ఎదురుచూసే హృదయం

ఎదురుచూసే హృదయం

నదీ లోయలోకి వారు దిగుతుండగా జాన్ ఆ కోటను అధ్యయనం చేయసాగాడు. ఆ కోటంతా దాదాపు కొండలమీదే ఉంది. ఈ వెల్ష్ కోట క్ల్వైడ్ నదిని ఆనుకొని ఉంది. కోట పడమటి గోడ నదీ ప్రవాహానికి కోసుకొనిపోయి ఉంది.

నది రక్షణగా లేని మిగతా మూడువైపుల్లో మూడు గోడలున్నాయి. బయటి గోడ అప్పటికే బీటలువారి ఉండటాన్ని జాన్ గమనించాడు. ఆ లోపలి గోడను మిగిలిన గోడలతో పోలిస్తే అది చిన్న పిల్లల ఆటలో కట్టినదానిలా ఉంది. బురుజుపైనున్న గోడ చదరంగా దాదాపు 40 అడుగుల ఎత్తులో ఉంది. దాని మందం దాదాపు 10 లేదా 15 అడుగులుండొచ్చు.

కోట గోడలు మందమైన బురుజులతో, బలమైన ద్వారాలతో రక్షణ ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. ఆ బురుజులన్నీ స్థూపాకారంలో ఉన్నాయి. లోపలి గోడయొక్క బయటి ప్రదేశం స్పష్టంగా కనిపిస్తోంది. “ఆ బురుజుల కన్నాలగుండా బయటకు కనిపిస్తున్న ఆయుధాలు ఏమై ఉంటాయి?” జాన్ అడిగాడు.

“నువ్వు కాస్త దగ్గరగా వెళ్తే మరిగే నూనో, కరిగే సీసమో ఆ ఆయుధాల్లోనుండి చిమ్మబడుతుంది” – జవాబుగా అన్నాడో సైనికుడు.

గతంలో కోటకు సరకులను రవాణా చేసిన సముద్రం, నదులు యిప్పుడు శత్రుసైన్యాలను రవాణా చేస్తున్నాయి. భారీ ఫిరంగులు వెలుపలి గోడవైపుకు ఉత్తర దిక్కుగా పొంచి ఉండి గోడలను పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాని పర్యవసానం యిక తెలిసిందే. రాళ్ళ దిమ్మెలు కుప్పలుగా దొర్లుతాయి, పగిలిన గోడలనుండి మనుష్యులు దూసుకొని లోపలికి వెళ్తారు.

ఈ ప్రక్రియలో ఎంతమంది మనుష్యులు కుప్పకూలిపోతారో తెలియదు. “వందల సంవత్సరాలుగా ఇంగ్లీషువాళ్ళు, వెల్ష్ వాళు ఎ) బలమైన ఈ రాతికోటలను కడుతూ వచ్చారు” – ఆ రాత్రి చలిమంట దగ్గర ఒక సైనికుడన్నాడు. – “మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో క్రామ్వల్ నాయకత్వంలో మనం వీటన్నిటినీ కూల్చబోతున్నాం.”

“శుభ్రంకూడా చేస్తాం” యింకో సైనికుడన్నాడు.

జాన్ మౌనంగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే తమ సైనికులు చేస్తున్నదానికి అతడు చాలా కలతచెందుతున్నాడు. ఆ సైనికుడు చెప్పింది నిజమే. తమ సైనికులు రాజుగారి కోటలన్నిటినీ కూల్చేస్తున్నారు.

రాజు పారిపోయాడు. యిక రాజుగానీ, యువరాజుగానీ, అతని సామంతులుగానీ, ప్రభువులుగానీ, ఎవరూ ఏ కోటలోనూ తలదాచుకోకూడదని ఫెయిర్ ఫాక్స్, క్రామ్వల్లు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జాన్ ఎందుకో సంతోషంగా లేడు.

అతడు విచారంగా ఉండటానికి యింకో కారణంకూడా ఉంది. ముట్టడికి గురైన కోటలోనివారు ఎటువంటి సంప్రదింపులూ చేయడం లేదు. వారి సరఫరాలు వారాల తరబడి కచ్చితంగా నిలిచిపోయి లోపలవాళ్ళు ఆహారం లేకుండా ఉండి ఉంటారు.

బహుశా తుపాకీ మందు, తూటాలు, గుండ్లుకూడా తగ్గుముఖం పట్టుంటాయి. కాబట్టి న్యూపోర్ట్ ప్యాగ్నెల్నుండి వచ్చిన సైనికులు దాడిచేయకుండా వేచి చూస్తున్నారు. తమకు యుద్ధం లేకుండా ఉండాలని కొంతమంది ప్రార్థనలుకూడా చేస్తున్నారు.

ఈ విషయంలో జాన్ ఏమాత్రం దిగులుపడటంలేదు. వాళ్ళు యుద్ధం చేయాలన్నా లేదన్నా అది కేవలం యాదృచ్ఛికమే. ముట్టడికి గురైనవారిని తుపాకీ గుండుకాని, మందు సామాగ్రి గాని రక్షించలేవు.

మనిషి తన విలువైన ఒకే ఒక జీవితంతో యిలా చెలగాటాలాడటం జాను ఒక బుద్ధిహీనతగా తోచింది. ‘మరలాంటప్పుడు తనెందుకు కనిపించకుండా పారిపోకూడదు?” ఎందుకో జాన్ అలా చేయలేకపోతున్నాడు.

“పడవలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పనికోసం యిద్దరు మనుష్యులు నాక్కావాలి” ఒక సాయంత్రం సార్జెంట్ అన్నాడు.

“పడవా?” అన్నాడో సైనికుడు చిరాగ్గా.

“రాజుగారి మద్దతుదారులు రాత్రివేళ నదిలోనుండి గోడవరకు వెళ్ళి కోటకు అవసరమైన వస్తువులు సరఫరా చేస్తున్నారు. దాన్ని మనం అడ్డుకోవాలి” – సార్జెంట్ ఓ సైనికుడిపై దృష్టి నిలిపి – “దానికి నిన్ను తీసుకుంటున్నాను” అన్నాడు. “నాకు ఈత రాదు.”

“ఐతే మనలో పెద్దగా ఈదగలవాడెవడు?” – సార్జెంట్ గద్దించాడు “ఈత అనేది పెద్ద చాకచక్యమైన విద్యేంకాదు. అయినా నీవు పడవపైన తిరగబోతున్నావు.” ఆ తర్వాత సార్జెంట్ తన సైనికులవైపు మరోసారి పరిశీలనగా చూశాడు.

“అత్యవసర పరిస్థితుల్లో తుపాకీ పేల్చేందుకు యితనికి తోడుగా యింకొకరు నాక్కావాలి” ‘ – అతను జానైవైపు చూశాడు – “బన్యన్ దానికి నువ్వే సరైన వ్యక్తివి.”

ఆకాశం మేఘావృతమైవుంది. దట్టంగా చీకటి కమ్ముకొని ఉంది. జాన్ తన తుపాకీతో అటూ ఇటూ ఊగిసలాడే ఓ చిన్న పడవలోకి కాలు పెట్టాడు. “ఈ రాత్రి బాగా చీకటిగా ఉండబోతోంది” సార్జెంట్ అన్నాడు.

“తెడ్డు లేదు, కర్రా లేదు; ఈ పడవనెలా నడిపేది?” – సణిగాడు జాన్తో నున్న సైనికుడు.

“ఈ నది గోడ పొడవునా ఒక మోకు (త్రాడు) గట్టిగా కట్టబడివుంది” – మెల్లగా చెప్పాడు సార్జెంట్ – “ఆ మోకు నీటి ఉపరితలానికి కొద్దిగా క్రింద ఉంటుంది. మీరు చెయ్యాల్సిందల్లా ఆ మోకును గట్టిగా పట్టుకొని గోడ పొడవునా ముందుకూ వెనక్కూ తిరుగుతూండడమే. మీరసలు మాట్లాడకూడదు. గోడపై భాగాన ఎవరైనా ఉంటే వారికి మీ మాటలు వినబడొచ్చు.”

“ఇప్పుడు ఈ పడవకు మేమే తెడ్డు కాబోతున్నాం” – గొణిగాడా సైనికుడు బూతులు జోడిస్తూ.

“ఆ చివర మూలనున్న బురుజువద్దకు మరీ దగ్గరగా వెళ్లొద్దు” – సార్జెంట్ హెచ్చరించాడు – “శత్రువులు దాడిచేసి మిమ్మల్ని బంధించవచ్చు లేదా తుపాకీతో కాల్చవచ్చు.”

“ఆ మూలనున్న బురుజు ఎంత దూరముంటుంది?” – జాన్తో ఉన్న సైనికుడు చిరాగ్గా అడిగాడు.

“దాదాపు 200 అడుగులు. పడవను మీరు మూడడుగుల దూరం నెట్టిన ప్రతిసారీ ఒకటిగా లెక్కించుకొని అలా 60 సార్లు లెక్క పెట్టేంతవరకు ముందుకెళ్ళండి. అలానే తిరిగి వెనక్కి రండి. అలా రాత్రంతా చేస్తూనే ఉండండి.”

జాన్ శరీరం వణుకుతోంది. భుజానికి తుపాకీ వ్రేలాడదీసుకొని నదిలో క్రిందికీ పైకీ ఊగిసలాడుతోన్న ఆ పడవలో నిస్సహాయంగా తన సహచరునితో కలిసి ముందుకూ వెనక్కూ తిరుగుతున్నాడు జాన్. మోకుకోసం నదిలోకి వంగినప్పుడు శరీరం చలితో వణుకుతోంది. నది మంచులా చల్లగా బాగా లోతుగా ఉంది.

గంటలు గడుస్తున్నకొద్దీ యిద్దరూ పడవను ముందుకూ వెనక్కూ త్రిప్పుతున్నారు. నీళ్ళు చాలా చల్లగా ఉన్నందున 30 మాత్రం లెక్కబెట్టి ఆపుతున్నారు. చేతులకు గోడరాళ్ళు పదేపదే తగిలి గాయాలవుతున్నాయి. కొద్ది సేపటికి వాళ్ళ చేతులు తిమ్మిరి లెక్కసాగాయి.

అలా కొన్ని గంటలతర్వాత తాడు లాగడానికి జాన్ వంతు వచ్చినప్పుడు అతని చేతులకు కొన్ని క్షణాలవరకు గోడ తగల్లేదు. ‘రాతి స్పర్శ చేతికి తగిలినా తెలియనంతగా తన చేతులు మొద్దుబారాయా?’ కాసేపటికి తాడు చేతులకు చాలా బరువుగా అనిపి స్తోంది. “ఈ తాడేంటి బాగా బరువైపోతోంది” తన తోటి సైనికుడితో మెల్లగా అన్నాడు.

“వాళ్ళు ఈ తాడు చివర కోసేసుంటారు” గట్టిగా అరిచాడు ఆ సైనికుడు.

“దాన్ని నువ్వు తాగగలిగినంత లోపలికి లాగు” వెంటనే అన్నాడు జాన్.

తమ రెండు చేతులతో ఆ తాడును లాగుతూ ముందుకు వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ పడవను గట్టుకు తీసుకెళ్ళాలని ఆ తాడును బలంగా లాగసాగారు. ఐతే జాను తాము ప్రవాహంలో కొట్టుకొని పోతున్నట్టుగా అనిపించింది. ఉన్నట్టుండి పడవ ఒక ప్రక్కకు ఒరిగింది. “నీవు దానిమీద ఎక్కువగా ఆనుకుంటున్నావు” కోపంగా అరిచాడు జాన్.

“నువ్వుకూడా, అలాగైతే యిద్దరం తాడు వదిలేద్దాం.”

“సముద్రంలోకి కొట్టుకొనిపోవడానికా?”

పడవ వాళ్ల క్రిందనుండి మెల్లగా జారుకుంది. చల్లని నీళ్ళు వాళ్ళను ఒక్కసారిగా ముంచేశాయి. జాన్ తాడు పట్టుకొని పైకి రావాలని ప్రయత్నిస్తున్నాడు కాని యింకా లోతుకు మునిగిపోతున్నాడు.

ఒడ్డు యింకా ఎంత దూరముందో? “ఓ దేవా! నాకు సహాయం చెయ్యి …” అతని తల మునిగిపోతోంది. మంచు నదిలో మునిగిపోతూ బాధతో సుడులు తిరిగిపోతున్నాడు జాన్. తల మునిగిపోయి అతనికి ఊపిరాడటంలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలీదు. అతడు సృహలేకుండా అయిపోయాడు.

“ఇతడు ఊపిరి పీలుస్తున్నాడు.” ఎవరో అంటున్నారు.

“సా … ర్జెం …ట్” – గొణిగినట్టుగా అన్నాడు జాన్. అతని గొంతు బాగా నొప్పిగా ఉంది.

“మూలనున్న ఆ బురుజునుండి శత్రువులు మోకును తెంపినట్టున్నారు.” – సార్జెంట్ గొంతు ఎక్కడో దూరంనుండి వినిపిస్తున్నట్టుంది జాన్కు – “మోకు తెగిపోయినట్టు కాపలాకాస్తున్న మన సైనికుడొకడు కనుగొన్నాడు. నీవు తాడును గట్టిగా పట్టుకొని ఉన్నందున మేము నిన్ను బయటకు లాగగలిగాము.”

“నా తుపాకీని పోగొట్టుకున్నాను” – జాన్ దిగులుగా అన్నాడు – “నా స్నేహితు డెక్కడ?”

“కొట్టుకుపోయాడు. అతడు తన పట్టు కోల్పోయి ఉంటాడు.”

ఆ తర్వాత రాత్రి కోటనానుకొని నదిలో కట్టబడివున్న మోకును శత్రువులు తిరిగి తెంపారు. పాపం! పడవలోని సైనికులు బలమైన ప్రవాహంతో పోరాడవలసి వచ్చింది. కాని వారికేం ప్రమాదం జరగలేదు.

గోడమీదనున్న శత్రువుల కాల్పులకు స్వల్ప గాయాలయ్యాయంతే. కోటలోనికి వస్తువులు సరఫరా కాకుండా చూడ్డానికి ప్రతి రోజూ పడవలో కాపలా కాయడం జరుగుతోంది. ఎంత కాపలా కాస్తున్నప్పటికీ కోటలోనికి పడవలో సామగ్రిని చేరవేయడంలో శత్రువులు విజయం సాధిస్తున్నారు. ఇక యిలా కాపలా కాయడం వృధా అన్న నిర్ధా రణకు వచ్చిన పార్లమెంటు సైన్యం ఫిరంగులతో కోట గోడల్ని ధ్వంసం చేయడం ప్రారంభించింది. త్వరలోనే కోట గోడలు కుప్పకూలిపోయాయి.

1647వ సంవత్సరం ప్రారంభంలో జాన్ పార్లమెంటు సైన్యంతో పడిపోయిన కోట సమీపంలో బసచేసి ఉన్నాడు. తన తీరిక సమయాల్లో బైబిల్ను తీసి చదివేవాడు. అది పూర్తి బైబిలు కాదుగాని సైనికులకు ఉపయోగపడే విధంగా కొన్ని శీర్షికల క్రింద కొన్ని ప్రాముఖ్యమైన బైబిలు వచనాలు యివ్వబడివున్నాయి. దీనితోకూడ మతా చారాలకు సంబంధించిన వేరొక పుస్తకం ప్రతి సైనికుడికీ యివ్వబడుతుంది.

గత రెండు సంవత్సరాలుగా జాన్ ఈ రెండు పుస్తకాలను నిర్లక్ష్యంచేశాడు. ఇప్పుడు తాను బైబిలు వచనాలున్న పుస్తకాన్నేగాక మతాచారాలున్న పుస్తకాన్నికూడ శ్రద్ధగా చదువు తున్నాడు. మంచు నదిలో తాను మునిగి కొట్టుకొనిపోతున్నప్పుడు కాపాడమని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు తనను కాపాడినందుకు దేవునికి తాను కృతజ్ఞత చెల్లించలేదు. అలా తాను కృతజ్ఞత చెల్లించనందుకు జాన్ తన్నుతాను సమర్థించుకొన్నాడు.

“తన తోటి సైనికుడుకూడ ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించి ఉంటాడుకదా? మరి అతడెందుకు మునిగిపోయాడు? అతడు దురదృష్టవంతుడు, తాను అదృష్టవంతుడు. అదీ విషయం” అతడు తనకు తాను సర్ధిచెప్పుకొన్నాడు.

స్కాట్లాండ్ వాళ్ళు చార్లెస్ రాజును క్రామ్వల్కు అప్పగించారని తెలిసింది. స్కాట్లాండ్ వాళ్ళు ఇంగ్లాండుకు చెల్లించవలసిన ఋణాన్ని మాఫీ చేస్తానని క్రామ్వెల్ యుక్తిగా వాళ్ళతో మంతనాలు జరపడంతో వాళ్ళు రాజును అప్పగించేశారు.

నార్తాంప్టన్ లోని హోల్బి గృహంలో రాజు బందీగా కాపలాలో ఉంచబడ్డాడు. ఇక ఐరిష్ సము ద్రాన్ని దాటి ఐర్లాండువారితో యుద్ధం చేయవలసివస్తుందని జాన్ ఎదురుచూడసాగాడు. సైనికులకు జీతాలు ఆపివేయబడ్డాయి. వారి జీతాలు తర్వాత చెల్లిస్తామన్నట్లుగా హామీ పత్రాలను సైనికాధికారులు సైనికులకిచ్చారు. ఇలా మునుపెన్నడూ జరగలేదు.

“ఇదేంటి?” తన జీతంకొరకు సైనికాధికారులు యిచ్చిన హామీ పత్రాన్ని చేతిలోకి తీసికొని చిరాగ్గా అడిగాడో సైనికుడు.

“దీన్ని డిబెంచర్ అంటారు. అంటే నీకు రావలసిన జీతం డబ్బును భవిష్యత్తులో తప్పక చెల్లిస్తామని సైన్యం యిచ్చిన హామీ పత్రమన్నమాట” గొప్ప విద్యావంతుడిలా జవాబిచ్చాడు జాన్.

“దీన్నెవరికైనా యిస్తే డబ్బులిస్తారా?”

“ఏమో! సందేహమే.”

“మనం తిరిగి చెస్టర్కు ఎప్పుడు వెళతాం?” జాన్ తన సార్జెంట్ని అడిగాడు. “మన జీతాలు చేతికి వచ్చేంతవరకు వేచివుండాలి.” చాలామంది సైనికులు తమ డిబెంచర్లను సైనికాధికారులకు అమ్మడం ప్రారంభించారు. అయితే ఆ అధికార్లు నాలుగు పెన్నీల డిబెంచర్లకు ఒక పెన్నీమాత్రమే యిస్తున్నారు.

జాన్ తన డిబెంచర్లను అమ్మడానికి నిరాకరించాడు. “కొంత ఆలస్యమైనా నేను పూర్తి మొత్తాన్నే తీసుకొంటాను” జాన్ అన్నాడు. అయితే సైన్యం వారికి డబ్బు చెల్లించలేదు. జూన్ నెల నాటికి జాన వద్ద తన ఐదు నెలల జీతానికి సంబంధించిన పదిపౌండ్ల విలువచేసే డిబెంచర్లున్నాయి. ఇప్పుడు అధికార్లు డిబెంచర్లను కొనుగోలు చేయడం లేదు. వాళ్ళవద్ద డబ్బు కొద్దిగానే మిగిలి ఉండటం, డిబెంచర్లు మాత్రం కుప్పలుగా పడివుండటం వారిని కలవరపరచింది. హఠాత్తుగా ఒక రోజు వాళ్ళు చెస్టర్కు ప్రయాణమయ్యారు.

“ఇంకా డబ్బు రాలేదు” సార్జెంట్ గొణిగాడు.

“నన్నిక్కడనుండి ఐర్లాండుకు పంపకపోవడమే నాకు పదివేలు” ఒక సైనికుడన్నాడు. మార్గమధ్యంలో ఫ్లింట్ కోట నేలమట్టమై ఉండటం జాన్ చూశాడు. ఏమాత్రం ఆ తర్వాత జాలి లేకుండా దాన్ని కుప్పకూల్చేశారు. జాను బాగా కోపమొచ్చింది. తన్నుతాను సంభాళించుకున్నాడు. తమ అధికారులు క్వైడ్ నదీ తీరానున్న కోటను నాశనం చేయనందుకు జాన్ సంతోషపడ్డాడు.

సైనికులు ఉత్తరపు గోడల్ని కూల్చేసిన అనంతరం కోటలోపలున్నవారిని బందీలుగా పట్టుకొన్నారు. కాని, కోటను మాత్రం నాశనం చేయలేదు. ఎవరినీ శిక్షించనూ లేదు. మేరీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతురతగా ఉన్నాడు జాన్. అయితే సైనికులు ఈ సారి చెస్టర్కు చాలా దూరంగా నైరుతి దిశలో విడిదిచేశారు. చాలా రోజుల తర్వాత ఆమె మామగారి ఎస్టేట్కు జాన్ అతికష్టంమీద వెళ్ళగలిగాడు.

అక్కడ పశువుల్ని కాస్తున్న వ్యక్తి మేరీ అనుకొని పరుగెత్తాడు. ఆ వ్యక్తి మేరీ కాదు. ఒక చిన్న కుర్రాడు. “మేరీ అనే అమ్మాయి ఎక్కడుంది?”

“ఆమె యిప్పుడు యింట్లోనే పనిచేస్తోంది” జవాబిచ్చాడా కుర్రాడు. “ఎందుకు?” కఠినంగా అడిగాడు జాన్.

“మా అమ్మకు బాగా జబ్బుచేసింది. మంచంమీదనుండి లేవలేకపోతోంది. సరే గాని నీవెవరు? ఎక్కణ్ణుంచి వస్తున్నావు?” ఆ అబ్బాయికి నిజం చెప్పాలనిపించలేదు జాను. ‘వీడు యింటికెళ్ళి వాళ్ళ నాన్నకు చెబితే యింకేమైనా ఉందా?’ తనిప్పుడు ఆమె యింటికెళ్ళి ఆమెను చూడ్డానికి ప్రయత్నంచేయడం అంత మంచిది కాదేమోనని పించింది.

ఆమె మామ రాజుగారి మద్దతుదారుడుకూడ. తానక్కడికి వెళ్ళడం వేరే సమస్యలకు దారితీయొచ్చు. అప్పుడు పరిస్థితి విషమించవచ్చు. ఇంతవరకు తన విషయం మేరీ మామయ్యకు తెలీదు. ఇప్పుడు తాను తొందరపడి మేరీని ఎందుకు యిబ్బందిపెట్టాలి? జబ్బుతో మంచానపడ్డ ఆమె అత్తయ్య చనిపోవడం ఖాయం. అప్పుడు మేరి తన మామయ్యను పెళ్ళిచేసుకోవడం తప్పనిసరి. మేరి తనకు దూరమౌతున్నట్టుగా అనిపిస్తోంది జాను. తను వెనక్కి వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నాడు.

“గత రెండున్నర సంవత్సరాలలో తనకు ఎదురైన అనుభవాలలో యిదొకటి” అనుకొన్నాడు జాన్. చనిపోయిన మేరీవాళ్ళ నాన్న తనకు తెలుసునని ఆ అబ్బాయికి చిన్న అబద్ధం చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు జాన్. మార్గీ చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా బాధతో నిండిపోయింది జాన్ హృదయం.

భారంగా అడుగులో అడుగు వేసుకొంటూ సైనిక విడిదికి చేరాడు. ‘ఈ సంఘటన తన ప్రియ చెల్లి మార్గీ చనిపోయిన సంఘటనకన్నా బాధకరమైంది. మార్గీ చనిపోవడానికి దేవుడు కారణం. మేరీ విషయంలో భంగపాటుకు తానే కారణం. తన గుండెను ఎవరో పిండుతున్నట్టుంది. భవిష్యత్తులో యింకా ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు?’

“ఇక్కడేం జరిగిందో ఊహించు బన్యన్!” – క్యాంపుకు తిరిగొచ్చిన జానన్ను అడిగాడు ఓ సైనికుడు నవ్వుతూ – “మనమందరం ఎవరిళ్ళకు వాళ్ళం వెళ్ళబోతున్నాం” జాన్ నుండి సమాధానంకొరకు నిరీక్షించకుండానే చెప్పేశాడు ఆ సైనికుడు సంతోషంగా. “మనం ఐర్లాండ్కు వెళ్ళడం లేదా?”

“అంతగా నీవు వెళ్ళాలనుకొంటే వెళ్ళొచ్చు, అదీ నీ సొంత ఖర్చులతో. బుర్రలేని దద్దమ్మా” సణిగాడు యింకొక సైనికుడు.

“నాకంత స్తోమత లేదు.”

“ఏం ఫరవాలేదు. మన జీతం డబ్బులు చెల్లిస్తున్నారు” – పళ్ళికిలించాడు మొదటి సైనికుడు. జాను పదిపౌండ్లు వచ్చాయి. బెడ్ఫోర్డ్ ప్రాంతానికి చెందిన సిపాయిలతో కలిసి అతడు త్వరలో ప్రయాణం కానున్నాడు.

మేరీని చూసేందుకు అతడు మరో ప్రయత్నం చేసేవాడే గాని మిగిలిన సైనికులు ఆగేట్టులేరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత తాను ఒంటరిగా ప్రయాణం చేద్దామంటే అది చాలా ప్రమాదకరం. రాజుకు మద్దతుదారులున్న ప్రదేశాల గుండా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు.

“ఇక నేను మేరీని మరచిపోవలసిందే” – బాధతో మూలిగాడు జాన్ మిగతా సైనికులతో తూర్పుదిక్కుగా ప్రయాణం కొనసాగిస్తూ.

“ఏంటి గొణుగుతున్నావు బన్యన్?” జాన్ ప్రక్కన నడుస్తున్న సైనికుడడిగాడు. “ఏం లేదు.” తానీ అబద్ధం చెబుతున్నప్పుడు కడుపులో తిప్పినట్టయింది జాను. ఎలోను చూశాక జాన్ హృదయం పరవశించింది.

‘బన్యన్ ఎండ్’ యిప్పుడు చాలా అద్భుతంగాను, ప్రశాంతంగాను కనిపించింది. తమ పూరిల్లు చూస్తూనే జాన్ మది పులకరించింది. తనను చూస్తూనే పదమూడేండ్ల విల్లీ ఆనందంతో పరుగెత్తు కుంటూ వచ్చాడు. జాన్ తన తండ్రిని చూసి చాలా ఆనందించాడు.

సైన్యంలో తాను చూసిన చాలామంది పనికిమాలిన వాళ్ళతో పోలిస్తే తన తండ్రి చెడ్డవాడేం కాదని పించింది జాను. తమ ఇంటి ప్రక్కన కనిపించిన చిన్న సమాధి జాన్ హృదయాన్ని కలచివేసింది. తన సవతి తల్లికి పుట్టిన తన తమ్ముడికి ‘చార్లెస్’ అని రాజుగారి పేరు పెట్టినట్లు తనకు న్యూపోర్ట్ ప్యాగ్నెల్లో తెలిసినప్పుడు తన తండ్రిపై చాలా కోప మొచ్చింది. అయితే ఎవరినీ లెక్కచేయని తన తండ్రియొక్క నిర్భీతిని యిప్పుడు అభినందిస్తున్నాడు.

“చిన్ని చార్లెస్ చనిపోయినందుకు చాలా చింతిస్తున్నాను” – దుఃఖపూరితమైన స్వరంతో తన తండ్రినీ, సవతి తల్లినీ ఉద్దేశించి అన్నాడు జాన్. యుద్ధంతోను, నిరంతర ఒత్తిడితోనూ, భయంతో నిండుకొని ఉండే యుద్ధ వాతా వరణంతోను జాన్ బాగా అలిసిపోయాడు. ఇప్పుడతడు పాత్రలకు కళాయి వేయడానికి కూడ యిష్టపడుతున్నాడు.

వివిధ రకాలైన లోహాలను అర్థం చేసుకోడానికీ, వాటిని ప్రశంసించడానికీ అతడు ప్రారంభించాడు. రకరకాల లోహమిశ్రమాలు యిప్పుడత నికి సంభ్రమాశ్చర్యాల్ని కలిగిస్తున్నాయి. వీటిని గురించి తీక్షణంగా ఆలోచించడం

ప్రారంభించాడు. రాగికి తగరం కలిపితే వచ్చే కంచు స్వచ్ఛమైన కంచుకన్నా చాలా సులభంగా కరిగిపోతుంది. ఆ కంచును చల్లార్చినప్పుడు అది స్వచ్ఛమైన రాగికన్నా గట్టిగా ఉంటుంది. జింకును రాగికి కలిపితే వచ్చే యిత్తడి స్వచ్ఛమైన రాగికన్నా మూసవేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అయినప్పటికీ యిత్తడి రాగికంటె గట్టిగా ఉంటుంది.

ఈ కళాయివేసే పనిపై జాన్ తీక్షణమైన దృష్టి నిలపసాగాడు. అప్పుడప్పుడూ అతడు ఎల్లోని పచ్చిక బయళ్ళలో తన స్నేహితులతో మాట్లాడుతూ గడిపేందుకు కూడ చాలా యిష్టపడేవాడు.
ప్రజల దృష్టిలో యిప్పుడితడు పనికిమాలిన బన్యన్ కాదు.

పొలం ఉన్న ఆసామి, అనుభవజ్ఞుడైన యాత్రికుడు, సైనికుడు, ఏ విషయం గురించైనాసరే అవగాహన జ్ఞానం కలిగివున్న వివేకవంతుడు. యుద్ధాన్నిగూర్చిన విషయాలైనా, రాజకీయాలైనా, మత సంబంధమైన విషయాలైనా అతడు అనర్గళంగా మాట్లాడే సమర్థుడిప్పుడు. ఎల్టాలోని పెద్దపెద్ద విద్యావంతులుకూడ అతని వాదనాపటిమకు నిశ్చేష్టులౌతున్నారు.

ప్రతిచోటా విమర్శకులుంటారు. “అతని వాదనలో అంత నిజాయితీ ఏం లేదు, ఒక్క ఉద్రేకం తప్ప” – జాన్ వినేట్లుగా అక్కడి పెద్దల్లో ఒకతను అన్నాడు.

“పుల్లని ద్రాక్షపండ్లు” జాన్ గొణిగాడు. జాన్ ఒక సమస్యను ఏవైపునుండైనా వాదించి గెలిచేవాడు. తాను సైన్యంలో లక్షలాది వాదనలు విన్నాడు. ఇవెంత? సైన్యం ఇతణ్ణి అనేక కోణాల్లో పదును పెట్టింది. గ్రామీణ పచ్చిక బయళ్ళలో అనేకమైన ఆటలు ఆడబడేవి. కొన్ని జూదానికి సంబంధించినవికూడ ఉండేవి. కాని అవి యితణ్ణి ఆకర్షించేవికావు.

‘కర్రాబిళ్ళ’ (బిళ్లంగోడు) అనే ఆటలో జాన్తో సమానంగా ఎవరూ అడలేకపోయేవారు. ఈ ఆట ఆడే ఆటగాడికి మంచి దేహ దారుఢ్యం, నైపుణ్యం, వివేచన చాలా అవసరం. ఆటగాడివద్ద కొంచెం పొడవైన కర్ర ఉంటుంది. దాన్ని ‘కోడు’ అంటారు. ‘బిళ్ళ’ అనబడే స్థూపాకారపు కొయ్యముక్క రెండు కొనలవైపు సూదిలాంటి మొనలతో రెండంగుళాల మందం, ఆరంగుళాల పొడవు కలిగి ఉంటుంది. బిళ్ళను నేలమీద పెడతారు.

ఆటగాడు తన చేతిలోని పొడవైన కర్రతో ఆ బిళ్ళను ఒక కొనవైపు కొట్టి, అది గిరగిరా తిరుగుతూ పైకి లేచినప్పుడు తన చేతిలోని కర్రతో తిరిగి రెండవసారి దాన్ని దూరంగా పోయేటట్లుగా కొట్టాలి. అలా రెండవ పర్యాయం అతడు కొట్టలేకపోతే అతడు ఆటనుండి నిష్క్రమించాలి. అప్పుడతనికేం పాయింట్లు రావు.

గాల్లోకి గిరగిరా తిరుగుతూ లేచిన బిళ్ళను అతను ఒకవేళ కొట్టగలిగితే అది దూరంగా భూమిమీద పడేలోపుగా ఎంత దూరంలో పడబోతుందో ఊహించి ఆ దూరాన్ని అడుగుల్లో చెప్పాలి. ఆ తర్వాత అది పడిన చోటు అతడు చెప్పినదానికన్నా తక్కువైతే తిరిగి అతడు ఏ పాయింట్లూ లేకుండానే నిష్క్రమించాలి.

ఒకవేళ అతడు చెప్పినదానికన్నా ఆ బిళ్ళ పడిన దూరం ఎంత ఎక్కువైతే అతనికి అన్ని పాయింట్లు వస్తాయి. అప్పుడతడు తిరిగి తన ఆటను కొనసాగించవచ్చు. అలా అతడు ఓడిపోయేంతవరకూ ఆడొచ్చు.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం హ్యారీ జాన్తో కలిసి ఆడేవాడు. యుద్ధంలో ఒక చేతిని పోగొట్టుకున్న రోజర్స్ ప్రేక్షకుల్లో ఒకడుగా కూర్చొని ఆనందించేవాడు. బెడ్ ఫోర్డ్నుండి వచ్చిన వ్యక్తో లేదా ఆ రాజమార్గంగుండా వెళ్ళే ఒక బాటసారో అక్కడ ఆగి జాన్ ఆటను తప్పక చూసేవాడు. “ఒకప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతూ ఆకతాయిలా ఉండే ఈ ఎర్రజుట్టు కుర్రాడిప్పుడు ఎంత చక్కగా ఆడుతున్నాడు!” అని ఆశ్చర్యంతో వారు వ్యాఖ్యానించేవారు.

“అతని ఆటమీద పందెం కడితే అతని ఆటతీరు యింకా మారిపోతుంది” – ప్రేక్షకుల్లో ఒకడుగా కూర్చొని ఉండే రోజర్స్ అనేవాడు.

అలా పందెం కట్టినప్పుడు జాన్ ఆట తీరు నిజంగా మారిపోయేది. తన మొదటి దెబ్బతో బిళ్ళను గాల్లోకి లేపి, చేతిలోని కర్రను తన పిడికిలితో గట్టిగా పట్టుకొని సరైన సమయంలో బిళ్ళను రెండవసారి తన బలంకొద్దీ కొట్టేవాడు. బిళ్ళ గిరగిరా తిరుగుతూ దూరంగా పడుతుంది.

జాన్ ఎప్పుడూ దూరాన్ని అధికంగా అంచనా వేయడు. ఒక గంట లేదా రెండు గంటలు అలా ఆడిన తర్వాత తన పందెం డబ్బును ప్రేక్షకులవద్దనుండి న్యాయంగా తీసికొని దాన్ని తన సహచరులతో పంచుకొనేవాడు. ఓడిపోయినవారు చాలా అరుదుగా అతనిపై సణిగేవారు. ఒక కళాయివేసేవాడితో ఓడిపోయినందుకు ఎవరుమాత్రం సణగకుండా ఉండగలరు?

జాన్ కష్టపడిచేసే కళాయి పనులవల్లనూ, అంతే గంభీరంగా ఆడే ఆటవల్లనూ వచ్చే డబ్బులు అతడు చెస్టర్నుండి తెచ్చుకొన్న డబ్బులకు జోడయ్యాయి. కాని అతనికి తన జీవితం నిర్జీవంగానూ, శూన్యంగానూ తోచింది.

తనపై ఎంతో నమ్మకంతో మేరీ అన్న మాటల్ని తనెంత అబద్ధం చేశాడు! “నువ్వు తప్పక వస్తావు జాన్ బన్యన్, నన్ను చూడటానికి తప్పక వస్తావు” అని మేరీ తనతో అన్న మాటలు జాన్కు పదేపదే గుర్తొస్తున్నాయి. ‘తనెంత పిరికివాడు! భయంచేత ఆమెను చూడకుండా తిరిగొచ్చాడు. ‘

తాను పగలు ఆమెను మరచిపోగలుగుతున్నాడు గాని రాత్రిళ్ళు ఆమెను మరచి పోలేకపోతున్నాడు. తాను ఎల్టాలోని చాలామంది యువతులను చూశాడు. అయితే వీళ్ళెవరూ మేరీకి సరిరారు. కొంతమంది అందంగానూ, మరికొంతమంది సౌష్టవం గానూ, కొందరు తెలివిగలవారుగానూ, మరికొందరు పరిశుద్ధంగానూ ఉన్నారు. ఇంకా కొంతమంది హాస్యంగా మాట్లాడగలరు.

అయితే ఈ లక్షణాలన్నీ మిళితమైయున్న మేరీలాగ ఎవరూ జాన్కు కనిపించలేదు. ‘ఆమె అత్తయ్య యింకా బ్రతికి ఉందేమో! వాళ్ళత్త పూర్తిగా కోలుకొని ఉందేమో! ఒకవేళ మేరీకి ఈ సమయంలో వివాహం చేయాలని ఒక మంచి వరుడికోసం వెదకుతున్నారేమో! ఒకవేళ అదే నిజమైతే అప్పుడు తానెంత వెర్రివాడైపోతాడు! తాను వెళ్ళాలి. తప్పక వెళ్ళి తన మేరీని తెచ్చుకోవాలి. ఒక్క వేసవికాలంలోనే యువతులు కాలినడకన ప్రయాణం చేయగలరు.’

“వచ్చే వేసవిలో నేను తప్పకుండా వెళ్ళి మేరీని తెచ్చుకుంటాను” – నిర్ణయించు కున్నాడు జాన్.

1647వ సంవత్సరం శీతాకాలంలో చార్లెస్ రాజు క్రాంవెల్ సైనికులనుండి తప్పించుకొని పారిపోయాడన్న వార్త జాన్కు దిగ్భ్రాంతిని కలుగజేసింది. 1648వ సంవత్సరం ఆశ్చర్యకరంగా రాజు గతంలో తనకు ద్రోహంచేసిన స్కాట్లాండ్ వాళ్ళతో తిరిగి సంబంధం పెట్టుకున్నాడు.

యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ స్కాట్లాండ్ వాళ్ళపై రాజు పూర్తిగా ఆధారపడ్డాడు. వేసవి వచ్చినప్పుడు రాజుగారి మద్దతుదారులు ఎక్కువగా ఉండే చెస్టర్కు మేరీకోసం వెళ్ళడానికి జాన్ భయపడ్డాడు. రాజుగారి మద్దతుదారులు మళ్ళీ బలాన్ని పుంజుకోవడంవల్ల అలా వెళ్ళడం చాలా ప్రమాదం.

మే నెలలో ఒక రోజున ఎల్లో చుట్టుప్రక్కల మసకబారిన పొలాలను చూడటంద్వారా తనను తాను ఓదార్చుకోవాలని ప్రయత్నించాడు గాని సఫలీకృతుడు కాలేకపోయాడు. రాత్రిళ్ళు మేరీ జ్ఞాపకాలతో జీవితాన్ని అతడు భారంగా గడుపుతున్నాడు.

ఆగస్టులో క్రాంవెల్ సైన్యం చార్లెస్ రాజునూ, అతనికి సహకరించిన స్కాట్లాండ్ సైన్యాన్నీ సమూలంగా ఓడించింది. జాన్ ఈ శుభవార్త వినేనాటికి వేసవి కాస్తా ముగిసిపోయింది. జాన్ తాననుకున్నట్టుగా మేరీని ఈ వేసవిలో తెచ్చుకోలేకపోయాడు.

“వచ్చే వేసవిలో నేను తప్పకుండా వెళ్ళి మేరీని తెచ్చుకుంటా” గత సంవత్సరం కూడ తానిలాగే అనుకున్నట్టుగా గుర్తుకు తెచ్చుకొంటూ తనలో తాననుకొన్నాడు జాన్. పాత్రలకు కళాయి వేయటం, ధైర్యశాలియైన బ్రహ్మచారిలా పల్లెపచ్చదనాలలో ఆటలాడటం, రాత్రిళ్ళు మేరీగురించి వేదన చెందటం ఇలా కాలం గడిచిపోతోంది.

ఆ శీతాకాలంలో క్రాంవెల్, అతడి సన్నిహిత సహచరులు, ఖైదు చేయబడ్డ రాజుతో మంతనాలు జరపడానికి ప్రయత్నించారు. అదేమంటే రాజు కేవలం నామమాత్రంగా ఉండాలి. పార్లమెంటు పరిపాలన చేయాలి. రాజు ఈ విషయంలో మొండితనం ప్రదర్శించాడు.

1649 జనవరిలో రాజు శిరచ్ఛేదనం గావించబడ్డాడు. రాజు మరణ వార్త జాన్కు దుఃఖం కలిగించింది. అయితే రాబోయే క్రాంవెల్ ఆధ్వర్యంలోని పార్లమెంటు పరిపాలన అతనిలో ఉత్తేజాన్ని నింపింది.

“రానున్న వేసవి నా జీవితాన్ని మార్చేయబోతోంది. నేను మేరీ దగ్గరకు వెళతాను” – తనలో తాననుకొన్నాడు జాన్ – “తాను అదృష్టవంతుణ్ణయితే!”

ఎంతో కాలంగా జాన్ ఎదురుచూస్తోన్న వేసవి రానే వచ్చింది. మే నెలంతా ఒక పండుగ సమయం. ఊళ్ళన్నీ తిరిగిరావడానికి అది మంచి అనుకూల సమయం. చాలామంది ఈ రోజుల్లో సంబరాలకనీ, సంతలకనీ ప్రయాణాలు చేస్తుంటారు. ఏ ప్రాంతంలోకూడ క్రొత్తవారిని పెద్దగా పట్టించుకోరు.

ఏప్రిల్ నెలలో జాన్ తన తండ్రివద్దకు వెళ్ళి తాను కొంతకాలం ఊళ్ళు తిరగడానికి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అయితే ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఎలాంటి ప్రశ్నలూ వేయలేదు. జాన్ యిప్పుడు పెద్దవాడయ్యాడు.

తన ప్రయాణంలో దేవుడు తనకు తోడైయుండి సహాయం చేయాలని తండ్రి తనకోసం ప్రార్థిస్తున్నప్పుడు తానేదో తప్పు చేసినవాడిలా జాన్ తలవంచుకున్నాడు. తన తండ్రిని తానెన్ని విధాలుగా యిబ్బంది పెట్టినా, ఎలా ప్రవర్తించినా అవేవీ ఆయన మనస్సులో పెట్టుకోలేదు. జాన్ తన తండ్రివైపు ఆరాధనా భావంతో చూసి ముందుకు కదిలాడు. ఎట్టకేలకు మేరీవద్దకు తాను వెళ్ళగలుగుతున్నందుకు జాన్కు చాలా ఉత్సాహంగా ఉంది.

“ఈ వేసవిలో నేను మేరీని తప్పక తీసుకొస్తాను” – తనలో తాననుకొన్నాడు. జాన్ – “నేనెక్కడా ఆగేది లేదు.” రెండు సంవత్సరాల క్రితం విషయాలే తలంపుకు వచ్చాయి జాను. ఇప్పుడు తన వయస్సు యిరవై సంవత్సరాలు.

ఇంతకు మునుపు ప్రతికూలమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే చాలా యిబ్బందిపడేవాడు. ఇప్పుడైతే ముందుకెలా వెళ్ళాలో, వెనక్కి ఎలా జారుకోవాలో, అటూ ఇటూ ఎలా వెళ్ళాలో తనకు బాగా తెలుసు.

ఏ విషయాన్నైనా యిరువైపులా ఎలా వాదించాలో కూడ తనకు తెలుసు. తననెవరైనా ఆపి ప్రశ్నల వర్షం కురిపిస్తే, ఆ వ్యక్తి క్రాంవెల్ పక్షానికి చెందినవాడా లేదా రాజుగారి పక్షానికి చెందినవాడా గ్రహించగలిగే తెలివితేటలు తనకిప్పుడున్నాయి.

ఒకవేళ అతడు రాజుగారి పక్షంవాడైతే తాను రాజుగారి పక్షాన సర్ జేకబ్ ఆస్ట్ అనే కమాండర్ క్రింద ఆయుధదళంలో పనిచేశానని చెబుతాడు. తర్వాత వచ్చే ప్రశ్నలనెలా నిరోధిం చాలో తనకు బాగా తెలుసు.

ఒకవేళ ఆ వ్యక్తి పార్లమెంటుకు సంబంధించినవాడైతే అతడి ప్రశ్నలకు జవాబివ్వడం జాన్కు కష్టమేమీకాదు. ఎందుకంటే సత్యం చెప్పడం సులువైన విషయం కదా! అబద్దం చెప్పడంకన్నా నిజం చెప్పడం తేలికైన విషయం.

ఎలోను విడిచిపెట్టినప్పటినుండి తానాలోచిస్తూ వచ్చిన పచ్చిక బయళ్ళను ఒక రోజు మధ్యాహ్న సమయంలో చేరుకున్నాడు జాన్. తన భుజంమీది సంచి గడ్డివాము క్రింద దాచి, పొదలూ కంచెలూ గడ్డివాములూ చాటుచేసికొంటూ మెల్లగా నడిచి దూరంలో పశువులను కాస్తున్న పిల్లాడిని సమీపించాడు. వాడు మేరీ అత్త కొడుకే అని నిర్ధారించుకున్నాక అతడు ఆవుల్ని తోలుకొని వెళ్ళేంతవరకు అతనికి కనిపించ కుండా దాగి, ఆ తర్వాత అతడికి కొద్దిదూరంనుండి మెల్లమెల్లగా అతణ్ణి వెంబడించ సాగాడు. ఆ పిల్లాడు ఒక తెల్లటి యింటిముందు ఆగాడు.

ఆ గృహం తెలుపులో నలుపు అలంకరణలతో చూడ ముచ్చటగా ఉంది. అక్కడి వాతావరణం చూస్తే మేరీ అత్తమ్మ మంచానపడి ఉన్నట్టుగా జాను అనిపించడం లేదు. జాన్ ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు. యింటివద్దకు అతడి రాకను పసిగట్టిన ఒక బలిష్టమైన కుక్క గట్టిగా మొరగటం ప్రారంభించింది.

“ఏయ్ ఎవరు నువ్వు?” – జాన్వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడా అబ్బాయి – “ఎక్కడినుండి వస్తున్నావు?”

“నేనొక బాటసారిని” వినయంగా సమాధానమిచ్చాడు జాన్. ఈలోగా యింకా కొన్ని కుక్కలు మొరుగుతూ జాన్ కాళ్ళచుట్టూ చేరాయి. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో అతని నిశ్శబ్దవాలకం చూసి అవి మొరగడం మానుకున్నాయి. నిత్యసంచారి అయిన తనకు ఈ కుక్కలు ఒక లెక్కా! “మీ బావిలో కాసిన్ని నీళ్ళు త్రాగవచ్చా?” అబ్బాయిని అడిగాడు జాన్.

“నీవు వెళ్తున్న ఆ దారి వదలి యిక్కడి కెందుకొచ్చావు?” దక్షిణవైపుగా చూసి తలాడిస్తూ అడిగాడా అబ్బాయి.

“నేనావైపునుండి రావడంలేదు. ఈశాన్యవైపున ఉన్న హెలీ ్బ కొండనుండి పల్లెలు దాటుకొంటూ ప్రయాణం చేస్తూ వచ్చాను. ఏటవాలుగా ఉండే ఆ కొండలను గురించి నీవు వినుంటావనుకొంటాను.”

అబద్ధాలు జాన్ నోట్లోనుండి ప్రవాహంలా దొర్లుకొస్తున్నాయి. ఈ చుట్టుపట్లనున్న ప్రాంతమంతా తనకు సుపరిచితమైనవేనని తెలియజెప్పేందుకే జాన్ తాపత్రయమంతా. మేరీ యితనికి ఈ స్థలాల పేర్లన్నీ చెప్పింది. ఆమె చెప్పినవేవీ తాను మర్చిపోలేదు.

“నేను మా నాన్ననడిగి చెప్తానుండు” సందేహంగా యింట్లోకి పరుగెత్తాడు ఆ అబ్బాయి.

కాసేపటికి ఒక మృగంలాంటి మనిషి బయటకు వచ్చాడు.

Leave a Comment