పారిపోయిన పడుచువాడు

పారిపోయిన పడుచువాడు

ప్రశ్న:-

మార్కు సువార్త 14:51,52 లో ఒక పడుచువాడు దిగంబర శరీరము మీద నారబట్ట వేసికొని రాణువవారు వచ్చి యేసును పట్టుకొనగా తన నారబట్ట వదిలి పారిపోయెను. అతడు ఎవడు? అతని చరిత్ర యేమిటి? అతను అంతకుముందు క్రీస్తు వారితో యున్నాడా? లేక ఎక్కడనుండి అతను వచ్చి యున్నాడు?

జవాబు :-

నేనుకూడ ఇది చదివి వీడెవడని ప్రశ్నించుకొన్నాను. గాని లాభమేమి? ఎక్కడా యీ సంగతి విశదము కాలేదు. వేరొక సువార్తలో కూడా నెంత వెదకిన ఈ పడుచువాని సంగతి కనబడదు. అవును, బైబిల్లో సంగతులన్నియు వ్రాయబడలేదు. అసలు క్రీస్తు చేసి చెప్పినవన్నియు వ్రాయబడలేదని యోహాను 21:25 లో తెలిసికొంటున్నాము. వ్రాసినవే మనకు మించినవి. వ్రాసినవే చేతకాకుండగా లేనివి యేల వ్రాయబడ లేదని అడుగ తగదు. నిత్యజీవము కొరకెన్ని అవసరమో అన్నియు వ్రాతకు వస్తే భూలోకమైనా అట్టి గ్రంథములకు చాలదని తోచుచున్నది. అయినను దీని సంబంధ ముగా కొన్ని యూహలు మాత్రము గలవు.

ఈ సువార్త వ్రాసినవాడే పడుచువాడని నమ్ముచున్నాము. రెండు అభిప్రాయములున్నవి. (1) మార్కు సువార్త వ్రాసినవాడెవ డనగా బర్నబా పౌలులతో కూడ మొదటిసువార్త యాత్రమీద వెళ్లి వెనుక మళ్లినవాడైన యోహాను, మార్కు రెండు పేరులు అతనికి గలవు. యోహానుతో కూడ మార్కు అని యున్నది. (అపొ. కార్య. 12:12, 25, 13:5,13). (2) లేదా, 1 పేతురు 5:13 లో నా కుమారుడైన మార్కు అని చెప్ప బడినప్పుడు వేరొకడు కాబోలు. అతడే సువార్తకు గ్రంథకర్త. అతడు పేతురు శిష్యుడట. అనగా పేతురు ఆత్మీయ బిడ్డ గనుక అతడే సువార్తను వ్రాసెనని చెప్పడము. అందువలన అనేకులు రెండవ సువార్త పేతురు సువార్త యంటారు ఎట్లనగా పేతురు కుమారుడైన మార్కే వ్రాత వ్రాసినను ఆత్మ చేత నడిపింపబడిన పేతురు సలహా యివ్వగా వ్రాసెనని పెద్దలంటున్నారు. అవును, మార్కే వ్రాసెను.

పేతురు చెప్పియుంటే చెప్పి యుంటాడు గాని ఆ వ్రాత యావత్తు దేవునిదేయనియు దేవుని ప్రేరణ క్రింద జరిగెననియు చెప్పబడిన ఈ మార్కులు అన బడిన వారొక్కరే అనియు నమ్ముచున్నాము. ఇటువంటి యితిహాసముతోనే మరొకటి మ్రోగుచున్నది.

ఈ సువార్త వ్రాసినవాడు పేతురు ఆత్మీయకుమారుడు గనుక ముసలి వాడు కాడు. పడుచువాడే గనుక మార్కు 14:51,52 లో పేరు లేకుండ వర్ణింప బడిన పడుచువాడు మార్కు తానే. తన సంగతి వ్రాసినప్పుడు స్వంత పేరు చెప్పలేక అలాగే వ్రాసిపెట్టెనని హామీ యిచ్చేవారు గలరు. అలాగే యుండవచ్చును. అవునని యైనను కాదనియైనను గట్టిగా నెవరు చెప్పలేరు.

పౌలు రెండవ కొరింథీ 12:1 లో తన కనుగ్రహింపబడిన దర్శనములను వివరింపబట్టి రెండవ వచనములో స్వంత పేరు చెప్పక ప్రథమ పురుషముగా నొక మనుష్యుని నేనెరుగుదునని వ్రాస్తున్నాడు. పేరులేకుండ చేసి వ్రాయుట దీని ఛాయ. మార్కు కూడ నొకవేళ తాను క్రీస్తు పట్టబడిన ఆ గొప్ప రాత్రిలో పడిన భీతిని వివరింపనారంభించి యిదే ఛాయకు వచ్చి తన స్వంత పేరు లోపించి ఫలాని పడుచువాడు పట్టబడితే శత్రువులకు చిక్కుటకన్న బట్ట పోగొట్టుకొనుట మేలని యెంచినవాడై దిగంబరిగా పారిపోయెనని వ్రాసెను. కొన్ని దినములాగి మహిమలో నన్నీ ప్రశ్న అడిగితే ఖుద్దున మార్కును విచారించి మీకుండే సంగతి చెప్పుతాను.

మహిమలో నుంటారని ధైర్యమున్నదా? ఎందుకు లేదు? ఇట్టి భీతి కలిగి క్రీస్తు నొప్పుకొనకుండపోతే భయంకరముగా నుంటుంది. పిరికివారిదే అగ్నిగుండమని ప్రకటన 21:8 లో నున్నది జాగ్రత్త! మత్తయి 10:32,33 దీనిలో చెల్లుచున్నది. ఈ ఫలాని పడుచువాని పేరు మనకు పట్టియుంటే తేటగా ప్రభువు వ్రాయించి సంగతి తెలిపేవాడు. అతని పేరేమిటో మనకు తెలియనక్కరలేదు. అతడు పడుచువాడే అని తెలిసినది.

పడుచువారు పిరికివారని దీనిలో తేలినది. అవును, గిద్యోను న్యాయముగా నొకనాడు తన కుమారునికి శిక్ష విధించు పని అప్పగించి ఫలాని క్రూర శత్రువులమీద పడమంటే ఆ కుమారుడు బొంకెనెందుచేత? యెతెరు చిన్నవాడే గనుక భయపడి కత్తిని దూయలేదని న్యాయాధి. 8:20 లో వ్రాయబడినది. అవును, దీనిలో కూడ పడుచువారు ధీరులు కారని తేలినది జాగ్రత్త! క్రీస్తును నమ్మి రక్షింపబడి గొప్ప కార్యములు చేయబూనుకొండి – రక్షణ పొందకుండ అనేకులు భయముచే వెనుకతీస్తారు.

సేవలో కూడ భయమే పెద్ద శత్రువు – క్రీస్తు యిచ్చే ధైర్యముతో పాతభయమును జయించతగినది. రక్షణతో కూడ పాపి నీతిమంతుడు కాగానే ఆ గొప్ప ధైర్యము అబ్బుతుంది. (సామెతలు 28:1). అబ్బినది అబ్బినట్టు శక్తిహీనముగా ప్రవర్తించవద్దు- ఆఖరిగా పడుచువాడైన మార్కు సువార్తలో వ్రాసినట్టు పారిపోయెను. మళ్ళీ అపొ. కార్య. 13:13 లో వ్రాసినట్లు పారిపోయెనని తెలియుచున్నది-ఇట్టి భయస్థుడెప్పుడైన పనికి వచ్చునా? అవును. రెండవ తిమోతి 4:11 లో చెప్పుచున్నట్లు భీతితో నిండిన యీ మార్కు ఆ భీతిని జయించి కడకు నమ్మకస్థుడై మంచి పనివాడై రెండవ సువార్త వ్రాయుటకు నియమింపబడెను. అట్టి పారిపోయినవారే క్రీస్తును పట్టుకొండి ఆయనలో మీ కొరకు చాలిన ధైర్యము దాగుకొనియున్నది. (కొలస్సై 2:3).

Leave a Comment