నీరు ద్రాక్షారసమగుట – Bible Verses Chapter 2 in Telugu

రెండవ అధ్యాయము

నీరు ద్రాక్షారసమగుట

మొట్టమొదటి సూచకక్రియ –
నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:1-11) :

2:1 ఈ వచనములో “మూడవ దినము” అని చెప్పబడిన దినము ప్రభువైన యేసు గలిలయలో నిలిచిన మూడవ దినమును సూచించుచున్నది. మొదటి అధ్యాయము నలభైమూడవ వచనములో రక్షకుడు గలిలయకు వెళ్ళెనని జ్ఞాపకము చేసికొనుము గలిలయలో కానా అను ఊరు ఎక్కడ ఉన్నదో కచ్చితముగా మనకు తెలియదు. కాని, కపెర్నహూముకు దగ్గరగా ఎత్తైన ప్రదేశములో ఉన్నట్లు 2:12 ద్వారా తెలియుచున్నది.

ఆ ప్రత్యేకమైన దినమున కానాలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లియైన మరియ అక్కడ ఉండెను. ఇక్కడ మరియను “యేసుతల్లి” యని చెప్పుట ఆసక్తితో గమనించదగినది. రక్షకుడు కన్య మరియకు కుమారుడగుటను బట్టి ప్రజలలో ఎక్కువ ప్రఖ్యాతి నొందలేదు కాని, ఆమె ప్రభువుయొక్క తల్లి యగుటవలన ఆమె అనేకులకు బాగుగా తెలియబడెను. అయితే లేఖనములు క్రీస్తుకు ఎల్లప్పుడు ప్రాధాన్యత నిచ్చెను గాని మరియకు ఇయ్యలేదు.

2:2 ఆ వివాహమునకు యేసును ఆయన శిష్యులుకూడ పిలువబడిరి. ఆ వివాహ మునకు ఆయనను ఆహ్వానించుట వివేకమైన నిర్ణయము. గనుక ఇప్పుడుకూడ తమ వివాహమునకు క్రీస్తును ఆహ్వానించుట జ్ఞానానుసారమైన నిర్ణయము. ఇందుకై పెండ్లి కుమారుడును పెండ్లికుమార్తెయు ప్రభువైన యేసునందు నిజమైన విశ్వాసులైయుండ వలెను. మరియు తమ వివాహానంతరముకూడ ఆ రక్షకునికి తమ జీవితములను సమర్పించి వారి గృహము ప్రభువు ప్రేమించు నివాసముగా ఉండునట్లు తీర్మానించు
కొనవలెను.

Read and Learn More Telugu Bible Verses

2:3 ఈ వచనములో “ద్రాక్షారసము లేదు” అను మాటలు గమనించండి. అంటే ద్రాక్షారస కొరత ఏర్పడినదని దీని భావము. సరఫరా నిలిచిపోయినది. ఆ పరిస్థితిని గమనించిన యేసుతల్లి, ఆ సమస్యను తన కుమారునికి తెలిపెను. తన కుమారుడు ద్రాక్షారసమును సమకూర్చుటకు అద్భుతము చేయగలడని ఆమె ఎరుగును. గనుక ఆ విధముగాచేసి తన కుమారుడు అక్కడ చేరియున్న అతిధులందరికి తాను దేవుని కుమారునిగా బయలుపరచుకొనవలెనని ఆమె కోరికయనుటలో ఎట్టి సందేహము లేదు. లేఖనములలో ద్రాక్షారసము ఆనందమును సూచించుచున్నది. “వారికి ద్రాక్షా రసము లేదు” అని మరియ చెప్పిన మాటలలో – రక్షింపబడని స్త్రీ పురుషులను గూర్చిన కచ్చితమైన వివరణను తెలియజేయుచున్నది. అయితే అవిశ్వాసులకు నిజమైన శాశ్వతానందము లేనేలేదు.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

2:4 తన తల్లి మాటలకు యేసు నిరుత్సాహకరమైన సమాధానమిచ్చెను. కాని అది గద్దింపు మాత్రము కాదు. తెలుగులో ‘అమ్మా” అను మాటకు ఇంగ్లీషులో ‘ఉమెన్’ (Woman) అని వ్రాయబడెను. ఆ మాటకు “ఘనురాలైన స్త్రీ” లేక “అమ్మా” అని అర్ధము. మరియు “నాతో నీకేమి పని” అని చెప్పుటలో – దైవకార్యమును జరిగించుటయందు తాను తల్లియొక్క ఆజ్ఞకు లోబడుటకాక, పరలోకముందున్న తన తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయతతో పనిచేయుటను ఆయన సూచించు చున్నాడు.

“నాతో నీకేమి (పని)?” అను మాట బైబిలులో అనేక మారులు చెప్పబడినది. ఈ మాటకు “మనకు పొందు ఏమిటి?” అని అర్ధము. అనగా “లేదు” అని జవాబు. ఈ మాటలను దావీదు సెరూయా కుమారులతో రెండు పర్యాయములు పలికెను ఆహాబు కుమారుడైన యెహోరామునకును, తనకు మధ్య ఎంత అగాధమున్నదో సూచించుచు ప్రవక్తయైన ఎలీషా రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయములో ఈ మాటలు పలుకుచున్నాడు.

సాతానుకు క్రీస్తుతో లేక క్రీస్తుకు సాతానుతో పని ఏమి లేనట్లు తెలియజేయుచు దయ్యములుకూడ మూడు పర్యాయములు ఈ మాటలు పలికెను. ఈ సందర్భములో మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయ మేమనగా పాపరహితమైన తన దైవత్వమునకును, పాపసహితమైన ఆమె మానవత్వమునకును ఎట్టి పొందులేనట్లును, వారిరువురి మధ్య గొప్ప వ్యత్యాసమున్నట్లు చూపించుటకు ప్రభువు ఈ మాటలు పలికెను.

యేసు మహిమపరచబడుట తాను కన్నులారా చూడవలెనని మరియు ఆశించినది. కాని అందుకు సమయము ఇంకను రాలేదని ఆయన ఆమెకు జ్ఞాపకము చేయు చున్నాడు. సమస్తమును జయించిన క్రీస్తుగా ఆయన లోకమునకు ప్రత్యక్షము కాకముందు ఆయన మొదటిగా బలిపీఠమును తప్పక ఎక్కవలసియున్నది. ఆ కార్యమును ఆయన కలువరి సిలువలో నెరవేర్చినాడు.

2:5 మరియ ఆయన మాటల భావమును అర్థము చేసికొని, “ఆయన మీతో చెప్పునది చేయుడి” అని సేవకులకు హెచ్చరించెను. తనకుగాని, మరి యే మానవునికి గాని విధేయులు కావలెనని ఆమె మనుష్యులకు ఆజ్ఞాపించలేదు. క్రీస్తును వారికి చూపించుచు ఆయనకే విధేయత చూపవలసినదని ఆమె వారికి చెప్పెను. ప్రభువైన యేసుయొక్క బోధలు క్రొత్త నిబంధనలో ఇయ్యబడినవి. అమూల్యమైన ఈ గ్రంథమును చదివినయెడల “ఆయన మీతో చెప్పునది చేయుడి” అని మరియ పలికిన ఈ మాటలే ఆమె ఆఖరి మాటలని మనము గ్రహించగలము.

2:6,7 పెండ్లి జరుగుచున్న ఆ స్థలములో ఆరు రాతి బానలుండెను. వాటిలో పదహారునుండి ఇరవైయేడు గ్యాలనుల నీరు పట్టును. కలిగిన అపవిత్రత నుండి తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకు యూదా ప్రజలు ఈ నీటిని ఉపయోగింతురు. ఆ బానలను నీటితో నింపుడని ప్రభువైన యేసు ఆజ్ఞాపించెను. తక్షణమే పనివారు ఆయన చెప్పినట్లు చేసిరి. తాను అద్భుతమును చేయచూచినప్పుడెల్ల ప్రభువైన యేసుక్రీస్తు తనకు అందుబాటులోనున్న పరిస్థితులనే వినియోగించుకొనెను.

రాతి బాసలను సమకూర్చుటకును, వాటిని నీటితో నింపుటకును ఆయన మానవమాత్రులను అనుమతించెను. కాని ఏ మానవుడు ఎన్నడు చేయలేని కార్యమును ఆయన చేసెను. అనగా నీటిని ద్రాక్షారసముగా మార్చెను. రాతి బానలను నీటితో నింపినది. పనివారేగాని యేసు శిష్యులు కాదు. ఇట్లు చేయుటద్వారా మొదటి సూచకక్రియ చేయుటలో ప్రభువు ఏదో మోసము చేసెనను అపవాదుకు తావులేకుండ చేసెను. అంతేగాక నీటిలో ద్రాక్షారసము కలుపబడినదని ఎవరు చెప్పనేరకుండునట్లు ఆ రాతి బానలు అంచులమట్టుకు నీటితో నింపబడెను.

2:8 అద్భుతము జరిగిన తరువాత బానలోనున్న దానిని ముంచి విందు ప్రధాని యొద్దకు తీసికొనిపొండని ప్రభువు ఆజ్ఞాపించెను. తక్షణమే ఆ అద్భుతము జరిగినట్లు స్పష్టమగుచున్నది. అవును, కొంత సమయము జరిగిన తరువాత గాక, ఆ మరుక్షణమే నీరు ద్రాక్షారసముగా మారిపోయెను.

2:9 ఆ విందులో భోజనమును, బల్లలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత విందు ప్రధానిదే. కాని ద్రాక్షారసమును రుచి చూచిన వెంటనే, అసాధారణమైన సంభవమేదో సంభవించియుండునని అతడు తలంచెను. అయితే అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియలేదు. అది బహుశ్రేష్ఠమైనదని అతడు తలంచి వెంటనే దానిని గూర్చి పెండ్లికుమారుని విచారించెను. (తూర్పు దేశములో అనేక మారులు నీరు కలుషితమై త్రాగుటకు పనికిరాక, ప్రమాదభరితముగా నుండును. ఆ దేశములలో ద్రాక్షారసము అతి సామాన్యమైన పానీయము, అయితే కొద్ది మోతాదులో వాడుట పాపముగా పరిగణింపలేదు. నేడు లోకములో కలుగుచున్న అనేక సమస్యలకు కారణము ఈ ద్రాక్షారసమును దుర్వినియోగ పరుచుటయే).

నీరు ద్రాక్షారసమగుట మొట్టమొదటి సూచకక్రియ – నీటిని ద్రాక్షారసముగా మార్చుట (2:1-11) :

అయితే నేటి దినములలో ద్రాక్షారసముపట్ల నిజ విశ్వాసియొక్క వైఖరి ఏమి? కొన్నిసార్లు వైద్యులు ద్రాక్షారసమును ఔషధముగా నిర్ణయించిరి. ఇది క్రొత్త నిబంధన బోధకు పూర్తిగా అనుగుణ్యముగా నున్నది (1 తిమోతి 5:23). దానిని మితిమీరి ఉపయోగించుట వలన కలిగెడి భయంకరమైన ఫలితములనుబట్టి అనేకమంది విశ్వాసులు దానిని పూర్తిగా నిషేధించిరి.

మత్తుపానీయములకు ఎవరైనను బానిసయగు అవకాశము కలదు. అయితే ఆ ప్రమాదమునుండి బయట పడవలెనంటే దానిని పూర్తిగా విడిచిపెట్టుటయే ఏకైకమార్గము. ఇతరులపై తన క్రియలు ఏ రీతిగా ప్రభావము చూపుచున్నవో విశ్వాసి ఎల్లప్పుడు గమనించుకొనవలెను. ఒకవేళ ఒక విశ్వాసి మత్తు పానీయము సేవించుచుండగా, రక్షింపబడని వ్యక్తి అతని చూచిన యెడల ఎంత చెడ్డ సాక్ష్యము పొందునో గదా! విందు ప్రధాని ఆ ద్రాక్షారసమును చూచినప్పుడు అది మంచిదని గ్రహించెను. అతనికియ్యబడిన ఆ రసము కేవలము ద్రాక్షరసమని చెప్పలేము.

2:10 కాని ఇప్పుడైతే అది సామాన్యమైనది కాదని అతడు గ్రహించెను. ఈ సమయములో అతడు పలికిన మాటలు – ప్రభువైన యేసు కార్యములకును, మానవుని కార్యములకును గల భేదమువైపు మన మనస్సులను ఆకర్షించుచున్నవి. సహజముగా పెండ్లి విందులో జరుగునదేమనగా – మొదట మంచి ద్రాక్షారసమును వడ్డించెదరు. ఎందుకనగా, జనులు మత్తుగొనకముందు దాని మంచిచెడులను దాని రుచి, వాసనలను బట్టి గ్రహించగలరు. ఆఖరున మత్తుగా నున్నప్పుడు ద్రాక్షారసముయొక్క నాణ్యతను గూర్చి వారు పట్టించుకొనరు. కాని ఈ విందులో శ్రేష్ఠమైన ద్రాక్షారసము ఆఖరిలో వడ్డించబడును.

ఇందులో మనకొక ఆత్మీయ భావము కలదు. లోకము సహజముగా ప్రారంభములో శ్రేష్ఠమైనదానినే ఇవ్వజూపును. మరి ముఖ్యముగా యౌవనస్థులకు బహు ఆకర్షణీయమైనవాటినే యివ్వజూపును. క్షణికానందము కలిగించువాటియందు తమ జీవితములను వ్యర్ధపరచుకొనిన తరువాత ఈ లోకము అతనికిచ్చునది మష్టేగాని మరేమికాదు. కాని నిజవిశ్వాసియొక్క జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. అది అన్ని వేళలలో శ్రేష్ఠమైన దానినే పొందును. కాని క్రీస్తు అంతము వరకు శ్రేష్ఠమైన దానినే ఇచ్చును.

ఈ లేఖన భాగము యూదా జాతితో ప్రత్యక్ష సంబంధము కలిగియున్నది. యూదా జనాంగమునందు నిజమైన ఆనందము ఎంతమాత్రము లేదు. యూదా ప్రజలు వ్యర్థమైన ఆచారములను, సాంప్రదాయములను అనుసరించుచుండిరి. కాని వారి జీవితములు నిస్సారమైనవి. దైవికమైన ఆనందమునకు వారు దూరస్థులు. గనుకనే తనయందు విశ్వాసముంచుమని ప్రభువు వారికి చెప్పగోరెను. వారి నీతి బాహ్యమైన స్థితిని పూర్ణ సంతోషము గలదానిగా ప్రభువు మార్చగలడు. ఆచారము సాంప్రదాయము లనెడి యూదా నీరు, క్రీస్తునందు సంతోషభరితమైన, నిక్కమైన ద్రాక్షారసముగా మారగలదు.

2:11 “పేతురు సువార్త” అని చెప్పబడుచున్న ఒక అవాస్తవికమైన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు బాల్యములో ఎన్నో అద్భుతములు చేసినట్లు చెప్పబడెను. కాని “యేసు ఈ మొదటి సూచకక్రియను చేసెను” అను మాటలు పైన చెప్పబడిన దానిని కొట్టివేయుచున్నవి. బాల్యములో ప్రభువు అద్భుతములు చేసినట్లు ఆరోపించుట కేవలము దేవదూషణ చేయుటయే. దీనిని ముందే ఎరిగియుండి ప్రభువు జీవితములోని ఈ కాలమును (బాల్యమును) పరిశుద్ధాత్మ దేవుడు “ఈ మొదటి సూచకక్రియ చేసి” అను మాటలతో మరుగుపరచి దురభిప్రాయమునకు చోటు లేకుండ చేసెను.

నీటిని ద్రాక్షారసముగ మార్చుట యనునది ఒక సూచకక్రియ. అది ప్రాధాన్యతతో కూడిన ఆశ్చర్యకార్యము. మరియు అది ఒక ఆత్మీయ భావముతో కూడిన దైవ కార్యము. ప్రభువుయొక్క అద్భుత కార్యములు యేసు దేవుని అభిషిక్తుడని ఋజువు చేయుచున్నవి. ఆ అద్భుతము చేయుటద్వారా ఆయన తన మహిమను ప్రత్యక్ష పరచెను. అంతేకాదు, శరీరమందు ప్రత్యక్ష పరచబడిన నిజమైన దేవుడుగా ఆయన మానవులకు బయలుపరచుకొనెను. ఆయన చేసిన ఆ అద్భుతమును బట్టి ఆయన శిష్యులు ఆయనయందు నమ్మికయుంచిరి. ఒక రీతిగా వారు ఇంతకు ముందే ఆయనయందు విశ్వాసముంచిరి. గాని ఇప్పుడు ఆ విశ్వాసము బలపరచబడెను. గనుక మరి ఎక్కువగా ఆయన యందు విశ్వాసముంచిరి.

క్రీస్తు యెరూషలేములో దేవాలయమును శుద్ధిచేయుట (2:12-17):

2:12 తరువాత యేసు కానా విడిచి తన తల్లితోను, సహోదరులతోను, తన శిష్యులతోను కలసి కపెర్నహూమునకు వెళ్ళెను. వారు అక్కడ కొన్ని దినములు మాత్రమే ఉండి, ఆ తరువాత వెంటనే యెరూషలేముకు వెళ్ళెను.

2:13 ప్రభువు యెరూషలేముకు వచ్చుట ఇదే మొదటి సారియని ఈ వచనము ద్వారా మనము గ్రహించవచ్చును. ప్రభువు తన బహిరంగ పరిచర్యను పస్కా పండుగ సమయములో మందిరమును శుద్ధిచేయుటద్వారా ప్రారంభించి, మందిరమును శు ద్ధిచేయుట ద్వారానే ముగించుచున్నాడు (మత్తయి 2:12, 13; మార్కు 11:15-18; లూకా 19:45, 46 పోల్చండి) ఐగుప్తు దాస్యమునుండి ఇశ్రాయేలీయులను విమో చించి, ఎర్రసముద్రము దాటించి, ఎడారిగుండా నడిపించి, వాగ్దానభూమిలో ప్రవే పెట్టిన ఆ సమయమును జ్ఞాపకార్థముగా ప్రతి సంవత్సరము జరుపుకొను పండుగే పస్కాపండుగ, మొట్టమొదట జరుపబడిన పస్కాపండుగను గూర్చి నిర్గమ 12 అధ్యా॥లో వివరించబడినది. భక్తిగల ఒక యూదునిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన ఆ దినమున యెరూషలేము చేరెను.

2:14 ఆలయము ఒక సంతగా మారిపోయినట్లు ఆయన దానిలో ప్రవేశించిన వెంటనే కనుగొనెను. ఎద్దులు, గొట్టెలు, పావురములు దేవాలయములో అమ్మబడు చుండెను. ఆరాధించుటకు వచ్చువారి ఆరాధన నిమిత్తము జంతువులు, పక్షులు అక్కడ అమ్మబడుచుండెను. రూకలు మార్చువారు సహితము తమ వ్యాపారమును అక్కడ జరుపుచుండిరి. రూకలు మార్చువారు చేయు పని ఏమనగా, విదేశీ యాత్రికుల నుండి వారి రూకలు (డబ్బు) తీసికొని, యెరూషలేములో వాడుకలోనున్న రూకల నిచ్చెదరు. దీనివలన యాత్రికులు దేవాలయపు పన్ను కట్టగలుగుటకు వీలగుచున్నది. ఈ రీతిగా వారు అక్రమముగా సొమ్ము సంపాదించెడివారు.

నీరు ద్రాక్షారసమగుట – Bible Verses Chapter 2

2:15 ఈ సమయములో ప్రభువు వాడిన కొరడా బహుశా సన్నని త్రాళ్ళతో తయారు చేయబడియుండవచ్చును. కాని ఆ కొరడాతో ప్రభువు ఎవరిని దండించినట్లు వ్రాయ బడలేదు. అయితే ప్రభువు చేతిలోని ఆ కొరడా ఆయనకుగల అధికారమునకు ఆనవాలైయున్నది. ఆయన కొరడా ఝళిపించుచు ఆలయములో వ్యాపారము చేయు వారిని బయటికి తోలివేసి, చిల్లర మార్చువారి బల్లలను పడద్రోసెను.

2:16 పావురము పేదల అర్పణ. కాని ఈ పావురములనమ్ము వర్తకులనుకూడ బయటికి వెళ్ళిపొమ్మని ఆయన ఆజ్ఞాపించెను. అవును, దేవుని ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చుట సరికాదు. మత కార్యములను ధనవంతులగుటకు సాధనములుగా ఉపయోగించకూడదని అన్ని యుగములలో దేవుడు తన ప్రజలను హెచ్చరించెను. ఆయన చేసిన ఈ కార్యములన్నింటిలో ఎట్టి క్రూరత్వముగాని, అన్యాయముగాని లేదు కాని, ఆయనయొక్క పవిత్రతకును, నీతిమత్వమునకును అవి ప్రతీకలైయున్నవి.

2:17 మందిరములో జరుగుచున్నదానిని చూచిన ఆయన శిష్యులు మెస్సీయ వచ్చినప్పుడు దేవుని సంగతులను గూర్చి ఆయనకుగల ఆసక్తినిగూర్చి కీర్తన 69:9లో వ్రాయబడిన “నీ యింటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అను మాటలు జ్ఞాపకము చేసికొనిరి. దైవారాధన పవిత్రమైనదిగా ఉండవలెనను దృఢ నిశ్చయతను ప్రభువైన యేసు బయలు పరచుటను శిష్యులు చూచిరి అంతేగాక కీర్తనకారుడు ఎవరినిగూర్చి వ్రాసెనో ఆ వ్యక్తి ఈయనే (యేసు) అని శిష్యులు గ్రహించెను.

నిజ విశ్వాసియొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మనము జ్ఞాపకము చేసికొనవలెను. యెరూషలేములోని దేవాలయము పవిత్రముగా ఉండవలె నని ప్రభువైన యేసుక్రీస్తు ఎంతటి ఆసక్తి కలిగియుండెనో, ఆ విధముగనే మనముకూడ మన దేహములను నిరంతరము శుద్ధి చేసికొనుటకు కూడ జాగ్రత్త వహించవలెను.

తన మరణ పునరుత్థానములనుగూర్చి యేసు ముందుగా చెప్పుట (2:18-22) :

2:18,19,20,21 యూదా ప్రజలు ప్రభువునుండి ఒక అద్భుత కార్యమునో, సూచకక్రియనో చూడవలెనను ఉద్దేశ్యముగల వారివలె కనిపించుచున్నారు. అయినను, ప్రభువైన యేసు అద్భుతములను ఒకదానివెంట మరొకటి జరిగించినను వారి హృదయములు ఆయనపట్ల మూసివేయబడెను. ఈ వచనములో దేవాలయములోని వ్యాపారులను బయటికి నెట్టివేయుటలో ఆయనకుగల అధికారమును వారు ప్రశ్నించిరి. మరియు తానే మెస్సీయ అని ఋజువుపరచుటకు ఒక సూచకక్రియ జరిగించుమని కూడ వారు కోరిరి. అందుకాయన తన మరణ పునరుత్థానములను గూర్చిన ఆశ్చర్యకర మైన సంగతిని తెలియజేసెను.

వారు తన పరిశుద్ధాలయమును పడగొట్టెదరనియు, తాను మూడు దినములలో తిరిగి లేపెదనని వారితో చెప్పెను. ఈ వచనములో ప్రభువుయొక్క దైవత్వము మరొకసారి మనకు కనిపించుచున్నది. “మూడు దినములలో దానిని తిరిగి లేపెదను” అని దేవుడు మాత్రమే చెప్పగలడు. కాని యూదులు ఆయనను గ్రహించలేదు. ఆత్మీయ సంగతులలో కంటే భౌతికమైన విషయములలో వారు ఎక్కువ ఆసక్తి కలిగియుండిరి. ఆలయమంటే యెరూషలేములో నున్న హేరోదుయొక్క ఆలయమునుగూర్చిమాత్రమే వారు ఆలోచించుచుండిరి. దానిని కట్టించుటకు సుమారు నలభై యారు సంవత్సరములు పట్టినది.

తన మరణ పునరుత్థానములనుగూర్చి యేసు ముందుగా చెప్పుట (2:18-22) :

అయితే దానిని తిరిగి మూడు దినములలో ఎట్లు కట్టగలడో వారు గ్రహించలేదు. అయితే ప్రభువైన యేసు తన స్వంత దేహమును గూర్చి మాటలాడు చున్నాడు. ఆయన దేహము దైవత్వముయొక్క సర్వపరిపూర్ణత నివసించు పరిశుద్ధ స్థలమైయున్నది. ఈ యూదులు యెరూషలేములోని ఆలయమును ఎట్లు అపవిత్ర పరచిరో ఆ విధముగనే ప్రభువును మరికొద్ది సంవత్సరములలో మరణమునకు అప్పగించెదరు.

2:22 ఆయన సిలువ వేయబడి, మరణమునుండి తిరిగిలేచిన తరువాత, తాను మూడవ దినమున తిరిగి లేచెదనని ప్రభువు చెప్పిన మాటలను, ప్రభువు యొక్క శిష్యులు జ్ఞాపకము చేసికొనిరి. ఇటువంటి అద్భుతమైన ప్రవచనము కళ్ళెదుట నెరవేరుట చూచి, ఆయన శిష్యులు లేఖనములను, ప్రభువు చెప్పిన మాటలను విశ్వసించిరి.

అనేక మారులు మనము గ్రహించుటకు కష్టమైన సత్యములను బైబిలు గ్రంథములో మనము చూచుచున్నాము. కాని దేవుని వాక్యమును మన హృదయములో దాచుకొన వలెనని ఈ సందర్భములో మనము నేర్చుకొనుచున్నాము. ఆ లేఖనములు ప్రస్తుతము మనకు అర్థము కాకపోవచ్చును. కాని కొన్ని దినములైన తరువాత ప్రభువు వాటిని మనకు వివరించును. “వారు లేఖనములను విశ్వసించి” అని ఈవచనములో వ్రాయబడిన భావమేమనగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి పాత నిబంధనలో వ్రాయబడిన ప్రవచనములను వారు విశ్వసించిరి.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

2:23 పస్కా పండుగ సమయములో యెరూషలేములో ప్రభువైన యేసు చేసిన సూచకక్రియలు, అద్భుతముల ఫలితముగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి. అనగా తాము ఆయనను అంగీకరించినట్లు చెప్పుకొనిరి. కాని చెప్పినదానికి, వారి ప్రవర్తనకు ఎట్టి పొందిక లేదు. వారు క్రీస్తును వెంబడించుట కేవలము పైకి తమ్మును తాము కనుపరచుకొనుటకే. నేడు లోకములో జరుగుచున్నది కూడ ఇదే. అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసముద్వారా తిరిగి జన్మించిన అనుభవము లేకపోయినను తాము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు.

2:24, 25 అనేకులాయనయందు విశ్వాసముంచినప్పటికిని, (23వ) యేసు వారిని విశ్వసించలేదు. ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. వారు కేవలము ఆసక్తితో మాత్రమే ఆయనయొద్దకు వచ్చుచున్నారని ఆయనకు ఎఱుకే. ఒక వింతైన అనుభూతి కొరకే వారు ఎదురు చూచుచుండిరి. “ఆయన అందరిని ఎరిగినవాడు” ఆయన వారి ఆలోచనలను, ఉద్దేశ్యములను ఎరిగినవాడు. వారు ఆ రీతిగా ప్రవర్తించుటలో గల కారణములను కూడ ఆయన ఎరుగును.

అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచుట (2:23-25) :

అంతేగాక వారి విశ్వాసము నిజమైనదా? లేక అనుకరణా? అనునదికూడ ఆయన ఎరుగును. ఒకని హృదయమును ప్రభువు ఎరిగినంతగా మరి ఏ మానవుడు ఎరుగలేడు. ఒకని హృదయమును ఎరుగుటలో లేక గ్రహించుటలో ప్రభువుకు ఎవరు బోధించనవసరంలేదు. లేక జ్ఞానోదయము కలిగించనవసరం లేదు. మానవునియందు ఏమున్నదో, అతడు అట్లెందుకు ప్రవర్తించు చున్నాడో అనువాటి విషయమైన పరిపూర్ణ జ్ఞానము ఆయనకు కలదు.

Leave a Comment