మేడ గదిలో – Bible Verses Chapter 13 in Telugu

పదమూడవ అధ్యాయము

మేడ గదిలో …

ఇంతవరకు ప్రభువు తన్ను తాను ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచుకొనిన ప్రత్యేకమైన యేడు గుర్తులు, లేదా అద్భుతములు ఇచ్చట పొందుపరచబడెను. ఒక పాపి క్రీస్తునందు విశ్వాసముంచునపుడు కలుగు అనుభవమును వీటియందు పొందు పరచవచ్చును. ఆ గుర్తులేవనగా :-

  •  నీరు ద్రాక్షారసముగామారుట (2:1-12). ఇది దైవసంబంధమైన ఆనందము, నిరాశలోఉన్న పాపికి ప్రభువైన క్రీస్తు తన శక్తిద్వారా సంతోషము అందించుట.
  •  ప్రధాని కుమారుడు స్వస్థపరచబడుట (4:46 -54). రోగియైన పాపికి ఆత్మీయ ఆరోగ్యము అవసరము. అది క్రీస్తు ఇచ్చును.
  •  బేతెస్థ కోనేటి దగ్గర వ్యాధిగ్రస్థుని స్వస్థపరచబడుట (5వ అధ్యాయము) పాపి శక్తిలేనివాడుగాను, నిస్సహాయకుడుగాను తన స్థితిని తాను మెరుగు పరచుకొనలేని పరిస్థితిలో నుండగా ప్రభువైన యేసు అట్టి దురవస్థనుండి అతనిని తప్పించెను.
  • ఐదువేల మందికి ఆహారము పెట్టుట (6వ అధ్యాయము). శక్తినిచ్చు ఆహారము, నీరు పాపికి అవసరమైయుండగా ప్రభువైనయేసు మరెన్నటికి ఆకలి గొనకుండు నట్లు అతని ఆత్మకు ఆహారము దయచేయును.
  •  ఆయన గలలియ సముద్రమును నిమ్మళపరచుట (6:16-21). పాపి అపాయకర మైన స్థితిలో నున్నాడు. ప్రభువైన యేసు తుఫానునుండి రక్షించును.
  •  పుట్టు గ్రుడ్డివానిని స్వస్థపరచుట (9వ అధ్యా॥). ఒకడు క్రీస్తు శక్తిచే తాకబడ నంతవరకు ఆత్మీయముగా గ్రుడ్డివాడుగా నుండును. పరిశుద్ధాత్మ దేవుని వలన ఒకడు ప్రభావితుడు కానంతవరకు తన పాప జీవితమునుగాని రక్షకునియొక్క సౌందర్యమునుగాని దృష్టించలేడు.
  •  మృతుడైన లాజరును లేపుట (11 అధ్యా॥). పాపి తన పాపములతోను, అతిక్రమ ములతో చచ్చినవాడుగా ఉన్నాడు. వానికి పైనుండి వచ్చు జీవము అవసరమై యున్నది.

ఈ గుర్తులన్నియు యేసే ‘క్రీస్తు’ అనియు, దేవుని కుమారుడనియు నిరూపించు చున్నవి.

Read and Learn More Telugu Bible Verses

13వ అధ్యాయములో మేడగది ప్రస్తావన వచ్చినది. శత్రు స్వభావము కల్గిన యూదుల మధ్య ఆయనిప్పుడు సంచరించుటలేదు తాను హింసింపబడుటకును, చంపబడుటకును అప్పగింపబడక మునుపు తన శిష్యులతో చివరిసారి సహవాసము నపేక్షించి మేడగదిలో చేరెను. 13 వ అధ్యాయము నుండి 17వ అధ్యాయము వరకు క్రొత్త నిబంధనలో ఆసక్తికరమైన అంశములను మనము గమనించుదుము.

మేడ గదిలో …

యేసు శిష్యుల పాదములను కడుగుట (13:1-11) :

13:1,2 సిలువ మరణమునకు ముందటి దినమది. తాను మరణించుటకును, తిరిగి లేచుటకును, మరియు పరలోకమునకు ఎక్కిపోవుటకును సమయము సమీపించినదని యేసు ఎరిగియుండెను. తనయందు నిజముగా విశ్వాసముంచిన తన వారిని ఆయన ఎరుగును.

ఆయన తాను ఈ భూమిపై పరిచర్య చేయునంతవరకు, మరియు నిత్యత్వమంతటివరకు వారిని ప్రేమించెను. తాను వారి నెంతగా ప్రేమించెనో ఈ దిగువ సన్నివేశమందు ప్రత్యక్షపరచెను. వారు భోజనము చేయుచుండగా అని వ్రాయబడెను గాని, ప్రభురాత్రి భోజనమనిగాని, పస్కా భోజనమనిగాని, మామూలు భోజనమనిగాని వ్రాయబడలేదు.

ఈ భోజన సమయమందే యూదాకు సాతాను యేసును అప్పగించు సమయమాసన్నమైనదను బీజమును నాటెను. ఈ విషయమై యూదా గతములోనే ఆలోచించుకొనియుండెను గాని, ఆ కౄరకృత్యమును ప్రారంభిం చుటకు సాతానుద్వారా పురికొల్పబడెను.

13:3 యేసు తనయొక్క దైవత్వములో నమ్మకముంచెను. తనకు అప్పగింపబడిన పనిని తాను ఎరిగియుండెను. తండ్రియైన దేవుని యొద్దనుండి తాను వచ్చెననియు మరల ఆయనయొద్దకు తిరిగి వెళ్ళనై యున్నాడనియు ఎరిగియుండెను.

13:4-7 తానెవరై యున్నాడో ఎరిగియుండియు, ఆయన ఎందు నిమిత్తము వచ్చియున్నాడో ఎరిగియుండియు, ఆయన గురి ఏమైయున్నదో ఎరిగియుండియు, ప్రభువు వంగి శిష్యుల పాదములను కడుగుచుండెను.

ఆయన భోజనమునకు లేచినప్పుడు పైవస్త్రము తీసివైచి, నడుమునకు తువాలు కట్టుకొని, దాసుని స్థానమును తీసికొనెను. తాను సృజించినవానికి పరిచర్య చేయుటకు ప్రభువు ఉన్నతస్థలములను విడిచి వచ్చెను.

తూర్పు దేశములందు చెప్పులు తీసి కూర్చుండుటవలన తరచుగా కాళ్ళు కడుగుటకు వీలుగా నుండును. ఆహ్వానించినవాడు ఆహ్వానింపబడినవారి పాదములు కడుగుట వారి సాంప్రదాయము.

దైవ స్వరూపుడే సేవకుడై చేసిన యీ దీనపరిచర్య – విశ్వాస ఘాతకుని పాదములచెంత యేసు! ఏమి దృశ్యమది! మనకెంతటి పాఠము! పేతురు చలించెను. దేవుడంతటి గొప్పవాడు తానంత అపాత్రుడైన వానిని కడుగుటను అంగీకరించలేకపోయెను.

తానిప్పుడు చేయుచున్న దానిలో ఆత్మీయార్థము ఉన్నదని యేసు చెప్పెను. పాదములు కడుగుటయనగా ఆత్మీయముగా శుభ్రపరచుట. అయితే పేతురు, యేసు చేయుచున్న కార్యమునే చూచుచుండెను గాని, దానిలోని ఆత్మీయార్థమును గ్రహించలేదు. పేతురు ఇప్పుడు తెలిసికొనవలెనని ప్రభువు దానిని వివరించుచున్నాడు. పేతురు ఆయనను ఎరుగనని ముమ్మారు బొంకిన తరువాత, తాను తిరిగి పునరుద్ధరింపబడి అనుభవపూర్వకముగా తెలిసికొనెను.

13:8 మానవ స్వభావములోని రెండు కొసలను పేతురు వివరించుచున్నాడు. ప్రభువా, నీవు నా పాదములు ఎన్నడు కడుగరాదని చెప్పుటలో “ఎన్నడు” అనగా నిత్యత్వమంతటిలో అని అర్థము.

అయితే యేసుప్రభువు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలులేదని చెప్పెను. పాదములు కడుగుటలోని భావము ఇక్కడ అర్థమగు చున్నది. క్రైస్తవుడు ఈ లోకములో జీవించునప్పుడు తన్ను తాను అపవిత్ర పరచు కొనును.

విశ్వాసి అసభ్యకరమైన సంభాషణ వినుటలోను, అపవిత్రమైన దానిని చూచుటలోను, నిర్దేవులతో కలసి పనిచేయుటలోను అపవిత్రుడగును. కనుక విశ్వాసి ఎల్లప్పుడు శుభ్రపరచబడవలెను (కడుగబడవలెను).

దేవుని వాక్యముద్వారా ఒక విశ్వాసి శుభ్రపరచబడవలెను. మనము పరిశుద్ధ గ్రంథమును చదువుదుము, ధ్యానించుదుము. అది బోధింపబడుచుండగా విందుము. ఒకరితో ఒకరము చర్చించుదుము.యేసు శిష్యుల పాదములను కడుగుట (13:1-11) :

ఇట్లు దేవుని వాక్యము మనలను శుద్ధిచేయును. మనము పరిశుద్ధ గ్రంథమును నిర్లక్ష్యము చేసినచో, క్రూర స్వభావము మన హృదయ ములో బలపడి మనలను అపవిత్రపరచి, మనలను పాపము చేయ ప్రేరేపించును. నాతో నీకు పాలు లేదని యేసు చెప్పుటలో -పరిశుద్ధ లేఖనములతో కడుగబడుటవలననే ఒకడు దేవునితో సహవాసము ఎడతెగక కలిగియుండును అని భావము.

13:9-11 పేతురు ఇప్పుడు మరొక కోణమునుండి మాట్లాడుచుండెను. ఒక నిమిషము క్రితము “ప్రభువా ఎప్పుడును నీవు నా పాదములు కడుగరాదనెను.’ అయితే ఇప్పుడు “నన్ను – నా శరీరమంతయు” కడుగ మనెను. అతనికి జవాబుగా యేసు ‘కడుగుమను పదమునకు రెండు మాటలను ఉపయోగించెను.

ఆయన వాస్తవముగా చెప్పినదేమనగా “స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను” స్నానమునకు, పాదములు కడుగుటకు తేడా కలదు.

స్నానమనగా మనము రక్షింపబడిన సమయమందు పవిత్రు లగుటను సూచించును. యేసుక్రీస్తు రక్తముద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము నొందుట ఒక్కసారే జరుగును. పాపమువలన ప్రేరేపింపబడినవాడు ఎల్లప్పుడు దేవుని వాక్యమువలన కడుగబడవలెను. స్నానమొక్కటే (ఒక్కసారే) కాని పాదములు అనేకసార్లు కడుగుకొనవలసియున్నది. మీరు పవిత్రులు కాని, “అందరు పవిత్రులు కారు” అనెను.

శిష్యులందరు తిరిగి జన్మించిన అనుభవము గలవారైరి గాని యూదాకు ఆ అనుభవము లేదు. యూదా రక్షింపబడలేదు. అన్ని సంగతులను ఎరిగిన యేసు, యూదా తనను అప్పగించునని ఎరిగియుండి, మీలో ఒకడు పవిత్రుడు కాడనెను.

తనను అనుసరించుమని
యేసు శిష్యులకు బోధించుట (13:12-20) :

13:12 – 14 యేసు శిష్యులందరి పాదములు కడిగెనని మనము చూచుచున్నాము. తనపై వస్త్రమును అవతల పెట్టివేసి, తాను చేసిన దానిలోని ఆత్మీయార్థమును బోధించుటకు కూర్చుండెను. ఒక ప్రశ్నవేసి సంభాషణను కొనసాగించెను.

రక్షకుడు అడిగిన ప్రశ్న వారిలో ఉత్సాహమును రేకెత్తించెను. సామాన్యమైన బోధనా పద్ధతిని ఆయన ఇక్కడ అవలంభించెను. శిష్యులందరు యేసును బోధకునిగాను, ప్రభువుగాను అంగీకరించిరి.

అట్టి ప్రభువే శిష్యుల పాదములు కడిగినయెడల వారిలో వారు కడుగుకొనినయెడల వారికి క్షమాపణ కలదా? అక్షరార్థముగా వారిని ఒకరి పాదములు ఒకరు కడుగుకొనుమని ప్రభువు చెప్పుచున్నాడా? లేక సంఘముగా ఆచరించుటకు ఆయన ఒక నియమమును ఇచ్చుచున్నాడా? కాదు.

ఇక్కడ ఒక ఆత్మీయార్థము కలదు. వాక్యముతో సహవాసము కలిగియుండుటవలన వారు ఒకరితోనొకరు పవిత్రపరచ బడియుందురు. ఎవడైనను ఒకడు తన సహోదరుడు విశ్వాసములో తగ్గిపోవుచుండగా, అట్టివానిని ప్రేమపూర్వకముగా పరిశుద్ధ గ్రంథములోని విషయములను చూపించి, అతనిని రాబట్టవలెను.

13:15-17 ప్రభువు వారికి ఒక చక్కని మాదిరి చూపించు పాఠమును నేర్పెను అది ఏదనగా ఒకరికొరకు ఏమి చేయవలెనో నేర్పించెను. మన గర్వముగాని, శతృత్వముగాని, మన సహోదరునికి పరిచర్య చేయుటలో మనకు తగ్గింపు స్వభావ మును కలిగించనియెడల మనము ప్రభువుకంటె గొప్పవారము కామని జ్ఞాపకము చేసికొని తగ్గింపు స్వభావము కలిగియుండుటకు ప్రయత్నించవలెను.

అపాత్రులును, కృతజ్ఞులైన వారి పాదములను కడుగుటకు యేసు తననుతాను తగ్గించుకొనెనుగదా! మరియు తన్ను అప్పగించువాని పాదములు కడుగుటకుకూడ తననుతాను తగ్గించు కొనెను.

మేడ గదిలో Bible Verses Chapter 13

సొమ్ముకొరకు విశ్వాస ఘాతకుడైన వానికి నీవు తగ్గింపుతో పరిచర్య చేయ గలవా? పంపబడినవారు (శిష్యులు) పంపబడినవాని (ప్రభువైన యేసు) కంటే ప్రభువు చేసిన కార్యములను చేయుటకు గొప్పవారు కారని ఒప్పుకొనుచున్నారు.

తగ్గింపు స్వభావమును గురించి, నిస్వార్థపరత్వమును గురించి, సేవ పరిచర్యను గురించి తెలిసికొనుట ఒక మెట్టు. వాటి విలువలు తెలిసికొని గైకొనుట మరొక మెట్టు. అట్లు జీవించుటలో నిజమైన ఆశీర్వాదము కలదు.

13:18 పరిచర్యను గురించి ప్రభువు ఇక్కడ వివరించునది ‘యూదాకు’ చెందదు. సువార్త పరిచర్య చేయుటకు ప్రభువు పంపిన వారితో యూదా పంపబడలేదు.

తాను అప్పగింపబడబోవు సంగతి ప్రభువు ముందుగా ఎరిగియుండెను గదా! కీర్తనలు 41:9 మొదలగు వచనముల ప్రకారము అతడు చేయవలసియుండెను. యూదా మూడు సంవత్సరములు ప్రభువుతో భుజించినను, ఆయనను తన్నుటకు “తనమడమ ఎత్తైను”, అనగా యూదా ఆయనను అప్పగించుటకు పూనుకొనెను. కీర్తన 41 లో తన్ను అప్పగించువానిని ప్రభువు తనకు ప్రియ స్నేహితునిగా వర్ణించుచున్నాడు.

13:19,20 ప్రభువు తానెట్లు అప్పగింపబడనై యున్నాడో ముందుగా వివరించుట వలన, ఆ సమయము వచ్చినప్పుడు శిష్యులు తనయొక్క దైవత్వమును తెలిసికొందురు. 19వ వచనములో ‘నేనే ఆయన’ అను మాటకు క్రొత్త నిబంధనలో నున్న ‘యేసు’ పాత నిబంధనలోని యెహోవా దేవుడని అర్థము.

తనను అనుసరించుమని యేసు శిష్యులకు బోధించుట (13:12-20) :

ఇట్లు నెరవేర్చబడిన ప్రవచన వాక్యము క్రీస్తు దేవుడనియు వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకబడెననియు చెప్పుచున్నది. ప్రభువు మరణము శిష్యులకు అభ్యంతర కారణముగాను, అనుమానా స్పదముగా నుండునని తలంచి వారిని ప్రోత్సాహపరచుటకు ఇట్లు చెప్పెను.

వారొక ప్రత్యేకమైన పరిచర్య నిమిత్తము పంపబడెనని వారు గుర్తుంచుకొనవలసి యుండెను. వారిని చేర్చుకొనువారు, వారిని కాదు, వారిని పంపినవానినే చేర్చుకొందురు. అనగా శిష్యులు ప్రభువుతో సారూప్యముగలవారిగా మార్చబడిరి. ప్రభువును చేర్చుకొనువాడు, ప్రభువునే కాదు, ఆయనను పంపిన తండ్రిని చేర్చుకొనును.

యూదా తనను అప్పగించునని
ప్రభువు ముందుగా చెప్పుట (13:21-30) :

13:21, 22 తన శిష్యులలో నొకడు తనను అప్పగించుననుటలో ఆయన బహుగా కదిలింపబడెను. ప్రభువు వానికి తనను అప్పగించు ప్రయత్నమును విరమించు కొనుటకు చివరి అవకాశము ఇచ్చెను. యూదాకు ప్రత్యేకముగా ఈ సంగతి బయలు పరచక మీలో ఒకడు నన్ను అప్పగించునని చెప్పెను.

అయినను అప్పగించువాని మనస్సు మారలేదు. శిష్యులు యూదాను అనుమానించలేదు. కనుకనే వారు కలవర పడి, ప్రభువా, వాడెవడని అడిగెను. ఆయన ఎవరిని గురించి మాట్లాడుచున్నాడో. వారికి గ్రహింపు లేదు గనుక వారు అతడెవరని అడిగెను.

13:23-26 ఆ కాలమందు ప్రజలు భోజనము చేయునప్పుడు కుర్చీలు, బల్లలు వాడెడివారు కాదు గాని మెత్తటి దిండ్లుపై కూర్చుండెడివారు. యేసు ప్రేమించిన శిష్యుడు ఈ సువార్తను వ్రాసిన యోహాను. అతడు తన పేరు ఇక్కడ వ్రాసికొనక “యేసు ప్రేమించిన శిష్యుడు” అని వ్రాసికొనెను.

యేసు శిష్యులందరిని ప్రేమించెను గాని, యోహాను ఒక ప్రత్యేకమైన సన్నిహిత సంబంధమును కలిగియుండెను. పేతురు మాట్లాడక, సైగద్వారా అతడెవరో తెలిసికొనుమని యోహానువైపు చూచెను. అప్పుడు యోహాను యేసు రొమ్మున ఆనుకొనుచు మెల్లని స్వరముతో అతడెవరని అడుగగా, ప్రభువుకూడ నమ్మదిగా జవాబిచ్చి యుండవచ్చును.

నేను ముక్కముంచి ఎవనికిచ్చెదనో, వాడేనని చెప్పెను. తూర్పు దేశములవారు భోజనపు బల్లదగ్గర ముఖ్య అతిధికి అట్లు ముక్క ముంచి ఇచ్చు వాడుక గలదు. ప్రభువు ఇట్లు చేయుటవలన యూదా తనయొక్క కృపను, ప్రేమను పొందినవాడై పశ్చాత్తాపము చెందునని ఆశించెను. మరికొందరు పస్కా పండుగ సందర్భముగా ఈ రసము పంచబడెనని చెప్పుదురు.

అట్లయినయెడల యూదా పస్కా భోజన సమయమందే అనగా ప్రభువు భోజనము ప్రారంభించక ముందే అతడు ఆ స్థలమును విడిచిపెట్టెను.

13:27 అప్పటికే సాతాను యూదా హృదయములో ప్రభువును అప్పగించు తలంపు పుట్టించి యుండెను. ఇప్పుడు సాతాను వాని హృదయములో ప్రవేశించెను. మొదటి సారిగా ఆ సలహాను ఆషామాషీగా అతడు తలంచెను. తరువాత ఇష్టపడెను.

ఆ తరువాత అట్లు చేయుటకు అంగీకరించెను. ఇప్పుడు సాతాను అతనిని సంపూర్ణముగా తన వశము చేసికొనెను. ఇప్పుడతడు తనను అప్పగించుటకు సంపూర్ణ నిశ్చయతను కలిగియున్నాడని ఎరిగిన ‘యేసు’ వానితో “నీవు చేయుచున్నది త్వరగా చేయుము” అని చెప్పెను. వాస్తవముగా యూదాను చెడుపనిని చేయుమని ప్రభువు ప్రోత్సహించుట కాదుగాని, దుఃఖపూరితమైన వీడ్కోలునిచ్చు కార్యమైయున్నది.

13:28 ఈ వచనమునుబట్టి ద్రాక్షారసమునుగురించి సంభాషణ ప్రభువైన యేసుకు యోహానుకు తప్ప మరెవరికిని తెలియరాలేదు. యూదా ప్రభువు నప్పగించునని వారికింతవరకు తెలియదు. వారిలో కొందరు యూదాను త్వరగా వెళ్ళు, పండుగకు ఏమైన కొనుమని చెప్పుచున్నాడనుకొనిరి. యూదా ఆ ముక్క పుచ్చుకొని ప్రభువును ఆయన శిష్యులను వదలి బయటికి వెళ్ళిపోయెను. అది రాత్రివేళ.

అది రాత్రి సమయమేకాని, యూదాకు ఆత్మీయముగా దుఃఖముతో నిండి, అంతులేని చీకటి ఘడియయైయున్నది, రక్షకునికి తన ముఖము త్రిప్పుకొను ప్రతివాడు ఈ చీకటి యందే నిత్యము నిలిచియుండును.

ఇవ్వబడిన క్రొత్త ఆజ్ఞ (13:31-35) :

13:31 యూదా వెళ్ళిన వెంటనే ప్రభువు శిష్యులతో స్వేచ్ఛగాను, ప్రియముగాను మాట్లాడెను. ఆతురత పోయెను. మనుష్యకుమారుడు ఇప్పుడు మహిమ పరచబడెను. తాను నెరవేర్చనైయున్న ‘విమోచన కార్యము’ను ప్రభువు ముందుగా తెలియజేయు చుండెను.

ఆయన మరణము ఓటమివలె కన్పించునుగాని నశించిన పాపి రక్షింపబడు టకు అది ఆధారము. ఆయన మరణించిన తరువాత పునరుత్థానుడై ఆరోహణమగును. వీటన్నిటియందు ఆయన మహిమపరచబడును. తన యందు దేవుడు మహిమపరచ బడును.

రక్షకుని కార్యము దేవునికి గొప్ప మహిమ తెచ్చెను. ఆయన పాపము చూచి దాటిపోలేని పరిశుద్ధుడైన దేవుడనియు, మరియు పాపియొక్క నాశనమును ఆశించని ప్రేమగల దేవుడనియు ప్రచురించెను.

పాపులను నీతిమంతులుగా తీర్పు తీర్చుటలో ఎంత న్యాయవంతుడో ఈ కార్యము ప్రచురించెను. కలువరిలో ఆయన దేవత్వము యొక్క ప్రతి గుణ లక్షణము (స్వభావము) అత్యున్నతముగా చూపించబడినది.

దేవుడాయనయందు మహిమపరచబడెను గనుక తనయందు కుమారుని మహిమ పరచును. తగిన ఘనతను, మహిమను తన కుమారునికి ఆయన ఆరోపింపజేసెను. ఆ విధముగా తన కుమారుని మహిమపరచెను.యూదా తనను అప్పగించునని ప్రభువు ముందుగా చెప్పుట (13:21-30) :

ఆలసించక ఆయన దాని చేసెను. కుమారుని మృతులలోనుండి లేపి, పరలోకములో తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనుటద్వారా ఈ ప్రవచనమును నెరవేర్చెను. రాజ్యము స్థాపించువరకు ఆయన వేచియుండలేదు గాని వెంటనే ఆయన దాని చేసెను.

13:33 తన ప్రియమైన ముద్దుబిడ్డలవలె శిష్యులను ప్రభువు మొదటిసారిగా, చిన్నపిల్లలారా అని పిలుచుచున్నాడు. యూదా అక్కడనుండి వెళ్ళిన తరువాత ఆయన ఈ విధముగా పిలుచుచున్నాడు.

ఆయన వారితో ఇంక కొద్ది సమయము మాత్రమే ఉండును. తరువాత సిలువపై మరణించనున్నాడు. అప్పుడు వారు ఆయనను వెదకుదురు గాని, కనుగొనరు, ఆయనను వెంబడించలేరు. ఎందుకనగా ఆయన పరలోకమునకు తిరిగి వెళ్ళును.

ప్రభువు ఇదే విషయమును యూదులకు చెప్పి యున్నాడు కాని ఈ ఉద్దేశ్యముతో కాదు. శిష్యులకు ఆయనతో ఎడబాటు కొద్ది కాలమే. వారికొరకు ఆయన మరల తిరిగి వచ్చును. (అధ్యాయము 14). యూదులకు ఆయన ఎడబాటు శాశ్వతమైనది. ఎందుకనగా తమ అపనమ్మకత్వమునుబట్టి వారు ఆయనను వెంబడించలేదు.

13:34, 35 ఆయన వారితో నుండని కాలము శిష్యులందరు ప్రేమ అను బంధము చేత అతుకబడి యుండిరి. “నీ దేవుని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు” అనునది ఆజ్ఞలన్నిటికి మించినదికాదు గాని మరొక విధముగా అది క్రొత్త విషయము.

యేసు ఈ విషయమై ప్రత్యక్ష సాక్ష్యము చూపించెను గనుక పరిశుద్ధాత్ముడు యీ విషయమై ప్రతి విశ్వాసిని ఒప్పింపజేసెను. క్రొత్త అనుభవము పాత అనుభవమును మ్రింగివేసెను. నీ పొరుగువారిని ప్రేమించుమని పాత ఆజ్ఞయైతే, నీ శత్రువుని ప్రేమించు మని క్రొత్త ఆజ్ఞ.

ఈ ఆజ్ఞ ప్రేమను ఉన్నత స్థాయికి కొనిపోవుచున్నది. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరునూ ఒకరినొకరు ప్రేమింపవలెను. ఈ ప్రేమ ఆజ్ఞ క్రొత్త ఉద్దేశ్యముతోను, క్రొత్త నిర్ణయముతోను, క్రొత్త మాదిరితోను, క్రొత్త స్వభావముతోను ఉన్నది.

క్రైస్తవ శిష్యత్వముయొక్క ముఖ్యోద్దేశము తోటి క్రైస్తవుని ప్రేమించుటే. దీనికి దైవశక్తి అవసరము. పరిశుద్ధాత్మ దేవుడు నివసించు హృదయములకే ఈ శక్తి అనుగ్రహింప బడును.

క్రీస్తు ప్రవచనమును పేతురు ధిక్కరించుట (13:36-38) :

13:36,37 యేసు తనయొక్క మరణమునుగూర్చి చెప్పియున్నాడని పేతురు గ్రహించలేదు. ఆయనతో ఈ భూసంబంధమైన ప్రయాణములో తానెందుకు వెంబడించలేనని తలంచుచున్నాడు. పేతురుతో-నీవు నన్ను తరువాత వెంబడింతువని ప్రభువు చెప్పుచున్నాడు.

అయితే అది మరణించిన తరువాత గాని, ఇప్పుడు కాదు అని అర్ధము. కచ్చితమైన దేవభక్తితోను, అత్యభిమానముతోను, పేతురు ప్రభువు కొరకు చావనుద్దేశించెను. తన స్వశక్తితో తాను హతసాక్షి కాగలనని తలంచెను.

కాని దేవుడిచ్చిన ప్రత్యేకమైన శక్తినిబట్టి ధైర్యమునుబట్టి పేతురు ఆయనకొరకు మరణించెను. ప్రభువు పేతురుయొక్క ఉత్సుకతను ఖండించుచు ఈ రాత్రికి ముందు నీవు నన్నెరుగనని ముమ్మారు బొంకెదవని చెప్పెను. తనయొక్క స్వశక్తి చేత పేతురు కొన్ని గంటలైనను తనను వెంబడింపలేడని ప్రభువు అతనియొక్క బలహీనతను, పిరికితనమును గుర్తుచేసెను.

యూదా తనను అప్పగించునని ప్రభువు ముందుగా చెప్పుట (13:21-30) :

Leave a Comment