కల్వరివైపుకు పయనము – Bible Verses Chapter 18 in Telugu

పదునెనిమిదవ అధ్యాయము

కల్వరివైపుకు పయనము

యూదా యేసును అప్పగించుట (18:1-11) :

18:1 యోహాను సువార్త 13 నుండి 17 అధ్యాయములలోని మాటలు – యేసుక్రీస్తు యెరూషలేములో ఉండగా మాట్లాడినవి. ఇప్పుడు ప్రభువు యెరూషలేము పట్టణమును విడిచి తూర్పుగానున్న ఒలీవల కొండవైపుకు వెళ్ళుచున్నాడు, ఆయన కెద్రోను వాగును దాటి ఒలీవల కొండకు పడమటి వాలున ఉన్న గెత్సెమనే తోటలోనికి వచ్చాడు.

18:2 ప్రభువు ఆ తోటలో అనేకసార్లు ప్రార్థనలో గడపడం యూదాకు తెలుసు, ప్రభువును కనుగొనుటకు అవకాశం హెచ్చుగానున్న స్థలము – ఆయన ప్రార్ధనా స్థలమే అనికూడ అతనికి తెలుసు. కావున సైనికులను, ప్రధాన యాజకులు – పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని అతడు గెత్సెమనే తోటకు వచ్చాడు.

18:3 ఈ సైనికులు బహుశా రోమా సైనికులై యుండవచ్చును. బంట్రౌతులు అనగా ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపగా వచ్చిన ఉద్యోగులు, వారు దివిటీలతోను, దీపములతోను, ఆయుధములతోను వచ్చారు. లోకమునకు వెలుగైయున్న వానిని వెదకడం కోసం వారు దివిటీలు తీసికొని వచ్చారు!

18:4 వారు తనను కనుగొనేంతవరకు వేచియుండక, ప్రభువే వారిని కలుసు కునేందుకు వచ్చాడు. ఇది సిలువకు తనను తాను అప్పగించుకోవడంలోని తన అంగీకారమును వెల్లడిచేస్తూ ఉంది. సైనికులు తమతో ఆయుధాలేమీ తీసికొని రాక పోయినా రక్షకుడు వారిని ఏ మాత్రం ప్రతిఘటించేవాడు కాదు.

Read and Learn More Telugu Bible Verses

‘మీరెవరిని వెదకు చున్నారు?’ అని ఆయన ప్రశ్నించాడు. వారు ఏ పని నిమిత్తమై వచ్చారో దానిని వారి పెదవులతోనే చెప్పించడమే ఈ ప్రశ్న వేయడంలోని ఉద్దేశ్యం.

18:5 ‘ఆయన వారి సృష్టికర్త, వారిని పోషించి కాపాడువాడు మరియు వారు అంతకు ముందెన్నడూ కలిగియుండని మంచి స్నేహితుడు’ అనే గ్రహింపులేనివారై నజరేయుడైన యేసును పట్టుకొనుటకు వారు వెదకిరి. “నేనే” (I AM) అని యేసు పలికెను. ఆయన నజరేతుకు చెందిన యేసే.

అయితే ఆయన యెహోవా కూడా ‘నేను ఉన్నవాడు’ (I AM) అనునది పాత నిబంధనలో యెహోవాకున్న పేర్లలో ఒకటి, ఆ సమూహంలోని ఇతరులతోకూడా యూదా నిలువబడియున్నప్పుడు, ఇది అతడు క్రొత్తగా ఆశ్చర్యపడేలా చేసిందా?

18:6 ఒక్కక్షణం యేసు తనను తాను సర్వశక్తిమంతుడైన దేవుడగు ‘నేనే’ (I AM) గా వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ ప్రత్యక్షత ఎంత శక్తిగలదిగా ఉన్నదంటే, వారు వెనుకకు తగ్గి నేలమీద పడిపోయారు.

కల్వరివైపుకు పయనము యూదా యేసును అప్పగించుట (18:1-11) :

18:7 మరల ప్రభువు – మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని ప్రశ్నించాడు. అంతకుముందే యేసుయొక్క (I AM) రెండు మాటలూ వారిమీద ఎంతో ప్రభావం చూపినప్పటికీ మరలా వారు అదే సమాధానం ఇచ్చారు.

18:8 వారు వెదుకుచున్న వ్యక్తి తానే అనియు మరియు తానే యెహోవా అనియు యేసు మరియొకసారి వారితో చెప్పెను. “నేనే ఆయననని మీతో చెప్పితిని. మీరు వెదకుచున్నది నా కోసమే గనుక శిష్యులను పోనియ్యుడని” యేసు వారితో చెప్పాడు.

తన స్వంత జీవితము ఎంతో అపాయములోనున్న సమయములోకూడా ఇతరులయెడల నిస్వార్థమైన ఆసక్తిని కలిగియుండటమనేది ఎంతో అద్భుతమైన విషయము!

18:9 యోహాను 17:12 లో యేసు పలికిన మాటలు ఇచ్చట నెరవేరినవి.

18:10 తన యజమానిని ఆ సమూహమునుండి బలత్కారముగా రక్షించుకొను సమయము ఆసన్నమైనదని పేతురు తలంచాడు. అతడు తన కత్తిదూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికాడు. పేతురు ఆ దాసుని చంపుటకు ఉద్దేశించెననుటలో సందేహము లేదు. కాని ఆ కత్తిని ఆ దాసుని కుడి చెవిని మాత్రమే సరుకునట్లుగా అది ప్రక్కకు తప్పినది.

18:11 పేతురు దురభిమానాన్ని యేసు గద్దించాడు. ‘శ్రమ అనుభవించడం మరియు మరణం’ అనే పాత్ర (Cup) ఆయనకు తండ్రిద్వారా ఇవ్వబడినది. మరియు దానిని త్రాగుటకే ఆయన నిర్ణయించుకొని యున్నాడు. ఈ సందర్భములో ప్రభువు ఏవిధంగా ‘మల్కు’ అను ఈ దాసునియొక్క చెవిని తాకి స్వస్థపరచాడో ఆ వృత్తాంతాన్ని లూకా తన సువార్తలో వ్రాశాడు.

యేసును పట్టుకొని బంధించుట (18:12-14) :

18:12 ఇప్పుడు మొదటిసారిగా దుష్టులైన మనుష్యులు ప్రభువైన యేసును పట్టుకొని బంధించగలిగినారు. ఆయన ‘అన్న’ యొద్దకు తీసుకొనిపోబడినాడు ‘అన్న’ అంతకు ముందు ప్రధాన యాజకునిగా పనిచేసినవాడు.

ఇప్పుడు ప్రధానయాజకునిగానున్న కయపయొద్దకు గాక అతని మామయగు అన్నయొద్దకు ముందుగా యేసు ఎందుకు తీసికొనిపోబడినాడో స్పష్టముగా తెలియదు. ప్రాముఖ్యమైన విషయమేమిటంటే ఆయ మోపబడిన నేరములైన ‘దేవదూషణ, భిన్న మతబోధ’ అను వాటిని ఋజువు చేసే ప్రయత్నములో భాగంగా యేసు ముందుగా యూదుల యెదుట న్యాయవిమర్శకు నిలబడినాడు.

దీనిని మనము ‘మత సంబంధమైన విచారణ’ అని పిలువవచ్చు. తరువాత – ఆయన ‘కైసరుకు శత్రువు’ అని ఆయనపై మోపబడిన నేరాన్ని ఋజువుచేసే ప్రయత్నములో భాగంగా రోమా అధికారులయెదుట విమర్శింప బడుటకై వారియొద్దకు తీసికొని పోబడినాడు.

అది – ‘పౌరసంబంధమైన విచారణ’ యూదులు రోమా అధికారము క్రింద ఉన్నారు. కాబట్టి వారు రోమా న్యాయస్థానముల ద్వారామాత్రమే పనిచేయవలసియుంది. మరణశిక్ష అమలుపరచే అధికారము వారికి లేదు. వారు దానిని పిలాతుద్వారా జరిగించాల్సి ఉంది.

యేసును పట్టుకొని బంధించుట (18:12-14) :

18:14 ప్రజలందరికొరకు ఒక మనుష్యుడు చనిపోవుట ప్రయోజనకరమని ప్రవచించిన కయపయు (యోహాను 11:50) ప్రధాన యాజకుడును ఒక్కడే అని యోహాను ఇచ్చట వివరించుచున్నాడు. ఆ ప్రవచన నెరవేర్పులో అతడు ఇప్పుడు పాలుపంపులు పొందబోవుచున్నాడు.

“కయప అను ఈ మనుష్యుడు ప్రజలందరి ఆత్మలకు కాపరిగా ఉండుటకు అధికారము పొందినవాడు, ఇతడు దేవునియొద్ద నుండి వర్తమానమును తెచ్చుటకును, సర్వాధికారియగు దేవునియొక్క ప్రతినిధిగా ఉండుటకును ప్రత్యేకింపబడినవాడు.

సంవత్సరమున కొకసారి అతిపరిశుద్ధ స్థలము లోనికి ప్రవేశించే మహిమకరమైన భాగ్యమును ఇతడు కలిగియున్నాడు. కాని ఈ మనుష్యుడే దేవుని కుమారుని నిందించినాడు.”

“ప్రపంచములో అత్యున్నతమైన మత అవకాశాలు మరియు ఎంతో ఆశాజనకమైన వాతావరణం ఒక వ్యక్తి రక్షణకు హామి ఇవ్వలేవు లేదా అవి అతని ఆత్మను యోగ్యంగా చేయలేవు’ అను సత్యాన్ని వివరించ డానికి ఇంత కంటే నిర్ఘాంతపరచే ఉదాహరణను చరిత్ర అందించలేదు.

‘యాత్రికుని ప్రయాణం’ అను గ్రంథాన్ని వ్రాసిన జాన్ బన్యన్ తన గ్రంథం ముగింపులో ఇలా వ్రాశాడు – “నేను” చూడగా, ఆకాశముయొక్క గవునులయొద్దనుండియు నరకమునకు వెళ్లుత్రోవ ఉన్నదని నాకు తెలిసెను.

పేతురు ప్రభువును ఎరుగనని బొంకుట (18:15-18) :

18:15 ఈ వచనములో ప్రస్తావించబడిన మరియొక శిష్యుడు యోహాను – కానీ అతడు వినయపూర్వకముగా, మరియు పేతురుయొక్క అవమానకరమైన వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని తన పేరును తానే ప్రస్తావించుకోలేదని చాలమంది బైబిలు పండితులు అభిప్రాయపడుచున్నారు.

ప్రధాన యాజకునితో అంతటి పరిచయమును యోహాను ఏ విధముగా కలిగియున్నాడో మనకు చెప్పబడలేదు. ప్రధాన యాజకునికి అతడు నెళవైనవాడు గనుక ప్రధాన యాజకుని యింటి ముంగిటిలోనికి వెళ్ళ గలిగినాడు.

యేసును పట్టుకొని బంధించుట (18:12-14) :

18:16 యోహాను బయటకువచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి అనుమతి తీసికొనేవరకు పేతురు లోపలికి ప్రవేశించుటకు వీలులేకపోయింది. జరిగినదంతటినీ పరిశీలిస్తే, తన పలుకుబడిని ఈ విధంగా ఉపయోగించడం యోహాను యొక్క దయ కావచ్చునని మనము ఆశ్చర్యపడతాము.

18:17 పేతురు ప్రభువును ఎరుగనని మొట్టమొదటిగా బొంకినది ఒక సైనికుని ముందు కాదుగాని ఒక స్త్రీ ముందు.

18:18 తాను యేసు శిష్యుడను కానని పేతురు బొంకాడు. ఇప్పుడు పేతురు తన ప్రభువుయొక్క శత్రువులతో కలిసిపోయి తన గుర్తింపును మరుగుచేయుటకు ప్రయత్నించాడు. అనేకమంది ఇతర శిష్యులవలెనే పేతురుకూడా ఈ లోకముయొక్క మంటవద్ద చలికాచుకున్నాడు.

మతసంబంధమైన విచారణ (18:19-24) :

18:19 ఈ వచనములోని ప్రధానయాజకుడు ‘అన్న’యో లేక ‘కయప’యో స్పష్టముగా వ్రాయబడలేదు. ఇతడు ‘అన్న’ అయివుండవచ్చని తోచుచున్నది. అదే నిజమైతే – అతడు అంతకుమునుపు ఆ పదవిలో ఉన్న కారణంచేత బహుశ మర్యాద పూర్వకముగా ‘ప్రధానయాజకుడు’ అని అతడు పిలువబడి యుండవచ్చును.

ప్రధాన యాజకుడు యేసును – ఆయన శిష్యులనుగూర్చి మరియు ఆయన బోధలను గూర్చి ప్రశ్నించాడు. ఆయనమీద మోపుటకు వారికి ఏ నేరము దొరకలేదు గనుక ఏదో ఒక నేరము సృష్టించుటకు వారు ప్రయత్నించుచున్నారు.

18:20 తాను చేసినది బహిరంగ పరిచర్యయని ప్రభువు సమాధానమిచ్చాడు. రహస్యముగా నుంచుటకు ఆయనయొద్ద ఏమియు లేదు. సమాజ మందిరములలో యూదుల సమక్షంలోను మరియు దేవాలయములోను ఆయన బోధించాడు, రహస్య ముగా జరిగినదేమియు లేదు.

మతసంబంధమైన విచారణ (18:19-24) :

18:21 తన బోధలు విన్న యూదులను ముందుకు తీసికొని రమ్మని ఆయన న్యాయాధిపతులను సవాలు చేశాడు. వారిని తనకు వ్యతిరేకంగా ఆరోపణలు తీసుకొని రానివ్వండి. తాను ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, మాట్లాడినా, సాక్ష్యము తీసికొనిరా వచ్చునని ప్రభువు సమాధానము.

18:22 యేసు ఇచ్చిన ఈ సమాధానము యూదులను చికాకు పెట్టింది. ఆ సమాధానమునుబట్టి వారు యేసుపై ఏ విధమైన కేసును బనాయించలేకపోయారు. కనుక వారు ఆయనను దూషించడం మొదలుపెట్టారు. యేసు ప్రధానయాజకునితో మాట్లాడిన విధానము సరియైనదిగా లేదన్న నెపంతో అక్కడున్న బంట్రౌతులలో ఒకడు ఆయనను అరచేతులతో కొట్టాడు.

18:23 పరిపూర్ణమైన ఆత్మస్థైర్యంతోనూ, తర్కంతోనూ, రక్షకుడు వారి స్థితి అసమంజసమని చూపాడు. ఆయన చెడ్డగా మాట్లాడాడని వారు ఆరోపించలేక పోయారు. ఆయన నిజము చెప్పినందుకు వారు ఆయనను కొట్టారు.

18:24 ‘అంతట అన్న యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయపయొద్దకు పంపెను’ అని ఈ వచనములో వ్రాయబడియున్నది. అనగా మొదటి విచారణ అన్న యెదుట జరిగినదని చెప్పవచ్చును. కయప యెదుట జరిగిన విచారణను గూర్చి యోహాను సువార్తలో వ్రాయబడలేదు. అది ఈ అధ్యాయము లోని 24 మరియు 28 వచనముల మధ్య జరిగినది.

పేతురు రెండవసారి మరియు మూడవసారి బొంకుట (18:25 – 27):

18:25 ఈ వృత్తాంతము మరల పేతురువైపునకు మళ్ళినది. తెల్లవారు జామున చలిలో అతడు చలికాచుకొనుచున్నాడు. అతని వస్త్రధారణ మరియు అతని మాటల తీరు నిస్సందేహంగా అతడొక గలిలయ జాలరుడనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

అతనితో కూడ నిలుచున్నవారిలో నొకడు నీవును యేసు శిష్యులలో ఒకడవు కావా? అని అతని ప్రశ్నించాడు, పేతురు రెండవసారి కూడా ఆయన ఎవరో తనకు తెలియదని బొంకాడు.

18:26 పేతురుతో మాట్లాడిన ఈ వ్యక్తి-మల్కు యొక్క బంధువు. తన బంధువు యొక్క చెవిని పేతురు తెగనరకడం అతడు చూచాడు. ‘నీవు తోటలో యేసుతో నుండగా నేను చూడలేదా? అని అతడు మరల ప్రశ్నించాడు.పేతురు రెండవసారి మరియు మూడవసారి బొంకుట (18:25 - 27):

18:27 ఇప్పుడు పేతురు మూడవసారి తాను ప్రభువును ఎరుగనని అబద్ధమాడాడు. వెంటనే కోడి కూయడం అతడు విన్నాడు. మరియు “కోడికూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువు” అని ప్రభువు పలికిన మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. అప్పుడు పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినట్లుగా మిగిలిన సువార్తలవలన మనకు తెలియుచున్నది.

పిలాతు యెదుట ‘పౌరసంబంధమైన విచారణ’ (18:28-40) :

18:28 మత సంబంధమైన విచారణ ముగిసినది. ఇక పౌరసంబంధమైన విచారణ ప్రారంభమవబోతూ ఉంది. గవర్నరు యొక్క అధికార మందిరము లేక న్యాయవిమర్శ జరిగే సభయొక్క సన్నివేశమిది. అన్యులయొక్క అధికార మందిరంలోనికి వెళ్ళడానికి యూదులకు ఇష్టము లేదు.

ఆ విధంగా చేస్తే తాము మైలపడి పస్కాను భుజించకుండా ఉండవలసి వస్తుందని వారు తలంచారు. కానీ దేవుని కుమారుని చంపడానికి కుట్ర పన్నడం అనే విషయం వారిని ఏ మాత్రం బాధించలేదు. వారికి అన్యుల గృహంలో ప్రవేశించడం అంటే చాలా విషాదకరమైన విషయముగానీ హత్యమాత్రం తృణప్రాయం.

కల్వరివైపుకు పయనము Bible Verses Chapter 18

అగస్టీన్ ఇలా అన్నారు “వారు (యూదులు) ఇతరుల నివాసస్థలమునుబట్టి నిశ్చయముగా అపవిత్రపరచబడతారుగాని తమ స్వంత అపరాధమునుబట్టి అపవిత్ర పరచబడరు. ఒక అన్యుడైన న్యాయాధిపతి యొక్క ప్రేతోర్యమను సభవలన అపవిత్ర పరచబడుదుమని వారు భయపడ్డారు గాని నిరపరాధియైన ఒక సహోదరుని రక్తమును బట్టి అపవిత్రపరచబడుదుమనే భయం వారికి లేదు.

ఏమిటీ దుష్టమైన అంధత్వం!” బిషప్ హాల్ ఇలా అన్నారు. “యాజకులారా, శాస్త్రులారా, అధికారులారా, వేషధారులారా! అయ్యో మీకు శ్రమ! మీ హృదయములంత అపవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉండగలదా? పిలాతుయొక్క అధికార మందిరపు గోడలు కాదు గాని మీ హృదయములే అపవిత్రములు.

హత్య మీ పనియేనా? మీరు సాధారణమైన అంటువ్యాధి వలన ఆగిపోతారా? సున్నముకొట్టిన గోడల్లారా! దేవుడు మిమ్మును మొత్తుతాడు. మీరు దేవుని రక్తముచే మలినపరచబడటానికి కోరుకొంటున్నారా? పిలాతు అధికార మందిరములో అడుగుపెడితే అపవిత్రులమవుతామని మీరు భయపడుతున్నారా? ఒక ప్రక్క ఘోరమైన దుష్టత్వమనే ఒంటెను మ్రింగుతూ మరో ప్రక్క ఏదైనా నలక గొంతులో ఇరుక్కుందని బాధపడుతున్నారా? ఓ అబద్ధికులైన అవిశ్వాసులారా! మీరు అపవిత్రులు కాకుండా ఉండాలంటే యెరూషలేమునుండి వెళ్ళిపొండి.

భయపడడానికి పిలాతుకు ఇంకా అధికమైన కారణం ఉంది. ఎందుకంటే మీవంటి అత్యంత ఘోరమైన దుష్టత్వాన్ని కలిగియున్న రాక్షసులవలన అతడి గోడలు అపవిత్రమౌతాయి”.
పూలే ఇలా అన్నారు – “ఆచారాల గురించి విపరీతమైన ఆసక్తి కలిగియున్న, వ్యక్తులు నైతిక విలువలు కోల్పోవడంకన్నా సాధారణమైనది మరేదీ లేదు.”

‘వారు పస్కాను భుజింపవలెనని’ అను మాట బహుశ పస్కా తరువాత జరుగు విందుకు సంబంధించినదైయుండవచ్చును. అంతకుముందటి రాత్రే పస్కాపండుగ జరుపబడినది.

18:29 రోమా గవర్నరైన పిలాతు బయటకు యూదులున్న చోటికి వెళ్ళడంద్వారా వారికి లొంగిపోయాడు. ‘ఖైదీగానున్న యేసుపై ఏ నేరము మోపుచున్నారు?” అను ప్రశ్న వేయుటద్వారా అతడు విచారణను ప్రారంభించాడు.

18:30 ఎంతో ధైర్యముగాను, అమర్యాదగాను వారు సమాధానమిచ్చారు. తాము అంతకుమునుపే ఆయనను విచారణ చేసి దోషిగా నిర్ణయించినట్లు వారు చెప్పారు. ఇక పిలాతు శిక్ష విధించడమే వారికి కావలసింది.

18:31 పిలాతు తన కర్తవ్యము నిర్వర్తించకుండా తప్పించుకొని దానిని యూదులపైకి నెట్టడానికి ప్రయత్నించాడు. వారు అంతకు మునుపే ఆయనను విచారణచేసి దోషిగా నిర్ణయించినట్లయితే ఎందువల్ల వారు తమ ధర్మశాస్త్రము చొప్పున ఆయనకు తీర్పు తీర్చి శిక్ష విధించలేదు? అందుకు యూదులు ఇలా సమాధానమిచ్చారు

“మేము స్వాతంత్య్రము కలిగినవారము కాదు మేము రోమా ప్రభుత్వంచేత పాలించబడుతున్న వారము. ప్రభుత్వము మా చేతుల్లోనుండి తీసివేయబడింది. కాబట్టి ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించే అధికారం మాకు ఇక లేకుండా పోయింది”.

అన్యుల అధికారానికి తాము దాసులమైయున్నాము – లోబడియున్నాము అనే విషయాన్ని వారు ఈ విధంగా ఒప్పుకొనుచున్నారు. అంతేగాక ‘క్రీస్తు మరణం’ యొక్క నిందను పిలాతుపైకి మళ్ళించుటకు కూడా వారు తలంచారు.

18:32 ఈ 32వ వచనము రెండు అర్థములను కలిగియుండవచ్చును. (1) తనకు మరణశిక్ష విధించునట్లుగా యూదులు తనను అన్యజనులకు అప్పగించెదరని మత్తయి 2019 లో యేసు ముందుగానే చెప్పియున్నాడు. ఆయన మాటలను యూదులు ఇప్పుడు నెరవేర్చుచున్నారు.

(2) చాలా చోట్ల ప్రభువు తాను ఎత్తబడుదునని చెప్పి యున్నాడు. (యోహాను 3:14; 8:28; 12:32, 34) ఇది సిలువ మరణాన్ని సూచిస్తూ ఉంది. సాధారణంగా యూదులు మరణ శిక్ష విధించే సందర్భములో రాళ్ళతో కొట్టి చంపుతారు.

కానీ సిలువవేసి చంపడం అనేది రోమా సామ్రాజ్యం యొక్క పద్ధతి. ఇప్పుడు ప్రభువు విషయంలో తామే మరణ శిక్షను అమలు జరపడానికి వారు నిరాకరించడంతో, యూదులు తమకు తెలియకుండానే ప్రభువుకు సంబంధించిన ఈ రెండు ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నారు.

(కీర్తనలు 22:16 కూడ చూడండి). 18:33 యేసును ఏకాంతముగా ప్రశ్నించుటకై పిలాతు ఆయనను తన అధికార మందిరములోనికి పిలిపించి – ‘యూదుల రాజువు నీవేనా?’ అని ఆయనను అడిగాడు.పిలాతు యెదుట 'పౌరసంబంధమైన విచారణ' (18:28-40) :

18:34 అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు “నేను రోమా ప్రభుత్వాన్ని కూల ద్రోయడానికి ప్రయత్నించినట్లుగా, ఒక గవర్నరుగా నీవు ఎప్పుడైన విన్నావా? కైసరు సామ్రాజ్యాన్ని కూలద్రోయగల రాజుగా నన్ను నేను ప్రకటించుకొనినట్లు ఇంతవరకు నీకేమైనా సమాచారము వచ్చినదా ? నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా? లేక ఇప్పుడు ఈ యూదులు మాట్లాడగా విని అనుచున్నావా?”

18:35 పిలాతు జవాబు ఎంతో తిరస్కారముతో కూడుకొనినదై యున్నది. “నేను యూదుడనా యేమి?” అని అతడు ప్రశ్నించాడు. ఇలా అడగడంలో ‘తాను చాలా ముఖ్యమైన వ్యక్తిననీ, స్థానికంగా యూదులయొక్క ఈ సమస్యతో తాను కలత చెంద నవసరం లేదని’ అతని ఉద్దేశ్యం.

గానీ అతడిచ్చిన ఈ జవాబు – యేసుపై మోపబడిన నేరమేమిటో అతనికి తెలియదని అతడు ఒప్పుకొనుచున్నట్లుగా ఉన్నది. యూదుల అధికారులు ఏదైతే చెప్పారో అది మాత్రమే అతనికి తెలుసు.

18:36 అప్పుడు ప్రభువు తాను రాజునని ఒప్పుకొనినాడు. కాని యూదులు నింద మోపినట్లుగా ఆవిధమైన రాజు కాడు. మరియు రోమా ప్రభుత్వమును బెదిరించేవాడు కాడు. క్రీస్తుయొక్క రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; మానవుల ఆయుధాల ద్వారా అభివృద్ధి చెందునది కాదు.

ఆయన రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే ఆయనను బంధించకుండా ఆయన శిష్యులు పోరాడియుండెడివారు. అది ఈ లోకమునకు చెందినది కాదు. అది తన శక్తిని, అధికారమును లోకమునుండి స్వీకరించదు. దాని ఉద్దేశాలు మరియు లక్ష్యాలు శరీరసంబంధమైనవి కావు.

18:37 తరువాత పిలాతు ఆయనను ‘నీవు నిజముగా రాజువా?’ అని ప్రశ్నించాడు. ‘నీవన్నట్టు నేను రాజునే’ అని యేసు జవాబిచ్చాడు, అనగా నీవు పలికినది నిజమే’ అని అర్థము. కాని ఆయన రాజ్యము సత్యమునకు సంబం ధించినది.

కత్తులకు, డాళ్ళకు సంబంధించినది కాదు. ఆయన ఈ లోకమునకు వచ్చెనను సత్యమునకు ఇది సాక్ష్యమైయున్నది. ఇచ్చట ‘సత్యము’ అనగా ‘దేవుని గూర్చిన ‘సత్యము’ క్రీస్తును గూర్చినది, పరిశుద్ధాత్మ, మానవుడు, పాపము, రక్షణ మరియు క్రైస్తవ్యానికి సంబంధించిన ఇతర గొప్ప సిద్ధాంతాలను గూర్చినది.

ఎవరైతే సత్యమును ప్రేమిస్తారో వారు ఆయన స్వరాన్ని వింటారు. ఈ విధంగా ఆయన రాజ్యము అభివృద్ధి చెందుతుంది.

18:38 ‘సత్యమనగా ఏమిటి?’ అని పిలాతు ప్రశ్నించాడు. ఈ విధంగా అడగడంలో అతని ఉద్దేశ్యమేమిటో చెప్పడం కష్టం. అతడు కలవరపడినాడా? లేక అపహాస్యము చేయుచున్నాడా? లేక సత్యమనగా నేమిటో తెలిసికొనుటకు నిజముగానే ఆసక్తి కలిగియున్నాడా? ఒక్కటి మాత్రం మనకు తెలుసు.

శరీర రూపము దాల్చిన ‘సత్యము’ (యేసు) అతని యెదుట నిలువబడియున్నాడు, కాని ఆయనను అతడు గుర్తుపట్టలేదు. యేసులో ఎలాంటి దోషము లేదని గ్రహించిన పిలాతు తిరిగి యూదులవద్దకు వచ్చాడు.

18:39 పస్కా పండుగ సమయములో పేరుమోసిన ఒక యూదు ఖైదీని విడుదల చేయుమని రోమా ప్రభుత్వాన్ని కోరే ఒక సాంప్రదాయం యూదులకు ఉన్నది. ఈ సాంప్రదాయాన్ని ఉపయోగించి యూదులను సంతోష పెట్టుటకును, అదే సమయ ములో యేసును విడుదల చేయుటకును పిలాతు ప్రయత్నించాడు.

18:40 కానీ అతని ఆలోచన సఫలం కాలేదు. యూదులు యేసును గాక బరబ్బను కోరుకున్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.

Leave a Comment