రక్షకుని మరణము – Bible Verses Chapter 19 in Telugu

పందొమ్మిదవ అధ్యాయము

రక్షకుని మరణము

నిర్దోషి దోషిగా తీర్పు తీర్చబడుట (19:1-16) :

19:1 నిరపరాధియైన ఒక వ్యక్తిని పిలాతు కొరడాలతో కొట్టించడం అనేది చాలా అన్యాయం. ఇలా శిక్షిస్తే యూదులు సంతృప్తిపడి, యేసు మరణాన్ని కోరుకొనరని బహుశ పిలాతు తలంచియుంటాడు. కొరడాలతో కొట్టించడం రోమా వారు శిక్షించే విధానము.

ఖైదీలను కొరడాతోగాని లేక బెత్తముతోగాని కొడతారు. ఈ కొరడాల చివర లోహపు ముక్కలుగాని, ఎముక ముక్కలుగాని ఉంటాయి. ఇవి శరీరముపై లోతైన గాయాలు చేస్తాయి.

19:2 తాను రాజునని చెప్పిన యేసును సైనికులు అపహసించారు. రాజు అయితే కిరీటం ఉండాలి కదా! అందుచే ముండ్లతో ఒక కిరీటమల్లి వారు దానిని ఆయన తలపై పెట్టారు. ఆ ముండ్లు నుదుటిలోనికి గ్రుచ్చబడుచున్నప్పుడు భయంకరమైన నొప్పి ఉంటుంది.

పాపము మానవజాతికి తెచ్చిన శాపమునకు ఈ ముండ్లు గుర్తుగా ఉన్నవి. మనకు విమోచనము కలుగునట్లుగా మన పాపములయొక్క శాపమును ఆయన భరించుట’ అనే చిత్రపటమును ఇచ్చట మనము చూస్తున్నాము. మనము మహిమాకిరీటమును ధరించవలెనని కోరి ఆయన ముండ్ల కిరీటమును ధరించాడు.

రక్షకుని మరణము నిర్దోషి దోషిగా తీర్పు తీర్చబడుట (19:1-16) :

ఊదారంగు వస్త్రమునుకూడా అపహసించడంకోసమే ఆయనకు తొడిగించారు. ఊదారంగు రాజత్వమునకు గుర్తుగా ఉన్నది. దేవుని యొక్క నీతి వస్త్రమును మనము ధరించులాగున మన పాపములన్నియు యేసుపై మోపబడినవి.

19:3 దేవుడు తన చేతులతో సృష్టించుకొనిన మానవులు అరచేతులు, దేవునియొక్క నిత్యత్వపు కుమారుడైన యేసును కొట్టడానికి మరియు వారి నోరులు ఆయనను అపహసించడానికి ఉపయోగించబడటం అనేది ఎంత శోచనీయం!

19:4 పిలాతు మరల వెలుపలకు (యూదుల యొద్దకు వచ్చి ఈయనయందు నాకు ఏ దోషమును కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీ తీసికొని వచ్చుచున్నానని వారితో చెప్పాడు. ఈ విధంగా పిలాతు తన మాటలచేతనే తననుతాను దోషిగా తీర్చుకొనుచున్నాడు. అతడు క్రీస్తునందు ఏ దోషమును కనుగొనలేదు. కానీ అతడు ఆయనను విడుదల చేయలేదు.

Read and Learn More Telugu Bible Verses

19:5 ఆ ముండ్ల కిరీటమును, ఊదారంగు వస్త్రమును ధరించినవాడై యేసు వెలుపలికి రాగా పిలాతు – ‘ఇదిగో ఈ మనుష్యుడు’ అని వారితో చెప్పాడు. అతడీ మాటను ఎగతాళిగా అన్నాడో, సానుభూతితో అన్నాడో లేక ఒక ప్రత్యేకమైన భావోద్రేకంతో కాక మామూలుగా అన్నాడో తెలుసుకోవడం కష్టం.

19:6 పిలాతు ఈవిధంగా భిన్న తలంపులమధ్య తడబడడం గమనించిన ప్రధాన యాజకులు – యేసును సిలువవేయుమని పెద్దగా కేకలు వేశారు. రక్షకుని మరణం విషయంలో నాయకత్వం వహించినది ఈ మతాధికారులే.

తరచుగా చర్చి అధికారులే నిజవిశ్వాసులను హింసలకు గురిచేస్తూ ఉండటమనేది శతాబ్దాలుగా జరుగుతూ వస్తున్నది. పిలాతు వారితోను, యేసుపట్ల వారికిగల నిష్కారణమైన ద్వేషముతోను విసుగుచెందినవాడై ‘ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు.

కనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని’ వారితో చెప్పాడు. అయితే తన అనుమతి లేనిదే వారు యేసుకు మరణశిక్ష అమలు చేయలేరని అతనికి తెలుసు.

19:7 కైసరు ప్రభుత్వమునకు యేసు ఒక ఆటంకముగా ఉన్నాడు’ – అని ఋజువు పరచడంలో విఫలులైన యూదులు ఇప్పుడు ఆయనపై తాము మోపిన మతసంబంధ మైన నేరమును ముందుకు తీసికొని వస్తున్నారు.

క్రీస్తు తాను దేవుని కుమారుడనని చెప్పుకోవడంద్వారా తననుతాను దేవునితో సమానునిగా ఎంచుకున్నాడు. యూదులకు ఇది దేవదూషణ నేరమవుతుంది. మరియు అట్టి నేరానికి మరణశిక్ష విధించాల్సి ఉంది.

19:8 యేసు నిజముగా దేవుని కుమారుడా? కాదా? అనే విషయం పిలాతును కలవర పెట్టింది ఇప్పటికే జరుగుతున్న వ్యవహారముతో గందరగోళ స్థితిలో నున్న పిలాతును ఈ విషయం మరింత భయానికి గురిచేసింది.

19:9 అతడు యేసును అధికార మందిరములోనికి తీసికొని వెళ్ళి “నీవెవరవు? ఎక్కడినుండి వచ్చావు?” అని ఆయనను ప్రశ్నించాడు. పిలాతు ఒక విషాదకరమైన వ్యక్తి. యేసు ఏ పాపమును చేయలేదని అతడు ఒప్పుకున్నాడు.

కానీ అతడు యూదులకు భయపడటంవల్ల యేసును విడుదలచేసే నైతిక ధైర్యం అతనికి లేకుండా పోయింది. యేసు అతనికి ఏ జవాబును ఇవ్వలేదు. పిలాతు తనకు ‘ఒప్పు’ అని తెలిసినదానిని చేయడానికి అయిష్టంగా ఉన్నాడు అనే విషయం ఆయనకు తెలుసు.

తన అవకాశదినాన్ని దుర్వినియోగపరచుకొని పిలాతు పాపం చేశాడు. అవకాశం ఇవ్వబడినపుడు సరియైన విధంగా స్పందించని అతనికి ఇక అవకాశం ఇవ్వబడదు.

19:10 యేసును భయపెట్టి, బలవంతముగా ఆయనచేత జవాబు చెప్పించడానికి పిలాతు ప్రయత్నించాడు. ఒక రోమా గవర్నరుగా ఆయనను విడుదల చేయుటకును, సిలువ వేయుటకును తనకు అధికారము కలదని అతడు యేసుకు జ్ఞాపకం చేశాడు.

19:11. యేసుప్రభువుయొక్క ఇంద్రియ నిగ్రహము ఎంతో అసాధారణమైనది. ఆయన పిలాతుకంటె ఎంతో ప్రశాంతముగా ఉన్నాడు. ‘పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు’ అని ఆయన పిలాతుకు సమాధానమిచ్చాడు.

ప్రభుత్వములన్నియు దేవునిచేతనే నియమించబడినవి. అధికార ములన్నియు – అవి ఇహలోక సంబంధమైనవిగాని, ఆత్మ సంబంధమైనవి గాని అన్నియు దేవునినుండి కలిగినవే. ‘నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు’ అని యేసు చెప్పాడు.

ఈ మాట, ప్రధానయాజకుడైన కయపను గూర్చి గాని ద్రోహియైన యూదానుగూర్చిగాని లేక యూదులందరినిగూర్చిగాని ఆయన చెప్పి యుండవచ్చును. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే యూదులకు సమస్తము తెలుసు. మెస్సీయా రాకనుగూర్చి ముందుగానే ప్రవచించబడిన లేఖనములు వారికున్నాయి.

19:10 యేసును భయపెట్టి, బలవంతముగా ఆయనచేత జవాబు చెప్పించడానికి పిలాతు ప్రయత్నించాడు.

ఆయన వచ్చినప్పుడు వారాయనను గుర్తించాల్సివుంది. కానీ వారు ఆయనను తృణీకరించారు. అంతేకాక ఇప్పుడు ఆయన ప్రాణం కోసం వారు కేకలు వేస్తున్నారు. ‘అపరాధము’లో స్థాయిలున్నాయని ఈ వచనము మనకు బోధించుచున్నది, పిలాతు అపరాధి కానీ కయప, యూదా మరియు దుష్టులైన యూదులు – వీరందరూ మరి ఎక్కువగా అపరాధులు.

19:12 యేసును విడుదల చేయుటకు అప్పుడే పిలాతు తన మనస్సును స్థిర పరచుకొనుచుండగా, యూదులు తమ బలమైన చివరి అస్త్రాన్ని సంధించారు. రోమా సామ్రాజ్యాధిపతియెడల తమకేదో శ్రద్ధ ఉన్నట్లుగా – “నీవు ఇతనిని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు” అని వారు పిలాతుతో అన్నారు.

వాస్తవానికి కైసరు అంటే వారికి అసహ్యం. వారికి సాధ్యమయితే వారు అతనిని కూలద్రోసి అతని స్వాధీనమునుండి స్వతంత్రులవ్వగలిగేవారే. కానీ ఇప్పుడు తననుతాను రాజునని చెప్పుకొనుచున్న ‘యేసు’ యొక్క బెదిరింపునుండి కైసరు సామ్రాజ్యాన్ని రక్షించుచున్నట్లు వారు నటించుచున్నారు.

తమయొక్క ఈ వేషధారణకు తగిన శిక్షను క్రీ.శ. 70వ సంవత్సరములో యూదులు అనుభవించారు. ఆ సంవత్సరములో రోమీయులు యెరూషలేములో ప్రవేశించి పట్టణాన్ని సర్వనాశనం చేసి అందులో నివసించుచున్న యూదులనందరినీ హతము చేశారు.

19:13 ‘కైసరుయెడల రాజభక్తి లేదు’ అని యూదులు వేస్తున్న నిందకు తల ఒగ్గడం ఇష్టం లేక పిలాతు ఆ అల్లరి గుంపుకు లొంగిపోయి యేసును బయటకు తీసికొని వచ్చి రాళ్ళుపరచిన స్థలమందు నిలబెట్టినాడు. ఆ స్థలమునకు హెబ్రీ భాషలో ‘గబ్బతా’ అని పేరు.

19:14 అంతకు ముందటిరోజు సాయంత్రం పస్కా విందు జరిగినది. ఈ వచన ములో ప్రస్తావించబడిన ‘పస్కాను సిద్ధపరచు దినము’ అనునది అటుతరువాత జరుగ బోవు విందుకు సిద్ధపడుటను సూచిస్తూ ఉంది.

‘అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను’. మార్కు తన సువార్తలో – అది పగలు తొమ్మిది గంటల సమయము అని వ్రాశాడు. (మార్కు 15:25). సమయం చెప్పే విషయంలో బహుశ మార్కు యూదుల పద్ధతిని, యోహాను రోమనుల పద్ధతిని అనుసరించియుండవచ్చు.

యూదుల కోపమును రేపుటకు పిలాతు యేసును తీసికొనివచ్చి ఇదిగో మీ రాజు అని వారితో చెప్పాడు. తాను యేసును శిక్షించవలసి వచ్చేలా తనను ఇరికించి నందుకు అతడు నిస్సందేహంగా వారినే తప్పుబట్టాడు.

19:15 యేసును సిలువవేయవలెనని యూదులు పట్టుబట్టారు. ‘మీ రాజును మీరే సిలువవేయుమని కోరుతున్నారా? అని పిలాతు వారిని సూటిగా ప్రశ్నించాడు. అందుకు యూదులు ఎంతో నీచస్థితికి దిగజారినవారై కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు’ అన్నారు.

వీరిచ్చిన ఈ జవాబు ఆదికాండము 49:10 వచనమునకు చక్కని నెరవేర్పుగా ఉన్నది. ఆ వచనములో ఇలా ఉన్నది – “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు.” వారు ఒప్పుకొనిన దానినిబట్టి దండము లేక ప్రభుత్వము దేశమునుండి తొలగిపోయినది.

కాని వారి మాటలు షిలోహు అనగా విశ్రాంతి నిచ్చువాడు (Rest-giver) వచ్చియున్నాడనికూడా ఋజువుపరచు చున్నవి. అయితే ఆయన వచ్చియున్నాడనే విషయాన్ని వారు నమ్మడానికి నిరాక రిస్తున్నారు. ‘కైసరు తప్ప మాకు వేరొక రాజులేడు’ అని వారు కేకలు వేశారు. ఎంతటి విశ్వాస ఘాతకమైన జనము!

19:16 యూదులను శాంతింపజేయవలెనని కోరిన పిలాతు, సిలువవేయబడుటకై యేసును సైనికులకు అప్పగించాడు. దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును అతడు ఎక్కువగా ప్రేమించాడు.

“షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు.”

ప్రభువైన యేసు సిలువవేయబడుట (19:17-24) :

19:17 సిలువ – ఒకే కొయ్యతో చేయబడియుండవచ్చు లేదా రెండు వేరు వేరు కొయ్యలతో చేయబడియుండవచ్చు. ఒక మనుష్యుడు మోయగలిగిన పరిమాణము దానికుంటుంది. యేసు కొంత దూరము వరకు తన స్వంత సిలువను మోసికొని వెళ్ళాడు.

తరువాత కురేనీయుడగు సీమోను అను వ్యక్తిచే వారు ఆ సిలువను కొంత దూరము మోయించినట్లుగా మిగిలిన సువార్తల వలన తెలియుచున్నది. యేసు సిలువ వేయబడిన స్థలము ‘కపాల స్థలము’ అని పిలువబడుటకు క్రింది కారణములలో ఏదో ఒకటి అయివుండుటకు అవకాశముంది, అందులో మొదటిది నేరస్థులకు మరణశిక్ష అమలు జరుపుతారు.

కాబట్టి బహుశ ఈ ప్రదేశములో కపాలములు, ఎముకలు ఎక్కువగా ఉండియుండవచ్చు. రెండవది ఈ స్థలము ‘కపాలము’ ఆకారమును పోలియుండవచ్చు. ముఖ్యంగా అది గుహలు కలిగినకొండ అయితే ఆ విధముగా ఉండుటకు అవకాశముంది.

రక్షకుని మరణము Bible Verses Chapter 19

19:18 ప్రభువైన యేసు తన చేతులలోను, కాళ్ళలోను మేకులతో సిలువకు కొట్ట బడ్డాడు. అప్పుడు ఆ సిలువను పైకిలేపి దానిని ఒక గుంటలోనికి దించి నిలబెట్టారు. ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఇద్దరు దొంగలు ఆయనతో కూడ సిలువవేయబడ్డారు.

“అతడు అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను” అను యెషయా 53:12 లోని ప్రవచనమునకు ఇది నెరవేర్పుగా ఉన్నది. ప్రియ స్నేహితుడా! నీవు ఇంకను ఆయనను రక్షకునిగాను, ప్రభువుగాను విశ్వసించనట్లయితే, ఆయన ఏవిధంగా నీకోసం మరణించాడో వివరిస్తున్న ఈ భాగమును నీవు చదువు చుండగా ఇప్పుడే నీవు ఆయనను అంగీకరిస్తావా?

19:19 సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేమిటో బాహాటముగా అందరికి తెలియునట్లు ఒక పత్రముపై వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టించు ఒక ఆచారము కలదు. కాబట్టి పిలాతు – ‘యూదులు రాజైన నజరేయుడగు యేసు’అను పై విలాసము వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా (లాటిన్) భాషలలో వ్రాయబడినది.

19:20 హెబ్రీ, గ్రీకు, లాటిన్-ఈ మూడు భాషలూ మూడు జాతులను మరియు వారి భావాలైన – ప్రత్యక్షత, కళ, సాహిత్యము, అభివృద్ధి, యుద్ధము మరియు ధర్మశాస్త్రము అనువాటిని తెలియజేస్తున్నాయి.

ఎక్కడయితే మానవజాతియొక్క ఈ మూడు రకముల కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుదో, చదవడానికి కన్ను ఉంటుందో – అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగియుంటుంది.

‘యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై యుండెను’ అని వ్రాయబడినది. పట్టణ సరిహద్దులకు బయట ప్రభువైన యేసు సిలువవేయబడినాడు, స్థలం కచ్చితంగా ఎక్కడుందో ఇప్పటివరకు నిర్ధిష్టంగా తెలియబడలేదు.

19:21 పిలాతు పై విలాసమును ఆవిధంగా వ్రాయించడం ప్రధానయాజకులకు నచ్చలేదు. ‘యూదులరాజు’ అని కాక యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయ వలెనని వారు కోరిరి.

19:22 వ్రాయబడినదానిని మార్చుటకు పిలాతు నిరాకరించాడు. వారి విషయంలో సహనం కోల్పోయిన పిలాతు ఇకపై వారి మాటలకు ఏమాత్రం లొంగిపోదలచుకోలేదు. కానీ ఇట్టి ‘నిశ్చయత’ను అతడు అంతకుముందే కనుపరచవలసింది!

19:23 ఈ విధమైన మరణదండన అమలు చేసేటప్పుడు చనిపోయినవారికి చెందిన వస్తువులను సైనికులు తమలోతాము వాటిని పంచుకొనవచ్చును. ఇక్కడ క్రీస్తుయొక్క వస్త్రములను వీరు పంచుకోవడం మనం చూస్తాము.

అవి ఐదు భాగాలు, వారు నాలుగు భాగాలను పంచుకొన్నారు. మిగిలిన అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది. గనుక దానిని చించుటకు సాధ్యపడలేదు.

19:24 కావున వారు దానికోసము చీట్లువేసి చీటివచ్చినవానికి దానిని అప్ప గించారు. దానిని పొందినవాని పేరేమిటో ఇచ్చట వ్రాయబడలేదు. వారీలాగు చేయుచున్నప్పుడు 1000 సంవత్సరములకు పూర్వము వ్రాయబడిన ప్రవచనమును (కీర్తన 22:18) వారు నెరవేర్చుచున్నారనే విషయము వారికి తెలియలేదు.

ఈ విధముగా నెరవేరిన ప్రవచనములు – ఈ గ్రంథము దేవునిచే ప్రేరేపింపబడి వ్రాయ బడినదనియు మరియు యేసుక్రీస్తే వాగ్దానము చేయబడిన నిజమైన మెస్సీయా అనియు తిరిగి మనకు ఒక నూతనమైన రీతిలో జ్ఞాపకము చేస్తున్నాయి.

19:25 యేసు తన తల్లిని యోహానుకు అప్పగించుట (19:25 – 27) : ఈ వచనములో నలుగురు స్త్రీలున్నారు. వారు – యేసు తల్లియైన మరియు, మరియ సహోదరియు – యోహాను తల్లియునగు సలోమే, క్లోపా భార్యయైన మరియ మరియు మగ్దలేనే మరియ.

19:26 తాను ఎంతో వేదనను అనుభవించుచున్నప్పటికీ ప్రభువు ఇతరులపట్ల కనికరయుతమైన శ్రద్ధను కలిగియున్నాడు. ఆయన తన తల్లిని, శిష్యుడైన యోహానును చూచి ఇకపై తన తల్లిపట్ల కుమారుని బాధ్యతను నిర్వర్తించుమని యోహానుకు చెప్పాడు.

తన తల్లిని ‘అమ్మా’ నీ కుమారునిగా ఇతనిని స్వీకరించుమని ఆమెతో చెప్పాడు. (మూలభాషలో ‘woman’ – స్త్రీ అని ఉంది అలా సంబోధించడంలో ప్రభువు ఏవిధంగానూ అగౌరవమును చూపలేదు. ఆమెను ‘అమ్మా’ (తల్లి) అని ఆయన పిలువలేదు. మరియను హెచ్చించి ఆరాధించుటకు శోధింపబడే వారికి ఇది కచ్చితంగా ఒక పాఠమే).

19:27 మరియను తన స్వంత తల్లిగా భావించి ఆదరించుమని యేసు యోహానుతో చెప్పాడు. యోహాను ఆ మాటకు విధేయుడై మరియను తన యింటికి తీసికొని వెళ్ళాడు.
రక్షకుని మరణం (19:28-30)

అవి ఐదు భాగాలు, వారు నాలుగు భాగాలను పంచుకొన్నారు. మిగిలిన అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది.

19:28 మధ్యాహ్నం 12 గంటలనుండి సాయంత్రం 3 గంటలవరకు మూడు గంటలు దేశమంతట చీకటి కమ్మియుండటం బహుశ 27 మరియు 28 వచనముల మధ్యలో సంభవించియుండవచ్చు. ఈ సమయంలోనే ఆయన దేవునిచేత విడువబడి మన పాపములకొరకైన శిక్షను భరించాడు.

‘నేను దప్పిగొనుచున్నాను’ అను ఆయన కేక, సిలువవేయబడి యుండటంద్వారా అధికమైన, నిజమైన, శరీర సంబంధమైన దప్పికను సూచిస్తూ ఉంది. ఈ శరీర సంబంధమైన దప్పికకంటేకూడా, మానవుల ఆత్మల రక్షణకొరకైన ఆయన దప్పిక ఇంకా గొప్పదనికూడా ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది.

19:29 ఆయన త్రాగుటకు సైనికులు చిరకను ఇచ్చారు. వారు ఒక స్పంజీని చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి దానిని ఆయన నోటికి అందించారు. (హిస్సోపు అనునది ఒక మొక్క) దీనిని పస్కాదినమున ఉపయోగించారు. (నిర్గమ 12:22).

దీనికి ముందు చేదు కలిపిన ద్రాక్షారసమును సైనికులు ఆయనకు త్రాగనిచ్చిన సందర్భమును (మత్తయి 27:34) మరియు ఈ సందర్భమును ఒకటి కాదు. చేదుకలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు ఆయన నిరాకరించాడు, ఎందుకంటే నొప్పిని తగ్గించు మందుగా దానిని ఇస్తారు. కాని మన పాపములకు తగిన శిక్షను ఆయన సంపూర్ణముగా భరించాల్సివుంది.

19:30 ‘సమాప్తమైనది’ అని చివరకు ప్రభువు కేకవేశాడు. ఆయన తండ్రి ఆయన కప్పగించిన పని సంపూర్ణముగా నెరవేరింది! మన పాపములకు పరిహారముగా ఆయన తనప్రాణమును ధారపోశాడు.

విమోచన కార్యము మరియు మన పాపములకు ప్రాయశ్చిత్తము సంపూర్తి చేయబడింది. ఆయన ఇంకా మరణించలేదనేది వాస్తవమే కాని ఆయన మరణము, సమాధి చేయబడటం, ఆరోహణం అనేవి – అవి అప్పటికే నెరవేర్చబడ్డాయి అన్నంత నిశ్చయమైనవి.

కాబట్టే పాపులు రక్షింపబడునట్లుగా ద్వారము తెరువబడినదని ప్రభువు ప్రకటించాడు. కల్వరి సిలువలో ప్రభువైన యేసు సంపూర్తి చేసిన కార్యమునకై దేవునికి స్తోత్రములు! ‘ఆయన తలవంచి …’ అని మనము చదువుతాము, అనగా ఆయన తన తలను వెనుకకు వాల్చాడని కొందరు చెబుతారు.

వైన్ ఇలా అంటారు “చనిపోయిన తర్వాత నిస్సహాయంగా తలను వాల్చడం కాదుగాని ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే తన తలను అలా విశ్రాంతి స్థితిలో ఉంచాడు.” ‘ఆయన తన ఆత్మను అప్పగించెను. అనగా ఆయన మరణం స్వేచ్ఛా పూర్వకమైనది. అంటే తన ఇష్టపూర్వకంగానే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. తాను మరణిం చాల్సిన సమయాన్ని ఆయనే నిర్ణయించాడు.

రక్షకుడు ఈటెతో ప్రక్కలో పొడువబడుట (19:31-37) :

19:31 తమ మెస్సీయాను చంపుతూ ఉన్నప్పుడుకూడా ఈ మతాసక్తి గలిగిన యూదులు ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉన్నారో మరల మనము ఇక్కడ చూస్తున్నాము. విశ్రాంతి దినమున (శనివారం) ఆ దేహములను సిలువపైనే ఉంచ కూడదు.

మరుసటి దినము పట్టణంలో మతసంబంధమైన విందు జరగబోతూ ఉంది గనుక నేరస్థులు త్వరగా మరణించులాగున వారి కాళ్ళు విరుగగొట్టించుమని వారు పిలాతుకు మనవి చేశారు.

19:32 కాళ్ళు ఎలా విరుగగొట్టేవారో అది మనకు చెప్పబడలేదు. ఒకచోట విరుగ గొట్టినంతమాత్రాన మరణం సంభవించదు – కాబట్టి అనేకచోట్ల వారి ఎముకలు విరుగగొట్టాల్సి ఉంది. ఇటువంటి విషయాల్లో సైనికులకు ఎంతో అనుభవం ఉండి ఉంటుంది.

19:33 యేసు అప్పటికే మరణించాడని వారు కనుగొన్నారు. ‘ఆయన సొమ్మసిల్లి యుండటంవల్ల వారు ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు’ అని చెప్పుటకు ఏమాత్రం ఆస్కారం లేదు. ఆయన మరణించియుండటం వారు చూచారు.

19:34 “సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్ళును కారెను” – బహుశ ఇది దుష్టత్వము అంతిమముగా బహిర్గత మవడమై డవచ్చును.
రక్తము మరియు నీరు అనువాటియొక్క భావమును గూర్చిన సరైన ఏకీభావము లేదు.

బ్రద్దలయిన హృదయంతో యేసు మరణించాడు అనుదానికి ఒక సూచనగా కొందరు దీనిని భావిస్తారు. కాని ‘ఆయన మరణము అనునది తనకు తానే ఇష్ట పూర్వకంగా అప్పగించుకొనినది’ అని మనము ఇంతకుముందే చదివాము.

రక్షకుడు ఈటెతో ప్రక్కలో పొడువబడుట (19:31-37) :

మరి కొందరు ఇది బాప్తిస్మమునుగూర్చి మరియు ప్రభురాత్రి భోజనమునుగూర్చి చెప్పు చున్నదని భావిస్తారు. కాని ఇది లేనిపోని అర్థం కల్పించినట్లుగా ఉంది. పాపము వలన కలిగే అపరాధ భావననుండి కడుగబడటం అనే సందర్భంలో ‘రక్తము’ మరియు పాపముయొక్క అపవిత్రతనుండి వాక్యముద్వారా శుద్ధిచేయబడడం అనే సందర్భంలో ‘నీరు’ సూచనగా ఉన్నాయి.

19:35 ఈ వచనము – యేసుయొక్క కాళ్ళు విరుగగొట్టబడలేదను వాస్తవమును గూర్చిగాని, యేసు తన ప్రక్కలో పొడవబడుటను గూర్చిగాని లేదా సిలువమరణ సంభవ మంతటినిగూర్చిగాని సూచిస్తూ ఉండవచ్చు.

“ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చు చున్నాడు” అను ఈ మాటలు ఈ వృత్తాంతమును వ్రాసిన యోహానును సూచించు చున్నవనుటలో సందేహము లేదు.

19:36 నిర్గమ 2:46 లోని “దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు” అను ప్రవచనమునకు నెరవేర్పు అని ఈ వచనము జ్ఞాపకంచేస్తూ ఉంది. (33వ వచనము గమనించండి).

ఆ ప్రవచనము పస్కా గొర్రెపిల్లను సూచిస్తుంది. ఎముకలను విరువకూడదు అనునది దేవుని ఆజ్ఞ. ఈ మాదిరి అంతయు క్రీస్తులో సంపూర్తిగా నెరవేర్చబడింది కాబట్టి ఆయనే నిజమైన పస్కా గొర్రెపిల్ల.

19:37 34వ వచనములో జరిగిన దానిని ఈ వచనం జ్ఞాపకముచేస్తూ ఉంది. ఆ సైనికునికి ఏమీ అర్థం కానప్పటికీ, అతడు చేసినది జెకర్యా 12:10 లోని ప్రవచ నమునకు నెరవేర్పుగా ఉన్నది. ఈ ప్రవచనము – భవిష్యత్తులో ఒకానొక దినమున ప్రభువు తిరిగి వచ్చునప్పుడు యూదులు చూస్తారు అన్న విషయాన్నికూడా సూచిస్తూ ఉంది.

“వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లును, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు” (జెకర్యా 12:10).

యేసు పాతిపెట్టబడుట (19:38-42) :

19:38 ఇప్పుడు యేసు పాతిపెట్టబడిన వృత్తాంతము మొదలవుతూ ఉంది. ఇప్పటివరకు అరిమతయియ యోసేపు ఒక రహస్య విశ్వాసిగానే ఉన్నాడు. అతడు క్రీస్తును బహిరంగముగా ఒప్పుకొనకుండా యూదులవలని భయము అతన్ని పట్టి ఉంచింది.

అయితే ఇప్పుడు ప్రభువు దేహమును పాతిపెట్టుటకై సెలవడుగుటకు అతడు ధైర్యముగా అడుగు ముందుకు వేశాడు. ఈ విధముగా చేయడంద్వారా వెలి వేయబడటానికి, హింసించబడటానికి మరియు దౌర్జన్యము చేయబడటానికి అతడు తననుతాను అప్పగించుకున్నాడు.

అయితే యేసు జీవించియున్న కాలములో తృణీక రించబడిన బోధకునిగా నెంచబడిన ఆయన కోసం అతడు నిలబడలేకపోవడమే. బాధాకరమైన విషయం.

యేసు పాతిపెట్టబడుట (19:38-42) :

19:39 నీకొదేము కూడావచ్చి అరిమతయియ యోసేపుతో కలవడం మనము ఇక్కడ చూస్తున్నాము. 3వ అధ్యాయములో అతడు రాత్రివేళ యేసునొద్దకు వచ్చినట్లు గాను మరియు 7వ అధ్యాయములో సన్హెడ్రిన్ సభయెదుట యేసు చెప్పుచున్న దానిని వినిన తరువాతనే ఆయనకు తీర్పు తీర్చవలెనని పట్టుబట్టినట్లుగాను మనము ఈ నీకొదేమును గూర్చి చదివాము.

అతడు బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్లయెత్తు తీసికొని వచ్చాడు.

19:40 బహుశ ఈ సుగంధ ద్రవ్యములు దేహమునకు పూయుటకు వీలుగా మెత్తని పొడి రూపంలో ఉండియుండవచ్చును. దానిని పూసిన తరువాత యేసు దేహమునకు నారబట్టలు చుట్టారు.

19:41 దాదాపుగా ప్రతివిషయము ప్రవచనముల నెరవేర్పుగా నున్నది. “అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను” (యెషయా 53:9) అని యెషయా ముందుగానే ప్రవచించాడు.

ఒక తోటలోని సమాధి అంటే అది కచ్చితముగా ఒక ధనవంతునికి చెందినదై యుండాలి. ఈ సమాధి అరిమతయియ యెసేపుకు చెందినదని మత్తయి సువార్తద్వారా మనకు తెలుస్తుంది.

19:42 యేసు దేహము ఆ సమాధిలో ఉంచబడినది. ఆ సాయంత్రం ప్రారంభం కాబోవుచున్న తమ విందుకు ఆటంకం కలుగకుండవలెనని యేసు దేహమును సిలువపైనుండి దించుటకు యూదులు ఆతృతపడ్డారు. కాని యేసు దేహము మూడు పగళ్ళు, మూడు రాత్రులు ఈ భూమియొక్క కేంద్రభాగములో ఉంచబడటం ఇదంతయు దేవుని ప్రణాళికలో ఒక భాగమైయున్నది.

యూదుల లెక్కల ప్రకారము ఒకదినములోని ఏ భాగమయినా అది ఒక పూర్తి దినముగా లెక్కించబడుతుంది. కాబట్టి ప్రభువు మూడు దినములు సమాధిలో ఉంచబడినాడనే వాస్తవం మత్తయి

12:40 లో ఆయన ముందుగా ప్రవచించినదానికి నెరవేర్పుగా ఉన్నది.

Leave a Comment