లును ఎన్నడు నటించలేదని అతడు చెప్పుచున్నాడు. యేసు ఇచ్చిన బాప్తిస్మముకంటె తానిచ్చిన బాప్తిస్మమే గొప్పదని అతడు ఎన్నడు చెప్పలేదు. అనగా పరలోకమునుండి పొందినది తప్ప తనయొద్ద ఏమియు లేదని యోహాను భావము. మన యందరి విషయము కూడ అంతే. ఈ లోకములో మానవుల యెదుట మనము అతిశయించుటకు గాని, మనలను మనము హెచ్చించుకొనుటకుగాని తగిన హేతువు ఏది లేదు.

3:28 తాను క్రీస్తును కానని చెప్పుచు యోహాను కేవలము క్రీస్తు రాకడ సమయ మును సూచించుటకును మరియు మెస్సీయా రాకడ కొరకు మార్గమును సిద్ధపరచుటక మాత్రమే పంపబడితినని తన శిష్యులకు జ్ఞాపకము చేయుచున్నాడు. అయితే వారు అతని విషయమై ఎందుకు వాదించిరి? అతని చుట్టు ఒక గుంపు ఉండవలెనని ఎందుకు ప్రయత్నించిరి? అతడు ప్రముఖమైన వ్యక్తి కాడుగాని, కేవలము ప్రభువైన యేసుతట్టు మానవులను త్రిప్పుటకు ప్రయత్నించుచున్నాడు.

3:29 ప్రభువైన క్రీస్తు పెండ్లికుమారుడై యున్నాడు. అయితే యోహాను కేవలము పెండ్లికుమారుని స్నేహితుడు మాత్రమే. బహుశా ఈనాడు మనము చెప్పుచున్నట్లు తోడి పెండ్లి కుమారుడు కావచ్చును. పెండ్లికుమార్తె తోడి పెండ్లికుమారునికి చెందదు గాని, పెండ్లి కుమారునికే చెందును. గనుక జనులు యోహానును వెంబడించుటకంటె యేసును వెంబడించుటయే తగును. ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శిష్యులుగా ఎందరు తీర్చబడుదురో వారందరు పెండ్లికుమార్తెగా చెప్పబడుచున్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యెహోవాయొక్క భార్యగా చెప్పబడిరి.

అయితే క్రొత్త నిబంధనలో సంఘసభ్యులందరు పెండ్లికుమార్తెగా వర్ణింపబడిరి. కాని ఇక్కడ యోహాను సువార్తలో సాదారణ భావముతో మెస్సీయా ప్రత్యక్షమైనప్పుడు యోహానును విడిచి క్రీస్తును వెంబడించిన శిష్యులను సూచించుచు చెప్పబడినది. అంతేగాని అది ఇశ్రాయేలు జనాంగమనిగాని లేక క్రీస్తు సంఘమనిగాని భావము కాదు. అయితే తన శిష్యులు తన్ను విడిచిపెట్టుటను బట్టి అతడెంత మాత్రము చింతించలేదు. కాని వారు పెండ్లి కుమారుని స్వరము వినుట అతనికెంతో గొప్ప సంతోషము. మరియు అందరు క్రీస్తునందు లక్ష్యముంచుటవలన అతడు తృప్తిచెందెను. క్రీస్తు మానవులచేత స్తుతింపబడి ఘనపరచబడినప్పుడు అతని సంతోషము పరిపూర్ణమైనది.

3:30 యోహాను పరిచర్యలో ముఖ్యోద్దేశ్యము ఈ వచనములో క్రోడీకరింపబడినది. స్త్రీ పురుషులను ప్రభువుతట్టు త్రిప్పి ఆయనయొక్క నిజమైన యోగ్యతను ప్రజలకు గుర్తుచేయుటకు అతడు ఎడతెగక ప్రయాసపడెను. తన కార్యమును నెరవేర్చుటలో అతడు తన్నుతాను మరుగుపరచుకొనెను, క్రీస్తు సేవకుడు స్వమహిమను వెదకుట ద్రోహమే కాగలదు. ఈ అధ్యాయములో తప్పక జరుగవలసిన మూడు కార్యములు గమనించండి : (1) పాపి పక్షముగ జరుగవలసినది (3:7); (2) రక్షకుని పక్షముగా జరుగవలసినది (3:14); (3) పరిశుద్ధుల పక్షముగా జరుగవలసినది (3:30).

3:31 “యేసుక్రీస్తు పైనుండి వచ్చినవాడు; అందరికి పైనున్నవాడు.” ఈ మాటలు పరలోక సంబంధమైన ఆయన ఉనికిని మరియు సర్వోత్కృష్టమైన ఆయన స్థానమును తెలియజేయుచున్నది. అయితే తన అల్పత్వమును నిరూపించుటకు తాను మంటినుండి వచ్చినవాడననియు, భూసంబంధమైన విషయములనే మాటలాడుచున్నాననియు బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పెను. ఈ మాటలలోని భావమేమనగా, బాప్తిస్మమిచు యోహాను జన్మత మానవమాత్రులైన తల్లిదండ్రులకు పుట్టినవాడు. పరలోక సంబంధ మైన ఔనత్యము అతనికి లేదు. అందుచేత దేవుని కుమారునివలె అధికారముతో అతడు మాటలాడలేదు.

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

“క్రీస్తు పైనుండి వచ్చినవాడును అందరికి పైనున్నవాడు” గనుక యోహాను క్రీస్తుకంటె తక్కువవాడు. ఈ విశ్వమంతటికి సర్వాధికారి క్రీస్తే. గనుక మనుష్యులు ప్రభువుయొక్క దూతను గాక ప్రభువునే వెంబడించుట ఎంతైన మంచిది.

3:32 కాని ప్రభువైన యేసు మాటలాడినప్పుడు అధికారముగల వానివలె మాట లాడెను. తాను ఏమి వినెనో ఏమి చూచెనో దానినిగూర్చిమాత్రమే ప్రభువు మనుష్యులకు చెప్పెను. దానిలో పొరబాటుగాని, మోసముగాని ఉండుటకు ఎట్టి అవకాశము లేదు. అయితే ఎవడును ఆయన సాక్ష్యమును గైకొనకపోవుట వింతగా నున్నది. ఇక్కడ “ఎవడును” అనగా – బొత్తిగా ఎవ్వరును ఆయన సాక్ష్యమును గైకొనలేదను భావము కాదు.

ప్రభువుయొక్క మాటలు గైకొని ఆయనను స్వీకరించిన వ్యక్తులు అక్కడక్కడ ఉన్నారు. అయితే యోహాను మానవాళిని గమనించి, వారిలో అనేకులు ప్రభువుయొక్క బోధను తిరస్కరించిన వారేయను భావముతో అతడు ఈ మాటలు చెప్పెను. పరలోకమునుండి దిగివచ్చినవాడు ప్రభువైన క్రీస్తే. గాని, బహుకొద్దిమంది మాత్రమే ఆయన బోధలు వినుటకు ఇష్టపడిరి.

3:33 ప్రభువుయొక్క మాటలను దేవునియొక్క మాటలుగా అంగీకరించిన బహుకొద్ది మందిని గూర్చి ఈ వచనము వివరించుచున్నది. వారు ఆ రీతిగా అంగీకరించుట ద్వారా దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేయుచున్నారు. నేడు కూడ అంతే. మనుష్యులు సువార్త సందేశమును అంగీకరించునప్పుడు వారు తనకును తక్కిన మానవాళికిని వ్యతిరేకముగా దేవుని పక్షము వహించుదురు.

దేవుడు చెప్పునదేదైనను తప్పక సత్యమైయుండునని వారు గ్రహించిరి. క్రీస్తుయొక్క దైవత్వమును గూర్చి ముప్ఫైమూడవ వచనము ఎంత స్పష్టముగా వివరించెనో గమనించండి. క్రీస్తుయొక్క సాక్ష్యమును ఎవరు నమ్ముదురో వారు దేవుడు సత్యవంతుడని ఒప్పుకొందురని ఈ వచనము చెప్పుచున్నది. ఈ మాటలనే మరొకరీతిగా చెప్పవలెనంటే క్రీస్తుయొక్క సాక్ష్యమే దేవుని సాక్ష్యము; మరియు క్రీస్తును చేర్చుకొనుట దేవుని చేర్చుకొనుటయే.

3:34 యేసు దేవునిచేత పంపబడినవాడు. ఆయన దేవుని మాటలనే పలికెను. ఈ మాటలను ఋజువుపరచుటకే – దేవుడు కొలత ప్రకారము ఆయనకు ఆత్మను అనుగ్రహించలేదని యోహాను తెలిపెను. ఏ మనుష్యుడును అభిషేకింపబడని రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆత్మచేత అభిషేకింపబడెను. మనుష్యులు తమ పరిచర్యలో పరిశుద్ధాత్మయొక్క సహాయము గుర్తించిరి. కాని దేవుని కుమారుని యొక్క ఆత్మ పూర్ణమైన పరిచర్యవంటి పరిచర్యగలవాడు ఎన్నడును ఎవడును లేడు.

3:35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడని యోహాను సువార్తలో చెప్పబడిన ఏడు సందర్భములలో ఇది యొకటి. సమస్తముపై కుమారునికి అధికారము అనుగ్రహించుటలో కుమారునిపట్ల తండ్రియొక్క ప్రేమ ఇక్కడ బయలుపరచబడినది. ప్రభువైన యేసుకు అప్పగింపబడిన సంపూర్ణ అధికారములలో మానవుని “గతి” కూడ ఇమిడియున్నది. ఈ సత్యము క్రింద వచనములలో వివరించబడియున్నది.

3:36 క్రీస్తునందు విశ్వాసముంచు వారికందరికి నిత్యజీవము ననుగ్రహించు అధికారము దేవుడు ఆయనకు అనుగ్రహించెను. బైబిలులో ఒక వ్యక్తి ఎట్లు రక్షింపబడునను సత్యము వివరించబడిన వచనములలో ఇది యొకటి.

ధర్మశాస్త్రము ననుసరించుట వలనగాని, బంగారు సూత్రమును పాటించుట వలనగాని, సత్రియలు చేయుటవలనగాని రక్షణ కలుగదు. కాని అది కేవలము కుమారునియందు విశ్వాస ముంచుటద్వారానే కలుగును. ఈ సందర్భములలో దేవుడు మాటలాడుచున్నాడని జ్ఞాపకము చేసికొనుము. ఎన్నటికి తప్పిపోని వాగ్దానమును ఆయన చేయుచున్నాడు. తన కుమారునియందు విశ్వాసముంచువారెవరైనను నిత్యజీవము గలవారని ఆయన నిశ్చయముగా చెప్పుచున్నాడు.

ఈ వాగ్దానమును విశ్వసించుట అవివేకము ఎంత మాత్రము కాదు. అయితే దేవుని కుమారునికి విధేయులు కానివారు జీవము చూడరుగాని, వారిమీద దేవుని ఉగ్రత నిలిచియున్నది. దేవుని కుమారునిపట్ల మనము చేయుదానినిబట్టి మన నిత్యగతి ఆధారపడియున్నదని ఈ వచనముద్వారా మనము నేర్చుకొనుచున్నాము.

మనము ఆ కుమారుని అంగీకరించినయెడల దేవుని నిత్య జీవమును ఉచిత వరముగా మనకు అనుగ్రహించును. అయితే మనము ఆయనను తిరస్కరించినయెడల మనము నిత్యజీవము ననుభవించక పోవుటయేగాక ఏ క్షణమందైనను మనమీద దిగుటకు దేవుని ఉగ్రత కాచుకొనియున్నది. (అని గ్రహించ వలసి యున్నాము).

యూదయ ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య (3:22-36):

Leave a Comment