జయశాలియైన బాలుడు

జయశాలియైన బాలుడు

జాన్ నోట్లోనుండి వస్తున్న రక్తం నాలుకకు ఉప్పగా తగుల్తోంది. అతని ముఖం గడ్డిలోను మట్టిలోను కూరుకుపోయి ఉంది. ప్రపంచమంతా గిర్రున తిరుగుతూ మబ్బు కమ్మినట్టుగా ఉంది. “దయచేసి నన్ను కాపాడు దేవా” – మూల్గుతూ మనస్సులో ప్రార్థించాడు జాన్. ఎక్కడో దూరంనుండి శబ్దం వినిపిస్తోంది.

“వాడు ఎల్లో గ్రామస్థుడైన జాన్ బన్యన్” – కేకేసినట్టు ఓ స్వరం జవాబిచ్చింది. ఆ స్వరం హ్యారీ స్వరంలా ఉంది.

“బెడ్ఫోర్డ్వడినని వాడు చెప్పినట్టు గుర్తు!” పండ్లు కొరుకుతూ కోపంగా అన్నాడు సైనికుడు.

“వాడు ఎల్టి కుక్కే అనుకుంటాను” సమాధానమిచ్చాడు హ్యారీ. “ఏరా నీక్కూడా పొగరా?” గుడ్లురిమాడు సైనికుడు.

“లేదండీ” వణుకుతూ అన్నాడు హ్యారీ.

“నేను నిన్ను నమ్మనురా.”

హ్యారీ కేకల్తో ఈ లోకంలోకి వచ్చాడు జాన్. మెల్లగా కళ్ళు తెరచి ఆ వైపు చూశాడు. బాధతో అరుస్తూ కేకలేస్తున్నాడు హ్యారీ. కొరడా దెబ్బలు తలకు తగలకుండా చేతులు అడ్డుపెట్టుకుంటున్నాడు. హ్యారీ క్రింద పడిపోయేంతవరకు సైనికుడు వాణ్ణి వదల్లేదు. సైనికుడు మళ్ళీ తనవైపు చూడడాన్ని గమనించాడు జాన్.

“రాజుగారి సైన్యంగురించి బెడ్ఫోర్డ్షైర్ మనుషులకు చెప్పావంటే నేనొచ్చి నీ అంతుచూస్తాను. తెలిసిందా అనాగరిక కుక్కా” అంటూ సైనికుడు జాన్పై మరోసారి కొరడా ఝళిపించాడు. జాన్ మోకాళ్ళను దగ్గరగా కుదుర్చుకుంటూ తలకు దెబ్బ తగలకుండా చేతులు అడ్డంపెట్టుకున్నాడు.

సైనికుడు రోజర్సన్నకూడ వదల్లేదు. కొరడా శబ్దాలమధ్య రోజర్స్ దయచూపించమని ఏడ్వడం జాన్కు వినిపిస్తోంది. కొరడా దెబ్బల్తో సైనికుడు రోజర్సిని కుప్పకూల్చాడు. ఊపిరి సలపని నిశ్శబ్దంమధ్య గుర్రపు డెక్కల చప్పుడు జాన్ తల ప్రక్కగా వినిపించి క్రమేణా దూరం కాసాగింది.

జాన్ లేచి నిలుచున్నాడు. “పదండి పోదాం”

అందరూ లేచారు. ముఖాలన్నీ దుమ్ముతోను, గాయాలతోను నిండి ఎర్రగా కమిలి పోయి ఉన్నాయి. దూరంగా పడివున్న తన టోపీని చేతిలోకి తీసుకున్నాడు జాన్. సైనికుడు కత్తితో లాగడంవల్ల అది చిరిగిపోయి ఉంది. దాన్ని తలపై పెట్టుకొని మౌనంగా నడవసాగాడు జాన్. మిగతా యిద్దరూ అతణ్ణి వెంబడించారు. అలా వారు ఒక కూడలి చేరేంతవరకూ మౌనంగానే ఉన్నారు.

ఆ కూడలివద్ద రెండు చిన్న దార్లున్నాయి. ఒకటి బెడ్ఫోర్డ్ పట్టణానికి వెళుతుంది. ఇంకోటి ఎల్లో గ్రామానికి వెళుతుంది. జాన్ ఏదో తీర్మానించుకున్నవాడిలా గంభీరంగా బెడ్ఫోర్డ్ వెళ్ళే దారివైపు మళ్ళాడు.

“ఏయ్ జాన్, ఎక్కడికెళ్తున్నావు?” భయంగా అరిచాడు రోజర్స్.

“రాజుగారి సైన్యంగురించి అందరికీ చెప్పేందుకు బెడ్ఫోర్డ్ వెళ్తున్నాను” సమా ధాన మిచ్చాడు జాన్.

“నీకేమైనా మతిపోయిందా?” గట్టిగా అరిచాడు హ్యారీ.

“వాడితో వాదించి లాభంలేదు” – కొద్దిగా భుజాలను పైకెత్తి అంటూ జాన్ను వెంబడించాడు రోజర్స్.

“సరే పదండి” గొణుక్కుంటూ హ్యారీకూడ వాళ్ళను వెంబడించాడు.

జాన్, అతని యిద్దరు మిత్రులూ బెడ్ఫోర్డ్లో సెయింట్ మేరి చర్చికి వెళ్ళే దారివరకు వచ్చి, ఎడమ ప్రక్కకు రహదారివైపు తిరిగి ఔసె నదివద్ద వంతెన దాటి నేరుగా ‘గ్రీన్’ గ్రామం చేరుకున్నారు.

అక్కడ చల్లని సాయం సమయంలో మోడువారిన ఎల్మ్ చెట్లమధ్య కొంతమంది పెద్దమనుష్యులు ఏదో తీవ్రంగా చర్చిస్తున్నారు.

జాన్ అక్కడొక బల్లమీద నిలబడి చేతులెత్తి – “అందరూ వినండి. రాజుగారి సైన్యం ఒల్నీకీ, యిక్కడికీ మధ్యనున్న నదీ మైదానాన్ని దాటి వెళుతోంది” అంటూ పెద్దగా కేకేశాడు.

“నోర్ముయ్ అబద్ధాల వెధవా!” – గోధుమరంగు సూటులో ఉన్న ఒక వ్యక్తి జాన్ చెయ్యి పట్టుకొని బల్లమీదనుండి క్రిందకు లాగాడు – “ఈ రోజు మిమ్మల్ని కెంప్టన్లో ఉన్న నా ఎస్టేట్గుండా వెళ్తుంటే రెండుసార్లు చూశాను. ఇప్పుడు నేనిక్కడకు రావడం మంచిదైంది.”

మెరుస్తూన్న ఆకు పచ్చని సిల్కు సూటు, ఈక ఉన్న టోపీ ధరించిన మరొక వ్యక్తి వారికి దగ్గరగా వచ్చాడు. “ఏంటి సంగతి యార్వే?”

“ఏం లేదు లూక్ గారూ, వీడో అబద్దాల పల్లెటూరి వెధవ.”

“నేను అబద్దం చెప్పడం లేదు … . ” – తలమీద మొట్టికాయతో జాన్ మాటలు మధ్యలో ఆగిపోయాయి.

“ఆపు, వీడు యిప్పటికే బాగా దెబ్బలు తిన్నట్టుంది. వీడ్నిలా కొట్టింది నువ్వేనా యార్వే” లూక్ గారు అడిగాడు.

“నేను కొట్టలేదు లూక్ గారు .”

“అలా అయితే వాడు చెప్పేదాంట్లో ఏదో నిజం ఉంటుంది. అదేదో నేను వినాలి” సర్ లూక్ అన్నాడు.

రాజుగారి సైన్యం నడుచుకొంటూ దక్షిణదిక్కుగా వెళ్ళిన సంగతంతా జాన్ గ్రీన్ గ్రామస్థులకు వివరించి చెప్పాడు. కత్తి చేసిన తన టోపి రంధ్రంలో వ్రేలుపెట్టి గిరగిరా త్రిప్పుతూ తీవ్రమైన బాధతో సైనికుని గురించి క్లుప్తంగా చెప్పాడు. ఆ తర్వాత పాలిపోయిన ముఖంతో వారి ప్రతిస్పందనకోసం ఎదురుచూడసాగాడు.

“వీడు ఎల్రో గ్రామస్థుడైన ఆకతాయి జాన్ బన్యన్ కదూ?” – వాళ్ళలో ఒకడు తలూపుతూ అన్నాడు.

“పాపం వీడి ఒంటిమీద దెబ్బలు యింకా పచ్చిగా రక్తం కారుతున్నాయి” ఇంకొకడన్నాడు.

యార్వే ఆ వ్యక్తి చేయిపుచ్చుకొని – “ఈ పోకిరి వెధవ దెబ్బలు తిన్నాడన్నమాట నిజమేగాని వీడు తోటల్లో ఆపిల్ పండ్లు దొంగిలించినందుకో, చెరువుల్లో చేపలు దొంగిలించినందుకో తన్నులు తినుంటాడు. ఈ ప్రాంతంలో జరిగే దొంగతనా లన్నింటిలో వీడి చేయి తప్పక ఉంటుంది. వీడు ఒక పాత్రలకు కళాయి వేసేవాని కొడుకు. పచ్చి అబద్ధాలకోరు.”

సర్ లూక్ జాన్ని బాగా పరిశీలనగా చూస్తూ అన్నాడు, “దీన్నిబట్టి చూస్తే నీకొక ఘనమైన కీర్తి ఉన్నటుంది జాన్ బన్యన్.” తర్వాత సర్ లూక్ అక్కడున్న గుంపునుద్దేశించి మాట్లాడసాగాడు. “ఎంత పనికిమాలినవాడైనా, అబద్ధాలకోరైనా అప్పుడప్పుడూ నిజం తప్పక చెబుతాడు.

ఈ కుర్రాడి ఒంటిపైనున్న దెబ్బలు చూస్తుంటే వీడు అబద్ధం చెబుతున్నాడని నేననుకోవడంలేదు. వీణ్ణి కొట్టిన సైనికుణ్ణి గురించి వీడు చెప్పినదాంట్లో కూడ అసత్యమున్నట్టు లేదు. సర్ లూక్ తన ప్రక్కనే ఉన్న ఒక సైనికుడిలాంటి వ్యక్తివైపు చూశాడు. “కల్నల్ కొకేన్, ఈ కుర్రాడి మాటల్నిబట్టి చూస్తే వీడు చూసిన సైనికుడు చార్లెస్ రాజు సైనికుడేనని అనిపించడం లేదూ?”

“అలానే అనిపిస్తుందండీ” జవాబిచ్చాడు కల్నల్ కొకేన్. ఈ కుర్రాడు చూచిన సైనికుడు ఉత్తరంవైపునున్న నాటింగ్ హాంకు చెందినవాడనిపిస్తోంది. మనం వెంటనే న్యూఫోర్ట్ ప్యాగ్నెల్లో ఉన్న మన సైన్యంవద్దకు వెళ్ళడం మంచిది”.

ఆఖరిగా సర్ లూక్ జానైవైపు చూసి అన్నాడు – “నీలో ఎక్కడో కొంత మంచీ, మర్యాదా మిగిలి ఉన్నట్టున్నాయి జాన్ బన్యన్. వాటిని అభివృద్ధి చేసికోడానికి ప్రయ త్నించు.” ఆ తర్వాత సర్ లూక్ కల్నల్ కొకేన్తో కలసి బెడ్ఫోర్డు పశ్చిమంగా పదిమైళ్ళ దూరంలో పార్లమెంటు సైన్యం ఉన్న న్యూఫోర్ట్ ప్యాగ్నెలైవైపు వెళ్ళాడు.

జాన్ కూడ గంభీరంగా అక్కడనుండి కదిలాడు. ‘దెబ్బలు తినడం, బాధతో బిగ్గరగా కేకలు వేయడం తనకు అలవాటే. పాత్రలకు కళాయివేసేవాని కొడుకు దెబ్బలు తింటుంటే రక్షించడానికి ఎవరు ముందుకొస్తారు? తన నోరే తనకు చేటుగా దాపు రించింది. అతిగా మాట్లాడకూడదని ఎప్పుడూ అనుకొంటాడు గాని ఆ అలవాటును మానుకోలేకపోతున్నాడు. తన నోటి దురుసుతనంవల్లే ఆ సైనికుడి దగ్గర దెబ్బలు తినాల్సివచ్చింది.

గ్రీన్ గ్రామంలో యార్వేకూడ తన మనస్సును గాయపరిచాడు. సైనికుడితో, యార్వేతో తనకీనాడు ఎదురైన అనుభవాలు మనస్సును కలచివేస్తున్నాయి. తను ఎవరినైతే మంచివారని ఎంచి ఎక్కువగా అభిమానిస్తాడో వాళ్ళే తనను గాయ పరుస్తున్నారు.

ఒకవేళ తాను మంచివాడు కాకపోవచ్చు. ఆ మాటకొస్తే తాను మంచి వాడుగా ఉండాలని ఎప్పుడూ ఆశించలేదు, ప్రయత్నించనూలేదు … ‘ జాన్ మనస్సులో ఏవేవో ఆలోచనలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

అలా వాళ్ళు దక్షిణ దిక్కుగా ఎలోవైపు రహదారిగుండా వెళ్తూ సెయింట్ లెనార్డ్ కుష్ఠరోగుల ఆసుపత్రివద్దకు వచ్చారు. కొరికివేయబడ్డట్టున్న కుష్ఠరోగుల ముఖాలనూ వ్రేళ్ళనూ చూచినప్పుడు జాన్ జాలిగా బాధపడినప్పటికీ ఆ ప్రాంతాన్ని దాటిపోయే టప్పుడు భయపడేవాడు.

కొద్ది సంవత్సరాల క్రితం తాను బెడ్ఫోర్డ్ ని ఉచిత పాఠశాలలో చదివేటప్పుడు ఉదయ సాయంత్రాలు ఈ ఆసుపత్రి మీదుగానే వెళు తుండేవాడు. స్కూలూ, కుష్ఠరోగులూ తనకెప్పుడూ జ్ఞాపకమే. అందుకే స్కూలు గురించీ, కుష్ఠరోగులగురించీ ఎప్పుడూ తమాషాగా మాట్లాడుతుంటాడు.

హ్యారీ ఎల్టాకు వెళ్ళే రహదారివెంట తన నడక కొనసాగించాడు. జాన్, రోజర్స్ పచ్చని విల్లో చెట్ల మధ్యలో పొలాలగుండా ‘బన్యన్ ఎండ్’కు వెళ్ళే ఓ వంపు మార్గంద్వారా వెళుతున్నారు. బన్యన్ కుటుంబీకులు చాలాకాలంనుండి అక్కడి రెండు సెలయేర్ల మధ్యనున్న భూభాగంలో నివసిస్తూ వస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కటీ వారి పేరుమీదనే పిలువబడుతుంది.

బన్యన్ కుటుంబీకులు దాదాపు మూడు వందల సంవత్సరాలుగా అక్కడుండేవారన్న విషయాన్ని జాన్ తండ్రి థామస్ చాలా గర్వంగా చెప్పుకొంటూ ఉంటాడు. వారి కీర్తిప్రతిష్టలు తరతరానికి క్రమంగా దిగజారిపోతూ వస్తున్నాయి.

భూస్వాములుగా, సత్రశాలల నిర్వాహకులుగా, మద్యం వ్యాపారులుగా ఇలా వారి స్థాయి దిగజారిపోతూ చివరికి యిప్పుడు పాత్రలకు కళాయివేసే స్థాయికి వారు చేరుకున్నారు. ఇవన్నీ జాన్కు తెలుసు. ఇప్పుడు వాళ్ళకు తొమ్మిది ఎకరాల భూమి, ఒక పూరిల్లు, ఒక కళాయి వేసే పొయ్యి మాత్రం మిగిలి ఉన్నాయి. వాళ్ళు దాదాపుగా అట్టడగు స్థాయికి అనగా గుంట అడుగుభాగానికి చేరుకున్నారన్నమాట. అందుకే ‘బన్యన్ ఎండ్’ను ‘బన్యన్ గుంట’ అని జాన్ హేళనగా పిలుస్తుంటాడు.

“గుడ్బ్భై జాన్” అంటూ దగ్గర్లోనే ఉన్న తన పూరింటివైపు నడక సాగించాడు. రోజర్స్.

జాన్ కూడ అతనికి వీడ్కోలు చెప్తూ తన పూరింట్లోకి వెళ్ళాడు.

“ఇంతసేపు ఎక్కడికెళ్ళావురా?” జాన్ తల్లి ప్రశ్నించింది. ఆమె వయస్సు ముప్పై తొమ్మిది. కాని ఆమె తన అసలు వయస్సుకన్నా ఇరవై ఏళ్ళు పెద్దదిగా కనిపిస్తుంది. ఆమె రొట్టెలు చేసేందుకు పిండి పిసుకుతూ ఉంది. ఎప్పుడో కొన్ని గంటలకు ముందే రొట్టెలు సిద్ధంచేసి ఉండాలి. కాని ఆమె బలహీనంగా ఉండటంవల్ల ఆలస్యమైంది. పైగా పనులన్నీ తానొక్కతే చేయాలి.

నూలు వడకాలి, బట్టలు కుట్టాలి, బట్టలుతకాలి, వంట చేయాలి, అంట్లు తోమాలి, పొలంలో కలుపుతీయాలి. విస్తారమైన పనిభారంవల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. కొన్ని రోజులు ఆమె మంచంమీదనుండి లేవడమే కష్టంగా ఉండేది. “ఎక్కడికెళ్ళావురా?” మళ్ళీ అడిగిందామె.

“బయటకు” విసుగ్గా జవాబిచ్చాడు జాన్.

“ఎవరితోనైనా పోట్లాడివచ్చావా?”

“లేదు. గుర్రం క్రింద పడ్డాను”.

జాన్ తల్లి అతడు నిర్లక్ష్యంగా జవాబివ్వడాన్ని పట్టించుకోలేదు, “నీ చెల్లి మార్గరెట్ నీ బదులు కోళ్ళకూ, పందులకు మేత వేయాల్సివచ్చింది”. ఆమె గొంతు వణుకుతూ ఉంది.

“మంచిది. ఆ పిల్ల స్వర్గానికెళుతుంది”.

జాన్ దృష్టిలో తన అమ్మ, చెల్లి చాలా మంచివాళ్ళు. వాళ్ళను తనెంత బాధించినా తనను వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. ఆ మాటకొస్తే వాళ్ళు అందర్నీ అలానే ప్రేమిస్తారు. తన తండ్రి అలా కాదు. ఒట్టి మూర్ఖుడు. తన్నుతాను బాగుచేసుకోవాలని తన జీవిత మంతా ప్రయత్నించాడు కాని ఏమాత్రం బాగుచేసుకోలేకపోయాడు. తాను సాగగొట్టిన కొన్ని యిత్తడి, సత్తు పాత్రలు ప్రోగుచేసుకొని అదే తన నిధి అన్నట్టు మురిసిపోతుంటాడు ఆయన. నిధి అంటే వెండి బంగారాలని అందరికీ తెలుసు.

కొన్ని సంవత్సరాలు తనను స్కూలుకు పంపడం తప్ప తనకంటూ ఆయన చేసిందేమీలేదు. అదికూడ తనకు ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన T.B. అనే అక్షరాలు అతికష్టంమీద మెల్లమెల్లగా చదివి, అది తన మేధాసంపత్తిలాగ విర్రవీగుతుంటాడు. ఈ లోకంలో డబ్బులేకపోతే మనిషికి విలువలేదని జాన్కు బాగా తెలుసు. తన ఎనిమిదేళ్ళ తమ్ముడు విల్లీ యిప్పుడు ఉచిత పాఠశాలకెళ్తున్నాడు.

రాత్రి భోజన సమయంలో బన్యన్ కుటుంబసభ్యులు ఐదుగురూ ఒక పెద్ద టేబుల్కు యిరువైపులా బెంచీలమీద కూర్చున్నారు. ప్రతి ఒక్కరూ సత్తుగిన్నె ముందు పెట్టుకొని ఒక చేత్తో చిన్న కత్తిని, మరొక చేత్తో ఫోర్క్న పట్టుకున్నారు.

బల్లమీద రొట్టెలు, క్రొవ్వులో వేయించిన పంది మాంసం అమర్చబడి ఉన్నాయి. వాటివాటి కాలంలో జాన్ తల్లి క్యారెట్గాని, క్యాబేజిగాని, కంద దుంపగాని పులుసు చేస్తుంది. వాళ్ళకు ఆవులేదు గాబట్టి పాలు, పెరుగు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉంటాయి. ‘బీఫ్’ (గొడ్డు మాంసం) చాలా అరుదుగా తింటారు. ప్రతి గురు, ఆదివారాలలో ఇంగ్లాండ్లోని పేదకుటుంబాల్లో ‘బీఫ్’ తినడాన్ని ఎలా ఆనందిస్తారో జాన్ వాళ్ళమ్మ ఒక పాట రూపంలో పాడేది. “అదంతా ఒకప్పటి విషయం” నిట్టూర్చాడు జాన్.

భోజన బల్లమీద ఏవో పంచభక్ష్య పరమాన్నాలున్నట్టుగా జాన్ నాన్న బల్లనంతా చాలా తీక్షణంగా పరిశీలించడం జాన్కు నవ్వొచ్చింది.

ఆ సాయంత్రమంతా జాన్ తన నాన్నమీద చాలా కోపంగా ఉన్నాడు. ఆయనకు చార్లెస్ రాజంటే చాలా అభిమానం. చార్లెస్ రాజును జాన్ అభిమానించడానికి అదే కారణం. రెండు నెలల క్రితం చార్లెస్ రాజుకోసం సెయింట్ కల్బర్ట్ చర్చిలో బహి రంగంగా ప్రార్థించినందుకుగాను బెడ్ఫోర్డ్లో గిల్స్ఫేర్న్ అనే వ్యక్తి బంధించబడినప్పుడు పార్లమెంటు సభ్యులపై జాన్ తీవ్రంగా మండిపడ్డాడు. అయితే యిప్పుడు పార్లమెంటు మద్దతుదారుడైన సర్ లూక్ తనపట్ల చాలా మంచిగా ప్రవర్తించాడు. సర్ లూక్ను గురించి జాన్ యిదివరకే విన్నాడు.

చార్లెస్ రాజుకు మద్దతునిచ్చినందుకుగాను సర్డైవేని బెడ్ఫోర్డ్నుండి తరిమేసినవాడు సర్ లూక్రే! అందుకే సర్ లూకు జాన్ గతంలో ద్వేషించాడు. అయితే అతడు తనకిప్పుడు ఒక వీరుడిలా కనిపిస్తున్నాడు. రాజుగారి పరివారం తనకేమాత్రం మంచిగా కనపడ్డంలేదు. తనను తప్పుదారి పట్టించినందుకు యిప్పుడు తన తండ్రిపై జాన్కు చాలా కోపంగా ఉంది.

ఆ రాత్రి తన పూరింట్లో నిద్రిస్తున్న జాన్ నిద్రలో వణికిపోతున్నాడు. తన కలలో తాను నరకంలో ఉన్నాడు. తన శరీరం అగ్నిలో కాల్తోంది. అగ్ని జ్వాలలు తన శరీరాన్ని కాల్చేస్తున్నాయి. తాను తీవ్రమైన బాధననుభవిస్తున్నాడు.

ఇలాంటి కలలు జాను గతంలో చాలాసార్లు వచ్చాయి. తనపై దయ చూపించమని రాత్రంతా తాను దయ్యాలను బ్రతిమాలుతున్నాడుగాని అవి అతణ్ణి బాధిస్తూనే ఉన్నాయి. ఆ దయ్యాలు సంకెళ్ళతో బంధింపబడి ఉన్నాయిగాని అవి తనను తీవ్రంగా హింసించగలుగు తున్నాయి. బాధతో తన గొంతెండుకుపోతోంది …

కోడి కూయడంతో జాన్కు మెలకువ వచ్చింది. అతడికి దేవుడిపై చాలా కోప మొస్తోంది. సైనికుడు తనను కొరడాతో బాదుతూంటే సహాయం చేయమని తాను దేవుణ్ణి ప్రార్థించాడుగదా? కాని దేవుడు తన ప్రార్థన వినలేదు.

తాను దేవుణ్ణి ప్రార్థిస్తు న్నాడు గాని దేవుడే తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ నరకాన్ని గురించి కలగన్నాడు. తానొకవేళ నరకానికే వెళ్ళవలసివస్తే తప్పక వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే తానక్కడికి హింసింపబడేందుకు వెళ్ళకూడదుగాని, అక్కడికి వచ్చే వారిని హింసించే సైతాను సేవకుడిగా మాత్రమే వెళ్ళాలి. పరమ దుర్మార్గుడైన తన లాంటివాడు సైతానుకు అక్కడ చాలా ఉపయోగపడగలడు.

“జాన్” నాన్నగారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు జాన్.

“నా పనులన్నీ నాకు గుర్తున్నాయి. ఒక్కొక్కటే అన్నీ ముగిస్తాను. నీవేం కంగారు పడకు” – అయిష్టంగా ఉన్నా వెంటనే జవాబిచ్చాడు జాన్. నిజానికి ఏ పని చేయడానికీ తానిప్పుడు సిద్ధంగాలేడు.

“ఈ రోజు నీకో క్రొత్త పని పెట్టబోతున్నాను. త్వరగా యిక్కడికి రా” – ఆజ్ఞాపించాడు జాన్ తండ్రి.

ఆ తర్వాత జాన్ జీవిత విధానంలో చాలా మార్పొచ్చింది. తన తండ్రి పాత్రలకు కళాయి వేసే పనిని జాను నేర్పించడం ప్రారంభించాడు. ‘బెడ్ఫోర్డ్లో రచ్చబండవద్ద జరిగిన విషయం తన తండ్రికి తెలిసిందేమో?’ ఒకవేళ తెలిసినా జాన్ భయపడడు.

ఈ చిన్న వయస్సులో రోజంతా యిలా కళాయి పని చేస్తూ ఉండాల్సిందేనా? తన బాధ యిప్పుడు ఎవరికి చెప్పుకోగలడు? పాత్రలు లేదా లోహపు పనిముట్లు తయారు చేయడానికి తన తండ్రి గ్రామాలకు వెళ్ళినపుడు, తానిప్పుడు రోజంతా యింటివెనుక కొలిమివద్ద పనిచేస్తూ ఉండాలి.

దీనితోబాటు పందులకూ కోళ్ళకూ మేతవేయడం, గోధుమ చేనులో కలుపుతీయడం, గోధుమలు పిండి కొట్టడంలాంటి పనులుకూడ తాను చేయాలి. ఇప్పుడు బయట తిరగడానికి తనకు చాలా కొద్ది సమయంమాత్రమే ఉంటోంది. అయినా తన తండ్రి యివన్నీ పెద్దగా పట్టించుకోడు కాబట్టి జాన్ వీలు దొరికినప్పుడల్లా బయట తిరిగొస్తూనే ఉన్నాడు.

ఒక రోజు సాయంత్రం వాళ్ళ నాన్న యింటికొస్తూనే నేరుగా పెరట్లోకి వెళ్ళాడు. జాన్ తన అల్లరి మూకతో బయట తిరిగి అప్పుడే యింటికొచ్చాడు. వాళ్ళు చార్లెస్ రాజుకు విరోధంగా ఏవేవో మాట్లాడుతూ ఆ రోజంతా గడిపారు. జాన్ చెల్లి మార్గీ దయతలచి జాన్కు బదులుగా పందులకూ కోళ్ళకూ మేతవేసింది, విల్లీ పొలంలో కలుపుతీశాడు.

వాళ్ల నాన్న కొలిమివద్దకు వెళ్ళి – “కొలిమి చల్లగా ఉందేం?” అన్నాడు.

“ఈ కొలిమి చాలా త్వరగా చల్లబడిపోతుంది” – జాన్ చెప్పేది అబద్ధం అని తెలుస్తోంది.

“ఇదేనా నీవు పని నేర్చుకోవడం” పిడికిలి బిగించి ఒక్క దెబ్బ కొట్టాడు వాళ్ళ నాన్న. రెండో దెబ్బకు గిర్రున తిరిగి పడి తల విదుల్చుకోసాగాడు జాన్. ఇంతవరకు తన తండ్రి బెత్తంతో కొట్టేవాడు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.

“గాలికిపోయే యిలాంటి దెబ్బలు నా స్నేహితులతో తిరగకుండా నన్నాపలేవు” తన తండ్రి యింట్లోకి వెళ్తుంటే గొణుక్కున్నాడు జాన్. తానిప్పుడు తన ముఠాని కలవాలి. తన తండ్రి ఎంత క్రూరుడో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. అన్ని విషయాల్లోనూ వాళ్ళు జాన్ను సమర్థిస్తారు.

తన బాధలో తనను ఆదరించేది వాళ్ళు మాత్రమే. అన్ని పరిస్థితుల్లోనూ గట్టి పట్టుదల కలిగి ఉండేందుకు సైతాను జాను శక్తినిస్తాడు. అయితే సైతాను జాన్ నుండి తగిన ఫలితాలనాశిస్తాడు. కాబట్టి జాన్ త్వరలో కెంప్టన్ క్షేత్రానికి వెళ్ళాలనీ, తన నూతన శత్రువైన యార్వేని ఒక ఆట పట్టించాలనీ ఒక ప్రణాళిక వేసుకొన్నాడు.

కొన్ని రోజుల తర్వాత జాన్ తన ముఠాతో కలిసి బెడ్ఫోర్డ్ దారివరకు వెళ్ళి, అక్కడ మలుపు తిరిగి, పడమటి దిక్కుగా ఔసె నది వెంట వెళ్ళసాగాడు. “మనమీ దార్లో వస్తామని యార్వే ఏమాత్రం ఊహించడు” కసిగా పలికాడు జాన్. “అతడు ఆ వైపు దారిలో కాపలా కాస్తుండవచ్చు. బుర్రలేని దద్దమ్మ తన ముక్కుకొనను తప్ప మిగతా అన్నిటినీ కాపలా కాస్తుంటాడు”.

“ఆ జమ్ము మధ్యలో కనిపించేదేంటి?” – పరిశీలనగా చూస్తూ అరిచాడు రోజర్స్. అతడెప్పుడూ దూరంగా ఉండే వాటిని పరిశీలిస్తూ ఉంటాడు.
అయి ఉంటుంది”

“ఎవరో రైతు సాల్మన్ చేపల్ని పట్టడానికి ఉంచిన కొయ్య మొద్దు . కనిపెట్టానన్నట్టు చెప్పాడు జాన్. “ఈ చేపల్ని దొంగిలించి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ మనం పట్టుబడినా పట్టుబడొచ్చు కాబట్టి వాటిని విడిపిద్దాం”.

“ఆ, అదే సరైన పని” – కసిగా అన్నాడు హ్యారీ.

జమ్ములోనున్న వస్తువును సమీపించిన జాన్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. అది సాల్మన్ చేపలను పట్టేందుకు ఉపయోగించే మొద్దు కాదు. నది ఒడ్డున ఒక కొయ్యకు కట్టివున్న చిన్న పడవ. ఓ దుష్ట ప్రణాళికను చక్కగా ఆచరణలో ‘ పెట్టడానికి జాన్లాంటి తెలివైనవాడికి ఎంతో సమయం పట్టదు. చాలా జాగ్రత్తగా కంచె వెంబడి ప్రాకుతూ వాళ్ళు యార్వే పొలంలోని ఒక గోదామును సమీపించారు.

జాన్కు యిప్పుడు ఆపిల్ పండ్లు దొంగిలించాలని లేదు. ఈ సారి మంచి జున్నును దొంగిలించ బోతున్నాడు. ఈ ఆలోచన రాగానే అతని నోట్లో నీళ్ళూరడం ప్రారంభించాయి. “ఈ పడవ ఎక్కువ ఊగుతోంది” – దొంగిలించిన జున్ను గడ్డల్ని పడవలో పెట్టడానికి గోదామునుండి తిరిగివచ్చినప్పుడు రోజర్స్ అన్నాడు. “అయితే ఏం?” కోపంగా అన్నాడు జాన్.

“నాకు ఈత రాదు” చెప్పాడు రోజర్స్.

“నాక్కూడా రాదు. అయినా నది వెంబడి ఫెన్లేక్ వరకు ఈ పడవను నడిపించడానికి ఈత రానవసరంలేదు” జవాబిచ్చాడు జాన్.

“అంటే నీ ఉద్దేశం బెడ్ఫోర్డ్లో అందరూ చూసేట్టుగా మనమీ పడవలో వెళ్ళాలనా?” రోజర్స్ ఆశ్చర్యంగా అడిగాడు.

“కచ్చితంగా. ఈ జున్ను గడ్డల్ని పడవలో పెట్టి జమ్ము రెల్లుతో కప్పేద్దాం. ఊర్లో మనుషులు పడవను గమనించేంత తీరిగ్గా ఏం ఉండరు. ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటారు. పడవను మా యింటికి ఓ మైలు దూరంలో ఉన్న ఫెన్లేక్ దగ్గర ఆపి, జున్ను గడ్డల్ని దింపేద్దాం. వాటిని వెంటనే యింటిలోకి తీసుకెళ్ళకుండా మా కొలిమి దగ్గర ఒక గుంట త్రవ్వి అందులో దాచిపెడదాం. మా నాన్న ఆ కొలిమిని యిప్పుడు అంతగా ఉపయోగించడం లేదు” జాన్ తన వ్యూహాన్ని విడమరిచి చెప్పాడు.

“అసలీ పడవ బాగుందో లేదో పరీక్షించాల్సిన అవసరం లేదంటావా?” సలహా యిస్తున్నట్టుగా ప్రశ్నించాడు హ్యారీ. “ఒకవేళ నువ్వు దాన్ని సరిగా నడపలేకపోతే!”

తాను నడిపి చూపాలనుకున్నాడు జాన్. తెలివితక్కువవాళ్ళతో వాదించడం తన ఓపికను తాను పరీక్షించినట్టే. జాన్ వెంటనే పడవలోకి దూకి, ఊగుతున్న పడవలో నిలదొక్కుకొని, ఒక పొడవైన కర్రతో ఒడ్డును బలంగా త్రోశాడు. పడవ మెల్లగా ముందుకు కదిలింది.

“ఇంకా భయపడుతున్నావా రోజర్స్? ఇంకా నమ్మకం కలగలేదా పిరికిపందా?” రోజర్స్ ని గేలిచేయసాగాడు జాన్.

“సరేలే! ఇక దాన్ని వెనక్కి తీసుకురా”,

జాన్ కర్రను నీళ్ళలో ముంచి తోయాలని ప్రయత్నించాడు. కాని నది జాన్ ఊహించినదానికన్నా లోతుగా ఉంది. ఒక ప్రక్కగా క్రిందికి వంగి కర్రను నీళ్ళలో యింకా లోతుకు పోనిచ్చి తోయాలని ప్రయత్నించాడు.

కర్ర నీళ్ళ అడుగున ఉన్న బురదలో యిరుక్కుపోయింది. తానేదో పొరపాటు చేశాననుకున్నాడు జాన్. అదే తన ఆఖరి పొరపాటు అయ్యేలా ఉంది. పడవ ప్రక్కకు ఒరిగింది. జాన్ నదిలో పడ్డాడు.

“దేవుడా, నాకు ఈత రాదు” భయంతో కేకేశాడు జాన్.

గర్వించదగ్గ సిపాయి

గర్వించదగ్గ సిపాయి

పిచ్చిగా నీళ్ళను బాదసాగాడు జాన్. “దేవుడనేవాడివి నీవొకడివి ఉంటే నన్ను కాపాడు” అని తన మనస్సులోనే తాను అనుకున్నాడు. అప్పటికే నీళ్ళు అతని నోట్లోకి, ముక్కులోకి పోవడం ప్రారంభించాయి. అతడు తన కాళ్ళతో, చేతులతో నీళ్ళను కొడుతున్నాడు.

చల్లని నదీజలాలు అతని ప్రాణాల్ని పీల్చేస్తున్నాయి. అతని తల మునిగి పోతోంది. అతనికి ఊపిరాడ్డం లేదు. అంతలో అతని చేతికేదో తగిలింది. అది పడవ ప్రక్క భాగం. ఆ పడవ తనవైపుకే కొట్టుకొని వచ్చింది. జాన్ గట్టిగా దాన్ని కరుచు కున్నాడు.

ముక్కులోనుండీ, నోట్లోనుండీ నీళ్ళు యింకా కారుతూనే ఉన్నాయి. అతని కాళ్ళకు నేల తగిలింది. పడవను వదిలేసి గట్టువైపుకు పరుగెత్తాడు. గట్టుపైన బోర్లాపడుకొని దగ్గుతూ నోటిలోని నీళ్ళను వెళ్ళగక్కడం ప్రారంభించాడు. చావు కొంచెంలో తప్పిపోయి, బ్రతికి బయటపడ్డాడు. అనుకొంటేనే భయంతో వళ్ళు వణికిపోతోంది.

“ఇక్కణ్ణుండి వెళ్లాం పదండి, ఈ పడవను యిక వాడలేము” – బొంగురు గొంతుతో బాధగా అన్నాడు జాన్.

“అవును, వెళ్లాం పదండి” అంగీకారంగా అన్నాడు రోజర్స్.

“రోజంతటికీ సరిపోయినంత జున్ను తిన్నాను” – జాన్ నీళ్ళలో పడి అవస్థపడు తున్నంతసేపూ జున్నుగడ్డలు తింటూ విసిగిపోయిన హ్యారీ అన్నాడు.

కొలిమి వెలిగించి, నాగటికొనను సాగగొట్టేందుకు జాన్ సమయానికే యిల్లు చేరుకున్నాడు. తన బదులు మార్గీ పందులకూ, కోళ్ళకూ మేతపెట్టింది. తన అదృష్టంకొద్దీ కొలిమి వెంటనే అంటుకొంది. జాన్ తండ్రి బయటినుండి వచ్చి జాన్ పని చేస్తుండటం చూసి తృప్తిగా తల ఊపి వెళ్ళిపోయాడు. కొంచెంలో నాన్న దగ్గర తన్నులు తప్పాయి.

ఆ రాత్రంతా జాన్కు నిద్రపట్టనే లేదు. ఏదో కొద్దిసేపు మగతగా నిద్రపోయుంటా డంతే. ‘కొన్ని క్షణాల్లో చావు తప్పి తాను బ్రతికి బయటపడ్డాడు. తానీపాటికి చనిపోయి నరకంలో ఉండాల్సినవాడే! ఇంతకీ తన్ను కాపాడిందెవరు దేవుడా? సైతానా? సైతానుకు తాను సేవకుణ్ణి గనుక వాడు తనను కాపాడాడంటే అర్థముందిగాని దేవుడు కాపాడా డంటే ఎందుకు కాపాడినట్టు? రాత్రంతా ఆలోచిస్తూనే గడిపాడు జాన్.

మరుసటి రోజంతా జాన్ కొలిమికే అతుక్కుపోయాడు. ఆ మరుసటి రోజుకూడ అంతే. కష్టపడి పనిచేయడం మనస్సుకు సంతృప్తిని యిస్తోంది. ఇక కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. జాన్ విశ్రాంతి తీసుకొంటూ ఆలోచించడం ప్రారంభించాడు.

గత సంవత్సరం తన తాతయ్య చనిపోయాడు. తనొక గొప్ప వ్యాపారవేత్తనని డంబంగా చెప్పుకొనే ఆయన చుట్టు ప్రక్క గ్రామాల్లో యిల్లిల్లూ తిరిగి చిన్నచిన్న పాత్రలు అమ్మేవాడు. చనిపోయేనాటికి ఆయన తన నాల్గవ భార్యతో కాపురం చేస్తుండేవాడు. జాన్ సొంత నానమ్మ జాన్ నాన్న పుట్టిన సంవత్సరమే చనిపోయింది.

తనకెవరూ చెప్పలేదుగాని నాన్నను కంటూ ఆమె చనిపోయి ఉంటుందని జాన్ ఊహ. అలా పిల్లల్ని కంటూ చనిపోవడం ఎల్టా ప్రాంతంలో సర్వసాధారణమే. క్రూరమైన తన తండ్రిని కన్నందుకే నానమ్మ చనిపోయి ఉంటుందని జాన్ నమ్మకం.

జాన్ అమ్మమ్మ తాతయ్యలు కూడ చనిపోయారు. అమ్మమ్మ వాడిపోయిన ముఖం, నీళ్ళు నిలిచిన కళ్ళు తనకు కొద్దికొద్దిగా గుర్తున్నాయి. బెంట్లీ తాతయ్య పీక్కుపోయిన ముఖంతో అసలు ముఖముందా లేదా అన్నట్టు ఉండేవాడు. ఇప్పుడు చనిపోయినవారికీ గతంలో ఎప్పుడో చనిపోయినవారికీ ఏం తేడాలేదు.

ఆ తరమంతా చనిపోయింది. వాళ్ళిక కొద్ది కాలానికి పూర్వం చని పోయినవారిలాగే ఎవరికీ గుర్తుండరు. చనిపోయిన వాళ్ళంతా ఒకటే. వారిలో ఏం తేడా ఉండదు. “అయితే ఈ చనిపోయినవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళుంటారు, స్వర్గానికా? నరకానికా?” ఈ ప్రశ్నకు జాన్వద్ద జవాబు లేదు.

తనకు జ్ఞాపకమున్నంతవరకు తన చిన్నతనంలో నాన్న తనను ఎల్తో చర్చికి బలవంతంగా పంపేవాడు. తనకు తెలిసినంతవరకు నాన్న చేసిన మంచి పని అదొక్కటే. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం స్థానికంగా ఉన్న చర్చికి తప్పక హాజరు కావాలి. అది ఇంగ్లాండు దేశ చట్టం.

చనిపోయిన ప్రతి ఒక్కరూ స్వర్గంలోగాని, నరకంలోగాని ఉంటారని పాస్టర్ క్రిస్టఫర్ హాల్ చెప్తుండేవాడు. స్వర్గం-నరకం, ఈ రెండూకూడ జాను ఉత్సాహాన్నిచ్చేవి కావు. స్వర్గానికి వెళ్ళే అవకాశం తానెప్పుడో పోగొట్టుకొన్నాడు. నరకంకూడ స్వర్గంతో సమానంగా ఆశించదగిందేనని తనలో తాను తృప్తిపడుతుంటాడు. ఎందుకంటే తాను వెళ్ళబోయేది అక్కడికే కాబట్టి.

“అయితే నరకంలో యితరులను హింసించేందుకు సైతానుకు సేవకుడిగా తాను అర్హత సంపాదించాలంటే ఈ లోకంలో బాగా పాపం చేయాలి. దుర్మార్గుడిగా జీవించాలి” – జాన్ తనకు తాను తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత జాన్ తన స్నేహితుల్ని కలిసికొన్నాడు. తాను యింట్లో పడే హింసను గూర్చి వారికి చెప్పాలనీ, మరో తుంటరిపనికి ప్రణాళిక వేయాలనీ అతడు ఉబలాటపడ్డాడు. కాని వాళ్ళ మాటలు యుద్ధంవైపు వెళ్ళాయి.

1642వ సంవత్సరం అక్టోబరు 23వ తేదీన ఎల్టాకు నైరుతి దిశగా కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఎక్జిల్ వద్ద రాజుగారి సైన్యం, పార్లమెంటు సైన్యం తలపడ్డాయి. కొంతకాలం క్రితం నది ఒడ్డున తాము చూచిన సైన్యం ఈ యుద్ధం చేసుంటుంది.

ముప్పైవేలమంది సైనికులు కత్తులు, ఈటెలు, గొడ్డళ్ళు, తుపాకులతో భీకరంగా యుద్ధం చేశారు. సర్ లూక్కూడ ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. ఐదువేలమంది సైనికులు తమ రక్తాన్ని ఆఖరి బొట్టువరకూ చిందించి చనిపోయారు. సర్ లూక్ మాత్రం బ్రతికాడు.

దీని తర్వాత చార్లెస్ రాజు తన సైన్యాన్ని ఉపసంహరించుకొని పశ్చిమ దిశగా ఆక్స్ఫార్డ్లోని పెద్ద కోటకు తరలివెళ్ళాడు. ఎస్సెక్స్ ప్రభువు తన సైన్యాన్ని తీసికొని దక్షిణ దిక్కుగా తమకు సురక్షిత ప్రదేశమైన లండన్కు వెళ్ళాడు. ఇరువైపులవారూ విజయం తమదేనని ప్రకటించుకొన్నారు.

“దేశం రెండు ముక్కలైంది” కోపంగా అన్నాడు రోజర్స్.

“రాజుగారు వాయవ్య దిక్కునూ, పార్లమెంటువారు ఆగ్నేయ ప్రాంతాన్నీ తమ అదుపులో ఉంచుకొన్నారు” జోడించాడు హ్యారీ.

“మన బెడ్ఫోర్డ్ మాత్రం ఈ రెండింటి మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలో ఉంది” చింతించాడు రోజర్స్.

“సైనికులకు పదహారు సంవత్సరాల వయసుండాలనడం ఏం బాగా లేదు” దుఃఖించాడు జాన్. “అబ్బ, సైతాను పనులకు యుద్ధంలో ఎంత మంచి అవకాశం !” ఎక్కడో చూస్తూ కలకంటున్నట్టుగా అన్నాడతడు.

ఎక్జిల్ యుద్ధం అయిపోయాక, మళ్ళీ మరిన్ని యుద్ధాలనుగూర్చిన వదంతులు వచ్చాయి. మొదట పార్లమెంటు సైన్యం అడ్వాల్టన్ మూర్ వద్ద రాజుగారి సైన్యంతో ఓడిపోయింది. తర్వాత పార్లమెంటు సైన్యం రాజుగారి సైన్యాన్ని రౌండ్ వే డౌన్స్ వద్ద ఎదుర్కొంది.

ఆ యుద్ధం పార్లమెంటు అత్యున్నత సైన్యాధికారి విలియం వాలరూ, రాజుగారి వీర యోధుడు ప్రిన్స్ రూపర్ట్కూ మధ్య జరిగింది. ప్రిన్స్ రూపర్ట్ చేతిలో వాలర్ చావుదెబ్బ తిన్నాడు. బెడ్ఫోర్డ్ షైర్ తూర్పుభాగం, ఆ చుట్టు ప్రక్క ప్రాంతాలు తిరుగుబాటుదారులైన పార్లమెంటు సైన్యంతో చేతులు కలిపాయి. యుద్ధం త్వరగా ముగియటం జాన్కు సంతోషంగా లేదు.

“బహుశా నాకోసమైనా సైతాను యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు” – తనలో తాను చెప్పుకొన్నాడు జాన్.

తన పదిహేనవ పుట్టినరోజుకు ఒక నెలముందు జాన్ తమ పెరట్లో తన తండ్రి కొలిమివద్ద పనిచేస్తున్నాడు. చీకటి ఆలోచనలు అతని మనస్సులో యధేచ్చగా ముసురు కుంటున్నాయి. వర్షం బాగా కురిసింది. జాన్ యింటి దగ్గరనున్న చిన్న నది ఎప్పటి లాగానే బాగా పొంగి ప్రవహిస్తోంది.

ఇంటి వెనుక పొలం బురదమయంగా ఉంది. ఇంగ్లీషువారి చట్టం ప్రకారం బీడు భూముల్లో ఎవరి పశువులైనా మేయవచ్చు. అందుకే ఎలోలో ఉన్న పందులన్నీ జాన్ వాళ్ళ బీడు భూముల్లోని బురదలో ముట్టెలు పైకెత్తి పొర్లాడుతున్నాయి. వాటి కంపునూ, అరుపులనూ జాన్ భరించలేకపోతున్నాడు.

రోజర్స్ ఒగర్చుతూ హడావుడిగా పెరట్లో ఉన్న జాన్వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖం ఎండకు కమిలిపోయి ఉంది. “రాజుగారి అశ్వకదళం సర్ లూయిస్ డైవే నాయకత్వంలో బెడ్ఫోర్డ్్మద దాడి చేస్తోంది.”

“సర్ డైవేని సర్ లూక్ మట్టుబెడతాడు” – నింపాదిగా జవాబిచ్చాడు జాన్.

“లేదు, రాజుగారి సైన్యమే గెలుస్తుందని విన్నాను” అన్నాడు రోజర్స్.

“రోజర్స్, బెడ్ఫోర్డ్కు వెళ్లాం పద” – గుర్రపు నాడాను మంటలోకి విసిరేస్తూ అన్నాడు జాన్.

“ఏ .. ఏ ఏంటీ, బెడ్ఫోర్డ్క? నాటింగ్ం నుండి ఆనాటి సైనికుడు అక్కడకు వస్తే ఎలా? వాడు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాడుకూడా.”

జాన్ గంభీరంగా బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతడు యుద్ధం చేయ డానికి వెళ్తున్నాడా లేక యుద్ధం చూడ్డానికి వెళ్తున్నాడా అనేది తెలీదు. వెళ్ళొద్దని వాళ్ళమ్మ బ్రతిమలాడింది. మార్గీ బ్రతిమలాడింది. రోజర్సక్కూడ బ్రతిమలాడాడు. వీళ్ళెవరూ అతణ్ణి ఆపలేకపోయారు. కాని అతని తండ్రి పిడికిలి ఒక్కటే అతణ్ణి ఆపగలిగింది.

ఆ తర్వాత హ్యారీతో కలిసి జాన్ బెడ్ఫోర్డ్కు జారుకున్న సమయానికి రాజుగారి మనుష్యులంతా వెళ్ళిపోయి బెడ్ఫోర్డు పౌరులు గాభరాగా వీధుల్లో తిరుగుతున్నారు. సర్ డైవే గత సంవత్సరం ఔసె నదిని ఈది సర్ లూకన్నుండి తప్పించుకొనిపోయి యిప్పుడు ప్రతీకారంగా వందలాది సైన్యంతో తిరిగి వచ్చాడు. వారు న్యూపోర్ట్ ప్యాగ్నెల్లోని చిన్న అశ్వకదళాన్ని ఓడించి తరిమికొట్టి రెండువేల మంది జనాభాగల పట్టణాన్ని కొల్లగొట్టారు. సెయింట్ పీటర్స్ గ్రీన్ నుండి సెయింట్ జాన్ హాస్సిటలవరకు రాజమార్గమంతా గుడ్డలతో కప్పిన శవాలతో నిండి ఉంది.

“అదీ యిప్పుడున్న యుద్ధ పరిస్థితి” పురజనుల్లో ఒకడన్నాడు. “ఒక గుంపుకు చెందినవారు బయటికి వెళ్ళినప్పుడు అది తెలిసికొని అవతలి గుంపుకు చెందినవారు వారి స్థావరాలకు వచ్చి దోపిడీలు, హత్యాకాండలు జరిగిస్తున్నారు. సర్ లూక్ తన సైన్యంతో న్యూపోర్ట్ ప్యాగ్నెల్నుండి వెళ్ళిపోయాడని సర్ డైవేకి తెలిసి ఉండొచ్చు”.

ప్రతి ప్రాంతంలోను అవతలివారి పక్షంగా పోరాడుతూ బలమైన తమ ప్రాకారాల్లో దాక్కొనేవారున్నారు. ఎల్లోకూడ అలాంటివారున్నారు. 1644 జనవరి మాసంలో పార్లమెంటుకు చెందిన వందమంది న్యూ ప్యాగ్నెల్ స్థావరంనుండి వచ్చి, ఎల్స్టా చర్చి దగ్గర హిల్లర్స్టాన్ హౌస్లోలో నివాసముండే ఒక రాజుగారివైపు వ్యక్తిని బయటకు లాగారు.

ఆ రోజు చలిగాలి తీవ్రంగా ఉన్నందువల్లనూ, చాలా త్వరగా ఆ పని జరిగినందువల్లనూ కొద్దిమందిమాత్రమే అది చూశారు. జాన్ నివసించే ప్రాంతం అక్కడకు ఒక మైలు దూరంలో ఉన్నందున అతడుకూడ చూడలేకపోయాడు.

జాను గుర్తున్నంతవరకు యింత చలి మునుపెన్నడూ లేదు. లండన్ వాసులు ఆ మహా నగరానికి ముప్పై మైళ్ళ లోపలనున్న ఏ చెట్టునైనా నరికేయవచ్చునని ఎలెలో వదంతులు వ్యాపించాయి. అదే అదునుగా ప్రజలు విండ్సన్ దగ్గరనున్న రాజుగారి చెట్లన్నీ కొట్టేశారు.

జాన్ ప్రతిరోజూ నది ఒడ్డుకు పోయి నీళ్ళలో కొట్టుకొని వచ్చిన చెట్ల కొమ్మల్ని నరికి యింటికి తీసుకురావాలి. కాని జాన్ నది ఒడ్డున తన స్నేహితులతో కాలక్షేపంచేసి యింటికొచ్చేవాడు.

అమ్మకూ, చెల్లికీ చలికాచుకోడానికి కట్టెలవసరమనీ, తానొకవేళ తీసుకెళ్ళకపోతే వాళ్ళెక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుందనీ జాను తెలుసు. కాని తాను కట్టెలు తేవడంలేదన్న విషయాన్ని వాళ్ళు నాన్నతో చెప్పరు కాబట్టి తాను భయపడనవసరం లేదు. జాన్కు వసంత ఋతువంటే భలే యిష్టం. ఈ చలికాలమంటే జాను అస్సలు యిష్టం లేదు. ఎందుకంటే ఈ చలి కాలంలో అమ్మ, చెల్లీ విపరీతంగా దగ్గుతూ బలహీనపడిపోతుంటారు.

“మీ యిద్దరికీ విశ్రాంతి అవసరం” అన్నాడు జాన్.

“మరైతే యింటి పనుల్లో మాకు సహాయపడతావా జాన్?” ఆశగా అడిగింది

“ఇప్పుడు సహాయం చేయడం లేదామ్మా?” – తన్ను తాను సమర్థించుకొంటూ సమాధానమిచ్చాడు జాన్.

మే మొదటి వారం ఎలోలో జరిగే నాలుగు రోజుల సంతకు చుట్టు ప్రక్క ప్రాంతాలనుండి జనం విపరీతంగా వచ్చారు. వర్తకులు సంతల్లోనూ, తమ సొంత పట్టణాల్లోనూ తప్ప వేరెక్కడా వ్యాపారం చేయకూడదన్నది ఇంగ్లాండ్ దేశ చట్టం. సంతలో వస్తువులు జాన్కు ఏమాత్రం నచ్చలేదు.

ఇంద్రజాలం, తోలుబొమ్మలాట, వీధి నాటకం, చలిమంటలు యివేవీ తనను ఆకర్షించలేకపోయాయి. అయితే సంతకు కొద్ది దూరంగా మసక వెలుతురులోనున్న పొలాలను అతడు చాలా యిష్టపడ్డాడు. అక్కడి సంగీతానికి అతని హృదయం గీతాలాపన చేసింది. కోళ్ళ పందాలు, అల్లరి నృత్యాలు, పేకాటలు, అలంకరించుకొన్న స్త్రీలు – అక్కడ పాపం రాజ్యమేలుతోంది.

ప్రస్తుతం తనవద్ద డబ్బు లేదు. అందుకే కేవలం చూచి ఆనందించి తృప్తిపొందు తున్నాడు. ‘అయితే వీటన్నిటినీ అనుభవించి ఆనందించే ఒక రోజు రాకపోతుందా?’ జాన్ తనలోతాను ఊహించుకొంటూ నడుస్తున్నాడు.

“జీవితాన్ని ఎలా అనుభవించాలో సైతానుకు బాగా తెలుసు” హ్యారీతో అన్నాడు జూన్.

జూన్ నెలలో జాన్ తల్లికి బాగా జబ్బు చేసింది. మొదట అతడు అంతగా పట్టించు కోలేదు. పల్లెల్లో స్త్రీలు జబ్బుపడటం మామూలే! అది చాలా కష్టంగా ఉన్నప్పటికీ భరించక తప్పదు. కాని జాన్ అమ్మ మంచంమీదనుండి లేవలేకుండా పోయింది.

“పాపం అమ్మ ఎంత బలహీనమైపోయింది!” తనలో తాను బాధపడ్డాడు జాన్. ఇప్పుడు మార్గీ రొట్టెలు కాల్చడమేగాక, యింటి పనులన్నీ కూడా చేయాలి. చార్లెస్ రాజు తన సైన్యంతోసహా ఎల్టాకు దక్షిణంగా యిరవై మైళ్ళ దూరంలోనున్న లైటన్ పట్టణంమీదకు బయలుదేరాడన్న విషయం జాన్లో ఉత్సాహాన్ని రేపింది. అయిష్టంగానే జాన్ తిరిగి రాజును యిష్టపడటం ప్రారంభించాడు.

“వీళ్ళింకా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారట” – ఒక రోజు సాయంత్రం ఆనందంగా తన స్నేహితులతో అన్నాడు జాన్.

“చార్లెస్ రాజు మత్తు కళ్ళవాడట. మా సవతి తండ్రి చెప్పాడు” ద్వేషంగా అన్నాడు హ్యారీ.
.
“కాని ఆ మత్తు కళ్ళవాడు యుద్ధం చేస్తున్నాడు తెలుసా?” – కోపంగా అన్నాడు

“మనం ఒకటి రెండు యుద్ధాల్లోనైనా పాల్గొనాలి. ఏంటి, యుద్ధం సంగతి వింటూనే నీ ముఖం ఆవు పాలలాగా తెల్లబోయింది రోజర్స్?”

తన తల్లికి జబ్బు ఎక్కువైనప్పుడు జాన్ బాగా కలవరపడ్డాడు. ‘జ్వరంతో ఈ మధ్య చాలామంది చనిపోయారు. ఒకవేళ అమ్మకేమైనా ఐతే!’ అమ్మ లేని యింటిని ఊహించుకోలేకపోతున్నాడు జాన్. ఇప్పుడామె తనకొక జబ్బు మనిషిలాగ కాకుండా చాలా విలువైందిగా కనబడుతోంది.

అమ్మ అలా మంచాన పడి ఉండటం అతనికి చాలా బాధగా ఉంది. ఆమెను స్వస్థపరచమని మనసారా దేవుణ్ణి ప్రార్థించాడు. ఒక రోజు ఆమె గంజి చప్పరిస్తూ కోలుకున్నట్టే కనిపించింది కాని మరుసటి రోజుకంతా పాలిపోయి చల్లగా చలనంలేకుండా రాయిలా పడి ఉంది. తనకెంతో ప్రియమైన అమ్మ యిక లేదు.

అమ్మ చనిపోయింది. ఆమె తనను వదలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దేవుడు మళ్ళీ తనను వదిలేశాడు. సమాధి ప్రక్కన అమ్మ తమ్ముడు జాన్, ఆమె తోబుట్టువులు రోస్, ఎలిజబెత్, ఆనీ మేరీలు మాత్రమే కనిపించారు. తమ తండ్రి, తమ్ముడు ఎడ్వర్డ్, ఆయన ముగ్గురు సోదరీలు బాగా అలంకరించుకొని కనిపించారు.

జాన్ చెల్లి మార్గీ జబ్బుగా ఉన్నప్పటికీ జాన్ను ఓదార్చేందుకు ప్రయత్నించింది కాని అతణ్ణి ఓదార్చలేకపోయింది. ‘అమ్మ బ్రతికున్న రోజుల్లో ఆమె మాట వినకుండా తాను ఆమెనెంతగా బాధపెట్టాడు!’ జాన్ అంతరాత్మ అతణ్ణి గుండెల్ని పిండుతూ ప్రశ్నిస్తోంది.

ఆ మరుసటి నెలలో మార్గీ చనిపోయినప్పుడు జాను ఈ ప్రపంచం శూన్యంగా కనిపించింది. తాను మార్గీకోసంకూడ ప్రార్థన చేశాడు. అయినా దేవుడు తనను మళ్ళీ నిరాశపరిచాడు. ఎర్రని జుట్టుతో, ముఖంపై గోధుమరంగు మచ్చలతో ఎంతో అందంగా ఉండే తన ప్రియమైన మార్గే తనకు దూరమైన దుఃఖాన్నుండి తాను కోలుకోలేకపోతున్నాడు.

ఆలోచనలతో జాన్కు రాత్రిళ్ళు నిద్రపట్టడంలేదు. ఒకవేళ మగతగా నిద్రపట్టినా పీడకలలు తనకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. మార్గీ బ్రతికున్న రోజుల్లో తానామెపట్ల ప్రవర్తించిన తీరు తనను హృదయంలో గుచ్చుతోంది.

కొన్నిరోజుల తర్వాత యార్కుకు సమీపంలో ఉత్తరంవైపున మార్దన్ మూర్ వద్ద భీకర యుద్ధం జరుగుతోందని బెడ్ఫోర్డ్షైర్లో జాన్, అతని మిత్రులు విన్నారు. అక్కడ పార్లమెంటు సైన్యం రాజుగారి సైన్యాన్ని నామరూపాల్లేకుండా చేసింది. ఈ యుద్ధం ఆలివర్ క్రాంవెల్ అనే అశ్వక దళ అధ్యక్షునిద్వారా అపజయంనుండి విజయంవైపుకు తిరిగింది. అజేయుడైన అతనికి సైనికులు ‘ఐరన్ సైడ్స్’ అనే బిరుదు నిచ్చారు.

“హంటింగ్టన్ నుండి ఔసె నదివరకు ఐరన్ సైడ్స్ బాగా ప్రబలమయ్యాడని అందరూ అంటున్నారు” – హ్యారీ కళ్ళు విచ్చుకున్నాయి.

“నేను ఒకప్పుడు రాజుగార్ని అభిమానించేవాణ్ణిగా ఉన్నానన్న విషయాన్ని నమ్మలేక పోతున్నాను” జాన్ తనలో తాను గొణుక్కున్నాడు. “మా అమ్మా, చెల్లీ చనిపోవడానికి కారణమైనాకూడ రాజుగారిని నేను అభిమానించేందుకు కారణమైనందుకు మా నాన్నకు నేను కృతజ్ఞుణ్ణి.” వాళ్ళకున్న కొద్దిపాటి పొలంలో జాన్ గోధుమపంట కోసి, కట్టలు కట్టి వామిగా పేర్చుతున్నాడు.

యుద్ధం యింత త్వరగా ముగింపుకు రావడం అతణ్ణి కలవరపరుస్తోంది. ఇంగ్లాండు చరిత్రలో యింత ఘోరమైన ఉపద్రవం వెనుక సైతాను ప్రమేయం తప్పక ఉండి ఉంటుంది. అయితే తానీ ఉపద్రవంలో పాలుపంచుకొని సైతానుకు ఉపయోగపడే అవకాశాన్ని జారవిడుచుకొంటున్నాడేమో!

జాన్ జీవితం యింకా విషాదమైపోయింది. అతడు గడ్డి నూర్చి గోధుమలను గోతాల్లోకి ఎత్తే సమయానికి వాళ్ళ నాన్న ఒక నూతన వధువుతో యింటికి వచ్చాడు. అర్థరాత్రి జాన్ ఒళ్ళు నొప్పులతోను, తల్లి చెల్లి జ్ఞాపకాలతోను అటకపై రోదించే సమయంలో అతని తండ్రి తన క్రొత్త వధువు ఆనీతో నిద్రిస్తున్నాడు. తన తండ్రిని చూస్తే జాను అసహ్యమేస్తోంది.

జాన్ ప్రక్కకు తిరిగి యుద్ధాన్నిగురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఈ యుద్ధం యిలానే మరికొంత కాలం కొనసాగాలని తాను మనసారా కోరుకొంటున్నాడు. నవంబరు నెలలో కొన్ని వారాల తర్వాత జాన్ తమకున్న కొద్దిపాటి పొలాన్ని దున్ని, గోధుమలు చల్లాడు. ఇదంతా అతడు గుర్రంలేకుండా తనే చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న పాత్రలకు, పనిముట్లకు కళాయి వేయడానికి ప్రక్క గ్రామాలకు వెళ్తూ తన క్రొత్త పెండ్లికూతురుకోసం త్వరగా యింటికి వచ్చేందుకు గుర్రాన్ని తనతో తీసుకెళ్ళేవాడు.

జాను విడుదల దినం ఆసన్నమైంది. అతడు వీడ్కోలు సంజ్ఞగా తన సవతి తల్లి ఆనీవైపు తీవ్రంగా చూస్తూ తన యింటిని శాశ్వతంగా వదిలేశాడు. బెడ్ఫోర్డ్ు వెళ్ళేదారిలో మలుపుదగ్గర విల్లీతో కలిసి వెళ్తున్న జాన్ను రోజర్స్ చూశాడు.

“ఏయ్ జాన్, ఎక్కడికి వెళ్తున్నావు?”

“నా తమ్ముడు విల్లీని స్కూలుకు తీసుకెళ్తున్నాను” – జవాబిచ్చాడు జాన్.

“అలా నీవెప్పుడు చేయవుగదా జాన్. క్రొత్తగా ఈ రోజేంటి యిలా? నీ చేతిలో ఆ సంచి ఏమిటి?” – ఆశ్చర్యంగా అడిగాడు రోజర్స్.

“నీవు తప్పక తెలుసుకోవాలా? అయితే విను. నేను సైన్యంలో చేరడానికి వెళ్తు న్నాను. ఈ రోజుతో నాకు పదహారేళ్ళు నిండాయి.” గంభీరంగా జవాబిచ్చాడు జాన్. “నాక్కూడా పదహారేళ్ళు నిండాయి.

“నేనుకూడ సైన్యంలో చేరాలనుకుంటున్నాను. కాని వాళ్లు మనల్ని పిలిచేంతవరకు ఆగుదాం” – సలహా యిస్తున్నట్టుగా చెప్పాడు. రోజర్స్.

“అప్పటికి యుద్ధకాలం కాస్త అయిపోతుంది.” అలా అంటూనే ముందుకు సాగి పోయాడు జాన్. తాను యుద్ధంలో ఎందుకు చేరాలనుకుంటున్నాడో రోజర్స్కేం తెలుసు? చెప్పినా వాడు అర్థం చేసుకోలేడు. కన్నీళ్ళతో తనకు వీడ్కోలు చెబుతోన్న తన చిన్నారి తమ్ముడు విల్లీవైపు కడసారి ప్రేమగా చూశాడు జాన్. చివరిసారిగా వాడితో ఏదో మాట్లాడాలనీ, వాడికేమేమో చెప్పాలనీ ఉంది కాని, ఏం చెప్పినా అర్థం చేసుకునే వయస్సు కాదు వాడిది.

ఆలోచిస్తూ ముందుకు నడిచాడు జాన్. ఆ తర్వాత అతడు న్యూఫోర్ట్ ప్యాగ్నెల్వద్ద సైనిక స్థావరంయొక్క ముఖద్వారంలో ప్రవేశించినప్పుడు జీవితంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్వేచ్ఛను పొందిన అనుభూతిని పొందాడు. ఇప్పుడు తానొక సైనికుడుగా ‘ఐరన్ సైడ్స్’ అని పిలువబడే ఆలివర్ క్రాంవెల్ సైన్యంలో పనిచేయబోతున్నాడు.

తూర్పు ప్రాంతానికి చెందిన అన్ని పరగణాలనుండి వచ్చిన దాదాపు వెయ్యిమంది సైనికులతో నిండి ఉంటుందీ సైనిక స్థావరం. న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో తోటి సైనికులతో పిచ్చాపాటిగా మాట్లాడుకొంటుంటే తెలిసింది వారు భీకరమైన యుద్ధాన్ని చూశారని.

రాజుగారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటిలో వారు యుద్ధం చేశారట. వారి సైన్యాధ్యక్షుడు సర్ శామ్యుల్ లూక్. ఆయనను జాన్ యింకా మరిచిపోలేదు. ఆ తర్వాత రోజుల్లో జాన్ ఆయనను చాలా అరుదుగా చూశాడు. తరచుగా తనకు కనిపించే సైనికాధికారులు కల్నల్ కొకేన్, మేజర్ ఎన్నీస్లు.

కొన్నాళ్ళపాటు క్రొత్త సైనికులకు శిక్షణనివ్వడం పూర్తయ్యాక జాన్ అధికారి అతనివద్దకు వచ్చి ఇలా అన్నాడు – “పార్లమెంటు సైన్యంలో నీవు ఏ విభాగంలో చక్కగా సరిపోతావో యిప్పుడు నిర్ణయించాలి.”

“ఐరన్ సైడ్స్ యొక్క అశ్వకదళంలో చేరడం నాకు యిష్టం” – తన యిష్టాన్ని
తెలిపాడు జాన్.

“నీ యిష్టప్రకారం అశ్వకదళంలో చేరడం సాధ్యంకాదు. మంచి విగ్రహంతో నీవు బాగా బలంగానే కనిపిస్తున్నావుగాని, పైకి కనిపించేటంత ధృడంగా ఉన్నావా నీవు?”

“మా నాన్నగారి గుర్రంవద్ద నేను చిన్నప్పటినుండీ పనిచేశాను. గుర్రాన్ని నియంత్రిం చడం నాకు అలవాటే” – తన అనుభవాన్ని వివరిస్తూ చెప్పాడు జాన్.

“ఈటెతో యుద్ధంచేసే సైనికునిగా నిన్ను చేయాలనుకున్నానుగాని నీకున్న తెలివితేటలను గుర్తించి నిన్ను తుపాకీ పట్టే సిపాయిగా చేస్తాను” – తన నిర్ణయం తెలిపాడు అధికారి.

తను తుపాకీ పేల్చే సిపాయి కావడం జాను చాలా ఆనందంగా ఉంది. ఈటెను పట్టే సైనికుడు పదహారడుగుల పదునైన ఈటెను భారంగా మోయడమేగాక, తలమీద శిరస్త్రాణం, ఛాతిని వీపును కప్పే బరువైన ఉక్కు కవచం మొదలైనవి ధరించాలి. అయితే తుపాకీ యోధులుకూడ భారమైన యుద్ధాభరణాలు ధరించడమేగాక వికారంగా కూడ కనిపిస్తారని తన దుస్తులు ధరించాక అతనికి అర్థమైంది.

దాదాపు పది కిలోల బరువుండే తుపాకినీ, ఒరలోనున్న పొడవైన కత్తినీ, ముళ్ళ గరిటెలాగ ఉండే పొడవైన యినుప కడ్డీనీ, ఛాతి చుట్టూ తుపాకీ గుండ్ల బెల్టునూ, తుపాకీ మందును ఉంచుకొన్న కొమ్మునూ మోయాల్సి ఉంటుంది. అంతేగాక ఛాతికి వాలుగానున్న పట్టీనుండి మందు గుండును వెలిగించే చిన్న ప్రేలుడు వత్తులు, మందు దట్టించిన తర్వాత గొట్టాన్ని మూసే దళసరి ఉన్ని బంతులుకూడ వ్రేలాడుతుంటాయి.

అయితే ఈ సైనిక దుస్తులు అతనికి సంతోషాన్నిచ్చాయి. అతని మనస్సును అవి పులకరింపజేశాయి. అతని క్రొత్త బూట్లు నల్లగా మెరుస్తూ నిగనిగలాడుతున్నాయి. తెల్లని ఈకతో వదులుగా ప్రక్కకు వాలి వెడల్పుగానున్న కమిలిన చర్మపు రంగు టోపీని అతడు తలపై ధరించాడు. తెల్లని మేజోళ్ళమీద కమిలిన చర్మపు రంగు ప్యాంటును ధరించాడు. తెల్లని పొడవైన చేతులు కలిగిన చొక్కా వెడల్పైన కాలర్ సింధూర వర్ణపు దట్టీ క్రింద దోపబడి ఉంది.

తుపాకీని తగిలించుకోడానికి ఏర్పాటు చేయబడిన చర్మపు రంగు సంచి ఎర్రని పట్టీతో చాలా అందంగా అమర్చబడి ఉంది. ఇంత చక్కని దుస్తులు జాన్ తన జీవితంలో ఎప్పుడూ ధరించలేదు. తానిప్పుడు ధరిం చిన ప్రతిదీ గతంలో తాను ధరించినదానికన్నా మెరుగ్గా ఉంది. పేదలకు ఒక అర్థ పెన్నీకూడ దానం చేయని ఈ ప్రజలు యుద్ధంకొరకై ఇలాంటి విలువైన వస్తువులకోసం డబ్బును ఉదారంగా సేకరించి పంపడం జాను ఆశ్చర్యంవేసింది. అయితే పేదలకు సహాయంచేసే విషయంలో తాను కొంతవరకు పరవాలేదనిపించింది జాను.

ఒక రోజు మేజర్ ఎన్నీస్ క్రొత్త సైనికులనుద్దేశించి మాట్లాడాడు – “మనది ఒక నూతనమైన ఆదర్శ సైన్యం. ప్రపంచంలోకెల్లా మనదే అత్యాధునికమైనది. ప్రామాణిక మైన జీతభత్యాలను, స్పష్టమైన నియమనిబంధనలను ఏర్పాటుచేసిన ఆలివర్ క్రాంవెలు మనమందరం సదా కృతజ్ఞులం.

నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈటెపట్టే సైనికుడు తుపాకీ పేల్చే సిపాయికి చాలా సన్నిహితుడైన మిత్రుడు. అలానే తుపాకీ పేల్చే సిపాయికూడ ఈటె పట్టే సైనికునికి అత్యుత్తమమైన స్నేహితుడు. నేను చెప్పేది యిప్పుడు మీరు నమ్మకపోతే మీ మొదటి యుద్ధంలో పాల్గొన్న తర్వాత మీరు తప్పక నమ్ముతారు.”

బరువైన తన దుస్తుల్నీ, ఉపకరణాల్నీ ధరించి నడవడాన్ని జాన్ ప్రతి రోజూ సాధన చేస్తున్నాడు. అప్పుడప్పుడు తన తుపాకీని పేల్చడంకూడ అతడు సాధన చేస్తున్నాడు. అయితే తుపాకీ మందు, గుండ్లు చాలా ఖరీదైనవి, చూసి వాడుకోవాలి. తుపాకీని ఎలా పేల్చాలో జాన్ సార్జంట్ అతనికి క్షుణ్ణంగా బోధించాడు.

తుపాకీని మోకాళ్ళ మధ్య ఎలాపెట్టుకోవాలో, సరిపడ్డ తుపాకీ మందును అరచేతిలో వేసికొని తుపాకీ గొట్టంలో ఎలా దట్టించాలో అతడు జాన్కు నేర్పించాడు. జాన్ అప్పుడొక గుండును గొట్టం లోపల వేసి ఒక పేపరు బిరడాను అడ్డం పెట్టాడు. తర్వాత ఒక కడ్డీ తీసికొని బిరడాను గట్టిగా మందు గుండువైపు బిగగొట్టాడు. అప్పుడతడు తుపాకీని స్టాండుమీద కదలకుండా ఉంచి, ఒక తాడుకు నిప్పంటించి, ఫ్లాష్పాన్మాద ప్రాథమిక ప్రేలుడు పదార్థాన్ని చల్లి, గొట్టాన్ని గురివైపుకు సరిచేసి మ్యాచ్ లాక్ను లాగాడు.

ఒక క్షణం తర్వాత గొట్టంలోనుండి ప్రేలుడు పదార్థం పెనుకెరటంలాగ పెద్ద శబ్దంతో విరుచుకు పడింది. తర్వాత గొట్టంలోనుండి పొగ దట్టంగా బయటకు వచ్చింది. తుపాకీ గుండు కొద్ది దూరంలో చెక్కతో తయారుచేసిన ఒక లక్ష్యాన్ని ఛేదించవలసి ఉంటుంది. గుండు అప్పుడప్పుడూ గురివైపుకు చక్కగా వెళ్ళేది. కాని తుపాకీ గొట్టంలో నుండి వచ్చే దట్టమైన పొగ కారణంగా జాన్కేమీ కనిపించేది కాదు.

“నువ్వు నాకెందుకు సన్నిహితమైన మిత్రుడివో నాకిప్పుడర్థమైంది” – జాన్ తనతో నున్న ఈటె పట్టుకొనే సైనికునితో అన్నాడు. “నేను రెండు నిమిషాలకోసారి మాత్రమే నా తుపాకీని పేల్చగలను. మళ్ళీ రెండవసారి నా తుపాకీని సిద్ధంచేసికొని పేల్చే వ్యవధిలో నేను కేవలం భద్రతలేనివాణ్ణి.” పదహారడుగుల పొడవున్న ఈటెల మధ్యలో తాను కాపాడబడటమనే ఆలోచన జాన్కు ఆదరణ కలిగించింది.

న్యూపోర్ట్ ప్యాగ్నెల్ ప్రాముఖ్యతనుకూడ జాన్ తెలుసుకొన్నాడు. ఇది పార్లమెంటు సైనిక స్థావరంలో ఒకటైన ‘తూర్పు సమాఖ్య’లో ఒక భాగం. ఆలివర్ క్రాంవెల్ సొంత కుమారుడు ఈ సైనిక స్థావరంలో ఉంటూ గత సంవత్సరం మశూచి సోకి చనిపోయాడు.

ఈ సైనిక స్థావరం చుట్టు ప్రక్క ప్రాంతాల యువకుల్ని ఆకర్షిస్తోందా అన్నట్టు హ్యారీ, రోజర్స్లు కూడ త్వరలోనే అక్కడకు చేరుకున్నారు. అయితే వారు వేరే సైనిక శిబిరాల్లో ఉంచబడ్డారని జాన్కు ఆ తర్వాత తెలిసింది.

క్రొత్తగా వచ్చిన సైనికుడు ఇంగ్లీషువారి జీవన విధానాన్ని గురించి సైనిక స్థావరంలో చాలా నేర్చుకుంటాడు. తన మొదటి రోజుల్లో జాన్ వేరే సైనికుణ్ణి – “అశ్వకదళానికి ఎక్కడ శిక్షణనిస్తారు?” అని అడిగాడు.

తన ప్రశ్నకు సమాధానమివ్వకుండా ఆ సైనికుడిలా మాట్లాడ్డం ప్రారంభించాడు, “మన అధికారుల్లో మనలాగా నీతినియమాలుండవు తెలుసా? తమ యిష్టాయిష్టాలకు సంబంధించినంతవరకు మన అధికారులు మంచివాళ్ళే.

మన అధికారుల్లో అందరూ సంపన్న వర్గాలవారే. మనలాంటి సామాన్య పేద వర్గాన్ని వాళ్ళ అవసరాలకే వాళ్ళు వాడుకుంటారు. ఆపై ప్రక్కన పడేస్తారు. వాళ్ళకు మనతో పని ఉన్నంతవరకే మనతో మంచిగా ఉంటారు.”

ఎప్పుడూ తిరుగుబాటు మనస్తత్వాన్ని కలిగిన జాన్ న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో యితరుల కన్నా తానెంతో మెరుగైనవాడుగా తనకు కనిపించాడు. అతడెప్పుడూ యింత అమర్యాదకరమైన దుర్భాషలు విని ఎరుగడు. అక్కడి మనుష్యుల్లో ఉన్న విరోధభావం జాను విస్మయం కలిగించింది.

ఆ సైనికులు ప్రతి విషయాన్నీ చెడ్డగా మాట్లాడేవారు. ఆహారాన్నిగురించీ, రాజునుగురించీ, ధనికులను గురించీ, పెద్ద మనుషులను గురించీ, స్థానిక బాలికలనుగురించీ, అధికారులను గురించీ, జీవితాన్ని గురించీ, చివరకు దేవుణ్ణి గురించికూడా వారు చెడ్డగా మాట్లాడుకొనేవారు.

“బైబిలు అసలు వాస్తవమైంది కాదు” – ఒక సైనికుడన్నాడు.

“బైబిలు వాస్తవమైంది కాదా?” సైనికులందరితోబాటు తనక్కూడా యివ్వబడిన ప్యాకెట్ బైబిల్ను యిష్టపూర్వకంగా తానెప్పుడూ చదవనప్పటికీ తోటి సైనికుడన్నమాట తననెవరో లాగి చెంపమీద కొట్టినట్టనిపించింది జాను.

“అసలు దేవుడే లేడు” – బ్రౌన్ అనే మరో సైనికుడన్నాడు.

“దేవుడు లేడా?” ఊపిరాడనట్టుగా నోటితో గాలి పీలుస్తూ ప్రశ్నించాడు జాన్.

ఆ రాత్రి తన గుడారంలో జాన్ చాలా కలవరపడ్డాడు. ‘దేవుడు లేడా? అయితే సైతానుకూడ లేనట్టేగా! అలాగైతే చిన్నప్పటినుండి తాను విన్నదంతా అబద్ధమేనా? అవునేమో! దేవుడు ఒకవేళ లేకపోవచ్చు. దేవుడున్నాడని తాను విన్నదంతా అబద్ధమై యుండొచ్చు’.

మొట్టమొదటిసారిగా తన మనస్సులో దేవుణ్ణి గురించి విపరీతమైన తలంపులు దొర్లుకొస్తున్నాయి. తానింతకాలం ఎంత వెర్రివానిలా ఆలోచించాడు! నరకం తనకొక రక్షణదుర్గం అనుకొన్నాడు యింతకాలం. అంతా మిథ్య. తాను అనుకొంటూ వచ్చిందంతా మాయ. ఆలోచించడానికి శక్తి చాలడంలేదు. అంతా మరచిపోవాలి. తన ఆలోచనల్ని ప్రక్కకునెట్టి నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జాన్.

“దేవుడు లేడు. దయ్యం లేదు. ఏమీ లేదు. అంతా అబద్ధం …” – నిద్రకు ఉపక్రమించాడు జాన్.

గంభీరమైన సైనికుడు

గంభీరమైన సైనికుడు

సైనిక స్థావరంలో జాన్ శిక్షణ చక్కగా కొనసాగుతోంది. అతడా స్థావరంలో తానెప్పుడూ వినని విషయాలనూ, విన్నా అర్థంచేసికోలేని విషయాలనూ వినడం ప్రారంభించాడు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు తన ఆరాధనా క్రమంలోను, తన అధికార క్రమంలోను రోమన్ కథోలిక్ సంఘానికి చెందిన విషయాలను చాలావరకు వెంబ డిస్తున్నట్టు మొట్టమొదటిసారిగా అతడు తెలుసుకొన్నాడు.

ఆ విషయాలనుండి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను శుద్ధీకరించేందుకు ‘ప్యూరిటన్లు’ అని పిలువబడేవారు ప్రయత్నం చేస్తున్నారనీ, మరో ప్రక్క ‘ప్రెస్బిటేరియన్లు’ అని పిలువబడే మరికొందరు స్థానికులైన మత బోధకులతోను పెద్దలతోను క్రైస్తవ సంఘాలను నడపాలని కోరుకుంటూ బిషప్ అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనీ కూడా అతడు తెలుసుకొన్నాడు.

“మన స్థావరంలో చాలామంది ప్యూరిటన్లు, ప్రెస్బిటేరియన్లు ఉన్నారు. సహోదర ప్రేమనుగూర్చి ఈ రెండు తెగలవారు బోధిస్తారుగాని, వారిద్దర్లో ఒక గుంపువారంటే యింకొక గుంపువారికి అస్సలు సరిపడదు” – బ్రౌన్ అనే సైనికుడు చెప్పాడు.

అక్కడ కొన్ని తీవ్రవాద గుంపులుకూడ ఉన్నాయి. కులీనులను, ఉన్నత వర్గీయులను అణచివేయాలని అనేవారు ‘లెవలర్స్’, ‘డిగ్గర్స్’ అనే మరో తీవ్రవాద గుంపు యింకొక అడుగు ముందుకేసి దేశంలోని సంపదనంతా అందరికీ సమానంగా పంచి, తద్వారా భూమ్మీద స్వర్గాన్ని సృష్టించాలంటారు.

‘రాంటర్స్’ అనేవాళ్లు రకరకాల విశ్వాసాలతోనున్న చిన్నచిన్న తెగల సమ్మేళనం. అందులో కొందరు బైబిలు సత్యాలను, దేవుని ఉనికినికూడ సవాలు చేస్తారు. కొంతమంది క్రీస్తును విశ్వసిస్తారుగాని, ఆయన ఒక మర్మమైన అదృశ్యశక్తి అనీ, చారిత్రాత్మక వ్యక్తి అసలు కానేకాదనీ వారంటారు.

మరికొందరు రాంటర్లు ఫ్రెంచి మతాధికారియైన కాల్విన్యొక్క సిద్ధాంతాన్ని తీవ్రస్థాయిలో వాదిస్తారు. ఎవరు రక్షించబడాలో దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడనీ, అలా రక్షించబడేవారిని దేవుడు తానే ఎన్నుకొంటాడు కాబట్టి ‘రక్షణ’ అనేది ఒక వ్యక్తి చేతిలో లేదనీ వీరు వాదిస్తారు.

‘ఒక వ్యక్తి దేవునిచే ఎన్నుకోబడినవాడైనా అయివుంటాడు లేదా ఎన్నుకో బడనివాడైనా అయివుంటాడు’ అని వీరి అభిప్రాయం. ఈ విధమైన దృక్పథంవల్ల వీరిలో చాలామంది నైతికంగా దిగజారి ఉండటాన్ని జాన్ గమనించాడు.

బ్రౌన్ అనే ఈ సైనికుడు జాన్కు ఒక రాంటర్లాగా కనిపించాడు. ఒక రోజు జాన్ అతణ్ణి ఇలా అడిగాడు – “రాజుపైనగాని, పార్లమెంటుపైనగాని, దేవునిపైనగాని, నీకు నమ్మకం లేనట్లయితే నీవు మరెవరికోసం పోరాడుతున్నట్టు?”

“నా తలకాయ. నేనిందులోకి ఇష్టపూర్వకంగా రాలేదు. బలవంతంగా చేర్చబడ్డాను. ఇష్టం లేనప్పుడు ఎందుకుంటున్నావని అడుగుతావేమో! మన క్రాంవెల్ పారిపోయిన వారిని పట్టుకొని ఉరితీస్తున్నాడని నీకు తెలుసుగా? అందుకే ఉంటున్నాను.”

అలా చెప్పిన కొన్ని రోజులకే బ్రౌన్ పారిపోయాడు. గ్లాసెస్టరులోని రాజుగారి మద్దతుదారునికి చెందిన ఒక ఎస్టేట్ను స్వాధీనంచేసికొనేందుకు న్యూపోర్టు ప్యాగ్నెల్ నుండి ఒక బృందం వెళుతోందని తెలిసింది.

ఆ బృందంలో జాన్ కూడ వెళ్ళవలసింది గాని ఆ స్థానంలో తనను వెళ్ళనివ్వమని ఆ ప్రాంతానికి చెందిన హేజల్వుడ్ అనే స్నేహితుడు జాన్ను బ్రతిమాలాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బృందం తిరిగి వచ్చినప్పుడు హేజలీవుడ్ కాపలా కాస్తుండగా చంపబడ్డాడని జాన్కు తెలిసింది. ఒక తుపాకీ గుండు అతని మెదడు గుండా దూసుకుపోయిందట.

“ఆ స్థానంలో నేను చనిపోయి ఉండాల్సింది” – జాన్ తనలో తాను అనుకొన్నాడు. “యుద్ధంలో బ్రతకడంగాని, చావడంగాని కేవలం అదృష్టమేనా?”

తనకిప్పుడు యుద్ధమన్నా, యుద్ధం చేయాలన్నా అంత ఆసక్తిగా లేదు. అజాగ్రత్తగా ఉండే సైనికులకన్నా అప్రమత్తంగా ఉండే సైనికులే యుద్ధంలో చనిపోతున్నారనీ, బలహీనులకన్నా బలవంతులూ మూర్ఖులకన్నా ప్రతిభావంతులూ అసువులు బాస్తున్నా రనీ జాన్ గ్రహించాడు.

యుద్ధభూమిలో తుపాకీగుండ్లు ఎటుబడితే అటు ఉల్కల్లాగ గాల్లో సంచరిస్తుంటాయి. అలా ఆలోచించే కొద్దీ యుద్ధంలో చావడం లేదా బ్రతకడం కేవలం అదృష్టమేనని అతడిప్పుడు ధృఢంగా నమ్ముతున్నాడు.

ఒకవేళ స్వర్గం నరకం అనే రెండూ లేకపోతే తనకున్న ఒకే ఒక జీవితాన్ని తెలివున్న ఏ వ్యక్తీ తన చేతులారా కడతేర్చుకోడానికి ఏమాత్రం యిష్టపడడు. ఈ యుద్ధం త్వరగా ముగిసి తాను బ్రతికి బయటపడాలని జాన్ యిప్పుడు మనసారా కోరుకుంటున్నాడు.

ఒకవైపు అతనిలో నూతనంగా అంకురించిన భయం రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతుంటే శత్రువుల పరాక్రమాన్నిగూర్చిన మాటలు ముఖ్యంగా రాజుగారి అశ్వ దళ నాయకుడూ పరాక్రమశాలీ అయిన ప్రిన్స్ రూపర్ట్ గురించి విన్నప్పుడు అతనిలోని

ధైర్యం సన్నగిల్లుతోంది. “అతడు సైతానుచే ప్రత్యేకంగా తయారుచేయబడ్డ వ్యక్తి” నొక్కి చెప్పాడో సైనికుడు. “మన స్థావరాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించి తలలు లెక్కిస్తాడు.”

“అతనికి అసాధారణ శక్తులున్నాయి” – వణుకుతూ చెప్పాడు మరో సైనికుడు.

“ప్రతి యుద్ధంలోను ప్రిన్స్ రూపర్ట్ యొక్క అశ్వకదళంద్వారా రాజు మెరుపుదాడి చేయిస్తాడు. దానికి తగ్గట్టు ప్రిన్స్ రూపర్ట్ రక్తం ప్రవహింపజేస్తాడు.”

“ఎందుకు చెయ్యడు. అతడు అదృశ్యుడు కాగలడు, భాషల్లో మాట్లాడగలడు, భవిష్యత్తునుగూర్చి చెప్పగలడు. అంతేగాక అతని తెల్లకుక్క ‘బోయ్’ ఒక దయ్యం” బిగ్గరగా చెప్పుకుపోతున్నాడు మొదటి సైనికుడు.

వారాలు జరిగేకొద్దీ యుద్ధం అస్సలు జరుగకూడదని జాన్ మరీ మరీ కోరుకుంటు న్నాడు. 1640వ సంవత్సరం మే నెల చివర్లో ఒక రోజు ఉదయాన్నే జాన్వాళ్ల సార్జెంట్ నోట్లోనుండి అతని గుండెల్లో చలిపుట్టించే మాట ఒకటి వచ్చింది. “మీరందరూ త్వరగా సిద్ధంకండి. మనం యుద్ధానికి వెళుతున్నాం.”

జాన్ తన యుద్ధ వస్త్రాలు ధరిస్తూ ఉన్నప్పుడు ఈటె పట్టే సిపాయి ధరించే లోహపు శిరస్త్రాణం ఒకటి అతనికివ్వబడింది.

“ఇది నాకెందుకు?” జాన్ ప్రశ్నించాడు.

“క్రొత్త చట్టం. ఇప్పటినుండి తుపాకీ పేల్చే సిపాయిలందరూ లోహపు శిరస్త్రాణాన్ని తప్పక ధరించాలి.”

వాళ్ళు బయలుదేరి మోకాళ్ళ ఎత్తున్న పచ్చని గోధుమ పొలాలగుండా మైళ్ళ తరబడి నడుస్తూ, కొయ్య వంతెనలు దాటుకొంటూ పశ్చిమంగా ప్రయాణం సాగించారు. వాళ్ళ అధికారి మేజర్ ఎన్నిస్. వాళ్లు న్యూపోర్ట్ ప్యాగ్నెల్కు వాయవ్య దిక్కున నలభైమైళ్ళ దూరంలోనున్న లీసెస్టర్కు వెళ్తున్నట్టుగా వారికి ఆ తర్వాత తెలిసింది.

“లీసెస్టర్కు వెళ్ళే పద్ధతి యిది కాదు” – కోపంగా అన్నాడో సైనికుడు.

“రాజుగారి సైన్యాన్ని తిరిగి లేవకుండా చేయాలంటే
మరో సైనికుడు.

“ఇదేం చిన్న యుద్ధం కాదు” – జాన్తోనున్న ఈటె పట్టే సిపాయి నిట్టూర్పుగా అన్నాడు. అతడు జాన్ కన్న ఒక సంవత్సరంమాత్రమే పెద్దవాడుగాని అంతకుముందే యుద్ధంలో పాల్గొన్నందున అనుభవంలో పెద్దవాడు. పేరు గిబ్స్. బెడ్ఫోర్డ్ పీపాలు తయారుచేసేవాని కొడుకు. అతడు “దేవుడు మనకు సహాయం చేయాలి బన్యన్” అని జాన్తో అన్నాడు.

జాన్ను భయం ఆవరించింది. ‘ఆలివర్ క్రాంవెల్, మిగతా పార్లమెంటు సైన్యం ఎందుకు రానట్టు? కనీసం సర్ శామ్యుల్ లూక్కూడ రావడంలేదు. ఆ మాటకొస్తే అసలు అశ్వకదళంకూడ రావడంలేదు. ఒక్క ఫిరంగీలేదు.

సైనిక పటాలాన్ని సమర్థ వంతంగా నడిపించే కల్నల్ కొకేన్ కూడ రావట్లేదు. కారణమేంటి?’ జాన్ తో కూడ వెళ్తున్నవాళ్ళు రెండు గుంపులకన్న ఎక్కువలేరు. బహుశ 120 మంది ఉండొచ్చంతే. ‘యుద్ధంలో చావమనా ఈ చిన్న గుంపును పంపిస్తున్నారు?’

మధ్యాహ్నానికంతా వాళ్ళు కీకారణ్యమైన విటిల్వుడ్ చేరారు. అక్కడనుండి వారు ఉత్తర దిక్కుగా అరణ్యంలోపలి అంచుల వెంబడే నడవసాగారు. ఆ రోజు వారు దాదాపు యిరవై మైళ్ళు నడిచారు.

ఎంతో భారమైన ఈ కవచాలూ ఆయుధాలూ ధరించి రోజుకు పది మైళ్ళు నడవడం చాలా కష్టమైన విషయమే! ఆ రాత్రి వాళ్ళు అడవిలోనే బసచేశారు. వారు అక్కడి చెట్లమధ్య ఆ రాత్రి గడిపేందుకు డేరాలు వేశారు. అక్కడ ఎవరూ నిప్పు అంటించేందుకు అనుమతించబడలేదు.

“ఇప్పుడు నా బైబిల్ను చదవలేకపోతున్నాను” – నిట్టూర్పుగా అన్నాడు గిబ్స్.

గిబ్స్క తన సొంతదైన ఒక పూర్తి బైబిల్ ఉందని జాన్కు తెలుసు. ఒక సాధారణ వ్యక్తి ప్యాకెట్ బైబిల్ చదవడమే అరుదు. ఇక పూర్తి బైబిల్ చదివేవారు అసలు కనిపించరు. అలాంటిది గిబ్స్ పూర్తి బైబిల్ ఎప్పుడూ తన దగ్గరుంచుకొని చదువు తుండటం జాన్కు ఆశ్చర్యమేసింది. తానెప్పుడు పూర్తి బైబిల్ను చదవలేదు. ఇక భవిష్యత్లోకూడ చదువుతానని తాననుకోవడంలేదు.

ఆ మరుసటి రోజంతా వాళ్ళు చెట్ల మధ్యనే నడుస్తూ లీఫీల్డ్ అనే అడవికి చేరుకున్నారు. ఎవ్వరూ నిప్పంటించకూడదని వారికి మరలా చెప్పబడింది. చిమ్మచీకటిగా ఉంది. ఆ చీకట్లోనే నడుస్తూ యింకా ముందుకు వెళ్ళాల్సిందిగా వాళ్ళ సార్జెంట్ చెప్పాడు.

ఆ చీకట్లో తన కాళ్ళకు గోధుమ పైరు తగలడాన్నిబట్టి అడవి దాటినట్టు జాన్కు అర్థమైంది. వాళ్ళు తెలతెలవారే సమయానికి లీసెస్టర్ ప్రాకారద్వారం ముందు నిలబడి ఉన్నారు.

“ప్రాకారం లోపలనున్నవారికి మనం శత్రువులం కాదన్న విషయం తెలియాలి. లేదంటే మన సంగతి అంతే” – మెల్లగా గొణిగాడు గిబ్స్.

లోనికి ప్రవేశించడానికి చాల ద్వారాలు తీయబడాలి. పెద్ద పెద్ద ద్వారాలు పైకెత్తబడుతుంటే వచ్చే శబ్దాలకు జాన్ వణికిపోయాడు. ద్వారం లోపలభాగంలో లోతైన కందకాలపైనున్న దూలాలమీదనుండి దాటుతుంటే జాన్కు జ్వరమొచ్చినంత పనైంది.

సింహద్వారం క్రిందనుండి వెళ్ళేటప్పుడు వారి తలలకు పైగా మనుషులను చంపేందుకు మరుగుచున్న నూనెను చిమ్మే రంధ్రాల్లాంటి అతిక్రూరమైన పరికరాలను చూచినప్పుడు జాన్ తల వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

వాళ్ళు రాళ్ళు పరిచిన వీధిగుండా వెళ్ళేటప్పుడు భయపడ్డ కొందరు పౌరులు లాంతర్లను పట్టుకొని యిళ్ళల్లోనుండి బయటకు వచ్చారు. వాళ్ళు లీసెస్టర్కు దక్షిణ దిక్కున ఉన్న క్రొత్త ప్రాకారం పైకెక్కి అక్కడనుండి దక్షిణవైపు ప్రాంతాన్ని చూచేందుకు ఏర్పాటుచేయబడ్డ కన్నాలు ఉన్న ఒక చదునైన ప్రదేశానికి చేరారు. జాన్ తన తలమీదనుండి శిరస్త్రాణాన్ని తీసివేశాడు.

తల గాలిలో తేలిపోతున్నట్టుంది. చల్లని గాలి అతని ముఖాన్ని ప్రేమతో ముద్దుపెట్టుకొన్నట్టయింది. నొప్పి పెడుతున్న కాళ్ళతో తాను ఇక నడవనవసరం లేదు. తన తుపాకీని గోడకు ఆనించి, తానుకూడ ఆనుకొని కూర్చొనేందుకు అక్కడొక గోడ ఉంది. చీకట్లో గుడ్లప్పగించి చూశాడు గోడవైపు.

“కాసేపు విశ్రాంతి తీసుకో మిత్రమా” – ఈటె సైనికుడు గిబ్స్ తన ఈటెను గోడ కానించి క్రింద కూర్చుంటూ – “నీవు బయటికి చూడాలన్నా నీకేమీ కనిపించదు” అన్నాడు జాన్తో.

జాన్ కూడ తన వీపు గోడకానించి క్రింద కూర్చున్నాడు. జాన్కు చాలా హాయనిపిం చింది. ‘ఇక్కడ యుద్ధం జరక్కపోతే బాగుణ్ణు. బహుశా జరక్కపోవచ్చు. రాజుగారి సైన్యం చుట్టు ప్రక్కల ఎక్కడా ఉండకపోవచ్చు. తెల్లవారగానే పచ్చిక మైదానాలను తాను తిలకిస్తాడు.

ఓ అందమైన ఎర్ర జింక ఆ మైదానాల్లో మేయడం తప్ప యిక వేరే ఏదీ తనకు కనిపించవు’. తనలో తాను కలగంటున్నట్టుగా ఊహించుకొంటున్నాడు. జాన్. తెలతెలవారుతున్నప్పుడు చుట్టూ చూశాడు. ఆ మసక వెలుతురులో రాజుగారి సైన్యం లీసెస్టర్కు దరిదాపుల్లో ఎక్కడా లేనట్టుగా నిర్ధారించుకున్నాడు. అతని ప్రక్కన గిబ్స్ గురకలు పెట్టి నిద్రపోతున్నాడు.

“అతడు అనుభవజ్ఞుడు” అని తనలోతాను అనుకొన్నాడు జాన్. ‘రాజుగారి సైన్యం యిక్కడేమాత్రం లేదనీ, యిక్కడికి కేవలం పొరపాటుగా సైన్యాన్ని తీసికొనివచ్చారనీ, యిప్పుడిక్కడ యుద్ధం జరగబోదనీ’ అతనికి తెలుసు. అందుకే అలా నిర్భయంగా నిద్రపోతున్నాడు. ‘యుద్ధంలేదు … ఏమీలేదు’ ఆనందంగా నవ్వాలనిపిస్తోంది జాన్కు.

ఉదయ కాంతిరేఖలు దక్షిణ గోడవైపున ఉన్న పొలాలపై పడుతున్నప్పుడు జాన్ లేచి నిలుచున్నాడు. సువిశాలమైన పచ్చికబయళ్ళు, వాటిని ఆనుకొని దూరాన అడవులూ

కొండలూ జాన్ కళ్ళకు కమనీయంగా కనిపించాయి. ‘అంతా నిర్మానుష్యం. రాజు లేడు. రాజు సైన్యం లేదు. ఏం లేదు’ – సంతృప్తిగా తనలోతాను అనుకొన్నట్టుగా అన్నాడు జాన్.

“ఏంటి గొణుగుతున్నావు?” – నిద్రనుండి మేల్కొని, తల విదిలించుకుంటూ – “ఏం చూస్తున్నావు బయట?” అన్నాడు గిబ్స్.

“ఏం లేదు. అయినా నీవు యింత దిగుల్లేకుండా నిద్రపోయావంటే నీకు విషయం ముందే తెలుసన్నమాట.”

“ఏం జరిగినాకూడ నేను దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నాను కాబట్టి నేను నిద్రపోగలిగాను.”

“ఈ క్రొత్త ప్రాకారం దొరకడం మన అదృష్టం” ఉత్సాహంగా అన్నాడు జాన్. ఆ ప్రాకారంపైన వాళ్ళున్న చదునైన స్థలానికి దక్షిణంగా మరొక గోడ పట్టణం లోపలి వైపుకు కన్నాలు పెట్టబడి ఉన్నాయి.

“పట్టణంలోపలికి శత్రువులు ప్రవేశించినాకూడ మనల్ని మనం రక్షించుకొనేందుకు యిక్కడ ఎంత అనుకూలంగా ఉందో చూడు. శత్రువులు కనుచూపుమేరలో ఎక్కడా మనకు కనిపించనందువల్ల దాన్నిగురించి యిప్పుడు మనం పెద్దగా పట్టించుకోనవసరంలేదనుకో!”

“బన్యన్ నీవు చెప్పేది నిజమే” గిబ్స్ నిట్టూర్చాడు.

“గిబ్స్! దూరంగా అడవినానుకొని వింతగా కనిపించే ఆ కంచె ఏంటి?” — ఆతురతగా అడిగాడు జాన్ – “అది ఒక అర మైలు వెడల్పున్నట్టుంది”.

“కంచా?” నొప్పెడుతున్న తన కండరాల్ని రుద్దుకుంటూ లేచాడు గిబ్స్. “రాజుగారి సైన్యం చెట్లు నరికి వారి ఫిరంగి దళానికి రక్షణగా వాటిని కంచెలాగ ఏర్పాటు చేసుకొంటున్నారు.”

“అంటే ఆ కంచె వెనుక ఫిరంగులున్నాయంటావా?”

“కచ్చితంగా” సమాధానమిచ్చాడు గిబ్స్.

“ఫిరంగులా!” తనకు తెలియకుండానే రొప్పుతూ అన్నాడు జాన్ తన బరువైన శిరస్త్రాణాన్ని తలపై పెట్టుకుంటూ. గిబ్స్ విశ్రాంతిగా తన బైబిలు చదువుకొంటూంటే జాన్ కంచెను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. శత్రుదాడి ఉండబోదని కొద్దిసేపు తన్నుతాను ధైర్యపరచుకొన్నాడు జాన్. ఎలా ముట్టడించాలో తెలియనప్పుడు కొన్నిసార్లు శత్రువు ముట్టడి ఆపేస్తాడు.

ఆ తర్వాత కొద్దిసేపు జాన్ తీవ్రమైన ఆందోళనకూ, నిరాశకూ గురయ్యాడు. ‘ఇక కొన్ని గంటల్లో తాను చనిపోబోతున్నాడు. ఆ తర్వాత తాను శాశ్వతంగా మరువ బడతాడు. చావుబ్రతుకులు కేవలం యాధృచ్చికం’.

“నీవంత ప్రశాంతంగా ఎలా చదవగలుగుతున్నావు?” – కోపంగా అడిగాడు జాన్ గిబ్స్న.

“బన్యన్! ఇది మానవునికి సువార్తనందించి ఊరటనిచ్చే ఒక గొప్ప గ్రంథం.”

జాన్ గొణుక్కుంటూ దూరాన ఉన్న కంచెవైపు క్షణానికోసారి చూస్తున్నాడు. ఒక సైనికుడు వచ్చి తన మధ్యాహ్న భోజనానికి రొట్టె, జున్ను యిచ్చి వెళ్ళినప్పుడుకూడ అవి తన గొంతులోకి యిసుకలాగ దిగిపోతుంటే ఆ కంచెనే దీక్షగా చూస్తున్నాడు జాన్. శిరస్త్రాణం క్రింద తన తల వేడెక్కిపోతుంటేకూడ దాన్ని తీయలేదు. దాదాపు సాయం సమయంలో ఒక దృశ్యం అతని కన్నులకు కనిపించింది.

“అటు చూడు” రొప్పుతూ అన్నాడు జాన్. “అశ్వకదళం అడవిలోనుండి బయటకు వచ్చింది. వారా కంచెకు ముందువైపున స్వారీ చేస్తున్నారు.” అతడలా చూస్తుండగానే చాలామంది సైనికులు గుర్రాలపై రావడం అతనికి కనిపించింది. “ఐదు వందలమంది సైనికులు గుర్రాలపైన ఉన్నారు.”

“వారు తమ గుర్రాలకు కొంత వ్యాయామం చేయిస్తూ ఉండవచ్చు” – నిలబడి జాన్ తనవైపు వింతగా చూసేంత ఉదాసీనంగా అన్నాడు గిబ్స్. అంతలోనే ఎవరో తనను కడుపులో తన్నినట్టుగా మాట్లాడసాగాడు గిబ్స్.

“మనమిప్పుడు వాళ్ళ పథకాన్ని తెలుసుకున్నాకూడ వాళ్ళేం లెక్కచేయరు. వాళ్ళని మనం ఆపలేమని వాళ్ళ ధీమా. ఫిరంగి గుండ్లు మన గోడల్ని కూలదోశాక ప్రిన్స్ రూపర్ట్ నాయకత్వంలో అశ్వకదళం లోపలికి చొచ్చుకొనివస్తుంది” గలగలా మాట్లాడేశాడు గిబ్స్.

“ప్రిన్స్ రూపర్టా?” జాన్ నోరు సుద్దపొడిలాగ ఎండిపోయింది. “మనం నిలుచున్న ఈ గోడ కూల్చేయబడుతుందా?”

వేలకొలది అశ్వకదళ సైనికులు తమ గుర్రాలపై వస్తూ ఉండటం జాన్ గిబ్స్ కలిసి చూశాడు. మొట్టమొదటి ఫిరంగి శబ్దం జాన్ విన్న కొద్ది క్షణాల తర్వాత ఒక ఫిరంగి గుండు వాళ్ళు నిలుచున్న గోడకు దక్షిణంగా కొద్ది దూరంలో మెత్తని భూమిలోకి చొచ్చుకుపోయింది.

“అదెక్కడో దూరంగా పడింది” – సంతోషంగా అరిచాడు జాన్. “వాళ్ళు టెలిస్కోపుతో చూస్తుంటారు” వ్యాఖ్యానించాడు గిబ్స్. “ఈసారి వాళ్ళు వదిలే గుండు దగ్గరగా పడుతుంది.” ఆ తర్వాత వచ్చిన గుండు గోడకు దగ్గరనున్న

మట్టికి తగిలి దొర్లుకుంటూ వచ్చి గోడ దగ్గర ఆగిపోవడం జాన్ చూశాడు. ఆ తర్వాత రెండు నిమిషాలకు గోడ పెళ్ళున పగిలి బీటలు వారుతున్న శబ్దం వినిపించింది. గుండు గోడ క్రింది భాగాన్ని గుద్దింది. గోడనుండి ఊడిపడిన ఒక పెద్ద రాయి గోడక్రింద పడింది. దూరంగా కంచె వెనుక పొగ దట్టంగా పైకి లేస్తోంది.

“నువ్వు గోడచాటుకు వస్తే మంచిది” – గిబ్స్ అన్నాడు – “కాసేపు విశ్రాంతి తీసుకో, వాళ్ళు ఫిరంగుల్ని సర్దుకొనేందుకు కొంత సమయం పడుతుంది”.
జాన్ తన వీపు గోడకానించి కూర్చున్నాడు. ఓపికతో వేచి చూడడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

ప్రిన్స్ రూపర్ట్ యొక్క అశ్వకదళంకూడ వేచి చూడ్డానికై కాస్త ప్రక్కకు వెళ్ళింది. క్రమం తప్పకుండా యిప్పుడు గుండ్లు గోడను ఢీకొడుతున్నాయి. ఫిరంగి గుండ్లు గోడకు తగిలినప్పుడు వచ్చే ప్రకంపనలు తన ఎముకల్లోకి పోకుండా మొదట్లో జాన్ ముందుకు వంగి కూర్చున్నాడు. కాని ఆ తర్వాత అనివార్యమన్నట్టు తిరిగి గోడకు ఆనుకున్నాడు. వచ్చే శబ్దాలనుబట్టి గుండ్లు ఎక్కడ తగులుతున్నాయో జాను ఇప్పుడు బాగా అర్థమౌతోంది. గుండ్లు నేలకు తగులుతున్న శబ్దాలు యిప్పుడు రావడంలేదు. గోడక్రింద భాగాన గుండ్లు తగలడంవల్ల గోడపై భాగాన బీటలు వారుతున్న శబ్దాలు వినబడుతున్నాయి.

“మనమున్న చోటికి వంద గజాల లోపునుండే వాళ్ళు ప్రాకారాన్ని బ్రద్దలు చేస్తున్నారు బన్యన్” గిబ్స్ అన్నాడు. కూలుతున్న గోడ దగ్గర అరుపులు, ఆర్తనాదాలు, వేదనాభరితమైన కేకలు వినబడు తున్నాయి. రాతి శకలాల క్రింద మనుషులు నలిగి ముక్కలౌతున్నారు.

గోడ విరిగి పడిపోతోందని మనుషులు బొబ్బలు పెడుతున్నారు. ఈ దాడి యింకా కొనసాగేటట్లు ఉంది. ప్రిస్స్ రూపర్ట్ ఎప్పుడు దాడి చేస్తాడో! ఇక కాసేపట్లో బ్రతికున్న మనిషికి తాను తన తుపాకిని గురిపెట్టాల్సి ఉంటుందని జాన్కు హఠాత్తుగా గుర్తొచ్చింది. తానొక మనిషి ప్రాణాల్ని నిలువునా తీసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆ మనిషికూడ తనని చంపడానికి ప్రయత్నిస్తాడు. జాన్కు చాలా బాధనిపించింది.

“గిబ్స్! ఇక్కడనుండి క్రిందకి దిగు. మనం గోడను తిరిగి కట్టాలి” సార్జెంట్ పెద్దగా కేకేశాడు.

“నేను యిప్పుడు నా ఈటెను ఉపయోగించనవసరం లేనందుకు ప్రభువుకు స్తోత్రం” గిబ్స్ అన్నాడు. ఆ తర్వాత జాన్ చేతిని తట్టి మెట్లవైపుకు నడిచాడు. గిబ్స్ బాటు యింకా కొంతమంది ఈటె పట్టే సైనికులను సార్జెంట్ క్రిందికి పొమ్మన్నాడు. పెను తుపానులో లంగరులావుండే గిబ్స్ వెళ్తుంటే జాన్ ఒంటరివాడైనట్టు బాధపడ్డాడు.

హఠాత్తుగా సార్జెంట్ జాన్వైపు తిరిగి అన్నాడు – “బన్యన్, నీ ఆయుధాలు ప్రక్కన పెట్టి నీవుకూడ రా. ఇప్పుడు నీ తుపాకికన్నా నీ వీపే మాకు ఎక్కువ అవసరం”. జాన్ పొడవైన కత్తితోనున్న తన ఒరను పట్టీనుండి విప్పి పిట్ట గోడమీద పెట్టాడు.

తుపాకీ కాల్చేందుకు తన వద్దనున్న సరంజామా అంతా ప్రక్కన పెట్టి ముందుకు కదిలాడు. ఇప్పుడు తానొక బరువులు మోసే జంతువు. అయితే ఈ యుద్ధోన్మాదంలో అదేం పెద్ద తేడాగా అనిపించలేదు జాను. మెట్ల దగ్గర గిబ్సన్న తిరిగి కలుసుకున్నాడు. వాళ్ళు ఓ రాళ్ళ గుట్టను సమీపించారు.

గోడను తిరిగి కట్టే ప్రయత్నంలో వాళ్ళు తడ బడుతూ, తిట్టుకుంటూ పడిపోయిన రాళ్ళతో కుస్తీ పడుతుంటే ప్రేలుడు మోతలూ, రాళ్ళు పడుతున్న శబ్దాలూ వారి చెవులను తూట్లు పెడుతున్నాయి.

పెద్దపెద్ద రాళ్ళను పైకెత్తి తీసుకొస్తూంటే జాన్ చేతులు కోసుకుపోయి రక్తం కారుతున్నాయి. అకస్మాత్తుగా ఆ రాళ్ళ గుట్టమీదనుండి మనుషులు గడ్డి బొమ్మల్లా క్రిందపడ్డారు. అలా పడిపోయిన ఒక వ్యక్తిని జాన్ తన చేతులమీద మోసుకుపోవలసి వచ్చింది. ఆ మనిషి ముఖం పిండి మాదిరి తెల్లగా అయ్యింది. అతని ఛాతీనుండి రక్తం విపరీతంగా కారుతోంది.

జాన్కు ఏం చేయాలో అర్థం కాక ఆ వ్యక్తివైపు నిస్సహాయంగా చూస్తుంటే ఒక స్త్రీ ఆ గోడ అవతలి భాగంనుండి ఆ వ్యక్తి గాయాలు తుడిచి అతణ్ణి సంరక్షించేందుకు ముందుకు వచ్చింది.

“ఒరేయ్ సోమరి కుక్కా, పనిచూడు” – జాన్వైపు చూసి గట్టిగా అరుస్తూ అతడు ముందుకు పడేలా గట్టిగా త్రోశాడో అధికారి. గట్టిగా వినబడే అరుపులు, కేకలు, తుపాకీ కాల్పులు అశ్వకదళం దాడి చేస్తోందని జాన్కు తెలుపుతున్నాయి.

కాని జాన్ పనిచేస్తూనే ఉన్నాడు. తానీ యుద్ధంలో చచ్చేంత వరకు తన పని యిదేననుకున్నాడు జాన్. అతడు రాళ్ళనూ, గాయపడి రక్తం కారుతున్న వారినీ మోస్తున్నాడు. తన బట్టలు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. ఎటు చూసినా రాళ్ళపొడిలో తడిసిన రక్తమే ఉన్నట్టుంది. గోడమీద సంతోషధ్వనులు వినిపించాయి.

“అశ్వకదళం దాడి ఆపేసింది” పిట్టగోడమీద ఎవరో కేక వేసారు. అంతలో చీకటిపడ్డట్టు జాన్ గ్రహించాడు. మళ్ళీ అశ్వకదళం దాడి చేసింది. శత్రువులు తిరిగి వెనక్కి తగ్గారని తన గుంపులోనుండి వస్తున్న ఆనందోత్సాహాలు జాన్కు తెలియజేసాయి.

ఆ తర్వాత కొద్దిసేపటికే అశ్వకదళం తిరిగి దాడి చేసింది. జాన్ యిక వీటిని లెక్కచేయడం మానేశాడు. తను బ్రతికి బయటపడే అవకాశాలు లేవని అతనికి తెలిసిపోయింది. ఆ వాస్తవం అతనిలోనున్న భయాన్ని చంపేసింది.

ఇప్పుడతడు ఏ విధమైన అనుభూతికీ స్పందించడం లేదు. నిర్లిప్తత అతణ్ణి ఆవరించింది. ఆ చీకట్లో చనిపోయిన ఒక మనిషి తలను రాయిని లాగినట్టు లాగవలసి వస్తోంది. ఎటు చూసినా మృతదేహాలే.

“మెట్లెక్కు” ఎవరో కేకేశారు.

జాన్ మెట్లెక్కి పిట్టగోడమీదికెళ్ళాడు. ఆ చీకట్లో తన సరంజామాను కష్టంగా వెదకి కనుగొన్నాడు. “ఏం జరుగుతోంది?” ఆ చీకట్లో ఈటెపట్టి ఉన్న ఒక సైనికుని గిబ్స్ అన్నట్లు ఊహించి అడిగాడు జాన్.

“రాజుగారి సైనికులు పట్టణం లోపల ప్రవేశించారు” అది గిబ్స్ గొంతే! “మనం లొంగిపోవడంలేదా?”

“ఎంత ఎక్కువ సమయం మనం దాక్కోగలిగితే అంత మేలైన ఒప్పందాలు వారితో మనం చేసుకొనే వీలుంటుంది.”

గిబ్స్ ఏ అర్థంతో ఈ మాటన్నాడో జాన్కు అర్థమైంది. కొన్నిసార్లు సైనికులు శత్రు సైన్యానికి వెంటనే లొంగిపోకుండా వీలైనంత ఎక్కువసేపు దాగి ఉంటారు. ఆలస్యమయ్యేకొద్దీ జరిగే అనవసరమైన ప్రాణ నష్టాన్నిబట్టి శత్రుసైన్యం సంప్రదింపు లకు వస్తుంది.

“ఇప్పుడు టైమెంత?” మెల్లగా అడిగాడు జాన్.

“మధ్యరాత్రి దాటుంటుంది” నక్షత్రాలవైపు చూస్తూ అన్నాడు గిబ్స్..

“మనం దాదాపు తొమ్మిది గంటలనుండి పోరాడుతున్నాం. జాన్కది చాలా ఎక్కువ సమయంలా ఉంది. అక్కడున్న దురదృష్టవంతులైన సైనికులందరికీ అలానే ఉంది.

గోడక్రింద దీపాలు పట్టుకొని ఉన్న మనుష్యులు ఏదో గట్టి గట్టిగా మాట్లాడుకొంటు న్నారు. వాళ్ళ గొంతుల్లో ఆందోళన కనిపించడం లేదుగాని, ఏదో వాస్తవాన్ని గూర్చి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంది.

“మేజర్ ఎన్నీస్ శత్రుసైన్యంతో మంతనాలు జరుపుతున్నాడు” – మెల్లగా అన్నాడు గిబ్స్ – “ఇలాంటి మంచి వ్యక్తికొరకు దేవునికి స్తోత్రం.”

కొద్దిసేపటికి జాన్ తన సార్జెంట్ స్వరం విన్నాడు – “మీరంతా మీ యుద్ధ సామగ్రి తీసికొని బయలుదేరండి. మనమీ శిధిలమైన రాళ్ళపైన నడిచి వెళ్తున్నాము. ఎవరూ మాట్లాడకూడదు. అందరూ మౌనంగా నడవండి. ఉత్తరంవైపు ద్వారంనుండి రాజుగారి సైన్యం పట్టణంలోపలికి వస్తోంది.

ఆ తర్వాత చాలాసేపటివరకు సమయం కష్టంగా గడిచింది. తక్కువ గాయాలతో నున్న జాన్లాంటివాళ్ళు ఎక్కువగా గాయపడ్డవారిని మోయవలసివచ్చింది. అలా వాళ్ళు చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ప్రొద్దుగుంకే సమయానికి లీసెస్టర్కు ఈశాన్య దిక్కున ఉన్న అడవుల్లోకి అతి కష్టంమీద చేరుకున్నారు. చాలాసేపటి తర్వాత ఇప్పుడు గిబ్స్ మాట్లాడే అవకాశం దొరికింది జాన్కు – “ఇంత సులభంగా మనం ఎలా తప్పించుకోగలిగాం?”

“మనం తప్పించుకోలేదు. మేజర్ ఎన్నీస్ శత్రుసైన్యంతో సంప్రదించి మనల్ని తప్పించాడు. మనం అంతసేపు అలా భీకరంగా పోరాడకపోయి ఉంటే ప్రిన్స్ రూపర్ట్ అంత సులభంగా ఒప్పుకొనేవాడు కాదు. మనతో యింకా రెండు మూడు రోజులు పోరాడాల్సి వస్తుందనీ, మేజర్ ఎన్నీస్ అంత సులభంగా వదలడనీ అతనికి తెలుసు. అందుకే ఒప్పుకొన్నాడు.”

ఆ రాత్రి అడవిలో చాలా గంటలు వాళ్ళు నిద్రించారు. మరుసటి రోజంతా -గాయాలకు కట్లు కట్టుకొంటూ, విశ్రాంతి తీసికొంటూ గడిపారు. ఎక్కువగా గాయపడ్డ వారికి తాత్కాలిక గుడారాలు ఏర్పాటుచేశారు. ఆ మరుసటి రాత్రికూడ అక్కడ నిద్రించిన తర్వాత, చనిపోయినవారిని అక్కడ పాతిపెట్టి ముందుకు కదిలారు.

గతంలోలాగ వాళ్ళు అడవిలో దాక్కుంటూ వెళ్ళకుండా నార్తాంప్టన్ గోధుమ పొలాలగుండా నేరుగా వెళ్ళసాగారు. అలా వాళ్ళు జూన్ 2వ తేదీన న్యూపోర్ట్ ప్యాగ్నెలు తిరిగి చేరుకున్నారు. శ్రీ తర్వాతి రోజుల్లో జాన్ తన బట్టలు ఉదుక్కుంటూ, చిరిగిపోయిన తన యూనిఫాం కుట్టుకుంటూ గడిపాడు.

ఈలోగా వారి సైనిక స్థావరంలో కొన్ని వార్తలు వినిపించాయి. రాజు సైనికులు లీసెస్టర్ నగరాన్ని సంరక్షించాలని ప్రయత్నించినవారిని చంపిన తర్వాత దాన్ని పూర్తిగా కొల్లగొట్టి అక్కడి స్త్రీలను మానభంగం చేశారట. ఇప్పుడు చార్లెస్ రాజు దక్షిణవైపునుండి ఆక్స్ఫర్డ్వరకు తీరిగ్గా తిరుగుతూ తన సైన్యానికి కావలసిన కోళ్ళను, జంతువులను, ఆహార పదార్థాలను సేకరిస్తూ, డావెంట్రీ వద్ద జింకలను వేటాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆలివర్ క్రాంవెల్ తన 700 మంది అశ్వకదళ యోధులతో బెడ్ఫోర్డ్లో ఉన్నా డని జాన్ విన్నాడు.

“చార్లెస్ రాజు 9000 మంది సైనికులతో ఇక్కడికి వాయవ్య దిశలో ఉన్నాడని ఆలివర్ క్రాంవెల్ను ఎవరైనా హెచ్చరించాలి” జాన్ అన్నాడు.

“అతణ్ణి నీవే హెచ్చరించాలి. అదిగో మాటల్లోనే అతనొస్తున్నాడు చూడు” – తూర్పు వైపున దుమ్ములేస్తున్న దిశగా తన వ్రేలు చూపిస్తూ అన్నాడు గిబ్స్.

ఆలివర్ క్రాంవెల్ తన అశ్వకదళంతో ఔసె నదీ తీరంలో విడిదిచేశాడు. సర్ శామ్యుల్ లూక్ అతనితో ఏదో చర్చించేందుకు అక్కడికి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు క్రాంవెల్ తన అశ్వకదళంతో వాయవ్య దిశగా వెళ్ళాడు.

“ఇతడు నేరుగా రాజుగారున్నవైపుకే వెళ్తున్నాడు” ఆశ్చర్యంగా అన్నాడు జాన్.

తాము వాయవ్య దిశగా ప్రయాణమై వెళ్ళనున్నట్టు జాన్, గిబ్స్ తెలుసుకున్నారు. గత యుద్ధంలో తగిలిన దెబ్బలు, గాయాలు యింకా పుండ్ల రూపంలో ఉన్నాకూడ పెద్దగా నొప్పి అనిపించడం లేదు. మార్చి 13వ తేదికంతా వాళ్ళు డావెంట్రీకి ఎనిమిది మైళ్ళ దూరంలోనున్న కిప్లింగ్బరీ వద్దకు చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసిన జాను శ్వాస ఆగిపోయింది. ఆ ప్రదేశమంతా యుద్ధ పతాకాలు రెపరెపలాడుతున్నాయి.

“ఎంత పెద్ద సైన్యం” ఆశ్చర్యంగా అన్నాడు జాన్.

“దేవునికి స్తోత్రం. ఈ సైన్యం రాజుది కాదు, మనది” – జాన్కు ఉపశమనాన్ని కలిగిస్తూ అన్నాడు గిబ్స్.

అవును, అది చార్లెస్ రాజుగారి సైన్యం కాదు. అది లార్డ్ ఫెయిర్ ఫాక్స్ నాయకత్వంలోని పార్లమెంటు సైన్యం. కొన్ని గంటల్లో 14,000 నుండి 15,000 వరకు సైనికులున్న ఆ గొప్ప సైన్యం ఉత్తర దిక్కుగానున్న నెస్బీ గ్రామంవైపు కదిలింది.

జాన్వాళ్ళ సార్జెంట్ పెద్ద వాగుడుగాయ. “రాజు సైన్యం ఈశాన్య దిశగా కదులు తోంది. వాళ్ళు మనగురించి విని లీసెస్టర్కు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వారక్కడ ఆగి మనతో యుద్ధం చేయాల్సి ఉంది” చెప్పుకుపోతున్నాడు సార్జెంట్.

ఏవన్ నది అవతల మిల్ హిల్ పైన ప్రాతః సమయాన లార్డ్ ఫెయిర్ ఫాక్స్ తన సైన్యాన్ని బారులు తీర్చాడు. ఫిలిప్ స్కిప్పోన్ నాయకత్వంలోని పదాతిదళం మధ్య రెండు వరుసల్లో ఉంది. అందులో జాన్ రెండో వరుసలో ఉన్నాడు. అతనికి కుడివైపున ఆలివర్ క్రాంవెల్ తన 3600 మంది అశ్వకదళ సైనికులతో రెండు వరుసల్లో ఉన్నాడు. జాన్కు ఎడమవైపున హెన్రీ ఐర్డన్ నాయకత్వంలోని అశ్వకదళం ఉంది.

సూర్యుడుదయిస్తుండగా డస్ట్ హిల్కు ఉత్తరాన ఉన్న లోయలో తళతళ మెరుస్తూ ఉన్న రాజుగారి సైన్యాన్ని చూశాడు జాన్. ఆ సైన్యం తమ సైన్యానికి ప్రతిబింబంలా ఉంది. జాన్కు ఎదురుగా జేకబ్ యాస్ నాయకత్వంలోని పదాతిదళం ఉంది. క్రాంవెల్కు ఎదురుగా ల్యాంగ్ డేల్ అశ్వకదళం ఉంది. ఐన్స్టన్ కెదురుగా ప్రిన్స్ రూపర్ట్ అశ్వకదళం ఉంది.

“ప్రిన్స్ రూపర్ట్ దాడి చేస్తున్నాడు” – జాన్కు దగ్గరగా నిలబడి ఉన్న ఒక సైనికుడు
అరిచాడు.

ఆ వైపునుండి ప్రిన్స్ రూపర్ట్ తన సైనికులకు ఆజ్ఞ యిచ్చి దాడికి ఉపక్రమించగానే ఈ వైపునుండి క్రాంవెల్ తన సైనికులను దాడికుపక్రమింపజేశాడు. అక్కడేం జరుగు తోందో చూడ్డానికి జాన్క సమయం దొరకలేదు. రాజు పదాతిదళం పార్లమెంటు సైన్యం మధ్యభాగంపై దాడి చేస్తోంది. పార్లమెంటు పదాతిదళం రెండుగా చీలి వారిపై ప్రతి దాడికి దిగింది.

తుపాకులు పేలుతున్నాయి. జాన్ ఒక్క తూటానే పేల్చగలిగాడు. అది ఎవరికైనా తగిలిందీ లేందీ పొగవల్ల తనకేమీ కన్పించలేదు. హఠాత్తుగా ఊగుతున్న తుపాకీ మడిమలు, చీల్చేస్తున్న ఈటెలు, నరుకుతున్న కత్తులు జాన్ కళ్ళకు కనిపిస్తున్నాయి.

జాన్ వెంటనే తన తుపాకీ ప్రక్కన పడేసి, తన కత్తి తీసికొని నరకడం ప్రారంభిం చాడు. అతడలా ఎంతసేపు పోరాడాడో అతనికి తెలియదు. ఎవర్నైనా చంపాడో లేదోకూడ అతనికి తెలియదు. అక్కడ ఒకరి భుజాలు మరొకరికి రాసుకుంటూ గందర గోళంగా ఉంది. ఉన్నట్టుండి సుడిగాలిలో ఎండుటాకులా జాన్ ఒక ప్రక్కకు ఎగిరి పడ్డాడు. గొప్ప యుద్ధాశ్వాలు పదాతిదళం మధ్యలోనుండి దూసుకొంటూ వెళ్ళాయి. – “ఇది మన ఐరన్ సైడ్స్ సైన్యమే” పదాతిదళం గట్టిగా అరిచింది.

ఆలివర్ క్రాంవెల్ అశ్వకదళ సైనికులు రాజుగారి సైనికుల్ని నిర్దయగా నరుకు తున్నారు. నిమిషాల్లోనే రాజుగారి పదాతిదళంలో అనేకులు చనిపోగా మిగిలినవారు లొంగిపోయారు. ఈ యుద్ధాన్ని ఏది మలుపు తిప్పిందోనన్న విషయం ఆ రోజు ప్రొద్దుపోయాకగాని జాను తెలియలేదు.

ప్రిన్స్ రూపర్ట్, ఐరన్ విభాగపు సైన్యాన్ని చిత్తుచేసి యుద్ధభూమి అవతలకు తరుముకుంటూ వెళ్ళాడు. క్రాంవెల్కూడ లాంగేల్ విభాగపు సైన్యాన్ని ఓడించి తరిమేశాడు. అయితే తెలివిగలిగిన క్రాంవెల్ లాంగ్ ల్ సైన్యాన్ని తరుముతూ వారి వెంటబడకుండా తన సైన్యాన్ని వెనక్కి త్రిప్పి రాజుగారి పదాతిదళంపై విరుచుకుపడ్డాడు.

ప్రిన్స్ రూపర్ట్, ఐరన్ సైడ్స్ సైన్యాన్ని తరమడం ముగించి తిరిగి యుద్ధభూమికి వచ్చే సమయానికి రాజుగారి సైన్యంలో అనేకులు చనిపోగా మిగిలినవారందరూ లొంగిపోయి ఉన్నారు.

“ఐరన్ సైడ్స్కు ఉక్కు గుండెమాత్రమేగాక పదునైన మెదడుకూడ ఉంది తనలో తాను అనుకొన్నాడు జాన్.

ఆ తర్వాత సంపూర్ణ విజయానికి సంబంధించిన వార్తలు చాలా తెలిశాయి. పార్లమెంటు సైన్యం చార్లెస్ రాజుకు సంబంధించిన తుపాకీ మందును, ఫిరంగులను, 5,000 మంది సైనికులను స్వాధీనం చేసుకొంది. పార్లమెంటు సైన్యానికి చాలా సంతోషకరమైన సమయం. యుద్ధ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నష్టంనుండి రాజు యిక కోలుకోలేడు. అతడు తన అశ్వకదళంతో తప్పించుకొని లీసెస్టర్ చేరుకొని ప్రాణం దక్కించుకున్నాడు.

“ఎందుకంత దిగులుగా ఉన్నావు?” – జాన్ అడిగాడు గిబ్స్న.

“తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్న రాజుయొక్క సాధారణ పదాతిదళ సైనికుల్ని మన అశ్వకదళ సైనికులు ఉత్తర దిక్కు త్రోవవెంట ఎలా వెంబడించి నరికారో జ్ఞాపకముందా?”

“మన అశ్వకదళ సైనికులు తరిమేటప్పుడు వాళ్ళుకూడా పోరాడుతూనే ఉన్నారు. కదా!”

“అయ్యుండొచ్చు” గిబ్స్ విచారంగా అన్నాడు. అయితే మరుసటి రోజు ఉదయం జరిగిన విషయాన్ని జాన్ తన కళ్ళతో చూసి నమ్మలేకపోయాడు. యుద్ధభూమికి ఉత్తరంగా దారి పొడవునా పడివున్న మృతదేహాలను సమాధి చేసేందుకు పంపబడ్డ సైనికుల్లో జాన్, గిబ్సుక్కూడ ఉన్నారు.

చనిపోయిన సైనికులు నిరాయుధులు. వారివద్ద నుండి ఆయుధాలను ముందే లాక్కున్నారని అక్కడున్న ఒక సైనికాధికారి చెప్పాడు. అక్కడొక దృశ్యం జాన్ హృదయాన్ని పిండేసింది. మార్గీని సమాధి చేసేప్పుడు తప్పు యింతగా తానెప్పుడూ బాధపడలేదు. చనిపోయిన సైనికుల శవాల్లో ఒక స్త్రీ మృతదేహం జాన్ కు కనిపించింది.

“స్త్రీ మృతదేహం!” – దిగ్భ్రాంతి చెందుతూ అన్నాడు జాన్, గిబ్స్.

ఎదురుచూసే హృదయం

ఎదురుచూసే హృదయం

నదీ లోయలోకి వారు దిగుతుండగా జాన్ ఆ కోటను అధ్యయనం చేయసాగాడు. ఆ కోటంతా దాదాపు కొండలమీదే ఉంది. ఈ వెల్ష్ కోట క్ల్వైడ్ నదిని ఆనుకొని ఉంది. కోట పడమటి గోడ నదీ ప్రవాహానికి కోసుకొనిపోయి ఉంది.

నది రక్షణగా లేని మిగతా మూడువైపుల్లో మూడు గోడలున్నాయి. బయటి గోడ అప్పటికే బీటలువారి ఉండటాన్ని జాన్ గమనించాడు. ఆ లోపలి గోడను మిగిలిన గోడలతో పోలిస్తే అది చిన్న పిల్లల ఆటలో కట్టినదానిలా ఉంది. బురుజుపైనున్న గోడ చదరంగా దాదాపు 40 అడుగుల ఎత్తులో ఉంది. దాని మందం దాదాపు 10 లేదా 15 అడుగులుండొచ్చు.

కోట గోడలు మందమైన బురుజులతో, బలమైన ద్వారాలతో రక్షణ ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. ఆ బురుజులన్నీ స్థూపాకారంలో ఉన్నాయి. లోపలి గోడయొక్క బయటి ప్రదేశం స్పష్టంగా కనిపిస్తోంది. “ఆ బురుజుల కన్నాలగుండా బయటకు కనిపిస్తున్న ఆయుధాలు ఏమై ఉంటాయి?” జాన్ అడిగాడు.

“నువ్వు కాస్త దగ్గరగా వెళ్తే మరిగే నూనో, కరిగే సీసమో ఆ ఆయుధాల్లోనుండి చిమ్మబడుతుంది” – జవాబుగా అన్నాడో సైనికుడు.

గతంలో కోటకు సరకులను రవాణా చేసిన సముద్రం, నదులు యిప్పుడు శత్రుసైన్యాలను రవాణా చేస్తున్నాయి. భారీ ఫిరంగులు వెలుపలి గోడవైపుకు ఉత్తర దిక్కుగా పొంచి ఉండి గోడలను పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాని పర్యవసానం యిక తెలిసిందే. రాళ్ళ దిమ్మెలు కుప్పలుగా దొర్లుతాయి, పగిలిన గోడలనుండి మనుష్యులు దూసుకొని లోపలికి వెళ్తారు.

ఈ ప్రక్రియలో ఎంతమంది మనుష్యులు కుప్పకూలిపోతారో తెలియదు. “వందల సంవత్సరాలుగా ఇంగ్లీషువాళ్ళు, వెల్ష్ వాళు ఎ) బలమైన ఈ రాతికోటలను కడుతూ వచ్చారు” – ఆ రాత్రి చలిమంట దగ్గర ఒక సైనికుడన్నాడు. – “మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో క్రామ్వల్ నాయకత్వంలో మనం వీటన్నిటినీ కూల్చబోతున్నాం.”

“శుభ్రంకూడా చేస్తాం” యింకో సైనికుడన్నాడు.

జాన్ మౌనంగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే తమ సైనికులు చేస్తున్నదానికి అతడు చాలా కలతచెందుతున్నాడు. ఆ సైనికుడు చెప్పింది నిజమే. తమ సైనికులు రాజుగారి కోటలన్నిటినీ కూల్చేస్తున్నారు.

రాజు పారిపోయాడు. యిక రాజుగానీ, యువరాజుగానీ, అతని సామంతులుగానీ, ప్రభువులుగానీ, ఎవరూ ఏ కోటలోనూ తలదాచుకోకూడదని ఫెయిర్ ఫాక్స్, క్రామ్వల్లు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జాన్ ఎందుకో సంతోషంగా లేడు.

అతడు విచారంగా ఉండటానికి యింకో కారణంకూడా ఉంది. ముట్టడికి గురైన కోటలోనివారు ఎటువంటి సంప్రదింపులూ చేయడం లేదు. వారి సరఫరాలు వారాల తరబడి కచ్చితంగా నిలిచిపోయి లోపలవాళ్ళు ఆహారం లేకుండా ఉండి ఉంటారు.

బహుశా తుపాకీ మందు, తూటాలు, గుండ్లుకూడా తగ్గుముఖం పట్టుంటాయి. కాబట్టి న్యూపోర్ట్ ప్యాగ్నెల్నుండి వచ్చిన సైనికులు దాడిచేయకుండా వేచి చూస్తున్నారు. తమకు యుద్ధం లేకుండా ఉండాలని కొంతమంది ప్రార్థనలుకూడా చేస్తున్నారు.

ఈ విషయంలో జాన్ ఏమాత్రం దిగులుపడటంలేదు. వాళ్ళు యుద్ధం చేయాలన్నా లేదన్నా అది కేవలం యాదృచ్ఛికమే. ముట్టడికి గురైనవారిని తుపాకీ గుండుకాని, మందు సామాగ్రి గాని రక్షించలేవు.

మనిషి తన విలువైన ఒకే ఒక జీవితంతో యిలా చెలగాటాలాడటం జాను ఒక బుద్ధిహీనతగా తోచింది. ‘మరలాంటప్పుడు తనెందుకు కనిపించకుండా పారిపోకూడదు?” ఎందుకో జాన్ అలా చేయలేకపోతున్నాడు.

“పడవలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పనికోసం యిద్దరు మనుష్యులు నాక్కావాలి” ఒక సాయంత్రం సార్జెంట్ అన్నాడు.

“పడవా?” అన్నాడో సైనికుడు చిరాగ్గా.

“రాజుగారి మద్దతుదారులు రాత్రివేళ నదిలోనుండి గోడవరకు వెళ్ళి కోటకు అవసరమైన వస్తువులు సరఫరా చేస్తున్నారు. దాన్ని మనం అడ్డుకోవాలి” – సార్జెంట్ ఓ సైనికుడిపై దృష్టి నిలిపి – “దానికి నిన్ను తీసుకుంటున్నాను” అన్నాడు. “నాకు ఈత రాదు.”

“ఐతే మనలో పెద్దగా ఈదగలవాడెవడు?” – సార్జెంట్ గద్దించాడు “ఈత అనేది పెద్ద చాకచక్యమైన విద్యేంకాదు. అయినా నీవు పడవపైన తిరగబోతున్నావు.” ఆ తర్వాత సార్జెంట్ తన సైనికులవైపు మరోసారి పరిశీలనగా చూశాడు.

“అత్యవసర పరిస్థితుల్లో తుపాకీ పేల్చేందుకు యితనికి తోడుగా యింకొకరు నాక్కావాలి” ‘ – అతను జానైవైపు చూశాడు – “బన్యన్ దానికి నువ్వే సరైన వ్యక్తివి.”

ఆకాశం మేఘావృతమైవుంది. దట్టంగా చీకటి కమ్ముకొని ఉంది. జాన్ తన తుపాకీతో అటూ ఇటూ ఊగిసలాడే ఓ చిన్న పడవలోకి కాలు పెట్టాడు. “ఈ రాత్రి బాగా చీకటిగా ఉండబోతోంది” సార్జెంట్ అన్నాడు.

“తెడ్డు లేదు, కర్రా లేదు; ఈ పడవనెలా నడిపేది?” – సణిగాడు జాన్తో నున్న సైనికుడు.

“ఈ నది గోడ పొడవునా ఒక మోకు (త్రాడు) గట్టిగా కట్టబడివుంది” – మెల్లగా చెప్పాడు సార్జెంట్ – “ఆ మోకు నీటి ఉపరితలానికి కొద్దిగా క్రింద ఉంటుంది. మీరు చెయ్యాల్సిందల్లా ఆ మోకును గట్టిగా పట్టుకొని గోడ పొడవునా ముందుకూ వెనక్కూ తిరుగుతూండడమే. మీరసలు మాట్లాడకూడదు. గోడపై భాగాన ఎవరైనా ఉంటే వారికి మీ మాటలు వినబడొచ్చు.”

“ఇప్పుడు ఈ పడవకు మేమే తెడ్డు కాబోతున్నాం” – గొణిగాడా సైనికుడు బూతులు జోడిస్తూ.

“ఆ చివర మూలనున్న బురుజువద్దకు మరీ దగ్గరగా వెళ్లొద్దు” – సార్జెంట్ హెచ్చరించాడు – “శత్రువులు దాడిచేసి మిమ్మల్ని బంధించవచ్చు లేదా తుపాకీతో కాల్చవచ్చు.”

“ఆ మూలనున్న బురుజు ఎంత దూరముంటుంది?” – జాన్తో ఉన్న సైనికుడు చిరాగ్గా అడిగాడు.

“దాదాపు 200 అడుగులు. పడవను మీరు మూడడుగుల దూరం నెట్టిన ప్రతిసారీ ఒకటిగా లెక్కించుకొని అలా 60 సార్లు లెక్క పెట్టేంతవరకు ముందుకెళ్ళండి. అలానే తిరిగి వెనక్కి రండి. అలా రాత్రంతా చేస్తూనే ఉండండి.”

జాన్ శరీరం వణుకుతోంది. భుజానికి తుపాకీ వ్రేలాడదీసుకొని నదిలో క్రిందికీ పైకీ ఊగిసలాడుతోన్న ఆ పడవలో నిస్సహాయంగా తన సహచరునితో కలిసి ముందుకూ వెనక్కూ తిరుగుతున్నాడు జాన్. మోకుకోసం నదిలోకి వంగినప్పుడు శరీరం చలితో వణుకుతోంది. నది మంచులా చల్లగా బాగా లోతుగా ఉంది.

గంటలు గడుస్తున్నకొద్దీ యిద్దరూ పడవను ముందుకూ వెనక్కూ త్రిప్పుతున్నారు. నీళ్ళు చాలా చల్లగా ఉన్నందున 30 మాత్రం లెక్కబెట్టి ఆపుతున్నారు. చేతులకు గోడరాళ్ళు పదేపదే తగిలి గాయాలవుతున్నాయి. కొద్ది సేపటికి వాళ్ళ చేతులు తిమ్మిరి లెక్కసాగాయి.

అలా కొన్ని గంటలతర్వాత తాడు లాగడానికి జాన్ వంతు వచ్చినప్పుడు అతని చేతులకు కొన్ని క్షణాలవరకు గోడ తగల్లేదు. ‘రాతి స్పర్శ చేతికి తగిలినా తెలియనంతగా తన చేతులు మొద్దుబారాయా?’ కాసేపటికి తాడు చేతులకు చాలా బరువుగా అనిపి స్తోంది. “ఈ తాడేంటి బాగా బరువైపోతోంది” తన తోటి సైనికుడితో మెల్లగా అన్నాడు.

“వాళ్ళు ఈ తాడు చివర కోసేసుంటారు” గట్టిగా అరిచాడు ఆ సైనికుడు.

“దాన్ని నువ్వు తాగగలిగినంత లోపలికి లాగు” వెంటనే అన్నాడు జాన్.

తమ రెండు చేతులతో ఆ తాడును లాగుతూ ముందుకు వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పడవను గట్టుకు తీసుకెళ్ళాలని ఆ తాడును బలంగా లాగసాగారు. ఐతే జాను తాము ప్రవాహంలో కొట్టుకొని పోతున్నట్టుగా అనిపించింది. ఉన్నట్టుండి పడవ ఒక ప్రక్కకు ఒరిగింది. “నీవు దానిమీద ఎక్కువగా ఆనుకుంటున్నావు” కోపంగా అరిచాడు జాన్.

“నువ్వుకూడా, అలాగైతే యిద్దరం తాడు వదిలేద్దాం.”

“సముద్రంలోకి కొట్టుకొనిపోవడానికా?”

పడవ వాళ్ల క్రిందనుండి మెల్లగా జారుకుంది. చల్లని నీళ్ళు వాళ్ళను ఒక్కసారిగా ముంచేశాయి. జాన్ తాడు పట్టుకొని పైకి రావాలని ప్రయత్నిస్తున్నాడు కాని యింకా లోతుకు మునిగిపోతున్నాడు.

ఒడ్డు యింకా ఎంత దూరముందో? “ఓ దేవా! నాకు సహాయం చెయ్యి …” అతని తల మునిగిపోతోంది. మంచు నదిలో మునిగిపోతూ బాధతో సుడులు తిరిగిపోతున్నాడు జాన్. తల మునిగిపోయి అతనికి ఊపిరాడటంలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలీదు. అతడు సృహలేకుండా అయిపోయాడు.

“ఇతడు ఊపిరి పీలుస్తున్నాడు.” ఎవరో అంటున్నారు.

“సా … ర్జెం …ట్” – గొణిగినట్టుగా అన్నాడు జాన్. అతని గొంతు బాగా నొప్పిగా ఉంది.

“మూలనున్న ఆ బురుజునుండి శత్రువులు మోకును తెంపినట్టున్నారు.” – సార్జెంట్ గొంతు ఎక్కడో దూరంనుండి వినిపిస్తున్నట్టుంది జాన్కు – “మోకు తెగిపోయినట్టు కాపలాకాస్తున్న మన సైనికుడొకడు కనుగొన్నాడు. నీవు తాడును గట్టిగా పట్టుకొని ఉన్నందున మేము నిన్ను బయటకు లాగగలిగాము.”

“నా తుపాకీని పోగొట్టుకున్నాను” – జాన్ దిగులుగా అన్నాడు – “నా స్నేహితు డెక్కడ?”

“కొట్టుకుపోయాడు. అతడు తన పట్టు కోల్పోయి ఉంటాడు.”

ఆ తర్వాత రాత్రి కోటనానుకొని నదిలో కట్టబడివున్న మోకును శత్రువులు తిరిగి తెంపారు. పాపం! పడవలోని సైనికులు బలమైన ప్రవాహంతో పోరాడవలసి వచ్చింది. కాని వారికేం ప్రమాదం జరగలేదు.

గోడమీదనున్న శత్రువుల కాల్పులకు స్వల్ప గాయాలయ్యాయంతే. కోటలోనికి వస్తువులు సరఫరా కాకుండా చూడ్డానికి ప్రతి రోజూ పడవలో కాపలా కాయడం జరుగుతోంది. ఎంత కాపలా కాస్తున్నప్పటికీ కోటలోనికి పడవలో సామగ్రిని చేరవేయడంలో శత్రువులు విజయం సాధిస్తున్నారు. ఇక యిలా కాపలా కాయడం వృధా అన్న నిర్ధా రణకు వచ్చిన పార్లమెంటు సైన్యం ఫిరంగులతో కోట గోడల్ని ధ్వంసం చేయడం ప్రారంభించింది. త్వరలోనే కోట గోడలు కుప్పకూలిపోయాయి.

1647వ సంవత్సరం ప్రారంభంలో జాన్ పార్లమెంటు సైన్యంతో పడిపోయిన కోట సమీపంలో బసచేసి ఉన్నాడు. తన తీరిక సమయాల్లో బైబిల్ను తీసి చదివేవాడు. అది పూర్తి బైబిలు కాదుగాని సైనికులకు ఉపయోగపడే విధంగా కొన్ని శీర్షికల క్రింద కొన్ని ప్రాముఖ్యమైన బైబిలు వచనాలు యివ్వబడివున్నాయి. దీనితోకూడ మతా చారాలకు సంబంధించిన వేరొక పుస్తకం ప్రతి సైనికుడికీ యివ్వబడుతుంది.

గత రెండు సంవత్సరాలుగా జాన్ ఈ రెండు పుస్తకాలను నిర్లక్ష్యంచేశాడు. ఇప్పుడు తాను బైబిలు వచనాలున్న పుస్తకాన్నేగాక మతాచారాలున్న పుస్తకాన్నికూడ శ్రద్ధగా చదువు తున్నాడు. మంచు నదిలో తాను మునిగి కొట్టుకొనిపోతున్నప్పుడు కాపాడమని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు తనను కాపాడినందుకు దేవునికి తాను కృతజ్ఞత చెల్లించలేదు. అలా తాను కృతజ్ఞత చెల్లించనందుకు జాన్ తన్నుతాను సమర్థించుకొన్నాడు.

“తన తోటి సైనికుడుకూడ ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించి ఉంటాడుకదా? మరి అతడెందుకు మునిగిపోయాడు? అతడు దురదృష్టవంతుడు, తాను అదృష్టవంతుడు. అదీ విషయం” అతడు తనకు తాను సర్ధిచెప్పుకొన్నాడు.

స్కాట్లాండ్ వాళ్ళు చార్లెస్ రాజును క్రామ్వల్కు అప్పగించారని తెలిసింది. స్కాట్లాండ్ వాళ్ళు ఇంగ్లాండుకు చెల్లించవలసిన ఋణాన్ని మాఫీ చేస్తానని క్రామ్వెల్ యుక్తిగా వాళ్ళతో మంతనాలు జరపడంతో వాళ్ళు రాజును అప్పగించేశారు.

నార్తాంప్టన్ లోని హోల్బి గృహంలో రాజు బందీగా కాపలాలో ఉంచబడ్డాడు. ఇక ఐరిష్ సము ద్రాన్ని దాటి ఐర్లాండువారితో యుద్ధం చేయవలసివస్తుందని జాన్ ఎదురుచూడసాగాడు. సైనికులకు జీతాలు ఆపివేయబడ్డాయి. వారి జీతాలు తర్వాత చెల్లిస్తామన్నట్లుగా హామీ పత్రాలను సైనికాధికారులు సైనికులకిచ్చారు. ఇలా మునుపెన్నడూ జరగలేదు.

“ఇదేంటి?” తన జీతంకొరకు సైనికాధికారులు యిచ్చిన హామీ పత్రాన్ని చేతిలోకి తీసికొని చిరాగ్గా అడిగాడో సైనికుడు.

“దీన్ని డిబెంచర్ అంటారు. అంటే నీకు రావలసిన జీతం డబ్బును భవిష్యత్తులో తప్పక చెల్లిస్తామని సైన్యం యిచ్చిన హామీ పత్రమన్నమాట” గొప్ప విద్యావంతుడిలా జవాబిచ్చాడు జాన్.

“దీన్నెవరికైనా యిస్తే డబ్బులిస్తారా?”

“ఏమో! సందేహమే.”

“మనం తిరిగి చెస్టర్కు ఎప్పుడు వెళతాం?” జాన్ తన సార్జెంట్ని అడిగాడు. “మన జీతాలు చేతికి వచ్చేంతవరకు వేచివుండాలి.” చాలామంది సైనికులు తమ డిబెంచర్లను సైనికాధికారులకు అమ్మడం ప్రారంభించారు. అయితే ఆ అధికార్లు నాలుగు పెన్నీల డిబెంచర్లకు ఒక పెన్నీమాత్రమే యిస్తున్నారు.

జాన్ తన డిబెంచర్లను అమ్మడానికి నిరాకరించాడు. “కొంత ఆలస్యమైనా నేను పూర్తి మొత్తాన్నే తీసుకొంటాను” జాన్ అన్నాడు. అయితే సైన్యం వారికి డబ్బు చెల్లించలేదు. జూన్ నెల నాటికి జాన వద్ద తన ఐదు నెలల జీతానికి సంబంధించిన పదిపౌండ్ల విలువచేసే డిబెంచర్లున్నాయి. ఇప్పుడు అధికార్లు డిబెంచర్లను కొనుగోలు చేయడం లేదు. వాళ్ళవద్ద డబ్బు కొద్దిగానే మిగిలి ఉండటం, డిబెంచర్లు మాత్రం కుప్పలుగా పడివుండటం వారిని కలవరపరచింది. హఠాత్తుగా ఒక రోజు వాళ్ళు చెస్టర్కు ప్రయాణమయ్యారు.

“ఇంకా డబ్బు రాలేదు” సార్జెంట్ గొణిగాడు.

“నన్నిక్కడనుండి ఐర్లాండుకు పంపకపోవడమే నాకు పదివేలు” ఒక సైనికుడన్నాడు. మార్గమధ్యంలో ఫ్లింట్ కోట నేలమట్టమై ఉండటం జాన్ చూశాడు. ఏమాత్రం ఆ తర్వాత జాలి లేకుండా దాన్ని కుప్పకూల్చేశారు. జాను బాగా కోపమొచ్చింది. తన్నుతాను సంభాళించుకున్నాడు. తమ అధికారులు క్వైడ్ నదీ తీరానున్న కోటను నాశనం చేయనందుకు జాన్ సంతోషపడ్డాడు.

సైనికులు ఉత్తరపు గోడల్ని కూల్చేసిన అనంతరం కోటలోపలున్నవారిని బందీలుగా పట్టుకొన్నారు. కాని, కోటను మాత్రం నాశనం చేయలేదు. ఎవరినీ శిక్షించనూ లేదు. మేరీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతురతగా ఉన్నాడు జాన్. అయితే సైనికులు ఈ సారి చెస్టర్కు చాలా దూరంగా నైరుతి దిశలో విడిదిచేశారు. చాలా రోజుల తర్వాత ఆమె మామగారి ఎస్టేట్కు జాన్ అతికష్టంమీద వెళ్ళగలిగాడు.

అక్కడ పశువుల్ని కాస్తున్న వ్యక్తి మేరీ అనుకొని పరుగెత్తాడు. ఆ వ్యక్తి మేరీ కాదు. ఒక చిన్న కుర్రాడు. “మేరీ అనే అమ్మాయి ఎక్కడుంది?”

“ఆమె యిప్పుడు యింట్లోనే పనిచేస్తోంది” జవాబిచ్చాడా కుర్రాడు. “ఎందుకు?” కఠినంగా అడిగాడు జాన్.

“మా అమ్మకు బాగా జబ్బుచేసింది. మంచంమీదనుండి లేవలేకపోతోంది. సరే గాని నీవెవరు? ఎక్కణ్ణుంచి వస్తున్నావు?” ఆ అబ్బాయికి నిజం చెప్పాలనిపించలేదు జాను. ‘వీడు యింటికెళ్ళి వాళ్ళ నాన్నకు చెబితే యింకేమైనా ఉందా?’ తనిప్పుడు ఆమె యింటికెళ్ళి ఆమెను చూడ్డానికి ప్రయత్నంచేయడం అంత మంచిది కాదేమోనని పించింది.

ఆమె మామ రాజుగారి మద్దతుదారుడుకూడ. తానక్కడికి వెళ్ళడం వేరే సమస్యలకు దారితీయొచ్చు. అప్పుడు పరిస్థితి విషమించవచ్చు. ఇంతవరకు తన విషయం మేరీ మామయ్యకు తెలీదు. ఇప్పుడు తాను తొందరపడి మేరీని ఎందుకు యిబ్బందిపెట్టాలి? జబ్బుతో మంచానపడ్డ ఆమె అత్తయ్య చనిపోవడం ఖాయం. అప్పుడు మేరి తన మామయ్యను పెళ్ళిచేసుకోవడం తప్పనిసరి. మేరి తనకు దూరమౌతున్నట్టుగా అనిపిస్తోంది జాను. తను వెనక్కి వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నాడు.

“గత రెండున్నర సంవత్సరాలలో తనకు ఎదురైన అనుభవాలలో యిదొకటి” అనుకొన్నాడు జాన్. చనిపోయిన మేరీవాళ్ళ నాన్న తనకు తెలుసునని ఆ అబ్బాయికి చిన్న అబద్ధం చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు జాన్. మార్గీ చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా బాధతో నిండిపోయింది జాన్ హృదయం.

భారంగా అడుగులో అడుగు వేసుకొంటూ సైనిక విడిదికి చేరాడు. ‘ఈ సంఘటన తన ప్రియ చెల్లి మార్గీ చనిపోయిన సంఘటనకన్నా బాధకరమైంది. మార్గీ చనిపోవడానికి దేవుడు కారణం. మేరీ విషయంలో భంగపాటుకు తానే కారణం. తన గుండెను ఎవరో పిండుతున్నట్టుంది. భవిష్యత్తులో యింకా ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు?’

“ఇక్కడేం జరిగిందో ఊహించు బన్యన్!” – క్యాంపుకు తిరిగొచ్చిన జానన్ను అడిగాడు ఓ సైనికుడు నవ్వుతూ – “మనమందరం ఎవరిళ్ళకు వాళ్ళం వెళ్ళబోతున్నాం” జాన్ నుండి సమాధానంకొరకు నిరీక్షించకుండానే చెప్పేశాడు ఆ సైనికుడు సంతోషంగా. “మనం ఐర్లాండ్కు వెళ్ళడం లేదా?”

“అంతగా నీవు వెళ్ళాలనుకొంటే వెళ్ళొచ్చు, అదీ నీ సొంత ఖర్చులతో. బుర్రలేని దద్దమ్మా” సణిగాడు యింకొక సైనికుడు.

“నాకంత స్తోమత లేదు.”

“ఏం ఫరవాలేదు. మన జీతం డబ్బులు చెల్లిస్తున్నారు” – పళ్ళికిలించాడు మొదటి సైనికుడు. జాను పదిపౌండ్లు వచ్చాయి. బెడ్ఫోర్డ్ ప్రాంతానికి చెందిన సిపాయిలతో కలిసి అతడు త్వరలో ప్రయాణం కానున్నాడు.

మేరీని చూసేందుకు అతడు మరో ప్రయత్నం చేసేవాడే గాని మిగిలిన సైనికులు ఆగేట్టులేరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత తాను ఒంటరిగా ప్రయాణం చేద్దామంటే అది చాలా ప్రమాదకరం. రాజుకు మద్దతుదారులున్న ప్రదేశాల గుండా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు.

“ఇక నేను మేరీని మరచిపోవలసిందే” – బాధతో మూలిగాడు జాన్ మిగతా సైనికులతో తూర్పుదిక్కుగా ప్రయాణం కొనసాగిస్తూ.

“ఏంటి గొణుగుతున్నావు బన్యన్?” జాన్ ప్రక్కన నడుస్తున్న సైనికుడడిగాడు. “ఏం లేదు.” తానీ అబద్ధం చెబుతున్నప్పుడు కడుపులో తిప్పినట్టయింది జాను. ఎలోను చూశాక జాన్ హృదయం పరవశించింది.

‘బన్యన్ ఎండ్’ యిప్పుడు చాలా అద్భుతంగాను, ప్రశాంతంగాను కనిపించింది. తమ పూరిల్లు చూస్తూనే జాన్ మది పులకరించింది. తనను చూస్తూనే పదమూడేండ్ల విల్లీ ఆనందంతో పరుగెత్తు కుంటూ వచ్చాడు. జాన్ తన తండ్రిని చూసి చాలా ఆనందించాడు.

సైన్యంలో తాను చూసిన చాలామంది పనికిమాలిన వాళ్ళతో పోలిస్తే తన తండ్రి చెడ్డవాడేం కాదని పించింది జాను. తమ ఇంటి ప్రక్కన కనిపించిన చిన్న సమాధి జాన్ హృదయాన్ని కలచివేసింది. తన సవతి తల్లికి పుట్టిన తన తమ్ముడికి ‘చార్లెస్’ అని రాజుగారి పేరు పెట్టినట్లు తనకు న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో తెలిసినప్పుడు తన తండ్రిపై చాలా కోప మొచ్చింది. అయితే ఎవరినీ లెక్కచేయని తన తండ్రియొక్క నిర్భీతిని యిప్పుడు అభినందిస్తున్నాడు.

“చిన్ని చార్లెస్ చనిపోయినందుకు చాలా చింతిస్తున్నాను” – దుఃఖపూరితమైన స్వరంతో తన తండ్రినీ, సవతి తల్లినీ ఉద్దేశించి అన్నాడు జాన్. యుద్ధంతోను, నిరంతర ఒత్తిడితోనూ, భయంతో నిండుకొని ఉండే యుద్ధ వాతా వరణంతోను జాన్ బాగా అలిసిపోయాడు. ఇప్పుడతడు పాత్రలకు కళాయి వేయడానికి కూడ యిష్టపడుతున్నాడు.

వివిధ రకాలైన లోహాలను అర్థం చేసుకోడానికీ, వాటిని ప్రశంసించడానికీ అతడు ప్రారంభించాడు. రకరకాల లోహమిశ్రమాలు యిప్పుడత నికి సంభ్రమాశ్చర్యాల్ని కలిగిస్తున్నాయి. వీటిని గురించి తీక్షణంగా ఆలోచించడం

ప్రారంభించాడు. రాగికి తగరం కలిపితే వచ్చే కంచు స్వచ్ఛమైన కంచుకన్నా చాలా సులభంగా కరిగిపోతుంది. ఆ కంచును చల్లార్చినప్పుడు అది స్వచ్ఛమైన రాగికన్నా గట్టిగా ఉంటుంది. జింకును రాగికి కలిపితే వచ్చే యిత్తడి స్వచ్ఛమైన రాగికన్నా మూసవేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అయినప్పటికీ యిత్తడి రాగికంటె గట్టిగా ఉంటుంది.

ఈ కళాయివేసే పనిపై జాన్ తీక్షణమైన దృష్టి నిలపసాగాడు. అప్పుడప్పుడూ అతడు ఎల్లోని పచ్చిక బయళ్ళలో తన స్నేహితులతో మాట్లాడుతూ గడిపేందుకు కూడ చాలా యిష్టపడేవాడు.
ప్రజల దృష్టిలో యిప్పుడితడు పనికిమాలిన బన్యన్ కాదు.

పొలం ఉన్న ఆసామి, అనుభవజ్ఞుడైన యాత్రికుడు, సైనికుడు, ఏ విషయం గురించైనాసరే అవగాహన జ్ఞానం కలిగివున్న వివేకవంతుడు. యుద్ధాన్నిగూర్చిన విషయాలైనా, రాజకీయాలైనా, మత సంబంధమైన విషయాలైనా అతడు అనర్గళంగా మాట్లాడే సమర్థుడిప్పుడు. ఎల్టాలోని పెద్దపెద్ద విద్యావంతులుకూడ అతని వాదనాపటిమకు నిశ్చేష్టులౌతున్నారు.

ప్రతిచోటా విమర్శకులుంటారు. “అతని వాదనలో అంత నిజాయితీ ఏం లేదు, ఒక్క ఉద్రేకం తప్ప” – జాన్ వినేట్లుగా అక్కడి పెద్దల్లో ఒకతను అన్నాడు.

“పుల్లని ద్రాక్షపండ్లు” జాన్ గొణిగాడు. జాన్ ఒక సమస్యను ఏవైపునుండైనా వాదించి గెలిచేవాడు. తాను సైన్యంలో లక్షలాది వాదనలు విన్నాడు. ఇవెంత? సైన్యం ఇతణ్ణి అనేక కోణాల్లో పదును పెట్టింది. గ్రామీణ పచ్చిక బయళ్ళలో అనేకమైన ఆటలు ఆడబడేవి. కొన్ని జూదానికి సంబంధించినవికూడ ఉండేవి. కాని అవి యితణ్ణి ఆకర్షించేవికావు.

‘కర్రాబిళ్ళ’ (బిళ్లంగోడు) అనే ఆటలో జాన్తో సమానంగా ఎవరూ అడలేకపోయేవారు. ఈ ఆట ఆడే ఆటగాడికి మంచి దేహ దారుఢ్యం, నైపుణ్యం, వివేచన చాలా అవసరం. ఆటగాడివద్ద కొంచెం పొడవైన కర్ర ఉంటుంది. దాన్ని ‘కోడు’ అంటారు. ‘బిళ్ళ’ అనబడే స్థూపాకారపు కొయ్యముక్క రెండు కొనలవైపు సూదిలాంటి మొనలతో రెండంగుళాల మందం, ఆరంగుళాల పొడవు కలిగి ఉంటుంది. బిళ్ళను నేలమీద పెడతారు.

ఆటగాడు తన చేతిలోని పొడవైన కర్రతో ఆ బిళ్ళను ఒక కొనవైపు కొట్టి, అది గిరగిరా తిరుగుతూ పైకి లేచినప్పుడు తన చేతిలోని కర్రతో తిరిగి రెండవసారి దాన్ని దూరంగా పోయేటట్లుగా కొట్టాలి. అలా రెండవ పర్యాయం అతడు కొట్టలేకపోతే అతడు ఆటనుండి నిష్క్రమించాలి. అప్పుడతనికేం పాయింట్లు రావు.

గాల్లోకి గిరగిరా తిరుగుతూ లేచిన బిళ్ళను అతను ఒకవేళ కొట్టగలిగితే అది దూరంగా భూమిమీద పడేలోపుగా ఎంత దూరంలో పడబోతుందో ఊహించి ఆ దూరాన్ని అడుగుల్లో చెప్పాలి. ఆ తర్వాత అది పడిన చోటు అతడు చెప్పినదానికన్నా తక్కువైతే తిరిగి అతడు ఏ పాయింట్లూ లేకుండానే నిష్క్రమించాలి.

ఒకవేళ అతడు చెప్పినదానికన్నా ఆ బిళ్ళ పడిన దూరం ఎంత ఎక్కువైతే అతనికి అన్ని పాయింట్లు వస్తాయి. అప్పుడతడు తిరిగి తన ఆటను కొనసాగించవచ్చు. అలా అతడు ఓడిపోయేంతవరకూ ఆడొచ్చు.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం హ్యారీ జాన్తో కలిసి ఆడేవాడు. యుద్ధంలో ఒక చేతిని పోగొట్టుకున్న రోజర్స్ ప్రేక్షకుల్లో ఒకడుగా కూర్చొని ఆనందించేవాడు. బెడ్ ఫోర్డ్నుండి వచ్చిన వ్యక్తో లేదా ఆ రాజమార్గంగుండా వెళ్ళే ఒక బాటసారో అక్కడ ఆగి జాన్ ఆటను తప్పక చూసేవాడు. “ఒకప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతూ ఆకతాయిలా ఉండే ఈ ఎర్రజుట్టు కుర్రాడిప్పుడు ఎంత చక్కగా ఆడుతున్నాడు!” అని ఆశ్చర్యంతో వారు వ్యాఖ్యానించేవారు.

“అతని ఆటమీద పందెం కడితే అతని ఆటతీరు యింకా మారిపోతుంది” – ప్రేక్షకుల్లో ఒకడుగా కూర్చొని ఉండే రోజర్స్ అనేవాడు.

అలా పందెం కట్టినప్పుడు జాన్ ఆట తీరు నిజంగా మారిపోయేది. తన మొదటి దెబ్బతో బిళ్ళను గాల్లోకి లేపి, చేతిలోని కర్రను తన పిడికిలితో గట్టిగా పట్టుకొని సరైన సమయంలో బిళ్ళను రెండవసారి తన బలంకొద్దీ కొట్టేవాడు. బిళ్ళ గిరగిరా తిరుగుతూ దూరంగా పడుతుంది.

జాన్ ఎప్పుడూ దూరాన్ని అధికంగా అంచనా వేయడు. ఒక గంట లేదా రెండు గంటలు అలా ఆడిన తర్వాత తన పందెం డబ్బును ప్రేక్షకులవద్దనుండి న్యాయంగా తీసికొని దాన్ని తన సహచరులతో పంచుకొనేవాడు. ఓడిపోయినవారు చాలా అరుదుగా అతనిపై సణిగేవారు. ఒక కళాయివేసేవాడితో ఓడిపోయినందుకు ఎవరుమాత్రం సణగకుండా ఉండగలరు?

జాన్ కష్టపడిచేసే కళాయి పనులవల్లనూ, అంతే గంభీరంగా ఆడే ఆటవల్లనూ వచ్చే డబ్బులు అతడు చెస్టర్నుండి తెచ్చుకొన్న డబ్బులకు జోడయ్యాయి. కాని అతనికి తన జీవితం నిర్జీవంగానూ, శూన్యంగానూ తోచింది.

తనపై ఎంతో నమ్మకంతో మేరీ అన్న మాటల్ని తనెంత అబద్ధం చేశాడు! “నువ్వు తప్పక వస్తావు జాన్ బన్యన్, నన్ను చూడటానికి తప్పక వస్తావు” అని మేరీ తనతో అన్న మాటలు జాన్కు పదేపదే గుర్తొస్తున్నాయి. ‘తనెంత పిరికివాడు! భయంచేత ఆమెను చూడకుండా తిరిగొచ్చాడు. ‘

తాను పగలు ఆమెను మరచిపోగలుగుతున్నాడు గాని రాత్రిళ్ళు ఆమెను మరచి పోలేకపోతున్నాడు. తాను ఎల్టాలోని చాలామంది యువతులను చూశాడు. అయితే వీళ్ళెవరూ మేరీకి సరిరారు. కొంతమంది అందంగానూ, మరికొంతమంది సౌష్టవం గానూ, కొందరు తెలివిగలవారుగానూ, మరికొందరు పరిశుద్ధంగానూ ఉన్నారు. ఇంకా కొంతమంది హాస్యంగా మాట్లాడగలరు.

అయితే ఈ లక్షణాలన్నీ మిళితమైయున్న మేరీలాగ ఎవరూ జాన్కు కనిపించలేదు. ‘ఆమె అత్తయ్య యింకా బ్రతికి ఉందేమో! వాళ్ళత్త పూర్తిగా కోలుకొని ఉందేమో! ఒకవేళ మేరీకి ఈ సమయంలో వివాహం చేయాలని ఒక మంచి వరుడికోసం వెదకుతున్నారేమో! ఒకవేళ అదే నిజమైతే అప్పుడు తానెంత వెర్రివాడైపోతాడు! తాను వెళ్ళాలి. తప్పక వెళ్ళి తన మేరీని తెచ్చుకోవాలి. ఒక్క వేసవికాలంలోనే యువతులు కాలినడకన ప్రయాణం చేయగలరు.’

“వచ్చే వేసవిలో నేను తప్పకుండా వెళ్ళి మేరీని తెచ్చుకుంటాను” – నిర్ణయించు కున్నాడు జాన్.

1647వ సంవత్సరం శీతాకాలంలో చార్లెస్ రాజు క్రాంవెల్ సైనికులనుండి తప్పించుకొని పారిపోయాడన్న వార్త జాన్కు దిగ్భ్రాంతిని కలుగజేసింది. 1648వ సంవత్సరం ఆశ్చర్యకరంగా రాజు గతంలో తనకు ద్రోహంచేసిన స్కాట్లాండ్ వాళ్ళతో తిరిగి సంబంధం పెట్టుకున్నాడు.

యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ స్కాట్లాండ్ వాళ్ళపై రాజు పూర్తిగా ఆధారపడ్డాడు. వేసవి వచ్చినప్పుడు రాజుగారి మద్దతుదారులు ఎక్కువగా ఉండే చెస్టర్కు మేరీకోసం వెళ్ళడానికి జాన్ భయపడ్డాడు. రాజుగారి మద్దతుదారులు మళ్ళీ బలాన్ని పుంజుకోవడంవల్ల అలా వెళ్ళడం చాలా ప్రమాదం.

మే నెలలో ఒక రోజున ఎల్లో చుట్టుప్రక్కల మసకబారిన పొలాలను చూడటంద్వారా తనను తాను ఓదార్చుకోవాలని ప్రయత్నించాడు గాని సఫలీకృతుడు కాలేకపోయాడు. రాత్రిళ్ళు మేరీ జ్ఞాపకాలతో జీవితాన్ని అతడు భారంగా గడుపుతున్నాడు.

ఆగస్టులో క్రాంవెల్ సైన్యం చార్లెస్ రాజునూ, అతనికి సహకరించిన స్కాట్లాండ్ సైన్యాన్నీ సమూలంగా ఓడించింది. జాన్ ఈ శుభవార్త వినేనాటికి వేసవి కాస్తా ముగిసిపోయింది. జాన్ తాననుకున్నట్టుగా మేరీని ఈ వేసవిలో తెచ్చుకోలేకపోయాడు.

“వచ్చే వేసవిలో నేను తప్పకుండా వెళ్ళి మేరీని తెచ్చుకుంటా” గత సంవత్సరం కూడ తానిలాగే అనుకున్నట్టుగా గుర్తుకు తెచ్చుకొంటూ తనలో తాననుకొన్నాడు జాన్. పాత్రలకు కళాయి వేయటం, ధైర్యశాలియైన బ్రహ్మచారిలా పల్లెపచ్చదనాలలో ఆటలాడటం, రాత్రిళ్ళు మేరీగురించి వేదన చెందటం ఇలా కాలం గడిచిపోతోంది.

ఆ శీతాకాలంలో క్రాంవెల్, అతడి సన్నిహిత సహచరులు, ఖైదు చేయబడ్డ రాజుతో మంతనాలు జరపడానికి ప్రయత్నించారు. అదేమంటే రాజు కేవలం నామమాత్రంగా ఉండాలి. పార్లమెంటు పరిపాలన చేయాలి. రాజు ఈ విషయంలో మొండితనం ప్రదర్శించాడు.

1649 జనవరిలో రాజు శిరచ్ఛేదనం గావించబడ్డాడు. రాజు మరణ వార్త జాన్కు దుఃఖం కలిగించింది. అయితే రాబోయే క్రాంవెల్ ఆధ్వర్యంలోని పార్లమెంటు పరిపాలన అతనిలో ఉత్తేజాన్ని నింపింది.

“రానున్న వేసవి నా జీవితాన్ని మార్చేయబోతోంది. నేను మేరీ దగ్గరకు వెళతాను” – తనలో తాననుకొన్నాడు జాన్ – “తాను అదృష్టవంతుణ్ణయితే!”

ఎంతో కాలంగా జాన్ ఎదురుచూస్తోన్న వేసవి రానే వచ్చింది. మే నెలంతా ఒక పండుగ సమయం. ఊళ్ళన్నీ తిరిగిరావడానికి అది మంచి అనుకూల సమయం. చాలామంది ఈ రోజుల్లో సంబరాలకనీ, సంతలకనీ ప్రయాణాలు చేస్తుంటారు. ఏ ప్రాంతంలోకూడ క్రొత్తవారిని పెద్దగా పట్టించుకోరు.

ఏప్రిల్ నెలలో జాన్ తన తండ్రివద్దకు వెళ్ళి తాను కొంతకాలం ఊళ్ళు తిరగడానికి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అయితే ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఎలాంటి ప్రశ్నలూ వేయలేదు. జాన్ యిప్పుడు పెద్దవాడయ్యాడు.

తన ప్రయాణంలో దేవుడు తనకు తోడైయుండి సహాయం చేయాలని తండ్రి తనకోసం ప్రార్థిస్తున్నప్పుడు తానేదో తప్పు చేసినవాడిలా జాన్ తలవంచుకున్నాడు. తన తండ్రిని తానెన్ని విధాలుగా యిబ్బంది పెట్టినా, ఎలా ప్రవర్తించినా అవేవీ ఆయన మనస్సులో పెట్టుకోలేదు. జాన్ తన తండ్రివైపు ఆరాధనా భావంతో చూసి ముందుకు కదిలాడు. ఎట్టకేలకు మేరీవద్దకు తాను వెళ్ళగలుగుతున్నందుకు జాన్కు చాలా ఉత్సాహంగా ఉంది.

“ఈ వేసవిలో నేను మేరీని తప్పక తీసుకొస్తాను” – తనలో తాననుకొన్నాడు. జాన్ – “నేనెక్కడా ఆగేది లేదు.” రెండు సంవత్సరాల క్రితం విషయాలే తలంపుకు వచ్చాయి జాను. ఇప్పుడు తన వయస్సు యిరవై సంవత్సరాలు.

ఇంతకు మునుపు ప్రతికూలమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే చాలా యిబ్బందిపడేవాడు. ఇప్పుడైతే ముందుకెలా వెళ్ళాలో, వెనక్కి ఎలా జారుకోవాలో, అటూ ఇటూ ఎలా వెళ్ళాలో తనకు బాగా తెలుసు.

ఏ విషయాన్నైనా యిరువైపులా ఎలా వాదించాలో కూడ తనకు తెలుసు. తననెవరైనా ఆపి ప్రశ్నల వర్షం కురిపిస్తే, ఆ వ్యక్తి క్రాంవెల్ పక్షానికి చెందినవాడా లేదా రాజుగారి పక్షానికి చెందినవాడా గ్రహించగలిగే తెలివితేటలు తనకిప్పుడున్నాయి.

ఒకవేళ అతడు రాజుగారి పక్షంవాడైతే తాను రాజుగారి పక్షాన సర్ జేకబ్ ఆస్ట్ అనే కమాండర్ క్రింద ఆయుధదళంలో పనిచేశానని చెబుతాడు. తర్వాత వచ్చే ప్రశ్నలనెలా నిరోధిం చాలో తనకు బాగా తెలుసు.

ఒకవేళ ఆ వ్యక్తి పార్లమెంటుకు సంబంధించినవాడైతే అతడి ప్రశ్నలకు జవాబివ్వడం జాన్కు కష్టమేమీకాదు. ఎందుకంటే సత్యం చెప్పడం సులువైన విషయం కదా! అబద్దం చెప్పడంకన్నా నిజం చెప్పడం తేలికైన విషయం.

ఎలోను విడిచిపెట్టినప్పటినుండి తానాలోచిస్తూ వచ్చిన పచ్చిక బయళ్ళను ఒక రోజు మధ్యాహ్న సమయంలో చేరుకున్నాడు జాన్. తన భుజంమీది సంచి గడ్డివాము క్రింద దాచి, పొదలూ కంచెలూ గడ్డివాములూ చాటుచేసికొంటూ మెల్లగా నడిచి దూరంలో పశువులను కాస్తున్న పిల్లాడిని సమీపించాడు. వాడు మేరీ అత్త కొడుకే అని నిర్ధారించుకున్నాక అతడు ఆవుల్ని తోలుకొని వెళ్ళేంతవరకు అతనికి కనిపించ కుండా దాగి, ఆ తర్వాత అతడికి కొద్దిదూరంనుండి మెల్లమెల్లగా అతణ్ణి వెంబడించ సాగాడు. ఆ పిల్లాడు ఒక తెల్లటి యింటిముందు ఆగాడు.

ఆ గృహం తెలుపులో నలుపు అలంకరణలతో చూడ ముచ్చటగా ఉంది. అక్కడి వాతావరణం చూస్తే మేరీ అత్తమ్మ మంచానపడి ఉన్నట్టుగా జాను అనిపించడం లేదు. జాన్ ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు. యింటివద్దకు అతడి రాకను పసిగట్టిన ఒక బలిష్టమైన కుక్క గట్టిగా మొరగటం ప్రారంభించింది.

“ఏయ్ ఎవరు నువ్వు?” – జాన్వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడా అబ్బాయి – “ఎక్కడినుండి వస్తున్నావు?”

“నేనొక బాటసారిని” వినయంగా సమాధానమిచ్చాడు జాన్. ఈలోగా యింకా కొన్ని కుక్కలు మొరుగుతూ జాన్ కాళ్ళచుట్టూ చేరాయి. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో అతని నిశ్శబ్దవాలకం చూసి అవి మొరగడం మానుకున్నాయి. నిత్యసంచారి అయిన తనకు ఈ కుక్కలు ఒక లెక్కా! “మీ బావిలో కాసిన్ని నీళ్ళు త్రాగవచ్చా?” అబ్బాయిని అడిగాడు జాన్.

“నీవు వెళ్తున్న ఆ దారి వదలి యిక్కడి కెందుకొచ్చావు?” దక్షిణవైపుగా చూసి తలాడిస్తూ అడిగాడా అబ్బాయి.

“నేనావైపునుండి రావడంలేదు. ఈశాన్యవైపున ఉన్న హెలీ ్బ కొండనుండి పల్లెలు దాటుకొంటూ ప్రయాణం చేస్తూ వచ్చాను. ఏటవాలుగా ఉండే ఆ కొండలను గురించి నీవు వినుంటావనుకొంటాను.”

అబద్ధాలు జాన్ నోట్లోనుండి ప్రవాహంలా దొర్లుకొస్తున్నాయి. ఈ చుట్టుపట్లనున్న ప్రాంతమంతా తనకు సుపరిచితమైనవేనని తెలియజెప్పేందుకే జాన్ తాపత్రయమంతా. మేరీ యితనికి ఈ స్థలాల పేర్లన్నీ చెప్పింది. ఆమె చెప్పినవేవీ తాను మర్చిపోలేదు.

“నేను మా నాన్ననడిగి చెప్తానుండు” సందేహంగా యింట్లోకి పరుగెత్తాడు ఆ అబ్బాయి.

కాసేపటికి ఒక మృగంలాంటి మనిషి బయటకు వచ్చాడు.

ప్రేమ ప్రయాణం

ప్రేమ ప్రయాణం

“ఏం కావాలి నీకు?” కర్ణకఠోరమైన స్వరంతో గర్జించాడు ఆ వ్యక్తి. అతడు జాన్ ఊహించినదానికన్నా చండాలంగా ఉన్నాడు. అతడి కళ్ళు క్రొవ్వుమడతల్లో మూసుకు పోయిన పంది కళ్ళలా ఉన్నాయి. ఏదైనా సంతలో ఒక కోతిలా అతణ్ణి ఆడించేలా అతని ఒంటినిండా రోమాలు దట్టంగా ఉన్నాయి.

“త్రాగడానికి మంచి నీళ్ళు కావాలండీ, నేను హెల్సీ ప్రాంతానికి చెందినవాణ్ణి. ఇప్పుడు చెస్టర్కు వెళుతున్నాను. జాను కొద్ది కొద్దిగా భయమేస్తోంది. కుర్రాణ్ణి మోసం చేయడం సుళువేగాని హెల్స్బీ చుట్టు ప్రక్కల ప్రాంతమంతా క్షుణ్ణంగా తెలిసిన ఈ మృగంలాంటి మనిషిని మోసంచేయటం చాలా కష్టమే! వీడు సామాన్యంగా వదిలేట్లు లేడు.

“ఈ మధ్య ఎప్పుడైనా పెక్ఫోర్త్ కొండలకు వెళ్ళావా?” ఆ వ్యక్తి అడిగాడు.

“బీస్టన్ కోటను చూసేందుకా?” జాన్ ఎదురు ప్రశ్న వేశాడు.

“హెల్బీ కొండపైన విలియం గ్రేడీ అనే సన్నకారు రైతు తెలుసా?” ప్రశ్నించాడా

“విలియం గ్రాడీనా?” నసిగాడు జాన్. అతని మెదడు వేగంగా పనిచేస్తోంది. ఏం సమాధానం చెప్పాలి? ఈ వ్యక్తి ఒకవేళ తనను పరీక్షించడానికి విలియం గ్రేడీ అనే వ్యక్తి పేరును యిప్పుడు సృష్టించాడేమో!

ఇంటి తలుపు దఢాలున తెరుచుకొంది. ఓ అందమైన అమ్మాయి పరికిణి, జాకెట్తో ఎగురుకుంటూ వచ్చి, “ఈ పరదేశికి నేను నీళ్ళిస్తా” అంది. ఆమె మేరీ!

“నిన్ను యింట్లోనుండి బయటకు ఎవర్రమ్మన్నారు?” కోపంగా అడిగాడు ఆమె మామ. అతని పంది కళ్ళు ఆమెవైపు క్రూరంగా చూస్తున్నాయి. “సరే త్వరగా యిచ్చి పంపు” అతడు గర్జించాడు. తన మామయ్య ప్రశ్నలనుండి జాన ను తప్పించాలన్నట్టు మేరీ జాన్తో మాట్లాడుతూ అతణ్ణి బావివద్దకు తీసుకెళ్ళింది.

అయితే మేరీ మామయ్య వాళ్ళను వెంబడిస్తూ జానన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. జాన్ మేరీతో మాట్లాడేందుకు అతడు అవకాశం యివ్వడంలేదు. జాన్ మేరీవైపు చూశాడు. ఆమె మునుపటికన్నా అందంగా స్త్రీత్వం ఉట్టిపడుతున్నట్టుంది. ఆమె తెలివికిప్పుడు ఆశ్చర్యపడుతున్నాడు జాన్.

మేరీ తనకు నీళ్ళందించిన తర్వాత వాటిని త్రాగుతున్నట్టు నటిస్తూ అడిగాడు, “మీ అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది?”

“ఈ రోజు ఆకాశం చాలా వింతగా ఉంది” – మేరీ కనుబొమ్మలు పైకెత్తుతూ అంది – “ఏ క్షణంలోనైనా శీతాకాలం రావచ్చనిపిస్తోంది.”

మేరీ చెప్పింది జాన్ కర్థమైంది. వాళ్ళత్తమ్మ బ్రతికుందిగాని ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అన్నట్టుంది. మేరీ మామయ్య తనవైపు కోపంగా చూడ్డం జాన్ గమనించాడు. “నేను చెస్టర్కు వెళ్ళడం మంచిదని తోస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే త్వరలో నేను పెళ్ళి చేసుకుంటాను. చీకటిపడ్డాక ఏ విషయం తెలుస్తుందని ఆశిస్తున్నాను” జాన్ అన్నాడు.

“నీ జీవిత కథ మాకెందుకోయ్ ఎర్ర జుట్టు వెధవా” – పెద్దగా గాండ్రించాడు మేరి మామయ్య – “నీ దారిన నీవు వెళ్ళు. నీ తిరుగు ప్రయాణంలో యిక్కడికేం రానవసరం లేదు.”

“అలాగేనండీ”.

జాన్ పెద్ద పెద్ద అడుగులు వేసుకొంటూ వేగంగా వెళ్ళిపోయాడు. “ఓ భగవంతుడా! మేరీ నా మాటల్ని అర్థంచేసికొని ఈ రాత్రికి పొలంలోకి వచ్చేట్లు చెయ్యి” చాలాకాలం తర్వాత దీర్ఘప్రార్థన చేశాడు జాన్. అతడు గడ్డివాములో రంధ్రం చేసుకొని అందులోకి వెళ్ళి చీకటిపడేదాకా అక్కడే ఉన్నాడు.

జాన్ కృంగిపోయి నిరుత్సాహంగా ఉన్నాడు. ‘తన ప్రార్థనలకెప్పుడూ జవాబు రాలేదు. ఎప్పుడైనా వచ్చాయా? అయితే కోటగోడవద్ద నదిలో తన పడవ తిరగబడ్డప్పుడు తాను ప్రార్థనచేస్తే దేవుడు విన్నాడుకదా! కాని, చనిపోయిన తన సహచరుని మాటేంటి?’ ఈ సందేహానికి జవాబు దొరకడం జాన్కు కష్టమనిపించింది. “దేవా దయచేసి మేరీని నాకప్పగించు.”

ప్రొద్దుగ్రుంకి బాగా చీకటిపడింది. ఆ చీకట్లో ఏమీ కనపడ్డంలేదు. అంతా నల్లని తారులా ఉంది. జాన్ గడ్డివామినుండి బయటకు వచ్చి కొద్ది దూరం నడుచుకొంటూ వెళ్ళాడు. ఒకవేళ మేరీవస్తే ఈ చీకట్లో తనను చూడగలుగుతుందా? మేరీ యింటికి సమీపంగా వెళ్ళడం ప్రమాదం. కుక్కలను లేపినట్టవుతుంది.

ఒక గడ్డివామికి ఆనుకొని కూర్చొని ప్రతి రెండు మూడు క్షణాలకొకసారి అది గాలి శబ్దమో, ప్రేమ జ్వరం తగిలిన గుడ్లగూబ అరుపో తేడా తెలియనంత మెల్లగా ఈలవేస్తూ కూర్చొన్నాడు. కాసేపటికి అతని నోరు కాగితంలా ఎండిపోయింది.

“ఇక్కడుంది నువ్వేనా జాన్ బన్యన్ ?”

“మేరీ!”

మొదట వారు ఒకరికొకరు దూరంగా నిలుచున్నారు. తర్వాత ఒకరికొకరు దగ్గరయ్యారు.

“నీవు తిరిగి వస్తావన్న ఆశను నేనెప్పుడూ వదులుకోలేదు” మేరీ అంది. ఆమె స్వరం ఆనందబాష్పాల్ని మోసుకొచ్చింది.

“నిన్ను తీసుకెళ్ళడానికి నేను సరైన ప్రయత్నం చేసుంటే బాగుండేది” జాన్ అన్నాడు. “నువ్వు ప్రయత్నం చేయకపోవడమే మంచిది. నీవెవరో, ఎక్కడినుండి వచ్చావో మా మామయ్యకు యింతవరకు తెలీదు.”

“నా భార్యగా నాతోకూడ వచ్చెయ్ మేరీ”.

“ఇక్కడైనా, వేరెక్కడైనా ముందుగా ప్రశ్నించకుండా మన పెళ్ళి జరిపించేందుకు చర్చి అంగీకరించదుకదా?!”

“క్రామ్వలెక్క ఈ నూతన శకంలో చట్టాలన్నీ మారిపోయాయి. మన పెళ్ళికేమీ అభ్యంతరం ఉండదు.” జాన్ కొద్దిసేపు మేరీ జవాబుకోసం ఎదురుచూశాడు. ‘మేరీ తనతో రాకుండా ఉండే అవకాశం ఉందా?’

“నేను కట్నమేమీ యిచ్చుకోలేను. నేను ఎప్పుడైనా ఒక పెన్నీ ముట్టుకొన్నట్టుకూడ నాకు జ్ఞాపకంలేదు. పుట్టినప్పటినుండి నేనొక నిరుపేదను”.

“నీవే నాకొక గొప్ప ధననిధివి మేరీ”.

“కొద్దిసేపు నన్ను ప్రార్థనచేసికోనివ్వు” ఆమె అడిగింది.

జాన్ నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు. ‘మేరీ ఎందుకు ప్రార్థన చేసికోవాలంటోంది? చిమ్మచీకట్లో ఈ పచ్చిక బయలుమీద మోకరించడంద్వారా ఆమెకేం తెలుస్తుంది? ఎక్కడో మారుమూలన ఈ నక్షత్రాలకన్నా యింకా దూరంగా ఉన్న దేవుడు ఈమె మాటల్ని ఇప్పుడు వింటున్నాడా?’

“నేను తిరిగి వెనక్కు వెళ్ళాలి” – కొద్ది సేపటి తర్వాత చెప్పిందామె.

“వద్దు” తుపాకీ గుండు తగిలిన సైనికుడు అరిచినట్టుగా అరిచాడు జాన్.

“నా దుస్తులూ, యింకా కొన్ని వస్తువులూ తెచ్చుకోడానికి” – అని చెప్పి మేరీ అక్కణ్ణుండి వెళ్ళింది.

‘దేవుడు మేరీ ప్రార్థనకు జవాబిచ్చాడన్నమాట. ఎలా యిచ్చాడు?” జాన్ తనలో తాను ఆలోచిస్తున్నాడు. ‘ఈ విషయం తర్వాత ఆమెనడగాలి’. మేరీ కోసం ఎదురుచూసే కొద్దీ జాన్లో భయం ఎక్కువౌతోంది.

‘ఆమెను వాళ్ళ మామ రాకుండా ఆపేస్తే!’ ఈ లోకంలో గుండెలు పగిలే విషయాలనెన్నింటినో జాన్ చూశాడు. ‘ఒక అంగుళం వాసి తేడాలో ఎంతమంది సైనికులు చనిపోలేదు! అయినా మేరీ వెళతానంటే తానెందుకు అంగీకరించాడు?’ కాలం అతని ఒంటిమీద సాలెపురుగు ప్రాకినట్లుగా కదలసాగింది.

“జాన్ ! …”

“మేరీ!

మేరీ తన చేతిలోని ఒక చిన్న మూటను జాన్ చేతిలో ఉంచింది. జాన్ తన సంచిని గడ్డివామి క్రిందనుండి బయటకు తీసి తన భుజానికి తగిలించుకొని మేరీ చేయి పట్టుకొని ముందుకు నడవసాగాడు. ఇద్దరూ చేయి చేయి పట్టుకొని వాయవ్య దిశగా నడుస్తున్నారు.

“మనం పగటిపూట దాక్కోవాలి తెలుసా? నేనిక్కడకు వచ్చే ముందు కొన్ని రొట్టెలు, జున్ను కొన్నాను. కాబట్టి మనకు ఆహారంగూర్చి చింతలేదు. మనం క్షేమంగా గమ్యం చేరతాము. నాకా నమ్మకముంది” జాన్ చెప్పుకుపోతున్నాడు.

మేరీ ఏమీ ప్రశ్నించలేదు. వాళ్ళు పగలు తప్పక దాక్కోవాలి. ఎందుకంటే మేరీ వాళ్ళ మామయ్య కొన్ని రోజులవరకు వాళ్ళకోసం తప్పక వెదుకుతాడు. ప్రొద్దుపొడవ డానికి కొంచెంముందుగా యింకా చీకటుండగానే వాళ్ళు పొలాల్లోని ఏదైనా ఒక గడ్డివామిలో దాగి, ప్రొద్దుపోయేంతవరకు అందులోనే ఉండేవారు.

వామిలోపల వాళ్ళు తయారుచేసుకొనే గూడు చాలా వేడిగా ఉండేది. కాని సమయమంతా భవి ష్యత్తునుగూర్చి గుసగుసలాడుతూ వారు గడిపేవారు. మేరీ శ్వాస అతనికి పాలు తేనెల్లో స్నానమాడినట్లుండేది. ఎండవేడిమి విపరీతంగా ఉంటేకూడ వారలానే కాసేపు నిద్రించేవారు.

చీకటిపడగానే అందులోంచి బయటకు వచ్చి తిరిగి రాత్రంతా ప్రయాణం కొనసాగించేవారు. రాత్రిళ్ళు వీచే చల్లని గాలి వారి ముఖాలకు సేదదీర్చేది. వారు ఆగ్నేయ దిశగా మలుపు తిరగక ముందు ఒక చిన్న కొండవాగులో నీళ్ళు త్రాగి, అక్కడ స్నానాలు చేసి తిరిగి ప్రయాణం కొనసాగించారు.

చాలా రోజులు రాత్రిళ్ళు ప్రయాణం చేసిన తర్వాత యిప్పుడు పగలు ప్రయాణం చేస్తున్నారు. జాన్ సమయాన్ని తన ప్రణాళిక ప్రకారం కచ్చితంగా పాటించాడు. మే నెల్లో జరిగే సంతలు, ఉత్సవాల కోసం మనుష్యులు పల్లె ప్రాంతాల్లో రద్దీగా తిరుగుతున్నారు.

గతంలో జాన్ స్నేహితుడూ ప్రస్తుతం ఒక చర్చి పాస్టరూ అయిన గిబ్స్, జాన్ మేరీల వివాహం జరిపించాడు. ఆ నూతన దంపతులు గిబ్స వద్ద రెండు దినాలు గడిపారు. అక్కడ ఉత్సవాల్లో నిమగ్నమైయున్న ప్రజలు వీరిని అంతగా పట్టించుకోలేదు.

మేరీకోసం తిరిగి వెళ్ళానన్న తన నిర్ణయాన్ని జాన్ ఎంతగానో అభినందించుకున్నాడు. ఆనందం, తన్మయత్వం, ఉత్సాహం, కార్యసాధన వీటన్నిటితోబాటు మేరీ తోడు అతనిలోని ఆలోచనా శక్తిని హరించివేసింది.

న్యూపోర్ట్ ప్యాగ్నెల్నుండి వాళ్ళు తూర్పున ఉన్న హంటింగ్టన్ మీదుగా ప్రయాణం చేశారు. అక్కడనుండి వారు ఈశాన్యదిశగా ప్రయాణంచేసి ఎలోలోని ‘బన్యన్ ఎండ్’కు వచ్చారు.

“ఈమె మేరీ … అవునా?” ఆశ్చర్యం నిండిన ముఖంతో అన్నాడు జాన్ తండ్రి, జాన్ ఆమెను తన భార్యగా పరిచయం చేసిన తర్వాత.

“ఏ ప్రాంతంనుండి వచ్చావు మేరీ?” జాన్ సవతి తల్లి ఆనీ అడింది

“మేరీది సముద్రతీర ప్రాంతం” – జాన్ అన్నాడు. ఆ వెంటనే నిజాన్ని ఒక అబద్ధానికి మార్చాడు – “మేము ఈశాన్యదిక్కునుండి రావడం నీవు చూళ్ళేదూ?” “అవును ఆ ఫెన్స్ ప్రాంతంనుండి వచ్చారుకదూ?” ఆసక్తిగా అంది ఆనీ. అద్భుత మైన ఆ భూభాగం జలప్రళయంనుండి తప్పించబడిందని విన్నాను. మీ యింటి పేరేంటమ్మా?”

“ఇప్పుడామె యింటి పేరు బన్యనే!” నవ్వుతూ చెప్పాడు జాన్.

ఎలోలోగాని, బెడ్ఫోర్డ్లోగాని మేరీ పుట్టింది పేరు తెలిసే అవకాశం లేదు. తన సవతి తల్లి ఈ విషయంలో ఆరాతీసే అవకాశం జాన్ యివ్వలేదు. ఎందుకంటే ఎలోలోని ప్రధాన మార్గంలో ఒక చిన్న యింటిని జాన్ అద్దెకు తీసుకున్నాడు.

ఆ యింటి వెనక భాగంలో జాన్ ఒక కొలిమి ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. జాన్ కూడబెట్టిన కొంత డబ్బు, మేరీ బట్టలమూటలో దాచితెచ్చుకొన్న రెండు పుస్తకాలు తప్ప ఈ జంటకు వేరే ఆస్తిపాస్తుల్లేవు.

సైన్యంలో ఉండేటప్పుడు జాన్ పుస్తకాలనుగురించీ, ప్రచురణకర్తలనుగురించీ ఎంతో తెలుసుకొన్నప్పటికీ తనలాంటి సామాన్యులు ఆ పుస్తకాల్ని కలిగి ఉండటం జాను ఆశ్చర్యాన్ని కలిగించింది. లోకంలో అత్యంత నిరుపేదయైన మేరీ ఒక్కటికాదు, రెండు పుస్తకాలు సంపాదించింది.

“మా నాన్న నాకోసం ఈ రెండు పుస్తకాలు వదలిపెట్టిపోయాడు. ఆయన చాలా దైవభక్తిగలవాడు” మేరీ గర్వంగా చెప్పింది.

మేరీకి సరైన పరిజ్ఞానం లేకపోయివుంటే ఆ విషయంమీద జాన్ వాదన పెట్టుకొనేవాడే. “ఆ పుస్తకాలేంటి?” అడిగాడు జాన్.

“బిషప్ లూయిస్ బేలి వ్రాసిన ‘పవిత్రతను అభ్యసించుట’ (The Practice of Piety by Bishop Bayly), పాస్టర్ ఆర్థర్ డెంట్ వ్రాసిన ‘పరలోకానికి సాధారణ మనిషి త్రోవ’ (The Plain Man’s Pathway to Heaven by Pastor Arthur Dent). ”

ఆ పుస్తకాల్లోని విషయంపై ఆసక్తి లేకపోయినప్పటికీ చదవడంలో తనకు ప్రావీణ్యత ఉందని చెప్పడానికి జాన్ మేరీతో కలిసి చదవడం ప్రారంభించాడు. బిషప్ బేలీగారి పుస్తకంలో వ్రాయబడిన ‘పాపులు పశ్చాత్తాపం పొందితే కృప సమృద్ధిగా ఉంటుంది’ అన్న సత్యం బాగానేవుందిగాని అది అసందర్భంగా ఉన్నట్టు జాన్కు తోచింది.

అది కొద్దిగా తనకు అన్వయింపబడి ఉంది. ధనవంతుల్లో అతి కొద్దిమందిమాత్రమే రక్షించ బడగలరని బేలి విశ్వసించాడు. ఈ మాట జాన్కు బాగా నచ్చింది. బేలి పుస్తకం చదవడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. మేరీ పుస్తకాన్ని చాలా బాగా చదవినట్టుంది. అందులో ఏదో మేరీని కలవరపరచినట్లుందిగాని అదేదో జాను తెలీదు.

ఆర్డర్ డెంట్ అనే మత బోధకుడు వ్రాసిన “పరలోకానికి సాధారణ మనిషి త్రోవ” అనే ఆమె రెండో పుస్తకం జాన్ ఊహల్ని తుపానులా తాకింది. ఈ పుస్తకం బేలీగారి పుస్తకంతో అనేక విషయాల్లో ఏకీభవించింది.

ధనవంతుడుగా ఉంటూ సుగుణాలు కలిసి ఉండుటలోగల యిబ్బందులనుగూర్చి ఈ పుస్తకంలో చక్కగా వివరించబడింది. ఇది ఒక కథలాగా కొనసాగుతుంది. మే దినాల్లో ఒక దేవదారు వృక్షం క్రింద కూర్చొన్న నలుగురు వ్యక్తుల సజీవ సంభాషణతో కూడినదీ పుస్తకం.

ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ‘యాంటిలేగన్’ అనే రౌతు. ఇతడు ‘జీవితమంటే ఆనందించడం’ అనే విషయాన్ని ఖండించేవాడు. జీవితంపట్ల అతనికున్న నిరాశా దృక్పథం జాన్ విన్న ‘రాంటర్ల’ మాటల్లాగా అనిపించింది. యాంటిలేగన్ దాదాపు అన్నింటినీ హేళనచేస్తాడు. ‘ఫిలగథాస్’ అనే మరో వ్యక్తి నిజాయితీ కలిగిన లౌకికుడు.

‘అసునేటోస్’ అనే మరొక వ్యక్తి అమాయకుడైన వెర్రివాడు. ఇక నాల్గవ వ్యక్తి ‘థియోలోగస్’ ఒక వేదాంతి. వీరి మధ్య సంభాషణ హాస్యధోరణిలో కొనసాగుతుంది. వాళ్ళ వ్యాఖ్యానాల్లో ఆతిథ్యంలాంటి సుగుణాలు తిండిబోతుతనంలాంటి చెడుతనంగా వక్రీకరించబడతాయి.

“విషయాన్ని విశదీకరించేందుకు ఎంత మంచి హాస్యధోరణి ఉపయోగించబడింది!” జాన్ మేరీతో అన్నాడు. “విషయాలన్నీ సామాన్య వాడుక భాషలో చాలా విశదంగా వివరించబడ్డాయి. ఇంతకుమునుపెన్నడూ యిలాంటి పుస్తకం నాకెదురవలేదు.

ఇది మంచి కాలక్షేపాన్నిచ్చే పుస్తకం. ఇప్పుడు గుర్తొస్తోంది, న్యూపోర్ట్ ప్యాగ్నెల్ స్థావరంలోని సైనికులు కాలక్షేపంకొరకు యిలాంటి పుస్తకాలను బిగ్గరగా చదివేవారు. ఒక పుస్తకంలో సర్ వరల్డ్లీ వైస్ లాంటి వ్యక్తులమధ్య చాలా ఉత్సాహాన్ని కలిగించే సంభాషణలు కొనసాగుతాయి.

వేరొక పుస్తకంలో హింస, హేతువు, నిశ్చయత అనే వ్యక్తులు బంధింపబడి స్వేచ్ఛ, అమాయకత్వం, సువార్త అనే న్యాయనిర్ణేతలు మరియు దేవుని ఉగ్రత అనే న్యాయాధిపతి ముందు నిలువబడిన సన్నివేశంలోని వారి సంభాషణ చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది” పుస్తకాలనుగురించి తనకంతా తెలుసునన్నట్టు పెద్ద లెక్చరిచ్చాడు జాన్.

“సువార్తా?” – మేరి మధ్యలో కలుగజేసికొని జాన్ మాటలకు అంతరాయం కలిగించింది – “ఒక మనిషి దైవికంగా మా నాన్నలాగా ఉండాలంటే ఈ సువార్త జ్ఞానం చాలా అవసరం.”

“ఆయన ఒక్కొక్కరి జీవిత వ్యవహారాల్లో జోక్యం చేసికొని వారినెలా సరిచేసేవాడో యిప్పుడు నాకు మళ్ళీ చెప్పబోతున్నావా?”

“ఈ సువార్త సత్యాన్నిగూర్చి వినేందుకు నాతో చర్చికి రావా జాన్?”

“చర్చికి తప్పక వెళ్ళాలన్నది ఇంగ్లాండు దేశ చట్టం గనుక నేను నా చిన్నతనంనుండి చర్చికి వెళుతూనే ఉన్నాను. కాని ఇప్పుడిక అది చట్టం కాదు. తప్పకుండా చర్చికి వెళ్ళాలన్న నిబంధనేం లేదు” జాన్ అన్నాడు.

“నీవు తీసుకెళితే తప్ప నేను చర్చికి వెళ్ళలేను” మేరీ దిగులుగా అంది.

మోక్షానికి సాధారణ మనిషి త్రోవ’ అనే పుస్తకంతో ప్రోత్సహించబడ్డ జాన్ తాను సైనిక స్థావరంలోనున్నప్పుడు చదివిన అనేక కథల్ని చెప్పుకుపోతున్నాడు. తాను వాటన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొన్నందుకు తనకే ఆశ్చర్యంగా ఉంది. “ఈ కథల్ని చదివి దాదాపు నాలుగు సంవత్సరాలైంది.”

“ఈ కథల్లో ఉపయోగించిన విచిత్రమైన పేర్లవల్లే నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో గలిగావు” మేరీ అంది.

“సరిగ్గా చెప్పావు. ఈ క్రొత్త విధానమే జ్ఞాపకశక్తిని పెంచుతోంది. అది యిప్పుడు నాకు తెలుస్తోంది. పాస్టర్ డెంట్స్ గారి పుస్తకాల్ని నేనెంతగా యిష్టపడతానో ఆయన ఉపయోగించిన థియోలోగస్, అసునెటాస్ లాంటి అపరిచితమైన పేర్లు అంతగా నాకు చిరాకు కల్గిస్తాయి. అవి గ్రీకు లేదా లాటిన్ భాషల్లోని పదాలై ఉండాలి” జాన్ అన్నాడు.

“అవి లాటిన్ పదాలని అనుకొంటాను” – మేరీ అంది – “అలాంటి పదాలు నాకు చర్చిలో ఎక్కువ వినిపిస్తుంటాయి. నేనిప్పుడు చర్చికి వెళ్ళలేకున్నాను. నన్ను చర్చికి తీసుకెళ్ళవా జాన్?”

జాన్ అంత కఠినమైనవాడేం కాదు. మేరీ దీనమైన కళ్ళు అతని గుండెను కరిగించివేసాయి.

ఆ తర్వాత జాన్ ఎల్టాలోని చర్చికి మేరీని తీసుకెళ్ళడం ప్రారంభించాడు. చర్చిలో పాస్టర్ క్రిస్టఫర్ హాల్ చేసే ప్రసంగాలను అతడు పెద్ద ఆసక్తిగా వినడంలేదు. చర్చి అలంకరణను, చర్చి అందాన్ని అతడు బాగా ఆస్వాదిస్తాడు. చర్చి తన జీవితంలో అత్యంత సౌభాగ్యవంతమైన అనుభూతి.

ఆ అనుభూతి కోసం తాను తపించిపోయేవాడు. ఇప్పుడు మేరీతోకూడ క్రమంగా చర్చికి వెళ్ళడంవల్ల పాస్టర్ గారి వస్త్రధారణ, బిషప్ గారి దుస్తులు అతడు బాగా గమనించగలుగుతున్నాడు.

పొడవైన నిలువుటంగీ, దానిపైన పొడవైన కండువా, మెడపట్టీ, బిషప్ తలపైని కిరీటం – వీటన్నిటినీ జాన్ చాలా ఆసక్తిగా పరిశీలించడం ప్రారంభించాడు. అలాగే పాస్టరుగారికి సహాయకులుగా ఉండే వారి దుస్తులుకూడ జాన్కు ఆసక్తిని కలిగించేవి.

ఏదో ఒక రోజు తానుకూడ ఇలాంటి దుస్తులు ధరిస్తాడేమో! అతడు మేరీని ఉదయం, సాయంత్రం చర్చికి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత ప్రతి ఆరాధనకు ముందు గంట కొట్టేందుకు జాను పాస్టరుగారు అనుమతినిచ్చారు.

“ఆ త్రాడు పట్టుకొని వ్రేలాడుతూ అద్భుతమైన ఈ గుడిగంటలు మోగిస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. అలా కొడుతున్నప్పుడు వచ్చే ప్రకంపనలు బిగుసుకొన్న నా చేతులనుండి అరికాలివరకు ప్రవహించడాన్ని నేను అనుభవిస్తుంటాను” ప్రతి ఆరాధన తర్వాత జాన్ మేరీతో అనేవాడు.

పాత్రలకు కళాయి వేసేవాడిగా తనకున్న వివిధ లోహాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని జాన్ మొదట ఆ గుడి గోపురంలోని ఐదు గంటల్ని తిలకించాడు. సులభంగా కరిగిపోయి, మట్టిమూసలో పోయబడు ‘గంటలోహం’గా పిలువబడే ఒక విశిష్టమైన యిత్తడి మిశ్రితలోహంతో ఆ గంటలు తయారుచేయ బడ్డాయి.

ఆ తర్వాత క్రమబద్ధమైన వాటి స్వరాన్ని అతడు ఆస్వాదించడం నేర్చుకున్నాడు. అతనిలో ఎక్కడో సంగీతంపట్ల అభిరుచి ఉన్నట్లనిపించింది. ఆ గంటలనుండి వచ్చే ఆది, మధ్యమ, ఉచ్ఛ స్వరాలు తాను వాటిని మ్రోగించిన తర్వాత గంటల తరబడి క్రమబద్ధమైన రీతిగా తన చెవుల్లో అలానే ప్రతిధ్వనిస్తూ ఉండేవి. మళ్ళీ ఆ గోపురంవద్దకు వెళ్ళి గంటలు కొట్టే సమయానికై అతడు ఆసక్తితో ఎదురుచూసేవాడు.

గతంలో తాను ఒంటరిగా ఉన్నప్పటి జీవితానికీ, యిప్పుడు మేరీతో కలిసి జీవించే తన జీవితానికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడతడు ఊర్లో దాదాపు అందరిచేత గౌరవించబడుతున్నాడు. అయితే ప్రతి ఆదివారం మధ్యాహ్నం పచ్చికమైదానాల్లో ఆడటంమాత్రం మానలేదు. తనకు తెలియకుండానే తానింకా ఒట్టుపెట్టుకొంటున్నాడు. కాని అతని జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. 1649 ఆఖర్లో అతని జీవితంలో ఒక పెను మార్పు వచ్చింది. తాను తండ్రి కాబోతున్నాడు!

“అన్ని సౌకర్యాలూ అమర్చబడివున్న యింత చక్కని కుటీరాన్ని అద్దెకు తీసుకొనే టప్పుడు ‘మనకింత యిల్లు అవసరమా?’ అనుకొన్నాను. కాని అలా తీసుకోవడం మంచిదైంది” సంతృప్తితో అన్నాడు జాన్.

“బహుశా, దేవుడు నిన్నలా ప్రేరేపించి ఉంటాడు.”

“ఆయ్యుండొచ్చు” జాన్ అన్నాడు అంగీకారంగా.

ఆదివారంనాడు పనిచేయడాన్నీ, ఆటలాడటాన్నీ ఖండిస్తూ ఒక ఆదివారం పాస్టర్ హాల్ చేసిన ప్రసంగాన్ని విని జాన్ అదిరిపడ్డాడు. ఆ ప్రసంగం తనకు చక్కగా అన్వయింపబడుతుంది. ‘ “కర్రా-బిళ్ళా” ఆట ఆడటంలో తప్పేంటి? తనుగాని, తన స్నేహితులుగాని యిప్పుడు పందెంకట్టి ఆడ్డం లేదు. తనపై పందెం కాచేవారెవరూ యిప్పుడు లేనప్పటికీ ఈ మార్పు ఒక సుగుణంగా తాను భావిస్తున్నాడు.

ఈ ఆటలో తన నైపుణ్యం చాలా ప్రసిద్ధికెక్కింది. తను మెప్పు పొందడం తప్పా?’ ఆ ప్రసంగం అర్థం లేనిదిగా కొట్టిపారేశాడు జాన్. ఆ ప్రసంగాన్ని తాను పెద్దగా వినకపోవడం మంచిదైంది.

ఆ రోజు మధ్యాహ్నం పచ్చికమైదానంలో జాన్ కర్రా-బిళ్ళా ఆటలో కొట్టిన మొదటి దెబ్బకే బిళ్ళ గిరగిరా తిరుగుతూ పైకి లేచి, గాల్లో సుడులు తిరిగింది. అతడు తన భుజాలు త్రిప్పి, మణికట్టును చాచి గర్వంగా దానివైపు చూశాడు. జాన్ కొట్టే రెండో దెబ్బకు బిళ్ళ తప్పకుండా ఒక మైలు దూరంలో పడి ఉండేదే!

“నీ పాపాన్ని విడిచి నీవు పరలోకం వెళ్తావా? లేక నీవు నీ పాపాల్లోనే జీవించి నరకానికి వెళ్తావా?” ఒక స్వరం అతని గుండెను పిండుతూ ఆకాశంనుండి ప్రశ్నించింది.

జాన్ తన చేతిలోని కర్రను క్రిందపడేశాడు. ‘తనను ప్రశ్నించిందెవరు?’ జాన్ తిరిగి పైకి చూశాడు. తానేదో పెద్ద తప్పు చేసినవాడిలా అతడు వ్యాకులపడ్డాడు. ఇంత విచారం తనకెప్పుడూ కలగలేదు. అతడు హ్యారివైపూ, రోజరై వైపూ చూశాడు. వాళ్ళిద్దరు అతనివైపు వింతగా చూస్తున్నారు.

“మీరది విన్నారా?” జాన్ వాళ్ళనడిగాడు.

“నీవు కొట్టకుండా వదిలేసిన బిళ్ళ క్రిందపడ్డ శబ్దంమాత్రం విన్నాను” – ఎగతాళిగా అన్నాడు హ్యారీ – “నువ్వు ప్రక్కకు జరుగు. ఇది నా వంతు” హ్యారీ తిరిగి అన్నాడు.

హ్యారీ తన వంతుగా కర్రను తీసుకొంటూ ఉంటే జాన్కు తల తిరుగుతోంది. ‘తనలో ఎప్పుడూ యిలాంటి అపరాధ భావన కలగలేదు. తనలోని ఈ అపరాధ భావన తొలగిపోవాలంటే తనేం చెయ్యాలి? తను తప్పు చేస్తోంది నిజమే. తనను గద్దించిన ఆ స్వరంకూడ అదే చెప్పింది.’

మళ్ళీ తన వంతు వచ్చినప్పుడు జాన్ ఆడేందుకే నిశ్చయించుకున్నాడు. ‘ఇప్పుడు తాను చేస్తున్న పాపం విషయంలో తనేం చేయగలడు? తను తప్పిపోయి ఉన్నాడంటే తప్పిపోయే ఉన్నాడు. తను పాపంకూడ చేసివున్నాడు.’ ఒక పెద్ద ఊపుతో బిళ్ళను ఆకాశంలోకి కొట్టాడు.

తన జీవితంలో మొట్టమొదటిసారిగా తాను పాపినని ఆ మధ్యాహ్నం జాన్ తెలుసుకొని యింటికెళ్ళాడు. దేవుడుగాని, దేవదూతగాని ఆ మాట పలికి ఉంటారని తనకు తెలుసు. ఆ తర్వాత ఎల్టాలో అంత మంచిపేరులేని ఒక స్త్రీకి సంబంధించిన దుకాణం ముందు జాన్ హ్యారీతో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆమె దుకాణంలోనుండి దూసుకొచ్చి జాన్ ముందు నిలబడింది.

“నువ్వు నాకు అసహ్యం పుట్టిస్తున్నావు జాన్ బన్యన్. నీలాగ ఒట్టుపెట్టుకొనేవాణ్ణి నేనెప్పుడూ చూళ్ళేదు” ఆమె అంది కోపంగా.

“నేనా?” నమ్మలేనట్లుగా అడిగాడు జాన్.

“ఎల్లో నీలాగ దేవునిపట్ల భయంభక్తీ లేనివాళ్ళెవరూ లేరు. యౌవనస్థులు నిన్ను ఆదర్శంగా తీసికొని చెడిపోకూడదని నేను దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను.”

“ఆమె ఎందుకలా అంది?” ఆమె దుకాణంలోనికి వెళ్ళిన తర్వాత జాన్ హ్యారీతో అన్నాడు.

“ఆమె మాటల్ని పట్టించుకోకు. ఇతరులకు నీతులు చెప్పేంత గొప్ప మనిషేం కాదామె. నువ్వు ఒట్టుపెట్టుకొంటావు. అయితే ఏంటట?”

అయితే అది జాను కలవరపెట్టింది. ఎవరో తనను లాగి చెంపమీద కొట్టినట్టని పించింది. ‘నైతిక విలువల్లేని ఒక స్త్రీకూడ అసహ్యించుకొనేంత పాపాత్ముడా తను? తను తన తండ్రంత చెడ్డవాడేం కాదు.

సైన్యంలో ఉన్నప్పుడు కొన్ని బూతు మాటలు తాను నేర్చుకొని ఉండొచ్చు. అయితే ఆ గ్రామీణ ప్రాంతంలో తన్నంతగా మెచ్చుకొనే వాళ్ళంతా వాస్తవానికి తన్నొక చండాలునిగాను, బూతులు తిట్టే వెధవగానూ భావిస్తు న్నారా? జాన్ బన్యన్ అనే తాను పనికిమాలిన మూర్ఖుడైన అసునేటోస్ కంటే చెడ్డవాడా?” ఈ విషయం తీవ్రమైన అవమానంగా తోచింది జాను.

పరలోకంలోని దేవుడు తనను మళ్ళీ ఒక బాలుడుగా చేస్తే బాగుండును. అప్పుడు దైవసంబంధమైన మంచి మాటలు మాట్లాడ్డం తాను నేర్చుకుంటాడు – “దేవా దయచేసి ఈ బూతుమాటల్ని నా నోట్లోనుండి తీసెయ్యి. ”

ఆ రాత్రి భోజనం దగ్గర తన మనస్సులోని భావాలను అణచుకొనేందుకు జాన్ మేరీతో ఏవేవో విషయాలు మాట్లాడ్డం ప్రారంభించాడు. జానైవైపు విచిత్రంగా చూస్తోంది మేరీ. “ఏం అలా చూస్తున్నావు?” అమాయకంగా అడిగాడు జాన్. అతని మనస్సేం బాగోలేదు. జరిగిన సంఘటనలు అతనిలో అలజడిని రేపుతున్నాయి. “నేనేమన్నా తప్పు మాట్లాడానా?” మళ్ళీ అడిగాడు.

మేరీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “నీ మాటల్లో ఎక్కడా తప్పులేదు.”

“నిజంగానా?”

“ఇంకొంచెం క్యారెట్ పులుసు వేసుకో జాన్” ప్రేమగా అంది మేరీ.

భోజనాల తర్వాత యిద్దరూ కలిసి బైబిల్ చదువుకున్నారు. జాన్ మేరీకోసం కొన్న ఏ వస్తువుకూడ ఈ క్రొత్తరకం బైబిలు యిచ్చినంత తృప్తిని ఆమెకు యివ్వలేదు. జారీచేశాడు. ఈ రకమైన బైబిల్ను తయారుచేసేందుకు క్రాంవెల్ స్వయంగా ఆజ్ఞలు జాన్ ఈ బైబిలును చాలా ఆసక్తితో చదవసాగాడు.

ఈ విషయం తెలిసి గిబ్స్ ఎంతో సంతోషించాడు. అందులో అద్భుతమైన కథలున్నాయి. ఇది దేవుని వాక్యమని జాన్ యిప్పుడు మనస్పూర్తిగా నమ్ముతున్నాడు. అందులో దేవుడిచ్చిన పది అద్భుతంగా ఉన్నాయి. దైవికంగా జీవించడానికి అవి చాలా ఉపయోగపడతాయి. ‘కాని యివి దేవుని హృదయంలోంచి వచ్చాయా లేక మోషే మెదడులోంచి వచ్చాయా?’

ఒక రోజు రాత్రి మేరీ యింకా బిడ్డను ప్రసవించకముందు అంచెలంచెలుగా నొప్పులు రాసాగాయి. ఈ నొప్పులకు అర్థమేంటో మేరీకి తెలియలేదు. అయితే జాన్ మేరీ కళ్ళలో భయాన్ని చూశాడు. జన్మనివ్వడం ఒక విపత్తుతో కూడుకొన్న పని. ఆవిడ జాన్ ప్రక్కన బాధతో మూల్గుతూ మెలికలు తిరుగుతూ తెరలుతెరలుగా వచ్చే నొప్పుల్ని ‘ఏం కాదులే’ అన్నట్టు నటించడానికి ప్రయత్నం చేస్తోంది.

తన మేరి బాధతో సుడులు తిరగడం అన్నది జాన్ ఆలోచనల్లో అత్యంత దురదృష్టకరమైన సంఘటన. జాన్ తన తల పైకెత్తి నిశ్శబ్దంగా ప్రార్థన చేశాడు, “దేవా! నీవు కాన్పు నొప్పులనుండి నా భార్యను కాపాడి యీ రాత్రి ఆమెకేం కష్టం కలగకుండా చేశావంటే నీవు హృదయ రహస్యాలను ఎరిగే దేవుడవని నిశ్చయంగా నేను తెలుసుకోగలను. ” వెనువెంటనే మేరీ మూల్గటం మాని గాఢ నిద్రలోకి జారుకుంది.

“అది నిజంగా అద్భుతం!” ఆ మరుసటి రోజు జాన్ తనలో తాననుకొన్నాడు.

ఆ తర్వాత చాలా వారాలవరకు అంటే 1650 జూలై నెలలో పురిటి నొప్పులు వచ్చేవరకు మేరీకి మధ్యలో ఎటువంటి నొప్పులు రాలేదు. ఆ దినం జాన్ సవతి తల్లి ఆనీ మేరీకి సహాయంగా వచ్చింది.

జాన్ తండ్రి అతడికి ధైర్యం చెబుతున్నాడు. కాన్పు చాలా కష్టంగా సుదీర్ఘంగా కొనసాగింది. కొన్ని గంటల తర్వాత పిడికిళ్ళు బిగబట్టి ఏప్రికాట్ పండులాంటి ముఖంతో ఉన్న ఆడశిశువు మేరీ ప్రక్కన పండుకొని ఉంది. ఈ క్రొత్త తలిదండ్రులు తమ బిడ్డకు బాప్తిస్మమిప్పించి ‘మేరీ’ అని నామకరణం చేశారు. అయితే ఆ బిడ్డ గ్రుడ్డిదని తెలుసుకున్నాక వాళ్ళ ఆనందం కాస్త ఆవిరైపోయింది.

‘ఎందుకిలా అయింది?’ జాన్ తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ‘అంతా సవ్యంగా, మృదువుగా సాగిపోతుంటే ఎందుకిలా జరిగింది? తాను మారుమనస్సు పొందలేదా? లేక పది ఆజ్ఞలను ఆచరించే ప్రయత్నం చెయ్యడంలేదా? ఎప్పుడైనా ఒకవేళ దేన్నైనా భంగపరచివుంటే తాను వెనువెంటనే పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకోలేదా? ఎందుకు దేవుడు తనను యింత కఠినంగా చూస్తున్నాడు? బహుశ తాను నిజంగా మార్పునొంద లేదేమో?’ జాన్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

‘మేరీ ముందు నొప్పులు పడిన రాత్రి తాను దేవుణ్ణి శోధించాడా? అదేనా కారణం? లేక ఆ రాత్రి దేవుడు తన ప్రార్థనకు జావాబిచ్చాడన్నది తనకు సందేహమా? లేక తాను యింకా మానుకోవలసినవి మానకుండా కొనసాగిస్తున్నాడా? అవును తను యింకా అల్లరి నృత్యాలు చేస్తూనే ఉన్నాడు.

పోయిన మేడే నాడు మేరీ గర్భిణిగా భారంతో కూర్చొనివుంటే తాను మాత్రం మే సంబరాల్లో గంటలతరబడి నాట్యం చేస్తూ ఆనందించసాగాడు. ఆ తర్వాత చర్చీలో గంటలు, వాటిని మ్రోగించడంలో సంతోషాన్ని అనుభవించడం మాత్రమేగాక వాటిని మ్రోగించేవానిగా గర్వించాడుకూడా.’

జాన్ నాట్యానికీ, గంటలు మ్రోగించే పనికీ స్వస్తి చెప్పాడు. కాని ప్రతి ఆరాధనకు ముందు గంటల గోపురంలో గంటలు మ్రోతలతో పులకించి మైమరచిపోయేవాడు. అయినా కొన్ని పర్యాయాలు అంధురాలైన తన కూతురును తలచుకొని కృంగిపోయే వాడు.

‘ఆమె ఎంత నిస్సహాయురాలు! పైనున్న గుడి గంటలలో యే ఒక్కటైనా అమాంతం ఊడి తన నెత్తిన పడకూడదా!’ జాన్ యుద్ధంలో పని చేశాడు. యుద్ధంలో దేహాలు చితికిపోగా, ఛిద్రమైన కీటకాల్లా కొన ఊపిరితో కొన్ని క్షణాలు విలవిల్లాడే అనేకమందిని తాను చూశాడు. తాను మరణించడానికి ముందు తన ఆఖరి తలంపులు ఎలా ఉంటాయో తనకు తెలుసు.

“అయ్యో! పాపం నా మేరీలు. వాళ్ళను అభాగ్యులుగా చేసి నేను ఎలా వెళ్ళగలను?”

జాన్ గంటల శబ్దాలు వినేందుకు గంట గోపురానికీ, చర్చికీ మధ్యనున్న గోపురం వెనక్కు వచ్చాడు. అతని మనస్సులో అప్పుడొక ఊహ : ‘ఆ గంటల్లో ఒకటి ఊడి నేరుగా క్రిందకు పడకుండా ఏటవాలుగా వచ్చి ఒక గోడకు గుద్దుకున్నట్టూ, ఆ తర్వాత తనమీద పడి తనను నుజ్జునుజ్జు చేసినట్టూ’ – కనుక చర్చి గంటల శబ్దం వినడానికి జాన్ చర్చినుండి బాగా దూరంగా వెళ్ళసాగాడు.

అసలు గోపురం మొత్తం కూలితే ఏమౌతుంది?” చర్చి గంటలు ఎలవాళ్ళను చర్చికి రమ్మని గుర్తుచేసినట్లు జాన్కుకూడ గుర్తు చేసేవి. జాన్ ఆలస్యంగా చర్చికి వెళ్ళేసరికి గంటల శబ్దం కాస్త ఆగిపోయేది. జాన్ గంటలు కొట్టే పనిని పూర్తిగా వదులుకున్నాడు. అలాగే నాట్యం చేయడాన్ని కూడా.

రోజురోజుకూ జాన్ లో మార్పు రాసాగింది. అలా అతనిలో ఎంత మార్పు వచ్చిందన్న విషయం తెలుసుకోడానికి యీ సంఘటన చాలు. ఒక రోజు వీధిలో జాన్ తన పాత స్నేహితుడు హ్యారీని కలుసుకున్నాడు. “ఎలా ఉన్నావ్ హ్యారీ?” ముభావంగా అడిగాడు జాన్. వాస్తవం ఏమిటంటే తన గత పాపమార్గానికి హ్యారీయే కారణమన్న ధోరణితో జాన్ చాలా వారాలుగా అతణ్ణి కావాలని తప్పించుకు తిరుగుతున్నాడు.

“ఓహ్! చాలా బాగున్నాను బిషప్ జాన్ గారూ!” వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు హ్యారీ అదనంగా దేవుణ్ణిగురించి చర్చి గురించి కొన్ని దూషణలు జోడిస్తూ. “హ్యారీ! నువ్వు దేవునికి దూరంగా ఉంటూ చనిపోతే నీ గతేమౌతుందో నీకు తెలుసా?”

“నాలాంటి వాళ్ళు లేకుండా సైతాను ఈ లోకంలో ఏం చెయ్యగలుగుతాడు” తర్వాత జాన్ను దూషిస్తూ నడిచి వెళ్ళాడు హ్యారీ.

విశ్వాస ప్రయాణం

విశ్వాస ప్రయాణం

హ్యారీ మాటలకు జాన్ అదిరిపడ్డాడు. ఒకప్పుడు జాన్ ఎలాగున్నాడో యిప్పుడు హ్యారీ అచ్చం అలాగే ఉన్నాడు. పాపాన్నిగూర్చిన ఆలోచనే లేదతనికి. పాపం అంటే హ్యారీకి ఒక తమాషాగా ఉంది.

జాన్ యిప్పుడు చాలా నీతిమంతునిగా ఉన్నాడు. పరిశుద్ధుడైన యోహాను, పరిశుద్ధుడైన పౌలు వ్రాసిన గ్రంథాలు తనను ఎంతో ఆకర్షించినా బైబిల్ లోని చారిత్రక గ్రంథాలనుకూడ అతడు ఆసక్తిగా చదివాడు.

“నేనిప్పుడొక దైవికమైన మనిషిని” తనలో తాను ధీమాగా అనుకొన్నాడు జాన్. కొన్ని వారాల తర్వాత ఆకు రాలు కాలంలో ఒక రోజు తన వ్యాపారాన్ని తిరిగి అతడు ప్రారంభించాడు. ఎండవేళ వీధుల్లో శ్రమతో నడుస్తూ – “పాత్రలకు కళాయి వేస్తాం … పాత్రలకు కళాయి వేస్తాం …” అని అభ్యర్థనపూర్వకంగా అరుస్తూ తిరగ సాగాడు.

తనలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ భార్యలు కూతుళ్ళు కాబోలు చాలామంది స్త్రీలు వీధిలో ఒక గుడిసె ముందు కూర్చోవడం జాన్ చూశాడు. వాళ్ళు దేవునిగూర్చి మాట్లాడుకోవడం అతనికి సంతోషాన్ని కలిగించింది.

జాన్ మంచి మాటకారి కాబట్టి ఆ ఆడవాళ్ళను మెప్పించి ఒకటో రెండో పాత్రలకు కళాయివేసే అవకాశాన్ని కల్పించుకోడానికి యిది మంచి సమయమనిపించింది.

“నమస్కారం అమ్మగారు! దేవునిగూర్చి మీరు మాట్లాడుకోవడం విన్నాను.” “మా సహవాసంలో చేరయ్యా” వాళ్ళలో ఒక స్త్రీ జవాబిచ్చింది. తిరిగి జన్మించడాన్ని (నూతన జన్మ) గూర్చి ఆమె మాట్లాడుతూ ఉంది.

వాళ్ళ సంభాషణ మధ్యలో చొరబడేందుకు అవకాశంకోసం జాన్ ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ సమయం రానేరాలేదు. వాళ్ళు తనకు తెలిసిన సాధారణ మనుష్యుల్లా మాట్లాడ్డం లేదు. అటువంటి పరిశుద్ధతతోకూడిన స్థితికి మేరీ మాత్రమే రాగలిగింది.

తమ హృదయాల్లో దేవుడెలా జీవిస్తూ ఉన్నాడో, అయినప్పటికీ తాము యింకా ఎంత ఘోరపాపులుగా ఉన్నామోనన్న విషయాలను ఆ స్త్రీలు చర్చించు కుంటున్నారు. వారు యేసుక్రీస్తుపట్ల తమ మితిలేని ప్రేమను వెలిబుచ్చడమేగాక, సాతాను శోధనలను జయించడానికి యేసుక్రీస్తు ఎలా తమకు సహాయంచేశాడో వాటినిగూర్చి ప్రతి స్త్రీ సాక్ష్యమివ్వసాగింది.

వాళ్ళు క్రీస్తుయెడల తమ ప్రేమను వ్యక్తీక రించడంలోని సహజత్వానికీ, వాళ్ళ ముఖాలలో కనిపించే సంతోషానికీ జాన్ ఆశ్చర్య పడ్డాడు. ఈ సాధారణ స్త్రీలు ప్రకాశమానంగా ఉండటమే గాక, పాస్టర్ గారు కూడా మాట్లాడలేనంత అనర్గళంగా, సమర్పణాపూర్వకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అందరిలా లేరు. పరిశుద్ధతతో ప్రత్యేకంగా కన్పిస్తున్నారు.

ఇప్పుడు జాన్కు అర్థమైంది – తిరిగి జన్మించడమనేదాన్నిగూర్చి తనకేం తెలియదని. ఈ స్త్రీలు కనుగొన్న విధంగా తనెప్పుడూ బైబిల్లో ఆనందాన్ని కనగొనలేదు. పాపాన్నిగూర్చి వాళ్ళకున్నంత బలమైన అవగాహన తనకు లేదనిపించింది జాన్కు.

“క్షమించండమ్మా! నేను వెళ్ళాల్సి ఉంది” – చివరగా అన్నాడు జాన్. మరోసారి తన్నుతాను వెర్రిబాగుల అసునేటోస్తో పోల్చుకున్నాడు అతడు.

మేరీతో కలిసి బైబిల్ చదివేందుకు జాన్ త్వరత్వరగా యింటికెళ్ళాడు. ఆ తదుపరి నెలల్లో అతడు బైబిలు చాలా ఆసక్తిగా చదివాడు. పసిపాప మేరీ గ్రుడ్డిదైనా చాలా తెలివిగలదనే సూచనలు కనపడినప్పుడు జాన్ తాను చాలా దీవించబడినట్లుగా భావించాడు.

బెడ్ఫోర్డ్లోని ఆ స్త్రీల దగ్గరకు జాన్ పలుమార్లు వెళ్ళాడు. గతంలో మాదిరి వాగుడుగాయలాగా లొడలొడా మాట్లాడాలనే శోధనను అతడు జయించ సాగాడు. తన ప్రతి ఆలోచనను వాక్య ప్రామాణికతతో పోల్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేసేవాడు.

జాగ్రత్తగా విని ప్రశ్నలు వేసేవాడు. వారి దగ్గర దేవుని సన్నిధిని అనుభవించే విధానాన్ని అతడు నేర్చుకున్నాడు. ఇప్పుడు తన ప్రతి నిర్ణయానికీ అతడు దేవుని అనుమతి తీసుకోసాగాడు. అంతేకాదు, బైబిలె యెడల అతనిలో అచంచల గౌరవభావం ఏర్పడింది.

అది అతని మనస్సులో ఆ స్త్రీలను బిషప్ల స్థాయికి తీసుకెళ్ళింది. అది తననుకూడ ఆ స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు తాను పరి. పౌలునుగూర్చి అవగాహన చేసుకోగలుగుతున్నాడు. తన ప్రవర్తన ఎంత నీతితో కూడినదైనా అభినందనీయమైనదైనా అది తనను రక్షించలేదని తనకు తెలిసింది. రక్షణ అనేది క్రీస్తుద్వారా వచ్చే బహుమానం. ఇక జాన్ చేయగలిగిందేమిటంటే తాను విశ్వాసాన్ని కలిగివుండటమే! అప్పుడు రక్షణ దానివెంబడే వస్తుంది.

‘అయినా తనకు విశ్వాసం ఉందా, లేదా?’ అనే ప్రశ్న అతణ్ణి ఆవేదనకు గురిచేసేది. ‘తను నిజంగా విశ్వసిస్తున్నాడా? విశ్వాసమనేది ఏమాత్రం లేని హ్యారీ ఎలా మాట్లాడు తున్నాడో అలానే తానుకూడ యితరులతో మాట్లాడుతున్నాడు. “రాంటర్లు”గా తమకు తామే అధ్యయనం చేసుకున్నవారితోకూడ తను అలాగే మాట్లాడుతున్నాడు. అనేకసార్లు యీ రాంటర్లు తనను సందేహంలో పడేటట్లు చేశారు. అతడు మళ్ళీమళ్ళీ బెడ్ఫోర్డులోని స్త్రీలవద్దకు వెళుతుండేవాడు. వాళ్ళు అతని సందేహాలన్నింటినీ నివృత్తిచేస్తుండేవారు.

ఒక రోజు బాగా వర్షం పడిన తర్వాత బెడ్ఫోర్డ్కు వెళ్తూన్న జాను ఏదైనా ఒక అద్భుతం ద్వారా తన విశ్వాసం ఋజువైతే బాగుండునని అనిపించింది. ‘అవును, ఎవరికైనా అవగింజంత విశ్వాసం ఉంటే వాళ్ళు కొండను కదిలిస్తారని ప్రభువు చెప్పలేదా? అలాంటప్పుడు తనకు విశ్వాసం ఉంటే ఆ మాత్రం ఓ చిన్న అద్భుతాన్ని తాను చెయ్యలేడా? ఈ దారిలోనున్న చిన్నచిన్న నీళ్ళ గుంటల్ని ఎండిపొమ్మని ఆజ్ఞాపిస్తే, అది తన విశ్వాసాన్ని ఋజువుచేస్తుందికదా?’ అయితే అతడు హఠాత్తుగా తిరిగి సందేహంలో పడ్డాడు.

‘ఒకవేళ యీ అద్భుతం జరక్కపోతే? అప్పుడు తన భంగపాటును భరించేదెలా? అప్పుడు తానింకా పడిపోయినవాడౌతాడు.’ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ, భారంగా నిట్టూరుస్తూ నిరాశగా బెడ్ఫోర్డువైపుకు పయనం కొనసాగించాడు జాన్.

అదే రోజు ఆ స్త్రీలు యథావిధిగా కూడుకొనివుండగా జాన్ అడిగాడు – “అమ్మా! మీకీ జ్ఞానం బైబిల్నుండి వచ్చిందని నాకు తెలుసు. అయితే మీకు మొదటగా దీన్ని పరిచయం చేసినవాళ్ళెవరు?”

“మా పాస్టర్ గిఫర్డ్ గారే! మేము ఆయన నడిపించే ‘ఫ్రీ చర్చ్ ఆఫ్ బెడ్ఫోర్డు’కు వెళ్తాం.”

కొన్ని రోజుల తర్వాత జాను దర్శనం కలిగిందో లేక పగటికల కన్నాడో తెలియదు గాని అందులో బెడ్ఫోర్టులోని స్త్రీలు ఓ కొండ ప్రక్కగా ఎండలో వెచ్చగా కూర్చొని ఉన్నారు. తనేమో నల్లని మేఘాల క్రింద, మంచులో నిల్చొని గజగజ వణుకుతున్నాడు. ఒక ప్రాకారం ఆ కొండను చుట్టుకొని ఉంది.

ఆ గోడలోనుండి ఏదైనా మార్గం ఉందేమో, దానిద్వారా ఆ స్త్రీలను కలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఆ గోడను జాగ్రత్తగా అతడు వెదకసాగాడు. చివరగా ఓ మార్గానికి తీసుకెళ్ళే తలుపు కనిపించింది. అది చిన్నగా యిరుకుగా ఉంది.

ఆ తలుపు సందులో తలను దూర్చేందుకు గంటల తరబడి సమయం పట్టింది. అయితే అతడు ఎలాగో అటూ యిటూ కదిలి చివరిగా శరీరాన్నంతా తులుపు సందులోకి దూర్చగలిగాడు. తర్వాత మెల్లగా ఓ త్రోవ వెంట పోసాగాడు. చివరిగా అతడు ఆ కొండ ప్రక్కకు సమీపించి ప్రకాశవంతమైన సూర్యరశ్మిలోని స్త్రీలను కలిసికొన్నాడు.

“మేరీ! మనం వచ్చే ఆదివారంనుండి బెడ్ఫోర్డులోని ‘ఫ్రీ చర్చి’కి వెళ్తున్నాం” – అటు తర్వాత మేరీతో అన్నాడు జాన్.

అలా జాన్ మేరీని బెడ్ఫోర్డులోని ‘ఫ్రీ చర్చి’కి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. అక్కడ పన్నెండుమందికంటే ఎక్కువ సభ్యులు లేరు. అది 1650 సంవత్సరంనుండి మాత్రమే నడుస్తోంది. చార్లెస్ రాజు పరిపాలన క్రింద యిటువంటి చర్చిని అనుమతించే వారు కాదు.

యువకుడైన ఆ సంఘకాపరి జాన్ గిఫర్డ్, జాన్కు ఆత్మీయ బోధకు డయ్యాడు. ఒకసారి ఓ ప్రత్యేకమైన సంభాషణలో తను సైన్యంలో ఉండగా పడిన హింసలనుగూర్చి జాన్ చెబుతుండగా పాస్టర్ గిఫర్డ్ గారు మధ్యలో అడ్డుపడి తాను రాజుగారి సైన్యంలో పనిచేశానని చెప్పాడు.

“మీరు రాచరికవాదులా!” ఆశ్చర్యంగా అడిగాడు జాన్.

“అవును. నేనెందుకు చెబుతున్నానంటే క్రీస్తులోనికి నేనెంత బాధకరమైన మార్గం ద్వారా వచ్చానో నువ్వు తెలుసుకోవాలి. ఈ రాజులు మరియు ఘనుల ఆటుపోట్లమధ్య యుద్ధంలో నీ సేవలు కనపర్చడం చాలా మంచిదే.

క్రీస్తునందలి విశ్వాస జీవితంలో కూడ అదే విధమైన ఆటుపోట్లుంటాయి. ఈ సంవత్సరం నీకు ఘనతగా భావించ బడినది వచ్చే సంవత్సరం మరణదండనకు కారణం కావచ్చు.”

“ఈ విషయాన్ని నేను తప్పక జ్ఞాపకముంచుకుంటాను పాస్టర్ గిఫర్డ్! అయితే మీ మార్గం అంత హింసాభరితంగా ఉండటానికి కారణం?”

“నేను లార్డ్ ఫెయిర్ ఫాక్స్కు వ్యతిరేకంగా లండన్కు ఆగ్నేయంగా మెయిడెన్ వద్ద పోరాడి నాలుగు సంవత్సరాలయింది. ”

“ఇంగ్లాండులో రక్తంతో తడవని ప్రాంతమంటూ ఏదైనా ఉందా?”

“నేను మేజర్ని …””

“మేజరా!”

“అవును. నా యీ ఉన్నతమైన హోదాకూ, నా దృఢ చిత్తానికీ నేను పొందిన బహుమానం ఏమిటంటే… మేము లొంగిపోయిన తర్వాత… మరణశిక్ష. ” “మరణశిక్షా!”

“అవును. ఫెయిర్ ఫాక్స్ నన్నూ, మరి పదకొండుమంది యితరులనూ ఆ మరణ శిక్షకు ఎంపికచేశాడు.”

“అయితే మీరు యిక్కడ …”

“అపొస్తలుల కార్యముల గ్రంథములో పేతురు చెరనుండి తప్పించుకున్న రీతిగా నేను తప్పించుకోవడంకూడ ఆశ్చర్యకరంగా జరిగింది.

జాన్ వెంటనే బైబిల్లోని ఆ సంఘటనను గుర్తుచేసుకొని చెప్పాడు :

“ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి – త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతులనుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడా లాగు చేసిన తర్వాత దూత – నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.”

“జాన్, దేవునివాక్యం విషయంలో నీకు మంచి జ్ఞాపకశక్తి ఉంది! ఏదో ఒక గొప్ప కోసమే యీ వరం దేవునిద్వారా నీకివ్వబడింది.”

“ఇంతకూ మీరెలా తప్పించుకున్నారు పాస్టరుగారూ?”

“నేను చెరసాలలో ఉండగా ఒకసారి నా సహోదరి నన్ను చూడ్డానికి వచ్చింది. ఆవిడ నాతో ‘కావలి వాళ్ళంతా త్రాగిన మైకంలోనూ, గాఢనిద్రలోనూ ఉన్నారని’ చెప్పింది. ఆ సమయంలో నేను కల కంటున్నానా అని నాకనిపించింది. నా సహోదరితో కలిసి నేను చెరసాలలోనుండి తప్పించుకొని బైటికి వచ్చాను.

బెడ్ఫోర్డుకు వచ్చేందుకు పగలంతా పొలాల్లో దాగి, రాత్రివేళల్లో ఉత్తర దిక్కుగా నడుస్తూ ప్రయాణం చేశాను. కచ్చితంగా దేవుడే నన్ను కాపాడాడు జాన్! నా క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ బెడ్ఫోర్డులో వైద్యవృత్తి ప్రారంభించాను. అయితే నేను దేవునికి కృతజ్ఞత చూపలేదు. నేను త్రాగి, జూదం ఆడి శాపగ్రస్థుడనయ్యాను.

ఒక రాత్రి జూదంలో చాలా పెద్దమొత్తం పోగొట్టు కొని కోపంతో నా దురదృష్టానికి దేవుణ్ణి తిట్టడం ప్రారంభించాను. అయితే అనుకోకుండా అపరాధ భావన నన్ను ముంచెత్తింది. నేనెంతగా చెడిపోయానోనని నాకు హఠాత్తుగా అన్పించింది. నేను మోకరించాను. మనిషి గనుక దేవుణ్ణి వెదకితే, అతడు తప్పక దేవుణ్ణి కనుగొంటాడు జాన్.”

పాస్టర్ గారి మాటల్ని వింటూ జాన్ తదేకంగా ఆయనవైపు చూస్తున్నాడు. “ఎంత ఆశ్చర్యకరమైన మార్పు! దేవునివైపు మీ ప్రయాణం, నా ప్రయాణంకన్నా చాలా విశిష్టమైంది” చివరిగా జాన్ అన్నాడు.

“నీ సుదీర్ఘ ప్రయాణంకూడా దాదాపు ముగిసినట్టే జాన్” – సమాధానమిచ్చాడు. పాస్టర్ గిఫర్డ్.

మార్టిన్ లూథర్ వ్రాసిన ‘గలతీ పత్రిక వ్యాఖ్యానాన్ని’ (Martin Luther’s Com- ments on Galatians) చదవమని ఆయన జాన్ కు అందజేశాడు. అందులో లూథర్ తన స్వంత శ్రమానుభవాన్ని అద్భుతంగా వివరించాడు. కాబట్టి జాన్ యిక ఒంటరిగా లేడు. పాస్టర్గారు బాగా శ్రమలకు గురయ్యారు.

చివరకు మహా గొప్ప వ్యక్తియైన మార్టిన్ లూథర్ క్కూడ ఎన్నో వేదనలకు గురయ్యాడు. అయితే కొంత సమయం తర్వాత ఓదార్పు పొందడానికి బదులు జాన్ మళ్ళీ కలతకు గురయ్యాడు. అవును ‘ఈ పాస్టర్గారూ, గొప్ప విశ్వాసులైన లూథర్లాంటి వాళ్ళూ సాతానును ఎదిరించారు. అయితే తను ఎలా ఎదిరించగలడు?’

మార్టిన్ లూథర్రి సందేశం, తన మంచి స్వంత కాపరియైన గిఫర్డ్ పాస్టర్ గారి ప్రోత్సాహం తనకున్నప్పటికీ జాన్ మానసిక క్షోభననుభవిస్తూ ఉండిపోయాడు. ఒక రోజు ఒక బలహీనమైన క్షణంలో “ఆ …. క్రీస్తు ఎటు పోతే మనకెందుకు?” అని అనుకున్నాడు. మరుక్షణం అతడు చాలా కంగారుపడ్డాడు.

తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించిన ఏశావులాగ తనెంత అనాలోచితంగా తయారయ్యాడు! కొన్ని వారాలుగా జాన్ తను రక్షణ పొందాడన్న విశ్వాసానికీ, శాపగ్రస్థుడయ్యాడన్న నమ్మకానికీ మధ్య ఊగిసలాడాడు.

1652 నాటికి మేరీ మరో బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉంది. ఆమెగాని, జాన్గాని విచారపడాల్సిన పనిలేదు. విచారం లేదా చింత అనేది దేవునియెడల విశ్వాసరాహి త్యాన్ని సూచిస్తుంది. అయితే జాన్ విచారపడాల్సి వచ్చింది.

జన్మించిన శిశువు మృతశిశువుగా దర్శనమిచ్చినప్పుడు జాన్ చాలా నలిగిపోయాడు. ‘మొదటి బిడ్డ గ్రుడ్డిది. రెండోది మృతశిశువు. ఇది తనపై దేవుని తీర్పా? రక్షణ పొందేందుకు సృష్టి ఆరంభంలోనే దేవునిచే ఎంపిక కాబడి ఏర్పరచబడిన ఆత్మలలో తాను ఉండకపోవచ్చు. తనేం చేసినా అది లెక్కకు రాదు. తనెప్పటికీ రక్షింపబడక పోవచ్చు’ జాన్ తనలో తాననుకొన్నాడు.

జాన్ సందేహంలో కొట్టుమిట్టాడసాగాడు. తన చుట్టూ ఉన్న అనేక సంగతులు చాలామంది సైతానుకు లొంగిపోతారన్న దానికి సాక్ష్యాలుగా కన్పించాయి. వృద్ధులు సైతం యింకా భౌతిక విషయాల వెంటబడటం అతడు చూశాడు.

‘ఎందుకు వాళ్ళంత వెర్రివాళ్ళుగా తయారౌతున్నారు? పవిత్రమైన వ్యక్తులుసైతం చనిపోయినవాళ్ళగురించి ఎందుకు విలపిస్తుంటారు? చనిపోయినవాళ్ళు పరదైసులో ఉంటారన్న నిశ్చయత గనుక వాళ్ళకుంటే, వారెందుకని అంత దుఃఖంలో ఉంటారు?’ ఈ చివరి పరిశీలన జాన్ ను కదిలించింది.

“నిజంగానే నేను సాతానుచే మోసగించబడ్డాను. నేను తప్పక విశ్వాసం కలిగి ఉండాలి” అని జాన్ తనలో తాను నిశ్చయించుకున్నాడు.

అతనెంత మానసిక హింసలో ఉన్నాడంటే ఇంగ్లాండులో ఏమి జరుగుతుందోకూడ తెలుసుకునే స్థితిలో లేడు. రాచరిక వాదులకూ, ఐర్లాండ్వారికీ, స్కాట్లాండ్ వారికీ వ్యతిరేకంగా పార్లమెంటువాళ్ళు జరిపిన యుద్ధం ముగిసిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండు వారు డచ్వారితో సముద్ర యుద్ధం చేస్తున్నారు.

ఆలివర్ క్రాంవెల్ తన సైన్యం మద్దతుతో పార్లమెంటును రద్దుచేశాడు. అతడు తనకు తాను ‘రక్షక ప్రభువు’గా పిలుచుకొని క్రొత్త రాజ్యాంగాన్ని సృష్టించుకున్నాడు.

“ఓ భగవంతుడా! యితడు తన్ను తానే క్రొత్త రాజుగా ప్రకటించుకున్నాడన్న మాట!” ఎవరో అన్నారు.

“ఆ ఏం లేదు … తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకొని, ప్యూరిటన్ తెగలయెడల మతసహనం కనపరుస్తాడు. రాజు అనే బిరుదును తిరస్కరిస్తాడు” – కొందరన్నారు. “మూడువందల సంవత్సరాల అనంతరం దేశంలోకి మొట్టమొదటిసారిగా యూదు లను అనుమతిస్తున్నాడు” – మరికొందరు దిగులుగా అన్నారు.

“అతడు అన్ని మతాలపట్ల సహనం చూపిస్తున్నాడనడానికి యిది నిదర్శనం” – మరికొందరు సమాధానమిచ్చారు.

జాన్ తన మానసిక ఆందోళనలోకూడ ఇంగ్లాండ్లో విస్తరించిన మత సహనం గూర్చిన విషయాలు తెలుసుకున్నాడు. అతడెప్పుడూ ఆలివర్ క్రాంవెల్ను దుష్టునిగా భావించలేదు. అయితే పార్లమెంటు సైన్యం చాలా ఘోరమైన దురాగతాలు చేసింది.

నెస్బీవద్ద చితగ్గొట్టబడిన ఆ అమాయక స్త్రీలను జాన్ ఈ రోజుకీ మర్చిపోలేదు. ‘అయితే వీటన్నిటికీ ఆలివర్ క్రాంవెల్ బాధ్యుడా? ఉన్నత స్థాయిలోనున్న లార్డ్ ఫెయిర్ ఫాక్స్ ఆ సమయంలో లేడా? దానికి తోడు ఆ పనికిమాలిన యుద్ధం నేడు “పౌర యుద్ధం”గా పిలువబడుతోంది.’

ఈ సమయానికి జాన్ పట్టుదల కాస్త సడలిపోయింది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ చల్లారిపోయాయి. ఏశావులాగ శాపానికి మాత్రం గురికాలేదు. అది కేవలం తన నిరీక్షణను తాను వదిలివేసేందుకు సైతాను పన్నిన పన్నాగంమాత్రమే! చనిపోయిన వారికి సంబంధించినంతవరకు దేవుని దృక్పథంలో అది దీవెనకరమైందే గాని అది తన విశ్వాసాన్ని కొల్లగొడుతోంది.

చనిపోయినవారినిగూర్చి అంగలార్చకూడదు. ఎందు కంటే వారు త్వరగా వెళ్ళిపోయినవారేగాని, పోగొట్టుకున్నవారినిగా వారిని భావించ నవసరంలేదు. అయితే తాను తన నీతిని తిరిగి ఎలా పొందగలడు? యిది కేవలం దేవుని కృపలోని మర్మంద్వారానే తప్ప తన అధిక తర్కజ్ఞానముచేతగాని, మొండి పట్టుదలచేతగాని కాదని అతనికి అర్థమైంది.

అంధురాలైన తన కుమార్తె విషయంలో దుఃఖించడంకూడ తప్పే. తనకు ఆమె అంటే ఎంత ప్రేమంటే … ఆమెకంటే మరో బిడ్డను ఎక్కువగా ప్రేమించడాన్నికూడ తను ఊహించలేడు. ఆమెకూడ తన్ను తాను ప్రేమించుకునేదానికంటేకూడ తన తలిదండ్రులను అత్యధికంగా ప్రేమిస్తోంది.

ప్రతిరాత్రీ తన ఏకాగ్రతను ఏవీ భంగపర చని రీతిలో బైబిల్లోని విషయాలను శ్రద్ధగా విని వాటినిగురించి ఆమె మాట్లాడేది. అలా ఆమె రెండు సంవత్సరాల వయస్సున్నప్పుడు ఐదేళ్ళ పిల్లలా ఎంతో తెలివిగా మాట్లాడుతోంది.

“నాకు యిరవై ఏళ్ళప్పుడు తెలియని విషయాలు దీనికి రెండేళ్ళప్పుడే తెలుసు!” – ఆశ్చర్యంగా అన్నాడు జాన్.

జాన్ పాత్రలకు కళాయి వేస్తూనే ఉన్నాడు. అయినా అతడు గిఫర్డ్ పాస్టరుగారికి బాగా సాయపడుతున్నాడు. సెయింట్ జాన్ చర్చిలో ఆరాధనలు జరిపించుకునేందుకు అనుమతి లభించిన 1653వ సంవత్సరంలో ఫ్రీ చర్చిలో పందొమ్మిదవ సభ్యునిగా సభ్యత్వం పొందేందుకు జాన్ దరఖాస్తు చేసుకున్నాడు.

తగినంతమందిని చేర్చుకునేం దుకు ఫ్రీ చర్చి నూతన సభ్యులను ఆహ్వానించింది. సభ్యత్వాన్ని ఆశించే సభ్యుడు తన ఆత్మలో జరిగించబడిన కృపాకర్యాలను గూర్చి సంఘంముందు చెప్పవలసి ఉంటుంది.

జాన్ వణకుతూనే చాలాసేపు మాట్లాడాడు. “నిజానికి నీ సాక్ష్యం పరిపూర్ణంగా ఉంద”ని ఆరాధనానంతరం పాస్టరుగారన్నారు. మిగతా సభ్యులు జాన్ దగ్గరకు వచ్చారు.

“బ్రదర్ బన్యన్! మీరు చాలా బాగా మాట్లాడారు.”

“నేను నిజంగా కదిలించబడ్డాను బ్రదర్ బన్యన్.”

“నూతన జన్మగురించి యింత కరుణారసాత్మకంగానూ, యింత విపులంగానూ నేనెప్పుడూ వినలేదు. నువ్వెంత మానసిక సంఘర్షణను అనుభవించావ్!” ఉత్సాహంగా అన్నాడు మరొక సభ్యుడు.

“విషయాన్ని చక్కగా వ్యక్తపరచే వరం నీకున్నట్లుగా అనిపిస్తోంది” – పాస్టర్ గిఫర్డ్ గారన్నారు.

“ఆ ఏదో సంపాదనకొరకు మాటకారితనంగా మాట్లాడి మాట్లాడి అలవాటైంది లెండి” – వినయంగా అన్నాడు జాన్.

“ఈ రోజు నువ్వు క్రీస్తుకొరకు మాట్లాడావు” చివరిగా పాస్టరు గిఫర్డ్ అన్నాడు. ఏ విషయాన్నైనా రెండువైపులా సమానంగానూ, అనర్గళంగానూ మాట్లాడగలిగిన తన తలాంతునుగూర్చి ఇంతకు మునుపు జాన్ ఒకలాంటి అపరాధ భావనకు గురయ్యేవాడు.

ఇప్పుడైతే పాస్టర్గారు చెప్పింది అతనికి వాస్తవమనిపించింది. మంచిగానీ, చెడుగానీ, ప్రాముఖ్యతలేని విషయంగానీ బాగా మాట్లాడగలగడం ఒక వరం. అనర్గళంగా మాట్లాడ గలిగిన తన ఈ తలాంతును తాను ఈనాడు అత్యున్నతమైన దేవుని ఉద్దేశానికి వినియోగించాడు. ఇది అతనికి విస్మయం కలిగించింది.

అతిసాధారణమైన కళాయి వేసేవాడైన తనలాంటివాడికి క్రీస్తుకొరకు మాట్లాడే అవకాశం రావడం జాన్కు ఆశ్చర్యమేసింది. అదే సమయంలో ‘తన్ను అనునిత్యం వెంటాడుతోన్న సంశయాల సంగతేంటి?’ అతడు తన్నుతాను ప్రశ్నించుకొన్నాడు.

“జాన్! నేను మరో బిడ్డను కనబోతున్నాను” – 1653 సంవత్సరం ఆకు రాలు కాలంలో ఒక సాయంత్రం మేరీ అంది.

బన్యన్లమీద దేవుని దీవెనలనుగూర్చిన పరీక్షగురించి మరోబిడ్డ జన్మ ఒక శోధన కాబోతోంది. అయితే జాన్ ఈ శోధనపై పోరాటం చేశాడు. మానవ జీవితంలోని ప్రతి సంఘటననూ ఒక సాధనంగా వాడుకొని ‘అది దేవుని అనుమతిని పొందినదా లేక ఆయన అనుమతిని పొందనిదా, దేవుడు ప్రేమిస్తున్నాడా లేక దూరంగా ఉన్నాడా, అసలు దేవుడంటూ ఉన్నాడా, లేడా?’ అనే సందేహాలకు వ్యక్తులను గురిచేయాలని సైతాను ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు.

1654 ఏప్రిల్ 14న ఎలిజబెత్ అనే బిడ్డకు మేరీ జన్మనిచ్చింది. బెట్సీ అని జాన్ మేరీలు ముద్దుగా పిల్చుకునే ఆ చిన్న పాప అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. జాన్ ఆత్మీయ జీవితం బలపడుతోంది.

ఆర్యోగ్యవంతమైన శిశువు తనకుగానీ మేరీకిగానీ శకునం కాబోదని తనకు తాను అతడు స్థిరంగా గుర్తుచేసుకుంటున్నాడు. ఆరోగ్యంగా ఉండే బెట్సీ జీవితం దేవుని చిత్తానుసారంగానే ఉంటుంది, తన చిత్తానుసారంగా మాత్రం కాదు.

జాన్ యిప్పుడు చర్చి విషయాల్లో పాస్టర్ గిఫర్డ్ గారికి సహాయం చేయడం, తోటి సహోదరులకు సలహాలనివ్వడం, గద్దించడం, ఓదార్చడంలాంటి సవాలక్ష పనుల్లో చురుగ్గా ఉంటున్నాడు. అవసరాన్నిబట్టి జాన్ అప్పుడప్పుడూ సహోదర సహోదరీలతో మాట్లాడుతున్నాడు.

తన స్వీయ ఆలోచనల్లో చాలా బలహీనమైన రీతిలో తనలోతాను అతడు యిలా తలంచేవాడు… ‘తను మాట్లాడేవాటిని విన్న యితరులు అవి చాలా ప్రభావంగలవని చెప్పినప్పటికీ అవి నిజంగా ప్రయోజనకరంగా ఉన్నాయా, లేదా?” అని తన మాటల్ని అతడు లోతుగా పరీక్షించుకునేవాడు.

జాన్ యిప్పుడు ఎక్కువ సమయం బెడ్ఫోర్డ్లోనే గడుపుతున్నందున 1655 సంవత్సరంలో జాన్ మేరీలు బెడ్ఫోర్డ్లోనే నివసించాలని నిశ్చయించుకున్నారు. వర్షా కాలంలో జాన్కు బాగా జబ్బుచేసి విపరీతంగా దగ్గుతూ రోజురోజుకీ బాగా బలహీన పడసాగాడు. మరోసారి అతని మదిలో సందేహాలు కదలాడసాగాయి.

‘క్రైస్తవ్యానికి ఫలితాలు ఇవేనా? దీవించబడిన వ్యక్తికివ్వబడే బహుమానాలివేనా?” తన సందేహాలవల్ల అతడు యింకా బాగా జబ్బుపడ్డాడు. అతని జబ్బు సందేహాలనింకా ఎక్కువ చేసింది. “ఈ సందేహాలు యిక ఎన్నటికీ ఉపశమింపవా?” – తన చిన్న పూరిగుడిసెలో ఎలుగెత్తి రోదించాడు జాన్.

జాన్ నెమ్మదిగా తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. తను సందేహపడినందుకు తన్ను తాను నిందించుకున్నాడు. పాస్టర్ గిఫర్డ్ గారు బాగా జబ్బుపడ్డారని విన్నప్పుడు తన సందేహాలు పూర్తి స్వార్థసహితమైనవిగా అతనికి కన్పించాయి. ఈ సమయంలో చర్చీలో ప్రసంగించమని జాను కోరారు. ఇది అతణ్ణి మోకరిల్లేట్లుగా చేసింది.

‘తనెలా దీన్ని చేయగలడు? ఒకప్పుడు తను చకాచకా మాట్లాడేవాడు. ఇప్పుడైతే తాను చాలా బలహీనునిగా, అనర్హునిగా, అయోగ్యునిగా తనకు తోస్తోంది.’ అయితే అతడు కొరింథీ మొదటి పత్రికలోని పరి. పౌలు మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు :

“పరిశుద్దుల సేవకు వారు తమ్మును తాము సమర్పించుకొనిరి. అటువంటి సేవకై మిమ్మును మీరు సమర్పించుకొనుడి.”

జాన్ బోధించడానికి ఒప్పుకున్నాడు. పాస్టర్ గిఫర్డ్ గారు తన రోగశయ్య మీదనుండి అతనికి సలహాలిచ్చాడు. జాన్ ముందుగానే తన ప్రసంగాన్ని సిద్ధపర్చుకోవలసి ఉంది. ఆ విధంగా అతడు తన ఆలోచనలను ఒక క్రమమైన పద్ధతిలో, ఒప్పించే విధంగా ఏర్పాటుచేసుకోగలడు.

అంతేగాక పాస్టరుగారు మరో సలహాకూడ యిచ్చాడు. మేరీలాంటి తెలివిగల వ్యక్తులకు అతని ప్రసంగం అర్థంకాకపోతే, అతడు చర్చీలో మాట్లాడినప్పుడు ఇక అది ఎవరికీ అర్థంకాదన్నమాట. జాన్కు తాను వ్రాసుకున్న ప్రసంగం ఒక ‘రికార్డు’లాగా ఉంది. అది మరెప్పుడైనా ఉపయోగించుకోవడానికి అతనికి అనువుగా ఉంటుంది.

జాన్కు వాస్తవంగా తెలుసు, తాను రెండవసారి ప్రసంగించేది అస్సలుకు ఉండదని. అయినా తన ప్రసంగాన్ని అతడు పదేపదే వ్రాసుకున్నాడు. ఎప్పుడైనా మేరీకి ఏదైనా వాక్యభాగం అర్థంకాకపోతే ఆమెకు అర్థమయ్యేంతవరకు ఆ భాగాన్ని మార్చిమార్చి వ్రాసేవాడు.

అతనికి ఒక విషయం అర్థంకాసాగింది. అది ఏంటంటే తను వ్రాసిన దానిలో కొన్ని భాగాలు మేరీకి అర్థమవడంలేదంటే, దాన్ని అర్థంచేసుకునే జ్ఞానం మేరీకి లేదనికాదుగాని, అర్థమయ్యే రీతిలో తన వాక్యనిర్మాణం లేదని అతనికి తెలిసింది. ఆ సమస్య పరిష్కారానికి అతడు చాలా ఆలోచనా శక్తిని వెచ్చించాల్సి వచ్చేది.

“నా భావ ప్రకటన ఉదయకాలపు తుషార బిందువంత స్వచ్ఛంగా ఉండాలి” అని జాన్ తనలో తాననుకొన్నాడు.

చివరకు జాన్ ప్రసంగించాడు. అతడు ఎంతో క్షుణ్ణంగా సిద్ధపడ్డా, అతని ప్రసంగం అతనికి వెగటనిపించింది. తానిప్పుడు బంధకాలలో ఉన్నానని అతడు తన సంఘంతో చెప్పాడు.

తాను పాపిననీ, ఎవరైనా తాము పశ్చాత్తాపం పొందడానికి ముందుగా తాము పాపులమని వారు గుర్తించాలనీ, పాపాన్ని గూర్చిన నిశ్చయత లేకుండ ఎవడూ రక్షింపబడనేరడనీ, రక్షణ పొందనందువలన ఆత్మ నిత్య నరకాగ్ని శిక్షకు లోనౌతుందనీ అతడు బోధించాడు.

జాన్ ప్రసంగాన్ని ముగించిన అనంతరం మేరీ అతణ్ణి అభినందించింది. ఆ తర్వాత ఆమె అతని చెవిలో అంది – “నువ్వు భయపడ్డావా?”

“మొదట భయపడ్డాను, కాళ్ళు వణికాయి, అయితే ఆ తర్వాత ఉన్నత శిఖరాల కెగసిపోయాను. ముందుగా ఎంత భయం! ఆ తర్వాత ఎంత ఆవేశం! విన్నవారికి నా సందేశం ఎంతవరకు అర్థమైందో, అది ఎంతవరకు వారికి ఉపయోగకరమో నాకు తెలియదు.”

అయితే ప్రసంగం విన్న సహోదర, సహోదరీలు ఆ ప్రసంగం తమ్మును బాగా కదిలించిందనీ, తమ పాపాలనుగూర్చి బాగా ఆలోచింపజేసిందనీ చెప్పి కృతజ్ఞతలు వెలిబుచ్చారు. వాళ్ళు అబద్ధం చెబుతున్నారని అనలేంగాని, వారి వినమ్రత అందులో స్పష్టంగా కనిపిస్తుంది. తాను పెద్దగా ప్రసంగించలేదుగాని ఓ మోస్తరుగా అంటే అంగీకారయోగ్యంగా ప్రసంగించాడంతే.

అలా వాళ్ళకు అవసరమైనప్పుడల్లా ప్రసంగించడానికి జాన్ అంగీకరించాడు. సంవత్సరాల తరబడి అతడు అనుభవించిన వేదన బైబిల్లోని ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథంవరకు ఉన్న దేవుని వాక్యాన్ని జీర్ణించుకొనేందుకు దోహదపడింది. తాను ప్రసంగించేటప్పుడు అవసరమైనచోట దేవుని వాక్యాన్ని చక్కగా ఉదహరించగల సామర్థ్యం తనకున్నట్టు అతడు గమనించాడు.

1655వ సంవత్సరం సెప్టెంబరు నెలలో జాన్ బన్యన్ తన ప్రసంగం తర్వాత సంఘసభ్యులను ఉద్దేశించి యిలా మాట్లాడాడు: “సోదరీ సోదరుల్లారా! పాస్టరు గిఫర్డ్ గారు వ్రాసిన ఈ ఉత్తరాన్ని చదవాలనుకుంటున్నాను. అందులో ఆయన యిలా వ్రాశారు – ‘ఈ లోకంలో కాపరిగా ఉండేందుకు దేవుడు నాకిచ్చిన సంఘానికి …’ పాస్టరు గిఫర్డ్ గారు తాను మరణశయ్యపైనున్నప్పుడు వ్రాసిన ఉత్తరమది. ఆయన ఎంతో జ్ఞానయుక్తంగానూ, గుండెల్ని పిండేసే విధంగానూ ఆ ఉత్తరాన్ని వ్రాశారు.

ఆ తర్వాత జాన్ మేరీతో మాట్లాడుతూ, “అందరూ చూచేట్లు నేను గట్టిగా ఏడ్వ నందుకు జనం నన్ను పాస్టర్ గిఫర్పైన ప్రేమలేని వ్యక్తిగా భావించవచ్చు. అయితే ప్రభువునందు నిద్రించిన పాస్టర్ గిఫర్డ్ గారిని మనకంటే ఆశీర్వదింపబడ్డ వ్యక్తిగా క్రీస్తునందు నాకున్న విశ్వాసాన్నిబట్టి నేను నమ్ముతున్నాను.”

“మన దుఃఖాన్ని ఆయన భార్య, నలుగురు పిల్నల్ని ఓదార్చేందుకు వినియోగించడం చాలా మంచిది.”

“అవును, సంఘం తన విధవరాండ్రను ఆదరించాలి.”

1656వ సంవత్సరం జనవరి వరకు ఫ్రీ చర్చీకి పాస్టరుగారు లభించలేదు. పాస్టరు బన్యన్ గారు విశ్వవిద్యాలయంలో చదివినవాడు కాదుగాని గుర్రపు బండ్లను తయారుచేసేవాడు. అతడు తగినంత పరిశుద్ధ వ్యక్తిత్వం కలవాడేగాని శారీరకంగా బలవంతుడు కాడు. వారాలు గడిచేకొద్దీ సహోదరులు అతనికి చాలా సహాయపడవలసి వచ్చింది. జాన్ బన్యన్ చర్చీలో ప్రసంగించడమేగాక, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో, వ్యవసాయ గిడ్డంగుల్లో, బహిరంగ ప్రదేశాల్లోకూడ బోధింపసాగాడు. ‘క్వాకర్లు’ అనే ఒక క్రొత్త మతశాఖకు చెందిన వ్యక్తులను జాన్ ఎదుర్కొనవలసి వచ్చింది.

బెడ్ఫోర్డ్లో కొంతకాలం నివసించిన జార్జి ఫాక్స్ అనే వ్యక్తి ఈ ‘క్వాకర్ల’ శాఖ సంస్థాపకుడు. త్వరలో ఈ కాకర్లు చుట్టుప్రక్కల ప్రాకిపోయి ప్రశాంతమైన ఆరాధన కూడికలను ఆటంకపరస్తూ, యితర చర్చీలకు వెళ్ళి వారి విశ్వాసాలను బహిరంగంగా సవాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రొత్త గుంపుపట్ల జాన్కు సదభిప్రాయం లేదు. చాలామంది క్రొత్త క్వాకర్లు తనకు చాలాకాలంనుండి తెలుసు. వాళ్ళలో చాలా మంది యింతకు మునుపు రాంటర్లు, ఈ రాంటర్లు తీవ్రమైన మత ఛాందసవాదులై నందున ఆలివర్ క్రాంవెల్ ప్రభుత్వంద్వారా చాలా హింసించబడి, కొంత మతసహనం కలిగిన ఈ క్వాకర్ల గుంపులో చేరారు.

“జార్జ్ ఫాక్స్ గారు ఈ క్వాకర్లు ఎలా ఉండాలని ఉద్దేశించాడోగాని, నాకు తెలిసి నంతవరకు వారిలో చాలామంది అవినీతిపరులు” అని జాన్ మేరీతో అన్నాడు.

1656వ సంవత్సరంలో ఒక రోజు ఎడ్వర్డ్ బరో అనే ఒక క్వాకర్ బెడ్ఫోర్డ్లోని మార్కెట్ హౌస్ దగ్గరనున్న ప్రధాన వీధిలో ప్రసంగిస్తున్నాడు. అది వినడానికి జాన్ ఆగాడు. బరో ప్రసంగం చాలా శక్తివంతమైన పదజాలంతో కొనసాగుతోంది. అతని మాటలు ఎదుటివారిని ఒప్పించేవిధంగా ఉన్నాయి. జాన్ ఇక మౌనంగా ఉండలేక పోయాడు. ఆశ్చర్యకరమైన రీతిగా బరో మాటల్ని సరిచేస్తూ అతడు చెప్పినదానికి వ్యతిరేకంగా జాన్ మాట్లాడ్డం ప్రారంభించాడు.

బరో మొదట జాన్ను చాలా చులకనగా చూశాడు. అయితే తన వాదనను జాన్ దేవునివాక్య ప్రమాణాలతో ఎదిరించేసరికి బరోకు కోపమొచ్చింది.

“ఎవరీ నరకానికి సంబంధించిన వ్యక్తి?” అని జాన్పై విరుచుకుపడ్డాడు బరో.

తర్వాత తన ధైర్యానికి ఆశ్చర్యపడుతూ యింటి ముఖం పట్టాడు జాన్. ఇప్పుడు చర్చి వెలుపల ఎక్కడైనా జాన్ సువార్త ప్రకటిస్తుంటే అడ్డుకోవడం కాకర్ల వంతయింది. అయితే బహిరంగంగా జాన్తో వాదించడం ఒక వెర్రి సాహసమే అవుతుంది. అతని సమయస్ఫూర్తి, వేగంగా పరుగెత్తే అతని ఆలోచనాశక్తి, అతని పరిపూర్ణ వాక్య స్ఫురణల ముందు ఎవరూ నిలువలేకపోయేవారు. ఒక రోజు తీవ్రంగా కలతపడ్డ ఒక క్వాకర్ మితిమీరిన కోపంతో ఇలా అన్నాడు – “నీ లేఖనాలను తీసి అవతల పారేయ్!” “చిట్టచివరకు నీ నిజమైన విశ్వాసమేంటో బయటకు వచ్చింది” – విజయోత్సా శ్రీ అన్నాడు జాన్ – “దేవుని వాక్యానికి బదులుగా మీరేది నమ్మాలనుకుంటారో దాన్నే నమ్ముతారు. మీరు మాయావాదులు తప్ప మరేం కాదు.”

అయితే ఈ క్వాకర్లు అతనితో పదేపదే ఘర్షణ పడేవాళ్ళు. ఇప్పుడు అతని ప్రసం గాలు ‘పాపాన్ని గుర్తించండి’ అంటూ బ్రతిమలాడే ధోరణినుండి ‘అబద్ధపు బోధల’ మీద తీవ్రంగా దాడిచేసే ధోరణికి మారాయి. తాను న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో చదివిన తీవ్రతరమైన కరపత్రాలను జ్ఞాపకం చేసుకున్నాడు జాన్. తన విమర్శకులను ఎదుర్కో డానికీ, వారి అబద్ధ బోధలమీద దాడిచేయడానికీ తన మనోభావాలను కరపత్రాల రూపంలో ముద్రించాలనుకున్నాడు జాన్. ‘కాని తాను చక్కగా వ్రాయగలడా?’

పాస్టర్ బర్టన్ గారి ప్రోత్సాహంతో క్వాకర్లకు వ్యతిరేకంగా ఒక కరపత్రం వ్రాయడం మొదలుపెట్టాడు జాన్. తాను క్వాకర్లతో పదేపదే ఘర్షణకు గురయ్యేకొద్దీ అతని కరపత్రం పెద్దదిగా, వేడివేడిగా తయారవ్వసాగింది. ఒక రోజు పాస్టర్ బర్టన్ గారిలా అన్నారు – “బ్రదర్ బన్యన్! నీ కరపత్రానికి నేను వ్రాసిన ‘ముందుమాట’ యిదిగో!” “ముందు మాటా!” జాన్ ఆశ్చర్యంగా చేతికి తీసికొని చదవడం ప్రారంభించాడు.

ఈ మనుష్యుడు భూసంబంధమైన విశ్వవిద్యాలయంనుండి ఎన్నుకొన బడినవాడు కాదుగాని క్రీస్తు సంఘమనే పరలోక విశ్వవిద్యాలయంనుండి ఎన్నుకోబడ్డాడు… ఇతడు దేవుని కృపచేత మూడు పరలోకపు డిగ్రీలను పొందాడు. అవి క్రీస్తుతో ఐక్యత, పరిశుద్ధాత్మాభిషేకం, సాతాను శోధనలవలని అనుభవం అనేవి. ఇవి ఏ విశ్వవిద్యాలయం యిచ్చే డిగ్రీలకంటేకూడ అత్యంత సమర్థవంతంగా సువార్త ప్రకటనాశక్తిని యితనికి యిచ్చాయి … ఇతని విశ్వాసంలోని పరిపూర్ణత, దైవికమైన యితని సంభాషణ, సువార్త ప్రకటించ డానికి యితనికున్న శక్తి సామర్థ్యాలను యితనితో నాకున్న అనుభవాలద్వారా నేను తెలుసుకున్నాను.

“మీకు చాలా కృతజ్ఞుణ్ణి. కాని నా కరపత్రం యింకా పూర్తికాలేదు” జాన్ అన్నాడు.

“నువ్వు తప్పక దాన్ని త్వరగా ముగించాలి. లేదంటే ఈ రాంటర్లకు విరోధంగా మీరు చేసిన మంచి తర్కాల్ని ప్రజలెలా తెలుసుకుంటారు?” – పాస్టర్ బర్టన్ అన్నాడు . “నీవు ఆలస్యం చేస్తూ వ్రాసుకొంటూ పోతుంటే ఎవరూ చదవడానికి ఇష్టపడనంత పెద్దదిగా అది తయారయ్యే ప్రమాదం కూడ ఉంది”.

మేరీ తన నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మగపిల్లాడ్ని జూనియర్ జాన్ అని పిలవడానికి బదులు జాన్ మేరీలు ముద్దుగా ‘జానీ’ అని పిలిచారు. “మనం ఈ కాకర్లమీద యుద్ధం ప్రకటించడం తప్పదంటావా?” ప్రశాంతంగా జీవించాలన్న తపనతో అంది మేరీ.

“ఇది మనకూ క్వాకర్లకూ మధ్య జరిగే యుద్ధం కాదుగాని, మానవ ఆత్మల క్షేమం నిమిత్తం సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే ఒక పెనుయుద్ధం. ఈ క్వాకర్లు బైబిల్ను విడిచిపెట్టి మాయావాదంలో కొట్టుకొనిపోతున్నారు. యేసు మరణించి తిరిగిలేచిన ఒక చారిత్రాత్మక పురుషుడు. అంతేగాని మరణాన్ని అనుభవించని ఒక మాయాస్వరూపుడు కాదు. అలాగైతే ఆయన పునరుత్థానానికి అర్థమే లేదు.”

“దుర్మార్గులు!” అంధురాలైన మేరీ మధ్యలో జోక్యం చేసికుంటూ అంది. ఇప్పుడామెకు ఆరేండ్లు. “క్రీస్తు గతంలో ఏమైయుండెనో, ప్రస్తుతం ఏమైయున్నాడో బైబిలు గ్రంథం స్పష్టంగా చెబుతోంది.”

జాన్ తన కరపత్రాన్ని ముగించి దానికి శీర్షికగా “క్రీస్తుయొక్క అయోగ్యుడైన దాసుడును, బెడ్ఫోర్డ్ నివాసియు, దేవుని కృపచేత ఆయన ప్రియకుమారుని సువార్తను ప్రకటించువాడునైన జాన్ బన్యన్ వ్రాసిన తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు” అని వ్రాశాడు. దీనిని న్యూపోర్ట్ ప్యాగ్నెల్లోని తన పాత మిత్రుడైన మాథ్యూ కౌలీవద్ద అతడు అచ్చువేయించాడు.

‘పాత్రలకు కళాయివేసే ఒక వ్యక్తి ఒక కరపత్రం వ్రాసే చొరవ తీసుకున్నాడంటే ప్రజలేమనుకుంటారు? అసలీ కరపత్రం ఒక కళాయివేసే వ్యక్తి వ్రాసినట్లు ఎవరైనా గుర్తిస్తారా?’ జాన్ అనుకున్నాడు.

పరలోక దర్శనం

పరలోక దర్శనం

జాన్ వ్రాసిన నిప్పులాంటి పత్రికయైన “తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు”ను క్వాకర్లు చదివారు. క్వాకర్ల తీవ్రమైన బహిరంగ అభ్యంతరాలతో ఈ కరపత్రం అనామకంగా అదృశ్యమైపోవడానికి బదులుగా అది విస్తృతంగా ప్రచారమైంది.

‘బహుశ ఇంగ్లాండ్ అంతా వీధుల్లో చేరి ఈ దినాల్లో మతం గురించి వాదోప వాదాలు చేసికుంటున్నట్టుగా కనబడుతోంది’ జాన్ అనుకున్నాడు.

అతని పేరు బెడ్ఫోర్డ్ షైరుకు దాదాపు ఐదువందల చదరపు మైళ్ళ పరిధిలో వ్యాప్తిచెందింది. సాధారణ ప్రజలు అతడొక పాత్రలకు కళాయి వేసేవాడన్న ఆశ్చర్యాన్ని ప్రకటించకుండా అతని మాటలు విన్నారు. సంపన్నులు ‘ఈ యిరవై ఎనిమిదేండ్ల నిప్పురవ్వ కేవలం ఒక కళాయి వేసేవాడా?’ అని ఆశ్చర్యచకితులయ్యారు.

కొందరు ఆనందించారు. మరికొందరు హెచ్చరికనొందారు. బెడ్ఫోర్డ్లోని ఫ్రీ చర్చి సభ్యులు ‘బన్యన్ మనుష్యులు’గా తెలియబడసాగారు. పాస్టర్ బర్టన్ గారు దీర్ఘకాలం అనారోగ్యంగా ఉండకుండా చురుగ్గా ఉండి ఉంటే యీ గుర్తింపు అతనికి వచ్చేదికాదు.

“తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు” అనే కరపత్రానికి జవాబుగా 1657 లో క్వాకర్ బరో ఒక కరపత్రాన్ని విడుదల చేశాడు. ఇది బన్యన్మీద నేరుగా జరిపిన ఆటవిక దాడి. అందులో “పాపి, దుర్మార్గుడు, దయ్యపు స్వభావం కలవాడు” అంటూ అతడు బన్యను వ్యక్తిగతంగా దూషిస్తూ, “అతని సిద్ధాంతాలు ఖండించదగినవనీ, అవి లోపభూయిష్టమైనవనీ” ఆరోపించాడు.

కాగితంమీద దాడులూ, బహిరంగ ప్రకటనలూ జాన్ స్థానాన్ని యింకా పటిష్టపరిచాయి. ఏ ఒక్క క్వాకర్ కూడా జాన్కు విరోధంగా తాము చేసే వాదాలను సమర్థించుకోలేక పోయాడు. అలాగే వాళ్ళు బైబిల్కు దూరంగా ఉండటంలోని ప్రమాదాన్ని జాన్ విస్మరించలేకపోయాడు.

ఆ తర్వాత “తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు అను కరపత్రంపైన ఆరోపణలకు. స్పష్టమైన జవాబు” అనే శీర్షికన మరో కరపత్రాన్ని జాన్ వ్రాయడం ప్రారంభించాడు. బరోలాగా జాన్ పెద్ద పదజాలాన్ని ఉపయోగించలేదుగాని ‘అడ్డుకర్రలు’, ‘మోసాలు’, ‘గుబురు చెట్లలో గ్రుడ్డివాడు’లాంటి ఘాటైన పదాలతో కొనసాగించాడు. స్పష్టంగానూ, తర్కబద్ధంగానూ, బుజ్జగింపుగానూ ఉండే ఒక భాగాన్ని చదువుదాం :

“ఈ దినాన క్వాకర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా కాలం క్రిందట రాంటర్లు వెలుబుచ్చిన అభిప్రాయాలే! రాంటర్లు వాటిని ఒక పాడుబడిన సత్రంలా చేస్తే ఈ క్వాకర్లు దానిమీద పైపై మెరుగులు నూతనంగా తొడిగి, బాహ్యసంబంధమైన పవిత్రతతో దాన్ని అలంకరించి …”

బరో కరపత్రానికి జవాబుగా వ్రాయబడ్డ ఈ కరపత్రం అదే సంవత్సరం అనగా 1657వ సంవత్సరంలో అచ్చయింది. దీన్నికూడ బరో ఖండించాడుగాని జాన్ దానికి ఎటువంటి ప్రతిస్పందనా చూపించలేదు. మరోసారి “తెరువబడిన సువార్త సత్యాలను” అతడు సమర్థించాడు. ఇప్పుడతడు వాక్యం బోధించడంలో తీరికలేకుండా ఉన్నాడు.

1658వ సంవత్సరానికల్లా బెడ్ఫోర్డ్లోని పర్ణశాలలాంటి అతని గృహం పిల్లల కేరింతలతో ప్రతిధ్వనిస్తోంది. అపురూపమైన ఎనిమిదేళ్ళ మేరీ, నాలుగేళ్ళ బెట్సీ, రెండు సంవత్సరాల జానీ, మరో నూతన శిశువు థామస్ లు చేసే అల్లరితో ఇప్పుడు ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటోంది.

తాను ఒకప్పుడు శత్రువుగా భావించి ద్వేషిస్తూ వచ్చిన తన తండ్రిని ప్రేమించి అభిమానించడానికి జాన్కు చాలా ఏళ్ళు పట్టింది. ఆయన తనకిప్పుడు శత్రువు కాదు. తన కుమారునికి తన తండ్రి ‘థామస్’ పేరు పెట్టుకొని ఆయనను బహిరంగంగా గౌరవించే అవకాశం చివరకు జాన్ కు లభించింది.

తాను చేసిన తప్పులన్నింటికీ జాన్ తన తండ్రిని క్షమాపణకూడా వేడుకున్నాడు! తన తండ్రిని ద్వేషించటం అనే పాపం శాశ్వతంగా సమాధి అయ్యిందని అతడు భావించాడు.

తన భార్య మేరీ ఏదో సమస్యతో బాధపడుతోందని జాన్ గ్రహించాడు. థామస్ పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ శక్తిని పొందలేకపోయింది. వాస్తవానికి దాన్ని దాచాలని ఆమె ఎంత ప్రయత్నించినా దాచలేకపోయింది. జాన్కు భయమేసింది. తల్లీ చెల్లీ యిద్దరూ చనిపోవడం తాను చూశాడు. అనుకోకూడనిదాన్ని ఆలోచించాల్సి వస్తోంది. ‘మేరీ యిక కోలుకోలేదా? మేరీ లేకుంటే తాను బ్రతకగలడా?”

ఆమెకు జ్వరం అధికమౌతుంటే నల్లని నీడలా భయం అతణ్ణి వెంటాడసాగింది. ‘ఊహాతీతమైంది మళ్ళీ ఏదైనా జరగబోతుందా? లేదు మళ్ళీ అటువంటిది సంభవిం చదు. తన ప్రియమైన భార్య మేరీకి అటువంటిది జరగనే జరుగదు.’

అతడు తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. అయితే ఒకనాడు ఆమె చెక్కిళ్ళమీది గులాబీరంగు చెదరిపోయింది! బంగారు రంగులో ఉండే ఆమె శరీరం పాలిపోయింది! మేరీ అతని నుండి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మరోసారి జాన్ తన అంతరంగంలో తీవ్రంగా రోదించాడు.

‘క్రైస్తవ్యానికి ఫలాలు యివేనా? దీవించబడ్డ వ్యక్తికి దేవునిచే యివ్వబడే బహుమానాలు యివేనా?’ మేరీ చావు భరింపశక్యం కానిదయినప్పటికీ, “ఓదార్పు నొందని దుఃఖం విశ్వాసరాహిత్యానికి చిహ్నమని” జాన్ తనకు తానే జ్ఞాపకం చేసుకొన్నాడు. ‘మేరీ పరదైసులో ఉంది’ – జాన్ తనకుతానే చెప్పుకున్నాడు – ‘దాన్ని నేను నమ్మకపోతే నా వాక్యోపదేశం, నా జీవితం అంతా దగా అవుతుంది.’

“అమ్మ పరదైసులో ఉంది” అతడు తన చిన్నారి బిడ్డలతో అన్నాడు.

“పరదైసు అంటే ఏంటి?” బెట్సీ అడిగింది. అంధురాలైన మేరీ తమ తలిదండ్రుల సంభాషణల్లో జోక్యం చేసుకున్నట్టు బెట్సీ జోక్యం చేసుకునేదికాదు. “అదెలా ఉంటుంది?” అందమైన వస్తువులద్వారా మధురమైన అనుభూతినిపొంది ఆనందించే బెట్సీ తిరిగి అడిగింది.

“ఎలాగుంటుందంటే …” ఆగిపోయాడు జాన్.

“అక్కడికి వెళ్ళడానికి ముందు నువ్వు బ్యూలా దేశంలో ఆగి, విశ్రాంతి తీసు కుంటావు” బిగ్గరగా అరిచింది మేరీ.

“ఎందుకు ?…… మేరీ సరిగ్గా చెప్పింది.” .” మేరీ భావాతీత జ్ఞానానికి జాన్ పులకరించిపోయాడు. “బైబిల్లోని యెషయా గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:

“విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు. పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు…బ్యూలా భూమికి పేళ్ళు పెట్టబడును యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు.”

“మరి బ్యూలా అంటే అర్థమేంటి?” బెట్సీ అడిగింది.

“ప్రభువుయొక్క భూమి” వివరించాడు జాన్ – “అంతకంటే ఎక్కువైంది. దేవుడా ప్రదేశాన్ని వివాహం చేసుకున్నంతగా అన్నమాట.”

“కాని అదేంటో నాకింకా అర్థంకావటం లేదు” ఫిర్యాదు చేస్తునట్టుగా అంది బెట్సీ.

జాన్ బ్యూలా దేశాన్నిగూర్చి బలవంతంగా ఊహించాల్సి వచ్చింది. ‘తన ప్రియమైన మేరీ అక్కడ యిప్పుడు నడుస్తూ ఉందని ఊహించగలిగితే అది చాలా తేలిగ్గా ఉంటుంది.’ బెట్సీవైపు తిరిగి అతడన్నాడు – “అమ్మ అక్కడున్న ఒక దారివెంట నడుస్తూ ఉంది. అక్కడ వీచే గాలి చల్లగా చాలా హాయిగా ఉంది.

ఆ ప్రదేశమంతా పచ్చగా ఉంది. ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ, పూలతోటలూ చూసేందుకు చాలా అందంగా కనిపిస్తు న్నాయి. అక్కడి తోటల్లోకి వెళ్ళే గేట్లన్నీ తెరిచేవున్నాయి. అమ్మ అక్కడున్న ఒక తోటమాలిని అడిగింది – “ఈ ద్రాక్ష తోటలూ, మంచి మంచి వనాలూ … యివన్నీ ఎవరివి?” అందుకు తోటమాలి యిలా జవాబిచ్చాడు: “ఇవన్నీ దేవునివి. ఇవి ఆయన ఆనందంకోసం, ఆయన యాత్రికుల ఉపశమనంకోసం యిక్కడ నాటబడ్డాయి.”

“కచ్చితంగా మీరు చెబుతున్నట్టే జరుగుతోంది నాన్నా!” – మేరీ అంగీకరించింది.

జాన్ చెప్పుకుంటూ పోతున్నాడు – “అమ్మ ఒక తోటలోనికి వెళ్ళడం నేను చూస్తున్నాను. ఆ తోటలోని రుచికరమైన పండ్లను ఆమె తింటోంది. అక్కడున్న దేవుని బాటలో షికార్లుచేస్తూ, అచ్చటి పొదరిండ్లలో ఆమె విశ్రాంతి తీసుకొంటోంది.

అక్కడి పక్షులు చెవులకింపుగా చక్కని పాటలు పాడుతున్నాయి. పావురాలూ, గువ్వలూకూడ కూ… కూ… అంటున్నాయి. అక్కడ చీకటిలేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది.”

“అయితే పరదైసుకు వెళ్ళక ముందు ఇదొక విశ్రాంతి ప్రదేశంమాత్రమే!” – మధ్యలో అడ్డుకుంది మేరీ.

“అవునవును” సందేహంగానే అన్నాడు జాన్. తన తలలో నిత్యం మోస్తూవున్న బైబిలు గ్రంథపు లోతుల్ని అతడు తడివి చూస్తున్నాడు. “బ్యూలాకు అవతల పరదైసు దేశంలో కనబడుతూ ఉంటుంది.

అక్కడి ప్రకాశమానమైన దూతలు కొందరు సంచరించేందుకు వస్తుంటారు. ‘చూడండి మీ రక్షణ సమీపించింది’ అన్న గంభీరమైన స్వరాలు ప్రశాంతమైన ఆ పరదైసునుండి వినిపిస్తూ ఉంటాయి.”

“ఓహ్, ఆ పట్టణాన్ని వర్ణించండి నాన్నా” మేరీ అడిగింది.

“ఆ పరదైసు ముత్యాలతోనూ రత్నాలతోనూ కట్టబడింది” – జాన్ చెప్పుకు పోతున్నాడు – “దాని వీధులన్నీ బంగారుమయమై ఉన్నాయి. ఆ పట్టణపు మహిమను దాటిన వెలుగు అమ్మను ఆవరించింది. ‘నేను వస్తున్నానని నా ప్రియమైన యేసుకు చెప్పండి’ అమ్మ గట్టిగా అరిచింది” – జాన్ కొద్దిసేపు ఆగాడు.

“ఇంకా చెప్పండి నాన్నా!” – బెక్సీ ఉత్సాహంగా అడుగుతోంది.

“అమ్మ ను అంతంతమాత్రంగానే చూడగలుగుతోంది. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారుకాంతి అమ్మ కళ్ళను మిరుమిట్లు గొలుపుతోంది. బంగారు వస్త్రాలు ధరించిన యిద్దరు దేవదూతలు అమ్మను కలుసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో స్వచ్ఛమైన వెలుగు ప్రకాశిస్తోంది.

“నువ్వెక్కణ్ణుంచి వస్తున్నావు?” అని వాళ్ళు అమ్మను ప్రేమగా ప్రశ్నించారు. తానెక్కడనుండి వస్తోందీ అమ్మ వారితో చెప్పింది. చివరిగా ఆ దేవదూతలు “మాతో రా!” అని అమ్మను తీసుకెళ్ళారు.

“వాళ్ళు అమ్మను పరదైసులోనికి తీసుకెళ్తున్నారా?” పెద్దగా అరిచింది బెట్సీ.

“అప్పుడేకాదు” – జవాబిచ్చాడు జాన్ – “పరదైసు పెద్ద కొండమీదుంటుంది. దాని పునాదులు మేఘాలకంటే ఎత్తుంటాయి. కాని అమ్మ చాలా సులభంగా వెళ్ళగలుగు తోంది. ఎలాగంటే ఆ దేవదూతలు అమ్మ చేతులను పట్టుకొని తీసుకెళుతున్నారు. అమ్మ మహిమ శరీరం ధరించివుంది.”

“అమ్మను నేను చూడగలుగుతున్నాను” మేరి ఆనందంతో అంది.

జాన్ తిరిగి కొనసాగించాడు “అమ్మతో దేవదూతలు యిలా అంటున్నారు : ‘నువ్వు దేవుణ్ణి విశ్వసించావు గనుక జీవవృక్షాన్ని చూస్తావు. దాని ఫలాల్ని నిత్యం భుజిస్తావు. పరలోకపు కాంతివస్త్రాలు నీకివ్వబడతాయి.

నీవు ప్రతినిత్యం దేవునితో నడుస్తూ, మాట్లాడుతూ ఉంటావు. ఏవిధమైన విచారాన్నీ, వ్యాధినీ, కష్టాలనూ, మరణాన్నీ నీవిక చూడవు. మునుపటి సంగతులు గతించిపోయాయి. ఇప్పుడు నువ్వు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులవద్దకు వెళుతున్నావు.”

“చాలా బాగుంది, ఇంకా చెప్పు నాన్నా” ఆనందంతో గంతులేస్తూ అంది మేరీ. “ఓ ఇంకా చాలా ఉంది మేరీ” – జాన్ అభయమిచ్చాడామెకు –

“అమ్మ పరదైసు ద్వారంవద్దకు వచ్చినప్పుడు పరలోక సైన్యసమూహం పరలోక గవినిగుండా త్వర త్వరగా బయటకు వచ్చి ఆమెను చుట్టుముట్టింది. ‘ఈమె భూలోకంలో ఉండగా మన ప్రభువును ప్రేమించింది. ఆయన పరిశుద్ధనామం నిమిత్తం అన్నీ విడిచిపెట్టింది’ I యిద్దరు దేవదూతలు బిగ్గరగా వారితో అన్నారు.”

“పరలోక సైన్యసమూహం మహదానందంతో, ‘గొట్టెపిల్ల వివాహవిందుకు ఆహ్వానించబడిన ఈమె ధన్యురాలు!’ అని కేక వేశారు” – మేరీ అరిచినట్టుగా అంది.

“అవును సరిగ్గా అదే జరిగింది” – జాన్ అన్నాడు – “దేవుని బూరల్ని ఊదే దేవదూతలు సంగీతంతో పరదైసును ప్రతిధ్వనింపజేశారు. పరలోక సైన్యసమూహం అమ్మ చుట్టూ భద్రతా వలయంగా నిలబడింది. పరదైసులో గంటలు మ్రోగాయి. పరలోకపు ద్వారానికి కొద్దిగా పైన బంగారు అక్షరాలతో వ్రాయబడిన ఈ మాటలను అమ్మ చూసింది :

“ఆయన ఆజ్ఞలను గైకొనువారు ధన్యులు. వారు జీవ వృక్షమునకు హక్కుగలవారగుదురు. వారు గవినిద్వారా పరదైసుకు వెళ్ళగలరు.”

“దేవదూతలు హఠాత్తుగా ద్వారంవైపుకు చూసి ఇలా అన్నారు – ‘ఇప్పుడు ద్వారపాలకులైన హనోకు, ఏలీయా, మోషేలను పిలుస్తున్నాము.’ ఆ ద్వారానికి పైగా ఆ ముగ్గురు పరిశుద్ధులు వెంటనే ప్రత్యక్షమయ్యారు. ‘పరదైసులో మీకేం కావాలి?’ అని వాళ్ళడిగారు.

ఒక దేవదూత ఇలా అన్నాడు – ‘ఈ ప్రదేశపు ప్రభువుయెడల ఈమెకు ఉన్న ప్రేమనుబట్టి ఈమె తన మునుపటి స్థలాన్ని విడిచి యిక్కడకు వచ్చింది.’ అప్పుడు ‘ఆమెను నాయొద్దకు తీసుకొని రండి. నీతిమంతులు ప్రవేశించే ద్వారాన్ని వెంటనే తెరవండి.

ఈమె తన విశ్వాసాన్ని కాపాడుకుంది’ అని పరలోక స్వరం ఒకటి ద్వారం లోపలనుండి బయలుదేరి పరదైసు అంతటా మార్మోగడం అమ్మ వినింది.” “కాని పరలోకంలో అమ్మ ఏం చేస్తుంది?” బెట్సీ అడిగింది.

“ఆమె తాను పడిన శ్రమలన్నింటినుండి విశ్రాంతి తీసుకొంటుంది” – – జవాబిచ్చాడు. జాన్ పరిపూర్ణ విశ్వాసంతో – “అంతేకాదు ఆమె పొందిన దుఃఖమంతటికీ ఆనందాన్ని పొందుతుంది. ఆమె విత్తినదాన్ని కోస్తుంది. ఆమె తన కన్నీళ్ళ ప్రార్థనకు తగిన ఫలాన్ని పొందుతుంది.

ఆమె బంగారు కిరీటాన్ని ధరించి పరిశుద్ధుడైన ప్రభువును ముఖా ముఖిగా చూస్తుంది. ఆమె ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూ, కీర్తనలు పాడుతూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటుంది. ఆమెకన్నా ముందుగా వెళ్ళిన ఆమె స్నేహితులతో కలిసి ఆనందిస్తూ ఉంటుంది.

ఇప్పుడామె తనకంటే ముందుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళ నాన్నవద్దకు వెళ్ళడం చూస్తున్నాను. అంతేకాదు అమెకు చూచాయగా గుర్తున్న ఆమె తల్లికూడ అక్కడే ఉంది.”

“ఊ, ఇంకా చెప్పు” – బెట్సీ అంది.

“పరదైసులో గంటలన్నీ మళ్ళీ ఆనందంగా మ్రోగుతున్నాయి. అమ్మ రూపాంతరం చెందింది. మహిమ కిరీటంతో అలంకరించబడింది. సూర్యునివలె ప్రకాశించే వస్త్రాలతో ఆమె అలంకరించబడింది.

ప్రతిచోటా సెరాపులు, కెరూబులు, మరికొన్ని జీవులు ఎగురుతూ ఉన్నారు. వారు గుర్తించలేనంతగా మెరిసిపోతున్నారు. పరలోక సైన్య సమూహమంతా ‘సర్వశక్తుడును ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు’ అని కేకలేస్తున్నారు. పరిశుద్ధుడైన ఆ దేవుని చూసేందుకు వారితో అమ్మకూడా చేరింది.”

జాన్ చెప్పిన కథ పిల్లల హృదయాలను పరవశింపజేసింది. దేవుడు వాళ్ళకప్పగించిన ఈ లోకపు బాధ్యతలను నెరవేర్చాలన్నదే దేవుని కోరిక అన్నట్లు జాన్ వారికి గట్టిగా నొక్కి చెప్పాడు. వాళ్ళు దానికి అంగీకరించారు. పిల్లలు యిప్పుడెంతో సమాధానాన్ని పొందడం జాన్ చూశాడు. అయితే మేరీని పోగొట్టుకోవడమనే వాస్తవం తనకు భరింపశక్యంగా లేదు. తన గత మానసిక క్షోభనుండి కొద్దికాలంగా విడుదల పొంది జీవిస్తున్నాడు. కానీ ఈ సంఘటనవల్ల ఆ మానసిక క్షోభ తిరిగి అతనిలో చెలరేగింది.

మేరీ అంత్యక్రియలు జరుగుచున్నప్పుడు జాన్ తన చిన్నాన్న ఎడ్వర్డ్ను, చిన్నమ్మ రోజ్ను యిన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా చూశాడు. ఎడ్వర్డ్ బన్యన్, సర్ శామ్యుల్ లూక్ గారి తండ్రియైన ఆలివర్ లూక్ గారి సేవకుడు.

ఎడ్వర్డ్, జాన న్ను లూక్కు చెందిన కోవ్లీ ఉడ్ ఎండ్ ఎస్టేట్కు ఆహ్వానించాడు. రెండు రోజుల తర్వాత జాన్కోసం గుర్రపు బండి వచ్చింది. ఎడ్వర్డ్, రోజ్లు ఎల్రలోని బన్యన్లతో ఎప్పుడో అరుదుగా కలుస్తుంటారు. అయినా వాళ్ళేమీ పెద్దగా మాట్లాడుకోరు. దానిక్కారణం జానికిప్పుడు అర్థమైంది.

కోప్ ఉడ్ ఎండ్ ఎస్టేట్లోని సంపద సామాన్యుణ్ణి నోరు తెరిచేలా చేస్తుంది. భూస్వాములకు చెందిన ఆ ఎస్టేట్ లోని వంట యింట్లోకి ఎడ్వర్డ్తో కలిసి వెళ్ళాడు. జాన్. వంటిల్లంతా తాజా రొట్టె, కైమా ఉండల వంటకాల వాసనతో గుభాళిస్తోంది.

ఆ పెద్ద వంటిల్లు అడుగునున్న భూగృహంలో ఎఱ్ఱని ద్రాక్ష సారాయి, యితర మద్యపానీ యాలను పెద్దపెద్ద పీపాలతో లూక్ వాళ్ళు నిల్వ చేశారన్న విషయం జానక్కు తెలిసింది. వంట గదిలో సంపన్నులు తరచుగా భుజించేవీ, సామాన్యులు కలల్లో మాత్రమే చూడగలిగేవీ అయిన ఎర్రజింకలు, కౌజులు, పీజెంట్ పక్షులు, కోళ్ళు, బాతులు, సాలమన్ చేపలు వగైరా వ్రేలాడదీసి ఉన్నాయి.

వంటగది, సామాన్ల గదీ ఉన్న చతుర్భుజాకారపు గృహంనుండి పనివాళ్ళ కోలాహలంతో నిండివున్న చతుర్భుజాకారపు గృహానికి వారు వెళ్ళారు. విలువైన వస్త్రాలతో క్రిక్కిరిసి ఉన్న ఒక చిన్న గదిలో సర్ ఆలివర్ లూక్ కోసం కుట్టించబడ్డ ఒక పొడవైన అంగీని పరిశీలించేందుకు ఎడ్వర్డ్ ఆగాడు.

నాణ్యమైన ఫ్రెంచ్ ఎరుపు వస్త్రాన్ని గజం రెండు పౌండ్లకు లండన్లో కొన్నారు. దానికి అసాధారణమైన నూలు గుండీలు, దారాలు అమర్చాల్సి ఉంది. ఎడ్వర్డ్ కూడ అటువంటిదే ఒకటి కొన్నాడు.

ఆ మొత్తం నిలువుటంగీ ఖరీదు ముప్పై పౌండ్లు. అంటే జాన్ యుద్ధంనుండి సంపాదించి తెచ్చుకొన్న సొమ్ముకు మూడురెట్లన్న మాట. “ఈ చతుర్భుజ గృహాలపైన పడక గదులున్నాయి” చెప్పాడు ఎడ్వర్డ్ అంకుల్.

ముందున్న చతుర్భుజాకారపు గది ముందుకు మునివేళ్ళమీద నడుస్తూ వెళ్ళాడు. ఎడ్వర్డ్. ఆ యింటి ముందు భాగమే ఆ గృహానికి శోభ. చాలినన్ని విశ్రాంతి గదులకు తోడు భోజనశాల, ప్రార్థనామందిరం, పొడవైన గ్యాలరీ ఉన్నాయి.

ఈ గ్యాలరీ ఖరీదైన చెక్కపలకలతో తాపడం చేయబడి అందమైన వర్ణచిత్రాలతోనూ, అలంకరింపబడిన కిటికీలతోనూ శోభాయమానంగా ఉంది. గ్రంథాలయంతోబాటు అక్కడ అధ్యయన మందిరంకూడా ఉంది.

వందలాది లెదర్ బైండింగ్ పుస్తకాలమధ్య కూర్చొనివున్న శామ్యుల్ లూకు, ఆలివర్ లూకు, మరికొంతమంది పెద్దమనుష్యులను చూసి జాన్ ఆశ్చర్యపడ్డాడు. ఎడ్వర్డ్ అంకుల్ అక్కడ ఆగి తనను గుమ్మంలోనుండి కొద్దిగా ముందుకు తోసినప్పుడు జాన్ మరెక్కువ ఆశ్చర్యపడ్డాడు.

“జెంటిల్మెన్! మీ అనుమతితో చిన్న మనవి … ఇతడు మా అన్నగారి కుమారుడు, జాన్ బన్యన్” – ఎడ్వర్డ్ అంకుల్ వారికి జాన్ను పరిచయంచేశాడు.

“ఓ, జాన్ బన్యన్!” సర్ శామ్యుల్ లూక్ తలపైకెత్తి చూచి దిగ్భ్రాంతి చెందాడు.

“నువ్వు న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో ఉండేవాడివని మీ చిన్నాన్న చెబుతుండేవాడు. బన్యన్. అక్కడ నువ్వు నాకు జ్ఞాపకం లేవు. అయినా కొన్ని కారణాలవల్ల నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాను.”

తాను పదమూడు సంవత్సరాల ప్రాయంలో నిష్ప్రయోజకునిగా ఉన్నప్పుడు, గుఱ్ఱపు రౌతుచే కొరడాదెబ్బలు తిన్న సందర్భంలో మొట్టమొదటిసారిగా సర్ లూక్ను కలుసుకున్నప్పటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ … “కష్టించి పనిచేసే వేలాది మంది సాధారణ ప్రజల్లో నేనూ ఒకణ్ణి” అని సమాధానం చెప్పాడు జాన్.

“నువ్వు ‘తెరువబడిన కొన్ని సువార్త సత్యాలు’ అనే కరపత్రం వ్రాశావని తెలిసింది!” అర్థాంతరంగా అన్నాడు అక్కడున్న మూడో పెద్దమనిషి.

“ఔనండి.”

“నువ్వు వృత్తిరీత్యా పాత్రలకు కళాయి వేసేవాడివి కదూ?”

“ఔనండి.”

“అంతా దగా మోసం” అంటూ ఆ మూడవ పెద్దమనిషి చాలా అనాగరికంగా జానన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు.

జాన్కు తెలుసు. తనలోని కోపాగ్నిని దాచుకోవలసిన దినం యిదేనని. తన ముఖంమీద నిండైన ప్రశాంతతను ధరించుకొని, ఒకదానివెంట మరొకటిగా తనపై సంధింపబడుతోన్న ప్రశ్నలను ప్రక్కకు నెడుతూ అతడు మౌనంగా నిలుచొన్నాడు. సైన్యంలో ఉన్న దినాలనుండి తానో పెద్ద వాగుడుగాయ.

అయితే లేఖనాలను ఆలింగనం చేసుకున్ననాటినుండి తన నోటివెంట మాటలే కరువయ్యాయి. ఇప్పుడు తాను సత్య నిష్ఠతోను, అసాధారణ ఆత్మవిశ్వాసంతోను మాట్లాడగలుగుతున్నాడు.

చిట్టచివరకు ఆ మూడో వ్యక్తి తన తల అడ్డంగా ఊపుతూ ఇలా అన్నాడు – “దాన్ని నమ్మలేకుండా ఉన్నాను. వందనాలు బన్యన్ గారు!” హఠాత్తుగా ఎడ్వర్డ్ అంకుల్ అతణ్ణి తీసుకొని ప్రక్కకు వెళ్ళాడు.

ఆ మూడోవ్యక్తి విలియం రసెల్ అని తాను అక్కడి పనివారి యిండ్లలో భోజనం చేస్తున్నప్పుడు తెలిసింది జాన్కు. తనను పిలుచుకు రమ్మని ఎడ్వర్డ్ అంకుల్ను అతని యజమానులే పురమాయించారన్న విషయంకూడా జాన్కు అప్పుడే తెలిసింది.

పాత్రలకు కళాయివేసే ఒక సాధారణ వ్యక్తి దగాకోరు బోధలకూ వ్రాతలకూ ముగింపు యిద్దామన్న ఆతృత బహుశ వారికుండవచ్చు. తను వాళ్ళను నిరాశపర్చాడు. ఎడ్వర్డ్ అంకుల్ మీద తనకేం కోపంలేదు. అంతకంటే ఎడ్వర్డ్ అంకుల్ యిక ఏం చేయకలిగి ఉండేవాడు?

దీనికి తోడు సంపదపట్ల యీ సంఘటన జాన్కు ఒక క్రొత్త ధృక్పథాన్ని కలి గించింది. యుద్ధంలో తాను సంపదను నాశనం చేశాడు. దాదాపు సంపన్నులయెడల చాలా జాలికూడ కలిగింది. కూలిపోయిన కోటల శిధిలాలు, దుమ్మును ఆధారం చేసుకున్న వారి మనోభావాల అంచనాలు తారుమారయ్యాయి. ఈ సంపన్నులు యింకా తమకొరకు తాము ఎన్నో ప్రణాళికలను చక్కగా వేసుకుంటూ పోతున్నారు.

‘రస్సెల్ మరియు లూక్లతో తన కలయికకూ, గత దినాల్లో జరిగిన సంఘటనలకూ ఏమైనా సంబంధం ఉందా లేదా?’ అన్న విషయం జాన్కు తెలియదు. ఇది బహుశ బెడ్ఫోర్డ్ షైర్ ప్రాంతాన్ని ఊపేస్తున్న ఒక కళాయి వేసేవాడి ప్రసంగాన్నిగూర్చి ఎడ్వర్డ్ గారి యజమానుల మనస్సుల్లో రేకెత్తిన ఆసక్తికి ప్రతిస్పందన అయి ఉండవచ్చు.

ఈ కళాయివేసే బెడ్ఫోర్డ్షైర్ వ్యక్తి కుశాగ్రబుద్ధిని చూశాక, సంపన్నులు యిక ఏమాత్రం అతనిగురించి హేళనగా వినోదించలేకపోతున్నారు. దేశంలోని ఆయా సంఘాల్లోనూ, ప్రత్యేకించి కేంబ్రిడ్జి ఆచార్యుల నివాసాలకు సమీప తూర్పు ప్రాంతాల్లోనూ బోధించి నందుకు యితనిపై అనేక ఆరోపణలు తీసుకొని రాబడ్డాయి.

‘విషయం యింకా తీవ్రతరం కాకముందే వాళ్ళు నన్ను బహిష్కరించాలని చూస్తున్నారు’ జాన్ ఆలోచించసాగాడు.

తనకు క్రొత్తగా తయారైన వ్యతిరేకతమీద అతడు తన దృష్టిని కేంద్రీకరించాడు. తన ప్రసంగాల్లో సంపన్నుల అసహనాన్ని ఎండగట్టడం ప్రారంభించాడు. అంతేకాదు మరో కరపత్రం “నరకంనుండి కొన్ని నిట్టూర్పులు” అనేదాన్ని వ్రాయడంకూడ మొదలుపెట్టాడు.

ఈ కరపత్రం ప్రధానంగా లూకా సువార్తలోని ధనవంతుడు, లాజరు ఉపమానంమీద ఆధారపడి వ్రాయబడింది. మరణానంతరం ధనవంతుడు నరకంలో బాధతో మెలికలు తిరగడం, మనోవేదన అనుభవించడం, పేదవాడు పరదైసులో అబ్రాహాము ప్రక్కన సుఖవాసం చేయడంవంటి వాటిని ఆధారం చేసుకొని దాన్ని వ్రాశాడు.

ఈ కరపత్రంలో తాను తొలి దినాల్లో చేసిన ప్రసంగాలు, అంటే – తామెంత దుర్మార్గులో, వాస్తవంగా తామెంత పాపభూయిష్టులో ప్రజలు ఎరుగనంతవరకు రక్షణకొరకైన తమ ప్రయాణాన్ని వారు ప్రారంభించనే లేరన్న అంశాలు ప్రస్తావించ బడ్డాయి.

ధనవంతులు మరియు ప్రత్యేక ఆధిక్యతలు గలవారికున్నంత తక్కువ పాప చింతన వేరెవ్వరికీ ఉండదు. జాన్ తన బిడ్డలతో కలిసి తన చిన్న కుటీరంలో ఉంటూ యీ కరపత్రాన్ని వ్రాయడంలో గంటలకొద్దీ సమయాన్ని గడిపాడు. చివరిగా న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో యిప్పటికీ పాస్టరుగా ఉన్న తన పాత స్నేహితుడు గిబ్సన్న తన కరపత్రం చదవమని అడిగాడు.

గిబ్స్ కాసేపు దాన్ని చదివిన తర్వాత ఇలా అన్నాడు – “నరకాన్ని గురించిన నీ ఊహలు దాదాపు కవిత్వంలా ఉన్నాయి జాన్. నరకంలో పాపిని ఒక గుంజకు కట్టి, సంవత్సరాలకొద్దీ యుగాంతంవరకు అతని మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుగా కోసివేస్తుంటారని యిక్కడ వ్రాశావు. అతని

దేహం కరిగిన సీసంతో నింపబడుతుందనీ, ఎర్రగా కాలిన లోహపు కడ్డీతో అతనికి వాతలు వేస్తారనీ, అక్కడ మిగిలేది రక్తం పీల్చే కీటకాల కాట్లు మాత్రమేననీ వ్రాశావు! అతని బాధలు ఆకాశ నక్షత్రాలను మించిపోతా యనీ, సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువులను అధిగమిస్తాయనీ, సముద్రంలోని నీటిబిందువులను మించివుంటాయనీ వ్రాశావు! నరకాన్ని కళ్ళకు కట్టినట్లు యింత చక్కగా చిత్రీకరిస్తావని నేను తలంచలేదు సుమా! నువ్వు వ్రాశావంటే నమ్మశక్యంగా లేదు” – ఎటువంటి చాతుర్యం లేకుండా ముగించాడు గిబ్స్.

“నేనుకూడా నమ్మలేకపోతున్నాను” జాన్ అంగీకరించాడు.

పాస్టర్ గిబ్స్ యింకా చదివి యిలా వ్యాఖ్యానించాడు – “దేవుని అల్పజనం ‘పెద్దమనుష్యులు కాదని’ నీవన్నావు” – అతడు అంగీకారంగా చిరునవ్వు నవ్వాడు “వాళ్ళు పొంతి పిలాతులాగ హీబ్రూ గ్రీకు లాటిన్ భాషలు మాట్లాడలేరని నువ్వన్నావు” – అతడు పైకి చూశాడు – “నువ్వు ప్రొఫెసర్లపై దాడిచేస్తున్నావు కదూ బ్రదర్ బన్యన్?”

“వాళ్ళు చాలా అసహనంగా ఉంటారు. తాము తప్ప వేరెవరూ తమ అభిప్రాయా లను వెలిబుచ్చకూడదని వాళ్ళు తలంచుతూ ఉంటారు.”

“అవును, నేను గమనించాను” అంగీకరించాడు గిబ్స్ – “ఇక్కడ ‘పవిత్ర జీవితం గడిపే సన్యాసులు గుహల్లో, సొరంగాల్లో సంచరిస్తూ నివసిస్తుంటే ధనవంతులు తమ కుక్కలకు ఇళ్ళు కడుతుంటారు’ అని వ్రాశావు. ఇది కాస్త ఘాటుగా ఉంది కదూ!

“ఊ…. చదువు”.

.చదువుతూండగా పాస్టర్ గారి ముఖం పాలిపోయింది. “ఇక్కడ ‘ధనవంతులు వీధుల్లో గర్వంగా నడుస్తూ… వేటాడుతూ, చెడు తిరుగుళ్ళు తిరుగుతుంటారు’ అని వ్రాశావు బ్రదర్ బన్యన్!” – ఆశ్చర్యంగా జానైవైపు చూశాడు పాస్టర్ గిబ్స్.

“ఇంకా చదువు …” చెప్పాడు జాన్.

“ఇక్కడేం వ్రాసుందంటే ‘ధనవంతులు బాగా సంపాదించడంకోసం శ్రమ పడతారు … క్రిందపడో, మీదపడో… ఒట్టుపెట్టుకొనో, అబద్దాలు చెప్పో, దొంగతనం చేసో … వారు అణగద్రొక్కుతారో, లంచమిస్తారో, పొగుడ్తారో, ఏ మార్గంలోనైతేనేం . ఏమైనా… ఏదైనా చేస్తారు … ఏంటి బ్రదర్ బన్యన్ యింత ఘాటుగా వ్రాశావు!” – గిబ్స్ ముఖంలో నెత్తురు బొట్టులేదు. మంచులాగ తెల్లగా అయింది.

“దేవా! యీ లోకం నామీద ఏమి మోపనుందో, ఆ బాధలు సహించడానికి నన్ను సిద్ధంచెయ్’ అనే మాట నీకీ సమయంలో గుర్తుచేయనివ్వు” జాన్ అన్నాడు.

“నువ్వు తప్పక బాధపడతావ్. ఏటికి ఎదురీదుతున్నావు బ్రదర్ బన్యన్ .”

“దీనికి నువ్వు ‘ముందుమాట’ వ్రాస్తే అది నాకో గొప్ప గౌరవంగా భావిస్తాను” సూచించాడు జాన్.

పాస్టర్ గిబ్స్ ముందుమాటలో క్వాకర్లు జాన్మీద చేసే అనాగరిక, నీచమైన దాడులను ప్రస్తావిస్తూ … “జాన్ తన యావత్ శక్తినీ వినియోగిస్తున్నాడు… విలుకాండ్రు తమ బాణాలతో అతన్ని మిక్కుటంగా బాధించడానికి అదొక కారణంగా నేను భావిస్తున్నాను” అని వ్రాశాడు.

ఈ క్వాకర్లు కరపత్రాల్లోను, బహిరంగ సభల్లోను జానన్ను హీనంగా బాధిస్తూ… యింకా దిగజారుడుతనానికికూడా సిద్ధపడ్డారు. ఇప్పుడైతే జాన్ గొప్పవారిమీదా, కులీనులమీదా తన దృష్టినుంచాడు.

“నీగురించి నాకు భయంగా ఉంది జాన్” – పాస్టర్ గిబ్స్ అన్నాడు – “అయితే దేవునికి వందనాలు … ఆలివర్ క్రాంవెల్ అసమ్మతిని అనుమతిస్తున్నాడు. గొప్ప వాళ్ళకు వ్యతిరేకంగాకూడా.”

జాన్ తన కరపత్రాన్ని ముద్రించి, పంచి పెట్టిన కొద్ది రోజుల్లోనే ఒక వార్త దేశాన్నంతా తుడిచిపెట్టింది. ఆ వార్త – “మహా గొప్ప విప్లవకారుడు ఆలివర్ క్రాంవెల్ మరణించాడు!”

“పాత ఐరన్ సైడ్స్ చనిపోయాడన్నమాట” గొణుగుతూ అన్నాడు జాన్.

“ఐరన్ సైడ్సా?” ఎప్పుడూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండే మేరీ అడిగింది.

“అది యుద్ధంలో ఆలివర్ క్రాంవెల్ పేరు” వివరించాడు జాన్. అది మనస్సులో రేపిన తీవ్రమైన భావసంచలనానికి అతడు ఆశ్చర్యపోయాడు. ఈ పేరును పన్నెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ తను పలుకలేదు. “అతడు గుఱ్ఱంమీద కూర్చుంటే మహా భయంకరమైన యుద్ధవీరుడు.”

ఆ తర్వాతి రోజుల్లో క్రాంవెల్నగురించి జాన్ తరచుగా ఆలోచించేవాడు. సంవత్స రాలతరబడి సంరక్షకుడైన ప్రభువుగా క్రాంవెల్ ఇంగ్లాండును పరిపాలించాడు. ఇప్పుడేం జరుగుతుంది? 1658 సెప్టెంబర్ మాసంలో యీ పుకార్లు శీతాకాల ప్రారంభంనాటి తుపానులా ఇంగ్లాండ్ అంతా వ్యాపించాయి. కొందరు పాత రాజుగారి కుమారుడు ఇంగ్లాండును పాలించడానికి తిరిగివస్తాడనీ, మరి కొందరేమో ఆలివర్ క్రాంవెల్ కుమారుడు రిచర్డ్ పరిపాలిస్తాడనీ అన్నారు.

సంవత్సరం చివరికల్లా అంతా స్పష్టమైంది. రిచర్డ్ క్రాంవెల్ క్రొత్త సంరక్షకుడైన ప్రభువు అయ్యాడు. జాన్ చుట్టుప్రక్కల పల్లెసీమల్లో తిరిగేటప్పుడు ప్రజల్లో ప్రత్యేకించి కులీనుల్లో క్రొత్త మనోభావాలను పసిగట్టాడు.

అది క్రాంవెల్ కుటుంబాలయెడల అయిష్టం, కోపం. ఈ క్రొత్త స్వాతంత్ర్యాలను దిగువ తరగతి ప్రజలు అతిగా అనుభవించారు. సామాన్యులకు తమ స్థానమేంటో అతి త్వరలోనే తెలిసిపోయింది. ఇంగ్లాండ్లో పరిపాలన కుటుంబాల మధ్య కొనసాగినంత కాలం వాళ్ళకు అసలైన రాజుతో పనేముంటుంది? ఇది దాదాపు చార్లెస్ రాజుతో అంతమైన పాత పరిపాలన లాగానే మారింది.

“చార్లెస్ రాజుగారి కొడుకులెక్కడున్నారు బ్రదర్ బన్యన్?” – ఎలిజబెత్ అనే ఓ యువతి ప్రశ్నించింది.

తన కుటీరంలో పిల్లలకు సాయపడేందుకు రోజూ వచ్చే యీ ఎలిజబెత్ అంటే జాన్కు బాగా యిష్టం ఏర్పడింది. ఈవిడ చాలా తెలివిగలది, భక్తి గలిగినది. ఈ అమ్మాయి యితనికి 1650 నుండి తెలుసు గనుక జాన్ యీమెను చిన్న పిల్లలా భావించేవాడు. తనెరిగినప్పటికి ఆమె వయస్సు ఎనిమిది లేక తొమ్మిదేళ్ళుంటాయి.

“రాకుమారులు ఫ్రాన్సులో ఉంటున్నారనుకుంటున్నాను.”

“వాళ్ళలో ఏమైనా రాచరిక లక్షణాలున్నాయా?

“ఆఁ, కచ్చితంగా. యువరాజు చార్లెస్ స్కాట్లాండ్ సైన్యంతో కలిసి క్రాంవెల్తో పోరాడినప్పుడు నువ్వు చిన్నదానివి. రాచరికవాదులు ఇప్పుడు అణచివేయబడ్డారు. కాని యువరాజు చార్లెస్ రాజరికానికి మళ్ళీ ప్రయత్నిస్తాడని నా అభిప్రాయం. అతనికిప్పుడు కేవలం ముప్పయి సంవత్సరాల వయస్సే. వాళ్ళ నాన్న ఇరవై ఐదేళ్ళకే రాజయ్యాడు.”

అవివాహితయైన ఎలిజబెత్ ఈ యింటికి ఎంత తరచుగా వచ్చేదో, అంత ఎక్కువగా జాన్ ఆమెమీద ఆధారపడసాగాడు. ఆమె అంటే పిల్లలు బాగా ఇష్టపడేవారు. రాత్రివేళ భోజనాలు అయిన తర్వాత ఎలిజబెత్ యింటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చేప్పుడు చిట్టచివరి పిల్ల బిగ్గరగా ఏడ్చేది.

చివరికి, మనుష్యులను బాగా గ్రహించగలిగేదీ, నడకనుబట్టిగాని గుసగుసలనుబట్టిగాని మనుష్యులను యిట్టే గుర్తుబట్టగలిగేదీ అయిన మేరీకూడ. దానికి ఎలిజబెత్ గురించి మంచి సంగతులు తప్ప యితరత్రా చెప్పగలిగినవి ఏవీ ఉండవు.

జాన్ భార్య మేరీ చనిపోయి పూర్తిగా ఏడాది అయిన తర్వాత అతడు తన తండ్రి థామస్తో ఏకాంతంగా మాట్లాడేందుకు వెళ్ళాడు. జాన్ అతడక్కడికెందుకు వచ్చాడో థామస్ కు కచ్చితంగా తెలుసు.

“నువ్వు ఒకవైపు ఎలిజబెత్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు, మరోవైపు దాన్ని ఘోరమైన తప్పిదంగా భావిస్తున్నావు. అవునా?” అతని తండ్రి స్వచ్ఛందంగా అన్నాడు.

“అవును”.

“నేను మళ్ళీ పెళ్ళి చేసుకున్నప్పుడు అది తప్పని భావించి కోపగించుకొన్నావుకదూ జాన్? మరీ ముందుగా చేసుకున్నానని నీవనుకున్నావ్. అయితే నేనెందుకలా చేశానో నువ్వప్పుడు గ్రహించలేదు.

కళాయి వేసేవాడిగా నేను ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు ప్రయాణం సాగించాలి. నువ్వు ఇంటికి పెద్దవాడివి. నువ్వు నమ్మదగినవాడవైతే నేనంత త్వరగా వివాహం చేసుకొనేవాణ్ణికాను. అయితే పసివాడైన విల్లీకి అప్పట్లో ఒక సంరక్షణ కావాలి.”

“మార్గీ, అమ్మా చనిపోయి పదిహేను సంవత్సరాలయింది కదా? ఈ సంవత్సరా లన్నింటిలో నీవు వెంటనే పెళ్ళి చేసుకోవడాన్ని నేను పరిపూర్ణంగా అర్థంచేసుకోలేక పోయాను. నీవు నాకెందుకు చెప్పలేదు?” – పశ్చాత్తాపంతో అన్నాడు జాన్.

“అప్పుడు నువ్వెలా ఉన్నావో బహుశ నీకు గుర్తుండి ఉండదు. దానికి తోడు నీకు చాలినన్ని సమస్యలు.”

“కాబట్టి ఆ విమర్శను భరించావు కదూ?” జాన్ అన్నాడు

“నన్నప్పుడు చాలామంది అర్థం చేసుకున్నారు. నువ్విప్పుడు వివాహం చేసుకున్నా ప్రజలు అర్థంచేసుకోగలరు. నువ్వూ దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటావు దేవుని సేవకోసం.

అంధురాలైన మేరీ, ఐదేళ్ళయినా నిండని బెట్సీ చిన్నపిల్లల సంరక్షణా బాధ్యతల్ని నిర్వహించలేరు. వాళ్ళకో తల్లి అవసరత ఉంది. నిన్ను నీవు ప్రశ్నించుకో వలసిందేమిటంటే … ‘నీవు నిజంగా ఎలిజబెత్ను ప్రేమిస్తున్నావా? – ఆమెకూడా నిన్ను నిజంగా ప్రేమిస్తున్నదా? అన్న విషయం మాత్రమే”

ఎలిజబెత్ురించి జాన్ బాగా ఆలోచించాడు. ఆవిడ చాలా చిన్నది. తను ఆమె కంటే చాలా పెద్దవాడు. తనకిప్పుడు ముప్పయ్ సంవత్సరాల వయస్సు. ఎలిజబెత్కు పదునెనిమిదేండ్లే. ఆమె తన కూతురంత చిన్నది కానందుకు దేవునికి వందనాలు.

ఇరవై సంవత్సరాల తర్వాత తనకు ఏభై, ఆవిడకు ముప్పయ్ ఎనిమిది. ఇది అసాధారణ మైనదే! కాని తన ఆరోగ్యాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది. ఆ మాటకొస్తే వయస్సు తక్కువున్న భార్యలుగలవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యిక్కడ తనో పెద్ద ప్రశ్నను ప్రక్కన పెడుతున్నాడు. అది-“తను ఆమెను ప్రేమిస్తున్నాడా?”

అతడామెనుగూర్చి ఆలోచించాడు. ‘ఆవిడకూ మేరీకీ పోలికలే లేవు. ఎలిజబెత్ జుట్టు నల్లగా, అంత ఒత్తుగాకాక గడ్డి మోపులా నిటారుగా ఉంటుంది. కళ్ళు లేత బూడిదరంగులో కాంతివిహీనంగా ఉంటాయి. ఆవిడ సుకుమారి కాదు. అంగసౌష్టవం గలదికూడా కాదు.

దృఢంగా, బలిష్ఠంగా ఉంటుంది. అయితే అత్యంత ప్రాముఖ్యమైన విషయంలో మేరీలాగ ఉంటుంది. ఈవిడ భక్తిపరురాలు. దేవునిపట్ల అంకితభావం మరియు విశేషాసక్తి కలిగిన వ్యక్తి. కొంత కోపిష్ఠికూడా! వాస్తవానికి తాను వివాహం గురించి ఆలోచించడానికి యీ లక్షణాలే కారణమని చెప్పొచ్చు. కాని తానామెను ప్రేమిస్తున్నాడా? తానామెను ప్రేమిస్తున్నట్లయితే అది తాను మేరీ ప్రేమలో పడినదాని కంటే భిన్నమైన ప్రేమగా దీన్ని చెప్పుకోవచ్చు’.

“నిజానికి చాలా రకాల ప్రేమలుంటాయి” – ఆ సాయంత్రం ఎలిజబెత్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగానే గొణుక్కున్నాడు జాన్. “ఒకడు తన భార్యను ప్రేమించిన రీతిగా తన బిడ్డను ప్రేమించలేడు. తన తల్లిని ప్రేమించిన విధంగా క్రీస్తును ప్రేమించడు.

తన భార్యను ప్రేమించిన రీతిలో తన తల్లిని ప్రేమించడు. లేదా తాను క్రీస్తును ప్రేమించినట్లుగా తన పొరుగువాణ్ణి ప్రేమించలేడు. కనుక వివిధ రకాల ప్రేమ లుంటాయి. దీన్నంగీకరిస్తావా మేరీ?” కుమార్తెతో అన్నాడు జాన్.

“అవును. నేనూ అలాగే అభిప్రాయపడుతున్నాను” ఆమె జవాబిచ్చింది. “ఎలిజబెత్ అంటే నీ కిష్టమేనా?”

“ఓ … చాలా యిష్టం”.

“అంటే దానర్థం ఆమెను మీ చనిపోయిన ప్రియమైన అమ్మకంటే ఎక్కువగానా?”

“ఊహు … కాదు. మా అమ్మను ప్రేమించినట్టుగా ఆమెను ప్రేమించడం లేదు.”

“నేనూ ఎలిజబెత్ను ప్రేమిస్తున్నాను. అయితే మీ అమ్మను నేను ప్రేమించినట్లుగా మాత్రం కాదు” జాన్ అన్నాడు.

అచంచల బోధకుడు

అచంచల బోధకుడు

మరుసటి రోజు సాయంత్రం భోజనాల అనంతరం ఎలిజబెత్ బెడ్ఫోర్డులోని స్వంత యింటికి వెళ్ళేందుకు సిద్ధమౌతున్న సమయంలో జాన్ ఆమెతో కలిసి కుటీరం బయటకు వెళ్ళాడు. “పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలిగిన ఒకర్ని పెళ్ళిచేసుకోవాలను కుంటున్నాను, ఎలిజబెత్!” జాన్ అన్నాడు.

“అయితే నేనేం చేయాలి?” బిత్తరపోతూ అంది ఎలిజబెత్.

“నీలాగా పిల్లలను చూసుకునేవాళ్ళు యింకెవరూ లేరనుకుంటాను. పైగా పిల్లలు కూడా నీ దగ్గర బాగా ప్రేమగా ఉంటారు”.

“నేనా?” రొప్పుతూ అంది ఎలిజబెత్.

“ఈ సాయంత్రమే మీ తలిదండ్రులను కలవాలనుకుంటున్నాను.”

జాన్ ఆ విధంగా ఎలిజబెత్తో పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించాడు. అతడీ ప్రస్తావన తెచ్చిన మొదటి సాయంత్రంనుండే ఎలిజబెత్ ఆనందంతో తేలిపోతున్నట్లుగా కన్పించింది. ఇంకా తాను రూఢిపరచుకోవలసి ఉంది.

తనను ఆమె బాగా అర్థం చేసుకోవాలనీ, ఆమె మనస్పూర్తిగా యిష్టపడితేనే తన భార్యగా ఆమెను చేసుకోవాలనీ తలంచాడు జాన్. అనేక సాయంత్రాలు దాపరికం లేకుండా అన్ని విషయాలూ ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు.

వివిధ సమయాల్లో దేవుని ప్రేమలో ప్రత్యేకించి స్తుతిగీతా లాపనలో అతడు అత్యంత ఆనందభరితునిగా ఉన్నప్పటికీ, మిగిలిన సమయాల్లో అంత రంగపు ఆలోచనల్లో తాను ఏదో కోల్పోతున్నట్లు, ఆత్మీయంగా చల్లారిపోయినట్లూ, దేవుణ్ణి సమీపించరాని విధంగా ఉన్నట్లు అతనికి అనిపించేది.

జాన్ నూతన గృహిణిని కనుగొన్న తరువాత దక్షిణాన లండన్ పరిసరాలవరకు ఊరూరా తిరిగే బోధకునిలా మునుపటికన్నా యిప్పుడు మరింత తీరికలేని, చురుకైన బోధకుడయ్యాడు. అతడు తూర్పున కేంబ్రిడ్జ్ నుండి దక్షిణాన లండన్ పరిసరాల వరకు ఊరూరూ తిరిగి బోధిస్తున్నాడు.

అనేకమంది ఒక కళాయివేసేవాడి బోధ వినడానికి ఎంతో కుతూహలంతో వచ్చేవారు. తిరిగి వెళ్ళేటప్పుడు అతను కళాయివేసే వాడన్న ఆలోచన లేకుండా వెళుతున్నారు.

అయితే కొంతమందికి అతని బోధలు అంతగా నచ్చేవికావు. “క్రొత్త నిబంధనకు తల్లిలాంటిదైన గ్రీకు భాషలో లేఖనాలను చదువకుండా సువార్త బోధించడానికి నీకెంత ధైర్యం?” – కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ఓ పండితుడు తిరస్కారంగా అన్నాడు.

“అయ్యా! మీ దగ్గర ఆదిమ సంఘానికి చెందిన పరిశుద్ధులు మరియు అపొస్తలులు వ్రాసిన అసలుసిసలైన గ్రంథపు చుట్టలున్నాయా?” జాన్ అడిగాడు.

“లేవనుకో, అయితే వాటి నకళ్ళు నా దగ్గరున్నాయి. ఆ ప్రతులు దేవుని సత్య వాక్యమని నేను నమ్ముతాను.”

“నా దగ్గరకూడ ఓ ప్రతి ఉందండి” – తన బైబిల్ను కత్తిలా ఝళిపించాడు జాన్ -“ఇదికూడ దేవుని సత్యవాక్యమని నేను నమ్ముతాను.”

మొదటి రెండు సంవత్సరాలూ, ఒక వ్యక్తి రక్షింపబడటానికి ముందు పాపాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతనుగూర్చి జాన్ బోధించాడు. తర్వాతి రెండు సంవత్సరాలు క్వాకర్లు మరియు రాంటర్లచేత రెచ్చగొట్టబడ్డాడు. వాళ్ళ అబద్ధ బోధలనుగూర్చి అతడు ప్రసంగించాడు. ఇటీవలి ప్రసంగాలలో క్రీస్తు స్వభావాన్నిగూర్చి జాన్ మరీమరీ బోధింపసాగాడు.

1659 మే నెలలో ఒక రాత్రి కేంబ్రిడ్జికి కొంత దూరంలోని ఓ ధాన్యాగారంవద్ద జాన్ ప్రసంగించాడు. మొదటి తిమోతి పత్రిక నాల్గవ అధ్యాయం తన ప్రసంగాంశంగా తీసుకొని ఒక విషయంలో తన శ్రోతలలో అధిక భాగం అవిశ్వాసులుగా ఉన్నారని నేరారోపణ చేశాడు.

ప్రసంగం తర్వాత గౌను ధరించిన ఒక వ్యక్తి రాజసం ఒలకపోస్తూ జాన్ను ఎదిరించాడు – “నేను థామస్ స్మిత్ని, గాక్యాట్ మతాధిపతిని, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో అరబిక్ ప్రొఫెసర్ని, గ్రంథాలయాధ్యక్షుడనుకూడ. మాలో అత్యధికులు అవిశ్వాసులని ఆరోపించడానికి నీకెన్ని గుండెలు? మాలో అధిక సంఖ్యాకులను యీ రాత్రి తప్ప మునుపెన్నడూ నీవు చూడలేదు!”

“నాకున్న అధికారమంతా నా ప్రభువేనండీ!” – జవాబిచ్చాడు జాన్ – “మత్తయి సువార్త పదమూడో అధ్యాయంలోని ఉపమానంలో విత్తనం విత్తబడిన నేలలు నాల్గు రకాలని ప్రభువు బోధించాడండీ! ఒక్క రకం నేలమాత్రమే బాగా పండింది.”

ప్రచురణ పొందిన జాన్ వ్రాతల్ని స్మిత్ ఎండగట్టసాగాడు. ప్రత్యేకించి జాన్లాంటి సామాన్యులు బోధింపతగరన్న విషయంమీద అతడు జాన్ ను విసిగించాడు. జాన్ ఏ విధంగానూ స్పందించలేదు. ఆ అవసరంకూడ అతనికి లేదు.

తన బోధించే హక్కును గూర్చి మరో విశ్వవిద్యాలయ పండితుడు హెన్రీ డేన్ సమర్థించాడు. మరో విశ్వవిద్యా లయ పండితుడైన పాస్టర్ విలియం డెల్, ఎల్డెన్లోని తన సంఘంలో బోధించేందుకు జాన్ను ఆహ్వానించాడు.

క్రీస్తు స్వభావాన్నిగూర్చి ఉపన్యసించడంనుండి ప్రక్కకు తొలగిపోవాలని జాన్ కోరుకోవడం లేదు. 1659 వేసవిలో తాను ప్రచురించిన “ధర్మశాస్త్రముయొక్క సిద్ధాంతము మరియు బయలుపరచబడిన కృప” (Doctrine of Law and Grace Unfolded) అనే పుస్తకంలో తనను తాను “బెడ్ఫోర్డుకు చెందిన ఒక తిరస్కరింపబడిన పాపి”గా అతడు అభివర్ణిస్తూ వ్రాశాడు.

ఇది రెండు నిబంధనలనుగూర్చిన పుస్తకం. ఇందులో క్రీస్తు ఏ విధంగా తన ప్రజలను కృప అనే నూతన నిబంధన క్రింద ఉంచాడోనన్న విషయాలను అతడు వివరించాడు.

1659 హేమంత ఋతువు చివర్లో ఎలిజబెత్ ఆ ఇంట్లోకి జాన్ భార్యగా వచ్చినప్పుడు జాన్ నలుగురు పిల్లలు ఎటువంటి సణుగుడు, అయిష్టం లేకుండా ఆమెను అంగీకరించారు.

ఆమెను వారు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఆమె ఫ్రీ చర్చి సభ్యురాలు గనుక వాళ్ళకామె ఎప్పట్నుంచో తెలుసు. ఆవిడ మేరీ, బెట్సీలకు ఓ పెద్ద అక్కలా కన్పిస్తుండేది.

ఒక శీతాకాలపు సాయంసమయంలో చలిమంట దగ్గర ఎలిజబెత్ జాన్తో యిలా అంది – “చాలా కాలంగా నువ్వు ఎక్కువగా మాట్లాడడం లేదు. ఏదైనా తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నావా, ఏంటి?”

“నీకు అనుమానంగా ఉన్నట్లుంది, అంతేనా?” ఆశ్చర్యంగా జాన్ బదులిచ్చాడు. “అవును, నీ ఈ నిశ్శబ్దం మామూలైంది కాదు.”

“సరిగ్గా చెప్పావు. దేవుని జలతారు పనిలో నేయబడటం చాలా బాధాకరమైందే!” “నీవు నన్ను బాగా సిద్ధపరచావు.”

“ఆలివర్ క్రాంవెల్ తన ప్రభుత్వ పతనానికి తానే విత్తనాలు నాటాడు. అతడు రాచరిక వాదులను పారద్రోలి, నీచమైన పార్లమెంట్ అవశేషంతో పాలన సాగించాడు. ఆ తర్వాత వాళ్ళను కాస్త రద్దుచేసి, అంతర్యుద్ధంకు ముందు ఎలా పాలించారో అలాగే యితడూ నియంతృత్వంగా పరిపాలించాడు.

ఒక్క క్రాంవెల్ మాత్రమే తన క్రొత్త ప్రభుత్వాన్ని ఏకత్రాటిమీద నడపగల సమర్థుడు. ఇతని కొడుకు రిచర్డ్ యీ నీచ పార్లమెంటు అవశేషాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నించాడు గాని, సంరక్షక ప్రభువుగా నిరూపించుకోవడంలో భంగపడ్డాడు.”

“ఇంతకూ దీనర్థం ఏంటి?”

“పాత రాచరిక వాదులూ, కొంతమంది పార్లమెంట్ సభ్యులూ కూడా రాచరికాన్ని పునరుద్ధరించేందుకు ఒత్తిడిచేస్తున్నారు. దాంతోపాటే పూర్తి పార్లమెంటునుకూడ తిరిగి పునఃస్థాపితం చెయ్యగలమని అంటున్నారు.”

“అయితే యిది మెరుగుపడటం కాదా జాన్? ఎందుకంత విచారంతో కృంగి పోతున్నావ్?”

“ఎందుకంటే యీ క్రొత్త రాజు నాలాటి అననుకూలవాదులైన బోధకులయెడల సహనం కనపరచకపోవచ్చు.”

“నువ్వు అననుకూలవాదులనే పదాన్ని ఉపయోగించడం యింతకు ముందెప్పుడూ నేను వినలేదు సుమా!” ఎలిజబెత్ అంది.

“ఈ మాట యీ రోజుల్లో బాగా ప్రచారంలో ఉంది. రాజు రాకతోపాటు అసహనం కూడ తిరిగొస్తుందని నా భయం.”

కొన్ని రోజుల తర్వాత రిచర్డ్ క్రాంవెల్ రాజీనామా చేసి ఇంగ్లాండు విడిచి పారి పోయాడు. 1660 ఫిబ్రవరి నాటికి జనరల్ జార్జి మాంఖ్ లండన్మీదకు సైన్యాన్ని నడిపి రిచర్డ్ క్రాంవెల్ నీచపు పార్లమెంట్ అవశేషం బలవంతంగా రద్దు అయ్యేట్లు చేశాడు.

సాధారణ జనానికి త్వరలోనే తెలియవచ్చినదేమిటంటే బ్రేడా ప్రకటన అని గొప్పగా పిలువబడే ఒక ఆమోదింపబడిన చట్టం ప్రకారం పార్లమెంట్తో కూడిన ప్రభుత్వాన్నీ, మత స్వేచ్ఛనూ, రాజకీయ ప్రత్యర్థులకు క్షమాభిక్షనూ ప్రసాదించడానికి ప్రిన్స్ చార్లెస్ అంగీకరించాడని. మే నెల నాటికి యితడు రెండవ చార్లెస్ రాజుగా ఇంగ్లాండ్కు తిరిగి వచ్చాడు.

జాన్ యధావిధిగా బోధించడం కొనసాగించాడు. తనకో బిడ్డ కలుగబోతోందని ఎలిజబెత్ అతనితో చెప్పింది. అది తప్ప మిగిలిన వార్తలన్నీ మంచివి కావు. దేశ మంతటా, ముఖ్యంగా న్యాయమూర్తుల విషయంలో చాలా మార్పులొచ్చాయి.

క్రొత్త న్యాయమూర్తులంతా రాచరికవాదులే. అయితే ట్రేడావద్ద రెండవ చార్లెస్ వాగ్దానం చేసిన ప్రకారం దయార్ద్ర హృదయుడైన రాజుగా ప్రవర్తింపనున్నాడా? తెరచిన సమాధి నుండి వచ్చే దుర్గంధంలా బెడ్ఫోర్డుకు వార్తలు అలలు అలలుగా రాసాగాయి.

ఒక రోజు సాయంత్రం ఎలిజబెత్ ఇలా అంది – “ఏంటి జాన్, తెల్ల కాగితంలా అలా నీ ముఖం పాలిపోయి ఉందెందుకు?”

“లండన్నుండి వార్తలు వస్తున్నాయి. ఇవి నీకు చెప్పాలని నేననుకోవడం లేదు. ఎలిజబెత్. ఎలాగైతేనేం నువ్వు వాటిని వింటావులే. అవి బహుశ చాలా చెడ్డవైయుంటాయి.”

“అవి ఏవైనాసరే, నేను భరించాలని అంటావు. అంతేనా?”

“ఈ క్రొత్త రాజు తన తండ్రి మరణశాసనం మీద చేవ్రాలు చేసిన ప్రతి ఒక్కరినీ నిర్బంధిస్తున్నాడట. వాళ్ళు విచారణకూడ ఎదుర్కోవలసి ఉన్నారట. వాళ్ళు మరణశిక్ష పొందబోతున్నారని నా భయం.”

జాన్ భయాలు కాస్త వాస్తవాలయ్యాయి. మరణ శాసనంమీద సంతకాలు పెట్టిన పదిమందికి మరణశిక్ష ఖరారయ్యిందన్న విషయం ఇంగ్లాండ్ అంతా తెలిసిపోయింది. ఫ్రీ చర్చి వాళ్ళు సెయింట్ జాన్లో యిక యేమాత్రం కూడికలు జరిగించరాదన్న వార్తలు వచ్చిన మరుక్షణం సెప్టెంబరు నెలలో పాస్టర్ బర్టన్ గారు చనిపోయారు.

అంతర్యుద్ధం తర్వాత బయటకు వచ్చిన పాస్టర్లంతా వాళ్ళ వాళ్ళ చర్చీల్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు సంబంధించి వ్రాయబడిన ప్రసంగాలు మాత్రమే బోధించాలని పార్లమెంటు చట్టం చేసింది. ఆ రోజు అరెస్టులను గురించి ఎలిజబెత్తో చెప్పినప్పుడు బ్రేడా ప్రకటనపట్ల చార్లెస్ చేసిన ద్రోహంగురించి జాన్ ఆమెకు చెప్పలేకపోయాడు.

‘మత సహనానికి యిది ముగింపు’ – తనలో తానే చెప్పుకున్నాడు జాన్. పాస్టర్ బర్టన్ గారిని గూర్చిన దుఃఖంలోనూ కలవరంలోనూ తాము కూడికలను ఏర్పాటుచేసు కునేందుకు ఏదైనా ధాన్యపుకొట్టుగానీ మరేదైనా కట్టడంగానీ దొరుకుతుందేమోనని ఫ్రీ చర్చికి సంబంధించిన సహోదర సహోదరీలు వెదకసాగారు.

ఇప్పుడు వారి సంఖ్య దాదాపు రెండొందలు ఉంది. వారి గుంపులో పెద్దవారైన కొందరు విధవరాండ్రు చాలా సంవత్సరాల క్రితమే జాన్ హృదయాన్ని చూఱగొన్న స్త్రీలు.

ఆలివర్ క్రాంవెల్ గత ప్రభుత్వంలోని పదిమంది లండన్లో ఉరితీయబడ్డారు. ఆ చర్య రాచరికవాదులను సంతృప్తిపరచలేదు. చనిపోయినవారి దేహాలను యీడ్చు కొచ్చి, నాలుగు ఖండాలుగా విభజించి, దేహఖండాలను పట్టణంలో వ్రేలాడదీశారు.

వాళ్ళలో యిద్దరి తలలను మొదటి చార్లెస్ రాజు ఎక్కడైతే విచారణకు గురయ్యాడో ఆ వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రదర్శనకు పెట్టారని తెలియవచ్చింది. ఇటువంటి అనాగరిక చర్యలను ఎలిజబెత్ నమ్మలేకపోయింది. జాన్కూడ ప్రత్యేకించి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించలేదు. అయితే యుద్ధంలోని అతని జ్ఞాపకాలు మట్టుకు యీ వదంతులు పూర్తిగా సత్యమేనని అతనికి చెప్పాయి.

జాన్ ఆ పల్లెప్రాంతాలన్నిట్లో బోధిస్తూనే ఉన్నాడు. నవంబర్ లో ఒక రోజు బెడ్ఫోర్డుకు దక్షిణంగా పదిమైళ్ళ దూరంలోని లోయర్ శామ్సల్ గ్రామానికి అతడు ప్రయాణంచేశాడు. ఇది జాన్కు ఎంతో యిష్టమైన పల్లె ప్రాంతం.

తమ చుట్టుప్రక్కల ఉండే పల్లపు మట్టి మైదానాలు హారింగ్టన్ సుద్ద కొండలకు నడిపిస్తాయి. అలాగే నైరుతీమూలగా షార్పెన్ హూ దగ్గరగా ఉండే కొండల దగ్గరకుకూడా. ఈ కొండలు క్లాపర్స్ ఉడ్ అడవులతో కప్పబడి ఉన్నాయి. దానికి దిగువగానున్న మనోహర దృశ్యం హాటన్ హౌస్. ఇది ప్రత్యేకించి జాన్ అనుభవంలో చాలా శ్రేష్ఠమైన విశాల భవనం.”

కాని తాను తరచుగా బోధించే ప్రదేశం లోయర్ శామ్సల్కు తూర్పున ఉన్న పాత సంస్థానం. ఇది విస్తారమైన ఎల్మ్ వృక్షాలతోనూ, కృంగిపోయి పూడుకుపోయిన కందకాల అవశేషాలతోనూ చుట్టబడి ఉంది.

మంచి వాతావరణంలో ఒక ముండ్ల పొదలాంటి హాథార్న్ చెట్టుక్రింద నిలబడి బోధించడాన్ని జాన్ యిష్టపడేవాడు. అయితే చెట్లకు ఆకులు రాలిపోయివుండే నవంబర్ నెలలోమాత్రం యిళ్ళలోపల బోధించేవాడు.

“ఈ రోజు మీ ముఖాల్లో బాధను చూస్తున్నాను ఎందుకని?” – ఆ యింట్లో అప్పటికే చేరిన జనాన్ని ప్రశ్నించాడు జాన్.

“ఈ రోజు మీరు వాక్యం చెప్పకూడదు” – గృహ యజమాని దిగులుగా అన్నాడు – “హర్లింగ్టన్ మెజిస్ట్రేటగు సర్ ఫ్రాన్సిస్ వింగేట్ మీరు బోధించిన పక్షంలో మిమ్మును అరెస్టు చేయించేందుకు వారంటుకూడ పంపాడు.”

జాన్ ఏమాత్రం తొందరపడలేదు – “కేవలం ఈ కారణంవల్ల ఈ కూడికను రద్దుచెయ్యబోను. ఓహ్! అందుకేనా మీరు అలా ఉన్నారు. సంతోషంగా ఉండండి. మన ఉద్దేశ్యం న్యాయమైందే. దేవుని వాక్యం ప్రకటించడంవల్లనూ, వినడంవల్లనూ మనకందరికీ మంచి బహుమానం లభిస్తుంది. దాని నిమిత్తమై యిప్పుడు మనం శ్రమలననుభవించవలసివస్తేకూడ దాన్ని విరమించకూడదు.”

జాను తెలుసు ఇప్పుడు తను విరమించుకోజాలనని. సంఘకాపరులు క్రీస్తుకోసం నిలబడలేకపోతే సహోదర సహోదరీలు తమ విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోగలరు? చుట్టు ప్రక్కల పల్లె ప్రాంతాలనుండి మిగిలినవాళ్ళు వచ్చిన అనంతరం ఎప్పటిలాగా జాన్ ప్రార్థనతో కూడికను ప్రారంభించాడు. అతడు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే తనను ఆటంకపరచేందుకు ఒక వ్యక్తి ముందుకొచ్చాడు.

“నేను కానిస్టేబుల్ని బన్యన్గారూ! మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు నా దగ్గర వారెంటు ఉంది.”

వెంటనే జాన్ హర్లింగ్టన్లోని మేజిస్ట్రేట్ యింటికి కొనిపోబడ్డాడు. అక్కడ మేజిస్ట్రేట్ కోసం రాత్రంతా జాన్ ఎదురుచూడాల్సి వచ్చింది. మరుసటి ఉదయం న్యాయమూర్తి అయిన సర్ ఫ్రాన్సిస్ వింగేట్కు ఎదురుగా జాన్ నిల్చున్నాడు.

“పాత్రలకు కళాయివేసేవానిగా పిలిపించుకోడానికి నువ్వెందుకు తృప్తిపడటం లేదు బన్యన్?” న్యాయమూర్తి అన్నాడు.

“ప్రజలు నశించిపోకుండునట్లు తమ పాపాలను విడిచిపెట్టి క్రీస్తును నమ్మమని ప్రజలకు బోధిస్తూ సలహాలిస్తున్నాను. నేను యీ పనీ చెయ్యగలను, కళాయివేసే పనికూడ చెయ్యగలను.”

“చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు వెలుపల బోధించడం చట్టవిరుద్ధమని నీకు తెలియదా?” – కొఱకొఱలాడాడు న్యాయమూర్తి.

“అటువంటి క్రొత్త చట్టం గురించి నాకేం తెలియదు.”

జడ్జి రెచ్చిపోయినట్టు కనబడ్డాడు – “చట్ట వ్యతిరేకంగా సమావేశమై చట్టాన్ని ధిక్కరించినందుకు నువ్వు అపరాధివని నేను తెలుసుకున్నాను …”

“ఎలిజబెత్ రాణి కాలంనాటి పాత చట్టాన్ని గురించేనా మీరు మాట్లాడేది?” – జాన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు – “అది వందల సంవత్సరాల కాలం నాటిది, దాన్ని ఆలివర్ క్రాంవెల్ భూస్థాపితం చేశాడు.”

“లేదు! ఆలివర్ క్రాంవెల్లే భూస్థాపితమయ్యాడు!” – వింగేట్ కోపంతో ఊగి పొయాడు – “నేను మీ అననుకూలవాద సంఘం మెడ విరిచివేస్తాను బన్యన్ ! ఇప్పుడు నువ్వొక అంగీకార పత్రం వ్రాసివ్వాల్సి ఉంటుంది. ”

“ఏమని వ్రాసివ్వాలి?” “బోధించడం మానుకుంటానని”

“నేను మానుకోను.”

“మానుకోకపోతే జైలు కెళతావ్!”

కానిస్టేబుల్తో జాన్ వెళ్ళకముందు వింగేటు సేవచేసే లిండేల్ అనే పాస్టరొకడు తానో గొప్ప విజయం సాధించినట్టు జాన న్ను వ్యంగ్యంగా దూషించాడు. యీ వింగేట్ పెడుతున్న హింస వెనుక లిండేల్ ఉన్నాడని అప్పుడు జానకర్థమైంది.

దేశంలోని చట్టానికి వ్యతిరేకంగా జాన్ నేరం చేసినట్లు భావించబడినందున బెడ్ఫోర్డులోని గ్రామ చెరసాలకు అతడు తరలించబడ్డాడు. ‘తాను విచారణకై మరో న్యాయమూర్తి ఎదుటికి వచ్చినప్పుడు లిండేల్లాంటి ప్రతీకారేచ్ఛ ఉన్న ఒకడి ప్రోద్బలంచేత పాత చట్టాలను తిరిగి ప్రయోగించడం జరిగిందని చెప్పాలి. తాను జైలునుండి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంపై తీవ్రంగా ప్రతిఘటించాలి’ అని జాన్ తనలో తాననుకొన్నాడు.

బెడ్ఫోర్డులోని యీ గ్రామ చెరసాల హై సిల్వర్ స్ట్రీట్స్క వాయవ్యంగా ఉన్న రెండంతస్థుల రాతి కట్టడం. జాన్ మూడు పొరల ఓక్ కొయ్యద్వారంగుండా చెరసాల లోనికి ప్రవేశించాడు.

ఖైదీలకు సువార్త ప్రకటించేందుకు అతడు అనేకసార్లు యీ ద్వారంగుండా వెళ్ళాడు. అయితే ఇనుప ఊచలతో భద్రంచేయబడ్డ యీ చెరసాలనుండి తప్పించుకోవడం ఎంత అసాధ్యమో జాన్కు యిప్పుడే తెలిసింది.

అప్పు తీసుకున్న వాళ్ళు రెండవ అంతస్థులోని నాలుగు లాకప్ గదుల్లోను, ఒక పగటిగదిలోను ఖైదు చేయబడతారని జాన్కు తెలుసు. క్రింది అంతస్థులో నేరస్థులకోసం లాకప్ గదులు, పగటి గదులు ఉన్నాయి. మొదటి అంతస్థులోని లాకప్ గదికి జైలర్ తనను తీసుకొని పోయినప్పుడు జాన్ సంతోషపడ్డాడు.

ఎందుకంటే క్రిందున్న రెండు పెద్ద గదుల్లో ఒక గది మరీ చీకటిగది. ఖైదీలు ఈ గదుల్లో గడ్డి పరుపులమీద నిద్రపోతారు. సాధారణంగా ఒక గదిలో ముగ్గురు లేక నలుగురు నేలమీద పడుకుంటారు, అదీ చలికి ముడుచుకొని.

అప్పుడప్పుడు ఒక్కో గదిలో పదిమందివరకూ పడుకొంటూ ఉంటారు. పగటి సమయంలో పగటిగదుల్లో నిరుత్సాహంగా అటు యిటు తిరుగు తుంటారు. లేదా మంచి వాతావరణంలోనైతే ఆవరణంలో పచార్లు చేస్తుంటారు.

ప్రారంభ దినాల్లో జాన్ ఎలిజబెత్వద్దనుండీ స్నేహితులనుండీ వచ్చిన దుప్పట్లు మరియు బట్టలతో కాలం గడిపాడు. చిన్న చలిమంటలు అప్పుడప్పుడూ పగటి గదుల్లో వేస్తుంటారుగాని లాకప్ గదుల్లోనైతే బయట ఎంత చలిగా ఉంటుందో లోపలా అంతే చలిగా ఉంటుంది.

కాని, అతని బైబిలు మరియు వ్రాతపరికరాలకంటే అతనికి ఎక్కువ వెచ్చదనాన్నిచ్చేవి మరేముంటాయి? ఖైదీలు చెప్పుకోనే మాటల్నిబట్టి ఖైదీ ఎప్పుడైనా ఒకసారి తన కుటుంబాన్ని సందర్శించవచ్చునన్న విషయం జాన్కు ప్రోత్సాహాన్నిచ్చింది. అక్కడి జైలరు ఖైదీలయెడల దయగా ప్రవర్తించేవాడు. అతడు జాన్కు ఎప్పుడూ కష్టం కల్గించలేదు. ఒకసారి రెండు పెన్నీలు జాన్ చేతిలో పెట్టాడుకూడ.

జాన్తో మాట్లాడిన ప్రతి ఖైదీ కూడ జాన్ ను హెచ్చరించాడు – “ఇక్కడ అతిగా సౌకర్యాన్ని పొందుతూ ఇక్కడే స్థిరపడాలని అనుకోవద్దు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా విచారణకు సిద్ధంగా ఉండు … నీమీద వాళ్ళకేం లేదు.”

“ఇదంత సులువైందా?” – సందేహంగా అడిగాడు జాన్.

చివరిగా ఒకతను అన్నాడు – “లేదు, అది అంత సులువైందేం కాదు. నీ అనుమానం నిజమే నేస్తం” – అతని స్వరం దయతో నిండినట్లుగా ఉంది.

“మీకెలా తెలుసండీ?” జాన్ అడిగాడు.

“నేను ప్లీడర్ గుమస్తాను. ఈ పర్యాయం చట్టం తలక్రిందుగా ఉంది” – అతడు కాపేపు ఆగి మరలా – “ఇంగ్లాండ్ అంతా ఒక రాజుక్రింద ఎలా పని చేస్తుందో నీకర్థమయ్యిందా బన్యన్?”

“ఎందుక్కాదు. మా కుటుంబం యీ రాజుగురించి. ఆయన ఆస్థానం గురించి మాట్లాడటం నాకెప్పుడో గుర్తుంది.”

“అవును, ఇంగ్లాండ్ను అదుపుచేసే అధికార కేంద్రం రాజు. అయితే, అంతకంటే మించి రాజుగారికి ఒక రహస్య సలహా సంఘం, ఇద్దరు మంత్రులూ ఉన్నారు. అంతేకాదు ఒక రాజగృహం, అందులో బట్టల బీరువా, ప్రత్యేక మందిరం, యించు మించుగా ఓ రాజధనాగారం ఉంటాయి. ఒక రాచ సరఫరాల అధికారికూడా అతనికి ఉంటాడు. అతని ఆర్థిక శాఖలోని ఒక భాగం ఖజానా.

వినటానికి అది అహేతుకంగా అనిపించినాకూడ ఖజానా అనేది న్యాయస్థానాల్లో ఒక భాగమే! అది సాధారణ న్యాయస్థానాలైన మూడింటిలో ఒకటి. మిగిలిన రెండు రాజుగారి న్యాయస్థానం, సాధారణ విన్నపాలు స్వీకరించేవి.

ఈ సాధారణ న్యాయస్థానాలకు తోడు లార్డ్ ఛాన్సలర్ యొక్క ఉన్నత న్యాయస్థాన విభాగం, స్టార్ చాంబరుకూడ ఉన్నాయి. రహస్య సమాలోచన సంఘానికికూడ కొన్ని న్యాయాధికారాలున్న సంగతి నువ్వు అసలు మరచిపోనేకూడదు.”

“నా తల తిరిగిపోతోంది.”

“ఒక రాజుగారి క్రింద అతని పౌరుడుగా ఉండటం అంత సులభం కాదు.”

“నువ్వింకా పార్లమెంటును ప్రస్తావించలేదు.”

“అవును. ప్రస్తావించలేదు. ఎగువ సభ సంపన్నవర్గాలతోనూ మతాధిపతులతోను నిండివుంటుంది. రాజుగారు ఈ సంపన్నవర్గాల సంఖ్యను అధికం చెయ్యవచ్చు. అంటే ఎగువ సభలోని సభ్యులు పెరుగుతారన్నమాట. అయితే మతాధిపతుల సంఖ్య స్థిరంగా చేయబడినందున, సంఘాధికారాన్ని యిది తగ్గిస్తుందికూడ.”

“మరి దిగువ సభ మాటేమిటి?

“ఓ…. వాళ్ళుకూడ భూకామందులే. కొద్దిమందిమాత్రం ధనవంతులైన వ్యాపారులు. మిగిలినవాళ్ళూ అలాంటివాళ్ళే. వాళ్ళు ఎన్నిక కాబడినవాళ్ళు. కాని నీకు తెలుసా, యీ ఎన్నిక చాలా మండలాల్లో భూస్వాములకు, సంపన్నులకుమాత్రమే పరిమితమౌతోంది. ‘నాణ్యమైన ప్రజలు’ అన్నదే నినాదం.”

“ఇది చాలా విచారకరం” – నిట్టూర్చాడు జాన్.

“నేను యిప్పటివరకు చెప్పినదానికంటే చాలా విచారకరమైంది యింకొకటుంది. ఈ పార్లమెంటు సభ్యుల మధ్య గొప్ప ఏకాభిప్రాయం ఉంటుందని నీవనుకుంటే పప్పులో కాలేసినట్టే. వాళ్ళ మధ్యకూడ రాచరికవాదులనీ, రాచరిక వ్యతిరేకవాదులనీ, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్వాళ్ళనీ, ప్రెస్బిటేరియన్లనీ విభేదాలున్నాయి.”

“దేశాన్ని పరిపాలించే వ్యక్తి దీన్నంతా అర్థం చేసుకోగలిగితే …”

“ఆలివర్ క్రాంవెల్ అర్థం చేసుకున్నాడు. అటువంటి మనిషే యిప్పుడున్నాడు.”

“సామాన్య ప్రజలకోసం పాటుపడే క్రాంవెల్ లాంటివాడా?” – ఆశగా అడిగాడు

“అవును. లార్డ్ క్లారెన్ డన్ అనే రాచరికవాది.”

ఒక దినాన ఖైదీలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాళ్ళు కిటికీల ఊచల దగ్గర గుమికూడారు. సాధారణంగా వాళ్ళ కుటుంబాలవాళ్ళు కోరుకున్న రోజున సిల్వర్ స్ట్రీట్నుండి వారితో మాట్లాడేందుకు ఖైదీలకు అనుమతివుంటుంది.

అయితే ఈ రోజున యీ ఉద్రిక్తతకు కుటుంబాల రాక కారణం కాదు. అలా తేరిపార జూస్తున్న ఖైదీలతో జాన్ కూడా కలిశాడు. వాళ్ళ ఎడంవైపు దూరంగా హై స్ట్రీట్మీద జనం బారులుతీరి ఉన్నారు.

“ఇదేదో కవాతులా ఉంది” అన్నాడో ఖైదీ. వాళ్ళు సైనిక వందనంతో తుపాకులు పేలుస్తున్నారు. “వచ్చేవాళ్ళెవరో గొప్ప సైన్యాధిపతియై ఉంటాడు” మరొకరన్నారు. జాన్కు బాగా తెలిసిన ఓ క్వాకర్ సకిలిస్తూ ఇలా అన్నాడు – “సైన్యాధిపతి కాదు.

ప్రధానాకర్షణగావున్న ఆ పెద్దమనిషిని చూడు. బిషప్ ధరించే గొప్ప తలపాగా ధరించివున్నాడు. బంగారు సిలువదండాన్ని చేబూనాడు. అతడు అత్యద్భుతమైన ఊదారంగు వస్త్రాల్ని ధరించి ఉన్నాడు.”

“అతనో బిషప్పు” – నిర్జీవంగా అన్నాడు జాన్.

“పాత చర్ఛాఫ్ ఇంగ్లాండ్ తన పాత వైభవం, నిరంకుశత్వంతో తిరిగి వచ్చిందన్న మాట.”

జనవరి ప్రారంభంలో జరిగే తదుపరి త్రైమాసిక సమావేశంలో జాన్ విచారణకు కొనిపోబడ్డాడు. హియర్నే చాపెల్ అనే భవనంలోనికి జాన్ను తీసుకెళ్ళారు. ఇది జాన్ చదువుకున్న పాత స్కూలు భవనానికి కుడి ప్రక్కనే ఉంది.

ఒక భవనంనుండి మరో భవనానికి వెళ్ళడం ఎంత కష్టమైందో జాన్ ఆలోచించలేక పోయాడు. ఆ రోజు న్యాయపీఠంమీద అయిదుగురు న్యాయమూర్తులు ఆసీనులైవున్నారు. వాళ్ళు కెలింజ్, చెస్టర్, బ్లండెల్, బీచెర్, స్నాగ్ అనే న్యాయమూర్తులు.

ఈ న్యాయమూర్తులంతా రాచరికవాదులనీ, కెలింజ్ అనే ప్రధాన న్యాయమూర్తి లండన్లో క్రాంవెల్ను బలపరచిన పదిమందిని మరణశిక్షకు గురిచేసిన న్యాయమూర్తుల్లో ఒకడనీ జైల్లో పుకార్లు వ్యాపించాయి. .

మొదటగా కోర్టు గుమస్తా మాట్లాడాడు. “జాన్ బన్యన్ అనే సామాన్య కార్మికుడు పైశాచికంగా, ప్రమాదకరంగా మారి దైవారాధనలను వినేందుకు దేవాలయానికి రాకుండా వాటిని బహిష్కరించి సార్వభౌముడైన రాజుగారి శాసనాలకు వ్యతిరేకంగా అనేక చట్టవిరుద్ధ కూడికలను జరిపిస్తున్నట్టు యితనిపై నేరారోపణలు చేయబడ్డాయి. – ఈ ఆరోపణలను గూర్చి నీవేమైనా వాదింపదలచుకున్నావా, ఖైదీ?”

జాన్ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. “మొదటి భాగం విషయమైతే, నేను సాధారణంగా చర్చ్ ఆఫ్ గాడ్ సంఘానికి వెళు తుంటాను. దేవుని కృపచేత క్రీస్తు శిరస్సుగావున్న ప్రజలలో ఒక సభ్యుడనుకూడ”.

న్యాయమూర్తి కెలింజ్ అన్నాడు. – “కాని నీవు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ స్థానిక సంఘానికి వెళుతుంటావా?”

“లేదండి! నేను వెళ్ళడం లేదు. అటువంటి యేదీ దేవుని వాక్యంలో నాకు కనిపించలేదు.”

“ప్రార్థించాలని ఆజ్ఞాపించాం” – తటాలున అన్నాడు కెలింజ్.

“అంతేగాని స్థానికసంఘ సాధారణ ప్రార్థనలను వల్లెవేయమని కాదుగా. ఆ ప్రార్థనలు యితర మనుష్యులచేత వ్రాయబడ్డాయి.”

“నువ్వుకూడ నీ సొంత ప్రార్థనలు వ్రాసి నేర్పిస్తున్నావేమో! మాకెట్లా తెలుస్తుంది?” – నవ్వాడో జడ్జి.

“లేదండీ, నేనెప్పుడూ అలా చేయను” – జవాబిచ్చాడు జాన్. వెంటనే జాన్కు ఒక వాక్యం మనస్సులో మెదిలింది – “గౌరవనీయులైన పెద్దలారా! రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా ఈ సమయంలో మీకు మనవి చేస్తున్నాను –

‘అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదుగాని, ఉచ్ఛరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.’

జాన్ బైబిల్ను ఉపయోగించుకున్న తీరునుబట్టి న్యాయమూర్తులు మౌనం వహించి నట్లు కనబడ్డారు. జాన్ కొనసాగించాడు, “అవును, మనమందరం ప్రభువు నేర్పిన ప్రార్థనను చెప్పవచ్చు.

అయితే ఎంతమంది ఆ ప్రార్థనలోని ‘పరలోకమందున్న మా తండ్రీ’ అనే మాటను తమ హృదయంలో పరిశుద్ధాత్మతో కలిసి అనగలరు? వాళ్ళు తిరిగి జన్మించనివారైతే ఆ ప్రార్థన కేవలం సణుగుడూ గొణుగుడే కదా?”

“అది వాస్తవమే” – న్యాయమూర్తి కెలింజ్ అన్నాడు.

“ప్రార్థన అనేది దేవునివాక్య ప్రకారం చెయ్యాల్సివుంది” జోడించాడు జాన్.

“స్థానికి సంఘానికి యితను చాలా ప్రమాదకారి” అన్నాడో జడ్జి. “అవును ఇతడు బోధించడానికి వీల్లేదు” – జతకలిపాడు కెలింజ్ -“నీకీ అధికారం ఎక్కడనుండి వచ్చింది?” జాన్ ను అడిగాడు.

“మొదటి పేతురు నాల్గవ అధ్యాయంలోని వచనాలనుండి :

“ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయ వలెను.

ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసు క్రీస్తుద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభా వమును ఆయనకుండునుగాక, ఆమేన్.”

“ఒక్క నిమిషమాగు” – ఒక జడ్జి అరిచాడు.

“ఇతడు మనల్ని మోసం చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఇతడు వాక్యాలు బాగా తయారుచేసుకున్నట్టుంది. ఇదిగో గుమస్తా, ఆ బైబిల్ యిలా తీసుకురా!”

న్యాయమూర్తులు బైబిల్మీద మూకుమ్మడిగా మూగిన తర్వాత జాన్ను యిది వరకటికంటె ఎక్కువగా రెచ్చగొట్టి, వేధించనున్నట్టు కనబడసాగారు. కెలింజ్ యిప్పుడు కూడ జాన్వైపు శతృత్వంతో చూశాడు. అమూల్యమైన యీ కళాయివేసేవాడితో యిక విరోధించలేకపోయాడు. బెదిరిపోయినవాడిలా అయ్యాడు.

తరువాత కెలింజ్ కోపంగా ఇలా అన్నాడు – “నీకియ్యబడిన వరాన్ని నీ కుటుంబంవరకే ఏకాంతంగా వాడుకోవాలి లేకపోతే కుదరదు.”

“నా కుటుంబానికి బోధించడం దేవుని దృష్టిలో మంచిదైనప్పుడు అది యితరులకు బోధించడంకూడా మంచిదౌతుంది కదా?”

“నేను నీ బైబిల్ను ఎదిరించలేను” – పెద్దగా అరిచాడు కెలింజ్. జాన్ బైబిల్ వాక్యాలను ఎక్కువగా ఉదహరించాడని తలుస్తూ అతడు – “నువ్వు కలవరపెడుతున్నావ్” అన్నాడు.

“ఇతరులతో కలిసి ప్రార్థించడం, వాళ్ళు నన్ను ప్రోత్సాహపరుస్తుంటే నేను వాళ్ళను ప్రోత్సాహపరచడం తప్ప నేను తప్పేం చేయలేదు” జాన్ అన్నాడు.

కెలింజ్ ముఖం ఎర్రబడింది. “నిన్ను మరలా జైలుకు పంపుతున్నాను బన్యన్. మూడు నెలల అనంతరం నువ్వు నీ బోధను విడిచిపెట్టి స్థానిక సంఘంలో హాజ రయ్యేందుకు లోబడమని అడుగుతాం. నువ్వు తిరస్కరిస్తే నిన్ను అమెరికా దేశానికి రవాణా చేస్తాం. నువ్వు మళ్ళీ ఇంగ్లాండ్ గనుక కన్పిస్తే నీకు ఉరి తప్పదు. ఇది మా తీర్పు!”

“వాళ్ళు కేవలం నిన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు బన్యన్. నువ్వు ఈ జైలు నుండి బయటకు వెళ్ళాలంటే చేయవలసిందల్లా యికపై బోధించడం మానుకోవడమే! యిది మాత్రం స్పష్టం” – ఆ తర్వాత పగటిగదిలోని ఒక ఖైదీ జాన్తో అన్నాడు.

జాన్ కోర్టు గుమాస్తా దగ్గరకు వెళ్ళి, యీ ఉత్తర్వులను గూర్చి అతనితో మాట్లాడాడు – “వాళ్ళు కేవలం నన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని నీవు నమ్ముతావా?”

“నే చెప్పదలచుకున్నది యిదే – చార్లెస్ రాజుకు మద్దతిచ్చినందుకు జడ్జి కెలింజ్ పదునెనిమిది సంవత్సరాలు విండ్సర్ కోటలో బందీగావించబడ్డాడు.”

జనవరి మధ్యకల్లా రాజు పార్లమెంటును రద్దు చేసినట్టు లండన్ నుండి వచ్చిన వదంతులతో జైలు అట్టుడికిపోయింది. పైకిమాత్రం అవి తగినంత సమూలమైన మార్పుల్లా కనబడలేదు. రెండవ చార్లెస్ అసాధారణ ద్రోహచింతనగల రాజుగా తన్ను తాను ఋజువు చేసుకుంటున్నాడు.

“జైలునుండి నేను బయటపడటం చాలా కష్టమని నీవనుకుంటున్నావా?” జాన్ మరో ఖైదీని అడిగాడు.

“ఇప్పట్లో నువ్వు బైటకు వెళ్ళలేవు. ఈ విషయాన్నిగూర్చి ఇక నీవు పెద్దగా ఆలోచించ నవసరం లేదు” – అడగని ప్రశ్నకు జవాబిచ్చాడు క్వాకర్.

“లండన్లో యింకా ఏం సంభవించాయో నీకు తెలుసా?”

థామస్ వెన్నెర్ నాయకత్వంలోని మతోన్మాదులు కొందరు ఒక గుంపుగా లండన్ నగరంలో చాలామందిని హత్యచేశారనీ, ప్రభుత్వాన్ని కూలద్రోయాలని యీ మతోన్మా దులు పట్టుదలతో ఉన్నారనీ, త్వరలోనే వాళ్ళెవరో అందరికీ తెలిసిపోతుందనీ జాను తెలిసింది.

ప్రతి అననుకూలవాది, ప్రతి క్వాకరు, జైల్లోవున్న ప్రతి ప్రెస్బిటేరియన్కుకూడ తెలిసిందేమిటంటే మత వ్యతిరేకులమీద రాజు ఓ సరిక్రొత్త అణచివేత విధానాన్ని ఆరంభించబోతున్నాడని. అటువంటప్పుడు దానికోసం ఈపాటికే జైల్లో ఉన్నవాళ్ళకంటే మించినవాళ్ళెక్కడ దొరుకుతారు? ఆ మాటకొస్తే వీళ్ళు సాధారణంగా అత్యంత దుస్థితినే అనుభవిస్తున్నారు.

ఎందుకు వీళ్ళు ఆ విషయమై మొదటి బంధితులు కాకూడదు? “ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు రవాణా చేయబడటమే నిజంగా సాధ్యమైన విషయంగా కన్పిస్తోంది బన్యన్” ఫిబ్రవరి ప్రారంభంలో పగటిగదిలో చెప్పాడు క్వాకర్. “నీకు మళ్ళీ రెండవ అవకాశం వీళ్ళివ్వకపోవచ్చు.”

“నీవు దేన్ని కోరుకుంటావు సోదరా? వర్జీనియానా లేక న్యూ ఇంగ్లాండ్నా?” – జాన్ అడిగాడు.

“మంచి వాతావరణానికిమాత్రం వర్జీనియానే నేను కోరుకొంటాను. అయితే మిగతా విషయాల్లో యిది అంత మంచిది కాదు బ్రదర్ బన్యన్. మనుషులు గొట్టాల్లో నింపుకుని పొగత్రాగే ఆ ఘాటైన పిచ్చిమొక్కకు పుట్టినిల్లు యీ. వర్జీనియానే.

ఈ పొగాకు పండించే తోటల్లో నల్ల ఆఫ్రికన్లు బానిసలుగా ఇప్పుడు పనిచేస్తున్నారు. నువ్వూహించినట్టు యిది రాచరిక వాదులకేగాని మనలాంటి వాళ్ళకు కోరుకోదగ్గ స్థలంకాదు.”

“అలాంటప్పుడు న్యూ ఇంగ్లాండ్ కోరుకోదగిందేనా?”

“అక్కడకూడ రోడ్ ఐలండ్లో మకాం వేయవచ్చు. ఎందుకంటే న్యూ ఇంగ్లాండ్ లోని మిగిలిన భాగమంతా అక్కడ స్థిరపడ్డ ఒక సంఘ నిరంకుశత్వం క్రింద ఉంది!” “చాలా బాగా చెప్పావ్” – మూడో మనిషి అన్నాడు – “అయినా అమెరికాకు తీసుకొని పోబడటం ఒక విధంగా దీవెనే. ఇంగ్లాండ్లో యిప్పుడు ప్రతివారినీ ఉరి తీస్తున్నారు. చివరకు ఆలివర్ క్రాంవెల్నకూడ.”

“ఆలివర్ క్రాంవెల్నా?” – ఆశ్చర్యంతో పెద్దగా అరిచాడు క్వాకర్.

“అతనెప్పుడో చనిపోయాడు” జాన్ అన్నాడు.

“అయినప్పటికీ రక్తపిపాసులు ఆలివర్ క్రాంవెల్ సమాధి గొయ్యిని త్రవ్వి తీసి, రెండేళ్ళ క్రితంనాటి అతని అస్తిపంజరాన్ని ఛారింగ్ కూడలివద్ద ఉరితీశారు. కుళ్ళిపోయిన అతని తలను వెస్ట్ మినిస్టర్లో ప్రదర్శనకు పెట్టారు.”

‘ఇంతకన్నా దురదృష్టకరమైన వార్త యింకేముంటుంది?” – జాన్ తనలో తాను అనుకొన్నాడు.

ఓ స్వేచ్ఛా ఖైదీ

ఓ స్వేచ్ఛా ఖైదీ

‘తన ప్రియమైన ఎలిజబెత్ బిడ్డను కోల్పోయిందన్న!’ వార్తను వినగానే పెద్దగా ఏడ్చాడు జాన్. “ఎటువంటి సందేహం లేదు! తాను చెరసాలలో ఉన్న విషయం ఎలిజబెత్ను బాగా కలవరపరచి ఉంటుంది. ఆమెలోని ఆ ఆందోళనే ఆమె గర్భస్రావానికి కారణం!” జాన్ రోదించాడు. వెంటనే జైలర్ను ఒంటరిగా కలుసుకొని తనను యింటికి వెళ్ళేందుకు అనుమతించమని అడిగాడు జాన్.

“ఇప్పుడుకూడ నీ పరిస్థితి తీవ్రంగానే ఉంది బన్యన్” – జైలర్ అన్నాడు – “జడ్జి కెలింజ్ యింకా నీపై కోపంగానే ఉన్నాడు. ఒకవేళ నీ పరిస్థితి అంత తీవ్రంగా లేకున్నా కూడ నిన్ను యింటికి పంపలేను. ఎందుకంటే లండన్లోని మతోన్మాదులు కొంతమందిని హత్య చేశారట. ఇంగ్లాండు చర్చి వ్యతిరేకులను ఎవరినీ బయటకు వెళ్ళేందుకు నేను అనుమతించను. కొంతకాలం ఆగు.”

జైలర్ను యిబ్బందులకు గురిచెయ్యడం జాన్కు యిష్టంలేదు. ‘తనెంత కాలం జైల్లో ఉండాలో, జైలర్వద్ద ఎంత ఉపకారం పొందాలో ఎవరికి తెలుసు? పగటి గదిలో తాను బైబిల్ చదువుకుంటున్నప్పుడూ, తను తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తు న్నప్పుడూ అతడు చూసీచూడనట్లు వెళుతున్నాడు.’ అయితే జాన్ హృదయం ఎలిజ బెత్ను గురించి రోదిస్తోంది.

“దేవా! దయచేసి మేరీ, నా సవతి తల్లి ఆనీలు ఆమెను ఓదార్చేట్లు చెయ్” అని జాన్ ప్రార్థించాడు.

ఏప్రిల్ నెల మొదటి వారంలో జాన్ పగటిగదిలో ఉన్నప్పుడు కోర్టు గుమాస్తా వచ్చాడు. విచారణ ముగిసి అప్పటికి మూడు నెలలయింది.

“బన్యన్, ఎలాగున్నావ్?” గుమస్తా అన్నాడు.

“వందనాలు. బాగున్నానండీ!”

“నువ్వు దేశ చట్టానికి విధేయుడవై, బహిరంగ సభలు నిర్వహించకుండా ఉండేందుకు యిష్టపడతావేమోనని కనుగొనేందుకు నేను యిక్కడకు పంపబడ్డాను. లేనిపక్షంలో రాబోయే త్రైమాసిక సమావేశాల్లో నిన్ను అమెరికా పంపడం జరుగుతుంది. లేదా యింకా దౌర్భాగ్యంగా యిక్కడే భూగృహాల్లో ఉండిపోతావ్.”

“అయ్యా! నన్ను జైల్లో పెట్టేందుకు ఉపయోగపడ్డ ఆ పాత చట్టం, చెడును బోధించే వారికోసం రూపింపబడినటువంటిది.”

“మతోన్మాదులుకూడ అదే అంటారు!” – సానుభూతిగా నవ్వాడు గుమస్తా – “బన్యన్! విను, నువ్వు దేవునిచే బోధించడానికే పిలువబడ్డావని నీవు తలంచే పక్షంలో, నువ్వు చేసే యీ బోధించే పని రహస్యంగా ఒక్కొక్కరికే బోధిస్తూ ఎందుకు చెయ్య కూడదు?”

“నేను నా బోధద్వారా ఒక్కరికి మంచి చెయ్యగలిగినప్పుడు, ఇద్దరికి నేనెందుకు చెయ్యకూడదు? అలా అలా …

“వందమందికి ఎందుకు చెయ్యకూడదు అంటావు. అంతేగదా? నువ్వు మంచే చేస్తున్నావని మాకెట్లా తెలుస్తుంది. నువ్వు చెడుకూడ చేస్తుండొచ్చు. అందుకనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్వారిచే రూపొందించబడిన ప్రత్యేక ప్రార్థనావిధానం అనుమతించ బడింది”.

“ఈ విషయాన్ని లేఖనాలే పరిష్కరించనీయ్!” సలహా యిచ్చాడు జాన్. విచారణ జరుగుచున్నప్పుడు జాన్ యేవిధంగా తన బైబిల్ పరిజ్ఞానంతో న్యాయమూర్తులను ఖంగుతినిపించాడో అది జ్ఞాపకం తెచ్చుకుంటూ తాను ఉచ్చులో పడబోతున్నట్టు పసిగట్టాడు గుమస్తా.

చివరకు జాన్ లొంగిపోడని నిర్ధారించుకొని నిరాశతో అతడు విరమిస్తూ – “వాళ్ళు చెప్పింది నిజమే బన్యన్, మన ఇంగ్లాండ్ అంతటిలో నీవంటి వాడు మరొకడు లేడు!” అని గొణుక్కుంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు గుమస్తా.

“ఏం జరిగింది బన్యన్?” తర్వాత అడిగాడు క్వాకర్.

“నేనింకా యిక్కడే ఉండబోతున్నాను నేస్తం.”

“ఏ విధంగానైతేనేం మనం యిక్కడినుండి బయటపడవచ్చు. మరో మూడు వారాల్లో చార్లెస్ పట్టాభిషిక్తుడు కానున్నట్లు నేను విన్నాను. అతడు తన దయాసూచకంగా చాలామంది ఖైదీలను విడుదల చేస్తాడు …

ఎలాగైనా ఎవ్వరైనాసరే ఎప్పుడూ ఖైదులో ఉండబోరు … ఎందుకంటే బ్రీడావద్ద అతని ఉద్దేశ్యపూర్వక ప్రకటన ….. అతని నిష్కాఠిన్య వాగ్దానాన్నిబట్టి .. …” – కటువుగా చెప్పుకుపోతున్నాడు క్వాకర్.

ఆ పట్టాభిషేకం రానూ వచ్చింది, పోనూ పోయింది. కొంతమంది ఖైదీలు విడుద లయ్యారు. కాని జాన్, క్వాకర్ మాత్రం విడుదల కాలేదు. తీవ్రమైన శిక్షానిర్వహణను తాత్కాలికంగా నిలుపుదల చేశారంతే! అతడు అమెరికాకు పంపబడటం లేదు. లేదా తీర్పు అమలుపర్చబోవడమూ లేదు.

ఈ లోపుగా అతణ్ణి పట్టించుకోకుండా మరచి పోయారు. తమ చావు తప్పదని జాన్ మరియు క్వాకర్ పరస్పరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు.

“ఇంగ్లాండ్ మొదటి చార్లెస్ రాజుతోసహా చాలామంది ఈ మరణశిక్షను అనుభవించడాన్ని మన జీవితకాలంలో మనం చూశాం” – క్వాకర్ అన్నాడు – “ఆ సమయంలో ధైర్యంగా చావడం తప్ప ఎవరూ చేయగలిగిందేమీ ఉండదు.”

ఆ చావునుగూర్చి జాన్ కాసేపు తనలోతాను ఊహించడం ప్రారంభించాడు ‘తాను ఒక నిచ్చెన నెక్కడం … మందంగా ఉన్న ఉచ్చుముడి తన మెడచుట్టూ బిగుసుకు పోవడం …” “చావునుండి ఒక వెంట్రుకవాసి దూరంలో కూడ వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నాను మిత్రమా.

దేవుడు నావైపు చూసినా చూడకపోయినా, కాపాడినా, కాపాడకపోయినా దేవుని వాక్యంకొరకు నిలబడటం నా బాధ్యత. మునిగినా తేలినా, మోక్షం వచ్చినా లేక నరకమే ప్రాప్తించినా, వధ్య స్థానంనుండి నిత్యత్వంలోనికి వెళ్ళడం మాత్రం ఖాయం. యేసయ్యా, నువ్వు నన్ను కాపాడదలచావా కాపాడు. లేదంటేకూడ నీ నామంలో నేను దీన్ని చేస్తాను.”

వసంతఋతువు ప్రారంభంలో జాన్ తన సమయాన్నంతా దాదాపు చెరసాలకూ, సిల్వర్ స్ట్రీట్్కూ మధ్యనున్న ఆవరణంలో గడుపుతూ వచ్చాడు. ఉదయాన్నే గడ్డి పరుపుమీదనుండి లేవడం, కాసేపు వళ్లు విదిలించుకోవడం, ఆ తర్వాత ఆవరణలోనికి వెళ్ళేందుకు అనుమతి పొందడం… యిదీ అతని మామూలు దినచర్య.

శీతాకాలమంతా పగటి సమయాన్ని పగటిగదిలో ఎండకు కూర్చోడంలోను, బైబిలు చదవడంలోను, ఖైదునుండి బయటపడే అవకాశాలనుగూర్చి యితర ఖైదీలతో చర్చించడంలోను, సలహా లివ్వడంలోను, బోధించడంలోను గడిపాడు. అప్పుడప్పుడూ వ్రాస్తుండేవాడు. ఇప్పుడు వ్రాయడంలో తీరికలేకుండా తన సమయాన్ని గడపడం ప్రారంభించాడు.

రోజూ జైల్లో పెట్టే సామాన్యమైన భోజనం తినడానికి మాత్రమే వ్రాయడం ఆపేవాడు. ఎప్పుడైనా ఎలిజబెత్ క్యాబేజి, కంద లేదా క్యారెట్ల పులుసు జైలరుద్వారా పంపేది. దానితో జాన్ విందు చేసుకొనేవాడు. మిగతా సమయాల్లో వ్రాసుకుంటూ ఉండేవాడు.

స్టెర్న్హోల్డ్ మరియు హోప్కిన్స్లు వ్రాసిన పాటల పుస్తకంనుండి జాన్ కీర్తనలు పాడుకొనేవాడు. అవి దేవాలయాల్లోనూ, సైన్యం కవాతుచేసే సందర్భంలోనూ ఆలపించ బడేవి. ఈ పాటల కవిత్వం నాలుగు పాదాల వాక్యాలతో వ్రాయబడినవి. ఎలాంటి ఉత్సాహం లేకుండా నిర్లిప్తంగా ఉన్న జానన్ను ఈ పాటలు ఒక్కసారిగా మేల్కొల్పాయి.

మేరీతో కలిసి తాను “పరలోకానికి సామాన్యుని కాలిబాట” (The Plain Man’s Pathway to Heaven) అన్న గ్రంథాన్ని చదివినప్పటినుండి అలాంటిదే ఒకటి వ్రాయాలని జాన్ ఆశించేవాడు. ఒక కథను చక్కగా సృష్టించగల నేర్పరితనం దేవుడు తనకిచ్చాడు.

ఒక క్రొత్త పంథాలో అలాంటి రచనలు చేయాలని జాన్ నిర్ణయించు కొన్నాడు. అంతే! అతని మెదడు సంభాషణలతో నాట్యం చేయడానికి ఎంతో కాలం పట్టలేదు. క్రీస్తుకూ పాపికీ మధ్య జరిగిన ఒక సంభాషణను అతడిలా వ్రాశాడు :

నీ దయను ప్రభూ అంగీకరిస్తాను నేను దాన్ని నాదానిగా నీ కృప ఉచితమనీ, నీ వాక్కు యిలా చెబుతోందనీ నేనంగీకరిస్తా నీవైపు మళ్ళీ మళ్ళీ నే మరలివస్తా నా మరణ సమయమప్పుడు ప్రభూ నే భయపడనుగాని నీ ప్రేమనే నేను గాఢంగా హత్తుకొంటా … పాపంలో ఉన్నప్పటికీ యింకా నీ ప్రేమలోనే నేనున్నా ఇంకా ప్రాపంచిక బంధాలను నే విడువనప్పటికీ పరమునకు నను చేర్చగలిగేవి నా క్రియలు కాదుగాని కేవలం నీ కృపయే ప్రభూ…

వచనం తర్వాత వచనం జాన్ యిలా వ్రాసుకు వెళుతున్నాడు. చివరగా తన వ్రాత ప్రతిని క్వాకర్కు చూపించాడు. “దీన్ని చదివి నీ అభిప్రాయం తెలుపు మిత్రమా.”

చదవాల్సిందేముంటుంది బన్యన్. నీకూ మా క్వాకర్లకూ నీ రచనలతోనేగదా పోట్లాటలు!” – కాని అతడు బన్యన్ వ్రాసిన కవిత చదివి చాలా ఆనందించాడు – “చాలా బాగుంది మిత్రమా. నీవు దీన్ని తప్పక ప్రచురించాలి.”.

“మన దేశంలో యిప్పుడు దేన్నీ ప్రచురించలేము. ఇక లండన్, ఆక్స్ఫర్డ్, క్రేంబిడ్జిలకు వెలుపల ప్రచురించడమంటే దాదాపు అసాధ్యమైన విషయం.”

“కాని ఫ్రాన్సిస్ స్మిత్ అని లండన్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి దీన్ని చేస్తాడు” క్వాకర్ అన్నాడు.

“ఫ్రాన్సిస్ స్మిత్ వ్రాసిన కొన్ని రచనలు నేను చదివాను. అతనిప్పుడు జైల్లో ఉన్నాడని నేననుకొంటున్నాను.”

“లేదు, జైల్లో లేనట్లే!”

“కాని నేను జైల్లో ఉన్నానుకదా మిత్రమా. నేనతని దగ్గరకు ఎలా వెళ్ళగలను?”

“నీవిక ఎప్పుడూ జైల్లోనే ఉంటావా ఏంటి? విడుదలై బయటికి వెళ్ళవూ?”

కాని జాన్ విడుదల పొందలేదు. వచ్చే ఆగస్టు నెలలో జరిగే త్రైమాసిక సమావేశాల్లో తన కేసు తిరిగి విచారణకు వచ్చేందుకు జాన్ ప్రయత్నం చేస్తున్నాడు. తన కేసు పునర్విచారణకు వచ్చినట్టయితే, తాను అన్యాయంగా నేరారోపణకు గురయ్యానని న్యాయమూర్తులను తప్పక ఒప్పించగలడు.

తాను ఈ నేరారోపణమీద ఏమైనా పోరాడదలచుకున్నాడా అని కోర్టు గుమస్తా మామూలు ధోరణిలో అడిగాడు. తాను తప్పక పోరాడతానని జాన్ బదులిచ్చాడు. కాని న్యాయవిచారణ సమావేశాలు సమీపించినప్పుడు విచారణ పట్టీలో తన పేరు లేదని జాన్కు తెలిసింది.

సమావేశాలు జరుగుతున్న రోజుల్లో ఒక రాత్రి హఠాత్తుగా జైలరు అతణ్ణి తన గదిలోంచి బయటికి తీసుకొనివచ్చి పగటిగది మీదుగా ప్రక్క గదిలోనికి నడిపించి చిమ్మచీకట్లోకి మెల్లగా త్రోశాడు. జాన్ చెరసాల బయటున్నాడు.

ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో వర్తకులు ప్రధాన వీధిలో మైనపు వత్తులు వెలిగిస్తే తప్ప బెడ్ఫోర్డ్ వీధులు రాత్రిళ్ళలో వెన్నెల వెలుగులో ఉండాలి, లేదంటే చీకట్లో ఉండాలి. కొన్ని నిమిషాల్లో జాన్ తన కుటుంబంతో ఉన్నాడు.

“ఈ రాత్రి అతడు నన్ను బయటకు పంపడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” – ఎలిజబెత్తో అన్నాడు జాన్.

“బహుశా నువ్వు నా కథ వినాలని కాబోలు అలా పంపి ఉంటాడు.”

“నీ కథా?”

“అవును, ఈ రోజు సమావేశం జరుగక మునుపు జడ్జీలను వాళ్ళ చాంబర్లలో నేను కలిశాను.”

“అలా చేశావా?”

“ఓహ్, ఆ అధికారులముందు నేనెంత వణికిపోయాననుకున్నావ్! అక్కడున్న జడ్జీలలో మాథ్యూ హేల్ అనే జడ్జిగారు చాలా మంచి మనిషి. సరైన విన్నపాలను తప్పక వింటాడని తెలిసింది.”

“మరి నీ విన్నపం విన్నాడా?”

“లేదు, కాని చాలా విచారపడ్డాడు. ”

తర్వాత జైల్లో జాన్ విన్నదేమంటే … ఎలిజబెత్ జడ్జీలవద్దకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిందట. చాలా తీవ్రంగా తన ప్రయత్నాలను కొనసాగించింది. వాళ్ళను చితక బాదినంత పనిచేసింది. ఆమెనుగూర్చి జాన్ చాలా గర్వించాడు. మొండి పట్టుదలగల బన్యన్ కుటుంబీకులవలన యీ జడ్జీలకు దాదాపు కంటిమీద కునుకు కరువయ్యింది!

జైలరు అప్పుడప్పుడు జాన్ను బైటకు పంపుతుండేవాడు. జాన్ కొన్ని పర్యాయాలు ఫ్రీ చర్చికికూడ వెళ్ళాడు. కాని అదిప్పుడు రహస్యంగా సమావేశమౌతోంది. వాళ్ళ కూడికలు పొలాల్లోనూ, ధాన్యాగారాల్లోనూ, తోటల్లోనూ జరుగుతూ ఉన్నాయి.

చివరకు జాన్ తన వ్రాతప్రతులను లండన్లోని స్మిత్వద్దకు తీసుకెళ్ళాడు. స్మిత్ సంవత్సరానికి రెండు మూడుసార్లు జైలుకు వెళుతున్నప్పటికీ జాన్ వెళ్ళిన సమయంలో అదృష్టవశాత్తు ఆయన లండన్లోనే ఉన్నాడు.

జాన్ వ్రాసిన ‘లాభకరమైన ధ్యానాలు’ (Profitable Meditations) అన్న శీర్షికగల వ్రాతప్రతిని అతడు తీసుకున్నాడు. అయితే జాన్ బెడ్ఫోర్డుకు తిరిగి వెళ్ళే సమయానికి అక్కడి పరిస్థితులు బాగుండలేదు. అతడు జైలునుండి బయటకు వెళ్ళిన ఐదురోజుల గైరు హాజరును జైలర్ రహస్యంగా ఉంచలేకపోయాడు.

“నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళడానికి నేను నీకిచ్చిన వ్యవధిని మరీ ఎక్కువగా ఉపయోగించుకున్నావు బన్యన్” – అతనికిచ్చిన ఆధిక్యతను దుర్వినియోగం చేసినందుకు జైలరు జాన్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు.

“మీరు నన్ను బయటకు పంపినందున మీకు దేవుని ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి” సమాధానమిచ్చాడు జాన్.

జాను భవిష్యత్తు దుర్భరంగా గోచరించింది. అతనికి ఇంటి ధ్యాస ఎక్కువైంది. అతడు తన కుటుంబాన్ని పదేపదే జ్ఞాపకం చేసుకోసాగాడు. అంధురాలైన మేరీకి యిప్పుడు పదకొండు సంవత్సరాలు.

ఇప్పుడామె బొద్దుగా ఉండే చిన్నపిల్ల కాదు, అందమైన రెల్లులాంటి యువతి. బెట్సీకి యిప్పుడు ఏడు సంవత్సరాలు. తెలివిగా, మేరీలా కాకుండ తన వయస్సుకు తగినట్లుగా నడుస్తుండేది. జానీకి ఐదు సంవత్సరాలు. మూడు సంవత్సరాల థామస్లో విధేయతతోబాటు పోకిరిచేష్టలుకూడా ఉన్నాయి.

వారాలు గడుస్తున్నాయ్. జాన్ ఏమీ వ్రాయనప్పుడు లేదా ఖైదీలకు సలహాలివ్వ నప్పుడు లేసులు ముడివేసే పని చేస్తుండేవాడు. ఇది బెడ్ఫోర్డులో మంచి పరిశ్రమ. కాని కొద్దిమంది మాత్రమే ఈ పని చేయడానికి యిష్టపడేవారు. జాన్ వీటిని వేలల్లో ముడివేసేవాడు. అతని సంపాదన ఎలిజబెత్కు పంపించబడుతూ ఉండేది. ఇప్పుడతడు జైల్లో ఉండి సంవత్సరమయింది.

రెండో సంవత్సరంలో జాన్ ఒక పాత కుర్చీ కాలుతో ఒక పిల్లనగ్రోవిని తయారు చేశాడు. అతనికి సంగీతమన్నా, నాట్యమన్నా, పాటలు పాడటమన్నా ఎంతో యిష్టం. ఇప్పుడతడు తనకుతానే వాయిద్యం వాయించడం నేర్చుకున్నాడు.

తన మోటు సంగీతం విన్న ఖైదీలు తనను ఎగతాళి చేస్తుంటే తాను దూరంగా జైలు ఆవరణంలోని ఒక మూలకు వెళ్ళి సాధన చేస్తుండేవాడు. త్వరలోనే వాళ్ళు గోలచేయడం ఆపి అతనితో బాటు తీయని రాగాలు తీయడం ప్రారంభించారు. దేవుడు జాన్పట్ల ఎంతో కృప చూపించాడు. తనలో అనంతమైన వరాలు ఉన్నట్లనిపించింది జానుకు.

జాన్ వ్రాయడం కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడు తన కవిత్వాన్ని మెరుగుపరచు కోవడంతోబాటు విస్తృతంగా వేదాంతం వ్రాయసాగాడు. రెండవ అంతస్తులోని పగటి గది ప్రార్థనా మందిరంగా అతనికి ఉపయోగపడేది.

ప్రసంగాలలో, రచనలలో అతడు నిమగ్నమయ్యాడు. తాను ఎంతో కొంత దీవించబడినట్టుగా జాన్ భావించాడు. అతణ్ణి జైల్లో ఉంచడమంటే అతని రచనా వ్యాసంగాన్ని మెరుగుపరచడమేనన్నమాట. చివరికి క్వాకరుకూడ అతని రచనలు చాలా బావున్నాయని అంగీకరించాడు.

1663 నాటికి జాన్ కవిత్వాన్ని చాలా రమ్యంగా వ్రాయసాగాడు. అతడు యింత వరకు నాల్గు . పాదాల ప్రక్రియలోనే వ్రాస్తూవచ్చాడు. అయితే యిప్పుడు పంచలయాన్విత మైన అసమపాద కవిత్వాన్ని మించి వ్రాయడానికి అతడు సాహసించాడు.

ఈ ప్రక్రియ పాడేందుకు అనువైందే గాని వినడానికి ధడేలుమనే శబ్దాలతో చెవులకు రసహీనంగా ఉంది. ‘చెఱ ధ్యానాలు’ (Prison Meditations) అని పిలవనున్న పుస్తకంలో చెరసాలలో విచిత్రమైన తన స్వాతంత్ర్యాన్నిగూర్చి అతడు యిలా వ్రాశాడు:

మనుష్యులు నా బాహ్య పురుషుణ్ణి వాళ్ళ గడులతో, ఊచలతో బంధించినా క్రీస్తునందలి విశ్వాసంతో నేను చుక్కలకన్నా పైకెక్కగలను. ఇక్కడ నాలో నివసిస్తోంది మంచి మనసాక్షి మది నిండా చల్లని ప్రశాంతికూడా ఇక్కడ నే సంకెళ్ళతో బంధింపబడివున్నా, ప్రతి అపరాధ భావననుండీ స్వేచ్ఛననుభవిస్తున్నా.

ఇక్కడ నేనూ, సత్యం ఒకటిగా బంధింపబడ్డాం, ఇలాగే చిరకాలం ఒకటిగా బంధింపబడే ఉంటాం; చేయీ చేయీ పట్టుకొని చిరకాలం నడుస్తాం, ఇది ముమ్మాటికీ సత్యం – ఇది ఎన్నటికీ వాస్తవం.

తనను ఖైదీగా బంధించినవారిని జాన్ ఎంతగా ద్వేషిస్తాడోనన్న సందేహం ఎవరికీ ఉండనక్కరలేదు. చివరకు అతని క్వాకర్ స్నేహితుడుకూడ జాన్ కవితల్ని చదువు ‘తుండగా తెల్లబోయాడు.

మంచివాళ్ళు శ్రమపడతారు దేవునికోసం చెడ్డవాళ్ళు మండిపడతారు వాళ్ళను చూసి … ఇక్కడ మనంకూడా చూస్తాం గిరగిరా తిరిగేవాళ్ళను గాలికోళ్ళలాగ ఎటు గాలి వేస్తే అటు … రాజకీయ నాయకులు చెబుతారెన్నో మాటలు స్థానాలకోసం లోకవాంఛలకోసం బాహ్యంగా కనిపిస్తారు ఎంతో బుద్ధిమంతుల్లా లోలోపల వాళ్ళెంతో కపట సహోదరులే

ఆ తర్వాతి సంవత్సరాల్లో అతడు ఐదు వేదాంత గ్రంథాలనూ, రెండు పద్య కావ్యాలనూ వ్రాశాడు. అయితే అతడు 1665 లో వ్రాసిన “కృపాసమృద్ధి (Grace Abounding) అనే గ్రంథం క్వాకర్ అభిప్రాయం ప్రకారం అన్ని గ్రంథాల్లో ఉత్తమ మైనది.

అది జాన్ వ్యక్తిగత ఆత్మీయ జీవిత చరిత్ర. అందులో అతని ఐదు సంవత్సరాల శ్రమలు, అంతకుముందు సంవత్సరాల చరిత్రకూడ వివరించబడ్డాయి. పాస్టర్ గిఫర్డ్ రి సలహాలను గుర్తుంచుకొనడం జాన్కు తేలికే.

యుద్ధంలో తన సేవల్ని జాన్ ప్రస్తావించ లేదు. రాచరికవాదులు యిప్పుడు అధికారంలో ఉన్నారు. యుద్ధాన్నిగూర్చిన ఏ ప్రస్తావనైనా జడ్జీల నిర్ణయం విషయంలో తనకు కీడు కలిగించవచ్చు.

“బహుశ రాబోయే కాలంలో మరికొన్ని వివరాలను నేను జోడించవచ్చు. ఇప్పుడవి వ్రాయడం సాధ్యంకాదు” – క్వాకర్తో జాన్ అన్నాడు.

“బన్యన్, నీవెప్పుడూ అధైర్యపడలేదా?”

“నేను అదే మాట నిన్ను అడుగుతున్నా. అయితే క్రీస్తు మనకు ఆదరణ అని మనిద్దరికీ తెలుసు. ఏ మనుష్యుడు క్రీస్తునందుంటే అతడు బానిసకాదు, ఖైదీ కాదు. క్రీస్తులో ఉండటమంటే స్వేచ్ఛగా ఉండటమే.”

కాని జాను తెలుసు, తాను పరిపూర్ణతకు దూరంగా ఉన్నానని. క్రీస్తుతో ఒడం బడిక చేసుకొన్నవాడు తన ఆత్మీయ దుస్థితిని గూర్చిన ఎరుక తప్పక కలిగివుంటాడు. ప్రతివాడూ దేవునితో ఎల్లప్పుడూ అత్యంత నిజాయితీని కలిగివుండాలి. “కృపాసమృద్ధి” పుస్తకం చివరిలో జాన్ తనలో యింకా ఊగిసలాడే సప్తవ్యసనాలను ఒక జాబితాగా రూపొందించాడు :

  1. అవిశ్వాసం వైపు తాను మొగ్గు చూపడం.
  2. క్రీస్తు బయలుపరచే కృపాప్రేమలను తాను హఠాత్తుగా మరచిపోవడం.
  3. ధర్మశాస్త్రసంబంధమైన క్రియలవైపు తాను మరలడం.
  4. ప్రార్థనలో తాను చల్లారిపోవడం.
  5. తానేం ప్రార్థన చేస్తాడో దాన్ని గమనించడాన్ని మరచిపోవడం.
  6. లేనివాటినిగురించి సణగటం, ఉన్నవాటిని గురించి నిందించటం.
  7. పరి. పౌలు రోమా 7:21 లో చెప్పినట్టు; కాబట్టి మేలు చేయగోరు
    తనకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము తనలో కనబడుట.

అయినప్పటికీ అంతములేని యీ భావోద్వేగాలకు దైవోద్దేశం ఏదో తప్పక ఉండి ఉంటుందని జాన్ అంగీకరించవలసి వచ్చింది. అవి పైకి వ్యతిరేకంగా కనిపించినా కొన్ని మంచి లక్షణాలను కలుగజేయడానికి సహాయపడ్డాయని అతడు వాటినో జాబితాగా రూపొందించాడు :

  1. అవి నన్ను నేను అసహ్యించుకొనేట్లు చేశాయి.
  2. అవి నా హృదయాన్ని నేను నమ్మకుండునట్లు చేశాయి.
  3. నా అంతరంగంలోని నీతివర్తన చాలినంతలేదని అవి నన్ను ఒప్పించాయి.
  4. యేసువద్దకు పరుగెత్తి వెళ్ళవలసిన ఆవశ్యకతను అవి నాకు చూపించాయి.
  5. అవి నన్ను దేవుని ప్రార్థించునట్లు బలవంతం చేశాయి.
  6. జాగరూకత, మెలకువ కలిగి ఉండవలసిన అవసరతను అవి నాకు చూపించాయి.
  7. అవి నన్ను క్రీస్తుద్వారా దేవుని ప్రార్థించేందుకు పురికొల్పి, తద్వారా ఆయన సహాయం పొంది లోకంలో మనుగడ సాగించడానికి తోడ్పడతాయి.

“కృపాసమృద్ధి” వ్రాతప్రతిని లండన్లో ఫ్రాన్సిస్ స్మిత్ అనే ఓ విప్లవ ముద్రికుని వద్దకు తీసుకెళ్ళాడు జాన్ స్నేహితుడు. స్మిత్ దాన్ని తీసుకోవడానికి తిరస్కరించాడు. అతడు అలా చెయ్యడానికి కారణం సానుభూతిలేక కాదుగాని, తన ముద్రణాలయంమీద దాడి జరిగి తాను శిక్షకు గురౌతానేమోనన్న భయంచేతనే! జార్జ్ లార్కిన్ అనే యువకుడు దాన్ని ముద్రించాడు.

కాని అది చాలా పేలవంగా ముద్రితమయ్యింది. అయితే అప్పటికే జాన్ తన మనస్సులో దాన్నిగూర్చి పునరాలోచన చేస్తున్నాడు. “ఏదో ఒక రోజు తన తప్పులు దిద్దిన గ్రంథాన్ని ఫ్రాన్సిస్ స్మిత్ ముద్రించకపోతాడా!” అనుకున్నాడు జాన్.

జాన్ సిల్వర్ స్ట్రీట్లో ఉన్న తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు చువ్వల కిటికీ దగ్గరకు వెళ్ళినప్పుడు అతడు ఒక పెద్ద కుటుంబాన్ని చూశాడు. అంధురాలైన మేరీకి యిప్పుడు పదిహేను సంవత్సరాలు. బెట్సీ, జానీ, థామస్ లు వరుసగా పదకొండు, తొమ్మిది, ఏడు సంవత్సరాలవాళ్ళు. పిల్లలు అశాంతిగా ఉన్నారు.

ఈ నాలుగు సంవత్స రాల్లో పిల్లలు తమ తండ్రిని కౌగలించుకోలేదు. వారికి జాన్ ఎప్పటికీ ఖైదులోనే ఉంటాడనిపించినట్లుంది. జాన్ ఊచలను పట్టుకొనకుండ ప్రక్కకు తొలిగాడు. ఒకసారి ఎలిజబెత్ ఇలా అన్నది – అతడలా ఊచలను గట్టిగా నిస్సహాయంగా పట్టుకొనివుంటే తన గుండె తరుక్కుపోయిందని, ఎలిజబెత్ తన ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుకంటే యింకా ఎంతో పెద్దదిగా కనిపిస్తోంది.

ఏం, ఎందుకు కనిపించదు? తండ్రిలేని కుటుంబం, అందులో నలుగురు పిల్లలు ఆమెమీద భారంగా ఉన్నారు. అందునా ఇద్దరు చిన్న అబ్బాయిలు రోజంతా రాచి రంపాన పెట్టే వయసున్నవాళ్ళు.

“నువ్వు చాలా విచారంగా కనబడుతున్నావు ఎలిజబెత్” – 1665 మే నెలలో కొన్ని వారాలు గడిచిన తర్వాత జాన్ తన కిటికీవద్ద నిలువబడి దుఃఖంగా అన్నాడు.

“లండన్ నుండి విషాదవార్త బన్యన్” అంతే విచారంతో ఆవిడ అంది.

“డవ్వాళ్ళతో యుద్ధం భయంకరంగా ఉందా?”

“ప్లేగు వ్యాధి” – ఆమె భుజాలు ఎగురవేస్తూ నిస్సహాయంగా అంది.

ప్లేగు! కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రపంచాన్ని తుడిచివేసిన యీ ప్లేగు వ్యాధి ప్రతిసారీ బహిర్గతమౌతోంది. చరిత్రలో యిది పునరావృతమైతే దీని వినాశనాన్ని గూర్చి ప్రజలెంత భయపడిపోతారో! అంతేగాక ప్రతి సంవత్సరం ఇంగ్లాండులో ఎక్కడో ఒకచోట యిది బహిర్గతమౌతూనే ఉంది. అయితే సాధారణంగా యిది డజన్లకొద్దీ ప్రజల ప్రాణాలనుమాత్రమే దహించి, ఆ తర్వాత విచిత్రంగా క్రమేణా మరుగైపోతోంది.

జాన్ కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత, యీ సంభాషణంతా విన్న ఓ పెద్దాయన ఇలా అన్నాడు, “ఇతరులను అంటిపెట్టుకోవడం చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ ఒక జైలరో, ఒక కాపలాదారో లేదా ఖైదీయో ఏదో ఒక విధంగా మన మధ్యకు ప్లేగును తెస్తే, అది నిప్పులా మన జైలునంతా తుడిచివేస్తుంది.”

“ఏంటది?” అడిగాడు క్వాకర్. ఇతడు అనుభవజ్ఞుడైన ఖైదీగా క్రొత్త విషయా లేమిటో చాకచక్యంగా పసిగట్టగల నైపుణ్యంగల వ్యక్తి.

“ప్లేగు” జాన్ అన్నాడు.

“ఇక్కడ బెడ్ఫోర్డులోనా?”

“ఇంకా లేదులే. లండన్లో వ్యాపిస్తోంది.”

“చాలా రోజులుగా నాకేం బాగుండడం లేదు” – క్వాకర్ ఆందోళనగా అన్నాడు.

“కాస్త తమాయించుకో మిత్రమా” – జాన్ అన్నాడు – “బాగా లేకపోవడం ఒక విధంగా ప్లేగు వ్యాధి లక్షణమేననుకో, అయినా దానికి ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి. తల నొప్పి, కడుపులో వికారం, వాంతులు, కీళ్ళ నొప్పులు .

“నువ్వు చెప్పింది నిజమే బన్యన్” – వయస్సు మళ్ళిన ఒక ఖైదీ అన్నాడు – “ఇది 1636 లో ప్రబలినప్పుడు నేను లండన్లో ఉన్నాను. వ్యాధిబారినపడ్డవాడికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అయితే ప్లేగు వచ్చిందనడానికి తిరుగులేని లక్షణం బాగా నొప్పిపుట్టే గడ్డలు కోడి గ్రుడ్డంత పరిమాణంలో గజ్జల్లోనో, చంకల క్రిందో, లేదా మెడమీదనో లేస్తాయి” అని చెప్పి క్వాకర్వైపు చూసి ఇలా అన్నాడు – “ఏంటి మిత్రమా నీకలాంటివేమైనా … ?”

“దేవునికి స్తోత్రం, నాకలాంటి గడ్డలేం లేవు.”

“ఈ మహమ్మారి చాలా తీవ్రంగా ప్రబలుతుంది. దాన్నిగురించి పెద్దగా చర్చిం చాల్సిన పనిలేదు. నాలుగు రోజుల్లో మీరంతా సమాధి గొయ్యిలోనికి పోయేవాళ్ళే” – నిట్టూర్చుతూ అన్నాడు ఆ పెద్దాయన.

“తప్పకుండా కొంత కోలుకోవడం ఉంటుందిలే” – ధృడంగా అన్నాడు క్వాకర్ . “దేవునికి ఏదైనా సాధ్యమే.”

“ప్రతి ముగ్గురికీ ఒకరు కోలుకుంటారు” – పెద్దాయన అన్నాడు – “ఒక్క వారం తట్టుకున్నారంటే మీరు కోలుకున్నట్టే.”

లండన్లో ప్లేగును గూర్చిన పుకార్లు ఎక్కువయ్యాయి. జూన్ నెల మధ్యకల్లా వారాంతపు మరణాల సంఖ్య వందకన్నా ఎక్కువగానే ఉన్నాయి. వ్యాధి తగ్గేవరకు గృహాలు వెలివేయబడ్డట్టు ప్రత్యేకంగా ఉంచబడ్డాయి. తలుపుమీద “రెడ్ క్రాస్” గుర్తు వేయబడింది. చాలామంది బిగ్గరగా ప్రార్థిస్తున్నారు: “ప్రభూ, మాపై దయచూపు!”

జూన్ చివరికల్లా జైలర్ ముప్పయ్మంది ఖైదీలను ఒక పగటి గదిలోనికి పిలిపించాడు – “స్నేహితుల్లారా, గతవారం లండన్లో మరణాల సంఖ్య రెండువందలకు మించిపోయింది. ధనవంతులు పల్లె ప్రాంతాలకు వలసపోతున్నారు.

కొంతమంది యిక్కడకు రావచ్చు. కొద్దిమందికి ప్లేగువ్యాధి ఉండి ఉండవచ్చు. అది తెలుసుకోవడానికి నేనెవర్ని? అయితే నాకు తెలిసిందేమిటంటే మనందరికీ ఈ వ్యాధి సోకేవరకు దానికోసం ఎదురుచూస్తూ మనం యిక్కడే మూటగా పడివుండలేం”.

“అసలు విషయానికి రండి!” – భయపడ్డ ఓ ఖైదీ వెంటనే అన్నాడు.

“మీరు మీ యిండ్లకు వెళ్ళవచ్చు. నేను కోరుకునేది … మీరు మీ యిళ్ళకు వెళ్ళాక వీధుల్లోకి వెళ్ళకుండా మీమీ యిళ్ళలోనే ఉండేట్లు చూసుకోండి. మీరు మళ్ళా యిక్కడకు రావలసిన అవసరం లేదు. అర్థమయిందా? మన స్నేహితుడు బన్యన్ యీ సమయంలో లండన్కు దూరంగా ఉండాలని వేరే హెచ్చరించాల్సిన పనిలేదనుకుంటాను.”

అలా జాన్తోసహా ఖైదీలంతా తమ తమ యిళ్ళకు వెళ్ళిపోయారు. ఇళ్ళూ వాకిళ్ళూ లేని ఖైదీలుమాత్రం జైల్లోనే ఉండిపోయారు. ఒకసారి జైలు పలచబడిన తర్వాత పెద్దగా ప్రమాదమేం ఉండదు. ఇంటిదగ్గర జాన్ రచనలు చేశాడు, లేసుల ముడులు వేశాడు. కుటుంబంతో సంతోషించాడు. పిల్లలకు పాఠాలు శ్రద్ధగా చెప్పాడు.

జానీ, థామస్ లు అతి కష్టంమీద చదవగలరని అతడు గ్రహించాడు. ఎలిజబెత్ వాళ్ళను బడికి పంపించాలని అనుకుంది కాని, అందుకు తగిన సహాయంకూడ అవసరమే. తరచుగా మగపిల్లలు బడి ఎగ్గొడుతున్నారు.

జాన్కు మరోసారి హృదయంలో అపరాధ భావన కలిగింది … తన తండ్రి తనను బడికి పంపినప్పుడు తాను కచ్చితంగా బడికే వెళ్ళానని నమ్మించడం తనకు జ్ఞాపకంవచ్చి అతడు హృదయంలో బాధపడ్డాడు.

చివరిగా ప్లేగు బెడ్ఫోర్డులోనికి పాకింది. ఇప్పుడు రెండో కేసు నమోదయ్యింది. ఇంకా ఎక్కువయ్యాయికూడ. బెడ్ఫోర్డులోని మరణాలన్నీ ఔసె నదికి ఉత్తరంగానే ఉన్నాయి. జాన్ తన కుటుంబం గురించి భయపడ్డా, నదికి దక్షిణాన ఉన్న తన సవతి తల్లీ, అరవై రెండు సంవత్సరాల తండ్రీ మరియు వాళ్ళ పిల్లల ప్రాణాలనుగూర్చి కూడ భయపడ్డాడు.

వ్యాధిబారిన పడినవాళ్ళను పెస్ట్ హౌస్ క్లోజ్ అనే దూరపు పొలాలలో పాతిపెట్టారు. బెడ్ఫోర్టు చుట్టుప్రక్క ప్రాంతాలన్నీ కళావిహీనమై పోయాయి. ఐతే లండనుండి వచ్చే విస్తృత వార్తలు మహా ఘోరంగా ఉన్నాయి.

“లండన్లోని దుకాణాలన్నీ ఇప్పుడు మూతపడుతున్నాయి. థేమ్స్ నదిమీద ఒక్క పడవకూడ లేదు” – జాన్ యింటికి తరచుగా వస్తూ పోతూ ఉండే ఒక స్నేహితుడు ఆగస్టు చివర్లో అన్నాడు.

“నిజానికి మరీ యింత ఘోరంగా ఉండకుండా ఉండాల్సింది” ఎలిజబెత్ అంది.

ఆ స్నేహితుడన్నాడు – “ఈ ప్లేగు వ్యాధి లండన్లోని అమాయకులైన పేదప్రజలను మరీ విపరీతంగా పొట్టన పెట్టుకుంటోంది. శవాలను పాతిపెట్టేవారు అనేకులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసినా తమ పనిని ముగించడం వారికి అసాధ్యమవు తోంది. శవాలను బండ్లలో కుప్పలుగా వేసి నగరం వెలుపట ఆరుబయట పొలాల్లో సామూహికంగా పాతిపెడుతున్నారు.”

“చనిపోయినవారి సంఖ్య అడగాలంటేనే భయంగా ఉంది” నిట్టూర్చాడు జాన్.

“గడచినవారం లండన్లో ఆరువేలమంది చనిపోయారు” – ఆ స్నేహితుడు చెప్పాడు.

“రాజును మళ్ళీ వెనక్కు తెచ్చుకున్నందున దేవుడు లండనీమీద తన ఉగ్రతను కురిపిస్తున్నాడా?” బెట్సీ అడిగింది.

“రాజూ, అతని ప్రభుత్వమూ ఉగ్రతను తప్పించుకున్నారు. ఇప్పుడు బాధపడే వాళ్ళంతా సామాన్యజనం. బహుశా సైతాను దీని వెనుక ఉండి ఉండవచ్చు” – జాన్ అన్నాడు.

ఈ ప్లేగు చావులు అక్టోబర్ నెల నాటికి తగ్గిపోయాయి.

‘దేవునికి స్తోత్రం, అది తన దుష్టత్వాన్ని జరిగించాల్సినంత జరిగించి చివరికి ఆగిపోయింది!’ జాన్ తనలో తాననుకొన్నాడు. నవంబర్ మాసాంతానికి వారాంతపు మరణాలు మూడువందలు. భయంకరమైన వార్తలిప్పుడు ఉపశమనంతో స్వాగతించ బడ్డాయి. ముగింపు కనుచూపుమేరలో ఉంది.

1666 క్రొత్త సంవత్సరం నాటికి జనం తిరిగి లండన్కు రావడం, తిరిగి దుకాణాలను తెరవడం ప్రారంభించారు. బెడ్ఫోర్డులోని రెండువేలమంది నిర్వాసితుల్లో నలభైమంది చనిపోయారు. అయితే లండన్లో చనిపోయినవారి సంఖ్యమాత్రం ఎక్కువగా ఉంది. ఒక్క సంవత్సరంలో లండన్ నగరం ఇంగ్లాండులో జరిగిన సుదీర్ఘ అంతర్యుద్ధాలలో చనిపోయినంతమందిని పోగొట్టుకుంది.

ఇంటివద్ద జాన్ వివిధ భావోద్రేకాలతో నిండిపోయాడు -“దేవునికి స్తోత్రం. ప్లేగు ఘట్టం ముగిసిపోయింది. అయితే నా భయమంతా తిరిగి నేను జైలుకు వెళ్ళాల్సి ఉంటుందేమోనని.”

“నాకైతే మరో క్రొత్త చట్టాలు వస్తాయనిపిస్తోంది” – ఆశాభావంతో అంది ఎలిజబెత్ – “బహుశ రాచరికవాదులు తమ ప్రతీకారం తీర్చుకునే ఉంటారు. కొద్ది కాలంలోనే వాళ్ళు నిన్ను జైలునుండి యింటికి వెళ్ళిపొమ్మనవచ్చు.”

“నాకీ స్వేచ్ఛాదినాలు సంప్రాప్తించినందుకు దేవునికి వందనాలు. పిల్లలు యిప్పుడు చదవటం, వ్రాయటం నేర్చుకోవచ్చు. అయినా దేవుడు మనకిచ్చిన గొప్పవరం ఉండనే ఉందిగా!”

“నిజమే! అదో అద్భుతం” తీయని స్వరంతో ఎలిజబెత్ అంగీకరించింది. జాన్ తిరిగి జైలుకు వచ్చేసరికి జైలు వాతావరణంలో మార్పు కనిపించింది. క్వాకర్ ఇప్పుడు జైల్లో లేడు. దేవుడు తనకిచ్చిన గొప్ప బహుమానాన్నిగూర్చి జాన్ క్వాకర్తో చెబుదామను కున్నాడు. కాని అతడక్కడ లేడు. కాబట్టి జాన్ జైలర్తో చెప్పాడు, “నేస్తం, నా భార్య ఎలిజబెత్ ఓ బిడ్డను ప్రసవించనుంది.”

“బహుశ బిడ్డ పుట్టబోయే సమయానికి నువ్వక్కడుంటావ్” ప్రోత్సహించాడు జైలర్.

జైల్లో యిప్పుడు పరిస్థితులు చాలా వెసులుబాటుగా ఉన్నాయి. జైలరు నమ్మకస్థులైన ఖైదీలను రాత్రిళ్ళు బయటకు పంపుతున్నాడు. ఇతర ఖైదీల్లాగ ప్రతి సమాచారాన్నీ జాన్ రొట్టెలాగ గట్టిగా నమిలేస్తున్నప్పటికీ, అతడు కోర్టు గుమస్తాను దర్శించేందుకు యింకా సిద్ధపడలేదు.

“బన్యన్, నువ్వు పెరోల్మీద బైటకు వెళ్ళబోతున్నావు.”

వసంతంలో ఆడశిశువైన శారా పుట్టినప్పుడు జాన్ యింటివద్దే ఉన్నాడు.

ఫ్రీ చర్చీ సభ్యత్వం యాభైకి పడిపోయినా అది రహస్యంగా కూడుకుంటూనే ఉంది. కొన్ని వారాలు జాన్ సంఘ సభ్యులకు వ్యక్తిగత సలహాలిచ్చాడు. ఎలిజబెత్ తిరిగి బలం పుంజుకునేందుకు అతడు సమయం యివ్వాలి. కుటీరానికి చెయ్యాల్సినవి ఏవేవో కొన్ని పనులున్నాయి.

తన బిడ్డలతో తాను సమయం గడపాలి. పుస్తకాలు అచ్చువేసే ఫ్రాన్సిస్ స్మితన్నుండి తన పుస్తకాల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాల్సి ఉంది. అయితే అతడు తన పరలోక పిలుపును మన్నించాల్సిన సమయంకూడ అతనికి ఆసన్నమయింది.

జాన్ మళ్ళీ సందేశాలు యివ్వడం ప్రారంభించాక శ్రోతలు ప్రతి ప్రసంగం తర్వాత ఉప్పొంగిపోసాగారు. త్వరలోనే కొన్ని వందలమంది దూరంగా ఎక్కడో ఒక పొలంలోని ఓక్ చెట్టు క్రిందనో, ఎండుగడ్డి కప్పువేసిన గిడ్డంగిలోనే గుమికూడేవారు. తాము పట్టుబడితే ఏం సంభవిస్తుందోనని తలచుకొని జాన్ వణికిపోయేవాడు.

జులై మాసంలో ఒక రోజున జాన్ తన ప్రసంగం ప్రారంభించగానే, “జాన్ బన్యన్, నువ్వు దేవుని కుమారుణ్ణి నమ్ముతున్నావా?” అంటూ ఓ వ్యక్తి రొప్పుతూ ముందుకు వచ్చి అడిగాడు.

“అవును, ప్రభువు నిన్ను దీవిస్తాడు.”

“నేను ఒక కానిస్టేబుల్ని. నువ్వు చట్ట వ్యతిరేకమైన కూడికను నిర్వహిస్తున్నావ్.” మరోసారి జాన్ భారీ ఓక్ తలుపుగుండా గ్రామ చెఱసాలలోనికి ప్రవేశించాడు.

విడుదలైన బోధకుడు

విడుదలైన బోధకుడు

“బన్యన్” రొప్పుతూ పిలిచాడు జైలర్.

“ఏంటి మిత్రమా?”

“నీ విషయం నాకు చాలా విచారంగా ఉంది. చూడు, నువ్వు నీ బోధను ఎందుకు వదులుకోకూడదు?”

“రాజుగారు మత స్వాతంత్ర్యాన్ని ఎందుకంగీకరించకూడదు?”

విషయ పరిజ్ఞానమున్న ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు రాజు మత స్వాతంత్ర్యం యివ్వడానికి ప్రయత్నిస్తున్నాడని జాన్ తెలుసుకున్నాడు. మత వ్యతిరేకులకు విరోధంగా రూపొందించబడిన తీవ్రమైన నిషేధాజ్ఞలు పార్లమెంటు బలవంతంగా ప్రవేశపెట్టినవే.

అయితే వాళ్ళకు పైకి అర్థమయ్యిందేమిటంటే ఈ మత స్వేచ్ఛను ప్రోత్సహించడంవలన రాజుగారు కథోలిక్ మతానికి మద్దతు పలుకుతున్నాడని. అతని తమ్ముడు జేమ్స్ ఒక్క పేరు విషయంలో తప్ప అన్నిటిలోను కథోలిక్కేనన్న విషయం అందరికీ తెలిసిన సంగతే.

“ఎటువంటి మెలిదిరిగిన, ఆందోళనకరమైన ప్రపంచాన్ని మనుషులమైన మనం తయారుచేసుకున్నాం?” జాన్ వ్యాఖ్యానించాడు.

జాన్ లేసులు ముడివేస్తున్నాడు, ఖైదీలకు ఆత్మీయ సలహాలిస్తున్నాడు, చివరకు తనను కలవాలని బయటనుండి వచ్చేవాళ్ళకు కూడా జైలర్ అనుమతిమీద అతడు ఆత్మీయ సలహాలిస్తున్నాడు. మిగతా సమయాల్లో వ్రాస్తున్నాడు.

కొంతకాలం “పరలో కానికి సామాన్యుని కాలిబాట”వంటి హాస్యపూర్వకమైన భావార్థ గ్రంథం వ్రాద్దామను కున్నాడు గాని, అంతకంటే సుగంధభరితమైన వచన కావ్యాన్ని, మధ్యమధ్య పద్యాలు చిలకరిస్తూ వ్రాస్తే బాగుంటుందనుకున్నాడు.

తాను వ్రాసిన ‘కృపా సమృద్ధి’ గ్రంథాన్ని చదివినవారు తామా గ్రంథాన్ని చదివి బాగా ఆత్మీయాభివృద్ధినొందామని చెప్పగా జాన్ విన్నాడు. ఇంకా ఎక్కువ ప్రతుల్ని ముద్రించాలని అతడు ప్రేరేపించబడ్డాడు.

కాబట్టి అతడు దాన్ని పునఃపరిశీలన చేశాడు. అది బహుశ అతని ఆత్మీయ యాత్రకు సంబంధించిన విషయమే కావచ్చు. కాని అదే అతని మనస్సులో ఎప్పటినుండో మెదలుతున్న బృహత్ కథావస్తువు.

1666 సెప్టెంబరులో చెరసాల మళ్ళీ లండన్ నుండి వచ్చే వార్తలతో నిండిపోయింది.

“మొదట్లోనేమో ప్లేగు, యిప్పుడేమో యిది!” – ఊపిరి బిగబట్టి అరిచాడో ఖైదీ.

“ఈ వార్త నీకెలా తెలుసు?” అడిగాడు మరొకడు.

“లండన్నుండి గ్రేట్ నార్త్ రోడ్డు వరకూ అందరి నోటా యిదే వార్త. ”

“ఏంటది?” జాన్ అడిగాడు.

“లండన్లో ఓ గొప్ప అగ్ని ప్రమాదం.”

లండన్ అంతా విచిత్రమైన చెక్క నిర్మాణాలతో పక్షిగూళ్ళలా అల్లుకుపోయిందని జాను తెలుసు. “ఎవడైనా సరే ఇళ్ళ కప్పులమీదనుండే లండన్ అంతా పరుగెత్త వచ్చు” జాన్ సణిగాడు.

“కాబట్టి నిప్పుకూడ అలాగేనన్నమాట” – జాన్ ఆలోచనను పూర్తిచేస్తూ ఓ ఖైదీ జోడించాడు.

వాళ్ళంతా మళ్ళీ రాబోయే తాజా వార్తలకోసం ఎదురుచూడసాగారు. అవి ఉర వడిగా రానేవచ్చాయి.

ప్లేగు తన పని ముగించుకోవడానికి తొమ్మిది నెలలు పడితే, యీ అగ్ని తన పనిని ఐదురోజుల్లోనే ముగించుకుంది. మళ్ళీ మరోమారు దేవుని ఉగ్రతనుగూర్చిన చర్చ వచ్చింది.

“చార్లెస్ రాజూ, అతని పార్లమెంటు సభ్యులూ కూడా అలానే భావిస్తారని నేను ఆశిస్తున్నాను. బహుశ తాము అణగద్రొక్కినవాళ్ళను వాళ్ళు స్వేచ్ఛగా వదిలేయవచ్చు” జాన్ అన్నాడు.

వేలాదిమంది లండన్వాసులు కేవలం కట్టుబట్టలు తప్ప సర్వం కోల్పోయారన్న వార్తలు విని ఎవరు సంతోషిస్తారు? ఫ్రాన్సిస్ స్మిత్ గిడ్డంగిలో నిల్వ చేయబడిన తన పుస్తకాల ప్రతులన్నీ కాలిపోయాయని విని జాన్ చాలా దుఃఖించాడు.

జాన్ న్యాయమూర్తులు మరియు కానిస్టేబుళ్ళద్వారా చాలా క్షోభను అనుభవిం చాడు. 1668 హేమంత ఋతువునాటికి అతడు జైలునుండి బయటకూ, బయటి నుండి తిరిగి జైలుకూ పదేపదే త్రిప్పబడ్డాడు. బోధించాలన్న తొందరపాటు యిప్పుడు అతనిలో పెద్దగా లేదు. అది అతడు మళ్ళీ తీవ్రంగా అదుపు చేయబడటానికి మాత్రమే కారణమౌతుంది.

తనకు లభ్యమైనదాన్నే తాను తీసుకోవాల్సి ఉంటుంది. అలా తలంచి అతడు సంఘసభ్యుల సమస్యలకు పరిష్కారాలు సూచించేందుకూ, వివాదాలు పరిష్క రించేందుకూ, బలహీనులకు బోధించేందుకూ తన సమయాన్ని వెచ్చించసాగాడు.

ఏదో తెలియని ఒక గొప్ప భావావేశం ఓ పెద్ద రచననుగూర్చి అతణ్ణి ఆలోచింప చేసింది. అతడిప్పుడు “పరలోక ప్రయాణికుడు” అనే కరపత్రాన్ని వ్రాస్తున్నాడు. ఇది పరలోకంకోసం, రక్షణకోసం ఒక మనిషిచేసే పరుగుపందానికి సంబంధించినది.

ఇది మనిషి విజయానికి పూర్తి అవరోధాలతో కూడుకొన్నట్టిది. తమని విడిచిపెట్టవద్దని స్నేహితులు అతణ్ణి బ్రతిమాలతారు. దారి చుట్టూ తిరిగి చిత్తడి నేలకు తీసుకెళ్ళడం, కొన్ని మార్గాలు మూసుకుపోవడం వంటివి అందులో ఉంటాయి.

ఇతర పందెగాళ్ళు ఎందుకు ఓడిపోయారనేదానికి ఆచార్యులు అబద్ధాలను ఆక్షేపణ లేకుండ అంగీక రించడం, సందేహాలతో బరువెక్కి పోవడంలాంటివి సవాలక్ష కారణాలు చూపబడ తాయి. అతడు దాన్ని వ్రాయడం మొదలుపెట్టాక అది పెరిగి పెరిగి ఒక కరపత్రం పరిమాణాన్ని మించిపోయింది. వాస్తవానికి అదొక చిన్నసైజు పుస్తకమయ్యేట్టుంది. జాన్ ఆ వ్రాతప్రతిని ప్రక్కనపెట్టాడు. ఈ కథావస్తువుతో ఒక విస్తృతమైన రచన ఏదో చేయాలని అతని మనసు అతనికి బోధిస్తోంది.

ఒక పెద్ద రచనను తలపెట్టేందుకు ఏదో శక్తి అతణ్ణి పురికొల్పుతోంది. ఇప్పుడు దేన్ని ముద్రించాలన్నా కష్టమైన పనే. అందుకు జాన్లాంటి కొంతమందికి అస్సలు అనుమతి దొరకదు. అనేక సంవత్సరాల సమయం తీసుకునే బృహత్తర సాహిత్య రచనకు ఉపక్రమించేందుకు సరైన సమయం యిదేననిపించింది జాన్కు.

ప్రక్కన పెట్టలేనంత ఆసక్తికరమైనదీ, మరచిపోలేనంత విజ్ఞానదాయకమైనదీ అయిన ఒక రచనను అతడు సృష్టించాలనుకున్నాడు. చివరిగా “పరలోక ప్రయాణికుడు” అనే కథావస్తువునే తీసుకొని దాన్నే ఒక పెద్ద కథగా మలచాలనుకున్నాడు. తొలిసారిగా తన పాపాన్నిగూర్చి తెలుసుకొన్న ఒక వ్యక్తి తన క్లిష్టమైన గమ్యాన్ని చేరడాన్ని గురించి అతడు ఒక కథ వ్రాయాలనుకున్నాడు.

“అతణ్ణి ఓ యాత్రికుణ్ణి చెయ్” సలహా యిచ్చింది ఎలిజబెత్.

“పరలోకానికి వెళ్ళే యాత్రలో . లోతుగా ఆలోచిస్తూ అన్నాడు జాన్.

“మహిమకరమైన పట్టణానికి” మేరీ బిగ్గరగా అన్నది.

“కాని మహాకష్టాలతో” ఆనందంతో చప్పట్లు కొడుతూ అంది ఎలిజబెత్.

త్వరలోనే జాన్ తన మహాకావ్యంలోని మొదటి భాగాన్ని పూర్తిచేశాడు. అది ఒక వ్యక్తి నిద్రనుండి మేలుకొని తాను కన్న కలను తిరిగి జ్ఞాపకం చేసుకునే రూపంలో వ్రాయబడింది. కథకుడు వినాశపురంలో నివసించే క్రైస్తవుడను పేరుగల వ్యక్తినిగూర్చి కలగంటాడు.

క్రైస్తవుడు బైబిల్ను చదవడం ప్రారంభించాక తన వీపుమీదనున్న గొప్ప పాపభారాన్నిగూర్చి తెలుసుకొని వేదన చెందుతాడు. చాలా దినాలు అతడు మైదానాల్లో ఏడుస్తుంటాడు. చివరిగా సువార్తికుడనే వ్యక్తి అతణ్ణి ఓదార్చి ఆ పాపభారాన్ని వదిలించు కోవాలంటే దూరంగా కన్పించే ఒక చిన్న ద్వారం దగ్గరకు వెళ్ళడమే మార్గమని చెబుతాడు.

క్రైస్తవుని కుటుంబ సభ్యులంతా అతణ్ణి ఒక పిచ్చివాణ్ణిగా తలుస్తారు. తన కుటుంబాన్ని విడిచిపెట్టడం తనకు బాధకరంగా వున్నా తన భారాన్ని వదిలించుకోడానికి తాను తప్పక వెళ్ళాలని అతడు నిర్ణయించుకొంటాడు.

‘మొండివాడు’, ‘మెత్తనివాడు’ అనే పొరుగువారు అతణ్ణి ఆపడానికి ప్రయత్నిస్తారు. తనతో వచ్చేందుకు ‘మెత్తనివాణ్ణి’ క్రైస్తవుడు ఒప్పిస్తాడు. ‘నిరాశ ఊబి’ అనే బురదగుంటలో క్రైస్తవుడు దాదాపు మునిగి పోయేటప్పుడు ‘సహాయకుడు’ అనే వ్యక్తి అతణ్ణి బయటకు లాగుతాడు. ‘మెత్తనివాడు’ అప్పటికే వినాశపురానికి తిరిగి వెళతాడు. క్రైస్తవుని ప్రయాణం చాలా కష్టతరంగా
ఉంటుంది.

క్రైస్తవుడు ఆ ద్వారం దగ్గరకు వెళ్ళకముందే ‘లోకజ్ఞాని’ అనే వ్యక్తి అతణ్ణి కలసి కనిపించే పర్వతం దగ్గరకు వెళ్ళమనీ, అక్కడ ‘నీతి పట్టణం’ ఉంటుందనీ, అక్కడ ‘చట్ట బద్ధత’ అనే వ్యక్తి వద్ద సలహాలు పొందమనీ సూచిస్తాడు. అయితే అదృష్టవశాత్తు సువార్తికుడు క్రైస్తవునిలోని లోపాన్ని కనుగొంటాడు.

అతడు క్రైస్తవుణ్ణి తిరిగి పెద్ద ద్వారం వద్దనున్న ఒక చిన్నద్వారం వద్దకు పంపిస్తాడు. అప్పుడు ఆ పర్వతం యిలా పెద్దగా గర్జిస్తుంది : “ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి విఫలమౌతారో వారంతా శాపగ్రస్థులు. ఎందుకంటే, ‘ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నియమాల్ని పాటించ డానికి ఎవరైతే విఫలమౌతారో వారంతా శాపగ్రస్థులు’ అని వ్రాయబడి ఉంది.”

“ఎవ్వరూ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నెరవేర్చజాలరు” వివరించాడు సువార్తికుడు.

క్రైస్తవుడు ఎవరితోనూ మాట్లాడేందుకు యిష్టపడక తన మార్గంలో తాను వెళ్ళేందుకు త్వరపడుతుంటాడు. అతడు మరలా మార్గాన్ని కనుగొని చిన్న ద్వారంవద్దకు వస్తాడు. ఆ ఇరుకైన చిన్న ద్వారంమీద ఇలా వ్రాయబడివుంది – b“తట్టుడి, మీకు తీయబడును.”b

అతడు ఆ తలుపు తట్టి ఇలా బిగ్గరగా ఏడుస్తాడు :

నేనిప్పుడు యిక్కడ ప్రవేశించవచ్చా?

లోపలనున్నవాడు నాకు ద్వారం తెరిచేందుకు యిష్టపడతాడా?

విడుదలైన బోధకుడు నేనొకవేళ అయోగ్యుడనూ, తిరుగుబాటుదారుడనైనప్పటికీ ఆయన నాకు ద్వారం తెరుస్తాడా! అలాగైతే యిక నేనెన్నటికీ తప్పిపోను, ఆయనకు నిత్య స్తుతిగానాలు ఆలపిస్తూ నే ముందుకెళతా.

అప్పుడు ‘సహృదయుడు’ అనే వ్యక్తి తలుపుతీసి, నిరంతరం పొంచియుండు సైతాను చివరిక్షణంలో అతనిమీద పడకుండా తక్షణమే అతణ్ణి లోపలికి లాక్కుంటాడు. తన బృహత్కావ్యంలోని మొదటి భాగపు ప్రారంభంలో జాన్ వ్రాసిన కథ యింతవరకే.

5000 పదాలున్న యీ మొదటి భాగపు ప్రారంభాన్ని జాన్తోవున్న కొందరు ఖైదీలు చదివారు. దాన్ని చదివేందుకు అతను కావాలనే మతాసక్తిలేని కొంతమంది నేరస్థులను ఎన్నుకున్నాడు. వాళ్ళు చదివినదాన్ని వివరించమని అతడు అడిగాడు. వాళ్ళ ప్రశ్నలను అతడు సావధానంగా విన్నాడు. తర్వాత పునఃపరిశీలన చేశాడు.

అతడు ప్రకటించిన ప్రతి సత్యాన్నీ లేఖనంతో సమర్థించాడు. ఎప్పుడూ వ్రాసినట్టు కాకుండా తరచుగా ‘మార్జిన్’లో అధ్యాయాన్నీ, వచనాన్నీ అతడు సూచించాడు. అతని కుటుంబ సభ్యులుకూడ వ్రాతప్రతిని పఠించారు గాని, ఖైదీల అభిప్రాయాలే అతని రచనను ఎక్కువగా ప్రభావితం చేశాయి.

రక్షణయాత్రకు సంబంధించిన విషయాలు అతని కుటుంబానికి సుపరిచితమే. అయితే జాన్ రక్షణావశ్యకత ఉన్నవాళ్ళను రక్షించాలనుకున్నాడు. ఖైదీలు అర్థం చేసుకోవడంమాత్రమే కాదు, అది వాళ్ళను హత్తుకునేంతవరకు ప్రతి విభాగంమీదా అతడు పనిచేశాడు.

అతని కథ ఏవిధంగా చూసినా ఒక అసాధారణమైన కథా వస్తువుగా రూపొందు తోంది. క్రైస్తవుడు నిరాశా ఊబినుండి బైటపడటానికి సహాయం పొందేంతవరకు తానున్న ఆ ఊబికి అనేక ఉపరితలాలున్నాయి. ఆ బురద ఊబిని బాగుచేయడానికి ప్రభువు ఒకవేళ పూనుకున్నా అది బాగుపడనటువంటిది.

ఒక పాపి తాను ‘పాపి’ననే నిశ్చయతకు చివరగా వచ్చినప్పుడు భయసందేహాలు ఉత్పన్నమై, అర్థంలేని ఆందోళనలూ అపవిత్రతా ఆ నిరాశలోనికి వస్తాయి.

వెయ్యి సంవత్సరాలుగా లక్షలాది ఉపదేశాలతో ఆ బురద ఊబిని పూడ్చేందుకు బండ్ల కొద్దీ మట్టిని కుమ్మరిస్తున్నారు ప్రభువు సేవకులు. వారు బురదగుంటలోనికి మెట్లు నిర్మించినా, భయాలూ సందేహాలూ పాపుల్ని ముంచివేయగా వాళ్ళు ఆ గుంటలో దబ్బున పడుతుంటారు.

“బన్యన్, దీన్నెప్పుడు అచ్చువేసేవాని దగ్గరకు తీసుకెళతావ్?” బాగా పునఃపరిశీలన చేయబడిన పాఠాంతరాన్ని క్షుణ్ణంగా చదివి ఆమోదించిన ఒక ఖైదీ అడిగాడు.

“ఇదిప్పుడే ప్రారంభించిన కథ” – జవాబిచ్చాడు జాన్ – “ఈ రక్షణ యాత్ర చాలా సుదీర్ఘమైనది. చాలా కష్టమైంది కూడా. నేననుకుంటాను … ముగించబోయే నాటికి యీ కథ నువ్వు చదివిందానికన్నా పది రెట్లుండవచ్చు.”

“నిజమా? అలాగైతే యిలాంటి రచన యింతవరకు ఎవరూ చేసి ఉండరు” ఆశ్చర్యపోతూ అన్నాడా వ్యక్తి.

“బహుశ అందుకేనేమో దేవుడు నన్నీ చెరసాలలో ఉంచాడు. లేకపోతే దీన్ని పూర్తిచేయడానికి నాకు సమయముండేది కాదు.” చాలా రోజులు జాన్ అలానే అనుకునేవాడు. చెరసాల అతనికి ఎవరూ ఆటంక పరచని కార్యాలయం అయింది.

“అంధకారమయంగానున్న నీ జీవితంలో ఓ ఆనందకరమైన స్థితిని తప్పక చూస్తావు” – నొసలు చిట్లించి అన్నాడా వ్యక్తి.

“క్రీస్తువద్దకు రావయ్యా, అప్పుడు ఏ నియంతా నిన్ను ఖైదీగా చెయ్యలేడు” – జాన్ ఆ వ్యక్తితో అన్నాడు.

తన సుదీర్ఘ దినాలన్నింటిలో జాన్ చెరసాలలోనే కూర్చొని ఉన్నప్పటికీ అతడు వ్యర్థంగా తన రోజుల్ని గడపడం లేదుగాని, వాస్తవంగా తన జీవితంలోని ప్రతి క్షణాన్నీ అతడు ఆస్వాదిస్తూ తన బృహత్ కావ్యంలోని వెలుగును చవిచూస్తూ ఉన్నాడు. తన బృహత్ కావ్యానికి తాను వ్రాసిన పీఠికలో ఆ గ్రంథ రచనావిధానాన్ని పద్యరూపంలో యిలా వ్రాశాడు :

మన ఈ సువార్త దినాల్లోనూ ప్రభుని కృపాకాలంలోనూ, పరిశుద్ధుల పరలోక పరుగును గురించి వ్రాస్తూ, ఇరవై అంశాలను గురించి చిత్రీకరించాను;
ఇంకా యిరవై అంశాలు నా మదిలో మెదుల్తున్నాయి, అగ్ని జ్వాలల్లోంచి ఎగిసిపడే నిప్పురవ్వల్లాగా, అవి యింకా నాలో ద్విగుణీకృతమౌతూనే ఉన్నాయి.

నిప్పురవ్వలు నిజంగానే నింగికెగిసాయి. జాన్ ఆలోచించడం ప్రారంభించాడు. అతని మనస్సులోనుండి ఆలోచనలు మెరుపుల్లా బయటకు రాసాగాయి. నదులు, పర్వతాలు, కొండలు, యింకా కవచాలు, యుద్ధాలు … జాన్ తన జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్ళిపోయాడు. షార్పెన్హూ (Sharpenhoe) దగ్గరనున్న పర్వతాలను వాటి సౌంద ర్యాన్నిబట్టి అతడు ఎంతగా ప్రేమించి అభిమానించాడో! అవి యిప్పుడు అతని కావ్యంలో మనోహర పర్వతాలుగా మారాయి.

అతడెంతగానో యిష్టపడ్డ హాటన్ గృహం (Hough ton House) యిప్పుడు అతని సౌందర్య గృహం (House Beautiful) అయింది. ఈ సౌందర్య గృహాన్ని విపరీతమైన శ్రమలేకుండా చేరలేరు గనుక జాన్ దీన్ని ‘శ్రమ పర్వతం’ (Hill of Difficulty) అని పేరుగల ‘నిటారు కొండ’ (Precipitous Hill) గా వర్ణించాడు.

అది తన భార్య మేరీ ఆమె బాల్యంలో మోకాళ్ళతో చేతులతో ఎక్కడానికి అవస్థపడ్డట్టు ఆమె వర్ణించిన హెల్స్బీ కొండ (Helsby Hill) నూ, దాన్ని ఎక్కడానికి ఆమె పడ్డ శ్రమనూ జ్ఞాపకం చేసుకుంటూ అతడు వ్రాశాడు.

తన కథలో అతనికి యింకా చాలా పాత్రలు కావల్సివచ్చాయి. ప్రతి పాత్రా సజీవంగా ఉండేందుకు తనకు తెలిసిన వాస్తవ వ్యక్తులనే అతడు దృష్టించాడు. ‘మెత్తనివాడు’ ఒక వాస్తవమైన వ్యక్తి, ‘మొండివాడు’ కూడా వాస్తవమైన వ్యక్తే. అన్ని పాత్రలనూ అతడలాగే తీసుకున్నాడు.

జాన్ తన నిజ జీవితంలోని న్యాయమూర్తియైన కెలింజ్ జడ్జిగారిని క్రైస్తవునియొక్క దుష్ట న్యాయవాదియైన ‘సుగుణద్వేషి’ (Judge Hate-good) గా మల్చడంలో ఒక వింతైన సంతృప్తిని పొందాడు.

రాంటర్లు, కులీనులు, రక్షకభటులు, ఆచార్యులు, పాస్టర్లు, వ్యాపారులు వీరంతా సజీవంగా కాగితంపై దర్శనమిచ్చారు. కొంతమంది చెడు పక్షంగా ఉన్నవాళ్ళైతే, మరికొందరు దేవుని కృపచేత రక్షింపబడినవారికి ప్రాతినిధ్యం వహించారు.

కొద్దిమంది దోషం లేనివాళ్ళుకూడ ఉన్నారు. వాళ్ళ పేర్లు యిలా ఉంటాయి : నిరాడంబరం (Simple), బద్దకం (Sloth), మూర్ఖభావం (Presumption), ఆచారవంతుడు (Formalist), వేషధారణ (Hypocrisy), అపనమ్మకం (Mis- trust), పిరికితనం (Timorous), అశ్రద్ధ (Wanton), అసంతృప్తి (Discontent), అవమానం (Shame), వదరుబోతు (Talkative), పనికిమాలినవాడు (No-good), అపకార బుద్ధి (Malice), మంచి సంభాషణ (Say-well), ధనాశ (Money- love), అజ్ఞాని (Ignorance), వ్యర్థ నమ్మకము (Vain-confidence), ప్రక్కకు తొలగు (Turnaway), అల్ప విశ్వాసం (Little-faith), దుర్బల హృదయం (Faint-heart), అపరాధ భావన (Guilt), నాస్తికుడు (Atheist). ప్రాపంచిక విధానం (Carnal Policy), దయలేని (Graceless), మోసం (Deceit), వెనుదిరుగు (Turnback) అనే పట్టణాలనుండి వారు వచ్చారు.

ఆ దారి పొడుగునా సాతానుని భయంకరమైన సేవకులుంటారు. వాళ్ళు పిశాచులు, (Habgoblins), వన దేవతలు (Satyrs), జలరాక్షసి (Dragons), ఉన్నత దేహులు (Gaints) సింహాలు (Lions), భట్రాజులు (Flatterers), అవినీతిపరులు (Corrupt Men) మొదలైనవారు. వాళ్ళు త్రోవకు ఆవలగా ఉంటారు.

ధైర్యవంతులు కొందరు దారిలోనే చచ్చినవాడి గొంది (Deadman’s Lane), నిరాశ (Despair), విధ్వంసం (Destruction), ప్రమాదం (Danger), పచ్చికల ప్రక్కదోవ (By-path Meadow), మాయా సంత (Vanity Fair), అవమానాల లోయ (Valley of Humiliation), మరణచ్ఛాయల లోయ (Valley of the Shadow of Death), సమ్మోహన ప్రాంగణం (Enchanted Ground) మొదలైన ప్రదేశాల్లో ఉంటారు.

అయినా ప్రభువు సహాయకులు ఆ దారి వెంబడి ఉంటారు. వాళ్ళు సహనం (Patience), సౌశీల్యం (Amity), ప్రకాశమానులు (Shining Ones), వివేకము (Discretion), శ్రద్ధ (Prudence), పవిత్రత (Piety), ఔదార్యము (Charity), జ్ఞానము (Knowledge), జాగ్రత్త (Watchful), విశ్వసనీయత (Sincere), అను భవం (Experience) మొదలైనవారు. ఆ దారి వెంబడి రక్షణ (Salvation), విమోచన (Deliverance), ఆనంద దేశం (Beulah), ఆహ్లాదకరం (Delectable), హెచ్చరిక (Caution) అనే ప్రభువు పట్టణాలున్నాయి.

జాన్ ఆ గ్రంథమంతటా కవిత్వాన్ని చిలకరించాడు. క్రైస్తవుని ప్రయాణం చాలా సుదీర్ఘమైనదైనప్పటికీ అతడు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు తన వీపుమీదున్న భార మంతటినీ ఒక్కసారిగా వదిలించుకున్నాడు. క్షమింపరాని అతని నేరం యిప్పుడు క్రీస్తు రక్తంచేత చెల్లింపబడింది. అది అతని వీపుమీదనుండి దొర్లి ఒక సమాధి గుంటలో పడ్డప్పుడు అతడు పట్టలేని ఆనందంతో బిగ్గరగా యిలా పాడాడు :

బహుదూరంనుండి వచ్చాను నా పాపభారంతో, బాధలతో వేదనలతో నిరాశానిస్పృహలతో, నాలోని దుఃఖాన్ని నే పోగొట్టుకోలేకపోయాను; చివరిగా ఈ సిలువచెంతకు నే వచ్చేంతవరకు, నా పరమానందానికి యిదే కావచ్చు అద్భుత ప్రారంభం! దొర్లిపోయినందున నా వీపునుండి నా పాపభారం! నను బంధించిన సాతాను సంకెళ్ళు తెగిపోవుట ఖాయం, నా పరలోక యాత్రలో నా విజయమిక తథ్యం; ఎంత అద్భుతమైనదీ సిలువ! ఎంత అద్భుతమైనదీ స్థలం! ఎంత అద్భుతమైనవాడు నాకై సిలువొందిన నా ప్రియ ప్రభువు!

ఆ తర్వాత తన ప్రయాణంలో ప్రకటన గ్రంథంలోని గొప్ప విధ్వంసకుడైన అపొల్లు యోనును జయించిన పిదప క్రైస్తవుడు ఓ పాట పాడతాడు :

మహా బయల్లైబూబు,విడుదలైన బోధకుడు ఆ పిశాచాల అధిపతి రూపకల్పన చేశాడు నా అంతానికి, ప్రయత్నించాడు నా పతనానికి కట్లనుండి విప్పి పంపాడు వానిని, వాడు రౌద్రంతో
అది భరింపశక్యం కానిది, భీతావహంగా చిక్కుకుపోయాను సహాయం చేశాడు నా దేవుడు దీవెనకరమైన మిఖాయేలుద్వారా కత్తి వేటుతో చేశాను వెంటనే వాడు ఎగిరిపోయేటట్టు. కాబట్టి చెల్లించనివ్వండి ఆయనకు నిత్యస్తుతులు, కృతజ్ఞతలు, దీవించబడునుగాక నిత్యం ఆయన పరిశుద్ధ నామం.

జాన్ తన గ్రంథంమీద ఎంతో శ్రమించాడు. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూనో, వింటూనో, పునఃపరిశీలన చేస్తూనో వ్రాతప్రతిలోని పేజీలతో అతడు తలమునక లయ్యాడు. అతడిప్పుడు జాన్ ఫాక్స్ గారి “హతసాక్షుల గ్రంథం” అనే పుస్తకాన్ని స్వంతం చేసుకున్నాడు. అయితే అతని ప్రధాన గ్రంథాలయము బైబిల్ మరియు స్త్రీల పురుషుల, పేదల ధనికుల, పరిశుద్ధుల పాపుల మనస్సులే.

1670వ సంవత్సరం నవంబర్ జాన్ ఒక దశాబ్దకాలం జైలు జీవితాన్ని పూర్తి చేశాడు. పరిస్థితులు మారుతున్నట్టు జాన్ గమనించాడు. జైలరు అతణ్ణి రాత్రివేళల్లో బయటకు పంపడంవలన మరింత స్వేచ్ఛను అనుభవింపసాగాడు. అయితే ప్రతిసారీ జాన్ వెనక్కురావాల్సిందే.

బోధించడాన్ని నిత్యం మానుకోవాల్సి వస్తోంది. చివరిసారిగా తన బంధకాలనుగూర్చి యింటివద్ద బాధకరంగా గుర్తుచేసుకోవాల్సి వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల జానీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.

“జానీ! నీ భవిష్యత్తును గూర్చి ఏవైనా ప్రణాళికలు వేసుకున్నావా?”

కుర్రాడు నొసలు చిట్లించాడు – “నేను నీలాగా, తాతయ్యలాగా పాత్రలకు కళాయి వేసేవాణ్ణి అవుతాను” కటువుగా జవాబిచ్చాడు.

“మరయితే కళాయి వేయడంలో నీకెటువంటి అనుభవం లేదుగా!”

“ఇది ఇంగ్లాండ్ నాన్నా. నేను కళాయి వేసేవాణ్ణయినా కావాలి లేదా అడుక్కుతినే వాణ్ణయినా కావాలి.”

“మరీ అంత ఎక్కువగా నటించకు జానీ.”

“నీకు తెలుసు కష్టపడకుండా ఎవడూ జీవితంలో తన స్థానంనుండి ఒక్క అడుగుకూడ ముందుకు వెయ్యలేడని. నీ సంగతి చూడు” జానీ అన్నాడు.

అలా జ్ఞానోదయమై జాన్ చెఱసాలకు తిరిగి వచ్చాడు. “యాత్రికుని ప్రయాణం” రచన మందకొడిగా సాగింది. ఈ నూతన స్వాతంత్య్రం అతనిమీద మరింత భారాన్ని మోపింది. ఎందుకంటే అతడు తన సంఘసభ్యులకు సలహాలు యివ్వాలి. తన కుటుంబ బాధ్యతల్ని నిర్వహించాలి. వీటికితోడు అచ్చొత్తించే విషయంలో ఎడ్వర్డ్ ఫౌలర్ అనే వ్యక్తితో అనవసరంగా గొడవపడాల్సి వచ్చింది.

ఫౌలర్ మతవిశ్వాస విషయంలో ఉదార భావాలు కలిగిన వ్యక్తి. తనకు తాను విచక్షణాజ్ఞానం గలవానిగా భావించుకునేవాడు. అతడు నూతన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు అనుకూలంగా మారాడు. మారుతూ ‘మన క్రైస్తవ స్వేచ్ఛ మనలను మనం నివసించే ప్రదేశ ఆచారాలకు అనుకూలంగా మారేందుకు లేదా అనుగుణంగా ఉండేందుకు అనుమతిస్తుందని” ప్రకటనకూడా చేశాడు. తననూ, తన సిద్ధాంతాలనూ అంగీకరించని వాళ్ళను గర్విష్టులుగానూ, వివాదాస్పదులుగానూ అతడు ఎంచేవాడు.

ఫౌలర్ను తన వాడి కోరలతో జయించాలనుకున్నాడు జాన్. అతడు “విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట అను సిద్ధాంతాన్ని సమర్థించే ప్రతివాదం” అనే కరపత్రాన్ని వ్రాశాడు. దానిలో ఫౌలర్లాంటి మనుష్యులు “మురికి లాభాపేక్షకొరకూ, మృష్టాన్న భోజనాలతో బద్ధకపు శరీరాలను నింపడంకోసమూ తమ పూర్వపు విశ్వాసాన్ని బ్రద్దలైన ఓడవలె చేసుకొనే మూర్ఖ ప్రజలవలె ప్రవర్తిస్తున్నార”ని జాన్ తెలిపాడు.

ఫౌలర్ పదింతలుగా బదులు పలికాడు. బన్యను పూర్తిగా “నైతికంగా పతనమై దుర్భాషలాడే ఓ పనికిమాలిన వెధవ”, “మూర్ఖుడు”, “ఉన్మాదపూరిత ఉత్సాహవంతుడు”, “భరింపశక్యంగాని అమర్యాదస్థుడు”, “వికృతమైన పనికిమాలినవాడు”, “అహంకారి”, “గర్విష్టి” వీటికితోడు “భయంకరమైన దెయ్యం వంటివాడు” అంటూ వ్రాశాడు.

ఈ సమయంలో 1671 లో చార్లెస్ రాజుగారు మత అసమ్మతివాదులను క్షమించి మత స్వేచ్ఛా ప్రకటన చేస్తాడని ప్రజలు ఎదురుచూడటం జరిగింది. అయితే అటువంటి ప్రకటన ఏమైనా వెలువడితే జాన్ బన్యన్ మాత్రం దానినుండి మినహాయింపబడాలని ఫౌలర్ ఆశించాడు.

“ఈ ఖైదు మత వ్యతిరేకవాదులకు ఎలా కేంద్రం అయిందో అనే విషయాన్ని స్నేహితుడు ఫౌలర్ తెలుసుకోగలిగినట్లయితే ఎంత బాగుణ్ణు! ఎంత అద్భుతమైన యుద్ధాన్ని మనం ఈ చెరసాలలో కల్పిస్తున్నాం!” అని జాన్ వ్యాఖ్యానించాడు.

చెరసాలలో జాన్తోబాటు అనేకమంది అసమ్మతివాదులున్నారు. చివరకు న్యూ ఫోర్టు ప్యాగ్నెల్లోని తన పాత స్నేహితుడు పాస్టర్ గిబ్స్ సైతం కొంతకాలం కటకటాల వెనుక ఉన్నాడు. వాళ్ళు పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుకుంటూ తమ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

“తాము జైలునుండి విడుద లయ్యాక తమ సంఘాలను పూర్తి వేగంతో నడిపించేందుకు ఎటువంటి అనుకూలమైన విధానాలు చేపట్టాలి” అని వారు ప్రణాళిక వేసుకున్నారు.

ఇప్పుడు జాన్ దాదాపు తన పూర్తి కాలాన్ని సంఘ ప్రణాళికపైనే వెచ్చిస్తున్నాడు.

ఒకవేళ యీ మతస్వేచ్ఛ ప్రకటింపబడితే పాస్టర్ గారికీ, ఆరాధనా స్థలానికీ అనుమతులు మంజూరు చేయబడతాయి. కనుక జాన్ జైలు లోపలా, బయటా ఫ్రీ చర్చీ సభ్యులతో మంతనాలు గావించాడు.

జాన్ ప్రణాళిక ప్రకారం యిప్పుడు కేవలం యాభైమంది అల్పసభ్యత్వం ఉన్న ఫ్రీ చర్చీ 1671 చివరినాటికి ఆరు దేశాల్లో, ముప్పయ్ ఒక్క నిర్ధారితమైన కట్టడాలతో, జాన్తో కలుపుకుని ఇరవైయారుమంది బోధకులతో విలసిల్లబోతోంది.

“కాని జాన్, ఇది అంత పెద్ద సంస్థగా ఎదగడం వాస్తవమా, అవాస్తవమా!” అతని బృహత్ ప్రణాళికను అధ్యయనం చేస్తూ అడిగింది ఎలిజబెత్.

“అది నూటికి నూరు పాళ్ళు వాస్తవం” – నవ్వుతూ, తన తలవైపుకు చూపుతూ – “యిక్కడ వరకు” అన్నాడు జాన్.

“అయితే యిది ఎప్పుడు నిజమౌతుంది?” మేరి అడిగింది.

“రాజుగారూ, పార్లమెంటు వాళ్ళూ అనుకున్నప్పుడు. కొత్తవాళ్ళు యిప్పుడు పార్ల మెంటులో అధికారం చెలాయిస్తున్నారనీ, వీళ్ళు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు పెద్దగా మద్దతు యివ్వడం లేదనీ వదంతులు వస్తున్నాయి. కాబట్టి చివరకు రాజుగారు తన మతస్వేచ్ఛా ప్రకటనను జారీ చేయొచ్చు.”

1672 జనవరి 21న జాన్ చర్చీ సభ్యులు అతని స్వేచ్ఛను ముందుగా ఊహించి అతణ్ణి తమ పాస్టర్గా ఎన్నుకున్నారు. అది ఓ శుభసూచకం. ఆ రోజునుండి అతడూ, అతని కుటుంబం కొద్దిపాటి ఉపకారవేతనం మీద ఆధారపడసాగారు.

“వాళ్ళది ఎంత గట్టి నమ్మకం!” – జాన్ పెద్దగా ఆశ్చర్యపడుతూ అన్నాడు “నేనింకా అధికారికంగా యీ దేశపు ఖైదీనే!”

“రాజుగారు యిప్పుడు యే దినమైనా నిన్ను విడుదల చేయొచ్చు” – మేరీ అంది – “పదకొండు సంవత్సరాలు ప్రతి రాత్రీ నీ విడుదలకోసం నేను ప్రార్థన చేశాను.”

ఒక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కుమాత్రమే అనుమతినిచ్చేట్టు చట్టాన్ని మార్చడానికి పార్లమెంటు సభ్యులు నిరాకరించినందున, 1672 మార్చి 15న ఎట్టకేలకు రాజుగారు మత స్వేచ్ఛను ప్రకటించాడు.

అననుకూలవాదులు ఆరాధనకై సమాజంగా కూడుకో వచ్చు. కథోలిక్కులు తమ మతాన్ని అంతరంగికంగా ఆచరించవచ్చు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు యెడల తీవ్రవాంఛలేని యిప్పటి పార్లమెంటు సభ్యులు ఈ విషయంలో విజయం సాధించారు.

జాన్ తన “యాత్రికుని ప్రయాణం” కథను దాదాపు మూడొంతులు పూర్తిచేసి “అలా నేను నా కలనుండి మేల్కొని” అనే వాక్యంతో ఆపాడు. చెరసాలనుండి విడుదలైన జాన్ తన కుటీరంకేసి నడవసాగాడు.

అతడు చేయాల్సింది చాలా ఉంది. మే నెల నాటికి ఫ్రీ చర్చీయొక్క విస్తృత కార్యక్రమంకొరకై అనుమతికోసం అతడు అభ్యర్థన పంపుకున్నాడు. రాజుగారు ఈ అనుమతుల విషయం మెరుపు వేగంతో పనిచేస్తున్నట్టు కన్పించింది. అదే నెలలో అనుమతి పత్రాలు జాన్ చేతిలో వచ్చిపడ్డాయి.

ఆగస్టు నాటికి పాస్టర్ జాన్ బన్యన్, ఆయన స్థానిక సంఘ పెద్దలు కలిసి జోసియాస్ రఫెడ్ అనే వ్యక్తికి చెందిన గిడ్డంగి నొకదానిని ఆరాధనా కూడికల కోసం కొన్నారు. బెడ్ఫోర్డుకు తూర్పునవున్న లోతట్టు ప్రాంతంలోని భూభాగంలోవున్న యీ గిడ్డంగికి ఆధారంగా పండ్లతోటకూడ ఉంది.

దాన్ని చూసేందుకు జాన్ తన కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు మేరీకి ఇరవై రెండేళ్ళు. బెట్సీకి పద్దెనిమిది, జానీకి పదహారు, థామస్కు పధ్నాలుగేళ్ళు. ఆరేళ్ళ పాప శారా జాన్ చెయ్యి పట్టుకుని నడుస్తోంది. ఇది యింతటితోనే అయిపోలేదు. ఎలిజబెత్ తన గర్భంలో మరో పాపాయిని మోస్తూవుంది.

థామస్ ఆ గిడ్డంగిని చూసినప్పుడు గట్టిగా ఇలా అన్నాడు – “ఎందుకిది గుంటలో ఉంది!”

“లేదు” – జాన్ నవ్వాడు – “ఆ దక్షిణంగా చూడు.”

“అది ఒక గుట్ట లేదా కొండ. ఒకప్పుడు బెడ్ఫోర్డ్ కోట దానిమీద ఉండేది”

“అవును, నాలుగు వందల సంవత్సరాల క్రితం, యీ గుంట ఒకప్పుడు ఆ కోటచుట్టూ ఉన్న కందకం” – జాన్ అన్నాడు.

“ఈ చర్చీలోకి దిగి వెళ్ళడం సులభంగా అయ్యేపనికాదు” – పొడిగా వ్యాఖ్యానించింది ఎలిజబెత్.

“కాని ఆ ఫ్రీ చర్చీ పన్నెండు సంవత్సరాలుగా ఏ కట్టడం లేకుండా ఉండటాన్ని ఆలోచిస్తే … యిది నాకు ఒక రాజభవనంకంటేకూడ రమ్యమైందిగా కనిపిస్తోంది” – జవాబిచ్చాడు జాన్.

ఆ గిడ్డంగి “ప్రార్థనా కూడిక గిడ్డంగి”గా ప్రాచుర్యం పొందింది. తమ తక్కువ స్థాయి ప్రారంభాన్నిగూర్చి ఆ సభ్యులు ఏమాత్రం సిగ్గుపడలేదు. పాస్టర్ జాన్ బన్యన్గారు బెడ్ఫోర్డులో బాగా ప్రాచుర్యం పొందాడు. అతడు ప్యూరిటన్లు ధరించే సామాన్య మైన రంగుదుస్తుల్ని ధరించేవాడు. మోకాళ్ళవరకు ప్యాంటు ధరించి, మేజోళ్లు, బకిల్ ఉన్న బూట్లు అతడు వేసుకునేవాడు.

పొడవైన చేతులున్న తెల్లని చొక్కామీద వెన్కోటు వేసుకునేవాడు. బాగా ఎండలున్నప్పుడు చొక్కాపైన వెస్ట్ కోటు వేసుకొనేవాడు. ఎప్పుడూ వెడల్పైన అంచువున్న పొడవైన టోపీ ధరించేవాడు.

ఆ వీధి వెంబడి భారీ శరీరంతో వచ్చే వ్యక్తి చాలా సంవత్సరాలు జైల్లో గడిపిన “జాన్ బన్యన్” అని క్రొత్తవాళ్ళు ఆసక్తిగా జాన్ వైపు చూసేవారు. వెడల్పైన భుజాలతో కొత్తవాళ్ళు బెదిరిపోయేటంత పొడగరిగా ఉండేవాడు జాన్. ఆ సంగతి జానుకూడా తెలుసు. అయినా తాను వాళ్ళను సమీపించినప్పుడు అతని చుట్టూవున్న గొప్ప ప్రశాంతతను చూచి వారిలోని భయం పోయి అతనిపై అభిమానం, ప్రేమ పుట్టుకొచ్చేవి.

ఆ “బోడి గుండు” రోజులు ఎప్పుడో పోయాయి. జాన్ ఎర్రటి జుట్టు ఇప్పుడు మధ్య పాపిటితో భుజాలవరకు వ్రేలాడుతోంది. మంచి మేనిచ్ఛాయ, భారీ విగ్రహం, ఎర్రటి ముఖంతో ఉండే అనేకుల్లా అతని మీసాలు గడ్డిమోపులా గుబురుగా ఉండేవి. అతని ముఖం గంభీరం, కాని అతని సంభాషణ స్నేహపూర్వకంగానూ ప్రశాంతంగానూ శబ్దాలంకారాలతో రుచికరంగాను తెలివైన పదబంధాలతోనూ ఉంటూ అత్యంత దురభిప్రాయంగలవారిని సైతం వెనువెంటనే వినేందుకు మౌనంలో పడేస్తాయి.

అతడు జైల్లోనుండి వెలుపలికి వచ్చిన తర్వాత మొదటిగా అతణ్ణి ఆశ్చర్యపరచింది తన సంఘంనుండి తనకు అందివ్వబడిన ఒక మంచి బహుమానం. అతడు ప్రసంగ వేదిక ముందు ఉన్నప్పుడు దాన్ని ఆయనకు అందించాలంటే చాలా కష్టం. అందుకే వారి మొదటి ఆరాధన గిడ్డంగిలో జరిగిన తర్వాత అతడు పొందిన విభ్రాంతికి ఆనందిస్తూ అతని సంఘ సభ్యులు ఆయనను బయటకు నడిపించుకొని వచ్చారు.

“స్వేచ్ఛగా సంచరించేందుకు అవసరమైంది ఏంటంటారు?” – వాళ్ళు జాన్ను ప్రశ్నించారు.

“గుఱ్ఱం” పెద్దగా అరిచింది అంధురాలైన మేరీ.

“గుఱ్ఱమా! ఎక్కడ?” – మేరీ సాధారణంగా పొరపాటుపడదని తెలిసి చుట్టూ చుశాడు జాన్.

చెట్ల చాటునుండి సంఘ సభ్యులు మెత్తని చర్మం కలిగిన గుఱ్ఱాన్ని ఒకదానిని నడిపించుకొని వచ్చారు. జాన్ దాని వీపు తట్టి, తర్వాత దాని పెదాలు పైకెత్తి చూసి, “ఇది చాలా చిన్న వయస్సులోనున్న గుఱ్ఱమే” అన్నాడు.

“కేవలం రెండేళ్ళ వయస్సుమాత్రమే పాస్టర్ బన్యన్” ఆ సభ్యుల్లో ఒకతను అన్నాడు -“చాలా బలమైంది. దూర ప్రయాణాలకు చాలా అనువైంది. చాలా సంవత్సరాలవరకు చురుగ్గా పనిచేయగల యౌవనాశ్వం.”

“ఇటువంటి అద్భుతమైన గుఱ్ఱానికి ఒక పేరు అవసరం” – ఆ చురుకైన గుఱ్ఱాన్ని తిరిగి తన కుటీరానికి తీసుకెళ్ళినప్పుడు ఎలిజబెత్ అంది.

“ఓహ్! ఈ గుఱ్ఱం ఎలా ఉందో నాకు చెప్పు?” గట్టిగా అరిచింది మేరీ.

జాన్ ఈ భారీ గుఱ్ఱాన్నిగూర్చి దీర్ఘంగా ఆలోచించాడు

“ఇది భుజాలవద్ద ప్రధాన న్యాయాధికారిగారి గుఱ్ఱంకంటే పొడగరి. దీని చర్మం శుద్ధిచేసిన బంగారం. ఇదిగో, యిక్కడ తడివి చూడు మేరీ, దీని చర్మాన్ని …”

“ఇది చాలా వెచ్చగా, శక్తివంతంగా ఉంది” – చేతి క్రింది కండరాలు చిన్న అలల్లాగా కదులుతూంటే మేరీ నవ్వుతూ అంది.

“దీని జూలూ తోకా చాలా పొడవుగానూ చిక్కగానూ అమావాస్య రాత్రంత నల్లగా ఉన్నాయ్. దీని కళ్ళు సాదరంగా, చురుగ్గా, బెడ్ఫోర్డునంతా ఒక్క గుటకలో మ్రింగివేయ గలిగినంత పెద్దవిగా ఉన్నాయి” దర్పంతో పలికాడు జాన్.

“అయితే ఈ గుఱ్ఱం పేరు ఐరన్సైడ్స్!” పెద్దగా అరిచింది మేరీ.

“అలివర్ క్రాంవెల్, అతని అశ్వదళం లాగానా?” అడిగాడు జాన్. “ఇంగ్లాండ్ సామాన్య ప్రజలకు జై” మేరీ అంది.

“అంతా ఒకప్పటి నా తిరుగుబాటు స్వభావమే” – ప్రశంసాపూర్వకంగా అన్నాడు జాన్ – “ఇటువంటి మాటలెక్కడైనా పలికేటప్పుడు జాగ్రత్త! అయితే మనం నిజంగా ఈ బలిష్ఠమైన గుఱ్ఱాన్ని ‘ఐరన్సైడ్స్’ అనే పిలుద్దాం.”